గురుజాడలు/కవితలు/కాసులు
కాసులు
మనలకీ పోరాట మిప్పుడు
దేని గూరిచి కలిగే చెపుమా,
మరచితిని.... నవ్వెద వదేలను?
యేమి కారణమైన పోనీ ;
వినుము, ....ధనములు - రెండు తెరగులు;
ఒకటి మట్టిని పుట్టినది; వే
రొకటి హృత్కమలంపు సౌరభ
మ, దియు నిది యొక్కెడను కలుగుట
యరుదు; సతులకు వేడ తగినది
యెద్దియో?
“మనసులో నీ కుండు
ధనమన నొండు కలదే పసిడి
గాక"ని. ప్రాజ్ఞులకె కనికట్టు
కనకము; చపల చి త్తల కన్ను
చెదురుట చిత్రమా! తీవలకు
తలిరుల తెరంగున, కాంచనము
సింగార మందురు లలనలకు;
కానిమ్ము; గాని, కమ్మని తావి
గ్రమ్మెడి పుష్పనిచయము ప్రేమె
కా? అది లేక మంకెన కెంపు,
కాంతల యందము
“ప్రేమ కొరుకుకు
తిందురా? యెట్టిదది? నా వలను
కలదో, లేదో?” యను నొక వింత
చూపును చూచెదవు -
బంగరు
మిసిమి మేనికి పసపు నలదితి;
కురుల నలరుల నూనె నించితి;
కాటుకను మెరుగిడితి చూడ్కికి;
విడెము వింత హొరంగు గూర్చెను
వాతెరకు; పలువరుస వెన్నెల
లలమె; దానదానను, మురువు
పెనగొనె, నేర్చి మెరసితి రూపు
ప్రేమ పెంచక పెరుగునే?
ప్రేమ-
పెన్నిధి గాని, యింటను నేర్ప
రీ కళ, ఒజ్జలెవ్వరు లేరు-
శాస్త్రము లిందు గూరిచి తాల్చె
మౌనము-నేను నేర్చితి భాగ్య
వశమున, కవుల కృపగని, హృదయ
మెల్లను నించినాడను ప్రేమ
యను రతనాల-కొమ్ము!
తొడవులుగ నవి మేన దాల్చుట
యెటుల నంటివో? తాల్చితదె, నా
కంట చూడుము! సతుల సౌరను
కమల వనముకు పతుల ప్రేమయె
వే వెలుగు; ప్రేమ కలుగక బ్రతుకు
చీకటి"
నా నేర్పు కొలదిది
(ప్రేమ విద్దెకు వోనమాలివి.)
యెదను నిల్పిన, మేలు చేకురు.
“మరులు ప్రేమని మది దలంచకు;
మరులు మరలును వయసు తోడనే;
మాయ, మర్మములేని నేస్తము
మగువలకు మగవారి కొక్కటె
బ్రతుకు సుకముకు రాజమార్గము-
ప్రేమ నిచ్చిన, ప్రేమ వచ్చును -
ప్రేమ నిలిపిన, ప్రేమ నిలుచును -
ఇంతియె -
కాసు వీసము నివ్వ నొల్లక,
కవిత పన్నితి నని తలంపకు;
కాసులివె; నీ కంఠసీమను
జేరి బంగరు వన్నె గాంచుత!
మగడు వేల్పన పాతమాటది;
ప్రాణమిత్రుడ నీకు నీ నెనెరు
కలుగకనున్న పేదను కలిగినను
నా పదవి వేల్పుల రేని కెక్కడ?
(“ఆంధ్రభారతి” 1910 ఆగస్టు)