చందమామ పిల్లల మాసపత్రిక/సంపుటము 2/జనవరి 1948/గేయ కథలు
కంచి మేక
చిలుకా చెల్లె లెందూకోస - మలిగిం దబ్బాయీ?
చిట్టీ పొట్టీ నీతికధలూ - చెప్తా వింటుందా?
కంచీ మేకా జబ్బూ చేసి
కలవా రిస్తూంటే,
తోడీ మేకాలన్నీ దాన్ని
చూడా వచ్చేవి.
చూచీ పోకా వేడీ వెచ్చా
చూచీ నట్లుండీ,
ప్రోగూ చేసీ కొన్నా గడ్డీ
పోచా లన్నింటీ,
వీసా మంతా మిగులా కుండా
మేసీ పోయినవీ!
కదలా లేకా కంచీ మేకా
కన్నీ రెట్టిందీ,
నీళ్ళూ మేతా లేకా తుదకూ
నీలిగి చచ్చిందీ.
ఇట్టీ చుట్టాలుంటే లాభ-మేమీ చెప్పండీ
చేరా నిస్తే యిల్లూ గుల్లా - చేసి పోతారూ-
పండు కోతి
కొండ మీద కోతిమూక - కూరు చున్నదీ.
కూరు చుండి కిచకిచాని - కేరు చున్నదీ.
గండెవంటి కోతి పిల్లా
గంతు లేయూచూ
పండు కోతి వీపు మీది
పుండు చూచిందీ.
చూచీ వచ్చి పుండు గిల్లి
పీచూ రేపిందీ.
తక్కూ కోతూ లన్నీ వచ్చి
దాని మోస్తారే
తక్కుబడ గిల్లి దాని
దుంపా దెంపేవి.
పండు కోతి పుండు వాచి
బాధ హెచ్చిందీ
కంట నీరు పెట్టి వాయి
గ్రమ్మి చచ్చిందీ.
కోతీ పనులు చేస్తే కొంప - గూలీ పోతుందీ
మోటు మూక తోడీ పొత్తు - ముప్పూ దెస్తుందీ.
ఎవడు త్రవ్వుకున్న గోతిలో వాడే పడతాడు!
చవకగా వచ్చినైగదా అని నవాబుగారు అణా యిచ్చి
అరడజను అరటిపళ్లు కొనుక్కునితింటూ బయలుదేరారు.
ఆ పళ్లు తింటూ తొక్కల్ని దర్జాగా రోడ్డుమీద పారేశారు. ఇంకేముందీ,
ఆ తొక్కలమీద కాలుపడి నవాబుగారే డమ్మనిజారి నడ్డివిరిగేట్టుగా పడ్డారు.
డాక్టరూ - రోగి
శారద ఒక కుక్కపిల్లని పెంచుతోందిట. ఆ కుక్కపిల్లకి ఓ రోజున కడుపునొప్పి వచ్చిందట. అప్పుడు, శారద వైద్తుడుదగ్గరికి పోయి మందు తెచ్చింది.
"ఈ మాత్రవేసుకో, కడుపునొప్పి పోతుంది !" అని మాత్రలడబ్బీ తెచ్చింది. కాని కుక్కపిల్ల మాత్ర ఎలా వేసుకుంటుంది ?
అందుకని, "ఉండు, ఈ గొట్టంలో మాత్ర వేసి ఊదుతాను," అని శారద ఒకగొట్టం తెచ్చి కుక్కపిల్లనోట్లో పెట్టింది.
గొట్టంలో మాత్రవేసి, శారద "పూ !" అని ఊదబోయింది.
కాని, కుక్కపిల్లే శారదకంటే ముందుగా వూదింది. ఇంకేముందీ ! మాత్ర కాస్తా శారద గొంతులోకే పోయింది !