Jump to content

గణపతి/ఇరువదియవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

ఇరువదియవ ప్రకరణము

తనకు వివాహము కాలేదని, యందువలన సాటివారిలో దనకు చిన్నతనము గలుచున్న దని, కష్టపడి చేసుకొన్న పెండ్లి చెడిపోయిన దని, కొంతకాలమునుండి గణపతి మనస్సులో విచారించుచుండెను. అతఁడు కట్టిన పుస్తె త్రెంచివైచి బుచ్చమ్మకు దండ్రి మరల పెండ్లిచేసెను. ఆ వార్త విన్నది మొదలుకొని మరల కష్టపడి తా నెట్లయిన వివాహము చేసికొని మేనమామ యొద్దకుబోయి "యీ పాడుపిల్ల నాకు తప్పిపోయినంత మాత్రమున నాకు వివాహము కాదనుకున్నారా? దీ నబ్బవంటి పిల్లను చేసికొన్నాను, చూడండి!" యని వారిని దెప్పవలెనని గణపతి మనస్సులో నిశ్చయించుకొని పెండ్లికూతురు నిమిత్తమై వెదకజొచ్చెను. తల్లి సింగమ్మయు దన కొడుకు ఘోటకబ్రహ్మచారియై యుండినా డనియు, బ్రసిద్ధమైన పప్పుభొట్లవారి వంశము వానితో నంతమొందు ననియుఁ దన మగనికి మామగారికి వారి పూర్వులకు సద్గతు లుండవనియు మిక్కిలి విచారించి, యిరుగు పొరుగు స్త్రీలు కనఁబడినపు డెల్ల నిట్లనుచుండును. " అమ్మా! మీ రంద రభిమానించుకొని మా గణపతి నొక యింటివానిని జేయరుగద. వాని మెడలో నాలుగు పోగులు పడే దారి చూతురమ్మా! మీకు బహుపుణ్య ముంటుంది. ఎంతమందో వంట బ్రాహ్మణులకు, నీళ్ళ బ్రాహ్మణులకు, దెలివి తేటలు లేనివాళ్ళకు యిట్టే పెండ్లిం డ్లగుచున్నవి. నా కర్మ మేమో కాని మావాడికి పిల్లనిచ్చుట కెవ్వరు రారు. కులము తక్కువా? గోత్రము తక్కువా? మేమేమి కుక్కను దిన్నామా? నా బిడ్డ పదిమందిలో తిరుగలేనివాడా? డబ్బు తెచ్చుకోలేనివాడా? మీ రందరు తలో పదిరూపాయలు చందా వేసి మా వాడికి పెండ్లి చేయండమ్మా. మా కిన్ని యేండ్ల పిల్ల కావలెను, అన్ని యేండ్ల పిల్ల కావలెను, అని పట్టింపులేదు. ఎన్ని యేండ్ల పిల్లయినను సరే. చివరకు రెండు మూడు నెలల పిల్లయినా సరే. అమ్మా! వానికి పాతిగేండ్ల కంటె నెక్కువ లేవు. ఇదొక వయస్సా? మావాడి కిప్పటికి కట్టు తప్పిపోలేదు." అని చెప్పుచుండ నామె పుత్ర స్నేహమునకు, వెంగలితనమునకు వారు మిక్కిలి విస్మితులై నవ్వుచు "సింగమ్మవ్వా! అలాగే పెండ్లి కుదర్చండి. మాకు తోచిన సహాయము మేము చేయుదు మని యుత్తరము చెప్పుచు వచ్చిరి. ఆమె కొడుకుం గలసికొన్నను, చుట్టములఁ జూచినను, చుట్టుప్రక్కల సుదతుల గనుగొనినను, బెండ్లిమాటయె కాని మఱియొక ప్రసంగము చేయుట మానెను. అన్యప్రసంగములు వచ్చినను నామె యెట్టకేల కీ ప్రసంగముననే దింపును. బడిపిల్లలతోను బాటసారులతోను బంధువులతోను గ్రామవాసులైన కరణములతోను కాపులతోను గణపతి తన వివాహప్రసంగమే చేయజొచ్చెను. తన శాఖలో నెవనియొద్ద నవివాహితయైన బాలిక యున్నదని విన్నను దన కామె నిచ్చి పెండ్లిసేయు మని స్వయముగానైన మాతాపితరుల నతఁ డడుగును. లేక యెవరిచేతనైన వర్తమాన మంపును. నీ కెంత యాస్థి యున్నదని యెవరైన నడిగిన పక్షమున నతని కెంతో కోపమువచ్చి యిట్లనును. "ఆస్తి! ఆస్తి! ఆస్తి లేకపోతే బ్రతకలేరా యేమి? ఆస్తి యున్నవారు బంగారము దినుచున్నారా? లేనివారు మన్ను దినుచున్నారా? ఎందు కాస్తి? చచ్చినప్పుడు కూడ తగులవేయుదురా యేమిటి? నేను భార్యకన్నము పెట్టగలనా, లేనా? యని యొక్కమాట విచారించవలెను. మీ యందరి కంటె బాగానే భార్య కన్నము పెట్టగలను. ఆస్తి కావాలట. ఆస్తి పాస్తి! చాలు చాలు! నోరుమూయండి, అధిక ప్రసంగములు చేయక" ఆ పలుకులు విని పిల్ల తల్లిదండ్రులు మధ్యవర్తులు వాని బేలతనమునకు ముసిముసి నవ్వులు నవ్వుచుందురు. ఒకనాడు తల్లి గణపతి కన్నము పెట్టుచు వివాహ ప్రసంగమురాఁగా కోపముగా నిట్లనియె "నాయనా! మన పల్లయ్యమామ భార్యకు నెలతప్పినదట. ఆ మాట విన్నప్పటినుండియు నాకెంతో సంతోషముగా నున్నది." "అయితే మనకేమి లాభమే?" యని యతఁడు బదులుచెప్పెను. "దాని కడుపున ఆడపిల్ల పుట్టినట్లయితే వాడుకూడ నీకు మేనమామే గనుక ఆపిల్లను నీకియ్యగూడదా? యని నాయాశ!" యని యామె బదులుచెప్పెను. ఆ మాట వినఁబడఁగానె గణపతి మిక్కిలి కోపించి "ఓసి భ్రష్ట కారిముండా! అంత చిన్నముండను నేను పెండ్లి చేసుకుంటానటే? అది యెన్నడెదుగును? ఎన్నడు కాపురమునకు వచ్చును? ఈ లాటి వెధవమాట లాడకు!" మని యెడమ చేతితో రెండు మొట్టికాయలు మొట్టెను. పాప మా ముసలియవ్వ యూ రెండు మొట్టికాయలతో నెంతో సేపు తల తడుముకొనుచు నేడ్చి "నీకిదేమి వినాశకాలమురా? నీ పెండ్లి పెటాకులు చేయవలెనని నేను మంచి యాలోచన చెప్పితే నీవు నన్ను కొట్టినావు? నీ పెళ్ళి మండిపోనూ, నా కెందుకు!" అని దూషణపూర్వకముగా విలపించుచుండ "ఓసి దొంగముండా! నన్ను తిట్టుచున్నావా!" యని చెంబులో నున్న నీళ్లామె నెత్తిమీద పోసి యన్నము విడిచిపెట్టి లేచిపోయెను. అది యైన మరి నాలుగు దినముల కొకనాటి రేయి గణపతి భోజనము చేయుచుండ మరల సింగమ్మ యిట్లనియె. "నాయనా! మన రామావధానుల కూతురకు సంబంధము దొరకలేదుట. తగిన వరుఁడు దొరికితే యివ్వవలె నని యున్నాడట! నీ వెవ్వరచేతనైనా పిల్లను నీకివ్వమని వర్తమాన మంపించరాదూ? నాయనా! నే బ్రతికియుండగా నొక యింటి వాఁడవైతే చూడ వలెనని యున్నది." అనుటయు గణపతి "వారెందుకు, వీరెందుకుకే? నీవే వెళ్ళి మా పిల్లవానికి మీపిల్ల నిమ్మని యడుగు. రామావధానులు మన సంబంధముకంటె యెక్కువ సంబంధము తేగలఁడా యేమిటి?"యని యుత్తరముచెప్పెను. అందు కామె వెండియు నిట్లనియె. "అది కాదు నాయనా! నేను వెళ్ళి యడిగి నా నంటే నీ కిల్లున్నదా? వాకిలియున్నదా? యని ప్రశ్నలు మొదలుపెట్టుదురు. ఆ ప్రశ్నలకు నేను జవాబు చెప్పలేను." తన యాస్తిసంగతి యెవఁడైన నెత్తినపక్షమున నతని కమితాగ్రహము వచ్చునని యిదివరకే వ్రాసియుంటిమి. తల్లి పలుకులు వినఁగానే నతఁ డతికోపము జెంది "శకునపక్షి ముండా! పెండ్లిమాటలకు వెళ్ళిరావే యంటే యిల్లున్నదా వాకిలియున్నదా యని వారడుగుతా రని లేనిపోని శంకలుపెట్టి పాడుమాట లాడుచున్నావు. బోడిముండా? నీ మూలముననే నాకు పెండ్లి కాలేదు. ఇల్లు వాకిళ్ళు పుట్టగానే లోకు లందరు పట్టుకువచ్చారా యేమిటి? నీవే నాకేమియు లేదని ముందుగా ప్రేలుచుంటే పిల్లనిచ్చేవా రనరా యేమిటి? పిశాచపు ముండా! కోడలు రానీ. నిన్ను వీథులోనికి కుక్క నీడిపించిన ట్లీడిపించక పోతానేమో చూతువుగాని?" యని కోపమాపుకొనలేక యా విస్తరి రెండుచేతులతో నెత్తి తల్లి నెత్తిమీఁదపెట్టి రుద్ది, వీపుమీఁద రెండు చరుపులు చరిచి లేచిపోయెను. "అయ్యో! నే నేమన్నానురా? నీ పెండ్లి పేలాలు వేగిపోను! నా జోలికి రాకురా, ఇఁకమీద నీ పెండ్లిమాట నేనెత్తనురా, బాబూ! యని తన తల యంటుపడెను. గావున నూతికడకు బోయి యామె స్నానము చేసెను. సింగమ్మకు మంచి పాటలు గాని పద్యములు గాని రావు. కాని అప్పుడప్పుడు యేవో కూని రాగములు తీయుచుండును. ఆమెకు రామదాసు చరిత్రము మిక్కిలి యిష్టము. అప్పుడప్పుడు బైరాగులు భిక్షాటనము నకు వచ్చి 'రామదాసు చరిత్రము బాడినపుడు చారెడు బియ్యము వారికి పెట్టి, రెండుమూడు కీర్తనలు వినుచుండును. ఆ కీర్తనలలో, 'యెందుకైనా యుంచినావు బందిఖానలో' నను నట్టి వామెకు మిక్కిలి యిష్టము. విద్యావిహీనులైన బైరాగులు శబ్దములు స్వచ్ఛముగ నుచ్చరింపలేక, 'వ్రెందుకైనా వుంచినావూ బ్రందిఖానలో' అని పాడుచుందురు. సింగమ్మ వారిదగ్గర నా పాట నేర్చికొని వారివలెనే 'వ్రెందుకైనా వుంచినా' వని తప్పుగా పాడుకొనుచుండును. ఒకనాఁడామె తన ప్రాత నులకమంచము మీఁద వెన్నెలలో బండుకొని యా పాట పాడుకొనుచుండగా గణపతి వచ్చి, "ఓసి నీపాట తగలెయ్య! అదేమి పాటే? బ్రాహ్మణముండవు కావటే! పాడదలచుకుంటె ఎందుకైనా వుంచినావు బందిఖానాలో నని స్వచ్ఛముగ పాడు. లేదా నోరు మూసికొని యూరుకో" యనిపలికెను. 'నా పాటజోలి నీ కెందుకురా? నాకు వచ్చినట్లు పాడుకొనుచున్నాను. నీ కిష్టమైతే విను. లేకపోతే యావలకు లేచిపో!' యని యామె బదులు చెప్పెను. "అపస్వరములు పాడి పాట తగులపెట్టి నేను దిద్దితే పైగా నామీఁద కోపపడతావా? ఓసీ కోపిష్టిముండా! అపస్వరాల పాట యెప్పుడూ పాడవుగదా? పాడవుగదా?" యని నాలుగు చెంపకాయలు కొట్టెను. ఆమె కుమారుని మనసులో దూషించుచు, గోలు గోలున మనసులో నేడ్చెను. ఒకనాడు కొట్టినాడు గదా, మరల వానియొద్ద నిట్టి పాటలు పాడ గూడదని యామె యూరకుండదు. ఆడది, పెద్దది, విశేషించి తల్లి, యామె యెట్లు పాడుకొనిన మన కెందుకని గణపతి యూరకుండఁడు. ఈ విధముగ నామె పాడుచుండుట నామెకు బుత్రదండనము జరుగుచుండుట ప్రాయికమయ్యెను. శంకరుని కుమారుఁడైన గణపతి యొక్క పురాణము జనులు వినాయక చతుర్థినాడె విందురు గాని యీ గణపతి పురాణమును ప్రతిదినము వినుచుండిరి. దినమున కొక క్రొత్తవింత బయలుదేరు చుండెను. రాత్రి భోజనము లైన తరువాత గ్రామవాసు లరుగుమీఁద గూర్చున్నపుడు ప్రాతఃకాలమున దంతధావనార్థము నలుగురు చెరువు గట్టు చేరినప్పుడు "యేమిటోయి గణపతి విశేషము?" లని యొండొరుల నడుగు చుందురు. ఎవరో కొన్ని క్రొత్త వింతలు చెప్పుచుందురు. అక్కడ చేరినవారందరు మితిమీఱ నవ్వి "మన యదృష్టముచేత గణపతి మన గ్రామమనున నివసించె" నని పలుకుచుందురు. వివాహము మాట తలపెట్టినపుడు, పాట పాడుకొన్నప్పుడు, కొడుకేదో వంకబెట్టి తన్ను కొట్టుచుండుటచేత సింగమ్మ కొడుకున కెవరైన చేతపడి చేసిరో లేక పిచ్చి యెత్తెనో యని యిరుగు పొరుగు కాంతలతో నాలోచింపఁ బోయెను. కొందరు దయ్యమనిరి, కొందరు పిచ్చియనిరి. గణపతి తల్లితోనే గాక తన వివాహముమాట యెత్తి తన కాస్తి లేదన్న వారందరితోను తగవులాడు చుండుటచే గ్రామవాసులలోఁ గొందరుకూడ యతనికిఁ బెండ్లి పిచ్చియెత్తినదని తలంచిరి. ఈతని వికృత చేష్టలు చూచి గడుసువాండ్రగు పాత విద్యార్థులు కొందరు గణపతిని తమ వినోదము నిమిత్త ముపయోగించుకొనవలెనని యాలోచించి తమలో తా మొక పన్నుగడ పన్నుకొని యొక నా డతనితో నిట్లనిరి. "పంతులుగారూ! మీకు వివాహము చేయవలెనని మాకందరకు గట్టిగా మనసులో నున్నది. కాని కొందరు గణపతిగారికి పిచ్చి యెత్తిన దనియు, మీరు తిన్నగా పల్లకీలో గూర్చుండ లేరనియు, మీకు బుద్ధినిలకడ లేదనియు మీమీద లేనిపోని వాడుకలు వైచినారు. ఆందుచేత మేమీ రాత్రి పల్లకీ భజంత్రీమేళము రెండుమూడు కాగడాలు తెప్పించెదము. మీరు పల్లకీలో కూర్చుండి, పెండ్లికొడుకు ఠీవి కనబరచవలెను. ఆలాగున మీరు చేసినపక్షమున మీరు వివాహమునకు దగిన వారే యని, మీకు వెఱ్ఱిలేదని గ్రామవాసులు నమ్మి, చందాలువేసి మీకు వివాహము జేయుదురు. మీరు మాకు చదువు చెప్పి మమ్మెంతో బాగుచేసినారు గనుక విశ్వాసముచేత మిమ్మొక యింటివారిని జేయవలెనని మా కందఱకు దోచినది. పల్లకిలో గూర్చుండుట మీ కిష్టమేనా?" పల్లకీపేరు చెప్పగానే గణపతి పరవశుఁడయ్యెను. వెనుక బుచ్చమ్మ పెండ్లి మిక్కిలి రహస్యముగ జరుగుటచే బహిరంగముగా బల్లకి యెక్కి యూరేగుట కతనికవకాశము లేకపోయెను. వివాహమైనప్పుడు తీరవలసిన ముచ్చట వివాహము కానప్పుడు తీరుట తనకు శుభసూచక మని తప్పక యటమీఁద నిఁక వివాహ మగునని యతఁడు నిశ్చయించి యిట్లనియె. "ఒరే అబ్బాయిలారా ! నేను కష్టపడి చదువు చెప్పినందుకు మీ కున్నది విశ్వాసము. తక్కినవాళ్ళలో నొక్క ముండాకొడుకు కయిన నున్నదా? ఒక్కరికీ లేదు సుమా. ఈ కలియుగములో విశ్వాస ముంటుదిట్రా! ఒక్క లమ్డీకొడుక్కైన లేదురా విశ్వాసము! యెంతకష్టపడి చదువు చెప్పినానురా మీకు? నా మూలముననె గాదట్రా, మీరింతంతవా ళ్ళైనారు. మీ విశ్వాసమునకు నేను సంతోషించినానురా. మీ యాలోచన బాగున్నది. ముత్యాల కుచ్చులున్న పల్లకి తెప్పిచండి. బోయలు వోం వోం వోం వోమ్మని బాగా కేకలు వేయాలి. కాగడాలు రెండు చాలవు. నాలుగై దుండవలెను. డోలు వీరణము సన్నాయి తోనే కడతేర్చక రమడోలు మేళము తాషామర్పాలు బాకాల జోడు కూడ తెప్పించండి. చూడు, వొరే వెంకటప్పా! మీ బాబయ్య చుట్టుకునే యెఱ్ఱతలగుడ్డ జరీది, తీసికొనివచ్చి జరీపట్టీలు పైకి బాగా కనబడునట్లుగా చుట్టి నా తలమీఁద పెట్టండి. పట్టుకోటెక్కడైనా తెచ్చిపెట్టండి. జరీపంచి, జరీకండువా కావలెను. అవి యింకొకరు తీసికొనిరండి. లేకపొతే చాకలి సరివిగాడికి నాలుగు డబ్బులిచ్చి తీసుకొనిరండి. ఇవి తెచ్చి సింగారం చేసి యాపైని నన్ను చూడండి. పల్లకిలో మహారాజు కొడుకులాగ ఎంత ఠీవిగా యెంత దర్జాగా కూర్చుందునో, కాగడాల వెలుతురున నా మొగమెంత ధగ ధగ మెఱయునో, నేనేలాటి నవ్వులు నవ్వుదునో, యేలాటి చూపులు చూతునో, చూడండి తమాషా నేనేమి వెఱ్ఱి వెంకటాయ ననుకొన్నారా యేమిటి? ఇరివరకిన్ని పెళ్ళిళ్ళైనవి గాని యీ గ్రామములో పల్లకిలో యింత డాబుగా కూర్చున్న పెండ్లికొడుకు లేడురా, వీడు కడుపుకాలా! వీ డసాధ్యుడురా! యని లోకు లందరు చెప్పుకొనునట్లు కూర్చుండ గలనో లేదో చూడండి. వెళ్ళండి. మీ పనిమీద మీరుండండి!" అని బడి కాదినము సెలవిచ్చెను. విద్యార్థులు వాని కడ సెలవుగైకొని తిన్నగా చాకలిపేటకు బోయి యొక పల్లకి గుదిర్చి రాత్రి యెనిమిది గంటలకు రమ్మని చాకలి వాండ్రతో జెప్పిరి. తాషాజోడు రమడోలు మేళము గుదిర్చి తక్కిన భజంత్రీల నేర్పరచిరి. ఒక డెఱ్ఱజరీ తలగుడ్డ తెచ్చిపట్టీలు పైకుండునట్లు చుట్టి యతని తలపై బెట్టి యది సరిపోవునో లేదో యని నాలుగైదుసారులు చూచిరి. గణపతి పెద్ద యద్ద మొకటి తెప్పించుకొని తనమొగ మందులో చూచుకొని సంతోషించెను. నాలుగైదు పట్టుకోట్లు తెచ్చిరి. గని యవి యన్నియు వాని బొజ్జకు సరిపోవయ్యెను. ఎన్ని కోకలు చుట్టినను హనుమంతుని తోక మిగిలియున్నట్లే యెంతెంత పెద్దకోట్లు తెచ్చినను గణపది బొజ్జ మాత్రము మిగిలియే యుండెను. చిన్న పొణకతో యాముదపు సిద్దెకో కోటు తొడిగినట్లుండెను. కాని మనుష్యునకు తొడిగినట్లు లేదు. సరివిగాని దయవల్ల జరీపంచయు నుత్తరీయము లభించెను. ఆ పంచ గట్టుకొని యాకోటుమీద నా యుత్తరీయము వైచికొని తలపాగ దాల్చి పల్లకి యెప్పుడు వచ్చు నెప్పుడువచ్చు నని యూరేగింపు టుత్సవమున కుబలాట పడుచుండగా నొక విద్యార్థి "మొగమున గళ్యాణము బొట్టు, కన్నులకు గాటుక, కాళ్ళకు పసుపు పారాణి లేకపోయిన పక్షమున పెండ్లి కొడుకున కుండవలసిన లక్షణము లుండవు గనుక తప్పక నవి యన్నియు నుండవలె" నని చెప్పెను. అది గణపతికి సహేతుకముగాఁ తోచినందున బాదములకుఁ బారాణియు, నేత్రంబులకు గజ్జలంబును బెట్టుమని తల్లి నడిగెను. ఇంతమాత్రపు ముచ్చటయైన దాను బ్రతికియుండగా దన కన్నుల బడినదని సంతోషించి యతఁడు మరచిపోయిన బుగ్గచుక్క గూడ బెట్టెను. ఊరేగింపైన తరువాతే భోజనము జేయుదు నని గణపతి యా పూట భోజనమే చేయలేదు. గణపతి యా దినమున నూరేగునను వార్త పొక్కుటచే గ్రామవాసులంద ఱా యుత్సవము గన్నులార జూచి యానందింపవలె నని తమ తమ పనులెల్ల పెందలకడ ముగించి దీపములు పెట్టినతోడనే భోజనములు చేసిరి. చిన్నపిల్లలు సైతము నిద్రపోవరైరి. మగవాండ్రందరు గణపతి యింటిముందర రాత్రి నాలుగు ఘడియల ప్రొద్దుపోవు నప్పటికి తీర్థప్రజలవలె జేరిరి. ఆడువాండ్రందరు గృహకృత్యములు పెందలకడ నిర్వర్తించుకొని యూరేగింపు చూచుటకు వీథులలో గూర్చుండిరి. రాత్రి జామగునప్పటికి యూరేగింపు ప్రారంభమయ్యెను. గణపతికి రెండు విచారములు మాత్రము పట్టుకొనియెను. భోగముమేళము లేకపోవుట యొకటి, బాణాసంచా లేకపోవుట యొకటి. ఆ విచారము పూర్వవిద్యార్థులకు తెలుపగా నిజమైన వివాహమున కా రెండు వెలితిలు బూర్తి చేయుదుమని చెప్పి గురువుగారికి దుఃఖోపశమనము చేసిరి. ఆ రాత్రి వానపల్లి గ్రామవాసులనుభవించిన యానంద మేమని వర్ణింతును? ఉత్సవములో నెంత తిరిగినను వారికి విసుగు జనింపలేదు. కాళ్ళు నొప్పులు పెట్టలేదు. ఆయాస మనిపించలేదు. ఎందుచేత ననగా మన గణపతి తనచేష్టలచేత, నాసనములచేత, చూపులచేత మఱి యితర చిహ్నములచేత, క్షణ క్షణము వారికి క్రొత్త యానందము గల్పించుచు వచ్చెను. ఒకమాఱు వెనుకనున్న బాలీసుకు జేరబడును. ఒక మాఱు పండుకొనును. ఒకసారి ముందఱికి వంగును. ఒకతూఱి బాసెనపట్టు వేసికొనును. ఒకపరి కాళ్ళు జాపుకొనును. ఒకసారి రెడ్డికము వైచికొనును. ఒకసారి కన్నులు మూసికొనును. ఒకసారి పెద్దగ్రుడ్లు చేయును. మఱియొకతూఱి యోరచూపులఁ జూచును. ఒకసారి చప్పట్లు వాయించి తానే గానము చేయును. కాగడాలు పల్లకికి దూరమైనప్పుడు కాగడాలు పట్టువారిని గట్టిగా తిట్టి దగ్గఱకు రమ్మనుచు, ఇంటింటి దగ్గఱ పల్లకి యాపించును. వారే కారణము చేతనైన నాగకపోయిన పక్షమున బిగ్గఱగ నఱచి యాపించును. ఒకసారి భజంత్రీలు సరిగా మేళము చేయకపోగా మేళము చేయింపు మని యతఁ డొకరిద్దరితో జెప్పెను. వారా మాట వినిపించికొన నందున గుభాలున తానే పల్లకిలో నుండి క్రింది కురికి భజంత్రీలను నాలుగు చెంపకాయలు కొట్టి మరల పల్లకి యెక్కెను. కూడనున్న జనులలో నవ్వని వారు లేరు. దేవతో త్సవములకు గాని జమ్మిసవారీకి గాని గురు స్వాములవారు వచ్చినప్పుడు కాని దేశోద్ధారకులైన మహానుభావులు వచ్చినప్పుడు గాని యంతజన మెన్నడును బయలు దేఱి యుండరు. తన స్నేహితుల యిండ్లముందఱికి బల్లకి వెళ్ళినప్పుడు గణపతి చేసన్న చేసి పిలిచి "ఓరీ! యుత్సవ మేలాగున్నది? నేను జమాయించి గూర్చున్నానా? పెండ్లి కొడుకులా గున్నానా?" యని యడుగుచుండును. "పెండ్లికొడుకు బాబులా గున్నావురా! నీలాటి పెండ్లికొడుకు లేడురా, లోకములో!" నని హాస్యాస్పదముగ వారు ప్రత్యుత్తర మీయ నతఁడు దానిభావము గ్రహింపలేక తనవంటి పెండ్లికొడుకులు లోకమున లేరని యానందించెను. తన యుత్సవ మగుటచేత గణపతి యా రాత్రి నిదురపోవలేదు. ఏమియు దోఁచనపుడు చుట్ట వెలిగించి యీ ప్రక్క నా ప్రక్కనున్న కాగడావాండ్ర మీఁదను స్నేహితులమీఁదను నుమియ జొచ్చెను. ఆ మహోత్సవ పారవశ్యమున వా రా యవమానము సరకుగొనరైరి. ఆ సమయమున నతని తిట్లు దీవన లయ్యెను. ఉమ్ములు పుష్పవర్షము లయ్యెను. జాము తెల్లవారునప్పటికి ఉత్సవము సమాప్తమయ్యెను. గణపతి పల్లకి దిగి యింటిగుమ్మములో నడుగు పెట్టగానే సింగమ్మ గుప్పెడు మిరపకాయలు దిగదుడిచి, తన్నిమిత్త మారిపోకుండ జాగ్రత్తపెట్టిన పొయినిప్పులో పడవైచి, కుమారునకు దృష్టిదోష పరిహారము చేసెను. పల్లకి దిగి గణపతి పండుకొని మరునాడు పగలంతయు నిద్రపోయి సంధ్యాకాలమున మేల్కొని యపుడు దంతధావనము చేసి భుజించి, కడచిన రాత్రి జరిగిన యూరేగింపునుగూర్చి విద్యార్థులతో గొంత ప్రసంగించి మరల పండుకొని మరునాడు జాము ప్రొద్దెక్కిన తరువాత లేచెను. అది మొదలుకొని పది దినములవరకు కనబడిన వారితో తన యూరేగింపు యుత్సవమునుగూర్చి మాటలాడుచు, బాగున్నదని యెల్లవారును బ్రశంసింప నమితానందమునొందుచు, తన్మయత్వము చెంది సుఖించుచుండెను. కాని తల్లి కుమారుఁడు భోజనము చేయునప్పుడు వాని వివాహ ప్రసంగము తలపెట్టుట మానలేదు. ఏదో తప్పుపట్టి గణపతి యామెను మొట్టుట కొట్టుట మానలేదు. ఆ బాధ పడలేక యామె యిరుగు పొరుగు నున్న మగవాండ్రతో మొఱ్ఱ పెట్టుకొనగా వారు గణపతికి పిచ్చి పట్టినదనియుఁ దలమీఁద గత్తివాటులు వేయించి నిమ్మపండ్ల పులుసుతో రుద్ది, వందబిందెల నీళ్ళు పోసిన గాని యా పిచ్చి కుదుర దనిఁయుఁ జెప్పిరి. "బాధపడలేక పోవుచున్నాను, నాయనా! యాలాగే చేయుం" డని యామె బదులు చెప్పెను. మరునాఁ డుదయమున గణపతి నిద్ర మేల్కొనక మునుపే వాని పూర్వ విద్యార్థులు ఆ మెరియలవంటివాండ్రనమండ్రు వచ్చి తల్లితో మాటలాడి, గణపతి మేలుకొనువరకు నక్కడ కూర్చుండి యాతఁడు మేల్కొన్న పిదప "పంతులు గారూ! కాలువకు వెళ్ళి స్నానము చేయుదము, రండి!" యని యడిగిరి. సరేయని యతఁడు బయలుదేరెను. వారొక మంగలివానిని గూడవెంట దీసుకొని పోయిరి. అక్కడకు వెళ్ళిన తరువాత "పంతులు గారూ! మీరు పని చేయించుకొం" డని యందొకఁడు చెప్పెను, "తల మాయలేదు. నేను పనిచేయించుకొన" నని యత డుత్తరము చెప్పెను. అప్పుడిద్దరు శిష్యులు చెరియొక చేయి బట్టుకొనిరి. ఇద్దరు కాళ్ళు త్రొక్కిపెట్టి పట్టుకొని మంగలివానిని పనిచేయు మని జెప్పిరి. అంతట మంగలివాఁడు క్షురకర్మ నారంభించెను. గణపతి మంగలివానిని, విద్యార్థులను దిట్టుచు దక్షిణ దేశపు గాయకుడు త్రిప్పినట్టుఁ తల యిట్టట్టుఁ బలుమారు త్రిప్పెను. మంగలివాఁడు ప్రయత్న పూర్వకముగ నాటులు వేయకపోయినను గణపతి శిరము వేమారు త్రిప్పుటచే నాలుగైదు నాటులు పడెను. అంతలో మరి నలుగురు విద్యార్థులు నాలుగు బిందెలు తీసికొనివచ్చిరి. సింగమ్మకూడ వారితో వచ్చెను. ఆ వార్త గ్రామమున బ్రకాశిత మగుటచేత బనిపాటలు లేనివాండ్రు వినోదము చూచుటకై కాలవయొడ్డున జేరిరి. నిమ్మపళ్ళ పులుసుతో మంగలివానిచేత తల రుద్దించి విద్యార్థులు గురుభక్తి తత్పరులై వందలకొలఁది బిందెలనీరు వాని తలపై బోసి "యీ దెబ్బతో మీ పిచ్చి వదులునులెండి!" యనుచు నించుమించుగ సహస్ర ఘటాభిషేకమూ జేసిరి. నడమ నడుమ సింగమ్మ "నాయనా! పిచ్చి పూర్తిగ వదిలినదాక నీళ్ళు పోయండి!" యని వారిని హెచ్చరించుచు వచ్చెను. " నాకు పిచ్చి లేదురోయి! వదలండిరోయి!" యని గణపతి కేకలు వేయజొచ్చెను, "అదే పిచ్చిమాట, నాయనా! పిచ్చి లేదన్నమాటే పిచ్చ" యని సింగమ్మ విద్యార్థులతో బలికెను. గణపతి, తల్లిని పూర్వవిద్యార్థులను యా మహోత్సవసందర్శనార్థ మరుదెంచిన గ్రామీణులను నోటికి వచ్చిన ట్లెల్ల దిట్టి, కాలుచేతులు స్వాధీనము గాకపోవుటచే గొందరం గఱచి, కొందఱం దలతో గ్రుమ్మి, గ్రామము నుండి యుత్సవము జూచుటకై కాలువవరకు నడచివచ్చిన వారి శ్రమ వృథాగాకుండ గావలసినంత వినోదము గలిగించెను. పూర్వవిద్యార్థు లట్లు తన్ను బాధించుచుండ దనకా పీడ దొలఁగింపు మని గణపతి తత్కాలపు విద్యార్థులతో వెన్నుముదిరిన వాండ్రను గొందరను బిలిచిచెప్పెను. కాని వారేమియుఁ చేయలేకపోయిరి. ఈ యభిషేకమైన తరువాత వారు గణపతిని మెల్లగా నిల్లుజేర్చిరి. ఈ పని తల్లియె చేయించిన దని యతఁడు తెలిసికొని, యామె తనకంటికి కనఁబడకూడదని చెప్పెను. అతఁడేదైన దుష్కార్యము చేయునేమో యని యామెను మహాదేవ శాస్త్రులగారి యింటికి పంపిరి. గురువుగారికి శిష్యులే తమ తమ యిండ్లనుండి పూటకొక్కరుగ వంతులు వేసికొని యన్నము దెచ్చి పెట్టుచుండిరి. తల్లి తనకు గావించిన పరాభవము తాను తల్లికి గావింపవలె నని యతనికి దృఢసంకల్పము కలిగెను. కలుగుటయు దన కాప్తులైన పదుగురు విద్యార్థులను బిలిచి యొకనా డిట్లనియె. "ఓరీ! నా కొక్క పెద్దచిక్కు సంభవించినదిరా! మా తల్లి వట్టి పిచ్చిముండై పోయినది. దానిపిచ్చి కుదురుతేనే గాని నాకు సుఖము లేదు. చూడు తమాషా ! అని పిచ్చిముండై యెదురు నాకే పిచ్చియని లోకమున వెల్లడిచేసి యినపగుండ్లవంటి బండకుంకలను పదిమందిని పోగుచేసి కాలువరేవున నా బుఱ్ఱ గొరిగించి, నిమ్మపండ్ల పులుసుతో నా తల రుద్దించి, నీళ్ళు పోయించినది. ముందు దాని పిచ్చి మనము కుదుర్చవలెను. అది యిక్కడకు వచ్చుటలేదు. ఒరే! చిదంబరం నీవు వెళ్ళి మా యమ్మను సమాధాన పరచి కోపము దీర్చి మన యింటికి తీసికొనిరా, వచ్చిన తరువాత నాలుగురోజులు చూచి దాని పిచ్చి మనము కుదిర్చివేతుము" అని చెప్ప వెంటనే చిదంబరము తల్లికడకు బోయి సామవాక్యములతో నామె యలుక దీర్చి యింటికి దోడ్కొని వచ్చెను. నాలుగురోజులు జరిగిన తరువాత నొకనాడు తెల్లవారుజాముననే మంగలిని గణపతి పిలుచుకొని వచ్చి నిద్దుర లేవక మునుపే తల్లికి క్షౌరము చేయుమని చెప్పెను. మంగలి మొదట సందేహించెను. కాని "మా యమ్మ పిచ్చిది, మే మిప్పుడు ఆమెకు నీళ్ళు పోయవలెను. గనుక సందేహింపక పనిచేయరా!" యని యతఁడు హెచ్చరింప క్షురకుఁడు వపన మారంభించెను. కత్తి తలకు తగలగానే యామె మేలుకొని కన్నులు తెరచి చూచి 'నీ కిదేమి వినాశ కాలమురా ' యని మంగలిని దిట్టి వానిచేయి బట్టుకొన బోవుచుండగా నంతలో గణపతియు విద్యార్థులు డగ్గరి కాలుచేతులు నొక్కిపెట్టిరి. ఆ నడుమ మంగలి ముండనము సమాప్తము చేసెను. ఆమెయు నిట్టటు గింజుకొనుటచే రెండుమూడు గంటులుపడెను. తరువాత గణపతియు శిష్యులును గలిసి శవమును దీసికొనిపోయి నట్లామెను వీధిలో నున్న పెద్దనూతికడకు దీసికొని పోయి బిందెలతో నీళ్ళుతోడి పోసిరి. ఆమెయు దనకు బిచ్చి లేదని పలుమారులు మొఱ్ఱపెట్టుకొన్నను నవి యెల్ల పిచ్చిమాటలేయని గణపతి 'సరకు సేయక పోయండి నీళ్లు పోయండి ' యని మాతౄణము దీర్చికొనెను. అంతటితో గణపతికి దల్లిపై నున్న యక్కసు తీరిపోయెను. నాటంగోలె సింగమ్మ తనయుని గృహమువిడిచి గ్రామమున వారింటను వీరింట నేవో పనిపాటలు చేయుచు గాలక్షేపము సేయజొచ్చెను. కొడుకు నలుగురను పోగుచేసి తనకు బిచ్చి యని నీళ్ళుపోయించునని తల్లియు, దల్లి పదుగురను బోగుచేసి తన కున్మాదమని చెప్పి కాలువకడ స్నానము చేయించునని కొడుకును నొండొరులకు భయపడ జొచ్చిరి. పిమ్మట మాతాపుత్రు లెన్నడు గలుసుకొనలేదు. మహాదేవశాస్త్రిగారి తల్లియు మరికొందరు బ్రాహ్మణు వితంతువులు రామేశ్వరయాత్ర వెళ్ళదలచి తమ కేవైన పనిపాటులు చేయుచుండునని సింగమ్మను వెంట రమ్మనిరి. ఆమె భోజనము గడచుటయే గాక యాత్రాఫలముగూడ దక్కునని వారి వెంట బయలుదేరెను. ఆమె తిరుపతి శ్రీరంగము మథుర రామేశ్వరము మొదలైన మహాక్షేత్రములు చూచి తిరిగి వచ్చునపుడు మార్గమధ్యమున శ్రీ కుంభకోణ క్షేత్రమునందు విషూచిజాడ్యముచే మృతినొందెను. ఆమె గోదావరీతీరమునందే మృతినొందవల నని మొదటి నుండియు దలంచెను. కాని భగవంతుడు కావేరీతీరమె యామె నిమిత్తము విధించి యుండెను. ఇప్పటివలె నా కాలమున రైలు బండి లేకపోవుటచే రామేశ్వరయాత్ర నేటివలె సులభముగాక మిక్కిలి కష్టసాధ్యమై యుండుటచే సింగమ్మ మరణవార్త గణపతికి తెలియనే లెదు. మహాదేవశాస్త్రులుగారి తల్లి వచ్చి యావార్త చెప్పునప్పటికి గణపతి వానపల్లి విడిచిపోయెను. అందుచేత నతఁడు దల్లినిమిత్తము కన్నీరు గాని నువ్వులనీరు గాని విడువవలసిన యవసరము లేకపోయెను. బ్రతికియుండగా బెట్టిన పిండమే గాని చచ్చిన తరువాత పిండము పెట్టనవసరము లేకపోయెను. మాతా పుత్రులు వియోగమైనది మొదలుకొని గణపతి కొంతకాలము విద్యార్థుల యిండ్లలో వారములు చేసికొనియు, గొన్నినాళ్ళు వంటచేసి కొనియు, బ్రాహ్మణార్థములకు బోయియు, సంతర్పణముల కరిగియు గాలక్షేపము సేయజొచ్చెను. గాని వివాహము కాలేదని గొప్ప విషాద మతని మనస్సును విడిచిపెట్టలేదు. అంతకు ముందు చేసిన ప్రయత్నమువలన శుల్కము గ్రహింపకుండ దనకు కన్యాదానము చేయువా రెవ్వరు లేరని యతఁడు తెలిసికొని కొన్ని వందల రూపాయ లోలి దా నిచ్చి యైన వివాహ మాడవలయు నని నిశ్చయించుకొనెను. కాని ద్రవ్యము లేదు. అందునిమిత్తమై చందాలు సేయు మని గ్రామవాసులను బీడింపఁ జొచ్చెను. ఆ గ్రామవాసులనే గాక చుట్టుప్రక్కల నున్న గ్రామముల కరిగి తద్గ్రామీణులను గూడ యాచింపజొచ్చెను. యాచించి తెచ్చిన సొమ్ము తన దగ్గర నుంచుకొనక తనకు నమ్మకముగల యొక బ్రాహ్మణుని చేతికిచ్చి దాఁచెను. రమారమి నూటయేబది రూపాయలు ప్రోగుపడెను. ఏడెనిమిది వందల రూపాయ లుండినగాని యతనికి వివాహము కాదు. ఎట్లయిన నంతసొమ్ము ప్రోగుచేసి యతడు కృతకృత్యుఁడు కావలెనను యత్నము చేయజొచ్చెను.

ఇట్లుండ నొకనాఁడు మహాదేవశాస్త్రి వర్తమాన మంపి గణపతిని పిలిపించి తన యెదుట గడ్డము పెంచుకొని యున్న యొకానొక బ్రాహ్మణుని జూపి యిట్లనియె. "అబ్బాయీ గణపతీ! ఈ బ్రాహ్మణుఁడు నీకు పిల్ల నియ్యవలెనని వచ్చినాఁడు. ఈయన కాపుర మంతర్వేది. వీరింటిపేరు చింతావారు. ఈయన పేరు భైరవదీక్షితులుగారు. ఈయన స్వాధ్యాయమందు గొప్ప యధికారి. ఈయనయే కాదు, ఈయన తండ్రిగారు, తాతగారు గూడ నెనుబదిరెండు పన్నములు గట్టిగా వల్లించి ఘనాపాఠులైనారు. వారు నీ వంటి వానితో సంబంధము చేయుటే కష్టము. ఇలాటిది నీ పూర్వ పుణ్యముచేత నీకు వారితో సంబంధము గలుగుచున్నది. ఈయన వందలు వేలు పుచ్చుకునేవాఁడు కాఁడు. నలువది వరహాలు మాత్రము నీ విచ్చేపక్షమున పిల్ల నీ యధీనమగును. పిల్లను నేను చూచినాను. గజ్జెలగుఱ్ఱములా గున్నది. ఆరు మాసములలోనే కాపురమునకు రాఁ గలదు. కాఁబట్టి నీవా సొమ్మిచ్చి వీరి పిల్లను చేసికో. పైగా వారు తమ పిల్ల నిక్కడికి తీసికొనివచ్చి మీ యింట్లోనే వివాహము చేయుదురు. వారు పూర్వము గొప్ప సంసారులె కాని వారి పెద్దలు చ్క్షేసిన క్రతులవల్ల దానధర్మములవల్ల సంసారము చితికిపోయినది. అందుచేత నలువది వరాల సొమ్ము నీదగ్గఱ పుచ్చుకొని మీ యింటికే వచ్చి పెండ్లిచేయవలసి వచ్చినది. కాని లేకపోతే వీథులు కట్టి విస్తళ్ళు వేసి సంతర్పణ చేసి కలియుగవైకుంఠముగ వారు వివాహము చేయగలవారె. సరే, ఆ మాటలెందుకు? ఇప్పుడు పెద్దమనుష్యుల నెవ్వరినైన తీసికొనిరా, తాంబూలములు పుచ్చుకుందము. 'ఏమండీ దీక్షితులుగారు! పిల్ల వానిని మీరు చూచుకొన్నారుగదా' మీ కిష్టమేనా?" అనవుడు సగము తెల్లవెంట్రుకలు సగము నల్ల వెంట్రుకలు గల తన గడ్డము చేతితో నొకసారి దువ్వు గోవింద! గోవింద! యని రెండుసారులు భగవన్నామస్మరణముచేసి దీక్షితు లిట్లనియె. "మా పరువు ప్రతిష్టలు మా తండ్రితాతలతోనే పోయినవి. నేనిప్పుడు మా పెద్దలపేరు చెప్పుకొనక జీవచ్ఛవమునై యున్నాను. మా యాడుపిల్ల లందరిని ఇది వరకు నేను కన్యాదానము చేసినాను. ఇది కడగొట్టు పిల్ల. దీనిని గూడ నొక యయ్య చేతిలో బెట్టి నా భార్యను దీసికొని నేను కాశీ వెళ్ళి యక్కడ నివాసము జేయఁదలఁచుకొన్నాను. ఆ యాత్ర బత్తెకర్చులకే యీ నలువది వరాలు పుచ్చుకొన్నాను. అంతేకాని పిల్ల నమ్ముకొని సుఖించుటకు కాదు. అమ్ముకో దలఁచుకొంటే నలువది వరాలు పుచ్చుకో వలసిన కర్మమేమి? ఏడువందలు పుచ్చుకో, ఎనిమిదివందలు పుచ్చుకో, వేయిరూపాయలు పుచ్చుకో, యని నా యింటిచుట్టు కుక్కలవలె పెండ్లికొడుకులు తిరుగుచున్నారు. వారి కివ్వకపోయినానా? కుఱ్ఱవాఁడు సాంప్రదాయకుఁడు బుద్ధిమంతుడు నైన వానిని జూచి కాశీయాత్ర కెంత సొమ్ము కావలెనో యంతే సొమ్ము పుచ్చుకొని యిచ్చివేయవలె నని యేర్పాటు చేసికొన్నాను. ఈ పిల్లవాఁడు నా కన్ని విధముల నచ్చినాఁడు. కాఁబట్టి తాంబూలము లిప్పించండి. ఐదారు దినములలో నేను వెళ్ళి మా వాళ్లను దీసికొనివచ్చి యిక్కడే వివాహము చేయగలను."

వారిరువురి మాటలు గణపతి కమితానందము గలిగింప నతఁడు "మహాదేవశాస్త్రిగారూ! నే నిప్పుడే వెళ్ళి అచ్చంబొట్లుగారిని, పాపన్న సోమయాజులుగారిని దీసికొని వచ్చెద" నని లేచి వెళ్ళి పూర్వోదాహృతులగువారిని దీసికొని వెళ్ళెను. మహాదేవశాస్త్రి వారిద్దరిని గౌరవించి కూర్చుండబెట్టి, వారిని రావించిన పని తెలియజేసి, తాంబూలము లిప్పించి పంచాంగము చూచి, తాను ముహూర్తము నిర్ణయము చేసెను. భైరవ దీక్షితులుగారు సకుటుంబముగ వచ్చిన తరువాత వారి కియ్యవలసిన నలువది వరహాలు నియ్య నిర్ణయము. అనంతరము భైరవ దీక్షితులు స్వగ్రామమున కరిగి తన కుటుంబము దీసికొని వచ్చెను. కుటుంబముగా దాను భార్యయుఁ బెండ్లికూతురు, తక్కిన కూతుళ్లను జామాతలు వివాహమునకు పంపనందున తాము మువ్వురు మాత్రమే రావలసివచ్చిన దని యతఁడు గ్రామములో చెప్పెను. బ్రాహ్మణునకు వివాహకార్యము వచ్చినపుడు పీటల మీఁది పెండ్లి చెడగొట్టగూడదని గ్రామవాసు లదివర కిచ్చిన చందాగాక మరికొంత ద్రవ్యము సరకులు మొదలైనవి గణపతి కిచ్చిరి. ఒక వైశ్యుఁడు బియ్య మిచ్చెను. మరియొకఁడు నెయ్యి యిచ్చెను. ఒక పాత విద్యార్థి పల్లకి ఖర్చు పెట్టెను. ఒకఁడు భజంత్రీ కర్చు పెట్టెను. వివాహము రేపనగా గణపతి నలువది వరాలసొమ్ము భైరవశాస్త్రి చేతిలో బోసెను. గణపతి పక్షమున రావలసిన చుట్టము లెవ్వరు లేనందున మహాదేవశాస్త్రియె మేటిచుట్టమై మగపెండ్లివారి పక్షమున జేయవలసిన పని యంతయు జేసెను. సుముహూర్తమున గణపతికి యథావిధిగ వివాహ మయ్యెను. కన్నులార జూచి సంతోషించుటకు దల్లి సమయమునకు లేక రామేశ్వరము వెళ్ళినదని చూడవచ్చిన వారందరు విచారించిరి. పసుపులు నలుచుటకు, గౌరికల్యాణము పాటలు పాడుటకు, తగవులు నడపుటకు, మహాదేవశాస్త్రి భార్య మున్నగు పేరంటాండ్రు వచ్చి కార్యము కొనసాగించిరి. ఊరేగింపుటుత్సవ మిదివఱకే వర్ణింపఁబడినది గావున నిప్పుడు వేరుగ వర్ణింప నక్కఱలేదు. ఐదు దినములు సలక్షణముగ జరిగెను. అప్పగింతలు, దండాడింపులు మొదలయినవి జరిగెను. గణపతి మహానందభరితుఁ డయ్యెను. పిల్ల పూర్వజన్మమున నిప్పులు పూజచేసిన దని కొందఱు, జిల్లేడు పువ్వులు పూజించినదని కొందఱు, దాని కేమి యిది మహాలక్ష్మిలా గున్నదియని కొందరు, బలు తెఱంగుల భాషింపజొచ్చిరి. ఇట్లు వివాహానంతరమున నాలుగు దినములు గడిచిన తరువాత నొకడు ముప్పది సంవత్సరముల వయసు గల యొక పడుచు బ్రాహ్మణుఁడు పోలీసు కనిస్టేబు నొకరిని వెంటబెట్టుకొని గణపతి యింటికి వచ్చి 'అతడే ముద్దాయి ' యని భైరవ దీక్షితులును జూపెను. కనిస్టేబులు భైరవదీక్షితులును బట్టుకొని "అయ్యా! నిన్నెఱస్టు చేసినా" నని చెప్పెను. పోలీసువారు పల్లెటూరు వచ్చినప్పుడు వానివెంట పదుగురుబడి యతఁడు చేయదలఁచిన కార్యము చూడబోదురు. అందుచేత నదివరకు కొందరు జనులక్కడ మూగిరి. వారిని జూచి మరి కొందరు జేరిరి. "నన్నెందులకు పట్టుకున్నా" రని దీక్షితులు రాజభటు నడిగెను. భటుఁడేమో చెప్పబోవుచుండగా వాని నూరకుండుమని నతినితోవచ్చిన పడుచు బ్రాహ్మణు డిట్లనియె. "అతడు కాదు నేను చెప్పుచున్నాను, విను. అయ్యా! పెద్దమనుష్యులు మీరందరుఁ గూడ చిత్తగించండి. ఈయన బ్ర్రాహ్మణుఁడండి. కాపుర మేయూరో తెలియదు. ఇప్పుడు పెండ్లియైన యీ పిల్ల తన కుమార్తె యని చెప్పి నా దగ్గర యైఁదువందల రూపాయలు పుచ్చుకొని యంతర్వేదిలో శ్రీనృసింహస్వామివారి యాలయములో ఆ పిల్లను నాకిచ్చి పెండ్లి చేసినాఁడు. వివాహమై యేడాది కాలేదు. ఇప్పుడా పిల్లనే తిరిగి యీ పిల్లవానికి వివాహము చేసినాడు. అంతేకా దీయన ప్రభావము వినండి. ఈ పిల్ల యీయన కూతురుగాదు. ఆవిడ యీయన భార్య కాదు. ఆవిడ సాతానిది. ఆమెది వెంకటేశ్వర్లువారి వాడపల్లె కాపురము. సాతాని తిరువెంగళయ్య భార్య, ఈవిడ పేరు నాంచారమ్మ. ఈ దుర్మార్గు డామెను పుత్రికాసహితముగా లేవదీసుకొని వచ్చి యిది తనభార్య యని, యాపిల్ల తన కూతుఁరని చెప్పి మొదట నన్ను మోసపుచ్చి పిమ్మట మిమ్మును వంచించినాఁడు. అందుచేత నితనిమీఁదను నితని క్రొత్తయల్లుని మీదఁను నేను డెప్యూటీ తహసీలుదారుగారివద్ద క్రొత్తపేటలో ఛార్జీ యిచ్చినాను. క్రొత్తయల్లునికి మామకు వారంటు తెచ్చినాను." వారంటను శబ్దము వినగానే గణపతి దొడ్డిదారిని నెక్కడికో పాఱిపొయెను. నాటికి నేటికి మరల కనఁబడలేదు. భైరవదీక్షితులున కాఱుమాసములు కారాగృహశిక్ష విధింపఁబడెను. తిరువెంగళయ్య తన భార్యను బిడ్డను దీసికొనిపోయెను. శూద్రసంపర్క దోషమునకై వానపల్లి గ్రామవాసులు ప్రాయశ్చిత్తములు చేయించుకొనిరి. చదువరులారా! మీ యదృష్ట మంతవరకె యున్నది. తన కథ యింతవరకు మాత్రమె చెప్పి యదృశ్యుఁడయ్యెను. అతఁడు మరల నగుపడి యనంతర చరిత్రము చెప్పిన పక్షమున నది గూడ నిట్లె లిఖించి మీ కానందము గలిగించెదను. ప్రస్తుత మింతటితో దనివినొందుఁడు. అతడు కనబడక పోయిన పక్షమున నంతకంటె నొక యక్షరమైన లేదని నమ్ముఁడు.

సమాప్తము.