చందమామ పిల్లల మాసపత్రిక/సంపుటము 1/జూలై 1947/పండుటాకుల పాట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
Chandamama 1947 07.pdf

అనగా అనగా ఒక పెద్ద రావిచెట్టు. ఆ చెట్టు కొక పెద్దకొమ్మ. ఆ కొమ్మకొక చిన్న రెమ్మ. ఆ రెమ్మకొక చిన్ని చిగురుటాకు. చిగురుటాకును గాలి చల్లగా జోకొట్టింది. సూర్యకిరణాలు వెచ్చగా మేలుకొలిపాయి. ఆనందంతో ఉబ్బిపోయింది, చిగురుటాకు.

ఇంతలో ఒకపాట సన్నగా వినిపించింది. ఈ పాట చుట్టుపట్ల చెట్లమీదినుంచి సన్న సన్నగా వచ్చింది. ఈ పాటను పండుటాకులు విన్నాయి. అవికూడా పాట అందుకున్నాయి. రావిచెట్టుమీది పండుటాకులన్నీ పాడసాగాయి.

చిగురుటాకు ఈపాట విన్నది. ఈ పాట ఏమిటో దానికి అర్థం కాలేదు. ' పండుటాకులు రాలే వేళయింది ' అని చెప్పింది పక్క ఆకు.

రాలి కిందపడటంలో ఆనందం ఉండి ఉండాలి అనుకున్నది చిగురుటాకు. రాలి కిందపడే భాగ్యం తనకు లేదే అని విచారించింది చిగురుటాకు. చిగురుటాకు తన విచారాన్ని రెమ్మకు చెప్పింది. రెమ్మ మండకు చెప్పింది. మండ కొమ్మకు చెప్పింది. కొమ్మ బోదెకు చెప్పించి. బోదె తల్లిచెట్టుకు చెప్పింది.

తల్లిచెట్టు బోదెతో చిగురుటాకుకు ఈ విధంగా కబురు చేసింది :

" చిగురుటాకును విచారించవద్దను. నన్నే అంటిపెట్టుకుని ఉండమను. నేనిచ్చే ఆహారం ఆరగించమను. ఎండలో చలి కాచుకోమను. గాలిలో ఆడుకోమను. పండుటాకుల పాటపాడే సమయం దానంతట అదే వస్తుంది. అప్పటిదాకా ఆగమను. "

ఈమాట బోదె కొమ్మకు చెప్పింది. కొమ్మ మండకు చెప్పింది. మండ రెమ్మకు చెప్పింది. రెమ్మ చిగురుటాకుకు చెప్పింది.

" అమ్మ చెప్పినట్టే చేస్తానులే, " అన్నది చిగురుటాకు.

అది తల్లినే అంటిపెట్టుకున్నది. ఎంతో ఆహారం తీసుకున్నది. ఎండలో చలి కాచుకున్నది. గాలిలో ఆడుకున్నది. పెరిగి పెద్దదై ముదురు ఆకుపచ్చ రంగుకు తిరిగింది. క్రమంగా దానిరంగు తేలిక ఆకుపచ్చగా మారింది. తరువాత పసుపు పచ్చగా అయింది.

మళ్లీ పండుటాకులపాట వినిపించింది. పండిన ఈ ఆకు కూడా ఆపాట విన్నది. మిగిలిన పండుటాకులతోపాటు పాడ నారంభించింది. పాట తెచ్చిన గాలి మెల్లిగా పండుటాకును చెట్టునుంచి వేరుచేసింది.

పండుటాకు మెల్లిగా గాలిలో తేలుతూ క్రింద పడిపోయింది.

కింద అనేకమైన ఎండుటాకు లున్నాయి. వాటిమధ్య పడి పండుటాకుకూడా వాటిలాగే దీర్ఘనిద్ర పోయింది.