చందమామ పిల్లల మాసపత్రిక/సంపుటము 1/జూలై 1947/తెనాలి రామలింగం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
Chandamama 1947 07.pdf

తెనాలి రామలింగం పేరు తెలియని పిల్లలు ఉండరు. అతని కాపేరు ఎలా వచ్చిందనుకున్నారు? తెనాలిలో పుట్టాడు కనుక తెనాలి రామలింగమయాడు. ఆ రోజుల్లో తెనాలి చిన్న ఊరు.

చిన్నప్పటినుంచి రామలింగం వట్టి చిలిపివాడు. ప్రతివాళ్లనీ పేర్లు పెట్టేవాడు. అతనికి నదురు బెదురు ఏకోశానా ఉండేది కాదు. తనకు నచ్చనిదాన్ని వెక్కిరించుటంలో మొనగాడు.

ఒకరోజున రామలింగం వీధిలో ఆడుకొంటూవున్నాడు. ఒక యోగి ఆ దారిని పోతూ అతన్ని చూచాడు. రామలింగం రూపురేఖల్లోనూ, అతని మాటల్లోనూ యోగికి తెలివితేటలు కనిపించాయి. వెంటనే ఆయన రామలింగాన్ని దగ్గిరకు పిలిచి శక్తి మంత్రం ఉపదేశించి యిలా చెప్పాడు:

"నాయనా! ఈ మంత్రం వెయ్యిసార్లు కాళికాదేవి గుడిలో జపిస్తే, దేవి నీకు ప్రత్యక్ష మౌతుంది. వెయ్యి తలలతో కనిపిస్తుంది. నీవు భయపడగూడదు. అప్పుడు దేవి మెచ్చి నీవు కోరుకొన్న వరం ఇస్తుంది," అని చెప్పి యోగి వెళ్లి పోయాడు.

ఒక మంచిరోజు వచ్చిందాకా ఆగి, ఆనాటి అర్ధరాత్రిపూట రామలింగం ఒంటరిగా కాళికాదేవి గుడికి వెళ్లి యోగి చెప్పిన మంత్రం వెయ్యిసార్లు జపించాడు. కాళికాదేవి వెంటనే వేయి తలలతో ప్రత్యక్షమైంది. రామలింగం భయపడలేదు. అతనికి ఏమితోచిందో ఏమో ఫక్కున నవ్వాడు.

దేవి రామలింగాన్ని "ఎందుకు అబ్బాయీ, నవ్వుతా?"వని అడిగింది.

"మీరు కోపగించుకోమంటే మనవి చేసుకొంటాను," అన్నాడు జంకు గొంకూ లేకుండా రామలింగం,
Chandamama 1947 07.pdf

దేవి సరేనన్నది. రామలింగం అప్పుడు చెప్పాడు: "అమ్మా! మాకు ఒకటే ముక్కు, కాని రెండుచేతులున్నాయి. ఎప్పుడన్నా జలుబు చేస్తే ఈ ఒకముక్కు చీదుకోటానికే రెండుచేతులు చాలటంలేదు. ఇక మీకా వెయ్యితలలు. కర్మంజాలక జలుబుచేస్తే ఆ వెయ్యిముక్కులు చీదుకోటానికి ఈ రెండుచేతులు ఎలా చాలుతాయా అని నవ్వు వచ్చింది."

దేవికూడా అతనిమాటకు నవ్వి - "నాయనా, నన్నుచూచి నవ్వినవాడివి ఇక నువ్వు ఎవరిని చూచి నవ్వవు గనుక. నీవు తప్పకుండా వికటకవి వవుతావు," అంది.

రామలింగం నమస్కరించి "తల్లీ ఎటుతిప్పి చదివినా చెడనిమాట వరంగా ఇచ్చావు. ఇంతకంటే నాకు ఏమికావాలి," అన్నాడు.

కాళిక అతని తెలివితేటలకు మెచ్చుకొన్నది. 'వికటకవి' అనే మాట ఎటు తిప్పిచదివినా మారేది ఏమి ఉంది> దేవి సంతోషించి మరొక వరంకూడా అతనికి ఇచ్చింది. "నీవు రాజాస్థానంలో విదూషకుడ వవుతావు. అంతే కాదు. నీలాగా పద్యం కూర్చటం మరొకరికి చేతకాదు." అని ఆశీర్వదించింది.

Chandamama 1947 07.pdf

రామలింగం వికటకవిగా ప్రసిద్ది కెక్కాడు. ఆయనపేరుతో ఎన్నో హాస్య కథలు ఉన్నాయి. ఇవిగాక వీరు రెందు మహాకావ్యాలు వ్రాశాడు. ఉద్భటారాధ్య చరిత్ర ఒకటీ, పాండురంగ మాహాత్మ్యం రెండూ.

పెద్దవాళ్లయినాక మీరు వాటిని చదువుతారు కదూ.