చందమామ పిల్లల మాసపత్రిక/సంపుటము 2/జనవరి 1948/రెండు విందులు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
Chandamama 1948 01.pdf

ఒక వూళ్లో ఇద్దరు అన్నదమ్ములు. అన్న చాలా భాగ్యవంతుడు. తమ్ముడు, పాపం అమిత బీదవాడు.

తమ్ముడు ఒకనాడు సంపాదన కోసరం దేశాంతరం బయలుదేరుతూ, దారిలో తినడానికి భార్యను ఏమైనా చేసియివ్వమని అడిగాడు. భార్య ఐదు మినపసున్నిఉండలు చేసి గుడ్డలో మూటకట్టి ఇచ్చింది.

అతను ఆమూట కర్రకు తగిలించుకుని, కర్ర భుజాన పెట్టుకొని బయల్దేరాడు. పోగాపోగా చీకటిపడే సమయానికి ఒక పెద్ద చెరువూ దాని పక్కన వెదురుపొదా కనిపించాయి. ఆచెరువులొ కాసిని నీల్లుతాగి, భుజంమీది మూట వెదురు పొదలొ ఒక గడకు తగిలించి ఆరాత్రికి అక్కడే పడుకుని నిద్రపోయాడు.

కొంత పొద్దెక్కినాకగాని అతనికి మెలకువ రాలేదు. తీరా అతను లేచేసరికి రాత్రి మంచుకు తడిసి వంగి ఉండిన వెదురుగడ ఎండకు పైకి నిలబడి ఉంది. దానితోపాటు అతని మినపసున్ని ఉండల మూటకూడా పైకి వెళ్లింది. మళ్ళీ సాయంకాలమైతేగాని మూట కిందికి రాదని గ్రహించి అతను ఆకలితోటే మళ్ళీ నిద్రపోయాడు.

ఈసమయంలో ఆకాశంలో తిరుగుతున్న ఐదుగురు గంధర్వులకు మినపసున్ని ఉండల వాసన తగిలింది. వెదురు గడకు వేళ్ళాడేమూట చూశారు. దాన్ని విప్పి అందులో ఉన్న ఐదు సున్ని ఉండలూ ఐదుగురూ తిన్నారు. చెరువు గట్టున నిద్రపొయ్యే మనిషిని చూచి అతని బీదస్థితికి జాలిపడి సున్ని ఉండలకు బదులు ఒక చిన్ని పెట్టెను
Chandamama 1948 01.pdf

ఆమూటలో ఊంచి గంధర్వులు వెళ్ళిపొయారు.

అతను లేచేసరికి సాయంకాలమయింది. వెదురుగడ కిందికి వంగిఊంది. ఆకలి దహించుకు పోతూండటంవల్ల అతను ఆత్రంగామూట దించుకుని విప్పి చూసెసరికి పెట్టె కనిపించింది. అతను ఆశ్చర్యంతో దాని మూత తెరిచాడు. వెంటనే పెట్టెలోనుండీ యిద్దరు గంధర్వ స్తీలు బయటికి వచ్చి పంచభక్ష్య పరమాన్నాలతో అతని ముందు భొజనం ఉంచి తిరిగి పెట్టేలోకి వెల్లి మాయమయ్యాడు.

అతను భోజనం చేసి సంతోషంతో పెట్టెతీసుకుని యింటికి వెళ్ళిభార్యకు సంగతంతా చెప్పాడు. మర్నాడతను ఊళ్ళొ వాళ్లలందరినీ పిలిచి, పెట్టెసహాయంతో వచ్చినవారందరికీ షడ్రసోపేతంగా విందు చేసాడు. వచ్చినవారంతా పెట్టెను గురించి వింతగా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు.

తమ్ముడికి కలిగిన ఈ అదృష్టం గురించి భాగ్యవంతుడైన అన్నకు అసూయ కలిగింది. పెట్టె దొరికిన వృత్తాంతమంతా అన్న తమ్ముడివల్ల తెలుసుకొన్నాడు. భార్య ప్రోద్బలంవల్ల అటువంటి పెట్టె తానుకూడా సంపాదించుకు రావాలనుకున్నాడు. భార్యచేత మినపసున్ని ఉండలు చేయించుకుని తానుకూడా తమ్ముడు వెళ్ళిన దారినే బయలుదేరాడు.

వెళ్ళి వెళ్ళి ఇతనుకూడా చెరువు దగ్గిరికి చేరుకున్నాడు. వెదురు పొదకు మూట తగిలించి పడుకుని నిద్ర పోయినాడు.
Chandamama 1948 01.pdf

ఎప్పటిలాగే అయిదుగురు గంధర్వులూ అటుగా వెళ్ళుతూ సున్నిఉండల వాసన పసికట్టి మూటవిప్పి చూశారు, "ఒకసారి పెట్టె ఇస్తే తృప్తిచెందక వీడు మళ్లీ వచ్చాడు. చాలా ఆశాపాతకుడుగా ఉన్నాడే" అనుకున్నారు. మినపసున్ని ఉండలు తిని వాటికి బదులు మరొక పెట్టె పెట్టి వెళ్లిపోయారు.

మర్నాడు సాయంకాలం వెదురు కిందికి వంగగానే అన్న మూట విప్పి చూసుకున్నాడు. మూటలో పెట్టెఉంది. తనపని నెరవేరిందిగదా అనే సంతోషంతో పెట్టెతోసహా యింటికి వచ్చి భార్యకు చూపించాడు. వారి ఆనందానికి మేరలేదు.

మరుసటి రోజున అన్నకూడా ఊళ్లో వాళ్లనందరినీ విందుకు పిలిచాడు. అందరూ వచ్చి బంతులు తీరి కూర్చున్నారు. అన్న జాగ్రత్తగా పెట్టె మూత తెరిచాడు. తెరిచేసరికి అందులోనుంచి అతిధికి ఇద్దరేసి మంగళ్ళు పొదులతోసహా బయటికి వచ్చారు. ప్రతి అతిధినీ ఒక మంగలి గట్టిగా పట్టుకుంటే రెండో మంగలి తల నున్నగా గొరగసాగాడు. కొద్ది సేపట్లోనే అందరి తలలూ బోడిగుండ్లు అయాయి. తర్వాత మంగలి వాళ్లంతా పెట్టెలోకి తిరిగివచ్చి మాయమయ్యారు.

ఆరోజు ఆవూళ్లో అన్నను తిట్టని వాళ్ళులేరు. అతను ఆలస్యం చెయ్యకుండా తనకు దొరికిన పెట్టెను సముద్రంలో పారేయించి తన అత్యాశకు తగిన ప్రాయశ్చిత్తం జరిగిందని తెలుసుకున్నాడు.