Jump to content

కోనంగి/అష్టమ పథం

వికీసోర్స్ నుండి


అష్టమ పథం

కారాగారం

స్వస్తిశ్రీ చాంద్రమాన విక్రమ సంవత్సర ఫాల్గుణ శుద్ద దశమీ బుధవారం రాత్రి పునర్వసుయుక్త కన్యాలగ్నమందు చిరంజీవి కోనంగేశ్వరరావుకును చిరంజీవి సౌభాగ్యవతి అనంతలక్ష్మీదేవికిని వధూ గృహంలో అఖండవైభవముగ వివాహం జరిగింది.

డాక్టరు రెడ్డిగారు వరుని తరపున పెళ్ళి పెద్ద. వధువు తరపున ఆమె పెదతండ్రి పెద్దకొడుకు అనంతకృష్టయ్యంగారు పెళ్ళి పెద్ద.

వివాహానికి నగరంలోని పెద్ద లెంతమందో వచ్చినారు. కాంగ్రెసు పెద్దలు, కమ్యూనిస్టు పార్టీవారు, ముస్లింలీగువారు, థియాసఫిస్టులు, బ్రహ్మ సమాజంవారు, కళాస్రష్టలు, సంగీతనిధులు, నాట్యవేత్తలు దంపతుల నాశీర్వదింప వచ్చినారు. వివాహం రిజిష్టర్డు వివాహంగా, హిందూ వివాహంగా రెండింటి క్రిందా అయినది.

మూడు రోజులు ఉత్సవాలు జరిగినాయి. మూడు సాయంకాలాలు గానసభలు, రాత్రిళ్ళు నృత్య ప్రదర్శనాలు జరిగినవి.

తనతో చదువుకొన్న బాలకులు ఎంతమందో కోనంగి వివాహానికి వచ్చినారు, వారి రాకపోకలకు కర్చు లాతడే ఇచ్చినాడు. వారందరు పెళ్ళి కొమరితను చూచి కోనంగి వంటి అదృష్టవంతుడీ భూలోకాన లేడని పొగడినారు. కొందరు కోనంగి అదృష్టానికి తమకు ఓర్వలేనితనం వస్తున్నదని అల్లరిచేసినారు.

కోనంగి వివాహానికి 'సారా' కన్యయు, సీతాదేవియు వచ్చినారు. సీతాదేవి కోనంగితో తనకును సంబంధము కుదిరిదనిన్నీ ఏలాగన్నా తాను చేతులారా కోనంగిని వదలుకొన్నానని తెలిపింది. రాబోవు వరుడు పి.డబ్ల్యు.డి. శాఖలో సబుడివిజనలు ఆఫీసరుగా ఏర్పాటయిన అరవ అయ్యరు అబ్బాయి అనియు, అతనికి అలా ఏర్పాటు చేసింది తనతండ్రే అనిన్నీ ఆమే తేల్పింది.

'సారా' అనంతలక్ష్మిని కౌగలించుకొని “అనంత్, నువ్వు అదృష్టవంతురాలివి, తెలివిగలదానివిన్నీ, కోనంగి నీ జన్మకు సంబంధం కలగడం అదృష్టం. అతన్ని నువ్వు ప్రేమించడం ఉత్తమజ్ఞానం. అతడు దేవకుమారుడు” అని అన్నది.

అనంతలక్ష్మి స్నేహితురాండ్రందరూ వచ్చినారు. ఆ ఉత్సవాలు, ఆ ఉప్పొంగులు, ఆ అల్లరులు, ఆనందాలు, మదరాసు నగరంలో ఒక్కసారి వేయి యువతీయువకుల జంటలకు వివాహము లైనట్లయింది.

వెంపటి సత్యం, వేదాంతం రాఘవయ్య, సామ్రాజ్యలక్ష్మి కలసి ఒక జట్టుగా నాట్యం చేశారు.

భోలానాథ్ జట్టువారు ఒకరోజున నాట్యం చేసినారు.

దక్షిణాది నుండి ఒక నర్తకీ బృందమొకదినమున నాట్య ప్రదర్శన మిచ్చింది.

వివాహము అనంతలక్ష్మి పరీక్షలైన వెంటనే అయినది. ఇక ముందున్నది మధుమాసము.

నాల్గవదినాన ఆచారం ప్రకారము కోనంగికీ అనంతలక్ష్మికీ సంధాన ముహూర్తం అయినది.

జయలక్ష్మి అయ్యంగార్ల ఇంట సాధారణంగా జరుగు వేడుకలే తన ఇంటనూ చేయించినది. కోనంగికి కృష్ణుని వేషమును, అనంతలక్ష్మికి రాధ వేషమును అలంకరించి వెండికోళ్ళుగల పూల ఉయ్యాలయం దూపుచూ జయలక్ష్మి చుట్టపు పుష్పాంగనలందరు కోకిల కంఠాల పాటలు పాడినారు.

ఎన్నెన్నియో వేడుకలైనవి. బందరు నుండి కోనంగి ప్రాణ స్నేహితుడు మధుసూదనరావు పెళ్ళికి వచ్చాడు.

ఆ రాత్రి స్వర్గధామంలా అలంకరించిన శోభన మందిరంలో వారిద్దరొంటిగా ఉన్నారు. వారి ఆనందము ఆ నాడా గదిలోనికి గవాక్షాల గుండా తొంగిచూచే ఆకాశమే వర్ణించి మరునాడు సూర్యునకు నివేదింపలేక పోయింది.

అంతకుముందు సాయంకాలం కోనంగి. ఇంటివెనుక తోటలో ఒంటరిగా కూర్చున్నాడు. ముసలివాళ్ళు చిన్నపిల్లల చేసికొని కొద్ది రోజులలో తాము ఆకాశంలో ఏవో లోకాలకు పోయి ఆధరువులేని పసికూనలకు స్వాతంత్ర్యం ఇచ్చే రోజులు పోయాయి అని కోనంగి అనుకొన్నాడు. అయితే ఆ దినాల్లో ఒక ముసలమ్మ ఒక పసిబిడ్డను పెళ్ళిచేసుకున్న వార్త లేమన్నా ఉండేవా?” అని అనుకుంటూ నవ్వుకున్నాడు.

ఆ సమయంలో స్నేహితుడితో కాస్త కాలం వెళ్ళబుచ్చుదామని డాక్టరు రెడ్డి కారుపై పెళ్ళి వారింటికి వచ్చాడు.

ఆ రాత్రేగదా కోనంగి భార్యతో కలియడము! ఆ సందర్భంలో కొన్ని సలహాలు కోనంగి కివ్వాలని డాక్టరు రెడ్డి వచ్చాడు.

“ఏ మోయ్ కోన్, నువ్వు గర్భనిరోధక విషయాలేమన్నా ఎప్పుడన్నా చదివావా?”

“గర్భనిరోధకం? నాకు గర్భం వస్తుందని నేనెప్పుడన్నా భయపడితేకదా!”

“వహ్వా! ఏమో నిన్ను చూస్తూ ఉంటే ఏదో ఓ రోజున ఓ బిడ్డ నెత్తుకొని పాలిస్తూ కనబడేట్లున్నావు.”

“ఆ బిడ్డకు తమరే తండ్రి అవుతారు కాబోలు కాట్రేడ్ గారూ!”

“నువ్వే ఆడదాని వైనట్లయితే నీకు నేను తప్పకుండా భర్తనయ్యేవాళ్లే.”

“ఎన్నేళ్ళు నన్ను భర్తగా కంట్రాక్టు చేసికొని వుందువు?”

“ఏ అయిదో ఆరో రోజులు.”

“ఓరీ నీ అసాధ్యంకూలా షారియర్ రాజులా తయారవాలని వుందన్నమాట! అవసరం అయ్యాక పెళ్ళాల పీక ఎగరవేస్తూ వుందువన్న మాట.”

“ఇంకీ సంభాషణ చాలించి, నిన్ను నేను సీరియస్గా అడుగుతున్నా, తొందరలోనే నీ భార్య తల్లి అవాలని వుందేమిటి నీకు?”

“తల్లే అవుతుందో కూతురే అవుతుందో మనకేం తెలుసునోయ్!”

“నీకు ఎంత బుద్ది చెప్పినా యీ హాస్యంగా మాట్లాడడం మానవు.”

“ఆఁ!

నా కీ ప్రపంచమంతా ఒక జోక్

తక్కినవాళ్ళ కిది పెద్ద షాక్

నీ కంటావా

నే చెప్పాలా

నువ్వు ముందుకు సాగలేని నల్లరాక్

కొందరి దద్దమ్మల కిది వట్టి షోక్

వాళ్ళకి మధ్య మధ్య ఒక్క పోక్

యిస్తేనేగాని, జాంబక్

రాస్తేగాని, వట్టి హంబక్

లై వూరుకుంటార్న మాట నిజమో కాదో త్రింబక్

క్షేత్రంలో విచారించవయ్యా డాక్టరు డాంబిక్ లేకపోతే వెళ్ళు ముసాంబిక్”

“ఆహా! ఏం పాటండి! వట్టి సర్రియలిస్టు కవిలాగున్నావే?”

“నేను సర్రియలిస్టును కాదు, నేను డ్యూక్ రియలిస్టుని.”

“ఓయి వెర్రికవీ! నిన్ను మోదవాకం

ఆస్పత్రిలోనో, లేక నుంగంబాకం

కాలేజీలోనో చేర్చకపోతే వట్టి పోరంబోకం

లేక, పరశువాకం

బేరకవో, వట్టి మీనంబాకం

ఏరోడ్రోమువో, లేక కోడంబాకం

పెద్ద చెరువువో, లేక కీలుబాకం

స్వదేశి ఆస్పత్రివో, లేక విల్లివాకం

కల్లుదుకాణానివో, లేక వట్టి మైసూరుపాకం

అయి వూరుకుంటావో, మాకేం."

“నేను నిన్ను నిజంగా మెచ్చుకున్నానోయ్ డాక్టరూ! నీవు సూపర్ సర్రియలిస్టు కవిలాగున్నావ్”

“సరేగాని నీ భార్య బి. యే. చదువుకున్నదని తెలుసా నీకు?”

“ఆ తెలుసును. నాకు రెండుచేతులున్నాయని ఎంత స్పష్టంగా తెలుసునో అంత స్పష్టంగా తెలుసును.”

“ఏమోలే, నేను నమ్మలేనులే. నీ వ్యాపారము చూస్తే ఏమీ నమ్మటానికి వీలులేకుండా వుందిలే. మరి మీ ఆవిడ చూశావా, బి.ఏ. పరీక్షకు వెళ్ళేసమయం పిల్లతల్లి అయి కూర్చోవాలని వుందా నీకు?”

“నువ్వు అంతా నిర్వేళాకోళంగా మాట్లాడుతున్నావు గనుక నేనూ తీవ్రకార్యాలోచనా పరుండనై ప్రతివచనం బిచ్చుచుంటిని. గైకొనుము వైద్యశేఖరుడా, మిత్రమా, సర్ రామస్వామి మొదలియార్ సత్రమా, గార్దభంబు గాత్రమా, తాటియాకు ఛత్రమా, నల్లరాతి పొత్రమా, అఖండ కమ్యూనిస్టుల మిత్రమా!”

“ఆ... చాల్లే నువ్వు వొట్టి వోటిపాత్రమా గాని...”

“అవునయ్యా, ఏమి చేయమంటావు?”

“గర్భనిరోధక సాధనాలు వువయోగించవయ్యా అంటాను.”

“ఎంత గర్భనిర్భేద్యమైనమాట చెప్పావూ” అయితే, డాగు దొరా, యీ విషయాన్ని గురించి యీ మధ్య పత్రికల్లో జరిగిన వాదోపవాదాలన్నీ వింటూ ఉన్నాను. హృదయంలో వరదలుకట్టి పారుతున్న కోరికలను చంపుకోలేక, అవ్వా కావాలి, బువ్వా కావాలని అనే పెద్దమనిషిని కాదలచుకోలేదు.”

“ఓయి వెర్రివాడా! ఆకలి చంపుకోలేవూ, నీ కిష్టమొచ్చిందల్లా తింటావూ! కడుపు నొప్పివస్తే, అజీర్ణం చేస్తే మందుకోసం పరుగెత్తుతావూ! తిండి, మందూ, అవ్వా బువ్వా కావుకాబోలు!”

“నిజమే, నేను మాత్రము అతిపురుషుణ్ణి కాదలచుకోలేదు. ఒక్క మాటమాత్రం నీ కిస్తాను. ఈ వేసవికాలంలో మాత్రమే యీ ఇంట నూతనదంపతులు తమ కాలాన్ని మధుమాసం చేసుకుంటారు. తక్కిన నెలలు వారిద్దరూ ప్రాణస్నేహితులు మాత్రం.”

“అభివందనములు. నిన్న మేయిల్లో మీ స్నేహితులంతా ఉత్తరానికి పోయినట్టున్నారే. తెలుగువాళ్ళకి, ముఖ్యంగా నీ స్నేహితులకు, కమ్యూనిస్టులంటే అంతకోపం ఏమిటోయ్?”

“నువ్వు మహా అరవవాడవు అయినట్టు! అంతగా లెక్కచూస్తే, తెలుగువాళ్ళలోనే కమ్యూనిస్టు లెక్కువున్నారు. అంతకన్న కాంగ్రెసువారూ ఎక్కువున్నారు మీ అరవవాళ్ళకన్నా.”

“ఒకమాటు నన్ను తెలుగు వాడంటావు. ఒకమాటు అరవవాడంటావు. ఈ మూడురోజుల ఉత్సవాలు, యీ రాత్రి జరగబోయే వుత్సవంతో, నీ మతి పోయినట్టుంది.”

“ఆ, ఒక విధంగా మతిపోయిందోయ్. నేను ఈ రోజునే గదా గృహస్థాశ్రమ ప్రాంగణందాటి లోనికి పోయేది?”

2

తానూ కోనంగి చుట్టాల పెద్దలతో, స్నేహితులతో కలిసి వివాహం రిజిస్టారుగారి దగ్గర వివాహపత్రంలో సంతకాలు పెట్టేడప్పుడు, అనంతలక్ష్మి సంతోషంతో వణికిపోయింది. తనంత అదృష్టవంతురా లెవ్వరు? అందరూ పెళ్ళివారింటికి వచ్చారు.

తాను ఎదుట చూచిన పురుషుడు ఏ లోకాల నుంచో అవతరించినట్టు అవతరించి ఆ దినాన తన గేటు గుమ్మం దగ్గర ఎదురు చూస్తూ ఉండడం ఎంత అదృష్టం? అలా రాకుండా ఉన్నట్లయితే తన బ్రతుకు ఎడారి బ్రతుకై ఉండేది?

తన భర్త ఎంత ఉత్తముడు! ఎంత చక్కనివాడు. ఎంత తెలివైనవాడు. ఆయన పాదాలకడనే తన సర్వస్వమూ! ఆయనే తన భర్త, ప్రియుడు, భగవంతుడు అని భావం గలిగింది. అదేనా ప్రేమ? వారు తిరిగి తన్ను ప్రేమించడం ఎంత మూత్కృష్టమైన అదృష్టము!

ఈ రాత్రి చుట్టాలంతా తమ శయనమందిరంలో ఏదో అల్లరులు చేస్తారు. తాను సిగ్గుచేత కుంగిపోవలసి వస్తుంది. తన భర్త కూడా సిగ్గుపడతారా? మగవాళ్ళకు సిగ్గు ఉంటుందా?

తాను... వారు? ఈ లోకం మధ్య! ఇదివరకు వారు మాట్లాడే విధానం వేరు. ఈనాడు వేరుగా ఉంటుందా? ఎన్నిసారులు తానూ ఆయనా ఇద్దరు మాత్రమే వాహ్యాళికి వెళ్ళలేదు. ఎన్నిసారులు ఇద్దరు మాత్రమే సినిమాలకు వెళ్ళలేదు? తానూ వారూ మాత్రమే తన పడకగదిలో కూర్చుండి మాట్లాడుకున్న సమయాలు ఎన్నో ఉన్నాయి. తన మాష్టరుగారు. తన్ను తమ గుండె కదుముకున్నప్పుడు తన దేహం అంతా ఝల్లుమనేది. ఏదో మత్తత, ఏదో మధురత తన్ను ముంచెత్తేవి. తనకా సమయాలల్లో భయమూ కలిగేది, వారు ఔచిత్యభంగం ఒనరిస్తారేమోనని?

అలా వారు ఔచిత్యభంగ మొనరించినా తాను భయంతోనన్నా ఆనందంతో మాత్రము ఒప్పుకొని ఉండును.

ఇతర పురుషులు తన్ను ముట్టుకొన్నప్పుడు ఏమీ ఆనందం ఉండేది కాదు సరికదా జుగుప్స కూడా కలిగి ఒళ్ళు ముడుచుకుపోయేది.

ఈ దినమందు-వారూ తానూ ఒంటిగా-ఈ ఆలోచనలకు అంతరాయంగా ఆ బాలిక సహాధ్యాయినిలు పకపకలాడుతూ అనంతలక్ష్మి దగ్గరకు పరుగెత్తుకొని వచ్చారు.

ఆ బాలికలు ఆమెను పెట్టిన అల్లరి ఇంతా అంతా కాదు. అంబుజం వెనక నుంచి అనంతం మోముమీదికి వంగి ఆమె పెదవులు ముద్దుపెట్టుకొని, కలకల నవ్వుతూ, “ఆసి దొంగా! కోనంగిరావుగారే అనుకున్నావా అమ్మా!” అన్నది.

పార్వతి: ఎందుకో అంబుజం? అది పగటికలలుకంటూ కూర్చుంది. మధ్య పానకంలో పుడకలాగ, నీ చిలిపిచేష్టలేమిటి?

మీనాక్షి: ఉండండి, ఇవాళ నుంచి అనంతానికి మనతో మాట్లాడడానికి తీరుబడే ఉండదు. అసలు మనకు తిన్నగా కనబడుతుందా?

యోగం: ఎప్పుడే అనంతం, మీరిద్దరూ మధుమాస యాత్రకు బయలుదేరేది?

మేరీ: ఎక్కడికే లక్ష్మీ! ఊటీకా, కాశ్మీరానికా?

మీనాక్షి: హిమాలయాలా, సింహళమా?

పార్వతి: ఈలాంటి తీయతీయని రహస్యాలన్నీ మనతో చెప్పుకుంటుందేం?

ద్వారకాబాయి: సిగ్గు వెయ్యదుటే పాపం!

కమల: ఏమిటే అనంతం, కళ్ళు వెదుకుతున్నాయి.

మేరీ: ఎవరో ఒకర్ని. తనకు తెలుగు చెప్పిన ప్రయివేటు మాష్టరో?

యోగం: ఒక సినీమాలో వేషం వేసిన కథానాయకుడో?

ద్వారకా: నాటకాలలో హీరోనో! -

మీనాక్షి: అడాడా! ఎన్నా ఇది ఇందమాదిరి విషయం పండ్రారే? నాణతినాల్ అవళ్ ముగం శివందు పోరదే.

నవ్వుకుంటూ అనంతం ఇవన్నీ వింది. “రండర్రా, కొత్త ఫలహారాలు చేద్దురుగాని” అని అనంతం లేచింది.

“ఇది ఫలహరంగచ్చెదానే. వేరు ఒండు ఇల్లియే?” అని మీనాక్షి అంది.

ఇంతలో జయలక్ష్మి అక్కడకు వచ్చి “ఫలహారాలు సిద్దంగా ఉన్నాయి, రండని” వారి నందరిని సగౌరవంగా పిలిచింది.

ఇల్లూ మేడా దీపాలతో, అలంకారాలతో కలకలలాడిపోతూ ఉంది. బాలికలందరూ అనంతలక్ష్మిని సంధాన శయనగృహానికి పంపించి మరీ ఇళ్ళకు వెళ్ళినారు.

అలా తలుపువేసి వెళ్ళారు. కోనంగి ఒక్కసారిగా అనంతలక్ష్మిని కౌగిలిలోకి కబళించి వేశాడు. ఆ బాలిక అతని కౌగిలిలోనే ఒక ఆనందామృత ప్రవాహమై అతని జన్మ సహస్రాలు అలముకుపోయింది. వారికి మాటలులేవు. వారే ఆనందమూర్తులయ్యారు. ఆనంద శిఖరితమైన అమృతము బిందువులై అతని కన్నులు తిరిగినవి. ఆమె తలకట్టు, ఫాలము, కనుబొమలు, కన్నులు, నాశిక, నాశికాపుటములు, చెంపలు, చెవులు, గడ్డము కంఠము అతడు పుణికినాడు. ఆమె పరవశమైనది. వివశయైనది. అతడామె పెదవులు, అతని పెదవు లామె! ఒక పరమమోహన సందేశ గాఢచుంబనావ సంగమ మైపోయినవి నాలు పెదవులున్నూ.

“అమృత కలశీవి నువ్వు

అమర లోకానీక

ఏకైక మూర్తినే

ఏను కోరెద నిన్ను”

అని కోనంగి అనంతలక్ష్మిని తన ఒడిలో గాఢపు కౌగిలింతలో ఒరిగించుకొని ఈ పాట పాడినాడు అస్పష్టవాక్కుతో.

“మీ ఆనందం అంత అనంతమైనదా!”

“అనంతత్వం నా ఆనందం ముందు ఒక క్షణిక మాత్రం అనంతలక్ష్మి!”

“అయితే నాకన్న మీ ఆనందం ఎక్కువా? పోనీలెండి. నన్ను వదలండి నే వెళ్ళిపోతాను!”

“నా అనంతమే నా ఆనందం. అనంతా! అసలు ఆనందం నా అనంతం ముందు ఒక్కక్షణికం అని!

“నా అనంతం ముందు

నళినాక్షీ ఒక లిప్త

మాత్రం అసలనంత

భావ మాత్మేశ్వరీ!”

“మాటలాడటం మాని, పాటలతో మాట్లాడుతారా?”

“మాటల్లో లోతేది

పాటల్లో తీపేది

నా జీవితేశ్వరీ

నళినాక్షులను పొగడ!”

“పాట పాటకు రాజ

మాటలాడకు నాథా

మూగనోమే నీకు

ముద్దుగులికే సొగసు.”

“నీకూ పాటలు వస్తున్నాయి లక్ష్మి!”

“ఇన్నాళ్ళు మీ సహవాసం చేసి!”

“తెల్ల వారుతోంది గడియారం జరిగిపోతుంది.”

“గడియారం ఆపు చేయండి."

“నువ్వే చేయి ఆ పని. వెనక సురభీదేవి కుండలు అమ్ముతూ వెడుతూంటే రాజుగారి భార్య కబుర్లు చెబుతూ ఆమెను ఆపుచేసిందట. నెత్తిమీదకు పొద్దురాకముందే భర్తకు అన్నం పెట్టాలట. అందుకని ఆవిడ “సూర్యదేవుడా? ఉన్నచోటే ఆగు నాయనా!” అని అందట. ఆ మహాపతివ్రతమాట ఆజ్ఞ అయి సూర్యదేవుడు ఆగిపోయాడట. దానితో లోకం తల్లక్రిందులయిందనుకో. నువ్వూ! అలా చేయి. లోకం తల్లక్రిందులైతే మనకేం భయం ?”

“ఏలాగా తలక్రిందులుగా జరుగుతోనే వుంది. కాని మీరో? వెనక వశిష్ఠులవారు తపస్సు చేసుకుంటోంటే, సూర్యుడు నెత్తి పైకి వచ్చాడట. వశిష్ఠుడు చేతిగుడ్డ పైకి ఎగరవేశాడట. ఆది పెద్ద మేఘమై సూర్యుణ్ణి అరికట్టిందట! మీరు మీ జేబురుమాలు ఎగరవేయండి.”

"అనగనగా ఒక అందమైన అమ్మాయట. అ అమ్మాయి అందం వర్ణించాలని బ్రహ్మా, ఆదివిష్ణువూ పంతాలు వేసుకున్నారట...”

“అనగనగా ఆ అందమైన అమ్మాయి, ఒక అందంలేని అబ్బాయిగార్ని వరించిందట...)

“ఆ అబ్బాయి ఆ ఆమ్మాయిని ఈలాగే పెదవుల...”

“ఉందురూ, మీరూ మీ పోకిరితనాలూ”

“ఉండను, పదికోట్లకూ ఉండను వేయికోట్లకూ ఉండను...”

“ఉండక వెళ్ళండి....”

“వెళ్ళను, కోటికోట్లకూ వేళ్ళను. శతకోట్లకూ వెళ్ళను...”

“ఉండక, వెళ్ళక ఏం చేస్తారు?”

“నా ప్రియురాలిని...”

అనంతలక్ష్మి అతని నోరుమూసి, “ఏమిటా అల్లరి మాటలు?” అని గదిమింది.

అతడు ఆమె చేయి వెనక నుంచే “నా ప్రియురాలిని నాలో కలుపు కుంటాను అంటే అల్లరిమాటా” అన్నాడు.

అనంతలక్ష్మి తన లేత తమలపాకు చేయి అతని నోటిపై నుండి తీసి,

“మీలో కలుపుకుంటే, నా పరీక్ష లెవరు చదువుతారు!” అని నవ్వింది.

“నేనే!”

“మీరు ఆడపిల్లయి చక్కబోతారు!”

“నువ్వు నాలో మొగపిల్లవాడవుతావా?”

“అయి పుడతాను!”

“నీకు తల్లినౌతానా అబ్బాయీ?”

“మనమొకరం సుగాత్రి శాలీనులం!”

“నా ప్రాణమే నీవు. నా ఆత్మే నీవు! అనంతం! నేను ఏ మహాతపస్సు చేసుకున్నానో కదా!”

3

అంబుజం అనంతలక్ష్మి ప్రథమ శోభన యామిని వర్ణిస్తూ పాట రాసింది.

“వొకరి నొకరు చూచినారు

వికసించే హృదయాలతో

ప్రకటించని ఉప్పొంగుతో

కికురించిన నవ్వులతో

గంధమలదే వధూబాల

కంఠములకు కరములకే

కమ్మని అత్తరు పూసెను

కాంతుని చేలాంచలమున

తమలపాకు చిలుకకొరికి

తరుణి నోటి కందిచ్చెను

తరుణుడు నమలుతు నవ్విన

తళ తళమనే వధువు కనులు

వేడుకలతో మేలమాడు

చేదెల అల్లరిలోనే

బ్రీడావతి వధువు చూసి

కోడెగాడు కన్నుగీటె” అని

అలాగే జరిగాయి ఆ రాత్రి శోభనమందిర ప్రథమ సంధాన దినపు వేడుకలు. చదువుకున్న పిల్లలు అల్లరి చేయడం మొదలు పెట్టితే ఆపే వారెవరు?

వధూవరులు ఆపలేరు, వాళ్ళలో వాళ్ళు ఆపుకోలేరు. జయలక్ష్మి ఏమంటుంది. కోనంగి అనంతలక్ష్మికి అత్తరు రాయాలి. అనంతలక్ష్మి కోనంగికి అత్తరు రాయాలి. ఒకరి కొకరు గంధాలు రాయాలి. అల్లరిగా బుగ్గలమీద రాయాలి. పన్నీరు చల్లించారు. ఇద్దరూ ఒకరి మెళ్ళో ఒకరు పూలదండలు వేయాలి. కోనంగి అనంతలక్ష్మి తల్లో పూవులు ముడవాలి. అనంతలక్ష్మి కోనంగి ఖద్దరు పట్టుచొక్కా గుండీకి పూలగుత్తి తగిలించాలి.

ఇద్దరూ తొమ్మిది చొప్పున తమలపాకుల చుట్టలు కొరికి వధువు వరుని నోట్లోకి, వరుడు వధువు నోట్లోకి అందివ్వాలి.

వీళ్ళు తమలంకూడా నోటికి నోటితో అందివ్వమంటారేమో దైవమా అని కోనంగి భయపడ్డాడు.

పార్వతి: నమలవే అనంతం!

మీనాక్షి: నమలండీ కోనంగిరావుగారూ!

కోనంగి: నములుతున్నా నమ్మా, నములుతున్నాను.

అంబుజం: మింగివేయకండి కోనంగిరావుగారూ!

మీనాక్షి: ఆ తమ్మ -

అనంతలక్ష్మి: మీనాక్షి!

పార్వతి: ఎందుకమ్మా మీనాక్షి? మీరు ఒకరి కొకరు తమ్మ అందియ్యాల? చేతులతో కాదండీ కోనంగిరావుగారూ!

కోనంగి: ఒక పాట రాసుకువచ్చాను. పాడమంటారా?

అందరూ: తప్పకుండా! అభివందనాలు.

మీనాక్షి: ఆ తర్వాత అనంతం ఓ పాట పాడాలి!

కోనంగి:

ఆకాశ దూరాల కంతేది చివరేది?

హృదయామృతము రుచికి

పదములల్లే దెవరు?

ఈ కొండ నోవాగు ఆ కొండనోవాగు

రెండు వాగులు కలియు

ప్రేమ క్షేత్రంబేది?

ఆనంద డోలికాయానాన కంతేది?

ఆర్ధకంఠంలోని ఆలాప నేరూపు?

చీకటిలో చీకటి చేరినట్లేవరెరుగు?

వెలుగు వెలుగున చేరు విధము ఎరిగిన దెవరు?

అంబుజం: ఏమిటిబాబూ ఈ వేదాంతం? కాని పాడడం దివ్యమే!

అందరూ: అద్భుతంగా ఉంది.

మీనాక్షి: నీ వంతో అనంతం!

అనంతం: నాకు వచ్చిన పాటలు కృతులే!

అంబుజం: కృతులకూ, ఇప్పటికీ శ్రుతి కలవదే!

అనంతం: నేను ఒకరి వ్రాత పుస్తకంలో వ్రాసుకొన్న ఓ పాట ఆ మధ్య చదివాను, అది పాడుతాను!

పార్వతి: ఆనందం! కానీ!

అనంత:

ఆడవో శిభిరాజ ఆడు పింఛమువీడ

ఆలము నీలపు కాంతి అడవి కుసుమాలతో

ఆకాశవీధిలో అరుదెంచే మేఘాలు,

మేఘాల నృత్యంచే మెరుపు బాలిక ఒకతె!

నీలి బాలునివేణు ఆలపించెను నీలమేఘ మల్లారి నా మేనెల్ల పులకించే!

ఈ పాట ఆపుతూనే బాలికలందరు పరుగున ఆ మందిరం విడచి, తలుపులు పైన బిగించారు.

* * * *

కోనంగి తల్పములో తెల్లవారుతున్నది. భార్యను కౌగిలిలో అదుముకొనే

“ఏ మహాతపస్సును చేసినానో

ఏ పవిత్ర సుకృతాన్ని చేసినానో

నువ్వు నా దేవివై వెలసితివి బాలా?” అని పాడినాడు.

అనంతలక్ష్మి అతని కౌగిలి నుండి జారి అతని పాదాలపై తల నుంచి అవి ముద్దు పెట్టుకొంది. కోనంగి తానూ క్రిందకు వ్రాలి అనంతలక్ష్మిని సువ్వున ఎత్తుకొని హృదయాని కదుముకొన్నాడు. అయిదుగంటలు కొడుతున్నది.

ఇంతలో ఎవరో వారి శోభనగృహపు తలుపులు కొట్టినారు.

యిద్దరూ కౌగిలి వదలి ఒకరి నొకరు ఆశ్చర్యంగా చూచుకొన్నారు.

“అమ్మిణీ!”

భయపడిన, సగం ఏడుపు కలసిన జయలక్ష్మి మాట వినబడింది.

ఇద్దరూ తెల్లబోయి తలుపు వైపు చూచారు.

“అమ్మిణీ!” ఇప్పుడు వెక్కి వెక్కి ఏడుపుతో జయలక్ష్మి పిలిచింది.

కోనంగి రెండంగలలో వెళ్ళి తలుపు తెరిచాడు. ఎదుట జయలక్ష్మి, అనంతలక్ష్మి స్నేహితురాండ్రు, చుట్టాలు కళ్ళనీళ్ళతో ఏడుస్తూ కనబడ్డారు. వాళ్ళ వెనకాల పోలీసు అసిస్టెంటు కమీషనరు, ఇద్దరు ఇనస్పెక్టర్లు, కొంత మంది కానిస్టేబిలు కనబడ్డారు.

కోనంగిరావు తెల్లబోయాడు. “ఏమిటండీ ఇది?” అని జయలక్ష్మిని అడిగాడు.

అప్పుడు అసిస్టెంటు కమీషనరు “అయ్యా! మిమ్ము అరెస్టు చేస్తున్నాను. సాయంకాలమే చేయవసింది. కాని ఇది మీ శోభనపు దినం. అందుచే మీకెవ్వరికీ తెలియకుండా మీ మేడచుట్టూ కాపలా ఉంచి, తెల్లవారుతోందిగదా అని ఇప్పుడు అరెస్టు చేయడానికి వచ్చాను.”

జయలక్ష్మి నిలువునా కూలిపోయింది. అనంతలక్ష్మి చైతన్యంలేని కట్టబొమ్మలా నిలుచుంది.

4

“గాంధర్వ కుటీరం” (జయలక్ష్మి ఇల్లు) ముందునే పోలీసువాను ఉంది. అందులోని కోనంగిని ఎక్కించారు పోలీసువారు. ఆ వెనకే తాము ఎక్కారు. అందులో నలుగురు పోలీసు జవానులు, ఒక పెద్దమనిషి ఉన్నారు. ఒక జవాను' తలుపులు వేశాడు. తాను సాగింది. కమీషనరుగారు తన కారులో బయలుదేరారు. వానులో ఇద్దరు సబు ఇనస్పెక్టర్లు ఉన్నారు.

ఆ 'వాను' వేగంగా సాగిపోతోంది. కోనంగి ప్రాణం బిగుసుకుపోయింది. “ఎందుకు పోలీసువారు తన్ను అరెస్టు చేశారు? ఎక్కడ కేసు పెడ్తారు? ఆ రాత్రి తాననుభవించిన స్వర్ణాతీతానంద మేమిటి? ఆ వెంటనే ఈ అరెస్టేమిటి? తన మాట అలా ఉంచండి, అక్కడ అనంతలక్ష్మి ఏమవుతుంది? ఏమనుకుంటారు తన్ను. ఇది వైట్వే వారు పెట్టిన కేసు కాదు గదా? తానేమీ తప్పు చేయలేదే! తప్పు చేయగలిగిన ధైర్యం ఏదీ తనకు?

అనంతలక్ష్మి ఎలాంటి ప్రేమ అర్పించింది! ఆ దివ్యాతిదివ్య క్షణాలు తలుచుకునేందుకు కూడా తాను తగడే? అనంత అమృతమూర్తి, సౌందర్య పరమావధి! తాను అతి అదృష్టవంతుడు కాబట్టి ఆమెతో ఆ కొద్ది గంటలన్నా ఏదో పరమ సమ్మోహస్థితిలో దేవత్వమే పొందాడు! కాని ఆ బాలిక? తమకిద్దరకూ పెళ్ళికాకుండా ఉన్నప్పుడు ఈ అరెస్టు జరిగి ఉంటే బాగుండునే! తనకన్న వేయిరెట్లు, కోటిరెట్లు మంచివాడు భర్తగా దొరికి ఉండును. తానామెకు తగడు. అందుకు భగవంతుడిలా “ఓయి చచ్చు పెద్దమా! నువ్వు చేసిన పుణ్యం ఎంతో మంచిది గాబట్టే నీకామె ఒక రాత్రికన్నా భార్య అయింది!” అంతవరకే తనకు వరమిచ్చాడు.

శోభనమని ఈ పోలీసువారు రాత్రికి రాత్రి అరెస్టు చేయలేదు. అదే పది కోటికోటి అదృష్టాలముద్ద. పోలీసువారయితేనేమి, వాళ్ళు మనుష్యులే! కాని కేసు ఏమిటి? తానేమి తప్పు చేశాడు? త్వరలో డాక్టరుకు కబురు పంపి బెయిలు పిటీషను పెట్టించాలి” అనుకొంటూ కోనంగి తలఎత్తి, పోలీసువారి మధ్య ఉన్న పెద్దమనుష్యుని వంక చూశాడు. అతడు బేడ్రెస్సులో ఉన్న ఒక పోలీసు ఇనస్పెక్టరను కొన్నాడు.

“కోనండీ! కంగారుపడకు.”

కోనంగి చకితుడై ఆ ధ్వనివైపు చూచాడు. ఆ అదృష్టకాంతులలో ఆ పెద్దమనుష్యుడు తనవైపు చూస్తున్నాడు. మాట తనకు చిరపరిచయమైనట్లే ఉంది.

“ఏమి కోనంగీ, ఆనవాలు పట్టలేదా?”

“నువ్వా డాక్టర్!"

“అవును నేనే; డాక్టరును.”

కోనంగి హృదయం తేలికైపోయింది. తన్ను విడిపించే మగవాడు రానే వచ్చాడు. తెల్లవారగానే పోలీసువారు తన్ను విడుదల చేసి తీరుతారు. అమ్మయ్యా! అతని గుండెల్లోంచి బరువు తీసివేసినట్లే అయింది.

డాక్టరు: కోనంగి, నేను నీవలెనే ఈ పోలీసువారి ఖైదీని.

కోనంగి: ఏమిటీ! నువ్వూ...? నాకు తల తిరిగిపోతోంది డాక్టరూ!

డాక్టరు: పడుకుంటావా?

కోనంగి: నిజంగా తల తిరగటంకాదు. ఏమీటో అరెస్టు అని?

డాక్టరు: ఏముంది, మనం ఇద్దరం కమ్యూనిస్టులమట! మనం ఇద్దరము తక్కిన ఇంకా ఎంతమందో కమ్యూనిస్టులతో కలసి ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నామట!

కోనం: మనమా? కుట్రా?

డాక్టరు: అవునయ్యా, అవును.

కోనంగి: మనకు కుట్ర ఏమిటోయ్?

డాక్టరు: కమ్యూనిస్టు రష్యా జర్మనీతో సంధి చేసుకున్న తరువాతనేగా, జర్మనీ పోలెండుమీద విరుచుకుపడింది.

కోనంగి: విరుచుకుపడనీ, తిననీ, దానికీ మనకూ సంబంధం ఏమిటంట?

డాక్టరు: జర్మనీకీ ఇంగ్లండుకూ యుద్ధమేనా?

కోనంగి: నువ్వన్న ముక్కలు నాకర్థం కాక కాదు నాయనా?

రష్యాకూ ఇంగ్లండుకూ స్నేహమే కదా! పైగా రష్యాకూ జర్మనీకీ జరిగిన సంధి “నన్ను ముట్టుకోకు నామాలకాకి, నిన్ను ముట్టుకోను నీమాల కొంగ!” అన్నదేగాదా అంట.

డాక్టరు: ఇవన్నీ ఇప్పుడు మనం వాదించుకుంటే ఏమి లాభం?

కోనంగి: మన్ని కోర్టులో విచారిస్తారా?

డాక్టరు: విచారణాలేదు, గిచారణాలేదు. ఈయుద్ధావసరం నిమిత్తం వచ్చిన

కోనంగి: అర్ధణాలు. ఆర్డినెన్సులు -

డాక్టరు: ఆ ఆర్డినెన్సులలో ఒకదాని క్రింద -

కోనంగి: దేని క్రిందైతేనేం, పైనైతేనేం, మనం ఇద్దరం జైలు ప్రవేశ శుభమహూర్తోస్తు అన్నమాట.

డాక్టరు: అదీదా నాయనా! నువ్వు కాస్త తేరుకున్నట్లున్నావు. ధోరణి ప్రారంభం అయింది.

కోనంగి: ఏం ధోరణి రెడీ! నీ మాట విని ఏదయినా సినీమా ఏమో అని కొంత కొంత సంతోషించాను. కాని, నిజమయిన జయిలు అంటే కాస్త బిక్కుబిక్కుమంటూనే ఉంది ప్రాణం!

డాక్టరు: ఇదివరకు ఎప్పుడయినా జైలుకు వెళ్ళావా?

కోనంగి: నేనేమన్నా దొంగననుకున్నావా?

డాక్టరు: ఓరి నీ యిల్లు బంగారంకానూ! ఏ కాంగ్రెసు ఉద్యమంలోనన్నా వెళ్ళావేమో అనోయీ నా ప్రశ్న?

కోనంగి: నాకుద్యమాలేమిటి నాయనా! నాకు ఉద్యోగం ఏమిటీ? అన్న ఉద్యమం తప్ప.

డాక్టరు: ఇల్లారా, దగ్గర కూర్చో! అప్పుడే తిరుక్కాలిక్కుండరం రోడ్డు వచ్చింది.

కోనంగి: ఎక్కడి కేమిటి మన యాత్ర?

డాక్టరు: రామేశ్వరమో? -

కోనంగి: తిరువనంతశయనమో?

కోనంగి లేచి పోలీసు జవానుల సహాయంతో, ముందుకు పోయి డాక్టరు ప్రక్క కూచున్నాడు.

డాక్టరు నిట్టూర్పు పుచ్చి “కోన్, ఏమి అత్తరువాసన కొడుతున్నావు. బట్టలన్నా మార్చుకోకుండా వచ్చేవా?” అని అడిగాడు.

కోనంగి తెల్లబోయాడు. ఒక్క నిమిషం గుండె ఆగిపోయింది. లేని నవ్వు తెచ్చుకొని ‘అనంతంతో చెప్పనన్నాలేదు రెడ్డీ?” అన్నాడు. మా అత్తగారు మూర్ఛపోయింది. అనంతం సంగతి ఏమయిందో?” అని తల వంచుకున్నాడు.

“ఇది ఎలా వచ్చిందో నాకు అర్థంకావటంలేదు.”

“ఎవడో ఒక రాస్కెల్ అబద్దాలు కల్పించి మన ఇద్దరిమీదా ప్రభుత్వం వారికి రిపోర్టు ఇచ్చాడట?” అని అన్నాడు డాక్టరు.

“నీ కెల్లా తెలిసింది?” “అసిస్టెంటు కమీషనరు నాకు స్నేహితుడు. అతడీ ముక్క నా చెవిని వేశాడు.”

“ఎవడా మహానుభావుడు?” “గర్భాదానపు గదిలో నుంచి కథానాయకుణ్ణి ఖయిదుకు పంపిన హీనుడు.”

“ఘోటక బ్రహ్మచారివి నువ్వు. నామాట కేమిగాని నిన్ను కటకటాల వెనక్కు వాటంగా నెట్టిన ఘోరపాపి ఎవడు వాడు?”

పోలీసువాన్ చెంగల్పట్టు పోలీసు స్టేషను దగ్గర ఆగింది. పోలీసు వారు కోనంగినీ, డాక్టరునూ మొగాలు కడుక్కొని ఫలహారాలు చేయమన్నారు. వారిద్దరూ ఇద్దెనులు, దోసెలు, వడలు సాంబారు, కాఫీ ఫలహారాలు చేశారు.

“ఈ మర్యాద అత్తవారి మర్యాదలానే ఉందోయి” అన్నాడు కోనంగి.

“ఒక అత్తవారింట్లోంచి ఇంకో అత్తవారింట్లోకి వెడుతున్నావు.”

“నీకిది మొదటి అత్తవారిల్లేగా?”

“అవునయ్యా, భార్య మాత్రం లేదుగాని.”

* * * *

అలా ఆమె భర్తను పోలీసువారు పట్టుకుపోయారు. భర్తతో మొదటి రాత్రి ముగియలేదు. దిక్కులు తెలతెలవారలేదు. ఆమె అలా నిలుచుండిపోయినది.

అనంతలక్ష్మికి తల్లి మూర్చపోయిన సంగతి తెలియదు. ఎనమండుగురు స్నేహితురాండ్రు అక్కడ ఉన్నారన్న సంగతి ఆమెకు స్పృహలేదు. తనకు సంధాన మూత్సవము జరిగింది అన్న జ్ఞానం ఆమెకు మాయమైంది.

భర్తను తీసుకుపోయారు. తన ప్రభువును, తన పరమ మిత్రమును, తన పురుషోత్తమోత్తముని తీసుకుపోయారు. ఎవరు? ఎందుకు? ఈప్రశ్నలేమీ ఆమె కుదయించలేదు. ఆమె కన్నులు మూయకుండా గుమ్మంవైపు చూస్తూ నిలుచుంది. ఆమె చూపులలో చైతన్యములేదు. ఆమె మోమున రక్తములేదు. ఆమెకు తాను అన్నజ్ఞానము పోయింది. ఆమెకు తానెక్కడ ఉన్నదీ తెలియదు.

కాని ఆమె మూర్ఛపోలేదు. ఏడవలేదు. కన్నులు మూస్తున్నట్లే వారెవ్వరికీ కనబడలేదు.

ఆ రాత్రి అక్కడ ఉన్న స్నేహితురాండ్రు ఆమెను చుట్టుముట్టి ఆమె సాధారణంగా పడుకునే గదిలోనికి నెమ్మదిగా తీసుకొనిపోయారు.

ఆమెను కూచోమంటే కూచుంటుంది. మొగం కడుక్కోకపోయినా ఇంత ఘాటు కాఫీ ఇచ్చారు. తాగు అంటే ఒక గుక్క తాగుతుంది. అలాగే బ్రతిమాలి ఎలాగయినా ఒక కప్పు త్రాగించారు.

* * * *



జయలక్ష్మి అల్లుణ్ణి అరెస్టుచేసి తీసుకు వెడుతున్నారని తెలియగానే ఒళ్ళు విరుచుకొని పడి మూర్ఛపోయింది. చుట్టాలు, ఆడవాళ్ళు గొల్లుమని జయలక్ష్మి దగ్గరకు వ్రాలినారు. కొందరు మొహమ్మీద నీళ్ళు చల్లినారు.

జయలక్ష్మికి మెలకువ వచ్చింది. కోనంగినీ, పోలీసువాళ్ళనూ, తన దురదృష్టాన్నీ తిట్టుకుంటూ జయలక్ష్మి ఏడవడం మొదలు పెట్టింది. ఒకరు డాక్టరు రెడ్డిగారింటికి పరుగెత్తారు. డాక్టరు రెడ్డిగారిని కూడా అరెస్టుచేసి తీసుకెళ్ళారని అక్కడ తెలిసింది.

ఎందుకు అరెస్టు చేసినట్లు అని ఇంటిల్లిపాదిని విచారం ఆకర్షించింది. చుట్టపు మొగవాళ్ళు కారువేసుకు వెళ్ళి జయలక్ష్మిగారి అడ్వకేటును తీసుకు వచ్చారు. ఆయన వచ్చి సంగతులన్నీ తెలుసుకొని, కోనంగిరావు గారి అరెస్టు విషయమై, సర్వమైన దర్యాప్తులు చేస్తానని చెప్పి వెళ్ళాడు.

జయలక్ష్మి సేదతేరుకుంది. ఆమె తన కూతురు దుఃఖం, కంట నీరులేని భయంకర విచారం చూచి బేజారై పోయింది. వర్ణించలేని, అర్థం కావటంలేని, గుండెను కలచివేసే అనంతలక్ష్మి స్థితిని చూసి జయలక్ష్మికి ఎక్కడలేని భయమూ వేసింది.

కూతుర్ని వదలిపెట్టి ఉండకండని చుట్టాలను స్నేహితురాండ్రను ప్రార్థించి, తాను స్నానాదికాలు కావించి పూజా గృహంలోకి వెళ్ళింది. పూజ ముగించుకొని, భగవంతుని ఎదుట పద్మాసనం వేసుకొని అలాగే కూర్చుంది.

ఆమె పూజాపీఠంలో కూడా భర్తయొక్క ఛాయాచిత్రముంది.

భగవంతునర్చిస్తూ స్వచ్చమైన జీవితం గడుపుదామన్న ప్రతివానికీ ఇలా కష్టపరంపరలు రావలసిందేనా? భక్తుల శక్తి సామర్థ్యాలనూ, దీక్షనూ భగవంతుడు పరీక్ష చేస్తాడట. సుఖమంటే మనిషికంత ప్రీతేమిటి? అనంతంగా ఎవడు సుఖవంతుడు? ఉత్కృష్టమైన ఆనందంవల్ల వచ్చే అనుభవమూ, భయంకరమైన దుఃఖంవల్ల వచ్చే అనుభవమూ, రెండూ చీకటి వెలుగులు కాబోలు.

ఇలాంటి జీవిత రహస్యాలు తన భర్త తనకు బోధించలేదా?

* * * *

దొడ్డిలోని మువ్వురు వస్తాదులకు పట్టరానికోపం వచ్చింది. అనంతలక్ష్మిని తమ బిడ్డను తమ సహెూదరి కొమరితను, ఎవరయ్యా ఈలాంటి దుర్భరమైన అవమానంచేసి ఆమె దివ్యానందకలశాన్ని ముక్కలుచేసి, కోనంగిని బంధించి తీసుకుపోగలిగారు? తాము ముగురు తలచుకుంటే ఏ పోలీసువారు ఆగుతారు? వాళ్ళను ముక్కలుచేసి కోనంగిరావుగార్ని ఆపు చేసి వుండేవారుకదూ!

ప్రజలలోని అరాజకత్వాన్ని అదుపాజ్ఞలలో ఉంచేవారు పోలీసువారు మాత్రం కాదు. ప్రజలలోని అరాజకత్వం నాయకులపై భక్తీ, పెద్దలంటే భయమూను.

ఎన్నిసారులు మన మువ్వురు వస్తాదులూ పోలీసువారికి ముగ్గురు నలుగురు మహా భయంకరులయిన దుర్మార్గులలో దుర్మార్గులను పట్టి యివ్వలేదు! దుర్మార్గ ప్రపంచానికి నాయకులయిన రౌడీలు, మన వస్తాదులు ముగ్గురూ అంటే గజగజలాడుతారు. వారి ద్వారా వీరు రౌడీమహారణ్యంలోని హీన క్రూరమృగాలను పట్టి యిచ్చారు పోలీసువారికి.

ఒకరోజు కలకత్తా మెయిలు వచ్చింది. ఆ బండిలో నుండి ఖద్దరు వస్త్రధారులైన ఒక కుటుంబమువారు దిగారు. ఆ కుటుంబం పెద్ద కాంగ్రెసు ప్రపంచంలో కొంచెం పేరు పొందినవారు. సాధుమూర్తి. ఏదో పని వుండి తిరుపతి చూచిన తర్వాత మదరాసు వచ్చాడు. మదరాసులో రామస్వామి మొదల్యారు సత్రంలో మకాంపెట్టి, మూడు రోజులుండి పని చూచుకొని, ఆ వెనుక తిరిగి వెళ్ళిపోదామని ఆ తెలుగు పెద్దమనిషి ఉద్దేశం.

రైలు దిగీ దిగడంతోటే, కూలీలను మాట్లాడుకొని కుటుంబంతో జట్కాబళ్ళ దగ్గరకు వద్దామని నడుస్తూ ఉన్నాడు. టికెట్టు గేటు దాటడం తోటే ఒక జట్కావాడు వచ్చి “రాండి స్వామీ!” అని కూలివాని నెత్తిమీద మూటలు లాక్కొని ముందుకు సాగినాడు.

ఈ పెద్ద “అక్కడ సామాను పెట్టు, నేనే జట్కాల స్టాండు దగ్గరకు వచ్చి బేరం మాటాడుకుంటానయ్యా” అని అన్నాడు. ఆ జట్కామనిషి వినకుండా సామానుతో ముందరకు పోసాగాడు. ఆ పెద్దమనిషికి కొంచెం కోపం వచ్చి, తన చేతిలోని సామాను క్రిందను ఉంచి పరుగెత్తుకొని వెళ్ళి జటామనిషి చేతిలోని మూటలు లాక్కొన్నాడు. దానితో ఆ జట్కావాడు పాములా బుసకొడుతూ “బయటకు రారా పైత్తకారీ నీ పని బడతానని వెళ్ళిపోయాడు.

ఈ పెద్దమనిషి జట్కాల దగ్గరకు కుటుంబంతో వెళ్ళేసరిగి ఆ జట్కావాడు “ఏమిరా వెధవా! నా చేతిలో మూటలు లాగుతావుటా, ఇక్కడ నిన్ను నీ పెళ్ళాం వాళ్ళ ఎదుట పాతివేస్తా'నంటూ మీదకు వచ్చాడు. .

ఆ పెద్దమనిషి తెల్లబోయాడు. నోట మాట రాలేదు. చుట్టుప్రక్కల ఎవ్వరూ లేరు. అంతా జట్కావాళ్ళే! కుటుంబంవారు హొల్లుమన్నారు. జట్కావాడు ఆ పెద్దమనిషిని చెంపపై బలమైన బలమైన దెబ్బకొట్టబోతూ, చటుక్కున ఆపుచేసి వెనక్కు తగ్గాడు.

ఇదేమిటా అని ఆ పెద్దమనిషి ఇటూ అటూ చూస్తే అప్పుడే ఖద్దరుషర్టూ, ఖద్దరు గూడకట్టూ, ఖద్దరు టోపీ పెట్టుకొన్న శలాకలా ఉన్న ఒక మనుష్యుడు వస్తున్నాడు. ఆ పెద్దమనుష్యుని చుట్టూ మూగిన జట్కావాళ్ళంతా చూసి భయంతో వెనక్కు వెళ్ళిపోయారు. ఆ మనుష్యుడు వాళ్ళవైపన్నా చూడకుండా “ఏమండీ స్వామీ, ఏమిటిదా గడబిడ?” అని ప్రశ్నించాడు.

పే. మ: ఆ జట్కావాడు నన్ను కొట్టాలని మీదకు వచ్చాడు.

మను: ఎందుకు?

పె. మ: రైలులో నుంచి వస్తోంటే, మా కూలీ నెత్తిమీదనుంచి నాతో బేరం ఆడకుండానే మూటలులాగి గబగబ ఇక్కడకు వస్తోంటే, నేను భయపడి నా మూటలు నేను లాక్కున్నాను. ఇక్కడకు రాగానే, “నా చేతిలో మూటలు లాక్కుంటావా?” అంటూ ఏదో అరవంలో అంటూ, ఈ జట్కా వాళ్ళందరూ నా చుట్టూ మూగుతుండగా నన్ను లెంపకాయ కొట్టడానికి సిద్ధమైనాడు.”

“అలాగా? ఏమిరా కందప్పన్, ఈలారా” అని జట్కా వాళ్ళ వైపు చూచి వాళ్ళచాటున వున్న ఆ పొగరుబోతు జట్కావాణ్ణి పిలిచాడు. వాడు గడగడలాడుతూ ఆ మనుష్యుని దగ్గరకు వచ్చాడు.

“ఏమిరా కందప్పా? మీ జట్కావాళ్ళు పొగరెక్కిపోతున్నారా ఏమిరా? మాట్లాడవేం? ఆయన కాళ్ళు పట్టు. ఇక్కడ నుంచి జాగ్రత్త. నేను చూడకపోతే ఆయన్ను లెంపకాయ కొట్టేద్దువుదానే? నువ్వు చేసిన ఈ తప్పిదానికి ఏమి శిక్ష విధించాలిరా?”

ఆ పెద్దమనిషి ఈ ఆగంతకుని చూచి “ఏమండీ స్వామీ, మీరేవరో తెలియదు. ఈ తప్పిదానికి ఆయన్ను క్షమించండని మా ప్రార్థన' అని తెలియజేశారు. ఆ ఆగంతుకుడు వినాయగంపిళ్ళ, ఆతడు తీవ్రంగా జట్కావాడు కందప్పను చూచి, “ఏమిరా కందప్పా, ఎంత కండకావరంగా, వారు గాంధీజీ శిష్యులనయినా ఆలోచించలేదే నువ్వు? లెంపకాయకు చేయ్యెత్తినావే” అని మళ్ళీ అడిగాడు. జట్కావాడు ఆ ఖద్దరు వస్త్రధారి యెదుట సాగిలబడినాడు.

ఈ వినాయగం అనినా, ఆతని ఇద్దరు స్నేహితులనినా దుష్టులకు అలాటి భయం!

5

కారాగారంలోకి అడుగిడగానే 'గోరంటు' (క్వారంట్రెను)లో ప్రవేశపెడతారు. జైలు సర్వరోగ నిరాకరణ ప్రదేశమనిన్నీ, ఆరోగ్యదేవతా తాండవ రంగస్థలమనీ ప్రభుత్వంవారు బాగా నమ్మి ఉండడంచేత అలాంటి పరమ శుభ్ర ప్రదేశంలోకి వచ్చేవారు కొన్ని క్షాళనాలు పొందితేనేగాని అడుగు పెట్టడానికి వీలులేదని నిర్ణయించారు. ఆ క్షాళన ప్రదేశం “గోరంటు”

ఏడురోజులు 'గోరంటు'లో ఉండి కోనంగిరావూ, డాక్టరు రెడ్డి జైలు ప్రథమద్వారం (అది రథాలు కూడా వెళ్ళేటంత పెద్దది) దాటారు, కార్లూ, గీర్దూ, రథాలూ వగైరాలకే తెరుస్తారు. మామూలు ఖైదీలు ప్రవేశించేటప్పుడు, పెద్దగేటులో ఒక చిన్న తలుపు ఉంటుంది. అది తెరచి ప్రవేశింపబెట్టారు ఖయిదీని.

ఆ ద్వారభాగం కాల్వ 'లాకు' లా ఉంటుంది. ఇక్కడ ఖయిదీని పూర్తిగా పరీక్ష చేస్తారు. ఏ వస్తువులన్నాదాచి పట్టుకువస్తున్నాడా అని బట్టలు కూడా విప్పి పరీక్షచేస్తారు.

ఆ తర్వాత అతనికి కఠిననరకం అయితే దుస్తులు: 1. పొట్టిలాగు, 2. బనీను, 3. నెత్తిటోపీ ఇస్తారు. అవి ఖయిదీ దుస్తులు. అవి రెండు సెట్టులు ఇస్తారు. అవి పట్టుకొని రెండవ గేటు దాటాలి. ఇక జైలాశ్రమ ప్రవేశం. ఏ-తరగతి ఖయిదీలకు ఖయిదీ దుస్తులు లేవు.

జైలులో ఒంటిగా ఏ ఖయిదీ వెళ్ళకూడదు. కూడా వారు (వార్డర్) గాని, కానీ కార్డు (కాన్విక్టు వార్డరు) గానీ, (ఎడ్వార్డు) హెడ్ వార్డరుగాని కూడా ఉండాలి.

జైలు వంకర టింకరలతో కలిసి ఒక రథచక్రంలా ఉంటుంది. పెద్ద జైళ్ళకు మధ్యను 'టారు' (టవరు) ఉంటుంది. చిన్న జైళ్ళకు ముఖ్యద్వారమే టవరు.

టవరుమీద సూపరెంటు (సూపరింటెండెంటు) ఆఫీసు ఉంటుంది. జైలు వేరు (జైలరు) ఆఫీసూ ఉంటుంది.

జైలులో చేసే పనులన్నీ ఖయిదీలే చెయ్యాలి. నూనె గానుగ ఆడడం, నూలుచేత, గొంగళీ, తివాసీ నేత, వడ్రంగిపని, తోటపని, వడుకు పని, రంగులు వేసే పని, కార్ఖానాపనీ అన్నీ ఖయిదీలే చేయాలి.

వంటా వారే. మంగలి, చాకలి పనులూ వారే, పాకీ పనులూ వారే!

కాంగ్రెసు గాంధీమహాత్ముని ఆధ్వర్యం క్రిందకు వచ్చి, అహింసా వ్రత దీక్షాపరులు వేలకువేలు, లక్షలకు లక్షలు జైళ్ళకు వెళ్ళడం ప్రారంభించిన కొలదీ జైళ్ళలో అనేకమైన మార్పులు వచ్చాయి.

అంతకుముందు మామూలు జైళ్ళకు చుట్టే యినప పట్టాలు పదును పెట్టిన మంగలికత్తులుగా వాడేవారు. ఆ కత్తులు వెంట్రుకలతోపాటు చర్మపు పెళ్ళలు కూడా చెక్కివేస్తుండేవి.

తువాళ్ళబదులు చదరపు చేతిరుమాళ్ళుండేవి. స్నానం చేయడానికి గోచీగుడ్డ లుండేవి. అందరూ కలిసి మలవిసర్జనకు పోయేవారు. అదైనా నియమిత కాలంలో ముగించాలి. వ్యవధి ముగియగానే కూడా ఉన్న వారు ‘టెంషను' (అటెంషను) అంటాడు. అందరూ లేచి శుభ్రం చేసుకొని వచ్చి వరుసగా నిలబడాలి. ఈ విషయమై జైలు నియమాలలో ఒకటి “నిష్కారణంగా మలమూత్ర విసర్జనం చేయరాదు” అని.

కాళ్ళకు కడియాలు, మెళ్ళేపుస్తెల్లా ఖయిదీల వరుస సంఖ్య, వెళ్ళే అవి యిప్పుడు లేవు. బేడీలు తీసివేశారు, పాయిఖానా అందరూ కనబడే బందెలదొడ్డిగాగాక, విడి విడి దొడ్లుగా ఏర్పాటు చేశారు.

పూర్వం జైలు తిండి అధ్వాన్నంగా ఉండేది. జైలు అధికారుల స్వంత ధనాగారం నింపే పెద్ద సంస్థలలో జైలు భోజనపు సంస్థ ముఖ్యమైనది.

మనుషునకు ఇరవైరెండు తులాల బియ్యం ఇవ్వవలసివస్తే, బియ్యంలో పదితులాల బియ్యం జైలు అధికారుల జేబులలోనికే! అలాగే కూరగాయల విషయంలో, ఉప్పు, పప్పు, నూనెల విషయంలో, ఇంక కారాగార నివాసుల కడుపుల్లో, తుక్కూదూగరా, మండే మశానమూనూ!

ఇప్పుడు కాంగ్రెసు బందీలు పూర్తిగా రేషను పుచ్చుకొని తామంతా కలసి వేరే వంట చేసుకోవడమే! నెయ్యి, మజ్జిగలు, వచ్చాయి. గోధుమలు తినేవారికి గోధుమలు వచ్చాయి.

ఆ కోనంగీ, రెడ్డి లోనకు రాగానే అదివరకే అక్కడ ఉన్న పన్నెండుగురు రాజకీయ నిర్బంధితుల జట్టులో చేరారు. డాక్టరు రెడ్డి తన ఊరగాయలు తెప్పించుకోవచ్చునట! తన పరుపూ, పక్కా కాంపుకాటు అన్నీ తెచ్చుకోవచ్చును.

జైలు ఎట్లా ఉంటుందో అని ఏవేవో ఊహించుకున్నాడు కోనంగి. ఊహకు మించే ఉంది అసలు జైలు.

అతనికి ప్రత్యేకం ఒక గది. నామకఃతువాళ్ళు కొసలు ముడివేయ్యడం పని. పుస్తకాలు తెచ్చుకోవచ్చును. వ్రాతకు పెన్సిలు, తెల్లకాగితాల పుస్తకమూ ఇచ్చారు. నెలకు రెండుసార్లు ఉత్తరాలు వ్రాసుకోవచ్చును. రెడ్డిగారు వారానికోసారి వ్రాసుకోవచ్చును. అలాగే చుట్టాలూ, స్నేహితులూ వచ్చి చూడడమూ అంతే. అక్కడ నుండి అనంతలక్ష్మికి ఉత్తరం వ్రాయడం ప్రారంభించాడు కోనంగి.

కడలూరు జైలు

బ్లాకు ఎనిమిది

గది పద్దెనిమిది

కారాగారవాసి

నెం. 2056 రు

6 ఏప్రిల్ 1942

ప్రియమైన అనంతా!

ప్రాణం నీ దగ్గిరే మరచిపోయి వచ్చి ఉంటాను. మొన్న నా పక్క చుట్టలలో, ఇతర సామానులలో వెతికాను. ఎక్కడా కనపించందే! నీ దగ్గర మరచిపోయిన వస్తువును ఎల్లాగ మరచిపోయాను, అది కాస్త జాగ్రత్తగా చూస్తూ వుండు.

నీకు నేను ఇంతవరకు ఒక ఉత్తరమన్నా వ్రాయడానికి వీలులేకపోయింది. తీయతీయని పరిమళాల ఉత్తరాలు నీకు వ్రాసే అదను కల్పించినందుకు ప్రభుత్వానికి నా ధన్యవాదాలు.

జైలులో లేకుండా పైనే ఉంటే, నేను ఉత్తరపుధృవం వెళ్ళవలసి వచ్చినా, నీతో కూడా వేళ్ళవలసిందే కారణాంతరాన, నీకు ఉత్తరం వ్రాయడానికి ఈలాంటి పరమాద్భుతసావకాశం కల్పించిన ఈ ప్రభుత్వముమీద ఆరువందల నవరత్నాలు వ్రాయవలసిందే!

ఇంక మన వ్యాపారం ఇక్కడ బాగానే ఉంది. ఈపాటికి నా ఈయక్ష శాపకారణం మీ అందరికి తెలిసే ఉంటుంది.

ఆత్మేశ్వరీ! ఎన్నో వ్రాయాలసి వుంది. అవన్నీ జైలువాళ్ళు చూస్తారన్న సిగ్గు. నేను వ్రాయవలసినవన్నీ వ్రాయడానికి చేసే ప్రయత్నం అర్థంచేసుకో!

నువ్వు ఏమీ బెంగపెట్టుకోకు. నీవు భారతీగూంగనవు. స్వాతంత్ర్యం లేని భారతీయుల స్వాతంత్ర్యం దివ్య ప్రయత్నంలో భాగస్వామినివి కావాలి.

నువ్వూ ఏమీ ఎరుగవు. నేనూ ఏమీ ఎరుగను. ఎందుకు నన్నీ పవిత్ర ప్రదేశానికి పంపారో నాకు కారణ గీరణాలు తెలియవు.

ఆ దినం మొదటిరాత్రి కదూ! ఆ అమృత క్షణాలు విశ్వకావ్యంలో స్థాయీభావ పవిత్ర సమయంకాదూ! ఆ క్షణాలు శాశ్వతంగా ఉండిపోతాయి. కాళిదాసాదుల వంటి కవులు వర్ణించలేని ఆనంద క్షణికంలో మనం లయమైపోయాము.

ఎడబాటు అందకుండా, అలాంటి క్షణానికి ఉత్తరక్షణంలో, ఒక వర్ణనాతీత గాఢ విషాదపూరిత విరహగాథ ప్రారంభం అయింది. అక్కడే ఉండి అందం! అదే కావ్య సౌందర్యం. సాధారణ జీవితంలో కూడా కావ్య సౌందర్యం అనుభవించే శక్తి సంపాదించు కోవాలి! అంతే. కాని, ఏడ్చి, దొర్లి, ఉన్న దుఃఖాన్ని పదిరెట్లు వృద్దిచేసుకొని, ఆ మహా దుఃఖం అందరూ చూచి ఎంతో ఓ ఓ ఓ సానుభూతి చూపిస్తున్నారా లేదా అని చూచి, కొయ్యబారిపోయి, దుఃఖం భరించలేమనుకొని, ఏ నదిలోనో పడడం, ముఖ్యంగా అది దగ్గరవాళ్ళు గోల, ప్రపంచం పాపం అనడం, ఇది మామూలు తంతు.

కాని అనంతలక్ష్మి అలా చేస్తూంటుందా? ససేమిరా పరీక్ష పూర్తిచేసి వేసవికాలంలో వచ్చి నన్ను చూస్తుంది. ఎంత అద్భుతంగా ఉంది ఆ భావం. నా సర్వేశ్వరీ!.

నేను రేపటెల్లుండి ఓ పుస్తకాల జాబితా వ్రాసి పంపిస్తా! ఆ ప్రకారం పుస్తకాలు కొను, నాకు పంపించు.

అంత తియ్యగా నవ్వుతావు నువ్వు, ఎక్కడ సంపాదించావు నవ్వులు? పూర్వకాలంలోని వెన్నెలలు ఆ నవ్వులు. ఈనాడు అవి ఉదయసంధ్యా మధుర పరిమళ అరుణరాగాలు. ఏదీ ఒక్కసారి నవ్వవు అనంతలక్ష్మీ!

ఎన్ని యుగాలో తపస్సు చేసిన భక్తునికి, భగవంతుడు ప్రత్యక్షమయితే వచ్చే ఆనందం వర్ణించగలరు కవులు, కాని ఆ రాత్రి నాకు కలిగిన ఆనందం గొప్ప పాశ్చాత్య కవులూ, ప్రాచ్యకవులూ కలసిపోయి, ఒక మహా ప్రవాహంలా ప్రవహించినా వర్ణించలేరన్న మాటే! అందుకని అలాంటివి అతిరహస్యం అన్నారు.

నీ అనుభవం వ్రాయాలి, నా అనుభవం నేను ఒక పెద్ద గ్రంథంగానే నీకు వ్రాస్తాను.

ఈ గ్రంథంమీద నీ అభిప్రాయం వ్రాయాలి. అదిగో నాగది. ఇనప కటకటాల తలుపులు తెరిచే గంట కొడుతున్నారు. ఉత్తరం ముగిస్తా.

నేను రోజూ డెయిరీలా, నా కథ వ్రాస్తా, అదే నేను వ్రాసే ఉత్తరం. నువ్వు ఎన్ని ఉత్తరాలు వ్రాసినా పరవాలేదు.

ప్రేమతో,

కోనంగి.

కోనంగిని పోలీసువారు తీసుకొని వెళ్ళగానే స్తబ్దురాలయిన అనంతలక్ష్మిని స్నేహితురాండ్రందరూ తీసుకువెళ్ళి వేరేగదిలో పడుకోబెడదామని చూశారు. లాభం లేకపోయింది. ఆమె పండుకోలేదు. మంచంమీద కూర్చుంది.

చెప్పిన పని చేస్తుంది. భావంలేని చూపులు మాత్రం చూస్తుంది. మొగం కడిగించారు. దుస్తులు మార్చారు...

అంబుజం: అనంతం! ఏమిటి వ్యాపారం, నీ సంగతికి ఏమన్నా అర్థం ఉందా?

మీనాక్షి: కాఫీ కాస్త తాగవే!

పార్వతి: దేశంకోసం జైలుకుపోయిన భర్తనుగూర్చి ఈలా అయిపోతే నీ దేశభక్తి అంతా కూపంలో కలిసిందా?

ఆండాళ్ళు: మాట్లాడితే 'జన, గన, మన' పాడడానికి సిద్దం అయ్యేది.

అంబుజం: ఎవరివంతుకు వారికి వస్తేనేగాని నిజం బయటపడదు!

పార్వతి: అదికాదే అంబుజం! మనకందరికీ దేశభక్తిలేదని వాదించేది కాదూ?

కనకవల్లి: మాటలకూ, చేతలకూ చాలాదూరం!

మీనాక్షి: ఖద్దరు చీరలు కొన్నదీ, ఖద్దరు పట్టుచీరలు కొన్నది.

నీలలోచన: ఈ మధ్య ఖద్దరు వడుకుతోంది మొన్న హిందీ ప్రచారక సమితి ఉత్సవాలలో వడకటంలో మొదటి బహుమానం కొట్టింది.

పార్వతీ: హిందీ చదివి ఈ ఏడు ప్రాథమిక పరీక్షకు వెడతానంది.

అంబుజం: తాను భర్తను గాఢంగా ప్రేమించింది. పాపం! ఆయన విరహతాపం భరించలేక ఈలాంటి అవస్థలో పడింది.

ఇంతలో లయోలా కాలేజీ ప్రొఫెసరు అయ్యంగారు అన్నగారు, డాక్టరుగారు ఒకర్ని తీసుకువచ్చారు. డాక్టరు అనంతలక్ష్మిని పరీక్షచేసి జబ్బు ఏమీ లేదనీ, అమ్మాయి నరాలకు భర్తను అరెస్టుచేసి తీసుకుపోవడం దెబ్బ అయిందనీ, ఇప్పుడు ఆమె స్నేహితురాండ్రు చేసే విధానం మంచిదేననీ, అనంతలక్ష్మిదేవికి కోపం తెప్పించడమే ఉత్తమమనీ, ఆ విషయం జాగ్రత్తగా అలోచించి కోపం తెప్పించండనీ చెప్తూ నరవిశ్రాంతికి మందుచీటీ వ్రాసి ఇచ్చి, సాయంకాలం మళ్ళీ వస్తానని చెప్పినాడు.

జయలక్ష్మిని పరీక్షచేసి, ఆమె నయంగా ఉందని ఆమెకూ కాస్త హుషారునిచ్చే మందు వ్రాసియిచ్చి వెళ్ళిపోయాడు.

ఈలోగా అయ్యంగారు ప్రొఫెసరు, అనంతలక్ష్మి స్నేహితులతో ఆలోచించాడు. ఈ పనంతా చెట్టియారుగారు చేశారని కథ అల్లి అమ్మాయితో చెప్పమన్నాడు. ఆ కథ మామూలు మాటలుగా అనంతలక్ష్మి వినేటట్లు మాట్లాడండని ఆయన సలహా ఇచ్చాడు. ఆ నాటకం ఆడే విధానం అంతా ఏర్పాటు చేశాడు.

అనంతలక్ష్మిచేత ఎల్లాగో కాఫీ త్రాగించారు. తర్వాత మందురాగానే మందూ త్రాగించారు. ఆ సమయంలో ఆమె ఉన్న గదిలో స్నేహితురాండ్రంతా చేరారు.

నీలలోచన: అసలు కోనంగిరావుగారి అరెస్టుకు కారణం ఏమయి ఉంటుంది అంబుజం? నువ్వు జడ్జిగారి కూతురువు కూడాను.

అంబుజం: ఏమయి ఉంటుందో మనకెందుకే! ప్రస్తుతం అనంతలక్ష్మికి మనం ధైర్యం చెప్పాలిగానీ?

పార్వతి: ఏమిటర్రా! అనంతానికి ధైర్యంలేదని మీరంతా అనుకోడం నాకేమీ నచ్చలేదు. నా ఉద్దేశం అనంతం ప్రస్తుతం ఆలోచించేది తాను కూడా జెయిలుకు ఎల్లా వెళ్ళాలా అని.

మీనాక్షి: దాని చేతకాదా జైలుకు వెళ్ళడం? పోలీసువాళ్ళు ధైర్యం చేస్తే అయిదు సెకండ్లలో అనంతం కారాగారవాసం చెయ్యగలదు.

అంతలో అనంతలక్ష్మి అన్న అయ్యంగారు అక్కడకు వచ్చారు.

నీలలోచన: ఏమండీ మాష్టరుగారూ! కోనంగిరావుగారిని ఎందుకు అరెస్టు చేసినట్లు?

అయ్యంగారు: అదంతా మన కెందుకులెండి!

కనకవల్లి: ఎందుకని తోసివేయకండి.

అయ్యంగారు: నేను తోసివెయ్యాలని అనుకుంటున్నానా? ప్రస్తుతం ఆ గొడవ మన కేందుకని? మీనాక్షి: మేము తెలుసుకు తీరాలండీ మాష్టరుగారూ!

అయ్యంగారు: మా వాళ్ళింటికి ఒక నాటుకోటిసెట్టిగారు వస్తూ ఉండేవాడు...

నీలలోచన: వాడా? రాస్కెల్! అయ్యంగారు: వాడు కోనంగిరావుగారు డాక్టరుగారితో కలిసి ప్రభుత్వముపై కుట్ర చేస్తున్నాడని పోలీసు కమీషనరుకు రిపోర్టు ఇచ్చాడట!

అంబుజం: ఏమిటీ ఆ రాస్కెల్, ఆ రాక్షసుడే!

అనంతలక్ష్మి గబుక్కున మంచంమీద నుంచి లేచింది. ఆమె మహిషాసురమర్దినిలా అయి. ఆమె కన్నులు చింతనిప్పు అయ్యాయి. గజగజ వణకింది. ఏమిటి అన్నా? ఏ-ఏ-ఏమిటి? ఆ సెట్టిగాడా? రిపోర్టు ఇచ్చాడా? అన్నది.

అంబుజం గబుక్కున లేచి, అనంతలక్ష్మిని పట్టుకొని, “కూచోవే అనంతం. పోనీలెద్దు ఆ చచ్చు శెట్టి సంగతి మనకెందుకు?” అన్నది.

అనంతం: మనకెందుకా? ప్రభుత్వంమీద కుట్రచేశారని రిపోర్టు ఇచ్చాడా వాడు, వాణ్ణి ఇక్కడే ఉంటే

మీనాక్షి: నీదాకా ఎందుకు? నేను వాడి గుడ్లు పీకేద్దును -

నీలలోచన: ఆ రిపోర్టు వ్రాసినవాడి చేతికి వాతలు పెట్టేదును.

పార్వతి: వాడి పళ్ళు రాలగొట్టుదును.

అనంతం: రాజకీయాలలో ఏమీ భాగం పుచ్చుకోనివారిని, అలాంటి నిందలువేసి రిపోర్టు యిచ్చాడా?

కోపం చల్లారి అనంతలక్ష్మి కన్నీరు కారిపోవ మంచంమీద పడి వెక్కి వెక్కి ఏడిచింది.

అమ్మయ్యా! అని అందరూ నిట్టూర్పులు విడిచారు.

అంబుజం: అనంతం! ఈ సంగతంతా మా నాన్నగారి ద్వారా తెలుసుకొని నేను చేసేపని అంతా చెప్తాను.

నీలలోచన: సీతాదేవి తండ్రి కూడా ఉపయోగిస్తాడు ఈ విషయంలో!

మీనాక్షి: నిన్న వచ్చిన సారా' అనే యూరోపియను అమ్మాయి కూడా మనకు సాయం చేయవచ్చునట్టా -

అయ్యంగారు: శెట్టిగారికి బుద్ది వచ్చింది. నిన్న సబుకోర్టులో జయలక్ష్మిమీద వాడు తెచ్చిన వ్యాజ్యం క్షవరం చేశారు కోర్టువారు.

మీనాక్షి: అంతటితో ఊరుకుంటే ఎల్లాగు? ఆ రౌడీకుంకకు బాగా బుద్ది చెప్పాలి.

పార్వతి: మంచి ఉపాయం ఏదయినా మనం ఆలోచించాలి.

అనంతలక్ష్మి: గాంధీతత్వవాదులు ప్రభుత్వంమీద కుట్ర ఎలా చేస్తారు?

6

అనంతలక్ష్మి కోలుకోడం జయలక్ష్మికి ధైర్యం కలిగింది. జయలక్ష్మి భగవంతుని పూజ ఎక్కువ చేసింది. భర్త ఛాయాచిత్రాన్ని ఎడతెగక ప్రార్థనచేస్తూ రహస్యంగా కళ్ళ నీళ్ళు కళ్ళ కుక్కుకునేది.

శోభనమందిరం అలంకారాలతో అలాగే ఉంచండని, ఆ మందిరానికి తాళం వేసింది. కోనంగి తిరిగి రాగానే తాను వ్యాజ్యం నెగ్గినందుకు సత్యనారాయణవ్రతం అఖండ వైభవంగా చేయాలని నిశ్చయించుకుంది. కోనంగి మీద శెట్టియారు చెప్పిన నేరాలన్నీ ఏనాడో వట్టి అబద్దాలని అయ్యంగారు బందరు ఉత్తరాలు వ్రాసి సమాచారం తెప్పించాడు.

అలాంటి ఉత్తమ బాలకుడు తనకు అల్లుడు కావడం తన అదృష్టమని జయలక్ష్మి కోనంగి అనంతలక్ష్ముల వివాహం నిర్ణయించే ముందే నిశ్చయానికి వచ్చింది.

శెట్టియారు వ్యాజ్యం ఓడిపోయినా ఊరుకోక అప్పీలు చేస్తాడని కబురు వచ్చింది. చెయ్యనీ! ఖర్చులు దాఖలుచేసి మరీ అప్పీలు చెయ్యాలి. లంచాలిచ్చి ఎంత సాక్ష్యం తెచ్చినా, న్యాయమయిన సాక్ష్యం ముందు అవి పొగలా మాయమయిపోయాయి. ఇంత త్వరలో వ్యాజ్యం తేలిపోతుందని యెవరూ అనుకోలేదు. పాలుపంపులు జరిగాయా లేదా అన్న ప్రశ్నపయినా, జయలక్ష్మి భర్త రంగయ్యంగారి విల్లు చెల్లుతుందా లేదా అన్న ప్రశ్న పయినా విచారణ జరిగింది. ఇంత త్వరలో విచారణ జరగడానికి ఎన్నో కారణాలు వచ్చాయి.

రంగయ్యంగారి అన్న కొమారుడు ఆచార్య అయ్యంగారు అనంతలక్ష్మికి హృదయ బాధ తీర్చడానికి పుట్టించినగాథే నిజమయిందని ఒక రోజున సీతాదేవి వచ్చి విజయలక్ష్మితో చెప్పింది. సీతాదేవి కోనంగిని పెళ్ళిచేసుకోనని చెప్పి పంపినా, కోనంగి అంటే ఆమెకు ఆపేక్ష కలిగింది. కోనంగి తనవాడనీ, తాను కాదన్న కోనంగి మంచి అందమయిన భార్యను సంపాదించుకునేటట్లు చూడడం బాధ్యత తనదనీ ఆమె నిశ్చయించుకొంది. కోనంగి సినీమా పదిసార్లు చూచిన వాళ్ళల్లో ఆమె ఒకర్తె. క్వీన్ మేరీ కళాశాలలో బాలికల సంభాషణ విషయాలలో కోనంగి ముఖ్య విషయమయి పోయాడు. ఆ సందర్భంలోనే కోనంగి అనంతలక్ష్మికి ఉపాధ్యాయుడయ్యాడన్న సమాచారం వింది.

సీతాదేవి ఆనాటి నుంచీ అనంతలక్ష్మితో స్నేహం వృద్ధి చేసుకుంది. కోనంగితో గంటలకొలది తన మామూలుధోరణి సంభాషణ ప్రారంభించింది. ఈరోజు రాగానే ఆమె అనంతలక్ష్మి దగ్గరకు వెళ్ళింది.

సీతాదేవి: అనంతలక్ష్మి! నిన్న మీనాక్షి మా ఇంటికివచ్చి ఎందుకు కోనంగిరావుగార్ని అరెస్టు చేశారో, మా తండ్రిగారిని కనుక్కోమని కోరమని చెప్పింది.

జయలక్ష్మి: ఎందుకు అరెస్టు చేసిందీ కనుక్కున్నారా?

సీతా: మా నాన్నగారు ప్రభుత్వ ఉపకార్యదర్శికాదండీ!

జయ: ఔనమ్మా ఔను. మాకు తెలుసునుగా!

సీతా: నేను మా తండ్రిగారిని హడలిగొట్టాను కనుక్కోమని.

జయ: కనుక్కున్నారా?

సీతా: పోలీసు డిపార్టుమెంటు ఉపకార్యదర్శి మా నాన్నగారికి మంచి స్నేహితుడండోయి!

జయ: కాదు మరీ? ఒకే పాయలోవాళ్ళు యెంతో స్నేహంగా ఉంటారు. కనుక్కున్నారా?

సీతా: అలాంటి రహస్యాలు యెల్లా చెప్పేది. ఎంత స్నేహమున్నా అవి రహస్యాలన్నాట్ట!

జయ: (నిట్టూర్పు) అంతేనా -

అనంతలక్ష్మి: (నిట్టూర్పు) ఎందువల్ల అరెస్టు అయితేనేమి. ఇప్పుడు మనం ఏమిచేయగలం?

జయ: మనం ఏమిచేయగలం నిజంగా!

సీతా: ఉండండి, అంతటితో మా నాన్న ఊరుకోలేదు.

జయ: మీ నాన్నగారు ఏ పని తలుచుకుంటే ఆ పని చేసి తీరగల సామర్థ్యం గలవారు.

సీతా: ఆ శాఖలో పెద్ద గుమాస్తా మా నాన్నగారి సహాయంవల్లనే పైకి వచ్చారు.

జ: గుమాస్తాలు తలుచుకుంటే ముఖ్యకార్యదర్శులే ఏమీ చేయలేరు.

అనంతం: రాజకీయాల సంబంధం తెచ్చుకున్నవారికి ఎప్పుడో జయిలు తప్పదు. డాక్టరు రెడ్డిగారు యిదివరకే జయిలుకు వెళ్ళివచ్చారు.

జయ: ఇంతకూ ఏమైనట్లు తల్లీ?

సీతా: పోలీసుశాఖ గుమాస్తాగారు ఉన్న రహస్యమంతా మా నాన్నగారికి చెప్పారు.

జయ: ఏమని?

సీతా: మా నాన్నగారు నాతో వచ్చి చెప్పారు.

అనంత: మీ నాన్నగారు ఏమి చెప్పినారు సీతా?

సీతా: ఎవరో నాటుకోడిశెట్టి పోలీసు కమీషనరుకు సంపూర్ణమైన సాక్ష్యంతో కోనంగిరావూ, డాక్టరు రెడ్డి కలసి ప్రభుత్వంమీద కుట్ర చేస్తున్నారని ఋజువు చేశారట. ఆ పైన కోనంగిరావును అరెస్టు చేశారట.

జయ: అనుకున్నంతా అయింది మా అబ్బాయి చెప్పినమాట నిజం! శెట్టే ఈ పని చేశాడు. వాడు కాకపోతే కోనంగిరావుగారు ఒక్క రాజకీయ సభలోనన్నా ఉపన్యాసం ఈయలేదే. యెలా అరెస్టు చేస్తారు?

అనంత: శెట్టియారు ఎంత దుర్మార్గుడు! ఇప్పుడు చూశావా అమ్మా? నేను ఆ రోజులలో గోలబెట్టితే విన్నావూ? ఆ రాక్షసుడు దేవత అనుకుంటూ, అపర హరిశ్చంద్రు డనుకున్నావు. ఒక కోటీశ్వరుడు అల్లుడౌతాడంటే ఉప్పొంగావు!

సీత: కోటీశ్వరుళ్ళు అల్లుళ్ళయితే అన్నీ యిబ్బందులే. కోనంగిరావుగారు వెళ్ళిపోయిన తర్వాత, నన్ను పెళ్ళిచేసుకుంటానని ఒక ఐ.పి.యస్. పరీక్షకు పోయే యువకుడు వచ్చాడు. కాని ఐ.పి.యస్. లంటే నాకు మంట.

అనంతం: కోనంగిరావుగార్ని నువ్వన్నా పెళ్ళి చేసుకుంటే బాగుండి పోవును సీతా! ఆయన జయిలుకు వెళ్ళకపోవును. నా దురదృష్ట జాతకం ఆయనకు తగిలింది!

సీత: అవేమి మాటలు అనంతలక్ష్మీ? నువ్వు ధైర్యంగా ఉండు. నేను అతన్ని ప్రేమించలేదు. నన్ను అతడు అంతకన్నా ప్రేమించలేదు. ఆ సంగతి మొదటే తెలుసుకున్నాను.

జయలక్ష్మి శెట్టిమీద మండిపోతోంది. వీడు తన కుటుంబానికి రావణాసురు డయ్యాడు. ఎక్కడ నుండి దాపురించాడు? ఇంతకూ అమ్మిణి అన్నట్లు వాడు తన ఇంటిలో అడుగుపెట్టడానికి కారకురాలు తానే! అప్పుడే వాణ్ణి రానీయ వద్దంది. వాడిని చూస్తే తనకు భయమంది వెట్టితల్లి. అన్నీ తాను సాలెగూడు దులిపినట్లు దులిపి పారేసింది. ఈనాడు తాను అనుభవిస్తోంది, తన కూతుర్ని అనుభవింపచేస్తోంది. ప్రాపంచికంగా లాభం ఆశించేవారికి, ఆ రకంగానే చెంపదెబ్బలు పెళ్ళున తగులుతాయి.

కోనంగిరావుగారు ఎన్ని సంవత్సరాలకు బయటపడతాడో! అందాకా అనంతలక్ష్మి కృంగిపోతూ ఉంటుంది. కోనంగిరావు పరీక్షలకు తయారుజేస్తే మొదటితరగతిలో ప్యాసయింది.

శోభనమహెూత్సవ ప్రథమ దివసంనాడే అతడు వెళ్ళిపోవలసి వచ్చినది. భోజనంచేస్తూ మొదటిముద్ద తిన్నవానిని ఆ తక్షణం లేచి పొమ్మనట్లు, యువతీ యువకులలో ప్రథమ ప్రేమదినాలకన్న మహదానందం సమకూర్చే వస్తువు లింకేమి ఉన్నాయి?

జయలక్ష్మికి రంగయ్యంగారు తన్ను ప్రేమించిన దినాలు జ్ఞాపకం వచ్చాయి. భవభూతి ఉత్తరరామాయణంలో “రాత్రిరేవ వ్యరంగీత్” శ్లోకం చెప్పినట్లు చెంప చెంపకు చేర్చి ఒక్కక్షణమైనా విడిపోని కౌగిలిలో, అర్థంలేని పిచ్చిమాటలు చెప్పుకుంటూ కునుకయినా ఎరుగని ఏదో మధుర మత్తతలో గడిచిపోయేవి ఆ దినాలు.

విడిపోవడం మరీ గాఢంగా కలుసుకొనడానికే! స్త్రీ పురుషుల జీవితంలో ప్రేమావస్థ ఎక్కడో ఆకాశంలో ఉండే ఉత్తుంగశిఖరం.

ప్రేమికులు ప్రయాణాలు చేయడం ఆనందం. తానూ రంగయ్యంగారూ, రెండు సీట్లు ఉండే మొదటితరగతిలో ప్రయాణంచేస్తూ ఉత్తమక్షేత్రాలన్నీ యాత్రలు సలిపినారు.

ప్రేమికులు ఒక్కొక్కచోట ఒక్కొక్క రకమయిన ప్రేమానుభవం పొందుతారు. ప్రేమ ఒక మహాపుష్పమయితే ఒక్కొక్క ప్రేమానుభవం ఆ పుష్పంలోని ఒక్కొక్క పుటవంటిది.

అంత ఆచారపరుడయ్యూ తన భర్త తన వంట తినేవాడు. వైష్ణవ దేవుడు కృష్ణుడు గొల్లవాడట. రాముడు శబరి ఎంగిలి తిన్నాడట.

తామిద్దరూ బృందావనం దగ్గర యమునాతీరంలో ఒక అడవిలో మకాం పెట్టినప్పుడు తాను వంట చేసింది. తాను వంట చేస్తుంటే, త్యాగరాజ కృతులు పాడుతూ నాట్యం చేశాడు. భర్త నాట్యంచేసి వచ్చి వంటచేసే తన్ను గాఢంగా కౌగలించుకొని పెదవులు ముద్దుకొంటూ “జయా, నువ్వు నా కర్పించేవన్నీ దివ్యామృతపు విందులేవే” అన్నారు. ప్రేమ! ఓహెూ ప్రేమ!

7

అనంతలక్ష్మి పెళ్ళి సందర్భంలో మదరాసు పతిత జనోద్దరణాశ్రమానికి అనంతలక్ష్మి వెయ్యి నూటపదహారు రూపాయలు చదివించింది. తన గురువూ, తన భర్త అయిన కోనంగిరావు “నాబోటి కులహీనులను, చరిత్ర హీనులను, సంరక్షించటానికి ఏర్పాటయిన యీ సంఘానికి నువ్వు వెయ్యి నూట పదహార్లివ్వటం యెంతో భగవతీతికరం, అనంతా!” అన్న మాటలు అనంతలక్ష్మికి జ్ఞాపకం వచ్చి కళ్ళనీళ్ళు తిరిగినవి. తన భర్త ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నట్టే ఆమెకు తోచింది. ప్రేమకు అంతరాయం కలిగినప్పుడే దాని గంభీరశక్తి వ్యక్తుల జీవితాల చుట్టూను, జీవితాలలోనూ స్పందిస్తుంది.

అనంతలక్ష్మి ప్రతిక్షణము తన చుట్టూ పొదివికొని వున్నట్లే తోచింది. "గురువునై నిన్ను ప్రేమించి నీ ప్రేమను చూరగొన్న నేను బిలహణుణ్ణి. నువ్వు యామినీపూర్ణతిలకవు” అని అనిన ఆయన మాటలు ఆమెకు నిమిష నిమిషము సాక్షాత్కారమయ్యాయి!

ఆయన పతితుడా! తాను పతితురాలా? వివాహం ఉత్తమ సంస్థ. ఆత్మసాక్షాత్కార దివ్యమందిరానికి సోపానమార్గం వివాహం. అలాంటి వివాహ సంస్కార విహీనపంకిలంలో ఉద్భవించిన నత్తగుల్ల తానని తన గురువుగారన్నారు. వారే తన ప్రేయసి మాత్రం పతితురాలు కాదని వాదించారు. మధురవాణి పతితురాలెటూ? అని వారి ప్రశ్న. మధురవాణి వంశంలో ఉద్భవించిన తాను మాత్రం ఉత్తమ జన్మ అన్నారు తన గురువుగారు.

తాను, తన భర్తా వివాహంనాడు వధూవరులై తీయించుకొన్న ఛాయా చిత్రాలన్నీ చూస్తూ అనంతలక్ష్మి తన చదువుల గదిలో కూర్చుండి ఆలోచించుకొంటున్నది.

ప్రేమను గురించి తాను ఎన్నో గ్రంథాలు చదివింది. ఇంగ్లీషు కావ్యాలు పఠించి వ్యాసాలు చదివింది. అన్నీ చదివి ఈలా ఉంటుంది ప్రేమ అని ఊహించుకొంది. కాని తన ఊహలకు మించిపోయే ఏదో ఒక దివ్యస్థితిని ఊహించి తన గురువుగారు తమ యిద్దరి వివాహానికి పూర్వం వర్ణించేవారు.

ఒకరోజు తనూ, తన గురువూ ఇద్దరూ కలసి మహాబలిపురం వెళ్ళి సముద్రంలో కలసిపోయే, ఆ విచిత్ర పరమాద్భుత శిల్పపు కట్టడాలలో సముద్రం పరికిస్తూ కూర్చున్నారు. ఆ సమయంలో ఎంతకాలమో వారిద్దరూ ఆ పరమసౌందర్యానుభూతిలో లయమై మాట లేకుండా ఉండిపోయారు.

కొంటెవారయ్యూ, తన గురువు సౌందర్యోపాసి. తాను వీణ వాయిస్తూ తన గొంతుక ఆ వీణకు శ్రుతి కలిపి, “రామాభిరామా” మొదలయిన కృతులు పాడుతూ ఉంటే, వారు ఉప్పొంగిపోతూ వింటూ, ఆనందాంబువులలో కరిగిపోయేవారు.

ఆనంద మధురమయిన ఇంతే వలపూ బొంపూ లేని నీ గొంతుక సౌందర్య వస్తువులలో కాంచనగంగ, నువ్వు ధవళగిరివి, నీ ప్రేమ గౌరీ శంకర శిఖరము, నిన్ను నా ఆత్మకు పొదివికొన్న నా అదృష్టము నందదేవి” అని వా రా నాడు అన్నారు. “లక్ష్మీ! సౌందర్యవస్తువుల నారాధించడం మనుష్యునిలోని సంస్కారోత్తుంగ కల్లోలకిరీటం. నువ్వు నాకు సన్నిహితం కావడంవల్ల సౌందర్యోపాసన నాకు సులభ లభ్యమయిపోయింది ప్రాణకాంతా!” అన్నారు ఇంకో రోజున.

సౌందర్య వస్తుదర్శనమే వారి హృదయాన్ని సర్వలోకం ఆక్రమింప జేస్తుందట. “ఆ ఆరాధనలో లోకం అంతా ఒక విశ్వసౌందర్యాంతర్భాగమై దర్శనమిస్తుంది. అనంతం! లోకంలో బాధలు, లోకంలో ఉత్తమ పథాలకు పోవాలన్న కాంక్ష, బీదవారి ధనవాంఛ, కూలివారు కోటీశ్వరులతో సమానం అయ్యేందుకు చేసే మహాయజ్ఞం, కాటకాలలోని నాశనం అన్నీ అందులో భాగమై కనబడతాయి. గులాబిపూవు సౌందర్యాన్ని నిజంగా అర్థం చేసుకున్న వారికి పల్లేరుముల్లు అందం తెలుస్తుంది. భైరవిరాగంలో లీనమయిపోగల హృదయం గలవానికే లోకంలో ధనదులచే, జమీందారీ రాక్షసులచే పిప్పి చేయబడే బీదవాళ్ళ ఆక్రందనములోని పరమార్థం అర్థం అవుతుంది. నిర్మల నీలాకాశ మనోజ్ఞతను హృదయమార క్రోలగలవాడే, చావునాచురంగు, కుళ్ళు నల్లరంగు, బాధ బూడిదరంగు పూర్తిగా అర్థం చేసుకుంటాడు. అనంతలక్ష్మి! మహాత్మాగాంధీ వంటి సౌందర్యోపాసి ఇంకోరు లేరుసుమా! ఆయన రాట్నధ్వని బీదతనం లోకంలో ఉండకూడదు అన్న మహానినాదరాగం సుమా!” అని మహాబలిపురంలో సముద్రతీరాన తన్ను వారి హృదయానికి అదుముకొని అన్నారు.

తాను: ఈ రాళ్ళతో చెక్కిన చెక్కడాలు సౌందర్య వస్తువులేల్లా అవుతాయండీ?

కోనంగి: ఏవీ నీ పెదవులు. ఆ పెదవుల అందం స్వతస్సిద్ధంగా ఉంటుందా? యవ్వనం అనే శిల్పి ఆ పెదవులను ప్రపంచాద్భుత సౌందర్య వస్తువులుగా తయారు చేసినాడా?

తాను: యవ్వనం కలిగిన అందరి పెదవులూ అందమైనవా?

కోనంగి: ఆ యవ్వనానికి శ్రుతైన యవ్వనం కలిగిన ఇంకొకనికి!

తాను: అందరికీ కావన్న మాటేగా?

కోనంగి: కొన్ని పెదవులు అందరికీ, కొన్ని కొందరికీ, కొన్ని ఒక్కడికే!

తాను: ఎవ్వరికీ అందంగాని యవ్వనపు పెదవులు వుండ వచ్చుగా?

కోనంగి: ఆ పెదవుల అందం తెలుసుకొనే యాత్రికుడు వచ్చే వరకూ!

తాను: వాడు రాకపోవచ్చుగా!

కోనంగి: రాకపోవచ్చుగాక, మలయాళదేశ సముద్రతీరంలో ఒక ముత్యపుచిప్ప పగిలి, ఆ ఇసుకలో అద్భుతమైన ఒక ముత్యం పడివుందనుకో, దాన్ని అనుభవించేవారు అక్కడకు వెళ్ళకపోయినంత మాత్రాన ఆ అందం లేదనట్టవుతుందా?

ఆ సముద్రం ఒడ్డున సముద్రపు పచ్చలతో, ఆకాశనీలాలతో, ఆ నల్లని రాళ్ళశిల్పాలు ఏదో దివ్యశ్రుతి పొందుతున్నాయి. ఆ శ్రుతికి పరమస్థాయి తానూ, తన గురువుగారి ప్రేమా అట.

ప్రేమను గురించి వారిద్దరికీ సంభాషణ జరిగింది.

కోనంగి: నా ఆత్మేశ్వరీ, ప్రేమ ఒక మహారాగంలోని ప్రాణస్వరం వంటిది.

తను: రాగం ఏమిటీ?

కోనంగి: నువ్వు!

తాను: మీరు?

కోనంగి: నేను శ్రుతిని.

అప్పుడు ఆయన పాడిన పాట ఎప్పటికీ తాను మరచిపోలేదు.

ఈ నీలి కెరటాల ఎదుట నువ్వూ నేను,

నీలోన నీలమే నాలోన కెరటమే!

ఈ అనంతపథాల ఎదుట నువ్వూ నేను

నీ వనంతానివే నేను పథికుడ రాణీ

ఈ శిల్పసౌందర్యదీప్తి నువ్వూ నేను

శిల్పమూర్తివి నువ్వు శిల్పి నేనో దేవి!

ఆ పాట పాడుకుంటూ అనంతలక్ష్మి తన మనోహర విశాలనేత్రాలు అరమూతలుగా “గురువుగారూ, నన్ను వదలి మీరు ఒక్కరూ జైలుకు వెళ్ళారా! ఎంత నిర్దయ మీది? అందులో మన ప్రథమ గాఢ సంశ్లేష సమయాన ఆ సంధ్యా కాంతుల్లో ఎక్కడికో వెళ్ళిపోయారా? మీది కఠిన హృదయం కాదూ! ఆ రాత్రే కాదూ నా కళ్ళలోకి తేరిపారచూస్తూ “అనంతలక్ష్మి! నిన్ను ఒక్కక్షణమైనా వదలి ఉండ” నన్నారు. ఆ మాట అంతలోనే అసత్యం చేశారా?” అని అనుకుంటూ కన్నుల నీరు నిండ తల హృదయం మీదకు వాల్చుకుంది.

8

రెడ్డిగారికి కారాగారం అలవాటే, అందులో 'ఏ' తరగతి బంధితుడు. క్యాంపు మంచం, పరుపు, కుర్చీలు, అన్ని సౌకర్యాలూ ఉన్నాయి. కోనంగీ డాక్టరూ రాత్రిళ్ళు తప్ప పగలల్లా కలిసే ఉండేవారు. అనేక విషయాలనుగూర్చి చర్చలు సాగుతూ ఉండేవి.

ముఖ్యమైన సమస్య సామ్యవాదం. ప్రపంచోద్దరణ సామ్యవిధానం వల్లనే జరుగుతుందని రెడ్డి అంటాడు. కోనంగి తన వాదనతో సామ్యవిధానం ఒప్పుకుంటాడు. కాని, అందుకు మార్గం గాంధీ విధానం అంటారు.

కోనంగి: రష్యా రాజకీయ విధానం ప్రపంచానికి ఆదర్శప్రాయంగా ఉంది. ప్రస్తుతం. కాని స్టాలిన్ ఎందుకు రక్షకభటులతో కాపలా కాయించు కుంటూ వెడతాడు?

డాక్టరు: ప్రాణరక్షణ ముఖ్యావసరం, ఎంత ప్రజారాజ్యం స్థాపించినా, యితర రాజ్యాల వారికి రష్యా జయమువల్ల ఉడుకుబోతుతనమూ, కోపమూ ఉద్భవించాయి. రష్యా రాజ్యవిధానం మంటగలిపి, రష్యాను నాశనం చేయాలని వారెప్పుడూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో స్టాలిను చావు మొదటి కోరిక వారికి.

కోనంగి: రష్యా దేశంలోని వాళ్ళెవరూ స్టాలిన్ కు విరోధులు లేరంటావా?

డాక్టరు: లేరనను. ప్రతి దేశంలోనూ, ఉత్తమాశయాలను నాశనం చెయ్యాలి అన్న దుర్మార్గులు ఉండనే ఉంటారు.

కోనంగి: మన దేశంలో గాంధీజీకీ వ్యతిరేకులు, గాంధీజీ పేరు చెప్పితే, కాంగ్రెను పేరు చెప్పితే మండిపోయేవారు లేరా?

డాక్టరు: ఉన్నారు.

కోనంగి: అయితే బాపూజీ యెందుకు రక్షకభటుల్ని పెట్టుకోదు? కాంగ్రెసు మంత్రి వర్గాలున్నంత కాలం మంత్రులెవ్వరూ రక్షకభటుల్ని పెట్టుకోలేదేమీ? కాంగ్రెసు నాయకులకు రక్షకభటులు లేరేమి?

డాక్టరు: అది ఒక గొప్పా? నిజమైన స్వాతంత్ర్యం మన దేశానికి వస్తే, అప్పుడు మంత్రులూ గింత్రులూ రక్షకభటుల్ని పెట్టుకోవాలి. ఇవాళ ఇంగ్లీషువారు నిన్ను రక్షిస్తున్నారు గనుక నీ ఆటలు సాగుతున్నాయి.

కోనంగి: అన్నావు నాయనా అంతమాటాను. పాపం ఇంగ్లండులో వాళ్ళ రాజ్యమే కాదుటండీ, అక్కడ కూడ స్కాట్లండుయార్డు, రక్షకభటులు మంత్రులనూ, ముఖ్యమంత్రినీ ఎందుకు కాపలాలు కాస్తుంటారు.

డాక్టరు: ఇంతకూ నీ వాదన ఏమిటి నాయనా?

కోనంగి: నా వాదన ఏమిటో తమకు అర్థం కాలేదు కాబోలు!

అంత మట్టితలకాయా నీది? మట్టి అయినా పంట పండుతుంది; బూడిదా?

డాక్టరు: బూడిదలో అనేక రసాయనాలున్నాయి. అన్నీ ఉపయోగించవచ్చును.

కోనంగి: ఏమీలేని ఖాళీ బుట్టా?

డాక్టరు: గాలి ఉంటే గాలి ఉపయోగం. గాలి లేకపోతే 'ఎక్సురే'కు ఉపయోగం.

కోనంగి: సరే ఎందుకో అందుకు ఉపయోగించు తమ్ముడూ! నా మాటలు అర్థం చేసుకోడానికి మాత్రం ఉపయోగించకు.

డాక్టరు: ఓ యమ్మో! అతితెలివైన అర్థంగల 'యారు’ నువ్వు? నువ్వు చెప్పేది నాయకుల ప్రాణం రక్షించవలసిన అగత్యంగల దేశంలోని రాజ్యవిధానం లోపభూయిష్ట మయినది. అని. నువ్వు సామ్యవాదాన్ని, గాంధీ వాదాన్నీ ఎల్లా సమన్వయం చేస్తావు?

కోనంగి: ఓయి ఎక్సురే బుఱగల వైద్యశిరోమణీగారూ, కొంచెం శ్రద్దగా విను.

డాక్టరు: ఓయి వంకర బుబ్ద కొక్కిరాయిగారూ, రెండు కళ్ళూమూసుకొని మాట్లాడు.

కోనంగి: గాంధీజీవాదనలో ఏమీ లోటు లేదు -

డాక్టరు: సామ్యవాదనలో ఏమీ లోటులేదు -

కోనంగి: ఈ రెండు కలిపితే అసలే లోటు ఉండదు -

డాక్టరు: ఆ రెండూ ఇంకంపాటబిల్సు - ఎప్పుడూ ఏ విధంగా కలవనివి. పైగా ఏదో కొత్తరకం విషయం అయి లోకాన్ని దహించి వేస్తాయి.

కోనంగి: నువ్వు ఆ రెంటినీ కలిపి, పరిశోధన చేసి చెబుతున్నావా, లేక డబ్బా వాయిస్తున్నావా?

డాక్టరు: నువ్వు డ్రమ్ము వాయిస్తున్నావు కాబోలు.

కోనంగి: డ్రమ్ము వాద్యవిశేషం. డబ్బా గొంతెమ్మ పండగవాళ్ళ గడబిడ విశేషమూనూ!

ఈలా వాళ్ళిద్దరూ ఆనందంతో గడిపేవారు. కాని కోనంగి హృదయాంతరాళాలలో ఆనందం ఏదీ? రెండు మూడుసారులు ఒంటిగా రాత్రిళ్ళు, తన కొట్టులో కటకటాల వెనకాల పడుకొని ఉన్నప్పుడు, కళ్ళ నీళ్ళలో కరిగిపోయాడు. ప్రేమావేదన అనుభవించిన వాళ్ళకే అర్థం అవుతుంది ఆ అవస్థ!

ఒక్కనిమిషం కూడా అనంతలక్ష్మి ఎదుట నుంచి మాయంకాదు. ఆ ప్రథమ సంధాన దివ్యముహూర్తపు మహామధురత ఎవ్వరూహించుకోగలరు?

అదివరకు ఆతడూ అనంతమూ కలిసి తిరిగేవారు. ఇద్దరు మాత్రమే కలిసి తిరిగారు. ఒకరి నొకర గాఢంగా కౌగలించుకొన్నారు. ముద్దులు కొనినారు. ఒకరిలో ఒకరు ఒదిగిపోయినారు.

ఆ యా ఆనందాలు, ఆ ప్రథమ దీవసపు ఉత్కృష్టానందం ముందు హిమాలయము ముందు నీలగిరి కొండలులా, గంగానది ముందు దండకారణ్యపు సెలయేళ్ళలా, గులాబి ముందు మల్లెపువ్వులులా కన్పిస్తాయని కోనంగి అనుకున్నాడు.

తలుపు వేయడంతోటే, అనంతలక్ష్మి సిగ్గుతో మంచంమీదనుంచి లేచి నుంచుంది? ఆ సిగ్గు కూడా ఎంత మధురమయి ప్రత్యక్షమైంది.

ఎవ్వరికీ వినపడకుండా తాము తమలో పాడుకున్న పాటలు, ఆమె పాడిన మువ్వగోపాల పదాలు, తా నా పవిత్ర యామినీ సంధానానికై రచించిన పాటలు పాడుకొన్నారు.

విద్యుత్ దీపాలు ఆర్పి, ఆ మేడపై కిటికీ దగ్గర వెన్నెల తమ మీద పడేటట్లు ఇద్దరూ ఒకటిగా జన్మించినట్లయిపోయిన కౌగలింతలో నిలుచున్నారు.

సౌందర్యాతి సౌందర్యమూర్తి అయిన ప్రియురాలి నగ్నసౌందర్య దర్శనము అతిపవిత్రము, ఆనంద పరమావధి.

“అనంతలక్ష్మీ! ప్రేమరాగాలాపన ప్రథమ స్వరంలోనే అపస్వరం సమకూర్చానా హృదయవీణకు?

ప్రాణేశ్వరీ! నువ్వు ధైర్యం వీడని స్థిరవై ఉన్నావా? కరిగిపోయిన కాసారజలంలా ఉన్నావా?

ఆత్మసాయకీ! పక్షిలా ఒంటినై జీవిత విశాలాకాశంలో ఎగిరే నన్ను నీ అందాలతో, అమృతగానాలతో బంధించి నీ ప్రక్కనే చేర్చుకుంటే ఏ పాడుబోదకాలు నన్నీవలలో పట్టి మనల నిద్దరినీ విడదీశాడు?

దగ్గరకు రాలేనంత దగ్గరకు వచ్చిన నిన్ను నేను విడినట్లా ఇంకనూ దగ్గరయినట్లా నా జీవిత పరమావధీ?

“ఈ కటకటాల బొచ్చెడు ఇందుమూర్తి

నీకు నా హృదయార్తిని నిద్రలేమి

తెలివిహీనుడై నిను జేరి తెల్చునంచు

ఇనుమడించిన భయముతో వనటబడుదు”

ఇలా పద్యాలు వ్రాసుకుంటే ఈ గుండెలోని వర్ణనాతీతమైన బాధ తగ్గుతుందా?

“ఎవరయ్యా పూజంటను

ఇటు తెంపిరి అటు తెంపిరి?

ఎవరయ్యా చంద్రుని చంద్రిక

విడదీసిరి విసిరివేసిరి?

ఎవరయ్యా వీణను తీగలు

విదలించిరి విరిచేసిరి?”,