Jump to content

గణపతిముని చరిత్ర సంగ్రహం/బ్రాహ్మణ స్వామి దర్శనము

వికీసోర్స్ నుండి

3. బ్రాహ్మణ స్వామి దర్శనము

బిరుద విభ్రాజితుడై గణపతిశాస్త్రి వైద్యనాథ క్షేత్రమున కేగి తపస్సును చేయుచు సురేశ మిత్రు డను పండితుని వలన తారా మంత్రోపదేశమును పొంది, మహాదీక్షతో జపించి మంత్రసిద్ధి నొందెను. పదవనాటి రాత్రి కలలో శివుడు కన్పించి నిర్విషయ ధ్యానరూపమైన స్మృతి మార్గమును చూపి కావ్యకంఠునిపై విభూతిని చల్లి మాయ మయ్యెను. తరువాత కావ్యకంఠుడు 'గహ్వాల' (గర్హ్వాల) సంస్థానాధిపతిని దర్శించి చతురంగమున ఆయన యొద్దనున్న యష్టదిగ్గజములవంటి వారిని ఓడించెను. ఆయన పళ్లెరము నిండ రూప్యముల నుంచి నమస్కరించినను కావ్యకంఠుడు పవిత్ర మనస్కులకు అత్యాశ తగదని మార్గ వ్యయమునకు కావలసిన పది రూప్యములను మాత్రమే స్వీకరించెను. ఆ ధనముతో ఆయన కాశికిచేరి, అటునుండి కాన్పూరునకు పోయెను. అక్కడ మూడు మాసములు స్మృతి మార్గము నవలంబించి ఆయన జపధ్యానములు సలిపెను.

అప్పుడు ఇంటికి రమ్మని తండ్రి వ్రాయగా కావ్యకంఠుడు వెంటనే కలువఱాయికి చేరెను. నేత్ర వ్యాధితో బాధపడుచున్న తండ్రికి సేవ చేయుచు ఆయన అచ్చటనే పదునైదు మాసములు వుండి, ఆయుర్వేదమును మధించి చికిత్స చేసి ఆయనకు దృష్టి చక్కబడునట్లు చేసెను.

తండ్రి యభిప్రాయమును అనుసరించి గణపతిశాస్త్రి భార్యతో కూడ 1902 మార్చి నెలలో నందిగ్రామము మీదుగా మందసా చేరి అచ్చట రాజకుటుంబము యొక్క ఆతిథ్యమును పొందుచు సుమారు మూడు నెలలుండెను. విశాలాక్షమ్మ అనారోగ్యము వలన పుట్టింటి కేగెను. కావ్యకంఠుడు సోదరుడైన శివరామశాస్త్రిని పిలిపించుకొని వాడితో భువనేశ్వరమున కేగి దేవిని ఒక మాసము ఆరాధించెను. అటనుండి ఆయన తమ్మునితో దంతవాణి సంస్థానమును దర్శించి కలకత్తాకు పోయి వెనుకకు మరలి కాంచీ నగరమునకు చేరి క్షీరవతీ, వేగవతీ నదుల మధ్యనున్న హనుమదాలయమున శివ పంచాక్షరిని ఒక నెల జపించెను. అక్కడ నారాయణుడను జ్యోతిష విద్వాంసుడు శిష్యుడయ్యెను. అతని మాటను పాటించి గణపతి తేజోలింగక్షేత్రమైన అరణాచలమునకు వచ్చెను.

అప్పుడు గణపతినవరాత్రుల యుత్సవములు జరుగు చుండెను. అందువలన పురము కోలాహలముతో నుండెను. కావ్యకంఠుడు మొదట అపితకుచాంబా దేవిని దర్శించి, పిదప అరుణాచలేశ్వరుని సేవించెను. అప్పుడాయనకు భక్తి యొక్క ఉద్రేకమున అపూర్వమైన యనుభవము కలిగి, "శక్తి, ఈశ్వరుడు ఇచ్చటనే నాకు పూర్ణానుగ్రహ స్వరూపులై కన్పించు చున్నారు. నా తపస్సు ఇక్కడనే సిద్ధి పొందును." అని ఆయన సోదరునకు చెప్పెను. శివరామశాస్త్రి కూడ అన్నతో అక్కడనే యుండుటకు నిశ్చయించుకొనెను. కాని వారి కచ్చట భోజనప్రాప్తి దుర్ఘటమయ్యెను. గణపతికి క్షేత్ర దేవతలపై కోపము వచ్చెను. అప్పుడు వారికి విచిత్రమైన యాతిథ్యము లభించెను. ఒక బ్రాహ్మణుడు కన్పించి తన భార్యయొక్క వ్రత పారణము కొఱకు వారి నిద్దరను ఆహ్వానించి ఆతిథ్యము నొసంగెను. వారు ఆ రాత్రి సుఖ ముగా నిద్రించి లేచునప్పటికి తాము ఆతిథ్యము పొందిన గృహము మాయమై దాని స్థానమున గణపతి దేవాలయము నొద్ద బయలు ప్రదేశము కన్పించెను. అది స్వప్న మనుకొనుటకు వీలు కాకుండా ఆ దంపతులొసంగిన తాంబూలములు గుర్తుగా కన్పించుచుండెను. కాంచీపురమందు గావించిన జపముతో శివ పంచాక్షరికి అయిదు కోట్లజపము పూర్తియగుటవలన అపితకుచాంబ అరుణాచలేశ్వరుడు అనుగ్రహించి తమ్ము అచటికి ఆకర్షించి ఆతిథ్యము నొసంగిరని గణపతి భావించుచు, తల్లిదండ్రుల యొడిలోచేరిన బాలునివలె ఆనందించెను.

అరుణాచలమున నివసించుచు అన్నము కొఱకు లోకులను యాచించుటకంటె పరమేశ్వరుని ప్రార్థించుటయే మేలని కావ్యకంఠుడు వేయి శ్లోకములలో హరస్తుతిని గావింప బూనుకొనెను. ఆశ్వయుజమున దేవీ నవరాత్రులైనంతనే 1902 అక్టోబరులో గ్రంథమును ఆరంభించి కావ్యకంఠుడు కార్తిక మాసమున కృత్తికోత్సవమునకు ముందే ముగించెను. ప్రతిదినము వ్రాసిన శ్లోకములను ఆయన సాయంకాలము నంది ముందు నిలుచుండి ఈశ్వర సన్నిధియందు వినిపించుచుండెను. పౌరులు ఆశ్చర్యచకితులై విన జొచ్చిరి. తుది దినమున శేషాద్రిస్వామి, బ్రాహ్మణస్వామియు వచ్చి విని ఆనందించిరి. గ్రంథము ముగియునప్పటికి ఈశ్వరానుగ్రహమున కావ్యకంఠునకు పాఠశాలయందు అధ్యాపకపదవి లభించెను. పది దినములలో ఆయన తమిళమును అభ్యసించి ఆ భాషలో విద్యార్థులకు బోధింపజొచ్చెను. కాని ఈశ్వరానుగ్రహము తనకు సమగ్రముగా లభింపలేదని, ఆత్మానందము గోచరించుట లేదని అయన పరితపించుచుండెను. 1903 జనవరిలో ఒకనాడు బ్రాహ్మణ స్వామిని దర్శించినచో తనకు ధన్యత్వము కలుగవచ్చునని కావ్యకంఠునకు తోచెను. వెంటనే విశ్వనాథయ్యరు అను పరిచితునితో కొండపైనున్న యాస్వామి యొద్దకుపోయెను.

బ్రాహ్మణస్వామి 1 - 9 - 1896 లో తిరుచ్చుళి నుండి అచ్చటికి వచ్చి అనేక స్థలములలో గాఢ సమాధియందుండి జ్ఞానిగా జనులచే గుర్తింపబడి సేవింపబడుచున్నను మౌనము నవలంబించి యుండెను. అప్పటివఱకు ఆయనవాక్కు ఎవని విషయమునను ప్రసరింపలేదు.

వీ రిరువురు విరూపాక్షి గుహలో స్వామినిగానక పద్మనాభాశ్రమమునకు పోయిరి. అచ్చట నొక ఱాతిపై బ్రాహ్మణస్వామి కూర్చుండియుండెను. ఆయనను చూడగానే కావ్యకంఠుడు దుర్గా మందిరయోగి చెప్పిన స్థూలశిరస్సు ఇతడే యని గుర్తుంచి ఆయన యందున్న యోజస్సునకు ఆశ్చర్యపడి చేతులు జోడించి నమస్కరించెను. ఆశ్రమ ముఖమున పద్మనాభస్వామి అను జటాధారి వ్యాఘ్రాసనముపై కూర్చుండియుండెను. విశ్వనాథయ్యరు ఆ జటాధారిని గూర్చి కావ్యకంఠునకు ఎంతో ప్రశంసించి చెప్పెను. కాని కావ్యకంఠుడు అతనిని తేజోహీనునిగా గమనించి నమస్కరింపక కూర్చుండెను. ఆ యవినయమునకు జటాధారి కినుక నొందియు గడ్డమును సవరించుకొనుచు, "గణపతిపరమైన "శుక్లాంబరధరమ్" అని మొదలగు శ్లోకమును విష్ణుపరముగా మీరు చెప్పగలరా ?" అని కావ్యకంఠుని ప్రశ్నించెను. ఆయన కోపముతో ఆ శ్లోకమును విష్ణుపరముగా వివరించి బ్రాహ్మణస్వామి పరముగాకూడ వ్యాఖ్యానించెను. బ్రాహ్మణస్వామి చిరునవ్వుతో గణపతిని అభినందించెను. అయినను ఆ స్వామిని ఆశ్రయింపవలెనను తలంపు అప్పుడు ఆయనకు కలుగలేదు. వారు తిరిగి వచ్చిరి.

అప్పటికి బ్రాహ్మణస్వామి వయస్సు సుమారు 22 ఏండ్లు. ఆయనకు కాషాయము దండ కమండలములు లేవు. కాబట్టి ఆయన సన్యాసికాడు. బ్రహ్మచారి యని తలంచుటకు యజ్ఞోపవీతము లేదు. తత్త్వజ్ఞుడు అనాచారముతో నుండునా? లోకహితమునకు అవతరించిన స్థూలశిరస్సు అయినచో దుర్గా మందిరయోగివలె తన్ను పలుకరింపడా? అని పెక్కు సందేహములతో కావ్యకంఠుడు ఆ స్వామి విషయమున అప్పుడు శ్రద్ధ వహింపలేదు. ఆయన తిరిగి వచ్చి హరస్తుతివలన హరుని దర్శనముకాని, సంపూర్ణమైన యనుగ్రహముకాని కలుగలేదని నిర్వేదముతో అ గ్రంథము చింపివేసెను. కల్పట్ రామస్వామి అను శిష్యుడు దీనికొక ప్రతిని వ్రాసికొనియుండెను. కాని ఆయన అకస్మికముగా మరణించెను. ఆ ప్రతి దొరకలేదు.