గణపతిముని చరిత్ర సంగ్రహం/ఆనందాశ్రమ నివాసము

వికీసోర్స్ నుండి

13. ఆనందాశ్రమ నివాసము

1929 వేసవిలో తిరువణ్ణామలైయందు ఎండలు నాయనకు దుర్భరముగా నుండెను. అప్పుడు అక్కడికి వచ్చిన దైవరాతుని శిష్యులు వాసిష్ఠుని గోకర్ణమునకు రమ్మని ఆహ్వానించిరి. మహర్షి "అట్లే చేయు" డనెను. నాయన వారివెంట గోకర్ణమునకు పోయెను. అక్కడ కూడ ఎండ నాయనకు దుర్భరముగానే యుండెను. దైవరాతుని తమ్ముడు సీతారాముడు అక్కడనుండి ఆయనను "కుళువే" గ్రామమునకు చేర్చెను. అది శిరిసికి దగ్గర. అది సముద్రతీరమునకు దూరమందున్నను 2000 అడుగుల యెత్తున నుండుటచే చాల చల్లగా నుండును.

వాసిష్ఠుడు కుళువేలో అహల్య అను నామెకు పీడను తొలగించి, తరువాత నామె భర్తకు టైఫాయిడ్ జ్వరము వచ్చినప్పుడు దానిని కూడ మాయమగునట్లు చేసెను. ఒకనాడు వాసిష్ఠుడు ఒక పాకలో శిష్యపరివృతుడై కూర్చుండి యుండగా సమీపములో గడ్డివాము లంటుకొని అగ్నిజ్వాల పాకను చుట్టుముట్టెను. వెంటనే వాసిష్ఠుడు పారాశరుని యగ్ని మంత్రమును అస్త్రముగా ప్రయోగించెను. పాకనుండి సుడిగాలి బయలుదేరి గడ్డివాములను జ్వాలలతో కూడ దూరముగా చిమ్మివేసెను. ఈ సంఘటనముల వలన అక్కడివారికి వాసిష్ఠుని మహిమలయందు గాఢమైన విశ్వాస మేర్పడెను.

మహాదేవుడు ఆస్తి విషయము తండ్రితో మాటాడుటకు కుళువేకు వచ్చెను. తండ్రికొడుకులు మోటారుబండిలో పయనించు చుండగా అది ఒక ప్రక్కకు పడెను. మహాదేవుని మోచేయి విఱిగెను. సమీపమందున్న వైద్యుడు తాత్కాలికముగా కట్టుకట్టి "పెద్దాసుపత్రికి తీసికొనిపొం" డనెను. మహాదేవుడు భయపడు చుండగా వాసిష్ఠుడు ఋగ్వేదములోని అస్థిసంధాన మంత్రమును పఠించి క్షణములో విఱిగిన చేతిని అతుకుకొనునట్లు చేసి కుమారుని ఆనందమున, వైద్యుని ఆశ్చర్యమున ముంచెను. పిదప నాయన కుమారుని కలువఱాయికి చేర్చి కుళువేకు తిరిగి వచ్చుచు త్రోవలో రమణ భగవానుని దర్శనము గావించు కొనెను.

1929 మే నుండి 1931 ఫిబ్రవరి వరకు నాయన కుళువేలో నిశ్చల తపస్సులో గడిపెను. సుందర పండితుడు, అతని తండ్రి పుండరీక రాయుడు అను వారు నాయనకు ఆప్తులై ఆయనను శిరసిలో తమ యానందాశ్రమములో నుండుడని ఆహ్వానించిరి. వాసిష్ఠుడు యాశ్రమమునకు చేరి పెక్కు మందికి మంత్రదీక్షల నొసంగుచు మహర్షిని గూర్చి ప్రసంగించుచు నుండెను.

కపాల భేద సిద్దితోపాటు వాసిష్ఠునకు అంతరంగమున ఒక దివ్య శరీరము పుట్టి ఆయనకు తెలియకుండగనే ఇతరులను ఆవహించుచున్నట్లు తోప జొచ్చెను. దానిని ఆయన స్వాధీన మొనర్చుకొనుటకు ప్రయత్నించుచుండెను. రామచంద్రభట్టు అను శిష్యుడు సంస్కృతమునే ఎఱుగని వాడు. నాయనయొక్క ప్రసంగములను శ్రద్దతో వినుచు ఇతరుల పరిహాసములకు లోనగు చుండెను. అట్టివాడు అల్పకాలముననే సంస్కృతమున ప్రజ్ఞను పొంది అందఱకును ఆశ్చర్యమును కలిగించెను. ఇది ఆ దివ్య శరీరముయొక్క మహిమయేయని వాసిష్ఠుడు గుర్తించెను.

శిరసిలోని యానందాశ్రమము నుండి నాయన భగవానునకు చాల ఉత్తరములు వ్రాసెను. వానిలో నాయనయందు కలిగిన పరిణామము చక్కగా వ్యక్తమగుచున్నది. 17-3-1931 తేది నాయన ఇట్లు వ్రాసెను. "భగవన్ విశ్వగురూ,

...సద్దర్శనము శనివారము 14-3-31 నాడు ముగింప బడెను..... నా యనువాదమునందు గుణమున్నచో నది భగవానుని యనుగ్రహమే. ఆ శనివారమునుండి నా దృష్టి విలక్షణము కాజొచ్చెను. సర్వ పదార్థమును ఏక స్వరూపముగా జూచు చుంటిని. ఈ యభ్యాసమ దృఢమై యనుభవ రూపమున నుండుటకు భగవంతుని ప్రార్థించుచుంటిని. నీటియందు బుడగ వలెనే యొక్క సద్వస్తువునం దీరూప వికారములను తిలకించు చుంటిని. ఆ వికారమును విడిచి శుద్దసద్రూపమును పొందుటకు యత్నించుచుంటిని.

ఇట్లు మీ యనుగ్రహార్థి,

వాసిష్ఠుడు.

భగవన్ కారణ గురో,

24-3-31,

...ఓ మాయాపుంజ సంహారి; ఇప్పటికిని నాకు భేదబుద్ది యస్తమించలేదు. మీయొక్క క్షణిక సంకల్పమున్నచో నాకది సర్వాత్మ భావ మగునని నే నెఱుగుదును. స్వేచ్ఛగా మీ మనస్సు నందొక్క సంకల్పమైన నుండజాలదని నే నెఱుగుదును. ఈశ్వరుడే మీ మనస్సునం దట్టి సంకల్పమును బుట్టింప సమర్థుడు. ఇట్టి ద్రావిడ ప్రాణాయామ విదమేల యని ప్రశ్న రావచ్చును. ఈశ్వరుడే స్వయముగా అనుగ్రహించక మఱొకనికి సంకల్పము బుట్టించుటకేల ప్రయాస పడవలెను? నిజమే. ఈ రహస్యము పుణ్యాత్ము లెఱుగదగినది. అవతార పురుషుడు జాగరూకుడై యుండగా నతని ద్వారా ఈశ్వరుడు తన కర్తవ్యమును చేయును గాని స్వయముగా చేయడని సిద్ధాంతము. అందువల్లనే తమ మనస్సు నందట్టి సంకల్పము బుట్టించుట కీశ్వరుని నేను ప్రార్థించుచుంటిని.

ఇట్లు.

మీ జన్మాంతర సోదరుడు.

భగవన్, దహరశయా,

......నాథా! తపస్సు పరిపక్వమై, అహంకారము నశించి, సహజ స్థితియందు స్థిరమై, యింద్రియ సమూహమంతయు భగవ దాయత్తమై యుండగా సర్వము సాధింపబడినట్లు నేను తలంచు చుంటిని. నిజాత్మనిష్ఠ నాకు మూలనిష్ఠకు మార్గము జూపుగాక. తమ కరుణ సన్నిధియందే సర్వాభీష్ఠసిద్ధి పూర్ణ మొందునని నే నెఱుగుదును. అట్టి శుభ కాలమునకై ప్రతీక్షించుచుంటిని. ఈ జను డిప్పుడు దూరములో నున్నను తమ చిత్త సామీప్య మందున్న వానివలె ప్రకాశించుగాక. ప్రభో! మీ రెప్పుడు నా హృదయమందే శయనించుచున్నారు. నే నెప్పుడు మీ పాదముల యొద్దనే శయనించుచుంటిని. మీరు నాకు నియోగించు ప్రభువులు, నేను మీకు కార్యదాసుడను.

ఇట్లన్నివిధముల మీ వాడైన

వాసిష్ఠుడు.

భగవన్, మాయామానుషా,

5-5-1931

.... .... ప్రభో! నా స్థితిని కొంచెము తమ చరణసన్నిధిని నివేదించుకొనుటకు నే నుత్సాహపడుచుంటిని. గొప్ప ఆనందమును పరమ లక్ష్యముగా కొందఱెంచుదురు. నిరతిశయ యోగసిద్ధి ముఖ్య లక్ష్యమని మఱికొందరు తలంతురు. సుఖ దుఃఖాతీత స్థితి యింకను కొందఱికి లక్ష్యమగుచున్నది. కొందఱు మృత్యు విజయము గొప్పదందురు. నేను మాత్రము కామోపశాంతి కమనీయ లక్ష్యమని తెలియుచుంటిని. నిస్సారములైన కొన్ని కామము లుపశాంతి నొందెను. కొన్ని యనుభవింపబడి శాంతి బొందెను. దూరము జేయబడి మఱికొన్ని యుపశాంతి గావింప బడెను. సారమున్నదో లేదో కాని నాకొక్క కామ్యము మాత్రముండి పోయెను. దానిని నిషేధించుటకు శక్తిలేదు దూరముగా పొమ్మనుటకు ఇచ్ఛలేదు. నా కష్టములో భగవంతుని సహాయమును యాచించు చుంటిని. ఆ నా కోర్కె భగవంతునకు తెలిసియే యుండును.

ఇట్లు

" ................ "

భగవన్, భక్తవత్సలా,

22-7-1931

మంత్రజప మహిమ వీక్షింపబడెను. యోగసారము విలోకించ బడెను. కుండలినీశక్త్యుల్లాసము పరీక్షింపబడెను. "అహం" యొక్క జన్మస్థలము నిరీక్షించబడెను. మౌనముచే ప్రకృతి పాక మన్వీక్షింపబడెను. భేదభావము దూరీకృతము గావింపబడెను. చప లత్వము నిరస్తము చేయబడెను. స్థయిర్యము అభ్యసింపబడెను. అట్లయినను నేను తృప్తి జెందలేదు. ఇప్పుడింక భక్తిచేతనే తృప్తి బొందగోరు చుంటిని. అ భక్తికి మూడు స్థానములున్నవి. ప్రథమస్థానము భగవాన్ మహర్షి, ద్వితీయస్థానము భగవా నింద్రుడు. తృతీయ స్థానము భగవతి మాతా భారతభూమి.[1]

ఇట్లు మీ చిరకాల భక్తుడైన

గణపతి.

ఈ లేఖలవలన ఆత్మనిష్ఠను నిలుపుకొనుటకై నాయన మనస్సునందు ఎంత సంఘర్షణము నొందుచుండెనో స్పష్టమగు చున్నది. మార్చి 17 వ్రాసిన లేఖలో " శుద్దసద్రూపమును పొందుటకు యత్నించుచుంటిని" అని తన లక్ష్యమును ఆయన స్పష్ట మొనర్చెను. ఈ లక్ష్యము తనకు సిద్ధించుటకు అవతార పురుషుడైన రమణుడు సంకల్పము చేయవలయునని 24 వ తేది లేఖలో ప్రార్థించెను. "నే నెప్పుడు మీ పాదముల యొద్దనే శయనించుచుంటిని. మీరు నాకు నియోగించు ప్రభువులు. నేను మీకు కార్యదాసుడను" అని 14-4-31 తేది లేఖలో నాయన వ్రాసిన వాక్యములు ఆయన యందున్న గురుభక్తిని వ్యక్తీకరించు చున్నవి. గురువును సేవించునప్పుడు అహంకారమును పూర్తిగా వీడి దాస్యమొనరించుటకు కూడ సిద్దపడవలయునని ఎల్లరు గ్రహింప వలసి యున్నది. ఆయనయందు సకల కామములు ఉపశాంతి పొందినను ఒక్క కామ్యము మాత్రము ప్రబలముగా మిగిలియుండెనని "దానిని నిషేధించుటకు శక్తిలేదు, దూరముగా పొమ్మనుటకు ఇచ్చ లేదు" అని నాయన మే 5వ తేది లేఖలో తన నిస్సహాయస్థితిని, నిర్వేదమును స్పష్టమొనరించెను. ఇంద్రుని ఉపాసించి శక్తిని పొంది భారత భూమియొక్క దుర్గతిని ఎట్లయినను తొలగింపవలయు నను కాంక్షయే ఆ ప్రబలమైన కామ్యమని 22-7-31 తేది వ్రాసిన లేఖలో స్పష్టమగుచున్నది. కుండలినీ శక్తియొక్క ఉల్లాసమును పరీక్షించినను "అహం' యొక్క జన్మస్థలమును పరీక్షించుచు ఎంత తీవ్రముగ తపస్సు చేసినను నాయన ఆ కామ్యమును తొలగించుకొనలేక తృప్తిని పొందలేక భక్తినే ఆశ్రయింపవలసి వచ్చెను. ఆ భక్తికికూడ గురువు, ఇంద్రుడు, భారతభూమి లక్ష్యములగుట గమనింపదగియున్నది. దీనినిబట్టి సంకల్పరహితమైన ఆత్మనిష్ఠను సాధించుట చాలా దుర్ఘటమని, సర్వసంకల్ప పరిత్యాగమే సంతృప్తిని సంతుష్ఠిని, ఆనందమును కలిగింపగలదని గ్రహింపవలసియున్నది. యీ అభిప్రాయమును ఆయనయే 10-3-31 తేది వ్రాసిన లేఖలో ఇట్లు స్పష్టమొనరించినాడు. "ప్రభో! భగవంతుని కటాక్షమువలన నాకు ఏ నిష్ఠ ప్రాప్తించెనో, అది నాకిక్కడ విజ్ఞానాత్మక మగుచున్నది. శరీరముకంటె భిన్నముగా ఆత్మను ఈ గుహయందు అనుభవించు చుంటిని. అట్లయినను ప్రపంచానుభవమునుండి యిది భిన్నత్వము బొందనందున పూర్ణనిష్ఠ గాదని తలంచుచుంటిని. అట్టి పూర్ణ నిష్ఠకై బహుయోజనములు లంఘించగల్గు తమ కటాక్షమును బంప వేడుచుంటిని." 14-3-1931 తేది నాయన "ఉన్నది నలువది" అను గ్రంథమును సద్దర్శనముగా సంస్కృతము లోనికి అనువదించి, జూన్ నెల చివరకు "ప్రచండ చండీత్రిశతి" అను స్తోత్ర గ్రంథమును ఈశోపనిషత్తునకు లఘుభాష్యమును రచించెను.

శ్రీ ఆర్యసోమయాజుల అప్పన్నశాస్త్రి సద్దర్శనములోని రచన యొక్క ప్రాశస్త్యమును ఇట్లు నిరూపించెను. "వీరి యనువాదములో పాదపురాణము కొఱకు ఒక్క వ్యర్థాక్షరమైనను మచ్చునకైనను కానరాదు. జటిల సమాసములు లేనే లేవు. పదములు అర్థమును భోధించుటలో ప్రసాద గుణభరితములై యున్నవి. ఒక్క పదమును కూడ మార్చుట కవకాశము లేదు. చిక్కనైన శైలితోను మృదు మధురములగు పదములతోను భావ గాంబీర్యముతోను, ప్రకాశించు ఈ గ్రంథము శ్రుతి సమ్మతమైన అద్వైతామృతమును మనకు అందించు చున్నది."[2]

1933 లో నాయన ఋగ్వేదమును మథించి భారతేతిహాసము నందు వర్ణింపబడిన చరిత్రను విమర్శించుచు 'భారత చరిత్ర పరీక్ష' అను పెద్ద గ్రంథమును రచించెను. ఆ గ్రంథములోని ప్రథాంశములను కొన్నింటిని శ్రీ గుంటూరు లక్ష్మీకాంతము ఇట్లు సంగ్రహించెను. "భారత కథకు చెందిన మహావీరు లందఱు శ్రీకృష్ణునితో సహా ఋగ్వేద మందు మంత్రదష్టలుగా నుండుట, వారు తపస్సంపన్నులైనను దేశము కొఱకు యుద్ధము సల్పి ధర్మమును కాపాడుట మొదలగు విషయములను బట్టి ఋగ్వేద ఋషుల వీర గాధలే మనకు ప్రసిద్ధ పురాణములైన ట్లీ విమర్శ నుండి విదిత మగును. అంతేగాక వేద కాలపు ఋషులు తమ తపశక్తి నీనాటి వేదాంతుల వలె యాధ్యాత్మ సౌభాగ్యమునకే కేవలము వినియోగించుకొని, దేశ సౌభాగ్యము నశ్రద్ద చేయలేదనియు, స్వాతంత్ర్యమునకు భంగము కలిగునప్పు డాంతర్య మందెట్లో బాహ్యమందెట్లే చికిత్స చేయుట కహింసాది ధర్మముల నడ్డు రానీయ లేదనియు విశద మగును. మఱియు, కురు వంశమునకు జెందిన కౌరవులు పాండవుల వలె భారతీయులు కారని ధ్వనించు చుండును."[3]

నాయన గావించిన పరిశోధనలకు కలుగవలసిన ప్రచారావశ్యకతను గూర్చి గుంటూరు శ్రీ లక్ష్మికాంతము ఇట్లు ఉద్ఘాటించెను. "ఈ గ్రంథము వలన మహాభారత పురాణము సంస్కరింపబడుటయే గాక, ఇతర పురాణేతిహాసము లందు నీచపఱుప బడిన ఋషి చరిత్రము లన్నియు సంస్కరింపబడిన వయ్యెను. అట్లే ఋషి సంప్రదాయము లనెడి పేరుతో మనుచున్న కొన్ని న్యాయము లన్యాయములని తేటపఱుపబడి నందున మన వైదికాచారములను శాసించు శాస్త్రములు సంస్కరింపబడిన వయ్యెను. మఱియు నిట్టి వేదార్థ మథనముచే విజ్ఞానకోశ మనదగు ఋగ్వేదము నుండి ఇతర రహస్యముల పరిశోధనకు పూనుకొన వలెనని పండితులకు ఆదర్శ మేర్పడును. కాని యిట్టి ఆదర్శములచే నాకర్షింపబడని ఈనాటి పండితులు గానుగెద్దులవంటివారే కాని స్వతంత్ర విదార శీలురు కారని నాయన కదివఱకే యనుభవ మయ్యెను. లోక హితముకొఱ కిట్టి పరిశోదనలచే పండితులు తోడ్పడవలెనని నాయన ఎన్నాళ్ళు చెప్పినను నొక్క పండితుడైన ముందునకు రాలేదు. ఆలోచింపగా పండితు లీనాడు పామరుల కంటే నధిక ధనలంపటులై, ధన రూపమున కిట్టుబడికాని కార్యము లెంత పుణ్యప్రదము లైనను తీరుబడి లేనివారివలె వాటి నంటకుండిరి"...[4]

నాయన గావించిన ఋగ్వేద పరిశోధనా వైశిష్ట్యమును శ్రీ అప్పల సోమేశ్వర శర్మ ఇట్లు ప్రశంసించినాడు. "ఇక మూడవ రచన" "ఋగ్వేద సంహిత" వాసిష్ఠుని ప్రాణ సంహిత. దానికి ఉపోద్ఘాత భాగ్యం ఈ కృతి (ఋగ్వేద భూమిక) వున్న గ్రంథాన్ని పరిశీలిస్తే శరీరం గగుర్పాటు చెందుతుంది. ఆ వాక్పాటవం, ఆ పొందిక, ఆ యుక్తి, ఆ గాంభీర్యం, ఆ పరమ స్వాతంత్ర్యం నాయనకే చెల్లుతాయి. "న భూతో న భవిష్యతి". ఇందులోని పరమ విశేషం "వేదాలు పౌరుషేయాలు" అని ప్రతిపాదించడం. అంటే "అతీంద్రియ ద్రష్టలైన మహర్షులు రచించిన గ్రంథాలు వేదాలు" అని నొక్కి వక్కాణించడం. ఈ సందర్భములో గణపతి శాస్త్రి, వేద వాక్య విశారుదులైన శబర స్వామిని, సాయనా చార్యులను కూడా సూటిపోటి మాటలతో అధిక్షేపించి విడిచి పెట్టారు. ఈ గ్రంథము పూర్తి అయితే ఎంతటి సిద్దాంత రత్నాలు దొరికి వుండేవో; భవతు"[5] 1934 ఫిబ్రవరిలోనో, మార్చిలోనో నాయన శిరసి వీడవలసి వచ్చెను. కలువఱాయికి చేరి ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయ వార్షికోత్సవములకు విశాఖపట్టణమునకు పోయి భారత చరిత్ర పరీక్షను గూర్చి రెండు ఉపన్యాసములు గావించెను. ఆ యుపన్యాసములకు ముగ్దులై విశ్వవిద్యాలయము నందు ప్రాచీన విద్యా పరిశోధనల శాఖలో నాయనను చేర్చుకోవలయునని చాలామంది యాచార్యులే (Professors) కాక వైస్ చాన్సలరుగా నున్న సర్వేపల్లి రాధాకృష్ణ పండితుడు కూడ తలంచెను. కాని వాసిష్ఠుడు తపోవృత్తిని వీడుటకు ఇష్ట పడ లేదు.

కలువఱాయిలో మహాదేవుడు తండ్రి కొఱకు మామిడి తోటలో కుటీరమును సిద్ధ మొనరించెను. అందులో చేరుటకు 14-9-1934 తేది శుభ దినముగా నిశ్చయింపబడెను. కాని మహాదేవునకు రైల్వేలో ఉద్యోగమును చూపింతుమని ఆశ చూపి శ్రీ మరువాడ ప్రసాదరావు ఆ శుభ దినముననే నాయనను గైకొని ఖడ్గపురమునకు బయలు దేరెను.

మహాదేవుడు కూడ పండితుడు, కవి. 'వాసిష్ఠ' అను పేరుతో ఈయన తండ్రిగారి యసంపూర్ణమైన నవలను 'పూర్ణ' ను పూర్తిచేసినాడు. ఈయాన 'వృషాకపి', 'భోజనస్థానము' మొదలగు గద్య రచనలను, 'తోవూరుయుద్దము', 'అపర్ణ' మొదలైన నవలలను వ్రాసినాడు. ఈయన పద్య రచనము నందుకూడ సిద్దహస్తుడే. గణపతి స్తవము, ప్రహ్లాద చరిత్రము మొదలుగా పెక్కు కావ్యముల నీయన రచించినాడు. తంజావూరు సరస్వతీ మహలులో తెలుగు రీసెర్చి పండితుడుగా పనిచేయుచు విప్రనారాయణ చరిత్ర మొదలైన గ్రంథాలను సంపాదించి (Editing) ప్రకటించినాడు. శ్రీ అయ్యల సోమయాజుల వేంకటరమణ ఈయనను గూర్చి చెప్పిన మాటలు గమనింపదగియున్నవి. “........లౌకిక జీవనంలో ఆయనపడ్డ కష్టములకు అంతులేదు. నిత్య గంభీరుడు, శాంత స్వరూపుడు, కోమల హృదయుడు అయిన ఆ మహనీయునికి సంసారము ప్రతిబంధకముగా నుండెడిది. చేతికి ఎముక లేని ఆయన త్యాగానికి రాబడి చాలెడిది కాదు. అతను సంసారానికి అంటి ఉండెడివాడు కాదు. సంసారం అతనిని అంటి ఉండెడిది. నిరంతరము ధ్యానమగ్నుడై తనలో తానే ఎక్కువగా జీవించాడాయన. అంటీ అంటని జీవితాన్ని గడిపి, గీతలో చెప్పినట్లు సుఖదుఃఖాలను, మానావమానాలను సమానంగా భావించి, భరించి 20-3-1966 తేది ఆదివారంనాడు అకస్మాత్తుగా గుండెనొప్పితో కన్నుమూశారు.”[6]

ఇప్పుడు ఈయన కుమారుడు, నాయన మనుమడు “మైత్రా వరుణ” అను పేరుతో తాతగారి “ఉమాసహస్రము” నకు వ్యాఖ్య వ్రాసి “రమణజ్యోతి” పత్రికలో ప్రకటించుచుండుట సంతోషకరము.

  1. * నాయన - పుటలు 636 నుండి 645 వఱకు వాసిష్ఠ వైభవమ్ ఉత్తరభాగము - ప్రకరణము - 7
  2. * జయంతి సంచిక - సద్దర్శన సమీక్ష పుట 38
  3. * నాయన పుట 648
  4. * నాయన పుట 650
  5. * జయంతి సంచిక పుటలు 15, 16
  6. * జయంతి సంచిక - పుట 77