గణపతి/పందొమ్మిదవ ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

పందొమ్మిదవ ప్రకరణము

వానపల్లెలో గణపతి స్థానమందుఁ బ్రవేశించిన యుపాధ్యాయుఁడు కాలవశమున విశూచి జాడ్యముచేత మృతినొందెను. అందుచేత నా యూరులో బడి చెప్పువారు లేకపోయిరి. అంతలో గణపతి కృష్ణవేషధారణమును, పాచకత్వము నను రెండుద్యోగములు మానిఁ యా గ్రామము బోవ తటస్థించెను. గణపతిచర్య లెన్నటికి మరపురానివైనను కొంద రా చర్యలు మరచి బడి పెట్టు మని యతని నడగరి. కొందరు గణపతి యెంతమాత్ర మా పనికి బనికిరాఁడని వాదించిరి. అభిమాన మున్నవారి యాదరముచేత నతఁడు మునుపటి చోట గాక మరియొక చోట పాఠశాల స్థాపించెను. బసయు మునుపటి చోట చేయక యా యూరివా రొకరు స్వగృహము విడిచి బిడ్డల కింగ్లీషు చెప్పించుకొనుటకు అమలాపురము వెళ్ళుచుండఁగా వారి నడిగి యా యిల్లు తన కాపురము నిమిత్తము గణపతి పుచ్చుకొని యందుఁ బ్రవేశించెను. ఇల్లు పెద్దదగుటచే పిశాచములు వచ్చి పీడించునని యాతడు విద్యార్థుల నెప్పటి యట్లు కొందరిని దనకు సాయముగ బిలుచుచుండును. ఆ యింటి దొడ్డిలో నాలుగైదు కొబ్బరిచెట్లుండెను. ఎలుక లప్పుడప్పుడు చెట్లెక్కి లేక పుచ్చెలు కొట్టి క్రింద పారవేయజొచ్చెను. ఎలుకలు రాయిడి తొలగించుటకై గణపతి యనేక యుపాయములు బన్నెను. ఆ యుపాయములలో నొకటియు నతనికి నచ్చలేదు. ఎట్టకేల కతనికి గొప్పయాలోచన యొకటి పొడకట్టెను. అది యమోఘ మని యతడు తలంచెను. ఒకనాడు సకల గృహవర్తియగు మార్జాలచక్రవర్తిని బట్టుకొని దాని నొక బుట్టలో బెట్టి శిష్యు నొకనిం బిలిచి చెట్టెక్కించి మరియొక శిష్యునిచేత పై నున్న వాని కా పిల్లి నందియ్యమని చెప్పెను. అతఁడ ట్లందిచ్చెను. పై వాడు పిల్లి నందుకొనిన తరువాత దాని మెడ కొక త్రాడు బోసి యా త్రాడు కొమ్మకు కట్టివేయ మని గణపతి చెప్పెను. శిష్యుఁడు గురుని యాజ్ఞ ప్రకారము గావించి క్రిందికి దిగెను. అప్పుడు గణపతి శిష్యులతో నిట్లనియె. 'ఈ సారి యెలుకలు చచ్చిపోయినవి. వీటి మొగం మండ! కొబ్బరికాయ యొక్క టైన దక్కకుండ వాటిపొట్టం బెట్టుకొనుచున్నవి. ఈ గ్రామములోని వారందరు నావలెనే యెలుకలబాధ పడుచున్నారు. కాని మందమతిముండాకొడుకులు నావలెనొక్కఁడైన యాలోచన చేయలేక పోయినాఁడు తెలివితేట లుండవలెను. కాని యేళ్ళుండఁగానే సరా. డబ్బుండఁగానే సరా!' ఆ కోతలు విని శిష్యులానందించిరి. అప్పటికి సాయంకాలమయ్యెను. గణపతి భోజనముచేసి నిద్రించెను. తన బిడాల మెన్ని యెలుకలనుబట్టి రాత్రి చంపెనో చూడగోరి గణపతి చెట్టుదగ్గరకుఁ బోయి మెడయెత్తి చూచునప్పటికి పిల్లి మెడకా త్రాడు యురిపడ చచ్చి యురి స్తంభముల వ్రేలాడు నేరస్తుని వలె వ్రేలుచుండెను. అది యేమైనదో చూచుటకై శిష్యులు చేరి యా బిడాలము యొక్క దుర్దశ జూచి జాలి నొందిరి. ఆ వార్త యప్పుడె గ్రామమున బొక్కెను. సూర్యోదయ మగు నప్పటికె గ్రామమునందలి పిన్న పెద్దలు నా వింత జూచుటకై యచ్చోటికిం జనిరి. నవ్వినవారు నవ్విరి. వెక్కిరించినవారు వెక్కిరించిరి. పరిహాసగర్భమున నతని బుద్ధి మెచ్చినవారు మెచ్చిరి. అంద రన్ని విధములు ననుచుండ మహాదేవశాస్త్రి గణపతి తల్లితో నిట్లనియెను. "సింగమ్మప్పా! నీ కొడుకు పిల్లి బ్రహ్మహత్య చేసి నాఁడు. కుక్కను చంపిన పాపము గుడికట్టి నప్పటికి బోదు. పిల్లిని చంపిన పాపము బంగారు పిల్లిని చేసి బ్రాహ్మణునకు దాన మిచ్చిన గాని పోదు. అట్లు చేయకపోతే వంశనాశన మని పెద్దలు చెప్పుచున్నారు. ఆనక నీ యిష్టము. నీ మేలు కోరినవాడను గనుక నిజ స్థితి జెప్పినాను. "అనవుడు సింగమ్మ గుండె బాదుకొని "అయ్యో! నాయనా! ఎంతపని జరిగిందిరా! నీ కొబ్బరిచెట్లు కూలిపోను. మీ కాయలు గంగపాలు గాను. ఈ మాయపిల్లలు మా వాడి మతి విఱిచి యీ పని చేయించినారమ్మా. అయ్యకొడుకా! నీవు బ్రతకవు కాబోలునురా, నాయనా!" యని కొడుకును గౌగిలించుకొని యేడ్చెను. అందులోఁ గొందఱు "అవ్వగారూ! భయపడకండి. మే మందరమూ చందా వేసికొని బంగారుపిల్లి చేయించి మీ యబ్బాయిచేత దానము చేయించెదమని ధైర్యము జెప్పిరి. అంతటితో గణపతి మనస్సు, తల్లి మనస్సు స్థిమితపడెను. మహాదేవశాస్త్రి యా రాత్రి మరల గణపతి గృహమున కరిగి తల్లి కొడుకులతో నిట్లనియెను. "బంగారు పిల్లిని చేయించుటకు గ్రామస్థులు చందా లిచ్చెద మని చెప్పినారు కదా. ఆ చందాలు మీరు పుచ్చుకొన్న పక్షమున నప్పటి కప్పుడే పులుసులో పడిపోవును. అవి ప్రోగుచేసి నా చేతి కివ్వండి. శాస్త్రప్రకారము చచ్చిపోయిన పిల్లి యెంత యున్నదో అంత పిల్లిని చేయించి దాన మీయవలెను. మన మనమంతవఱకు శక్తులము గాము గనుక చందాల సొమ్ము పెద్దకాసువఱకు జేరిన తోడనే శాస్త్ర సంతృప్తికొఱకేదో విధముగా నొక చిన్నపిల్లిని చేయించి యొక బ్రాహ్మణుని చేతిలో బెట్టుదము. పిల్లిదానము తిలదానముకంటె చెడ్డది. అది యెవరు బట్టరు. ఏదో విధముగ నేనే యేర్పాటు చేయుదును లెండి, మీరు భయపడకండి" అని చెప్పిపోయెను.

మహాదేవశాస్త్రి ఉదయమున జేసిన ప్రథమోపన్యాసమును బట్టియు రాత్రి గావించిన ద్వితీయోపన్యాసమును బట్టియు నతఁ డేలాగైన గణపతిని దోష విముక్తుని జేసి, పిల్లిదాన మెవరు బట్టకపోయినను దానైనను యా దానమును బట్టి యాతని నొకదరికి జేర్పవలయు ననియు సంకల్పించి నటులు స్పష్టముగ దెలియుచున్నదికదా. ప్రాణభయముచేత గణపతి ప్రతిదినము నిద్ర మేల్కొనగానే నలుగురునో యైదురుగునో గృహస్థులను జూచి చందా నడిగి తన చుట్టముక్కల కందులో గొంత మిగుల్చుకొని తక్కినవి మహాదేవశాస్త్రిగారి చేతి కిచ్చుచుండును. అట్లొక మాసములో నొక కాసు పోగుచేసి యతఁడు శాస్త్రి కిచ్చి, పైడిపిల్లిం జేయించు మని కోరెను. కాని కా సాగ్రామమున దొరకలేదని కొంతకాలము, కంసాలి చేయలేదని కొంతకాలము, తూనిక వేయ లేదని కొంత కాలము జరిగి గణపతి యా గ్రామమున నుండగా సువర్ణ మార్జాలము నతనికి జూపలేదు. గణపతి చందావలన దెచ్చిన రాగిడబ్బులు; వెండి బేడకాసులు, పావులా కాసులు చేతబడవైచి నప్పుడే యనియె రాగిపిల్లు, వెండి పిల్లులు నని మహాదేవశాస్త్రి మనస్సులో దలంచుకొని యాపిల్లుల నెప్పటికప్పుడె భక్షించుచు వచ్చెను. కాని బంగారుపిల్లిని జేయించదలఁచుకొననే లేదు.

బంగారుపిల్లి గొడవతో నిట్లు కొంతకాలము గడచిన పిమ్మట నొకనాడు గణపతి, అతని యింటికి రాత్రులు పండుకొన వచ్చు పెద్దవిద్యార్థులు కొందఱును గలిసి కాలువదగ్గఱకు షికారు బోయి, యయ్యది వేసవికాల మగుటచేఁ దెల్లవాఱు జామున లేచి ప్రతిదినము స్నానము చేయవలయు నని నిశ్చయించుకొనిరి. కాని దీని కొక్కచిక్కు గనబడెను. గణపతికి మెలకువ వచ్చుట యసంభవము, ప్రతిదినము జాము ప్రొద్దెక్కిన తరువాత లేచు గణపతి జాము తెల్లవారగట్ల లేచుట యన యర్థ రాత్రమున సూర్యోదయ మగుటయె. శిష్యుల ముందె మేల్కని పిదప గురువును లేపవచ్చునని వారిలో నొక్క డాలోచన చెప్పెను. తెల్ల వారుజామున శిష్యులకు ముందు మెలకువ వచ్చుట యెట్లని వారిలో నొకనికి సందేహము తోఁచెను. గురువుగారి దగ్గరునున్న ప్రజ్ఞలన్నియు శిష్యులకు లేకపోయినను నిద్రావిషయమున మాత్ర మతని శిష్యులే యని యనిపించుకొనుటచేత నట్టి సందేహమున కవకాశము గలిగెను. పట్టణములో గొప్పవారి యిండ్ల నుండు నట్టి గడియారమొక్కటి యున్నపక్షమున ముందుగాఁ దక్కిన వారికి మెలఁకువ వచ్చుటకు వీలుగా నుండునని యొకడు చెప్పెను. అది విని కాపుల కుఱ్ఱవాఁ డొక డిట్లనియెను. "గడియారములు మన దేశములో లేవు. నూటనాట నొకటి యున్నదో లేదో! అదిగాక గడియారము లేకపోయిన నేమి? మంచి కోడిపెట్ట నొక దానిని మనము పెంచుకొన్నపక్షమున నది నాలుగుజాములకు కూయును. కడపటిసారి కూసినతోడనే ముందుగా మనకు మెలకువ వచ్చును. ఆ తరువాత మనము గురువుగారిమీద నెక్కి త్రొక్కియొ రక్కియొ గిల్లియొ కఱచియొ లేపవచ్చును. ఇదిగాక కోడిని పెంచుటవల్ల గురువుగారికి మఱి రెండు లాభము లుండును. కోడి గ్రుడ్లమ్మినందువలన కొంత డబ్బు చేరును. పైగా దాని కడుపున రెండుమూడు పుంజులు మంచివి పుట్టినయెడల మన యమ్మవారి తీర్థములోను మఱి యితర తీర్థములలోను వాటిచేత పందెములు కట్టించి కావలసినంత డబ్బు సంపాదించవచ్చును. కాబట్టి నా యుపాయము విని యొక కోడిని పెంచుట మంచిది. " అనవుడు వెఱ్ఱివాలకముగా నున్న యొక బ్రాహ్మణబాలుడు "ఛీ! ఛీ! కాలమానము దెలియుటకు బ్రాహ్మణు లెవరైన కోడిని పెంచుదురా? ఇది చాల తప్పు. అది మనము చేయవలసినది కా" దని హితోపదేశము చేసెను. ఆ యుపదేశము తక్కిన బ్రాహ్మణ బాలకులకును సహేకమై సమ్మతమై తోచినను నదివఱకె హాస్యాస్పదముగ నున్న గురువుగారి చరిత్రము మఱింత పరిహాసపాత్రముగఁ జేయఁదలంచిన యా శూద్రకుమారుని యాలోచనము మిక్కిలి బాగున్నదని ప్రశంసించి యతని మాట కడ్డము చెప్పిన బ్రహ్మణబాలుని వారు చీవాట్లు పెట్టిరి. పందెముల వలనను గ్రుడ్లవలనను విశేషలాభము గలుగునని వినినతోడనే గణపతి కుక్కుట స్వీకారమునకు సమ్మతించి యొక కోడిని దనకు దెమ్మని కాపుల కుఱ్ఱవాని నడిగెను. వాఁడు తన యింటనున్న యొక పెట్టను దెచ్చి మరునాఁ డుదయమున గురువుగారికి గొప్ప కానుకగా సమర్పించెను. ఆ యులుపా గ్రహించి గణపతి పరమ సంతోష భరితుఁడై దాని కొక గది యేర్పరచి కన్నబిడ్డవలె దాని నాదరింపఁ జొచ్చెను. బడిలో చదువుకొను పిల్ల లందరు వంతుల ప్రకారము దినమున కొక్క పిల్లవాఁడు దాని నిమిత్తమై తఫుడు తేవలె నని యతఁ డాజ్ఞాపించెను. ఆ ప్రకార మందరుఁ దే దొడగిరి. తవుడు తేలేనివారు గురువుగారియొక్క బెత్తము దెబ్బలకు గురి కావలసినదే. దాని కూతవలన శిష్యులకును గురువునకును మెలుకువ వచ్చుటయు దెల్లవారు జామున వారు కాలువకు స్నానమునకుఁ బోవుటయు మూఁడునాళ్ళ ముచ్చటయ్యెను. పిన్ననాటినుండియుం బెంచిన బద్ధకము వారి శ్రద్ధను కబలింప వారా ప్రయత్నము మానుకొనిరి. కోడిమాత్రమె యింట మిగిలెను. గణపతి బడిపిల్ల లందరు జూచుచుండగను, వారు లేనప్పుడును కోడిని యొడిలో బెట్టుకొని చేతితో జోకొట్టుచు 'నా బుల్లికోడి రావే! నా బుచ్చికోడి రావే! నా వెఱ్ఱికోడి రావే!' యని ముద్దులాడుచుండును. తల్లి సింగమ్మ కుమారుఁడు చేయు కుక్కుటసంరక్షణ మెంతమాత్రము సహింపక 'కొంప మాలపల్లి చేసినావురా, యాయనా! నీ కోడి మండిపోను! దీని యీకెలు రెట్టలు యెత్తిపోయలేక చచ్చిపోవు చున్నాను. బ్రాహ్మణులకు కోడి యెందుకురా? నీముద్దు ముక్కలైపోనూ!" యని పలుమారు మందలించుచుండెను. అవి యెంతమాత్రము వాని తల కెక్కలేదు. మహారాజుల యతఃపురాంగనలు చిలుకలను రాయంచలను మిక్కిలి గారాబమునం బెంచుచు నెత్తుకొని ముద్దాడుచు నానందించునట్లె గణపతియు నెందఱు చెప్పినను వినక యా కోడి తన కారవప్రాణ మనియు దనపాలిటి లక్ష్మి యనియు నమ్మి దానికే వెలితి రాకుండ వేవిధముల గనిపెట్టుచుండును. గ్రామ వాసులలో ననేకు లతఁడు కోడినెత్తుకొని ముద్దాడు సమయమున నక్కడకు బోయి, వాని మాటలు ముఖవైఖరులును బరీక్షించి వినోదముతో బ్రొద్దుపుచ్చు చుందురు. అప్పు డప్పుడా కోడి గ్రుడ్లు పోవుచుండును. దొంగిలించిన బాలుని గనుగొన లేక గణపతి బడిపిల్ల లందఱి వీపులమీఁద నీతబెత్తములతో బాజాలు వాయించుచుండును. రామాయణ భారత భాగవతా దులలో కథలు చెప్పుకొనినట్లు యాగ్రామవాసులు, సమీప గ్రామవాసులును వాని చరిత్రము జెప్పుకొని కడుపులు పగులునట్లు నవ్వుచుందురు. ఎప్పటి గ్రుడ్లప్పుడు గణపతి ఖర్చు నిమిత్త మమ్మివేయుచుండును. కాని కోడి పొదిగి వాటిని పిల్లలు జేయువఱకు నోపిక పట్టలేకపోయెను. అట్లుండఁగా నొకనా డాకుక్కుటము మిక్కుటమైన సంతోషముతో దొడ్డిలో దిరుగుచు నక్కడక్కడ రాలిన గింజలు చెదపురుగులు మొదలైనవాని నేరుకొని తినుచుఁ దిరుగు చుండగాఁ నేమూలనుండియొ నొక గండుపిల్లి వచ్చి దానిం బట్టుకొని గొంతుకొరికి చంపెను. చంపిన తరువాత లోపలినుండి గణపతియు బడిపిల్లలు వచ్చిరి. కార్యము మించి పోయిన తరువాత వచ్చి యేమి చేయగలరు? అప్పుడు గణపతి పడిన దుఃఖపు వర్ణన దుస్సాధ్యమైనను గొన్ని మాటలైన వ్రాయక పోవుట చరిత్రమునకు వెలితి యగును. కావున నించుక చెప్పదలంచితిమి. 'అయ్యో! నాకోడీ! నానల్లకోడీ! నా పాలిటి బంగారు గని ననుకొన్నానే, నిన్ను! నీ కడుపున పుట్టిన పుంజుల చేత పందెములు వేయించి నాలుగైదు వందలు సంపాదించి పెండ్లి చేసుకుందా మనుకున్నానే ! నీవంటి బంగారు బొజ్జగల కోడి నావంటి నిర్భాగ్యునకు దక్కునటే! నీకెంత ముద్దుగా తౌడు పెట్టుకొన్నానే! భుజముమీద ఎక్కించుకొని త్రిప్పినానే, రాత్రులు నా ప్రక్కలో బండుకొనేదానవే, ఇక నేనొక్కడ నేలాగున పడుకోగలనే ఈమాయ పిల్లెక్కడ వచ్చిందే నీ ప్రాణమునకు." అని దుఃఖించుచుండ సింగమ్మ యతని కడకుఁ బోయి "యయ్యో నాయనా! అది చుట్టమా? పక్కమా? కోడికోసమల్లా యేడువవచ్చునట్రా?" యని మందలించెను. ఆ పలుకులు వినగనే యతఁ డాగ్రహావిష్టుడై తాటియాకుల మంటవలె లేచి "దిక్కుమాలిన ముండా! నా కోడికి నీ దృష్టే తగిలిందే ముండా! దానిని చూచినప్పు డెల్ల నీ కన్నులలో నిప్పులు పోసికొన్నావు. నీ మూలమున నిక్షేపమువంటి కోడపెట్టె పోయినదే ముండా! నా యిల్లు చిన్నబోయి వల్ల కాడు లాగున్నదే ముండా! నీ కన్ను లిప్పుడు చల్లగా నున్నాయటే, ముండా!" యని కోప మాపుకొనలేక యామెకడకుఁ బోయి బుఱ్ఱవంగదీసి పదిచఱపులు వైచెను. "నీ కేమి చేటుకాలము వచ్చినదిరా? నే నేమి జేసినానని నన్ను కొట్టుచున్నా" వని యామె యేడ్చుచు లోపలికి బోయెను. ఆ రాత్రి యతడు దుఃఖముచేత సరిగా నన్నమే తినలేదు. జన్మమధ్యమున నతనికి సరిగా నిద్రపట్టని రాత్రి యదియె. తెల్లవారుజామున నెన్నడులేని దతనికి మెలకువ రాగా "యీ పాటికి లేచి కూసేదానవే. నీ కూతలు నాకు సంగీతములా గుండేవి. నేనెంత దిక్కుమాలినవాడనైతినే! నీవు లేకపోవుటచేత యిల్లు బావురుమని పోయిందే! నీవు చచ్చిపోయినావు కాని మా తల్లి ముండైనా చచ్చిపోయినదికాదే!" అని పరిపరి విధముల దుఃఖించెను. ఆ మరునాటినుండియు మఱియొక కోడికొఱకు ప్రయత్నము చేయదొడగెను, కాని యది లభించినదికాదు.