Jump to content

కోనంగి/సప్తమ పథం

వికీసోర్స్ నుండి


సప్తమ పథం

ఏ దారి?

27వ డిశంబరు 1940 సంవత్సరంలో సినిమా పూర్తి అయింది. సినీమా కంపెనీ జీతం కోనంగికి 3000/-లు గిట్టినాయి. కోనంగి భాగ్యవంతుడయ్యాడు. అతనికి నాయికగా నటించిన సినీమాతారకు రు.10,000/-లు జీతము దొరికింది. అందుకు అతనికిని సంతోషమేకాని ఏమీ విచారంలేదు.

తనకు సినీమా ఇంతటితో సరి అనుకున్నాడు. తాను మంచి అభినయవేత్త కాక కాదు. వీరి బొమ్మ చూచి, ఒక డిస్టిబ్యూటింగ్ కంపెనీ వారు వెంటనే ఆ చిత్రాన్ని నాలుగున్నర లక్షల రూపాయలకు కొన్నారు. పత్రికలన్నీ కోనంగి పాటకూ, అభినయానికి ఎంతో మెచ్చుకున్నాయి.

ఆంధ్రపత్రిక: “దుక్కిటెద్దులు” చిత్రం చాలా బాగా ఉన్నది. ఇంతవరకూ తెలుగు చిత్రాలలో ఇంత అద్భుతమైన చిత్రం రాలేదని మేము చెప్పగలం. కథ చక్కగా నడిచింది. కథ సంవిధానంలో, నడకలో ఒక విశిష్టత పైచిత్రంలో ఉంది.

తారలలో నాయకుడూ, నాయికా చక్కగా నటించారు. మొదటి బహుమానం నాయకుడుగా అభినయించిన కోనంగిరావుగారిది. అక్కడక్కడ సంభాషణలో లేని హాస్యం వాచ్యాభినయంవల్ల ధ్వనింప చేసేవారు.

“గంభీరమైన విషాదపూరిత నటన, పెదవి చివరలు తిప్పడంలో, కన్నులర మూతలలో, మొగం వంచడంలో, ఒక చిరునవ్వు ప్రసరించడంలో ధ్వనింపచేశారు.”

“ఇప్పుడు సాధారణ భారతీయ ఫిల్ములలో కథానాయకుల నభినయించేవారు కోనంగిరావుగారి అభినయాన్ని చూచి ఎంతో నేర్చుకోవాలి-” అలాని వ్రాసింది.

ఆంధ్రప్రభ కోనంగిని ఆకాశంకి ఎత్తివేసింది.

ఈ బొమ్మంతా చూచి, పత్రికల అభిప్రాయాలు చదివి, ఒక గొప్ప అరవ కంపెనీ వారు కోనంగికి నాయకుని వేషం యిస్తామనీ, ఇరవైవేల రూపాయలు జీతమిస్తామన్నారు. ఎంతో మోమాటము పెట్టినారు. కోనంగికి జీతం తక్కువ అనుకుంటున్నాడేమోనని, ఏదో పేరుపెట్టి ఇంకో పదివేలు ఇస్తామన్నారు.

“దుక్కిటెద్దులు” చిత్రం దేశంలో డబ్బుదోయడం సాగించింది.

కోనంగికి సినీమాలో ఉండాలన్న వాంఛ క్రిందకు జారి పడిపోయింది. తాను నాయకుడుగా అభినయించే రోజులలో, నాయికవేషం వేసిన అమ్మాయి-అసలు పేరు వేదమ్మాళ్. మన కంపెనీవారు ఆమెకు మిస్ వాణి అని పేరు పెట్టినారు.

వాణీదేవి కోనంగిని గాఢంగా వాంఛించింది. ఆ విషయం మొదటి నుండి అతనికి తెలుసు. అదీకాక చిత్రంతీయడం సాగినది. ఒకనాడు ఆమె ఇతరులకు తెలియకుండా, ఇతరులు వినిపించుకోకుండా “రేపు మా ఇంటికి రండి, రేపు సాయంకాలం మూడు గంటలకు ఎవరూ వుండరు” అని అన్నది.

“ఎందుకు వాణీదేవిగారూ?”

“అదేమిటంటీ అట్లా అంటారు? ఎవరన్నా భార్యను అట్లా అడుగుతారా?”

“భార్యేమిటి, భర్తేమిటీ?”

“మీరు భర్తా నేను భార్యను కానా?”

“అదేమిటండోయ్, అలా అంటున్నారేమిటి?”

“మొన్న సెట్టింగులో మనం చేసుకున్న పెళ్ళిమాట?”

“అదా!” పకపక నవ్వినాడు కోనంగి, “ఆయన మీ నాన్నేనా, ఆవిడ మీ అమ్మేనా?”

“అలాగే మీరు ఒప్పుకుంటే?”

“నేను ఒప్పుకునేదేమిటి వాణీదేవీ? నువ్వు భార్యగా, నేను నీ భర్తగా లోకం అంతా చాటింపయిపోతుందిలే, బొమ్మ విడుదల కాగానే!”

“అది అలా ఉంచండి! నేను మిమ్మల్ని మూడంటే మూడే ప్రశ్నలడుగుతాను. దాచక, అబద్ధమాడక జవాబులు చెప్పండి.”

“అలాగే! నాకు తెలిసివుంటే చెప్తాను. అవి ఇంకోరికి సంబంధించిన రహస్యాలైతే చెప్పను.”

“ఒకటి: మీరు నన్ను ప్రేమిస్తున్నారా, లేదా?”

"ఆ ప్రశ్న నీ కెందుకు కలిగింది? నాటకంలో ప్రేమ నిజమైన ప్రేమ అనుకున్నారా మీరు?”

“ఒకమాటు 'మీరు' ఒకసారి 'నువ్వు' మార్చకండి. నన్ను “నువ్వూ' అంటేనే మంచిది.”

“నన్ను గౌరవంచేస్తూ మాట్లాడితే నేనూ అలాగే మాట్లాడుతున్నాను.” “నేను భార్యను. నన్ను మీరు గౌరవం చేయకూడదు.”

“మళ్ళీ భార్య అంటారేమిటి? సరే కానియ్యి. నువ్వే అంటాను. అంతమాత్రంవల్ల నేను మొద్దు తలకాయను కానులే. ఇంక ఏమిటీ?”

“నా మొదటి ప్రశ్నకి జవాబియ్యరేం?”

“మొదటి ప్రశ్నా? నీ మొదటి ప్రశ్నా? ఏమిటదీ? అవునవును. నేను నిన్ను ప్రేమిస్తున్నానా లేదా అని కాదూ? ఉహూఁ? ఏమీ ప్రేమించడం లేదు.”

“అయితే ఈ ప్రశ్న విషయంలో కొంత చర్చ చేయాలి.”

“ఏమి టా చర్చ?”

“ఏముంది! ఎందుకు ప్రేమించడంలేదు. చేయకపోతే, ఇప్పటికి నాల్గయిదు నెలలనుంచి ప్రేమిస్తున్నట్లు ఏలా అభినయం చేయగలిగినారు? మొట్టమొదట నన్ను ప్రేమించటంలేదని నాకు స్పష్టంగా తెలిసింది. అప్పటి మీ అభినయం అర్థమయింది నాకు.”

“తర్వాత అంతే! మొదట అభినయం చేయడం నాకు చేతకాదు, తర్వాత చేయగలిగాను. అదే తేడా!”

“ఆబద్దాలాడకండి! ఈ విషయం అంతా మా ఇంటిదగ్గిర చర్చించు కుందాం రండి!”

ఆ బాలిక ఇంటికి ఎలాగో తాను వెళ్ళడమూ, అక్కడ ఆ అమ్మాయి అప్సరసలా వేషం వేసుకుని తన్ను సుడిగుండంలా కౌగిలించుకోవడమూ అయింది. అతనికి మొదట ఆశ్చర్యము, తరువాత కొంచెం రక్తం ఉడుకెత్తడమూ జరిగింది. అతడు బ్రహ్మాండముమీద ఆమె కౌగిలి వదిలించు కొని, ఎలాగో ఆమెతో వాదించి, ఆమెకు మనస్సు మార్చ ప్రయత్నం చేయడం అన్నీ కోనంగి జ్ఞాపకం తెచ్చుకొన్నాడు.

“వాణీదేవీ! నువ్వు కామవాంఛాపూరిత జన్మవు. నేను కాను. నా కామవాంఛ నా భార్యవల్లనే తీరాలి. నీ కామవాంఛ ఎవరివల్ల నైనా తీర్చుకోగలవు. అది నాకేమీ సరిపడదు.”

కోనంగిరావుగారూ! ఎప్పుడూ నన్ను ఇతరులు పాంఛించడమూ, వారి కోర్కె నేను తీర్చడమూ, అందుకు వేలకువేలు వారు సమర్పించడమూ జరుగుతోంది. ఈ మధ్యనే మన కంపెనీలో ఏభైవేల రూపాయల ధనం పెట్టి డిస్టిబ్యూటరుగా చేరిన నాటుకోటిసెట్టిగారు, మీతో కూడా ఎంతో చనువుగా మాటాడుతారే-ఆయన నాకు పదివేలు ఇస్తాను, నెలరోజులు తనతో ఉండమన్నారు.”

“ఆ సెట్టిగారు నీ దగ్గిరా చేరారూ?”

“ఏమి లాభం? నేను ఒప్పుకోలేదు. ఆయన బ్రతిమాలాడు. డబ్బు ఎక్కువ చేస్తానన్నాడు. ఏభై వేలదాకా బేరం వృద్ధి చేశాడు.

“నువ్వు?”

“ఒప్పుకోలేదు!"

“వాడు స్త్రీ చంద్రకల రాహు రాక్షసుడు.”

“కానీ నేను మీకు పదివేలు భక్తితో సమర్పించుకుంటాను. నాతో ఒక నెలరోజులు ఉండండి!”

“ఓయి వెర్రి అమ్మాయి. కాపురం చేస్తూ భర్తను భగవంతునిలా ఎంచుకుంటూ ప్రేమించే అమ్మాయిని ఎవరైనా పదివేలు ఇస్తానంటే వాళ్ళతో నెలరోజులు ఉంటుందా? నువ్వు చెట్టియారుతో ఎందుకు ఉండనన్నావు? అలాంటిది నేను నా దేవతగా నా సర్వస్వముగా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తోంది. ఆమే నాకు సకలైశ్వర్యమూ! ఇక నీ మాట కర్థం నాకేమి తెలుస్తుంది. చెప్పు?”

ఆ బాలిక ఏడ్చింది. తన ఒడిలో తల పెట్టుకొని. తర్వాత పాదాలు కళ్ళకద్దుకొని లోనికి వెళ్ళిపోయింది.

అప్పటినుంచి వాణీదేవి తన్నేమీ అలజడి పెట్టలేదు. చిత్రం పూర్తిఅయి చివర రోజులలో ఉపనాయకుడు వేషం వేసిన ఒక ఆంధ్ర బ్రాహ్మణ యువకునికీ ఆ బాలికకూ పెళ్ళి అని అందరకూ శుభలేఖలు వచ్చాయి.

కోనంగీ, డాక్టరుగారూ వివాహానికి వెళ్ళారు. ఆ రాత్రి సినిమా లోకం అందరకూ పెద్ద విందు. ఆ విందు సమయంలో కోనంగి కడకు ఆ అమ్మాయి వచ్చి రహస్యంగా అన్నది “మీరే నాకు గురువు! నేను వివాహం చేసుకున్నా, కాని ఎప్పటికైనా మీరు నాకొక్కసారైనా తృప్తినివ్వాలి” అని అన్నది.

“అదేమిటి పెళ్ళిచేసుకొని!”

“ఆ పెళ్ళికొడుకులో మిమ్మల్ని చూచి అతన్ని చేసుకొన్నాను. మీరు నాకు దేవతలు. ఒక్కటే ఒక్కసారి మీరు నాకు వరం ఇవ్వవలసి ఉంటుంది.”

కోనంగి గుండెలో మూడుదెబ్బలు తప్పిపోయాయి.

2

ఈ దినాలలో సాంఘికంగా ఈ దారినా, ఆ దారినా అనే ప్రశ్నేలేదు. సాంఘికమైన మార్పులు వస్తున్నాయి. వాని అంతట అవి వచ్చి తీరుతాయి. వ్యక్తికి వున్న ప్రశ్న అల్లా “నేను హరిజన సేవ చేయగలనా, చేయలేనా?” అనే ప్రశ్నగాని, చేయడం మంచిదా, కాదా అన్న సమస్య కానేకాదు. అందులో అలాంటి ప్రశ్నలుగాని, సమస్యలుగాని కోనంగి ప్రత్యుత్తర మీయవలసిన అవసరమే లేదు. అతనికి కులమే లేదు. గుడి మింగేవాడికి గుళ్ళోలింగమెంత? అని అనుకున్నాడు.

"ఇంక కోనంగి యెదుట ప్రత్యక్షమైన సమస్యలు రాజకీయమైనవే. అతనికి ఇంక తిండికి కరువు లేదు. సినీమా ప్రపంచం రెండుచేతులు చాచి అతన్ని ఆహ్వానిస్తూనే ఉన్నది. కనక ఆ విషయంలో ఆనుమానమే లేదు.

అతడు ప్రస్తుతం సినీమా ప్రపంచంలో తిరిగి అడుగు పెట్టదలచుకోలేదు. దానికి కారణం ఆ ప్రపంచంలోవున్న కుళ్ళే! ఆ కుళ్ళు పోవడానికి ప్రయత్నం చేసేవారు లేరు. చేయడానికి తగిన సదుపాయాలూ లేవు. ఆందుకు బ్రహ్మప్రళయం అంతపనిచేస్తే ఒకటి రెండు మార్గాలు దొరుకుతాయి. కానీ ఆ మార్గాలు కోనంగికి అందనే అందవు.

ఇంక కోనంగి మనస్సంతా రాజకీయాలలో పడింది. అతనికి రెండు మార్గాలు కనిపించాయి. ఒకటి అప్పుడే తలఎత్తి బయటకు వచ్చే సామ్యవాదం. రెండవది భరతదేశం అంతా నిండివున్న గాంధీమార్గం. మధ్యగావున్న మార్గాలు గురించి ఆలోచించ నవసరంలేదు.

ఈ మార్గాలు రెండూ తాను సినీమాలో ఉన్నంతమాత్రాన అడ్డురావు. సినీమాలో ఉన్న మనుష్యుడు తాను పతితుడు కాకుండా సంరక్షించు కుంటూ రాజకీయంగా పనిచేయవచ్చుకాదా?

ఏ ఉద్యమంలో వున్నా, మనుష్యుని శక్తులు ఎక్కువగా స్పందనం అయ్యే సమయంలో ఉత్తమ శక్తులతోపాటు హీనశక్తులూ విజృంభిస్తాయి. సంగీత విద్వాంసులలో, నాట్యవేత్తలలో, నృత్యవిద్యా విశారదులలో, చిత్రకారులలో, శిల్పులలో, కవులలో మనుజుని శక్తులన్నీ కదులుతాయి. కనుకనే వారిలో అనేకమంది పతితులౌతున్నారు.

చివరకు రాజకీయాలలోనూ ఎంత అహింసామార్థం అవలంబించినా మనుష్యుడు కదిలిపోతాడు. ఆ కదలికలో అతని పశుశక్తులు ఉబికివస్తాయి. అందుకనే మత విషయికమైన ఉత్సవాలలో, రాజకీయ ఉద్యమాలలో కళాసన్నివేశాలలో కొన్ని అసంబద్దపు సాంఘిక వ్యతిరేక సంఘటనలు సంభవిస్తూ వుంటవి అని కోనంగి అనుకున్నాడు."

సినిమా లోకంలో ఎప్పుడూ ఎడతెగని ఉత్సాహమూ, ఎడతెగని దీక్షా, ప్రయత్నమూ, మనుష్యునిలోని ఉత్తమాధమశక్తులు రెంటినీ విజృంభింప చేస్తాయి. రాజకీయోద్యమాలలో అహింసావారమైన కాంగ్రెసు విషయంలో సత్య అహింసాది భావాలు మనుష్యుని విచ్చలవిడితనాన్ని చాలా వరకు అణచివేస్తాయి. మతోత్సవాలలో పాపభీతి అడ్డంవస్తుంది. కళోత్సవాలలో వచ్చే కళాకారులే తక్కువ.

కాని సినీమాలో అత్యంత ధనమూ, రాత్రింబవళ్ళువనీ, పెద్ద జీతాలు, గుణగణాల్నిబట్టికాక కళాశక్తి ననుసరించి ఎక్కువ హెూదా, సర్వకాలోత్సవంలా కార్యక్రమమూ స్త్రీ పురుషుల్ని మహా ఝంఝాం సంచలిత కల్లోలాలులా పై కెగయచేసి లోతుల్లోకి కూలదోస్తూ ఉంటాయి.

పాపభీతి, సాంఘికభీతి, మనుజుడే ఏర్పరచుకున్న అహింసాది నీతి నియమభీతి సినీమా ప్రపంచంలో లేవు.

ఉద్యోగానికి వచ్చి రాజకీయాలనుగూర్చి ఆలోచించే తనంత తెలివి తక్కువ వాడెవరన్నా ఉన్నాడా? ఉద్యోగమా అంటే కావలసినంత డబ్బు దొరికే ఉద్యోగం! తన్ను ప్రేమిస్తున్నది ఒక దివ్యసుందరి, బంగారపు చిలుకా, అంతకన్న తన కేమి కావాలి? తానామెను పెండ్లియాడి సినీమా ప్రపంచంలో ఏవో నాల్లురాళ్ళు సంపాదించుకుంటూ అనందంగా బ్రతుకు దారిని పోవచ్చుకాదా?

కాని ఏదో ఆవేదన, ఏదో అసంతృప్తి, ఏదో వ్యధ అతన్ని కలచి వేస్తున్నవి. దానికి ఏమి కారణం చెప్పకోగలడు? ఏమిటీ ఆవేదన? ఎందుకీ ఆవేదన?

అతనికీ తెలుసు. ఒకరకంగా ఆవేదనకు కారణం మానవుని మనస్సు యొక్క నడవడిక అని! అది అతి విచిత్రమైనది. పరిసరానువర్తిగా ఎంత ఉంటుందో, పరిసరాతీత మార్గాలు సంచరింప అంత కోరుతుంది.

"ఆ మనస్సే ఎయిన్ స్టెయిన్చే పరిణామవాదాన్ని కనిపెట్టింపచేసింది. బుద్ధుణ్ణి బోధివృక్షం క్రిందకు పంపించింది. నెపోలియనును రష్యాకు పంపించింది. బాపూజీచే సత్యాన్వేషణం చేయిస్తున్నది. ఫోర్డుచే నిమిషానికి రెండు వందలు గణింపచేస్తున్నది. పెరల్ బక్కుకు నోబెలు బహుమాన మెప్పించింది.

కోనంగి అనంతలక్ష్మి కళ్ళలోతుల్లో తనదారి వెతుక్కుంటున్నాడు. అనంతలక్ష్మి కోనంగి సినీమాలో పనిచేస్తున్నంతకాలమూ బాధపడుతూనేవుంది. ఎన్నో అనుమానాలూ, ఎన్నో ఆవేదనలు కలిగినవి.

ఒకసారి కోనంగీ తానూ ఒంటిగా ఉన్నప్పుడు కోనంగి భుజంచుట్టూ చేతులు చుట్టి “ఏమండీ గురువుగారూ! మీరు సినీమాలో ఊరకే అభినయం మాత్రం చేస్తున్నారు " కాదూ!” అని అడిగింది.

“ఓయి బంగారు పడుచా! కాక ఏమిటి చేస్తున్నాననుకొన్నావు?”

“నా ప్రేమలో నేను పడేవెట్టై!” అని కన్నుల నీరు తిరుగుతూ ఆమె అతని హృదయంలో మోము దాచుకుంది.

అతడామెను అతిగాఢంగా హృదయాని కదుముకొని,

“ఆత్మసామ్రాజ్జీ! ఏమిటి నీ వేషం! ఉత్తమ ప్రేమ ఎప్పుడూ అనుమానపడదు. నేను నీకు తగుదునా, తగనా అని లోపల ఆవేదన పడుతూంటాను కాని, నీకు ఆవేదన ఎందుకు? నా జన్మకు, జన్మ జన్మలకు నువ్వే! మన ప్రేమ చిరకాలానుగతం కాబట్టే మొదటిచూపులోనే నిన్ను నేనూ, నన్ను నీవూ ప్రేమించగలిగాము.” అని ఆమెను తనివితీర ముద్దుకొన్నాడు.

అలాంటి ప్రేమదేవి తనకున్నది. ఎందుకీ ఆవేదన? ఏమి కావాలి తనకు?

డాక్టరుగారి స్నేహం ఈ ఆవేదనకు కొంత దోహదం ఇచ్చింది. ఆయన కూడా ఎప్పుడూ ఏదో మనస్సులో వెదుక్కుంటూ ఉంటాడు.

సూర్యకుటుంబమూ, సర్వతారాకుటుంబాలూ అంతులేని ఈ విశ్వంలో దేనినో వెదుక్కుంటూ వెడుతూ వుంటాయి. అలాగే మనుష్యుడు ఎడతెగని అసంతృప్తిచేత అలా ఎక్కడికో ఎడతెగని ప్రయాణం చేస్తూనే ఉంటాడని డాక్టరుగారి వాదన.

“నువ్వు ప్రాపంచికమైన సుఖాలకోసం పరిశోధిస్తూ ఎడతెగని ప్రయాణం చేస్తావు. లేదూ మహాత్మునిలా దేహవాంఛలు చంపి, ఏవో మానసికమైన వాంఛలకై, అహింసా సత్యాన్వేషణలు మనోపథంలో పరిశోధిస్తూ ఎడతెగని ప్రయాణం చేస్తావు” అని డాక్టరన్నాడు.

3

డాక్టరుగారన్న మాటలకు కోనంగి తల ఊపాడు. కాని అతని అనుమానాలు అతడే తీర్చుకోవాలి! ఇతరులు ఏమి చెప్పగలరు? కుడిచి, కూర్చుని రాజకీయాలలో వేలుపెట్టేవారు వేరు, కావాలని తమ జీవితాలు దేశానికి అర్పించే రాజకీయ సేవకులు వేరు.

అందులో ఈ మహాత్ముడు అతి విచిత్రమైన పురుషుడు. ఏ కొద్దిమందిలోనో అహింసా వాదమున్నది. ప్రాచ్యదేశములోని మహరులూ, పాశ్చాత్యదేశాలలో వేదాంతులూ అహింసావాదులు. ఎమర్సన్, థోర్యూ, రస్కిన్, టాల్ స్టాయి మొదలయినవారూ, కొంతమంది మతోద్యోగులూ, అహింసావాదులు. కాని చాలామంది అహింసావాదాన్ని పాక్షికంగా చూడగలరు, సర్వతోముఖంగా చూడలేరు.

అహింస బీదవాణ్ణి, కష్టజీవినీ కరుణతో చూడ్డంలో ఉంది. అంతే! తనకూ, తన వర్గానికీ, తన జాతికీ ఇతరుల సంపత్తును తెచ్చుకోడంలో అహింసలేదు. అదేకాదా మేజర్ బార్బరాలో బెర్నార్డుషో మహాకవి తెలిపిన విషయం.

ప్రాచ్యదేశాలలో మహరులు అహింసావాదాన్ని, హింసాపూరితమైన వస్తువులను, భావాలను వదలివేయడంలో చూపించారు. కాని ప్రపంచాన్ని ఎదుర్కొని ప్రపంచంతో భాగస్టులై అహింసను ఆచరించేది ఒక్క బాపూజీయే.

రష్యావారు అహింసావాదాన్ని హింసతో నెలకొల్పుతున్నారు. ఆ ప్రయత్నంలోనే వున్నారు.

ఆశయానికి వెళ్ళడం ఆశయ స్వరూపమైన దారినా? లేక ఏదారినైనా సరేనా?

ఇదీ కోనంగికి తగిలిన పెద్ద సమస్య. గాంధీమహాత్ముని గురించిన గ్రంథాలు చదువుతోంటే అహింసా మార్గమంత ఉత్తమమైన మార్గం లేదనుకుంటాడు. తన స్నేహితుడు డాక్టరుగారు చదవమని యిచ్చిన గ్రంథాలు చదువుతోంటే రష్యామార్గమంత ఉత్తమమార్గ మింకోటి లేదనుకుంటాడు.

జర్మనీ వాళ్ళే దేశాలన్నిటికీ రక్ష అనుకుంటాడు మెయిన్ కాంప్ చదువుతూ. కాని వెంటనే నాజీఇజం - సామ్రాజ్యవాద, సామ్రాజ్యవాద సంఘర్షణ జనితమైన పాశ్చాత్య యాదవకుల ముసలం అని అనుకుంటాడు.

లోకంలో వున్న అన్ని ఆవేదనలకూ, బాధలకూ, కష్టాలకూ, బీదతనానికీ, చలికీ, ఆకలికీ, ఎండిపోయే వాంఛలకూ, అఖండ నిస్పృహకూ ఏడుగడ రష్యావారి సామ్యవాదమే అని అనుకుంటాడు. పాశ్చాత్యుల ప్రజా ప్రభుత్వవాదం (డెమోక్రసీ) చెప్పినట్లు వ్యక్తి స్వాతంత్ర్యమే ప్రపంచ రక్షేమో, అది సామ్యవాదమా అని అనుమానిస్తాడు.

ఇంగ్లండులోని ప్రజాపాలన విధానంగాని అమెరికాలోని ప్రజాస్వామ్య విధానంగాని, ఫ్రాంసు వగైరాలలోని ప్రజారాజ్య విధానాలు గాని ఆ యా దేశాలకు ఏమి శాంతి చేకూర్చాయి? అని ప్రశ్నించుకుంటాడు.

అనంతలక్ష్మి ఇంటరు మొదటతరగతిలో కృతార్థురాలైంది. ఇంగ్లీషులో, తెలుగులో యూనివర్శిటీ కంతకూ మొదటిగా రావడంవల్ల రెండు బంగారు పతకాలు బహుమానాలు అందుకుంది.

కోనంగి తన్ను తయారుచేసిన విధానంవల్ల అనంతలక్ష్మికి బహుమానాలు వచ్చాయి. పాఠాలన్నీ అద్భుతంగా బోధించడమే కాకుండా, పరీక్షల ముందు బాగా పరిశీలనచేసి ఈ ప్రశ్నలు వచ్చి తీరుతాయి అని, ప్రశ్న పత్రాలు తయారుచేసి వానికి చక్కని జవాబులు వ్రాయించి తన్ను అద్భుతంగా సిద్ధంచేశారు.

నూటికి ఎనభైవంతులు అతను వస్తాయని అంచనా వేసిన ప్రశ్నలే వచ్చాయి. తక్కినవి ఆమెకు వచ్చును.

పరీక్షలు తెలిసినరోజున కోనంగి సినిమా తయారులో నిమగ్నుడై ఉన్నాడు. యూనివర్సిటీ నుంచి వెంటనే కోనంగి అభినయించే స్టూడియోకు కారుపై వెళ్ళింది అనంతం.

కోనంగి వేషంమీద ఉన్నాడు. సెట్టుమీద అభినయం పూర్తికాగానే అనంతలక్ష్మిని కలుసుకుని “మొదటి తరగతి, రెండవ తరగతా?” అని అడిగాడు.

“మొదటి తరగతి గురువుగారూ! నాకు ఇంగ్లీషులో, తెలుగులో విశ్వవిద్యాలయాని కంతకూ మొదటి బహుమానం!”

“అసి పిల్లా కొట్టావూ! నీకు నా గాఢ అభినందనాలు. నువ్వు ఇంటి దగ్గర ఉండు. నావంతు ఒక అరగంటలో పూర్తిచేసుకొని, తక్కినవి రాత్రికి ఏర్పాటు చేసుకొని మీ ఇంటికివచ్చి వాలుతా! మనం సినిమా, టీ పార్టీ, సముద్రం షికారు, మీ ఇంటి దగ్గర విందూ, నేను నీకు అద్భుతమైన బహుమతిన్నీ!”

“నేనే మీకు చక్కని బహుమతి ఇవ్వాలి గురువుగారూ!”

“నువ్వు ఇల్లా పదిసార్లు వస్తూవుంటే, వీళ్ళందరూ ఏదో అనుకుంటున్నారు.”

“వహ్వా! అనుకుంటున్నారని తప్పక అనుకుంటున్నంతా చేస్తారా?”

“ఛా!ఛా!”

“అయితే మీకు భయం ఎందుకు గురువుగారూ? అనుకుంటున్నారని ఉత్తమ కార్యాలు చేయడం మానుతావా లక్ష్మీ! అని తమరేగా నన్ను ఓ సారి కూకలేశారు?”

“అమ్మో! ఇప్పుడే ఇంక నన్ను జాడిస్తున్నావు, రేపు పెళ్ళి అయితే?” “వట్టి జాడింపులా? నాలుగు తగిలింపులు కూడా!”

“ఏమిటా తగిలింపులు?”

“బుగ్గమీద?”

“లెంపకాయలా”

“పెదవులతో!”

“ఓడిపోయాను లక్ష్మీ!”

“నేను వెడుతున్నాను కృష్ణా!”

4

రాజకీయాలలో చేరాలని కోనంగికి ఉబలాటం కలుగుతోంది. దానివల్ల జైళ్ళూ, కాల్పులూ, లాఠీచార్జీలు తనపై ప్రయోగం కావచ్చు! అందువల్ల అతడు భయపడడంలేదు. కాని బాపూజీ శిష్యపరమాణువులా అన్నా - నిర్మాణ కార్యక్రమం అనీ, హరిజన సేవ అనీ, రాజకీయ ఉపన్యాసాలనీ, బ్రహ్మచర్యమనీ లేకుండా, వట్టి రాజకీయవాదిగా తయారయి చివరకు ఏ కార్యదర్శి పదవో స్వీకరించి వచ్చే నాయకులకూ, వెళ్ళే నాయకులకూ సేవ చేస్తూ ఉండడం అంటే స్వతంత్రవాది అయిన కోనంగికి యిష్టంలేక పోయింది.

ఒకసారి శాస్త్రజ్ఞానం వృద్ధిచేసుకొని పరిశోధన సలుపుతూ కాలక్షేపం చేద్దామా అని బుద్ధిపుట్టుంది.

ఒకసారి ఏ పారిశ్రామిక సంస్థలోనన్నా చేరి ఆ పరిశ్రమలో లోట్లు దిద్ది కొత్తమార్గాలు కనిపెట్టి ఈ యుద్ధంరోజుల్లో లోకాని కెందుకు సహాయం చేయకూడదు? అనుకుంటాడు.

డాక్టరుగారి ఇంట్లోనే మకాం. డాక్టరుగారికీ కోనంగికీ దినదినమూ వాదన అవుతోంది. “నువ్వు కమ్యూనిస్టువాదివి ఎందుకు కాకూడదు?” అని డాక్టరుగారి వాదం. “నేను కమ్యూనిస్టు నెందుకవ్వాలి?” అని కోనంగి వాదం.

ప్రపంచంలో ఉన్న సంపదపై అందరికీ సమాన హక్కంటావు. వ్యక్తిగతోద్యమాలు ఉండకూడదంటావు. ఏ మనుజుడూ జన్మవల్ల తండ్రి అస్తికి వారసుడైగాని, ఎవరి ఆస్తికైనా వారసుడైకాని సంపన్నుడు కాగూడదంటావు. మూఢనమ్మకాలు పనికిరావంటావు. కులంతేడాలు, మతంతేడాలు, ఉద్యోగ వివాహ భోజన సాంఘిక కళాజీవనాలలో ఉండకూడదంటావు. ఇంక నువ్వు సామ్యవాదివి కావడానికి అభ్యంతరం ఏమిటంట?”

“డాక్టరూ! నీవాదన నీకైనా నచ్చిందా? మహాత్ముని వాదనలో నీవు కోరినవన్నీ ఉన్నాయి కాని మీ మార్గం వేరు, వారి మార్గం వేరు.”

“నీ మార్గం?”

“నేను ఏ మార్గమూ నిర్ణయించుకోలేదు.”

“అహింసామార్గాలవల్ల ఇవన్నీ ఎప్పటికీ రావు.”

“రష్యాలో సంపూర్ణంగా మార్క్సిజం వచ్చిందా?”

“చాలవరకు వచ్చింది.”

“ఆ మిగిలి ఉన్నదే ముఖ్యం. ఆ వచ్చినవన్నీ సులభంగా గాంధీజీ మార్గంవల్లా వస్తాయి. కాని రష్యాలో వచ్చిన సామ్యవాద జీవితం బలవంతంగా వచ్చింది. బలవంతంగా ఎంతకాలం నిలుస్తుంది.”

“నమ్మకంతో వచ్చింది మాత్రం అనంతంగా ఉండిపోతుందా? బౌద్దమతంలో ప్రజలు నమ్మే చేరారు. తర్వాత ఏమయింది.?”

“అవును బాబూ! నమ్మి చేరినా ఒకటే బలవంతంగా చేరిన ఒకటే. ఏ విధానమైనా మారిపోతూనే ఉంటుంది. అలాంటప్పుడు ముందుకు వెళ్ళే దారి ఉత్తమమయిం దయితే మరీ మంచిదికాదా?”

“ఉత్తమం ఏమిటి, అధమం ఏమిటి? దేంతో కొలుస్తావు?”

“అన్నింటికీ ఏ కొలతబద్దలో, ఏ త్రాసులో, ఏ కొలత గిన్నెలో ఉన్నాయి సామ్యవాద స్థితికి రావాలంటే ఉత్తమాధమ మార్గాలున్నాయా లేవా?”

“అవి నైతికం కావుగా?"

“ప్రాపంచికంవే అనుకో”

“అనుకున్నా!”

“ఏవైతేనేమి, ప్రాపంచిక వాదనకు అవి ఉత్తమమే.”

“నైతికవాద మేమిటి ముసలమ్మవాదం?”

"ప్రాపంచికవాద మేమిటి చంటిబిడ్డలవాదం!”

ఈ సంభాషణవల్ల కోనంగి నవ్వడం, డాక్టరు నవ్వడమూ! అంతటితో అఖరయ్యేది.

కాని కోనంగి మాత్రం డాక్టరు వాదనవల్ల సామ్యవాద గ్రంథాలు పరిశీలింపక వదలలేదు.

సామ్యవాదులు జర్మనీతో రష్యా స్నేహం చేయడం అద్భుతం అన్నారు. మంచి ఎత్తన్నారు. కాంగ్రెసువాదులు మాకా గొడవలు అక్కరలేదు. మాతో ఆలోచించకుండా, దేశంలో ఉన్న ప్రభుత్వాలతో ఆలోచించకుండా హిందూదేశాన్ని యుద్ధంలో దింపడం అన్యాయం అన్నారు. హిందూదేశంలో వట్టి బలప్రయోగంవల్ల రాజ్యం చేస్తూన్న బ్రిటిషువారు ప్రజాప్రతినిధుల సలహా సంప్రదింపులు లేకుండా ఎవ్వరిమీద నైతేనేమి యుద్దంలోకి దింపడం నాజీపద్దతే అన్నారు.

ప్రభుత్వం సామ్యవాదాన్ని ఒప్పుకోలేదు. సామ్యవాద సంస్థలేవీ ఒప్పుకోలేదు. కాబట్టి సామ్యవాదులు కాంగ్రెసులో ఉండి కొందరూ, కాంగ్రెసు బయట ఉండి కొందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉండిరి.

ప్రభుత్వం సామ్యవాదంపై కత్తిగట్టి అనేకమందిని నిర్బంధంలో ఉంచింది. కేసులు పెట్టి శిక్షించి జైలుకు పంపింది. కొందరు కమ్యూనిస్టులు విచారణ సమయంలోనూ, కొందరు జైళ్ళ నుండిన్నీ పారిపోయి తమ ఉద్యమం సాగిస్తూ ఉండిరి. వారిని పట్టుకొన్నవారికి బహుమానాలు ప్రచురించారు ప్రభుత్వంవారు.

కాంగ్రెసువారు మంత్రివర్గాలు మానివేశారు. కేంద్ర శాసనసభలోంచి వచ్చివేశారు.

మళ్ళీ దేశంలో ఉద్యమం ఏదైనా గాంధీమహాత్ముడు నడుపుతాడా అని అలజడి పుట్టింది.

1905-వ సంవత్సరం ప్రాంతాలలో బెంగాలు విభజన రోజులలో, దేశం అంతటా పాకిపోయిన విప్లవ ఉద్యమం ఫలితంగా ఎంత మందో రహస్య సంఘాలుగా చేరి దారులు దోచి, బ్యాంకులు దోచి ధనం సంపాదించడం, తెల్లవారిని హతంచేయడం, ఒక్కసారిగా దేశాన్ని ప్రభుత్వంపై తిరుగుబాటు చేయించడానికై కుట్రలు సలపడం ప్రారంభించారు.

విదేశాలలో అచ్చువేయబడిన రాజద్రోహపు కరపత్రాలు, పుస్తకాలు, అనేక మార్గాల దేశం అంతా వచ్చి పడుతూ ఉండేవి. అవి చదువుకొని యువకులు మండిపోతూ ఉండేవారు.

ప్రభుత్వం వారికి ఎన్నో రహస్యాలు తెలిసి కుట్రలు పెట్టి ఎంత మందినో అండమానుకు పంపారు. తిలకును మాండలేలో నిర్బంధించారు.

అలాగే నేడు సామ్యవాదులు చేయదలచుకొన్నారని ప్రభుత్వం అనుమానడింది.

5

శ్రీ మహాత్మాగాంధీ సత్యాగ్రహం ప్రారంభించడం ఏమిటి? చౌరీ చౌరాలో అల్ల రులు జరిగి, ఒక పోలీసుస్టేషను అందించివేశారు. దానితో గాంధీజీ సత్యాగ్రహెూద్యమం మానివేశారు. వారిపై ప్రభుత్వం వారు కేసు పెట్టితే ఆరుఏళ్ళు కారాగారవాసం శిక్ష విధించారు.

దాసుగారు స్వరాజ్యపక్షం స్థాపించారు. కాంగ్రెసు రెండు చీలికలైంది. ఖైదులో గాంధీగారికి కడుపులో అపెండిక్సుకు శస్త్రచికిత్స జరిగింది. వారు బ్రతికారు. వారికి విడుదల అయింది. అంతకు ముందే గయా కాంగ్రెసు, తరువాత బెల్గాం కాంగ్రెసు అయ్యాయి.

అహింసావాదం నెమ్మదిగా బలం సమకూర్చుకుంటూ వుండగా 1930 మార్చిలో గాంధీజీ ఉప్పుసత్యాగ్రహం ప్రారంభించి దండయాత్ర గావించారు. అప్పటికి కోనంగికి పదమూడేళ్ళు.

దేశం అంతా ఉత్సాహం నిండింది. కోనంగి వెళ్ళి బందరు దగ్గర హంసలదీవిలో ఉప్పుసత్యాగ్రహం చేశాడు. దేశం అంతా సముద్రం దగ్గర ఉప్పుసత్యాగ్రహమే!

అక్కడ నుంచి పోలీసు అక్రమచర్యలు ప్రారంభం అయ్యాయి. లక్షలకొలది జైళ్ళకు పోయారు. లాఠీ ప్రయోగాలు, కాల్పులూను. కాని భారతీయులు చిరునవ్వుతో దెబ్బలు తింటూ, ప్రాణాలు అర్పిస్తూ, జైళ్ళకు వెడుతూ మహెూత్తమ అహింసాశక్తిని ప్రదర్శించారు. గాంధీమహాత్ముని కారాగారంలో ఉంచారు. చివరకు హరిజన ప్రశ్నపై బాపూజీ నిరశన వ్రతం చేయగా మహాత్మాగాంధీని వదిలారు. హరిజన సమస్య పరిష్కారం అయింది.

గాంధీ ఇర్విను ఒడంబడిక, గాంధీజీ రెండవ రౌండుటేబిలు సమావేశానికి ప్రయాణం జరిగాయి. రౌండుటేబిలు సభ నిష్ఫలం అయింది. గాంధీజీని హిందూదేశంలో అడుగుపెట్టగానే కారాగారవాసిని చేశారు. 1930 కన్న ఈ 1932 సంవత్సరంలో ప్రభుత్వం మరీ తీవ్రంగా కాంగ్రెసుపై దాడి సలిపింది. తిరిగి గాంధీజీ విడుదల అవడం, హరిజన సమస్యపై దేశసంచారం చేయడం జరిగింది.

1935 ప్రభుత్వం వారి భారతపరిపాలనా శాసనం కొత్తది వచ్చింది. కాంగ్రెసువారు ఎన్నికలలో పాల్గొని అఖండ విజయం పొందారు. కాంగ్రెసు మంత్రివర్గాలు వచ్చి చక్కగా పనిచేస్తుండగా యుద్ధంరావడం, కాంగ్రెసువారు ప్రభుత్వంతో అసహకారం చేయడం జరిగాయి.

ఇంతవరకు కోనంగి దేశంలోని జాతీయశక్తుల విజృంభణ ఒక్కసారిగా మనస్సున జ్ఞప్తికి తెచ్చుకున్నాడు.

రాజకీయంగా మూత్తమస్థితికి రావడానికి గాంధీమార్గమే ఉత్తమోత్తమమని ఒకవైపు వాదన. వేరొకవైపు లోకంలో ఇది ఎక్కడా లేదని సామ్యవాద వాదన. ప్రపంచం అంతా హింసాపూరితమై వుంటే నీ అహింస ఏమి చేస్తుందయ్యా అని డాక్టరు గారంటారు.

అహింస భగవద్దర్మమని అతడు ఏలా ఒప్పుకొంటాడు? డాక్టరు వాదనలో మహాత్ముడు దేశాన్ని మేలుకొలుపుతూ నూతన చైతన్యం ఇవ్వడం మొదలయిన మహెూత్తమ కార్యాలు చేశాడట. అందుకు సందేహం లేదట. కాని ఇకముందు కాంగ్రెసు కమ్యూనిస్టు పంథా అనుసరించాలట.

కమ్యూనిస్టులలో నాయకుడు పి.సి. జోషి అతడూ, బ్రాడ్లీ, ఫ్ర్పెట్ మొదలయినవారు అంతా కలిసి పెద్ద కుట్రచేశారు. దాన్ని ప్రభుత్వం వారు పట్టుకుని పెద్ద కేసుపెట్టారు. దాన్నే మీరటు కుట్రకేసు అని పిలుస్తారు. అందులో జోషి నాలుగేళ్ళు ఖయిదు అనుభవించాడు.

కాంగ్రెసు చప్పబడినట్లు తోచినప్పుడు బెంగాలులో విప్లవవాదం ఎక్కువైంది. పంజాబులోనూ అది ఎక్కువగా వ్యాపించింది. అప్పుడే భగతోసింగ్, రాజగురు, శుకదేవు మొదలయిన యువకులు పెద్ద కుట్రసలిపి హిందూ స్వతంత్ర ప్రభుత్వసేన అని పేరు : పెట్టుకొని ఉత్తరాలు పంపడం, ప్రకటనలు గోడలకు అంటించడం మొదలయిన పనులు సాగించారు. వైస్రాయిగారి రయిలుపైనే డయినమైటు ఉపయోగించి పేల్చివేద్దామను కున్నారు. అందరూ పట్టుబడ్డారు.

అప్పుడే రాజకీయఖయిదీలకు సరియైన గౌరవము కారాగారాలలో జరగటంలేదని కలకత్తాలో జితీనుదాసు డెబ్బదిఏడురోజులు నిరశనవ్రతం చేసి ప్రాణాలు బలిచేశాడు. భగత్ సింగు, శుకదేవు, రాజగురులను ఉరితీశారు. దత్తాను దయదలచి వదలివేశారు.

ఈలా యువకులలో స్వాతంత్ర్య వాంఛలు ప్రబలమై అనేక రీతుల ప్రవహించాయి. సాంఘికవాదులు వేరే ఒక సంస్థగా ఏర్పడ్డారు. వారికి నరేంద్రదేవు, జయప్రకాశ్ నారాయణ, మాసాని, మెహరల్లీ మొదలయిన వారు నాయకులుగా ఉండిరి.

ఆ రోజులలోను డాక్టరు రెడ్డికూడా సామ్యవాది అయి కాంగ్రెసులోనే వుండి పనిచేస్తూ ఉండినాడు. అనేకమంది యువకులవలె కాక, రెడ్డి చాలా జాగ్రత్తగా లోకానికి తన చరిత్ర ఏ మాత్రమూ తెలియనీయకుండా పనిచేస్తూ రహస్యము చక్కగా దాచుకొని ఉండేవాడు.

డాక్టరు ఉచితంగా కూలినాలి జనులకూ, రికావారికి, బళ్ళులాగే వారికి, మిల్లుకూలీలకూ, సామానులు మోసేవారికి వైద్యం చేస్తూ ఉండెను. వైద్యానికి వచ్చినప్పుడే వారితో రాజకీయాలు మాట్లాడుతూ ఉండేవాడు. ఎన్నో కూలి సంఘాలు ఏర్పరచాడు. జట్కావారి సంఘం, రిక్షావారి సంఘం, బళ్ళవారి సంఘం ఏర్పాటు చేయించాడు.

మిల్లులలో, రైల్వేలో, ట్రాంవే, బస్సువారలలో ఇదివరకే సంఘాలు ఏర్పడ్డాయి. ఆ యా సంఘాలకు గుప్తదానాలు చేసేవాడు.

వైద్యంలో నిపుణుడవటంచేత అతడు పట్టిన కేసులు సాధారణంగా నెగ్గి తీరేవి. అందుచేత కూలిప్రజలకు అతడు దేవుడనే భావం.

అతనికి పెద్దవారితోనూ సహవాసం ఉండేది. పైకి కాంగ్రెసువాది. కాంగ్రెసు సంఘాలలో సభ్యుడు తమిళనాడు కాంగ్రెసు సభ్యుడుగానే ఉండేవాడు. తమిళంలో పండితుడు. కాని మదరాసులో తన వైద్య జీవితం ప్రారంభించినప్పటి నుండి తెలుగు బాగా నేర్చుకొని తెలుగుభాషలోనూ పండితుడయ్యాడు.

“డాక్టరూ, నువ్వు తెలుగువాడవయ్యా. అరవవాళ్ళంటే యెక్కువ మొగ్గుతా వేమిటి?” అని కోనంగి ప్రశ్నవేశాడు.

“నేను అరవవాణే! అరవదేశంలో పుట్టాను!”

“మంచిపని చేశావు. పొరపాటున ఏఆఫ్రికాలోనో పుట్టితే నీగ్రోవాడివై పోదువన్నమాట!”

“ఆ వైగర్ దేశంలో కాపురం చేసే తెలుగు దంపతులకు పుట్టి ఉంటే నీగ్రోనైపోదును.”

“ఏ అడవిలో కోతులున్న ప్రదేశంలోనే పుట్టి వుంటే కోతివైపోదువు.”

“ఆంధ్రులందరూ కోతులేటగా?”

“అరవలు కొండముచ్చులు!”

"కన్నడులు?”

“లంగూరులు?”

6

కొందరి మనుష్యులకు రాజకీయాలు మహాఇష్టం అంటాడు కోనంగి. వారిలో రెండు జాతులున్నా యంటాడు.

ఒక జాతివారు తమ వృత్తికీ, మామూలు పనులకూ భంగం లేకుండా, రాజకీయాలవల్ల తమకు ఏ విధమయినటువంటి ఇబ్బంది లేకుండా రాజకీయాలు, తప్ప ఇంకోటి వినరు, కనరు, చదవరు, మాట్లాడరు, ఊహించరు, నిద్రపోరు, లేవరు, తినరు, నమలరు, మింగరు, ఆరగించికోరు, వాదించరు.

ఇంకో రకంవారికి రాజకీయ జీవితం ఉంటుంది. జాగ్రత్త ఎక్కువ. జిల్లాబోర్డు రాజకీయాలు విద్యాసంస్థల రాజకీయాలు, గ్రంథాలయ రాజకీయాలు, కలెక్టర్లు మొదలయిన ప్రభుత్వోద్యోగుల్నీ, మహాత్మాజీ మొదలయిన జాతీయ నాయకుల్నీ కలుసుకుంటూ ఉంటారు. ఘాటుకాని రాజకీయ ఉద్యమాలకు చందాలిస్తారు. ఈ జాతిలోవారే ఆంధ్ర మహాసభ కార్యకర్తలూ నాయకులూను.

కాంగ్రెసులోనో కమ్యూనిస్టులలోనో చేరి జీవితాలు దేశానికి అర్పించేవారు రాజకీయ మానవులు కారట. వారు వట్టి రాజకీయ రూపాలే అని కోనంగి వాదన.

తాను మాత్రం ఏం కావాలి! స్వరాజ్యమో సామ్యరాజ్యమో వచ్చేవరకూ, ప్రజలందరూ కాకపోయినా తనబోటి పెద్దలు మరి ఏ ఇతర దేశాభ్యుదయ కార్యమూ చేయలేనివారు మాత్రం తప్పక రాజకీయాలలో చేరాలట.

డాక్టరుతోపాటు కోనంగి కూడా మిల్లుకూలీల సమావేశాలకి, ఇతరకూలీల సమావేశాలకి వెళ్ళడం సాగించాడు. ఆ సమావేశాలలో కోనంగి అప్పుడప్పుడు ఎంతో తియ్యగా మాట్లాడేవాడు. డాక్టరే ప్రోత్సాహం!

“కామేడులారా! మీరంతా బట్టలు వేస్తున్నారు. మేమంతా కట్టుకుంటున్నాము. ఈ సంఘం ఒక మహాసంఘం. ఈ సంఘంలో ఈ వ్యక్తి ఆ వ్యక్తి అనేది కాకుండా! సంఘమే ఒక వ్యక్తి. ఈ వ్యక్తి ఒక కోటితలలూ రెండు కోట్ల చొప్పున కళ్ళు, చేతులు, కాళ్ళు, పదికోట్ల చేతివేళ్ళు, పదికోట్ల కాలివేళ్ళు, కోటి కడుపులు, ముప్ఫై రెండుకోట్లపళ్ళూ, పదిహేను కోట్ల కోట్ల తల వెంట్రుకలు కలది.

“ఇంతటి మహావ్యక్తిని ఈ మిల్లు యజమానులనే ఖామందు ఒక చిన్నగిన్నెలో పలచని గంజి యిదేరా నీ తిండి అని పోసి తాగమంటున్నాడు. ఈ మహావ్యక్తే లేకపోతే ప్రపంచంలో గుడ్డాలేదు, గుడ్డలో పోగేలేదు. అప్పుడే ఖద్దరువాళ్ళు తప్ప తక్కినవారు దిగంబరావ్రతం పుచ్చుకోవాలి కదా! కాబట్టి మిల్లు కూలీలనే ఈ మహావ్యక్తికి సరియైన అన్నం, కట్టుగుడ్డ, వుండ ఇల్లు ఇవ్వాలి. ఒకటేమిటి అన్నీ ఇవ్వాలి.

“మిల్లే ఒక బ్యాంకు అనుకుంటే, మిల్లు యజమానుదారులు బ్యాంకులో డబ్బు వడ్డీకి వేసేవా రన్నమాట! బ్యాంకులో వడ్డీ ఏడాదికి మూడు రూపాయలు మాత్రం. అలాంటి సందర్భంలో ఈ మిల్లు యజమానులు ఒక కోటి రూపాయలుపెట్టి, నాలుగుకోట్ల రూపాయలు వడ్డీ క్రింద లాగుతున్నారన్నమాట. అది అన్యాయమేకాదు. రౌరవాది నరకం. అడుగున అయిదుమైళ్ళ లోతుగల కళపెళలాడుతూ మండే దురాశ అనే మంట.”

ఈ రకంగా మాట్లాడినాడు. డాక్టరు ఇంటి దగ్గర కోనంగితో నీ ఉపన్యాసం బాగానే ఉంది. కానీ, కొంచెం ఘాటుగా, లెక్కల పూరితంగా ఉండాలి. రష్యాలో ప్రజలేలా ఉత్తమ స్థితిలో ఉన్నారో అనీ చెప్పాలి” అన్నాడు.

“నాకు లెక్కలేమి వచ్చును రెడ్డీ?”

“లేక్కలు చదువు, అందాకా వచ్చినట్లు నటించు!”

“ఉపన్యాసాలలో నటనే?”

“అది జీవిత నటన!”

“వారెవా! ఫ్యాక్టరీలలో నటన, ప్రేమలో నటన, భోజనంలో నటనా?

ఈ ప్రపంచ మొక నాటకరంగం,

అందులో మనమే పాత్రలమూ

అం తా న ట నా

అం తా ఘ ట నా

అ ఘ ట న ఘ ట నా

ఉ ప న్యా స మ ట నా?”

ఆ రాత్రి అనంతలక్ష్మి ఇంటికి వెళ్ళినాడు కోనంగి, అనంతలక్ష్మి బి.యే. చదువుతూంది. కోనంగి వారి ఇంటికి వెళ్ళగానే అనంతలక్ష్మి కనబడలేదు. పనిమనిషి “అమ్మగారు పార్థసారధి మొదలయ్యారు జడ్జిగారింటికి వెళ్ళారు. తాము వచ్చేవరకు మిమ్మల్ని ఆపమని చెప్పారు” అని కోనంగితో చెప్పింది.

ఇంతలో జయలక్ష్మి అక్కడకు వచ్చి “కోనంగిరావుగారూ! కూర్చోండి” అని కోరింది. కోనంగి ఒక కుర్చీలో కూర్చుండి “ఏమండీ! మీరు ఒకసారి అన్ని తీర్థయాత్రలు తిరుగుదామనుకున్నారు. ఎప్పుడు ఏర్పాటు చేశారు? అప్పుడే సెప్టెంబరు నెలకూడా అయిపోవచ్చింది?” అని ప్రశ్నించాడు.

“కోనంగిరావుగారూ! మీతో కొన్ని ముఖ్యవిషయాలు మాట్లాడుదాము అనుకుంటున్నాను...”

“తప్పకుండా ముఖ్యాముఖ్య విషయాలన్నీ మాట్లాడవచ్చును.”

“మా అమ్మణి పెళ్ళి వెంటనే చేయమంటారా లేకపోతే బి.యే. పూర్తి చేసిన తర్వాతా?”

“అది రాబోయే పెళ్ళికొడుకునుబట్టి వుంటుంది.”

“మా అమ్మిణికి ఉన్న భూమివల్ల పదివేల పై చిల్లర ఆదాయం వస్తుంది. రొక్కం నగదు ముప్పైవేలున్నాయి. నగలు వేయికాసుల బంగారంవరకూ ఉన్నాయి. వజ్రాలు, ముత్యాలు మొదలైనవి ఏభైవేల వరకూ ఖరీదు చేస్తాయి. ఇది మా ఆస్తి.

“అమ్మిణికి ఒక రాజకుమారుడు రావచ్చు!”

“అయితే ఏమి, అమ్మిణి నేను చెప్పినమాట వినదుగా?”

“ఏమంటుంది?”

“చెట్టిగారిని చేసుకోను పొమ్మంది.” “అయ్యయ్యో!”

“అంటే అంది! వాడు పోవడమే మంచిది. వాడు రాక్షసుడు. కాని చెట్టిగారు మావారి అన్నగారి చిన్నకొడుకు శ్రీనివాస అయ్యంగారు దగ్గర సగం ఆస్తి రాయించి పుచ్చుకొని, మా ఆస్తిలో సగం తనదనీ, వాటాలు పంచాలనీ, మావారూ వారి అన్నగారూ అసలే పంచుకోలేదనీ, కాబట్టి వారి ఆస్తి విల్లు చేయడానికి ఆధికారం లేదనీ, ఇన్నాళ్ళ నుంచీ నేను అనుభవించి నందుకు తనకు ఫలసాయం క్రింద ఏభైవేలల్లో సగం ఇరవై అయిదువేలు రావలసి ఉంటుందనీ వ్యాజ్యం వేశాడు.”

“ఆరి దుర్మార్గుడా! వేశాడూ, ఏం చేద్దామని మీరు?”

“మా అమ్మిణి వాళ్లి చేసుకుంటే వ్యాజ్యం వదలుకుంటాడుట!”

“ఎంతటి దుర్మార్గుడూ!”

“మీ సలహా?”

“మీరేమి ఆలోచించారు?”

“ఈవాళే నోటీసులు వచ్చాయి. తంజాపురి సబుకోర్టునుండి.”

“వకీలుతో ఆలోచించారా?”

“మావారి అన్నగారి పెద్దబ్బాయి అనంతకృష్ణ అయ్యంగారు మా అమ్మాయికి పాఠం చెబుతూ ఉంటాడు. ఆయనకీ నోటీసులు అందాయట. ఆయన తెల్లబోయి ఎంత దుర్మార్గుడు చెట్టియారు అన్నాడు. తన తమ్ముణ్ణి నానాతిట్లు తిట్టినాడు.”

7

కోనంగి చెట్టియారుగారి కోపానికి ఆశ్చర్యం పొందనే లేదు. అతనికి చెట్టియారుగారి గుణగణం కరతలామలకమే. చెట్టియారికి అనంతలక్ష్మిని వివాహం చేసుకోడం ముఖ్యంకాదు. అనంతలక్ష్మిని అనుభవించడమే అతడు కోరేది. ఆ బాలిక భార్య అయితే అందంలేదు. భార్యలు చప్పబడి పోతారు. మనకు కావలసినప్పుడు వెళ్ళి ఒక అందమైన బాలికను అనుభవించడంలో ఉన్న బ్రహ్మానందం ఆమెను భార్యను చేసుకోవడంలో ఎక్కడ నుంచి వస్తుంది? అది లేనిపోని తద్దినం నిష్కారణంగా నెత్తిన తెచ్చి పెట్టుకోవడమే!

వెల ఇచ్చి అనుభవించే స్త్రీలు నిజమైన ఆనందం ఇవ్వలేరు. వాళ్ళల్లో ధనం ఎక్కువ పుచ్చుకొనేవాళ్ళు ఉండవచ్చుగాక! కాని వాళ్ళు బజారులో వస్తువుల వంటివారు. అందరానిపండుకు ఆశించి, ఆ పండును కోరి కోరి, కష్టపడి సంపాదించుకొని, అనుభవించడంలోనే ఆనందం, మహదానందమూ ఉన్నాయి. అదీ చెట్టియారుగారి వ్యక్తిత్వం అని కోనంగి ఏనాడో అర్థం చేసుకున్నాడు.

"చెట్టియారుగారి చరిత్రలు కథలుగా సినీమా లోకంలో చెప్పుకోడం కోనంగి బాగా విన్నాడు. ఊం కొట్టాడు. అతడు సినిమా తారలకోసం ప్రాకులాడుతూంటే ఎవరికీ నష్టంలేదు. కాని పండంటి కాపురాలు చెడగొట్టడమూ, ఏమీ ఎరగని బాలికలను అధోగతిలోకి కూలదోయడమూ, సినీమాలలో ఏదో ఒలుకుతుందని కానీ, ఏదో తారుమారు చేద్దామనిగాని, బీదతనంచే కుళ్ళిపోయి అది నాశనం చేసుకొని, తలెత్తి బ్రతుకుదామనిగాని, బాలికలు కొత్తగా సినిమా ప్రపంచంలో అడుగుపెట్టితే, ఆ మాయాలోకంలో మన చెట్టియారువంటి ఉదార హృదయులూ, అతి గొప్పనటకులూ పొంచివుండే పెద్దపులులై ఆ బాలికలను కబళించి వేస్తారు. అక్కడే సినీమాలోని విషాదాంత నాటిక ప్రారంభ నాందీశ్లోకం పాడుతుంది అని కోనంగికీ దృఢతరమైన నమ్మకం కలిగింది.

మన చెట్టియారుగారు ఎన్ని సినీమా కంపెనీలలోనో భాగస్వామిగా ఉన్నాడంటే ఇదే రహస్యం. ఆయన స్త్రీ వాంఛ అడవుల్ని అడవుల్ని ఆహుతికోరే దావానలం. ఆయన పురుషత్వం ఎప్పుడూ స్త్రీలు అనే జడివానలను కోరే భయంకరమైన ఎడారి. అతని పురుషత్వం వృకోదరం! అతని పురుషత్వం ఎంతో లోతు ఉన్న దొంగ ఊబి.

అతనికి జయలక్ష్మిగాని, అనంతలక్ష్మిగాని అందకపోవడం పెద్ద తలవంపు లయిపోయింది. అతని ‘షరం' మచ్చపడింది. అతని ‘ఇజ్జత్' విరిగి పోయినట్లయింది. అతని గౌరవం, మర్యాదా మంటకలిసిపోయాయి. అతని సిగ్గు చిట్టిబండలపాలయింది.

అందుకని చెట్టియారుగారు జయలక్ష్మిపై కత్తికట్టాడు. అనంతలక్ష్మి తండ్రి రంగయ్యంగారు మంచి న్యాయానుభవం కలవాడు. అందరిలోనూ తెలివైనన్యాయవాదుల నాయకులు ఆయనకు మిత్రులు. తన ఆస్తి సంపూర్ణ హక్కులతో జయలక్ష్మికీ, అనంతలక్ష్మికీ మరణశాసనం వ్రాసినాడంటే, అన్ని కట్టుదిట్టాలు చేయకుండా వ్రాస్తాడా? రంగయ్యంగారు పోయి అరేళ్లు కాకుండా వ్యాజ్యం తెచ్చారు. అంతవరకు చెట్టియారుగారు జాగ్రత్తవంతులే. చరాస్తికి దఖలు దస్తావేజులు శ్రీనివాసఅయ్యంగారు రాసి ఇచ్చాడుట. నగలు అవీ కొనడం అన్నీ జయలక్ష్మీ పేరునే, ఆయన రాసిన ఉత్తరాలన్నీ జయలక్ష్మిని భార్యగా ఎంచే రాసినారు. అందుకని చరాస్తిపై వ్యాజ్యం వేయలేకపోయాడు. జయలక్ష్మికి ఇప్పుడు నలభయినాలుగేండ్లు. రంగయ్యంగారికీ జయలక్ష్మీకీ ఇరవైఏళ్ళ సంబంధం! అయ్యంగారు ఏ అవుసరపు పనులకు తన భూముల గ్రామాలకు వెళ్ళినప్పుడో తక్క జయలక్ష్మిని వదలి ఉండలేదు.

రంగయ్యంగారి విల్లు చెన్నపట్నంలో వ్రాశారు. న్యాయవాదుల సలహా సంప్రతింపులలో ఆ విల్లు రిజిష్టరయింది. అది తర్వాత న్యాయస్థానంలో అనుమతింప బడింది. ఆ ప్రకారమే ఆస్తి అంతా జయలక్ష్మికి దఖలుపడింది.

ఈ విషయాలన్నీ కోనంగి తెలుసుకున్నాడు. కోనంగీ, డాక్టరు రెడ్డిగారూ కలిసి రంగయ్యంగారి వకీలయిన వరదరాజయ్యంగారితోపాటు అప్పటికి బాగా పేరుపొందిన ఆంధ్ర వకీలయిన గోపాలరావుగారిని ఏర్పరచారు.

రంగయ్యంగారు వ్రాసిన విల్లులో రంగయ్యంగారి అన్నగారి దస్కత్తులేదు. కాని కోనంగి రంగయ్యంగారి కాగితాలన్నీ వెదుకుతూవుంటే ఆయన అన్నగారు వెంకటేశయ్యం గారు వ్రాసిన ఉత్తరాలు దొరికాయి. ఆ ఉత్తరాలలో రంగయ్యంగారూ, వెంకటేశయ్యంగారూ పంచుకున్నట్లు స్పష్టంగా వొప్పుకుంటూ వున్నట్లున్నది.

వెంకటేశయ్యంగారి పెద్ద కుమారుడు అనంతకృష్ణయ్యంగారు మర్నాడు తన తమ్ముడు తనకు రాసిన ఉత్తరాలకట్ట పట్టుకువచ్చాడు. ఆ కట్టలో అనేక ఉత్తరాలలో అతడు తన తండ్రికీ పినతండ్రికీ పంపక మయిందని వప్పుకున్నట్లూ, జయలక్ష్మి ఆ భూములు అనుభవించడం వొప్పుకున్నట్లూ స్పష్టంగా వుంది.

అవన్నీనీ, ఇతర దస్తావేజులు అన్నీ చూస్తే పాలుపంపకాలున్నట్లూ, అలా భూములూ, ఇల్లూ అమలు అవుతున్నట్లూ, దానిలో రంగయ్యంగారి భాగం జయలక్ష్మికి దఖలు అయినట్టూ, ఆమే అవి అనుభవిస్తున్నట్లు స్పష్టమయిపోయింది.

చెట్టియారుగారు వేసిన వ్యాజ్యంలో రంగయ్యంగారు రాసిన విల్లు లా ప్రకారం చెల్లదనీ, అందుచేత ఆ విల్లు లేనట్లే అవుతుందనీ, అలా విల్లు లేక ఆస్తి అన్యాయంగా అనుభవించే జయలక్ష్మికి హక్కు వుండదనీ, భావంచేత వెంకటేశ అయ్యంగారి రెండవ కుమారుడైన శ్రీనివాసయ్యంగారు మొదటి ప్రతివాది హక్కు వొప్పుకొన్నట్ల, దానికి న్యాయశాస్త్ర దృష్ట్యా ఏమీ తాహతు లేదనీ వుంది.

- ఈ పనంతా కోనంగి చక్కబెడుతూ తనకున్న దస్తావేజులకు జాబితా, వానిలో వుండే సారాంశమూ రాస్తూ వుంటే, అతనికి అనంతలక్ష్మి ఎంతో సహాయం చేస్తూ వున్నది.

“మీరు ప్లీడరుగారు, నేను గుమాస్తానూ కాదూ?”

"కాదు లక్ష్మీ నేను పెద్ద వకీలును, నీవు చిన్న వకీలువు!”

“ఆమ్మో! నాకు న్యాయవాదం చదవాలని లేదండీ గురువుగారూ!”

“నాకు మాత్రం మహావున్నట్లు, న్యాయవాద విద్య నేను చదవలేదు. చదవదలచుకోలేదు.”

“మీలో ఆ శక్తి వుంది;”

“నీలో లేదా?”

“నాలో గుమాస్తా శక్తి వుంది!”

“నాలోనూ అంతే. నేను హెడ్ గుమాస్తాను, నువ్వు నా సహాయకురాలవు.”

“మీకు మావ్యాజ్యాల గొడవ ఎందుకు?”

“మా ఆవిడ వ్యాజ్యాలు నావి కావా?”

“ఏమిటి! అయితే, నేను చేసేవంటకు మీరు సహాయం చేస్తారా?”

“ఓ! భోంచేయడం!”

“అయితే నేను వంటే చేయను.”

“నువ్వు వంటచేయని భోజనం నేను ఆరగిస్తా?”

“ఎల్లాగు?”

“నిన్ను తనివార ముద్దు-”

“అఁ ఆఁ!”

8

“అనంతలక్ష్మి! నేను ప్రేమ అంటే ఏమిటో యిదివరకు యెరగను. నాతోపాటు చదివిన కొందరు బాలలను దూరంగా చూస్తూ గుటకలు మింగేవాడిని. దగ్గరకు వెళ్ళి యెంతో జాగ్రత్తగా వ్యంగ్యార్థాలు కూడా మాట్లాడేవాణ్ణి. హాస్యసంభాషణ చేసి నవ్వించేవాడిని. ఈడు వచ్చిన బాలుణ్ణి, బాలికను కామం స్పందింప చేస్తుంది. కాని ప్రేమ అనేది కాని. విపరీత కామేచ్చగాని వుంటేనే బాలబాలికలు హద్దు మీరుతారు. బాలికలకు బాలురందరినీ వాంఛించడం వుండదు. వారిలో జాగ్రత్త ఎక్కువ. అనుమానాలు ఎక్కువ. అందుచేత యెప్పుడో కాని బాలిక హద్దు మీరదు. బాలుడు యెప్పుడూ హద్దుమీరడానికి సిద్దమే. కాని వివాహాదులకు మాత్రం జాగ్రత్తగా ఆలోచిస్తాడు.

“ఎందుకండీ ఈ ఉపన్యాసమంతా?”

“వస్తున్నా! నిన్ను చూచినంతవరకూ ప్రేమ అనే పదార్థము ప్రపంచంలో వుంటుంది అనుకోలేదు. ఇది వట్టి కవుల భావన మాత్రం అని అనుకునేవాణ్ణి)

“అయితే మీరు ఏ బాలికనూ వాంఛించలేదా?”

“ఊళ్ళో 'అనీ' అనే ఆంగ్లో ఇండియన్ బాలిక వుంది. ఆమె నన్ను ఒకసారి గాఢంగా వాంఛించింది...”

అనంతలక్ష్మి చటుక్కున లేచింది. ఆమె మోము కందిపోయింది. కళ్ళు నిప్పులు , కురిశాయి. కోనంగి అది చూచి నవ్వుతూ లేచి, “అనంతం! తొందరపడకు చివరివరకూ విను. నేను ఆ క్షణంలో గంగలో పడిపోదును. కాని నిన్ను అదివరకే చూచివున్నాను. అదో కారణం. వివాహం లేక కామసంబంధం పెట్టుకోలేనన్న నాలోని మహాకోర్కె ఓటి నన్ను క్రిందకు పడిపోకుండా ఆపుచేసింది. నేను ఇంతవరకూ సీదోషమేమీ ఎరుగనని నీతో ఆత్మపూర్వకంగా చెబుతున్నాను లక్ష్మీ!” అన్నాడు.

అనంతలక్ష్మి కన్నుల నీరు కారిపోవగా, నెమ్మదిగా అడుగులువేస్తూ కోనంగి కౌగలిలోనికి పోయింది వారలా ఎంతసేపున్నారో, జయలక్ష్మీ రావడంవారు చూడనేలేదు జయలక్ష్మి దగ్గు దగ్గింది. అంతటిలో వారిరువురు కౌగిలి విడిపోయారు. ఇద్దరి కన్నులు బాష్పములతో నిండివున్నవి.

జయలక్ష్మి ఆ విషయం ఏమీ గమనించనట్లు నటించి “ఏమండీ కోనంగిరావుగారూ! మీపని ఎంతవరకు వచ్చింది?” అని అడిగింది

కోనంగి: అన్ని దస్తావేజులు అయిపోయాయి. ఇంక ఉత్తరాలు మిగిలివున్నాయి.

జయలక్ష్మి: అమ్మిణి మీకు సహాయం చేస్తోందా, పనికి అడ్డువస్తోందా?

అనంతలక్ష్మి: అదేమిటే అమ్మా! నేనేమి అడ్డువస్తున్నాను. అలా అంటావు? నేను లేకపోతే మా మాష్టరుగారు సగం దస్తావేజులన్నా పూర్తిచేయలేకపోదురు.

కోనంగి: అంతవరకూ నిజమేనండీ!

జయ: ఏమో మీరిద్దరూ తోడిదొంగలే!

కోనంగి: మీరన్నది కొంత నిజం కూడాను!

అనం: ఆయన దొంగేమో కాని, నేను మాత్రం కాను అమ్మా!

జయ: నిన్ను మాత్రం నమ్మమని ఎక్కడుంది. మీరిద్దరూ భోజనానికి లెండి. మన దావా స్టేటుమెంటుకు పదిహేనురోజులే వాయిదా! మీరిద్దరూ ఈపని పూర్తి చేసిన వెంటనే మనం ముగ్గురమూ, ఇక్కడి మన వకీళ్ళూ, మా గుమాస్తా అందరమూ బయలుదేరి తంజావూరూ, మన్నారుగుడీ పోవాలి.

కోనంగి: తప్పకుండా!

అనంత: తప్పకుండా

జయ: నువ్వు వెళ్ళి భోజనానికి దుస్తులు మార్చుకురా అమ్మిణీ!

అనంతలక్ష్మి వెంటనే లోనికి వెళ్ళుతూ తల్లికి కనబడకుండా కోనంగికి కళ్ళు గలిపి చక్కాబోయింది.

జయ: కోనంగిరావుగారూ, మిమ్ము మా అమ్మిణి ప్రేమిస్తోంది. మిమ్మల్ని తప్ప ఎవర్నీ పెళ్ళిచేసుకోనని స్పష్టంగా చెప్పేసింది. మీరు తన్ను గాఢంగా ప్రేమిస్తున్నారనీ, పెళ్ళిచేసుకుంటారనీ అమ్మిణి నాతో చెప్పింది. మొన్న కొంచెం ఈ విషయం మీ దగ్గర కదిపాను. మీ ఉద్దేశం స్పష్టంగా చెప్పండి.

కోనంగి: మీ అమ్మిణినే నేను ప్రేమిస్తున్నాను. ఇదివరకు ప్రేమ అంటే ఏమిటో ఎరుగను. ఇంతవరకూ ఏ స్త్రీతోనూ ఎలాంటి సంబంధమూ ఎరగను. అనంతలక్ష్మికి భర్త నవడంకన్న నా అదృష్టం ఇంక ఏదీ ఉండదు. నన్ను గురించి మీరు పూర్తిగా తెలుసుకున్న తర్వాతగదా నన్ను మీరా ప్రశ్న వేయడం? నేను మీ అమ్మాయికి తగుదునా అనే భయంచేత మొదటి నుండీ అనంతాన్ని నిరోధం చేశానుకాని, నేనుకూడా కాదనలేని స్థితికి లాక్కుని వచ్చింది. మీ అమ్మాయి ఎంతో ఉత్తమస్థితికి వెళ్ళవలసివున్నది.

జయ: ఏమిటా ఉత్తమస్థితి?

కోనంగి: ఇంగ్లండు అమెరికాలు వెళ్ళి పెద్ద పరీక్షలు ప్యాసయి రావసిన అమ్మాయి.

జయ: ప్యాసయి?

కోనంగి: ఇక్కడ పెద్ద ఉద్యోగాలు చేయవలసిన అమ్మాయి!

జయ: మీరు?

కోనంగి: నేను కటిక దరిద్రుణ్ణి!

జయ: సినీమాలో బాగా సంపాదించారుగాదా! సంపాదించగలరు!

కోనంగి: సినీమా నా కేమీ ఇష్టంలేదు.

జయ: ఇష్టంలేక?

కోనంగి: ఏదైనా పారిశ్రామిక విద్య చదువుకుందామని.

జయ: ఏమిటది?

కోనంగి: ఇంకా ఏదీ నిశ్చయం చేసుకోలేదు. గ్లాసు పరిశ్రమో, ఇనప కర్మాగార విద్యో, నూనె పరిశ్రమో, విద్యుచ్ఛక్తి విద్యో?

జయ: అయితే మా అమ్మిణిని మీరు వివాహం చేసుకోవడానికి ఏమి అభ్యంతరం?

కోనంగి: నేను బీదవాణ్ణి!

జయ: అదేమిటండీ! మాట్లాడితే బీదవాజ్ఞంటారూ? మీ బీదతనంవల్ల మాకు అభ్యంతరం లేదు. మీరే మా అమ్మిణికి తగినవారు. నాకు ఆమె ఒక్కతే బిడ్డ! కొడుకులు లేరు. భగవంతుడే మిమ్మల్ని మా ఇంటికి తీసుకు వచ్చి ఆ రోజున మా గుమ్మం దగ్గర నిలబెట్టాడు. మా అమ్మాయిని వివాహం చేసుకుని నాకు కొడుకులు లేని లోటు తీర్చండి. ఇది నా ప్రార్థన! మీకు ఇష్టంలేక ఈ నాటక మాడుతున్నారంటే స్వచ్చమయిన మా అమ్మాయి జీవితం అంతా కుంగదీసిన వాళ్ళవుతారు.

కోనంగి తలవంచుకొని, “అలాగేనండి! ఆమె నాకు భార్యకాక, నేను జీవంలేని కఱ్ఱనే అయిపోతాను. పెద్దలతో ఆలోచించి మీరు ఎప్పుడు ముహూర్తం పెట్టినాసరే!” అన్నాడు.

9

జయలక్ష్మి కోనంగి కడకు కళ్ళనీళ్ళు తిరుగుతుండగా వచ్చి అతని చెంపలంటి తన చెంపలకు విరిచికొని లోనకు గబగబ వెళ్ళిపోయి తన పూజామందిరము కడ ఉన్న భర్త చిత్రానికి సాష్టాంగపడి. స్వామీ, ఈ అబ్బాయి అమ్మిణికి తగిన భర్తెనా?” అని వేడుతూ అడిగింది. ఆమెకు ఆ బొమ్మ చిరునవ్వు నవ్వినట్లయింది.

డాక్టరు ఇంటిదగ్గర ఉండే రోజుల్లో కోనంగికి డాక్టరు స్నేహితులు జనాబ్ మొహమ్మద్ మొహిద్దీన్, బార్-ఎట్-లా గారితోనూ, కాట్రేడ్ కాంతారావు, ఎం.ఎల్.సి. ఆంధ్ర కమ్యూనిస్టుపార్టీ అధ్యక్షునితోనూ, రిక్షావారి సంఘం ఉపాధ్యక్షుడు, రిక్షాలాగే వారిలో ప్రథమ బహుమానమందిన వారునూ అయిన వరదరాజులతోనూ, అఖిలాంధ్ర రైతుసంఘ కార్యదర్శి కృష్ణదేవరాయచౌదరితోనూ మంచి స్నేహం కుదిరింది.

కోనంగి మొదటి నుంచీ కాంగ్రెసు వారితో స్నేహం చేస్తూనే ఉన్నాడు. ఆంధ్ర కాంగ్రెసు కార్యాలయంలో మూర్తి అనే కాంగ్రెసు సేవకునికీ, కోనంగికీ ఎంతో స్నేహం అయింది. డాక్టరు రెడ్డి కాంగ్రెసు వారికీ వైద్యుడే! అక్కడే రియాసత్ ఆలీ అనే కాంగ్రెసు ముస్లిం కూడా కోనంగికి స్నేహితులయ్యారు. వీరే గాకుండా వీనస్ వస్త్రయంత్రాలయం కూలీల నాయకుడు పాములపాటి జేము అనే క్రైస్తవునితో స్నేహం గాఢమైంది.

స్నేహితులందరితో ఎప్పుడూ కోనంగి వాదిస్తూ ఉండేవాడు. ఎవరు ఏ విషయంమీద వాదిస్తే వారికి ఎదిరిగా వాదించడం అంటే కోనంగికి మహాసరదా. ఆ వాదనైనా తర్కరూపంగా ఉంటుందా? హేళన, హాస్యము, అవహేళన, అపహాస్యమూనూ! అవతలివాడు అతిపూటుగా మాట్లాడుతూ ఉంటే ఆ వాదనంతా ఇనుపగుండు అనుకున్నవాణ్ణి దూదిపింజలా ఎత్తి అవతల పారవేస్తాడు. కోనంగిని బాగా అర్థం చేసుకున్నవాళ్ళు నవ్వేస్తారు. తక్కిన వాళ్ళకి కోపాలు కూడా వస్తూ ఉంటాయి.

ఎంత మనిషినైనా కోనంగి ఏడ్పించగలడుగాని తనను మాత్రం చెక్కు చెదర్పలేడు. ఇంతమంది స్నేహితులున్నా తన హృదయం సంపూర్ణంగా చెప్పే స్నేహితులు కోనంగికి ఇద్దరే! ఒకడు డాక్టరు రంగనాయకులు రెడ్డి, రెండోవాడు రియాసత్ ఆలీనీ.

ఆ డాక్టరు రెడ్డిగారి ఇంటా, ఆంధ్రమహాసభా మందిరంలోనూ కోనంగి అనేకమందిని కలుసుకుంటూ ఉండేవాడు.

ఆంధ్రమహాసభ వాతావరణంలో మూడే ముఖ్యవిషయాలు. ఒకటి పేకాట, రెండు నాటకాలు, మూడు బిల్లార్సు, టెన్నిస్, పింగ్ పాంగు మొదలయిన ఆటలూ, వాని పందేలూ.

మదరాసు ఆంధ్రులు పేక ఆడడం మొదలు పెడితే ఆట వరసగా రోజులు రోజులు ఆడగలరు. హెూటల్సునుంచి సెట్టు గిన్నెలలో భోజనాలు వస్తాయి. మహాసభ భవనంలో మంచి కాఫీపౌూటలుంది. సిగరెట్లు, బీడి, వెత్తలపాకు దుకాణమూ ఉంది. మూడుముక్కల ఆట, అయిదు ముక్కల ఆట, బ్రిడ్జి ఆంధ్రులకు మా ఇష్టం. కొందరు జట్టులవారు రూపాయలు మేజులుపెట్టి ఆడ్డారు. వేలకొలది రూపాయలు మారుతూ వుంటాయి. ఆంధ్ర మహాసభకు ఒక్క పేక అమ్మకంవల్ల అద్దె డబ్బులు రెండువందలు వచ్చేస్తాయట.

ఇంకా నాటకాల విషయంలో మహాసభవారు చాలా శ్రద్ధ తీసుకుంటారు. మహాసభ సభ్యులలో చాలామంది వేషాలు వేస్తారు. చక్కగా అభినయం చేయగలరు. ఊళ్ళో అనేకం సినీమా కంపెనీలు ఉండడంవల్ల అనేక మంది తారలు మధ్యే మధ్యే పానీయం క్రింద ఆంధ్రమహాసభా నాటకాలలో వేషాలు వేస్తూ ఉంటారు.

కోనంగిరావుగారు కూడా ఆంధ్రమహాసభలో సభ్యుడయ్యాడు. ఒక చిత్రంలో ఎంతో ఖ్యాతి సంపాదించుకున్న సినీమా నాయకునికి ఎక్కడ ప్రవేశంలేదుకనక!

అయినా ఆంధ్రులు వీరపూజావలంబకులు కారు. వారికీ రాజకీయ నాయకులన్నా లెక్కలేదు. ఒక్క మహాత్మాజీ విషయం మాత్రం ఒక మోస్తరుగా ఆలోచిస్తారు. తక్కిన పటేలు, నెహ్రూ, రాజేంద్రబాబు, సరోజినీనాయుడు మొదలయిన వారంటే లెక్కాపత్రమూ లేదు. అలా అని గౌరవం చేయరనుకోకూడదు. ఎంత మాత్రము కూడదు. ఊళ్ళ ఊళ్ళలోనూ లక్షలకొలది జనం రావడం, నాయకుణ్ణి బ్రహ్మరథం ఎక్కించడమూ ఉండి తీరుతుంది.

కోనంగి పెద్ద వీరుని క్రింద తన్ను తన ఆంధ్రులు చూడలేదని ఏమీ బెంగపడలేదు. ఇంతకూ అతన్ని వేషం వేయమన్నారు అదే పదివేలు.

వేసే నాటకం ఉషాపరిణయం. కొందరు కోనంగిరావుగారు అనిరుద్ధుడుగా ఉండాలన్నారు. కొందరు మరొకరన్నారు. చివరకు కోనంగిరావుకు ప్రద్యుమ్నవేషం ఇచ్చారు. అయితే ఉషవేషం వేసే అమ్మాయి ఒక పెద్ద తెనుగు సినీమాతార. పెద్ద అంటే ఆరడుగుల దెయ్యంలాంటి మనిషి కానేకాదు. సన్నగా పొట్టిగా శలాకులా బంగారు పిచ్చికలా ఉండే మనిషికి అవిడకి ఒకే పక్షీంద్రుడు కాక ఇద్దరు పక్షీంద్రులున్నారు. అయినా అవిడ హృదయం నవనీతం గనక తన యౌవన సుధారసాన్ని సరియైన, తను అందుకోగల, తన కవసరమైన రసికావతంసులకు గ్లాసులకొద్దీ గ్రోలనిస్తుంది.

ఆవిడకు మామగారుగా మాత్రం రావడం కోనంగికి తన అదృష్టమనుకున్నాడు. అయితే ఇంక రతీదేవి ఎవ్వరుబాబూ అని కోనంగికి అందోళన కలగకపోలేదు. అవిడ తనపాలిట రతీదేవే అయితే ఇంక తాను అతనుడు, అనంగుడు, అశరీరుడు, విదేహుడు కావలసి ఉంటుంది. అలా తాను అనంగుడు కాలేకపోతే సీనారేకు పుష్పబాణాలు చేయించుకొని వంటినిండా వాడి మొనలుగల ఆ బాణాలు దండలుగా దండికడియాలు కాళ్ళ కడియాలుగా మొలనూలుగా యజ్ఞోపవీతంగా తలకిరీటంగా మీసాలుగా (పూల మీసాలు ఎందుకు ఉండకూడదు? అని కోనంగి వాదన) ఉంటే కొంత రక్షకపూల కవచం కుదరవచ్చును అని కోనంగి అనుకున్నాడు.

ఎవరో వస్తున్నారు వస్తున్నారు అని ఆంధ్ర మహాసభ నాటకాల కార్యదర్శిగారు మూడురోజులు ఊరించి చివరకు మూడోరోజు రాత్రి కారు మీద ఆ రతీదేవిని తీసుకు వచ్చారు.

వీరందరూ రిహార్సల్ వేసే గదిలోకి ఆ అమ్మాయి రాగానే, అమ్మయ్యా అని కోనంగికి ఎంతో అనందం అయింది. తన రతీదేవి, దుక్కిటెద్దుల చిత్రంలో తన నాయికే!

కోనంగిరావుగారి ఆవిడ “ఏమండీ భర్తగారూ, మళ్ళీ మనం ఇద్దరం భార్యాభర్తల మవుతున్నాము” అని పలుకరించింది.

“వట్టి భార్యాభర్తలటండీ!”

“ఏదైనా గట్టిరకం భార్యాభర్తలం అవుతామా ఏమిటి? నిజం చెప్పండి! మా ఆయన గోలపెడ్తాడు!”

గట్టిరకంకన్న పై రకమమ్మా స్త్రీపురుషులందరూ భార్యాభర్త లవడానికీ, ప్రేమికా ప్రేమికులవడానికీ, విటనాయికా నాయకులు కావడానికీ, తాత్కాలిక కామసంబంధాలు కలవడానికీ ఎవరైతే కారకులో ఆ దివ్య భార్యాభర్తలం! రతీమన్మథులం మనం!

10

ఆంధ్ర మహాసభలో నాటక కార్యదర్శిని కలుసుకొన్నాడు కోనంగి. ఆయనతో నాటకం విషయంలో తన అభిప్రాయాలు ఘట్టిగా తెలిపాడు.

కార్యదర్శి: మీ సలహా నాకు వినడానికి ఏమీ అభ్యంతరం లేదు గాని, మనం నాటకాలలో ఈనాడు ఉన్న భావాలు గమనించాలి కదండీ!

కోనంగి: అది సరేగానీ, ఈ రోజున సరియైన నాటకాలు ఆడడం విధానం ఎక్కడ ఉందండీ?

కార్యదర్శి: మన స్థానం నరసింహారావుగారు లేరా? బందా కనకలింగేశ్వరరావు గారు లేరా? నిడుముక్కల సుబ్బారావుగారు, మాధవపెద్ది వెంకట్రామయ్యగారు, పులిపాటి వెంకటేశ్వర్లుగారు, సూరిబాబుగారు, బెల్లంకొండ సుబ్బారావుగారు, రాఘవాచార్యులుగారు, వీరంతా నాటకాలు ఆడటం లేదా?

కోనంగి: అవును, వున్నారండీ బాబూ వున్నారు. నాట్యకళను వెలిగించడానికి!

కార్యదర్శి: అదేమిటండీ అలా మాట్లాడుతారూ?

కోనంగి: ఏమండీ చిదానందంగారూ! మీరు కోప్పడకుండా వుంటే చెపుతాను. ఉదయశంకర్ వచ్చి నాట్యకళకు నూతనజీవం పోసేవరకూ, మనదేశంలో కూచిపూడివారి నాట్యాలు, భోగంవారి నాట్యాలు ఎలా వుండేవి చెప్పండీ?

చిదా: ఏమో, నేనా నాట్యాలూ చూడలేదు, నాటకాలు చూడలేదు!

కోనంగి: నేను మాత్రం మహాచూశానా ఏమిటిగానీ, ఆయినా చూసినంతమట్టుకు చెబుతున్నాను. తైతక్కతైతక్కడాన్సులూ, గంతులూ, కోతి అభినయాలూ, వేషాలూ విరేచనాల మందు పుచ్చుకుంటే కడుపులో కుదిపేసినట్లే! ఈనాటికికదా కాస్త వెంపటి సత్యనారాయణ, వేదాంతం రాఘవయ్య, వేదాంతం జగన్నాథశర్మా మొదలయినవాళ్ళు నాట్యరూపం మార్చి; అసలయిన భారత సంప్రదాయానికి నూతనజీవం, నవ్యశక్తి, నూతనోద్దీపన ఇచ్చారు. సంప్రదాయ విరుద్ధం కాకుండా కొత్త ఆశయాలూ, కొత్తదైన ప్రదర్శన విధానము చూపిస్తున్నారు.

చిదా: బాగా ఉందండీ కోనంగిరావుగారూ! నాటకాలు కూడా సినీమా భావాలవల్ల నైతేనేమీ, పాశ్చాత్య సంపర్కంవల్ల నైతేనేమీ మార్పులు పొందనే పొందాయికాదా?

కోనంగి: పొందాయి. ఒక్క డి.వి.సుబ్బారావుగారి కంపెనీయూ, అలాంటివే కొన్ని అమెచ్యూరు కంపెనీలూ తప్ప, సరియైన కంపెనీలుగాని, సరియైన నాటక విధానంగాని ఒక్కటంటే ఒక్కటైనా ఉందా?

చిదా: ఇంతకీ మీరనేది?

కోనంగి: నేననేది ఏముందీ? మనకు ఒకకోటి వీళ్ళున్నాయి. అద్భుతమైన నాటకవిధానం చూపించడానికి.

చిదా: ఏదో గాలికబుర్లు చెప్పక నాలుగు గట్టి విషయాలు చెప్పండిమరీ.

కోనంగి: ఏమి గట్టి విషయాలు, మన తెలుగుదేశం నిండా నిండిపోయిన నాటకాలలో గట్టివిషయాలు ఏమున్నాయి చిదానందంగారూ! పద్యాలు గొంతుక చించుకుని నాటకశాల అంతా నిండి, ఆ చుట్టుప్రక్కల వీధులు నింపి, ఆ ఊరంతా నింపి, పక్క ఊళ్ళు కూడా పాకేటంతగా అరిచే వారంతా గొప్పనటకులు. అభినయం మన సంప్రదాయమూకాదు, ప్రకృత్యనుకరణమూ కాదు, చివరకు ప్రాపంచకవాదమూ కాదు.

చిదా: మంచిదారి ఏమిటో సలహా యివ్వండీ అంటే, ఉన్నవాళ్ళ నందరినీ ఏకితే ఎలాగండీ?

కోనంగి: చిదానందంగారూ! ఏకకుండా పరుపు ఎల్లా కుడతామండీ?

చిదా: సరేలెండి, ఏకండి, ఏకండి! ఏ పరుపు కుడతారో అదీ చూస్తానుగా!

కోనంగి: నాటకం, ఏకపాత్రాభినయం కలది అయితే ఒక్కడే నటకుడుగాని, అభినయించే బాలికగాని, నాటకం జరుపవచ్చు: చంద్రశేఖరంగారిలా, చెంచయ్యగారిలా పేరూ సంపాదించవచ్చు. కాని నాటకం అంటే సాముదాయకాభినయపూర్ణము కాబట్టి అందరూ శ్రుతిగా అభినయించాలి. అలాంటి సందర్భంలో ఈ కాంట్రాక్టు నాటకాలు ఏమిటండీ? ఇటువైపు నుంచి ఏ పులికాటుగారో వచ్చి, ఊళ్ళోవాళ్ళను నలుగురిని కలేసుకుని నాటకం ఆడటం ఎంత హాస్యాస్పదమూ, కళకు ఎంత అవమానమూ?

చిదం: ఇవాళ మీరు నాకు లెక్చరిచ్చే సరదాలో ఉన్నారు. కానీయండి. కోనంగి: ప్రస్తుతం నేను లెక్చరిచ్చే వీరుడిలా తయారై ఉన్నాను. మీరు వినకపోతే, ఈ గోడలకూ, ఈ బెంచీలకూ ఉపన్యాసం హెూరాపౌూరీగా ఇచ్చేస్తాను. చిదం: అందరూ ఏమనుకుంటారు?

కోనంగి: అనుకుంటే అనుకోనీయండి. నాటకం పోర్షను జ్ఞాపకం కోసం గట్టిగా జ్ఞాపకం చేసుకున్నా ననుకుంటారూ? జూలియస్ సీజరులో ఆంటనీలా.

చిదం: ఇంతకీ మీ సలహా?

కోనంగి: వినండి. ఒకటి: మాట్లాడవలసినచోట ఆ భావాన్ని పద్యంగాగాని, పాటగాగాని అభినయం చేయకూడదు. రెండు: అభినయానికి అనవసరంగా చేతులు కదల్చడం, మొగం, కళ్ళూ తిప్పడం ఉండకూడదు. మూడు: తెరలు ఒకే రంగువి వుండాలి. రంగస్థలం తెల్పడానికి సెట్టింగులుండాలి. నాలుగు: వేషాలు వేయడం నూతన విధానాన్నను సరించి ఉండాలి. అయిదు: సంగీతంలో హార్మోనియం ఉండకూడదు. ఆరు: నాటకంలో, పార్టు పాఠంగా వచ్చేవరకూ రిహార్సలు జరగాలి. ఏడు:

చిదం: మీ జాబితా ఎంతవరకూ ఉందిబాబూ?

కోనంగి: మీరు ఆచరించ గలిగితే డెబ్బయివరకూ ఉంది.

ఈలా అలరించేస్తూ కోనంగి కొంత నాటకవిధానంలో మార్పు తీసుకు వచ్చాడు. అసలు కవి రాసిన నాటకంలో, అనిరుదుణ్ణి పట్టుకోగానే ఉష -

“ఆహా! నా ప్రాణేశ్వరు

హతవిధి బంధించేనుగా!

ఈ సుకుమారుడు మన్మథ తనయుడు

ఏలా భరింయించు కష్టములు ఆహా!

అని ఏడ్చి మూర్చపోతుంది. అది చూచేసరికి కోనంగి రిహార్సులు గది అంతా నిండిపోయేటట్లు పకపకా నవ్వాడు. అందరూ తెల్లబోయారు. కొందరికి కోపం వచ్చింది. చిదంబరంగారు మొగం చిట్లించుకుంటూ “ఏమిటండీ ఆ నవ్వు? రిహార్సల్సులో ఈలా ప్రతిబంధకాలు పెడితే నాటకం ఏలా తయారవుతుందండీ కోనంగిరావుగారూ?” అని అన్నాడు.

“అవదండి నాకు తెలుసును. కాబట్టి కానీయ్యండి. ఏమిలేదు ఆ పాట ఎందుకూ? ఏడుస్తూ ఎవరన్నా పాట పాడతారా? అని నవ్వు వచ్చింది” అని కోనంగిరావు అన్నాడు.

ఒక నటకుడు “మీకిష్టం లేకపోతే నాటకం మానివెయ్యండి” అన్నాడు.

“కోనంగిరావుగారు మానివేస్తే నేనూ మానివేస్తాను” అని ఉష వేషంవేసే అమ్మాయి లేచి నిలుచుంది.

“మన్మథుడు లేకపోతే రతి ఎందుకు?” అని రతీదేవి వేషంవేసే అమ్మాయి లేచింది.

కార్యదర్శి గోలపెడుతూ “అదేమిటండీ, నన్ను కూయంనదిలో పడమన్నారా, ఈ నాటకం అవుతుందని పేపర్లన్నిటిలో వేశాం. ఆహ్వానాలు పంపాము. కరపత్రాలు అచ్చువేసి పంపుతున్నాము. టిక్కట్లప్పుడే వేయిరూపాయల వరకూ అమ్ముడయ్యాయి. అందులో కోనంగిరావుగారి పేరు చూచే మూడు నాలుగు వందల రూపాయలు వచ్చాయట. నాటకం మానివేసి ఆంధ్రమహాసభను నడిసముద్రములో ముంచుతారా?” అని అన్నాడు.

కోనంగి నవ్వుతూ “చిదంబరంరావుగారూ! మీరేమీ భయపడకండి. నేను మానటంలేదు. ఎవ్వరూ మానరు. ఉషా అ బొద్దు పాఠ్యం నిరుద్ధులు కలిసినప్పుడు విడివిడిగా పాటలు పెట్టారు. రతీమన్మథులు కలిసినప్పుడు పెట్టారు. అవి చాలు. ఈ రంగం తర్వాత ఒక కొత్త రంగం ఉష తన గదిలో ఒంటిగా ఉండి, తన చరిత్రకు సంబంధించినట్లు ఒక పాట పాడితే బాగుంటుంది. అది మన కవిగారే రాసినారు. అది నేను కోరితే ఇచ్చారు. ఆ రంగం కూడ రాసినారు” అని చదివి ఆ పాట పాడి అందరకూ వినిపించాడు. అది చదువుతోంటే, పాట పాడుతూంటే విని అక్కడివారు ఆ నాట్యాభినయానికి ఆనంద నిమగ్నులైపోయినారు.

11

నీలాలు విరిగినవి, నింగిలో బూడిదలు

నీటి కలువలు తూలి నిలువునా కూలాయి

1

మసక మసకేసింది మధుమాస శశిమూర్తి

2

కుసుమ మధువులు అలమె విసపు మంటలు శక

3

తెగిపోయెనా వీణ తీగెలన్నీ నేడు

పొగలెగసె ధూపాల సెగలెత్తే హృదయాన

చిత్రఫలకమునందు చేరలేదే కుంచే

పత్రరచనకు రావు వర్ణనిన్యాసాలు

(ఆమె కంటిలో అశ్రువులు చేరాయి)

చిత్రలేఖ ప్రవేశించును

చిత్ర: చెలీ! ఏమిటి ఆ కంటనీరు లేక కల్లబారి కూర్చున్నావు. నీ భర్త వట్టి అందకాడు మాత్రం అనుకున్నావు.

(ఉషాసుందరి ఎదుటికిబోయి ఆమె ఎదుట మోకరించి) ఈలా చూడా రాజకుమారీ, నీ తండ్రికి వేయి చేతులున్నాయి. కాబట్టి ఆయనను ఎవ్వరూ ఓడించలేరు. సుకుమారుడు త్రిలోకమోహనుడు అయిన నీ అందాల బాలుని సాలీడు మధుపాన్ని పీల్చినట్లు పీల్చివేయగలడని అనుకుంటూ భయపడుతున్నావు.

ఉష: (తల తిప్పకుండా నిస్పృహతో) చిత్రలేఖా, నిన్నెవరు ఆ కోమలాంగుని మాయచేసి తీసుకురమ్మన్నారు?

చిత్ర: నువ్వేగాదూ!

ఉష: ఏ విద్యచేత త్రిలోకపూజ్యుడు ఉన్నాడని గ్రహించగలిగావో, ఏ శక్తిని ఉపయోగించి అతణ్ణి ఇక్కడికి తీసుకు రాగలిగావో, అవన్నీ ఇప్పుడు బలహీనమై నిన్ను వదలి మాయమైపోయాయా?

చిత్ర: ఏమిటా మాటలు! ఉష: రోగంతో బలహీనమై పోయాయా? ఆ మాటకు సమాధానం చెప్పవేమి?

చిత్ర: బలహీనం కాలేదు. అప్పుడెంత అవిచ్చిన్నంగా ఉన్నాయో ఇప్పుడూ అంతే.

ఉష: అయితే వానిని నీ కంటిపాపలా కాపాడుతూ వెంటనే ద్వారకలో విడిచిరా! వెంటనే వెళ్ళు.

చిత్ర: ఇక్కడ నా శక్తికన్న మించిన శక్తిగల సేనాపతులు అనిరుద్ద కుమారుని బంధించినారు.

ఉష: అయితే ఏమిటి? నువ్వు నాకు ఊరడింపు మాటలు చెప్పడం సాగించావు. నీ మాయే ద్వారకా నగరవాసుల్ని మోసంచేసినప్పుడు, నీ మాయ కన్న అనేక రెట్లు గొప్పదైనదా సేనాపతుల మాయ! అలాంటిది మా నాయనగారి మాయ ఎంతో శక్తిగలదే! దానిముందు పది ద్వారకా నగరాలు ఎత్తి వచ్చినా అవి ఏమి చేయగలవు?

చిత్ర: వారేవా! యేంత తెలివిగా మాట్లాడుతున్నావు! ద్వారకా నగరము అంటే ఏదో పెద్ద పట్టణం, అందులో మామూలు ధైర్యవంతులు మాత్రం ఉంటారు. వారు మీ తండ్రిగారి ముందు ఏం చేయగలరని?

ఉష: అవును చిత్రలేఖా! (విచారంగా)

చిత్ర: ఎంతైనా తండ్రి! వెనక మీ మామగారి మేనత్త సుభద్రాదేవి నువ్వు పడిన క్లిష్ట సమస్యలోనే పడింది. అక్కడ ఆవిడ తన భర్త అన్నగారు యెక్కువ శక్తిలవారు అని అనుకోవడానికి కారణాలున్నాయి?

ఉష: వారికేమి ఉన్నాయా?

చిత్ర: ఏమిటా, ఆమె అన్నగారు అవతారపురుషుడని ఆమె నమ్మకం.

ఉష: ఇక్కడ?

చిత్ర: ఇక్కడ నీ మనోనాయకుని తాతగారు ఆయనేగా?

ఉష: అవును చిత్రా! నాతో చెప్పావుగా శ్రీకృష్ణభగవానుని పౌత్రులే

ఈ...

చిత్ర: పరమ సుందరకారుడు-అని చెప్పినానులే! నేను ఆ భగవానుని ఇచ్చలేనిదే అనిరుద్దకుమారుని తీసుకొనిరాగలిగాననా?

ఉష: ఏమిటి నువ్వనేది?

చిత్ర: నీకు నీ మీదే నమ్మకంలేదు. అసురబాలికా లక్షణం పోగొట్టుకొన్నావుకావు. మీ అత్తగారు అసురబాలిక, మీ సవతి అత్తగారూ అసుర రాకొమరితే! వారందరి చరిత్రలు నీ వంటివే! కనుక ఏమీ దిగులు పెట్టుకోకు. నీ తండ్రి పరమశివుణ్ణి ఇంట్లో కట్టేసుకున్నాడు. అయినా నీ తండ్రి ఎప్పుడైనా కౌరవుల పక్షం అవుతారేమోనని ఉన్న వేయి చేతులబలం తగ్గించివేద్దామని ఆ కృష్ణయ్యగారి ఆలోచన అనుకుంటా!

ఉష: ఉండు చిత్రా, అయితే నువ్వు వెంటనే బయలుదేరి ఆ భగవానునకు జరిగిన సంగతి చెప్పి వారిని వీరిసాయంగా....

చిత్ర: తప్పక తీసుకువస్తా! ఏమీ సందేహంలేదు. అలా ధైర్యంగా ఉపాయాలు ఆలోచించు. ఈలోగా నీ శక్తి ఉపయోగించి కారాగారంలోనో, ఇవతలనుండో వారిని కలుసుకో!

(చిత్రలేఖ నిష్క్రమించును)

రంగం - కారాగారం

ప్రవేశం అనిరుద్ధుడు

అనిరుద్ధుడు: కాపలాకాసే అసురవీరుడా!

ప్రవేశం అసురవీరుడు

అసురవీరుడు: ఏమయ్యా! ఏమిటి? ఎందుకు పిలిచావు ప్రభూ!

అనిరుద్ద: ఒక వీణ తెప్పించి ఈయగలవా?

అసుర: చిత్తము. ఎలాంటి వీణ తెమ్మన్నారు? నారద, శారద, రుద్రవీణలున్నాయి. విపంచి, రావణ హస్తము, కిన్నెర వీణలున్నాయి. ముఖవీణలున్నాయి.

అనిరుద్ద: రుద్రవీణే తెప్పించు.

అసుర: చిత్తము. పురుషునివలె అడిగారు! వాయించగలిగితే రుద్రవీణే వాయించాలి. మీ గురువు ఎవరు?

అనిరుద్ద: మా తండ్రిగారు నాకు వీణ చదువు చెప్పారు! మా తాతగారు పూర్తిచేసినారు.

అసుర: మా రాజకుమారిగారికి నారదమహరులు గురువు.

అనిరుద్ద: నారదమహర్పులు మా తాతగారు సృష్టించిన నూతన విధానాలు, మా తాతగారి దగ్గరకే వచ్చి నేర్చుకున్నారు.

అసుర: ఎవరు ప్రభూ! మీ తాతగారు?

అనిరుద్ద: శ్రీకృష్ణమహాత్ములు.

అసుర: అలాగా! విన్నాను. ఇక్కడికి ఏభైయోజనాల దూరం ఉన్న ద్వారకా నగరంలో ఉన్న వేదాంతులైన రాజర్షికాదూ?

అనిరుద్ద: అవునయ్యా వీణమాట ఏమి చేసినావు?

అసుర: చిత్తం ఇదుగో తెప్పిస్తున్నా!

అసురవీరుడు నిష్క్రమించును. ఉషాబాల బాలుని వేషంలో వీణ మోయుచుండగా అసురవీరుడు ప్రవేశిస్తాడు.

అసుర: ప్రభూ! ఈ బాలుడు వీణలో ప్రసిద్ధ గాయకుడట. మహారాజకుమారిగారు వీరిని తమకడ వీణవాయింప పంపినారు. నాకు ఎదురైనాడు వారి ఆజ్ఞతో. ఈతని పాట వింటూ ఉండండి. ఈలోగా మీకు రుద్రవీణ వచ్చేటట్లు చేస్తాను.

అనిరుద్ధుడు ఉషాదేవిని ఆనవాలు పట్టలేదు.

అని: రావయ్యా లోనికి, నువ్వు పట్టుకువచ్చిన వీణ నేను చూచినట్లున్నది.

ఇద్దరూ లోనిమందిరములోనికి నిష్క్రమిస్తారు.

తెర వాలును.

12

రంగం - కారాగారంలో ఒక మందిరం

ప్రవేశం:

అనిరుద్ధుడు అక్కడ ఒక చిరుసింహాసనము పై అధివసించి, ఉషాదేవి బాలకస్వరూపంలో వీణ వాయిస్తూ -

ఉష: (వీణ వాయిస్తూ ఉంటుంది పాట అయినది)

అని: ఏమిటయ్యా! ఈ పాట చాలా కొత్తరకంగా ఉందే?

ఉష: (నోటివైపు వేలుతో చూపించి మాటలాడలేనని వ్యంజనం చేస్తుంది)

అని: పాపం వినికిడి వున్నది. కాబట్టి పుట్టుకలో బధిరత్వంకాదు. ఎందుచేత మాటాడలేవు?

ఉష: (నాలిక చూపించి తన నొసట వేలు రాసి, విధికృత్యమని వ్యంజనము చేయును.)

అని: జబ్బు చేసిందా?

ఉష: (అవునని గట్టిగా తల ఊపును.)

అని: భగవంతుడు ఎంత నిర్దయుడు? వాయించవయ్యా, ఇంకో పాట వాయించి రాగాలాపనచేయి. నీ పాట బాగానే ఉంది.

ఉష: (ఒక కొత్తరాగం వీణమీద ఆలపించును. ఆ ఆలపించడమూ కొత్త విధానంగా ఉంది. సంప్రదాయ విరుద్ధంగా ఉంది; కాని సంప్రదాయానికి శ్రుతిగానూ ఉంది. పాట పూర్తి అవుతుంది)

అని: ఇదేమిటి? సంప్రదాయ విరుద్దంగా ఉన్నా లేనట్లు కనబడుతుంది. ఎక్కడిదయ్యా ఈ విధానం?

ఉష: (వీణమీద తాను ఉషాదేవిగా వాయించినట్లు వాయిస్తుంది.)

అని: (ఆశ్చర్యం పొందుతూ ఆ బాలకుని వైపు చూస్తాడు.)

ఉష: (వాయిస్తూ, తన తీయని కంఠంతో పాట పాడుతుంది.)

పద్మ బంధిత మధుపమూర్తికి

పాటలేలా పదములేలయ్యా,

అని: ఏమిటీ? ఎవరు నువ్వు? (చటుక్కున లేచి ఆ బాలకుని తల చీర ఊడతీస్తాడు. ఉషాదేవి జడ క్రిందకు వాలుతుంది.)

ఉష: అదేమిటండీ, నా గౌరవం అంతా భగ్నపరుస్తున్నారు?

అని: దొంగా! కంటికాటుకతో రచించుకొన్న మీసాలు అచ్చంగా నూనూగు మీసాలే అనుకున్నాను. నన్ను ఎంత భ్రమపరచావు? అసురమాయ!

(ఆమె దగ్గిర కూరుచుండి తన కండువాతో ఆమె మీసము తుడిచి వేయును.)

ఉష: నా పాటకు అడ్డం రాకండి. అంతఃపుర ద్రోహం చేసిన బంధితులకు పాట లెందుకనైనా ఆలోచింపక నేను వచ్చి పాడుతూ ఉంటే నన్ను బాలిక అంటూ అవమానపరుస్తారా!

అని: అవును, నీవు ఉషాకుమారుడవు. నేను పొరపాటున నిన్ను ఉదయించే ఉష అనుకున్నాను.

ఉష: మీరు రాత్రా!

అని: నేను రాత్రినో, ఉషను హృదయంలో ఒదిగించుకొన్న నీలాకాశాన్నో! నాకేమి తెలుసును.

ఉష: అంత మతిపోవడానికి కారణం?

అని: ఒక ఎర్ర అమ్మాయి వలలో పడ్డాను. దాంతో సగం మతిపోయింది. ఆ అమ్మాయి తండ్రి ఒక వేయి కిరణాల, బాణాల అసురుడు. విరసుడు బంధించడమువల్ల, ఆ ఎట్టి అమ్మాయిని విడిచి ఉండడం అనే విరహంలో బడి తక్కిన మతి కూడా పోగొట్టుకున్నాను.

ఉష: పాపం! అందుకనే మందులివ్వడానికి వచ్చాను.

అని: ఆ మందు నువ్వే యివ్వగలవు, రా! ఓయి వైద్యుడా, నా దేహానికి ముందు నా హృదయానికి మందు -

ఉష: చాల్లెండి! నేను వెళ్ళి మందులపెట్టి పట్టుకువస్తాను.

అని: అబ్బా! నువ్వు వెళ్ళడమే నాకు భయంగా ఉంది. నన్ను గట్టిగా అదిమి పట్టుకో వైద్యుడూ, ఎఱ్ఱని ఆ నీ పెదవులు.

ఉష: నేను వెడుతున్నా... (ఆమె లేచును. అనిరుద్ధుడు ఆమె చేయి పట్టుకొని ఆ వెనక రెండు భుజాలు పట్టుకొని, ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఉంటే...)

ప్రవేశం బాణుడు సంరంభంగా

బాణు: ఓయి దుర్మార్గుడా! అంతఃపుర ద్రోహం చేశావని, ప్రాణశిక్ష విధించాలని కారాగారంలో పెడితే ఇక్కడ కూడా....

ఉష: (భయపడుతుంది వణికిపోతుంది. తండ్రి కడ మోకరించి చేతులు జోడించి) చక్రవర్తీ! ఇదంతా నాది తప్పు, నన్ను శిక్షించండి!

బాణా: ఛీ! నిన్ను శిక్షించడమేమి? ఈతడు అంతఃపుర ద్రోహం చేశాడు.

ఉష: చేయించింది నేను.

బాణా: నువ్వు చేయించడమేమిటి?

ఉష: నేనే ఆయన్ను నా అంతఃపురంలోకి రప్పించుకున్నా!

బాణా: నువ్వేలా రప్పించుకోగలవు?

ఉష: నా చెలికత్తె నొక బాలికను పంపి ఈ మహాపురుషుడు నిద్రపోతోంటే, నా మందిరానికి రప్పించుకొన్నాను.

బాణా: అయినా వీడు పురుషుడు! అబల అయిన బాలిక ఒకర్తె మంచీ చెడుగూ తెలియని పసిబిడ్డ తన అంతఃపురానికి రప్పించుకుంటే తాను ద్రోహం చేయడమే?

ఉష: భర్త భార్యను అంతఃపుర ద్రోహం ఎల్లా చేస్తాడు?

బాణా: వాడు నీ భర్తా?

ఉష: అవును మహారాజా అవును! ఈయన్ను నేను మన అసురశక్తిచే నా అంతఃపురంలోనికి రప్పించగానే ఒక పురోహితుని రప్పించి అగ్నిసాక్షిగా వివాహం -

బాణా: ఏమిటి వివాహమా? అయితే నువ్వూ శిక్షార్హురాలివే!

ఉష: వేయండి, నా భర్తతోపాటు నాకు కూడా శిక్ష. నన్ను అబల అన్నారు. పసిబిడ్డనన్నారు. స్త్రీలు అబలలా చక్రవర్తి? ఎవరు చేశారు మమ్మల్ని అబలలుగా? మా మామగారి సవతితల్లి సత్యవతీదేవి నరకమహారాజును ఓడించినప్పుడు స్త్రీలు అబలలుగా కనపడ్డారా తమకు?

బాణా: ఏమిటీ నువ్వు అంతకన్న అంతకన్న ఔచిత్యం మీరి మాట్లాడుతున్నావు. నీ ఎదుటనే నీ దొంగ భర్తను బట్టలొలిపించి ఒళ్ళంతా హూనమయ్యేటట్లు కొరడాతో- (అంటూ అనిరుద్దుని కడకుపోయి అతని రెండు చేతులు పట్టుకుంటాడు. ఉష తూలి క్రిందకు వాలిపోతోంది.)

ప్రవేశం ప్రత్యక్షమయినట్లు ప్రద్యుమ్నుడు.

ప్రద్యు: (పకపక నవ్వుతూ) వేయి బాహువుల బలంగల మా బావగారు బాలకుల మీదకు పోతున్నారు, ఇదట ఇదీ మీ ప్రతాపం? సమఈడుగల వియ్యంకులమీద చూపుదురు కాని.

బాణా: (సంశయంతో ప్రద్యుమ్నుని ఒకసారి, అనిరుద్ధుని ఒకసారి చూసి అనిరుద్ధుని చేతులు వదలి) ఎవరయ్యా నువ్వు? ఈ అబ్బాయి పెద్దన్నగారిలా ఉన్నావూ?

ప్రద్యుమ్నుడు: (పకపక నవ్వుతూ) కోడలు వాలిపోయింది. మామగారియందు భర్తతో మా అనిరుద్ద కుమారుడు యుద్ధం చేయడు. చటుక్కున పట్టుపడ్డాడు. భర్త అనిన్నీ, తన తండ్రి సహస్ర బాహుబలం కలవాడనీ అనుకుని భయపడి కుంగిపోయింది. కోడలిని సేదతీర్చవా ప్రాణేశ్వరీ!

ప్రవేశం మాయాదేవి ప్రత్యక్షమయినట్టు.

మాయా: (రతి) ఉషా రాకుమారీ! లే! ఈలా వచ్చి నా హృదయాన వాలు (ఉషను పొదివి పట్టుకుంది.)

బాణా: ఇదేమిటయ్యా. నా అంతఃపురాలలోకి భార్యతో వచ్చావు. ఎవరు నువ్వు?

ప్రద్యు: మేము ప్రద్యుమ్న నామధేయులము. మా జనకులు శ్రీకృష్ణ...

బాణా: అలా చెప్పు. ఆ నలువూ. ఆ నెమలిపింఛాలూ చూస్తూ కూడా ఆనవాలు పట్టలేక పోయాను. నాతో యుద్ధం చేయడానికి ఆ చేతిలో ఆ లీలాకమలం ఏమిటీ?

ప్రద్యు: ఈ పువ్వు యొక్క శక్తి ఎరుగరు మీరు బావగారూ! (ఆ పుష్పంతో బాణుని రొమ్ముపై లీలగా కొట్టగా విద్యుచ్ఛక్తి తాకిడి అయినట్లయి తూలిపోతాడు. తెర ఎత్తగా 20 మందిగాని, 30 మందిగాని బాలికలు నాట్యంచేస్తూ వగలు చూపిస్తారు. ఇక్కడ వెలుగు దర్శకత్వం బాగా చూపించాలి. సంగీతం అతిమనోహరం. బాలికలందరు బాణుని చుట్టి కౌగిలింతలు. ముద్దులు మొదలయిన చర్యలు నాట్యంలో చూపిస్తారు, చేస్తారు.)

13

ఈ రకంగా నాటకం అంతా పూర్తి అయింది. ప్రద్యుమ్నుని పాత్రపోషణ, మాయాదేవి పాత్రపోషణా, కథాసంవిధానంలో వీరిరువురకూగల గాఢసంబంధమూ చాలా రంగాలలో విన్యసింపబడింది. నాటకానికి అసలు దర్శకుడు కోనంగే అయ్యాడు. అసలు కథా, దాని సంవిధానం అంతా మార్పించాడు.

నాటక ప్రారంభంలో, ఇద్దరు వేదపండితులు వచ్చి వేదసూక్తము ఉషాదేవిని ప్రార్థిస్తూ గానం చేస్తారు.

తెర పైకి లేస్తుంది. పొలం, ఉషఃకాంతులు అంతటా ప్రసరిస్తాయి. రైతులు వచ్చి

“మా దేశానికి ప్రత్యూష వచ్చిందీ

మా ఎడదలోనే స్వేచ్చాకాంతులు దరిశాయీ

హిందూ ముస్లిం పారశీ శిక్కూ

అందరం ఏకం అవుతామూ

సంపూర్ణంగా దేశమాతకూ

స్వాతంత్ర్యాన్ని తెస్తామూ”

అనేపాట పాడుతూ జై భరతమాతకూ జై అని వేడతారు.

ఇంతలో ఒక ఆంధ్రకళపాసి వచ్చి “నేను ఆంధ్రుడనండీ, ఉష మా ఆడపడుచు. బాణుడూ, నరకుడూ మా వాళ్ళు. ప్రాగ్జతిషమే ధనకటక నగరం అయింది. ఆ రాజకుమారి బాగా చదువుకున్న అమ్మాయి. సర్వకళలూ నూతన జీవితం పోసుకున్నాయి. సిద్దహస్త అయిన ఆమె ప్రతిభ చేత, ఉషా సంప్రదాయం జగత్ ప్రసిద్ధము! ఆమె సర్వశాస్త్ర జ్ఞానంలో ఆరితేరిన పండితురాలు. కాబట్టే ద్వారకలో వున్న తన మనోనాథుని కొద్ది కాలం వ్యవధిలో తన నగరానికి తెచ్చుకుంది. నూత్న సంప్రదాయాలు తెచ్చినది ఉషాదేవి! తండ్రి పూర్వ సంప్రదాయం, ఆయనకూ కళలకు నూతనత్వం చేకూర్చినది కృష్ణుడు. అనిరుదుని విషయంలో మహా యుద్ధము అవుతుంది. అనిరుద్ధుడు యువక హృదయమూర్తి. ఉష సర్వకళలలో నిత్యమైన నూతనోదయం. కళారహస్య ప్రద్యుమ్నుడు, రసము, అతి సమ్యస్థితి శ్రీకృష్ణుడు. పూర్వాచారము బాణుడు. ఈ నాటకం ప్రసిద్ధి కెక్కిన నవ్యకవి భూదేవరాజు వ్రాసినాడు. సెలవు” అని సూత్రధారులు వెళ్ళిపోయినారు.

నాటకం ఎంతో రక్తికట్టింది. భారతంలోని ఉషాసుందరీ పరిణయ ఘట్టంలోని పద్యాలు అబ్బయామాత్యుని “అనిరుద్ధ చరిత్ర” కావ్యంలోని పద్యాలూ, రంగమూ, రంగమూ మధ్యన మంచి గొంతుకలుగల ఇద్దరు యువకులు నేపథ్యం నుండి చదువుతూ వచ్చారు.

నాటకం పూర్తికాగానే, చివర అభినందన సమర్పణ అయింది. ప్రద్యుమ్న పాత్ర నిర్వహించిన కోనంగిని ఎంతమందో మెచ్చుకుంటూ మాట్లాడారు. అ నాటకం ఇంకోసారి అక్కడే ఆడడానికి నిశ్చయించారు. ఆ రాత్రికి రాత్రి అప్పుడే అయిదువందల రూపాయల టిక్కెట్లు అమ్ముడై పోయాయి.

కోనంగి మొగం తుడుచుకుంటూఉంటే అనంతలక్ష్మి పరుగున వచ్చి “ఓహెూ ఏమి అద్భుత అభినయం మీది? అందరూ మెచ్చుకున్నారు. ఈ నాటకానికి ప్రద్యుమ్నుడే కథానాయకుడా అన్నారు కొందరు సుమండీ” అన్నది.

కోనంగి: నన్ను ఎక్కువ మెచ్చుకోకు లక్ష్మీ!

అనంత: అంత బాగా అభినయించారు. మీ రక్తంలో కూచిపూడి వారి సంప్రదాయం ఏమన్నా ప్రవహిస్తోందా?

కోనంగి: అవును లక్ష్మీ! మా అమ్మగారు కూచిపూడిలోని ఒక కుటుంబంవారి ఆడపడుచు.

అనంత: అలా చెప్పండి. మా దక్షిణాది నర్తకీ జాతికి గురువులు మీ కూచిపూడి వారేనట.

ఇంతలో సీతాదేవి అక్కడికి వచ్చింది. “హల్లో, కోనంగిరావుగారూ! మీరు బందరు నుంచి తిరిగి వచ్చి దుక్కిటెద్దులు సినీమాలో అభినయించారు. ఇంతవరకూ ఎనిమిది సారులు చూశాను. ఎంతబాగా అభినయించారండీ ఆ చిత్రంలో. ఇంకా ఏ ఏ బొమ్మలలో అభినయిస్తారు? ఈ నాటకంలో అభినయిస్తున్నారని తెలిసి వచ్చాను” అని గబగబ మాట్లాడి అతని హస్తము స్పర్శించి సంతోషంగా జాడించింది.

కోనంగి: సీతాదేవిగారూ! మిమ్మల్ని చూడడం చాలా సంతోషంగా వుంది. మీరు ఈ ఏడు సీనియర్ ఎఫ్.ఏ.కు వచ్చారుకదూ?

సీత: అవునండీ.

కోనంగి: అనంతలక్ష్మి వీరు సీతాదేవిగారు. హేబారు అయ్యంగార్లు వీరి పెండ్లి చేసుకుందామనే ఈవూరు వచ్చాను. కాని లాభం లేకపోయింది. వీరి తండ్రిగారు ప్రభుత్వ కార్యదర్శి కార్యాలయంలో ఒక కార్యదర్శి సీతాదేవిగారూ, ఈ బాలిక అనంతలక్ష్మి- నా జన్మాన్ని ఏలబోయే చక్రవర్తిని, బి.ఏ. జూనియర్ చదువుతున్నది.

సీతా: వీరిని బాగా ఎరుగుదును. వీరు మా కాలేజీలో ఎన్నో బహుమానాలు, ఆటలలో, ఉపన్యాస వ్యాసంగంలో కొడుతూ వుంటారు.

అనంత: వీరిని నేనూ ఎరుగుదును. మా కాలేజీ తమిళ సంఘంలో సభ్యులుగా వున్నారు.

కోనంగి: రండి మనం పోదాం.

సీతా: మీరిద్దరూనూ మా యింటికి రేపు టీ పార్టీకి రావాలి.

కోనంగి: తప్పకుండా, ఏమంటావు అనంతలక్ష్మీ!

ఆనంత: వస్తానండీ సీతాదేవిగారూ! ఎన్నిగంటలకు?

సీత: సాయంకాలం అయిదున్నరకు తప్పకుండా రండి. మా తండ్రిగారి ఆహ్వానము రేపు ఉదయమే అందుతుంది. సెలవు. మంచిరాత్రి మంచిరాత్రి!

ఆమె అతివేగంగా వెళ్ళిపోయింది. అనంతలక్ష్మి, కోనంగీ గబగబ మెట్లుదిగి, అనంతకారులో కూర్చున్నారు! జయలక్ష్మి అదివరకే వెళ్ళికారులో కూర్చుంది. వీరు కూడా వెనుక స్థలంలో కూర్చుంటే కారు కదిలి వెళ్ళింది.

జయలక్ష్మి: కోనంగిరావుగారూ! చెట్టియారు రాయించే ఉత్తరాలు చూస్తున్నారుకాదూ! అరవభాష మీకు రాదు. చదవరాని భయంకర భావాలతో ఉన్నాయి. ఎవరిచేతనో రాయిస్తున్నాడు. అదేదో చచ్చు తమిళం వారపత్రికలో పేర్లు మార్చి నన్ను గురించి, మా అమ్మాయిని గురించీ కథ రాయిస్తున్నాడు. నేను ఏమిచేయను?

కోనంగి: అత్తగారూ, మీరేమీ కంగారు పడకండి. ఈ చెట్టియారుకు భగవంతుడు త్వరలో బుద్ధిచెబుతాడు లెండి. మనం ఏమీ తొందరపడవద్దు. సత్యం మనకు తెలుసు. మన స్నేహితులందరకూ తెలుసును. అందుచేత వాడు ఎన్ని అవకతవక పనులు చేస్తే ఏమి భయం ?

అనంత: అమ్మా! ఈ విషయం మా మాష్టరుగారు నాకు బాగా బోధించారు. ఆ రాతలవల్ల, ఆ ఉత్తరాలవల్ల, మనకు వచ్చే నష్టమేమిటి?

కోనంగి: నిజంగా ఆలోచిస్తే మనకు వచ్చే నష్టం ఏమీ కనబడదు. మనం గోల పెట్టి మనస్సులో బాధతో తొందరపడి ఏ పనైనా చేశామా వారి ఉద్దేశం మొదటి తరగతిలో మొదటగా, నూటికి యాభై మార్కులతో నెగ్గిందన్నమాటే!

వారు ముగ్గురూ అనంతలక్ష్మి ఇంటికి పోయారు. జయలక్ష్మి కోనంగిని తన ఇంటి దగ్గరనే పడుకోమని కోరింది.

డాక్టరు తనకోసం కనిపెట్టుకొని ఉంటాడనీ, ఒక గంట మాట్లాడి కాస్త కాఫీ త్రాగి తాను నడిచి వెళ్ళిపోతానని కోనంగి అన్నాడు.

జయలక్ష్మి లోనకు వెళ్ళిపోయింది. వెంటనే అనంతలక్ష్మి కోనంగి భుజంచుట్టూ చేతులుచుట్టి “పాపం, మీరా సీతాదేవిని ఎందుకు పెళ్ళిచేసుకోలేకపోయారో' అని ప్రశ్నించింది.

“చేసుకునేవాడనే, ఆ అమ్మాయి వద్దంటే నేను ఏమి చేయను?”

“చేసుకుంటానంటే ఏంచేద్దురు?”

“అనదు! నా ఆశయరూపిణి నాకోసం ఎదురుచూస్తూవుంటే ఎలా ఒప్పు కుంటుంది?” అంటూ కోనంగి ఆమెను హృదయానికి అదుముకొన్నాడు.

తనకో పెద్ద సంసారం సిద్దం అయింది. ఇదివరకు కోనంగి తన ఇష్టం వచ్చిన దారిన తిరిగాడు. తోటదారులలో, సిమెంటురోడ్డులో, కంకర రహదారిలో, పుంతలో, రాధారులో, కాలిబాటలో, అతడు సముద్రం ఎదుట నిలిచాడు. కాని ఆ సముద్రభావం ఏమి తెలిసింది. అతడు వీధులలో నడిచాడు. ఆ వీధుల పొదివికొన్న ప్రజానీకం అనుభవించే బాధలూ, ఆనందాలు ఎంత లోతులలో ప్రారంభం అయ్యాయో, ఎంత పై ఎత్తుకు ఎగిరిపో గలవో, ఎవరు చెబుతారు.?

కోనంగి ఒంటిగానే లోకం మధ్య నిలిచి వున్నట్లే లోకంలో బాధలూ లోకం ఆశయాలు, ఆవేదనలు అతని కేమి తెలియును? ఒకనాడు తాను ఎడారి దారిని నడుస్తున్నాననీ, దానికి అంతులేదనీ, తాను దాహంతో ఏమయిపోవాలో అని వణికి పోయాడు. ఒకనాడు లక్షలకొలది జనం మధ్య వారితోపాటు తోసుకుంటూ వారి చెమటలు, వారు ఒంటికి రాసుకున్న అత్తరువులు, వారి ఊపిరి వెంట గంధాలు, వారి తాంబూలపు సువాసనలు, మాసిన చిరిగిన బట్టలకంపు, చాకలి ఉతికి తెచ్చిన బట్టల పై, వారలలుముకున్న సువాసనల ముంపు ఇవన్నీ అతన్ని పొదివికొన్న మాట నిజమే?

కాని జీవితం యొక్క బాధకు నిజస్వరూపము విశ్వరూపమై అతనికి దూర దూరంగానే వుండిపోయింది. అతని బాధకు అతని నవ్వు విరుగుడు. లోకబాధకు లోకాన్ని నవ్విస్తే నవ్వు చండాగ్నిని ఆర్పగలిగే పాలసముద్రం అవుతుంది.

కోటి కోటి చేతులు చాపి, కోటి కోటి గొంతుకలెత్తి లోకప్రజ యుగాల నుండి హృదయానికీ, దేహానికీ, మనస్సుకూ, ఉత్తమస్థితి, న్యాయంకానిస్థితి, ధర్మమైనస్థితి కోరుతూంది. అందుకై కుములుతూవుంది. అప్పుడప్పుడు ప్రళయ తాండవ మాడింది. కుంగి భూమిపై వాలిపోయింది, ఒక్కొక్కణ్ణి నాయకుణ్ణి చేసుకుంది. ముందుకు సాగింది. మళ్ళీ లేచి చిన్న మార్గాల చూచి ముందుకు సాగింది. ఎడారులు దాటింది. దారిలో నశించింది. ఆవలికి వెళ్ళింది. అక్కడ నందనవనాలు లేవు! అలా నడిచి ముందుకు పోతోవుంది.

కళలో, కవిత్వమో, వేదాంతమో, భక్తి, నమ్మకమో, జ్ఞానమో ఆ ప్రజకు చేతికఱ్ఱలుగా, నడిపించే శక్తిగా, దారిని వెలిగించే వెలుగుగా, దారిగా అయ్యాయి.

ఈ మహాదృశ్యము ఈ అనంత అఖండ విశ్వ ప్రజాజీవితం స్పందించే కోనంగి హృదయాన్ని తలుపు తట్టింది.

వెళ్ళవలసిన దారులనంతం. ఏ దారి అయినా ఒకటే అని కోనంగి అనుకున్నాడు.

మన ప్రాణ స్నేహితులు కాబోయేవారు ముస్లింలీగువారు, కాంగ్రెసువారు, హిందూ మహాసభవారు, ఈలా ఎంతమందో ఉన్నారు.

సినీమా ప్రపంచంలో, నాటక ప్రపంచంలో ఒడుదుడుకుగా స్పందించే జీవితాలు తన జీవితగృహంలో ఆతిథ్యం పుచ్చుకుంటాయి.

జీవితపు మధ్యదారిలో కోనంగి నడవవలసిందే. నడుస్తున్నాడు. పరుగెత్తుతున్నాడు. ఇతరులు కొందరు పడిపోతున్నారు. కొందరు పాటలు, కొందరు ఆటలు, కొందరు తాత్కాలిక బసలో చేరారు. కొందరు దారి దౌర్భాగ్యులకు సహాయం చేస్తున్నారు. కొందరు హేళన చేస్తున్నారు. కొందరు ఎవ్వరితోనూ మాట్లాడక తమ దారిన తాము పోతున్నారు. కొందరు ఆగి కూర్చుండి తమ చుట్టూ రక్షణకై గోడలు కట్టుకుంటున్నారు.

ఎంత విచిత్రమైనదీ దృశ్యం. ఈ మహాదృశ్యం, ఈ బ్రహ్మాండదృశ్యం అంతా చూడగలిగినవారు మహాపురుషులు. అదే ఎయన్ స్టెయిను భావం. ఆదే శ్రీకృష్ణ భావం. అదే కారల్ మార్క్స్ భావం. అదే మహాత్మాజీ భావం.

ఇందులో ఎవరు ఈ ప్రపంచ ప్రళయాలు సృష్టించేవారు? వాని అర్థం ఏమిటి? అని కోనంగి డాక్టర్ని ప్రశ్న వేశాడు.

“ఓయి వెర్రివాడా! ఒక మనుష్యునిలో ఒక పెద్దజబ్బు ప్రవేశిస్తే అది ఎన్నో రూపాలుగా పైకి వస్తుంది. సామ్రాజ్యవాదం అనే జబ్బు లోకంలోకి వచ్చింది. ఇది పదిహేడవ శతాబ్దంలో విజృంభింపసాగి, ఇప్పటికీ లోకాన్ని బాధపెడుతూంది. ఆ జబ్బు యొక్క వెర్రితలలు ఫాసిజం, నాజీజమూను!”

“సామ్యవాదంలో లోట్లులేవా?”

“ఉండవచ్చును. అవి ఒక్కొక్క దేశంలో ఆ వాదం వేళ్ళు పాదుకోవడంలో వచ్చిన లోట్లు.”

“ఆ లోట్లు ఎల్లా పోతాయి? లేకపోతే అవి పోనేపోవా?”

“కొన్ని పోవచ్చును. కాని ఎప్పటికీ పోకపోవచ్చును.”

“డాక్టరులా మాట్లాడావు?”

“నేను డాక్టరు నయినప్పుడు ఇంక ఎల్లా మాట్లాడుతాను?”

“కొందరు డాక్టర్లు కూడా మామూలుగా మాట్లాడబోతారు.”

“కొందరు మామూలు వాళ్ళు డాక్టర్లుగా మాట్లాడబోతారు.”

“కాని డాక్టరు డాక్టరుగా మాట్లాడడం అన్నింటిలో పనికి వస్తుందా నాయనా?”

14

అనంతలక్ష్మి త్వరలో వివాహం కావాలని తల్లితో నిర్మొహమాటంగా చెప్పింది.

“ఆదేమిటే అమ్మిణీ! అవతల భూమి అంతా వ్యాజ్యంలో పడింది. ఇప్పుడే ఈ గొడవ అంతా ఎందుకు?”

“ఎప్పుడూ వారితో కలిసి మెలసి ఉంటూ వారి దగ్గర ఉన్నప్పుడు తదితర లోకం అంతా మరిచిపోయే నన్ను...”

“ఎంతకాలం ఈలా దూరంగా ఉండాలంటావు? అని నీ ప్రశ్న? నీ చదువన్నా వూర్తి అవ్వాలా?”

“అయితే అవుతుంది, లేకపోతేలేదు, చదువుకీ...”

“చదువుకీ పెళ్ళీకీ సంబంధం లేదంటావు.”

“స్నేహితురాండ్రందరూ వేళాకోళంచేసి చంపేస్తున్నారు.”

“పెళ్ళి అయిన తర్వాత మాత్రం వేళాకోళం చేయరా?”

“చేయరమ్మా, పెళ్ళి అయిన వారి మాట అలా ఉంచు. మా కాలేజీలో పిల్లల తల్లులయిన వాళ్ళెందరో ఉన్నారు. పెళ్ళయినవారి జోలికి వెళ్ళకూడదని మా కాలేజీలో నియమం ఉంది.”

“నీకు వీలుగా ఉంది నియమం!”

“నాకు వీలుగా ఉందోలేదో అదికాదు విషయం. నేను వారిని ఒక్క నిముషం వదలి వుండలేను. స్నేహం తప్ప యింకో సంబంధం లేకపోతే వారితో తిరుగుతూ యితర అనుమానాలకు గురికాకుండా ఎట్లా వుంటాను? నువ్వు ఏనాడు తెచ్చిపెట్టావో ఆ సెట్టియారును, ఆ రాక్షసుడు నెమ్మది నెమ్మదిగా మా కాలేజీలో నన్ను గురించి వినరాని అపవాదులన్నీ వెదజల్లు తున్నాడు.”

“ఇదా వెర్రితల్లీ నీ భయమూ? మన్నారుగుళ్ళో మన అయ్యవార్లం గారిని ముహూర్తం పెట్టమందాం. నేను కోనంగిరావుతో చెప్పి అన్నీ సిద్ధం చేస్తాను.”

ఆ మాటలు వింటూనే అనంతలక్ష్మి తల్లిని కౌగిలించుకొని తల్లి బుగ్గను ముద్దు పెట్టుకొని నాట్యంచేస్తూ తాను తన కాలేజీలో ఆడిన నాటకంలోని ఒకపాట:

లోక మెంత తీయనైంది

శోక మెంత హీనమైంది

మూక బాధ లేల ప్రజకు

ఆక లేల చీకటేల?

పూవులుండే తావులుండే

పూలనాను మధుపముండే

తావి పన్నీరుజల్లు

తావిరంగు ఉదయముంది.

రంగు రంగు భూమిపైన

రమ్యరూప దర్శనమ్ము

దారి పొడుగునా వెలుంగు

తలిరుటాకు తరళమూర్తి.

ఏదో యీ ఉదయంలో

హృదయంలో రాగమాల

ఆనందం తాళాలై

అడుగువేసె బ్రదుకుదారి”

అని పాడుకుంటూ తన్నతిమనోహరంగా అలంకరించుకుంది. నాటకమైన నాల్గవరోజది. కోనంగి రావడం తరువాయి. అతన్ని పొదువు కోవడమే! అతను కదలడానికి వీల్లేదు. అది క్రిష్టమస్ సెలవరోజులు గనుక అనంతలక్ష్మి ఇంటి దగ్గరే ఉండడం, కోనంగి. సినిమాకు తీసుకు వెళ్ళాలి. కోనంగి బీచికి తీసుకొని వెళ్ళాలి. కోనంగి ఎక్కడికైనా తీసుకు పోవాలి. ఎన్నూరో, కంచో, మహాబలిపురమో, తిరుక్కాళికుందరమో (పక్షితీర్థం) కోనంగి వచ్చి శిల్ప సందర్శనమూ, క్షేత్ర ప్రదర్శనమూ చేయించాలి. తిరువన్నామలై వెళ్ళి రమణ మహర్షిని దర్శింపించాలి.

వాళ్ళకు సెలవలు సంక్రాంతి చివరకు. ఈలోగా చెన్నపట్నంలో గానసభలన్నింటికీ వెళ్ళారు. ఆమె తీగలా కోనంగిని ఆల్లుకుపోయింది.

కోనంగి ఆమె ప్రేమావేశం చూచి ఆశ్చర్యం పొందాడు. ఇంతవరకు అనంతలక్ష్మికి తన యందు గాఢప్రేమ లేదని ఎప్పుడూ అనుకోలేదు. కాని ఈ విధంగా తన్ను వివాహం కాకుండానే ఇంత చుట్టివేస్తుందని ఎప్పుడూ అనుకోలేదు.

ఒకరోజు సినిమా నుంచి వస్తున్నారు ఆమె కారులో. అనంతలక్ష్మి వెంటనే అతని కౌగలిలో ఒదిగిపోయింది. అతని మోము తన మోముకు గట్టిగా అదుముకుంది. అతని కన్నులు, అతని పెదవులు గాఢచుంబనాలతో ముంచెత్తింది. అతడు పరవశుడైకూడా, వట్టి సాక్షిలా ఆమె చేష్టలు గమనిస్తూ అలా ఊరకున్నాడు.

ఇల్లు వచ్చింది. లోనికి వెళ్ళాడు. “అనంతం! నీకీ మధ్య ఇంత ప్రేమ విజృంభణమైంది. దానికి నేనెంత ప్రశ్నించుకున్నా తోచటంలేదు?” అని ప్రశ్నించాడు.

అనంతం అతని వైపు తేరిపార చూచింది. ఆమె చూపులలో ఏవో తృష్ణలున్నాయి. ఆమె చూపులో ఒక నిమేషంలో దీనత అలము కొన్నది.

“మాష్టరుగారూ, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీ హృదయంలో ఏమీ దాచకుండా నిజం చెప్పండి, మీరు నాటకాలలో, సినీమాలలో పాలు పుచ్చుకుంటున్నారు. ధనంకోసం కాదు. అని నా కర్థమవుతుంది. ఆ పనులలో మునిగిపోతారు. ఆ సమయాలలో ఒక్కొక్కప్పుడు నన్ను కూడా మరచిపోతారు. నాకు ఏమీ అర్థంకాక భయం కలుగుతూ ఉంటుంది.”

“ఓసి వెట్టి అమ్మాయి, నీకు ఈ అనుమానం ఎందుకు కలగాలి? నువ్వు చదువుకొన్న అమ్మాయివి. నీకు చదువు ఎందుకు అని నేను ప్రశ్నవేయ వచ్చునా?”

“మాకు చదువు పురుషులతోపాటు ఆడవాళ్ళు సమం అవడానికి!”

“పురుషులు ఏమి చేస్తూ ఉంటారు?”

“అన్ని పనులూ.”

“ఆ పనులన్నీ ఆడవారూ చేయాలా?”

“ఆ చేయలేనివి ఒకటి రెండు ఉండవచ్చుగాక.”

“అలాగే స్త్రీలు చేయగలిగిన పనులు మగవారు చేయలేనివి కొన్ని వున్నాయి!”

“అవును.”

“అంతేగాని, అస్తమానమూ స్త్రీపురుషులు ప్రేమ ప్రేమ అని కూచోరుగదా!”

అనంతలక్ష్మి తెల్లబోయి కోనంగి వైపు చూచింది. అతడు చిరునవ్వు నవ్వుతున్నాడు. ఒక్క నిముసం అలా చూచింది. అనంతలక్ష్మి కన్నుల నీరు నిండింది. గబగబ లోనికి పరుగెత్తిపోయి, తన పడకగదికిపోయి, ప్రక్కమీద వ్రాలి వెక్కి ఏడవడం ప్రారంభించింది.

కోనంగి తెల్లబోయాడు. తానేమన్నాడు ఆమెతో? ఆమె కళ్ళలో నీరు నిండిందే! ఆ దివ్యసుందరగాత్ర హృదయంలో ఏ బాధ చేరింది? ఆ అమలహృదయ మనస్సులో ఏ అనుమానం మొలకెత్తింది?

అతడు నెమ్మదిగా ఆమె గదిలోకి వెళ్ళినాడు. ఆమె పరుపుపై బోర్లగిల పడుకొని దిండులో తలదూర్చి సముద్రమై కరిగిపోతున్నది.

15

“ఈలా చూడు లక్ష్మీ!” కోనంగి అనంతలక్ష్మిపై వ్రాలి, ఆమెను పొదివిపట్టుకొని, తనవైపు తిప్పుకొని, ఆమె చెవిలో “నువ్వు నాకు రాజరాజేశ్వరివి. నువ్వు నాకు ఆత్మవు. ఎందుకీ దుఃఖం? ఏమిటీ ఆవేదన? నువ్వు ఆజ్ఞ ఇయ్యి. అగ్నిపర్వతంలో ఉరుకుతాను. నువ్వు నాకు చక్రవర్తినివి! నాకు నీ పైన ప్రేమ ఎంతవుందో దాని అనంతత్వము నాకు మాత్రం తెలుసునా లక్ష్మీ?”

ఆమెను గాఢంగా తన హృదయానికి అదుముకున్నాడు. ఆమెను ఊపిరాడనట్లు చుంబించినాడు. ఆమెను నలిపివేశాడు.

అతనికి కళ్ళనీళ్ళు తిరిగాయి. ఆ విషయం ఆ గడబిడలోనే అనంతలక్ష్మి చూచింది. ఆమెకు మనస్సు ఒడుదుడుకై పోయినది. వెంటనే తన దుఃఖం కష్టపడి ఆపి వేసుకొని, మంచంమీద నుంచి లేచి స్నానాల గదిలోనికి వెళ్ళిపోయింది.

కోనంగి ఆ బాలిక వచ్చేవరకూ అలాగే కూర్చున్నాడు. అరగంట వరకూ చూచినాడు. అనంతలక్ష్మి రాలేదు. అతనికి ఆశ్చర్యం కలిగింది. జాలివేసింది. ఈ బాలికలు చదువుకున్నా బాలికలే! బాలికలలో స్త్రీలలో చదువు నరనరాలకూ ఎక్కిపోలేదు. రెండు మూడుతరాలవరకూ చదువులు హత్తుకుపోతేగాని, స్త్రీలలో భావగమనము క్రొత్తదారులు పట్టదు.

అయినా, అనంతలక్ష్మి హృదయం అనుమానం అయ్యే జాతిదికాదనే తాను నిశ్చయానికి వచ్చాడుకదా! ఇంక అనుమానం తప్ప అనంతలక్ష్మిని ఈ స్థితికి తీసుకువచ్చింది ఏమి ఉంటుందిగనకా? నాటకాలలో, సినిమాలలో ఎవరెవరో యౌవనంగల అందమైన స్త్రీలతో కలిసి అభినయించవలసి వస్తుంది. అప్పుడు తెలివితక్కువ భార్య అనుమానపడుతుంది.

లోకంలో కార్యసంబంధం ఉన్నవాళ్ళందరూ ఇతరులతో సంబంధం లేకుండా ఎలాగు? పురుషులకు ఒక్క పురుషులతో మాత్రం అనిగాని, స్త్రీలకు ఒక్కస్త్రీలతో మాత్రమే అనిగాని. భార్యగాని, భర్తగాని పంతాలుపట్టి కూర్చుంటే లోకం కాలప్రయాణం ఎలా చేయగలదు?

ఈ బాలిక సాధారణ బాలికలకన్నా అదృష్టవంతురాలు. ధనమూ, ఆస్తీ, రూపమూ, హృదయమూ, విద్యా ఉత్తమంగా ఉన్నాయి. అలాంటి బాలిక అనుమాన రోగానికి పాల్పడితే తన జీవితమూ, తన భర్తజీవితమూ యమలోకం చేసుకుంటుంది.

కోనంగి నిట్టూర్పువిడుస్తూ లేచాడు. నెమ్మదిగా గది బయటకు వచ్చాడు. అనంతలక్ష్మి చదువుకునే గదిలోనికిపోయి అక్కడ ఒక సోఫాలో ఆలోచిస్తూ కూచున్నాడు. కళ్ళు మూసుకున్నాడు. కానీ నిద్రమాత్రం లేదు.

"అతడల్లా పండుకొని ఉండగానే కొంతసేపటికి పనిమనిషి ఒకతె వచ్చి ఆ గదిలోకి తొంగిచూచి కోనంగివైపు తేరిపార చూచి వెళ్ళిపోయినది. ఆ విషయం కోనంగి ఎరుగడు.

తాను బీదవాడై ఒక ధనవంతురాలైన బాలికను వివాహం చేసుకోవాలని సిద్ధం అయ్యాడు. ఆ బాలిక అందాన్ని చూచి ఆ బాలిక కావాలని కోరేవారు చాలామంది వున్నారు. ఆ బాలిక తన్ను ఏమీ చూచి ప్రేమించింది? ప్రేమకు అర్థం వుందా లేదా! ప్రేమ దేహాన్ని కామకాంక్షతృప్తిపరచుకోడానికి కోరటం వంటిదా? వివిధ వ్యక్తుల కోరికలు వివిధంగా వుంటాయి. బాహ్యరూపం మాత్రం చూచి స్త్రీని పురుషుడుగాని, పురుషుని స్త్రీగాని కోరేయెడల. ఒకేస్త్రీని చాలామంది పురుషులు, ఒకేపురుషుని చాలామంది స్త్రీలు కోరవచ్చును.

మానసికమైన ప్రేమ అయితే, మనస్సులు కలిసినవారు మాత్రమే ప్రేమించు కుంటారు. అలాంటి వారు ఒకే స్త్రీని మానసికంగా ప్రేమించేవారు ఉన్నారు. అలాగే ఒక పురుషుని నలుగురైదుగురు స్త్రీలు ప్రేమించవచ్చును.

కాని ఒకే పురుషుడు, ఒకే స్త్రీ ఇది ఏదో అతి విచిత్రభావం. ఇది దేహాతీతము. మానసికాతీతము అయిన ఏదో విచిత్రశక్తికి సంబంధించి ఉండాలి.

తాను అనంతలక్ష్మిని ప్రేమిస్తున్నాడు. ఆ బాలికను ఒక్కదాన్నే ప్రేమిస్తున్నాడా లేక ఇతర బాలికలను కూడా వాంఛింపగలడా? ఇంతవరకూ తనకు సంభవించిన రెండు పరీక్షలలో, “అనీ' తన్ను వాంఛించి నప్పుడుగాని, తన సినీమా నాయిక వాంఛించి నప్పుడుగాని, తాత్కాలికంగా తన దేహం కొంత ఉప్పొంగగా, మనస్సూ హృదయమూ రెండూ ముడుచుకుపోయాయి. కాని అనంతలక్ష్మే తన భార్య అన్న భావానికి చలనం లేదే!

ఇంతకూ అనంతలక్ష్మికి ఎందుకు కోపం వచ్చినట్లు? ఆమె ఈపాటికి పండుకొని నిదురపోతూ ఉంటుంది. తనపై కోపం వచ్చిందా లేక తన విషయంలో ఏదో అనుమానంపడి, బాధ పడుతున్నదా?

అతనికి నిద్రపట్టలేదు, కదలక కన్నులు మాత్రం మూసుకొని, హాలులోనికి వినాయగం దీపాలు ఆర్పడానికి వచ్చినా కోనంగి కదలలేదు. దీపాలు ఆర్పీ వినాయగం వెళ్ళిపోయాడు.

తాను డాక్టరు ఇంటికి వెళ్ళిపోవలసింది. కాని అనంతం ఈలా సంచరించడంవల్ల తాను ఇక్కడ ఈలా పరుండవలసి వచ్చినది. ఎప్పుడైనా ఈ ఇంటిలో తాను పండుకోవలసి వస్తుందని తనకు ప్రత్యేకంగా ఒక గది ఏర్పాటు చేశారు.

అనంతలక్ష్మి ఆ గదిని ఎంతో మనోహరంగా అలంకరించింది. గదిలో తనకోసం ఎన్ని విచిత్రమైన వస్తువులు ఉంచింది! తనకు కాబోయే భర్తకు అది చదువుల గది అట. ఆ భర్త ఎవరో తనకు తెలుసునట! అతనికి ఇష్టాఇష్టాలు, ప్రీతికరమైనవీ, అనందం ఇచ్చేవీ ఆ గదిలో ఉండాలట. అలా అని ఎన్నో సంగతులు యాదాలాపంగా అడిగినట్లు అడుగుతూ అందులోకి చేర్చేది.

అందులో ఒక చక్కని మంచం వేసి తాత్కాలికంగా అది తనకై పడకగది చేశారు.

అలా చీకటిలో ఒక అరగంట సేపు పడుకునేసరికి, అక్కడికి జయలక్ష్మి చక్కావచ్చి దీపం వెలిగించి, “ఏమండి కోనంగిరావుగారూ! మీరు పడుకున్నారేమిటి?” అని ప్రశ్నగా కేక వేసింది.

16

జయలక్ష్మి మాటలు విని కోనంగి సువ్వన లేచినాడు.

“అబ్బే! నిద్దర పట్టలేదు. ఏదో ఆలోచించుకుంటూ పడుకున్నా.”

“మీకూ అమ్మిణికీ మాటా మాటా వచ్చిందా?”

“మాటా మాటా పట్టింపులేమీ రాలేదుగాని లక్ష్మీకి నేను నాటకాలలో, సినీమాలలో పాల్గొనటం యిష్టంలేక మనస్సులో బాధ పెట్టుకుందను కుంటాను.”

“మీరు సినీమాలలోనే వుంటారా?”

“నేను సినీమాలలోనే వుండనని మొదటే చెప్పాను కాదూ అత్తగారూ! అనంతలక్ష్మికి తగినట్టి భర్తను కావాలని నాఆశ. జీవితంలో ఉత్తమపథం కనుక్కుందామని నా ఆశయం.”

“అమ్మిణి కుళ్ళిపోతోంది. కారణం అడిగితే చెప్పదు. నా కాశ్చర్యం వేసింది. నేను హడలి బేజారయాను.”

వెంటనే కోనంగి ముందుకువచ్చి చిరునవ్వు నవ్వుతూ “నా లక్ష్మికినేను విష్ణువు కావాలండీ. ఎక్కడ వుంది?” అని అడిగినాడు. తన పడకగదిలోనే వుందని ఆమె జవాబు చెప్పింది. కోనంగి నెమ్మదిగా నడచి అనంతలక్ష్మి పడక గదిలోకి వెళ్ళాడు. ఆమె మంచంమీద బోర్లగిలా పడుకొనివుంది.

“లక్ష్మీ! ఈ ప్రపంచంలో నీ వొక్కదానివే బాధపడుతున్నట్లు కనబడుతోంది. నీవు లక్ష్మివి. నేను విష్ణుని. నిన్నప్పుడే నేను నా హృదయంలో ధరించుకోవాలి. ఏ దివ్యమూర్తినో సంపాదించుకొని, నేనీ మేడంత మనిషినై, నా హృదయాన్ని యీ గదంత పెద్దది చేసుకొని, అందులో బంగారపు సింహాసనమేసి, దానిపైన ఎన్నడూ వాడని గంగాతరంగిత డోలాయిత పద్మాన్నొక దాన్ని తెచ్చి, అది సింహాసనంమీద వుంచి, దాని పైన నిన్ను దివ్యమూర్తిలా కూర్చోపెట్టి, నేనే నాహృదయంలోనికి చొచ్చుకు వెళ్ళి నీ సింహాసనం యెదుట మోకరించి, వందే లక్ష్మీదేవీం, నా యొక్క ప్రాణేశ్వరీం, ఆత్మేశ్వరీం, నేను వట్టి డండర్ హెడ్డునుం నీ హృదయానికి బాధ కలిగించినందుకు క్షమింపుమాం. నేను చేసిన తప్పిదానికి నీవు ఏ విధమైన శిక్ష వేసినా నేను భరింప సిద్దముగా వుంటినః అని ప్రార్థింపదలచినాను” అని అంటూ ఆమె మంచం దగ్గరకుపోయి చేతులు జోడించినాడు.

అనంతలక్ష్మి చటుక్కున లేచి కూర్చున్నది. ఆమె పకపకా నవ్వుతూ “ఓయి. భక్తుడుగారూనాం. నిన్ను క్షమించితినం. అహం నీకు ఏ కోర్కె కావాలో అది తీర్చ సిద్దముగా వుంటినః” అని వరదహస్తమూ, అభయ హస్తమూ పట్టినది.

కోనంగి మోము ఆనందముచే వెలిగిబోయినది. అతడు అస్పష్ట వాక్కులతో మోకరించి, ఆమె వైపు చేతులు చాపి “లక్ష్మీం క్షీరసముద్రరాజ తనయాం, శ్రీరంగధామేశ్వరీం, దాసీభూత సమస్త వనితాం! ధర్మార్థ కామమోక్ష ప్రదాయినీం, నా హృదయాన వాలిపోం. నాకు రెండు చుంబనాలు ప్రసాదించుమీం” అని అన్నాడు.

అనంతలక్ష్మి మంచంమీద నుంచి ఒక్కవురుకున అతని చేతులలోనికి వ్రాలినది. అతడామెను క్రింద పడకుండ బంతివలె పట్టుకొని, ఆమె తన మెడచుట్టూ చేతులు బిగియార కౌగలింపగా, లేచి గట్టిగా అదుముకుంటూ, ఉదయశంకర నాట్యం ప్రారంభించి

నే.... నే.... యీశ్వరుణ్ణి....

నే.... నే.... నారాయణుణ్ణి....

నే.... నే.... ఆనంద నాట్యపూరితుణ్ణి

నే... నే.... సర్వ విశ్వాత్మక మధ్యస్థ పురుషోత్తముడను

నా అర్ధదేహ కామేశ్వరీ....

నా హృదయ మధ్య కమలేశ్వరీ

నే....నూ....నా దేవీ....

నా దేవీ.... నేనూ....”

అని పాడినాడు.

ఈ విచిత్ర ప్రేమ ప్రదర్శనము గుమ్మాని కెదురు గుండా చీకటిలో నిలుచుండి జయలక్ష్మి చూస్తూ ఆనందంతో మైమరచిపోయి భర్తను ధ్యానించుకొన్నది, ఆమె నెమ్మదిగా ఆమె గదిలోనికి వెళ్ళిపోయింది.

నాట్యము చాలించి అతడామెను ఆలాగున ఎత్తుకొనే ఇంటి తోటలోనికి తాము మామూలుగా కూర్చుండు స్థలమునకు తీసుకొనిపోనా అని అతడడిగినాడు. ఆమె నవ్వుతూ అతని చేతులలో చిన్నబిడ్డలా ఒదిగే ఉన్నది తోటలో ఆమె క్రిందకు దిగినది. అతని నడుంచుట్టూ తన చేయి వేసి, అతని చేతిని తన నడుంచుట్టూ చుట్టగా ఇద్దరూ తోటలో తిరిగినారు. వారలా వెళ్ళడం వినాయగం చూచినాడు. తనలో నవ్వుకొన్నాడు, ఆనందంతో హృదయము నింపుకొన్నాడు.

వారు నెమ్మదిగా అడుగులిడుకుంటూ, వారిరువురూ వెన్నెలలో తాము సాధారణంగా కూర్చునే పొదరింటి పందిరికడకు పోయినారు. అక్కడ బల్లపై కూర్చున్నారు. వారిరువురి హృదయాలు నిండి ఉన్నాయి.

అత డనుకొన్నాడు. మనుష్యునికి ఆకలి వేస్తుంది. ఆకలితో బాధపడతాడు. షడ్రసోపేతమైన భోజనం లభిస్తుంది. అతడు సంతోష స్వాంతుడౌతాడు. మనుష్యుడు బీదతనంతో క్రుంగిపోతాడు. ఇల్లు పోయింది. కట్టగుడ్డలు లేవు. పదిమంది బిడ్డలుగల సంసారము. అంతకన్న అంతకన్న నీచస్థితికి పోతుందా కుటుంబం. అప్పుడాతనికి ఒక్కసారిగా లక్షలు వస్తాయి. అతని ఆనందం ప్రాపంచికానందం. ఈ రెండూ స్త్రీ పురుషుల ప్రేమ కలయికవరము ప్రసాదించే ఆనందంతో సరిపోగలవా? ఇది ఆనందము. అవి అతిశయ సంతోషాలు మాత్రం.

ఆమె అనుకొన్నది. స్త్రీ జన్మకు తన జన్మ అణువు అణువునా లీనమైన పురుషుడే మోక్షం. అతని నుండే ప్రపంచం! అతడు ప్రసాదించే బిడ్డలే ఆ మోక్షంలో భాగాలు. ఓహెూ నాకు ఉత్తమ పురుషుడు భర్త అయినాడు. నేను ఎన్నివేల దేవుళ్ళవలన కోటి కోటి వరాలు ప్రసాదించబడినానో! అని.

ఇరువురూ ఒకరి నొకరు చూచుకున్నారు. ఇరువురూ ఆనందమత్తులైనారు.

దివ్యవరము దివ్యలోకంలో ఉద్భవిస్తుంది. జ్ఞానలోకంలో వినిపిస్తుంది. హృదయ లోకమవతరిస్తుంది. అక్కడ వేగవంతమై బాహ్యలోకం అంతా నిండిపోతుంది.

ఇరువురూ ఆ పుల్కరింపు మైమరపు సమయంలో ఒకరి దేహమొకరు వాంఛించారు! ఇద్దరూ గాఢకామం వాంఛించినారు. రూపం తెల్చిన ప్రేమకు తమ దేహాలను నివేదన లిద్దామనుకున్నారు!

కాని, తమ ప్రేమ దేవాలయం తలుపులు ఇంకను మూయబడి ఉన్నట్లు వారికి తోచింది. ఆ తలుపులకు పెళ్ళి కాకపోవుట అన్న తాళం బంధింపబడి ఉన్నట్లు తోచింది. ఇద్దరూ రోజుతూ ఒకరి కౌగిలి నుండి ఒకరు విడిపోయినారు. సిగ్గు పొందారు. పకపక నవ్వుకొన్నారు. వేడిని జ్యోత్స్నగా మార్చుకొన్నారు.