గణపతిముని చరిత్ర సంగ్రహం/శ్యామ్ శ్రీచరణ్ బాబాగారి "శ్రీముఖము"

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

శ్యామ్ శ్రీచరణ్ బాబాగారి

"శ్రీముఖము"

ఓం నమో భగవతే, శ్రీ రమణేశ్వరాయ, అరుణాచలేశ్వరాయ, ఆధిమధ్యాంత రహితాయ, అప్రమేయాయ, ఆనందదాతాయ నమోన్నమ:

అభ్యర్థన:- ఈ జీవిబుద్ది పరిమితము. వ్రాశేది అపరిమితమును గురించి. ఇది సబబుకాదని తెలుసు. ఆశ యనెడి పాశము ఊరకే నుండనివ్వక తెలిసీ తెలియని ఆలోచనలను రేకెత్తించి ఏవేవో అక్షరవాక్య విన్యాసాలను చేయిస్తున్నది. పరమాత్మ సృష్టిలోని జీవి మాటలు, చేతలు, వ్రాతలు వచ్చీరాని మాటలవలె, నడకలవలె తడబడుతూ వుంటాయి. అవి కొన్ని జీవులకు, సంతృప్తిని, మరికొన్నింటికి అసంతృప్తిని, మిగిలిన వానికి ఉదాసీనత, నిరుత్సాహము....... వగైరాలను కలిగించుట ప్రకృతి సహజము. తుమ్ము, దగ్గు, వమనములను ఆపుకోవడానికి ప్రయత్నించడము ఆరోగ్యానికి క్షేమకరం కాదని పెద్దలంటారు. అలాగే సక్రమమని అన్పించిన దానిని అక్షర రూపంలో నిర్భయంగా పెట్టలేక పోవడం కూడా భవరోగానికి మంచిదికాదు. ఎందుకు? తద్వారా త్రికరణ శుద్ది లోపించడమే కాక "నేను" బలమై బుద్ధిశక్తి నిర్వీర్యమై, అకాశవాదము నుండి దిగజారి అశాశ్వతమగు అవకాశవాదమునకు మూలమౌతుంది.

పిచ్చివారి వెఱ్ఱి వ్రాతలు తలరాతలను మార్చగలవోలేవో కాని, మనోరాతలను మాత్రం కదిలించక మానవు. అదే పిచ్చివాని వెఱ్ఱి వ్రాతలలోని గమ్మత్తయిన మనస్సుకు హత్తుకునే మహత్తు. వద్దని వదిలించుకున్నా, విదిలించుకున్నా వదలక చుట్టుకునేదే ప్రారబ్ధము. అది మంచో, చెడో నిర్ణయించుకునేది ఆలోచనలకు బంధుడై బద్ధుడైన జీవుడు, తన ప్రారబ్ధాదానికింకెవరో కారకులనడం అమాయకత్వం. తన భావనలే, ఆచరణలే, తనను నడిపిస్తున్నాయని, అలాగే యితరుల విషయంలోనని కూడా తెలుసుకోగలిగితే - ఇక వాదనలకు, వివాదములకు, వింత వింత పోకడలకు, విమర్శలకు, తావుండక - వివేకానికి దారి తీస్తుంది. ఇదే భావన ఆలంబనమై ఈ క్రింది వాక్యాలు ఎలా స్పందింప జేస్తాయో........................................(?)

పూజ్యపాద ప్రేమ స్వరూపులగు తల్లిదండ్రులకు (రచయిత, ప్రోత్సాహక దంపతులకు) - ఈ బిడ్డకు మధ్య పరమాత్మ వేసిన బంధము - ఋణానుబంధము మాత్రంకాదు. ఆత్మానుబంధము యొక్క ప్రతిస్పందనే కదలని కలాన్ని కదిలించింది. వీటన్నిటి వెనుక అదృశ్యంగా వుండి నడిపిస్తున్న శక్తి ఏదో వుందని అనిపిస్తుంది, కానీ తెలియదు. చూడలేదు. కనుక వుందని నిర్భయంగా చెప్పలేను. అందుకే జన్మకారకులు, జన్మచరితార్థకారకులు నగు తల్లిదండ్రుల పావన పదపద్మములకు కృతజ్ఞతతో, ప్రేమతో శిరసా నమస్కరిస్తున్నాను. నాకు మాతృభాషయే సరిగ్గారాదు. వ్యాకరణం రాదు. వ్యావహారికం రాదు. గ్రామ్యము, దేశ్యములసలేరావు. మరి నాకొచ్చిన దేమిటంటే అన్నీ కలియబోసిన భాష. దానికి మీరేమి పేరు పెట్టుకున్నా నాకంగీకారమే. అందువలన భాషకు, భావములకు వీడే బాద్యుడు.

క్లుప్తంగా రెండు వాక్యాలు. ఈ శ్రీముఖంలోని భావాలు కేవలం ఈ జీవి పరిమిత బుద్దివే. నృశంసనములు మాత్రం స్వీకరించడానికి సంసిద్దత వ్యక్తపరుస్తూ వీలైనంతమంది తమ నృశంసనములను పంపించవలసినదిగా ప్రార్థిస్తూ ఇక మొదలిడతాను.

నయనానందకర నాయనాయనమ:

శ్లో|| గురు మన్త్రో ముఖేయస్య తస్య సిద్ద్యన్తి నాన్యథా |
    దీక్షయా సర్వకార్యాణి సిద్ద్యన్తి గురుపుత్రకే || -శ్రీగురుగీత.

శ్లో|| నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం
    విశ్వాతీతం గగన సదృశం తత్త్వమస్యాది లక్ష్యమ్ |
    ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షి భూతమ్
    భావాతీతం త్రిగుణ రహితం సద్గురుం తన్నమామి ||

శ్లో|| వటవిటపి సమీపే భూమిభాగే నిషణ్ణం
    సకలమునిజనానాం జ్ఞానదాతారమారాత్ |
    త్రిభువనగురుమీశం దక్షిణామూర్తి దేవం
    జననమరణ దు:ఖచ్ఛేద దక్షం నమామి ||

శ్లో|| చిత్రం వటతరోర్ములే వృద్ధాశిష్యా గురుర్యువా
    గురుస్తోమౌనం వ్యాఖ్యానం శిష్యాస్తుఛిన్న సంశయా: ||

శ్లో|| మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్త్వం యువానం |
    వర్షిష్ఠాన్తేవసదృషి గణైరావృతం బ్రహ్మనిష్ఠై: |
    ఆచార్యేన్ద్రం కరకలిత చిన్ముద్ర మానన్దమూర్తిం |
    స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే ||

శ్లో|| బీజస్యాన్తరివాంకురో జగదిదం ప్రాజ్ఞ్నిర్వికల్పం పున:
    మాయా కల్పిత దేశకాలకలనా వైచిత్ర్య చిత్రీకృతమ్ |
    మాయావీవ విజృంభయ త్యపి మహా, యోగీవయస్వేచ్చయా
    తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే ||

శ్లో|| బాల్యాదిష్యపి జాగ్రదాదిఘ తథా సర్వాస్యవస్థాన్వపి
    వ్యావృత్తాస్వసు వర్తమాన మహ మిత్యన్త: స్పురన్తస్సదా |
    స్వాత్మానం ప్రకటికరోతి భజతాం యోభద్రయాముద్రయా
    తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ||

పై శ్లోకాలలో స్థూలముగా గోచరించే అర్థానికైననూ, అంతర్లీనమై నిండి నిబిడీకృతమైయున్న అంతరార్థమునకైననూ, శ్రీగురు శిష్య సంబంధము, శ్రీగురుడే పరబ్రహ్మమనెడి నియమబంధము, అర్హత, యోగ్యతలు గల్గిన శిష్యులకెలా శ్రీగురు పరబ్రహ్మ కృప లభ్యమగునో యనెడి మధురానుబంధములు. అంతరాంతరాళములను తట్టి తమస్సునుండి లేపి తపస్సునకు వెళ్లమని ప్రేరేపించ గలవు. పారమార్ధికమున తపన, తపన అధికమైన అదియే తపస్సుగా మారి తమస్సును తొలగిస్తుంది.

భగవాన్, నాయనల బంధము, అటువంటిది. నయనములు అందరికీ వుండవచ్చును. కానీ చూడకలిగే శక్తి కొందరికే వుంటుంది. అదియునూ వారివారి సంస్కారములను, ఆలోచనలను బట్టి, చూచిన దానిని గురించి ఏదోఒక భావన కలుగుతుంది. అలాగే సత్యాన్వేషణతో పరితపించే హృదికల్గిన నయనములతో, నాయన చరిత్రను పారాయణమొనరిస్తే నయనానందకరముగా బాష్పానందములు భగవాన్ నాయనల పదపంకజములపై కృతజ్ఞతతో అమృత జలపాతముగా వర్షించగలవు. ఆ అదృష్టశాలురేక్కడో ఒకరిద్దరుండ వచ్చునేమో ! చదవడం మనస్సుతో చేసే ప్రక్రియ. పారాయణం బుద్ధితో జరిగేక్రియ. పారాయణం పరాయణత్వాన్నిస్తే చదువు ఆలోచనలను రేకెత్తించి, అహాన్ని పెంచగలిగే ప్రమాదం కూడా కలదు. చదువు భౌతికము, అహమునకు నాంది. విద్య పారమార్థికము వివేకమునకు నాంది. "విద్యయొసగును వినయంబు" విద్య, చదువులతో మొదలైన నాయన జీవితము చదువు నశించి, విద్యతో అంతమైనది. కావుననే నాయన 'నాయన'గనే అందరినోట తెలిసియో తెలియకయో పిలువబడుచున్నాడు. నాయనలోని విశిష్ఠత, విశ్లేషణలకు అందనిది, విచక్షణకు చిక్కనిది, విచారణకు దొరకనిది.

దాదాపు 14 (పదునాలుగు) సం||లు అరుణగిరిమీద మొలకు గోచితో, చేతిలో కర్రతో, అటునిటు తిరుగుచూ, చూచుచూ, చూడకుండా, ఆయనను చూడటానికి, దర్శించడానికి వచ్చిన వారిచేత బ్రాహ్మణస్వామిగా, మౌనస్వామిగా పిలువబడుచూ వచ్చిన జంగమ మగు అనంతశక్తి, చివరకు అ జంగమమునకు భౌతికముగా కారకురాలైన తల్లివచ్చి మూడు దినములు రోదించి, విలపించినా, పెదవికదపక, మౌనముగా నుండిన తేజోమూర్తిని, పెదవిని కదిలించి, కంఠమును స్వరపరచినది నాయన. అ క్షణమునుండే ఆయనను దర్శించే వారందరి పంటలు పండినవి. వీనులకు విందులు, కనులకు పసందులు. జిహ్వకు రుచులు, ఆత్మకు అభిరుచులు ఆటలు, పాటలు - ఇలా ఎన్నో, యింకెన్నెన్నో మానవులకు అందని మధురానుభూతిని అనుగ్రహించినది. - మన నాయన నడచి వచ్చి నయనానందకరముగా ఆ మౌనస్వామిని మౌనమునుండి విడిపించి "నాయనా' అని పిలిపించుకొని మనలను తరింపజేసినది - ఆ క్షణమునుండే.

అంతవరకు అంతుదొరకని, అర్థంకాని, అదేదో తెలియని మౌనం - అంటే నిశ్శబ్దంలో వుండిన దొక ఆకారము. దానికే భగవాన్ రమణ మహర్షి అని తర్వాత నామకరణము జరిగింది.

ఇక నాయనో! ఒకటే శబ్దజాలమయం. చిన్ననాడే నవద్వీపములో కావ్యకంఠ బిరుదు. మహారాజుల వద్ద సన్మాన, సత్కార, గౌరవాదులు, అనేక మంత్ర, యంత్ర తంత్ర శాస్త్రములలో సరిలేని జోడు. పట్టుదలకు మారుపేరు. వ్యక్తులను, వక్తలను, ప్రత్యర్థులను సశాస్త్రీయంగా వాదనలలో అత్యంత సులువుగా గెలిచిన ధీరోదాత్తుడు. దేవతలనేకుల దర్శన కృపలను పొందిన స్రష్ఠ. అనేకానేక మంత్రములలో ద్రష్ఠ. " తారామంత్రము" ఉత్తర భారతమునుండి దక్షిణ భారతమునకు దెచ్చినది నాయనే. పుట్టుక నుండియే వాక్సిద్ది, నిర్భయత్వమునకు మారుపేరు. ఏకసంథాగ్రాహి. సూర్యునివలె కళంకరహితమగు భావన, ఆచరణ, నమ్మిన సిద్దాంతములపై సమదృష్టి, గణనాథునివలె విఘ్నములెన్ని ఎదురైననూ చలించక, అదరక, బెదరక, తప్పించుకొన యత్నించక, ధైర్యముగా నెదుర్కొని విఘ్నములకే విఘ్నములను గల్గించి. నిర్విఘ్నముగా అసంఖ్యాకమగు శిష్యబృందముతో, భారతావనిలోని అనేకానేక ప్రాంతములలో తనపేరు మారు మ్రోగుచుండ ధీరుడై, గంభీరుడై, ప్రచండుడై దేశ దాస్యవిముక్తికై, వైదిక ధర్మోద్ధరణకై సంకుచిత కుటిల మనస్కులగు పండితులమని పిలిపించుకునే వారల అహంకారములను పాతిపెడుతూ, దిగ్విజయ యాత్రలతో, పుణ్యక్షేత్ర, తీర్థ, సందర్శనములతో, ప్రజల నుత్తేజ పరుస్తూ, కార్యోన్ముఖుల కావిస్తూ, అతులిత ప్రజ్ఞా పాటవములకు ఆలవాలమై వెలుగుతూ వుండిన నాయనకు ఒక క్షణమున "తనను గురించి తానెరుగ దలంచిన వేళ" తను అంతవరకు నేర్చినది తృణప్రాయమని గ్రహించి, సత్యాన్వేషణ తత్పరుడై అరుణగిరిని చేరి అందు జంగమస్వరూపముగానున్న తేజోమూర్తిని చూచి - అహంకార, మమకార, వగైరాదులను వీడి సాష్టాంగ ప్రణామమొనరించి, వినయ శీలుడై, వివేకోదయము కొరకు ఆత్మోన్నతి కొరకు, తానెవరో తెలుసు కొనుటకై పరితాపముతో తన అంతరంగిక బాధను వెడలగ్రక్కినాడు.

ఒక విషయం : మనము ఎక్కడికైనా వెడితే మన బంధువులో, స్నేహితులో, ఆశ్రితులో వుంటే ఎదుటివారికి సాష్టాంగ పడటం నామోషి అనిపిస్తుంది. అహంకార మడ్డువస్తుంది. మరి మన ఊహకందని స్థితినందిన నాయన ఏమీలేని, సామాన్యునివలె కన్పించే మౌనస్వామికి సాష్టాంగపడటం, నాయనకే చెల్లిందికానీ, నాలాంటివారికది జన్మజన్మ పరంపరలకు కూడా కలుగదేమో ! ప్రస్తుతము ఈ విషయంలో మన దేశంలోని కొంతమంది తల్లి దండ్రులను, వారిపిల్లలను మనము అభినందించక తప్పదు. జన్మ నిచ్చిన తల్లిదండ్రులకే నమస్కరించుటకు మనస్కరించకపోగా, వారిని చులకనగా చూసే దౌర్భాగ్యపు జాతికి చెందిన వారుండటం, వారికి సరియైన ధర్మ, కర్మాచరణలను నేర్పని తల్లిదండ్రులను చూడటం వలన, బహుశావారు ఈ దేశవాసులు కాని వారేమోననీ, గతిలేక పొట్టకూటికై, అన్నింటినీ అందరినీ ప్రేమ, సమత, మమతలతో యిడుడ్చుకునే హైందవ ధర్మమునకు ఆలవాలమైన భారతమాతకు దత్తు కొడుకులుగా వచ్చినారేమోననీ, అందుకే తల్లిపాలు త్రావి రొమ్ములు గ్రుద్దే ప్రబుద్దులుగా తయారౌతూ - తామేదో దేశానికి లోకానికి సృష్టికి, సంఘానికి సేవలు చేస్తున్నామనే అవివేకముతో డప్పులు వాయించుకుంటూ, పబ్బం గడుపుకునే వారిని అభిశంసించక అభినందించగలమా? అలాంటివారికి మహాత్ముల ప్రవర్తన, నాయన నడక, భగవాన్, సాయినాథ్, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, శ్రీ అరవిందుల లాంటి ఎందరెందరో జీవిత చరిత్రలైనా కనులు తెరిపించగలవు. అయినా నా వెఱ్ఱిగానీ వారికి అటువంటి, ఆశ, ఆశయము, ధ్యాస, ధ్యేయములు వుంటేకదా ! అందుకే ఓ సహనశీలి భరతమాతా ! నీకు మమ్మల్నందరినీ సమానంగా భరించక తప్పదు.

అప్పుడు ఆ మౌనస్వామి కంఠమును సవరించుకొని ఒక చిన్న వాక్యములో " మంత్ర నాదమెక్కడ పుడుతుందో చూడ " మని అన్నాడు. అంతే - అదే మరువలేని, మధురాతి మధురమైన క్షణం మనోజ్ఞ మంజుల సుందర సమ్మోహన దృశ్యం. దానిని చూడగలిగే శక్తి గలిగి చూచిన వారెవరైనా వుండి వుంటే ధన్యులు. ఆ క్షణంలో మానవులెవ్వరూ లేరక్కడ. మహాసిద్ధపురుషులు, అర్ధనారీశ్వరుడు మిగిలిన దేవాది బృందములుండి వుండవచ్చును. అ తర్వాత క్షణాలలో వచ్చాడు పళనిస్వామి. నివ్వెరపోయాడు.

నిశ్శబ్దమునుండి శబ్దము మంద్రస్వరముగా వెలువడింది. శబ్దజాలమయమున కాలవాలముగా పిలువబడిన (నాయన) శబ్దము నిశ్శబ్దముగా నిలిచిపోయింది. శబ్దము నిశ్శబ్దమునుండి శబ్దమును వెలువరింపజేస్తే ఆ నిశ్శబ్దమునుండి వెలువడిన శబ్దము, శబ్దమయమును నిశ్శబ్ద మొనరించినది.

అంతకుముందు అరుణాలేశ్వరుని రథమాగి "నాయన" రాకతోనే కదలుట ఆ వూరివారందరికి తెలిసినదే. ఇప్పుడు బ్రాహ్మణ, మౌనస్వామి నోటినుండి శబ్దము వెలువడుట.

ఇది నాయన. భగవాన్ చరిత్రలలో ముడివేసుకొని, పెనవేసుకు పోయిన మధురాను బంధమనోహర మధురస్మృతి.

నాయన ఆ స్వామికి "భగవాన్ రమణ మహర్షి" అని నామకరణం చేశారు. అందరినీ "భగవాన్" అని పిలిచి అనుగ్రహములు పొంది తరించమన్నారు. కాని, స్వార్థచింతనతో తన కెందుకులే అని అనుకోలేదు. మామూలు మానవుడు నా కెందుకులే అని అనేక విషయాలలో స్వార్థచింతనతో సాటి మానవులనుండి తప్పుకొని పోవడానికి యత్నిస్తాడు. కాని మహాత్ములు "మనకందరకూ" అనే విశాల దృక్పథంతో వ్యవహరిస్తారు.

ఆనాడు నాయన నామకరణం చేసివుండకపోతే ఈనాడు మనము "భగవాన్ రమణ మహర్షి" అని తెలుసుకొని, పిలుచుకుంటు వుండగలిగే వారమా? అలాగే భగవాన్ "నాయనా" అని పిలిచి వుండకపోతే మనము నాయనను "నాయన' అని పిలుచుకునేవారమా ! చిత్రాతిచిత్రం. శిష్యుడు గురువుకు నామకరణం చేయడం. మామూలుగా తల్లిదండ్రులు, గురుదేవులు పిల్లలకు, శిష్యులకు, నామకరణం చేస్తారు. కాని ఇక్కడ యిదొక విభిన్న పంథా. ఆ తర్వాత గురువు శిష్యునికి నాయన "నాయన" అని నామకరణం చేశాడు.

అక్కడ నుంచి మొదలైంది నాయన మరోజన్మ. అనేకానేక మహా మహిమోపేతములైన గ్రంథములు, దేశపర్యటనలు, తపస్సులు, ఆశ్రితుల నుద్దీపింపజేయడం. బ్రహ్మచర్యం, వానప్రస్థం సన్యాసం, వేద ధర్మాలు, వర్ణాశ్రమ దర్మాలు, అధ్యయనములు, ఉపన్యాసములు, శిష్యకోటి పరంపర, అన్నిటి మధ్య శ్రీ గురుని చల్లని నీడలో నిర్లిప్తత - ఇది నాయనను గురించి ముక్తసరిగా - అసంఖ్యాకములలో ఏ ఒకటో, రెండో విషయములు. దేవతలున్నారా ? తపస్సు సాధ్యమా ! మంత్రాలకు చింతకాయలు రాలుతవా ? మోక్షము సాధ్యమా ? విఘ్నములను ఎదుర్కొనుట సాధ్యమా? జ్యోతిష్యము నిజమా ? గురువు అవసరమా ? శిష్యుని లక్షణ, లక్ష్య, ధర్మ, కర్మములేవి? బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసములు ఒక జన్మలోనే అనుభవించ వీలగునా ! దిక్కులేని వారికి దేవుడే దిక్కనెడి సామెత నిజమేనా? తల్లిదండ్రుల ఆచార వ్యవహార, సంకల్పములను బట్టి సంతానము ఎలా వుంటుంది ? శరణాగతి అంటే ఏమిటి? ఆపదలలో నున్నప్పుడు శ్రీ గురుని కృప ఎలా శిష్యుని, ఆశ్రితుని అదృశ్యముగా కాపాడుతుంది? వీటన్నిటికి సమాధానములు "నాయన" ను గురించి అనేకులు వ్రాసిన అనేక చరిత్రలలో "భగవాన్" ను గురించి అనేకులు వ్రాసిన అనేకానేక గ్రంథములలో కొంతవరకు లభించవచ్చును.

ఆనాడేకాదు, ఈనాడు ఇకముందు కూడా ధ్యేయము బలముగా నుండిన సత్యాన్వేషణ తత్పరునకు గురువు అవసరము. శ్రీ గురునికి తనను అర్పించుకొన్న శిష్యుడు సదా శ్రీ గురుని శిక్షణలో పరిరక్షనలో సత్యములో లీనం కాగలడని అవగాహనకు వస్తుంది. పాత్రతను బట్టి పాత్ర, పాత్రను బట్టి పదార్థము. యధాలాపంగా చదివినా, నాయన చరిత్ర పడుకున్నవాడిని కూర్చోబెట్టి ఆలోచింపజేస్తుంది. ఇంతకూ ఈ రాతకు ముగింపులేదు, వుండదు. కానీ ముగించక తప్పదు. సత్యధర్మములు స్థిరములు. అవి భారతమాత పాలిండ్లు. ఆ అమృతమును గ్రోల గలిగినవారు ధన్యులు. కానీ ఆ తల్లి సంస్కారాన్ని, శీలాన్ని సంస్కృతిని మాత్రం నశింప జేయకూడదని ప్రార్థన.

"నాయనే కాదు, ఎందరెందరో కొన్నికోట్ల సంవత్సరాలుగా మన తల్లిని గౌరవిస్తూ, తల్లికి నమస్కరిస్తూ తమ ధర్మాన్ని నెరవేర్చు కుంటున్నారు. వారికి అడ్డు బోకండి. ఒకరికి ఉపకారం చేయక పోయినా అపకారం చేయకుమనే సామెతనైనా గుర్తుంచుకోండి.

లేకుంటే తల్లిని తాకట్టు పెట్టే దౌర్బాగ్యులై, చివరకు అనాథలై దిక్కు తోచక దిక్కు కొకరుగా పరుగెడుతూ అలమటించాల్సిన దుర్గతి పట్టగలదని ఆర్యులు ఏనాడో హెచ్చరించారు. అలా జరిగిననాడు ఎవరికెవరు ? రక్షణ ?

వేద ధర్మములు, సంస్కారములు, సంస్కృతి, సాంప్రదాయములకు, ఆచార వ్యవహారములకు వివరణలను కొంతవరకు తెలుసుకోగోరితే భగవాన్, నాయన, సాయి, వగైరా......... పరమాత్మ స్వరూపుల చరిత్రలు చదవండి. రామాయాణ, భారత, భాగవత, భగవతాది ధర్మసూక్ష్మములను తెలిపే పురాణములను చదవండి. మేల్కొండి అని ఘోషిస్తున్నాయి - సత్యాన్వేషణ తత్పరుల ఆవేదనలు. ఈ ఆవేదనల రోదనలెందుకని తామసులై వుందామో ! లేక తాపసుల మౌదామో ! అటు యిటుగాక మధ్యన యిరుక్కు పోతామో ? వారివారి ప్రారబ్దము శ్రీ గురుకృప దైవేచ్ఛ! లోకాస్సమస్తాస్సుఖినోభవంతు.

ఓం తత్ సత్ !!