చందమామ పిల్లల మాసపత్రిక/సంపుటము 2/జనవరి 1948/కథాసరిత్సాగరము

వికీసోర్స్ నుండి

ఒకనాడు కైలాసంలో పార్వతీదేవి శివుణ్ణి ఏమని కోరిందంటే, మూడు లోకాలలోనూ ఎవ్వరూ యెన్నడూ వినని కథలు తనకు వినిపించమన్నది. శివుడు సరేనని, వాకిట నందిని కాపుంచి, యెవ్వరినీ లోపలికి రానివ్వవద్దని ఆజ్ఞాపించి పార్వతికి అనేక వందల కథలు చెప్ప నారంభించాడు.

శివుడిదగ్గిర కొలువుండే భూతప్రేతగణాలకు నాయకులలో ఒకడైన పుష్పదంతుడు ఈవిషయం పసికట్టి శివుడు కథలు చెప్పేచోటికి వచ్చాడు. లోపలికి పోవటానికి శివాజ్ఞలేదని నంది అడ్డగించాడు. పుష్పదంతుడు నేరుగా లోపలికి వెళ్ళలేక తుమ్మెదరూపం ధరించి నందికి తెలియకుండా లోపల ప్రవేశించి ఒక స్తంభం చాటునవుండి శివుడు పార్వతికి చెప్పిన కథలన్నీ విన్నాడు. ఆతరువాత ఇంటికివెళ్లి పుష్పదంతుడు తనువిన్న కథ లన్నిటినీ తన భార్య అయిన విజయకు చెప్పాడు.

మర్నాడు ఆ కథలనే విజయ ఇతరులకు చెప్పుతూవుండటం విని పార్వతీ దేవి పుష్పదంతుడి మోసం గ్రహించినదై, అతన్ని నరజన్మ మెత్తమని శపించింది. పుష్పదంతుడి పక్షాన మాల్యవంతుడనేవాడు వాదించడానికి రాగా పార్వతి మాల్యవంతుణ్ణికూడా నరజన్మ మెత్తమని శపించింది.

పుష్పదంత మాల్యవంతు లిద్దరూ పార్వతి పాదాలపైబడి తమకు శాపవిముక్తి అనుగ్రహించమన్నారు. చివరికి వారిమీద అనుగ్రహం కలిగినదై పార్వతి వారికి ఈవిధంగా చెప్పింది :

"వింధ్యపర్వతాలలో గణభూతి అనే యక్షుడు శాపగ్రస్తుడై పిచ్చివాడల్లే తిరుగుతున్నాడు. పుష్పదంతుడు నర జన్మ మెత్తి ఆ గణభూతిని కలుసుకుని అతనికి ఈ కథలన్నీ చెప్పినట్టయితే పుష్పదంతుడికి శాపవిముక్తి అవుతుంది. గణభూతి తానువిన్న కథలన్నీ మాల్యవంతుడికి చెప్పినట్టయితే గణభూతికి శాపవిముక్తి కలుగుతుంది.మాల్యవంతుడు ఈ కథలనన్నిటినీ పుస్తకంగా రాస్తే అతని శాపం పోతుంది."

పార్వతి శాపం ప్రకారం పుష్పదంతుడు భూలోకంలో వరరుచిగా పుట్టాడు. మాల్యవంతుడు గుణాఢ్యుడుగా పుట్టాడు. వరరుచి వింధ్యపర్వతాలంతా వెతికి గణభూతిని పట్టుకుని తాను దొంగతనంగావిన్న కథలన్నీ అతనికి చెప్పేశాడు.శాపవిముక్తుడై కైలాసానికి తిరిగి వెళ్ళాడు.గణాభూతి ఈ కథలనే గుణాఢ్యుడికి చెప్పి తాను కూడా శాప విముక్తుడైనాడు. ఆతరువాత గుణాఢ్యుడు ఈ కథలన్నిటినీ తాటాకుల మీద రాసి ఆ పుస్తకానికి " కథాసరిత్సాగరం " అని పేరుపెట్టాడు. అతను కూడా శాపవిముక్తుడైనాడు.

ఈ కథలు మీకు కూడా వినాలనుందా? ఐతే వచ్చేనెలనించి ఒక్కొక్క కథచెబుతాను వినండి.