Jump to content

చంద్రరేఖావిలాపము/తృతీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

చంద్రరేఖావిలాపము

తృతీయాశ్వాసము

క.

శ్రీరతిసతీమనోహర
చారుతరగృహాయమానశష్పావృతవి
స్తారభగాన్వితచంద్రీ
నీరంధ్రాశేవ్యలోల నీలనృపాలా.

1


వ.

ఆకర్ణింపుము తావకీనకథావిధానంబు యథార్థంబుగా
శ్రీశివబ్రాహ్మణవర్ణాగ్రగణ్యుం డైన వీరభద్రభట్టారకేంద్రు
నకు శ్రీమద్వైఖానసవంశోత్తంసం బగు నరసింహాచార్యవర్యుం డవ్వలి
కథ యిట్లని చెప్పం దొడంగె.

2


క.

అంతటఁ బటఘటితగృహా
భ్యంతరమహిషానుపుష్పబంధురబలవ
ద్దంతయుతశయ్య నమ్మహి
కాంతుఁడు లే కున్న దాసి కలు డాసి కడున్‌.

3


క.

కళవళ మందుచు మన మిటఁ
గొలగొల మనుకొంచుఁ జుట్టుకొని యుండఁగఁ గో
మలగతి నేడకుఁ జనెనో
తెలియ దహా దైవమాయ తీ రెట్లగునో.

4


సీ.

పిక్క లూరులు కాళ్ళు పిల్లసేవకులచే
            గ్రుద్దించుకొనుచుండెఁ గొంతసేపు
పాటకు ల్పఱతేరఁ బాడించుకొంచును
            గొల్వుదీరిచియుండెఁ గొంతసేపు

హితవు మీఱఁగ భాగవతుల మేల్వేసాల
            వింత గన్గొనుచుండెఁ గొంతసేపు
మద్దెలమ్రోయంగ గుద్దఁ ద్రిప్పుచు నాడు
            నింతిఁ గన్గొనుచుండెఁ గొంతసేపు.


గీ.

మంచ మెక్కి యొక్కతెతోడ మదనకదన
మెంతయును జేయుచుండెను గొంతసేపు
తమలము మెసంగి పొగచుట్ట త్రాగిఁ గొంత
సే పతం డంత నెం దేఁగెఁ జెప్ప రమ్మ.

5


క.

ఏ లంజె యింటి కేఁగెనొ
యే లీలావతిని బలిమి నెనయించెనొ తా
నేలాగు మాయ మయ్యెను
నీలాద్రినృపుండు కామినీలోలుఁ డహా.

6


క.

వేంకటశాస్త్రులయజ్ఞము
పొంకము చూడంగ లేచిపోయెనొ లే దా
వంకఁ బులి మ్రింగిపోయెనొ
జం కయ్యెడిఁ జెప్ప రమ్మ జవ్వనులారా.

7


సీ.

ఇందుఁ దా వెల్వడి యెందు వేంచేసెనో
            మా సామిఁ జూపరే మ్రాకులార
సన్నకసన్న నే సకిఁ గూడియుండెనో
            మా ఱేనిఁ జూపరే మద్దులార
వేఁపులఁ బట్టుక వేఁటకుఁ బోయెనో
            మా దొరఁ జూపరే మడుఁగులార
యిందఱ భ్రమియించి యేటికిఁ బోయెనో
            మా రాజుఁ జూపరే జారులార.


గీ.

మమ్ము నేలిన నీలాద్రిమనుజవిభుఁడు
పూలపాన్పునఁ బెనునిద్ర పోయిపోయి
లేచి యొక్కరుఁడును మా కగోచరముగ
నెచ్చట నడంగెఁ జెప్పరే పచ్చులార.

8

క.

ఎల్లీ మల్లీ వల్లీ
పుల్లీ మా రాజు కూసుపోవక మీమీ
గొల్లెనకై రాఁడు గదా
కల్లలు వల దింకఁ జెప్పగదరే వేగన్‌.

9


సుగంధి.

నేలఱేఁడులార మంచినేస్తులార విక్రమా
భీలశూరులార పిన్నపెద్దలార గుప్పునన్‌
బూలపాన్పు డిగ్గి యేడఁ బోయినాఁడొ చూడరే
నీలకాశ్యపీవరుండు నిన్నరేయి యొక్కఁడున్‌.

10


మ.

అని గగ్గోలుగ వారు రోదనము సేయన్‌ నాయకుల్‌ గాయకుల్‌
చనవర్లున్‌ గణికాజనంబు లనుజుల్‌ సామంతులున్‌ మంత్రులున్‌
విని శోకాకులచిత్తు లై కదిసి తద్వృత్తాంత మాలించి యా
యన నన్వేషము సేయఁబోయిరి సమీపారణ్యమధ్యంబునన్‌.

11


క.

గట్టుల దరిఁ బుట్టల కడఁ
జెట్టుల చెంగటను జెఱువు చెంతల బలు పె
న్గుట్టల సందుల గొందులఁ
బట్టుగఁ బ్రవహించు నేటిపల్లములందున్‌.

12


క.

రోయుచు హో యని కూఁకలు
వేయుచు హా నీలభూప విస్మయముగ నీ
వేయెడ కేఁగితొ వెస రా
వే యనుచును మోఁదుకొనుచు విహ్వలు లగుచున్‌.

13


క.

మూఁగి యరయంగ నాతని
తోఁ గూడం జనిన వేఁటతోరపుఁగుక్కల్‌
సైగలు సేయుచు సాగఁగ
నా గతి గని చనిరి వార లందఱు వెంటన్‌.

14


క.

చని కనిరి చంద్రరేఖా
తనురూపవిలాసవహ్నిదగ్ధశరీరున్‌
ఘనచింతాభారున్‌ నూ
తనజనితదశావికారు తన్నృపమారున్‌.

15

వ.

ఇట్లు కనుంగొని సకలపరివారంబు లతనిం జుట్టుకొని
యాక్రందనంబు సేయుచు నాశ్చర్యధుర్యమానసంబుతో ని ట్లనిరి.

16


క.

వాతము పట్టెనొ వనిఁ బెను
భూతము గొట్టెనొ మఱెట్టి పొడగుట్టెనొ? హా
హా తెలియ దేమి మాయయొ
యీతఁడు పడియున్న చంద మెంచి కనంగన్‌.

17


సీ.

బహుళద్విజద్రవ్యభక్షణోద్భవమహా
            పాతకంబున నోరు పడియె నొక్కొ?
కవిమాన్యహరణదుష్కర్మప్రభూతాతి
            కలుషంబుచే జిహ్వ పలుకదొక్కొ?
పరసతీవ్రతభంగకరణప్రభవపంక
            గతి దుర్బలాంగంబు గదలదొక్కొ?
సుజనులఁ జెడఁజూచు చూడ్కిఁ జుట్టిన కొలఁ
            గడుఁ గనుంగవ మూఁతవడియె నొక్కొ?


గీ.

నిరతనిజదాసికాజననికరములను
బలిమిమైఁ బట్టపగ లింట బట్టి మిగుల
సమరతులఁ దేలఁ బొడము దోసమున నొక్కొ?
నీలనరనాథుఁ డిట్లొంటిఁ గూలినాడు.

18


వ.

అని మహాదుఃఖావేశంబున నందఱు నిట్లనిరి.

19


సీ.

కొలువు దీర్పవ దేమి గురుతరతరుసార
            భాసురలక్ష్మీవిలాసమునను?
కూర్చుండవది యేమి ఘుమఘుమామోదగుం
            భితసుచందనకాష్ఠపీఠమునను?
తేఱి చూడవ దేమి దృఢతరలావణ్య
            గణ్యపణ్యస్త్రీనికాయములను?
పలుకరింపవ దేమి బహువేషభాషాతి
            బంధురాశ్రితబాలభాగవతుల?

గీ.

నకట నీలాద్రిరాజభోగానురక్తి
మాని ఈ ఘోరకాంతారమహిని బండఁ
గారణం బేమి యేరిపైఁ గాఁక పూని
తెగి యిటకు వచ్చి యిట్లు నిద్రించె దిపుడు.

20


క.

కేళీభవనాంతరపరి
కీలితమల్లీలతాంతకేవలశయ్యా
లోలుఁడ వై యుండక యీ
నేలపయిం బండ నేల నీలనృపాలా.

21


సీ.

విజయరామక్షమావిభుఁడు పిల్వఁగఁ బంచె
            రాచిరాజకుమార లేచిరమ్ము
యెఱుకువాఁ డిదె పంది నేసి మాంసము దెచ్చి
            కాచుకయున్నాఁడు లేచిరమ్ము
వేఁటకుక్కలఁ గాన్క వెట్టి పంపిరి దొరల్‌
            చూచివత్తువుగాని లేచిరమ్ము
కొత్తపారావారు కొలువంగ వచ్చిరి
            రాచయేనుఁగుగున్న లేచిరమ్ము.


గీ.

దాసి యొక్కతె నీ పొందు కాస చెంది
వాఁచియున్నది విషయింప లేచిరమ్ము
సలుపుఁ గొల్పెడి పుండ్ల బూచులకు మందు
రాచికొన నీలనృప వేగ లేచిరమ్ము.

22


వ.

అని మఱియును.


క.

కదలఁడు పలుకఁడు ధాతువు
పదకరముల నుండఁ జూచి బ్రతుకునొ లేదో
బెదరకఁ జెప్పు మ దెట్లు
న్నదొ యీతని కో ముడుంబి నరసాచార్యా.

23


తే.

అనిన నాతండు దగ్గఱ కరిగి ధాతు
గతి పరీక్షించి యితనికిఁ గామరోగ

మంకురించిన దిఁక మీరు జంకు మాని
సరగ శిశిరోపచారముల్‌ సలుప లేచు.

24


క.

అని చెప్పిన వా రందఱు
జనితామోదంబుతోడఁ జల్లనిపను లే
పునఁ జేయఁగ సమకట్టిరి
మనుజాధిపుచెంతఁ జేరి మక్కువ మీఱన్‌.

25


క.

పసుపును నూనెయుఁ గరపద
బిసరుహముల రాచి విసముఁ బిండి శిరమునం
దిసు మంత గొఱిగి వడి నిడి
వెసఁ జెవి వెల్లుల్లి యూఁద వేగమె తెలిసెన్‌.

26


ఆ.

తెలిసి యుస్సు రనుచు నలుదిక్కులను జూచి
సైగ సేయ వారు చల్లగంజి
వంటకంబుఁ బిసికి వడిఁబోయ మెల్లన
గుటుకుగుటుకు రనుచుఁ గ్రోలి సోలి.

27


క.

తెప్పిఱి కూర్చుండి యతం
డప్పుడు తన చంద మెల్ల నాప్తులతోడన్‌
గుప్పున నేకాంతంబునఁ
జెప్పిన విని లంజె యెంత చేసెనఁ టంచున్‌.

28


క.

బొకనాసి, గడ్డ, సెగయును
నకటా యీ నీలవిభుని కంటించిన యిం
టికి నొంటికి హాని గదా
ప్రకటంబుగఁ బురుగు లురలిపడి చచ్చుఁ గదా.

29


క.

పట్టుఁడు కట్టుఁడు కొట్టుఁడు
“గట్టిగఁ దల బోడిచేసి గాడిదమీఁదన్‌
పెట్టుఁడు పురి వెడలంగా
గొట్టుఁ” డనిరి యంద ఱొకటఁ గోపము మీఱన్‌.

30


వ.

అప్పుడు నీలాద్రిభూమిపుండు.

31

ఆ.

దానిఁ బట్టఁ బూను తజిబీజుఁ గనుఁగొని
సాని నిట్లు సేయఁ జనదు నాకుఁ
గూర్మిమీఱ మీరు కుస్తరిం చిటు తోడి
తెచ్చి కూర్పవలయు నిశ్చయముగ.

32


క.

తల గొఱిగించుట కంటెన్‌
మొల గొఱిగించుటయె మేలు ముగ్ధ యగుట బల్‌
సలుపున కోర్వక యుంచిన
దిల విటులకు నింత భాగ్య మేదీ జగతిన్‌.

33


క.

సమ మై రోమరహిత మై
యమితమృదుత్వంబుఁ గలిగి యశ్వత్థదళో
పమ మై స్నిగ్ధం బై వెళు
పమరెడు భగ మిచ్చు భాగ్య మందురు శాస్త్రుల్‌.

34


ఆ.

ఇన్ని లక్షణంబు లెన్న దాని త్రికోణ
పాళి నుండు ననుచు హాళి నాదు
నంతరాత్మఁ దోచె నయ్యది సౌభాగ్య
వతియె సుమ్ము పెక్కువాక్కు లేల.

35


ఆ.

దాని యోని తీరు దాని చన్నుల చెన్ను
దాని మోము గోము దాని మోవి
కావి ఠీవి చెప్పఁగా మాకు శక్యమే
రోమములు వడంకు భీమరాజ.

36


క.

సిద్ధాంతివి పండితుఁడవు
సద్ధర్ముండవును నాకు సఖుఁడ వెపుడు నే
నుద్ధతి దాని రమించెద
శుద్ధగతిం జెప్పు శొంఠి సుబ్బయ మాకున్‌.

37


వ.

అని పలుకునప్పుడు పండితుండును నిష్టాగరిష్ఠుండును
సుజ్ఞాననిపుణుండును హితుండును బ్రాహ్మణాగ్రగణ్యుండును శాం
తుండును సకలజనసమ్మతుండును జతురుండును ప్రయాగవంశోత్తఁ
ముండును నగు బాపన్న యాపన్నుండై యా పగిది వాపోవుచుఁ

గన్నులు తేలవైచుచున్న యా నీలాద్రిమన్నుఱేనిం గనుంగొని
వినయవిసంభ్రగాంభీర్యంబులు గుంభింప గంభీరభాషంబుల మెల్ల
మెల్లన యిట్లనియె.

38


క.

పరనారీసోదరుఁడవు
పరతత్త్వవిశారదుఁడవు బహురాజసభాం
తరనుతకీర్తివి వేశ్యా
తరుణీమైథునము సేయఁ దలపం దగునే.

39


సీ.

చెఱవు చేసితివిగా చెలఁగి బాడవక్రింద
            సద్రాజు లెన్న సముద్రముగను
వనము నిల్పితివిగా వర్ణింపరాకుండ
            వీఁక నరట్ల కుప్పాక నడుమ
మాన్య మిచ్చితివిగా మహిషి మూలంబున
            శొంఠిసుబ్బయ్యకు క్షుద్రభూమి
నా కిచ్చితివి గదా నాలుగైదు వరాలు
            పేశలగతిని వర్షాశనముగ.


గీ.

వివిధసంగ్రామజయరామవిజయరామ
రాజకరుణాకటాక్షనిర్వ్యాజలబ్ధ
సకలసామ్రాజ్యఖనివి నీ వకట యొక్క
పుప్పి బోగపులంజెకై పొగులఁదగునె.

40


క.

ఇల్లును నొళ్ళును గుల్లగుఁ
బె ల్లడరెడు రాజ్యలక్ష్మి పెంపు హరించున్‌
గుల్లాపుసానిదానిన్‌
మళ్ళతని తమిఁ గోరి నీవు మఱి రతి సలుపన్‌.

41


క.

వద్దు సుమీ యిది కూడని
పద్దు సుమీ నాదు మాట పాలించితివా
ముద్దు సుమీ యా సానిది
మొద్దు సుమీ దాని దెంగు మోహం బేలా.

42

క.

జగ్గకవిరాజు చేతం
బగ్గెయు సిరి వోవఁ దిట్లు వడితివి చంద్రిన్‌
మగ్గము వెట్టిన మొదలే
నగ్గవయో నీలభూప నృపసుమచాపా.

43


వ.

అప్పు డప్పలుకులు విని కటకటంబడి కటమదరిఁ బండ్లు
పెటపెటం గొఱికి చటులక్రోధకుటిలారుణలోచనుం డై తదీయప్రధాన
ప్రధానుం డగు పాదుర్తి భీమనామమంత్రి యతని కిట్లనియె.

44


క.

ప్రభుచిత్త మెవ్విధంబున
ప్రభవించునొ యట్లె నీవుఁ బలుకక వడి ని
ట్లు భయము మాని పలికెదవు
సభలో వారెల్లఁ గడు నసహ్యత పడగన్‌.

45


క.

ఓంభూలు చేసికొంచును
జంభంబులు గొట్టుకొనుచు జడమతి నశుభా
రంభము లరయుచుఁ దిరిగెడి
దంభపువిప్రునకు నీకుఁ దగ దిది చనుమా.

46


ఆ.

పప్పుదప్పళంబు లొప్ప దప్పొప్పులు
సెప్పుకొంచుఁ దడక విప్పుకొంచుఁ
జదువుకొంచుఁ దిరుగ ఛాందసుల్‌ మీరలు
రాచకార్యములకు రాఁగఁ దగునె.

47


క.

వైశ్యం బేలా విధవకు
వైశ్యునకున్‌ సమరవిజయవాంఛ ల వేలా
వశ్య యయి కులికి పైఁబడు
వేశ్యారతిసుఖము వేదవేద్యున కేలా.

48


వ.

అనిన నమ్మంత్రిజనపుంగవున కాతం డిట్లనియె.

49


క.

నిష్ఠహీనుండవు ఘన
నిష్ఠురయాప్రలాపనిపుణుఁడ వీవే
జేష్ఠ వితనిని నియోగి
జ్యేష్ఠులలోపలను జేర్చి చెప్పఁగ నేలా.

50

క.

తిరుమణియు దులసిపేరులు
తిరువారాధనయు బెద్ద తిరుగూడ వెసన్‌
ధరియించి ముష్టి కిప్పుడె
తరలుము మంత్రాంగ ముడిగి దాసరి వగుచున్‌.

51


గీ.

బంధుఁడును బండితుఁడు గూరపాటి రాయ
మంత్రివర్యుఁ డతని దోలు మడతబెట్టి
కొట్టి సన్యాసి జేసితి విట్టివాఁడ
వితని గులశేఖరుని జేయు టెంత నీకు.

52


సీ.

ఇయ్యనీయవుగదా యెంత సత్కవి వచ్చి
            ప్రస్తుతించిన బూటబత్తె మైన
నుండనీయవుగదా చండపండితరాజ
            మండలంబును సభామంటపమున
నిల్వనీయవుగదా నిమిషమాత్రం బైన
            నాశీర్వదించు ధరామరులను
చూడనీయవుగదా వేడుకతో బాడు
            గానవిద్యాప్రౌఢగాయకులను.


గీ.

కూసుమతమార్గరతుఁడ వై(డైన) కులము విడిచి
తిరిగి(తిరుగు) నీ విందు జేరి మంత్రిత్వ మూని
త్రిప్ప నీలాద్రిరా జిట్లు మొప్పె యయ్యె
భీకరవ్యాజ యాదుర్తి భీమరాజ.

53


శా.

సామం బేమియు లేదు సాంత్వనవచస్సందర్భమున్‌ నాస్తి దు
ర్గ్రామణ్యం బధికంబు కాముకతయు న్గాపట్యము న్హెచ్చుగా
భీమామాత్యుఁడ వంచు బల్కుదురు ని న్బృధ్వి న్యదార్ధం బహో
నీ మంత్రాంగముచేత నేడు చెడియె న్నీలాద్రిరా జెంతయున్‌.

54


క.

గణికశ్రేష్టుఁడ వయ్యో
గణకాంగన పొందు రాజుగారికి దగదం
చణుమాత్రము చెప్పవు నీ
గుణము తెలిసివచ్చె బుద్ధికుశలుఁడవు భళీ.

55

క.

అని వా రిరువు నిటువలె
ఘనఘనరవసదృశనాదగద్గదగళు లై
కినుక వివాదింపంగా
విని చింతలపాటి నీలవిభుఁ డి ట్లనియెన్‌.

56


క.

మీ రేటికి వాదించెద
రూరక యుండుండు చెలిమి యొప్పారంగా
గౌరవమున నా మది గల
యారాటము తీర్ప బాపఁ డసమర్ధుఁడుగా.

57


క.

రతిచింతచేత నిప్పుడు
మతివోయిన రీతినుండు మాకు న్సుద్దుల్‌
హితమతి చెప్పెదు పోపో
పతిచిత్త మెఱుంగలేవు బాపఁడ వయ్యున్‌.

58


వ.

అని యతనిమీద రోషసంఘటితచిత్తుం డగుట గనుం
గొని తత్సన్నిధిగలవార లేగు మనిన నతం డరిగె నంత భీమరాజుం
జూచి యేకాంతంబున నిట్లనియె.

59


క.

బాపఁ డని నేస్తుఁ డనియును
నోపిక చేసితిని గాని యొడుతును జుమ్మీ
పాపమున కోడ కి మ్మెయి
బాపన్నను భీమరాజ పటుకోపమునన్‌.

60


వ.

అనిన భీమరా జతని కిట్లనియె.

61


క.

అద నైన బంది బొడవవొ
యెదురించిన పులిని బొడవవొ యేన్గు బొడవవో
కదనమున శత్రు బొడవవొ
వదరుచు నెదురాడు నట్టి పారు బొడవవో.

62


క.

అని భీమరాజు పలికిన
విని మనమున సంతసించి వేడుకతో ని
ట్లనియెను జంద్రిని వేగం
బనుకూలము సేయకున్న హా యె ట్లోర్తున్‌.

63

ఉ.

కోకిలకీరశారికలకూకలకు న్గలహంసకేకినీ
భీకరనిర్భరార్భటికి బెగ్గిలితి న్మఱి చెప్ప నోప నెం
దాక సహించువాఁడ వెస దానిత్రికోణము దెచ్చిచూపుమా
నా కెదలోని మన్మథకనద్ఘనపావకతాప మాఱగన్‌.

64


గీ.

మరి విచారింప నది యాడిమళ్ళ వేంక
టాభిధానప్రత్రేజాపతి యంశ బుట్టె
సకలరతిబంధచాతుర్యసరణి గనియె
పూని వర్ణింప దాని కే సాని సవతు?

65


క.

కావున వేంకటశాస్త్రికి
నా వల పెఱుగంగ జెప్పినను నాతఁడు తా
నావలిపని సమకూర్చును
వేవేగమె భీమరాజ విచ్చేయవయా.

66


వ.

అని చెప్పి.


చ.

పనిచిన నాతఁ డేగి గనె భంజితనీలతరాజకాయసం
జనితకరోటికూటము వసాసఘృత ప్లుతసత్పలాశమాం
సనికరవర్ధమానవిలసత్పటువహ్నిశిఖాప్రభాటమ
త్యనుపమమంత్రతంత్రకరయాజకఝాటము యజ్ఞవాటమున్‌.

67


క.

కనుగొని తచ్ఛాలాంతర
మున దక్షుడు బోలె యజ్ఞ ముగ్రంబున దా
నొనరించు వేంకటమఖిన్‌
జనవున కని రాజకార్యసంగతి దెలిపెన్‌.

68


క.

తెలిపిన మఖి యత్యంతము
బులుపు వొడమ భీమమంత్రి పుంగవ వెస దా
దలచిన పని సమకూర్తును
చెలిమి వెలయ నీ మఖంబు చెల్లిన పిదపన్‌.

69


క.

దాతయు దైవము నేతయు
నే తీరున గన్న నతఁడె యెప్పుడు గానన్‌

నీతోడు భీమరాజా
యాతని పని సేయు టుచిత మగుఁ గద మాకున్‌.

70


క.

అని రాజుగారి కంతయు
వినయంబునఁ దెలుపుమనుచు వేడిన నతఁడున్‌
జని యట్ల చెప్ప నీలా
వనివిభుఁడుఁ గుడారమునను వనరుచునుండెన్‌.

71


వ.

అనంతరంబున నయ్యారామద్రావిడబాడబాగ్రగణ్యుం
డగు వేంకటసోమపీథినిరతపర్యుషితాన్నదానవిధానసంక్రుద్ధసుప్రసిద్ధ
వృద్ధభూమీసురవారానివారితభూరితరదారుణభాషావిశేషదూషితం
బును ప్రచండతరచండాలసరోవరపరిసరపరికల్పితానల్పవిశాలశాలా
తటతటులకుటిలాచ్ఛమత్స్యపుచ్ఛాచ్ఛాదితకృపీటసంపాద్యమానా
హీనపురోడాశప్రము ఖాయోగ్యవస్తుయాగభాగానురాగారహితవిహిత
మహితబృందారకబృందంబును యథావిధివన్నిర్ధారితదక్షిణాక్షీణ
పదార్ధవంచనాగుణనిరస్తోత్సాహసాహసధావన్మహాసోమయాజివిరాజి
తంబును జామాత్యమూర్ఖమహాకఠినవాక్యతర్జనభర్జనపలాయితసకల
దేశసమాగతవివిధవిప్రప్రకరంబును పరమపరిహాసకపరికల్పితస్వచ్ఛ
చ్ఛాగనాదామోదితవేదితలాంతరపరివర్తితధూర్తపండితపామరజనస
మూహంబును బ్రాహ్మణార్ధసంపాదితబహుళసత్ఫలశాకపాకభక్ష్య
భోజ్యదధిఘృతగుడాదికవస్తుస్తోమచౌర్యక్రియాకౌశలయాతాయాతా
తతాయిశ్రేష్ఠకుమారనారాయణశాస్త్రివిశ్రుతంబును సంభావనా
సంభ్రమాలోకనార్ధసమాగతవితతవారాంగనాభుజంగపుంగవశృంగా
రకేళీగృహాయమానశాలాసమీపప్రదీప్తవిశాలకాయమాననికాయం
బును విపులాపూపశరావోపమానూనపీనోపస్థాస్థలవికీర్ణాస్తోకానేకదీర్ఘ
తరశ్యామలకోమలరోమస్థోమోద్ఘాటనపాటవప్రోల్లసద్బాలవిధవావి
రాజితాంతర్గేహంబును విదార్యమాణపశువిసరకళేబరసంజనితఘన
తరక్షరితక్షతజప్రవాహాబిందుసందోహగ్రసనవ్యసనసంభ్రమభ్రమద
దభ్రశుభ్రగృధ్రకాకఘూకకంకకౌలేయకగనయగోమాయప్రముఖ
వన్యఖగమృగజాలకోలాహలబధిరీకృతజనసమూహంబును పరమ

నిర్భరనిర్భాగ్యదామోదరదురోదరమృగయావినోదామోదఖేల
న్నీలాద్రినృపాలబాలిశదుష్కరకరాగ్రసమర్పితయాగఫలదానధారా
పూరంబునుంగా క్రతువు సమాప్తంబు గావించి జన్మంబు బన్నంబు
లేకుండ గడతేఱె మదీయపుత్త్రియు నిజముఖకళావిలాసతిర
స్కృతచంద్రరేఖ యగు చంద్రరేఖను కోమలాలంకారభవ్య
యగు నా కావ్యకన్యకకును నుత్తముండగు నీలాద్రినృపుండు
వరుండ య్యెడు సమయంబు నయ్యె మామకీన భాగ్యమహిమంబు
చెప్పదరంబె యని సంతుష్టాంతరంగుండై చని చని.

72


సీ.

పూతిగంధాధారిపుంఖితడిండీర
            భరిత మై రేయకుంభవ్రజంబు
గ్రామసూకరమాంసఖండతోరణవార
            కంకవాయసగృధ్రసంకులంబు
మేదురఖాదనామోదసంపాదిత
            తామ్రచూడాసహ్యతటతలంబు
రతిరాజసంగరోత్థితషిద్గజనశుక్ల
            మూత్రార్థగేహళీచిత్రితంబు.


గీ.

విటవిటీజనసంధాన విహితవచన
నిచయరచనానిపుణకుట్ట నీ సహాయ
కరణకారణకౌలేయకంబు వేంక
టాభిధానాతినీచవేశ్యాలయంబు.

73


క.

ఇటు నటుఁ గనుఁగొని లోనికి
లొటలొటఁ జని మంచ మెక్కి లోలత నది త
త్తటమునఁ గూర్చుండిన న
క్కుటిలాత్ముఁడు కౌఁగలించుకొని యి ట్లనియెన్‌.

74


తే.

ఎంత భాగ్యంబు చేసితి మిరువురమును
కాసు విడకుండ యజ్ఞంబు కలిగెఁ జంద్ర
రేఖను దలఁచి నీలాద్రిఱేఁడు మిగుల
మోహితుం డయ్యె భాగ్య మామోద మొదవె.

75

క.

నీలాద్రిరాజు మిక్కిలి
తాళక కృశియించె విరహదహనముచే నీ
వేళం జచ్చును వేగం
బాలోలతఁ జంద్రి నంపు మాతని కడకున్‌.

76


తే.

పూలమ్రాఁకులు నీవు నీపుత్త్రికయును
చూచువల్ల యెఱింగి బొజుగుల వలపు
వెల్లి గొలుపుచు బలువుగ విత్త మెల్ల
లాగుదురు ధాత్రి మీవంటి లంజెలే రి.

77


తే.

నేడు నీ కల్లుఁ డాయెను నీలనృపుఁడు
కూఁతురును నీవు నేనును గొదవ లేని
సిరులఁ బొదలెద మింక నీ చిన్నదానిఁ
గడఁక గైసేయు మని చంద్రి గాంచి పలికె.

78


తే.

బాలరో నీవు మిగుల సౌభాగ్యవతివి
యొక బొజుగు వోవ మఱి యొక్క డుత్తముండు
దొరకె నీలాద్రిరాజు సచ్చరితుఁ డిపుడు
నిన్ను గోరి పిలువనంపె నేఁడు నీవు.

79


క.

ఏలాగున నలయించెదొ
యేలాగున నీలవిభుని వలయించెదొ మ
మ్మేలాగున రక్షించెదొ
బోలెఁ దెగడు నీదు భగము పుణ్యముచేతన్‌.

80


వ.

అనిన చంద్రరేఖ యిట్లనియె.

81


సీ.

చూపుకోపులచేత చుంబనంబులచేత
            దంతక్షతనఖక్షతములచేత
తాడనంబులచేత బీడనంబులచేత
            గాఢపరీరంభకలనచేత
నుపరతిగతులచే గపటవాక్యములచే
            దాంబూలదానవిధంబుచేత

కలవంబుఁబూఁతచేఁ గారవింపులచేత
            గాననాట్యప్రసంగములచేత.


గీ.

మందుమంత్రంబులను నీలమనుజవరుని
లోలు గావించి కలధనం బోలి లాగి
పిదప జోగిగఁ గావించి మద ముడించి
తెత్తు మీ సన్నిధికి నా ప్రతిజ్ఞ వినుఁడు.

82


ఆ.

దొడ్డదొడ్డ తురకబిడ్డల నా తొడ
లందు నిరకఁబట్టి యడుగునెత్తిఁ
బెట్టి లోలుఁ జేసి వెట్టివానిగఁ జేతు
నీలనృపుఁడు నాకుఁ జాలగలఁడె.

83


తే.

అనిన నీవంత నేర్పరి వగుదు వమ్మ
లెమ్మ ముస్తాబు గమ్మ శీఘ్రమ్ముగాను
బొమ్మ యాతనితమిఁ దీర్పఁ గమ్మవిల్తు
చేతి బంగరుబొమ్మ యో చిన్నికొమ్మ.

84


క.

నావు డల చంద్రి యప్పుడు
భావం బలరార లేచి పరిపరిగతులన్‌
వేవేగఁ జేయ దొడగెన్‌
గేవలశృంగార మొడలఁ గీలుకొనంగన్‌.

85


క.

నీలాద్రిరాజు మోమున
గ్రాలెడు గడ్డంబురీతిఁ గనుపట్టి మహా
స్థూలోపస్థాభాసా
భీలతనూరుహము లన్ని బిరబిర బెఱికెన్‌.

86


క.

ఆతని పెనుబాలీసుల
భాతిన్‌ గడుపొడవు లగుచుఁ బ్రబలు కుచములం
దాతతమలయాచలసం
జాతసుగంధంబు మిగులఁ జానుగ నలఁదెన్‌.

87


క.

భుగభుగ సుగంధబంధుర
మగుచుండెడు ధూప మిడియె నానందమునన్‌

నిగనిగ లీనెడు తన ఘన
భగదేవత కాత్మవాంఛ ఫలియించుటకున్‌.

88


ఆ.

గొఱ్ఱెబొచ్చుకంటె నెఱ్ఱ నై చిఱ్ఱ లౌ
కుఱ్ఱవెండ్రుకలను గూడదువ్వి
తొఱ్ఱకొప్పు వెట్టె నఱ్ఱుమీదను జాల
విఱ్ఱవీగుకొంచు బిఱ్ఱబిగియ.

89


క.

హరిమొగము దెగడు మొగమున
హరిదళమును దళముగాగ నలది మహాసిం
ధురతరనేత్రయుగంబున
గరమరుదారంగ మందు కాటుక వెట్టెన్‌.

90


క.

సత్తికి సింగారించిన
యిత్తడిసొమ్ములను బోలి యెసగగ మేనన్‌
బుత్తడిసొమ్ములు తన కా
పత్తారణకారణముగ బాగుగ దాల్చెన్‌.

91


క.

కంచెలలోపల గట్టి బి
గించెన్‌ జనుకట్టుదోయి గిరినాగుల నా
డించక హితుండికుఁడు వడి
వంచనతో బెట్టినట్టి వైకరి దోపన్‌.

92


క.

ఈలీల నలంకృతయై
యాలోల వెలింగి నప్పు డాశ్చర్యముగా
నీలాద్రిరాజు బట్టం
బో లోలత మెరయు పెద్దభూతమొ యనగన్‌.

93


ఉ.

అప్పుడు సోమయాజులు తదాకృతి వేంకటసానియుక్తుఁ డై
ఱెప్పలు మోడ్ప కర్మిలి నెఱిం గని కూఁతుర నీకు దుల్య యౌ
నొప్పులకుప్ప నిప్పుడమి నొక్కెడ జూడము లోలవయ్యు బా
గొప్పెడు బాలలీల గడు నూనితి మేల్బళి యంచు మెచ్చగన్‌.

94


క.

నీలాద్రిరాజు వార
స్త్రీలోలుం డయ్యె నింక జెడి వైతరిణిన్‌

గూలు నిటు లనుచుఁ దెల్పెడి
పోలిక నంభోధిఁ గ్రుంకెఁ బ్రొద్దు రయమునన్‌.

95


క.

అపకారి నీలభూపతి
అపయశ మల విష్టపముల నలమె ననంగా
విపులమగు కటికచీకటి
విపులాస్థలి నంబరమున విప్పుగ కప్పెన్‌.

96


శా.

అంతన్‌ దారలు దోఁచె నంబరమునం దా నీలభూపాధముం
డెంతేఁ జంద్రిని గూడఁ దత్తనువునం దింతైన సందీయ క
త్యంతంబున్‌ రసపొక్కు లిట్లు వొడమున్‌ దథ్యం బటంచున్‌ నభః
కాంతారత్నము దెల్పెనో యన మహాగాఢాతిధౌతచ్ఛలిన్‌.

97


ఆ.

తాను జంద్రరేఖ నా నెసంగుదు నంచు
సాని పిప్పితొత్తులోన నుబ్బు
దాని నేఁతు నంచు దాఁ గోపమున వచ్చె
నో యనంగఁ జంద్రుఁ డుదితుఁ డయ్యె.

98


వ.

అయ్యవసరంబున.

99


ఉ.

వేంకటసోమయాజియును వేంకటసానియు శ్రద్ధులై కడున్‌
బొంకపు మాటలున్‌ వగలు బుద్ధులుఁ దద్దయుఁ జెప్పుకొంచు లోఁ
గొంకక నీలభూవిభుని గొల్లెనలోనికి దాని దూర్చి పూ
కంకటిచెంగట న్నిలుపఁ గన్గొని యా నరపుండు వేడుకన్‌.

100


ఉ.

దిగ్గున లేచి దండ మిడి ధీవర యజ్ఞముఁ జేసినావు మున్‌
బగ్గెగ మేము మన్మథవిపద్దశనుండి తొలంగ నిప్పు డీ
సిగ్గఱికన్నెఁ దార్చితివి చెప్పఁగ శక్యమె నీ ప్రభావ మీ
వగ్గివి గాక బాపడఁవె యారయ వేంకటసోమపీథిరో.

101


ఆ.

యెద్దుమానసుఁడవు యేదాంతుగుఁడవు సో
మాదుగుఁడవు నీవు మామ వైతి
మాకుఁ బున్నె మెలమిఁ జేకూఱెనౌ చంద్ర
రేఖ మీఱు చంద్రరేఖ వలన.

102

క.

నావుడు నతఁ డిట్లనియెను
దేవా తావకకటాక్షదృష్టివలన నే
కావించితిఁ గ్రతు విపు డిది
నీ వన్నియఁ జూచి వలచె నీలనృపాలా.

103


సీ.

కైశ్యంబు కందంబు ఘనగోధిచంద్రమః
            ఖండంబు భ్రూద్వంద్వకము ధనుస్సు
చక్షుస్సులు చకోరపక్షు లోష్ఠంబు పీ
            యూషసరస్సు పయోధరములు
మాతంగకుంభముల్‌ మలినరోమాళి పి
            పీలికాశ్రేణి గంభీరనాభి
విషనిధి కటి మహావిపులసువేది ప
            త్తామరసంబు మదనసదనము.


గీ.

పాండురాశ్వత్థభూరుహపత్ర మిట్టి
సరససౌందర్యవతి యగు చంద్రరేఖ
నీకు దొరకెను సంభోగనిహితలీల
దక్క నేలుము నీలాద్రి ధరణిపాల.

104


ఆ.

దీనితల్లి యీమె నా నేస్తురాలు మే
మిరువురమును నీకు హితుల మెట్లు
సాఁకెదవొ యటంచుఁ జంద్రి హస్తము తెచ్చి
యతనిచేత నుంచి యప్పగించి.

105


క.

ముప్పదియాఱేండ్లది ముం
దెప్పుడు నొక్కరునిఁ బొంద దేలాగున నీ
విప్పుడు దిద్దుకొనియెదో
మొప్పెతనము మాన్పవలయు ముందఱపనిలో.

106


వ.

అని మరియును.


శా.

కం పేపారెడు మంచిగంధమును బుక్కా క్రొత్తపన్నీరు క
ప్రంపున్వక్కలు నాకులున్‌ దబుకుతోఁ పర్యంకమం దుంచి తా

దంపత్యోశ్చరకాలభోగ్య మను వృత్తంబుల్‌ మహాపస్వరం
బింపారన్‌ బఠియించి వేంకటమనీషీంద్రుండు మోదంబునన్‌.

108


శా.

తారామార్గముఁ జూచి మంగళముహూర్తం బిప్పు డేతెంచెఁగా
యో రాజాగ్రణి పుస్తె కట్టు మిఁక జాగూనంగ నేలా ధ్రువం
తే రాజా వరుణో యటంచు నుడువన్‌ దేజంబు దీపింపఁ ద
న్నారీకంఠమునన్‌ ఘటించెను సువర్ణప్రస్ఫురత్సూత్రమున్‌.

109


క.

తలబ్రాలు వోయ నవి జిల
జిల జాల్కొని మదనసదనస్నిగ్ధస్థలిపైఁ
బొలిచెను భావిసురతసం
కలితేంద్రియ మిట్లు పైని గప్పు నను గతిన్‌.

110


వ.

అనంతరంబున వేంకటశాస్త్రి యిట్లనియె.

111


శ్లో.

యభస్వపుష్పిణీం చంద్రరేఖామలమఖీమిమాం
చంద్రరేఖాం భగవతీం త్వం నీలాద్రిప్రజాపతే.

112


శ్లో.

త్వన్మందిరే బహుళకాంచనసిద్ధిరస్తు
వంశాభివృద్ధిరధికాస్తు శివారవోస్తు
బాలార్కకోటిరుచిరస్తు మలేతరాస్య
నీలాద్రిపుణ్యజనవర్య హరిప్రసాదాత్‌.

113


వ.

అని యాశీర్వదించి యిట్లనియె.

114


క.

స్మరమందిరాంగణంబున
కరదంతక్షతము లుంచి గాఢరతుల భీ
కరభంగిఁ జేయ కిప్పుడు
తురతుర నవ్వెనుక మెల్లఁ ద్రోయఁగ వలయున్‌.

115


ఆ.

ఆకు పోఁక వెట్టి లోఁకువగాఁ బట్టి
పూకు మెల్ల నిమిరి నూకవలయు
డాకఁ జేసి వేగఁ దాకంగఁ బోవద్దు
నీకుఁ దక్కుఁ జంద్రి నీలభూప.

116


వ.

అప్పుడు వేంకటసాని యిట్లనియె.

117

క.

బాల సుమీ గోల సుమీ
బేల సుమీ గాఢరతులఁ బెంపేద కడున్‌
సోలింపక తూలింపక
పాలింపుము చంద్రి నీదు పాలయ్యె నిఁకన్‌.

118


క.

డా సిండు విడెము మరుచే
గాసిం డగ్గఱక మున్నుగా మచ్చికఁగా
జేసిండు సొమ్ము పిదపన్‌
నీ సేఁతల కెల్ల నోర్చు నీలనృపాలా.

119


వ.

అని చంద్రరేఖం జూచి యిట్లనియె.

120


క.

సచ్చోఁడా పబు వీతఁడు
యెచ్చమునకు పచ్చమునకు యిచ్చలయిడిగా
యిచ్చును హెచ్చుగఁ గొలువుము
సచ్చు యిటుల సేరబోక సందర లేకా.

121


క.

దేవేరిఁ గేరెదవు స
ద్భావంబున నితఁడు చేతఁ బట్టిన నీ వో
పూవుంబోఁడిరొ విటసం
భావనపైఁ దలఁపు విడిచి బత్తిఁ గొలువుమా.

122


సీ.

పాట పాడు మటన్నఁ బాడక యెలుఁగెత్తి
            పదరి రోదనము చేసెదవు సుమ్ము
కా ళ్ళొత్తుమని వేఁడఁ గడువడి నొత్తక
            నెదురొత్త మని పలికెదవు సుమ్ము
తముల మందిమ్మన్నఁ దమి నీక క్రమ్మఱ
            నీ కిమ్మటంచుఁ బెనఁగెదువు సుమ్ము
రతికి రమ్మని పిల్వ రాగిల్లి డాయక
            యదనునఁ గడకుఁ బోయెదవు సుమ్ము.


గీ.

తురకదండి గాఁడు దూదేకులియుఁ గాఁడు
పసులవాఁడు గాఁడు బట్టు గాఁడు

మనల నేలు నట్టి మనుజనాథుఁ డితండు
సెప్పి నట్లు నీవు సేయు చంద్రి.

123


వ.

నావుడు నతం డిట్లనియె.

124


ఉ.

పుత్తడి కీలుబొమ్మ యనఁ బోలెడు బోలెఁడు యోని చందిరిన్‌
హత్తఁగఁ దోడితెచ్చి విరహార్తి హరింపఁగఁ జేసినావు నీ
కుత్తమభూషణాంబరసముత్కర మిచ్చెద వేగ నందు మో
యత్త వలగ్ననిర్జితవియత్తల వేంకటసాని జానుగన్‌.

125


క.

అన నవ్వుచు వారిద్దరు
జని రంతట నీలవిభుఁడుఁ జంద్రిని గని నూ
తనమదనకేళిఁ దేలెద
నని లోపల మోహ మొదవి హస్తము పట్టన్‌.

126


క.

తల వంచి పట్టెకంకటి
గల దండము వట్టి వదలఁగా నొల్లక తా
వెలవెలఁ బోవుచు సిగ్గుం
గల బాలికవోలెఁ బెనఁగఁగా నాతండున్‌.

127


ఉ.

ముంగటికుచ్చు పట్టుకొని మోహమునన్‌ దన శయ్యఁ జేర్చి వా
రాంగన వింత సిగ్గువడ నర్హమె యెందఱఁ జక్కఁబెట్టితో
దొంగతనంపు టీ వగలు ద్రోచి హసన్ముఖి వయ్యుఁ గౌఁగిటన్‌
లొంగఁగఁబట్టి నన్ను రతిలోలునిఁ జేయుము నీకు మ్రొక్కెదన్‌.

128


ఉ.

చంద్రుఁడు మింట నంటి సరసంబుగ నగ్నికరాళవిస్ఫుర
చ్చంద్రికఁ గాయఁజొచ్చె సుమచాపుఁడు బాణము లేయఁజొచ్చెనో
చంద్రి విలాసవిభ్రమవిశాలకళారసలీల మీఱఁగా
సాంద్రకృపాకటాక్షమునఁ జక్కఁగఁ గన్గొని కోర్కెఁదీర్పుమా.

129


సీ.

సకలభాగ్యములిత్తు చక్కరకెమ్మోవి
            చవులు చూపింపవే చంద్రరేఖ
శంబరాంతకుచేతి శరముల కోర్వను
            జక్కఁ గౌఁగిట డాఁచు చంద్రరేఖ

చల మేల పూనెదు వలపు నిల్పఁగఁజాలఁ
            జన్ను లంటఁగ నిమ్ము చంద్రరేఖ
తాళఁజాలను నీదు కాలికి మ్రొక్కెద
            స్మరమందిరము జూపు చంద్రరేఖ.


గీ.

కడకుఁ బోవక నెమ్మోము ముడుఁచుకొనక
సిగ్గు విడనాడి ననుఁ గటాక్షించి నీదు
కన్నెప్రాయంపు రతికేళిఁ గలయనిమ్ము
జాగు సేయక కటకపుఁ జంద్రరేఖ.

130


క.

నీకున్‌ దాస్యము చేసెద
నాకుం గల ధన మొసంగి నానాగతులన్‌
బైకొని రతి న న్నేలుము
ప్రాకటముగఁ జంద్రసాని పల్లవపాణీ.

131


చ.

సిగ విడి జాఱ మోముపయిఁ జెమ్మటబిందువు లూర గబ్బిచ
న్మొగడలు నిక్కు దేఱ దెగి ముత్తెపుఁబేరులు శయ్యఁ జేరఁగా
భగ మతిసార మూర జలపంకకళంకిత జీలువారఁగా
వగఁ బురుషాయితంబున నవశ్యము నేలుము చంద్రరేఖరో.

132


క.

నా విని శరావసన్నిభ
కేవలసుస్నిగ్ధమదనగృహము చెమర్పం
గా వాలుబెళుకుఁజూపులఁ
దా వలనుగ నతనిమోము తప్పక చూచెన్‌.

133


క.

ఇటువలెఁ జూచిన నాతఁడు
తటుకున నిదె సమయ మనుచుఁ దమి దీరఁగఁ గౌఁ
గిట నొత్తి మోవిమధు వటు
గుటుకుగుటుకు రనుచుఁ గడుపుకొలఁదిన్‌ గ్రోలెన్‌.

134


సీ.

బుడ్డికుండలవంటి బుగ్గలు చుంబించి
            గొఱ్ఱెబొచ్చును గేరు కురులు నిమిరి
కప్పచిప్పలవంటి కన్నులు ముద్దాడి
            యూదబొడ్డున కరం బూది నిలిపి

కొలిమితిత్తులఁ బోలు కుచములు పీడించి
            మరగాళ్ళఁ దెగడెడు కరము లంటి
కొంగకంఠమువంటి కుతుక గోరుల నించి
            పులిబోను బోలెడు పూకు చమిరి.


గీ.

వెడద కుంచములో వ్రేలు వెట్టినట్లు
యోనిలోఁ గామదండము నొత్తి దూర్చి
వెనుకకును ముంగలికి నూఁగుకొనుచు నీల
ధారుణీశుండు వడివడిఁ దాఁక నదియు.

135


క.

మును నల్లమందు మాజుము
తినియున్నది గాన మేను తిమ్మిరిగొని యా
తని తాఁకులకుఁ జలింపక
తన నేరుపుకోపుఁ జూపఁదలఁచి కడంకన్‌.

136


క.

భగము వికసింపఁజేయుచు
బిగఁబట్టుచు లోనఁ జొర నభేద్యంబుగఁ ద
ప్పఁగఁ ద్రోయుచు బెణకించుచు
బిగితొడలం జుట్టి పట్టి బి ట్టలరించెన్‌.

137


సీ.

పారదోపమవీర్యధారాతతభగంబు
            స్తనచర్మభస్త్రికాతాడవంబు
కక్షప్రదేశనిర్గతఘర్మసలిలంబు
            చక్రక్రమచపేటచాలనంబు
భూరితరాపానమారుతోద్ధూతంబు
            ఘనదేహదుర్గంధగంధిలంబు
శునకబంధవిశేషవినమితమేఢ్రంబు
            క్రీడారచితపాదతాడనంబు.


గీ.

గార్దభస్వరనిస్సరద్గ్రామ్యవచన
మమితరోదనజలపూరితాననంబు
చంద్రరేఖాభిధానవేశ్యానలాస్య
ప్రథమసురతంబు నీలభూపతిఁ గరంచె.

138

వ.

ఇవ్విధంబున సమరతిఁ గావించి నప్పు డప్పడుపుంబో
టిమిన్న మున్నెరికంబున నన్నీలాద్రిరాజపుంగవుపై లంఘించి హుంక
రించి జం కించుకయు లేక సంకోచంబు మాని “ఇంక నాచేతం జిక్కితి
వెక్కడికిఁ బోయెదవు నిలునిలు నా యుపరతి చమత్కారంబు
తోరంబుగాఁ జూపెదఁ బరాకు గాకు రాకొమరా మా ఱాడక నా
కేమి మెప్పు లిప్పు డిచ్చెదవో మది నెంచుకొమ్ము” అని చెక్కిలి
నొక్కి యక్కునం గ్రక్కునం దన లంబమానపీనస్తనంబులు గది
యించి నునుదొడలఁ గుదియించి వదలని మదంబున ముదంబునం
దన మదనసదనంబున నతని మేహనంబును నమోఘంబుగాఁ దగిలిం
చుకొని ముమ్మరమ్ముగా దొమ్మరికొమ్మ గడగడసియాడు చందం
బున సంభ్రమించుచు లాగివైచు చందంబున నొత్తుచు మేను మేన
హత్తింపుచుఁ దత్తరింపకఁ గొంచెపడకఁ దిట్టతనంబుఁ దెచ్చుకొని
విచ్చలవిడి ముచ్చట లెల్లం దీరఁ జనుమిట్టల గట్టిగ బిగఁబట్టి యిట్టట్టు
బెసఁగకఁ దడంబడక గుట్టుచెడకఁ జేతులు పట్టువిడక నెదురు
దట్టింపు మని చేయి మార్పు మని యడుగు తప్పె నని మించఁ
బలుకుచుఁ గులుకుచుఁ గోడెప్రాయంపు నాడెంపు సాలెవాఁడు ఘళుకు
ఘళుకు మనఁ బలక చులుకఁగ దాటించు వాటంబున నోటువడక
నీటుఁజూపుచుఁ బరిభ్రమణవేగంబునం గరపాదభూషణవిశేషం
బులు ఘల్లుఘల్లుమని భీషణంబుగ ఘోషింప నవ్వారయోషాల
లామంబు పెదవి పెదవిం గదియఁ దన నిడుదవాడిమొనపంటిం బట్టి
పీల్చుచు చిఱ్ఱికుఱ్ఱవెండ్రుకల తొఱ్ఱకొప్పువీడి యక్కటిప్రదేశం
బున నటియింపఁ గుండలంబులు గండతలంబునం దాండవింపఁ గోరిద
కంపసొంపునం బెంపారు కంపుమేనుల ననూనంబుగాఁ గ్రమ్ము
ముమ్మరంపుఁ జెమ్మటసోన లతని దుర్భరతరసంవృథమానదేహశాల్మ
లీద్రుమంబునందు దిగజాఱ వీరులసివం బెత్తిన లాగున నూగు
లాడుచుండం గని యాప్రజాపతి సేద దీర్చుకొని క్రమ్మఱ నమ్మరు
దురంబున కెదిరించి వదలని చలమ్ము హెచ్చఁ బెచ్చుపెరుఁగు
మచ్చరంబున సమదమ్ముగ నదుముకొనిన నదియు వదలక పదరుచు

గుదికొన్న తమకమ్మునం దలంకక నెదురుదాక ఢాక నిద్దఱుం దద్దయు
సంభ్రమంబున జలంబును జయకాంక్షయు మనంబునం బెనంగొన
నగ్గలంబుగ నిగ్గుచు వెనుకకుం దగ్గుచు మొగ్గరించుచుఁ బగ్గెలు సెప్పు
కొనుచుఁ జెండుచెండుగ బండబండగఁ దాకులాడు నెడ నచ్చంద్ర
రేఖ బహువిటజనసంయోగజనితచాతుర్యకళాధుర్య కావున మొగ్గ
వేసి యోటువడంజేయ సమకట్టిన నా దిట్టమట్టిఱేఁడును బహుగణి
కావిలాసినీదాసికాసంభోగసంభృతనైపుణీగుణగణగణ్యుఁడు గావున
వెనుదీయక నునుదొడలం దానినడుము బిగించి మా ఱొడ్డుచుఁ
దెబుకుతెబుకు మను చప్పుడు లుప్పతిల్ల బిట్టట్టుసేఁతల నెట్టుకొని
గుట్టు వదలక పట్టుపట్టి సూటిఁదప్పకుండ గండుమీఱి మూర్కొన్న
మహిషంబులడంబునఁ జిత్తకుక్కలవిధంబున చీరబోతులభాతి
మాలమాసటీండ్లంబోలె మార్జాలంబులకైవడి మసకంపుఁబెను
బాములచందంబున మదించిన కోడిపుంజులమాడ్కి లకుముకుల
లాగున గొఱ్ఱెపొట్టేళ్ళభాతి గుంటుకఁ దోలులీల కొర్తవేసిన
కైవడి చిట్టాముదములఁ గ్రుమ్మునేర్పున గొంకుజంకులేక
సమరతి యుపరతి బంధంబులం దేల జిలజిల మరుజలంబులు జాలు
కొని తదీయశయ్యాతలంబునం బడి వెల్లివిరిసి సెలయేరులై పాఱ
మహామైథునసంకల్పసంభోగక్రీడావినోదంబులు సూపి యలసి సొలసి
తొడల తొడలును బాహువుల బాహువులును మోవిని మోవియు
మొగంబున మొగంబును పదంబుల పదంబులును నురంబున నురం
బును భగంబున లింగంబును గదియఁ గౌఁగిలించుకొని దీర్ఘనిద్రా
సమాయుక్తనేత్రులై పడియుండి రనంతరంబున.

139


క.

తమ్ములఁ జక్రమ్ముల నధి
కమ్ముగ బాధించు రాజు కాంతి దొరఁగి వే
గమ్మునఁ గ్రుంకెన్‌ దద్గతిఁ
గ్రుమ్మరు నీలాద్రిరాజు గ్రుంకక యున్నే.

140


క.

అల నీలాద్రిమహీపుం
డెలమిని జంద్రిని రమించి యెంతయుఁ దేజో

బలహీనుఁ డగుటఁ దెలుపన్‌
దెలుపు వొడవి నట్లు తూర్పు తెలతెలవాఱెన్‌.

141


క.

ఇనవంశసంభవుండై
ఘనసన్మార్గంబు దొరఁగి కాముకుఁ డౌ నీ
లనృపతిఁ గాదనఁ గినుకన్‌
జనుదెంచె ననంగ నపుడు సవితృఁడు దోఁచెన్‌.

142


తే.

అంతఁ జింతలపాటి నీలాద్రిరాజు
మొగము వెలవెలఁబోవంగ నిగుడి లేచె
చంద్రరేఖయు ముఖకాంతి సడలి కనుల
నుసుముకొంచును మేల్కాంచి మసలుచుండె.

143


వ.

అత్తరి నా రాజోత్తముండు దానిం గూర్చి యిట్లనియె.

144


క.

నావంటి రసికు డెందముఁ
గేవలముగఁ గరఁగఁజేసి కేరుచు మిగులన్‌
భావభవకేళి దాసుని
గావించితి నీకు సాటి గారే సానుల్‌.

145


క.

నీ మొగము నీ త్రికోణము
నీ మెఱుఁగుంగన్నుదోయి నీ నునుఁదొడలున్‌
నీ మోవి నీ కుచంబులు
నా మది నిఁక మఱవజాల నమ్ముము బాలా.

146


క.

సొమ్ములు చీరలును వరాల్‌
సమ్మతమున నీకు నిత్తు సత్యం బిఁక నా
సొమ్మయి యుండుము విటసం
ఘమ్ములతోఁ జెలిమి మాని కలికీ యెపుడున్‌.

147


ఆ.

సానిదాన నంచుఁ బూని లోలో వెచ్చ
కాండ్రఁ గూడ నేను గాంచినపుడె
చన్ను ముక్కు యోనినున్న గొల్లియుఁ జిఱ్ఱి
కొప్పుగోసి వెళ్ళఁగొట్టువాఁడ.

148

క.

రాయవరంబున నీ క
త్యాయతగేహంబు గట్టి యం దుంచెద నీ
వే యెడకుఁ బోక యుండుము
నీ యండనె యుండువాఁడ నే నచ్చోటన్‌.


తే.

నావుడు న దిట్టు లనియెను దేవ నాకు
నీవు దయ దండఁ జిక్కుట కేవలముగ
సకలసామ్రాజ్య మిచ్చుటె సంశయంబు
లేదు నీదాన నై యుందు మోదమునను.

150


క.

నీకంటె లోనిచుట్టము
నా కిచ్చెడువాఁడుఁ గలఁడె నానాగతులన్‌
జేకొని కాపాడుము సుగు
ణాకర యెవ్వరిని జేర నరుగక యుందున్‌.

151


వ.

అంత నంతకుమున్న గోతియొద్ద నక్కచందంబున ద్వార
బంధమ్ముకడఁ గాచుకొనియున్నవాఁడు గావున వేంకటసోమయాజి
యిదంతయు నాలకించి తటుక్కున లోనికిం బ్రవేశించి యిట్లనియె.


క.

ఇషు వినుము చంద్రరేఖా
భషకమువలె నిన్నుఁ జేతఁ బట్టి యెవరినిన్‌
విషయింప నీయ గట్టిగ
మృష గా దని పలికె మిగులఁ బ్రేమ దలిర్పన్‌.

152


వ.

అయ్యవసరంబున.


సీ.

ప్రాఁతపుట్టము కట్టి పూఁతచెందిర వెట్టి
            పాఁతచెప్పులు మెట్టి చేత గట్టి
కోలసోలుచుఁ బూని చాల మద్యం బాని
            ప్రేలుకొంచును గూను గ్రాల యోని
పుండ్ల కీఁగలు వ్రాల జండ్లు బొడ్డునఁ దూలఁ
            గండ్ల పుసులు కార రొండ్లు వ్రేల

నోరఁ దేగుడు గాఱ యూర బేరము మీఱ
            సారె పయ్యెద జాఱి యోరఁ జేర.


గీ.

దారి నెముకుచు బడబడ దగ్గుకొనుచు
నపుడు వేంకటసాని నీలాద్రిరాజు
గొల్లెనకు నాతులటుపాయఁ గొనుచు లోని
కరిగి చే యెత్తి మ్రొక్కి యిట్లనుచు బలికె.

155


క.

నీ బానిసతొ త్తిది దయ
చే బాసల నిచ్చి చాలఁ జేపట్టు మికన్‌
గాబాగూబిగఁ జేయక
నీ బంతిని గూడు గుడుపు నీలాద్రినృపా.

156


వ.

అనిన నతం డత్యంతసంతోషస్వాంతుం డై యట్ల చేసెద
నని దానికిం బీతాంబరాదికంబు లొసంగి చంద్రియె లోకంబుగా
మెలంగుచుండె.

157


సీ.

రతిఁ జేసి యలసిన ధృతి దాని మన్మథా
            గారద్రవం బెల్లఁ గడిగి తుడుచు
నాఁకుఁ జుట్టి యొసంగి నది తమ్మలము సేయఁ
            దమ్మ గైకొని నోరఁ గ్రుమ్మి నమలు
నది మదిర గొనంగ నది మంచిదే యని
            తచ్ఛేషహాలమోదమునఁ ద్రావు
నిదురించుతఱి దాని పదములుఁ దొడలు త్రి
            కోణంబు సుఖముగా గ్రుద్ది పిసుకు.


గీ.

మెల్లనే దాని మంచము నల్లిఁ జంపు
లావుగుబ్బల గంద మలంది నిడుద

క్రొమ్ముడిని పూవుటెత్తులఁ గూర్చు వలపు
గులుక నీలాద్రిభూపాలమలహరుండు.

158


క.

ఇ ల్లెఱుఁగక ప ట్టెఱుఁగక
యెల్లధనము దాని కిచ్చి యెగ్గును సిగ్గున్‌
జెల్లఁగఁ దత్పాదద్వయ
పల్లవముల దండ మురిసి పడి కా పుండెన్‌.

159


తే.

పుడమిపై గూదలంజెకు బుడ్డవేడ్క
కాఁడ ననెడుమాట చంద్రరేఖకును నీల
ధరణివరునకుఁ జెల్లెను దత్కథావి
ధాన మెఱిఁగించితిని నీకుఁ దథ్యముగను.

160


తే.

అనుచుఁ దంబళ వీరభద్రార్యమణికి
నంబి నరసింహుఁ డతులితానందహృదయ
కమలుఁ డై చెప్పి యంతట సముచితగతి
నతని వీడ్కొని చనె దేవతార్చనకును.

161


క.

వాచాగోచరముగ భువి
నాచంద్రార్కంబు గాఁగ హాస్యరసముచే
నా చంద్రరేఖ కథయును
నీ చరితముఁ జెప్పినాఁడ నీలనృపాలా.

162


క.

ఈ కృతికి సమముగాఁ గృతి
నే కవులునుఁ జెప్పఁజాల రిది బిరుదము భూ
లోకము రాజులలోపల
నీకు దొరకె హాస్యలీల నీలనృపాలా.

163


చ.

ధరణియు మేఘమార్గమున దారలుఁ దామరసాప్తచంద్రది
క్కరటిగిరీంద్రశేషఫణికంధికిటీశ్వరకూర్మనాయకుల్‌
స్థిరముగ నెంతకాలము వసింతురు తత్క్రియ నీ ప్రబంధ ము
ర్వర సరసోత్తముల్‌ కవులు వర్ణన సేయఁగ నుండుఁ గావుతన్‌.

164

క.

చేటీవధూటికాకుచ
కోటీసంలబ్ధవిపులకోమలపంకో
త్పాటనకరఖరనఖర ని
శాటోపమఘోరరూప యార్యదురూపా.

165


స్రగ్విణి.

రాచిరాజాన్వయా రామదావానలా
యాచకాస్తోకమేఘౌఘఝంఝానిలా
నీచవారాంగనానిత్యరత్యాదరా
పాచకాధార నిర్భాగ్యదామోదరా.

166

గద్యము
ఇది శ్రీమజ్జగన్నాథదేవకరుణాకటాక్షవీక్షణానుక్షణసంలబ్ధసరసకవితా
విచిత్ర సలలితాపస్తంబసూత్ర కౌండిన్యసగోత్ర కూచిమంచికుల
పవిత్ర గంగనామాత్యపుత్త్ర మానితానూనసమాననానా
విధరనంగత్రిలింగదేశభాషావిశేషభూషితాశేషకవితావిలా
సభాసురాఖర్వసర్వలక్షణసారసంగ్రహోద్దామ శుద్ధాం
ధ్రరామాయణప్రముఖబహుళప్రబంధనిబంధన
బంధురవిధాన నవీనశబ్దశాశనబిరుదాభిరామ
తిమ్మకవిసార్వభౌమసహోదర గురుయశో
మేదుర వివిధవిద్వజ్జనవిధేయ జగన్నాథ
నామధేయ ప్రణీతంబైన చంద్రరేఖా
విలాపం బను హాస్యరసప్రబంధ
రాజంబునం తృతీయా
శ్వాసంబు
సంపూర్ణము.