గణపతి/మొదటి ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

గణపతి

మొదటి ప్రకరణము

"శుక్లాంభరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయే త్సర్వవిఘ్నోపశాంతయే"

అని విఘ్నేశ్వర దేవతానీకమైన స్తుతిశ్లోక మొకటి కలదు. "తెల్లని వస్త్రములు ధరించువాఁడు, సర్వవ్యాపకుడు చంద్రునివలె ధవళమైనవాఁడు, నాలుగు భుజములుగలవాడు, ప్రసన్నమైన మొగముగలవాఁడు నగు విఘ్నేశ్వరుని సర్వ విఘ్న శాంతికొరకు ధ్యానించుచున్నాఁడ" నని యాశ్లోకమున కర్థము. సర్వతోముఖ పాండిత్యముగల యొకానొక బుద్ధిమంతుఁడు చమత్కారముగ నీశ్లోకము గాడిద నుద్దేశించి చెప్పఁబడిన దని విపరీతార్థము గల్పించి చెప్పెను. అది యెట్లనఁగా శుక్లాంబరధరం అనఁగా ధవళవస్త్రములు ధరించునది, చాకలివాఁ డుదికిన తెల్లనివస్త్రములు మోయునది గావున నీ శబ్దము గాడిదకే యర్థ మగుచున్నదని చెప్పెను. విష్ణుశబ్దమునకు సర్వవ్యాపకత్వ మర్థ మున్నది గదా. గాడిద యెక్కడ చూచిన నక్కడే కనఁబడు చుండును. కావున నిక్కడ విష్ణుశబ్దమునకు గాడిదయే యర్థ మని వాక్రుచ్చెను. శశివర్ణ మనఁగా చంద్రునివలె ధవళమైనది, గాడిద తెల్లగా నుండును గావున నీ యర్థము నిర్వివాద మయ్యెను. చతుర్భుజ మనఁగా నాలుగు భుజములు గలది, గాడిదకు నాలుగు భుజము లుండుటవలనఁ జతుర్భుజశబ్దము సార్థక మనియెను. అవి భుజములు కావు; పాదము లని చదువరు లెవ్వరైనను సందియపడుదు రేమో, "నిరంకుశాః కవయః” యను నార్యోక్తి జ్ఞప్తికిఁ దెచ్చుకొనుఁడు. కవులు నిరంకుశులు, వారు పాదములు భుజములు చేయఁగలరు. భుజములు పాదములు చేయఁగలరు. ప్రసన్నవదన మనగా ప్రసన్నమైన ముఖము గలది. ప్రసన్నమైన మనస్సుతో చూచిన యెడల దాని మొగము ప్రసన్న మైయుండును. కావున నదియు నిర్వివాదమే. ఇటువంటి గాడిదను సర్వవిఘ్నోపశాంతి కొఱకు ధ్యానించుచున్నాఁడ నని యీ శ్లోకార్థమైనట్లు తన నిరుపమాన పాండిత్య ప్రకర్షము చేత నా విద్యాంసుఁడు విపరీతార్థము జెప్పి సమర్థించెను, గణపతి యనఁగా విఘ్నేశ్వరుఁడు; మహేశ్వరునియొద్ద పరమభక్తు లగు ప్రమథు లను దివ్యులు కొందరు గలరు. ఆ ప్రమథుల కే ప్రమథగణ మని పేరు. మహేశ్వరుఁడు నిర్హేతుక జాయమాన కటాక్షము చేతనో లేక నిరుద్యోగియైన తన కుమారుని నేదేని నొక యధికారమునం దుంచవలయునను నిచ్చ చేతనో, నాయకుఁడు లేనియెడల బ్రమథులు కట్టుతప్పి చెడిపోవుదు రను భయముచేతనో యా ప్రమథ గణమునకు వినాయకుని నాయకుని జేసెను, ఆ గణమునకధిపతి యగుటచేత వినాయకునకు గణపతి యను పేరు వచ్చెను. గణ పతి యనఁగా విఘ్నేశ్వరుఁ డగుటచేత విఘ్నేశ్వరు నుద్దేశించి చెప్పఁబడిన పూర్వోదాహృతశ్లోకముయెక్క విపరీతార్థము నీ గ్రంథ కథానాయకుఁడైన మా గణపతి కన్వయింపఁజేయ వలదని కోరుటకై యాశ్లోక ముదహరించితిని. ఆ గణపతి ప్రమథగణపతి గదా, మా గణపతి యే గణమున కధిపతి యని మీ రడుగవచ్చును. అది నేను చెప్పుట కష్టము. మీరే యూహించుకొనవచ్చును. తల్లిదండ్రు లితనికి గణపతి నామ మేల పెట్టిరో నాకు తెలియదు, కాని గణపతి నామ లక్షణము లనేకము లీతనియందు, కాని గణపతియందుండు లక్షణము లనేకము లీతనియందు గలవు. ఉండ్రములమీఁద నతని కెంత యిష్టము గలదో వర్ణించుటకు సపాదలక్షగ్రంథముగల మహాభారతము రచించిన వేదవ్యాసుడు దిగి రావలయును గాని సాధారణకవులు సామాన్య వచన గ్రంధ ప్రణేతలు పనికిరారని కంఠోక్తిగాఁ చెప్పగలను. అది మొదటి సామ్యలక్షణము. పానకము, వడపప్పు, కొబ్బరికాయలు మా గణపతికి కావలసినన్ని దొరకవు గాని దొరికినపక్షమున దక్కిన ప్రజ్ఞావిషయమున కాకపోయినను భోజనవిషయమున మహాగణాధిపతిని మా గణపతి యవలీలగ జయింపఁగలడు. ఇది రెండవ లక్షణము, మహాగణపతిది గుజ్జురూపమే యని శపథముఁ జేసి చెప్పగలను, ఇది మూడవ లక్షణము. ఆ విఘ్నేశ్వరుని దేనుఁగు మొగము, మా గణపతిది యేనుగు మొగమువంటి బుంగ మొగము, ఇది నాల్గవ లక్షణము. సామ్యములైన లక్షణములు గణపతుల కిద్దఱకు మూఁడు కలవు గాని మా గణపతి యా గణపతికంటె నెన్నో విషయములయందు ఘనుఁ డని చెప్పవచ్చును. బొజ్జ విషయములో మా గణపతి యగ్రతాంబూలామున కర్హుడని పండితు లెందరో సెలవిచ్చియున్నారు. లంబోదర శబ్దము విఘ్నేశ్వరునకు నేతిబీరకాయవలె సార్థకము గాదనియు మా గణపతియందు లంబోదరత్వము సార్థకమైన దనియు నా దృఢవిశ్వాసము; విఘ్నేశ్వరుఁ డేకదంతుడు, మా గణపతి ముప్పదిరెండు దంతములు గలవాఁడు. స్థాలీపులాక న్యాయముగఁ బైనుదహరింపబడిన కొన్ని యతిశయలక్షణములు జూపఁబడియె. మహాగణపతికి సమానములైన లక్షణములు కొన్ని, యతనికంటె నతిశయములైన లక్షణములు యుండుటచేత మొత్తముమీఁద గణపతి శబ్దము మా కథానాయకునియందు కొంతవఱకు సార్థకమైన దని మీకిప్పుడు నమ్మిక కలిగియుండవచ్చును. జగదారాధ్యుఁడైన వినాయకునియందు గల లక్షణంబులె తమ ప్రియపుత్రునియందుఁ గలుగునని నమ్మి తలిదండ్రులా నామ మతని కిచ్చి యుందురాయని మమ్మడుగ వచ్చును. దాని కుత్తరముఁ జెప్పుట మిక్కిలి కష్టము, తల్లిదండ్రులు బిడ్డల కొకప్పుడు తమ యిష్టదైవతముల పేర్లు పెట్టవచ్చును. ఆ దైవతముల యుందున్న గుణములు బిడ్డలయందు పొడగట్టవచ్చును. పొడగట్టక పోవచ్చును. రాముని నామము ధరించిన వారందఱు బితృవాక్య పరిపాలకులై యేకపత్నీ వ్రతస్థులైరా? తలిదండ్రులను నిరంతరము గొట్టి తిట్టునట్టి కష్టచరిత్రుఁడుగూడ రాముఁ డను పేరం బఱగుచుండును. అట్టి మూర్ఖుఁడు సాపాటు రాముడగును గాని గుణములలో దశరథరాముఁ డగునా? నోరుఁ విప్పునపు డెల్ల నబద్ధములే చెప్పువాఁడు హరిశ్చంద్రు డనుపేరఁ బరగవచ్చును. లక్ష్మీప్రసాదుఁడను నామధేయము గలవాఁడు నిరుపేద గావచ్చును. తలిదండ్రులు వెఱ్ఱెయ్య యని పేరు పెట్టుకొన్న బాలుడు మేథావంతుడై తన ప్రతిభాప్రభావముచేత జగంబును వెలయింపవచ్చును. తలిదండ్రు లొక యుద్దేశముతో బేరుపెట్టవచ్చును, కుమారుని యుత్తరచరిత్ర మా యుద్దేశమునకు వైరుధ్యమును జూపవచ్చును. గణపతి తలిదండ్రులు తమ కుమారున కిష్టదేవత పేరే పెట్టియుండవచ్చును, లేదా వినాయక చతుర్థినాఁ డతఁడు జన్మించి యుండుటచే నా నామము గలిగి యుండవచ్చును. కాదేని వారి వృద్ధ ప్రపితామహుఁడు యా పేరువాఁడై యుండనోపు. అదియును గానిపక్షమున బుట్టినప్పడు బుల్లిబొజ్జ, బుంగమొగము, బుఱ్ఱముక్కు, గుజ్జురూపముఁ జూచి తమ భక్తికిఁ దమ తపః ప్రభావమునకు మెచ్చి యదితి కశ్యపుల గర్భమున శ్రీమన్నారాయుణుఁడు వామనరూపము ధరించి జన్మించినట్లు తమ్ము ధన్యులఁ జేయుటకు దమపేరు మహీతలమున వెలయించుటకుఁ దమ వంశము పావనముఁ జేయుటకు గణపతి తమ గర్భవాసమున జన్మించియుండునని నమ్మి మాతాపితృ లానామమిచ్చి యండవచ్చు. ఒక్కవిషయమున దక్క యితఁడన్నివిషయముల గణపతికిఁ దుల్యు డనవచ్చును. మహాగణపతి విద్యల కధిపతి, మన గణపతి కదొక్కటే కొఱత. ఇట్ల నుటచేత నితఁడు చదువు రానివాఁడని తలంపవద్దు. ఆ కొరత దీర్చుకొనుటకై యతఁ డుపాధ్యాయత్వముఁ జేసి కొందరు బాలుర బాగుచేసెను. తాను గ్రంథములు చదువుకొనుటకు విద్య రాదు. కాని యొకరికి చెప్పుట కతనియొద్ద నెంత విద్యయైన గలదు. కాని యెకరికి చెప్పుట కతనియొద్ద నెంత విద్యయైన గలదు. ఏవంగుణ విశిష్టుఁడైన గణపతియొక్క చరిత్రమునం దుపోద్ఘాతము వ్రాయఁబడినది. ఈ యుపోద్ఘాతము చదువగానె వాని చరిత్రము నామూలాగ్రముగ జదువవలయునని మీ మనస్సులు, వినవలయునని మీ చెవులు నువ్విళ్ళూరుచుండ వచ్చును. అందుచేత నామధేయ ప్రకరణమును విడిచి వంశరూపధేయాది ప్రకరణములయందు బ్రవేశింతము. గణపతి చరిత్రము మిక్కిలి గొప్పది. ఇది చదువరుల యదృష్టముచేత మాకు లభించినది. వాల్మీకి కిట్టి చరిత్ర దొరికిన పక్షమున రామాయణమును మాని యత డా కథయే వ్రాసి యుండును. వేదవ్యాసున కిట్టిది లభించిన పక్షమున కష్టసాధ్యములైన పదునెనిమి పురాణములను, మహాభారతమును రచియించుట మాని తన యశస్సు కల్పాంతస్థాయి యగునట్టు లా చరిత్రమునే రచియించి కృతార్థుఁడై యుండును. ఇంకఁ గాళిదాస భవభూతి ప్రముఖుల మాట చెప్పనేల! ఇటువంటి చిత్రకథ శ్రవణగోచరము గాకపోవుటచేతనే బాణుడు కాదంబరీ హర్షచరిత్రలను విధిలేక వ్రాసియుండును. మన పూర్వజన్మ పుణ్యముచేత లభించిన యీ యద్భుత చరిత్రమును గణపతి ప్రతిష్ఠకుఁ దగినట్లు రచియింపలేకపోయినను నేదోవిధముగ యథాశక్తి సహగమనమువలె రచియింపఁ దలచుకొంటిని.