గణపతిముని చరిత్ర సంగ్రహం/కావ్యకంఠ బిరుద సత్కారము

వికీసోర్స్ నుండి

2. కావ్యకంఠ బిరుద సత్కారము

గణపతికి తపస్సు చేయవలయునను కాంక్ష తీవ్రమయ్యెను. శ్రావణ మాసము నోములకు భార్యను పుట్టింటివారు తీసికొని పోవుట మంచి యవకాశముగా భావించి గణపతి యొకనాడు రహస్యముగా వేంకటశాస్త్రియను మిత్రునితో అన్నయైన భీమశాస్త్రితో బయలుదేరి 1896 వ సంవత్సరము ఆగష్టు నెలాఖరుకు రాజమహేంద్రవరమును చేరెను. భీమశాస్త్రి జంకుతో ఇంటికి తిరిగి వచ్చెను. గణపతి వేంకట శాస్త్రితో కోనసీమలో పేరమ్మ యగ్రహారమున కౌశికి నది యొడ్డున తపస్సునకు ఉపక్రమించెను. సుమారు రెండు మాసములు దీక్షతో శివ పంచాక్షరి, మహాగణపతి మంత్రములను జపించినను అతనికి ఫలితము కన్పించలేదు. కొన్ని దినములకు వేంకటశాస్త్రి కూడ వెడలిపోయెను. గణపతి కాశికి పోదలచి నంది గ్రామమునకు చేరి అచ్చట జ్యోతిష ప్రజ్ఞ చేత ధర్మశాలాధికారియైన కృష్ణమ్మనాయుని యభిమానమునకు పాత్రుడయ్యెను. అతడు నరసింహశాస్త్రిని పిలిపించి తండ్రి కొడుకుల నిద్దఱను సత్కరించి, ఏబది రూప్యములను వార్షికముగా నిచ్చుచు యాత్రలకు తోడ్పడుదునని అప్పటికి వారిని వెనుకకు పంపెను.

కలువఱాయిలో ఒక నాడు గణపతి ధ్యాన నిమగ్నుడై యుండగా పెద్ద గడ్డముగల యొక పురుషుడు తెల్లనివాడు గోచరించి 'నేను నీకు తపస్సఖుడను, భద్రకుడను; నీవు గణకుడవు' అని ప్రబోదించెను. ఈ విషయమును గణపతి తండ్రికి చెప్పెను. ఆయన తపస్సునకు అనుమతిని ఇచ్చుచు, ఆ సమయమున విశాలాక్షి పుట్టింటిలో నుండవలెనని, తాను కోరినంతనే గణపతి తపస్సును వీడి రావలయునని, రెండు నిబంధనములను ఏర్పఱచెను. గణపతి అందులకు అంగీకరించి తన యిరువదియవ జన్మదినమునకు మఱునాడు 18-11-1897 వ తేది తండ్రి యాశీస్సులతో ప్రయాగకు పోయెను.

ప్రయాగలో శంఖ మాధవాలయమున హంసతీర్థము నందు గణపతి కొన్ని దినములు తపస్సుచేసి పుష్య మాసములో సూర్య గ్రహణమునకు కాశికి బయలు దేరెను. కాశిలో తండ్రికి మేనమామయైన ఆర్య సోమయాజుల భవానీ శంకరము యొక్క ఇంటియందు కాలము గడుపుచు గణపతి దర్భాంగ సంస్థానమున పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడైన శివకుమార పండితుని దర్శించి, ఆయనను కవితా వైభవముచేత పాండిత్య ప్రకర్షచేత ముగ్ధుని గావించెను. ఆయన గణపతిని నవద్వీపమున జరుగు విద్వత్పరీక్షకు పొమ్మని ప్రోత్సహించుచు అచ్చటి కార్య నిర్వాహకవర్గ కార్యదర్శికి పరిచయ పత్రము నొసంగెను.

పిదప ఒకనాడు గణపతికి సోమయాజుల సూర్యనారాయణ అను యోగి కన్పించి, 'భద్రకాదులము మనము పదునార్గురము లోక కార్యము కొఱకు జన్మించితిమి. ఒక్కొక్కరము ఒక్కొక్క కార్యము నందు ప్రీతితో నున్నాము. నేను సుకేతుడను. నీవు గణకుడవు. నీకు విహితమైన కార్యమును స్థూల శిరస్సు తెలుపగలడు' అని వెడలిపోయెను. రాత్రి కలయందు ఒక బ్రాహ్మణుడు కన్పించి నాసికయందు తపస్సు చేయుమని గణపతిని ప్రబోధించెను. గణపతి నాసికనుండి త్ర్యంబకము మీదుగా కుశావర్తమునకు చేరి పదునాల్గు దినములు నీలాంబికాలయమునందు తపస్సు చేసెను. అచ్చట రామబాపు అనువానితో పరిచయ మేర్పడి, వాని ప్రేరణమున గణపతి మొదటి సారిగా అష్టావధాన మొనర్చెను. పిమ్మట అతనితో నాసికకు తిరిగివచ్చి గణపతి అచ్చట తపస్సునకు యోగ్యమైన స్థలమును వెదకుటకు ఒంటరిగా బయలుదేరెను. అట్లు వెదకుచు గణపతి లక్ష్మణాలయమున ప్రవేశించెను. అప్పుడది నిర్జనమై యుండెను. ద్వారము దాటినంతనే కోవెల పూజారి గణపతిని దొంగ యనుకొని జుట్టు పట్టుకొని గ్రామాధికారి యొద్దకు ఈడ్చుకొని పోజొచ్చెను. అంతకు పూర్వము పండిత గోష్టిలో గణపతిని చూచియున్న యొక వ్యక్తి ఎదురై పూజారిని మందలించి అతనిని విడిపించెను. పూజారి తన తప్పును ఒప్పుకొన లేదు. గణపతి క్రుద్ధుడై నాసిక ధ్వంస మగునట్లు శపించెను. పిదప శాంతించి అతడు ఆ పరిసరముననే 'నవచూతి' అను స్థలమున డెబ్బది దినములు ఘోర తపస్సును చేసెను. ఒక దిగంబరుడు తెల్లనివాడు కలలో కన్పించి ఆంధ్ర భాషలో ఇంటికి పొమ్మనెను. శాపము వలన పూజారి కుటుంబము మొదలుగా నాసిక నగరము మారీ జ్వరముతో తుఫానుతో ధ్వంస మయ్యెను.

గణపతి కలువఱాయికి తిరిగివచ్చి కొన్ని నెల లుండెను. విశాలాక్షి గర్భవతి యయ్యెను. గణపతి మరల బయలుదేరి భువనేశ్వర క్షేత్రమున కేగి తొమ్మిది దినములు తపస్సు చేసెను. తుది దినమున రాత్రి గణపతికి భువనేశ్వరి సాక్షాత్కరించి బంగారు గిన్నెతో తేనెను త్రావించెను. అప్పుడతడు వెన్నెలలో ఒక ఱాతిపై కూర్చుండి యుండెను. పెదవి తడుముకొనగా అతనికి తేనె పెదవుల నంటుకొని యుండెను. అందువలన అది కల కాదు. ఆనాటి నుండి అతని బుద్ధి యందు సూక్ష్మత్వము, కవిత్వము నందు మాధుర్యము అతిశయించెను. నాల్గు మాసములు అక్కడనే అతడు తపస్సును కొనసాగించెను.

14 - 2 - 1899 తేది విశాలక్షమ్మ పుత్రుని గనెనని యుత్తరము వచ్చినంతనే బయలుదేరి గణపతి విరజాపుర మందు కొంత కాలము తపస్సు చేసి కలువఱాయి చేరెను. కుటుంబ పోషణకు ఉద్యోగ ప్రయత్నము చేయుచు గణపతి పర్యటించుచు కేశినకొఱ్ఱు అగ్రహారమున ఒక పండితుని యొద్ద రెండు మాసములలో తర్క వేదాంత శాస్త్రములను పఠించెను. తరువాత నతడు కలువఱాయికి వచ్చి మూడు నాలుగు మాసములలో వ్యాకరణ మహాభాష్యమును నీతి శాస్త్రాది గ్రంథములను పఠించెను.

1900 వ సంవత్సరమున ఉగాదికి గణపతి మందసా సంస్థానాధిపతిని దర్శించి అష్టావధానము గావించెను. అచ్చట రాజ గురువును వాదమున జయించి రాజకుమారునకు శివపంచాక్షరి నుపదేశించి కొన్ని నెల లుండెను. ఇంతలో నవద్వీప మందు విద్వత్పరీక్షలు జరుగబోవుచున్నవను వార్త వచ్చెను. రాజు ప్రోత్సహింపగా గణపతి నవద్వీపమునకు చేరెను. అచ్చట నతడు శివకుమార పండితుడు ఇచ్చిన పరిచయ లేఖ వలన కార్యదర్శి యైన శితికంఠ వాచస్పతి యొక్క ఆదరమునకు పాత్రుడై అతని యింటనే బస చేసెను. పాండిత్యమున ఆశు కవిత్వము నందు ఉత్తర దేశమున అద్వితీయుడుగా ప్రసిద్దుడైన అంబికాదత్తుడు అ సంవత్సరము పరీక్షలకు అధ్యక్షుడుగా నుండెను. సభలో ప్రవేశించుచు గణపతి అధ్యక్షుని చూచి చాపలముతో 'ఈయన ఎవరు' అని వాచస్పతిని పెద్దగా అడిగెను. అధ్యక్షుడు ఆ మాట విని చిరునవ్వుతో 'శ్లో|| సత్వర కవితాసవితా, గౌడోహం కశ్చిదంబికా దత్త:|' (సత్వరముగా కవిత్వమును చెప్పగల గౌడుడను అంబికాదత్తుడను) అని శ్లోకమున సగము చెప్పెను. వెంటనే 'గణపతి రితి కవి కులపతి, రతిదక్షో దాక్షిణాత్యోహమ్||' (నేను గణపతి అను కవి కులపతిని, అతి దక్షుడను, దాక్షిణాత్యుడను) అని గణపతి శ్లోకమున ఉత్తరార్ధమును పూరించెను. అంతటితో నూరకుండక గణపతి 'భవాన్‌దత్త: అహం త్మౌరస:' (మీరు అంబికకు దత్త పుత్రులు; నేను ఔరసుడను) అనెను. ఎల్లరును బాల పండితుని సాహసమునకు నివ్వెఱపడిరి. అంబికాదత్తుడు గణపతిని వేదికపైకి ఆహ్వానించి పరంపరగా నాలుగు సమస్యల నిచ్చెను. అడిగినదే తడవుగా అన్నింటిని గణపతి అద్భుతముగా పూరించెను. తరువాత వారి కిరువురకు స్పర్థతో వివాదము విజృంభించెను. తుదకు కవిత్వ పటుత్వమునకు నిరర్గళధారకు అంబికాదత్తుడు సంతోషించి గణపతిని కౌగిలించుకొని యభినందించెను. పిదప పరీక్షకుల యభిమతము ననుసరించి గణపతి పదునెనిమిది శ్లోకములలో భారత కథను సరసముగా ఆశువుగా చెప్పెను. అధ్యక్షు డంతటితో పరీక్షను నిలిపి గణపతికి "కావ్యకంఠ" బిరుదము నొసంగవలయునని ప్రకటించెను. అట్లే ఆ విద్వత్పరిషత్తువారు 20 - 6 - 1900 తేది కావ్యకంఠోపహార ప్రశంసా పత్రము నొసంగి గణపతిని మిగుల సమ్మానించిరి.