గోన గన్నారెడ్డి/ద్వితీయగాథ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ద్వితీయగాథ

కుట్ర

1

త్రైలింగ మహాసామ్రాజ్యానికి చక్రవర్తియై, మహాజగనాథక్షేత్రం నుండి చిదంబరక్షేత్రం వరకున్నూ శివకేశవులకు అభేదం కల్పించి, తూర్పు సముద్రం కెరటాలు పశ్చిమసముద్రం తరంగాలతో సంగమంచేయించి, సమధిగత పంచమహాశబ్ద, మహామండలేశ్వర, పరమమాహేశ్వర, అనుముకొండపురవరాధీశ, వరనారీసహోదర, ఆదిచోడకటకచూరకార, మన్నియబెండకార, విభవదేవేంద్ర, మూరురాయ జగదాళ, విదితవిక్రమశీల, సత్యహరిశ్చంద్ర, శ్రీ స్వయంభూ దేవర దివ్యశ్రీ పాదపద్మారాధక, వితరణకర్ణ, ఆశ్రితపోషక, శరథిశశౌర్యమందర, పరబలసాధక, ప్రత్యక్షప్రమథగణావతార, లాటకటకచూరకార, కదనప్రచండ, చలమర్తిగండ, చతుస్సముద్రముద్రాధికార్జితకీర్తి, సప్తమచక్రవర్తి, ఆదిరాజ చారుచరిత్ర, సుజనైకమిత్ర, సుస్థిరనిజరాజాన్వయనామాది సమస్తప్రశస్తిసహితులై మహావైభవంగా రాజ్యం ఏలుతున్న శ్రీశ్రీ కాకతీయ గణపతిరుద్రదేవ చక్రవర్తికి వృద్ధాప్యం వచ్చింది.

శ్రీ శ్రీ చక్రవర్తి ఆజ్ఞప్రకారం ఆయన పెద్దకుమార్తెను పురుషవేషంతో మహాసామ్రాజ్యానికి యువరాజుగా అభిషేకంచేసి స్వామికార్యదురంధరులై శ్రీ ప్రతాపనాయనింవారున్నూ, శ్రీ మండలేశ్వర మాణిక్యం, సర్వసేనాధ్యక్షులు మురారినారాయణ. చలమర్తిగండ, గండపెండేర, రక్కెసగంగ, సిద్ధయదేవ, తలగొట్టగండ, గణపతిరుద్రదేవచరణనళిన యుగళ సమారాధన, మాండలిక బ్రహ్మరాక్షస ఇత్యాదిమహాబిరుదాలతో బాహత్తరనియోగి, మహావీరుడు వృద్ధుడు శ్రీ జన్నిగదేవసాహిణి మహారాజులుంగారున్ను, మహామంత్రి అఖండరాజ్య తంత్రజ్ఞుడు, ఉభయభాషల్లో పండితుడు, పురుషార్థసార మహానీతిగ్రంథ నిర్మాత అయిన శివదేవయ్య మహాసచివులవారున్నూ, రాజభక్తిపూరితులైన మండలేశ్వరు లనేకుల సహాయంతో రాజ్యంలో రాజద్రోహంలేకుండా కాపాడుతున్నారు.

శ్రీ గణపతిదేవచక్రవర్తికి పశ్చిమాంధ్ర ప్రతినిధిగా వర్ధమానపురం రాజధానిగాచేసికొని, మానువనాటి విషయానికి గోన లకుమయారెడ్డిసాహిణి మహారాజులంవారు అన్నగారివెనుక ఆయనకుమారునిపరంగా రాజ్యంచేస్తూ చక్రవర్తికి నమ్మకమైనబంటై, చక్రవర్తి సేనల్లో సేనాపతియై, అశ్వసాహిణియై, సమ్రాట్టు ఆజ్ఞాప్రకారం కుంతలదేశంలోనికి సేనల్ని చొప్పించుకొనిపోయి కల్యాణపుర యాదవరాజ్యప్రతినిథుల్ని ఓడించి, వాతాపినగరం పట్టుకొని ఆంధ్రసామ్రాజ్యము పశ్చిమానికి చాలా విస్తరింపజేసెను. ఆదవోని మండలేశ్వరుడైన శ్రీకోటారెడ్డి దేవర మహారాజులుంగారున్నూ చాలా సహాయంచేసిరి.

శ్రీ శ్రీ గణపతిదేవమహాచక్రవర్తి యువతి అయిన తన పెద్దకుమార్తెను పురుషవేషంతో శిఖండిలా మహారాజుగా యువరాజ్యభారం వహింప చేసేటప్పటికి లకుమయారెడ్డికి కోపం మిన్నుముట్టింది. డెబ్బదియేండ్ల వృద్ధుడైన ఆ మహాభిమానికి ఆడదాని చేతి కూడు తినడం వీరపురుషులకు తలకొట్టినట్లే అనిపించింది. తలుచుకొన్నకొద్దీ కోపం గాలివాననాటి మేఘంలా పెరిగిపోతోంది. చేవతప్పని అతని వీరరూపం వణికిపోయింది. రుద్రమదేవిని సింహాసనంమీది నుంచి లాగివేసి వంటయింటిలోనికి పొమ్మందామని అనుకున్నాడు.

అయితే శ్రీ శ్రీ గణపతిరుద్రదేవ చక్రవర్తులవెనక సామ్రాజ్యానికి సింహాసనం ఎక్కించడం ఎవరిని? హిమాలయశిఖరం నుంచి గంగాదేవివలె వీపున ప్రవహిస్తూఉన్న ఆతని తెల్లనిజుట్టున్ను, బవిరిగడ్డమూ ఊగిపోయాయి. ఆ మహా సమ్రాట్టుకు కొడుకులేడు. చివరకు దౌహిత్రుడన్నాలేడు. ఆడుది రాజ్యం చేయుటా? అర్జునుణ్ణి జోహారనిపించే ఈ వీరపురుషులూ, మహారాజులూ ఆడుదానికి జోహారు చేయుటా? తమ తమభావాలు తెలుపవలసినదిగా మండలేశ్వరులకడకు తాను పంపిన తన ద్వితీయసచివుడు చిన్నయామాత్యుడు పొత్తపినాండు విషయ మహా మండలేశ్వరుడు, బేడచెలుకిరాయడు, ఆదవోని మహామండలాధిపుడు కోటారెడ్డి పూగినాటి విషయాధిపతి కోట పేర్మాడిరాయడు, కందవోలు రాజ్యాధిపతి వంది భూపాలుడు యావన్మందిన్నీ ఈ ఆడది రాజ్యం చేయడం ఇష్టంలేదన్నారని వేగు తెచ్చాడు.

“ఇక ఆవల వీరావతారుడైన జన్నిగదేవుడు, ప్రతాపనాయుడు, అసాధ్యుడు చాణక్యుడులాంటి శివదేవయ్యమంత్రీ ఉన్నారు. వాండ్లకు మడపల్లె దుర్గాధిపతి, పల్లవనాటిరాజు, వెలనాటిప్రభువు, వేంగీరాజ్యాధిపతీ బాసటగా ఉన్నారు. చక్రకోట్యమండలం, కమ్మనాడు, మేడిపల్లి కాచయనాయుడు - ఆ ప్రభువులంతా బెల్లంకొట్టినరాళ్ళులా ఊరకొన్నారు. వీలయితే తిరగబడి తమ రాజ్యాల్ని స్వతంత్రం చేసుకోవాలనీ, లేకపోతే మేము రాజభక్తిపూరితులము అని చెప్పాలనీ, ఎవరిమట్టుకు వారికి సమ్రాట్టు అవుదామనీ ఉందనుకుంటాను” అని చిన్నయామాత్యుడు మహారాజుతో చెప్పినాడు.

“ఆదవోని మహారాజు మహాబలవంతుడు. కర్ణాటరాజు భల్లాణ భూపతిని నాలుగుసారులు ఒక్కడే ఓడించా డా ప్రభువు. ఆ మహారాజుకుమార్తె అన్నమాంబాదేవి చాలా అందమయినది. యువరాజులవారికి ఈడు. ఈ రెండు రాజ్యాలు ఏకమైతే రుద్రమదేవికి బలం ఎక్కడ? ఆదవోనివారికి దగ్గరచుట్టాలే కందవోలు రాజ్యాధిపతులు” అని ముఖ్యమంత్రి రుద్రయామాత్యులవారు సెలవిచ్చారు. “యాదవమహారాజు దేవగిరి కృష్ణభూపతి వృద్ధుడైనాడు. ఆయన కుమారుడు యువరాజు ఆంధ్రదేశముపై కన్నువేసి ఉంచారు. బద్ధశత్రువులైన ఆంధ్రుల రాజ్యము యావత్తూ కబళించి తానే సమ్రాట్టుఅయ్యే ప్రయత్నాలు చేస్తూవున్నాడని వేగు” అని సేనాధిపతి కామయరెడ్డిసాహిణి వాక్రుచ్చాడు.

ఆదవోని వర్ధమాన మండలేశ్వరులకు రాయబారాలు జరిగినవి. సంబంధము నిశ్చయమయింది. ఇద్దరు ప్రభువులు కందవోలు ప్రభువును, ఇందునగర మహామండలాధిపతియున్నూ చేరి యాదవయువరాజు మహాదేవరాజుకు శ్రీ గణపతి రుద్రచక్రవర్తి లింగైక్యంకాగానే వేగుపంపించి రప్పించుటకున్ను, రుద్రాంబను తక్తుమీదనుండి లాగివేయుటకున్ను, యాదవుడు తన రాజ్యం చేరగానే వీరందరున్నూ తిరుగబడి స్వతంత్రం అనుభవించుటకున్ను ఏర్పాటు చేసికొన్నారు.

వృద్ధుడైన లకుమయారెడ్డిప్రభువు పూనిన పనిని అతి పట్టుదలతో నిర్వహింపగలిగే సాహసి. రహస్యంగా చారులను పంపి, ఓరుగల్లులో సైన్యాల విషయము వేగు తెప్పించుకున్నాడు. ఓరుగల్లును దేవగిరి యాదవదేశ మహారాజు ముట్టడిస్తే కోట ఏదెస నీరసంగా ఉండును, ఎక్కడనుంచి ముట్టడి సాగింపవచ్చును అనే విషయాలు పూర్తిగా తెలుసుకున్నాడు.

రహస్యాలోచనమందిరంలో అతడు ముఖ్యసచివునితో, సేనానితో మంతనం జరిపే సమయంలో లకుమయాధీశుని ముఖ్యచారులలో ఒకడు ప్రభువు అనుమతితో లోన ప్రవేశించి మహారాజుకు సాష్టాంగ నమస్కారములు చేసినవా డాయెను. ఆ తరువాత మహారాజుం గనుగొని “మహాప్రభూ! హరిహరదేవ, మురారిదేవుల ఆప్తసచివులు మారయమంత్రులు వచ్చి మహారాజు ఆజ్ఞకోసం నిరీక్షిస్తున్నారు” అని విన్నవించాడు.

2

మారయమంత్రి రహస్యాలోచన మందిరంలోకివచ్చి, ప్రభువు లకుమయారెడ్డికీ, మంత్రులకూ నమస్కారంచేసి ఆసనమం దధివసించెను.

“మహారాజా! మా ప్రభువులు హరిహరదేవుడు, చిన్నప్రభువులు మురారి దేవులు, పరు లెరుగకుండానున్ను, అసాధ్యులైన ప్రసాదాదిత్యనాయకులు ఏమాత్రమూ గ్రహింపలేకుండా ఉండేటట్లుగానూ, శివదేవయ్యమంత్రిగారి దూర శ్రవణాది మాయోపాయాలకు చిక్కకుండా ఉండేటట్లుగానూ సర్వ సన్నాహాలు చేస్తూఉన్నారు” అని మారయమంత్రి మనవిచేశాడు. లకుమయ: హరిహరదేవులే కాకతీయమహారాజ్యానికి నిజమైనవారసులు. కాకతీయ మహరాజాధిరాజులైన రుద్రదేవచక్రవర్తి యాదవరాజుతో యుద్ధాలుచేసి దేవగిరిపై దండెత్తి వెళ్ళినప్పుడు, ఒక మహరాష్ట్రకన్యను వలచి, గాంధర్వ వివాహమై అనుమకొండ తీసుకువచ్చారు. ఆ దేవికి హరిహర మురారిదేవుల తండ్రి సారంగధరదేవుడు ఉద్భవించాడు. రుద్రదేవమహారాజు దేవేరికి పుత్రులు లేనందున కాకతీయ సామంత మండలేశ్వర మహాసేనాపతులు, మహామండలేశ్వరులు గాంధర్వవివాహజనితులైన సారంగదేవులను కాకతి సింహాసనం ఎక్కించక, మహదేవరాజునే ఎక్కించారు. మహదేవరాజుప్రభువు కాలధర్మం పొందగానే రేచర్ల రుద్రసేనాని గణపతి రుద్రదేవమహారాజును సింహాసనం ఎక్కించెను. సారంగదేవప్రభువు అన్నగారగు గణపతిదేవ మహాచక్రవర్తిని, భక్తితో ప్రేమతో కొలిచి, ఇప్పటికి మూడేళ్ళక్రితం లింగైక్య మందినారు. గణపతి రుద్రదేవులు ప్రేమతో కొలనుపాక విషయం పాలనకు ఇచ్చి అచ్చటినుండి, ఉత్తర రాజ్యం గోదావరీతీరం వరకూ పాలిస్తూ ఉండడానికి తమ్మునికి అనుమతి ఇచ్చినవారు. ఇప్పుడు శ్రీ గణపతి రుద్రదేవచక్రవర్తికి స్వస్థత లేకున్నదాయెను. ఆయన రుద్రదేవచక్రవర్తి అన్న నామంతో నిరుడు శాలివాహనశకం 1182 రౌద్రి సంవత్సర మాఖమాసంలో తన కుమార్తెను చక్రవర్తి సింహాసనం ఎక్కించారు. అప్పటినుండీ హరిహరదేవ మురారిదేవులకు చాలా కష్టంగా ఉన్నదని వింటున్నాము.

మారయమంత్రి: ప్రభూ! తాము నిజం తూ. చ. తప్పక, సర్వం గ్రహించారు. పురుషునకే రాజ్యార్హత ఉంది. ఏధర్మశాస్త్రంలోనూ స్త్రీ పైతృకమైన రాజ్యానికి అర్హురాలు కాదు. హరిహర మురారిదేవుల తండ్రి తన అన్నగారికి తన కొడుకులలో ఒకరిని పెంచుకోమని మనవిచేసి ఉన్నా, చక్రవర్తి వినడాయెను.

రుద్రమమంత్రి: అదంతా బలగర్వం మారయమంత్రిగారూ! నిజంగా ఆలోచిస్తే కాకతీయ మహారాజ్యం నిలిపింది రేచెర్ల వారూ, మల్యాలవారూ, గోన వారూకదా! తూర్పున నతనాటిసీమలో, కొండతూరుపు, కొండపడమటిసీమలలో పలనాడు విషయంలో, పాకనాడు, వెలనాడు, వేంగీవిషయాలలో కాకతీయులను కాపాడుతున్నది చాళుక్యులు, వెలనాటి చోడులు, కోటవారు, సాగివారు, కాయిస్థులూ కదా! అయినా, పెద్దలను రప్పించి కుమార్తె విషయమై ఆలోచించినవాడు కాడాయెను. అది చక్రవర్తి చేసిన మహాదోషము. స్త్రీ పరిపాలన చేయదలచుకొంటే చిన్నబిడ్డలకు సంరక్షకురాలుగా చేయాలి. అంతేగాని ధర్మం అడుగంటచేస్తే ధర్మాభిరతులైన సామంతులు ఊరుకోవలసిందేనా? అని మహారాజులవారు ఆలోచిస్తున్నారు. మారయ: చిత్తం! వేనుని చరిత్ర మనం ఎల్లా మరచిపోగలం? కాబట్టి మా ప్రభువు హరిహరదేవులు న్యాయంగా రావలసిన తమరాజ్యం తమ కిప్పించ వలసిందని తోటి మండలేశ్వరుల నందరినీ హెచ్చరిస్తున్నారు.

లకుమయారెడ్డి: మారయప్రెగ్గడవారూ! తాము చెప్పినది మాకు నచ్చినది. తమ ప్రభువులకు బాసటగా నిలిచే ఇతర సామంతు లెవరు? ఎంతమంది?

మారయ: ప్రభూ! రేనాటిలో శ్రీపతిప్రభువు, సకిలి ఎరువలో గణపతిసాహిణి మనకు మాట ఇచ్చారు. వారు అంబయదేవుని తుదముట్టిస్తారు. విజయగండ గోపాలుడు కమ్మనాటిలో, ఎరువమాను మిలిదేవరాజు పాకనాటిలో, పొత్తపినాటిలో సిద్ధయ చోడరాజు హరిహరదేవ మహాచక్రవర్తికి సహాయం చేసితీరుతామనీ, త్రిపురాంతక, జన్నిగదేవులను నాశనం చేస్తామనీ మాటయిచ్చారు. గుంటూరులో నాగదేవరాజు మా ప్రభువుకు సర్వసహాయం చేయడానికి మాట పంపించారు.

లకుమయారెడ్డి లేచి మారయమంత్రివరునకు రుద్రయామాత్యులవారు ఆతిథ్యం నెరవేర్పవలసిందనియు, శ్రీ హరిహరదేవ ప్రభువుల పక్షాన మారయామాత్యులు, తమ పక్షాన రుద్రయామాత్యులు అగ్నిప్రమాణ మైత్రి నెరవేరపవలసిందనిన్నీ చెప్పి తమ అభ్యంతరమందిరంలోకి వెళ్ళిపోయినారు.

లకుమయారెడ్డి లోనికిబోయి దాసీజనసహాయంతో మళ్ళీ స్నానం చేసిన వారై, శుభ్రవస్త్రాలు ధరించినవారై, పూజాపీఠంముందు కూర్చుండి విష్ణుపూజ నెరవేరుస్తుండిరి. గోనవారు అద్వైతులు, విష్ణుపూజాపరులు, గోనలకుమయారెడ్డి తాతగారు బుద్ధమహారాజు పశ్చిమచాళుక్యులకు సామంతుడుగా భువనగిరిదుర్గంలోఉండి పరిపాలనం చేసే రోజుల్లో బౌద్దమతము స్వీకరించినాడు. ఆయన కుమారుడు గోన క్షేమరాజు వైష్ణవం స్వీకరించి రంగనాథ నామం స్వీకరించి, బుద్ధదేవుడు విష్ణువునకు తొమ్మిదవ అవతారమని నమ్మి తన పెద్దకుమారునకు బుద్ధారెడ్డి అనిన్నీ, చిన్న కుమారునకు లకుమయ అని లక్ష్మణదేవర పేరు పెట్టుకోన్నాడు.

లకుమయకు భగవంతునిపై హృదయము లగ్నముకాదు. అతడు ఎంతో కళవళపడుచుండెను. ఎనుబదిఏళ్లు నిండిన గణపతిదేవ సార్వభౌముల పండువంటి రూపము ఎదుట ప్రత్యక్షమవుతున్నది. శ్రీకృష్ణదేవునికున్నట్లు అష్టభార్యలున్నా చక్రవర్తికి ఒక్క బాలుడైనా కలుగలేదు. పట్టపుదేవి సోమాంబామహారాణికి ఇద్దరు బాలికలు ఉద్భవించారు. వారైనా ఆయన ఏభైతొమ్మిదోయేటా, అరవై రెండవయేటనూ ఉద్భవించారు. జాయపసేనాని అక్కలు నారాంబా, పేరాంబాదేవులకు ఇరువురకూ సంతానమే లేదు. ఈ ఆలోచనలను లకుమయ దూరంగా తోలి తాను పూజించే చెన్నకేశవుని మరలమరల తలపోస్తూ ఉన్నాడు కాని ఏమిలాభము? మనస్సు నిలువ దాయెను.

తన అన్నగారూ డెబ్బదిఏండ్లు బ్రతికి చనిపోయి పదేళ్ళయినది. అప్పటికి అన్నకొడుకులు, గన్నయ్య, విఠలయ్యాను చిన్న బాలకులు. వారి అక్క కుప్పసానమ్మను మాల్యాల గుండయ్యప్రభువుకు వివాహం చేశాడు తన అన్నగారే.

గన్నయ్య ఈలా గజదొంగ అవడం ఏమిటి? తానూ పాడయ్యాడు, తమ్ముణ్ణీ పాడుచేసుకొన్నాడు. గోనవంశానికి తీరని కళంకమే. అయితే ఏమి? అలాంటి కళంకాలు వస్తూనే ఉంటాయి. వీళ్లు అలా గజదొంగలు కావడం మంచిదే. తన మనస్సులోని శంకలన్నీ మాయమయ్యాయి.

ఇంక వివాహం సంగతి. ఆదవోనివారికి మళ్ళీ వేగుపంపించి ముహూర్తం నిశ్చయంచేసి నగరంచుట్టూ రక్కసిమూకలలాంటి సైన్యాలు కాపుంచి, వివాహం పూర్తిచెయ్యాలి. అప్పుడు ఇటా, అటా అని ఊగులాడే కోటారెడ్డి ఈ ప్రక్కకు వచ్చివేయడం జరుగుతుంది.

హరిహరదేవునికి చక్రవర్తిత్వమట! ఎవరిస్తారయ్యా! హరిహరదేవుడు యుద్ధంలో ఆరితేరిన బంటుకాకున్నా ప్రస్తుత కార్యవ్యవసాయానికి ఆతడు మంచి నాగలి కాగలవాడు.

రుద్రమదేవి తెలివైనది. ఆమెకై చాళుక్య వీరభద్రుడు నిట్టూర్పులు విడుస్తున్నాడు. కాని తాను పురుషుణ్ణంటుంది. పురుషుడని ఆ బాలికకు పెళ్ళికూడా చేశారు ముమ్మడమ్మను. ఇప్పుడు ముమ్మడమ్మస్థితి ఏమిటి? ఆమెను రుద్రమ్మ ఏమిచేస్తుంది? గణపతిరుద్రప్రభువు తక్కిన సామంతులతోపాటు మూడు నెలల క్రిందట తమ్ము పిలిచినమాట నిజమే. అప్పుడు తన కుమారుడైన రుద్రదేవునియెడ మేమందరము రాజభక్తి కల్గిఉండాలని మాచేత వీరప్రమాణాలు చేయించుకున్న మాట నిజమే. అయితే రుద్రమదేవి రుద్రదేవుడయినగదా, తమ ప్రమాణం నిలిచేది? వృద్ధచక్రవర్తికి మతిపోయింది. మొన్న వివాహ ముహూర్తానికి ‘సమధిగత పంచమహాశబ్ద, మహామండలేశ్వర, పతిహితచరిత, వినయవిభూషణ శ్రీహనుమకొండ పురవరాధీశ్వర, చలమర్తిగండ, మూరురాయజగదాళ!’ అనే బిరుదాలతో రుద్రమ్మ తండ్రీ తానూ చక్రవర్తులయినట్లు బహుమానాలు పంపించినది. ఓహో, ఆడవాళ్ళచేతలు!

తనకు రుద్రమ్మపై కోపము లేదు కోపమేమీలేదు. ఆడదానిపై కోపమేమిటి? ఆమె పూతనా, తాటకా, శూర్పణఖా? ఆమెను ఏ చాళుక్యునకో, ఏ ఇతర మహామండలేశ్వరునకో ఇచ్చి వివాహంచేసి పంపించి వేద్దాముగాక.

లకుమయకు మనస్సు నిలువదు. “ప్రభూ! రక్షించు. ఈదుర్బర రాజధర్మాలు భక్తుల మనస్సులుకూడా పాడుచేస్తాయి” అనుకొంటూ పూజపూర్తి చేశాడు.

3

ఓరుగల్లులో, రాచనగరులున్న లోపలికోటలో, అంతా నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నది. వృద్ధులయిన శ్రీ శ్రీ గణపతి రుద్రదేవ చక్రవర్తి తన సౌధ నగరిలో, స్వయంభూదేవారాధనతత్పరుడై చల్లగా కైలాసేశ్వర పాదపద్మారాధనకై ఈ దేహం చాలించి ఎప్పుడావెళ్ళడము అని నిరీక్షిస్తున్నారు.

అత్యంతావసరమైతేగాని తమతో రాజ్యవిషయాలు చర్చింపవద్దని చక్రవర్తి ఆజ్ఞచేశారు. మహామంత్రులైన శివదేవయ్యదేశికేంద్రులు శివమాహాత్మ్యం, శైవ వేదాంతం వినిపిస్తూ ఉంటారు. మహాకవు లనేకులు తమ తమ రచనలు వారికి చదివి వినిపించి, ఆ సార్వభౌములవల్ల బహుమతులు, అగ్రహారాలు, ధనరాసులు పొందుతూ ఉంటారు.

కవిబ్రహ్మ, వుభయకవిమిత్రుడు సింహపురాన్నుంచి తాను రచించిన ఆంధ్ర మహాభారత పర్వాలు, ఆశ్వాసాలు ఎప్పటికప్పుడు ఆంధ్రసార్వభౌముని కడకు పంపిస్తున్నారు. అవి పంపించడం ప్రారంభించి మూడుసంవత్సరాలైనది. విరాటోద్యోగములు, భీష్మ ద్రోణపర్వములు పూర్తిఅయినవి. చక్రవర్తి శ్రీ తిక్కకవి సోమయాజి దివ్యకవితామృతంలో ఓలలాడుచూ ఎప్పుడు తదితర పర్వాలూ వస్తాయా అని ఎదురుచూస్తూవుండెను.

ఒక వుదయమున సార్వభౌమునికడకు శివదేవయ్యమంత్రి, శ్రీ శ్రీ రేచెర్ల ప్రసాదాదిత్యప్రభువు విచ్చేసినారు. చక్రవర్తి శివదేవదేశికులకు లేచి నమస్కారం చేసినారు. చక్రవర్తికి ప్రసాదాదిత్యుడు మోకరించి నమస్కరించినాడు. వారిని కూర్చుండ నియమించి డెబ్బదిఏండ్ల యా వృద్ధచక్రవర్తి తాను తన పల్యంకసింహాసనంపై కూరుచుండి, దిండులమీద ఒదిగి “గురుదేవా ! ఉదయమే దయచేశారు!” అని ప్రశ్నించారు.

శివ : ప్రభూ : ఒక్కనిమేషము ఏకాంతం ఇప్పించాలి.

అక్కడ వివిధాసనములపై అధివసించి శివదేవయ్యదేశికులు రాగానే సార్వభౌమునితోపాటు లేచిన పండితాది బ్రాహ్మణులు, ఆరాధ్యులు, జంగమ గురువులు లేచి ఆవలికి వెళ్ళిపోయిరి. కంచుకు లా మహామందిర కవాటములు బంధించి తాము వెడలిపోయిరి.

శివ : మహాప్రభూ! వివిధ దేశాలలో త్రిలింగ సామ్రాజ్యంపై కుట్ర లెక్కు వౌతున్నవి.

గణ : ఎవరు? ఏలా కుట్రసలుపదలుచుకున్నారు? రెండేళ్ళనాడు సామంతులందరూ వచ్చి తమ రాజభక్తిని ప్రమాణపూర్వకంగా ప్రకటించి వున్నారుకదా! శివ : నిజమే మహాప్రభూ, కాని శ్రీరుద్రదేవయ్యవారిని పురుషునిగానే యెంచి మనం ప్రమాణం చేయించితిమి. వారందరూ అలాగే చేసిరి. శ్రీ రుద్రదేవయ్యగారు పురుషులేనని చెబుతూ ఎంతకాలం రహస్యం దాచి వుంచగలవారం? ఏనాడో ఆ రహస్యం బయలుపడవలసిందేనని మహాప్రభువు లెరుగనిదికాదు.

గణ : అవును. మేము పరమశివుని సన్నిధిని చేరినవెనుక కొంతకాలం శ్రీరుద్రదేవయ్య చక్రవర్తిగా రాజ్యపాలన సాగించి నిలద్రొక్కికొన్న వెనుక అప్పుడు రహస్యం నెమ్మదిగా బైటపెట్టవచ్చునుగాక ఈలోపుగా తొందరేముంది?

శివ : మహాప్రభూ ! శ్రీ ప్రసాదిత్యనాయనింవారు కొన్ని ముఖ్యవిషయాలు తమకు తెలియజేస్తారు.

ప్రసా : మహాప్రభూ ! గోన లకుమయ, ఆదవోని కోటారెడ్డి, కందవోలు పందిభూపాలుడు, కల్యాణపుర చోడోదయుడు, వూగినాటి కోటపెమ్మాడిరాయడు, కందూరి కేశినాయకుడు. వీరంతా కలిసి కుట్రచేస్తున్నారు. తుంబలక, మానువ, హాలువవారూ ఆ కుట్రలో కలవాలని వువ్విళ్ళూరుతున్నారు. బేడచెలుకి, మేడిపలి కాచయప్రభువుల నమ్మలేము. ఈలాటి రహస్యవార్తలు అటు తూర్పునుండి, దక్షిణదేశాలనుండి వస్తున్నాయి. వారందరికీ చిన్నచక్రవర్తుల రహస్యం తెలిసిందని అనుమానించవలసి వుంటుంది.

శివ : అందుకనే మహాప్రభువులకు నేను మనవిచేసేది, ముందుగా రుద్రదేవులు స్త్రీయే అని లోకానికి చాటడం, తర్వాత...

గణ : మహామంత్రీ ! ఈ విషయంలో మీరూ, రుద్రదేవప్రభువులూ, ప్రసాదాదిత్యులూ ఆలోచించి ఏదిమంచిదైతే అదిచేయండి. ఎవరు కుట్రలో చేరబోతున్నారో వారిని ధర్మంగా శిక్షించండి. అనుమానరహితం చేసుకొని మరీ పనికి దిగండి. చూడండి, మహాకవి తిక్కన సోమయాజులవారు వుద్యోగపర్వంలో ఈవిషయం ఎంతచక్కగా వర్ణించారో ! ధర్మరాజు ఆఖరుకు అయిదూళ్ళడిగి అప్పుడు కాదనిపించుకొనికూడా శ్రీకృష్ణులవారి రాయబారం నడిపించారు. ఓహొహో ఏమి అద్వితీయ కవిత్వం! తమ పురుషార్థంలోని భావాలు ఎన్నో వున్నాయి ఆయన మహాగ్రంథంలో, ఇక సెలవు. విషయాలు ఎప్పటికప్పుడు తెలియజేయండి.

శివదేవయ్యమంత్రి ఏబదిరెండ్లేండ యీడువాడు చామనచాయవాడు. సన్నగా పొడుగ్గా వంగిపోయి వుంటాడు. మహామాత్యులైన చెన్నాప్రగడ గణపామాత్యుల మేనల్లుడు. ఆరాధ్యుడైన వీరశైవుడుకాడు. విష్ణుభక్తికలవాడు, అఖండ పండితుడు, వేదవేదాంగ పారంగతుడు. సకలశైవాగమవేత్త. మేనమామవలె అఖండవైద్యుడు. చక్రవర్తిచేత అనేకవైద్యాలయాలు, ప్రసూతి ఆలయాలు, వైద్యవిద్యాపరిషత్తులు ఏర్పాటుచేసిన ధర్మశీలి, సర్వతంత్ర స్వతంత్రుడు. తన బావగారైన గోపరాజురామప్రధానిచే త్రైలింగ మహాసామ్రాజ్యంలో రాజ్యపాలన నిర్వక్రంగాజరిగేటట్లు చూస్తున్నవాడు, శివపూజా ధురంధరుడు.

ఈవల ప్రసాదాదిత్యనాయుడు కాకతీయవంశంతోపాటు వుద్భవించిన రేచెర్లవంశ ముక్తాఫలము. రేచెర్ల వారందరూ కాకతీయవంశ మూలపురుషుడైన భేత ప్రభువు కాలంనుండి కాకతీయ ప్రభువులకు దక్షిణహస్తాలుగా వుండిన మహా పద్మనాయక వెలమకులజులు. అఖండ శౌర్య సంపన్నులు. సూక్ష్మబుద్ధిశాలురు. కాకతి ప్రభువులకు పెట్టనికోటలు.

శివదేవయ్యమంత్రి నాయనివంక చూచి “సేనాపతీ ! రుద్రమదేవివారి మనస్సు మార్చడం ఎల్లాగు? ఆ దేవికి మీరు స్త్రీలమ్మా అనేభావం నచ్చచెప్పడం ఎలాగు?”

“గురుదేవులవారికి నేనా సలహా ఇచ్చేది ! ఈపాటికి ఏదో ఎత్తువేయకుండా వుంటారూ?”

“ప్రసాదాదిత్యులవారూ! మానవప్రకృతి మనుష్యుని ఊహకుమించి నడుస్తూవుంటుంది.”

“మహామంత్రీ ! చాళుక్య వీరభద్రులవారికి తమరు ఎందుకు వార్తపంపినట్లు?”

“యవ్వనహృదయాన్ని, యవ్వనహృదయమే గ్రహిస్తుంది. చాళుక్య వీరభద్రమహాప్రభువు యౌవనవంతుడు, మహావీరుడు, కామినీ జయంతుడు. ఆయనకు యువమహారాజుల హృదయం అర్థంకాకూడదా అని రప్పించాను.”

“తమ అభిప్రాయం నేను తెలుసుకోలేనంటారా? పైగా రుద్రమదేవ మహాప్రభువులు, చాళుక్య వీరభద్రప్రభువు కలిసి ఎందుకు వేటకు వెళ్ళడం ఏర్పాటు చేశారు?”

“ప్రసాదాదిత్యులవారూ ! మీరు మన మనుకున్న మువ్వన్నె మెకాన్ని సిద్ధంచేశారా?”

“అన్నీ సిద్ధమే. నేను ఆ ప్రదేశంలోనే వారిరువురకు తెలియకుండా సిద్ధంగానే వుంటున్నాను.”

4

శ్రీ లకుమయారెడ్డి మహారాజుకు అన్నగారు బుద్ధారెడ్డి సాహిణి. ఈయన భువనగిరి రాజధానిగా ముచికుందసీమ రాజ్యంచేస్తూ శ్రీ శ్రీ సమధిగత పంచమహాశబ్ద, మహామండలేశ్వర, పరమమాహేశ్వర, పతిహితచరిత, విజయవిభూషణ, శ్రీ అనుమకొండ పురవరాధీశ్వర, చలమర్తిగండ, మూరురాయ జగదాళ నామాది సమస్త ప్రశస్తిసహితం, శ్రీ స్వయంభూదేవర దివ్య శ్రీపాదపద్మారాధకులైన శ్రీమన్మహామండలేశ్వర కాకతీయమనుమ రుద్రదేవ మహారాజులను భక్తితో కొలుస్తూ ఉండెను.

కల్యాణి రాజైన తైలపుణ్ణి ఓడించడంలో శ్రీ శ్రీ కాకతి రుద్రదేవ చక్రవర్తికి సహాయంచేసినవా డాయెను బుద్ధారెడ్డి.

భువనగిరికి దక్షిణంగా ముప్ఫై గవ్యూతుల దూరంలో వర్ధమానపురం అనే పురము ఉండెను. ఆ పురము రాజధానిగా మానుకోటవిషయాన్ని తెలుగు చోడులు రాజ్యం చేస్తూ ఉండిరి.

వర్ధమాన మహాపురం నాలుగు గవ్యూతుల మహాదుర్గం. అపరిమిత భోగభాగ్యాలతోనున్నూ అనేక దేవాలయాలతోనున్నూ అనుమకొండను మించిఉండేది. ఆ పురం రాజధానిగా శ్రీ శ్రీ కాకతి రుద్రదేవ మహారాజు కాలంలో భీమచోడుడు తన సోదరుడు గోకర్ణచోడుడు మంత్రిగా, సేనానాయకుడుగా, యువరాజుగా రాజ్య పరిపాలనం చేస్తూ పశ్చిమచాళుక్య చక్రవర్తైన తైలప మహారాజుకు సామంతుడుగా ఉండెను.

ఆ భీమచోడనృపాలుడు వెనుకటి శ్రీకృష్ణుని మామైన కంసభూపాలుని యశం తన అపయశంచేత తెల్లగా కనిపింపజేసే పరమదుర్మార్గుడు. తన సవతి తల్లిని విలాసవతిగా చేసికొని ఉన్నాడు. సవతితల్లి కుమారుడు, బాలుడు చిన్నగోకర్ణుడు తిరగబడి అసహ్యించుకొని కళ్యాణికి వేగు పంపించగా, వాడుభోజనం చేస్తూ ఉండే సమయాన వాణ్ణి చంపించాడు భీముడు.

ఆ మహాపాపం భారతభూమిని గగ్గోలుపరిచింది. భువనగిరికొండల్లో మారుమ్రోగగానే రుద్రుడైన శ్రీ గోన బుద్ధరాజు అనుమకొండకు శ్రీ రుద్రదేవ చక్రవర్తులకు సహాయం రావలసినదనీ, ఆంధ్ర చక్రవర్తుల చల్లని వెన్నెలవంటి ప్రభుత్వానికి ఈలాంటి పాపిని రాజ్యం చెయ్యనీయటమే కళంకం అనిన్నీ వినతి పత్రం పంపుకొన్నాడు. పశ్చిమచాళుక్య తైలపదేవ చక్రవర్తి రుద్రచక్రవర్తి పరాక్రమంవల్ల జబ్బుచేసి గుండె పగిలి కథావశేషుడుకాగా, ఆ రాజ్యం యావత్తూ భీమచోడనృపాలుడు ఆక్రమించుకొన్నాడు. కాబట్టి చక్రవర్తిత్వానికి సంపూర్ణత్వం సిద్ధించవలసివున్నదనియు మనవి చేసుకొన్నా డా వేగులో.

శ్రీ భువనగిరిపురవరాధీశ్వర, సతిహితచరణ బుద్ధారెడ్డి సాహిణి వర్ధమానపురం ముట్టడించగానే భీమచోడు డుగ్రుడై మహాకోపంతో సర్వబలాలతో వచ్చిన బుద్ధారెడ్డిని తాకినాడు. మూడురోజులు మహాయుద్ధం జరిగింది. భీమచోడుణ్ణి పరాక్రమవంతుడున్ను, వ్యూహరచనాసమర్ధుడున్ను అగు బుద్ధారెడ్డి అన్నిద్వారాల దగ్గరగా పూర్తిగా ఓడించేసరికి, భీమచోడుడు వర్ధమానపురం కోటలోకి పారిపోయినాడు. ఇంతలో రుద్రదేవ చక్రవర్తి అఖండసైన్యంతో విచ్చేస్తున్నాడని వేగులు ఇరువాగులవారికినీ అందినవాయను. భీమచోడుడు ఒక రాత్రి రాత్రి ఆంధ్ర సైన్యాలు ఏమరుపాటున ఉండగా సమస్తమందితో చుట్టాలతో పర్వతాలకు పారి పోయినాడు.

బుద్ధారెడ్డి వర్ధమానపురం పట్టుకొన్నాడు. ఇంతలో భేరీ భాంకారాది వాద్యాలు మోగుతూ వుండగా పెద్ద ఉప్పెన వచ్చినట్లు అఖండంగా ఆంధ్ర సైన్యాలను నడిపించుకొని చక్రవర్తి స్వయంగా విచ్చేసి వర్ధమానపురంలో పాపం పొందిన రాజభవనాలు నేలమట్టంచేసి భీమచోడుడుణ్ణి తరుముకుపోయి అతనిచే జోహా రనిపించుకున్నారు. భీమచోడుడు తన కుమార్తె పద్మావతిని శ్రీ రుద్రదేవ చక్రవర్తికి కన్యాదాన సమర్పించి చక్రవర్తికి మామగారై, చేసిన పాపనివృత్తికి గాను సంసారం త్యజించి వీరశైవదీక్ష తీసికొని తపస్సుకై మహాబలేశ్వరం వెళ్ళిపోయ్యాడు. పెద్ద గోకర్ణచోడుని కందూరులో తనకూ బుద్ధారెడ్డికీ సామంతమండలేశ్వరుడుగా చక్రవర్తి నియమించినాడు. మానువనాటి మహామండలానికి రాజప్రతినిధిగా, మండలేశ్వరుడుగా ఇరవై ఐదు ఏళ్ళ శ్రీ బుద్ధారెడ్డి సాహిణి మహారాజును చక్రవర్తి పట్టాభిషేకం చేసినాడు.

శ్రీ రుద్రదేవచక్రవర్తి అవతారం చాలించారు. శ్రీ మహదేవరాజు చక్రవర్తి దేహం చాలించారు. శ్రీ గణపతిదేవ చక్రవర్తి రాజ్యపాలనంవచ్చింది.

ఆ బుద్ధారెడ్డికి బిడ్డలులేరు. ఆయనకు ఏబదితొమ్మిదవఏట రెండవ భార్యయైన ఎరుకసానమ్మ దేవేరియందు కుప మాంబ అనే కుమార్తెయున్ను, గన్నారెడ్డి, విఠ్ఠల ధరణీశుడు అనే కుమారులున్ను రెండేళ్ళ చొప్పున తేడాలుగా పుట్టినారు. బుద్ధారెడ్డి తన తమ్ముడైన లకుమయారెడ్డిని తన యువరాజుగాను, సేనానాయకుణ్ణి గాను చేసికొని ఉన్నాడు. శ్రీ గణపతిదేవ చక్రవర్తి రాజ్యానికి వచ్చిన నలుబది యేండ్లకు బుద్ధారెడ్డి తనకు ఎనుబది ఏడు ఏండ్ల వయసులో దేహం చాలిస్తూ తమ్ముణ్ణి పిలిపించి తన పెద్ద కుమారుడైన గన్నభూపతి తరపున రాజ్యం చేయ వలసిందనిన్నీ, వాడు పెద్దవాడు కాగానే వాడి రాజ్యం వాడికి ఇచ్చి ‘నువ్వు భువనగిరి పరిపాలించవయ్యా లకుమయా!’ అని సెలవిచ్చి లింగైక్య మందినాడు.

లకుమయ మహావిచారంతో రాజ్యభారం పూని అన్నకుమారునికి బదులుగా రాజ్యం చేస్తూ ఉండెను. శ్రీ గణపతిదేవ చక్రవర్తికి బాసటయై పశ్చిమాన విరోధులైన రాజుల్ని హతమారుస్తూ ఆంధ్ర సామ్రాజ్యం విస్తరింపచేశాడు.

రాజ్యపరిపాలన చేసినకొద్దీ రాజ్యకాంక్ష మొలకెత్తింది. కోరలు పోయి, పంజాలకు బలంతగ్గిన సింహమైనట్లు శ్రీ గణపతిరుద్రదేవులు ముసలిపండై ఉండగా ఇదే అదనని లకుమయ రానురాను అనుమకొండలో విద్య లభ్యసిస్తున్న రాజకుమారులకు పంపించవలసిన మహారాజభూతాదికర్చులు పంపించడం మానివేశాడు.

వర్ధమానపురంలో స్వామినివేదనలు, అర్చనలు గన్నభూపతిపేర చదివించడం మానివేశారు. సంవత్సరాదినాడు హజారంలో వైతాళికులు, వందులు శ్రీశ్రీ గన్నభూపతి మహారాజా! అని పాడుటమాని, శ్రీ లకుమయ మహామండలేశ్వరులపేరు పాడుతున్నారు. లకుమయ శిలాతామ్రశాసనాలల్లో గన్నారెడ్డిపేరు లిఖించడం మానిపించాడు.

మహారాజ తంత్రజ్ఞులైన శివదేవయ్యమంత్రులు, మహాసేనాని జన్నిగదేవులు, రాజభక్తిపూరితచరిత్రుడు ప్రసాదాదిత్య నాయకులున్ను సామంతమండలేశ్వరులు తిరగబడకుండా ఆంధ్ర మహాసామ్రాజ్యం జాగ్రత్తగా కాపాడుకోవడంలో మునిగి ఉన్నారు. వాండ్లకు గన్నారెడ్డికి ఆలోచన చెప్పడానికి తీరిక లేదాయెను.

లకుమయ బలవంతుడు, చాలా ధనం కలవాడు. అతనివైపువాండ్లు చక్రవర్తి ఆస్థానంలో ఉండనే ఉండిరాయను. వాండ్లుపోయి వృద్ధచక్రవర్తి చెవిలో లకుమయా రెడ్డి రాజభక్తి వేనోళ్ళవర్ణిస్తూఉండిరి.

అప్పు డాలోచిస్తూ “అవునయ్యా ! ఈ విషయాలు యావత్తూ శ్రీ శివదేవయ్య దేశికులకు విన్నవించండి. గోన గన్నయ్య చాలా మంచివాడు అనుకొంటిమి. వీర విద్యలయందూ, సర్వశాస్త్రాలయందూ అతడు పండితుడవుతూ ఉండెను. మాయందూ, యువరాజులవారియందూ ఎంతో భక్తిగా ఉండెను. మీరు పలికే పలుకులు విరుద్ధంగా ఉంటున్నవేమి?” అని శ్రీ గణపతిరుద్రదేవులు అన్నారు.

“మహారాజాధిరాజా ! అదే గన్నయ్యలో ఉన్న విచిత్రము ! అయనా, విఠలనాథుడూ, అనేకులు బాలకులు ఓరుగల్లుపురంలో చేసే అల్లరి మహాప్రభువులతో విన్నవించేది ఎవరు?”

“సరేనయ్యా. మా కీ గొడవలు పట్టవు. చిన్న మహారాజులుంగారితో మనవిచేసుకోండి” అని గణపతిదేవులు లకుమయపక్షంవారిని పంపివేశారు.

వారు తిన్నగా లకుమయారెడ్డికి రహస్యచారునితో ఈలా లేఖ పంపించారు.

5

"శ్రీ శ్రీ ఓం నమఃశివాయ
 తేయాద్దేవో ద్విరవదనః శర్మినః శైశ వేయః
 పాయంపాయం కరవిరళతశ్చాపలాచ్ఛూత్కృతేన
 అస్తేస్తన్య ప్రచుర వృషతై ర్బూషయత్యంబికాయాః
 స్రైర్మూర్ధన్ న్యైరివకుచయుగం మౌక్తికైర్ముక్తదోషః.

స్వస్తి. శ్రీ శాలివాహనశక వర్షంబులు 1183 దుర్మతి సం. ర పాల్గుణ శు 10 గురువారంనాడు శ్రీ సకలగుణాలంకార, పరనారీదూర, వర్ధమానపురవరేశ్వర, వీరలక్ష్మీనిజేశ్వర, దోర్భలభీమ, రణరంగరామ, వితరణకర్ణ, శౌర్య సౌవర్ణ, పతిహితాంజనేయ, శౌచగాంగేయ, సత్యరత్నాకర, దుష్టజనభీకర, స్వామిద్రోహరగండ శ్రీ శ్రీ గోనవంశాబ్దికులచంద్రుండు శ్రీ శ్రీ లకుమయారెడ్డి మహారాజులవారికి అనేక విజయాలు ఆశీర్వదించి ఆత్రేయగోత్ర పవిత్రుడు ఈశ్వరభట్టుమనవి. ప్రభూ, ప్రొద్దుగుంకుతూఉండెను. అనేక శకున్త సంతానాలు అల్లకల్లోలంగా ఉండెను. బూరుగ చెట్టున కర్ణపక్షి. చిన్న పురుగులతో దిక్కులేకున్నది. తాము సుఖంబుండుడు. అనుష్ఠానంబులు సరిగా అవుతున్నవి” అన్న ఉత్తరం పంపించారు.

లకుమయ సర్వసన్నద్ధుడౌతూ, మంచి లోహకారులచేత ఈటెలు, భల్లాలు, శూలాలు, చురకత్తులు, సువ్వలు, బాణాలు చేయించి, కేశమునుకూడా పన్నెండు భాగాలుగా చేయగల పదును పెట్టిస్తుండెను. అనేక ఫలకాలు, శిరస్త్రాణాలు, కవచాలు చేయిస్తూ ఉండెను. తన దేశంలో వ్యవసాయంచేసే రెడ్డివీరుల్ని, ముఖ్యంగా బోయమన్నీలను సిద్ధంచేస్తూ ఉండెను. ఎప్పటికప్పుడు రహస్యచారులు వార్తలను ఆదవోనికి, కందవోలుకు, కందూరుకు అందచేస్తూ ఉండిరి.

యాదవరాజ్యానికి వార్తలు వెడుతూఉన్నవి. రుద్రయ్యమంత్రి పరివారంగా ఉత్తరంగా ప్రయాణంచేసి, దేవగిరి చేరాడు. దేవగిరి ప్రభువుల మంత్రియైన భవానీభట్టు రుద్రయ్యమంత్రిని అత్యంత స్నేహంతో ఆహ్వానించి తన భవనంలో మహారాజోపచారాలు చేయించాడు.

ఆ రాత్రి శౌణరాజ్యయువరాజు మహాదేవరాజును రుద్రయమంత్రి కలుసుకొన్నాడు. ఆ సమావేశంలో మహాదేవరాజు ముఖ్య సేనానాయకుడు సింగదేవుడు కూడా ఉండెను.

“మహాప్రభూ ! ఒకలక్ష ఎనుబదివేల కాల్బలము, మూడువేల అశ్వరాహుత్తులు. ఏబది ఏనుగులు మా మండలేశ్వరులు సిద్ధంచేశారు. వీరుకాకుండా బోయమన్నీ లెందరో సిద్ధం అవుతున్నారు. ఇవిగాక మహావీరులతోకూడిన సైన్యాలతో ఇంకను పెక్కుమంది మండలేశ్వరులు మమ్ము కలుస్తారు. మీరు ఎప్పుడు రాగలిగితే ఆనాడు మేమంతా సిద్ధం” అని రుద్రమంత్రి మహాదేవరాజుతో మనవి చేశాడు.

వహా : మహామంత్రీ! ఆంధ్రులందరూ సిద్ధంగా వుండవచ్చు. మేమున్ను సిద్ధంగా వున్నాము. మా సైన్యము రెండులక్షల యాభై వేల కాల్బలము, మాఅశ్వ సైన్యము ఇరవై వేలున్నది. మా సైన్యంలో మూడువందల ఏనుగులున్నాయి.

భవానీభట్టు మహామంత్రీ ! మా వృద్ధమహారాజు ఆంధ్రులపైకి వెళ్ళవద్దంటారు. వారుకూడా శ్రీ గణపతిదేవులులా మోక్షానికై ఎదురుచూస్తున్నారు. ఇప్పుడే ఓరుగల్లుపై యుద్ధానికి రావడం వీలుపడదు. మీరంతా సంపూర్ణంగా సిద్ధం కండి. మేము ఎప్పటివార్త అప్పటికి అందజేస్తూంటాము.

రుద్రమంత్రి : ఇంత సులభంగా మా రాయబారం పూర్తికాగల దనుకో లేదు. మా కీ దినము ఆనందదినము.

భవానీభట్టు : రుద్రయమంత్రులవారూ! మేము ఏ దారిని వస్తామో ఆ దారిలో మీ సైన్యం కొంత మాకు కలవాలి. మేము ఓరుగల్లును ముట్టడించగానే మీరు మీ తక్కిన సైన్యాలతో వచ్చి మా సైన్యంలో చేరిపోవాలి.

రుద్ర : అలాగే చేస్తాము. ప్రభువులు నాకు రేపు బయలుదేరటానికి సెలవిప్పించాలి.

రుద్రయ్యమంత్రి అతిజాగ్రత్తగా శౌణదేశచారుల సహాయంతో స్వదేశం వస్తూ ఉండెను. గోదావరినిదాటి రెండుదినాలు ప్రయాణంచేసి వచ్చినాడు. రాత్రులే ప్రయాణం. పగలు ఏదో గ్రామంలో ఆగిపోతూ ఉండెను. రుద్రయ్యమంత్రి కాశీ ప్రయాణంచేసి వచ్చే ఉద్యోగివలె వేషము వేసుకొని ఉన్నాడు.

ఒకనాడు బొలినవాడ అనే గ్రామంలో విడిదిచేసి ఉన్నప్పుడు పగలు ఎవరో ఆయింటిని చుట్టుముట్టివేసినారు. “ఏడయ్యా దొంగరుద్రయ్య, రాజద్రోహి రుద్రయ్య, పాపి రుద్రయ్య!” అంటూ ఆ బ్రాహ్మణుని ఇంటిలోకి విచ్చుకత్తులు, భల్లాలు ఝళిపిస్తూ బిలబిలమంటూ విచ్చుకత్తులవారు వచ్చిపడ్డారు.

“పాపం! ఈ రుద్రయ్యమంత్రి మహానుభావుడు. దేవగిరి కాశీనుంచి వర్ధమానపురం రామేశ్వరానికి పోతూఉన్నాడు. ఆహాహా! శ్రీ శ్రీ గోన బుద్ధారెడ్డి ప్రభువుదగ్గర అత్యంత నమ్మకంతో పనిచేసిన మాధవమంత్రి కొమారులు రుద్రయ్యమంత్రులు ఆంధ్రరాజ్యాన్ని తరింపజేయడానికి అపర మహేశుడు యాదవ మహాదేవుణ్ణి తీసుకువస్తాడట!” అంటూ గజదొంగ గన్నారెడ్డి గదిలోపలికి చక్కావచ్చాడు.

గన్నారెడ్డిని చూడగానే రుద్రయ్యమంత్రి అయిదుప్రాణాలు వేసంకాలంలో నీరు ఆవిరిఅయినట్లు అయిపోయాయి.

అయినా, లేనిధైర్యం తెచ్చిపెట్టుకొని, రుద్రయ్యమంత్రి గన్నారెడ్డిని చుఱ చుఱ చూచాడు. “ఏమి ! నువ్వెవరవు? బుద్ధిలేదా? శ్రీ శ్రీ అపర మహేశ్వరులు గణపతిరుద్రదేవ ప్రభువు రాజ్యంచేసేదేశం కాదనుకున్నావా?” అని రుద్రయ్య మంత్రి మండిపడ్డాడు.

గన్నారెడ్డి ఫక్కున నవ్వి ‘అబ్బే ! ఆడది రాజ్యంచేస్తూంది అనుకున్నా! అవును, మరి అలా ఆడది రాజ్యంచేయకుండానే మనం అందరమూ ప్రయత్నం చేస్తున్నాముకాదా రుద్రమంత్రీ!’ అన్నాడు. ‘అన్నగారూ! ఇతడేనా మహానుభావుడు మాధవయ్యమంత్రులవారి జ్యేష్ఠ పుత్రుడు?’ అని ప్రక్కనున్న బాలుడు విఠలధరణీశు డన్నాడు.

ఆరడుగుల పొడుగువాడు, వెడదఉరంవాడు, పంచె వెనక్కు విరచికట్టి, తలపాగా వయ్యారంగాచుట్టి, వక్షంమీద చేతులుకట్టుకుని నూనూగుమీసాలు ఆడుతూండగా నవ్వుతూ నిలిచివున్న గోనగన్నారెడ్డి, ఇరవై యేళ్ళ ఈడువాడు, అన్నగారికన్న ఒక అంగుళం పొట్టివాడు, భీమునివంటి బలవంతుడు, అన్నగారివలె వేషం వేసికొని, కత్తిదూసి నిలుచున్న విఠలధరణీశుని భుజంపై చేయివేసి ‘తమ్ముడూ! ఆ కత్తిని వరలో ముడువవయ్యా! మన రుద్రయ్యమంత్రులవారి మీదనేనా అంతకోపం?’ అంటూ పకపక నవ్వాడు.

‘రుద్రయ్యగారికి భవానీభట్టు విందులు బాగాతగిలాయి. మహదేవరాజు బహుమతులు అమూల్యమైనవి ఉంటాయి. ఆ మూటలు, ఆ తోలుపెట్టె అన్నీ పట్టుకుపదండి మహారాజా!’ అని సూరన్న రెడ్డి, ఒక ఏనుగుగున్నలాంటి మనిషి అన్నాడు.

సూరన్నరెడ్డి అయిదడుగుల పదిఅంగుళాలు ఉంటాడు. విఠలధరణీశుడు భీముడైతే ఈతడు ఘటోత్కచుడే! అతనిచేతిలో ఎప్పుడూ ఒక మణుగుబరువు గల ఉక్కుగద ఉంటుంది.

‘అవునయ్యా సూరన్నరెడ్డీ! పద. మనం ఎల్లాగా దొంగలమే! అన్నిటి కంటె అమూల్యమైనధనం రుద్రయ్యామాత్యులే! ఆయన్ని సపరివారంగా మన కోటకు తీసుకుపోదాం పద’ అన్నాడు గన్నారెడ్డి.

అప్పు డా బందిపోటుదొంగలు రుద్రయ్యామాత్యులను, పరివారాన్ని, వారి పెట్టెల్నీ బేడల్ని పట్టుకొని ఎక్కడికో మాయమైపోయారు.