గణపతిముని చరిత్ర సంగ్రహం/కవితా వైభవము

వికీసోర్స్ నుండి

4. కవితా వైభవము

గణపతిశాస్త్రి అప్పటికి వేదాధ్యయనము కావింపలేదు. ఆ కొఱతను తీర్చుకొనుటకై ఆయన వేద పాఠశాలలోని యొక పండితునియొద్ద ఒక సంవత్సరములో వేదమును అధ్యయన మొనర్చెను. పిమ్మట సాయణాచార్య భాష్యముతో వేదార్థమును గ్రహించి గురువునకే బోధించెను.

"వాసిష్ట వైభవము" నందు పుత్రునకు ఉపనయనము చేసిన తరువాత వేలూరునందే నాయన ఋక్ సంహితను అధ్యయనము గావించి సాయణభాష్యమును పరిశీలించి నట్లున్నది. "వత్సస్య మహాదేవస్య ఉపనయన మహోత్సవాయ గృహంగత్వా, తతో౽రుణాచల మేత్య మహర్షే రాశిషం ప్రాప్య పుత్రకస్య బ్రహ్మణ్యం సంస్కారం నిరవర్తయమ్ ... ఋక్సంహితాం సస్వరాం వేలూరుపుర ఏవ అశిక్షే సావధానం సాయణీయ భాష్యంచ సమాలోకషి||[1]

క్రమక్రమముగా కావ్యకంఠుని కీర్తి ప్రసరించి ఆయనను దర్శించుటకు అనేకులు రాజొచ్చిరి. ఒకనాడు చెన్నపురి హైకోర్టులో గుమస్తాగాఉన్న శాతంజేరి రామస్వామి అయ్యరు వచ్చెను. తన తాతయైన ఉపనిషద్ర్బహ్మమే గణపతిశాస్త్రిగా అవతరించెనని అతనికి తోచెను. వెంటనే అతడు గణపతిశాస్త్రికి పాదాభివందనము గావించి శిష్యుడయ్యెను. అతని ప్రేరణమున కొన్నాళ్ళకు కావ్యకంఠుడు చెన్నపురమునకేగెను. అక్కడ హైకోర్టు వకీలుగా ఉన్న పంచాపకేశశాస్త్రి తనతోకూడ వేదము వేంకటరాయశాస్త్రిని, తందులం సుబ్రహ్మణ్య అయ్యరును గైకొని వచ్చి కావ్యకంఠుని దర్శించెను. ఆయన వేంకటరాయశాస్త్రిగారి సందేహములను తీర్చి ఆశువుగా శ్లోకములను చెప్పి వారి ప్రశంసకు పాత్రుడయ్యెను. రంగయ్య నాయుడు అను తెలుగు పండితుడు ఒక పురాతన వైద్య గ్రంథము తీసికొని వచ్చెను. దాని నొక్క గంటలో పరిశీలించి రంగయ్య సంశయముల కన్నింటికి ఆయన సమాధానములు చెప్పెను. పిమ్మట ఆయన అన్నామలైకి మరలి వచ్చెను.

నరసింహశాస్త్రి నేత్రరోగచికిత్స కొఱకు చెన్నపట్టణమునకు వచ్చి యటనుండి తిరువణ్ణామలైచేరి బ్రాహ్మణస్వామిని దర్శించెను. పాఠశాలలకు సెలవులిచ్చినంతనే గణపతిశాస్త్రి తండ్రిని గైకొని చెన్నపురమునకు వచ్చి ఆయనను కలువఱాయికి పంపి తాను రామస్వామి యింటికి పోయెను. అక్కడ పెక్కుమంది ఆయనను దర్శించుటకు వచ్చుచుండిరి. ఆ యిల్లు చాలక ఆయన బసను దొరస్వామి అను విద్యార్థి ఇంటికి మార్చెను.

ఒకనాడు తోడి విద్యార్థులతోకూడి దొరస్వామి ఆయనతో మాటలాడుచు షేక్స్పియర్ రచించిన "మాక్బెత్" నాటక కథను చెప్పెను. కావ్యకంఠుడు వెంటనే "డంకస్ నామమహీపతిస్సమ భవత్" అని ఆరంభించి ఆ కథను కావ్యముగా అనర్గళముగా చెప్పెను. పిమ్మట ఒక విద్యార్థి ఆంగ్ల వార్తాపత్రికలోని కొన్ని పంక్తులను చదివి వినిపించగా కావ్యకంఠుడు ఆ పంక్తుల నన్నింటిని మరల చదువుటయేకాక తుదినుండి మొదటికి కూడ చదివి వారిని ఆశ్చర్యపరవశుల గావించెను. దొరస్వామి భక్తి పారవశ్యమున లేచి ఆయనకు పాదాభివందనము గావించెను. అప్పుడు ఆయన అతనిని పూర్వజన్మ కింకరుడైన సుధన్వునిగా గుర్తించెను.

విద్యార్థులు, పౌరులు కావ్యకంఠుని సమ్మానించుటకు పూనుకొనిరి. ఆ సమయమునకు "బాలసరస్వతి", "భట్టశ్రీ" బిరుదములు గల సుదర్శనుడు అను సుప్రసిద్ధ పండితుడు అచ్చటికి వచ్చెను. ఆయనకుకూడ సమ్మానము కావింప వలయునని కొందఱు పట్టుపట్టిరి. సమ్మానసభవారు ఒక బంగారు తోడాను చేయించి ఇరువురిలో వాదమున జయించినవానికి దానిని బహూకరింప నిశ్చయించిరి. ఈ లోపల తిరువళిక్కేణి పాఠశాలలో ఏర్పాటు చేయబడిన సభలో కావ్యకంఠుడు వేదము వేంకటరాయశాస్త్రి మొదలగువారు ఇచ్చిన యేబది సమస్యలను వెంట వెంటనే పూరించి సమ్మానింపబడెను.

భట్టశ్రీ కావ్యకంఠుల వివాదసభ కృష్ణస్వామి అయ్యరు అధ్యక్షతయందు మైలాపూరులో జరిగెను. అందు కావ్యకంఠుడు విజేతయై "తోడా" ను పొందెను. మఱియొక సభయందు భట్టశ్రీ అధ్యక్షుడుగా నుండి కావ్యకంఠుని అవమానించుటకు కుతంత్రమును పన్నెను. కావ్యకంఠుడు భట్టశ్రీయొక్క దౌర్జన్యమును, మోసమును పాండిత్య హీనతను నిరూపించి మహాజనుల యభినందనములకు పాత్రుడయ్యెను.

  1. *16. ప్రకరణం - 166