గీతా పరిచయం/మొదటి పరిచయం
మొదటి పరిచయము
పూర్వ కాలములో అన్ని మతములకంటే ముందు పుట్టినది, అన్ని మతముల కంటే పెద్దది ఒక్క ఇందూమతమేనని చెప్పుటలో సంశయము లేదు. కృతయుగమునుండే ఇందూమతము గలదు. పూర్వము ఏ ఇతరమతములు లేని కాలములో ఇందూమతము ప్రపంచ వ్యాప్తముగ ఉండెడిది. ప్రపంచములో మొదటి దేవాలయము ఆకారములేని గుండును దేవునిగ ప్రతిష్ఠించి ఆరాధించ బడినది. ప్రపంచములో మొదటి బోధ భగవద్గీత సారాంశము. భగవద్గీత ద్వాపర యుగములో శ్రీకృష్ణుడు అర్జునునకు చెప్పడమేకాక సృష్ఠి ఆదిలోనే దేవుడు సూర్యునకు తెల్పినది. గీత ఆదిలోనే చెప్పబడగ ఆదినుండి ఇందూమతము గలదు. కాలక్రమమున ఇందూమతము అనేక మతములుగ చీలిపోయినది. ఇందూమతము అనగ దేవుని విషయమును తెల్పుమతమని అర్థము. ఇందు అనగ దేవుని జ్ఞానమని అర్థము. దీని ప్రకారము ప్రస్తుత కాలములో క్రైస్తవ, ఇస్లామ్ మతములుండినప్పటికి అవన్నియు సృష్ఠికర్త అయిన దేవున్ని గురించి తెల్పునవే కావున ఆ మతములు కూడ ఇందూ మతములోని అంతర్ భాగములనే చెప్పవచ్చును. అలాగే క్రైస్తవ, ఇస్లామ్ మతములలోని బోధలు రూపనామములు లేని సర్వవ్యాపి అయిన దేవున్ని గురించి తెల్పునవే కావున అవి కూడ గీతలోని అంతర్భాగములనియే చెప్పవచ్చును.
ఇతర మతములలోని అర్థము, ఆరాధనా జ్ఞానమును కల్గియున్నది భగవద్గీత. అన్ని మతముల సారాంశము ఇందూమతములో ఉండగ, అన్ని మతముల జ్ఞానము భగవద్గీతలో గలదు. సర్వమత జ్ఞానము కల్గిన గీత నేడు ఇందూమతములో ఉండినప్పటికి ఇందూమతములో జ్ఞానము తెలియని ప్రజలు తమ మతము యొక్క ఔన్నత్యమును తెలియలేక తమ మతము పేరునే మరచిపోయి చివరకు హిందువులైనారు. హిందువులు కూడ ఇందూమతము లోని భాగస్వాములే అయినప్పటికి మిగత మతములకంటే వెనుకబడి యుండడము, జ్ఞానహీనులు కావడము వలనను హిందూమతము క్షీణించుటకు కారణమైనది. నేడు భారత దేశములో హిందువులుగనున్న ఎందరో క్రైస్తవులుగ, ముస్లిమ్‌లుగ మారిపోవడము జరుగుచున్నదని ఒప్పుకోక తప్పదు. ఒకప్పుడు దైవమార్గములో అందరికి మార్గదర్శకమైన ఇందూమతము నేడు హిందూమతముగ మారిపోయి జ్ఞానమార్గములో వెనుకబడిపోవడము, హిందుమత గురువులలో ఐక్యతలేక భగవద్గీతకు అన్యముగ బోధించుట వలనను, హిందూ మతములోని ప్రజలకు తమకు మూలగ్రంథమేదో తెలియక గీతను వదలి భారత రామాయణ పురాణములను ఆశ్రయించుట వలనను హిందూమతము క్షీణించుటకు అవకాశమేర్పడినది.
క్రైస్తవులకు మేము క్రైస్తవులమని తెలుసు, వారికి మూలగ్రంథము పరిశుద్ద బైబిలు అని తెలుసును. మహ్మదీయులకు మేము ముస్లిమ్‌లమని తెలుసును, వారి మూల గ్రంథము పవిత్ర ఖురాన్ అని తెలుసును. హిందువులలో కొందరికి తప్ప చాలామందికి వారిది హిందూమతమనిగాని, వారికి మూల గ్రంథము భగవద్గీత అనిగాని తెలియదు. క్రైస్తవులు బైబిలును, ముస్లిమ్‌లు ఖురాన్‌ను ఎంతో పవిత్రముగ చెప్పుకొందురు. ఆ గ్రంథములను మించినవి లేవని వారు చెప్పుకొనుచుండగ, వారి హృదయములలో వారి మూల గ్రంథములకు గొప్పస్థానముండగ, హిందువులలో భగవద్గీతకు గొప్ప స్థానము లేకుండపోయినది. అన్ని మతములకు మూలగ్రంథమైన భగవద్గీతను ప్రక్కన పెట్టి భాగవతమును గొప్పగ చెప్పుకొనువారు హిందువులలో చాలామంది గలరు. ఇందూమతములోని గురువులు భగవద్గీతకంటే ఎక్కువగ పురాణములను చెప్పుటచేత, గీతకిచ్చిన స్థానమునే కల్పిత కథలకు, పురాణములకు ఇచ్చుటవలనను అన్నిటిలో గీత కూడ ఒకటైపోయినది. భగవద్గీతకు హిందూ మతములో ప్రత్యేక స్థానము లేక పోవడమువలన, హిందూమతమునకు పైన ఆధారము, క్రింద పునాది తెలియకుండ పోవుటవలన హిందూమతము క్షీణించు అవకాశమేర్పడినది.
భగవద్గీత సర్వమానవులకు, అన్ని మతములలోని వారికి తెల్పిన హద్దని, మానవాళికి, మాయకు మధ్యలో గీచిన గీతయని, ఒక్క హిందూ మతములోని వారికేకాదని, అన్ని మతములలోని ఇందువులకని (జ్ఞానులకని) తెలియునట్లు వ్రాయబడినదే త్రైత సిద్ధాంత భగవద్గీత! అందరికి సంబంధించిన భగవద్గీతంటే ఏమిటో తెలియాలంటే ముందు ఈ "గీతా పరిచయము" చదవవలసిందే!! గీతా పరిచయము మొదట చదువుటవలన అన్ని మతముల వారికి గీత యొక్క స్వరూపమేమిటో తెలియగలదు. గీతా పరిచయములో అనేక సంశయములు, అనేక ప్రశ్నలు సృష్ఠించబడి, భగవద్గీతలో వాటికి సమాధానములు తెలుపబడినవి. అందువలన చూపు గీతాపరిచయము కాగ, దృశ్యము భగవద్గీత అయినది. ఒక విషయము తెలియుటకు మొదట, తెలియువాడు, తర్వాత తెలియబడునది రెండు అవసరమున్నట్లు గీత యొక్క విషయము తెలియుటకు, మొదట గీతాపరిచయము తర్వాత త్రైతసిద్ధాంత భగవద్గీత అవసరము. ఈ రెండు తెలిస్తే భూమి మీద మతములంటే ఏమిటో, మనుషులంటే ఏమిటో తెలియగలదు. తర్వాత అన్నిటికి మూలపురుషుడైన దేవుడు తెలియగలడు.
-***-