గణపతిముని చరిత్ర సంగ్రహం/శ్రీఅరవింద దర్శనము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

12. శ్రీఅరవింద దర్శనము

నాయన చెన్నపురము నుండి అరుణాచలమునకు మరలి వచ్చిన తరువాత, మహర్షి సంస్కృతమున రచించిన యుపదేశ సారమును చూచి దానియందలి గాంభీర్యమునకు, సౌలభ్యమునకు ఆశ్చర్యమును, ఆనందమును పొంది వెంటనే దానికి లఘువ్యాఖ్యను రచించి గురువునకు సమర్పించెను. అప్పటికి ఆశ్రమములోని పరిస్థితి నాయనకు సుఖకరముగా లేదు. గురువును దర్శించుచు సాయంకాలము లందు కొంతసేపు గడుపుచున్నను నాయన ఆశ్రమ వ్యవహారములలో గాని, భగవానుని ఎదుట జరుగు సల్లాపములలో గాని వెనుకటవలె పాల్గొనక త్వరగా మరలి వచ్చి, చూతగుహ యందే కాలక్షేపము చేయజొచ్చెను. కొందఱి వలన రమణాశ్రమము వ్యాజ్యములపాలై అక్కడి వాతావరణము కలుషితమై యుండుటచే వాసిష్ఠుడు అక్కడి వారితో మాటాడుటకూడ మానుకొనెను. ఆయనకు ఆ యూరు విడిచి కొంతకాలము ఎక్కడికైనను పోవలయునను తలంపు గాడమగు చుండెను. ఆ సమయమున నాయనను శ్రీఅరవిందుడు చూడగోరుచున్నాడని సుధన్వుడు లేఖ వ్రాసెను. దానిని నాయన రమణునకు రహస్యముగా చూపెను. "సరే వెళ్లి రండి" అని రమణుడు అనుజ్ఞ నిచ్చెను. అది నెపముగా నాయన 1928 ఆగష్టు రెండవ వారములో తిరువణ్ణామలై వీడుటకు సిద్ధపడు చుండగా సుధన్వుడు వచ్చి ఆయనను పుదుచ్చేరికి తీసికొని పోయెను.

1928 లో ఆగష్టునకు ముందు సుధన్వుడు ఉమా సహస్రమును శ్రీఅరవిందునకు పంపెను. దానిని సాంతముగా చదివి అతడు కావ్యకంఠుని చూడవలయునని శ్రీమాత వలన సుధన్వునకు తెలియజేసెను. అందువలన సుధన్వుడు అంత శ్రద్ద వహించెను. శ్రీఅరవిందుడు ప్రకటించుచున్న "ఆర్య" పత్రికను చదివినప్పటి నుండియు వాసిష్ఠుడు చాల యేండ్ల క్రిందటనే శ్రీఅరవిందుని తన పూర్వజన్మ తపస్సఖులలో నొకనినిగా గుర్తించి శిష్యులతో చెప్పు చుండెను. ఆతనిని దర్శింపవలయును అను కుతూహలము కూడా నాయనకు ఉండెను. ఈ సందర్భమున గుంటూరు లక్ష్మీకాంతము వ్రాసిన విషయము గమనింపదగియున్నది. "తనకంటె వయస్సున పెద్దవాడు, తపశ్శాలి, పూర్వజన్మ తపస్సఖుడైన శ్రీఅరవిందుని సందర్శించుటకు గాని, యతనికి నమస్కరించి యతని యాశీస్సు బడయుటకు కాని నాయన మనస్సు శంకించలేదు."[1]

ఇక్కడ ఒక విషయమును మనము పరిశీలింపవలసి యున్నది. నాయన పై యభిప్రాయములను శిష్యులతో ఇతరులతో అప్పుడప్పుడు వ్యక్తీకరించి యుండును. లేకున్నచో శ్రీ లక్ష్మీకాంతము పై విధముగా వ్రాయుటకు అవకాశము లేదు. ఇట్టి యభిప్రాయములను గూర్చి మహర్షి ఏమియు అనుకొనక పోయినను, ఆయన యొక్క భక్తులు అనుకొనుట అసహజము కాదు. మహర్షి మహాత్ముడు. మహాత్ముని భక్తులందఱు మహాత్ములై యుండరు. 'భగవానుడా! మాకు ఎవరును శరణము లేరు. మీరే మాకు శరణము. మమ్ము రక్షింపుడు. ఉద్ధరింపుడు' అని రమణుని ఆశ్రయించి యున్న భక్తులకు ఆయనకంటె అధికుడుగా గాని, సమానుడుగాగాని అప్పుడే ఒక డున్నాడు అని తలంచుట ఇష్టమై యుండదు. అట్లు తలంచుట అపరాధముగా కూడ అనేకులు తలంప వచ్చును. ఇది సంకుచిత భావము కావచ్చును. కాని అందఱు విశాల భావములు కలిగి యుండుట సంభవము కాదు. సూరి నాగమ్మ వ్రాసిన ఈ క్రింది విషయమునుబట్టి రమణునకు శ్రీఅరవిందునకుగల యంతరమును గూర్చి రమణ భక్తులు ఎట్లు గ్రహించు చుండిరో మనము గ్రహింప వచ్చును. 'ఈ మధ్య ఒకరు తమ స్నేహితులు సూక్ష్మశక్తి పరిణామములు చూడగలవా రున్నారనీ, వారు మహాపురుషుల సూక్ష్మశక్తి పరిణామాలు చూచారనీ, అందులో శ్రీఅరవిందుల సూక్ష్మశక్తి కాంతి ఏడు ఫర్లాంగుల దూరం వ్యాపించిందనీ, భగవాన్ సూక్ష్మశక్తి యొక్క కాంతి మూడు మైళ్ళవరకు చూడగలిగితినే కాని ఆ వెనుక ఎంతవరకు వ్యాపించినదో చూడలేక పోతిననీ, బుద్దుడు మొదలయిన వారిదెవ్వరిదీ ఇంత దూరం వ్యాపించ లేదనీ చెప్పినట్లుగా భగవత్సన్నిధిలో నివేదించారు.'[2] ఇట్టి యభిప్రాయములు రమణ భక్తులలో ప్రబలముగా నున్నప్పుడు వారు వాసిష్ఠుని యెడ ఆయన శిష్యుల విషయమున అసంతుష్టులై యుండుట సహజము.

ఆగష్టు 15 శ్రీఅరవిందుని జయంతి. నాయన అక్కడికి చేరునప్పటికి భక్తులు, ఆశ్రమ వాసులు శ్రీఅరవిందుని దర్శించుట ముగిసెను. నాయన రాక ముందుగానే తెలియుటచే శ్రీమాత శ్రీఅరవిందులు ఒక గదిలో కూర్చుండి యుండిరి. రెండు నిముసములు నాయన శ్రీఅరవిందుడు పరస్పరము చూచుకొనిరి. నాయన గజాననాంశ సంభవుడని శ్రీఅరవిందుడు. శ్రీఅరవిందుడు అద్బుత శక్తి తేజము కలవాడని నాయనయు అనుకొనిరి. పిమ్మట శ్రీమాత నాయనతో కూడ ధ్యానము చేయగోరెను. అట్లు వారు ముప్పావు గంట ధ్యానించిరి. 'నాయన నిశ్చయముగ గొప్ప యోగి' అని శ్రీమాత కపాలి శాస్త్రితో చెప్పెను. నాయన పుదుచ్చేరిలో ఒక వారముండెను. అప్పుడు ఆయన "జనని" అను గ్రంథమునకు పీఠికను, 108 సూత్రములతో "తత్త్వాను శాసన" మును రచించెను. రెండును శ్రీఅరవిందుని మెప్పును పొందెను.

నాయన తిరువణ్ణామలైకి తిరిగి వచ్చి డిసెంబరులో ఇంద్ర స్తోత్రమును రచించెను. ఈ సమయమున పొన్నుస్వామి అయ్యరు అను శిష్యుడు వాసిష్ఠుని యొద్దకువచ్చి తన్ను శ్రీమాత అనుగ్రహించి శ్రీఅరవిందాశ్రమమున చేర్చుకొనునట్లుగా లేఖ వ్రాసి ఇమ్మని ప్రార్థించెను. వాసిష్ఠుడు ఆమెకు ఇట్లు వ్రాసెను.

"భగవతీ! శ్రీమాతా!

దురదృష్ట వశమున నేను దూరమున నున్నను, నా మనస్సుచే నీ పాదములను స్పృశించుచునే యుంటిని. నాజీవిత యాత్రలో ధన్యతమమైన దివసమందు నీ తేజస్సెట్టిది చూడబడెనో అది మోహమును ఖండించు అంత:ప్రభ నా కిచ్చుగాక! నీ పుత్రుడు దూరముగా నుండెనని యుపేక్షింప వలదు. బహు సంవత్సరముల నుండి నీ చరణములను ధరించిన నే నెచ్చట నున్నను నీ సాన్నిధ్య మందున్నట్లెంచి యనుగ్రహించ వలెను.

మఱియొక మనవి. శ్రీఅరవిందుని యందు భక్తి గలవాడును, శ్రీమాతయందు దృడ విశ్వాసము గలవాడును, నాకు శిష్యుడును అయిన పొన్నుస్వామి అయ్యరు అభ్యనుజ్ఞను బొందుటచే ఈ పత్రము నీ జనుడు వ్రాసికొనెను. వానికి అభ్యనుజ్ఞ నిచ్చుటకు నీవు తగుదువు. వాడు ధన్యుడగు గాక.[3]

ఇట్లు,

నీ నిత్య భక్తుడు, హృదయ పుత్రుడు

వాసిష్ఠ గణపతి.

శ్రీమాత యందు నాయన ప్రకటించిన వినయ విధేయతలు భక్తి భావము రమణ భక్తులకు తెలియకుండ నుండవు. వారు దీనివలన ఆయన యందు అనాదరమును పొంది యుండుటయు సంభవించి యుండును.

ఈ సందర్భమున శ్రీఅరవిందుని సిద్దాంతములను గూర్చి భగవానుని భావము లెట్లుండెనో గ్రహించుట యుక్తము.

13-3-1936 తేది బొంబాయి నుండి వచ్చిన ఒక పెద్దాయన మహర్షితో ఇట్లనెను. "శ్రీఅరవిందాశ్రమమున నేను మాతను ఈ ప్రశ్నఅడిగితిని. భగవంతుడు తన నిజస్వరూపమున గోచరింపవలె నని నేను తలంపులు లేకుండ మనస్సును శూన్యమొనర్చు చున్నాను. కాని నా కేమియు కన్పించుట లేదు.' ఆమె యిచ్చిన సమాధానమున విషయము ఇట్లు వున్నది. 'పద్దతి సరిగానే యున్నది. పైనుండి శక్తి క్రిందికి వచ్చును. అది ప్రత్యక్షమగు అనుభూతి.' కాబట్టి ఇంకపైన నేను ఏమి చేయవలె?"

మహర్షి: నీవు ఏదిగా నున్నావో అట్లే యుండుము. పైనుండి క్రిందికి వచ్చునది కాని, అభివ్యక్త మగునదికాని ఏదియును లేదు. అహంకారమును తొలగించుకొనుటయే కావలసినది. ఏది యున్నదో అది ఎప్పుడును వున్నది. ఇప్పుడు కూడ నీవు అదిగానే యున్నావు. దానికంటె భిన్నముగా లేవు. ఆ శూన్యము నీచే చూడబడు చున్నది. దానిని చూచుచు నీవు వున్నావు. నీవు దేనికొఱకు వేచియుండ వలె? 'నేను చూడ లేదు' అను తలంపు, చూడ వలయునను నిరీక్షణ. దేనినో పొందవలయునను కోరిక - ఇవి యన్నియు అహంకారము యొక్క కార్యములు. నీవు అహంకారముయొక్క వలలో పడినావు. ఆ యహంకారమే వీని నన్నింటిని చెప్పుచున్నది. నీవు కాదు. నీవు నీవుగా నుండుము. అంతకుపైన ఏమియు లేదు."

13th March 1936.

183; A gentleman from Bombay said: I asked Mother in Sri Aurobindo Ashram the following question. 'I keep my mind blank without thoughts arising so that God might show himself in His true being. But I do not perceive any thing.'

The reply was to this effect: "The attitude is right. The power will come down from above. It is a direct experience."

So he asked what further he should do.

Maharshi: Be what you are. There is nothing to come down or become manifest. All that is needful is to lose the ego. That which is always there. Even now you are that. You are not apart from it. The blank is seen by you. You are there to see the blank. What do you wait for? The thought 'I have not seen', the expectation to see and the desire of getting some thing are all the workings of the ego. You have fallen into the snares of the ego. The ego says all these things and not you. Be your self and nothing more.*[4] 14-6-1936 తేది పార్సీ స్త్రీలు కొందఱు శ్రీఅరవిందుని యోగమును గూర్చి, వేద ఋషుల యనుభూతుల కంటె అధికమైన దానిని అన్వేషించితినని ఆయన చెప్పుటను గూర్చి, మఱియును ఉపనిషత్తులలోని ఋషులకు కలిగిన సాక్షాత్కారమును పొంది యుండుట తనకు శిష్యులుగా కాగోరిన వారికి అర్హతయని శ్రీమాత అభిప్రాయపడుటను గూర్చి ప్రస్తావించి వీనిపై మహర్షి యభిప్రాయ మేమని యడిగిరి.

"శ్రీఅరవిందుడు సమగ్రమైన శరణాగతి చేయుడని ఉపదేశించు చున్నాడు. మొదట ఆ పనిని చేసి ఫలమును నిరీక్షింతము. తరువాత అవశ్యకమైనచో ఇతర విషయములను గూర్చి చర్చింతము. ఇప్పుడు కాదు" అని మహర్షి శరణాగతిని గూర్చి చెప్పెను.

వారు మరల ఇట్లు ప్రశ్నించిరి, "దివ్య చైతన్యమును క్రిందికి తెచ్చుటను గూర్చి ఏమందురు?"

మహర్షి:- అది ఇప్పుడు మన హృదయమునందు లేనట్లా? "ఓ అర్జునా; నేను హృదయాకాశము నందు వున్నాను" అని శ్రీకృష్ణుడు చెప్పుచున్నాడు. "సూర్యుని యందు ఎవడు వున్నాడో ఆ పురుషుడు ఈ మానవుని యందు కూడ వున్నాడు" అని ఉపనిషత్తులోని మంత్రము చెప్పుచున్నది. "భగవంతుని రాజ్యము లోపల నున్నది" అని బైబిలు చెప్పుచున్నది. ఈ విధముగా భగవంతుడు లోపలనే యున్నాడను విషయమును అందఱును అంగీకరించు చున్నారు. క్రిందికి తేవలసినది ఏది? ఎక్కడ నుండి? ఎవడు దేని కొఱకు తేవలె? శాశ్వతము, సర్వగతమును అయిన వస్తువును గుర్తించుటకు అవరోధములుగా వున్నవానిని తొలగించుటయే సాక్షాత్కారము. వస్తువు వున్నది. దానిని ఒకచోటి నుండి మఱియొక చోటికి తీసికొని పోవలసిన పని లేదు."

14 th June 1936

200 Some Parsi Ladies asked for Maharshi's opinion of Sri Aurobindo's Yoga and his claim to have probed beyond the experience of Vedic Rishis and the Mother's opinion of the fitness of her disciples to begin with the realisation of the Upanishadic Rishis.

Maharshi: Aurobindo advises complete surrender. Let us do that first and await results and discuss further if need be afterwards and not now.

Devotees: What about bringing down Divine Consciousness from above.

Maharshi: As if the same is not in the Heart? "O! Arjuna, I am in the expanse of the Heart." says Sri Krishna. "He who is in the sun, is also in the Man" says a mantra in the Upanishads. "The kingdom of God is within" says the Bible, All are thus agreed that God is within, What is to be brought down? From where? Who is to bring what and why?

Realisation is only the removal of obstacles to the recognition of the eternal, immanent reality. Reality is. it need not be taken from place to place.[5] బి.వి.నరసింహస్వామి అను న్యాయవాది చెన్నపురము నుండి నాయన చరిత్రను అడిగి వ్రాసికొనుటకు వచ్చి ముందుగా మహర్షిని దర్శించి స్వీయ చరిత్రమును చెప్పుడని కోరెను. "నాయన చెప్పిన తరువాత నేను చెప్పెదను" అని మహర్షి యనెను. ఆయన నాయన యొక్క చరిత్రమును అంశముల రూపమున నాయన చెప్పుచుండగా వ్రాసికొనెను. అట్లే మహర్షి చరిత్రమును వ్రాసికొని ఆయన వెంటనే దానిని గ్రంథమునుగా పెంపొందించెను. నాయన చరిత్రమును అట్లు పెంపొందింపక అంశముల ప్రతిని గైకొని ఆయన ఆశ్రమము నుండి బయలుదేరు చుండగా భగవాను ఆయన యొద్ద నుండి దానిని గైకొని భద్రపరచెను. మహర్షి చరిత్రము "Self Realisation" (ఆత్మ సాక్షాత్కారము) అను పేరుతో ఆంగ్లమున ఆశ్రమము వారిచే ప్రకటింప బడినను, నాయన చరిత్రము విపులీకరింపబడ లేదు. భగవాను భద్రపరచిన యంశముల ప్రతి అట్లే యుండెను. నాయన స్వర్గస్థుడైన తరువాత కపాలిశాస్త్రి నాయన చరిత్రమును సంస్కృతమున వాసిష్ఠ వైభవమ్ అను పేరుతో రచించుచు అందులో మొదటి భాగమున ఆ యంశములను ఉపయోగించుకొనెను.

  1. * నాయన - పుట - 591
  2. * శ్రీ రమణాశ్రమ లేఖలు 53 స్వప్నాలు భ్రాంతులు పుట 95.
  3. * నాయన - పుటలు 602, 603. వాసిష్ఠ వైభవము - ఉత్తర భాగము ప్రకరణము - 4
  4. * Talks With Maharshi Pages 151, 152
  5. * Talks with Maharshi Page 168.