గోన గన్నారెడ్డి/ప్రథమగాథ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ప్రథమగాథ

పీటలమీద పెండ్లి

1

పెళ్ళివారంతా యధోచితస్థానాల మహాఠీవిగా కూర్చున్నారు. శ్రీ కుమారసింహ గుణార్ణవకుమార అరిభీకరసూర్య గోన వరదారెడ్డి సాహిణి కుమారుడు వరుడై, సమస్తాభరణాలు ధరించినవాడై, జరీపూవులూ ముత్యాలకూర్పులూ కుట్టినహొంబట్టు ఉపధానాలమధ్య చెక్కిన పాలరాతివిగ్రహంలా వివాహ వేదికపై కూర్చుండిఉన్నాడు. వజ్రాలుకూర్చిన బంగారు పిడితో నడుమునవ్రేలాడు డాలుపై ఎడమచేయి తీర్చియున్నది. కుడిచేయి దిండుపై అలంకరించియున్నది.

వర్ధమానపురరాజ్యపు మంత్రిముఖ్యులూ, సేనానాయకులూ, రాజబంధువులూ, సామంతప్రభువులూ మొదలైనవారంతా చుట్టూ పరివేష్టించియున్నారు.

ఆదవోని రాజ్యం పరిపాలకుడు ప్రతాపాదిత్య, ప్రచండవిక్రమ, పరగండ భైరవ, అశ్వసాహిణి శ్రీ కోటారెడ్డిదేవర మహామండలేశ్వరుడు శ్రీ విశాలాక్షీ దేవీపూజానిరతురాలగు తనకుమార్తె అన్నమాదేవిని వర్ధమానమండలేశ్వరుల కుమారునికి వివాహముచేస్తూ ఉన్నారు. ఈ రెండు రాజ్యాలనూ ఏకంచేసే ఈ శుభలగ్నానికి అప్పుడే త్రైలింగ మహాసామ్రాజ్యానికి సార్వభౌములైన శ్రీ శ్రీ రుద్రమదేవచక్రవర్తియు మహామంత్రులైన శ్రీ శివదేవయ్య దేశికులును, సర్వసైన్యాధ్యక్షులైన శ్రీ జన్నిగదేవ మహారాజులుంగారును బహుమతులు, ఆశీర్వాదాలు సేనాధికారులద్వారా పంపించియున్నారు.

ఆదవోని దుర్గంలో పెద్దరాచనగరిలోనున్న నూరు స్తంభాల వివాహ మంటపమంతా ఆంధ్రరెడ్ల వైభవం వేనోళ్ళచాటుచున్నది. గోడలపైన రసవంతాలైన చిత్రాలు, దంతశిల్పం, పొదిగిన కళలూరే స్తంభాలు, చిత్రచిత్ర లతలు నగిషీ చేసిన వెండిప్రమిదల్లో కమ్మని చందనం, సంపెంగ, మల్లె, జాజి నూనెల్లో వెలుగుతూఉన్న పైడిప్రత్తివత్తుల దీపాలు, ఆ మధ్య వివాహవేదిక, బంగారు స్తంభాలతో, ముత్యాల అల్లికలతో, రంగురంగుల మణులు పొదిగిన అనల్పకల్పనలతో, పచ్చని మామిడాకు తోరణాలతో, నారికేళాలూ, అరటి గెలలతో, పట్టుగొడుగులతో, ముత్యాలతోరణాలతో ఆ మండపం వెలిగి పోతున్నది. వివాహవేదికలో యెడమభాగాన పచ్చని పట్టుతెర సౌభాగ్యవతి యగు వధువు రాకకు నిరీక్షిస్తున్నది.

రంగుగంగు పట్టు తలచీరలవారూ, బంగారు కిరీటాలవారూ, నిమ్మపండ్లు నిలిచే భయంకరమైన మీసాలవారూ, రత్నహారాలూ, భుజబంధాలూ, కంక ణాలూ, కుండలాలూ విరజిమ్మేకాంతితో కలసిపోయే దేహంకలవారూ, పట్టుకాసెకోకలవ్రేలు బంగారు ఒరలలో బంగారు పిడుల బాకులుగలవారూ, వెడద ఉరాలవారూ, వారివారి పీఠాలమీద పోతపోసిన విగ్రహలులాగ అధివసించి యున్నారు.

వివాహవేదిక మూడుప్రక్కలా వేదవేదాంగపారంగతులునూ, పండితోత్తములునూ అయిన బ్రాహ్మణోత్తములు ఋషులవలె కూర్చుండి గంభీరస్వరాలతో వేదగానం చేస్తున్నారు. గాయకులు వారివారి విద్వత్తులు చూపిస్తున్నారు. నటీబృందం సవిలాసంగా నృత్యము చేస్తున్నది.

వసిష్ఠులవారు పెండ్లి కుమారునిచేత ఆచమనాదులను చేయిస్తున్నారు. చుట్టూ కాండపటాలమధ్య దాసీజనము బంగారు చప్పరములో వధువును తోడ్కొని వస్తూఉన్నారు.

భేరీభాంకారాలు, నాదస్వరాలు, పిల్లనగ్రోవులు, ఇత్తడికొమ్ములు, కనక తప్పెటలు, మురజలు మొదలైన వాద్యాల మంగళధ్వనులు దిశలు నిండుతున్నవి.

ఆ సమయంలో నిశితకృపాణహస్తాలతో పదిమందివీరులు తన్ను పరివేష్టించి రాగా, ఎడమచేయి నూనూగుమీసమును, కుడిచేయి పట్టుదట్టీని సవరింప సన్నగా శలాకవలె పొడుగైనవాడు, శిరస్త్రాణంపై బంగారు కిరీటలాంఛనం గలవాడు, మిలమిలలాడు కుబుసమువంటి ఉక్కు కవచముపై హారాలు ధరించినవాడు, ఎడమ పార్శ్వమున బంగారుచెక్కడములపై మణులు వెలుగుతూఉండే పిడిగల దీర్ఘ కరవాలంగలవాడు, చిరునవ్వు మోమున నర్తించేవాడు, లోకభీకరుడూ, రాజుల గుండెల్లో నిద్రపోవువాడు, బీదలపాలిటి కల్పతరువు, గజదొంగ గోన గన్నా రెడ్డి సాహిణి ఒయ్యారి నడకలతో మందమందముగ వివాహమంటపమున బ్రవేశించెను.

పెళ్ళికుమారుడైన గోన వరదారెడ్డి సాహిణిని గుబుక్కున లేవదీయడం, విఠలనాథుడూ సూరనరెడ్డీ అనే పిట్టపిడుగుల కౌగిలింతలకు ఆ రాజకుమారుణ్ణి అప్పజెప్పటం, వారందరితోపాటు సింహద్వారాలు దాటడం, వారితో గుఱ్ఱాలపై చెంగునఉరికి గన్నా రెడ్డి అధివసించడం కన్నుతెరచి మూసేలోపలే జరిగి పోయింది.

అక్కడఉండే సభికులు యావన్మందీ, రాజులు, మంత్రులు వీరవాహినీ పతులు మ్రాన్పడిపోయారు. వివాహమంటప మంతా ఒక్కసారి పెద్దసముద్ర కెరటం విరిగిపోయినట్లు మహారావంతో నిండిపోయింది. కూరుచున్న ఆసనాల మీదినుంచి ఆ వీరులు ఉరికారు. అంగరక్షకులను పిలిచి సేన లాయత్తం చేయుడన్నారు. అశ్వాలను కొనిరండన్నారు. రథాలు పూన్చుడన్నారు. ఉక్కిరిబిక్కిరిగా రణగుణధ్వనుల్లో మునిగిపోయారు వీరవరేణ్యులు యావన్మందిన్నీ.

ఎక్కడ పురరక్షకులు నక్కడే ఆపుచేసి పురసైన్యాల కేమిన్నీ తెలియకుండానే కోట తూర్పుద్వారంనుంచిఉన్న రాజపథమంతా తనవీరులతో ఆక్రమించి, గోన గన్నారెడ్డి ఒక్కక్షణంలో వచ్చాడు. వారందరితో మరుక్షణాన మాయమై పోయాడు.

సేనల్ని ఆయత్తంచేసుకొని వీరశ్రేష్ఠులంతా గజదొంగ గన్నారెడ్డిని వెంబడించారు. వాయువేగంతో అశ్వసైన్యాలు తరుముతూ ఉన్నవి. ప్రచండమారుతంలా గన్నారెడ్డి సమీపారణ్యంలో ప్రవేశించాడు. మంత్రించినట్లు ఆ అడవుల్లో, కొండలలో, లోయల్లో గన్నారెడ్డి యెక్కడ మాయమైపోయాడో తన సైన్యంతోనూ, పెండ్లి కుమారునితోనూ!

సాయంకాలంవఱకూ సైన్యా లా ప్రదేశాలను వెదకుతునే ఉన్నవి. కాని, ఒక్క అశ్వఖురం జాడైనా వారికి దొరకలేదు.

2

తన వీరులతో బారులుతీర్చి వాయువేగంతో పోతూ గన్నా రెడ్డి రాజకుమారుని వీపున తన బాకు ఆనిస్తూ “తమ్ముడా, తప్పుకుపోవడానికి ఏమాత్రం ప్రయత్నం చేసినా, ఈ బాకు నీ గుండెల్లో నిద్రపోతుంది” అని అన్నాడు. అతని మాటల్లోని వేగము రాజకుమారుడు కనిపెట్టి భయపడినాడు. “ఒకరోజు కొంచెం మాతో ఉండాలి. ఎంతగౌరవం జరగాలో అంతా రాజకుమారుడైన మా తమ్ములకు జరుగగలదు” అని గోనవంశోదధిలో కాలకూటంలా జన్మించిన గన్నారెడ్డి మరల హెచ్చరించెను.

వెంటాడుతున్న సేనలో ఒక్క సైన్యాధికారి పర్వతశిఖరంవలె సమున్నతాంగుడైన రెడ్డివీరుడు మీసం తిప్పుకుంటూ “గన్నారెడ్డి గొప్ప వీరు డన్నారు. కత్తిపోరులోగాని, ముష్టి గదా ధనుర్యుద్ధాలలోగాని అతనికి సాటే లేడన్నారు. అతని వీరులంతా అతనికి ఉద్ది అన్నారు. మా ఏకశిలా నగరంలో గన్నారెడ్డిని గూర్చి ఆశ్చర్యంగా చెప్పుకుంటారుకదా, ఇదేమిటి? ఇలా దొంగ ఎత్తుగా పారిపోయినాడు” అని ఇంకో రెడ్డివీరునితో అంటున్నాడు.

“మీరు గన్నారెడ్డిని ఏమిన్నీ అనేందుకు వీలులేదు సుమండీ. అతడింతవరకు అధర్మంగా ఎవ్వరికీ ద్రోహం చెయ్యలేదు. ఎదురుగుండా వస్తాడు. తాను తలుచుకున్నపని చేస్తాడు. మాయమైపోతాడు. ఎదిరించిన వాడిని హతమారుస్తాడు. తన అనుచరులకూ హాని రానివ్వడు. అందుకోసమే తన్ను రూపుమాపే సైన్యం వస్తే, నేలపగిలి దారియిచ్చినట్లు, గాలికింద కరిగినట్లు మాయమౌతాడు” అన్నాడా రెండో రెడ్డివీరుడు.

“మామూలు బందిపోటులా ఊళ్ళు దోస్తాడంటూ, దార్లు కొడ్తాడంటూ ప్రజల గోలఏమి మరి?”

“అదే తప్పు. అతడు ఒక్క ఊరుదోచినట్టుకాని, దొంగలా దారి కాచినట్టుగాని ఒక్కళ్ళును చెప్ప సాహసించలేదు. గిట్టనివాళ్ళు చెప్పే విషపు మాట లివి.”

3

దక్షకృతావమానంచే విశ్వంయావత్తూ బూదిచెయ్యాలన్న రుద్రుని కోపంతో రాజశ్రేష్ఠుడు, వయోవృద్ధుడు శ్రీ శ్రీ మహారాజాధిరాజు శ్రీ గోన లకుమయారెడ్డి మండలేశ్వరులు మంత్రాలోచనసభ చేరినారు. వర్ధమానపురంలో కోటలో రాజనగరిలో, అన్నిచోటులలోనూ వచ్చిన వార్తలవల్ల జనులు గజిబిజిపడిపోతూ ఉన్నారు.

ఆదవోనినుంచి మహారాజు రాజ్యసైన్యాలు, మంత్రివర్గం, రాజబంధువులు, సామంతులు యావన్మందీ వచ్చిచేరినారు. నేడు రాజ్యసభలో మంత్రాలోచనకై సభికులు ముందే వచ్చియున్నారు. మహారాజులు రావడంతోనే అందరూ లేచి జోహారులన్నారు. ఆయనకన్నుల్లో నిదాఘవేళాప్రచండ మార్తాండదుర్నిరీక్ష కిరణాలు వెలిగిపోతున్నావి. ఆయన వెలిగడ్డము వణకుతూ ఉన్నది. దీర్ఘమైన బాహువులు పైకీ క్రిందికీ ఆడుతూ ఉన్నవి. కుడిచేత్తో అయన ఇటు అరజానెడు అటు అరజానెడు ఉన్న ధవళమైన మీసాల్ని సవరిస్తూనే ఉన్నారు.

సచివాగ్రణి లేచి మహారాజులంవారి దిక్కు మొగమౌతూ “ప్రభూ! ఈ దొంగ, ఈ పాపి, మచ్చలేని దుర్జయవంశానికి అవకీర్తి తెస్తూఉన్నాడు. పాలసముద్రమువంటి గోనవంశాన హాలాహలం పుట్టుకువచ్చి నీచాతినీచుడయ్యాడు. అతని జాడతీసి అనుచరులు యావన్మందితోనున్నూ హతమార్చమంటారో, జీవంతో పట్టుకువచ్చి నేలఖయిదులో పారవేయించమంటారో మహాప్రభువుల వారు సెలవియ్యాలి. సేనానాయకులవారు అరణ్యంచుట్టి, దొంగల్ని బంధించడానికై నాలుగు సైన్యదళాల్ని పంపించి ఉన్నారు. స్వయంగా రెండు అశ్వదళాలతో, ఒక గజసైన్యంతో ఈదినమే ప్రయాణం అవుతూ ఉన్నారు. దేవర వారి ఆజ్ఞ” అని విన్నవించాడు.

సభఅంతా నిశ్శబ్దం అయింది. ఇంతలో చటుక్కున హజారం ముంగల రణగుణధ్వని వినబడినది. ప్రతీహారివచ్చి “మహాప్రభూ, దేవరకు ఎల్లప్పుడూ అఖండజయం! శ్రీ శ్రీ మహారాజకుమారులు అడవికిపోయి కొన్ని సైన్యాలతో విజయంచేస్తూ ఉన్నారు. అశ్వచారులు హుటాహుటివచ్చి వార్త అందించుకున్నారు” అని మనవిచేసెను.

మహారాజు చటుక్కున లేచినవా డాయెను. సభ అంతా లేచినది. మహారాజు త్వరితగమనంతో సభాప్రాంగణంవరకూ సభ వెనుక నడుస్తూ ఉండగా, వెళ్ళినారు. “జయ! జయ! దిగ్విజయీభవ! శ్రీకుమారమహారాజులం వారికి జయ!" అనే జయజయధ్వానాలు మిన్నుముట్టుతూ ఉండగా, శ్రీ వరదారెడ్డి మహారాజకుమారులంవారు అశ్వసైన్యాధ్యక్షుడు, దండనాయకుడు, తలవరి చమూపతులు కొలుస్తూఉండగా ఉత్తమమైన పంచకళ్యాణిగుఱ్ఱంపై అధివసించి వచ్చి, దిగి, తండ్రిగారికి పాదాభివందనం ఆచరించారు. మహారాజులంవారు ఎడమ కన్నుకొలుకున చెమర్ప కుమారుని ఎత్తి కవుంగలించుకొన్నారు! జయజయధ్వానాలు మిన్నుముట్టుతూ ఉన్నవి. ముత్తైదువులు, బ్రాహ్మణులు, హారతు లర్పించేవారు ఆశీర్వదించేవారై ఎదురుగా వచ్చారు? శ్రీ సోమనాథదేవ దివ్య శ్రీపాదములకు నివేదనలు అర్పించవలసినదిగా మహాప్రభువులు ఆజ్ఞ ఇచ్చారు. ఇంతలో దౌవారికుడువచ్చి ఒక కొమ్ములో ఉన్న రక్తం కుడిచేతిలోకి వంచుకొని మహారాజకుమారునిపై చల్లి నొసటను బొట్టు పెట్టెను. నగరంలోఉన్న దేవాలయాలన్నిట ఆనాడు అర్చనలు జరిగాయి.

కొన్ని ఘటికలు గడిచినతర్వాత మహారాజు మహారాజకుమారుణ్ణి చూడ్డానికి వెళ్ళినవాడాయెను. “ఆ కొండల్లోకి వాళ్ళగుఱ్ఱాలు లేళ్ళలా ఎక్కినాయి. ఇంతలో గన్నారెడ్డి నా కళ్ళకు గంతలు కట్టాలన్నాడు.”

“దొంగపోటు దుండగీడు. వాడితల కోటగోపురం ఎదుట వ్రేలాడాలి గాక!” అని లకుమారెడ్డి వళ్ళు పటపట కొరికినాడు.

“నాకళ్ళకు గంతలతోనే గుఱ్ఱాలపై రాళ్ళెక్కాము, లోయలు దిగాము, కొండలు దాటాము. దండంతాఆగింది. నాకళ్ళగంతలు విప్పారు. అద్భుతమైన తోటలు, మేడలు, ఒక చక్కని సెలయేరు, చుట్టూ ఎత్తైనకొండలున్నూ.”

4

ఈ గడబిడఅంతా కాండపటాలమధ్య పల్లకీలోఉన్న పెళ్ళికుమార్తె విన్నది. కాండపటాలను పట్టుకున్న పరిచారికలు, పల్లకీమోసే పరిచారికలు ‘ఆగండి!’ అన్న గంభీరస్వరం విని ఆగిపోయారు. మండలేశ్వరుల ఆజ్ఞ చొప్పున ఇరువురు కంచుకలు పరుగునవచ్చి “పెళ్ళికుమార్తెను లోనికితీసుకొనిపొం” డని, అది మహారాజుఆజ్ఞ” అని, దాసదాసీజనముతోనూ, సఖులతోను రాకుమార్తెను లోనికి బంపించివేసిరి. ఇంతలో అంతఃపురాల్లోకి గజదొంగ గోన గన్నారెడ్డి వచ్చి, అందరివీరులమధ్య ఉన్న పెళ్ళికుమారుణ్ణి ఎత్తుకొనిపోయాడన్న వార్త పిట్టపిడుగులా మారుమ్రోగింది.

పెండ్లికుమార్తెను మహారాణిగారి అభ్యంతరమందిరంలోకి తీసుకుపోయినారు. రాజమాతయున్నూ, మహారాణియున్నూ వధువుదగ్గరకు వచ్చి చేరినారు. పదునెనిమిదేండ్లు ఎలప్రాయముగల అన్నాంబికాదేవికి ఇదంతా ఒక హాస్య నాటకంలా తోచింది. మొదటినుండీ ఏకారణంచేతనోగాని, ఈ వివాహం అంటే ఆమెకు అంత ఉత్సాహం లేకపోయెను. చుట్టుప్రక్కల చుట్టాలవారి స్త్రీజనం అంతాను, పరిచారికాజనమున్నూ ఉక్కిరిబిక్కిరిగా మాట్లాడుకొంటున్న మాటల్లో కొన్ని ఆమె చెవిని బడుతున్నాయి.

“ఈ పాడురాక్షసుడు, పెండ్లికుమారుడి పెత్తండ్రి చుట్టమేనటమ్మా!”

“ఈతని పేరుచెబితే ప్రజలు, గ్రామాలు, రాజ్యాలుకూడా గజగజ వణికిపోతాయట.” “ఎంత భయంకరంగా ఉన్నాడనుకొన్నారు!”

“కాదండీ దొరసానిగారూ! నేను తొంగిచూశానుగా, మంచి పొడుగ్గా, అందంగా, బలంగా, బంగారుచాయతో వెలిగిపోతూఉన్నాడు. ఏమి ఠీవండీ! కళ్ళు విశాలాలై మధ్యహ్నసూర్యుడిలా ఉన్నాయి. అబ్బో!”

ఇంకా ఈలా, ఈలా మాటలు.

అన్నాంబికాదేవికి నవ్వువచ్చింది. ఆపుకొన్నది. సంస్కృతకావ్యాలు అన్నీ చదువుకొన్నది. ఇప్పుడు శాకుంతలం ప్రారంభించింది. భరతశాస్త్రము, జాయప సేనాని నృత్తరత్నాకరము, అలంకారశాస్త్రాలు చదువుకొన్నది. కౌముది అవుతున్నది. మనుధర్మశాస్త్రం, శుక్రనీతిసారము, చాణక్యనీతి, మానసోల్లాసము, భారత భాగవత రామాయణాదులు, ఆంధ్రమున అనుభవసారము, శివతత్వసారము, పండితారాధ్యచరిత్ర, పురుషార్థసారము, నన్నయ తిక్కనకవి విరచిత ఆంధ్ర మహాభారతము, మార్కండేయ పురాణము, మొదలైన వెన్నియో చదువుకొన్నది.

అన్నమదేవికి వరవడి రుద్రదేవి. ఆదవోని మహారాజుకు ఈమె ఒక్కతే సంతానము అవడంచేత ఆదవోని ప్రభువు తన చక్రవర్తి గజపతిరుద్రదేవ మహారాజురీతిగా తానున్నూ అన్నమాంబికాదేవికి పురుషవేషం వేయించి వీరవిద్యలన్నీ నేర్పించెను.

అన్నాంబిక పొడుగరి, కోలమోము; మరీపెద్దకళ్ళు. నల్లపాపలలో ఏదో ఒక లోతు, ఏదో ఒక మహాప్రశ్న, ఏదో ఒక తీవ్రత, ఏదో ఒక గాఢమ ధుతనీలాకాశపథాల అప్సరసలలా నృత్యం చేస్తూఉంటవి.

తీర్చిదిద్దిన అవయవస్ఫుటత్వము, పసమిఎరుపుల వేణ్ణాతీరంలో దొరికే బంగారంవలె శరీరచ్ఛాయ. ఆ ఛాయకు పువ్వులోని పరిమళంలా యౌవనం ఒక అనన్యమోహనత్వం ఆమెకు ప్రసాదించినవి.

అశ్వం నడపడంలో అందెవేసినబంటు. ఎంతపొగరుగల గుఱ్ఱాన్నయినా, నిర్భయంగా స్వారిచేయగలదు. అన్నిగతులా నడిపించగలదు. అశ్వారూఢయై ఖడ్గ, పరశు, ధనుర్యుద్ధాలు చేయగలదు.

ఆమె కోలమోములో ఆ పెద్దకళ్ళుచూసి, ఈమె వట్టి పసిబిడ్డ అనుకుంటారు! కాని ఏదీక్షయినా పూనినప్పు డాకళ్ళు వెడల్పుతగ్గి ఇంకను పొడుగై చెవులవరకూ వ్యాపించినట్లయి, శాంతంగాఉన్న మానససరోవరం లోతులు ప్రళయఝంఝామారుతం వీచినప్పుడు పొందే భయంకరస్వరూపం పొందగలవు!

ఆదవోని ప్రభువు కోటారెడ్డిమహారాజు తన తదనంతరం తన కుమార్తెయే ఆదవోని సింహాసనం అధిష్ఠించాలని తన చక్రవర్తితోపాటు తానున్నూ ఆలోచించేవాడు.

ఆదినాల్లో ఆమె తాను బాలికన్నమాటే మరిచి మగరాయుడిలా తోటి మంత్రికుమారులు, సేనానాయకులబాలురు మొదలైనవారితో సమంగా కత్తిసాము, గుఱ్ఱపుస్వారి, ధనుర్విద్య నేర్చుకుంటూ వారందరినీ నిమిషంలో ఓడించేది. ఆ బాలిక బాలికయని రాజబంధువులకూ, ఉన్నత రాజోద్యోగులకూ తక్క మరి ఎవ్వరికీ తెలియదాయెను.

కాని అన్నమాంబకు ఈడువచ్చింది. శైశవము క్రిందటివసంతంలో కలిసి పోయింది.

ప్రభువు అన్నమాంబికను అంతఃపురవాసిని చేశాడు. “అమ్మాయీ! నా చక్రవర్తి ఏలాచేసినా చక్రవర్తిగనుక చెల్లుతుంది. నేను స్త్రీలు స్త్రీలుగా, పురుషులు పురుషులుగా ఉండాలన్న ధర్మాన్ని దాటి కొడుకులు లేనంతమాత్రాన స్త్రీని పేడి వానిలా మగవాడై సంచరించమనడం అపకీర్తి, అధర్మము రౌరవాదినరకహేతువున్నూ అవుతుందని నిశ్చయానికి వచ్చాను” అని ఒకనాడు అన్నాంబికాంతః పురంలో కుమార్తెతో అన్నాడు.

అన్నాంబిక తండ్రిభావాలు విని అత్యంతాశ్చర్యం పొందింది. ఎందుకు ఇంత విచిత్రంగా తండ్రి తన భావాలన్నీ మార్చుకొన్నాడు? లోకానికి అనేక విషయాలలో గురుపీఠము వహించిన శ్రీ శ్రీ గణపతి రుద్రదేవ మహారాజు మరణించగానే ఇంక భయములేదని, తన హృదయంలో ఉన్న ఉద్దేశాన్ని ఇపుడు బైటపెట్టినారుకాబోలు అని ఆమె కించపడింది.

ఆవెంటనే తన పురుషవస్త్రా లూడ్చినదాయెను. నిడుదయై జానువులవరకూ వేళ్ళాడే కేశభారాన్ని మూడుపాయల జడగావేసి, రత్నాలుపొదిగిన బంగారు కుప్పెలుగల నల్లటి పట్టుకుచ్చులు ధరించింది. తలపై మాణిక్యనాగాభరణము, వజ్ర నక్షత్రాభరణము, ముత్యాలపాపటబొట్టు, గోమేధిక చేమంతిపూవు ధరించింది. ఉత్తమ రాజకన్యోచితమైన కంకణ, కేయూర, హార, మేఖల, నూపురాది ఆభరణాలు తాల్చింది. బంగారు సరిగంచుల పూల నీలపుం బట్టుచీర, ఎఱ్ఱపట్టు కంచుకము మధ్యాహ్నవేళ; ఉదయం కాశ్మీరకుసుమపుచీర, గరుడపచ్చ కంచుకము; సాయంకాలము అరుణకాంతిచీర, బంగారుపచ్చకంచుకము ఆ యా వర్ణాలు శ్రుతిని పొందే వల్లెలున్ను ధరించుట ప్రారంభించినది.

చెంపలకు పుప్పొడి అద్ది చెలులు రచించిన కస్తూరి కుంకుమ మకరికా పత్రాదులు రత్నకర్ణికలతో వియ్యంపొందుతూ ఉండగా, ఆ బాల అరమూతల రెప్పలవెనుక తన అసంతృప్తి దాచుకొన్నదాయెను.

మొదటినుండీ ఆ బాలకు వివాహం ఇష్టంలేదు. బాలునివలె పెరిగిన ఆ బాల పురుషులు స్త్రీలకు పతులు అని ఆలోచించుకొనలేకపోయింది. తనతల్లి మొదలగు స్త్రీలు, తల్లులగుటకే ఉద్భవించారని ఆమె నమ్మకం.

కోటారెడ్డిమహారాజు తనకుమార్తె అన్నమాంబిక పితృభక్తి కలదని నమ్మకంకలవాడుకాబట్టే శ్రీ గోన లకుమయారెడ్డి మహారాజుకుమారులైన వర్ధమాన రాజ్య యువరాజులను వివాహం చేసుకోవలసిందని ఒప్పించారు. హృదయంలో వివాహానికే ఇష్టంలేని అన్నమాంబిక ఈవిధంగా తనకన్న రెండేళ్ళు మాత్రమే పెద్దవాడై, విక్రమంలో తనతోకూడా సాటిగా ఏమాత్రమూ నిలువలేని వరదారెడ్డిని వివాహం చేసుకొనడానికి ఏమాత్రమూ ఇష్టపడకున్నను తండ్రి బ్రతిమాలుటతో సరేనని ఒప్పుకొన్నది.

5

పెళ్ళిప్రయత్నాలన్నీ ఎందుకో తొందరగా జరిగాయి. అశ్వచారులు అతి త్వరితంగా శుభలేఖలు చుట్టాలకు అందిచ్చినారు. ఆదవోనినగరం అంతా సైన్యాలతో నిండింది. వీరనాయకులతో, దుష్టతురగరేఖారేవంతులతో నిండిపోయింది.

రేచర్ల వారు, విప్పర్ల వారు, మల్యాలవారు, కోటవారు, వెలనాటివారు, సాగివారు, చాళుక్ములవారు మొదలగు ఆంధ్రక్షత్రియవంశాలవారు వివాహానికి వచ్చి యుండిరి.

ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడే అన్నాంబికాదేవికి తెలుస్తూనే ఉండినవి. ఆమె తన వివాహాన్నిగురించి ఆలోచించడం మానివేసింది. తమ కులదేవత విశాలాక్ష్మీదేవి కృప ఎల్లాఉంటే అల్లాగే జరుగుతుంది అని నిస్పృహ చేసుకొని ఊరుకుంది.

ఆమెచేత ఏమేమి తంతు చేయించారో, ఆమె కేమీ గుర్తులేదు. తన్ను బంగారుస్యందనంలో ఎక్కించి కాండపటాలు చుట్టూపూన్చి చెలికత్తెలు రాగా, వివాహ వేదికలోనికి తీసికొనివచ్చారు దాసీజనులు అన్నదిమాత్ర మామె ఎరుగును.

ఇంతలో గన్నారెడ్డి గజదొంగ వచ్చాడు. అందరు గొల్లుమన్నారు. ఆ సమయంలో ఒక గంభీరస్వరం “ఆగండి” అని వినిపించింది. ఆ కేకలో ఎనిమిది బారుల నిశితత్వంఉంది. ఆ కేకలో పదహారు ఉరుముల మహానాదముంది. ఆ కేకలో సప్తసముద్రాల లోతులున్నాయి.

చెలికత్తెలు గజగజ వణుకుతూ ఆగిపోయినారు. స్యందనంలోనుండి అప్పుడన్నమాంబిక ఒక కాండపటము ప్రక్కకు ఒత్తిగించి ఆ కేకవేసిన మహాపురుషుని చూచినదాయెను. ఆ సమయములోనే ఆ పురుషుడును తన్ను చూచు మంచుశిఖరాల మధ్య నిలిచిఉన్న అపరాజితాదేవి మోమువలె తెరల మధ్య కాన్పించిన వధూ వదనము వీక్షించెను.

వారిరువురి చూపులు ఏడుక్షణములకాలం ఒకదాని నొకటి ఎదుర్కొని, సంధించి, కలిసిపోయినాయి. ఎవరుముందు కంటిరెప్పలు వాల్చినారో వా రిరువురకూ తెలియదు. ఇంతలో తండ్రిగారి ఆజ్ఞవల్ల చెలులు రాజకుమార్తె స్యందనం, మహారాణి అంతఃపురంలోనికి తీసుకొనిపోయినారు. అతడు గజదొంగా? అతడేనా గోన గన్నారెడ్డి? ఆనాటి పెళ్ళికొడుకున కాతడు పెదతండ్రి కుమారుడా? ఆమె చిరునవ్వు నవ్వుకొన్నది.

మహారాణి అంతఃపురంలో రత్నకంబళ్ళపై నున్నదంతపీఠికలపై అధివసించి ఉన్న రాజస్త్రీలు పెళ్ళికుమార్తె పల్లకి మహారాణి సింహపీఠిదగ్గర దింపగానే ఒక్కసారిగా లేచినిలిచిరి. ఆ తెరల్లోంచి అన్నాంబికాదేవి ఈవలకురాగానే, మహారాణి కూతురుకడకు రెండంగలువేసి, కుమార్తెను గట్టిగా కౌగిలించుకొన్నదాయెను.

“నా తల్లి! ఆ రాక్షసుని కంటపడలేదుకదా! దిష్టితీయించవలె” అని ఆ తల్లి కన్నుల నీరు నింపుకొన్నది.

అవరోధజనం వివాహం చూడటానికి నిర్మింపబడిన ప్రతిసీరల మరుగున నున్న మేడవసారాలలోనున్న స్త్రీజనమెల్ల ఆ గజదొంగ వచ్చిన గడబిడలో అడలిపోయి, మహారాణి మందిరంలోకి పరుగునవచ్చి వ్రాలెను. వాళ్ళందరూ మువ్వన్నె మెకము అడవి సొచ్చినప్పుడు, కురంగీలోకం వణికిపోయినట్లు వణికిపోయారు. ఏట్రింత చెట్టుమీద వాలినప్పు డా చెట్టున నివసిస్తూన్న పులుగు పడతులు భయచకిత కలకలరావాలు సలిపినట్టు ఆ రాచనెలతుక లందరూ గోలు గోలుమనిపోయిరి.

ఆ అదటు ఇంకనూ తీరనేలేదు. రాకొమరితను అచ్చటికి దాసీలు తీసుకురాగానే ఆ అంగనలందరూ కళ్ళ తడిపెట్టుతూ అన్నాంబికాదేవిచుట్టూ చేరారు.

అన్నాంబిక వారందరూ ఆశ్చర్యంలో మునిగిపోయేటట్లుగా చిరునవ్వు నవ్వుతూ ప్రక్కనున్న ఒక చెలితో “అందరినీ కూర్చోపెట్టవే” అన్నది.

ఇంకొక చెలిచెవిలో మరియేమో ఊదినది. అప్పుడు పదిమంది దాసీలు పరుగిడి రాజకుమారి వీణవాయించుకొంటూ అధివసించేపీఠము, దిండ్లు, వీణియ తెచ్చిరి. అన్నాంబిక ఆ పీఠముపై అధివసించి, వీణ ధరించి, మండలేశ్వరుల భార్యలు, సేనాపతుల భార్యలు, మంత్రి సామంతుల భార్యలు, వారి వారి బాలలు, ఆశ్చర్యంతో చూస్తుండగా, తీగలుసవరించి సారెలుబిగించి, పేరంటము సమయములో ముత్తైదువరాండ్ర నలరించుటకువలె నిట్లు పాడెను.

“విరిసినవి కుసుమాలు దరిసినవి వర్ణాలు
కురిసినట్టీ దివ్యపరిమళము జాడలో!
తోట వెలుపల అడవి తోటలోపల మడవ
తోటలో విహరించు తొలిగాలి కే దారి?”

ఆ పాటలోని భావము ఎవ్వరికీ అర్థంకాలేదు. వారందరూ ఒకరిమొగ మొకరు చూచుకొనిరి.

ఆంధ్రస్త్రీలు సుందరులు. వారు సన్ననికౌనుగలవారు. దీర్ఘ నీలకుంతలలు, పుష్పాలంకారప్రియులు, సరిగలతలు, కుట్టిన చీరలు నానావర్ణాలవి ధరింతురు. కస్తూరితో, చందనంతో, పునుగు జవ్వాజులతో, కుంకుమపూవుతో పాటలవర్ణ విరాజిత పీనవక్షోజములపై మకరికాదిపత్రాల రచియింతురు. పద్మాలవలె ఎఱ్ఱనైన తమ పాదాలకు లత్తుకరంగుతో లతలు రచింతురు. మనోహరంగా విన్యసింపబడిన వివిధభూషణాలను ధరింతురు. యవ్వనవతులగు బాలికలు తమ వక్షోజాలను మరుగుపరచరు. వివాహంకాగానే పట్టుకంచుకాలు ధరిస్తారు.

ఉదయారుణకాంతిలా కోలమోములవారు, చంద్రబింబాలులా గుండ్రని మోములవారు, నల్ల కలువపత్రాలులా కాటుకకన్నులవారు, చకోరాలులా వాలు గన్నులవారు, పద్మములులా విశాలాక్షులు, అరమూతల మదిరాక్షులు, చూపులలో ఆర్ద్రత ఒలికించే కామాక్షులు, గన్నేరు మొగ్గలవంటి సమనాసికలవారు, నువ్వు పువ్వులవంటి ముక్కుపుటాలవారు, చిరువంపునాసాగ్రంకల చిలుకలకొలుకులు, ఇరికపళ్ళవంటి ఎఱ్ఱటిపెదవుల చిన్ననోరులవారు, విలువంపుతిరిగిన తేనెపెరవంటి అధరోష్ఠాలవారు, సముద్రతీరాలవంటి సెలయేటినడకలవంటి కనుబొమలవారు, తామరపూరేకులవంటి చెంపలుకలవారు, మామిడిపళ్ళవంటి చిబుకములవారు, లతల వంటి చంద్రకిరణాలవంటి చేతులుకలవారు, మందారమొగ్గలవంటి పడుచువారల కోర్కెలవంటి అంగుళులుకలవారు, లేతపొన్నమొక్కలలా ఊగే సన్ననికౌనులవారు, ఠీవికలవారు, ప్రేమకలవారు, చదువుకొన్నవారు, ఆకాశమునుంచి ఒలికే ఒడగండ్లవంటి స్వచ్ఛశీలంకలవారు, ఉషస్సువంటి, రాకాపూర్ణిమవంటి, లోతైన మంచినీళ్ళ చెరువువంటి, కమలములతో నిండిన చెరువునుండి వుదయంలో వచ్చే పరిమళంవంటి సౌందర్యంకలవారు ఆంధ్రసుందరాంగులా మందిరములో వారికి తలమానికమైన అన్నాంబిక ఆ వల్లకిపై పలికించే మనోహర గాంధర్వము వింటూ, గణపతి రుద్రదేవమహారాజు నిర్మించిన గుడిలోని ఉత్తమ శిల్పసుందరులులా సుందరభంగిమలు తాల్చినవారయిరి.

“మరలినవి చీకట్లు వరలె పులుగులపాట
 సురలతాంగి ఉషస్సు అరుదెంచె తూర్పులో
 మావిలో పికియోర్తు ఏవియో స్వప్నాల
 కావిరంగుల చిగురు తావులను మూర్కొనదు”

ఈ చరణాలు ఆ వనితాలోకానికి అగమ్యగోచరాలే అయినవి. ఏదియో మధుర ప్రపంచంమాత్రం వారికి దృశ్యాదృశ్యంగా గోచరించింది.

అన్నాంబిక నిట్టూర్పువదలి తన పీఠంమీదనుండి లేచింది. చెలికత్తెలు దారిచూప మహారాణియు, వధువును అభ్యంతరగృహాల కేగిరి. బంధుకాంతలందరు వారి వారి విడుదులకు వెళ్ళిపోయిరి.

తల్లీ కూతుళ్ళిద్దరూ అలంకారమందిరంలో ఆసనాలపై అధివసించగానే అన్నాంబిక సవిచారంగా తల్లినిచూచి “అమ్మగారూ! విడిపోయిన పూలరేకులు అతికించలేము. విఱిగిపోయినపాలు మరి తోడుకొనవు. ఈ పెండ్లి దైవవశాన చెడటం మేలే అయింది. ఎత్తుకుపోబడిన మనుష్యులు మరల దొరికినా, మళ్ళీ శుభముహూర్తం పెట్టవలసినపనిలేదు” అన్నది.

మహారాణి కుమార్తెను చూచి “అవునుతల్లీ! నాకూ మొదటనుండి ఈ సంబంధం ఇష్టములేనిదే ! పురుషుల రాజకీయాలలో మనజోక్యం ఎందుకు అని ఊరుకున్నాను!” అని నెమ్మదిగా పలికింది.

“అమ్మా! ఈ కర్కశ యుద్ధరాజకీయాలకోసం స్త్రీలను పణముపెట్టి జూద మాడటం ధర్మమా చెప్పండి?” అన్నది.

మహారాణి లేచివచ్చి ఆ బాలికను తన హృదయాని కద్దుకొన్నది. ఆమె కనుల్లో సుడిగుండాలులా నీరు తిరుగుతున్నది.

ఇంతలో దాసి ఒక్కరిత పరుగునవచ్చి, మహారాజుగారు వస్తున్నారని చెప్పింది. మహారాణియు, అన్నామాంబికయు లేచి నిలిచిరి. మహారాజు లోనికి వచ్చినాడు. తల్లికూతుం డ్రిద్దరూ ఆయనకు నమస్కారం చేశారు.

మహారాజు తానొక పీఠం అధివసించి, కుమార్తెను దగ్గరకు చేరదీసుకొని, “తల్లీ, గన్నారెడ్డి రాక్షసుడు!” అన్నాడు.

ఎవరూ మాట్లాడలేదు.

మహారాజు: మన సైన్యాలుకూడా అ దొంగలదండుకోసం పెండ్లికుమారునికోసం వెతుకుతున్నారు. దొంగలను ఓడించి వరదారెడ్డి మహారాజును త్వరలో తీసుకువస్తాము. ఈలోగా జ్యోతిష్కులు, పండితులు, కులగురువులు, పెద్దలు త్వరలో ఇంకొక ముహూర్తము ఉందేమో చూస్తున్నారు.

అన్నాంబిక: నాయనగారూ! ఒకసారి చెట్టునుంచి రాలినపండు మళ్ళీ చెట్టుమీదికిపోదు. గాలివానకు విరిగినచెట్టు మళ్ళీ బ్రతుకలేదు!

మహారాజు: అంటే నా తల్లి ఉద్దేశం?

మహారాణి: పోయిన ముహూర్తం పోనేపోయింది. తప్పిపోయిన సంబంధం భగవంతుని దివ్యేచ్ఛవల్లనే అలా జరిగింది. మళ్ళీ రాయబారాలూ వద్దు, ముహూర్తాలూ వద్దు.

మహారాజు: అమ్మాయీ?

మహారాణి: అమ్మాయి ఇష్టమే తమకు తెలియజేస్తున్నా.