చందమామ పిల్లల మాసపత్రిక/సంపుటము 1/జూలై 1947/బండ రాముడు

వికీసోర్స్ నుండి

చూడామణి

ఎంతో ముచ్చటపడి మా అమ్మా నాన్నా నాకు శ్రీరామచంద్రమూర్తి వారిపేరు పెట్టుకున్నారు. పేరుపెట్టారే కాని అంతపొడగుపెట్టి పిలవటానికి వాళ్లకే ఓపిక లేకపోయింది. అదీకాక నావంటి చిన్నిబుర్రగలవాడికి ఇంతపెద్ద పేరుదేనికీ? అందుచేత నాపేరు కుదించి 'రాముడు' అన్నారు. ఐతే, ఊళ్లోవాళ్లు ఈ పేరుకు ముందు రకరకాల తోకలు తగిలించారు. విష్ణుమూర్తికి వేయినామాలుంటే నాకు రెండువేలున్నాయి - బండరాముడు, మొద్దురాముడు, రాచ్చిప్పరాముడు, తిక్కరాముడు, మట్టిబుర్ర రాముడు, అడ్డతలరాముడు, పిచ్చిరాముడు, వెర్రిరాముడు, మన్నుతిన్నరాముడు, నిద్రమొహంరాముడు, దున్నపోతురాముడు... ఇలా ఎన్నో మీకు కూడా ఏదన్న మంచిపేరు దొరికితే దానితో నన్ను పిలిచుకోండి, నాకేమి అభ్యంతరము లేదు. కాని నాకుమాత్రం ఈ పేర్లన్నిటిలోకి బండిరాముడనే పేరు బాగుండేది. అ పేరుతోనే జాస్తిగా నన్ను పిలిచేవాళ్లు.

మా అమ్మ నన్ను, "రా....ము....లూ!" అని చాలా పొడూగ్గాపిలిచేది. మా నాన్న మటుకు నన్ను రకరకాలుగా పిలిచేవాడు. ఆయన ఒకసారి పలికి నట్టు మరొకసారి పలికేవాడుకాదు.

నాపేరుతో మానాన్న నవరసాలూ ఒప్పించేవాడు.

ఒక దసరా పండగనాడు నాకు అక్షరాభ్యాసం చేశారు. ఆ ముహూర్త బలిమిఏమోకాని నేను ఎప్పుడు పుస్తకం పట్టుకున్నా, అది నాచేతిలో తలకిందుగానే ఉండేది. "పుస్తకం సరిగా పట్టుకోరా, పశువా" అని మానాన్న మొట్టిన మొట్టికాయలూ, తిట్టినతిట్లూ, పెట్టిన తొడపాశాలూ ఇన్నన్నికావు.

"మొద్దు వెధవ! వెయ్యి పుఠాలు వేసినా వీడికి చదువురాదు. వెనకజన్మలో వీడు ఏ గాడిదో అయిఉండాలి," అని చెప్పేశాడుమానాన్న, వుసుగుపుట్టి.

అక్షరాభ్యాసం అయిన నాటినుంచీ నేను ఒక్క విద్యమాత్రం బాగానేర్చా. అదేమిటంటే దెబ్బలుతినటం. తోటి వాళ్లంతా నన్నే కొట్టేవాళ్లు; ఇరుగు పొరుగువాళ్లుకూడా, , తమపిల్లలకు తగల వలసిన దెబ్బలు నాకే తగించేవాళ్లు; పైగా మాయింటికివచ్చి, "మీ రాము డిట్లా చేశాడు" అని ఫిర్యాదు చేసేవాళ్లు. మానాన్న నన్ను చావకొట్టేవాడు; ఇక మా అమ్మకూడా నాలాంటి గాడిదను కని, ఊళ్లోవాళ్లచేతా మానాన్నచేతా దెబ్బలుపడటానికి వప్ప చెప్పినందుకు, కోపంవచ్చి నన్నే కొట్టేది. దీనికితోడు మానాన్నదగ్గిర నేను ఎనిమిది నెలలపాటు చదువుకున్నాను. అయిదు బళ్లూ నాకు వచ్చేలోగా ఎన్నిదెబ్బలు తినిఉంటానో మీరే ఊహించుకోండి. ఇలా దెబ్బలు తినడంవల్ల నావొల్లు బండబారి పోయింది. అందుకనేనేమో నాకు బండరాముడు అంటే ఇష్టం.

చిన్నతనంలో నాకు తెలివిగలపనులు చెయ్యాలని ఉండేది. మంచిపనులూ చెయ్యాలని ఉండేది. దెబ్బలు తినటం అలవాటయినకొద్దీ ఈ ఉద్దేశం అడు

గంటింది. దెబ్బలభయం మూలకంగా ఏపనిచెయ్యాలన్నా భయమే. అదీకాక ఏపనిచేసినా దెబ్బలే తగులుతున్నప్పుడు మంచిపనులేవో, చెడ్డపనులేవో తెలుసు కోవటం ఎలా? అందుచేత నాకు మంచీ చెడూ తెలుసుకునేశక్తిపోయింది. నేను సాధువునయాను. నా మెత్తతనం చూసి కొందరు నన్ను మొద్దురాముడనేవాళ్లు.

ఇంక నాకు పెద్దచదువులు చెప్పటం మానాన్నవల్ల కాలేదు. అందుచేత నన్ను ఒకబడిలో వేశారు.

నన్ను ఒకటోక్లాసులో చేర్చుకున్నారు. మా క్లాసులోకల్లా నేనే పొడుగు. వయసులోకూడా నేనే అందరికన్నా పెద్ద. అందుచేత మిగిలినవాళ్లకెవరికీ తెలియని విద్య ఒకటి నాకుతెలుసు. అదేమిటంటే, చచ్చినా నోరు విప్పకపోవటం. నన్ను కొట్టినప్పుడల్లా పెద్దవాళ్లు, "నోరు మూసుకో, వెధవా! నోరుమూసుకో!" అనేవాళ్లు.

వాళ్ళ ఉద్దేశం నేను పైకి ఏడవరాదనో, మాట్లాడరాదనో నాకు తెలియదు. నేనుమాత్రం నోరు మూసుకోవటం నేర్చుకున్నా.

ఒకరోజు సాయంకాలం, క్లాసులో మా మేష్టారు పిల్లకాయల్ని, "ఏం కధ చెప్పమన్నారు?" అని అడిగారు. పిల్లకాయలెవరూ మాట్లాడలేదు. నా పక్కన్న ఉన్న పిల్లవాడు నా చెవిలో, మాయలేడి కథ చెప్పమని అడుగు", అని రహస్యంగా ఊదాడు. "మేష్టారూ, మాయలేడి కధ చెప్పండి," అన్నాను. ఎందుకోగాని పిల్లకాయలంతా గొల్లున నవ్వారు.

మేష్టారికళ్ళు చింతనిప్పులల్లే అయాయి. ఆయనపళ్లు పటపటా కొరుకుతూ అంబశక్తికి మల్లే ఒక్కొక్క అడుగే వేసుకుంటూ, చేతిలో బెత్తం ఊపుతూ,

"కోతివెధవా, పుండాఖోఠ్, బద్మాష్" అని తిడుతూ నామీదకివచ్చాడు. ఎన్ని దెబ్బలు తిన్నానో నేను లెక్క పెట్టలేదు. ఆ దెబ్బలతో ఆయనకోపం తీరిందో లేదో తెలియదు. అసలాయన నన్నెందుకు కొట్టిందీ, నేనేం తప్పుచేసిందీకూడా నే నెరగను. వాచినకళ్లతో, బూరెలాగా పొంగిన వీపుతో ఇంటికి వెళ్లేటప్పుడు మాక్లాసు పిల్లకాయ ఒకడు నాతో చెప్పాడు: మేష్టారిపేరు రమణయ్యట; ఆయన చకచక ఎవ్వరికీ అందకుండా నడుస్తాడట. అందుచేత ఆయనకు మాయలేడి అని పేరుపెట్టారట. అందుకనేనట ఆ పేరంటే ఆయనకు కోపం.

మర్నాడు నాకు బడికిపోటానికి బుద్ధిపుట్టలేదు. కాని మానాన్న మొట్టికాయల కంటే పంతులుగారి బెత్తమే నయమని వెళ్లాను. మేష్టారు నిన్న అనవసరంగా నన్ను కొట్టినందుకు ఇవాళ చాలాబాగా చూశారు. ఇవాళ మేష్టారికి డ్రాయింగు బొమ్మ వెయ్య బుద్ధయింది. చాక్‌పీసు తీసుకుని తేలుబొమ్మ వేస్తూండగా ఆయనకు పొడుంపీల్చవలిసిన అవసరం వచ్చింది. రొండినుండి పొడుండబ్బీ తీసిచూస్తే అందులో పొడుములేదు.

ఆయన నాకేసిచూసి, నవ్వి, ఎంతో అపేక్షగా, "ఒరే, నాయనా, రాముడూ, ఇలారా", అన్నాడు. నాకు చెమటలు పోశాయి. కాళ్లు వణుకుతూ అయన దర్గిరికి వెళ్లా. "ఒరే, అబ్బాయీ, ఈ పక్కదుకాణానికివెళ్లి ఒక అర్ధణా నస్యం వేయించుకు రా గలవూ?" అన్నాడు. "వేయించుకు వస్తానండీ, నాకు దుకాణాలకు వెళ్లటం అలవాటే, మా వీధిలో వాళ్లందరికీ సరుకులు నేనే తెచ్చిపెడతాను, ఇవ్వండి," అన్నాను ఉత్సాహంతో. ఆయనదగ్గిర పొడుము డబ్బీతోపాటు రెండు కాన్లు తీసుకుని బయటికి పరుగెత్తాను.

దుకాణంవాడికి పొడుముడబ్బీ, డబ్బులూ ఇచ్చి, పక్కనే గారడీ జరుగుతుంటే తొంగిచూశా. గారడీవాడు తురకంలో ఏదో చెబుతున్నాడు. వాడితో ఇంకొకడు పాడుతూ డోలు కొడుతున్నాడు. "ఓ అబ్బాయిలూ, మీలో ధైర్యంగలవా డెవడైనా ఇట్లా రండి"' అని గారడీవాడు పిలిచాడు. ఎవరూ రాలేదు. గారడీవాడికళ్లు నామీద పడ్డాయి. నామనసు ఊగింది పోవాలని. కాని మేష్టారిపొడుముడబ్బీ, బెత్తమూ జ్ఞాపకం వచ్చి, గబగబా దుకాణం దగ్గిరికిపోయి అక్కడఉన్న డబ్బీ తీసుకుని బడికి పరుగెత్తా. డబ్బీ మేష్టారి బల్లమీద పెట్టి వచ్చి మళ్లీ నాచోటులో కూర్చున్నా.

మేష్టారు తేలుబొమ్మవేసి బల్లదగ్గిరికివచ్చి చూసుకునేసరికి బల్ల మీద నిప్పుపెట్టె ఉంది. ఇదేమిటని దాన్ని తెరిచిచూసేసరికి అందులోనుంచి ఒక తేలుపిల్ల బయటికి వచ్చింది. "రాముడు మేష్టారికి తేలుపిల్ల బహుమానం తెచ్చాడు", అని క్లాసులో పిల్లకాయలు అరిచారు. నావీపు చెడింది అనుకున్నా.

"పొడుమేదిరా, రాముడా?" అని అయ్యవారడిగాడు. అప్పుడు నాకు తెలిసింది, మేను పొడుముడబ్బీకి మారుగా ఎవరో అల్లరి పిల్లకాయపెట్టిన నిప్పు పెట్టె తెచ్చానని.

"ఇప్పుడేవెళ్లి క్షణంలో తెస్తానండీ", అంటూ మళ్లీ దుకాణానికి దౌడుతీశా.

నాస్థితి కనిపెట్టి దుకాణదారు నన్ను చాలాసేపు ఏడిపించి, నాచేత నీళ్లు తెప్పించి, దుకాణం ఊడ్పించి, ఆఖరుకు డబ్బీ ఇచ్చి పంపించాడు. ఆవిధంగా ఆరోజు భగవంతుడి అనుగ్రహంవల్ల నాకు దెబ్బలు తప్పాయి. పొద్దున్నే లేచి ఎవరిదో మంచిమొహం చూసి ఉంటా