చంపూరామాయణము/చంపూ రామాయణ పీఠిక

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

చంపూరామాయణ పీఠిక

కవికాలనిర్ణయము

ఈకృతి యొనర్చినకవి కవిరాజకంఠీరవబిరుదాంకితుఁడును వాసిష్ఠగోత్రజుఁడును నగుఋగ్వేదికవి వేంకటాచలపతి. ఆశ్వాసాంతగద్యములయందు "ఋగ్వేదికవి తిరువేంగళార్యకలశరత్నాకరసుధాకరఁ"డని తన్ను వర్ణించుకొనుటచే నీతనితండ్రిపేరు తిరువేంగళార్యుఁ డైనట్లు తెలియుచున్నది. మరియు గ్రంథావతారికలో దాను "తిరువేంగళార్యకవిరాజసమాశ్రయ ధన్యచిత్తవర్తనుఁ" డనియు—

"అత్తిరువేంగళార్యుని యుదారదయావిలసత్కటాక్షసం
పత్తి నదీర్ణమైన సుకుమారవచఃప్రతిభానిరూఢి ను
ద్యత్తరగద్యపద్యచయ మాశుగతిన్ రచియింపనేర్చె"

ననియు వ్రాసికొనుటచే నీతని కవితాగురువు కూడ దిరువేంగళార్యుఁడైనట్లు కన్పట్టుచున్నది. ఈతిరువేంగళార్యు లిరువురు భిన్నపురుషులై యుందు రని తోచుచున్నది. అట్లు కానిచో గురువును వర్ణించునవసరమున నతఁడు తనతండ్రియే యని చెప్పకుండునా?

కవికాలమును నిర్ణయించుటకు దగినయాధారములు కొన్ని గ్రంథమునందే యున్నవి. వానిలో గృతిపతివంశావతారము ముఖ్యమైనది. ఈకృతిపతి యిప్పుడు కార్వేటినగరసంస్థాన మని వాడబడుచున్న దేశమున కధిపతి యైన వెల్లంటి కసవరాజు. ఆదేశమునకు దొండమండలము, తుండీరమండలము నని పూర్వనామములు. ఆంధ్రజైమినిభారతకృతిపతి యగుసాళువ నరసింగరాజు మొదలగు సాళువరాజులు పూర్వ మాదేశమును బాలించిరి. వారిపిదప మాకరాజువంశ్యులు రాజులైరి. ఈమాకరాజుకులములో జేరిన తిరుమలరాజునకే చదలువాడ మల్లయకవిప్రణీత మైన విప్రనారాయణచరిత్ర మంకిత మైనది. కొంతకాలమునకు రాజ్యము మాకరాజువంశమునుండి దౌహితృభాగముగా వెల్లంటివారికి సంక్రమించినది. ఈమా ర్పెప్పుడు జరిగినదో స్పష్టముగా దెలియదు. ప్రస్తుతగ్రంథకృతిపతి యైన కసవనృపతి యీవెల్లంటివంశమువాడే. ఇప్పుడున్న కార్వేటినగరపు జమీందారులు కూడ నీవంశమువారే. మాకరాజువారును వెల్లంటివారును గూడఁ బూర్వపుసాళువరాజులబిరుదములఁ దమబిరుదములుగాఁ జేసికొన్నారు.

కసవరాజువంశము గ్రంథములో నిట్లు వర్ణింపబడినది. కరికాళచోళుని వంశములో సింగరిరాజు పుట్టెను. సింగరిరాజునకు శ్రీరంగరాజును, శ్రీరంగరాజునకు సింగరిరాజును, సింగరిరాజునకుఁ గావేరిరాజునుఁ, గావేరిరాజునకు సింగరిరాజును, సింగరిరాజునకుఁ గావేరిరాజునుఁ, గావేరిరాజునకుఁ గసవరాజు, సింగరిరాజు, తిరువేంగళరాజు, పెరుమాళ్రాజు ననునలువురు కొడుకులును బుట్టిరి. ఈకసవరాజే కృతిపతి. కసవరాజుపిదప నేడవతరమువాఁ డగుబ్రహ్మరాజు కాలమునఁ బుట్టిన [1]పద్మావతీపరిణయ మనుసంస్కృతచంపూగ్రంథ మీవంశక్రమమును దృఢపరుచుచున్నది. ఆగ్రంథములోఁ గసవరాజునకు మాఱు కేశవరా జనియున్నది. కసవయనునది కేశవశబ్దభవము కాఁబోలును. కసవరాజు తరువాతి తరములవారు పద్మావతీపరిణయములో నీరీతిం జెప్పఁబడినారు:—

కసవరాజు పిమ్మట నతనితమ్ముఁడైన వేంకటపెరుమాళ్రాజు రాజ్యము చేసెను. అతని యనంతర మాతని యన్నకొడు కగుబ్రహ్మరాజు రాజ్యము చేసెను. బ్రహ్మరాజుకొడుకులు కావేరిరాజు వేంకటపెరుమాళ్రాజులు. వేంకటపెరుమాళ్రాజు కొడుకు బ్రహ్మరాజు; అతని కొడుకులు కుమారవేంకటపెరుమాళ్రాజు, కావేరిరాజు, తిరుమలరాజు, సుందరకృష్ణరాజును. కుమారవేంకటపెరుమళ్రాజు కొడుకులు [2]బ్రహ్మరాజు మొదలగువారు. ఈబ్రహ్మరాజే పద్మావతీపరిణయకృతిపతి. కసవరాజునకు బ్రహ్మరాజునకు నడుమ నయిదుగురు రాజ్యముచేసినట్టులు దీనివలనఁ గనఁబడుచున్నది. ఈగ్రంథములోఁ గుమారవేంకటపెరుమాళ్రాజు తారణసంవత్సరచైత్రమాసములో లోకాంతరగతుఁ డైనట్లును, నాసంవత్సరజ్యేష్ఠమాసములో బ్రహ్మరాజు పట్టాభిషిక్తుఁ డైనట్టును బ్రహ్మరాజునాజ్ఞ ననుసరించి యాగ్రంథము వికృతిసంవత్సరమునం దచ్చుపడినట్లు నున్నది. తారణసంవత్సరము 1884-వ క్రైస్తవసంవత్సరమునకును, వికృతిసంవత్సరము 1890 సంవత్సరమునకును సరిపోవును. కుమారవేంకటపెరుమాళ్రాజు సవతితమ్ముఁ డగుతిరుమలరాజున కంకితమైనట్టియు, గరుడాద్రి సుబ్రహ్మణ్యవిద్వత్కవి ప్రణీత మైనట్టియు [3]శత్రుఘ్న విజయ మీవంశక్రమమును దృఢపఱుచుచున్నది. ఈ గ్రంథము 1786 వ (రసకరిమునిశశి) శాలివాహనసంవత్సరమునకు సరియైన ప్రభవసంవత్సరమునఁ బూరింపఁబడినట్లు గ్రంథాంతమం దున్నది. ఇది క్రీ. 1864 వ సంవత్సరమునకు సరి పోవును. అప్పటికిఁ గుమారవేంకటపెరుమాళ్రాజు సజీవుఁడై యున్నట్లును, నతనికి బ్రహ్మరాజు, కుమారవిజయవీరరాఘవరాజు, కావేరిరాజు, సింగరిరాజు ననునలుపురుకొడుకు లున్నట్లును జెప్పి యింకను బలువురు తనయులు కలుగుదురుగాక యని కవి యాశీర్వదించినాఁడు. క్రీ. 1884 సంవత్సరమునఁ గాలధర్మము నొందిన కుమారవేంకటపెరుమాళ్రా జీతఁడే యగుట నిస్సంశయము. ఈకుమారవేంకటపెరుమాళ్రాజు కసవరాజున కైదవ తరమువాఁ డగుచున్నాడు. ఆచారానుసారముగాఁ దరమున కిరువదియైదుసంవత్సరముల చొప్పున లెక్కించినచోఁ గసవరాజు క్రీ. 1714 సంవత్సరప్రాంతమువాఁ డగుచున్నాఁడు. స్టూలదృష్టిచే, క్రీ. 1700 సంవత్సరప్రాంతమువాఁ డనుకొందము.

వేఱొకలెక్కనుబట్టి చూచినను నించుమించుగా నీకాలమే ధ్రువపడుచున్నది. ఎట్లన :—

కవిగురువైన తిరువేంగళార్యుఁడు సాళ్వతిమ్మనృపాలుఁడు, వీరవేంకటరాయశౌరి, వెలుగోటి వేంకటవిభుఁడు, చెంజి వరదేంద్రుఁడు ననుప్రభువులచే గౌరవింపఁబడినట్లు గ్రంథములో నున్నది. (ఆ. 1 ప. 31.) సాళ్వతిమ్మనృపాలుఁ డెవ్వఁడో తెలియదు. ఆకాలమం దాపేరుగల సుప్రసిద్దరాజు గానరాఁడు. సామాన్యుఁ డైనజమీందారుఁడై యుండనోపును. చెంజి వరదేంద్రుని కాలము స్పష్టముగాఁ దెలియుచున్నది. దీనినిబట్టి యితరుల కాలము నిర్ణయింపవలసి యున్నది. చెంజి యనునది దక్షిణార్కాటు మండలములో సుప్రసిద్ధ మైనస్థలము. ఆంగ్లేయ భాషను దీనిని "జింజి" యందురు. కర్ణాటరాజ్యకాలమం దీచెంజిదేశమును గొందఱునాయఁకులు పాలించుచుండెడివారు. ఆనాయఁకులలో నొక్కఁడగు "చెంజి వరదప్పనాయనయ్యవారు తీర్థాచరణ వచ్చి శేతుదర్శనం శేశి స్వస్తిశ్రీశాలివాహనశకవర్షంబులు 1593 కల్యబ్దాః 4772 అస్మిన్ వర్తమానె వైశాఖబహుళసప్తమి స్తిరవారం యీపుణ్యక్షేత్ర మైన..........మరప్రదేశం ఆకార్తికశుద్ధపౌర్ణమినాడు కొమారస్వామికి బంగారు అందలమున్ను సమర్పణ శేశి తమఆరతిను యేర్పాటు శేయించినారు” అని మధురకు సమీపమందున్న సుప్రసిద్ధకుమారక్షేత్రమగు తిరుప్పరంగుండ్ర మను గ్రామమునందలి దేవాలయములో నొక్క తెలుఁగుశాసనమును, దాని కనువాదముగా నొక యరవశాసనమును గలవు[4]. ఈశాసనములో వరదప్పనాయనితోఁ గూడ నిరువదియైదు తరములవారు పేర్కొనఁబడియున్నారు. వీరిలో వరదప్ప యను పేరుగలవాఁ డితఁ డొక్కఁడుమాత్రమే యున్నాఁడు. తిరుములార్యుని గౌరమించిన చెంజి వరదేంద్రుఁ డీవరదప్పనాయఁడే యనుటకు సందేహ ముండఁగూడదని నాయభిప్రాయము, వరదప్పనాయనిశాసనసంవత్సరము క్రీ. 1671 సంవత్సరమునకు సరిపడును. ఇఁక వీరవేంకటపతిరాయశౌరి యెవ్వరో చూతము. పేరును బట్టి చూడ నీతఁడు కర్ణాటరా జని స్పష్టమగుచున్నది. సుప్రసిద్ధుఁ డగు వీరవేంకటపతిరాయలు క్రీ. 1614 ప్రాంతమున మృతి నొందెను. 1648 ప్రాంతమున శ్రీరంగరాయలు రాజ్యమునకు వచ్చి 1678 ప్రాంతమందు రాజ్యభ్రష్టుఁడై మహిసూరుదేశములో మృతినొందెను. ఈయిద్దజురాజుల నడిమికాలమునందుఁ బలువురు రాజ్యమును గాంక్షించుటచే ఘోరమగుపోరు పుట్టి శ్రీరంగరాయలు రామరాయలు వేంకటపతిరాయలు ననువారు స్వల్పస్వల్పకాలము సింహాసన మధిష్టించి పదభ్రష్టు లగుచు వచ్చిరి. శ్రీరంగరాయలపిదప క్రీ. 1678-1680 సంవత్సరములలో వేంకటపతిరాయలు రాజ్యము చేసినట్టులు కొన్ని[5]శాసనములవలనఁ గనఁబడుచున్నది. ఈవేంకటపతిరాయలకాలము చెంజి వరదప్పనాయనికాలమునకు సరిపోవుచున్నది. ఈతఁడే తిరువేంగళార్యుని గౌరవించిన వీరవేంకటరాయశౌరియైనట్లు తోఁచుచున్నది. నిజముగా శ్రీరంగరాయలతోడనే కర్ణాటరాజ్య మంతమైనది. అదిమొదలు చాలకాలమువఱకు నావంశములోనివా రెవ్వరో యొక రానెగొంది సమీపదేశమునకుఁ బ్రభువులై పూర్వాధికార మంతరించినను బూర్వరాజుల బిరుదములను మాత్రము పెట్టుకొనుచుండినట్లును, గౌరవార్థముగా వారినే కర్ణాటరాజులుగా మధురనాయఁకులు మొదలగువారు భావించుచుండినట్లును శాసనములవలనఁ గన్పట్టుచున్నది. ఇక వెలుగోటి వేంకటవిభుఁ డెవ్వరో చూడవలసి యున్నది. బ్ర. వెల్లాల సదాశివశాస్త్రిగారు రచియించిన వెలుగోటివారి వంశచరిత్రమువలన వేంకట యనునామముగల వారు 19-20-21 తరములలో మాత్రమే యున్నట్టులు కనఁబడుచున్నది. 20వ తరమువాఁడైన యాచ శూరున కెనమండ్రు కొడుకులు. వారిలో వేంకటాద్రినాయఁడు, వేంకటప్పనాయఁడు, చినవేంకటప్పనాయఁడు నను ముగ్గురు వేంకటాభిధాను లుండిరి. వీరిసోదరుఁడును రాజ్యభర్తయునైన కుమారయాచమనాయుఁడు మహిసూరువారితో యుద్ధము చేసి జయమంది "అబ్దుల్ ఫాదుషా" గారివలన బహుమానములు పొందినట్లు బ్ర. సదాశివశాస్త్రిగారు వ్రాసినారు. అబ్దుల్ ఫాదుషా యనఁగా అబ్దుల్ కుతుబ్ షా యను గోలకొండరాజు. ఈ రాజు క్రీ. 1611 మొదలు 1672 వఱకు రాజ్యము చేసెను. ఇదియుఁ జెంజి వరదప్పనాయనికాలమునకు సరిపోవుచున్నది. . యాచశూరునిసోదరులు కూడ నీకాలమువారే. వారు ముగ్గురిలో నెవ్వరో యొకరు చంపూరామాయణములోఁ బేర్కొనఁబడిన వెలుగోటి వేంకటవిభుఁడు కావలయును. ఈ ప్రమాణములు మూఁటిని బట్టి తిరువేంగళార్యుఁడు క్రీ. 1670-80 సంవత్సరములప్రాంతమువాఁ డైనట్లు తేలినది. ఆతని శిష్యుఁడైన వేంకటాచలపతికవి క్రీ. 1700 ప్రాంతమందుఁ గృతి నిర్మించుట యీకాలనిర్ణయమున కవిరోధమేకదా!

కవికాలనిర్ణయము చేయుట కింకొకయాధారము కూడఁగలదు. వేంకటాచలపతికవి దామర యక్కనృపాలుని సన్నిధికిం జని నప్పు డెవ్వరో "వరకవి గంధసింధురము" వచ్చె నటన్న "నేను గవిరాజకేసరి" నని కవి పల్కెనఁట. (చూ. ఆ. 1 ప. 34) ఈ యక్కనృపాలుఁ డెవ్వరో నిర్ణయింపవలసియున్నది. ధూర్జటి లింగకవి కృత [6]కాళహస్తిమాహాత్యమువలనఁ గాళహస్తిరాజవంశమం దక్కప్ప యనుపేరు గలవారు నలువు రున్నట్లు తెలియవచ్చుచున్నది. వారిలో మొదటివాఁడు చెన్నపట్టనమునకుఁ బేరొసంగిన చెన్నప్పనాయని రెండవకుమారుఁడు. ఈతఁడే ఉషాపరిణయగ్రంథకర్త. ఈయక్కప్పనాయని మనుమఁడుఁగూడ నక్కప్పయే. ఈ రెండవయక్కప్పకు, అక్కప్పయను కుమారుఁడును మనుమఁడును నమ్మక్కయను గూఁతురు నుండిరి. అమ్మక్క వెలుగోటి వీరకుమారయాచమనేని భార్యయై బంగరు యాచమనేనిం గనియెనఁట. ఈ బంగరు యాచమనీఁడు క్రీ. 1693 వ సంవత్సరమువఱకు సజీవుఁడైనట్లు వెలుగోటివారి వంశచరిత్రము చెప్పుచున్నది. కావున, బంగరు యాచమనేని మేనమామకుమారుఁడగు నాలుగవయక్కప్ప క్రీ. 1700 సంవత్సరప్రాంతమువాఁ డనియు వేంకటాచలపతికవికి సమకాలికుఁ డనియుఁ దేలుచున్నది. ఏవిధమునఁ జూచినను వేంకటాచల పతికవి క్రీ. 1700 ప్రాంతమం దుండె నని సిద్ధాంతీకరించుట కాక్షేప మేమియుఁ గనఁబడదు.

పద్మావతీపరిణయము నందుఁ గసవరాజు నుత్తరచరిత్ర మిట్లు వర్ణింపఁ బడినది :—

"కసవరాజపుత్రకుండై వయసునఁ జిన్నవాఁడైనను గుణములచేఁ బెద్దయు, వేంకటేశ్వరాంశసంభూతుండు నైన వేంకటపెరుమాళ్రా జనుచిన్నతమ్ముని రాజ్యతంత్రధురంధరుంగా నెంచి యతనియందు రాజ్యభార ముంచి నిస్పృహుఁ డై వానప్రస్థాశ్రమము నంగీకరించి భార్యతోఁ గూడ మునినికరముం జేరి వారిచెంతఁ గొండగుహయందు వసించి దుష్కరమగు తప మొనర్చుచుఁ గొంతకాల ముండి యంతటఁ దనకు మోక్షకాలము సమీపించినదని యెఱింగి నిజరాజధానియైన నారాయణపురమున కేగి యందున్న కల్యాణవేంకటేశ్వరుని యాలయములో ధ్వజస్తంభము చెంత భగవత్పాదములు స్మరించుచు బ్రహరంధ్రమునుండి ప్రాణమును విడిచెను." అని. చంపూరామాయణములోఁ గసవరాజునకు సింగరిరాజు, తిరువేంగళరాజు పెరుమాళ్రాజు ననువారు ముగ్గురే తమ్ము లుండినట్లు చెప్పఁబడినది. పద్మావతీపరిణయములో నీతనికి, తిరుమల రాజు, వేంకటపతిరాజు, చిన్నరాజునను మఱి ముగ్గురుతమ్ములుఁగూడ నుండిరనియు నీయార్గురిలో వేంకటపెరుమాళ్రాజు కడపటివాఁ డనియు నీతఁడే [7]కార్వేటినగరమును గట్టించెననియు, నంతకుఁ బూర్వము నారాయణపురమే రాజధానిగా నుండె ననియుఁ జెప్పఁబడియున్నది.

ఈగ్రంథము ప్రతియొక్కటే అత్తిరాలలో బ్ర. వెల్లాల చిన్నవేంకటసుబ్బయ్య సిద్ధాంతిగారివలన దొరకినది. దీని చివర "యతుల నారసింహ్వరాజు వ్రాసిన చంబూరామాయణం” అని యున్నది. ప్రత్యంతర మి తవఱకు దొరకలేదు. లేఖనదోషములుమాత్రము సవరించి వలసినపట్ల సంస్కృతచంపూరామాయణమునకు సరిచూచి మాకు దొరకిన ప్రతి ప్రకటించినారము.

వేంకటేశ్వరాష్టకములోనివి గ్రంథావతారికలో (పుట 4.) ముద్రింపఁబడిన మూడుపద్యములుగాక మిగిలిన యైదుపద్యములు నీ క్రిందఁ జేర్పఁబడినవి.

శా.

పర్వేందుప్రతిబింబవక్త్రము శరత్పద్మాక్షియుగ్మంబు కీ
రార్వశ్లాఘ్యధనుర్గుణాసహన సూనాకారనాసోన్నతిన్



శర్వాదు ల్నుతియింపలేనితఱి నీసౌందర్య మెంతోగదా
కార్వేటీశ ప్రసన్నవేంకటరమాకాంతామనోవల్లభా.


శా.

ఆర్వేలేండ్లు తపంబు చేసి భవదీయావాసశేషాద్రిపైఁ
జెర్వంగాంచెను వేల్పుమూఁకకు మహాసేనుండు బల్నెత్తురుల్
నుర్వు ల్గట్టఁగఁ దారకాసురుని దా నుగ్గాడె నీశక్తిచేఁ
గార్వేటీశ ప్రసన్నవేంకటరమాకాంతామనోవల్లభా.


శా.

తార్వాళంబులు వంచి చిత్తరుల వింత లముచ్చటైయుండఁగాఁ
దిర్వీథుల్ భవదీయసన్నిధిని ముస్తీదైన యావీథిలోఁ
దెర్వారే తిరునాళ్ల నీకు నడవన్ దృశ్యంబు గాకుండఁగాఁ
గార్వేటీశ ప్రసన్నవేంకటరమాకాంతామనోవల్లభా.


శా.

కుర్వేరుం దమనంబు జాతిసుమముల్ గోరంట చేమంతులున్
హర్వై నిగ్గులు దేఱు శ్రీతులసి నీ కర్పించు మర్త్యుండు దా
నేర్వజ్రంబుల మౌక్తికంబులను బూజించేఫలం బొందుఁగా
కార్వేటీశ ప్రసన్నవేంకటరమాకాంతామనోవల్లభా.


శా.

ఓర్వ న్శక్యమె యామ్యబాధ కటువై యుండ న్మనుష్యుం డిలం
జార్వాకోక్తులచేతనే చెడు దురాచారంబు గావించుఁగా
శర్వర్యందు నహస్సునందును భవచ్చారిత్రదూరాత్ముడై
కార్వేటీశ ప్రసన్నవేంకటరమాకాంతామనోవల్లభా.

జయంతి రామయ్య

కవిత్వవిమర్శనము

శ్రీమద్రామాయణమును జంపువుగా సంస్కృతభాషయందు రచించినకవి భోజరాజు. ఈ రాజకవి ధారానగరము రాజధానిగాఁ గల మాలవదేశమున క్రీ. శ. 1018 సం. మొదలుకొని 1060 వఱకు రాజ్యము చేసినట్లు శాసనములవలనఁ దెలియుచున్నది. కనుక నితఁడు క్రీ. శ. 1022 సం. మొదలు 1063 సం. వఱకు వేంగీదేశమును పాలించిన మనరాజరాజనరేంద్రునకు సమకాలికుఁడుగా నున్నాఁడు. ఇతఁడు సరస్వతీకంఠాభరణము, పాతంజలసూత్రవృత్తి మొదలగు గ్రంథములను రచించియుఁ బెక్కుపండితకవులకు నాశ్రయభూతుఁడై వారిచే బహుగ్రంథముల రచింపించియు సంస్కృతభాషను మహోన్నతికి దెచ్చెను. చంపూరచన కితఁడు మార్గదర్శి. ఇందుల కితఁడు 'గద్యానుబన్ధరసమిశ్రితపద్యసూక్తిర్హృద్యాహివాద్యకలయాకలితేవగీతి' యని గద్యముతోఁ గూడిన పద్యకావ్యము వాద్యముతోఁ బాడిన గీతమువలె హృద్య మని కారణమును నిరూపించెను. ఇతఁ డీచంపూరామాయణమునం దయిదుకాండములే రచించి యేకారణమువలననో యాఱవది యగుయుద్ధకాండమును రచింపక విడువఁగా దానిని లక్ష్మణసూరి యనుకవి రచించి పూరించినవాఁ డయ్యె. ఈకవిశిఖామణు లిద్దఱును రచించిన యీచంపువు మృదుమధురపదసందర్భసుందరమై చదువరుల నిర్భరరసాస్వాదపరవశులం జేయుచు సంస్కృతభాషకు వన్నెగలిగించుకావ్యములం దొకమిన్నగా నెన్నందగియున్నది.

ఇట్టి ప్రబంధమును దెనుఁగుచేసినవాడు కవిరాజకంఠీరవ బిరుదాంకితుఁ డగుఋగ్వేదికవి వేంకటాచలపతి.

ఇతని యాంధ్రీకరణపుఁ దెఱంగులు కొంత పరామర్శింతము. ఇతఁడు మూలమును గొన్నియెడల వేఱుగ మార్చియుఁ, గొన్నిపట్టుల లేనివి గూర్చియుఁ, కొన్నిచోట్ల నున్నవి విడిచియుఁ దెలిఁగించినను మొత్తముమీఁద మూలమున కంతగా హెచ్చును దక్కువయుఁ గాకుండ దీనిని రసవంతముగానే రచించినాఁ డనవచ్చును. భాషాంతరము సేయుట యనఁగా నొకభాషలోని పదమునకు మఱి యొకభాషయందలి మాఱుపదమును మక్కీకిమక్కీగాఁ బెట్టుట గాదు. భాషలు తమతమశబ్దవాక్యస్వరూపవిశేషములంబట్టియుఁ, దన్మూలకము లైనవ్యాకరణప్రక్రియలంబట్టియు, రచనయందును శైలియందును, స్వభావమునందును బరస్పరభేదము గలిగియుండును గనుక నొకభాషయందలిపదములను మరొకభాషలోనికిఁ బరివర్తనము చేయునప్పు డారెండవభాషస్వభావాదుల ననుసరించి తగుకొలందిని వానిని మార్చియుఁ గూర్చియు రచించిననే యవి రమణీయమై రసవంతముగా నుండును. 'బ్రహ్మాండభాండము'లను 'బమ్మగ్రుడ్డుకుండ' లనుట గాని 'పెండ్లికొడుకు'ను 'వివాహపుత్రుఁ' డనుటగాని భాషాంతరము గాదు. దీని నెఱింగియే కవికులాదృష్టాధ్యగమనుఁ డగుశ్రీనాథుఁడు తన తెనుఁగునైషధమున 'శబ్దం బనుసరించియు, నభిప్రాయంబు గుఱించియు, భావం బుపలక్షించియు, రసంబుఁ బోషించియు, నలంకారంబు భూషించియు, నౌచిత్యం బాదరించియు, ననౌచిత్యంబు పరిహరించియు మాతృకానుసారంబునఁ జెప్పంబడిన యీభాషానైషధకావ్యం' బని వ్రాసినాఁడు. ఇంక నీ కవి తెనుంగునందలి మార్పులను గూర్పులను విడుపులను నుదాహరించెదము.

మార్పు:— ఇట మూలమును బెంచి కాని తగ్గించి కాని మఱింత మెఱుంగు గూర్చిన మార్పులను దెలిపెదము.

మూ.

సీతా పురా గగనచారిభి ర ప్యదృష్టా
మాభూ దియం సకలమానననేత్రపాత్రమ్
ఇ త్యాకలయ్య నియతం పిదధే విధాతా
బాష్పోదయేన నయనాని శరీరభాజామ్.

(అయోధ్యా)


తె. మ.

అజరాదుల్ పొడగాంచఁగూడని యసూర్యంపశ్య నారాముదే
వి జనానీకవిలోకభాజనము గావింపన్ మదిం గొంకి పం
కజగర్భుండు ఘటించె నాగరకలోకశ్రేణికిం జూడ్కి బా
ష్పజలాకీర్ణముగా నజాహ్వయభృతక్షాత్త్రాభిమానోన్నతిన్.

(4ఆ. 52ప.)

మూలమునందుంబోలెఁ దెనుఁగున గగనచారులకును బొడగాంచరనిదని సీతకు వనవాసానర్హతను దెలుపుటకై పరమసౌభాగ్యప్రయుక్త మగుసౌకుమార్యాతిశయము చెప్పుటయే కాక యెక్కువగా 'అసూర్యంపశ్య' యనియుఁ జెప్పి యెండ కన్నెఱుంగనిది యడవి కెట్లు పోజాలు నని సందర్భోచిత మగుకరుణరసమును మూలముకంటె మిక్కుటముగా నిందుఁ గవి వెలివిరియించినాఁడు. రామునిదేవిని మనుష్యులు చూడ ననువుగాకుండునట్లు చేసినవిధాతకు రామునియం దింతయభిమానమేల యని యాశంక కల్పించికొని బ్రహ్మకును రామునితాతకునుగల "యజాహ్వయ"మే హేతువుగా నిబంధించి మూలమున కెంతో మెఱుఁగు గావించినాఁడు.

మూ.

యద్యస్తి కౌతుక మపూర్వమృగే మృగాక్షి
చాన్ద్రం హరామి హరిణం నను సన్నిధేహి
యావ న్నముఞ్చసి మయా హృత మేణ మేనం
తావ ద్దధాతు తవ వక్త్రతులాం మృగాఙ్కః.

(ఆరణ్య)


తె.శా.

నీకున్ వింతమృగంబుపైని దమియుం టే నేమి కాదంటినా
రాకాచంద్రున కంతరంగ మగుసారంగంబు రప్పించెదం
గైకొ మ్మాహరిణంబు నీకరమునం గన్పట్టునందాఁక శు
ద్ధాకారుం డతఁ డొందుఁగాక భవదీయాస్యైకదాస్యోన్నతిన్.

(5ఆ. 81ప.)

మూలమందలి 'చాన్ద్రంహరిణ'మ్మునకంటెఁ దెనుంగునందలి 'రాకాచంద్రున కంతరంగ మగుసారంగ' మనుట మిక్కిలిసొంపు. మూలమునఁ జంద్రుఁడు మృగాం కమును వీడి శుద్ధుఁడై సీతాముఖముతోఁ బోలు నని యుండఁగాఁ దెనుఁగునందు శుద్ధుఁడయ్యును సీతాముఖమునకు దాస్యోన్నతినే పొందునని మిక్కిలిసారస్యము గలిగి యున్నది.

'సచివా స్తైలద్రోణ్యాం నిక్షిప్య' యన్నముక్కను

గీ.

అర్హమయ్యెఁ గృతాధ్వరుం డయినయతని
దేహము తిలోత్తమోదితస్నేహమునకు
నర్హముగదా కృతాధ్వరుం డైనయతని
దేహము తిలోత్తమోదితస్నేహమునకు.

అని తెలిఁగించి శ్లిష్టార్థాంతరన్యాసానుప్రాసములతో మిక్కిలి చమత్కరించినాడు.

ఇట్లె మూలమున 'అస్తి ప్రశస్తా జనలోచనానా, మానన్దసన్ధాయిషు కోసలేషు । ఆజ్ఞాసముత్సారితదానవానాం, రాజ్ఞా మయోధ్యేతిపురీ రఘాణామ్' అనుశ్లోకమునకుఁ జాతుర్వర్ణ్యాదివర్ణనకలిత మగు నొకసీసపద్యమును, విశ్వామిత్రయాగసందర్భమున 'కరతలగలితపలాశసమిత్కుశాః కుశికసుతాన్తేవాసినః' అనుటకు 2-వ యాశ్వాసమున (84, 85, 86, 87) నాలుగు పద్యములును, హనుమదాదులప్రాయోపవేశఘట్టమున 'తాస్తాఃకథాఃపరిదేవయన్త' మ్మనుటకు నయిదాఱుపద్యములను రచించి మూలముకంటెఁ దెనుఁగును రసోద్వేలము గావించినాఁడు.

కూర్పు:—ఇందు మూలములో లేనివై కేవలకవికల్పితము లగువానిని వ్రాసెదము.

వసంతవర్ణనము

సీ.

జిగితీవపడఁతికిఁ జెంగావిపావడ యవనీపదోచితయావకంబు
మాధవశ్రీకి నిమంత్రసిందూరంబు కలికానికాయతారలకు సంజ
పరభృతవాఙ్మయప్రదశాంభవీరుచివనికాపురంధ్రికాననహరిద్ర
వనదేవతచనుంగవకుఁ గుంకుమముడంబు ధారణీరుహశైలగైరికంబు
కామినీకాముకవినోదకలనకొఱకు, సమయవర్ధకి పొదరింటిగమికిఁ గీలు
కొలిపి నరుటంపుఁగెంపుఱాతళుకుటోడు, బిల్లగుము రెల్లకడ నుద్భవిల్లెఁ జిగురు.


మ.

మరునందు మఱుసృష్టి మ్రాఁకులయెడం బాలించుటెక్కున్ హిమో
పరిసంహారముఁ జూపి తత్త్రిపురుషీభాగౌచితిం జైత్రుఁ డొం
దురజస్సత్త్వతమోగుణోన్నతు లనం దోఁచెం జిగుళ్లుం జిగు
ళ్లరకంబయ్యెడుక్రొవ్విరుల్ విరులపట్లన్ వ్రాలుభృంగంబులున్.

చ.

చనదు వినోదకోప మిఁక సాగవు బింకము లాలకింపుఁ డీ
మనసిజుఁ డానతిచ్చినక్రమం బిది యంచు విటీవిటాలికిం
బనుప వసంతుఁ డక్షరసమాజము వ్రాసినకాగితంబులో
యనఁ దనరెన్ సబంభరవనాంతరకాంతలతాంతబృందముల్.

ఇత్యాదులు పెక్కులుగలవు. బాలకాండమున దశరథుని యనపత్యతావిచారమును, మిథిలాపురవర్ణనమును విశ్వామిత్రకృతసీతాసౌందర్యవర్ణనమును వివాహవర్ణనమును మూలమందు లేవు. అష్టాదశవర్ణనములసందర్భములో నీతని సొంతపద్దెములు లేనితావు లేదు.

విడుపు:— ఇందు మూలమున నుండియుఁ గవిచే విడిచిపెట్టఁబడినవానిని వ్రాసెదము. మూలమున విరాధుఁడు సీతను విడిచి రామలక్ష్మణుల నెత్తికొనిపోవుసందర్భమున

'యాతునః పదవీ సైషా య తు న శ్చాస్య లక్ష్మణ
యాతుకామం తయై వేదం యాతు కామం నహన్యతామ్.
'అయి కబలయ మా మమూ విముఞ్చే త్యతికరుణం రుదతీ మవేక్ష్యసీతామ్
అర మరచయతా ముభా వసిభ్యాం పిశితభుజం భుజభారహీనమేనమ్.
'రక్షోవధః ప్రకృత ఇ త్యయమేవ శంసే
త్స్వర్గాయ గాయకపదం గమితో విరాధః
నాగాలయాయ వపు రస్య వదే దితీవ

శ్వభ్రే త దక్షిప దిషుప్రహతం స రామః॥' అను శ్లోకములును, శూర్పణఖ రామునిం గూర్చి—

లావణ్యామ్బునిధే రముష్య దయితా మేనా మి వై సం జనం
కస్మా న్మాసృజ దస్మదన్వయగురో రుత్పత్తిభూః పద్మభూః
ఆస్తా మేత దరణ్యవాసరసికే హా కష్ట మస్మి న్నిమామ్
కాన్తిం కాననచన్ద్రికాసమదశాం కిం నిర్మమే నిర్మమే.

అన్న శ్లోకమును మఱియు నిట్లె రసవంతము లగుకొన్నిశ్లోకములను విడిచినాఁడు.

మూలమునకు సమాన మైనతెనుఁగు

మూ. శ్లో.

సంక్రాస్త వర్ణాన్తరగాధిసూనో
స్సంపర్కపుణ్యాదివ రామభద్రః
క్షాత్రక్రమా త్పిప్పలదణ్డయోగ్యః
పలాశదణ్డాదృతపాణి రాసీత్.

(బాల)

తే.

కలితవర్ణాంతరుం డైనగాధిసూను
సహచరత నేమొకో నిజక్షత్త్రజాతి
కయిన పిప్పలదండ మూనియుఁ బలాశ
దండకరుఁ డయ్యె నపుడు మార్తాండకులుఁడు.

(2 ఆ. 90 ప.)


మూ.శ్లో.

రేఖారథాఙ్గ సరసీరుహశఙ్ఖచిహ్నే
క్షేమంకరే తవకరే జగతాం త్రయాణామ్
కాన్తారకన్దఖననం రచయేతి నూన
మాబద్ధవాన్ ప్రతిసరం భగవా న్వసిష్ఠః.

(అయోధ్యా)


తె. చ.

ధరజలజాదిచిహ్నములు దావుకొనంగ జగత్త్రయీశివం
కర మగునీకరంబునకుఁ గంకణ మార్తినిదానకాననాం
తరతరుమూలకందఖననం బొనరింపు మటంచుఁ గట్టెనో
గురుఁ డగుశక్తితండ్రి రఘుకుంజర నిన్నఁటియుత్సవోన్నతిన్.


మూ. శ్లో.

మహాసమరసూచకః ప్రతిదినం మనోజన్మనో
మయూరగళకాహళీకలకల స్సముజ్జృమ్భతే
పయోదమలినేదినే పరుషవిప్రయోగవ్యథాం
నరేషు వనితాసువా దధతి హస్త కే కా ఇతి.

(కిష్కింధా)


తె. పృథ్వి.

చెలంగె నలుదిక్కుల శిఖిశిఖావళీకంఠకా
హలీధ్వని 'వియోగితామపి నరేషు నారీషువా
జలాకులఘనే దినే సపది యాన్తి కేకా ' యితి
చ్ఛలారభటితో మనోజరణవేగసంసూచియై.

ఇట 'వియోగితా......... కేకా' యను దానిని దెలిఁగించిన రసభంగము గొన దాని నట్లే యనుకరించి వ్రాసినాడు.

ఇతని కవిత్వమందు దోషములును గొన్ని గలవు. కొన్ని పూర్వాంధ్రకవుల యనుకరణములును గలవు. ఒక్కొక్కచోటఁ దెనుఁగు మూలమునకంటె నొకటి రెండువన్నెలు తక్కువగా నుండుటయుఁ గలదు. స్థాలీపులాకన్యాయమున నొక్కయుదాహరణము.

మూ.శ్లో.

వాచం నిశమ్య భగవా నథ నారదస్య
ప్రాచేతసః ప్రవచసాం ప్రథమః కవీనామ్
మాధ్యందినాయ నియమాయ మహర్షిసేవ్యాం
పుణ్యా మవాప తమసాం తమసాం నిహన్త్రీమ్.

క.

అమరమునిపల్కు విని సం, భ్రమమున వాల్మీకిసుకవి మాధ్యందినకృ
త్య మొనర్ప నరిగె సురుచిర, తమసారసకుముదవనికిఁ దమసాధునికిన్.

ఇట ముని మాధ్యందిననియమునకుఁ దెనుఁగునందలి నదీవిశేషణములకంటె మూల మందలివి మిక్కిలి యుచితములు. కథావిషయమునను నొకానొకచో మూలమునకును దెనుఁగునకు భేదము కనఁబడుచున్నది. మూలమునఁ గ్రౌంచమిథునములో నొక్కదానినే బోయ చంపినట్లుండఁగా రెంటిని జపినట్లు తెనుఁగున నున్నది. కొన్నిలక్షణదోషములును గలవు. మొగఱా (ఆ. 3.71 మగఱా యనుట సాధురూపము.) ధనువంశము (ధనుర్వంశము) కడానీబెత్తపు (కడానిబెత్తపు) ఇత్యాదులు చూపట్టుచున్నవి. 'గండపెండేరముఖపరిష్కార' (3 ఆ. 71) యని సమాసగర్భమునఁ దెనుఁగు దుష్టమయ్యును బూర్వశాసనములందుఁ గండపెండేరము మొదలగు రాజచిహ్నాభిధాయకములు సంస్కృతసమాసములందు ఘటితములై యున్నవి. కూఁతుశబ్దమునకుఁ బ్రథమైకవచనమాత్రనియత మగురువర్ణకము సమాసమునను బహువచనమునను విభక్త్యంతములను గనుపట్టుచున్నది. రెండవయాశ్వాసమున 25-వ పద్యమున 'సూళగేరి' యనుపదము మొదట 'సురలగౌ'రని దిద్దంబడినను బిదపఁ గర్ణాటనిఘంటు పరిశీలనమున నాగవాసమునకు వాచక మగు 'సూళగెరి ' యనుపదముగాఁ దెలిసి దిద్దంబడినది.

కవి దాక్షిణాత్యుఁడు గాన నొండు రెండుచోటుల ద్రావిడకర్ణాటపదములు పడినవి. 'చెలంగె నలుదిక్కుల' ననుపృథ్వీవృత్తమునకుఁ గవి తొమ్మిదింట యతిని వేసినాఁడు. వసుచరిత్రపీఠిక ను బ్ర. శొంఠి భద్రాద్రిరామశాస్త్రులవారు 13వ యక్షరమును, శృంగారనైషధవ్యాఖ్యానమున బ్ర. వేదము వేంకటరాయశాస్త్రులవారు 14వ యక్షరమును బృథ్వికి యతిగా వ్రాసిరి. పూర్వకవిప్రయోగములందు 12వ యక్షరము యతిగా నున్నది. కావున దీనినిబట్టి కవియందుఁ దప్పుపట్టరాదు.

ఇక్కవి మూలమున నందందుఁ గలశైలిని బాకమును ననుసరించియే యాయాపట్టుల పద్యములను రచించినాఁడు. ఇతని కవనమున వ్యర్థపదములును బాదపూరణములును నంతగాఁ గలుగవు. స్వతంత్రప్రయోగము చాలవఱకు గలదు. రసపోషణము ప్రధానముగా నున్నది. కవికి శృంగారరసము మిక్కిలి యభిమతముగా నున్నది. మొత్తమునకు శైలి మధురమై యలంకారబంధురమై యున్నది.

తంజనగరము దేవరాజసుధి,

కఱ్ఱి సాంబమూర్తిశాస్త్రి.

  1. ఈగ్రంథము కార్వేటినగరమునందలి శ్రీభారతీలీలాసదనముద్రాక్షరశాలలో నచ్చుపడినది.
  2. బ్రహ్మరాజునకు బొమ్మరాజని వాడుకపేరు. బ్రహ్మరాజుగారిపుత్రు లయినకుమారవేంకటపెరుమాళ్రాజు, కుమారస్వామిరాజుగార్లు ప్రస్తుతసంస్థానాధిపతులుగా నున్నారు.
  3. ఈగ్రంథము వ్రాఁతప్రతి యాంధ్రసాహిత్యపరిషత్పుస్తకభాండాగారమున నున్నది.
  4. ఈశాసనములు రాజకీయశాసనాధికారులు 1917 సంవత్సరములో సంపాదించిన శాసనములలో 860-861 సంఖ్యలు గలవి. వారికార్యస్థానమునఁ జూడనగు.
  5. చూ. Sewell's Lists of Antiquities Vol. II.
  6. ఈ గ్రంథము వ్రాఁతప్రతి, యాంద్రసాహిత్యపరిషత్సుస్తకభాండాగారమునఁ జూడనగు.
  7. చంపూరామాయణములోఁ గార్వేటినగరప్రశంస యుండుటచే నీమాట సత్యము కాదని తేలుచున్నది.