చిన్ననాటి ముచ్చట్లు/లలిత కళాభిలాష

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

21

లలిత కళాభిలాష

చిత్రకళ, నాట్యకళ, గానకళ మొదలగు లలితకళలందు నాకు చిన్నప్పటినుండి నైజముగానే ఎక్కువ అభిలాష కలదు. శాస్త్రయుక్తముగ ఆయావానిని అభ్యసించుటకు నాకు పూర్తిగ అవకాశము లేకపోయినను, చూచి, విని వాని ప్రాశస్థ్యమును తెలయగల సహృదయుడు అని నా మిత్రులనుచుందురు.

గృహనిర్మాణ మొక శిల్పము. దాని రహస్యము లెరుంగుటయు నొక విశేషమే. చిన్నతనములోనే నాకు ఇందు నేర్పు కల్గినది. కుఱ్ఱతనమున ఆడబిడ్డలకు బొమ్మరిండ్లను అందముగ గట్టుచుంటిని. అందువల్ల ఊరి వారందరు వారి బిడ్డలకు బొమ్మరిండ్లు కట్టిపెట్టుమని నన్ను ఆశ్రయించే వారు. ఈ విద్య నేను శిక్షణ లేకనే అలవరచుకొన్నది. మద్రాసులో కట్టించిన నా భవనములన్నియు స్వంత ప్లానులతో కట్టినవే.

చిత్రలేఖనము చిన్నతనముననే అభినివేశము ఏర్పడినది. మా అమ్మ పండుగలకు ఇల్లంతయు గోడలకు శుభ్రముగా సున్నము కొట్టించేది. ఆ తెల్లనిగోడలు చూడగానే నాకు ఉత్సాహము కల్గి బొగ్గు తీసుకొని తోచినట్లు బొమ్మలు గీచేవాడను. వానిని చూచినవారు ఆయా బొమ్మల ముక్కు కన్ను తీరు బాగున్నదనియు, నాచేతిలో శిల్పమున్నదనియు మెచ్చుకొనేవారు. కాని మా అమ్మ తెల్లగోడలను బొగ్గుతో గీచి పాడుచేసితినని నన్ను తిట్టేది.

మద్రాసు గోవిందప్పనాయుని వీధియందు టి.వి. సుబ్బన్న అండ్ బ్రదర్సు అను పేరుతో చిత్రముల వ్రాయు ముచ్చి వారుండిరి. వీరు కార్వేటినగరం సంస్థానమున రంగుచిత్రములను వ్రాయుచుండిరిగాని ఆ సంస్థానము తగ్గుదశకు రాగానే వారు మద్రాసుకువచ్చి బొమ్మలను వ్రాయు వ్యాపారమును స్థాపించిరి. వీరు పలకలమీద చింత విత్తనముల జిగురుతో బొమ్మలను వ్రాసి దానిమీద సన్న బంగారురేకును అంటించి మెరుగుబెట్టి పఠములను తయారుచేయుచుండిరి. అటు తయారైన పఠములు యెంతకాలమైనను మాసిపోక మెరుగుతో తళతళలాడుచుండును. పూర్వము మద్రాసులో ఈ పఠములకు మంచి గిరాకీ యుండెడిది. మద్రాసులో అనేకుల ఇండ్లలో వీరి పఠములు గలవు. ఉప్పటూరి ఆళ్వారుశెట్టిగారి రామానుజ కూటమున ఇవి గలవు. ఈ పురాతన చిత్రకళ క్రమముగ నశించిపోయినదనే అనవచ్చును.

శ్రీమతి రత్నాల కమలాబాయిగారు తాను చిత్రించిన త్రివర్ణ చిత్రములతో 'గృహలక్ష్మి' పుటలతరచు అలంకరించుచుండిరి. ఈమె చిత్రకళా నైపుణ్యమునకు మెచ్చి యొకసారి గృహలక్ష్మీ స్వర్ణకంకణమును తొడిగి గౌరవించితిని. ఇంకను అనేకులు చిత్రకారులు వ్రాసిన చిత్రములను కొని ప్రచురించి వారికి ప్రోత్సాహమొసంగితిని.

ఆహార్యము, అభినయము, సంగీతము ప్రాధాన్యముగాగల నాట్యకళ బహువిధములు. వీధి భాగవతములు, తోలుబొమ్మలాటలు, భరత నాట్యము, నృత్యము, ఆధునిక నాటకములు. ఇవి అన్నియు ఆ కళ క్రిందికే వచ్చును. నా నాట్యకళాభిమానము వీధి నాటకములను చూచుటతో ప్రారంభమైనది. బాల్యమున ఈ వీధి భాగవతములన్న నాకు చాల వెర్రి. మా వూరిలో మద్దెలమీద దెబ్బపడిన శబ్దము వినగనే నేనక్కడ హాజరుగ నుండెడివాడను.

నా కుఱ్ఱతనమున మొట్టమొదట నేజూచినవి మాలనాటకములు. ఆ రోజులలో మా వూరి మూలవాడనుండి మాలవారు వచ్చి గ్రామమునకు దూరముగ స్థలమును ఏర్పాటు చేసుకొని రామాయణ నాటకమును ఆడేవారు. వారు రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు మొదలైన వేషములు ధరించి నాటకములాడేవారు. మాసినగుడ్డలను, లక్కరంగు ఆభరణములను ధరించేవారు. కాళ్లకు గజ్జెలు కట్టుకొనేవారు. వాటి ఘల్లుఘల్లునకు తోడు తాళము తప్పెటలు వీరికి ప్రక్క వాయిద్యములు.

ప్రతివూరి సమీపమునను మాలవాడ, మాదిగవాడ యని రెండుండును. మాలవారు మాదిగవారికంటె గొప్పవారమని చెప్పుకొందురు. మాలవాడలో శ్రీరాముని దేవాలయమును కట్టుకొని రామభజన చేయుచుందురు. వీరిలో హెచ్చుగా భక్తిపరులైనవారు కొందరు ప్రతినిత్యము మొగము నిండ తిరుమణి శ్రీ చూర్ణములను తులసిపేరులను ధరించి భజనకీర్తనలు పాడుచు మెట్టవేదాంతమును మాట్లాడుచుందురు.

వీధిభాగవతము లాడినవారిలో ముఖ్యమైనవి రెండు జట్టు. ఒకటి : మాగ్రామ సమీపముననే తమ్మవరము అని యొక గ్రామమున్నది. ఆ గ్రామమునుండి వచ్చు తమ్మవరపు బోగము వెంకటస్వామి జట్టు. రెండవది కూచిపూడి బ్రాహ్మణుల భాగవతము జట్టు.

వెంకటస్వామి జట్టులో చేరినవారందరు బోగమువారే. పురుషులు పురుష వేషమును స్త్రీలు స్త్రీ వేషమును ధరించేవారు. వెంకటస్వామి హాస్యమును ప్రదర్శించుటలో చాలా మేధావంతుడు. ఆ నాటక సమాజమంతయు వెంకటస్వామి చేతులలోనే యుండినది. వీరు మా ఊరికి వచ్చినప్పడు పాత కచ్చేరి సావడిలో బస చేసేవారు. పిమ్మట గ్రామకరణమును మునసబును దర్శించి నాటకప్రదర్శనమును యేర్పాటు చేసుకొనెదరు. ఒకనాటి రాత్రి నాటకమునకు ఒక వరహా సామాన్యమైన యేర్పాటు. వీరందరు కలిసి ఇంచుమించు 10 మంది యుందురు. వీరికి ఊరిలో ప్రతియింట నొక్కొక్కరికి భోజనము పెట్టదురు. సత్యభామ వేషము వేయు స్త్రీ అందమైనది. కనుక అందరును తమ యిండ్లకు ఆమెనే భోజనమునకు పిలుతురు. ఆమె భోజనమునకు వచ్చిన గారెలు, బూరెలు, పరమాన్నములతో కూడ విందు చేసెదరు. అందువలన ప్రతియింటికి సత్యభామయే భోజనమునకు వచ్చునని వెంకటస్వామి కబురుపంపెడివాడు. కనుక జట్టు అందరికీ పిండివంటలతో విందు జరిగేది. నాటకమునాడు స్థలమునంతయు, సాయంకాలము వెట్టివాండ్రు చిమ్మించి నీళ్లుచల్లి బాగుచేయుదురు. రాత్రి 10 గం||లకు నాటకము ప్రారంభమగును. ఊరి ప్రజలందరు వచ్చి కూర్చుందురు. నాటకరంగమునకు ముందు కరణం మునసబులు ఇంక ననేకమంది బ్రాహ్మణులు, కాపులు, రెడ్డు కూర్చుందురు. వేషము యెప్పుడు వచ్చునాయని ఆత్రముతో వేచియుండెదరు. సాధారణముగ వీరు మొదట భాగవతనాటకమునే ప్రదర్శించెదరు. దీనిలో ముఖ్యపాత్రలు కృష్ణుడు, సత్యభామ, గొల్లభామ, సుంకర కొండడు మొదలగునవి. మొదటి వేషము (అది సామాన్యముగా భామవేషమో, రాజవేషమో) తెరచాటునుండి వెలుపలికి వచ్చునప్పుడు రెండు దివిటీలను ఆ వేషము మొగమెదుట మోటించి నిల్చి దానిపై గుగ్గిలపుపొడిని చల్లెదరు. ఆ వెలుతురున తెరలోని వేషము బయటపడును. ఈ వేషధారులు ధరించి యుండు ఆభరణములన్నియు తేలిక కొయ్యమీద చెక్కి కాకిబంగారము అంటించబడినవి.

సత్యభామ తన జడను తెర ఇవతలవేసిన 'తనను ఈ సభలో ఎవరైనను భాగవతవిషయమై ప్రశ్నించినచో జవాబు చెప్పగలను' అని సూచన. ఒక్క భాగవతముననే ఏమి? సామాన్యముగా నీ భామవేషమువేయు వ్యక్తి ఆనాటి సకల శాస్త్రములను తెలిసినదైయుండును. ఈ వేషమున పూర్తిగా యుపన్యసించుటకు ఒకటి రెండు రాత్రిళ్లు పట్టును. అందు శాస్త్రముల నన్నిటిని తడవి వేషధారి తన విద్వత్తు ప్రకటించును. చూలింతయైన దేవకీదేవి పిండోత్పత్తిక్రమము, గర్భరక్షక విధులు, పురిటింటు సన్నాహము, బాలింత పథ్యపానములు, శిశుపోషణ పద్దతులు - మొదలైనవాని నన్నిటిని ఆయుర్వేద వైద్యశాస్త్రరీత్యా ఉపన్యసించును. సత్యభామ శృంగార రసమందలి సాత్వికావస్థలను, నాయికా నాయక లక్షణములను, ఉపన్యసించును. దీనినే భామ కలాపము అందురు. ఇదియొక విధముగ నాటికాలమున వయోజన విద్యావిధానము అనజెల్లును. పైవిధముగా నీ భామ తన జడను తెరలోపలినుండి రంగస్థలమువైపున తెర బయటకు జారవిడువగనే సభాసదులలో పండితోత్తములు ఆమెను భాగవతములోని పద్యములను, కృష్ణకర్ణామృతములోని శ్లోకములను చదివి భావార్ధముల చెప్పమని అడిగెదరు. అవి చెప్పినంతనే విడువక, ఇంకను భరతశాస్త్రము నందును, అలంకారశాస్త్రమునందును ప్రశ్నింతురు. నాటకము తెల్లవారి 5 గం||ల వరకు జరుగును. అటుపిమ్మట వారందరు ధరించిన వేషములతోనే గ్రామములో ప్రతియింటికి వచ్చి చీరెలను ధోవతులను భిక్షమెత్తెదరు. హరిశ్చంద్ర నాటకము, నలచరిత్ర, ఉషాపరిణయము, ప్రహ్లాదనాటకము మొదలైనవి ప్రదర్శించేవారు.

కూచిపూడి భాగవతుల వీధినాటకములలో ఆడవేషమునుగూడ మగవారే ధరించుదురు. వీరు రంగస్థలమునకు వచ్చినపుడు పురుషుడువేసిన స్త్రీ వేషములను గుర్తించుట సులభముగ నుండెడిది. వీరు బ్రాహ్మణులు గనుక భోజనాది వసతులు సులభముగ వూరిలో కుదిరేవి. మధ్యాహ్నపు వేళలో యెవరి యింటిలోనైన వేషములు వేయకుండ అష్టపదులు, కృష్ణకర్ణామృతములోని శ్లోకములు, తరంగములుపాడి, అభినయముపట్టి భరతశాస్త్ర ప్రదర్శన మొనర్చెడివారు. వీరిలో కొందరు గారడికూడ చేయగలవారుండిరి. తరంగములు పాడునప్పడు అద్భుతముగ నృత్యము చేసెడివారు. పళ్లెములో నీళ్లు పోసియుంచి ఒక్క చుక్కనీరైన చిందకుండ దానియంచుపై నిల్చి నృత్యము చేయుచు గంటలకొలది 'బాలగోపాల మాముద్దరే అనే తరంగమును పాడగల నేర్పరులుండిరి. ఈ తరంగమున శ్రీ నారాయణ తీర్ణులవారు తాళప్రస్థారమునకు ఎంతో అవకాశము కల్పించి వ్రాసియున్నారు.

కూచిపూడివారి పలుకు స్ఫుటముగను, ఉచ్చారణ స్వచ్చముగను ఉండును. వీరి హాస్యమును మోటుగాక సరసముగ నుండును. వీరికి భాగవతమే విశేషముగ అభిమాన పాత్రమగు నాటకము.

చెంచునాటకములను గొల్లవారుచేరి ప్రదర్శించుచుండిరి. వీరి నాటకములు పల్లెటూళ్లలో చాల పేరుపొంది యుండినవి. ఒక ఊరిలో వీరు చాలదినములు బసచేసి నాటకములాడుచుండేవారు. వీరి నాటకములో ముఖ్యమగు ఇతివృత్తము అహోబిల నారసింహస్వామి చెంచెతను (చెంచువారి పడుచును) మోహించి వివాహమాడుట. ఆ చెంచెత కథనే 'గరుడాచల మహాత్మ్యము' అని పూర్వకవి యక్షగానముగా వ్రాసియున్నాడు. దాని ననుసరించి ఈ నాటకమును వీరాడుదురు.

మా వూరి రంగిరీజులు గుడ్డలమీద బొమ్మలను వేసి అద్దుటకు అలవాటుపడిన వారు గనుక పలచని తోళ్లను బొమ్మలవలె కత్తిరించి వాటికి రంగులనువేసి వాని సహాయమున నాటకములాడుచుండిరి. ముఖ్యముగ నేను జూచిన నాటకము రామాయణము. ఈ రామాయణ నాటకములోని దశకంఠుడు, ఆంజనేయుడు, సీత మొదలగు వారి చిత్రములతో కూడ వానరరాక్షస సేనలుండినవి. ఈబొమ్మలకు చేతులు కాళ్లు తల మున్నగు అవయవములన్నియు విడివిడిగనే చేయబడి - దారములతో కట్టబడి యుండును. బొమ్మలకు వెనుకప్రక్క అన్నిటికి కలిసి వచ్చునట్లు వెదురుబద్దలను కట్టుదురు. ఆ బద్దలకు దారములమర్చెదరు. ఈ సూత్రములను (దారములను) అన్నిటిని కథ నడుపువారు పదివ్రేళ్లకు తగిలించుకొని చేతబట్టుకొని లోతెరలో తెరపై బొమ్మలనుంచి నిల్తురు. పిదప కథానుసరణముగ ఆయాసూత్రములు లాగుచు ఆ బొమ్మల అవయాంగముల నాడింతురు. సంస్కృత నాటకముల నాటకమాడించు ప్రధాన పురుషుని 'సూత్రధారి' అందురు. నిజమున కతడు ధరించు సూత్రమేమియు లేదు. తోలుబొమ్మలాటలలోని సూత్రములే - ఈ సూత్రధారికి మూలమేమో? సూత్రధారి హస్తలాఘవమున రామరావణ యుద్దమును, సముద్ర లంఘనమును, లంకాదహనమును, వానరరాక్షస సమరమును, రథములను మొదలైనవాని నన్నిటిని పాటలతో, మాటలతో చిత్రవిచిత్రముగ దృశ్యములుగా చూపగల్గును.

అసలీ తోలుబొమ్మలాటకు మరాటీవారు ప్రసిద్ది. వీరు కథ నడుపునప్పడు - సంస్కృత సమాసములను, వాక్యములను చెప్పి – ముక్కముక్కగా విరిచి అర్థము చెప్పదురు. 'అశ్వ = గుర్రములున్నూ, గజ = ఏనుగులున్నూ......' ఈ విధముగా చెప్పుచుందురు. అమరమందలి శ్లోకములును చదువుదురు. అద్దంకిసీమను కొన్నాళ్లు మరాఠీ లేలినారు. బహుశా ఆ సంపర్కముచే మా ఊరి రంగిరీజుల కిది అబ్బియుండును.

Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf