Jump to content

చిన్ననాటి ముచ్చట్లు/పెండ్లి

వికీసోర్స్ నుండి

6

పెండ్లి

నేను మద్రాసులో జీవనోపాయమును సంపాదించుకొన్నందున నా మేనమామగారు నాకు పిల్లనిచ్చి పెండ్లి చేసెదనని జాబును వ్రాసిరి. మంచిదని జవాబిచ్చితిని. పెండ్లి సన్నాహమునకు కావలసిన సామానులను సమకూర్చుకొనవలసి వచ్చెను. నాచేత డబ్బు లేనందున చిన్ననాటి స్నేహితుడగు అన్నం చెన్నకేశవులు శెట్టిగారిని మరల ఆశ్రయించితిని. శెట్టిగారు యింటిలో స్వతంత్రులు గారు. చిన్నవారు తల్లిదండ్రుల చాటున నున్నవారు. గనుక వారివద్ద ఆ సమయమున రొఖ్కం లేదు. ఆ కాలమున మద్రాసులో ధనికులు, పురుషులు కూడ చేతులకు బంగారుకాపులను (మురుగులు) గొలుసులను ధరించుకొనుచుండిరి. మా శెట్టిగారు కూడ లావాటి మురుగులను గొలుసులను తొడుగుకొని యుండిరి. ఆ మురుగులు గొలుసులు వారి చేతికి వదులుగ నుండెను. అప్పుడు శెట్టిగారు కంసలిబత్తుని వద్దకుపోయి తన చేతుల మురుగులలోని బంగారమును కొంత కోసి నాకు యిచ్చి పెండ్లి నగలు చేయించుకొమ్మని చెప్పిరి. ఆ బంగారముతో ఆ కాలపు నాజూకు నగ, నెల్లూరి గజ్జలపట్టెడను చేయించితిని. కాళ్లకు యేనుగు గొలుసులు, పావడాలు, పట్టెగొలుసులు మేలైన జర్మను సిల్వరుతో తయారు చేయించితిని. ఆ కాలమున పేరుపొందిన బాలామణియను ఒక దేవదాసి యుండెను. నాటకములలో ప్రసిద్ధి చెందిన నటకురాలు. తారాశశాంకము, డంబాచారి విలాసము యను నాటకములలో బాలామణిని చూచుటకు మద్రాసులో వేలకొలది ప్రేక్షకులు పోవుచుండిరి. బాలామణి అక్క కోకిలాంబ పురుషవేషమును ధరించెడిది. అప్పడు ఆ బాలామణి పేరుతో చీరలను నేసి, బాలామణి చీరెలని అమ్మెడువారు. ఆ చీరెలను రెంటిని నా పెండ్లికి కొంటిని. మెడకు పట్టెడ, కాళ్లకు గొలుసులు, కట్టుచీరెలతో పెండ్లి కి ప్రయాణమై వూరికిపోతిని. పట్నం నుంచి పల్లెటూరికి పెండ్లి సన్నాహముతో పోగానే వూరివారందరు పట్నం చీరెలను, నగలను చూచుటకు పరుగెత్తి వచ్చిరి. ప్రదర్శనము జరిగెను.

నా పెండ్లి మావూరికి సమీపమున చెదలవాడయను గ్రామమున యుండు శ్రీరాముల దేవాలయములో జరిగెను. మా వూరికిని చెదలవాడకును నడుమ గుండ్లకమ్మ యేరు అడ్డము. నిండు యిసుకలో చెదలవాడకు నడచిపోవలయును. ముహూర్తము నాడు తెల్లవారగనే మాకు మంగళస్నానములయినవి. పాతపల్లకి వచ్చినది. చాకలివారు పల్లకిని మోయుటకు హంసపాదికలతో సిద్దమైరి. మంగలివారే భజంత్రీలు కూడాను. పల్లకిలో కూర్చుంటిమి. పల్లకి సాగినది, ఏరు దాటినది. ఇసుకలోకి పోగానే చాకలివారి కాళ్ళు కాలి ముందుకు పరుగిడవలసి వచ్చెను. మేళగాండ్లు వెనుక చిక్కిరి. కూడ వచ్చు పెండ్లివారి సంగతి నిక చెప్పనేలా! తిన్నగ 12 గంటలకు దేవాలయము ప్రవేశించితిమి. ఒక మూల వంట ప్రయత్నము, మరియొకచోటు పెండ్లి ప్రయత్నములు జరిగెను.

చెదలవాడ గ్రామము భోగము పడుచులకు ప్రసిద్ధికెక్కినది. ఈ గ్రామమున యుండు భోగమువారందరు దేవాలయ మాన్యములను అనుభవించుచు దేవుని కొలుచువారే. వీరిలో ముఖ్యముగ యెఱ్ఱబాయి, నల్లబాయి యను పేరుగల యిద్దరు వేశ్యలుండిరి. వీరికీ పేరు శరీరపు రంగును బట్టియే వచ్చినవి. ఈ యెఱ్ఱబాయమ్మ మామగారికి స్నేహితురాలగుటచే పెండ్లి సరఫరా చక్కగ జరిగినది. సాయంత్రము చదురు కూడ జరిగినది. పెండ్లి ముగించుకొని పల్లకినెక్కి చీకటికి ముందటనే యిల్లు చేరితిమి.

ఆ రాత్రియే వూరిలో వూరేగింపు కూడ. మా వూరేగింపు చూచుటకు వూరి వారందరు కూడిరి. ఆ కాలమున నూనె దివిటీలకు బదులు కుడప పీడకలను కిరసనాయిలులో తడిపి దివిటీలు వెలిగించుచుండిరి. చాకండ్లు దివిటీలను పట్టుకొనిరి. పల్లకి లేచినది. ఊరేగింపు నడివీధికి పోయినది. ఈ దివిటీల కిరసనాయిల పొగ వాసనకు పెండ్లికూతురు తట్టుకోలేక కడుపులో త్రిప్పి వమనమును చేసుకొనినది. ఆ వమనము యెదుటనున్న నావళ్ళోనే జరిగెను. ఇదియే నాకును ఆమెకును జరిగిన ప్రథమ పరిచయము.

వివాహానంతరము నేను మనుగుడుపులకు అత్తవారి యింట్లో వారమురోజులుంటిని. ఈ దినములలో గ్రామమునసబు, కరణం మొదలగువారు వారి తాతముత్తాతల నాటి పాత కోర్టు రికార్డులను తీసుకువచ్చి నన్ను చదివి అర్ధము చెప్పమనేవారు. పూర్వాచారపరాయణులు కొందరొచ్చి 'అబ్బాయి! పట్నంలో జాతివాడు మరద్రిప్పిన గొట్టములోని నీరు త్రాగుచున్నారటనే నిజమేనా? మద్రాసులోని కూరలు తినిన ఏనుగ కాళ్లగుట నిజమేనా?' అని అడిగేవారు. నన్ను చూడవచ్చిన ప్రతి వకరును తమకు, తమకు కావలసిన వస్తువులను తలా వకటి, ఈసారి వచ్చినప్పుడు తెచ్చిపెట్టమని నన్ను అడిగేవారు. నీళ్లు నిల్వచేసుకొనుటకు పెద్ద కొయ్య పీపాయిని తెచ్చిపెట్టమని ఒకరు చాలాదూరం ప్రార్ధించిరి.

మాయింటి ప్రక్కన, ఒకనాడు వారి దొడ్లోనుంచి వెఱ్ఱికేక వినబడినది. ఆ కేకను విని అక్కడికి వెళ్లి చూచితిని. నులకమంచము మీద ఆడుబిడ్డను కూర్చుండబెట్టి మసిలే నీళ్లను ముంతతో ఆ పిల్లనెత్తిన పోయుచుండెను. మరియొక ముంత మంచముమీద పోయుచుండెను. ఆ బిడ్డ కన్నతల్లిని అడిగితిని. పిల్ల తలనిండుగ పేలున్నవనిన్నీ, మంచము నిండుగ నల్లులున్నవనిన్నీ వాటిని చంపుటకు యిట్లు చేయుచున్నాననిన్నీ చెప్పెను. ఆ ప్రకారము ఆ తల్లి యెంతకాలమునుంచి చేయుచున్నదో గాని కొంత కాలమునకు ఆపిల్లకు మతిచెడివెఱ్ఱిచూపుల పిల్ల అయినది. పేలకు, నల్లులకు సిద్ధౌషధమును కనిపెట్టిన భాగ్యశాలి! ఈ వూరిలోనే నేను కూడ పుట్టినది.