గీతా పరిచయము/గీతాపరిచయము
గీతాపరిచయము
భూమి విూద గల జీవరాసులలో మనిషి అన్నిటికంటే ఎక్కువ బుద్ధిబలము కలవాడు. బుద్ధిలో అన్నిటికంటే గొప్పవాడైన మానవుడు, అన్నిరంగములలో అతి సూక్ష్మాతి సూక్ష్మముగ యోచించగల్గుచున్నాడు. కాని ఒకేఒక ఆధ్యాత్మికరంగములో మాత్రము హీనాతిహీనముగ వెనుకబడి ఉన్నాడు. ఉదాహరణకు ఒక న్యాయవాది (అడ్వకేట్) ఉన్నాడనుకొందాము. అతడు అన్యాయపరుని వైపు వాదించుటకు ఒప్పుకొని, తన బుద్ధిచేత అన్యాయమును, న్యాయముగ వర్ణించి, తన క్లౖెెంట్ చేసినది న్యాయమనిపించి శిక్షనుండి తప్పించగల్గుచున్నాడు. అలాగే ఒక డాక్టరు తన దగ్గరకు వచ్చిన రోగియొక్క భయంకర రోగమును సహితము, తన తెలివితో వైద్యము చేసి నయము చేయగల్గుచున్నాడు. పోలికలేని క్రొత్తరోగమును బుద్ధితో యోచించి పోగొట్టిన వైద్యుడుగాని, అన్యాయమును న్యాయమన్నట్లు వాదించి గెలిచిన న్యాయవాదిగాని, ఇంకా ఎంతో తెలివిగలవారు గాని, దైవసంబంధమైన విషయములవద్ద మాత్రము పూర్తి తెలివి తక్కువవారై, ఏమాత్రము గ్రహించలేనివారై పోవుచున్నారు. ప్రపంచ విషయములలో వికసించిన బుద్ధి, పరమాత్మ విషయములలో మాత్రము ముకుళించుకొని పోవుచున్నది. మానవుడు ప్రపంచ విషయములలో ఎంతో అభివృద్ధి చెందుచు పూర్వము లేనివి, ఎవరికి తెలియనివి అయిన ఎన్నో క్రొత్త సిద్ధాంతములను, క్రొత్త యంత్రములను కనుగొనుచున్నప్పటికి ఆధ్యాత్మిక విషయములలో మాత్రము పూర్వమున్నవి మరియు పూర్వము అందరికి తెలిసిన విషయములను కూడ గ్రహించలేక పోవుచున్నాడు. ప్రపంచ విషయములను ఎన్నిటినో తెలిసినవాడైనా, పరమాత్మ విషయములను ఎందుకు తెలియలేక పోవుచున్నాడో కూడ గ్రహించలేక, దైవ విషయములలో పూర్తి పొరబడుచున్నాడు. అక్షరములను నేర్చినంత మాత్రముననే అన్ని పట్టాలు వచ్చినట్లు తలచువానిలాగ, తనకున్న కొద్ది భక్తితోనే తనకు పూర్తి జ్ఞానము తెలుసుననుకొనుచున్నాడు.
ఈనాటి మానవుని బుద్ధికి ఆధ్యాత్మిక విషయములలో పూర్తిస్థాయి అవగాహన లేకుండపోవుచున్నది. ఉదాహరణకు ఒక దారిలో ఇద్దరు స్త్రీలు పోవుచున్నారు. అదే దారిలోనే ముగ్గురు వ్యక్తులు కూర్చొని ఉన్నారు. ఫర్లాంగు దూరములో వస్తున్న ఇద్దరు స్త్రీలలో ఒకరు స్త్రీకాగ, ఒకరు నపుంసకుడై ఉండెను. చీర, రవిక కట్టడములోను, వేషధారణలోను, అలంకారములోను నపుంసకుడు స్త్రీతో సమానముగ ఉండుట వలన దూరము నుండి చూచినపుడు ఇద్దరిని స్త్రీలనుకోవడములో తప్పులేదు. మొదట ఇద్దరిని, స్త్రీలని దారి ప్రక్కన కూర్చున్న వారనుకున్నారు. ఆ స్త్రీలు కొంత దగ్గరవుతూనే ముగ్గురిలో ఒకటవ వాడు, వారిలోని నడక, ముఖవర్చస్సు యొక్క కొద్దిపాటి వ్యత్యాసమును బట్టి వస్తున్నది ఇద్దరు స్త్రీలుకాదు, అందులో ఒకరు మాత్రము స్త్రీ కాగ ఒకరు నపుంసకుడని చెప్పాడు. ఆ మాటవిన్న రెండవవాడు, మూడవవాడు వారిలోని వ్యత్యాసమును కనుగొనలేక, "కాదు ఇద్దరూ స్త్రీలే" అన్నారట. ఇలా వారనుకొన్న కొద్దిసేపటికే దారిన పోయే ఆ ఇద్దరు దగ్గరకొచ్చారు. దగ్గరగ చూచిన రెండవ వానికి కొంత అర్థమైపోయి ఒకరు నపుంసకుడే అని నిర్ధారణకొచ్చాడు, కాని పైకి ఒప్పుకోలేదు. ఇంతసేపు కాదని ఇపుడు ఒప్పుకుంటే తనకు విలువుండదను కొన్నాడు. మూడవవాడు మాత్రము చాలా తెలివితక్కువవాడు కాబోలు అప్పటికి కూడ వానికి అర్థము కాలేదు. వారిలోని తేడాను కనుగొనలేక పోయాడు. మొదటివాడు ఎన్నో తేడాలు చెప్పుచున్నప్పటికి, మూడవ వానికి ఏమాత్రము అర్థము కాలేదు. పైకి కనిపించు ఆకారములే ముఖ్యమనుకొన్నాడు. లోపలగల లింగభేదమును గ్రహించలేక పోయాడు. చివరకు ఈ విధముగ ఏమి చెప్పిన ఒప్పుకోను, ప్రత్యక్షముగ చీరకట్టుకున్న ఆడవారు కనిపిస్తుంటే ఎలా కాదనాలి? నేను నమ్మనుగాక నమ్మను. చెవులకు కమ్మలు, చేతులకు గాజులు, కాళ్లకు మెట్టెలు, మెడలో మంగళసూత్రము ఇన్ని ఉంటే ఆడది కాదంటావా నీకు బుద్ధిలేదుపో అన్నాడు. రెండవవాడు మాత్రము మొదటివాని మాటను లోపల ఒప్పుకొనినప్పటికి, బయటికి మాత్రము మూడవవాడు చెప్పినదే నిజమన్నాడు. వారి వాదనను చూచి మొదటివాడు వీరెంతో తెలివి తక్కువవారని, వీరితో వాదించుటకంటే ఊరకుండుట మంచిది అనుకొన్నాడు.
ఈ విధముగనే జగతిలో మూడు రకముల మనుషులున్నారు. సత్యమును గ్రహించినవారు ఒకరకము, సత్యమును గ్రహించి పైకి ఒప్పుకోలేని వారు రెండవ రకము, సత్యమును గ్రహించలేక, తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్లన్నట్లు కొంతయిన వెనుదిరిగి ఆలోచిస్తామనుకోక, తనకు తెలిసినదే సత్యమని మొండిగ వాదించువారు మూడవ రకము. దైవ విషయములో సత్యమును తెలిసినవారు కోటికి ఒకరు అరుదుగ ఉండగ, అంతరంగములో సత్యమును ఒప్పుకొని బయట ఒప్పుకోనివారు కొందరున్నారు. సత్యమును ఏమాత్రము గ్రహించలేక మొండిగ వాదించువారు ఎందరో గలరు. దైవ మార్గములో సత్యమునే తెలియాలని పట్టుదల గలిగి సత్యాన్వేషియై, సత్యమును తెలిసినవాడు కోటికొకడుండడము అరుదైన విషయమే. భూమివిూద సత్యమును తెలిసినవాడు అరుదుగ ఎవడో ఒకడుండవచ్చును. వానిని దారిలోనున్న మొదటివానిగ చెప్పుకోవచ్చును. మొదటినుండి తమకు జ్ఞానము తెలుసునని చెప్పుకొనుచు గురువులుగ, స్వాములుగ, ఆధ్యాత్మికవేత్తలుగ చలామణి అయిన వారికి దైవమార్గములో కొంత తెలిసివుండుట వలన చివరకు తమ జ్ఞానము తప్పని, సత్యాన్వేషి చెప్పిన జ్ఞానమే నిజమైనదని తెలిసి, పైకి ఒప్పుకొంటే ప్రజలలో ఇంతవరకున్న గౌరవము తగ్గునని, మొదటినుండి తాము చెప్పుచున్నదే చెప్పుచుందురు. తమలోని పొరపాటును బయటపడకుండ, తాము బయటపడకుండ తెలిసి అసత్య వచనములాడుచుందురు. ఇటువంటి వారు దారిలోని రెండవ రకము వారు. సత్యమును ఏమాత్రము ఎప్పటికి గ్రహించలేక తమకున్న కొద్దిపాటి జ్ఞానమే గొప్పదనుకొని, తాము చేయు ఆచరణయే సరియైనదనుకొని, ఎవరేమి చెప్పిన విననివారు గలరు. ఇటువంటి వారిని దారిలోని మూడవరకము వారిగ లెక్కించవచ్చును.
దారిలో వస్తున్న వారు వేషభూషణములలో స్త్రీలే అయినప్పటికి వారి భౌతిక శరీరములలో తేడాగలదు. ఇద్దరిలో ఒకరు స్త్రీకాగ రెండవ వారు నపుంసకులు. నపుంసకుని శరీరము పురుషాంగము కల్గియుండట వలన నపుంసకుడిని స్త్రీ అనలేము. పైకి కనిపించుటకు అన్నివిధముల స్త్రీవలె ఉన్నప్పటికి లోపల మాత్రము శరీరము వేరుగ ఉన్నది. మొదట దూరమునుండి చూచినపుడు గుర్తించ లేక స్త్రీలనుకొనిన ఫరవాలేదు గాని, దగ్గరికి వచ్చిన తర్వాత కూడ గుర్తించలేని వారిని తెలివితక్కువ వారని చెప్పవచ్చును. అంతేగాక గుడ్డలూడదీసి చూచినప్పటికి స్త్రీపురుషుల తేడాను గుర్తించలేని వారిని మరీ మూర్ఖులని చెప్పవచ్చును. దారిలో వస్తున్న స్త్రీలు కనిపించినట్లే, భూమి విూద పైకి కనిపించుటకు ఆకారములో ఒకే పోలిక కల్గిన రెండు రకముల తేడాలున్న పుస్తకములు గలవు. వాటిని చూచువారు కూడ మూడు రకముల వారు గలరు. పుస్తకములు ఒకే ఆకారములున్నప్పటికి వాటిలోపల తేడాలున్నవని చెప్పు మొదటి రకము వారూ గలరు. అలాగే ఆ తేడాను మొదట గుర్తించలేక పోయినప్పటికి తర్వాత గుర్తించి, ఆ విషయమును బయటికి ఒప్పుకోక ముందునుండి చెప్పుమాటనే చెప్పు రెండవ రకమువారూ గలరు. పుస్తకములు అన్ని ఒకరకముగానే ఉన్నవి కదా! అని వాటి తేడాను ఏమాత్రము ఒప్పుకోని మూడవ రకమువారు కూడ గలరు.
భూమి విూద పుస్తకములు అన్నియు ఒకే ఆకారము కల్గి ఉన్నప్పటికి వాటిలోని విషయములను బట్టి పురాణములు, శాస్త్రములని రెండురకములుగ విభజింపవచ్చును. కనిపించుటకు అన్నీపుస్తకములే అయినప్పటికి, వాటిలోని విషయములనుబట్టి పురాణములని, శాస్త్రములని విభజించుకొని గుర్తించు మొదటిరకము మనుషులుగలరు. మొదట అన్నీ పుస్తకములేకదా! అది శాస్త్రమైతే ఇది ఎందుకు శాస్త్రముకాదని వాదిస్తు, చివరకు వాటి తేడాను గమనించి బయటపడక, ముందు మాటనే మాట్లాడుచుపోవు రెండవ రకము వారు గలరు. అలాగే వాటి తేడాను కనుగొనలేక అన్ని ఒకటే కదా! అని మొండిగ వాదించు మూడవ రకము వారు గలరు.
పురాణములలోని విషయములు వేరని, శాస్త్రములలోని విషయములు వేరని తేల్చి చెప్పువారున్నప్పటికి, వాటి తేడాను వివరిస్తున్నప్పటికి, మొదట కాదని కొంతకాలమునకు తమ మనసులో సత్యమును గ్రహించిన వారు పురాణములను విడువలేక పైకి అన్ని ఒకే దారి చూపుచున్నవి, ఏమీ తేడాలేదని చెప్పుకొనువారు గలరు. పురాణములను బోధించుచు పురాణములలో ఎంతో పేరుగాంచిన వారు, పురాణములు కాలక్షేపమునకే గాని కర్మక్షేపమునకు పనికి రావని, చివరికి తెలిసి కూడ మధ్యలో పురాణముల గూర్చి తక్కువగ చెప్పితే, ఇంతవరకు గొప్పవని చెప్పిన తమకు విలువుండదని, బయటికి వాటిని గొప్పగనే చెప్పుచుందురు. కొంత మనసులో పురాణముల కంటే శాస్త్రములు గొప్పవని తోచుచున్నప్పటికి, తమ బయటి గౌరవము కొరకు పురాణములను విడువలేని వారు చాలామంది కలరు. మనుషులను ఇంతగ చిక్కుబెట్టు పురాణములను, శాస్త్రములను గురించి తెలుసుకొందాము.
ఒక విషయమును గురించి చెప్పునపుడు నోటితో చెప్పితే ఆ మాట ఆ సమయములోనే, ఆ ప్రాంతములోనే వినిపించగలదు. అలా కాకుండ చెప్పిన విషయము ఎల్లప్పుడు అన్నిప్రాంతములలో తెలియాలంటే అది గ్రంథరూపము కావాలి. పుస్తకరూపమైన విషయము పుస్తకమున్నంత వరకు ఉండగలదు. అటువంటి పుస్తకములు రెండు రకములు గలవు. అవియే పురాణములు, శాస్త్రములు. జరుగవలసిన కాలములో మానవుడు ఈ విధముగ నడువవలెనని సమాచారమును తెలుపు నిమిత్తము, వ్రాయబడిన పుస్తకములు కల్పితములతో కూడుకొన్నవి కొన్ని కాగ, ఏమాత్రము కల్పితములు లేనివి కొన్ని గలవు. కల్పితములతో కూడుకొన్నవే పురాణములు. మానవున్ని మంచి మార్గములో నడుపవలెనను పురాణములలోనున్న ఉద్దేశ్యము మంచిదే. అయినప్పటికి తెలుపబడిన విషయము కల్పితములతో కూడుకొన్న దానివలన హేతువాదుల విమర్శలకు నిలువలేక పోవుచున్నవి. విమర్శలకు జవాబివ్వగల స్థోమత పురాణములలో లేదు. వాస్తవ జ్ఞానము పురాణములలో లేని దానివలన మానవుని కర్మను తొలగించు స్థోమత వాటియందు లేకుండపోయినది. అందువలన వాటిని తెలియుట వలన కాలక్షేపమేగాని కర్మక్షేపములేదని, పూర్వము నుండి వాటికి గుర్తింపుగ ఒక పేరుపెట్టారు, దానినే పురాణ కాల క్షేపమన్నారు. పురాణ కాలక్షేపమను మాటతో వాటి వలన కాలము వృథా అగునని అర్థము. క్రొత్త విషయములను తెలియజేయడములో మానవున్ని మంచి మార్గములో నడుపుటకు ఉద్దేశించిన పురాణముల ప్రయోగము మానవున్ని పూర్తి కర్మవిముక్తున్ని చేయలేక పోయాయి. పురాణములకు పూర్తిగా అతుక్కుపోయిన వారికి ఈ విషయము కొంత బాధ కల్గించునదైనప్పటికి వారిని మాత్రము పురాణములు ముక్తులజేయలేవు. పురాణములకు పూర్వమునుండి పుక్కిడి పురాణములని నామము కూడ కలదు. నిజమైన విషయములు బొడ్డు దగ్గరనుండి వచ్చునని, కల్పితములు, అబద్దములు నోటిపుక్కిడి నుండి వచ్చునని కొందరి ఉద్దేశ్యము. మేము చిన్నప్పుడు పాఠశాలలో ఉన్నపుడు నిన్నటి దినము ఎందుకు రాలేదని మాష్టారు ఒక పిల్లవానిని అడిగినపుడు, ఆ పిల్లవాడు నిన్నటి దినమున నాకు తలనొప్పిగ ఉండెను, దానికి రాలేదనెను. ఆ మాటవిన్న మాష్టారు నీవు చెప్పుమాట బొడ్డు దగ్గర నుండి వస్తావుందా లేక పుక్కిడిలో నుండి వస్తావుందా అని అడిగెను. ఆ మాటలో అర్థము నీవు చెప్పుమాట నిజమైనదా లేక అబద్దమా అని అడగడము. దీని ప్రకారమే పుక్కిడి పురాణములనడములో అబద్దపు పురాణములని అర్థమవుచున్నది.
పురాణములు పుక్కిడినుండి వచ్చునవైతే, బొడ్డుదగ్గరనుండి వచ్చునవి శాస్త్రములని చెప్పవచ్చును. శాస్త్రములనగా శాసనములతో కూడుకొన్నవని చెప్పవచ్చును. "శాపము" అన్న పదము నుండి పుట్టినది "శాసనము". శాసనము అనిన, శాపము అనిన జరిగి తీరునదని అర్థము. శాసనములతో కూడుకొన్నది శాస్త్రము. శాస్త్రములోని ప్రతి విషయము సత్యముతో కూడుకొని ఉండును. ఒక్క మారు చెప్పబడిన శాస్త్రవిషయము ఎప్పటికి అసత్యము కాదు. ఉదాహరణకు అందరికి తెలిసిన గణిత శాస్త్రమును తీసుకొందాము. అందులో 5×4=20 అన్నది శాసనము. ఇది ఒక్క మారు చెప్పబడి నదైనప్పటికి చిరకాలము ఉండిపోయినది. ఎప్పుడైన ఎక్కడయిన జరిగితీరునది శాసనము లేక శాస్త్రము అన్నట్లు, 5×4=20 అను మాట ఎప్పటికీి మారదు. ఈ విధముగ ఉన్నవి శాస్త్రములని తెలుసుకొన్నాము. పురాణములు ఒక రకమైన గ్రంథములు కాగ, శాస్త్రములు మరొక రకమైన గ్రంథములు. ప్రయాణము ఒకటే అయిన తూర్పు పడమర దిశలు వేరైనట్లు, ఉద్దేశ్యము ఒకటే అయిన పురాణములువేరు, శాస్త్రములువేరు. తూర్పు, పడమరకున్నంత తేడా పురాణములకు శాస్త్రములకు గలదు. వాటి వ్యత్యాసమును గ్రహించలేక అన్నీ పుస్తకములే కదా అంటే స్త్రీకి, నపుంసకునికి తేడా తెలియనట్లగును. అందువలన ఏ పుస్తకము ఏ కోవకు చెందినదో, శాస్త్రమేదో, పురాణమేదో, వాటికున్న వ్యత్యాసమేమో తెలియవలసిన ఆవశ్యకత చాలా ముఖ్యము. అలా కాకపోతే కాళ్లవిూద పోసుకోవలసిన దుమ్మును నెత్తివిూద, నెత్తివిూద పోసుకోవలసిన నీటిని కాళ్లవిూద పోసుకొన్నట్లుండును. కాళ్లకు దుమ్ము అయినప్పటికి తలవిూద నీరు పోసుకొంటే శరీరమంత తడిసి శుభ్రపడడమే కాక, కాళ్లకున్న దుమ్ముకూడ నీటిలో కొట్టుకొనిపోయి కాళ్లుకూడ శుభ్రము కాగలవు. అలాకాక కాళ్లవిూద నీరుపోసుకొని తలవిూద దుమ్ము పోసుకొంటే అంతవరకు శుభ్రముగనున్న శరీరమంత అశుభ్రముగ మారును. ఆ విధముగనే పురాణములు ఏ గ్రాహితములేని వారికి ప్రాథమికముగ తెలుసుకొనుటకని, కొంత గ్రాహితశక్తి గలవారికి శాస్త్రములు అవసరమైనవని తెలియాలి. అలాకాక గ్రాహితమున్న వారు పురాణములు చదివినా, గ్రాహితము లేనివారు శాస్త్రములు చదివినా ఏమాత్రము వారికి రుచింపవు. ఈ కారణము చేతనే కొందరు పురాణములను అర్థము చేసుకొన్నట్లు, శాస్త్రములను అర్థము చేసుకోలేక పోవుచున్నారు. మరికొందరు శాస్త్రములను తెలిసి పురాణముల జోలికిపోకున్నారు.
ఇపుడు మనము చూడబోవు భగవద్గీత నూటికి నూరుపాళ్ళు శాస్త్రము కావున పురాణములలోనికి దీనిని కలుపకూడదని ముందే తెలుపుచున్నాము. ఇక్కడ ముఖ్యముగ మేము చెప్పవలసిన విషయము, విూరు వినవలసిన విషయము మరొకటిగలదు. అదేమనగా! అష్ఠాదశ పురాణములని పురాణములు మొత్తము 18 గలవు. అవి వరుసగ 1) బ్రహ్మపురాణము 2) పద్మపురాణము 3) విష్ణుపురాణము 4) శివ పురాణము 5) భాగవతము 6) నారదపురాణము 7) మార్కండేయ పురాణము 8) అగ్నిపురాణము 9) భవిష్యత్‌పురాణము 10) బ్రహ్మకైవర్తన పురాణము 11) లింగపురాణము 12) వరాహపురాణము 13) స్కంధ పురాణము 14) వామనపురాణము 15) కూర్మపురాణము 16) మత్స్య పురాణము 17) గరుడపురాణము 18) బ్రహ్మాండపురాణము.
ఈ పదునెనిమిది పురాణములు పూర్వమునుండి పేరుగాంచియున్నవి. శాస్త్రములు, పురాణములలో మూడవ భాగము మాత్రము గలవు. పురాణములు 18 కాగ శాస్త్రములు కేవలము 6 మాత్రమే. శాస్త్రములకంటే పురాణములు సంఖ్యలో మూడింతలు పెద్దవైనప్పటికి విలువలో రాతికి రత్నానికి వున్నంత తేడా పురాణములకు, శాస్త్రములకు గలదు. 18 పురాణములకు లేని విలువ 6 శాస్త్రములకుండుట వలన ఆ విషయము పూర్వము కొందరికి జీర్ణము కానిదయ్యెను. పూర్వము కాలగమనములో పురాణప్రియులు ఎక్కువ, శాస్త్రప్రియులు తక్కువైనపుడు, అదే అదనుగ పురాణములకు విలువ చేకూర్చుటకు, శాస్త్రములకు విలువ లేకుండ చేయుటకు, పెద్దకుతంత్రము జరిగినది. శాస్త్రములను లేకుండ చేసి, శాస్త్రముల స్థానములలో మరో ఆరు విధానములను ప్రవేశపెట్టి, అవియే శాస్త్రములని ప్రచారము చేశారు. అలా మొదటి ఆరు శాస్త్రములు శాస్త్రములుగ ప్రచారము కాక, శాస్త్రములుకాని ఆరు శాస్త్రములు ప్రచారమైనవి. అవి వరుసగ 1) శిక్ష 2) వ్యాకరణము 3) చంధము 4) నిరుక్తము 5) జ్యోతిష్యము 6) కల్పము. ఈ కాలములో ఇవి అందరికి తెలియకున్నా వేదపరిచయమున్న వారికి, పురాణములలో పూర్తి మునిగిన వారికి బాగా తెలియును. శాస్త్రముల పేరుతగిలించుకొన్న వీటిలో ఉదాహరణగ ఒకదానిని వివరించుకొని చూస్తాము.
1) శిక్ష :- ఇందు వేద శబ్దముల యొక్క అక్షరముల స్థాన జ్ఞానములను, ఉదాత్త, అనుదాత్త, స్వరిత స్వరముల జ్ఞానమును చెప్పబడి ఉన్నది. ఉదాత్తమనగ ఉచ్ఛము, అనుదాత్తమనగ నీచము, స్వరితమనగ సమానము అని తెలియవలెను. ఈ శిక్షా శాస్త్రములను వ్యాస శిక్ష, భరద్వాజ శిక్ష, నారదశిక్ష అని మూడు విధములుగ చెప్పుచున్నారు. ఇది ఒకటవ శాస్త్రమైన శిక్షలో ఉన్న పద్ధతి. వేదశబ్దములు ఇలా పలువలెనని ఒకచోట గట్టిగ, ఒకచోట చిన్నగ పలుకుటకు చెప్పిన పద్ధతిని శాస్త్రమన్నారు. అదియు ఒక శాసనరూపము గాక ఇది నారదుని పద్ధతని, ఇది వ్యాసుని పద్ధతని, ఇది భరద్వాజ పద్ధతని తెలిపినారు. దానిని బట్టి వ్యాసుడు పల్కినట్లు భరద్వాజుడు పల్కలేదని, భరద్వాజుడు పల్కినట్లు నారదుడు పల్కలేదని తెలియుచున్నది. శాస్త్రము ఒకే పద్ధతి కల్గి ఎప్పటికి మారదను సూత్రమునకు శిక్షాశాస్త్రము విలువలేకుండ చేసినది. మధ్యలో కల్పించబడిన ఇటువంటి శాస్త్రములను వదలి నిజమైన శాస్త్రములేవో తెలుసుకొందాము.
పురాణములకంటే శాస్త్రములు ఎంతో ముందుపుట్టినవి. అవి వరుసగ ఈ విధముగ గలవు 1) గణిత శాస్త్రము 2) జ్యోతిష్యశాస్త్రము 3) ఖగోళశాస్త్రము 4) రసాయనిక శాస్త్రము 5) భౌతికశాస్త్రము 6) యోగశాస్త్రము. ఈ ఆరు శాస్త్రములు మినహా ఏ శాస్త్రములు లేవు. ఇక్కడ కొందరొక ప్రశ్న అడుగవచ్చును. అదేమనగా! ఈ ఆరు శాస్త్రములకంటే నేడు బాగా ప్రచారములో ఉన్నది వాస్తుశాస్త్రము. ఇల్లు కట్టించుకొను వారంతా వాస్తుశాస్త్రము ప్రకారము కట్టించుకొనుచున్నారు. అది విూలిస్టులో లేదే అని అడుగవచ్చును. దానికి మాజవాబు ఏమనగా! మేము చెప్పిన ఆరు శాస్త్రములు తెలిసినవారు చాలా తక్కువగ ఉన్నారు కాని, వాస్తుశాస్త్రజ్ఞులు మాత్రము ఎక్కడ చూచిన తయారైనారు. ఇక దీని విషయము గురించి చెప్పాలంటే ఇప్పుడున్న వాస్తుశాస్త్రమనేది అసలు కల్ల. వాస్తు ప్రకారము ఇల్లు కట్టుకోవాలనడము మరీ విచిత్రమైన మాట. వాస్తుప్రకారము లేని ఇంటిలో కష్టాలు,నష్టాలు వస్తాయనడము యోగశాస్త్రమునకే విరుద్ధమైన మాట. మనిషికి లభ్యమగు ఇల్లు వాడు పుట్టినపుడే ప్రారబ్ధములో నిర్ణయించబడివుండును. మధ్యలో ఎవరూ నిర్ణయించలేరు. ఒకరికి ఎటువంటి ఇల్లు జీవితములో దొరుకునను విషయము జ్యోతిష్యములో ఉండును. అంత తప్ప ఇంటిని గురించి ప్రత్యేకమైన శాస్త్రములేదని గుర్తించవలెను.
శాస్త్రములు ఆరు, పురాణములు పదునెనిమిది సంఖ్య ఎప్పటికి మారునది కాదు. ఆరు శాస్త్రములలోని గణితశాస్త్రముతో జ్యోతిష్యశాస్త్రము ముడిబడియున్నది. అందువలన గణితములేని జ్యోతిష్యముండదు. అలాగే జ్యోతిష్యశాస్త్రముతో ఖగోళశాస్త్రము ముడిబడియున్నది. అట్లే ఖగోళశాస్త్రముతో రసాయనిక శాస్త్రము, రసాయనికశాస్త్రముతో భౌతికశాస్త్రము, భౌతికశాస్త్రముతో యోగశాస్త్రము అనుసంధానమై ఉన్నవి. భౌతికమనగా శరీరమునకు సంబంధించినది. మానవుడు శరీరము ధరించివున్నాడు. శరీరములో ఎన్నో భాగములతో నివాసము చేయు జీవాత్మ, పరమాత్మలోనికి ఐక్యము కావడానికి యోగశాస్త్రమును తెలిసి తీరాలి. గణితము, జ్యోతిష్యము, ఖగోళము, రసాయనికము, భౌతికము అను ఐదుశాస్త్రములు మానవుని మనుగడలో ప్రపంచసంబంధముగ ఉపయోగపడుచున్నవి. ఆరవ శాస్త్రమైన యోగశాస్త్రము మాత్రము మానవునికి ప్రపంచసంబంధముగాకాక పరమాత్మ సంబంధముగ ఉపయోగపడుచున్నది. మానవుడు ప్రపంచములో బ్రతుకుటకు ఐదుశాస్త్రములు కావలసియుండగ, ప్రపంచమును వీడి పరమాత్మలోనికి ఐక్యము కావడానికి, ఆరవశాస్త్రమైన యోగశాస్త్రము తప్పనిసరిగ అవసరము. మానవునికి తప్పనిసరిగ అవసరమైన యోగశాస్త్రము అనునది ఏది? ఎక్కడ గలదని కొందరడుగవచ్చును. అందరికి అవసరమైన యోగశాస్త్రమును గురించి, దానివిలువ గురించి ముందు తెలుసుకోవడము కూడ ముఖ్యమే.
మానవునికి అతిముఖ్యమైన శాస్త్రము యోగశాస్త్రము. యోగ శాస్త్రములో మానవుని కర్మను రూపుమాపు విధానము గలదు. కర్మనిర్మూలనా సూత్రములను మానవుడు బోధించలేడు, కావున స్వయముగ పరమాత్మయే ఈ శాస్త్రమును భగవంతుని రూపముతో బోధించాడు. భగవంతుడు బోధించిన యోగశాస్త్రము మూడు భాగములుగ ఉన్నది. భూమి విూద కొన్ని దేశములలో యోగశాస్త్రము లోని ఒక భాగమును భగవంతుడు ఎక్కువగ బోధించాడు. ఏ దేశములో, ఏ భాగము అవసరమో, ఏ భాగమును అక్కడి ప్రజలు అర్థము చేసుకోగలరో, ఆ భాగమునే ఎక్కువగ బోధించాడు. భారతదేశములో మాత్రము యోగశాస్త్రములోని మూడు భాగములను బోధించాడు. ఇక్కడ మూడు భాగములలోని ఏ భాగమును అనుసరించినా మోక్షము పొందు అవకాశము గలదు. భారతదేశము ఇందూదేశము, అనగా జ్ఞానముకల్గిన దేశము. జ్ఞానమును అవగాహన చేసుకొను స్థోమత ఇందువులలో గలదు, కావున యోగశాస్త్రము యొక్క మూడుభాగములను సంపూర్ణముగ బోధించారు. యోగశాస్త్రములోని మూడు భాగములు వరుసగ 1) జ్ఞానయోగము లేక బ్రహ్మయోగము. 2) రాజయోగము లేక కర్మయోగము. 3) భక్తియోగము లేక విశ్వాసయోగము అనునవి గలవు. మూడు యోగభాగములు మూర్తీభవించిన యోగశాస్త్రము భారతదేశములోనే బయల్పడడము మన అదృష్టమేనని చెప్పవచ్చును. మూడు యోగభాగములలో స్వయముగ పరమాత్మ అంశయైన భగవంతుని చేత చెప్పబడిన యోగశాస్త్రమే భగవద్గీతా గ్రంథము.
స్వచ్ఛమైన యోగశాస్త్రమైన "భగవద్గీత" గ్రంథములోనే మిగతా దేశములలో గల ఇతర మత గ్రంథరూపములో చెప్పబడిన సారాంశము కూడా గలదు. కావున భగవద్గీతను ఏ మతస్థుడు, ఏ దేశస్థుడు ఖండించలేడు. వారి వారి మతములలోని సారాంశము భగవద్గీతలో ఒక భాగమైవుండడమే దీని ప్రత్యేకత. ఎంతో గొప్ప యోగశాస్త్రమైన భగవద్గీతలో కూడ కొందరు రచయితలు చెప్పిన భావములచేత దాని గొప్పతనమునకు ముసుగుపడు ప్రమాదమేర్పడినది. గీతకు భాష్యమును చెప్పిన వారికి భగవద్గీతలోని మూడు భాగములు తెలియక పోవడము, వారిలో పురాణముల భావములు ఇమిడివుండడము మరియు భగవద్గీత ఒక శాస్త్రమను విషయము కూడ వారికి తెలియక పోవడము, మొదలగు కారణముల చేత గీతయొక్క విలువ భారతదేశములోనే తెలియకుండ పోయినది. అందువలన ఇతర మతస్థులు కూడ గీతను గురించి హేళనగ మాట్లాడు అవకాశము గలదు. కొందరు ఇందువులే గీతను చిన్నచూపు చూచుచున్నారు. ఇందూమతమునకు మూలగ్రంథము భగవద్గీతయని తెలియనివారు చాలామంది ఇందూమతమును వదలి ఖురాన్, బైబిలు మొదలగు మూలగ్రంథములున్న ఇతర మతములలోనికి పోవుచున్నారు. అన్ని మతముల సూత్రములు భగవద్గీతలో భాగమైవుండగ, ఇందూమతమునే వదలి ఇతర మతములలోనికి పోవడమునకు కారణము, భగవద్గీత యొక్క సారాంశముగాని, దాని విలువగాని ఎవరికి తెలియక పోవడమేనని తెలియుచున్నది. ఎంతో మంది భగవద్గీతను అనేక భాషలలో అనువదించివుండగ, ఇందూమతములో ఇప్పటి వరకు దాదాపు మూడువందల మంది స్వామిజీలు గీతకు భాష్యము వ్రాసివుండగ, గీతబోధకులమని కంకణము కట్టుకొనివుండువారు అనేకులుండగ, ఈ మతమునే వదలిపోవు పరిస్థితి ఎందుకు ఏర్పడినదో అందరు ఆలోచింప తగిన విషయము. ఇప్పటికి పల్లెల ప్రాంతములలో గీత అంటే ఏమిటో తెలియనివారు 90 శాతముగలరు. వీటన్నిటికి కారణము గీత ఇప్పటి వరకు సరైన విధానములో శాస్త్రబద్దముగ బోధింపబడకపోవడమేనని చెప్పవచ్చును. శాస్త్రమును శాస్త్రముగ కాక పురాణమువలె బోధించడము వలనను, ఎన్నో పురాణవిషయములు గీతలో కలపడము వలనను, ముఖ్యముగ ముక్తి కొరకు భగవద్గీత అని తెల్పక, భుక్తి మరియు జీవనసరళికొరకని గీతామహత్యమును చేర్చడము వలన, యోగశాస్త్రమైన గీత దానివిలువను కోల్పోయినదని తెల్పుచున్నాము. భగవద్గీత ధర్మయుక్తమైనది కాగా అధర్మయుక్తమై పోయినట్లు కన్పిస్తున్నదని తెల్పుచున్నాము.
భగవంతుడు తెల్పిన స్వచ్ఛమైన, శాసనబద్దమైన, యోగశాస్త్రమైన భగవద్గీత ఇటువంటి సమయములో పూర్తి అవసరము. ఏ మతస్థులు, ఏ దేశస్థులు విమర్శించలేనిది, ఇది మా మతమునకు సంబంధించినదేనని ఇతరులు కూడ చెప్పుకొనునట్లు, అర్థభావములతో కూడుకొన్న భగవద్గీత మనకు కావలెను. హేతువాదుల, నాస్తికవాదుల సంశయములను తీర్చి వారిని కూడ ఆస్తికులకంటే గొప్పగ దేవుని విశ్వసించునట్లు చేయు భగవద్గీత ఎంతో అవసరము. అటువంటి భగవద్గీతను గుర్తించాలంటే ముందు దాని వివరము, పరిచయము కొంతయిన తెలియాలి. గీతను గురించి ముందు తెలియవలసిన వివరమే ఈ "గీతా పరిచయము". భగవద్గీత అంటే ఏమిటో తెలియాలంటే తప్పనిసరిగ గీతాపరిచయము చదవాలి. గీతాపరిచయమును చదివిన తర్వాత గీతను సులభముగ అవగాహన చేసుకోవచ్చును.
ఇంతవరకు శాస్త్రములను, పురాణములను విడదీసిచెప్పిన మేము శాస్త్రబద్దముగ భగవద్గీతను వ్రాయడము జరిగినది. అదియే "త్రైతసిద్ధాంత భగవద్గీత". త్రైతసిద్ధాంత భగవద్గీత ఆధ్యాత్మికవిద్యలో ఒక పెద్దమలుపులాంటిది. దీనిలో ఎన్నో కల్పిత శ్లోకములను నిర్దాక్షిణ్యముగ తీసివేయడము ఒక ముఖ్యవిషయమైతే, గీత 17 అధ్యాయములేనని, ఒక అధ్యాయమును తీసివేయడము మరియొక సంచలన విషయము. త్రైతసిద్ధాంత భగవద్గీతలో దాదాపు 50 శ్లోకములకు భావమే మార్చి వ్రాయడము ఒక విప్లవములాంటిది. గీతలోని పురాణవిషయములను ఖండించి స్వచ్ఛముగ గీతను శాస్త్రముగ తీర్చిదిద్దడమైనది. ఎన్నో మలుపులు తిరిగిన "త్రైతసిద్ధాంత భగవద్గీత" ను చదువుటకు ముందు గీతాపరిచయమును చదివితే గీత సులభముగ అర్థము కాగలదు. గీతలో ఇప్పటివరకు ఏమున్నదో, ఏముండవలయునో తెలియుటకు, గీతయొక్క పేరులో గల అర్థమును మొదట వివరించుకొనుచు, గీతా పరిచయమును మొదలు పెట్టెదము.
"గీత" అంటే ఎందరో పెద్దలు ఎన్నో అర్థములు చెప్పివున్నారు. కాని మనందరికి సులభముగ తెలిసిన పద్ధతిలో "గీత" అంటే "హద్దు" అని తెలుసు. రామాయణములో ఒకనాడు లక్ష్మణుడు కూడ ఈ గీతను దాటవద్దని ఒక హద్దును ఏర్పరచి అడవిలోనికి పోయాడని అందరికి తెలుసు. అలాగే ఈ గీతలో ఉంటే జీవత్వమునకు అర్థముందని, ఈ గీత దాటితే మానవత్వమునకే అర్థములేదని భగవంతుడు ఏర్పరచిన హద్దునే "భగవద్గీత" అంటున్నాము. లక్ష్మణుడు ఆనాడు పుల్లతో భూమి మీద గీత గీచి దీని లోపలుంటే రక్షణ ఉంటుందని, ప్రమాదము వుండదని, దీనిని దాటకూడదని సీతకు చెప్పాడని చరిత్రలో ఉన్నది. అలాగే భగవంతునిగ ఉద్భవించిన పరమాత్మ, మాటలతో జీవత్వమునకు హద్దు ఏర్పరచి ఈ హద్దు విూరితే మానవత్వమునకు అర్థమే లేకుండ పోవునని, ఈ హద్దులో ఉన్నంతవరకు జీవత్వమునకు అర్థముంటుందని, ఈ గీతలోపలుండు వానికి దైవత్వము ప్రాప్తించునని తెలుపుచు క్రమపద్ధతిగ గీచిన గీతయే "భగవద్గీత".
గీత అంటే హద్దు అనియు, రేఖ అనియు, గీయబడిన గీత అనియు మేము చెప్పితే అర్థము చేసుకోలేని అప్రబుద్దులు కొందరు "అర్థము ఏ నిఘంటువులోనిది? విూకు ఎవరు చెప్పారు? మాలాంటి విజ్ఞులు నవ్విపోతారను ధ్యాస కూడ లేకుండా చెప్పారే!" అని హేళనగా మాకు ఉత్తరములు కూడ వ్రాశారు. అటువంటి వారందరికి చెప్పు జవాబేమనగా! ఇతరులు ఇంతకుముందు చెప్పిన విషయమును, ఇతరులు ఇంతకుముందు వ్రాసిన విషయమును, మేము చెప్పడముగాని, వ్రాయడముగాని ఎప్పటికి ఉండదు. అందువలన మా రచనలలోని పుస్తకములలో అన్ని క్రొత్త విషయములుగానే కనిపిస్తూయుంటాయి. కృష్ణుడు గీతను చెప్పాడు, అది అంతకు ముందు ఎవరు చెప్పినదికాదు, వ్రాసినదికాదు. ఏసుప్రభువు తన జీవితములో కొన్ని మాటలు చెప్పాడు, అవి ఆయనకంటే ముందు ఎవరు చెప్పలేదు. కృష్ణుడుకాని, ఏసుప్రభువుకాని ఎలాగ ఎవరిని అనుసరించి చెప్పలేదో, అలాగే మేము ఎవరిని అనుసరించి చెప్పలేదు. మాచే వ్రాయబడిన వ్రాతలన్నీ ప్రత్యేకతను కల్గియున్నవేనని అందరు గ్రహించవచ్చును. అదే పద్ధతి ప్రకారము గీత అంటే ఇంకా ప్రత్యేకముగా ఏమి చెప్పుచున్నామనగా!
గీత అనగా గీయబడినది. ఎవరు గీచారు అని ప్రశ్నించుకుంటే, దేవుని చేత గీయబడినదని జవాబు తెలియుచున్నది. దేవుడు కనిపించేవాడు కాదు, ఆయన ఎట్లు గీచాడు అని ప్రశ్నరావచ్చును. దానికి జవాబు ఏమనగా! శరీరములోని జీవుడు కూడ కనిపించడములేదు. అయినప్పటికి మన శరీరములో కనిపించని మనము (జీవులము) శరీరమునకున్న హస్తము ద్వార గీతలు గీయుచున్నాము కదా! అలాగే కనిపించని దేవుడు ప్రకృతి అను తన శరీరముతో గీత గీచాడు, అని నీవు ఎందుకు అనుకోకూడదు? ఇపుడు మరియొక ప్రశ్న రాగలదు. జీవుడు కనిపించలేదు, దేవుడు కూడ కనిపించలేదు. అయినను కనిపించే శరీరముతో గీచిన గీత కనిపిస్తుంది కదా! అలాగే కనిపించే ప్రకృతితో గీచిన గీత కనిపించాలి కదా! అలా ఎక్కడ కనిపించలేదే అని ప్రశ్నించవచ్చును. తెలివైన వారికి మరొక విధముగ యోచనవచ్చి, కృష్ణుడు కూడా మనలాంటి శరీరమున్న మనిషే, అతని శరీరము ద్వార వచ్చిన గీత పుస్తకరూపములో ఉన్నది. దేవుడు మనలాంటి మనిషి కాకున్నా ప్రకృతి అను అతని శరీరము ద్వార వచ్చిన గీత ఏ రూపములోను కనిపించలేదే అని ప్రశ్నించవచ్చును. ఈ ప్రశ్నకు జవాబేమిటో, ఏ విధముగ అర్థము చేసుకోవాలో క్రింద చూస్తాము.
శ్రీకృష్ణునిచే గీయబడిన భగవద్గీత అను పుస్తకము కొందరి వద్ద ఉండవచ్చును, కొందరి వద్ద లేకుండపోవచ్చును. దేవునిచే గీయబడిన గీత ప్రతి ఒక్కరివద్ద గలదు. మానవులవద్దేకాక, సమస్త జీవరాసులవద్ద కూడ కలదు. దేవుడు గీచిన గీత లేక హద్దు జీవుడైన నిన్ను వదలి లేదు. ఆ గీత ఎప్పటికి నిన్ను అంటిపెట్టుకొని ఉన్నది. దేవుడు గీచిన హద్దు ఏదో తర్వాత పేజీ పటములో చూడుము.
భూమి విూద ఎన్నో దేశాలు కలవు. ప్రతి దేశమునకు ఆ దేశము యొక్క సరిహద్దు రేఖ ఉండును. సరిహద్దు రేఖ లోపలయుండునది పలానా దేశమనియో, ఫలానా రాజ్యమనియో చెప్పుచుందుము. ఈ పద్ధతి ప్రకారము భారత దేశమునకు చుట్టు ఒక హద్దు కలదు. అలాగే ప్రపంచములో ఎన్నో జీవరాసులు కలవు. ఒక్కొక్క జీవరాసి శరీరము ఒక్కొక్క విస్తీర్ణము కల్గియున్నది. ఈ పద్ధతి ప్రకారము మానవుని శరీరము కూడ ఒక విస్తీర్ణము కల్గియున్నది. దేశమునకు హద్దు ఉన్నట్లు, మానవ శరీరమునకు కూడ హద్దు ఉన్నది. దేశము యొక్క సరిహద్దు లోపల ఆ దేశము యొక్క చట్ట రాజ్యాంగముండును. అలాగే శరీరము యొక్క గీత లోపల ఆ శరీరము యొక్క నిబంధన రాజ్యాంగముండును. దేశము యొక్క చట్ట రాజ్యాంగము ఆ దేశము యొక్క పరిధి అను హద్దులోపలనే ఉండును. అలాగే శరీరము యొక్క నిబంధన రాజ్యాంగము, ఆ శరీరము యొక్క పరిధి అనబడు హద్దులోనే ఉండును. దేశమునకు ఒక రాజు ఉన్నట్లు, శరీరమునకు జీవుడు అను ఒక రాజు కలడు. దేశములోని రాజుకు కొంత పరివారమున్నట్లు, శరీరములోని జీవుడను రాజుకు కూడ 25 మంది పరివారము కలరు. దేశములోని రాజు ఒక చోట కూర్చొని తన పరివారము చేత రాజ్యపరిపాలన చేస్తున్నట్లు, శరీరములోని జీవుడు ఒక చోట కదలకవుండి తన పరివారము చేత శరీర పరిపాలన చేస్తున్నాడు. దేశ పరిధిలోని రాజ్యాంగమును తెలుపునది చట్టము. అలాగే శరీర పరిధిలోని యంత్రాంగమును తెలుపునది నిబంధన లేక ధర్మము. చట్టము దేశపరిధిలో ఉన్నట్లు, ధర్మము దేహము యొక్క పరిధిలో ఉన్నది. చట్టములో న్యాయము, అన్యాయము ఉన్నట్లు, ధర్మములో పుణ్యము, పాపములు కలవు. దేశములోని చట్టము, న్యాయా న్యాయములను నిర్ణయించినట్లు, శరీరములోని ధర్మము పుణ్యపాపములను నిర్ణయించుచున్నది.
సరిహద్దును పరిశీలిస్తే అది ఏ దేశమైనది, అందులోని చట్టము ఏమిటి అన్నది తెలియును. అట్లే శరీరహద్దును పరిశీలిస్తే అది ఏ దేహమైనది, దానిలోని ధర్మమేమిటన్నది తెలియును. చట్టమేమిటన్నది దేశ హద్దును చూస్తే తెలియునట్లు, ధర్మమేమిటన్నది దేహ హద్దును చూస్తే తెలియును. నీ శరీరములోపలి ధర్మములేమిటో తెలియాలంటే శరీర గీతలోపలే తెలియాలి. దేహము లోపల గల స్థూల, సూక్ష్మ వివరములను తెలుపునదే గీత, అదియే భగవద్గీత. భగవద్గీతలోని ప్రతి శ్లోకము శరీరపరిధిలోని ధర్మములనే తెలియజేశాయి తప్ప ఏ శ్లోకము శరీరపరిధి దాటి చెప్పలేదు. శరీరపరిధియే ధర్మములకు నిలయమైనది, కావున పరిధిలోపలనే చెప్పబడిన దానిని గీత అన్నారు. దేవుడు భగవంతుని రూపములో చెప్పినది కావున దీనిని భగవద్గీత అన్నారు.
విచక్షణా దృష్ఠితో చూస్తే నీ గీతలోపల ఉండునదే భగవద్గీతయను గీతలో ఉన్నది. దేవుడు మానవుని ఊహకు ఎన్నో సిద్ధాంతములను అందించినట్లు "గీత" అను పదమును కూడ అందించాడు. గీత అంటే రేఖ అనియు, హద్దు అనియు, గీయబడిన గీత అనియు వ్రాయించాడు. అలా వ్రాయించుట వలన ఎప్పటికైన మానవుని బుద్ధికి సంశయమొచ్చి ఇది ఏ గీత? ఏ హద్దు? అని ప్రశ్నించుకొని జవాబుకొరకు ఎదురుచూస్తాడని దేవుని ఉద్ధేశ్యము. అలా చూచువానికి గీతలోని ధర్మములన్ని అర్థము కాగలవని ఆయన భావము. ఎంతో మనమంచి కోరి దేవుడు గీతను గీతగానే మనకు పరిచయము చేస్తే, దానిని తెలుసుకొందామను యోచన కొందరి బుద్ధికి రాక, ఏ నిఘంటువులోనిది ఈ అర్థము అని అడిగితే, వారు రాక్షస జాతివారో, దేవతల జాతివారో, వారినేమనాలో విూరే యోచించండి. నిఘంటువులలో (డిక్షనరీలలో) ప్రపంచ అర్థాలుండవచ్చును. కాని పరమాత్మ భావములుండవు. అట్లుంటే దేవుడు భూమి విూదకు వచ్చి తన జ్ఞానము ఇది అని చెప్పవలసిన పనిలేదు. ధర్మాలు అధర్మాలుగ మారినపుడే దేవుడు తన జ్ఞానమును తెలియజేస్తానన్నాడు. దేవుడు భగవంతునిగ భూమి విూదకు వచ్చినపుడు అధర్మపరులకు ధర్మములు రుచించవు. అందువలన శ్రీకృష్ణజన్మలోను, ఏసుప్రభువు జన్మలోను ఆయన మాటను ధిక్కరించినవారు, ఆయనకు ఇబ్బందులు కలుగజేసినవారు ఎందరో కలరు. ఆనాడే ధిక్కరించిన వారున్నపుడు, ఈనాడు మాలాంటివారిని తప్పుపట్టువారు ఎందరో ఉండవచ్చును. అటువంటి వారిని దృష్ఠిలో పెట్టుకోకుండ, దైవజ్ఞానము విూద శ్రద్ధకలవారికి వాస్తవ జ్ఞానము అందివ్వాలను ఉద్ధేశ్యముతో, గీత అనగా దేవునిచేత గీయబడిన గీత అని అర్థము చెప్పుచున్నాము.
ధర్మములను మాటలతో భగవంతుడు గీచిన గీతను మీకు అందించా లనుకొన్నాము. కాని ముఖ్యగమనిక ఏమంటే ఆరోగ్యవంతునికి కాక రోగమున్న వారికే వైద్యుడు అవసరమన్నట్లు, ఇంతవరకు ఆత్మవాదులకే కాక ఆస్తికులకు, నాస్తికులకు, హేతువాదులకు కూడ మా బోధలు ఎక్కువ ఉపయోగపడినాయి. కొందరు ఆస్తికుల నుండి కొన్ని విమర్శలు వచ్చినప్పటికి, హేతువాదులు, ఆస్తికులు, నాస్తికులు మా బోధల వలన నిజమైన ఆత్మవాదులుగ మారడము మాకు ఉత్సాహము నిచ్చాయి. అందువలన హేతువాదులకు, నాస్తికులకు, ఆస్తికులకు కూడ అర్థమగునట్లు, వారు కూడ దైవత్వమును తెలుసుకొనునట్లు, భగవద్గీత అందరికి జవాబై నిలుచునట్లు వ్రాయపూనినాము. మేము వ్రాయు భగవద్గీతయందు ఎన్నో క్రొత్త అద్భుత ఆశ్చర్యకరవిషయములు బయటపడగలవని ముందే తెలుపుచున్నాము.
ఎన్నో ప్రశంసలు, మరెన్నో విమర్శలు చవిచూచిన మేము అన్నిటిని యోచించి, సత్ విమర్శలన్నిటికి తట్టుకొనునట్లు, సత్యమునే ప్రకటించడము మంచిదని మాలోని చిత్తము నిర్ణయించడము మాకు సంతోషము. గీతలో శ్రీకృష్ణుడు కూడ ఒక మాట చెప్పాడు. మానవునికి కావలసిన సుఖముల కోసమే వేదార్థములున్నవని, కష్టములు కడతేరి సుఖములు ప్రాప్తించుటకు వేదములిలా చెప్పుచున్నవని, ఎన్నో విధముల ఉపన్యాసములను కొందరు వేదవాదులు తేనెవలె తియ్యగ ఉండునట్లు బోధించుచున్నారని, ఆ మాటలు విన్నవారు వారి సుఖముల కోసమే దైవ ప్రార్థనాక్రియలు చేయుచున్నారని, శ్రీకృష్ణుడు చెప్పినట్లు అలాంటి తియ్యటి మాటలు మా బోధలలో లేని కారణమున కొందరికి రుచించడము లేదు. "సుఖములందాసక్తి కలిగినవారు వారి సుఖముల కోసమే పూజలు కూడ చేయుదురు కాని వారికి ఆత్మజ్ఞానము పట్టుబడదు" అని శ్రీకృష్ణుడు అన్నాడు. ఆ విధముగనే నేటి ప్రజలు చాలామంది అదే మార్గములో ఉన్నారు. అంతేకాక బోధించు బోధకులు కూడ భగవద్గీత శ్లోకములను మంత్రములవలె జపించుచున్నారు. కాని వాటిలోని ఉన్నత భావమును గ్రహించలేకపోయారు.
మా బోధలు ప్రపంచ విషయములకు ఏమాత్రము ఉపయోగపడవు. కావున నేటి ఆశల వాతావరణములో మా బోధలకు ఆదరణ చాలా తక్కువని కూడ మాకు తెలుసు. అయినప్పటికి సత్యమునే తెల్పి మానవులను శాశ్వతమైన మోక్షప్రాప్తిని ఆశించునట్లు చేయాలని మా ఆకాంక్ష. మా బోధల వలన అందరు కాక వేయింటికొకడు మోక్షాసక్తుడైన మా కృషికి ఫలితము చేకూరినట్లే, మా ఉద్దేశ్యము నెరవేరినట్లే.
గీత అంటే ఒక రేఖ అనియు, మానవాళికి ఒక హద్దును చూపున దనియు, మానవాళికందరికి పనికి వచ్చునదేననియు చెప్పారు. కాని ఫలానమతము వారికని పేరుపెట్టి చెప్పలేదు. అందువలన గీత విశ్వ మానవులందరి నిమిత్తము శాసన రూపముగనున్న శాస్త్రమని తెలియవలెను. అందులో తెలిపిన విషయములు మానవ జాతికంతటికి ఉపకరించునప్పటికి, గీత కేవలము హిందువులకేనని మిగతా మతముల వారనుకోవడము శోచనీయము. బహుశ చెప్పిన వానిని బట్టి అతను ఆ దినము ఏ మతమువాడో, ఆ మత సంబంధమైనదేనని కొందరనుకొని, గీతను ఒక్క హిందూమతమునకే పరిమితము చేసియుండవచ్చును. భగవద్గీత ప్రకటితమైన ఐదువేల నూటాయాభై సంవత్సరముల క్రితము,ఏ ఇతర మతములేదని ముఖ్యముగ గమనించినట్లయితే, గీత ఇప్పుడున్న అన్ని మతముల మానవులకని సులభముగ తెలియగలదు. అందులోని విషయములు జన్మించిన జీవునికని ఉండుట వలన, అన్ని మతముల వారు జన్మించిన జీవులే అయినందువలన, ఆ విషయములు సమస్త మానవాళికి సంబంధించినవని తెలియుచున్నది. ఇంకనూ పరికించి చూచినట్లయితే అందులో స్త్రీ,పురుష భేదములు లేక కేవలము ఆత్మ పరముగ చెప్పబడియున్నదని తెలియుచున్నది. అటువంటప్పుడు ఒక కులమని, ఒక మతమనియేకాక, స్త్రీ పురుషుల భేదము కూడ లేకుండ గీతను తెలుసుకొనవచ్చునని తెలియుచున్నది. బైబిలు క్రైస్తవులకన్నట్లు, ఖురాన్ మహ్మదీయులకన్నట్లు, భగవద్గీత హిందువులకేనని చాలామంది భావిస్తున్నారు. బైబిలులో క్రైస్తవులపేరు, ఖురాన్‌యందు ఇస్లామ్ పేరుండుట వలన ఆయా గ్రంథములను ఆయా మత గ్రంథములనుటలో అర్థము కలదు. కాని భగవద్గీతయందు ఏ మతము పేరు లేదు, చెప్పినవాడు ప్రవక్తగాదు, అటువంటపుడు అది ఒక మత గ్రంథమనుటలో అర్థమే లేదు.
భగవద్గీతను అర్థము చేసుకొంటే మానవ జాతికంతటికి అధిపతియైన దేవుడున్నాడని తెలియగలదు. అందువలన అందరికి అధిపతియైన దేవున్ని గూర్చి తెలుసుకొను నిమిత్తము భగవద్గీతను చదువవలెనని కోరుచున్నాము. బహుశ కొందరు భగవద్గీతను ఇప్పటికే చదివివుండవచ్చును. అందులో యోచించు వారికి సంశయములు ఉండవచ్చును. సంశయములు తీరక గీతకు దూరముగ, నాస్తికులుగ కొందరు మారివుండవచ్చును. అలాంటి వారినందరిని దృష్టిలో పెట్టుకొని వారియందు ఉద్భవించిన ప్రశ్నలను సేకరించి ఆ ప్రశ్నలకు సరియైన జవాబు నొసగు భగవద్గీతను మేము వ్రాయడము జరిగినది. చదువరులైన మీరు మా వ్రాతలలోని ఏ విషయమును గ్రుడ్డిగ నమ్మక యోచించి నిర్ణయించుకోండి. మేము చెప్పు విషయములు కొన్ని మీరింతవరకు విననివిగ ఉండవచ్చును. పూర్వము ఎవరూ ఈ శైలిలో చెప్పక వేరుగ చెప్పివుండవచ్చును. అయినప్పటికి వాస్తవికతను అర్థము చేసుకోగలరను భావముతోనే వ్రాయుచున్నాము.
భగవద్గీతను శ్రీకృష్ణుడు యుద్ధరంగమున బోధించాడని అందరికి తెలియును భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునునితో "ఇది రహస్యమైన జ్ఞానము, నీకు మాత్రమే బోధిస్తున్నాను" అని అన్నాడు. అలాంటపుడు అర్జునునికొక్కనికే తెలిపిిన విషయమును సంజయుడెలా వినగలిగాడు? అన్నది ప్రశ్న. ఒకవేళ దూరదృష్టి, దూరశ్రవణము సంజయుడు కలిగివుండవచ్చును. ఆ విషయము శ్రీకృష్ణునికి తెలియకుండానే సంజయుడు యుద్ధరంగములోని ప్రతి విషయమును ధృతరాష్ట్రునికి తెలియజేయుచున్నాడనుకొందాము. విశ్వరూప సందర్శన సమయమున "ప్రకృతి కన్నులతో నా విశ్వరూపమును చూడలేవు, నాయొక్క విశ్వరూపము జ్ఞాననేత్రులకు మాత్రము అగుపడగలదు. దేవతలు కూడ ఇంతవరకు చూడని నా విశ్వరూపమును నీకు మాత్రము చూపగలను. విశ్వరూపమును చూచుటకు జ్ఞాననేత్రమునిచ్చుచున్నాను"అని శ్రీకృష్ణుడు చెప్పి ప్రత్యేకమైన జ్ఞానదృష్టినిచ్చి అర్జునునికి మాత్రము చూపినపుడు, సంజయుడు ఏ దృష్టితో విశ్వరూపమును చూచి ధృతరాష్ట్రునికి తెలియబరిచాడు? అన్నది ప్రశ్నే. అర్జునునితో పాటు సంజయుడు కూడ విశ్వరూపము చూడగలిగినపుడు, ఎవరు చూడని దానిని నీకు మాత్రము చూపుచున్నానని శ్రీకృష్ణుడెందుకన్నాడు? ఇలా ఆదిలోనే భగవద్గీత ప్రశ్నలమయమైనది. ప్రశ్నల రూపములో యోచించువారికి సత్యమైన సమాధానము ఏమిటన్నది మనము చూడాలి.
ఇలా యోచించుతూపోతే గీతలోని సత్యములు, రహస్యములు బయట పడగలవు. భగవంతుడు చెప్పిన మాటలు ఎన్నో సందర్భములలో, ఎన్నో విధములుగ మారి, చివరకు ఏడు వందల శ్లోకముల రూపముగ గీత నిలిచివున్నది. ఈనాడు మనముందున్న భగవద్గీతకు, ఆనాడు శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీతకు ఏమైన మార్పు ఉన్నదాయని యోచిస్తే, అన్ని విధములైన ప్రశ్నలకు సమాధానము దొరకగలదు. ఆ యోచించేదేదో నిరూపణాత్మకముగ, శాసనబద్ధముగ ఉన్నపుడు అసలైన సత్యములు బయల్పడగలవు. అన్నిటికి సమాధానములు దొరకగలవు. ఈ పంథాలో యోచించినపుడే యుద్ధరంగమున శ్రీకృష్ణుడు అర్జునునకు ఎంతసేపు బోధించాడను ప్రశ్నకు సమాధానము కూడ లభించగలదు.
వ్రాయడానికి చేతకాని లేక చదువురాని ఒక వ్యక్తి ఇంకొక ఊరిలో గల తన బంధువుకు సమాచారము తెలియజేయాలనుకొన్నపుడు, సమాచారమును వ్రాయగలిగిన వ్యక్తి వద్దకు పోయి ఉత్తరము వ్రాసిపెట్టమని అడుగుతాడు. వ్రాయుటకు ఎదుటి వ్యక్తి ఒప్పుకొన్నపుడు సమాచారము చెప్పునతడు చెప్పవలసిన ముఖ్యమైన విషయమును చెప్పి ఊరకుండును. ఆ విషయమును విన్న అతడు దానిని ఎలా పొందుపరిచి వ్రాస్తే చదువుకొనువాడు సులభముగ తెలుసుకొనగలడని యోచించి, ఎదుటివాడు అర్థము చేసుకొనుటకు తగిన విధముగ ఉండునట్లు మరియు ముందు క్షేమ సమాచారములు అడిగినట్లు, చివరిలో ముగింపును తెలియజేస్తు పొందుపరిచి వ్రాయును. చెప్పినవాడు విషయమొకటి చెప్పినప్పటికి వ్రాయువాడు దానికొక పద్ధతి, వరుస, అందము, అర్థము కలుగజేసి వ్రాసినట్లు భగవంతుడు చెప్పిన మూల సారాంశ విషయమును వ్యాసుడు శ్లోకముల రూపమున తీర్చిదిద్ది వ్రాశాడు. భగవంతుడు చెప్పిన విషయము చిన్నదైనప్పటికి అది అర్థమగుటకు అనేక శ్లోకములుగ, అనేక అధ్యాయములుగ వ్యాసుడు వ్రాయుట వలన ఏడువందల శ్లోకముల గ్రంథ మైన గీత మన ముందున్నది. అన్ని శ్లోకముల సారాంశమును పరిశీలించి చూచితే మూల విషయము బహుకొద్దిగ ఉన్నట్లు తెలియగలదు. అన్ని అధ్యాయములను పిండిచూస్తే సారాంశము కొద్దిదే. "సర్వము వ్యాపించివున్న వానిని నేనొక్కనినే" అను మాటకు విభూతి యోగమను అధ్యాయములో 42 శ్లోకములు చెప్పబడియున్నవి. "సర్వము నేనే" అను విషయమును సూచించుటకు 42 శ్లోకములు వ్రాయబడితే 700 శ్లోకములందు ఇమిడిన భావము కొద్ది నిమిషములలో మాట్లాడు మాటలకంటే మించి ఉండదు. చిన్న విషయమును పొడవైన జాబుగ వ్రాసుకొన్నట్లు, శ్రీకృష్ణుని చిన్న సందేశమును వ్యాసుడు పెద్దగ వ్రాసి చూపించాడే తప్ప ఇంత పొడవైన భగవద్గీత యుద్ధరంగములో జరుగలేదు. జరుగుటకు వ్యవధియులేదు. వ్యాసునిచే వ్రాయబడిన ఇంత పెద్ద భగవద్గీత మానవులకు సులభముగ అర్థమగుటకే తప్ప వేరు ఉద్దేశ్యము లేదని తెలియాలి.
సంజయుడెలా యుద్ధరంగములోని విషయమును ధృతరాష్ట్రునికి తెలియ జేసాడన్నది గీతలోని మొదటి ప్రశ్న. ఒకవేళ సంజయుడు శ్రీకృష్ణుని సందేశమును, ఆయన విశ్వరూపమును తెలుసుకోగలిగాడనుకొందాము. అపుడు అర్జునునకేగాక ఆ విషయము సంజయునికి, ధృతరాష్ట్రునికి కూడ తెలిసినట్లగును. అలా యుద్ధరంగము మొదటిలోనే శ్రీకృష్ణుడు ఫలానాయని తెలిసియుంటే సంజయుడు ధృతరాష్ట్రుడు ఇద్దరు యుద్ధరంగములోనికే సరాసరి పరుగెత్తిపోయి యుద్ధాన్ని నిలిపియుండెడివారు. అదియును గాక గీతా బోధ సంజయుడు వినియుంటే "నీకుతప్ప" అని భగవంతుడు అర్జునునితో చెప్పిన మాటే అసత్యమగును. భగవంతుని మాట ఎప్పటికి అసత్యముకాదు. సంజయుడు గీతను విన్నాడన్న మాటే అసత్యమంటే సంజయుడు విని చెప్పకపోతే భగవద్గీతయే లేదు కదా! అను సంశయము ఏర్పడగలదు. ముందు నుయ్యి వెనుక గొయ్యిగ వున్న ఈ ప్రశ్నకు సమాధానము దొరకలేదంటే ఇంతవరకు మనము గీతను సరిగ అర్థము చేసుకోలేదని తెలియుచున్నది. గీత అడ్డంకుల మార్గములో అర్థమైనది గాని, సంశయరహితమైన మార్గములో అర్థము కాలేదని తెలియుచున్నది. ఇటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పలేని స్థితిలో తాముండియు, ప్రజల దృష్ఠిలో తెలిసిన వారిగ చలామణి అగుచున్న కొందరు మీ జ్ఞానము ఏపాటిదని మమ్ములను హేళనగ మాట్లాడడము కూడ జరిగినది. అలా వారు మమ్ములను వెక్కిరించినా పరవాలేదు. వారి మూలముగ ప్రజలు గీతను సరియైన మార్గములో అర్థము చేసుకోలేక పోయారన్నదే మా బాధ. ఇంతవరకు సత్యమైన విషయములు ఎవరి బలహీనతతో బయటికి రాలేదో ప్రజలు గ్రహించగలరు. బ్రహ్మవిద్యలో సత్యమును అన్వేషించువారికి, హేతువాదులకు ఇంతవరకు చాలా చోట్ల లభించిన జ్ఞానములో వారియందు ఉద్భవించిన ప్రశ్నలకు జవాబులు దొరకక ఎందరో నాస్తికులైనారు. "మాప్రశ్నలకు జవాబులు లేవు. అంతా బూటకము, మాటలతో మభ్యపెట్టడము తప్ప మరేమిలేదు. దేవుని పేరు చెప్పుచు సంశయాలతో కూడుకొన్న జ్ఞానము చెప్పుచున్నారు" అని నాస్తికులు అంటున్నారు.
అలాంటి నాస్తికులు కూడ మా జ్ఞానము ద్వార వారి ప్రశ్నలకు జవాబులు తీసుకొని, ఈ పద్ధతి ప్రకారమైతే దేవుడున్నాడని ఒప్పుకొనుచుండగ మిగతావారు వెక్కిరించిన పరవాలేదు. చాలామంది గీత రచయితలు మేము అడుగు ప్రశ్నలకు జవాబు చెప్పలేరు. ఎందుకనగా గీతలో విశ్వరూపమునకు ఆకారమును కల్పించి చెప్పారు. అక్కడ వారు చెప్పినట్లు కోరలు, ముఖము, నోరును చిత్రించుకొంటూ పోతే పరమాత్మ రూపము వికృతమైన పెద్ద పిశాచి ఆకారమును పోలియుండును. అలాంటిదా పరమాత్మ ఆకారము? దీనికేమి సమాధానము చెప్పగలరు? దేవుడు పల్కిన "చాతుర్వర్ణము" అను మాటకు వివరము బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్రులని కులముల పేర్లు చెప్పి కుల,మత భేదములు కల్గించు అజ్ఞానుల మాటలవలె దేవుని మాటలను తీర్చిదిద్దారు. వారి మాటల ప్రకారము భూమి మీద హిందూమతమునకే సంబంధములేని మతములలోని మనుజులలో పై చెప్పిన నాల్గుకులములు లేవే! వారిని ఏ దేవుడు సృష్ఠించాడు? ప్రపంచమంతా ఒకే దేవుడైనపుడు చాతుర్వర్ణమను మాట వారికి వర్తించదా? ఈ నాల్గుకులాలు లేని దేశములెన్నో ఉన్నాయి. వారిని సృష్ఠించిన వాడు ఎవడో చెప్పగలరా?
గీతయందు జ్ఞానయోగమను అధ్యాయము మొదటిలో ఆదియందే సూర్యునికి చెప్పియుంటినని భగవంతుడు చెప్పినపుడు, సూర్యుడొక మనిషికాదు కదా! అది ఒక గోళము గదా! అలాంటి గోళమునకెట్లు చెప్పాడు? ఎంతో దూరమునున్న సూర్యుడెట్లు వినగలిగాడు అను ప్రశ్నకు జవాబు చెప్పగలరా? ప్రకృతి చేత పుట్టినది, ప్రకృతి సంబంధమైనది శరీరమని, శరీరములోని కదలికశక్తి పురుషుడైన పరమాత్మదని, గుణత్రయ విభాగయోగములో 3,4 శ్లోకములలో ఉండగ, ప్రక్క అధ్యాయమైన పురుషోత్తమ ప్రాప్తియోగములో 16,17 శ్లోకములలో క్షర అక్షర పురుషోత్తములుగ పురుషున్ని మూడు విభాగములు చేసి చెప్పియుండగ, ఆ శ్లోకముల వివరము కేవలము పురుషునికే చెప్పక ప్రకృతి సంబంధమైన శరీరమును ఎందుకు తీసుకొన్నారని అడిగిన జవాబు చెప్పగలరా? ఇంతవరకు ఎందరిచేతనో వ్రాయబడిన గీతలలో ఇటువంటి ప్రశ్నలుగ మిగిలిన విషయములెన్నో కలవు. కనుక ఇప్పటికైన మేల్కొని, పవిత్రమైన కాలమును వృథా చేయక, జ్ఞానము సముద్రములాంటిదని, దానిలో ఇంకా మనకు తెలియని విషయములెన్నో కలవని, తెలుసుకొనుటకు ప్రయత్నిద్దాము.
దూరముగ కురుక్షేత్రమందు జరుగు యుద్ధమును సంజయుడు చూడగల్గుచున్నాడను కొందాము. అక్కడ ఆయనకు కనిపించునది కేవలము ప్రకృతి దృశ్యము. అక్కడున్న మనుజులు, ఏనుగులు, గుఱ్ఱములు, రథములే కనిపిస్తాయి. నేడు మనము చూచితే దగ్గరున్నవి మాత్రమే కనిపించును. ఆనాడు సంజయుడు చూస్తే దగ్గరున్నవి కాక దూరమున్నవి కూడ కనిపించాయట. అలా చూడగల్గు శక్తి ఆనాడు సంజయునికుండెడిదనుకొందాము. దూరముగ యుద్ధరంగములో గల అర్జునుడు శ్రీకృష్ణుడు కనిపించి ఉండవచ్చును. కాని అంతరంగమున లోదృష్ఠియైన జ్ఞానదృష్ఠికి కనిపించు పరమాత్మ దర్శనమెలా కనిపించింది? సంజయుడు యుద్ధరంగము మొదటి నుండి చూచాడన్నపుడు ప్రకృతి సంబంధమైన బయటి దృశ్యములే కనిపించియుండును, కాని పరమాత్మ దర్శనము కనిపించి ఉండదని తెలియుచున్నది.
ఇక్కడ కొందరికొక అనుమానము కూడ రావచ్చును. అది ఏమనగా! శ్రీకృష్ణుడు రాయబారము కొరకు కౌరవసభలోనికి పోయినపుడు, అచట దుర్యోధన దుశ్శాసనులు మొదలగువారు తాడుతో బంధించవలెనని రాగ, ఒంటరియైన శ్రీకృష్ణుడు వారి తాళ్లకు బంధింపబడక విశ్వరూపము చూపాడు కదా! అపుడు కన్నులు మిరుమిట్లు గొల్పు ఆ రూపమును చూడలేక వారు క్రిందపడిపోగ, ఆ రూపమును చూడవలెనను ధృతరాష్ట్రుని కోర్కెమేరకు శ్రీకృష్ణుడు ఆయన అంధత్వమును తీసివేసి కన్నులు కనిపించునట్లు చేశాడని, మరియు అపుడే ధృతరాష్ట్రుని భార్య గాంధారిదేవి కూడ తన కళ్లకు కట్టుకొన్న గుడ్డ తీసి విశ్వరూపము చూచినదని విన్నాము. ఆనాడు అందరు మామూలు కన్నులతోనే కదా! విశ్వరూపమును చూచినది. అటువంటపుడు యుద్ధ సమయములో అర్జునునికి చూపిన విశ్వరూపమును సంజయుడెందుకు చూచియుండడని అడుగవచ్చును. దానికి మా సమాధానమేమనగా! వారి మాట ప్రకారము దూరముగనున్న సంజయునికే విశ్వరూపము కనిపించియుంటే అచటనే దగ్గరలో నున్న సైన్యమునకు, ఇటు పాండవులకు, అటు కౌరవులకు అందరికి కనిపించియుండాలి. అట్లు అందరికి కనిపించినట్లు ఋజువే లేదు.దగ్గరున్న వారికే కనిపించని విశ్వరూపము దూరముగ ఉన్న సంజయునికి కనిపించిందనడము పూర్తి అసత్యము. అట్లే రాయబారమున విశ్వరూపమును కొందరు చూచుట, కొందరు చూడకుండ పోయారను మాట కేవలము అభూత కల్పనయే గాని నిజము కాదు. ఆత్మ, పరమాత్మలు ఇంద్రియాలకు అగోచరమైనవి. కంటికి కనిపించవు, చెవులకు వినిపించవని భగవంతుడు గీతయందే తెలిపియున్నాడని మరువకూడదు. అలా తెలిపియుండగ పరమాత్మ స్వరూపమైన విశ్వరూపము కంటికి కనిపించిందనడము ధర్మవిరుద్ధమైన మాట. కనిపించినదని చెప్పువారుంటే భగవద్గీత రాజవిద్యా రాజగుహ్యయోగమను అధ్యాయములో నాల్గవ శ్లోకమున "మయాతత మిదం సర్వం జగదవ్యక్త మూర్తినా" ఇంద్రియములకు కనిపించక ఈ ప్రపంచమంతా నేను వ్యాపించియున్నాను. అని ధర్మయుక్తముగ చెప్పిన భగవంతుని మాటకే వ్యతిరేఖముగ చెప్పినవారగుదురు. అందువలన గీతను జాగ్రత్తగా పరిశీలించి ధర్మబద్దముగ చెప్పాలంటే, సంజయుడు తన కన్నులతో విశ్వరూపమును ఏమాత్రము చూడలేదు. రాయబారమున విశ్వరూపము చూపుటకు అదేమైన గారడివిద్య లాంటిదా! అవసరమొచ్చినపుడంతా విశ్వరూపము చూపితే దానికి విలువుంటుందా! అలా చూపించునదేయైతే విశ్వరూపసందర్శన యోగములో 47వ శ్లోకమున "నీవు తప్ప మరి ఎవ్వరును దీనిని చూచిన వారు లేరు" అను మాట మరియు 52వ శ్లోకమున "అర్జునా ఈ రూపమును చూడవలెనని దేవతలు కూడ కోర్కె కలిగియున్నారు. అయినను నీవు తప్ప ఎవరును దీనిని చూచిన వారు లేరు". అను మాట పనికిరానిదై పోవును. అలాంటపుడు భగవంతుడు పల్కిన మాట నిజమా లేక మానవులు చెప్పిన మాట నిజమా అని పరిశోధించి చూచితే, భగవంతుడు చెప్పినది సిద్ధాంతపరమైన శాస్త్రవచనమని, మానవుడు చెప్పినది నిరూపణకురాని అశాస్త్రీయవచనమని తెలియుచున్నది. అలాకాక విశ్వరూపమును యుద్ధరంగములో సంజయుడు, రాయబారములో మిగతావారు, చూచారంటే ఎవరు చూడలేదను భగవంతుని మాట అసత్యమై మొత్తము భగవద్గీతయే అసత్యమగును.
పురుషుడైన పరమాత్మ, ప్రకృతియైన మాయ యొక్క రహస్యములు తెలియాలంటే చాలా కష్టము. ఎచట పురుషుడున్నాడో అచట ప్రకృతి కూడ గలదు. ఎచట ధర్మమున్నదో అచటనే అధర్మము కూడ ఉన్నది. అట్లే ధర్మముల కూడలియైన భగవద్గీతయందు కూడ అధర్మపు వాసన వుండనే ఉన్నది.
అందువలన పూర్తి వివరణ చేయగలిగినపుడే అందులోని ధర్మములను స్వీకరించి అధర్మములను విడనాడగలము. అటువంటి వివరము ప్రకారము చూస్తే గీతను 700 శ్లోకముల రూపముగ భగవంతుడు చెప్పలేదు. మరియు సంజయుడు విశ్వరూపమునుగాని, యుద్ధరంగములోని ప్రకృతి దృశ్యమును గాని చూడలేదు. అనగా యుద్ధరంగమున జరుగుచున్న ప్రత్యక్ష దృశ్యమును కూడ చూడలేదు. ఇక్కడ కొందరికి ఆశ్చర్యము కల్గి సంజయుడు చెప్పగ ధృతరాష్ట్రుడు విన్న మాటలేగదా భగవద్గీత రూపముగనున్నదను అనుమానమును వ్యక్తము చేయవచ్చును. దానికి మా సమాధానమేమనగా! భగవద్గీత కేవలము శ్రీకృష్ణుడు అర్జునుడు మాట్లాడిన విషయమే గాని ఇతరులకు ఏమాత్రము సంబంధము లేదు. అలాకాక గీత, సంజయ ధృతరాష్ట్ర సంభాషణే అయివుంటే గీతకు సంజయ ధృతరాష్ట్ర సంవాదమని పేరు కల్గెడిది. శ్రీకృష్ణార్జున సంవాదమని పేరు కల్గెడిది కాదు.
గీతను వ్రాసిన వ్యాసుడు సంజయ ధృతరాష్ట్రులు మాట్లాడినట్లు వ్రాశాడు కదా! ఇది అబద్దమా అని కూడ కొందరడుగవచ్చును. దానికి మా సమాధానము ఏమనగా! వ్యాసుడు తెలివిగ శ్రీకృష్ణార్జునులు మాట్లాడిన విషయమంటూనే ఆ విషయమును సంజయ ధృతరాష్ఠ్రులు మాట్లాడినట్లు చిత్రీకరించాడు. ఆనాడు వ్యాసుడు అలా చేయడములో ఒక విశేషము గలదు. ప్రజలు సులభముగ అర్థము చేసుకోవాలను ఉద్దేశ్యముతోనే సంజయ ధృతరాష్ట్రులపాత్ర కల్పించి కొద్దిపాటి గీతను 700 శ్లోకముల రూపముగ చేశాడు. మంచిని బోధించుటకు చిన్న పిల్లలకు బూచోనిని కల్పించి కథ చెప్పినట్లు, వ్యాసుడు కొంత పొడవుగ కొన్ని పాత్రలు కల్పించి చెప్పడములో తప్పులేదు. అయినప్పటికి చిన్న పిల్లలకు చెప్పు కథలో బూచోని పాత్ర ఎంత అసత్యమో, గీతలో సంజయ ధృతరాష్ట్రుల పాత్రలు మరియు 700 శ్లోకముల పొడవు అంతే అసత్యమగును.
కొందరు పెద్దలు తమ జ్ఞానమును పుస్తక రూపములో వ్రాయునపుడు దానినెట్లు చెప్పవలెనని యోచించి, ఎట్లు చెప్పితే ప్రజలు నమ్మగలరని ఆలోచించి, కొన్ని పాత్రలు కల్పించి, వారి సంభాషణ రూపములో వ్రాశారు. ఉదాహరణకు అటువంటివే "సీతా రామాంజనేయ సంవాదము", "శ్రీకృష్ణరుక్మిణీ సంవాదము", "శివపార్వతి సంవాదము", "గురుశిష్య సంవాదము" మొదలగునవి గలవు. ఇలా ఎన్నో సంవాదరూపముగ వ్రాయబడియున్నాయి. కాని నిజముగ సీత రామాంజనేయులు, శ్రీకృష్ణరుక్మిణీలు మాట్లాడలేదు. అట్లే శివపార్వతులు, గురుశిష్యులు మొదలైన పాత్రలన్ని కల్పితమేనని తెలియాలి. అలాగే సంజయ ధృతరాష్ట్రులు కూడ కల్పితమే అగుదురు.
ఇపుడు భగవంతుడు చెప్పిన గీత వ్యాసునికెలా తెలిసిందను ప్రశ్న కూడ రాగలదు. మరియు గీతను వ్యాసుడు ఎవరి ద్వారా తెలుసుకొన్నాడన్న ప్రశ్న కూడ రాగలదు. దానికి మా సమాధానమేమనగా సావధానముగ పరికించి చూచితే శ్రీకృష్ణుని ద్వార తెలుసుకొన్న అర్జునుడే తాను తెలుసుకొన్న విషయమును యుద్ధానంతరము కొంత కాలమునకు వ్యాసునికి స్వయముగ తెలిపియుండాలి. అర్జునుని ద్వార తెలుసుకొన్న విషయమును పాత విషయమనిపించనట్లు, అపుడే జరుగుచున్న తాజా విషయమన్నట్లు, సంజయ ధృతరాష్ట్రుల పాత్రలు కల్పించి వ్యాసుడు వ్రాశాడు. అలా వ్యాసుడు వ్రాయుట వలన ఎవరికీ అనుమానము రాలేదు. ఆలోచించని బోధకులు కూడ అలాగే చెప్పుచు పోయారు. ప్రజలంతా అదే నిజమనుకొన్నారు. కాని యోచించు కొందరికి మాత్రము గీత అడ్డగీతగ తోస్తున్నది. ఆలోచించు వారికి కొంత అసత్యము అందులో కనిపిస్తున్నది. జ్ఞానదృష్ఠి కల్గిన వారికి గీతరూపమే వేరుగ కన్పిస్తున్నది. వారందరు ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో తెలియక నాస్తికులుగ మారజొచ్చారు. ఇటువంటి అర్థముకాని సమయములో గీత సత్యమైనదని, హేతుబద్దమైనదని, అందులోని విషయములు సిద్ధాంతపరమైన శాసనములని చెప్పుట మావంతయినది.
సంజయునికి సంబంధములేదని చెప్పడముతో భగవద్గీత నిజముగ భగవద్గీతయే అగును. మధ్యలో సంజయ గీత కాదు. దీనితో భగవద్గీత పెద్ద మలుపు తిరిగినట్లగును. ఇంత పెద్ద మలుపు త్రిప్పితే గాని చిక్కులుగల్గు తప్పుదారి వదలి, ఆటంకములు లేని మంచి దారిలోనికి కలుసుకోలేము. అందువలన పాఠకులు కడు జాగ్రత్తగా సత్యాసత్యములను యోచించి తెలుసుకోవాలని కోరుచున్నాము.
ఇప్పుడొక విప్లవాత్మకమైన ప్రశ్న వేసుకొందాము. అది ఏమనగా! భగవంతుడు చెప్పినది భగవద్గీత అని అర్థముగదా! అలాంటపుడు మనము చదువుచున్న భగవద్గీత 18 అధ్యాయములుగ ఉన్నది. అందులో మొదటి అధ్యాయము అర్జున విషాద యోగముతో మొదలైనది. అర్జున విషాదయోగము కూడ భగవద్గీతయేనా! లేక కాదా? దీనికి సమాధానము చూస్తాము.
ఒక డాక్టరు, ఒక రోగి మాట్లాడుకొనుచున్నారనుకొందాము. రోగి తనకున్న రోగమును గూర్చి చెప్పగ, డాక్టరు రోగనివారణకు కావలసిన మందులు పత్యములు జాగ్రత్తలు మొదలగున్నవన్ని చెప్పాడనుకొందాము. ఇప్పుడు దేనిని వైద్యమంటాము? డాక్టరు చెప్పిన విషయమును మాత్రమే వైద్యమంటాము కదా! రోగి చెప్పిన దానిని వైద్యమనము కదా! అలాగే అర్జునున్ని రోగి అనుకుందాము. శ్రీకృష్ణున్ని వైద్యుడు అనుకుందాము. అలాంటపుడు శ్రీకృష్ణుడు చెప్పినదే వైద్యముగాని, అర్జునుడు చెప్పినది వైద్యము కాదుకదా! అర్జునుడు తనలోనున్న అజ్ఞానమనే రోగాన్ని బయట పెట్టినపుడు, జ్ఞానమనే వైద్యమును శ్రీకృష్ణుడు చెప్పినపుడు, ఆ విషయమునకు వైద్యమని పేరుపెట్టితే, అది కేవలము శ్రీకృష్ణుని మాటలకే వర్తించాలి. కురుక్షేత్ర యుద్ధమున అర్జునుడు తనలోని విషాదమును బయట పెట్టగా, సర్వదుఃఖములను పోగొట్టు జ్ఞానమును శ్రీకృష్ణుడు చెప్పాడు. అపుడు ఆయన మాటలకే భగవద్గీతయను పేరు కల్గినది.
"భగవద్గీత" అనగ భగవంతుడైన శ్రీకృష్ణుడు పల్కినదేగాని అర్జునుడు పల్కినదికాదని తెలియుచున్నది. అలాంటపుడు భగవద్గీత ఎక్కడి నుండి మొదలైనదను ప్రశ్న ఉద్భవిస్తే! వైద్యులు చెప్పినదే వైద్యమన్నట్లు భగవంతుడు చెప్పినదే భగవద్గీతయగును. కావున భగవంతుని మాటలు ఎక్కడినుండి మొదలైనవో అక్కడినుండే భగవద్గీత మొదలైనదని నిస్సంకోచముగ చెప్పవచ్చును. మనకు అవసరమైనవి, మనము తెలుసుకో తగిన విషయములు, భగవంతుని మాటలతోనే మొదలైనవి. భగవంతుని మాటలు జీవులు తెలుసుకోతగ్గ హద్దు కావున వాటిని " గీత" అనడము జరిగినది.
ఇక్కడ కొందరికొక సంశయము రాగలదు. అదేమనగా! రోగి లేనిది వైద్యుడు, రోగము లేనిది వైద్యము అవసరము లేదు కదా! అలాంటపుడు అర్జునుడు చెప్పిన విషాదయోగము భగవద్గీతలో ప్రాముఖ్యము కాదా! అని అడుగవచ్చును. దానికి సమాధానమేమనిన విషాదమన్నది ఆనాటి అర్జునునికే కాక ఈనాటి మానవులందరికి విషాదమున్నది. అలాంటపుడు గీత మానవులందరికి అవసరము. విషాదమున్నది ఆనాటి అర్జునునికేనన్నట్లు ఆయన యొక్క విషాదమునే చెప్పుకోనవసరము లేదు. శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు భవరోగములున్న వారందరకి వైద్యములాంటివే, భవరోగములనునవి మానవులైన మనందరకున్ననే ఉన్నవి. కావున అర్జున విషాదయోగమను అధ్యాయమును భగవద్గీత అను పేరుతో చెప్పుకోనవసరము లేదు. భగవద్గీతను ప్రతి పుస్తములోను భగవంతుడు చెప్పిన విషయముల నుండియే ప్రారంభించి వ్రాసి ఉంటే ఎంతో బాగుండేది. అలాకాక ప్రతి భగవద్గీతలోను అర్జున విషాదయోగముతో మొదలు పెట్టిన దానివలన చదివిన వారందరు శ్రీకృష్ణుడు అర్జునునకు చెప్పాడని, ఆ విషయములు అర్జునుని కోసమేనని, అర్జునుని చేత యుద్ధము చేయించే దానికొరకేనని, అధైర్యపడిన పార్థుని ధైర్యపరుచుటకేనని, కేవలము అర్జునుని నిమిత్తమే భగవద్గీత ఉన్నట్లు తలచుచున్నారు. అర్జున విషాదయోగము చదివిన కొందరు "అర్జునునకు బాధ ఉన్నది. కావున ఆయనకది అవసరము. మాకేమి బాధ లేదు కావున మాకు అవసరము లేదు" అనుచున్నారు. ఇక్కడ ముఖ్యముగ చదివేవానికి తన నిమిత్తమే దీనిలోని విషయములు గలవను తలంపురావడము లేదు. అందువలన నేడు భగవద్గీత పారాయణము చేయుటకే ఉన్నదని, కంఠాపాఠము చేసుకొని పారాయణము చేయుచున్నారు. కాని దాని అర్థము గూర్చి ఎవరు యోచించడము లేదు.
బాగా పారాయణము చేయు ఒకరి వద్దకు పోయి మీరు శ్లోకములు బహుచక్కగ పారాయణము చేయుచున్నారు. అందులోని అర్థము కూడ మీకు బాగా తెలిసివుండునని అడుగగా! అందులకాయన "అర్థముతో మాకు పనిలేదు, పారాయణము చేయడము మంచిదని చేయుచున్నాము" అన్నాడు. ఆ శ్లోకములు ఎందునిమిత్తము చెప్పబడినవో తెలియకుండ కేవలము పారాయణము చేయడము ఏమి మంచిదని మేము అడుగగా! ఆయన (శ్రీకృష్ణుడు) ఏమి చెప్పితే మనకేమి? ఏమి చెప్పాడని చూచుకోవలసింది అర్జునుడు, మనము కాదు. మనము పెద్దలు చెప్పినట్లు పారాయణము చేయడము మంచిది, కాని ఇదెందుకు, అదెందుకని అడగకూడదు అని గద్దించి చెప్పాడు. ఇలా చాలామంది గీతలోని మొదటి అధ్యాయమైన అర్జున విషాదయోగముతో గీత యొక్క భావమునకు దూరమైపోవుచున్నారని తెలియుచున్నది. కావున మేమిపుడు వ్రాయు భగవద్గీతలో అర్జునవిషాదయోగము అను అధ్యాయము లేకుండ కేవలము భగవంతుడు చెప్పిన మాటలనుండియే మొదలు పెట్టి భగవద్గీతయను పేరుకు అర్థము సార్థకమగునట్లు వ్రాయదలిచాము.
కొందరు తెలివైనవారు గీతాపారాయణము మీద దృష్ఠి పెట్టక, అందులో శ్రీకృష్ణుడు ఏమి చెప్పాడని చూచేవారు కూడ గలరు. అటువంటి వారు, అందులో సత్యము తెలుసుకోవాలనుకొన్నవారు, గీతను పూర్తిగ చదివినప్పటికి అందులో నుండి ఏమి తెలుసుకోలేక చివరకు ఎన్నో సంశయములనుకల్గి, ఇది మనకేమి అర్థము కావడము లేదు. ఇందులోని విషయములు ఒకదానికొకటి పొంతన లేకుండ ఉన్నాయి. ఇది అర్జునునితో యుద్ధము చేయించుటకొరకు అతనిని ఉత్సాహ పరుచుటకు పల్కిన పల్కులేకాని, సిద్ధాంతపరముగ లెక్కించు విషయములు లేవనుచున్నారు. ఆ మాట విన్నమేము "భగవద్గీత ధర్మయుక్తమైనది, శాస్త్రబద్దమైనది. అటువంటి దానిని సిద్ధాంత పరముగ లేదనుట ఏమి మాట" అని అడుగగా! వారు వారికున్న అనుమానము లను ఇలా చెప్పుచున్నారు. "ఏమిటయ్య గీతలో ఉండేది? గ్రుడ్డిగ చదివేవారికైతే సరిపోతుంది. వివరణా దృష్ఠితో చదివే మాలాంటి వారికి సరిపోదు. ఒక చోట ఇంద్రియములకు తెలియనిది 'ఆత్మ' అంటారు, మరియొక చోట 'ఓం'అను అక్షరమే దేవుడంటారు, అక్కడ కనిపించని వినిపించని వాడు ఇక్కడ కనిపించి వినిపించే 'ఓం' ఎట్లయ్యాడు? ఒక చోట ప్రకృతియే అంతాచేస్తున్నది, నేను ఏమి చేయలేదు చూస్తున్నాను, కేవలము సాక్షిని మాత్రమేనని చెప్పి, మరియొక చోట అన్నీనేనే చేస్తున్నాను, బొమ్మలాట మాదిరి ఆడిస్తున్నాననడము ధర్మమా? సిద్ధాంతమా? ఒకచోట నాకందరు సమానమని, అందరికి నేను సముడనని చెప్పినవాడు, మరియొక చోట హెచ్చు తగ్గు కులములుగ పుట్టిస్తున్నాననడము దైవత్వమా? ఒకచోట గుణముల వలననే కార్యములు జరుగుచున్నవంటాడు మరియు గుణములను త్యజించమంటాడు. మరియొక చోట గుణములు త్యజించి పనులు మానుట తామసము అంటాడు. అలా పనులు మానకూడ దంటాడు. ఒక చోట కుక్కను, ఏనుగును, చండాలుని అందరిని సమానముగ చూడమంటాడు. మరియొక చోట వాడు శత్రువు వానిని చంపుము అంటాడు. ఒక చోట ఆత్మ చంపబడదంటాడు, మరియొక చోట అందరిని నాశనముచేయు కాలుడను నేనే అంటాడు. ఈ విధముగ గీతలో ఎన్నో దిక్కు తెలియని మాటలున్నాయి. అందువలన అర్థముతో పనిలేకుండ కంఠాపాఠముగ చదువు వారికి సరిపోతుంది గాని మాకు నచ్చదు పో" అంటున్నారు.
భావమేమిటని చూచేవారికి గీతలో కొన్ని సంశయములు వచ్చు మాట నిజమే. అంతమాత్రమున గీతను అశాస్త్రీయము, సిద్ధాంతముకాదని చెప్పుటకు వీలులేదు. గీతను తెలుగులోనికి అనువదించి అర్థము చెప్పువారు సరైన విధముగ చెప్పలేక పోవడము వలన పై విధముగ అనుమానములు కొందరికి వచ్చి ఉండవచ్చును. సత్యము చెప్పాలంటే ఆనాడు భగవంతుడు తెల్పిన గీత నేటి వరకు అర్థము కాలేదనియే చెప్పవచ్చును. ఎందుకనగా భగవద్గీతను సక్రమముగ అర్థము చేసుకోవాలంటే ముఖ్యముగ నాలుగు సూత్రములను అనుసరించి చదువ వలసియుండును. వ్రాయువారు కూడ ఆ నాలుగు సూత్రముల ప్రకారమే వ్రాసి ఉండవలెను. అలా సూత్రబద్దముగకాక ఇష్టమొచ్చినట్లు వ్రాయువారికి, ఇష్టమొచ్చినట్లు చదువువారికి గీతలోని అంతరార్థము ఎప్పటికి అర్థము కాదు. ఇంతవరకు ఈ నాలుగు సూత్రములను ఎవరు అనుసరించలేదు. కావున గీత యొక్క స్వరూపము ఎవరికి అర్థముకాలేదనియే చెప్పవచ్చును. ఈ మాటకు కొందరికి కోపము కూడ వచ్చివుండవచ్చును. గీత మాకు తెలియదా అని మమ్ములను దూషించినా ఫరవాలేదు. ఇంతవరకు సంశయరహితమైన గీత లేదు! అందువలన సంశయరహితమైన గీత కావాలంటే ముఖ్యమైన నాలుగు సూత్రములు గీత మీద పెట్టి చదవాలి. ఆ నాల్గు సూత్రములేవియనగా!
1. చదువుచున్న శ్లోకము జీవాత్మకా, ఆత్మకా, పరమాత్మకా,
ప్రకృతికా? ఎవరిని గూర్చిచెప్పబడినది?
2. చదువుచున్న శ్లోకము బ్రహ్మయోగమునకా!లేక కర్మ
యోగమునకా దేనికి సంబంధించినది?
3. చదువుచున్న శ్లోకము సాకారమునకా, నిరాకారమునకా
ఎవరిని గూర్చి చెప్పినది?
4. చదువుచున్న శ్లోకము శాస్త్రబద్దమా! కాదా?
ఈ నాలుగు సూత్రములు గీత మీద ప్రయోగించి చూడకపోతే అది ఆకారప్రాయమేయగును గాని అర్థసహితము కాదు. ఈ నాల్గు సూత్రముల ప్రకారము ఇంతవరకు ఏ భగవద్గీత వ్రాయబడియుండలేదు. కావున వాటిలో ఎన్నో సంశయములు మిగిలినవనుటలో తప్పులేదు. సంశయరహిత జ్ఞానము గీత నుండి అర్థము కావాలంటే తప్పక పై సూత్రములను అనుసరింప వలసివుండును. పై సూత్రములలో నాల్గవ సూత్రమును గీత మీద వర్తింపజేస్తే, అందులోని అశాస్త్రీయ కల్పిత శ్లోకములన్నియు బయటపడగలవు. భగవంతుని ఉద్దేశ్యమునకు ఏ శ్లోకములైతే భిన్నముగనున్నవో అవన్నియు ఈ సూత్రముతో దొరికి పోవును. భగవంతుడు చెప్పిన భావమంతయు శాస్త్రబద్దమే, కావున ఆమాటలు చదివిన వారికి ఎటువంటి సంశయములు మిగలవు. పై నాలుగు సూత్రములకు సంబంధము లేని శ్లోకములు భగవద్గీతకు ఏ మాత్రము సంబంధములేదని చెప్పవచ్చును. ఇపుడు ఈ సూత్రములు ప్రయోగించి గీతామహత్యమునకు, గీతకు సంబంధమేమైన కలదేమో చూచెదము.
గత కాలములోని పెద్దలు ఏదో మంచి చేయాలనుకొంటే ఆ పనులు నేటి సమాజములో దురదృష్ఠవశాత్తు అర్థములేనివై, అనర్థములతో కూడుకొన్నవై నిలిచినవి. పెద్దలు ఆశించిన ఫలితములకంటే వేరు ఫలితములు ఎదురైనవి. ఉదాహరణకు యమలోకమును గురించి అది ఎక్కడోవుందని, అక్కడ పాపముల పట్టిక ప్రకారము నరకము అనుభవింపవలసి ఉంటుందని భయోత్పాతము కల్గునట్లు వాస్తవానికి అక్కడ లేని యమలోకమును గురించి వర్ణించారు. దాని వలన ప్రజలకు పాపమంటే భయముకల్గి, పాపపు పనులు చేయకుందురని పెద్దల భావము. వారిది మంచి భావమేయైనప్పటికి దాని ఫలితము ఆశించినట్లు లేకుండ ప్రజల యందు వేరు విధముగ తయారై పోయినది. పాపము చేయువానికి పాపభీతి కల్గడములేదు. చేయుపని చెడ్డదని తోచినప్పటికి అది ఆ సమయానికి అనుకూలమైన పనియని పాపమువస్తే రానీలేనని, యమ లోకానికి పోయినప్పుడు కదా అనుభవించేదని, మరణించిన తరువాత ఏమో జరుగునని ఇపుడెందుకు వదులుకోవాలని, అపుడు ఏమి జరుగుతుందో ఎవడు చూచాడని, యమలోకమనునది దృష్ఠాంతము లేని మాటయని ఇష్టమొచ్చినట్లు ఎవరంతకు వారనుకొనుటకు మొదలు పెట్టారు. వాస్తవానికి పాపభీతి లేకుండ పోయినది.
పెద్దలు యమలోకము ఎక్కడో ఉందని వర్ణించక ఇక్కడే ఉందని, భూమి మీద అనుభవించు కష్టబాధలన్నియు యమబాధలేనని, వాస్తవము తెలిపియుంటే ప్రత్యక్షముగ జరుగు ఘాెరమైన బాధలను చూచి, మానవుడు పాపము యొక్క పరిణామమిట్లుండునని తెలుసుకొని, భయముకల్గి పాపపు పనుల నుండి తప్పించు కొనెడివాడు. ఉన్నదున్నట్లు చెప్పక మానవులకు అర్థము కావాలని కథల రూపముగ అల్లి చెప్పిన మాటలు మానవులకు పెడదారిని చూపినవి. అట్లే ఈనాడు "గీతామహత్యము" వలన గీత ఎడల మానవుల భావము పెడదారియే పట్టినదని చెప్పవచ్చును.
కొందరు పెద్దలు గీతను అందరు చదువవలెనని, అందరికి దానియందు భక్తి కల్గునట్లు చేయవలెనని, గీతామహత్యమును ప్రకటించారు. దానివలన ప్రజలు మహత్యమునందు కల్పించిన ఫలితముల మీదనే మనస్సును లగ్నము చేసి గీతలోని విషయములను వదలివేశారు. మహత్యములో ప్రకటించిన ఫలితములే కావాలను కొంటున్నారు. గీతయందు ప్రకటించిన ధర్మములను చూడలేక పోవుచున్నారు. కొందరు పెద్దలు మంచిదని తెలిపిన గీతామహత్యము, మానవుల ఎడల బెడిసికొట్టి అధర్మముల వైపు మరల్చినది. ఆ విధముగ మారుటకు గీతామహత్యమునందు భగవద్గీతకు వ్యతిరిక్తమైన మరియు ధర్మవిరుద్ధమైన మాటలెన్నో గలవు. అందువలన మనమందరము గీతా మహత్యమంటే ఏమిటో తెలుసుకోవాలి.
భగవంతుడు గీతయందు ఏ ఉద్దేశ్యమును ప్రకటించాడో ఆ ఉద్దేశ్యమునకు వ్యతిరిక్త భావములు గీతామహత్యమందు వ్రాయబడుట విచిత్రము. గీతయందు భగవంతుడు ధర్మములు తెలిపియుంటే, ధర్మములకు వ్యతిరేఖముగనున్న వాక్యములను గీతామహత్యములను పేరుతో ఎందరో మరిమరి చెప్పుచు మానవాళిని ప్రక్కదారి పట్టించడము మరీ విచిత్రము. అంతో ఇంతో జ్ఞానమున్నవారు కూడ గీతామహత్యము, గీతకు వ్యతిరేఖముగ ఉన్నదేనని యోచించక నిత్యము పారాయణము చేయడము మరిమరి విచిత్రము. ఈ మా మాటలకు కొందరికి కోపమొచ్చి మా మాటలు అజ్ఞానపరమైనవని గొంతెత్తి అరవవచ్చును. పాఠకులుగ మీరు స్వయముగ యోచించుస్థితికి రండి. ఒకనాడు సత్యమును చెప్పిన ఏసుప్రభువును ఆనాటి జ్ఞానులు దైవదూషణ చేయువానిగ లెక్కించి హింసించి చంపారు. సత్యము తెలుసుకొన్న తరువాత ఆనాటి ఏసు మాటలు ఈనాడు శిరోధార్యమైనాయి. అట్లే ఒకనాడు ఖగోళ రహస్యములను చెప్పిన గెలీలియో అనునతనిని ఆనాటి జ్ఞానులన్నవారు చిత్రహింసలపాలు చేశారు. మరి ఈనాడు ఆ గెలీలియో మాటలే ఖగోళశాస్త్రజ్ఞులకు ఆధారమైనాయి. అందువలన మన లెక్కలో జ్ఞానులను పేరుకల్గిన వారు ఇది అసత్యమని అరచినంత మాత్రమున మీరు తొందరపడక ఆలోచించి చూడండి. అపుడే సత్యము తెలియగలదు.
మేము ప్రకటించిన నాలుగు సూత్రములలో నాల్గవ సూత్రము ప్రకారము చూచినట్లయితే గీతామహత్యము అశాస్త్రీయమని తెలియగలదు. గీత యోగశాస్త్రము కాగ, గీతామహత్యము వరాహపురాణమగుట గమనింపదగిన విషయము. శాస్త్రములకు పురాణములకు ఎంతో తేడాగలదనుటకు నిరూపణగ శాస్త్రమైన గీత జన్మరాహిత్యమును తెలుపగ, పురాణమైన గీతామహత్యము గీతపారాయణము వలన ప్రపంచమున్నంత వరకు మానవ జన్మకలుగునని తెల్పినది. గీతామహత్యమందు 13వ శ్లోకమున గీతను ప్రతిదినము ఒక అధ్యాయము చదువుట వలన మన్వంతరము వరకు నరజన్మమును పొంది, భూమి మీద పుట్టుచుందురని గలదు. ఇది గీతకు వ్యతిరేఖమైన మాటకాదా!
పగలంతయు పాపము చేసి సాయంత్రము గీతను చదివెడువారు, వినెడివారు కొందరున్నారు. ఎందుకనగా! గీతను వినుటవలన చేసుకొన్న పాపమంతయు పుణ్యముగ మారునని గీతామహత్యమున 18వ శ్లోకములో ఉండుట వలన వారు నిర్భయముగ పాపము చేయుచు, సాయంకాలము దానిని పుణ్యముగ మార్చుకొనుటకు గీతను వినడము చదవడము చేయుచున్నారే గాని అందులోని అర్థమును గ్రహించడము లేదు. గీతలో ఏమి చెప్పారో తెలిసి నడుచుకోమని చెప్పితే అది మాకు అవసరములేదు, అది మాకు సాధ్యము కాదు, దానికంటే గీతామహత్యములో చెప్పినట్లు గీతను వినుచువస్తే పాపము పుణ్యముగ మారునుకదా! ఇదే సులభము కదా! అనుచున్నారు.
భగవద్గీత, పాప పుణ్యరహితుడవై మోక్షము పొందమని చెప్పితే, గీతా మహత్యము పాపములను పుణ్యములుగ మార్చుకొమ్మని చెప్పుచున్నది. వాస్తవానికి పాపపుణ్యములు మానవులు సంపాదించినపుడు అవి వాని కర్మచక్రములోని సంచితకర్మలో చేరిపోయి మరుజన్మలలో అనుభవింపవలసి వచ్చును. అట్లుకాక గీతను వినుట వలన పాపము పుణ్యముగ మారుననుట అభూతకల్పనయే గాని సత్యముగాదు. వినుటకు అవకాశముండి కూడ గీతను వినని ఒక వ్యక్తిని కలిసి "ఏమయ్యా నీవు గీతను కనీసము వినడము కూడ లేదు. మీ ఇంటి ప్రక్క దేవాలయములో ప్రతి దినము గీతను పారాయణము చేయుచున్నారు కదా! వినుటకు మంచి అనుకూలము కదా" అని అడిగితే, ఆయన "నేనేమి పాపములు చేయలేదు. పాపము చేస్తే కదా పుణ్యములుగా మార్చుకొనుటకు గీతను వినాలి. నేను పుణ్యమునే చేయుచున్నాను, కావున గీతను వినవలసిన పనిలేదు" అన్నాడు. మీరెందుకలా అంటున్నారని మేమడుగగా "గీతామహత్యములో వ్రాసిపెట్టారుకదయ్యా! మీకంతమటుకు తెలియదా" అన్నాడు. ఆ మాట విన్న మేము గీతామహత్యము ముఖ్యముకాదయ్య గీతయే ముఖ్యమని చెప్పగ, అతను నవ్వి ఇలా అన్నాడు, "గీతా మహత్యములో 20వ శ్లోకము చూడుము. గీతను చదివినప్పటికి గీతామహత్యము చదవకపోతే ఫలితమేలేదని ఉంది. కావున గీతకంటే గీతామహత్యమే ముఖ్యమని మాకు తెలుస్తున్నది". ఇలా ఎందరో గీతకంటే గీతామహత్యములో చెప్పిన మాటలనే ఎక్కువగ నమ్మి నడుచుకొనుచున్నారు. అలాంటి మరియొక వ్యక్తితో కలిసి గీతలోని విషయములను అడుగగా అందులోని వివరము మాకు తెలియదన్నాడు. ఇదేమి విచిత్రము గీతను ప్రతిదినము చదువుచున్నారు కదా అని అడిగితే "అవునయ్యా గీతను ప్రతిదినము చదివితే అందులోని విషయములతో మాకు ఏమి పని" అని అన్నాడు. మరి ఆ విషయములతో పనిలేనిది ఎందుకు గీతను చదువు చున్నారని అడిగితే మోక్షముకొరకని సమాధానము చెప్పాడు. మోక్షమంటే ఏమిటని వివరము తెలిసి దానిని పొందాలంటే గీతలోని ధర్మములు తెలియాలి కదా! అని అడిగితే, అతను నవ్వి కొండనుత్రవ్వి ఎలుకను పట్టినట్లు అంతశ్రమ ఎందుకయ్యా మేము సులభముగ మోక్షము పొంది ఉన్నామన్నాడు. ఏమిటి బ్రతికియున్నట్లే మోక్షమా! దేహముతో ఉన్నపుడే మోక్షము పొందారా అని అడిగితే "అవునయ్యా గీతామహత్యములో 19వ శ్లోకము చూడలేదా! గీతను, గీత అర్థమును చదువుట వలన దేహముతో ఉండియే మోక్షము పొంది ఉందురని ఉన్నది కదా! నేను తూచ తప్పక ప్రతి దినము గీతశ్లోకములు తాత్పర్యము చదువుచున్నాను. కావున గీతామహత్యము ప్రకారము నేను ఇపుడు మోక్షములోనే ఉన్నట్లు" అని అన్నాడు. అలా కాదయ్యా మోక్షమంటే శరీరమును వదలి, ఏ శరీరము ధరించక అణువణువున వున్న పరమాత్మయందు కలిసిపోయేదని మేమంటే, అతను కోపగించుకొని "విష్ణువు చెప్పిన గీతామహత్యమునేకాదని ఇది మోక్షముకాదంటావా! నీకేమి తెలియదుపో" అన్నాడు. ఇలా ఎందరో గీతామహత్యములోని మాటలనే నమ్మి అసలైన ధర్మములను వదలి గీతకే వ్యతిరేఖముగ మారిపోయి ఉన్నారు. ఇందులో మొదటి తప్పు గీతా మహత్యమును చెప్పిన వారిదేయగును. వాస్తవానికి చెప్పినవారు ప్రజలను తప్పు దారి పట్టించాలని చెప్పలేదు, మంచియే చేయాలని చెప్పారు. కాని అది ప్రజలయెడల దురదృష్టవశాత్తు తప్పుగ పరిణమించినది.
అదే పద్ధతిలో మరికొందరు పెద్దలు గీత శ్లోకములు చదువుట వలన ప్రపంచ పనులు నెరవేరునని ఆశను కల్పించారు. ఒక్కొక్క శ్లోకము ఒక మంత్రమని పలానా శ్లోకమును మంత్రమువలె చదువుట వలన పలానా పని నెరవేరునని చెప్పారు. ఈ శ్లోకము చదువుట వలన ఈ రోగముపోవునని, మరియొక శ్లోకము వలన కోర్టులోని వ్యాజ్యమును గెలుచుదురని, అట్లే సంతానమునకొక శ్లోకము, ధనప్రాప్తికొక శ్లోకము పనికివచ్చునని చెప్పినవారు కూడ కలరు. అది చూచిన మేము ప్రపంచ పనులకు కాదయ్య గీత ఉన్నది, మనము జ్ఞానము తెలుసుకొనే దానికని చెప్పితే, జ్ఞానము అర్జునునికి చెప్పాడు గాని మనకు కాదయ్య అంటున్నారు. అర్జునునకు చెప్పినదే మనకు పనికి వస్తుంది. దాని వలన జ్ఞానము తెలిసి మోక్షము పొందవచ్చునని మేమంటే, దానికి జవాబుగ పెద్దలు దీని వలన మోక్షమొస్తుందని చెప్పలేదే! ఈ శ్లోకము చదివితే ఈ పని నెరవేరునని చెప్పారు కదా! ఈ అధ్యాయము చదివితే ఈ ఫలితముంటుందని వ్రాశారు. నాకు ఇపుడు కోర్టులో కేసువున్నది, కావున అది నెరవేరుటకు ఇది సరిపోవునని పెద్దలు చెప్పిన శ్లోకమును ప్రతిదినము పఠించుచున్నానన్నాడు. ఇలా గీతామహత్యము ప్రజలను గీతకు దగ్గర చేసినది కాని గీత యొక్క భావమునకు దూరము చేసినది. గీతకు మహత్యముందని తెలుసుకొన్నవారు శ్లోకములను పారాయణము, పుస్తకమును పూజచేయు చున్నారు తప్ప గీతలోని జ్ఞానమునకు దగ్గర కావడము లేదు. నేటి నుంచి గీతను చదువువారు శ్రీకృష్ణుడు ఆనాడు అర్జునునికి మాత్రమేకాదు, మనకు కూడ చెప్పాడని అందులోని భావము గ్రహించి చదవండి. అంతో ఇంతో జ్ఞానులైనవారు గీతామహత్యమును చదవకుండ గీతలోని విషయములనే చదివి అర్థము చేసుకోవాలి. గీతామహత్యము ప్రకారము ఏవో ప్రపంచ కోర్కెలు నెరవేరునను ఉద్దేశ్యముతో గీతను చదువకూడదు. ఫలితముల మీద ఆశ లేకుండ చదవాలి. గీతకు, గీతామహత్యమునకు ఎలాంటి సంబంధము లేదని, గీత శాస్త్రబద్దమైనదని, గీతామహత్యము శాస్త్రముకాదని, అది కేవలము పురాణమని తెలియాలి. ఇట్లు విశదీకరించుకొంటూ పోతే కురుక్షేత్రము ధర్మక్షేత్రమేనా! అను ప్రశ్న కూడ ఉద్భవించుచున్నది. గీత యుద్ధరంగములో మొదలైనది. ఆ యుద్ధము ఎందుకు సంభవించినదో అందరికి తెలుసు. నిజము చెప్పాలంటే ప్రొద్దుపోక జూదమాడి పెట్టుకున్న యుద్ధమని అందరికి తెలియును. ఆ యుద్ధము కురుక్షేత్రమందు జరిగినది. ఆ కురుక్షేత్రమును ధర్మక్షేత్రమనుట కూడ జరిగినది. వాస్తవానికి కురుక్షేత్రము ధర్మక్షేత్రమేనా అన్నది ప్రశ్న, దానిని పరికించి చూస్తాము.
ప్రపంచములో మొదటి నుండి బీదవానికొక న్యాయము, ధనికునకొక న్యాయము సహజముగనున్నది. పేదవాడు చిన్న తప్పుచేస్తే వానిని తప్పుడు వానిగ ప్రచారము చేస్తారు. అదే ధనికుడు చేస్తే వానినలా అనక వాడు చేసిన తప్పును కూడ సమర్థిస్తారు. ఒక ఊరిలో ఒక పేదవాడు ఒక స్త్రీతో అక్రమసంబంధము ఏర్పరచుకొంటే వానిని తిట్టిన ప్రజలే, అదే ఊరిలో అదే పనిని ఒక ధనికుడుచేస్తే వాడు మగవాడు ఏమి చేసిన తప్పులేదన్నారు. ఇట్లు అనేక చోట్ల అనేక విధముల తప్పులను ధనికుల ఎడల ఒక విధముగ, పేదల ఎడల మరొక విధముగ మాట్లాడడము జరుగుచున్నది. నాకు తెలిసిన మరొక వ్యక్తి జూదమాడి ఉన్న ఆస్తినంతయు పోగొట్టుకుంటే అతనిని ఛీ అన్నారు. అట్లన్నవారే ఆస్తిని మరియు భార్యను కూడ జూదములో పెట్టి ఓడిపోయిన ధర్మరాజును ధర్మపరుడన్నారు. ఇదే పేద ధనికులకుండే భేదము చూడండి.
ఆస్తిని, అన్నదమ్ములను, చివరకు భార్యను కూడ కోల్పోయిన ధర్మరాజు తిరిగి తన ఆస్తి కోసము యుద్ధమునకు పూనుకొన్నాడు. ఆ యుద్ధము ఈనాడు పంజాబ్ రాష్ట్రమునందు గల కురుక్షేత్రమందు జరిగినది. ఆ క్షేత్రములో ధర్మము ఈనాడుగాని, ఆనాడుగాని లేదనియే చెప్పవచ్చును. ఎందుకనగా ఈనాడు ఆ స్థలము పెద్దపట్టణముగ ఉన్నది. అన్ని స్థలములలో జరిగినట్లే అక్కడ కూడ మోసములు, కుతంత్రములు, హత్యలు, గలాటలు జరుగుచూనే ఉన్నవి. ఈనాడు సిక్కులు తమకు ప్రత్యేకమైన రాష్ట్రము కావాలని పోరాటము జరిపి ఎందరో హతమయ్యారు. ఆనాడు భూమి కోసమే యుద్ధము జరిగినది. భారత దేశచరిత్రలో ఈనాటికి, ఆనాటికి యుద్ధములో పేరుగాంచి రక్తముతో తడిసిన ఆ భూమిని ధర్మక్షేత్రమనుట సరియైన భావముకాదనియే చెప్పవచ్చును.
కురుక్షేత్రమును ధర్మక్షేత్రమని శ్రీకృష్ణుడు అనలేదు. మధ్యలోని వారన్నారనుకోండి. దానికి ఆ పేరు తగునా, తగదా అను ప్రశ్నను వేసుకొని యోచించాలి. ముందు ధర్మమంటే ఏమిటో తెలియాలి. ధర్మమంటే పలానాయని తెలిసినపుడే అది ధర్మక్షేత్రమా కాదా అను వివరము మనకు తెలియగలదు. అదియును కాక ధర్మయుక్తమైన భగవద్గీతను తెలుసుకొనుటకు ముందు ధర్మములను గూర్చి కొద్దిగ అయిన తెలిసి ఉండాలి. అలాంటపుడే గీతలో ఇవి భగవంతుడు చెప్పిన ధర్మయుక్తమైన వాఖ్యములని, ఇవి మనుజులు చెప్పిన అధర్మ యుక్తములైన మాటలని గుర్తించుటకు వీలగును.
జడ్జీల మీటింగులో మంత్రిగారు ఉపన్యసిస్తూ న్యాయమును నిర్ణయించి తీర్పు చెప్పు న్యాయమూర్తులను ధర్మపరులని వర్ణిస్తు, మీరు ధర్మము ప్రకారము తీర్పులు చెప్పుచు ధర్మమును కాపాడవలసినది మీ చేతులలో ఉన్నదని, ఏ ప్రలోభములకు లొంగకుండ ధర్మమును నిర్వర్తించాలన్నాడు. ఇక్కడ మంత్రిగారు న్యాయమును, ధర్మమును రెండిటిని కలిపేసి న్యాయమూర్తులను ధర్మమూర్తులు అన్నారు. అలాగే చాలామంది ప్రజలు కూడ న్యాయము, ధర్మము ఒకటేనని తలచి న్యాయమని చెప్పు సందర్భములలో ధర్మమను పదము వాడుచున్నారు. ఇది ప్రజల పొరపాటైతే ఇక స్వాములైన వారు జ్ఞానము, నీతి రెండు ఒకటేనని తలచి, వారు జ్ఞానము చెప్పవలసిన సందర్భములలో నీతిని చెప్పుచున్నారు. ఇట్లు ప్రజలకు న్యాయధర్మముల వ్యత్యాసము తెలియక పోగా, జ్ఞానము, నీతి వ్యత్యాసములు స్వాములకు కూడ తెలియకుండ పోయినవి.
నీతి, న్యాయములు ఒక జాతి కాగ, జ్ఞాన, ధర్మములు మరియొక జాతి అగును. నీతి, న్యాయము ప్రపంచ సంబంధము కాగ, జ్ఞాన, ధర్మములు పరమాత్మ సంబంధమగును. నీతి న్యాయయుక్తమైతే, జ్ఞానము ధర్మయుక్త మగును. నీతిని ఆచరిస్తే న్యాయమగును, అవినీతిని ఆచరిస్తే అన్యాయమగును. అట్లే జ్ఞానమునాచరిస్తే ధర్మమగును. అజ్ఞానమునాచరిస్తే అధర్మమగును. నీతి న్యాయములాచరించడమును బట్టి పుణ్యము, అవినీతి అన్యాయముల ఆచరణను బట్టి పాపము వచ్చుచుండును. అట్లే జ్ఞానధర్మములను బట్టి పాపపుణ్యములనబడు కర్మ నశించిపోవడము జరుగుచుండును.
నీతి, ప్రపంచమున మానవుని ప్రవర్తనను సూచించి సత్ప్రవర్తునిగ జేయును. మానవుని ప్రవర్తన మీదనే న్యాయాన్యాయములు ఆధారపడి ఉండును. ప్రవర్తన సరియైనపుడు న్యాయమని, ప్రవర్తన సరికానపుడు అన్యాయమని నిర్ణయింపవలసి ఉండును. అట్లే జ్ఞానము ఆధ్యాత్మికముగ మానవుని కట్టుబాట్లను సూచించి సత్పురుషునిగ (యోగిగ) మార్చును. జ్ఞానమును ఆచరించడము మీదనే ధర్మాధర్మములు ఆధారపడియుండును. మానవుని బాహ్యాచరణకు సంబంధించినది న్యాయము కాగ, అంతర్ భావముల మీద ఆధారపడినది ధర్మము. అంతర్ ఆచరణమున ధర్మము బాహ్యములో అవినీతి, అన్యాయముగ కనిపించవచ్చును. అందువలన ధర్మములివియని చెప్పిన శ్రీకృష్ణుడు కూడ బాహ్య ప్రపంచములో కొందరికి అసత్యపరుడుగ అక్రమాలు చేసినవాడుగ కనిపించాడు.
వాస్తవానికి నీతి న్యాయమిదియని, జ్ఞాన ధర్మములివియని తెలిస్తే గాని ఎదుటి వానిని పూర్తిగ గుర్తించలేము. నీతి న్యాయము తెలిసినంత మాత్రమున, ప్రపంచ మానవుల స్థాయిని గుర్తించి చెప్పవచ్చును. కాని యోగమార్గములో ఎవరెంతటివారో చెప్పలేము. భూమి మీద మానవులు నీతి న్యాయమును గుర్తించగలరేమో గాని, జ్ఞాన ధర్మములను గుర్తించుట చాలా కష్టము. అందువలన నేటి కాలములో చాలామంది స్వాములు కూడ జ్ఞానధర్మములివియని గుర్తించలేకపోయారు. జ్ఞానమనుకొని నీతిని పట్టుకొని వ్రేలాడుచున్నారు. ప్రజలకు పుణ్యమొచ్చు పనులనే బోధిస్తు అదే జ్ఞానమాచరణ అనుకొంటున్నారు. పాపపుణ్యములు నశింపజేయు జ్ఞానమును తెలుపలేక పోవుచున్నారు. అందువలన చాలా మంది నీతినే జ్ఞానమని, న్యాయమునే ధర్మమని తలచుచున్నారు. కోర్టులో గల న్యాయమూర్తులను ధర్మమూర్తులని, వారి ఆసనములను ధర్మాసనములని అనడము కూడ వింటున్నాము.
ఎన్నో పుణ్యములు చేయుచున్న మానవుడు వాటిని ధార్మిక కార్యములు చేస్తున్నట్లు చెప్పుచున్నాడంటే ధర్మమనునది ప్రత్యేకమైనదని తెలియక పోవడమే కారణము. అంతేకాక నీతి కార్యమైన దానము చేయు ప్రతి సందర్భములోను ధర్మము చేయుచున్నాననడము కూడ గ్రహించవచ్చును. ఒక దేవాలయములో ఫ్యానును బిగించి ఒకడు దానము చేశాడనుకొందాము. అక్కడ ఫ్యాను విూద పలానా వారి ధర్మమని దానము చేసిన వారి పేరును వ్రాసియుందురు. పలానా వారి దానమని మాత్రమువుండదు. అతను చేసినది దానమేయైనప్పటికి ధర్మమని వ్రాయుటలో అర్థమే లేదు. ఇట్లు తెలియని తనము అందరిలో వ్యాపించి చివరకు భిక్షమడుగువాడు కూడ దానము చేయండి అనక ధర్మము చేయండి అనడము చూస్తూనే ఉన్నాము. ఈ పరిస్థితిని బట్టి చూస్తే ధనికులను మొదలుకొని భిక్షగాని వరకు ధర్మమంటే ఏమిటో తెలియక పోయినదని అర్థమగుచున్నది. స్వాములు సహితము పుణ్యము వచ్చు మెత్తని నీతి మాటలే చెప్పుచున్నారంటే ధర్మమునకు భూమి మీద గుర్తింపులేదని అర్థమగుచున్నది.
ఇలా ధర్మాధర్మముల వివరము ప్రకారము చూస్తే కురుక్షేత్రము ధర్మక్షేత్రమేమాత్రము కాదు. అవినీతి అన్యాయములకు ఆలవాలమైన మనుజుల మధ్య జరిగిన పోరాట స్థలమును ధర్మక్షేత్రమనడము సమంజసము కాదు. ఆనాడు కౌరవ పాండవులు నీతిని ఉల్లంఘించి, సంగ్రామమున యుద్ధపు కట్టుబాట్లను అతిక్రమించి, మోసముతో ఒకరినొకరు చంపుకొని రక్తసిక్తమై చరిత్రకెక్కిన స్థలము ధర్మక్షేత్రమా? అలా అది ధర్మక్షేత్రమైతే, పౌరుషమే ఊపిరిగ ముఠాకక్షలతో పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని రాయలసీమ జిల్లాలు కూడ ధర్మక్షేత్రములే అగును.
ఆచరణ యోగ్యమైనది ధర్మము, అది కదలిక కల్గిన మానవులు మాత్రమే ఆచరించుటకు ఉపయోగపడును. అందువలన ధర్మపరుడు అధర్మపరుడని మనుషులను పిలువవచ్చును. కాని చైతన్యములేని భూమికి ధర్మక్షేత్రమని పేరుపెట్టడములో అర్థము లేదు. సైన్సు ప్రకారము ఒక్కొక్క వస్తువుకు ఒక్కొక్క ధర్మము గలదు. అట్లే బ్రహ్మవిద్యను తెలుపు యోగశాస్త్రము ప్రకారము దైవమునకు కూడ ధర్మము గలదు. దైవధర్మమును ఆచరించినపుడు మానవుడు కూడ దైవముగ మారిపోవును. మానవుడు పరమాత్మ నుండి బయటికి వచ్చిన జీవాత్మ. జీవాత్మ తన పూర్వపు ధర్మమైన పరమాత్మ ధర్మమును అనగ తన స్వధర్మమును ఆచరించిన ఎడల మరల పరమాత్మ స్థాయిలో చేరిపోగలడు. గాలి నీరు వేరు వేరైనప్పటికి గాలినుండే నీరు పుట్టినది. కావున నీరు తిరిగి గాలిగ మారిపోగలదు. నీరు గాలిగ మారుటకు ప్రయోగమవసరము. అట్లే జీవాత్మ పరమాత్మగ మారుటకు యోగమవసరము. ఏ ప్రయోగము ద్వార నీరు గాలిగ మారునో ఆ విధానమును శాస్త్రవేత్తలు తెల్పినట్లు, ఏ యోగము ద్వారా జీవాత్మ పరమాత్మగా మారగలదో ఆ విధానమును భగవంతుడైన శ్రీకృష్ణుడు తెల్పాడు. ప్రయోగములో ఏ పద్ధతులు అనుసరించాలో శాస్త్రవేత్తలు తెల్పినట్లు యోగములో ఏ పద్ధతులు అనుసరించాలో శ్రీకృష్ణుడు తెల్పాడు. ఆ పద్ధతులే గీతలో గలవు. నీరు గాలిగ మారుట శాస్త్రబద్దమైన విషయము. అట్లే జీవాత్మ పరమాత్మగ మారుట కూడ శాస్త్రబద్దమైన విషయము.
కౌరవులకు, పాండవులకు మధ్య జరిగిన యుద్ధములో శ్రీకృష్ణుడు రథసారథ్యము వహించాడు. యుద్ధప్రారంభములో అర్జునుడు మోహగుణము చేత అక్కడున్న వారందరు తనవారని, వారిని చంపుట చేత పాపము కూడ వచ్చునని, చింతించి నిశ్చేష్ఠుడు కాగ అపుడు శ్రీకృష్ణుడు మాట్లాడుచు యుద్ధము చేయకపోతే మొదట, వారు నిన్ను పౌరుషము లేనివానిగా లెక్కింతురని, యుద్ధము చేసి వీరుడవనిపించుకోమని, ప్రపంచ సంబంధ వచనములే చెప్పగ అర్జునుడు యుద్ధము చేయుటకు ఉత్సాహములేదని, ఏమి తోచని స్థితిలో ఉన్నానని, నన్ను శిష్యునిగ తలచి నీవు శాసించి ఏమి చేయాలో చెప్పమని అడిగినపుడు శ్రీకృష్ణుడు తన గీతను మొదలు పెట్టిచెప్పాడు. ఏ వస్తువైన అవసరమైనపుడు లభిస్తే దానికి విలువ ఉంటుంది. అవసరములేనపుడు ఆ వస్తువును అంతగ లెక్కించము. అలాగే అర్జునునికి అవసరమైనపుడు గీతను చెప్పుటవలన దానికి విలువ ఉంటుంది. అలా అవసరము లేనపుడు చెప్పితే గుడాకేశుడు (నిద్రను జయించినవాడు) అని పేరుగాంచిన అర్జునుడు కూడ ఆవులించి నిద్రపోగలడని తలచిన శ్రీకృష్ణుడు తన జ్ఞానమును అర్జునుడు అడుగు వరకు చెప్పలేదు. అలాగే ఈనాటి మానవుడు కూడ తనకు జ్ఞానము అవసరమని తెలియనంత వరకు గీతను గూర్చి చెప్పిన తెలియలేడు. ఎప్పుడో ఒకప్పుడు అర్జునునికి కల్గిన అనుభూతివలే మనకు పాపభీతి ఏర్పడినపుడు అర్జునునికి అవసరమైన గీతయే మనకు కూడ అవసరమగును. పాపభీతి ఇప్పటి మానవునికి ఎక్కడ కనిపించడము లేదు. అందువలన శ్రీకృష్ణుడు ఏమి చెప్పాడన్నది వీరికి అవసరములేకున్నది. నేటి మానవునికి కష్టభీతి తప్ప పాపభీతిలేదు. కష్టము లెలా పోతాయను ఆలోచన తప్ప, కష్టములకు కారణమైన పాపమెలా పోతుందని యోచించడము లేదు. కష్టములకు కారణమైన పాపమును గూర్చి యోచించిక కేవలము కష్టనివారణ ఉపాయములే వెదుకుచున్నాడు. అలాంటి సమయములో దారి చూపి ఇది మీకష్టములకు కారణమని తెలియజేయాల్సిన వారు గురువులు. నేటి కాలములో గురువులు కూడ జ్ఞానమను అగ్ని చేత పాపకర్మలు కాలిపోవునని. అపుడు కష్టముల నుండి బయటపడగలరని చెప్పక, కష్టనివారణకు ఈ ప్రదక్షిణలు చేయమనో, ఈ యజ్ఞములు చేయమనో, దానములు చేయమనో లేక పూజలు చేయమనో చెప్పుచున్నారు. దాని వలన తాత్కాలిక కష్టనివారణ కోసమే మానవుడు మ్రొక్కడమో లేక యజ్ఞయాగాది దానములు చేయడమో జరుగుచున్నది. అలాంటపుడు గీత యొక్క ఆవశ్యకత ఎంతటిదని తెలియకపోయినది. ఒకవేళ ఎక్కడైన గీతను చదవడముంటే అది కూడ పలానా లాభమువచ్చునను ఉద్ధేశ్యముతోనే చదువుచున్నారు తప్ప దీనివలన జ్ఞానమెంతో తెలియునని, జ్ఞానము వలన కర్మ నుండి బయటపడి ముక్తి పొందవచ్చునను ఉద్ధేశ్యముతో చదవడము లేదు. ఒకరకముగ చెప్పాలంటే గీత కొన్ని గ్రామములలో ఎక్కువగ ప్రచారములోనికి వచ్చినది. గీతామందిరములు కట్టించుకొని అక్కడ గీతను పెట్టుకొన్నారు. అటువంటి చోట కూడ గీతాశ్రవణమని వినేదానికి పోవుచున్నారు తప్ప, అందులో సారాంశమేమని గ్రహించడానికి పోవడము లేదు.
ఇటువంటి కాలములో కూడ గీత అంటే ఏమిటి? గీతా సారాంశము ఏమిటని యోచించు వారు కూడ అక్కడక్కడ గలరు. అటువంటి వారికి ఇంతవరకున్న గీత భావములలో ఎన్నో లోపములు కనిపించగ వాటి నిజస్వరూపమేమిటని అన్వేషిస్తున్నారు. అలా గీత నిజస్వరూపమేమిటో తెలుసుకోవాలను తపనకల్గిన వారున్నారని, వారి కోసమే ఈ గీత బయల్పడు చున్నదని, అటువంటి వారికి ఎన్నో తెలియని రహస్యములను తెలియజేస్తు త్రైత సిద్ధాంత భగవద్గీత ముందుకు సాగిపోగలదని భావిస్తున్నాము.
మానవ శరీరములో పేరుగాంచిన గుణములు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరములనునవి ఉన్నవి. కామమనగ ఆశ, క్రోధమనగ కోపము, లోభమనగ పిసినారి తనము, మోహమనగ నాది నావారను భావము, మదమనగ గర్వము, మత్సరమనగ అసూయ అని చెప్పుకోవచ్చును. అలాంటి గుణముల చేత సర్వమానవులు కదిలింపబడి పనులు చేయుచుందురు. భూమి మీద ఏ జీవరాసియైనప్పటికి గుణముల వలననే కదలి కార్యములు చేయుచున్నవి. ఈ పద్ధతి ప్రకారము అర్జునుడు యుద్ధము చేయననుకొనుటకు కారణమైన గుణము మోహగుణము. మొదట ఆశ, కోపము యుద్ధమునకు ప్రేరేపింపగ తర్వాత మోహగుణము వలన వీరు నావారు వీరినెట్లు చంపగలనను కొన్నాడు. ఈ విధముగ గుణముల మధ్య అశాంతి ప్రతి జీవునికి ఏర్పడుచున్నది. అర్జునునకేర్పడిన మోహగుణమును, బుద్ధి యోచించి వీరిని చంపుట వలన పాపమొచ్చునని సంకల్పము పుట్టించగ అదే అదునని శ్రీకృష్ణుడు గీతను చెప్పాడు. అర్జునునికేర్పడినట్లు గుణముల మధ్య మానవునికి అశాంతి ఏర్పడి పాపమను భావమొచ్చినప్పటికి శ్రీకృష్ణునిలాగ వెంటనే చెప్పు గురువులేనందున మానవుడు వివరము తెలియక అశాంతిలోనే మునిగిపోవుచున్నాడు. అర్జునునికి కల్గినట్లు ప్రతి మానవునికి గుణముల వలన బాధకల్గుచునే ఉన్నది. ఒక గుణమొక వైపుకు లాగితే మరియొక గుణము ఇంకొక ప్రక్క లాగుచుండును. గుణముల మధ్య చిక్కి నలుగుచున్న మానవునికి అశాంతి కలదు. కావున శ్రీకృష్ణుని గీత అర్జునునికొక్కనికే కాక గుణములున్న జీవరాసులందరికి అవసరమే. శ్రీకృష్ణుడు చెప్పినది అర్జునునకేనని తలచవద్దండి. గుణ ప్రభావములో చిక్కిన అందరికి వర్తించునదిగ తలచి, ప్రతి ఒక్కరు గీత తన నిమిత్తమే చెప్పారని తలచి చదవాలి. ఇపుడు ఇక్కడ వ్రాసిన గీత అర్జునునికేననుకోక శ్రీకృష్ణుడు నీకే చెప్పుచున్నాడను భావముతో శ్రద్ధగా చదవండి.
భగవద్గీత శ్రీ భగవానువాచతో మొదలైనది. శ్రీకృష్ణుడు పల్కిన పలుకులను భగవానువాచ అనడమెందుకు? శ్రీకృష్ణ ఉవాచ అని ఎందునలేదను సంశయము కొందరికుండవచ్చును. దానికి మా సమాధానము ఏమనగా! శ్రీకృష్ణుడు అందరిలాంటి మానవుడు కాదు. అతను అందరిలాగ జన్మించలేదు. ఈ ప్రపంచమంతయు ఏ శక్తి ఆధారముతో నిలచి ఉన్నదో, ఆకాశములో సూర్య,చంద్ర,నక్షత్ర గోళములు ఏ శక్తి ఆధారముతో తమ గమ్యములు తప్పక తేలియాడుచున్నవో, అణువణువున ఏ శక్తి దైవముగ నిలచి అధిపతిగనున్నదో, భూమి విూద గల అన్నిమతములకు ఏ శక్తి దేవునిగ ఉన్నదో ఆ శక్తియే ఒక మానవునిగ వచ్చిన జన్మ శ్రీకృష్ణునిది! శ్రీకృష్ణుడు భగము నుండి పుట్టినవాడు కనుక భగవంతుడను పేరువచ్చినది. భగమనగ స్త్రీయొక్క యోని భాగమని అర్థము. అలాంటపుడు మనము కూడ తల్లి భగము నుండియే పుట్టాము కదా! మనమంతా భగవంతులమేనా? అను ప్రశ్నరాగలదు. ఇక్కడున్న అందరికి తెలియని సత్యమేమిటంటే మనమందరము భగము నుండి పుట్టలేదు. ఈ మాట చాలామందికి ఆశ్చర్యమును కలుగజేయును. ఇందులో సత్యము తెలిస్తే ఆశ్చర్యపడవలసినదేమి లేదు. భగము నుండి మన శరీరములు పుట్టినవి, కాని జీవాత్మలమైన మనము పుట్టలేదు. శిశు శరీరము భగము నుంచి బయటికి వచ్చిన తర్వాత కొంతసేపటికి అనగ ఐదు నిమిషములకో, పది నిమిషములకో, అరగంటకో, లేక గంటకో ఎక్కడో శరీరమును వదలిన మనము శిశు శరీరములో చేరి అరచుచున్నాము. ఒకచోట మరణించిన జీవుడు గుణములు, పాపపుణ్యములతో కూడివచ్చి నిర్ణయింపబడి సిద్ధముగ బయటికి వచ్చియున్న క్రొత్త శరీరములో ప్రవేశిస్తున్నాడు. సర్వవ్యాపియైన పరమాత్మ మనమాదిరి ఒకచోట మరణించి మరియొక చోటికి పోనవసరము లేదు. ఆయన శరీరము ధరించి మాట్లాడి ధర్మములు తెలియజేయాలనుకొన్నపుడు స్త్రీ శరీరములోను, గర్భమందు, గర్భస్థ శిశువునందు, సర్వము వ్యాపించి ఉన్నాడు కనుక శిశుశరీరముతో సజీవముగ పుట్టుచున్నాడు. అందువలన ఆయన ఒక్కడే భగవంతుడగును. సర్వవ్యాపి, సర్వము తానైనవాడు మరియొక దాని ప్రమేయము లేకుండ పుట్టగలడు. "స్వయంభు" అయిన పరమాత్మ పుట్టవలసి వచ్చినపుడు శిశుశరీరము తయారగుటకు పురుష వీర్యకణములతో కూడ పనిలేదు. కనుక సర్వవ్యాపియైన వాడు కన్యగర్భము నుండియైన పుట్టిరాగలడు. ఖుద్ అనగా తనకు తానుగ పుట్టువాడు ఖుదా అగును. ఖుదాయైన పరమాత్మ సజీవముగ పుట్టిన శరీరమునకు శ్రీకృష్ణ అను పేరు పెట్టారు. కావున శ్రీకృష్ణుడు భగవంతుడు, ఆయన చెప్పినదే భగవద్గీత.
ధర్మములంటే ఏమిటో తెలియకుండపోయి,అధర్మములు మానవులందు ఎక్కువైనప్పుడు ఉద్భవించి, ధర్మముల గూర్చి తెలియజేస్తానని గీతయందు భగవంతుడు తెల్పాడు. ఆ మాట ప్రకారము ద్వాపరయుగ అంత్యములో భగవంతుడు పుట్టాడంటే అపుడు ధర్మములకు ముప్పు ఏర్పడి అధర్మములు చెలరేగి ఉన్నవన్నమాట. ఇక్కడ కొందరికి ఒక అనుమానము రావచ్చును. ద్వాపరయుగ అంత్యములో వ్యాసుడు, భీష్ముడు, మొదలైన ఎందరో గొప్ప వారుండెడి వారు గదా! ఆ సమయములోనే ధర్మములకు ముప్పు ఏర్పడినదా? అన్నది ప్రశ్న. దానికి జవాబు ఏమనగా! ఆనాడు తపస్సులు, యజ్ఞయాగాదులు, వ్రతక్రతువులు ఎక్కువగ ఉండెడివి. వాస్తవిక ధర్మములు తెలియని కారణమున ఆనాటి ప్రజలలో భక్తియనునది ఉన్నప్పటికి అది బాహ్య దేవతారాధనల మీద ఉండెడిది. అంతర్ముఖ ఆధ్యాత్మికము మీద ఏమాత్రము లేకుండెడిది. ఎందరో ఋషులున్నను వారంతయు దేవతల మీద దృష్ఠినుంచి తామేదో పొందవలెనను తపన తప్ప, యోగమేమిటో తెలియకుండిరి. ఎంతటి గొప్ప ఋషులైన పుణ్యమొచ్చు సత్కార్యములు తప్ప, పుణ్యమంటని కార్యవిధానము తెలియకుండిరి. నీతి తప్ప జ్ఞానము తెలియని ఆ కాలములో, న్యాయము తప్ప, ధర్మము తెలియని అటువంటి సమయములో భగవంతుడు ఉద్భవించాడు. ఆ భగవంతుడు చెప్పినదే భగవద్గీత. గీత భగవంతుని ద్వార బోధింపబడినది. భగవంతుడు గీతను శాశ్వతముగ వుండునట్లు గీచిపోయినప్పటికి ఆ హద్దులోని ఆధ్మాత్మిక రూపమును, అజ్ఞానమను గ్రుడ్డితనముతో మానవుడు సరిగ చూడలేక పోయాడు. ఇవి ధర్మములని గుర్తించలేక పోయాడు. ఇది ఆధ్యాత్మికమని బోధించుటకు మానవులైన కొందరు గురువులుగ బయలుదేరినప్పటికి, వారియందు మాయ తిష్ఠవేసి ఆధ్యాత్మికమునే బోధించునట్లు భ్రమింపజేసి, వారిచేత అధర్మములనే బోధింపచేసింది. పరమాత్మ చేత సృష్ఠింపబడిన మాయ, పరమాత్మకు వ్యతిరిక్తముగ బోధించునట్లు మరియు వర్తించునట్లు చేయుట దాని కర్తవ్యము. కావున మానవుల శరీరములలో గుణములందు ఇమిడియుండి, ఎవరు గుర్తించలేనట్లున్న మాయ మానవులను సులభముగ తనవైపు నడిపించు కొనుచున్నది. ఎందరో గురువులను సహితము భ్రమింపజేసి, పరమాత్మ యొక్క విధానమును గాని, పరమాత్మ ధర్మములను గాని, గుర్తించకుండునట్లు చేసి, వారు చేయుచున్నది మరియు వారు చెప్పుచున్నది పరమాత్మ జ్ఞానమేనన్నట్లు తలపింప జేయుచున్నది. అందువలన ఎందరో మహానుభావులు కూడ ఆధ్యాత్మికములో పరమాత్మ చెప్పినట్లు కాక, కొద్దిగ ప్రక్క మార్గములో పోయారనియే చెప్పవచ్చును.
తెలిసినవారు కూడ ముఖ్యమైన ధర్మములవద్ద పొరబడునట్లు మాయ చేసినది. ప్రజలకు జ్ఞానమును బోధించు బోధకుల చేతనే ప్రక్కదారిని బోధించునట్లు చేయుచున్నది. ఉదాహరణకు ఒక విషయమును చూస్తాము. ఒక సినిమా శతదినోత్సవ సభలో ఒక స్వామి ఉపన్యసిస్తు, డైరెక్టరు గొప్పపని చేశాడని చెప్పుచు, "ఈ సినిమా దర్శకుడు ఒక గొప్ప యోగియై ఎంతో తపస్సు చేసి చిత్రమును తయారు చేశాడు. ఈ సినిమాపట్ల ఆయన చేసిన తపస్సుకు మెచ్చుకోవలసిందే" అన్నారు. ఇక్కడ సినిమా దర్శకుడుపడిన శ్రమను తపస్సుగ పోల్చి చెప్పడమే కాక అతనినే యోగి అనడము కూడ జరిగినది. దీనిని బట్టి చూస్తే ఆయన ఉపన్యాసములో యోగి, తపస్వి ఇద్దరు ఒకరేనని తెలియుచున్నది. ఇది ఒక సంఘటనకాగా మరియొక విషయమును చూస్తాము. ఒక స్వామిని ఒక పట్టణమునకు అక్కడి ప్రజలు ఆహ్వానించారు. ముందుగానే ఆ విషయమును ప్రజలకు తెలియజేయుటకు, అందరిని స్వామిగారి దర్శనార్థమురమ్మని చెప్పుటకు ఒక ఆహ్వాన పత్రికను అచ్చువేయించి పంచిపెట్టారు. ఆ ఆహ్వానపత్రికను అచ్చువేసిన వారు ఆధ్యాత్మికవిద్యను బాగా తెలిసినవారే. వారు అచ్చు వేయించిన పత్రికలో సమాచారము ఈ విధముగ గలదు. "ద్వాదశ సంవత్సరములు రుద్ర భూమినందు తపమాచరించి యోగిగ మారిన శ్రీశ్రీశ్రీ బాలభారతి యోగి గారు మన పట్టణమునకు విచ్చేయుచున్నారు. భక్తులందరు విచ్చేసి దర్శనము చేసుకోవలసిందని కోరుచున్నాము" అని వ్రాశారు. ఇక్కడ కూడ పండ్రెండు సంవత్సరములు స్మశానములో తపస్సు చేసిన తపస్విని యోగి అన్నారు. "తపము చేసి యోగిగ మారిన" అన్నారు. ఈ విషయమును వ్రాసిన వారు గొప్ప తత్త్వవేత్తలే అయినప్పటికి తపస్సుకు యోగమునకు భేదము తెలియలేక పోయారు. తపము చేసిన వానిని యోగిగ, యోగము చేసిన వానిని తపస్విగ చెప్పుకొనుట వలన భగవద్గీతలో దేవుడు చెప్పిన ధర్మములకే ముప్పు ఏర్పడగలదు. ధర్మములకు గ్లాని ఏర్పడినదని ధర్మములను కాపాడుట కొరకు దేవుడే దిగివచ్చి "తపస్విభ్యోధికో యోగి" అని చెప్పినప్పటికి, యోగమునకున్న గొప్పతనమును తెలియక తపస్వికులను, యోగులను ఒకటే అనుకోవడము పొరపాటు కాదా! దేవుడు చెప్పిన ధర్మమునకు వ్యతిరేఖముగ చెప్పినవారము కాదా! దేవుని ధర్మమునకు ముప్పు కల్గించినవారమై, దేవుని మాటకు విలువ లేకుండ చేసిన వారమగుదుము కదా!
ఎంతో చిన్న జ్ఞానమును కూడ గ్రహించలేక, ఎంతో పెద్ద స్వాములు కూడ పొరబడడము విచిత్రముగ నున్నది కదా! ఇప్పటికి కూడ నూటికి తొంభైమందికి తపస్సు వేరు, యోగమువేరని తెలియక పోవడము విచిత్రముగానే ఉన్నది. చాలా పురాణములలో తపస్సును, యోగమును రెండిటిని ఒకటిగానే చెప్పుకొన్నారు. ఒక మహర్షి అడవిలో కూర్చొని తపస్సు చేయుచుండగ అతని యోగదీక్షకుమెచ్చి ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడని ఒక పుస్తకములో వ్రాసియున్నది. అలాగే ఒక రాజు యోగము చేయుచుండగ అతని తపస్సుకుమెచ్చి బ్రహ్మదేవుడే ప్రత్యక్షమయ్యాడని మరొక పుస్తములో వ్రాశారు. ఈ వ్రాతలుగాని, కొందరి బోధలుగాని భగవద్గీతలోని ఆత్మసంయమ యోగము 46వ శ్లోకములో "తపస్వి భ్యోధికో యోగీ" అను మాటకు వ్యతిరిక్త ధోరణిలో గలవు. మాయ జ్ఞానులను కూడ దేవుని మాటకు వ్యతిరేకులుగ చేయగలదు. అందువలన శాస్త్రమును ఆధారము చేసుకొని జ్ఞానమార్గములోనే నడువవలెను. అట్లు కాకపోతే దారి తప్పు ప్రమాదము గలదు.
నేటి కాలములో ఎందరో గురువులుగ పేరుగాంచినవారున్నారు. వారిలో స్వచ్ఛమైన జ్ఞాన వివరములుకాక పురాణ ఇతిహాసములైన భారత భాగవత, రామాయణ కథలను చెప్పుకొను గురువులను వదిలివేసి, ఆత్మ వివరమును తెలుపునట్టి జగత్ గురువులను సహితము చూచిన ఎడల వారియందు కూడ కొంత మాయ పనిచేసినదనియే చెప్పవచ్చును. ఉదాహరణకు అద్వైత సిద్ధాంతమును ప్రచారము చేసినవారున్నారు. మరియు ద్వైత సిద్ధాంతమును ప్రచారము చేసిన వారు కూడ ఉన్నారు. పీఠాధిపతులై గొప్ప గురువులమని పేరుగాంచిన వారే ఒకరి సిద్ధాంతమును మరొకరు ఒప్పుకోక ద్వైతము సరియైనదికాదని అద్వైతులు, అద్వైతము సరియైనదికాదని ద్వైతుల యొక్క వాదన. ఆలోచించి చూచినట్లయితే ఒకరిది సరియైన సిద్ధాంతమైతే మరియొకరిది తప్పు సిద్ధాంతమగును కదా! అందువలన సిద్ధాంతములనే బయల్పరచిన గురువులవద్ద కూడ మాయ పనిచేసినదనియే చెప్పవచ్చును.
సిద్ధాంతమనునది ఎప్పటికి మారునది కాకుండాలి, మరియు అసత్యమైనది కాకుండాలి. ఇంకనూ వివరము చెప్పుకుంటే సిద్ధి అనగా ప్రాప్తించునది, సిద్ధించునది అనగా అనుభవానికివచ్చునదని అర్థము. అనుభవానికి వచ్చు విషయము తెల్పువాడు సిద్ధాంతియగును. శాసనములతో కూడుకొన్నది శాస్త్రము. శాసనము సిద్ధాంతము రెండు ఒకటే. శాస్త్రము తెలుపువాడు శాస్త్రియని, సిద్ధాంతములను తెల్పువాడు సిద్ధాంతియని పూర్వమనెడివారు. చిన్న చిన్న శాసనములతో కూడుకొన్నదే ఒక సిద్ధాంతమగును. దీని ప్రకారము అన్ని విద్యలకంటే గొప్ప విద్యయైన ఆధ్యాత్మికము శాసనపరమైన సిద్ధాంతరూపముగ ఉండాలి. అలాగే జగత్ గురువులుగ పేరుగాంచిన శంకరాచార్యులవారు అద్వైత సిద్ధాంతమును, మద్వాచార్యుల వారు ద్వైత సిద్ధాంతమును ప్రచారము చేశారు. ఇవి ఒకదానికి ఒకటి భిన్నముగ ఉండుట వలన ఏది సత్యము, ఏది అసత్యమని పరికించి చూడవలసియున్నది. వాటి వ్యత్యాసములు వాటిలోని సత్యాసత్యములు తెలుసుకొనుటకు ప్రమాణముగ పెట్టుకొని చూడవలసినది భగవంతుడు చెప్పిన భగవద్గీతయే.
బ్రహ్మవిద్యకు ప్రమాణ గ్రంథమైన భగవద్గీత నూటికి నూరు పాల్లు శాస్త్రబద్దమైన సిద్ధాంతములతో కూడుకొని ఉన్నది. పరమాత్మ స్వయముగ తెల్పిన భగవద్గీత ప్రకారము చూచిన ఎడల పరమాత్మ, జీవాత్మలను రెండు లేవని పరమాత్మ ఒక్కటే గలదను అద్వైతము, జీవాత్మ పరమాత్మలు రెండు ఉన్నాయను ద్వైతము, రెండునూ గీతకు కొద్దిగ ప్రక్కమార్గములో ఉన్నాయని తెలియుచున్నది. అనగ పూర్తి సరియైన సిద్ధాంతములుకావని అర్థమగుచున్నది. గీతను ప్రమాణముగ పెట్టుకొని చూచినట్లయితే మానవమాత్రులైన గురువులు చెప్పిన ద్వైత, అద్వైత సిద్ధాంతములు రెండును హేతుబద్దముగ లేవు. ద్వైత సిద్ధాంతమును పరిశీలించి చూచినట్లయితే భూమి మీద వేర్లు లేకుండ చెట్టున్నదనుట ఎంత సత్యమో అంతే సత్యముగనున్నట్లు తెలియుచున్నది. అట్లే అద్వైత సిద్ధాంతమును పరిశీలించితే భూమి, వేర్లు రెండు లేకుండానే చెట్టున్నదనుట ఎంత సత్యమో అంతే సత్యమగును. అనగ రెండు సిద్ధాంతములు అశాస్త్రీయముగనున్నవని, హేతుబద్దముగలేవని తెలియుచున్నది. ఈ రెండు సిద్ధాంతములు అశాస్త్రీయము, అహేతుకమనుటకు గీతలోని పురుషోత్తమప్రాప్తి యోగమందు గల 16,17వ శ్లోకములే ఆధారము. ఈ రెండు శ్లోకములు ద్వైత అద్వైత సిద్ధాంతముల రెండిటిని ఒక్క వేటుతో కొట్టిపారవేయుచున్నవి. ఈ రెండు శ్లోకములే అసలైన ఆధ్యాత్మిక సిద్ధాంతమైన త్రైత సిద్ధాంతమును బోధిస్తున్నవి. ఈ రెండు శ్లోకములే కాక గీత యొక్క సారాంశమంతయు త్రైతము మీదనే బోధింపబడియున్నది. కలియుగములో ద్వైత, అద్వైత సిద్దాంతములు బయటికి రాగ, ద్వాపరయుగ అంత్యములోనే త్రైత సిద్ధాంతము భగవంతుని చేత బోధింపబడి ఉన్నది. అయినప్పటికి మాయా ప్రభావము చేత త్రైతము అర్థము కాకపోయినది. మాయా ప్రభావము చేతనే ద్వైత, అద్వైతములు బయల్పడినవి. ఇప్పటికి ద్వైత, అద్వైత గురుపరంపరలైన మద్వాచార్య, శంకరాచార్య పీఠములు భూమి మీద గలవు. త్రైతమను పేరుగాని దానిని బోధించువారుగాని లేకుండపోయారు. ఇట్టి పరిస్థితులలో త్రైతము బయటికి రావడము మన అదృష్టమని తెలియాలి. త్రైతము ప్రకారమే భగవద్గీత, భగవద్గీత ప్రకారమే త్రైతము గలదు. మనము ఇక్కడ క్రొత్తగ చెప్పుకొనుచున్న త్రైత సిద్ధాంతమును గురించి కొద్దిగ వివరించుకొందాము.
పరమాత్మ తప్ప రెండవది లేదనుట అద్వైతము, పరమాత్మ జీవాత్మ రెండు కలవనుట ద్వైతము. పరమాత్మ జీవాత్మకు మధ్యలో ఆత్మగలదని మూడింటిని గూర్చి తెల్పునది త్రైతము. ఏ విధముగ భూమికి చెట్టుకు మధ్యలో కనిపించకుండ వేర్లున్నవో, అట్లే పరమాత్మకు జీవాత్మకు మధ్యలో ఆత్మగలదు. భూమికి, చెట్టుకు మధ్యలో వేర్లు ఎంత ప్రాముఖ్యత వహించియున్నవో, అట్లే పరమాత్మకు, జీవాత్మకు మధ్యలో ఆత్మ ప్రాముఖ్యత వహించియున్నది. పరమాత్మ సర్వవ్యాపి, అనంతముకాగ ఆత్మ శరీరమంత వ్యాపించి, శరీరములో ఒక్క స్థానములో గల జీవాత్మ యొక్క జీవనాన్ని సాగిస్తున్నది. వేర్లు లేకపోతే చెట్టు ఎలా లేదో అలాగే ఆత్మ లేకపోతే జీవాత్మయే ఉండదు. భూమి మీద చెట్టు ఎక్కడున్న దానికి తప్పని సరిగ వేర్లు అనుసంధానమైవుండి చెట్టు జీవనాన్ని సాగించుటకు ఆధారమై ఎట్లున్నవో, అట్లే పరమాత్మ వ్యాపించిన జగతిలో జీవాత్మ ఎక్కడున్నా ఆత్మ అనుసంధానమైవుండి జీవాత్మ జీవనాన్ని సాగించుటకు ఆధారమైవున్నది. జగతిలో పరమాత్మ, ఆత్మ, జీవాత్మలేని ఆధ్యాత్మికమే లేదు. ఈ విషయమునే వివరిస్తు క్షరుడని జీవాత్మను, అక్షరుడని ఆత్మను, పురుషోత్తముడని పరమాత్మను గీతలో బోధించారు. జీవాత్మ, ఆత్మలు రెండు కూటస్థముగ కలిసి ఉన్నాయని, వాటికతీతముగ పరమాత్మ ఉన్నదని, జీవాత్మ ఆత్మలను ఇద్దరి పురుషులకంటే అతీతముగనున్న పరమాత్మ పురుషోత్తముడని చెప్పబడియున్నది. ఈ విషయము బ్రహ్మవిద్యా శాస్త్రమైన గీతలో పరమాత్మ మాటల రూపముగ చెప్పడమే కాక ప్రతి మానవుడు ఈ విషయము తెలుసుకొనునట్లు, ప్రతి మానవుని హస్తములో జీవాత్మ, ఆత్మ, పరమాత్మల గుర్తుగ మూడు రేఖలు ముద్రించి పెట్టాడు. ప్రతి మనిషి హస్తములోను మూడురేఖలు ముఖ్యముగ ఉండును. వాటిలో రెండు క్రింది రేఖలకొనలు ఒకదానితో ఒకటి కలిసియుండును. పై రేఖ ఒకటి మాత్రము ప్రత్యేకముగ ఉండడము గమనించవచ్చును. కలిసియున్న రెండు రేఖలు జీవాత్మ, ఆత్మలకు ప్రతీకలుకాగ ప్రత్యేకముగ పైన ఉన్న రేఖ మాత్రము పరమాత్మకు గుర్తుగవున్నది. ఇది ప్రతి హస్తములో ఉండగ గురువులుగ ఉన్నవారు కూడ దీనిని గమనించ లేదంటే, మాయ యొక్క ప్రభావమెంత ఎక్కువగ ఉన్నదో అర్థము చేసుకొనవచ్చును. సృష్ఠి ఆదియందే మానవుని అరచేతిలో మూడు ఆత్మల రహస్యముంచిన పరమాత్మ ద్వాపరయుగ అంత్యములో కూడ అదే విషయమునే గీతలో చెప్పాడు. చేతిలో పెట్టినా, నోటితోచెప్పినా, మానవుడు గ్రహించలేక పోతున్నాడని పూర్వము తెలిసిన పెద్దలు పురుషున్ని సూచించు లింగాకృతిని దేవాలయములందు ప్రతిష్ఠించి గీతలో చెప్పినట్లు జీవాత్మ, ఆత్మ, పరమాత్మలుగ, పురుషుడు మూడు భాగములై ఉన్నాడని తెలియునట్లు, మూడు విభూతి రేఖలు లింగము మీద తీర్చిదిద్దారు. మూడు ఆత్మల విషయము ప్రతి ఈశ్వర దేవాలయములోను ఉండునట్లు చేశారు. కాని కాలక్రమమున ధర్మమేనాడో అధర్మముగ మారిపోయి ఈశ్వర దేవాలయము కడకు మెడలో పామున్న శివుని ఆలయముగ లెక్కించబడుచున్నది. ఈశ్వరుడనగా అధిపతియను అర్థము పోయి ఈశ్వరుడే శంకరుడను పెడార్థము మిగిలిపోయినది. ఆదియందు స్వచ్ఛముగనున్న లింగమొకటే ఉన్న ఈశ్వరాలయములో తర్వాత లింగము ప్రక్కన పార్వతి, ఎదురుగ నందిని ప్రతిష్ఠించారు. ఇలా చివరకు ఈశ్వరాలయము శంకరాలయముగ మారి శైవుల దేవాలయమైనది. ఇలా మూడు విభూతి రేఖల అర్థమైన ఆత్మల గుర్తింపు మారిపోయినప్పటికి అసలు సత్యము స్థిరముగనుండునట్లు మన పెద్దలు ఒక నియమమును ఉంచారు. అదేమనగా ప్రతిరోజు ఉదయము నిద్రలేస్తూనే ఎవరి ముఖము కూడ చూడకుండ మొట్టమొదట తన అరచేతిని చూడాలని చెప్పారు. లేస్తూనే అరచేతిని చూచుట వలన మూడు రేఖలు కనిపిస్తాయని, ఎప్పటికైన వాటిని గురించి ఆలోచించరా! అని వారి భావమై ఉండవచ్చును. ఈ ఆచారము ఈ కాలములో ఎక్కడైన మిగిలి ఉన్నప్పటికి అర్థము తెలుసుకోలేక పోవుచున్నారు. అరచేతిలోనే మూడు ఆత్మలున్నాయని, అరచేతిలోనే అంతా ఉన్నదని, అరచేతిలోనే వైకుంఠముందని, అరచేతిలోనే త్రైత సిద్ధాంతమున్నదను అర్థముతో, ఏ మతములోని వాడైన నా అభిమతములోనే ఉన్నాడని పరమాత్మ మానవుల చేతిలో మూడు రేఖలు అమర్చాడు.
చేతిలోని మూడురేఖలే శరీరములోని మూడు ఆత్మలని, శరీరములోని మూడు ఆత్మలనే త్రైతము అంటున్నామని, త్రైతమును తెల్పునదే త్రైత సిద్ధాంత భగవద్గీత అని తెల్పుచున్నాము. త్రైత సిద్ధాంతము ముఖ్యముగ మూడు ఆత్మల వివరమును గురించి చెప్పుచు పోయినది. త్రైతమనిన, మూడు ఆత్మలనిన చదువు వారికి క్రొత్తగ ఉండును. కావున ముందే "గీతా పరిచయము"ను చూడవలసిన ఆవశ్యకత గలదు. ఎందుకనగా ఒక క్రొత్తవానిని మనము నేరుగ పలకరించలేము. వానితో స్నేహము చేయలేము. క్రొత్త వ్యక్తిని పరిచయము చేయడానికి మొదట ఒక మధ్యవర్తి ఉంటే వానితో సులభముగ పరిచయము ఏర్పడగలదు. మధ్యవర్తి యొక్క తెలివినిబట్టి, వాడు తెలిపే దానినిబట్టి, క్రొత్తవాని విషయమంతా మనకు ముందే అవగాహన కాగలదు. ఆ తర్వాత వానితో సులభముగ కలసిమెలసి పోవచ్చును. అలాగే త్రైత సిద్ధాంత భగవద్గీతలోని సారాంశము తెలియాలంటే, దాని అవగాహన కావాలంటే, ముందు గీతా పరిచయమను మధ్యవర్తి కావలసిందే. 'గీతాపరిచయము' ను చదివిన తర్వాత 'త్రైత సిద్ధాంత భగవద్గీత' అను సరిక్రొత్త గీత అర్థము కాగలదు. ఈ గీతాపరిచయము మిమ్ములను త్రైతముతో పరిచయము చేయించి, త్రైతమంటే ఏమిటో తెలుపగలదు. గీతాపరిచయమును చదివిన తర్వాత మాచే రచింపబడిన "తైత సిద్ధాంత భగవద్గీత" ను చదవగలరని కోరుచున్నాము.
-***-
అసత్యమును వేయిమంది చెప్పినా అది సత్యము కాదు,
సత్యమును వేయిమంది కాదనినా అది అసత్యము కాదు.