Jump to content

గణపతిముని చరిత్ర సంగ్రహం/ఖడ్గపుర నివాసము

వికీసోర్స్ నుండి

14. ఖడ్గపుర నివాసము

ఖడ్గపురములో నాయన నవంబరులో ఇండియన్ ఇన్స్టిట్యూటులో బహిరంగోపన్యాస మొసగెను. అప్పుడు నేమాని సూర్యనారాయణ శిష్యుడయ్యెను. ఇతడు నాయనను కలకత్తాకు ఆహ్వానించెను. కలకత్తాలో కిద్దర్ పురమునందు ఆంధ్రులు హెచ్చుగా నుండిరి. అక్కడ గుంటూరు లక్ష్మికాంతము తెలుగు పాఠశాలను నడుపుచుండెను. 24-11-1934 తేది నాయన కలకత్తాకు వచ్చినప్పుడు సూర్యనారాయణ యింటిలో వసతిలేక ఆయనను లక్ష్మికాంతముగారి యింటిలో ఉంచిరి. లక్ష్మికాంతము నాయనను చూడగనే పదేండ్లక్రిందట తాను స్వప్నములో చూచిన సిద్ధపురుషునిగా గుర్తించి ఆశ్చర్యమును ఆనందమును పొందెను.

ఆనాడు సూర్యనారాయణతో వచ్చిన మిత్రులు అభిలషింపగా యింటియందే నాయన తన చరిత్రమును గంట సేపు చెప్పెను. ఆ రాత్రి శనివారపు భజనకు సుమారు నలువదిమంది చేరి భజన యైన తరువాత నాయనను ఉపన్యసింపుమనిరి. యజ్ఞావతారము తేజోంశావతారము అని అవతారములు రెండు విధములుగా నుండునని, రామకృష్ణాదులు యజ్ఞావతారములని, మానవుల నిష్కామకర్మ యజ్ఞరూపమై ఈ యవతారములకు ఉపాధి యగునని, జన్మాంతర పుణ్య బలము గలవారు తేజోంశావతారులని, వీరు ఆధ్యాత్మిక ప్రపంచమునకు గురువులు ఆదర్శప్రాయులును అగుదురని నాయన ఆ ప్రసంగమున వివరించెను. ఆదివారం పెద్ద సభలో నాయన వేదకాలమును గూర్చి, సోమవారము రమణ భగవానుని గూర్చి ప్రసంగించెను.

త్వరలోనే అనేకులు నాయనకు శిష్యులు రమణునకు భక్తులు ఏర్పడిరి. తరువాత పాఠశాలయందే ఆయన పదునైదు ఉపన్యాసముల నిచ్చెను. ప్రసంగములు ప్రశ్నలపై ఆధారపడి యుండెడివి. ఆ ప్రశ్నలను కూర్చుటలో ఆ పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడైన బి. ఎస్. రామారావు, ఆయనకు మిత్రుడు ఆర్. సంజీవరావు అధిక ప్రజ్ఞను చూపి నాయనకు ప్రేమాస్పదులైరి. వీరే నాయన కీర్తిని కలకత్తాలో నాలుగు మూలలకు ప్రసరింప జేసిరి. సుమారు ఒక మాసము ఇట్లు గడచెను. ఈ ఉపన్యాసములవలన అక్కడ పెద్ద సంచలనము కలిగెను. నాయన మంత్రదీక్షలను గైకొనిన వారికి నియమావళిని ఏర్పఱచి ప్రత్యేక బోధనలను గావించెను. భక్తులు నాయన కొఱకు ఒక అద్దె యింటిని ఏర్పఱచిరి. లక్ష్మీకాంతము నాయనకు తగినట్లుగా ఆహారపానీయాదులను సమకూర్చుచుండెను. లక్ష్మీకాంతమునకు ఆయన భార్య సూరమ్మకు రాత్రులందు నాయన ప్రత్యేకముగా బోధించెడివాడు. 1935 ఆగష్టులో నాయన ఆమెకు గాయత్రీ మంత్రమును ఉపదేశించెను. నాయన దివ్య శరీరము ఒకనాడు లక్ష్మికాంతమును ఆవహించెను. అప్పుడు నాయన ఇట్లనెను. "ఇది నా దివ్య శరీరముయొక్క యనుగ్రహ చేష్ట. ఇది సూరమ్మను అనుగ్రహించుటకు నన్ను ప్రేరేపించిన పిదప, నాకు తెలియకుండ నిన్ను అనుగ్రహించెను. దీని యుద్భవము నాకు కపాలము భిన్నమైనప్పుడే తెలిసినను ధ్యానమందున్నప్పుడు మాత్రము నాకు దాని మహిమ గోచరించుచు, మిగిలిన వేళలందు దాని వ్యాపార సంచారములు తెలియబడుట లేదు. అది తెలిసి నప్పుడు నా తపస్సు పూర్ణ సిద్ధిని బొందినట్లుగును. అందుకొఱకు నే నిరువది దినములు రేణుకాదేవి యాజ్ఞాపించిన దీక్ష బూనవలెను. కాని దీనికి పూర్వము గోచరించవలసిన సిద్ధి యభివ్యక్తము కానందున నా తపస్సునందు ఆ దీక్షకు దగిన పాకము రాలేదని జాప్య మొనర్చుచుంటిని."[1]

  1. * నాయన - పుట 694