గణపతిముని చరిత్ర సంగ్రహం/ఉపసంహారము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

15. ఉపసంహారము

1935 ఆగష్టు మూడవ వారములో నాయన ఖడ్గపురమునకు పోయి ఆచాళ్ల పార్వతీశము యొక్క యింటిలో బస చేసెను. ఈ సమయముననే ఒకనాడు నాయన కంచి కామకోటి పీఠాధిపతులైన చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారిని దర్శించుట సంభవించెను. గోపాలశాస్త్రి (గోపదేవ్) అను యోగివలన ఈ సన్నివేశము ఏర్పడెను. గోపాలశాస్త్రి నైష్ఠిక బ్రహ్మచారి. ఖడ్గపురమునకు స్వామివారు వచ్చినప్పుడు ఇతడు స్వామివారిని దర్శించుచుండెను. ఇతడు నాయనను గూర్చి అంతకు పూర్వమే వినియుండెను. కాని, చూచి యుండలేదు. పండితు లెందఱో స్వామివారి దర్శనమునకు వచ్చు చుండగా నాయన రాలేదమని సందేహము కలిగి ఇతడు స్వామి వారినే అడిగెను. " వారు నిరపేక్షులు. అందువలన రాకయుందురు. అదియునుగాక వారు సంస్కరణ శీలురు. అందువలన రాక యుండవచ్చు" నని స్వామి, వారు వచ్చినచో తమకు అభ్యంతరము లేదనికూడ తెలిపిరి. గోపదేవుడు నాయనయొక్క నివాస స్థానమును తెలిసికొనిపోయి ఆయనను దర్శించెను.

నాయనయొక్క రూపము గోపదేవుని మిగుల నాకర్షించెను. ఈ సందర్భమున గుంటూరు లక్ష్మీకాంతము చిత్రించిన నాయన రూపమును గ్రహించుట సమంజసము. "ఇదున్నర అడుగుల యెత్తుగలిగి బక్క పలుచగా నున్నను, బంగారు బొమ్మవలెనున్న ఈ మానవాకృతి యెట్టివారి దృష్టినైన నరికట్టి యాకర్షించెడిది. విశాలమైన ఫాలము, బట్టతల, పూర్ణవికాసమును స్ఫురింపజేయు తీరుగల శిరస్సు, విజ్ఞాన దృక్కులను ప్రసరించు నేత్రములు, గాంభీర్యము నిచ్చు కనుబొమలు, సన్నని మీసము, పలుచగా వ్రేలాడు చిన్న గడ్డము గల నాయన యాకృతి గతయుగమునకు చెందిన ఋష్యాకృతి నెట్టివారికైన స్మరణకు దెచ్చుచుండెడిది. పిల్లలకు, పెద్దలకు, వృద్ధులకు గూడ నాయనను జూచుసరికి పేరునకు తగినట్లు పితృభావము స్ఫురించి, బిడ్డలవలె శరణు బొందుటకు చిత్తము ప్రేరేపించుట యామూర్తి విశేషము. అందుల కనుగుణముగా నాయన చూపునందేగాక యావత్తు ముఖవికాసము నందు వెల్లువలైనట్లు వాత్సల్యానుకంపము లవ్యాజముగా నుట్టి పడుచుండెడివి. ఇక కంఠము విప్పినచో ఘంటానాదము ద్వనించి, సత్యప్రకర్షతో గూడి అధికారయుతమైనను మధురరస పూరితములగు మాటలు వెడలి హృదయ సమావర్జన మొనర్చుచుండెడివి. ఆ యోజస్సునందు గౌరవముతోపాటు చనువు బుట్టించు విశేష ముండెడిది. చిఱునవ్వు మాటిమాటికి వెల్లివిరిసి, కలకల ద్వనులతో గిలిగింతలు పెట్టుచున్నట్లుండి సంతోషమును వ్యాప్తిజేయు చుండెడిది".....[1]

ఇట్టి మనోహరమైన యాకృతి గోపదేవు నాకర్షించుటలో ఆశ్చర్యములేదు. నాయన గోపదేవుని మిగుల నాదరించి, అతని యభ్యర్థనము ననుసరించి అతనితో స్వామివారి యొద్దకు పోయెను. అక్కడ నాయన భక్తి శ్రద్దలతో పీఠమునకు స్వామివారికి దండ ప్రణామము లాచరించి సంస్కృతములో వారిని స్తుతించెను. స్వామివారుకూడ నాయనను చక్కగా నాదరించిరి. వారికిరువురకు నాలుగు గడియలు (96 నిముసములు) సంస్కృతమున సంభాష ణము సరసముగా సాగెను. స్వామివారు చాలా సంతోషించి తగినట్లుగా సత్కరించిరి.[2]

1-9-1935 తేది వినాయక చతుర్థియందు నాయననే విఘ్నేశ్వరునిగా ఫీఠము పైనుంచి భక్తులు కొందఱు షోడశోపచార పూజలను చేయవలయునని అభిలషించిరి. వారి యుత్సాహమును భంగపఱచుటకు ఇష్టములేక నాయన తనకు ఇష్టము కాకున్నను అందులకు అంగీకరించెను. మహోత్సవముగా భక్తులు నాయనను గణపతినిగా పూజించిరి. అలవాటు చొప్పున పురోహితుడు ఉద్వాసన మంత్రములను కూడ పఠించెను. నాయనకు నవ్వువచ్చెను. కాని అది అపశకునమే అయ్యెను.

తరువాత కొన్ని దినములకు నాయన మనుమని బాలసారె కొఱకు కలువఱాయికి పోయెను. అప్పుడు ఆయన చేతియందు యాదృచ్చికముగా చేరిన రాగి నాణెము స్వవర్ణముగా మాఱెను. అప్పటికి రేణుకాదేవి ఆజ్ఞాపించిన దీక్షను పొందుటకు అర్హత కలిగిన దని నాయన సంతసించెను. 21-9-35 తేది నాయన మరల ఖడ్గపురమున పార్వతీశముయొక్క ఇంటికి చేరెను. నాయన తపస్సుకొఱకు ఒక యాశ్రమమును నిర్మింపదలచి అక్కడి భక్తులు డిసెంబరులో నాయనచే దానికి శంకుస్థాపన చేయించిరి. అంతవరకు గుట్టుగా నుంచబడిన స్వర్ణసిద్దిని ప్రసంగవశమున నాయన వెల్లడి చేసెను. పార్వతీశము మొదలగువారు ఆ మహిమను చూచుటకు కుతూహలపడిరి. ఆ రాత్రి నాయన అందరు చూచు చుండగా ఒక అర్ధణాకాసుకు (ఇది అప్పుడు రూపాయి సైజులో ఉండెడిది) తన చెమటను పట్టించెను. అది మొదట మాడినట్లుగా ఉండి క్రమముగా పసుపురంగును పొంది బంగారముగా అయ్యెను. అప్పుడీ యోగసిద్దిని లక్ష్మికాంతము ప్రసాదరావు మొదలుగా అనేకులు స్పష్టముగా చూచిరి. ఆ నాణెము కొఱకు వారిలో ఆశ కలుగుటను చూచి నాయన ఆ కాసును లక్ష్మికాంతముచేత డొంకలో విసిరివేయించెను.*[3]

శ్రీ బి.ఎస్. రామారావు నాకు 21-4-91 తేది వ్రాసిన లేఖలో ఈ సందర్భమును ఇట్లు వివరించెను. " ఆ coin (నాణెము) యిచ్చింది నేనే. ప్రతిరోజు వారికి (నాయనకు) మధ్యాహ్నం apple (ఆపిల్ పండు) తెచ్చియివ్వటం నావిధి. ఆనాడు apple పండు కొన్నప్పుడు రెండు అణాల బిళ్ళ యిస్తే విక్టోరియా (బొమ్మ ఉన్న) అర్దణా pure copper (స్వచ్ఛమైన రాగి) వచ్చింది. వారు పండుకై చేయి జాపారు. పండుతో ఆ coin (నాణెము) వారి చేతిలో విడిచాను. వారు పరధ్యానంగా మాట్లాడుతూ మరచి పోయారు కబుర్లు చెపుతూ. అరగంటతర్వాత Mrs. Kantham (లక్ష్మికాంతముగారి భార్య) పండు అడిగి తీసుకుంది. క్రిందనున్న coin రంగు మారింది - స్వర్ణం వైపు. వారు చకితులై మంచం మీదనుంచి దిగి- "ఛీ! పిశాచీ" అని ఆ Coin ను Drain Pipe (gutter మురుగు కాలువ) లో జారవిడచి నన్ను మందలింపు చూపే చిఱునవ్వుతో సత్కరించారు. వారు ఎప్పుడూ ఈ విద్యను ప్రదర్శించలేదు...శిష్యులు ఆప్తులు ఈ విద్య చూడ ఇచ్చగించినప్పుడు ఎక్కడైనా ఒక్క నాణెం వారు సృజించి వారికి చూపారేమో......యీ విద్వుద్వ్యయం (నాణెము బంగారముగా మారునప్పుడు శరీరములోని విద్యుచ్ఛక్తి కొంత వ్యయమగును) శరీరమును కాల్చేటంతటి క్షోభ కలుగ జేస్తుంది......"

పై లేఖలో కుండలీకరణములలో ఉన్నమాటలు నేను చేర్చినవి.

పార్వతీశము యొక్క బావమఱది కృష్ణరావు పదియేండ్ల వయస్సులో ఆ సమయమున ఆరవ తరగతి చదువుచు బావగారి యింటిలో ఉండేను. అప్పుడు నాయనతో తనకు కలిగిన యనుభవములను స్మరించుచు అతడు ఇటీవల నాయనను గూర్చి ఆంగ్లవ్యాసమును భారతీయ విద్యాభవనము వారిపత్రికలో ప్రకటించెను.*[4]

ఒకనాడు అక్క కృష్ణరావును శిక్షించుచు ఇంటినుండి గెంటివేసి తలుపు గడియ వైచెను. కృష్ణరావు తలుపును తట్టుచు ఏడ్చుచుండెను. నాయన తలుపు తీసి అతనిని కౌగిలించుకొని కన్నీళ్ళు తుడిచి ఆమెను పిలిచి, "అమ్మా! పిల్లవానిని ఇంతగా శిక్షించుట తగదు. వీడే ఒకనాటికి మంచి వాడగును" అని చెప్పి అతనిని ఓదార్చెను.

కృష్ణారావు బావగారికి కలిగిన యొక అనుభవమును కూడ అ వ్యాసములో వివరించినాడు. రమణ భగవానునితో తనకు చాల చనువు వుండెడిదని, ఇద్దఱును కలిసి తపస్సు చేయుచుండెడి వారని, ఆ సమయములో వారు ఎన్నో అవమానములను భరింప వలసి వచ్చెడిదని నాయన పార్వతీశమునకు చెప్పుచుండెడి వాడు. పార్వతీశము నాయన యందు గాడమైన భక్తి కలవాడే అయినప్పటికి ఆతనికి నాయన మాటలు అతిశయోక్తులుగా తోచుచుండెడివి. నాయన స్వర్గస్థుడైన పిదప 1937 లో అతడు తిరువణ్ణామలైకి పోయి రమణ భగవానుని దర్శించెను. నాయన చెప్పినదంతయు నిజమేనా అని భగవానుని అడుగ వలయునని అతడు తలంచు చుండెను. కాని అడుగ లేదు. భగవానుడు చుట్టున్న వున్న భక్తు లందఱను కలయ జూచి ఒక్క క్షణము అతని వైపు నిశితముగా చూచి సొరుగులో నుండి ఒక పుస్తకమును తీసి తెఱచి చూపెను. ఆ పుటలో కూర్చుండియున్న నాయన బొమ్మ వున్నది. ఆ బొమ్మను చూపుచు భగవాను డిట్లనెను. "ఇది నాతోకూడి తపస్సు చేయుచు ఎన్నియో అవమానములను పొందిన మహనీయుడగు నాయన యొక్క బొమ్మ, ఆకలి యైనప్పుడు మేము కొన్ని సమయములలో అగ్రహారము లోనికి భిక్ష కొఱకు పోవుచుంటిమి. ఒక్కొక్కప్పుడు జాలిగల తల్లులు ఏదైన పెట్టుచుండెడి వారు. ఇంకొకప్పుడు తిట్టి తఱుముచుండెడి వారు."

" This is the picture of Nayana, a great soul who did tapasya with me and suffered several indignities. Some times when we would feel hungry, we would go to the Agraharam for alms. Some times a kind hearted mother would give us some thing to eat, but at other times they would drive us away hurling abuses." ఆ మాటలను భగవానుడు తన్ను ఉద్దేశించియే చెప్పెనని గ్రహించి, నాయన మాటలను తాను నమ్మనందులకు భగవానుడు తన చెంపపై కొట్టినట్లుగా పార్వతీశము భావించి పశ్చాత్తాపమును పొందెను.

దీనిని బట్టి నాయనకు భగవానుని యొద్దగల చనువు, నాయన యందు భగవానునకు గల ప్రేమ చాల గాఢముగా నుండెనని స్పష్టమగు చున్నది.

22-3-1935 తేది నాయన కలకత్తాకు లక్ష్మికాంతముతో వెళ్ళెను. అక్కడ ఒకనాడు నేమాని సూర్యనారాయణ ఒక బీగమును నాయన శిరస్సునకు అడుగున్నర యెత్తున రెండు మూడు నిముషములు పట్టుకొనిన పిదప విద్యుత్ర్పయోగముచే అది అయస్కాంతమువలె నయ్యెను. అప్పు డతడు కొన్ని గుండుసూదులను తెచ్చి దాని సమీపమున నుంచెను. అది అయస్కాంతము వలెనే గుండు సూదులను ఆకర్షించుటను అతడు అందఱకు చూపెను.

అక్కడ నాయన విశ్వమీమాంసకు తాత్పర్యము, ఆత్మకథ, పూర్వకథ తెలుగులో రచింప నారంభించెను. ఈ సమయమున లక్ష్మికాంతము మొదలగువారికి ఎన్నో విషయములను బోధించెను. స్వలాభములేని కర్మలు సకామ్యములైనను గొప్పవే అని; ఇటీవలి వారు జ్యోతిష యుగములకు, ధర్మ యుగములకు గల భేదమును గుర్తింపలేదని; వైదికమత ప్రామాణ్యమునకు ఇతర మతము లేవియు సరికావని; బుద్దుడు నాస్తికుడుగా పరిగణింప బడినను వేదమతానుయాయులు వేదములను విచక్షణముతో విమర్శించి గ్రహింప వలయునను తలంపుతోనే వేద ప్రామాణ్యమును నిరసించెనని; కర్మలందు వినియోగింపబడుచున్న పెక్కు మంత్రములను ఆధ్యాత్మ పరముగా వ్యాఖ్యానింప వలసిన యావశ్యకత యున్నదని ఆయన వారికి వివరించి చెప్పెను.*[5]

25-4-1936 తేది తనకు ఇష్టము లేకున్నను, ఖడ్గపురము వారు వచ్చి తొందర జేయగా నాయన అక్కడ నిర్మింపబడిన యాశ్రమములో నుండుటకు బయలుదేరి వెళ్ళెను. అది నింపురా చివఱ నుండెను. వేదుల రామమూర్తి, పార్వతీశము, నేమాని సూర్యనారాయణ మొదలగువారి యిండ్లు అన్నియు దానికి రెండు మూడు మైళ్ళ దూరములో నుండెను. అందువలన నాయన సేవ యందు అనుక్షణము శ్రద్ద చూపుటకు వారికి అవకాశము లేకుండెను. ఆశ్రమ నిర్మాణము నందు, నిర్వహణము నందును రామమూర్తి ప్రధాన భాధ్యత వహించి యుండెను. ఆశ్రమ విషయములలో మొదట ప్రగల్భములు పలికిన వారెవరును సాయము చేయుటకు ముందుకు రాకుండిరి. భారమంతయు రామమూర్తి పైననే పడెను. అప్పటికి ఆశ్రమము పేరుతో ఒక పాక మాత్రమే ఏర్పడి యుండెను. అక్కడ వంట చేయుటకు ఏర్పాట్లు లేకుండెను. సమీపమున సోమయాజుల సూర్యనారాయణ అను గృహస్థు వుండెను. ఆయనకు జీతము తక్కువ, కుటుంబ భారము ఎక్కువ. ఆయన యింటి యందు నాయనకు పగటి పూట భోజనము ఏర్పఱచి, రాత్రిభోజనము కొఱకు రొట్టెలను ఒక జనవాసము నుండి (colony) పంపు చుండిరి. శనివారములలో మధ్యాహ్నము కార్యాలయములలో (Offices) పనులు ముగిసిన తరువాత శిష్యు లందఱు నాయన యొద్దచేరి హోమము సల్పుచుండిరి. పిదప నాయన బోధించుటయో లేక పరస్పరముగా చర్చలో జరుగు చుండేడివి.

నాయన పరిచర్యల కొఱకు సింహాలు అను వ్యక్తి కలువఱాయి నుండి వచ్చెను. యోగ యుక్తమైన (నాయన శరీరమునకు పాల కంటె తియ్యని పండ్ల రసము ఆవశ్యకము. అప్పుడప్పుడు బత్తాయి నారింజ పండ్లను నాయనకు తెచ్చియిచ్చు చుండిరి. అవి పుల్లగా నుండునని కాబోలు నాయన వానిని ముట్టకుండెను. అందువలననే సింహాలు నాయనకు పండ్ల రసమే అక్కఱ లేదని తలంచెను. భోజనము నందు నాయనకు చిక్కని మజ్జిగ కూడ అమరకుండెను. క్రమముగా ఉష్ణ మధికమై భుజము క్రింద సెగ గడ్డవంటి యొక వ్రణము పైకి లేచెను. అప్పుడైనను అంత ఉష్ణము ఎందులకు కలిగెనని ఎవరును విచారింపకుండిరి. ఆ గడ్డ అణగిపోయిన తరువాత నాయనకు అతిమూత్ర వ్యాధి పైకివచ్చెను. "నే నిక్కడ మూడు మాసములు వుందును" అని నాయన ప్రసంగ వశమున సూర్యనారాయణతో చెప్పెను. ఆది నాయన శరీరమును వీడుటకు సూచన అని అప్పుడు ఎవ్వరికిని తోచలేదు. అట్లే నాయన సింహాలుతో ఒకనాడు 'నా దివ్య శరీరము సుఘటితమై, స్థూల బంధమునువీడి, నాకు వశమైయున్నది. సిద్ద పురుషస్థితి ప్రాప్యము కానున్నది' అని చెప్పెను.*[6] అదిఏదో యోగ రహస్య మనుకొని అతడు ఆ మాటను ఎవరికిని చెప్పలేదు. శ్రీ సోమయాజుల సూర్యనారాయణగారు తెలిపిన యొక వృత్తాంతమున నాయనకు గల యతీంద్రియ శక్తులెట్టివో వ్యక్తమగుచున్నది. "ఎండలు చాలా తీవ్రముగా ఉన్నవి. ఒకరోజు సాయంత్రము నేను నా అలవాటు చొప్పున ఆశ్రమమునకు వచ్చినాను. నాయనగారు ఖిన్నులై విచారముగా నున్నారు. నేను భయపడి కారణమడుగగా, ఆశ్రమములో సదుపాయము లన్నియు సరిగానే ఉన్నవి. కాని ఈ రోజున అబిసీనియా చక్రవర్తి హెవీస లాపిన్ రాజ్యభ్రష్ఠుడై భార్యాబిడ్డలతో బ్రిటీషువారు "అసైలము" (Asylum రక్షణస్థానము) ఇవ్వగా పోవుచున్నారు. ఆ దృశ్యము కనపడగా విచారము వచ్చినది. కాని బ్రిటీషువారే వీనికి 5 సంవత్సరముల తరువాత తిరిగి రాజ్యము ఇప్పించుతారు. అందుచే విచారము తగ్గినది అనెను" అలాగే జరిగినది.

వీరు తెలిపిన మరియొక వృత్తాంతము వలన నాయనకు లౌకికవిధి నిర్వహణమున ఎంత శ్రద్ద యుండినదో వ్యక్తమగు చున్నది. "ఒక రోజున నేను సాయంకాలము ఆశ్రమానికి వచ్చి ఇవతల వరండాలో కూర్చుని సంధ్యావందనము చేసికొనుచుండగా వచ్చి చూచి సంధ్యావందనము అయిపోయింతర్వాత "నీవు ఆఫీసులో పనిపాటలు సరిగా చేసిన తర్వాత సంధ్యజపము చేస్తే మంచిదే కాని ఆఫీసులో పనిపాటలు సరిగా చేయకుండా ఇంటికి వచ్చి జపముచేస్తే లాభములేదు. ఆఫీసులో పనులు మైమరచినట్లు చేయాలి. అలాగు చేయనిచో భగవంతుడు నిన్ను క్షమించడు."*[7] శిష్యులను సరియైన వర్తనము నందుంచుట గురువులకు కర్తవ్యము. అట్టియెడల గురువులు శిష్యులయెడ మొగమోటమితో వారి లోపములనుచూచి యుపేక్షింపరాదు. నాయన కర్తవ్య నిర్వహణమున ఎంత శ్రద్ద కలిగియుండెనో దీనివలన వ్యక్తమగుచున్నది.

నాయన ఆరోగ్యము క్రమముగా క్షీణింప జొచ్చెను. 21-7-1936 తేది మధ్యాహ్నమున నాయనకు మాటాడుటకుకూడ శక్తి లేకుండ పోయెను. నేమాని సూర్యనారాయణ అ స్థితిలో నాయనను చూచి భయపడి రమణమహర్షికి, మహాదేవునకు తంతి వార్త పంపించి లక్ష్మికాంతమునకు టెలిఫోనులో తెలిపెను. లక్ష్మికాంతము భార్యతో ఏపిల్ పండ్లను, గ్లూకోజు డబ్బాలను గైకొని ఆశ్రమమునకు మఱునాడు ఉదయము చేరెను. వారు అరగంట కొకసారి పండ్లరసము, గ్లూకోజు ఇచ్చుచుండగా నాయనకు నీరసము తగ్గెను. మధ్యాహ్నము ఒంటిగంటకు నాయన మంచమునుండి లేచి వస్త్రములు మార్చుకొని వరండాలోనికి నడువగలిగెను. ఇంతలో పెద్ద వర్షము కురిసి పాకయంతయు తడియ జొచ్చెను. పాకనుండి పార్వతీశముయొక్క ఇంటికిపోవుట మంచిదని లక్ష్మికాంతమనగా నాయన "రేపు శనివారము మధ్యాహ్నము రెండున్నర గంటలకు ఇక్కడనుండి వెళ్ళుటకు బాగుండును" అని స్పష్టముగా చెప్పెను. అది నిర్యాణమునకు ముహూర్తమని అప్పుడు ఎవ్వరికి తోచలేదు.

డజన్లకొద్దిగా ఏపిల్‌పండ్లను తెప్పించి నాయన మాట ననుసరించి రసమును తఱచుగా ఇచ్చుచుండిరి. వైద్యుడు వచ్చి చూచి నీరసము చాలవరకు తగ్గెనని చెప్పెను. పిమ్మట చీకటి పడుచుండగా శ్రీ రమణాశ్రమమునుండి నిరంజనానందస్వామి పంపిన తంతి వచ్చెను. " మీ రిచ్చిన రెండు టెలిగ్రాములు భగవాన్ తనయొద్ద నుంచుకొని సమాధానము పల్కలేదు." అని ఆ తంతి యందు ఉండెను. నాయన దానిని అందుకొని చించిపారవేసెను.*[8]

శ్రీ రమణాశ్రమము నుండి వచ్చిన తంతిని నాయన చింపి వేయుట ఆశ్చర్యకరము. ఆయన ఎందులకు అట్లు చేసెనో తెలియదు. మహర్షి ఏదైన సందేశమును తనకు అందింపుడని చెప్పి యున్నను ఆశ్రమమువారు అట్లు చేయలేదని ఆయన శంకించి కోపముతో అట్లు చేసియుండునేమో అని యూహింపవలసి యున్నది. లేకున్నచో గురువు దగ్గఱ నుండి వచ్చిన వార్తగల పత్రమును చింపి నాయన అనాదరమును ప్రకటించునా?

అప్పటికే కలువఱాయి నుండి మహాదేవుడు వచ్చియుండెను. ఆఫీసులో ముఖ్యమైన పని యుండుటచే వెంటనే తిరిగిరావచ్చునను తలంపుతో లక్ష్మికాంతము కలకత్తాకు పోయెను. అత్యుష్ణమువలన నాయనకు వారము రోజుల నుండి విరేచనము కాకుండెను. పండ్ల రసము వలన 25 వ తేది శనివారము ఉదయమున అయిదారు విరేచనములు అయి మలమంతయు వెలువడెను. అప్పుడు నాయన తెరపినబడి తేలిక నొందెను.

మధ్యాహ్నము ఒంటి గంటన్నరకు శిష్యులందఱు శనివార హోమమునకు వచ్చిరి. వారు హోమము చేయుచుండగా నాయన మంచము నుండి దిగి వారితోపాటు ఆసనబద్దుడై కూర్చుండెను. తరువాత శిష్యులను పంపి మంచముపై పండుకొని మధ్యాహ్నము రెండున్నర గంటలకు, ఉత్తరీయమునువలె, శరీరమును అనాయాస ముగ వదలి "అంతకు పూర్వమే సిద్దమైయున్న తన దివ్యామృతమయ శరీరమును వహించి యనామయ పదమును బొందెను."*[9]

గుంటూరు లక్ష్మికాంతము వర్ణించినట్లుగా నాయన 'నవయుగ యోగి చక్రవర్తి' అనుట యథార్థము. కపాలసిద్దితోపాటు ఆయన సాధించిన సిద్దులు అనేకములు. ఆయన చేసిన తపస్సు అసామాన్యము. శ్రీరామకృష్ణునకు వివేకానందునివలె శ్రీ రమణ భగవానునకు నాయన ప్రియతమ శిష్యుడై గురువు యొక్క కీర్తిని, సందేశమును దేశమున నలుమూలల వ్యాపింపజేసి గురు ఋణమును తీర్చుకొని చరితార్థు డయ్యెను.

శ్లో|| జయతు భరతక్షోణీఖండం విషాద వివర్జితం
    జయతు గణపస్తస్య క్షేమం విధాతుమనా ముని:
    జయతు రమణస్తస్యాచార్యో మహర్షి కులాచల:
    జయతు చ తయోర్మాతా పూతా మహేశ విలాసినీ||

భరతఖండము విషాద వివర్జితమై జయము నొందునుగాక. దానికి క్షేమము కలిగింపవలయునని తలంచుచున్న గణపతి జయము నొందునుగాక. అతనికి ఆచార్యుడును మహర్షి కులాచలుడును అయిన రమణుడు జయము నొందును గాక. వారి కిరువురకును తల్లియైన మహేశ విలాసిని ఉమాదేవి జయించుగాక.

||శుభమస్తు

  1. * నాయన పుట 728, 729
  2. పండిత గోపదేవ ఆత్మచరితము-గోపదేవ్ Printed by ఆర్య సమాజము కూచిపూడి-1983-పుటలు 164, 165, 166
  3. * నాయన-పుటలు 700, 701
  4. * Bhavan's Journal Vol, 32, No. 9, Dec. 15-1985-NAYANA THE SAINT- A.K. Rao
  5. * నాయన పుటలు 708 - 714
  6. * నాయన పుట 719
  7. * జయంతి సంచిక - " నాయనగారితో నా పరిచయము" - సోమయాజుల సూర్యనారాయణ - పుట 33
  8. * నాయన పుట - 725
  9. * నాయన పుట 728