గణపతి/రెండవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

రెండవ ప్రకరణము

ఆహాహా! మన దేశమునందు జీవచరిత్రములు లేని లోప మిప్పుడు కనఁబడు చున్నది. చరిత్రరచనమునందు మన పూర్వులకు శ్రద్ధ యెంతమాత్రము లేకపోవుటచే నొక్కమహాపురుషుని చరిత్రయైన జదివెడు భాగ్యము మన కబ్బినది కాదు. రాజరాజనరేంద్ర ప్రముఖులగు మహారాజుల యొక్కయు నన్నయభట్టారక తిక్కనసోమయాజి ప్రముఖ మహాకవుల యొక్కయు చరిత్రములు చేకూరనందుకు మన మంత విచారించవలసిన పనిలేదు. కాని గణపతియొక్క చరిత్రము సంపూర్ణముగ లభియింపనందుకు మనము కడుంగడు విచారింపవలయును. ఆ విచారములోనె గుడ్డిలో మెల్ల యనునట్టు కొంత చరిత్రము మన కసంపూర్తిగనైన లభించినందుకు సంతోషింపవలయు; సంగ్రహముగనైన నీ చరిత్రము నాకెట్లు లభించినదో చెప్పెద వినుండు. ఒకనాఁడు నేనొక మిత్రునింటికి విందారగింపఁ బోతిని. ఆ మిత్రులయింట వివాహము జరుగుచుండెను. ఆ విందు నిమిత్తము మిత్రులనేకులు వచ్చియుండిరి. ఇప్పటివలె చీట్లు పంపి భోజనమునకు పిలిచెడు నాచార మప్పుడు లేదు. పెందలకడ భోజనము పెట్టు నాచారమంతకంటె లేదు. విస్తళ్ళు వేయునప్పటికి రెండుజాముల రాత్రి యయ్యెను. వడ్డించు నప్పటికి మఱినాలుగు గడియలు ప్రొద్దుపోయెను. భోజనము చేసి లేచునప్పటికి కొక్కురో కో యని కోఁడికూసెను. విస్తళ్లు వేయకమునుపు, విస్తళ్లముందుకి గూర్చుండిన తరువాతను, భోజనము సేయుచు నెడనెడ వంటకములు వచ్చులోపలను నేను నాలుగు కునుకులు కునికితిని. ఆ నిద్రలో నాకొక స్వప్నము వచ్చెను. ఆ స్వప్నములో విలక్షణమైన యొక విగ్రహము కనబడెను. కర్కోటకుఁడు కఱచిన తరువాత మారురూపము దాల్చిన నలుడా? యితఁడని యా విగ్రహమును జూచి నేను వితర్కించుకొంటిని. వామనరూపుఁడా యని మఱికొంతసే పనుకొంటిని. అప్పటికి నాకు దోచిన కొన్ని కారణములచేత నే ననుకొన్న రెండు రూపములు కావని నిశ్చయించుకొనియుంటి నని భావించి భయపడితిని. ఆ పురుషుడు నా భయము జూచి నవ్వి "భయపడకు, నేను నీకు హాని సేయుదలఁచి రాలే" దని మీఁద చేయివైచి తట్టి వెండియు నిట్లనియె. "అయ్యా! నేను గణపతిని; కాని పార్వతీపరమేశ్వరుల కుమారుఁడైన వినాయ కుఁడనుగాను, నా చరిత్రము మిక్కిలి రమణీయమైనది. ఇది మీ రాంధ్రభాషలో రచింపవలయునని నాకోరిక. నా చరిత్రము మిక్కిలి లోకాపకారము. ఇది మీరు తప్ప మఱి యెవ్వరు వ్రాయజాలరు. సాహిత్యవిద్యా చతుర్ముఖులైన విద్వాంసులు లోకమున ననేకులు కలరు. తర్కవ్యాకరణశాస్త్రపారంగతులగు పండితులుఁ బెక్కండ్రు కలరు. కాని వారిచేత నా చరిత్రము వ్రాయించుకొనవలయు నని నా కిష్టములేదు. వారు నా చరిత్ర వ్రాయఁదగరు. వారెంత సేపు భావాతీతములైన యుత్ప్రేక్షలతో నతిశయోక్తులతోఁ గాలక్షేపము సేయుదురు. వారిదృష్టికి వెన్నెలలు చందమామలు తామరపువ్వులు కలువపువ్చ్వులు హంసలు చిలుకలు తోటలు కోటలు మేడలు మిద్దెలు మలయమారుతములు విరహతాపములు మకరంద ప్రవాహములు మొదలయినవే వచ్చును కాని నిగర్వమైన నా చరిత్రము వారికి నచ్చదు. అందుచేత గీర్వాణవిద్వాంసుల గీర్వాణముఁ జూచిన నాకు దయలేదు. ఇప్పుడు నా చరిత్రము మీకు చెప్పెదను. విని వ్రాయకపోయిన పక్షమున మీరు కాశీలో గోహత్య జేసి నట్లె. ప్రయాగలో బ్రహ్మహత్యసల్పినట్లే. కురుక్షేత్రములోఁ గుక్కను తిన్నట్లే. ఇంతకు మీరు వ్రాయని పక్షమున నేను దయ్యమునై మిమ్మును మీ వంశము వారిని బదునాలుగు తరములవరకు బట్టుకొని పీకికొని తినియెదను; జాగ్రత. మీరు వ్రాసిన తరువాత నాచరిత్రము పఠియించిన వారికి పంచమహా పాతకము లడఁగును. పఠియింపని వారు చదపురుగులై పుట్టి మఱియొక జన్మమునఁ బుస్తకముఁ దిని వేయుదురు.

అని చెప్పి తన వృత్తాంతము సంగ్రహముగ నాకెఱిఁగించెను. నాలుగు కునికిపాటులలో నాలుగుపావులు చెప్పి సంగ్రహమైన యీ కథ ముగించి నీ కేమైన సందేహములున్న నడుగుమని మఱి మఱి యడిగెను. అడుగుటకు నేను ప్రయత్నములచేసి నోరు తెరవఁబోవుచుండ వడ్డన బ్రాహ్మణుఁడు నాచేతిమీఁద వేడిచారు పోసెను. నేను విస్తరి ముందరఁ గూర్చుండి చారెంతసేపటికి రాకపోవుటచే గొడకు జేరఁబడి దొన్నెలోఁ జేయిపెట్టుకొని కునుకుచు స్వప్నసుఖమనుభవించుచుండఁగా మోట బ్రాహ్మణుడు నా చేయిగాల్చెను. అందుచేత నాకు మెలకువ వచ్చెను. మరలమజ్జిగ వచ్చునప్పటికిఁ గొంతయాలస్యమైనది; కాని చేతి మంటచే నిద్ర పట్టినదికాదు. మరల నిద్రపట్టిన పక్షమున గణపతి నా కలలో మరలఁ గనఁబడి నా సందియములఁ దొలగించి యుండును. మఱియొకసారి యడుగుదమని తలంచితిని గాని నాటికి నేటికి మరల నతఁడు స్వప్నమునఁ గనబడలేదు. భోజనానంతరమున నేను నా గృహమంబున కరిగి మంచముపైఁ బండుకొంటిని. కాని నిద్రపట్టినదికాదు. భుజించిన వంటకములు త్రేన్పు రాఁదొఁడగెను. గణపతి చరిత్రము స్మృతిపథమున నిలువఁజొచ్చెను. అతని మూర్తి నాకన్నుల యెదుట నిలిచినట్లే యుండెను. ఇది నిజముగా స్వప్నమైయుండునా నామనోభ్రమయా యని నేను కొంతసేపు వితర్కించితిని. నిశ్చయముగ స్వప్నమే యని సిద్ధాంతము చేసితిని. కలలోని వృత్తాంతమును నమ్మి గణపతి చరిత్రమును నేను వ్రాయవలసి యుండునాయని నాలో నేనాలోచించుకొంటిని. వ్రాయుటయే సర్వోత్తమమని నిశ్చయించితిని. వ్రాయకపోయిన పక్షమున నతఁడు పిశాచమై పీడించునను భయమున నే నిది రచియింప సమకట్టలేదుసుడీ. ఎందుచేత నన, నేను దయ్యములు లేవని వాదించు వారలలో నొకఁడను. అట్లయిన నేల వ్రాసితినందురేమో; స్వప్నమం దొక పురుషుఁడు కనఁబడుటయుఁ దన చరిత్రము సంక్షేపముగఁ జెప్పుటయు నది వ్రాయమని కోరుటయు నది యెంతో చిత్రముగ నుండుటయు మొదటికారణము. ఆంధ్రభాషాభిమానము రెండవ కారణము. భారత భాగవత రామాయణాది పురాణములు విని విని చెవులు తడకలు కట్టినవారికి వినోద మేదైన గల్పింపవలయు ననునది మూఁడవ కారణము. ఆంగ్లేయ భాషాభివృద్ది యగుచున్న యీ దినములలో స్వప్నములలో మనుష్యులగపడుట గ్రంథములు వ్రాయమనుట చదువరు లనేకులు నమ్మకపోవచ్చును. నమ్మకపోయిన నా కేమిభయము. ఇది యబద్ధము కాదు గదా! మహాకవియగు తిక్కన సోమయాజికి నతని జనకుఁడగు కొమ్మనదండనాధుడును హరిహర నాధుఁడును స్వప్నమున సాక్షాత్కరించి మహాభారత రచనకుఁ బురికొల్పలేదా, కృష్ణదేవరాయల వారికి శ్రీకాకుళమున నాంధ్రనాయకస్వామి కలలో సాక్షాత్కరించి విష్ణుజిత్తీయ మను నామాంతరముగల యాముక్తమాల్యదను రచియించి తన కంకిత మిమ్నని కోర లేదా, తెలుగుకవులు కావ్యరచనకు ముందు కలలు గనుట సాంప్రదాయ సిద్ధము. కాబట్టి మా కలలో నంత వైపరీత్య మేమియులేదు. కలమాటఁ గట్టిపెట్టి కథాకథనములోకి దిగియెద.

ఆంధ్రకవులు తమకావ్య ముఖములకు మనోహర తిలకంబులై యుండునట్లు గృతిపతుల యొక్కయుఁ గధానాయకులయొక్కయు వంశముల వర్ణించుట సుప్రసిద్ధము. నేనును నాలుగు పద్యము లల్లనేర్చి కొందఱిచేతఁ గాక పోయిన గొందఱచేత నైనను కవి ననిపించుకొనుటచేఁ గవుల సాంప్రదాయ మనుసరింపవలయు నను దృఢసంకల్పము నాకుఁ గల్గినది. అందుచేత నీ కథానాయకుని వంశము ముం దభివర్ణించెద. మా కథానాయకు నది లోకము తగులఁ బెట్టు సూర్యవంశముగాదు. దొంగపోటుగ రాత్రులు తిరుగు మచ్చగల చంద్రవంశము గాదు. ఈ వంశమునకు బ్రహ్మదేవుఁడే మూలపురుషుఁ డగుటచేత నిది పవిత్రమైన బ్రహ్మవంశము. ఆ బ్రహ్మవంశములో నొక్కశాఖ పప్పుభొట్లవా రనుపేరఁ బరగజొచ్చె. ఇది కేవల పౌరుషనామము కాని యూరక పెట్టుకొన్న పేరుకాదు. మా గణపతి పూర్వులలో నొకఁడు పందెమువేసి మూఁడు తవ్వల కందిపప్పు వండించుకొని తానొక్కఁడే భక్షించి మూడు వరహాలు బహుమానముగ గ్రహించుటం జేసి నాటనుండియు వాని యింటిపేరు పప్పుభొట్లవా రని ప్రసిద్ధికెక్కెను. గోదావరీ తీరమున మందపల్లి యను నొక గ్రామము కలదు. ఇక్కడ శనైశ్చరుఁడు శివప్రతిష్టఁ జేసెను. శనికి మందుఁడను నామాంతరము గలదు. కావున శని ప్రతిష్టితుఁడై యీశ్వరుఁ డచ్చోట మందేశ్వరుఁడని వ్యవహరింపఁబడుచుండును. ఈ మందేశ్వరస్వామివలన నీ గ్రామము గోదావరీమండలముననే గాక కృష్ణా విశాఖపుర మండలములయందుఁ గూడ మిగులు ప్రసిద్ధికెక్కెను. శనిపీడ గలవారీగ్రామమునకుఁ బోయి బ్రాహ్మణులకు వలసిన తిల దానములిచ్చి తైలాభిషేకము మందేశ్వరునకుఁ జేసిన పక్షమున శనిదోషంబు శమియించు నని స్థలపురాణజ్ఞులు చెప్పుదురు. ఆస్తికబుద్ధిగల మనవా రందఱు శనిగ్రహావిష్ణులైనప్పుడచ్చటకుఁ బోయి కొంత ధనము వ్యయముజేసి శనివిముక్తులగుచుందురు. అనేక మహర్షులు దేవతలు బ్రహ్మస్థలముల యందు మహేశ్వరప్రతిష్టలు చేసిరి. కాని శనైశ్చరుడు ప్రతిష్టఁజేయుట తరచుగ వినము. సేతువుదగ్గర రఘురాముని చేతఁ, బ్రతిష్టింపఁబడిన మహేశ్వరుఁడు, రాజమహేంద్రవరమున మార్కండేయుని చేతఁ బ్రతిష్టింపబడిన మహేశ్వరుడు, మఱియు నగస్త్యాది మహర్షులచేతఁ బ్రతిష్టింపబడిన మహేశ్వరుడు శనైశ్చరుని చేత నేల బ్రతిష్టింపఁబడె నని నాకు వలెనే మీకును సంశయము దోపకపోదు. మృత్యుంజయుడైన సదాశివునకు గూడ శనిగానివలన భయము జనించి యుండుననియు నతఁడు తన్ను బ్రతిష్టింపఁ గోరినపుడు భయపడి వలదనఁజాలక యియ్యె కొనియెననియు నాకుం దోచుదున్నది. అంతకన్న శంకరుడు శనైశ్చరప్రతిష్ట నంగీకరించుటకు మఱియొక కారణ మగపడదు. ఆ మందపల్లియె మన కథానాయకుని పూర్వుల నివాసస్థానము. ఆ గ్రామమున మన గణపతి యిల్లిదియని యుద్దేశించి చెప్పుటకు వీలులేదు. అతని సంతతివా రుండిన పక్షమున మాపెద్దల స్థల మిదియిని యిల్లిది యని చెప్పుకొందురు. పప్పుభొట్లవారి వంశము బ్రహ్మచర్య దీక్షితుఁడై జీవనము వెళ్ళబుచ్చిన మన గణపతితో సమాప్తమైనందున గణపతి కక్క సెల్లెండ్రైనను లేమి దౌహిత్రుఁడుగూడ లేకపోవుటచేతను పప్పుభొట్ల వంశస్థులకు పరంపరగా నివాసమైన నివేశనస్థలమునిర్దేశించుట కవకాశము లేకపోయినది. అట్లు నిర్దేశింపఁగలిగిన పక్షమున మందపల్లి వెళ్ళిన దీర్థవాసు లందఱు మందేశ్వర స్వామివారి యాలయము జొచ్చి తరించిట్లే గణపతివారి గృహముకూడ ప్రవేశించి చూచి తరించుచుందురు గదా. ఆ యదృష్ట మాంధ్రదేశమునకు లేదు. గతించినవారికి విచారించిన ఫలమేమి? ఆ గ్రామమందున్న పాడు దిబ్బలలో నేదో యొక దిబ్బ పూర్వము గణపతి యిల్లయి యుండవచ్చును. కాదేని నేడు సకలసంపదలు కలిగి కలకలలాడుచున్న యిండ్లలో నొకటి మన కథానాయకునిదై యుండవచ్చును. గణపతికిఁ బూర్వు లేడు పురుషాంతరములవారు మందపల్లిలో నివసించిరి. అంతకుముందు వారి పూర్వుల నివాసస్థానము నక్కపల్లి. ఈ గ్రామము తూర్పునాడున నున్నది. నక్కపల్లినుండి గణపతి పూర్వులు మందపల్లికి వచ్చుటకు గొప్ప కారణము గలదు. గణపతి కెనిమిదవ పూర్వపురుషుఁడు నక్కపల్లిలోఁ గాపురము చేయుచుండ యొకానొక దినమున భార్యమీఁద మిక్కిలి కోపగించిన వాడై కోపమాపుకొనలేక జందెములు త్రెంపివేసి చెరువు గట్టుననున్న రావిచెట్టు కడకుఁ బోయి ముండనము జేయించుకొని సన్యసించెను. సన్యాస మిప్పించుట కెవరైన గురువు కావలయునని శాస్త్రములో నున్నది గదా! కోపమే పరమగురువై యీతనికి సన్యాస మిప్పించుటచేత నీతని సన్యాస మశాస్త్రీయమని వైరాగ్య భావముచేత సంప్రాప్తమైనది కాదని గ్రామ మందలి బ్రాహ్మణులా యపూర్వ స్వాములవారిని వెలివేసి భిక్షలు చేయుట మానిరి. ఒకరు భిక్షలు చేసెడిదేమి? నాయిల్లే మఠము. నాభార్యయే నాకు శిష్యురాలు. నా బిడ్డలేముఖ్యశిష్యులని యా ధూర్తస్వామి కడుపుమంట కాగలేక మూఁడవనాఁడె స్వగృహంబున కరిగి భార్యను బ్రతిమాలి యొడంబఱచి సన్యాసమునకు సన్యాసమిప్పించి కోమటి పేరి శెట్టి దగ్గర జందెములు వెలకుఁగొని మెడలోవేసికొని రెండు మాసములలోఁ బిల్లజుట్టుఁ బెంచికొని మరల గృహస్థుఁడయ్యెను. ఊరివా రందఱుఁ గట్టుగట్టి ఆ కుటుంబమున కంతకు నాంక్షజేసి బాధించుటచే నక్కడ బాధపడలేక కుటుంబసహితముగా బహు గ్రామములు తిరిగి తిరిగి యెట్టకేలకు మందపల్లి జేరెను.