గణపతిముని చరిత్ర సంగ్రహం/అవతరణము

వికీసోర్స్ నుండి

"ఓం నమో భగవతే శ్రీ రమణాయ"

"ఇంద్రో విశ్వస్య రాజతి"

1. అవతరణము

స్వధర్మము కొఱకు స్వరాజ్యము కావలెనని 1857 లో భారతీయులు బ్రిటిషు ప్రభుత్వముపై తిరుగుబాటు చేసిరి. అది విఫల మయ్యెను. తిరుగుబాటు దారులను శిక్షించు నెపముతో బ్రిటిషువారు ప్రజలను పెక్కు విధముల హింసింప జొచ్చిరి. స్వరాజ్యము నెట్లయినను సంపాదించవలెనని అప్పుడు ఆసేతు హిమాచలముగా అనేకులు భావించు చుండిరి. ఆ గాఢ భావమునకు ఫలముగా వారి సంతతిగా దేశమందంతటను ఎందరో మహానుభావులు రాజకీయ ధార్మిక విద్యా రంగములలో ఉదయించి భారత దేశము నుద్ధరింప యత్నించిరి. అట్టి ధార్మిక వీరులలో ఎన్నదగినవాడు శ్రీ కావ్యకంఠ గణపతి ముని.

విశాఖపట్టణ మండలమున బొబ్బిలికి ఆరు మైళ్ళలో కలువఱాయి అను గ్రామము కలదు. ఇందు "నవాబు అయ్యల సోమయాజుల" అను నింటి పేరుగల బ్రాహ్మణ కుటుంబము ఆ ప్రాంతమున ప్రఖ్యాతమై యుండెను. వీరు ఋగ్వేదులు; కౌండిన్యస గోత్రులు. సంస్కృతమున జానకీ పరిణయ మను నాటకము రచించిన రామభద్ర దీక్షితుడు ఈ వంశములోని వాడే. ఈ వంశమున జగన్నాథ శాస్త్రికి మామగారి వలన కలువఱాయి గ్రామాధిపత్యము సంక్రమించెను. జగన్నాథ శాస్త్రి కుమారుడు భీమశాస్త్రి. భీమశాస్త్రికి నరసింహ శాస్త్రి, సర్వేశ్వర శాస్త్రి యను పుత్రులు కలిగిరి.

నరసింహశాస్త్రి కుటుంబమునకు, గ్రామమునకు ఆధిపత్యమును వహించుచు ఆయుర్వేద జ్యోతిష మంత్ర శాస్త్రము లందు విశారదుడై చుట్టు ప్రక్కల గ్రామములలో వ్యవహారవేత్తగా ప్రసిద్ధుడయ్యెను. శ్రీవిద్యా దీక్షను పొందిన వీరి వంశస్థులలో ఈయన యైదవ పురుషుడు. ఈయనకు డుంఠి గణపతి, భార్యయగు నరసమాంబకు సూర్యుడు ఇష్ట దేవతలు.

విప్లవము నాటికి నరసింహశాస్త్రి కుఱ్ఱవాడు. ఆ సమయమున ఈయన దేశ సంచారము చేయుచుండెను. విప్లవము నణంచు నెపముతో తెల్లవారు కావించుచుండిన ఘోరకృత్యములను దారి పొడవున చూచుచు ఈయన చాల ఖేదమును పొందెను. నాటినుండి దేశ స్వాతంత్ర్యము కొఱకు ప్రజల యభ్యుదయము కొఱకు ఈయన ఉపాయములను ఆలోచింప జొచ్చెను. వేద దర్మము నుండి ప్రజలు జారుచుండుటయే వారి దౌర్బల్యమునకు దేశ దుర్గతికి హేతు వయ్యెనని ఆయన తలంచుచుండెను. కాని సనాతనమైన ధర్మమును నెలకొల్పుటకు తనకు శక్తి చాలదని అట్టి సామర్థ్యముగల పుత్రుని అనుగ్రహింపుమని ఆయన ఇష్టదైవమైన గణపతిని ప్రార్థించు చుండెను. నరసమాంబ కూడ భర్త ననుసరించి మంత్ర జప స్తోత్రములను ఆరాధనలను చేయ జొచ్చెను. అప్పటికే వారికి భీమశాస్త్రి కలిగి యుండెను. వానికి రెండేండ్ల వయస్సులో పెద్ద జబ్బు చేసెను. పిల్లవాడు జీవించినచో అరసవల్లి క్షేత్రమున పుట్టుజుట్టు నిత్తునని తల్లి మ్రొక్కు కొనెను. బాలుడు బ్రతికెను. వానికి మూడవ యేట మ్రొక్కు తీర్చుటకు ఈశ్వర సంవత్సర రథ సప్తమినాడు (9-2-1878) తల్లిదండ్రులు బాలుని గైకొని అరసవల్లి కేగిరి. ఇది ప్రసిద్ధమైన సూర్య క్షేత్రము. మ్రొక్కు తీర్చిన తరువాత నరసమాంబ "తండ్రి నీ కృపను ఇంతటితో ఆపకుము; దేశోద్ధారకుడైన పుత్రుని ప్రసాదింపు" మని సూర్య భగవానుని ప్రార్థించెను.

"వాసిష్ఠ వైభవమ్" లో నాలుగేండ్ల వయస్సుగల పుత్రునితో నరసమాంబ యొక్కతయే అరసవల్లికి పోయినట్లు చెప్పబడియున్నది.*[1]

పగలంతయు ఉపవాసము చేసి ఆ దంపతులు మంత్ర ధ్యానముతో గడపి రాత్రికి విశ్రమించిరి. నరసమాంబకు కలలో సూర్యాలయ ప్రాకారము యొక్క వెనుక భాగము నుండి యొక బంగారు వర్ణముగల స్త్రీ అగ్నిపూర్ణమగు బంగారు కలశమును గైకొని వచ్చి నవ్వుచు ఇచ్చి అంతర్ధానమైనట్లు కన్పించెను. అది విని నరసింహశాస్త్రి సంతోషముతో "ఆ కాంచనాంగి సూర్య శక్తియగు హిరణ్మయి. ఆమె అగ్నిని ధరించును. ఆమె దానిని నీ చేతి యందుంచుట వలన నీకు అగ్ని యంశముతో పుత్రుడు కలుగునని తోచుచున్నది" అని ఆమెను అభినందించెను. అట్లే ఆమె అక్కడి నుండి వచ్చిన తరువాత గర్భవతి అయ్యెను. ఏడవ మాసము రాగానే ఆమెను పుట్టింటికి పంపి నరసింహశాస్త్రి ఇష్ట దేవతానుగ్రహమును సంపాదించుటకు కాశికి పోయెను. అక్కడ ఆయన కార్తీక మాసారంభము నుండి డుంఠి గణపతి ఆలయములో పగలు ఉపవసించుచు రాత్రి పాలు త్రావుచు జపముచేయ జొచ్చెను. ఒకనాడు మధ్యాహ్నమున రెండు గంటలకు ఒక శిశువు గణపతి విగ్రహము నుండి వచ్చి అభిముఖముగా అంతర్ధానమైనట్లు ఆయనకు గోచరించెను. ఆ దేవుని యనుగ్రహమున తనకు పుత్రుడు కలిగి యుండునని తలంచి సంతోషించుచు ఆయన అత్తవారింటికి వచ్చెను. తన యొద్దకు దివ్యశిశువు వచ్చిన సమయముననే బహుధాన్య కార్తీక బహుళాష్టమి యందు భానువాసరమున 17 - 11- 1878 మఖా నక్షత్ర ప్రథమ పాదమున పుత్రుడు కలిగెనని చెప్పిరి. పుట్టిన బిడ్డచుట్టు దివ్యమైన తేజస్సు తనకు గోచరించెనని నరసమాంబ చెప్పెను. అందరును సంతోషించిరి. తమ యిష్ట దేవతల నామములతో దంపతులు పుత్రునకు సూర్య గణపతి శాస్త్రి అని నామకరణ మొనరించిరి.

దైవాంశసంభూతు డయ్యును బాలుడు దివ్య లీలలను ప్రదర్శింపక పోగా రోగగ్రస్తు డగుట బంధువుల పరిహాసమునకు తల్లిదండ్రుల పరితాపమునకు కారణ మయ్యెను. ఆరేండ్లు వచ్చినను బాలునకు మాటలు రాలేదు. ఎన్నో చికిత్సలను చేసి విసిగి తుదకు నరసింహశాస్త్రి వానికి కాల్చిన లోహమును నాడీ బంధము నందు తాకించెను. అడ్డు తొలగించి నంతనే ఉబికివచ్చు ప్రవాహము వలె బాలునకు మాటలు పుష్కలముగా వచ్చెను. అది ఆశ్చర్యకరమై అందరును బాలుడు దైవాంశ సంభూతుడని నమ్మిరి. పిల్లవాడు ఏకసంథాగ్రాహియై పినతండ్రియైన ప్రకాశశాస్త్రియొద్ద కొలది దినములకే బాల రామాయణమును, శివ సహస్రమును కంఠస్థము గావించెను. గణపతి పది యేండ్ల ప్రాయమునకే కావ్యములను పఠించుచు గణిత శాస్త్ర గ్రంథములను కైవసము చేసికొని పంచాంగ గణనమున శుద్ధి ప్రకరణము అనునొక పథకమును రచించి గురువునకు గురు వయ్యెను. సిద్ధ జ్యోతిష్కుడని బాలుని కీర్తి ప్రసరించెను. అప్పుడే ఇతడు ఒక్క గంటలో ముప్పదినాలుగు శ్లోకములతో "పాండవ ధార్తరాష్ట్ర సంభవ" మను ఖండ కావ్యమును రచించెను.

గణపతి తరువాత నరసమాంబకు అన్నపూర్ణ, శివరామ శాస్త్రి కలిగిరి. తరువాత మూడేండ్లకు నరసమాంబ గర్భవతియై ప్రసవించుటకు ముందు 'నాయనా ! ఇప్పుడు పురుడు వచ్చిన వారికి ఎట్లుండును?' అని గణపతి నడిగెను. 'అమ్మా ! ఇప్పుడు పురుడు వచ్చిన వారు మరణింతురు' అని గణపతి నుండి వాక్కు బాణము వలె వెలువడెను. అట్లే ఆమె కవల పిల్లలను ప్రసవించి వారితో స్వర్గస్థురాలయ్యెను. బాలుని వాక్కు అమోఘమై ఆమె మృతికి కారణ మయ్యెనని లోకులు ఘోషించిరి. అది విని గుండె జల్లుమన గణపతి మౌనముద్ర నవలంబించి జడునివలె అయి మరల అందఱకు ఆందోళనము కలిగించెను. రెండు నెలలు అట్లుండి పిదప యథాప్రకారముగా అతడు మేధా విజృంభణముతో కావ్య పాఠములను కొనసాగించెను. బంధువుల యొత్తిడి వలన నరసింహశాస్త్రి గణపతికి పండ్రెండవ యేటనే ఎనిమిదేండ్లు నిండని విశాలాక్షి నిచ్చి వివాహ మొనర్చెను. గణపతి భార్య నుద్దేశించి 'మేఘ దూతము' ననుకరించుచు 'భృంగదూత' మును రచించెను. కాని కాళిదాసుని కవిత్వమునకు అది చాల తక్కుగా నున్నదని దానిని చించివేసెను.

పదునెనిమిదవ యేడు వచ్చునప్పటికి గణపతి వ్యాకరణాలంకార శాస్త్రములను సాధించుచు రామాయాణ భారతాది పురాణేతిహాసము లందు పారగు డయ్యెను. పురాణ పఠనము వలన గణపతి తానుకూడ ఋషులవలె తపస్సు చేసి శక్తులను పొంది లోకము నుద్దరింప వలయునని తలంచు చుండెను. తండ్రి వలన పదమూడవ యేటనే అతడు పంచాక్షరి మొదలుగా పండ్రెండు మహామంత్రములను పొందెను. అప్పటి నుండి తపస్సు చేయుటకు తగిన దేశ కాలమును గూర్చి ఆలోచింప జొచ్చెను. కోడలిని కాపురమునకు తెచ్చుటకు తల్లిదండ్రులు యత్నించు చుండగా అతడు ఒక నిబంధనముపై అందులకు అంగీకరించెను. ఆరు మాసములు తాను ఇంటియొద్ద నుండుటకు ఆరు మాసములు తపోయాత్రకు పోవుటకు తన భార్య అంగీకరింపవలయునని అతడు చెప్పెను. విశాలాక్షియు తనకు ఒక రిద్దరు పుత్రులు కలిగిన తరువాత తాను కూడ తపస్సు చేయుటకు భర్త అంగీకరింప వలయునని తెలిపెను. ఇద్దరు సరి వుజ్జీలుగా నున్నారని అందరు సంతోషించిరి. అత్తవారింటికి వచ్చి ఆమె భర్తవద్ద మహాగణపతి మంత్రమును శ్రీవిద్యాదీక్షను గైకొనెను.

  1. * (ప్రథమ ప్రకరణము - ప్రాదుర్భావము)