Jump to content

కోనంగి/షష్ఠ పథం

వికీసోర్స్ నుండి


షష్ఠ పథం


సినిమా

డాక్టరు రెడ్డిగారూ స్నేహితులూ ఏర్పాటు చేసిన సినిమా కంపెనీలో కోనంగి చేరినాడంటే, ఒక టాంకుదళం చేరినంతపని అన్నమాటే! ఆ కంపెనీకి మానేజింగు డైరెక్టరు విష్ణుమోహన లక్ష్మీనారాయణరావుగారు. వీరిని కంపెనీలో వారందరూ వి. యల్. అంటారు. ఇక బొమ్మకు దర్శకుడు? బొంబాయిలో, కొల్లాపూరులో అక్కడ అసిస్టెంటు డైరెక్టరు చేసి కష్టపడి వచ్చిన ఎ. ఆర్. జి. పాటీగారు ఈ బొమ్మకు డైరెక్టరుగా నియమింప బడ్డారు. ఎ. ఆర్. జి. పాటీ అంటే అనంతరావు గార్లపాటి అన్నమాట.

కోనంగి: అల్లారుటండీ! నేను ఆయన ఎవరో మహారాష్ట్రుడనుకున్నా, మహారాష్ట్రునికి తెలుగు అంత బాగా ఏలావచ్చునా అని ఓమాట అనుకున్నా!

డాక్టరు: అవునయ్యా! మీరుకూడా ఆర్. కే. నంగే అని పెట్టుకోరాదూ.

కోనంగి: మీరు డాక్టరు ఆర్.డీ.డీ. అని పెట్టుకోండి. డ్డి అనే వత్తుమాట డీ.డీ అని శబ్దశాస్త్ర ప్రకారం మారుతుంది. ఏ జర్మనీ నుండో వచ్చిన పెద్ద డాక్టరనుకుంటారు మిమ్మల్ని.

డాక్టరు: నంగే అంటే వచ్చిన తప్పేమిటి?

కోనంగి: వట్టి నంగిమాటలు మాట్లాడే మనుష్యుడు నాయకుడు వేషం వేశాడు కాబట్టి ఈ చిత్రం తగలడుతుందిరా అని ప్రజలలో అభిప్రాయంపడితే ఇంక చిత్రాన్ని చూడడానికి ఎవరు వస్తారు? లేదూ నంగే అనే మహారాష్ట్రుడు కథానాయకుని వేషం వేస్తున్నాడు, ఇంక మనం కళ్ళారచూడనక్కరలేదు బొమ్మను, చెవులార విననక్కర లేదనుకుంటారు. డైరెక్టరు మహారాష్ట్రుడు కాబట్టి మహరాష్ట్రుణ్ణి పెట్టాడు. ఇది తెలుగు చిత్ర మనుమాట మరచి తెలుగు రానివాళ్ళని పోగుచేస్తున్నాడురా! అనుకుంటారు.

డాక్టరు: అది సరేగాని, నీ కథానాయికను చూచుకున్నావూ?

కోనంగి: చూచా స్వామీ, చూచా. అదేమిటి? అలాంటి కంచి ఇడ్లీ పిల్లని కొట్టుకు వచ్చారేమిటి?

డాక్టరు: మొగం చంద్రబింబంలా లేదటయ్యా?

కోనంగి: చంద్రబింబం అంటారేమిటి? దానికి తరగడం పెరగడం ఉన్నాయి. నా నాయకురాలి మోము అచ్చంగా తిరగలి రాయిలా ఉంది. నిజంగా చెప్పండి డాక్టరు గారూ! ఎందుకు ఆ అమ్మాయిని నాయికగా చేయదలచుకున్నారు?

డాక్టరు: చెప్పమన్నావు స్వామీ, మాకు డబ్బిచ్చేవారిలో ఒక పెద్దగారు ఉంచుకున్న పిల్ల ఆ అమ్మా యి.

కోనంగి: తామెల్లా ఊరుకున్నారు స్వామీ?

డాక్టరు: సంగీతం అద్భుతంగా పాడుతుందా లేదా?

కోనంగి: ఓ హెూహెూ! ఆ సంగీత మేమిటి! చెప్పడానికి వీల్లేదు. వర్ణించడానికి వెయ్యి నాలుకలు చాలవు. పాపం! ఒక్కటే వుంది.! గొప్ప సంగీతములో కన్నన్ బాలా, కన్నాంబా, సుబ్బలక్ష్మి, కుర్షీద్ అందరి సంగీతమూ తన గొంతులో నాట్యం చేస్తున్నాయని ఆ ఇద్దెనమ్మాయి ఉద్దేశం. “నాట్యం కాదుకాని అవన్నీ కలిసి శివాలాడుతున్నాయి. ఒక్కొక్కటే బైటకు వచ్చేద్దామనే తొందరలో, ఒకదాని కొకటి కాళ్ళకద్ధాలాడు తున్నాయి. అన్ని శ్రుతులూ, అన్నిస్వరాలూ, అన్ని రాగాలూ, అన్నితాళాలూ, అన్నిగతులూ ఒక్కసారిగా పైకి వచ్చి సంగీత కదంబం, చౌచౌ, భౌభౌ” ఊరుకు అయిన్నాయి.

డాక్టరు: నిజం చెప్పవయ్యా కోనంగీ, ఆ అమ్మాయి పనికి వస్తుందా రాదా?

కోనంగి: విను స్వామీ! అ అమ్మాయి ప్రాణనాథా' అనమంటే, 'పరాణనాదా' అంటుంది. 'నాథా' అనమంటే నాదా అంటుంది. 'ధా' ఒత్తు అంటే గ్జాదా అని నామీదే ఒత్తు తుంది బాబూ!

డాక్టరు: నీమీదే ఒత్తిందీ?

కోనంగి: నన్ను ఒక్కణే ఏం, అక్కడ ఉన్నవారందరినీ, రేపు ప్రేక్షకులనందరినీ కూడా ఒత్తుతుంది.

డాక్టరు: నాయిక సంగతి ఈలా ఉందీ, ఇంక తక్కినవారి సంగతి?

కోనంగి: నిజంగా మీ అందరి ఉద్దేశమూ 'సహస్రకంఠ రావణాసుర' తీద్దామనే!

డాక్టరు: మా వాటాదార్లందరీ ఉద్దేశం అదే! కాని నా ఉద్దేశం మాత్రం అదికాదు కోనండీ! కోనంగి: ఏం లాభం! ప్రతి వెంకయ్య, సుబ్బయ్య పురాణగాథలు తీద్దామనే. ఇంగ్లీషు వాళ్ళు ఎన్ని పురాణ గాథలు తీశారు? సైన్ ఆఫ్ ది క్రాస్, క్వోవాడిస్ మాత్రమే! ఎన్నో కిరస్తాని మతగాథలు, ఏన్నో గ్రీకుగాథలు ఉన్నాయి. అవన్నీ తీశారా?

వీరిద్దరూ డాక్టరుగారి ఇంటిదగ్గర మాట్లాడుకుంటున్నారు. ఇంతట్లో చిత్రం డైరెక్టు చేయనున్న "పాటీ' గారు, మేనేజింగు డైరెక్టరు వి.యల్.యన్. గారూ, మేనేజింగు ఏజంట్సులో డాక్టరు రెడ్డితోపాటు భాగస్వామి అయిన నాదమునిచెట్టిగారూ కారుమీద రెడ్డిగారింటికి చక్కా వచ్చారు.

డాక్టరు రెడ్డి వారందరినీ అహ్వానించి, “సమయానికి వచ్చారు రండి. మా కోనంగేశ్వరరావుగారి ఉద్దేశాలు వినండి!” అని అన్నాడు.

ఈలోగా నాయరు టీలూ, ఉపాహారాలూ తెచ్చి బల్లమీద ఉంచితే అందరూ ఉపాహారాదికాలు సేవిస్తూ కబుర్లు చెప్పుకోడం సాగించారు.

డాక్టరు: మా కోనంగిరావు పురాణం బొమ్మ వద్దంటాడండీ.

చెట్టి: ఏం లోటు వచ్చిందండీ! సహస్రకంఠ రావణాసురునికథ ఇంతవరకూ ఎవ్వరూ తీయలేదు. డబ్బు దోచేస్తుంది. సీతమ్మ వేషం ఆంధ్రదేశాన్ని దోచేస్తుంది.

కోనంగి: ఆంధ్రదేశం ఆవిణ్ణి తెరమీదచూచి ఆనందంచేత మూర్చ పోతుంది.

పాటీ: మీరు వెటకారంగా అంటున్నారా, లేకపోతే నిజంగానా?

డాక్టరు: మా కోనంగి హాస్యంగా కాకుండా ఎప్పుడు మాట్లాడినాడూ?

చెట్టి: అయితే మీరు మనవి - కాదు చెప్పేది ఏమిటండీ కోనంగి రావుగారూ?

డాక్టరు: పురాణకథ తీయవద్దంటారు. పాటీ: కారణం?

కోనంగి: పురాణగాథవల్ల డబ్బు వస్తుంది. అంతవరకు నిశ్చయం. సరిగా తీయకపోతే దమ్మిడీ కూడా రాని మాట నిజమే! పురాణగాథ పురాణపురుషుల వేషం వెయ్యడానికి ఎవ్వరికీ శక్తిలేదు. పురాణగాథలో ఉన్నది అది ఏదో విచిత్ర వాతావరణం, ఇంతవరకు ఇండియాలో ఎవ్వరూ సృష్టించలేదు. ఇక ముందుకూడ ఎవ్వరూ సృష్టించలేదు. కథంతా కృత్రిమంగా నడుస్తుంది.

చెట్టి: మీ ఉద్దేశం?

కోనంగి: ఈనాటి కథ తీయటం ఉత్తమం. ఇదే డాక్టరుగారి ఉద్దేశమూ! డాక్టరు: అది నిజంగా నా ఉద్దేశమే. ఆ ప్రకారమే కోనంగిరావుగారు అలా చెప్తున్నది.

పాటీ: ఏమికథ మరి? నేను డైరెక్టర్ల ఉద్దేశం ప్రకారం రామానుజమూర్తిని సివేరియో రాయమన్నాను.

డాక్టరు: ఎవరా రామనుజమూర్తి?

పాటీ: ఆయనా? ఆయన్ను ఎరగరా మీరు? అమ్మయ్యో! ఇంతవరకూ ఆయన పది తెలుగు చిత్రాలకు సినేరియో రాశారు. ఇప్పుడు ప్రస్తుతం ఆరు చిత్రాలకో ఎనిమిదింటికో రాస్తున్నారు. ఆయనకు ఆంధ్ర ప్రేక్షకుల హృదయం బాగా తెలుసు.

డాక్టరు: కంట్రాక్టు రాసినారా?

పాటీ: ఓ!

డాక్టరు: ఎంతకు? పాటీ: మూడువేలకు.

డాక్టరు: అది రాయించి ఆ మూడువేలు ఆయనకు అర్పించండి.

ఆ సినేరియో వద్దు, గనేరియో వద్దు! కొంచెం పేరు పొందిన కవి ఎవరన్నా రాసిన కథ ఒకటి తీసుకుందాం. ఆ కవీ, మనమూ కథనుగూర్చి ఆలోచించి, ఆయనచేతనే సినేరియా వాయిద్దాము.

చెట్టి: మన కథానాయిక మాట?

డాక్టరు: ఆవిడ సీత! ఇప్పుడు మనకు సీత అక్కరలేదుగా! ఆవిడ రాసిన కంట్రాక్టు చూచాను. మన కేమీ ఇబ్బంది లేదులెండి. అడ్వాన్సుపోతే పోయింది.

2

అనంతలక్ష్మికి సినీమా సంగతులన్నీ చెబుతూ నవ్విస్తూ ఉండేవాడు కోనంగి.

“నన్ను చూస్తే కోపం డైరెక్టరు పాటీగారికీ, మేనేజింగు డైరెక్టరు రావుగారికిన్నీ, నాయికవేషం వేయడానికి సిద్ధమై మానివేయింపబడిన స్వర్ణలతా దేవిగారికీని.”

“నిజంగా కోపమే! ఎందుకా కోపం?”

“ఆవిడ నాయికగా పనికిరాదని అల్లరిచేసిన వారిలో నేను ముఖ్యుణ్ణని ఆమెకు తెలియదా ఏమిటి?”

“తక్కిన నాయికలు మహా బాగున్నట్లు ఆవిడ విషయంలో మీకంత కోపం ఎందుకు?”

“మ. రా. రా. శ్రీ కోనంగేశ్వరరావుగారు నాయకుని పాత్ర వహిస్తూంటే ఆ చిత్రమంతా పాడయిపోవలసిందే?”

“ఆమె పని ఏం చేశారు?”

“ఏమిటి చేయ్యడం. ఆవిడకు కథానాయకుని చెల్లెలు వేషం ఏర్పాటు చేశారు.”

“మీ చెల్లెలా?”

“ఓ, అయితే నాకేమన్నా భయమా?”

“నే నెప్పుడన్నా మీరు నటనచేసే సమయంలో వచ్చి చూడాలని ఉంది.”

“ఆ పనిమాత్రం చేయకు, నామీద ఉన్న కాస్త గౌరవం కూడా పోతుంది."

“ఇప్పుడు కథానాయకివేషం వేసేది ఎవరు?”

“నువ్వు!”

“నేనా? మా అమ్మ ఒప్పుకుంటుందా? లక్షరూపాయలిస్తే నేను ఒప్పుకుంటానా?”

“నీకు లక్ష? ఖర్మం కాలిపోతే! మూడులక్షలు తక్కువైతే నేను ఒప్పుకోమంటానా?”

“మూడు లక్షలుకాదు. ముప్పైలక్షలైనా నేను ఒప్పుకోను.”

“నాకు నాయికగా అభినయించడానికైనా ఒప్పుకోవూ?”

“అది మీ ఇష్టమండి సార్!”

సినిమా ప్రపంచం వేరు. ముస్లిం మతం పుచ్చుకోగానే వేరేజతైనట్లు, సినిమాలో చేరగానే వేరేజాతి మనుష్యులవుతారు కాబోలు అని కోనంగి అనుకున్నాడు. కొత్త నాయికకోసం ఆంధ్రదేశం అంతా గాలిస్తున్నారు.

కథకులని ప్రఖ్యాతి వహించిన విశ్వంభరమూర్తిగారి కథ ఒకటీ సినీమా హక్కులకు వేయిరూపాయలకు కొన్నారు. దానికి సినిమా సంభాషణలు వ్రాయడానికి వారినే వేయిరూపాయలకు బేరమాడినారు.

విశ్వంభరమూర్తిగారూ, పాటీగారూ, డాక్టరుగారూ, కోనంగీ కలిసి సినేరియోసిపు తయారు చేయడానికి నిశ్చయం అయింది. చిత్రం తీయడానికి “చితవాక్కు స్టూడియోస్లో బేరం కుదిర్చారు. యుద్ధంలో జర్మనీవారి “ఆగ్చా” కంపెనీని ప్రభుత్వంవారు వశపరచు కున్నారు. కాబట్టి, పాటీగారూ ఇంకా కొందరు పెద్దలూ బొంబాయి పరుగెత్తివెళ్ళి “కోడక్” కంపెనీవారితో మాట్లాడి చిత్రానికి తగిన “నెగిటివ్” “పోసిటివ్' ఫిల్ములను సప్లయి చేసేందుకు కంపెనీనుండి కంట్రాక్టు పుచ్చుకొన్నారు.

కథ పేరు ఏం పెట్టాలి అన్న ఆలోచన వచ్చింది. చివరకు కోనంగి కథకు అనుగుణమైన పేరని 'దుక్కిటెద్దులు' అన్న పేరు పెట్టితే బాగుంటుందన్నాడు. అందరూ అద్భుతం అన్నారు.

దర్శకుడు పాటీగారు కోనంగివైపు మొగ్గడం ప్రారంభించాడు. కోనంగి ఇచ్చే అభిప్రాయాలు కొంచెం ఆలోచనాపూర్వకమైనవి. నాలుగో వంతు హాస్యం, తక్కిన మూడువంతులలో సగం శృంగారం, సగం కరుణరస పోషణ ఉండాలనీ, ఇవి బాగా రంగరించి మంచిపథకం అల్లాలనీ కోనంగి వాదన.

అసలు కథపేరు 'పొలం'. కథ ఏమిటయ్యా అంటే-పొలందున్నుకునే ఒక రైతుకు అందమయిన అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి చదువుకుంటానంటుంది. రైతుసంఘంలో చేరిన ఆ చిన్నరైతు చదువుకుంటానన్న తన బాలికను తమ జిల్లా పట్టణం పంపించి చదివిస్తాడు. కథానాయిక తండ్రి హిందూస్తానీ సంస్కృతమూ చదువుకున్నవాడు. చిన్నతనంలో రెండవ ఫారమువరకూ ఇంగ్లీషు చదువుకున్నవాడు. రైతు నాయకుడై కిసాన్ సభలలో ముఖ్యునిగా పేరు సంపాదించుకొన్నాడు. స్వంత వ్యవసాయం.

మన రైతునాయకుడు వెంకటస్వామి. ఆయన్ను అందరూ చాలా గౌరవిస్తారు. గాంధీతత్వవాది, ఖద్దరాభిమాని, కాంగ్రెసులో సభ్యుడు. అప్పుడే రెండుసారులు జైలుకు వెళ్ళివచ్చాడు.

రైతు రెడ్డికులంవాడు. ఆయన కొమరిత కమలాక్షీదేవి ప్రవేశపరీక్షలో కృతార్ధత నొంది కాలేజీ చదువుకు కాకినాడ వెడుతుంది. ఈ అమ్మాయి ఇంటరు చదువుతోంటే కమ్మవారి కులానికి చెందిన ప్రసాదరావు అనే యువకుడు బి.యస్.సి. సీనియర్ చదువుతూ ఉంటాడు. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటారు.

ప్రసాదరావు తండ్రి ఒక పెద్దరైతు. అతని జిల్లా వేరు. వ్యవసాయం మెరక వ్యవసాయం, తండ్రి ప్రభుత్వ పక్షపాతి. రైతు సంఘాలకు వ్యతిరేకుడు, పూర్వాచార పరాయణుడు. ఆ పెద్ద రైతు తన కుమారుడు ఇతర కులానికి చెందిన ఒక బాలికను వివాహం చేసుకోకూడదంటాడు.

తండ్రి భావాలు కుమారుడు ప్రసాదరావుకు ఇష్టంలేదు. తండ్రి ఇంక చదువు చెప్పించనక్కరలేదనీ, తనకు తండ్రి ఆస్తి ఏమీ అక్కరలేదనీ, ఉత్తరం వ్రాసి కాలేజీ చదువు మాని దేశాలు తెగించి పోతాడు.

ఇవతల కమలాక్షీదేవీ, అవతల ప్రసాదరావు తల్లీ ప్రసాదుకోసం దుఃఖిస్తూ ఉంటారు.

ప్రసాదరావు వేరే జిల్లాలో కొంత భూమి ఒక పెద్ద రైతు దగ్గర కౌలుకు పుచ్చుకొని, అతని దగ్గిరే పెట్టుబడికి నూరురూపాయలు పుచ్చుకుని వ్యవసాయం ప్రారంభిస్తాడు. నాలుగెకరాల భూమి కొత్త పద్ధతులతో అందమైనతోట అయి అతనికి మంచి రాబడి యిస్తుంది. రైతు పెట్టిన పెట్టుబడి బాకీతీర్చి. ఇంకో వందరూపాయలు ఆ తోటపనికి ఉంచుకుని, తక్కిన నూరురూపాయలతో కథానాయిక ఊరువస్తాడు.

కథానాయిక తండ్రి తన కొమరితను నాయకునికి వివాహం చేయడానికి సందేహిస్తాడు. ఒకరు కమ్మవారు. ఒకరు రెడ్లు. కథానాయకుడు వెళ్ళిపోతూఉంటే కథానాయిక అతన్ని కొంతదూరంలో కలుసుకుంటుంది. ఇద్దరూ వెళ్ళి చెన్నపట్నంలో వివాహం చేసుకుంటారు.

కథానాయకుడు పొలందున్నుతూ, నాయిక చెట్లు పాతుకుంటూ తోటపని వాళ్ళవుతారు. కథానాయకుడు రైతుసంఘ కార్యదర్శి అవుతాడు.

చివరకు ప్రసాదు తల్లి భర్తను వ్యతిరేకించి, తన ఇల్లు వదిలి కొడుకు దగ్గరకు వచ్చి ఉంటుంది. గాంధీగారు ఆ గ్రామం వచ్చినప్పుడు ప్రసాదు తోటలో మకాం చేస్తారు.

ఇదంతా విని, భార్యాభర్తల తండ్రులిరువురు ఒకరికి తెలియకుండా ఒకరు ప్రసాదును, కమలాక్షిని చూడడానికి వస్తారు. అయిదునెలల బిడ్డడు మోహనదాసు ప్రసాదుకూ కమలాక్షికీ.

చివరకు అందరూ సంతోషంగా కలుసుకుంటారు.

ఈ కథను చలనచిత్రానుగుణంగా మార్చితే అద్భుతమైన కథ అవుతుందని కోనంగి ఉప్పొంగిపోయాడు.

కానీ డాక్టరు రెడ్డిగారికి కొన్ని అనుమానాలు ఉద్భవించాయి.

3

డాక్టరు: కథలో ముందుకుపోయేతనం ఉందిగాని, కొంచెం చప్పగా వుంది.

పాటీ: ముందుకుపోయేతనం ఏమిటి, వెనక్కుపోయేతనం ఏమిటి?

డాక్టరు: కళ దేశాన్ని ముందుకు నడిపించుకుపోయే శక్తిని విరజిమ్ముతూ ఉండాలి.

కోనంగి: ముందుకు నడిపించుకుపోవడం అంటే కళ ప్రచారక స్వరూపంగా వుండాలని డాక్టరుగారి భావంలెండి పాటీగారూ! పాటీ: కళ కాంగ్రెసు ప్రచారకుడటండీ?

డాక్టరు: కళాప్రేమ మానవుని ఉన్నత ప్రేమలో ఒకటికదా? పాటీ: అవునండీ. అందులో సినిమాకళ మనుష్యునికి చాలా సన్నిహితమైన కళ.

డాక్టరు: దాని ద్వారా మనుష్యుడు పురోగమించే విధానాలు నేర్పడం ఉత్తమాశయం అంటారా కాదా?

కోనంగి: అయితే ఇంగ్లీషు సినిమాలలో నాట్య సంగీత సినిమాలు 'బ్రాడ్వేమెలడీ' అని “థిన్ ఐస్' అనీ అనేకం వచ్చాయి. వాటిలో ఏమీ ప్రచారం లేదు. అయినా అలాంటి బొమ్మలకు లక్షల కొలది డాలర్లు రాబడి వస్తోంది. అవి పనికిరావా?

డాక్టరు: అవి పనికిరావు. అవి 'పారిపోయే' భావం తెలియజేసే బొమ్మలు. మనుష్యుడు తన ధర్మం మరచి ప్రపంచం వట్టి ఆనందం కోసం పుట్టిందనీ, ఎల్లాగో అల్లాగ ఆనందం సమకూర్చడమే పరమావధి అనుకొని పాడయిపోతాడు.

కోనంగి: పాడయిపోతే?

డాక్టరు: లోకం పాడయిపోతుంది.

కోనంగి: లోకం పాడయిపోతే?

డాక్టరు: మనుష్యజాతి నాశనమైపోతుంది.

కోనంగి: మనుష్యజాతి నాశనమైపోతే!

పాటీ: అవేమి ప్రశ్నలండీ కోనంగిరావుగారూ?

కోనంగి: నా ప్రశ్నలకు అర్థం లేకపోలేదండీ. ఆమెరికాలో పదివేల సంవత్సరాల క్రితం ఏదో తోకచుక్క తాకిందట. అప్పుడు ఆ మధ్య ఆమెరికా అంతా నాశనమైపోయిందట. 1903లో కెనడాలో ఒక చిన్న తోకచుక్క వాలిందట. అది అడివి ప్రదేశం. అయినా లాచాచ్ కాన్ అను ఆయన పదిహేను వందల రైన్దేరులూ, సెమెనోవ్ అనే ఆయన ఇల్లూ, నాలుగు వందల మైళ్ళ ప్రదేశమూ నాశనం అయ్యాయట. అలాగే ఒక పెద్ద తోకచుక్క భూమిని తాకితే భూమి అంతా నాశనం అవుతుందని అంచనా వేశారు శాస్త్రజ్ఞులు. అప్పుడేమవుతుంది మన పురోగమన కళ?

డాక్టరు: అమ్మయ్యా! కోనంగిరావుగారూ ఎంత గొప్ప ఉపన్యాసం ఇచ్చారు! అయితే నేనడిగే ప్రశ్నలకు సమాధానం ఇయ్యి. ప్రపంచం శాస్త్రరీత్యా ఆర్థికంగా, రాజకీయంగా, సాంఘికంగా, అభివృద్ధి పొందితే ఏం?

కోనంగి: ఏం ఫరవాలేదు. అలా వృద్ధిపొందితే కొంపలు మునిగిపోవు.

డాక్టరు: అందుకోసం కళలు తయారుచేస్తే ఏం?

కోనంగి: దేశాలు తగలబడిపోవు! భయమేమీలేదు.

డాక్టరు: అప్పుడు ప్రజలందరూ సంతోషిస్తారు కాదా?

కోనంగి: ఏం చూసి?

డాక్టరు: అందరికీ సమంగా తిండీ, సమంగా బట్టా, సమంగా ఆనందం, సాంఘిక సమత్వం, రాజకీయ సమత్వం వస్తుంది. అప్పుడు అందరికీ ఆనందం కాదా?

కోనంగి: ఉహు! కాదు! ఒకడు బక్కవాడు. ఒకడు మరుగుజ్పువాడు. ఒకడికి జబ్బుచేస్తుంది. ఒకడికి చేయదు. ఒకడ్ని ఒక అందమైన పిల్ల మోహిస్తుంది. ఒకణ్ని మోహించదు. ఒకడికి తియ్యటి గొంతుక ఉంటుంది. ఒకడికి గార్దభస్వరం ఉంటుంది. ఒకడికి బిడ్డలు పుడుతారు. ఒకడికి పుట్టడానికి శాస్త్రం ఒప్పుకోదు. ఉన్నవాడిని చూచి లేనివాడికి ఏడ్పు. ఇక అందరూ ఒకటే పొడుగూ, లావూ, బరువూ, ఒకటే రూపూ, ఒకటే రంగూ ఉండాలి. అందుకోసం టెస్టుట్యూబు బేబీలు. ఒకరే ఆ బేబీల తండ్రి అయితేనే అదయినా!

డాక్టరు: అయినా తల్లులనుబట్టి రూపురేఖా విలాసాలు మారుతాయి నాయినా! పైగా ఒకడే తండ్రి అయినా వాడి పూర్వీకుల రూపురేఖా విలాసాలు, ఒకరిలో ఒకరి పోలిక, ఇంకొకరిలో ఇంకొకపోలికా వస్తుందట.

కోనంగి: మరి ఇంక సమాన మెక్కడ బాబూ?

డాక్టరు: నీ వాదన ఎలా వుందంటే -

కోనంగి: అష్టవంత్రకాత్ భవేత్గా వుందంటావు. ఇంతకూ సినిమా కథలో ఏమిటి లోటు?

డాక్టరు: ఇంకొంచెం కారంగా ఉండాలి.

కోనంగి: మరీ కారంవద్దు. మరీ చప్పగా వద్దుబాబూ. రోజుల మాహత్యం డాక్టరూ!

కథ ఎల్లాగో తంటాలు పడుతూ రాయడం సాగించారు.

ఈలోగా కవిగారి పాటలు సంగీతంలోకి సంగీత దర్శకులు మిష్టరు మునీరు సాగించారు. వీరు ఒక వీధి నాటకంలో ఫిడేలువాయించే వారు. ఆ వీధినాటకం కొన్నాళ్ళకు వృద్ధిపొంది నాటకశాలల కెక్కింది. ఆ సమయంలో మునిగారు ఆ నాటకం కంపెనీకి సంగీత దర్శకులయ్యారు.

సంగీత దర్శకత్వం బాగా నేర్చుకొనడానికి ఆయన మదరాసు పోయి ఉదయశంకర్ నాట్యప్రదర్శనాలు చూశాడు. తమ కంపెనీ నాటకశాల కంపెనీ అవడానికి పెట్టుబడి పెట్టిన పెద్దమనిషి ఇంట్లో మంచి గ్రామఫోనూ, నూరు, నూటయాభై రికార్డులు ఉన్నాయి.

ఆ రికార్డులు వినడం, ఈ కరీంఖానుపాట బావుంది. ఆ జ్యోతికారయిపాట అద్భుతం, ఈ బరోడోకర్ పాట అమందానందకందళితం అని వారి వారి పాటలకు సరియైన తెలుగు పాటలు వ్రాయించడం, అవి పాడించడమూను.

ఉదయశంకర్ గారి నాట్యప్రదర్శనంలో నాలుగు సితారులు, అయిదు ఇన్ రాజులు, మూడు మాండోలీనులు, ఒకటి తబలాతరంగ్, రెండు జలతరంగ్లు, అయిదు వాయులీనులు. ఎనిమిది వుదోపోనులు, ఆరు వేణులు ఉన్నాయి. గనుక తాను కూడా రెండు వీణలు. మూడు హార్మోనీలు, అయిదు ఫిడేళ్ళు, రెండు తబలా సెట్టులు (అరెస్టా) గాన సమ్మేళనం ఏర్పాటు చేశాడు.

ఈయన సమ్మేళనం ఊరూరా పేరు పొందింది. అందుచేత మునీవారే సంగీత దర్శకులన్నారు మానేజింగు డైరెక్టరు రావుగారు.

కవి రాసిన కథలో పది పాటలున్నాయి. కథానాయకుడు పాడినవి మూడు. నాయిక అయిదు. రెండు రైతుసంఘ మహాసభలో పాడినవి. కనక ఇంకో రెండు పాటలన్నా చేర్చాలి అని దర్శకులు పాటీగారు కోరారు.

అందులో ఒక్కొక్కపాటకు ఒక్కొక్కరాగం. ఒక్కొక్కతాళమూ, పాటలోని భావాన్నిబట్టి అమరించాలంటాడు కోనంగి.

పాట అర్థం వికారమైనా సంగీతం ముఖ్యమంటాడు సంగీత దర్శకుడు.

ఈ ఇద్దరి వాదనలలో ఎవరి వాదన వైపు మొగ్గనా అని కవిగారు తటపటా ఇస్తున్నారు.

4

అనంతలక్ష్మికి కోనంగి సినీమాలో వేషం వేయడం అంతకన్న ఇష్టం లేకపోవడం ప్రారంభించింది. మొదట తన ప్రియుడు, తన హృదయనాథుడు సినీమా నాయకుడు అవడం ఎంతో అద్భుతం అనుకుంది. ఆమె మనఃపథాలలో ఆశోక్ కుమార్, సైగల్, బారువా, ప్రేమ ఆదీబ్, పృధ్వీరాజ్, నాగయ్యలతో సమంగా కోనంగిరావూ ఎదురుగుండా కనుపించాడు. తన నాయకుడు అందరికన్నా గొప్పవాడవుతాడు. తన హీరో, తన స్వామీ, తన చక్రవర్తి సినీమా చక్రవర్తి అవుతాడు. ఆ భావంకన్న ఇంక జీవితానికి పులకరం కలుగజేసే భావం ఏముంది?

ఆ తర్వాత సినీమా షూటింగ్ ప్రారంభమైంది అని కోనంగి తెలిపాడు. ఆ ముక్క వినగానే ఆమె ఎదుట అనేకమంది సినీమా నాయకులు బారులుగా ఒకరివెంట ఒకరు నడవడం సాగించారు. విడివిడిగా వారివారి ప్రఖ్యాత చిత్రాలలో సంచరించడం ప్రారంభించారు.

మేరీ వారి యొస్కాలో నెపోలియనుగా చార్లెస్ బోయర్ కనిపించాడు. ఎంతఠీవి, ఎంతచక్కని వేషం, ఎంత విచిత్రాభినయం? అతని ఎదుట కాంటెన్ మారీ వారి యొస్కాగా గ్రేటాగారో ప్రత్యక్షమైంది. ఏమి ప్రేమగాథ! ప్రాణాలు నిలిపివేస్తున్నది.

చార్లెస్ బోయరుకు భార్యలేదా? ఆమెను అతడు ప్రేమిస్తున్నాడాలేదా? నిజంగా ప్రేమిస్తే ఇంకో బాలికను - గ్రెటాగార్బోయే అనుకోండి - అలా ఎలా ప్రేమించగలడు? గ్రేటాగార్బోను ప్రేమిస్తున్నాడా, అది నటనా? ఆ కౌగిలింతలు, ఆ చూపులు, ఆ మాటలు, ఆ ముద్దులు, నటన ఎట్లా అవుతాయి? మనస్సులో నిజంలేందే నటన రాగలదా?

రేపు తన గురువు, తన జీవితనాథుడు కోనంగిరావుగారూ అల్లాగే అభినయిస్తారు గాబోలు. తెలుగు సినిమాలలో కౌగలింతలు లేవు. ముద్దులు లేవు. అయినా వందేమాతరంలోలాగ నలిపివేయ్యడం ఉంటుంది. మళ్ళీ పెళ్ళిలో లాగ పక్కగా పడుకొని సన్నిహితంగా అవడం ఉంటుంది. ఆ చూపులు, ఆ నర్మగర్భ వాక్యాలూ ఉంటాయి. నాథా! హృదయేశ్వరీ! అనే మాటలు వస్తాయి. పుస్తెలు కట్టడం, శోభనపుగది రంగాలు అన్నీ ఉండవచ్చును.

ఆ బాలిక ఆ ఆలోచనలు భరించలేకపోయింది. ఆమె గుండె కుంగిపోయింది. అప్పుడే ఆ చిత్రం తీయడం ప్రారంభించి వారం రోజులయింది. రెండువేల అడుగులు చిత్రం తీశారుట.

ఆమె గుండెలో ఏదో బాధ ప్రవేశించింది. కథానాయిక వేషం వేసింది ఎవరు? ఆమె గుణగణా లెలాంటివి? అని ప్రశ్నలు వేద్దామని, కానీ తన గురువు ఏమనుకుంటాడో అని భయం.

పరీక్షలైపోయాయి. చివర పేపర్లు బాగానే జవాబులు వ్రాసింది. మొదటి పేపర్లలో విశ్వవిద్యాలయానికే మొదటగా వస్తుంది.

అనంతలక్ష్మి కోనంగిని సినీమాలో చేరమని మొదట ప్రోత్సహించింది. అంతకన్న గొప్ప యేమిటని వాదించింది. ఇప్పుడు వద్దని ఏలా చెప్పగలదు. నవ్వులాటగా ఉండదా? తన భవిష్యత్తు ఏలా ఉంటుందో?

ఇంతలో కోనంగి చిత్రంలో, ఒక ఘట్టము తీయడమైన వెనక, అనంతలక్ష్మిని చూడడానికి వచ్చాడు. ఒకరాత్రి, ఒక పగలు ఆ ఘట్టం తీయడం జరిగిందట. ఒక చిన్న ఇంటిలోని రంగము, కథానాయకుడూ, నాయికా చిలకాగోరింకల్లా కబుర్లు చెప్పుకొనడం రంగమూ, అక్కడకు కథానాయకుని తండ్రి పంపిన పెద్దవచ్చి, కథానాయకుని బెదిరించే రంగమూ, కథానాయకుని తల్లి వచ్చే రంగమూ అయ్యాయి. ఇంకా ఆ ఇంటికి సంబంధించిన రంగాలు పద్దెనిమిది వున్నాయట.

తానూ కథానాయికా కలిపి పాడిన పాట ఒకటి అతడు అనంతలక్ష్మికి పాడి వినిపించాడు.

అనంతలక్ష్మి చెవులార ఆ పాట విన్నది. అతడు నాయిక పొడినచరణాలూ వినిపించాడు. ఈ పాట ఇదివరకే తీసి ఇప్పుడు ఆపాట యంత్రం వెనక పాడుతూ వుంటే తాము ఆ పాటతో కలిసి పాడుతూ అభినయించామనీ, ఛాయాగ్రహణ యంత్రం మాత్రం ఆ చిత్రం తీస్తుందనీ, పాడిన పాట తమ పెదవుల నటనతో సరిపోయేటట్టే చిత్రం తీస్తారనీ అతడు తెలిపాడు.

అనంతలక్ష్మి కొంచెం విపులం చేసి చెప్పమంది.

కోనంగి: ముందర మేము ఇద్దరం పాడిన పాట విను.

‘21వ మేళం-మదగజగమనరాగం-త్రిశ్రజాతి రూపకం.


నాయకుడు:

బంగారు పీటపై
శృంగార నాయికా
అందుకో నా పూజ
అందుకోవేమే!


నాయిక:

పువ్వల్ల పూజలో
ముంచెత్తు పురుషుడా
ఎవరోయి నాకడకు
ఎందుకొచ్చావూ?


నాయికుడు:

పరభృత స్వనకంఠి
పలుకులతో కరిగించి
మాయచేస్తువే నన్ను
మందార మాలా!


నాయిక:

 మందార మాలనో
మాయపూ పేరునో
కొమ్మలో కోయిలనో
కొలుతు వెందుకు నన్ను?


“ఏలా వుంది పాట?”

అనంతలక్ష్మి: అంత ఆడగొంతుకతో ఏలా పాడగలిగారు గురువు గారూ?

కోనంగి: రెండు గొంతులు చూపించారా?

అనంత: అవునులెండి. మీరు అనుకరించిన ఆడగొంతులాంటి గొంతుకేనా ఆ అమ్మాయిది?

కోనంగి: ఛా! ఛా! అది వేరు. చాలా బాగుంటుంది.

అనంత: ఎంత బాగుంటుంది?

కోనంగి: నీ గొంతుక ముందర అది తేలిపోతుంది. నీ గొంతుకే అయితే చిత్రానికి కనకవర్షం కురవదూ?

అనంత: అన్నీ పొగడ్తలే.

కోనంగి ఇటు అటు చూచి అనంతలక్ష్మిని గబుక్కున కౌగలించుకొని గాఢంగా హృదయానికి అదుముకొని, "అనంతం, నీ కంఠమాధుర్యం నేను వర్ణింపగలనా? నేను అబద్దం చెప్తానో, పొగడతానో నీకు తెలియదో హృదయసింహాసనరాజ్జీ! నీ ప్రేమకు నేను తగుదునా! నీవు నా భార్యవై, ఆ సమ్మోహనాక్షులతో నన్ను చూస్తూ ఉంటే, అన్నీ మరిచిపోయి దారితెలియలేని మొద్దునో, సమస్తమూ తెలిసిన అమృతమూర్తినో అయిపోనా లక్ష్మి!” అని ఆమె పెదవుల చుంబించినాడు.

అనంతలక్ష్మి కరిగిపోయింది. ఆమె పులకరించింది. చైతన్య రహితురాలివలె, తేజరిల్లే ఉపాబాలవలె, కోనంగి కౌగిలిలో ఒదిగిపోయి, “గురువుగారూ! నన్ను త్వరగా పెళ్ళి చేసుకోండి. మిమ్మల్ని విడిచి వుండలేను. మీ యెదుట తిండిలేకుండా సంవత్సరాలు అలా పూజచేస్తూ గాఢంగా మీలో ఒదిగివున్నా తృప్తితీరని బాలికను” అన్నది.

కోనంగి కన్నుల నీరు తిరిగింది. “పవిత్రమైన చరిత్ర నీది అనంతా! నీ రూపే, నీ మాటే, నీ హృదయమే నాలో! నేను నీకు తగను. నేను నీ ప్రేమకు ఏ తపోబలంచేత పాత్రత సంపాదించుకొన్నానో!” అని తన కౌగిలిలో తనలో ఒకటై ఉన్న అనంతలక్ష్మి మూర్ఖముపై మోమునాన్చి ఆఘ్రాణించినాడు.

“అనంతా! ఎన్నా సమాచారమా? మన చెట్టిగారు వచ్చిరే!” అంటూ వినాయగం కేక వేసినాడు.

ఇద్దరూ కౌగిలింత విడిపోయి చెరి యొక సోఫాపై కూర్చున్నారు. ఇంతలో నాటుకోడి చెట్టియారు లోనికి విచ్చేశారు.

ఈ మధ్య మూడునెలలు ఆ నాటుకోడి చెట్టియారుగారు మలయా వెళ్ళి వచ్చారు. మలయా నుంచి చెట్టిగారుపోయి, అక్కడనుంచి మదరాసు వచ్చినా రా రోజునే! రావడమేమిటి, స్నానాదికాలు, భోజనం చేయకుండానే అనంతలక్ష్మి ఇంటికి వేంచేసినారు.

వినాయగానికి అనంతలక్ష్మి కోనంగుల ప్రేమగాథ ఆర్థమైపోయింది. అతని హృదయంలో కోనంగిరావుగారే తమ రాజకుమారి అయిన అనంతలక్ష్మికి తగిన వరుడు అని నిశ్చయం చేసుకున్నాడు. అతనికి ఇష్టంలేని మనుష్యుడా ఇంట్లోకి అడుగుపెట్టలేడు. కొందరిని రానిస్తాడు. కొందరు రావాలని కోరుతాడు.

వినాయగం భక్తుడు. అతడొక విధానంగా బాగా చదువుకొన్నవాడు. ఆనంద వికటన్, దినమణి, స్వదేశమిత్రన్ అతనికి ప్రియమైన పత్రికలు.

అతనికి, అతని మిత్రులకూ సంభవించిన ఒక మహత్తరమైన ఆపద నుండి అనంతలక్ష్మి తండ్రి రక్షించాడు. జయలక్ష్మి తల్లిలా వారిని చూస్తున్నది. ఆమెకు సహాయంగా వచ్చిన తరువాత వినాయుగమూ, అతని ఇద్దరి స్నేహితులూ భూములు సంపాదించుకొన్నారు. బ్యాంకులో డబ్బు వేసుకొన్నారు. వారి మువ్వురికీ గాంధీవాదం మహాయిష్టం. అహింసాతత్వం పూర్తిగా తెలిసి, సత్యమంటే ఏమిటో అర్థమై కాదు. వారు వినోబాభావేల వంటివారు కారు. కాకపోయినా గాంధీతత్వం వారి హృదయాలు తెలిసికున్నాయి. మెదడులు తెలుసుకోపోతేనేం?

చెట్టిగారు వచ్చారని అనంతలక్ష్మికి తెలియజెయ్యడం తన విధి. చెట్టిగారి కారు హారనుమోత ఆళ్వారుపేట టర్నింగ్ దూరంగా మ్రోగడం విన్నాడు. వెంటనే గేటు బంధించి మెట్లవరకు పరుగెత్తుకొనివచ్చి, పొలికేకతో చెట్టిగారు వచ్చారన్న వార్త ఉప్పు అందించి తాను పరుగున పోయి గేటు తలుపు తీసినాడు.

చెట్టియారుగారు వచ్చేసరికి సినిమా విషయం చెబుతున్నాడు.

“మొదట పాటపాడుతూ ఉంటే రికార్డు (శబ్దగ్రహణ) చేస్తారు. అంటే శబ్దము శక్తిగనుకా, ప్రతిశక్తి యొక్క మూలమూ విద్యుచ్ఛక్తిగనుకా, శబ్దమూ విద్యుత్ రూపము పొంది వెలుగుతుంది. మన మాటలో ఉన్న స్పందన వెలుగు రూపాన హెచ్చుతగ్గులౌతుంది. వెలుగు సినీరీల్ బద్దెపైబడి ప్రొటెక్టార్ (శబ్దపు సారతి) యంత్రంలో పెట్టి ధ్వని ప్రసారం చేస్తారు. ఆ ధ్వని ప్రసారపుపాటలో కలవడం ప్లేబాక్ అంటారు. ఆ పాటతో కలసి నటీనటకులు పాడుతూ అభినయం చేస్తారు.

5

చెట్టిగారు తెలివితక్కువవారు కారు. అప్పుడే అతనికి కోనంగి అనంతలక్ష్మిలిద్దరూ ఏవో ప్రేమ రహస్యానందాల నోలలాడుతున్నారని అనుమానం స్పురించింది. ఆ ప్రేమగాథ ఎంతవరకూ వెళ్ళిందో? ఈ జయలక్ష్మికి బుద్ధిలేదు. ఈడులో ఉన్న యువకుని పొగరు మోతుని తన కూతున కుపాధ్యాయునిగా ఏర్పాటు చేయడం ఏమిటి? అని అనుకున్నాడు.

తన చరిత్ర తనకు ఏలా తప్పు అవుతుందీ చెట్టియారుకి? కోనంగి పాపచరిత్రుడు. కోనంగికి తగిలిన దెబ్బలకు బుద్దిరాలేదు. ఏ కాలో చెయ్యో పనికిరాకుండా చేస్తేగాని బుద్దిరాదు.

చెట్టియారు మండిపోయాడు. అయినా నాటుకోటిచెట్టి, ధనసంపాదన రహస్యాలు అతనికి తెలిసినట్లు యువతీ సంపాదన రహస్యాలు తెలుసును. అందువల్ల పైకి ఏమీ ఎరుగనివానిలా నవ్వుతూ వచ్చి వారి దగ్గర కూర్చున్నాడు.

“ఏమండీ కోనంగిరావుగారూ, మీరు సినీమాలో చేరారట. నాయకుని వేషం వేస్తున్నారట. మీ కంపెనీలో నేనూ వేయిరూపాయల షేర్లు పది కొంటున్నానులెండి. అవసరమైతే ఇంకా ఇరవై ముప్పైకొందామనే ఉంది. ఎవరు మీ చిత్రంలో కథానాయిక?”

“మావాళ్ళు ఆంధ్రదేశం ఆంతా గాలించి, గాలించి లాభంలేక ఒక అరవ అమ్మాయిని తీసుకువచ్చారు. ఆ అమ్మాయి ఇదివరకు ఎప్పుడూ సినీమాలలో వేషం వేయలేదులేండి.”

“అరవ అమ్మాయి తెలుగు పిక్చరులో వేషం వేయగలదండీ?”

“మా తెలుగువాళ్ళు మీ అరవంలో వేయటంలేదా ఏమిటి?”

“వారు అనుభవంగల తారలు. నాగయ్యగారు చిత్తూరువాసులు. సగం అరవవారు. కన్నాంబ మదరాసులో ఉంది. ఉండి అరవతనం బాగా నేర్చుకున్నది.”

“సరేలెండి, మదరాసు తెలుగుదేశం. అందుకని మీ అరవతార మా తెలుగుతార అయిపోతుంది.”

“మదరాసు తెలుగుదేశం ఎట్లా?”

“చరిత్ర ప్రకారం! ఇప్పటి ప్రత్యక్ష ప్రమాణాల ప్రకారమూ.”

"మదరాసుకోసం మా ప్రాణాలు తెగించి పోరాడుతాము.”

“ఎవరితో?”

“తెలుగువాళ్ళతో.”

“అరవవారు తెలుగువాళ్ళతో దెబ్బలాడతారా?”

“ఆ!”

అక్కడనుంచి ఏదో పనిమీద వెళ్ళినట్లుగా అనంతలక్ష్మి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోవడం ఇద్దరికీ ఇష్టమే అయింది. అక్కడ ఉండకపోవడమే ఇద్దరూ కోరింది. కోనంగి దగ్గర ఉండకూడదని చెట్టియారూ, చెట్టియారు దగ్గర ఉండకూడదని కోనంగీ కోరారు. ఆ బాలిక ఆ ఇద్దరి భక్తుల కోరిక నెరవేర్చింది.

చెట్టిగారు: “కోనంగిరావుగారూ, మిమ్మల్ని ఎక్కడైనా దిగబెట్టవలసివస్తే మా కారు దిగబెడుతుంది” అన్నాడు.

“ఆ కష్టం మీకు వద్దు. మా కంపెనీ కారు నాకోసం వస్తుంది లెండి.”

“ఎన్ని గంటలకు?”

అప్పుడు సాయంకాలం అయిదుగంట లయినది. అది కోనంగికి తెలుసు. ఆందుకని “రాత్రి తొమ్మిదిగంటలకు” అని అన్నాడు.

చెట్టియారుగారు మండిపోయారు మనస్సులో. పైకి నవ్వుతూ “అల్లాగా అండి. మరీమంచిది. నాభోజనం ఇవాళ ఇక్కడే!” అని అన్నాడు.

“నా భోజనం ఇక్కడ గనుకనే అంతవరకూ ఆగవలసి వచ్చింది.”

“బాగుంది మనం మీ సినీమా విషయం మాట్లాడుకోవచ్చును.”

కోనంగి ఈ మొండిఘటంగాడు తనంతట తాను వదలడు కాబోలు అనుకున్నాడు. కోనంగిని అనంతలక్ష్మి భోజనానికి ఆగమనీ, రాత్రి ఏదైనా సినీమాకు వెడదామనీ, కూడా తమ పనిమనిషిని ఎవరైనా తీసుకువస్తాననీ, తల్లి ఏమీ అనదనీ చెప్పింది. ఇంక అనంతలక్ష్మితో సినీమాకు వెళ్ళడానికి వీలుండదు. ఒక ఉపాయం ఉంది. తెలుగులో ఒక చిన్న చీటిరాసి అనంతానికి అందివ్వాలి. ఆ బాలిక పనిమనిషి కానమోరా సినీ ప్రదర్శనశాలకు వెళ్ళడం తాను కంపెనీ కార్యాలయమూ, నటకుల ఆలయమూ వున్న త్యాగరాజనగరం బయలుదేరినట్లుగా బయలుదేరి కామోరా చేరుకోడం. తర్వాత చెట్టియారు వెళ్ళగానే అనంతం బయలుదేరి వస్తుంది!

కోనంగి తన కంపెనీ విషయాలు తాను మాత్రం చెట్టికి చెప్పదలచుకోలేదు. ఏవేవో గొప్పలుకొట్టి తప్పించుకొందాం అనుకున్నాడు.

కోనంగి: చెట్టిగారూ, ఏ కంపెనీ అయినా ఇప్పట్నుంచే మంచి మంచి సినీమా యంత్రాలు తెప్పించుకు వుంచుకోవాలండీ.

చెట్టి: యుద్ధం మూలాన అనేనా మీ ఉద్దేశం?

కోనంగి: అవును.

చెట్టి: ఎంతకాలం వుంటుందని ఈ యుద్ధం?

కోనంగి: ఎంతకాలం ఏమిటి? పది సంవత్సరాలవరకూ సాగుతుందనే నా దృఢమైన నమ్మకం.

చెట్టి: యిప్పుడు మీ కంపెనీవారు స్టూడియో పెట్టదలచుకున్నారా?

కోనంగి: ఏమో కాని, మన దేశానికి ఎన్నో స్టూడియోలు కావాలండీ! మీరు ఒక గొప్ప స్టూడియో కట్టించాలి! ఏలా వుండాలో ఒకమాటు ఆమెరికా హాలీవుడ్డు వెళ్ళి చూచిరండి.

చెట్టి: అదే ఆలోచిస్తున్నాను.

కోనంగి: ఆలోచిస్తోంటే కాలం చాలదు.

ఈలోగా కోనంగి చీటీ ఏదో తోచక గీకుతున్నట్లు నటిస్తూ రాసి స్నానాలగదికి వెళ్ళివస్తానని లోనకుపోయి, ఒక పరిచారికకు ఆ చీటీ ఇచ్చి అనంతలక్ష్మికి అందజేయమని చెప్పి తాను స్నానాల గదిలోకి పోయాడు.

6

కోనంగి కారు రాగానే వెళ్ళిపోయాడు. కోనంగి వెళ్ళిపోగానే చెట్టిగారికి కాస్త సంతోషం కలిగించింది. ఇక అనంతలక్ష్మి తనదే ననుకున్నాడు. తానే ఆ బాలికతో మాట్లాడుతూ కూచోవచ్చును. ఈ బాలికకు ఆనందం సమకూర్చి మనస్సు రంజింప చేయాలి. తాను మలయా నుంచి, జావా నుంచి, సింహళాన్నుంచి తెచ్చిన విచిత్రవస్తువులు ఖరీదులు కలవి. బర్మా వస్తువులు ఎన్నో ఆమెకు బహుమానాలు ఈయవచ్చును. మంచి మంచి ఇంగ్లీషు గ్రంథాలు బహుమానాలు ఈయవచ్చును. దేశంలో తయారయ్యే వస్తువులు సమర్పించవచ్చును.

మనస్సు కరిగితే ఏ ఏబది వేల రూపాయలు వెల కలిగిన నగనో బహుమతి యిచ్చి కొంచెం దగ్గరకు లాగవచ్చును.

బాలిక తనకు దూరమౌతున్నదని చెట్టియారుకు తోచినకొలదీ, ఆమెమీద కాంక్ష ఎక్కువైపోయినది. ఏ ఉపాయంచేతనైనా సరే ఆ చిలుకల కొలికిని, కులకుల మిఠారిని పక్కకు తార్చాలి. అందుకు ఒక పెద్ద ఉపాయం ఉంది. ముందు జయలక్ష్మిని నిముషంలోకి పక్కలోకి చేరుస్తే కూతుర్ని అర్పించి తీరుతుంది. జయలక్ష్మికోసం తాను తహతహ లాడిపోతున్నట్లు ముందర ఎత్తులు వేయడం అద్భుతమైన ఉపాయం.

ఇంతలో కారు వెడుతున్నట్లు చప్పుడైంది. ఏమిటా అని హాలులోంచి బయటకువచ్చి తన సేవకుణ్ణి అడిగితే అనంతలక్ష్మి సేవకురాలూ వెళ్ళారని చెప్పినాడు. మనస్సు మారిపోయింది. కోపంతో దిక్కులు నల్లబడ్డాయి. దీనిపొగరు మితిమీరిపోతోంది. చెట్టిగారి శక్తి దీనికేమి తెలుసును! ముగ్గురు రౌడీలు యిల్లు కాపలా కాస్తున్నారుకదా అని వీళ్ళకు పొగరు మిన్ను ముట్టుతూంది. 'కోనంగిని ముందు కోనలు పట్టించాలి. అది ముందు తీర్చి తరువాత వీళ్ళిద్దరిపని చూడాలి. కోనంగి వదిలితే అనంతలక్ష్మి శక్తి ఉడిగిపోతుంది. ఒత్తిడి కొంచెం కొంచెంగా ఎక్కువ చేయాలి.

చెట్టియారు జయలక్ష్మితో మాట్లాడడానికి లోనికి వెళ్ళినాడు. వంటలక్కతోపాటు జయలక్ష్మి ఇంట్లో అన్నీ సర్దుకుంటూ ఉంది.

చెట్టియారు: "జయలక్ష్మి' అని పిలిచాడు. 'ఎందుకు స్వామీ!' అని అంటూ ఆమె ఇవతలికి వచ్చింది.

“జయా! నీ కోసం కొన్ని బహుమానాలు పట్టుకు వచ్చాను.”

“ఏమిటండీ ఆ బహుమానాలూ?”

“ఓరే కోవాలన్! కారులోవున్న పాకెజీలన్నీ పట్టుకురారా!” అని చెట్టియారు కేక వేశాడు. సేవకుడు అట్టకాగితాలతో చుట్టబెట్టివున్న నాలుగు పాకేజీలూ తీసుకు వచ్చాడు.

తానే స్వయంగా పాకేజీలన్నీ విప్పినాడు. బర్మాలో పనిచేసిన ఒక వెండి బుద్దుడు నీలాలే కనులు, బంగారు పద్మంపై కూర్చుని ఉన్నాడు. ఆ పనితనానికి ఎవరైనా ముగ్గులు కావలసిందే. జయలక్ష్మి ఆశ్చర్యంతో నిండిపోయి “ఈ బొమ్మ నాకేనా, లేక అమ్మిణీకా?” అని ప్రశ్నవేసింది.

“ఇది నీకే, ఇంకోరికి ఎల్లా ఇవ్వగలను?” అని అంటూ ఆమెవైపు మెరుములా ఒక చూపు పరపి, మళ్ళీ తలదించి, రెండవపాకేజీ విప్పడం ప్రారంభించాడు. సింహళ శిల్పపు పనితనంలో ఒక కంఠపు గొలుసుకు, నాయకమణిగా ఒక పచ్చ, చిన్న చిన్న పచ్చలు ఇరువది ఏడు ఉన్నవి (పచ్చల తారహారము) ఒకటి తీసినాడు.

మూడవ పాకెట్టు విప్పినాడు. అందులో బలిదేశపు లక్కబరిణ ఉన్నది. ఆ బరిణలో ఒక వజ్రపుటుంగరము నాగముల కౌగిలింతగా పని తీర్చినది ఉన్నది. నాల్గవకట్ట విప్పినాడు. అందులో జపానులో తయారైన ఉత్తమజాతి సిల్కుచీర గుడ్డమీద బంగారు పూవులూ, లతలూ ఉన్నాయి. అంచు బెనారసు పనివాళ్ళుకుట్టారు. తొమ్మిది గజాలచీర పిడికిట పట్టవచ్చును. అవన్నీ చూచి విభ్రమాశ్చర్యాల మునిగిపోయి, జయలక్ష్మి “ఇవన్నీ ఏమిటండీ చెట్టిగారూ?” అని అన్నది.

ఆమె మాటలు అస్పష్టంగా వినబడ్డాయి. ఆ వస్తువులన్నీ పది పది హేను వేలుంటాయి అని జయలక్ష్మి అంచనా వేసింది.

“ఇవన్నీ నీ కోసం పట్టుకొచ్చాను జయలక్ష్మీ! నీకు ముప్పయి ఎనిమిది అయినా, పదిహేనేళ్ళ బాలికలా ఉంటావు. నీ అందం ఎవరికి వుంది ఈ మద్రాసంతలోనూ? అయ్యంగారు నీ కోసం సర్వం అర్పించాడంటే ఆశ్చర్యం ఏమిటీ! నా సర్వస్వం నీవే!” అని గుటక మింగినట్టు ఆగి, ఆమెను కళ్ళతో కబళించాడు.

జయలక్ష్మి ఆశ్చర్యం మిన్నుముట్టింది. మాట రాలేదు. అనేకులు ఆమెను ఆశించారు. కాని, ఇతడు తన కూతురు పెండ్లికై కోరి వస్తున్నాడనుకొంది. తనకన్న రెండు మూడేళ్ళు చిన్న. పాపం తన్ను ఎంత వాంఛించాడో వెర్రి కుర్రవాడు. తన దేహం వాంఛించాడు. తన సౌందర్యం వాంఛించాడు. ఇప్పటికి తన్ను ఎంతమంది జమీందారులు వాంఛించడం లేదు! తన అందం ఏమీ తీసిపోలేదనీ, అంతకన్న అంతకన్న ఎక్కువైందనీ, అనేకులు ఉత్తరాలు రాస్తూంటారు.

కాని ఈ కుర్రవానికి వర్తక వ్యాపారాదులు తెలిసినట్లు ప్రేమ విషయాలు ఏమి తెలుస్తాయి? ఆమెలో మాతృత్వము ఒక్కసారి పైకుబికింది. తనకు బంగారు కూతురితోబాటు బంగారు కొమరుడు కలుగలేదు.

ఆమెకు అతని తలపై చేయివేయవలెనని బుద్ధి కలిగింది కాని, అది ఈ చెట్టి తప్పు అభిప్రాయం చేసుకోవచ్చు ననుకుంది.

ఆమెలోని స్త్రీత్వము అతని ప్రేమోపాసన వాక్యాలకు ఉప్పొంగింది. ఆమెలోని దేవీత్వము, తాను నిజంగా ప్రేమించిన పురుషుడొకడుండి, తనకు ఒక విధంగా తాళికట్టిన భర్త అయి తన్ను విడిచి వెళ్ళిపోయినప్పుడు, వేరొక్క పురుషుడు ఇతడు అని తెలిసింది. ఆమెకు కోపం వచ్చింది. దుఃఖము వచ్చింది. నవ్వు వచ్చింది. ఆమెలోని మాతృత్వము కూతురికై భయపడింది. తాను తన కూతురుకన్న అందమైందా? తన కూతురును వాంఛించి వచ్చినవారు ప్రతి యువకుడూ తన్ను వాంఛించడం మొదలు పెట్టాడా? ఆమే గజగజలాడిపోయింది.

ఆమె తలవంచుకొనే ఉన్నది. ఇంతలో చెట్టియారు పాములా చేయి ఆమె భుజంమీద వేశాడు. ఆమె ఉలిక్కిపడింది. మత్తు నుంచి మెలకువ వచ్చింది. ఆమె కోపంతో మండిపోయింది.

వెంటనే వెనక్కుతగ్గి “చెట్టిగారూ! మీరు చాలా మంచివారు. జగత్ర్పసిద్ధి పొందిన అనేకమంది సౌందర్యవంతులైన బాలికలను కూర్చుకొని మీరు స్త్రీవాంఛతృప్తి తీర్చుకొంటున్నవారు. అలాంటి మీరు నన్ను ప్రేమిస్తున్నారంటే నమ్మను. నాకు మీ బహుమానాలు వద్దు! ఇంకో విషయం మనవి చేస్తున్నాను. మా అమ్మాయి కోనంగిని ప్రేమిస్తోంది. ఆమె మిమ్ము వివాహం చేసుకోదు. నేను మిమ్ము ప్రేమించలేను. మీకున్న ఆస్తి నంతనూ ధారపోసినా నాకు అక్కరలేదు. ఇక్కడ నుండి మీ స్నేహం మాత్రం కావాలి, సెలవు” అని తెలిపింది.

ఆమె వెంటనే తన పని మనుష్యుని ఒకర్ని రమ్మని కేక వేసి, ఆ ప్యాకెట్టులు కట్టమనిన్నీ, చెట్టిగారి కారులో పెట్టమనీ చెప్పి తాను లోపలికి వెళ్ళిపోయింది.

7

ఆ రోజు పగలు మదరాసుకు ఇరవైమైళ్ళలో ఒక పొలంలో బాహ్యప్రదేశ చిత్రగ్రహణం (అవుట్ డోర్ ఘాటింగ్) చేస్తున్నారు సినీమా కంపెనీవారు.

అంతకుముందు పదిరోజుల నుండి అక్కడ ఉన్న మామిడితోటలో నటీనటకులకూ, శబ్దగ్రాహక ఛాయాచిత్రగ్రాహక కళానిపుణులకూ, వారి సహాయులకూ, సహాయ దర్శకులకూ, ఇతరులకూ డేరాలు, పాకలు వేశారు. బల్లలు, కుర్చీలు, మంచాలు వచ్చాయి. వంటశాలలు ఏర్పాటయ్యాయి. అక్కడ ఒక చిన్న గ్రామం సిద్దమయింది.

నాయకుని వ్యవసాయ చిత్రాలు, పల్లెటూరి జీవితము, పంటకోత మొదలయినవన్నీ తీయవలసి వుంది. వేషాలువేసే డేరాలలో మగవారి డేరావేరు. ఆడవారి డేరాలు వేరు. అలంకారిక శిల్పి స్వయంగా నాయికా నాయకాది ముఖ్య నటీనటకులకు, సాధారణ పాత్ర ధరించి నటకురాలయిన జవ్వని, సుందరి అయిన యువతులకూ స్వయంగా వేషాలు వేస్తాడు.

అతడు మదరాసులో పేరు పొందిన అలంకారికుడు. మొదట నాటకాలలో పాత్రలకు వేషాలు వేస్తూ ఉండేవాడు. ఇప్పుడు గొప్ప అలంకారికుడై పోయాడు.

అతనికి వేషమేమిటి, ఔచితి ఏమిటి, భావమేమిటి అనేవి అవసరం లేదు. తాను వేషందిద్దిన స్త్రీలు బంగారు బొమ్మలు, తాను తీర్చిన పురుషులు మన్మధుళ్ళు.

ఇంక కళా దర్శకుడు చిన్నతనాన్నుంచీ ఫోటోలు చూచి నూనె బొమ్మలు రాసుకునే శిల్పి. అతనికి చారిత్రక దృష్టి, భావగంభీరతా, కళా చమత్కృతీ ఏమీ తెలియవు. డైరెక్టరులలో ఒకరికి స్నేహితుడు. అందుచే అతన్ని ఏర్పాటు చేశారు.

ఇంక వీరిద్దరి హంగామా వర్ణనాతీతం. కోనంగికి నవ్వు వచ్చేది. డాక్టరుగారి చెవిలో వేశాడు.

డాక్టరు రెడ్డిగారు స్వయంగా ఏమీ తెలియనట్లు అన్నీ చూచాడు. కళాదర్శకుడు ఏం చేస్తాడు? ఛాయాచిత్రకోణం (యాంగిల్) తెలియదు. గంభీరత తెలియదు. వేషాలకూ రంగస్థలానికీ సామ్యమూ చుట్టరికమూ తెలియదు. ఆయనకు ఎంత సేపూ నాటకాల రంగస్థలమే ఎదుట ప్రత్యక్షము.

"నటకులు అభినయించకుండా ఎందుకు అడ్డంగా కుర్చీలూ, సోఫాలూ అని అనేవాడు. అందరికీ నగలూ, మాంచి బట్టలూ, ఎప్పుడూ ఉండాలని వాదన. అసలయిన వజ్రం ఉంటేనేగాని సినీమాలో బాగా ఉండదట. “గాజు రాళ్ళేమిటి?” అని వాదించేవాడు. ఖరీదు తక్కువైనా అనుకరణ దుస్తులు, అనుకరణ భవనాలూ ఛాయాచిత్రగ్రహణంలో చాలా బాగా వస్తాయి అని అతనికి ఇదివరకు చిత్రాలలో పనిచేసినవారు ఎంత చెప్పినా ఆయనకు నచ్చలేదు. వారికి కోపాలూ వచ్చాయి, విసుగూ ఎత్తింది. దర్శకునికి మాత్రం ఆ విషయాలు తెలిస్తేకదా.

ఇంక అలంకారికుడు వేషందిద్దే సమయమే వేయి రూపాయల ఖరీదంటాడు. వేషం వేసే ప్రతి అమ్మాయి కడ నుండీ బహుమతులు చక్కనివి దొరుకుతాయి. ధనమే కాదు. పెదవులదుముట, ఒకరితో ఒకరి హృదయాని కదుముట, ఒకరు యింకో బహుమతీ, ఈలా ఈలా ఉంటాయి.

సినీమాలకు వచ్చిన అమ్మాయిలలో ముగ్గురు ఆరితేరినవారు. నలుగురు ఆరితేరదలచుకొన్నవారు. తక్కిన ఆరుగురిలో సగంమంది ఆరితేర వచ్చును. ఆ సగంలో ఒకతి వట్టి వెట్టిది. తక్కిన ఇద్దరి విషయంలో జాగ్రత్త! “కొందరు బాలలకు పక్షీంద్రు లుంటారు” అని ఒక సినీమా అనుభవశాలి అన్నాడు కోనంగితో.

కోనంగి: ఎవరా పక్షీంద్రులు? ఏమిటి వారి పని?

అనుభవశాలి: “తనవెంటన్ సిరి, లచ్చివెంట అవరోధవ్రాతమున్ దాని వెన్కను పక్షీంద్రుడు.”

కోనంగి: దాని వెంట ఉండేవాడో పక్షీంద్రుడు? అవునండో, చాల మంది తారల వెనకాల ఆ తారల బృహస్పతులు కాని వారు కనబడుతున్నారు.

అనుభవ: వారినే చంద్రులు లేక పక్షీంద్రులు అంటారు.

ఆ రోజున చిత్రగ్రహణం చురుకుగా సాగుతోంది. పొలమూ, పశువులూ, కూలీలూ, కోతకోసేవారూ, ఆడకూలీలూ, మొగకూలీలు కలిసి కుప్పలు వేయడం, పాటలు పాడటం, రంగం తర్వాత రంగం తీసిపార వేశారు.

రంగము 93--పొలం--బాహ్యరంగం


పాత్రలు:

 ముగ్గురు పొలం కాపులు
కథానాయకుడు
కథానాయిక

ధ్వని:

దూరాన పొలం కేకలు
పక్షుల కూతలు
పశువుల అరపులు
సంభాషణ.


వస్తువులు:

పొలం దున్నేందుకు మూడు నాగళ్ళు
మూడుజతల ఎద్దులు
మూడు కర్రలు
తాటాకు గొడుగు
చాప
గడ్డపార
పాట
రాట్నం
దూది


వేషాలు: 1

 కథానాయకుడు
పంచె కట్టు
బనీను
తలపాగా
కాళ్ళకు పల్లెటూరి చెప్పులు


2

కథానాయిక చీర ఎర్రది
రవిక పువ్వులదీ
తలముడిలో పూవు
గాజులు ఎర్రవి 2 జతలు
మంగళసూత్రము
మెళ్ళో పూసల పేరు
బొట్టు
కాళ్ళకు చెప్పులు


3

కాపులు
పంచేలు ముగ్గురికి
ఇద్దరికి చొక్కాలు
ఒకడికి చొక్కాలేదు, బనీనూ లేదు.
కాళ్ళకు పల్లెటూరి చెప్పులజోళ్ళు
తలపాగాలు
ఒకరికి చేతులకు వెండి మురుగులు
(అతనికీ చొక్కా ఉండదు.)


నటన:

1. పొలం దున్నడం
2. కథానాయిక తాటాకు గొడుగు క్రింద రాట్నం వడుకుతూ ఉంటుంది.

3.

కథానాయకుడు గట్టుప్రక్క త్రవ్వి బాగుచేస్తూ ఉంటాడు
కథానాయికకు కొద్దిదూరంలో


4.

రైతులు పొలం ఈ చివర నుంచి ఆ చివరకు కథానాయకుడూ నాయిక ఉన్నచోటికి నాగళ్ళు తోలుతూ వస్తూ వేడుతూ ఉంటారు
ఆ సమయంలో మాట్లాడుతూ ఉంటారు .


సంభాషణ:

కథానాయకుడు: (త్రవ్వుతూ) ఈ యేడు పంటలు బాగా పండితే మన అప్పు తీరిపోతుంది.

నాయిక: పొలంపనేనా, ఇంకా మనం ఈ గ్రామానికి ఇతర సహాయాలు ఏమన్నా చేయవద్దా?

నాయకుడు: రైతుసంఘం స్థాపించామా, రాత్రి పాఠశాల నడుపు తున్నామా, నా రాణీ.....

నాయిక: వేళాకోళానికన్నా నన్ను రాణి అనకండి!

నాయకుడు: ఏమి అనమన్నావూ?

నాయిక: స్నేహితురాలా అనండి..

నాయకుడు: వట్టి చప్పగా ఉంది ఆ మాట. ఆత్మేశ్వరీ ఆంటాను.

నాయిక: అది బాగుండదు. నేను ఈశ్వరినా, శాంభవీ శాకినీ ఢాకినీనా!

నాయకుడు: ఏమన్నావు నరసూ?

నాయిక: నరసూ ఏమిటి? నరుసులాగ, నేను నరసు కాఫీనా?

నాయకుడు: ఓ రైతుపిల్లా! ఏంటంటవు?

నాయిక: నన్ను రైతుపిల్లా అనకండి!

నాయకుడు: ఏమిటీ నేతి నీతి?

నాయిక: నేను నెయ్యీకావా లనలేదు. నూనే కావాలనలేదు.

నాయకుడు: ఆముదం కావాలనలేదు పుట్టబోయే చిన్నబిడ్డకు?

నాయిక: నాకు సిగ్గు కలిగించే మాట అనకండి!


నాయకుడు:

 సిగ్గుమాలిన బాల
ఎగ్గు ఎరగని బేల
నీలాల ముంగురుల
వాలుచూపుల గోల!


నాయిక:

 పారపట్టిన రైతు
సారమెరుగని రైతు
రైతునంటూ తిరుగు
రంగేలి నా రాజు


నాయకుడు:

 నన్ను రాజనబోకు


నాయిక:

 నన్ను రాణనవోకు


నాయకుడు:

 బంగారు నేలలో


నాయిక:

 పసిడి పండేవేళ


రైతులు:

 బంగారు నేలలో
పసిడి పండిస్తాము
దేశాల మా పంట
దివ్యాక్షతలు కావ?

అందరూ:

 బంగారు నేలలో

పసిడి పండిస్తాము

బంగారు మా నేల మాకుండగానూ

పసిడి మాకేల!

పసిడి మా కేల?


కెమేరా: 1 దగ్గిర గ్రహణం (క్లోజ్ షాట్) పొలంలో భూమి నాగేటిచాలుగా మారుతో వుంటూ జరిగిపోతోంది - 5 అడుగులు! కోణం ప్రక్కనుంచి.

2. చాలా దూరం అవుతూ వుంటుంది. మధ్యగ్రహణం (మిడ్షాట్) చాలూ, మేడితోకా, వెనక రైతూ కనబడతారు.

3. ఇంకా దూరం - మధ్యదూరం (మిడ్ లాంగ్ షాట్) నాగలి, ఎద్దులు, రైతూ కనబడతారు.

4. దూరం - దూరగ్రహణం (లాంగ్ షాట్).

5. కెమేరా నెమ్మదిగా తిరుగుతూ పొలం చూపెట్టుంది.

6. రాట్నంమీద వాలుతుంది మధ్యగ్రహణం. రాట్నం తిరగడం. కొంచెం రాట్నం తిప్పుతూ దారం ఒడికే నాయికను చూపెట్టుంది.

7. ఇంకా కదులుతుంది కెమేరా; తవ్వే నాయకునిపైన వాలుతుంది.

8. ఎ. బి. సి. డి. ఇ ఎఫ్. జి. హెచ్. గా కెమేరా విభజన ఇంతవరకూ!

9. ఇక్కడ నుండి సంభాషణలు, (మిడ్ షాట్లు) నాలుగు క్లోజప్పులు నాయిక, మూడు నాయకుడు.

10. నాయకుడు మాట్లాడుతూ వుంటే నాయిక ప్రేమచూపుల క్లోజప్పులు నాలుగు. మూడు ముఖములు మాత్రం, ఒకటి కన్నులు మాత్రం. నాయకునిది ఒక క్లోజప్పు ముఖం మాత్రం.

షరా: ఈ అయిదు క్లోజప్పులూ ఆయా ఇంగ్లీషు అక్షరాల క్రింద ఒకటి, రెండు, నాలుగయిదు.

8

అలా ఉంటుంది బొమ్మతీసే వ్రాత. దీన్నే “ఘాటింగ్ స్ర్కిప్టు” అంటారు.

కోనంగి కొంచెం బంగారుఛాయ మనుష్యుడు కాబట్టి హాలీవుడ్లు మేక్స్ ఫాక్టరు కంపెనీవారి వేషధారణ రంగులలో 26వ నంబరు క్రీము మొగం అంతా రుద్దుకొని బాగా అద్దుకొని మర్దనా చేసుకొన్నాడు. ఆ తర్వాత ఆ నంబరు ద్రవపదార్థం పెట్టి మర్ధనా చేసుకొన్నాడు. ఆ తర్వాత ఆ నంబరు పొడితో మొగం అద్దుకొన్నాడు. అప్పుడు వేషం తయారుచేసే ఆయన, కళ్ళకు, రెప్పలకు, కనుబొమ్మలకు నల్లరంగు వేశాడు. పెదవులకు కొంచెం ఎరువు దిద్దాడు.

మెడకూ చేతులకూ ఆ నంబరు ద్రవపదార్ధము రాసుకొని పొడి జాగ్రత్తగా అద్దుకోన్నాడు కోనంగి.

మేక్స్ ఫాక్టరు మొదట ఒక పెద్ద సినీమా కంపెనీలో వేషాలువేసే కళాకారుడు. అదివరకున్న రంగులు దేహానికి హానికరమని ఎంచి బాగా పరిశోధనచేసి కొత్తరంగులు కనిపెట్టాడు. సినీమాలో ఛాయాగ్రహణం వర్ణవిభేదవిధానరూపమై పరిణమించి, గ్రహణపు బద్దెలు సకల వర్ణఛాయా గ్రహణశక్తి సంపాదితములుగా (ఫాన్ క్రొమాటిక్) తయారు చేయబడినవి. ఆందుకు తగినట్టే సర్వవర్ణాత్మిక వేషధారణ వర్ణాలు మాక్స్ఫాక్టరు తయారు చేశారు. అప్పటి నుంచీ సినీమా లోకం అంతా అదే వాడు తున్నది.

వేషం అయిన తర్వాత ముదురు పసుపురంగు వేసిన పంచెలు, చొక్కాలూ ధరించాలి. అవి అయితేనే చిత్రంలో తెల్లగా కనబడతాయి. ముదురు ఎల్లరంగు ముదురు నల్లరంగుగా కనబడుతుంది. ఆకుపచ్చరంగు మధ్యరకం నలుపుగానూ, నీలం లేతనలుపుగానూ కనబడుతుంది.

నాయిక వేషం వేసే అమ్మాయికి అంతా కొత్త అయినా, కొంచెం గడుసుపిల్ల కాబట్టి త్వరలో సినీమా విధానాలన్నీ నేర్చుకొంది. పాటీగారూ, మేనేజింగు డైరెక్టరూ, కంపెనీ డైరెక్టరూ, ఛాయాగ్రాహకుడూ, శబ్దగ్రాహకుడూ, వేష కళాకారుడూ, కళా దర్శకుడు అందరూ ఆమెను వాంఛించారు.

ఆమెకు దేహం అమ్ముకోవడం కొత్తకాదు. చక్కగా పాడగలిగి, అందమైన మొగమూ, పొంకమైన దేహమూ కలిగిన ఆ బాలికకు రుసుము చెల్లించే ప్రేమికుల కేమిలోటు?

కాని సినీమాకు యిదే మొదటిసారి రావడం. సినిమా జీవితాన్ని గురించి బాగా పాఠాలు నేర్చుకుని ఉండడంవల్ల కొంచెం బెట్టుగా ఉండేది.

మేనేజింగు డైరెక్టరుగారికి రెండు మూడుసార్లు తృప్తి తీర్చింది. రెండు మూడునెలలయిన వెనుక ఆయనకు దొరికేదికాదు. తక్కిన కంపెనీ డైరెక్టర్లకు రెండు మూడు కౌగిళ్ళు, నాల్గయిదు చుంబనాలు, అయిదారు సార్లు టీలు, ఫలహారాలు మాత్రం అర్పించి, అంతకన్న వారిని ముందుకు సాగనీయక తప్పించుకుంది.

పాటీగారికి మొహమాటం. కొంచెం భయస్తుడు. లోపల కోర్కెవుంది. కాని ఎవరేమనుకుంటారో! మొదటసారి దర్శకునిగా వీలువచ్చింది. అది పాడుచేసుకుంటే ఏలాగు?

సంగీత దర్శకుడు అమ్మాయికి ఆమె ఇంటి దగ్గరే పాఠాలు చెబుతున్నాడు. అయనకు మంచి వరసలు ఇచ్చినందుకు ఇంటి దగ్గిర తయారు చేసేందుకు ఎప్పుడైనా రుసుముగా ఆమెనే పుచ్చుకుంటున్నాడు. అతడు ఆరితేరిన ఘటం. అందరికీ పాఠాలు నేర్పడంలో దిట్టమైన చేయి.

బాగా వేషం వేస్తాడని వేషాలరాయడిగారికి ఒకటి రెండుసార్లు ఆమె అతనికోర్కె తీర్చింది. అదే పదివేలనుకున్నాడు.

కెమేరా దర్శకుడు పాడుచేస్తే కొత్తరూపం, శబ్దగ్రాహకుడు పాడు చేస్తే గార్ధభకంఠమూ తయారవుతాయి. అందుకని వారాని కొకసారి వారి తొందర తీర్చేది.

ఇంతమందిని ఆమె సంతృప్తిపరచింది. కాని ఆమె స్త్రీ అందులో బాలిక, అందులో గడుసుది, జాణ, ఆమెకు హృదయం ఉంది. ఆమెకు కూడా వాంఛ ఉంది, ఆమె తగిన పురుషుణ్ణి కోరుకుంటుంది. ఆమె హృదయం కోనంగిని వాంఛించింది. తనకు మంగళసూత్రం కడతాడు (ఆ రంగం ఇంకా తీయలేదు). ఈలోగా భార్యభర్తలుగా ప్రేమరంగాలు అవుతున్నాయి. చిన్నవాడు, పెళ్ళికాలేదు, అందగాడు, తెలివైనవాడు, సర్వదా సంతోషంగా ఉంటాడు. అందరినీ నవ్విస్తూ వుంటాడు. వట్టి అనాఘాత పుష్పంలా ఉన్నాడు. ఈగవాలనీ రసగుల్లాలో ఉన్నాడు. వాయి తీసిన యిట్టెనులా ఉన్నాడు.

ఆమె అతన్ని గాఢంగా వాంఛించింది. ఆమె అభినయంలో, మాటలలో ఆ గాఢతా, ఆ వాంఛా వ్యక్తమౌతూ ఉంది. కాని కోనంగి అంటీ అంటనట్టున్నాడు. అతని అభినయం కూడా ముభావంగానూ, త్రపాపూరితంగానూ ఉంది.

ఇదంతా డాక్టరు రెడ్డిగారు చూస్తున్నారు. అయినంతమట్టుకు యెలావుందో చూచుకుంటే కథానాయకుడు సిగ్గుపడుతున్నట్లు, అతనికి ప్రేమకన్న మర్యాద ఎక్కువగా ఉన్నట్లు కనబడింది.

డాక్టరుగారు కోనంగితో చాలాసేపు తమ ఇంటిలో వాదించారు. ప్రేమ అనే ఒక దివ్యభావం ఉందంటే నేను ఒప్పుకోను కోనంగ్! కాని స్త్రీ పురుషుల మధ్య నుండే భావం పశుభావం కాదని నువ్వు వాదించావే, ఆ వాదనంతా నీ అభినయంలో ఏమైపోయింది?” అని ప్రశ్నించాడు.

కోనంగి: ఆమె వేశ్యవృత్తిలోవున్న బాలిక కాదయ్యా మరి!

డాక్టరు: అయితే నిన్ను ఎత్తుకుపోయిందా? కోనంగి: కాని బజారు వస్తువు అని తెలియడంవల్ల నాకు జుగుప్స.

డాక్టరు: ఆ బజారుతనం నీకు కూడ వస్తుందనా? కోనంగి: కాదు.

డాక్టరు: కాదూలేదు, గీదూలేదు! అభినయం నిజం అనుకుంటున్నావా?

కోనంగి: అనుకోటంలేదు. నిజంలో నుంచి ఇంకా అభినయంలోకి దిగలేకుండా ఉన్నాను.

డాక్టరు: అయితే బొమ్మంతా తగలడిపోతుంది.

కోనంగి: ఎట్లాగ?

డాక్టరు: ఆ అమ్మాయి ఎంత చక్కగా అభినయిస్తోంది. నీ మీద కన్ను వేసిందనుకుంటాను.

కోనంగి: అందుకనే అంత బాగా అభినయిస్తోంది.

డాక్టరు: బడాయి కూడానా! కాని నువ్వు నీరాణీని అనంతలక్ష్మిని తలచుకో!

కోనంగి: ఛా! ఛా! మా ప్రేమ పవిత్రమైంది.

డాక్టరు: ఏమిటా పవిత్రత? పవిత్రం ఏమిటి, అపవిత్రం ఏమిటి?

కోనంగి: బాబూ! ఆ విషయాలు ఇంకోసారి వాదించుకుందాములే! నన్ను కోపంచేయకు తండ్రీ!

డాక్టరు: కోపమా, కోపమన్నరా? ఇంత డబ్బు పెట్టి తీస్తున్న చిత్రమూ, నీ అభినయంవల్ల తగలబడవలసిందేనా? ఎప్పుడూ నిజం అనుకునేటట్లు అభినయిస్తావే! జీవితంలో అభినయమూ నాటకంలో జీవితమూనా నీ వ్యాపారం? రాఘవాచారిగారిని చూడు. ఆయన చెప్పిన విషయాలు మరిచిపోయావూ?

9

కోనంగి తన ప్రేమాభినయంలో లోటు వుందని గ్రహించాడు. కారణం, తనలోని భయం. ఆ భయం ఎందుకు కలగాలి? నాయిక పాత్ర వేసే అమ్మాయిని తన హృదయం మెచ్చుకొంది. ఆమెను స్త్రీగా తాను వాంఛింపలేదు, నిజమే. కాని ఫ్రాయిడ్ అన్నట్లు తన హృదయాంతరము ఆ బాలికను తన స్త్రీగా చూడటం ప్రారంభించింది. హృదయమూ, మనస్సూ ఆ వాంఛను అసహ్యించుకుంటున్నాయి. తాను సంపూర్ణ హృదయంతో ప్రేమించింది అనంతలక్ష్మిని. ఆ ప్రేమ హృదయాంతరములోని వాంఛను ద్వేషించింది. ఈ కలతచేత తన అభినయం కుంటుపడింది. ఈ కుంటుపడడానికి ఇంకో ముఖ్యకారణం లేకపోలేదు.

ఆ బాలిక తన్ను నిజంగా ప్రేమించినట్లో, వాంఛించినట్లో తన అభినయంలో స్పష్టంగా వ్యక్తం చేస్తున్నది.

మొన్నటిరోజున ఆ సాయంకాలదృశ్య రంగం తీసేసమయంలో తన్ను వెనుక నుంచి వచ్చి కన్నులు మూసిన తర్వాత మెడచుట్టూ చేతులు చుట్టి, తన జుట్టు తడిమి తన తల ప్రక్కకు త్రిప్పి చుంబించబోయినట్టు నటించవలసి వచ్చినప్పుడు, ఆమే తన్ను నలిగి పోయేటట్టు కౌగిలించుకొని, తల ముద్దెట్టుకొన్నది. ఆమె కళ్ళు వింతకాంతులతో వెలిగిపోయాయి. ఆ సమయంలో తాను జుగుప్సతో బిగుసుకుపోయినాడు. అప్పుడు దర్శకుడు “కోనంగిరావుగారూ, కొంచెం హుషారుగా ఉండండి” అని ప్రార్థించాడు. “తక్కిన విషయాలలో మీ అభినయం అద్భుతం” అన్నాడు..

ఈ అమ్మాయితో ప్రేమ అభినయించినా అది నిజమనుకుంటుందేమో అని అతడు భయపడినాడు. ఏదో కాలేజీ సహాధ్యాయినులతో మాత్రం మాట్లాడగలిగిన తాను సినీమా తారలతో తను మామూలు ధోరణీగా చనువుగా ఏలా ఉండగలడు? ఈ జీవితమే అతనికి కొత్త అయినా ప్రయత్నించి మెప్పుపొంద నిశ్చయించుకొన్నాడు.

అక్కడనుంచి అతడు దివ్యంగా అభినయించడం ప్రారంభించాడు. “జీవిత మొక బొమ్మల ఆటగా” కాక, జీవితమొక నవ్వుల తోటగా చూచు కొనే కోనంగి ఈ అభినయంలో జీవిత మొక ఏడుపు పాటగా, జీవితమొక బాధల బాటగా కూడా అభినయించాడు.

డాక్టరూ, దర్శకుడూ చివరకు కథానాయిక కూడా ఎంతో మెచ్చుకోడం సాగించారు. ఒకసారి అతడు ఒక గుండెపగిలే దృశ్యం అభినయిస్తోంటే సెట్టుమీద వారందరికీ కళ్ళ నీళ్ళు తిరిగాయి.

అనంతలక్ష్మి తల్లితో కలిసి ఒకసారి సినీమా చూడడానికి వచ్చింది. ఆ రోజున స్టూడియోలోని ఒక పెద్ద భవనపు సెట్టింగులో కథానాయకుడూ తండ్రి పోట్లాడుకోవడమూ, కథానాయకుణ్ణి తండ్రి కోపపడడము, కథా నాయకుడూ తల్లీ ఈ విషయాలు మాట్లాడుకోవడమూ? కథానాయకుడు తన గదిలో వరండాలో హాలులో ఆలోచించుకొంటూ తిరగడమూ, చివరకు తన గ్రంథాలయంలో ఒక గ్రంథం యాదాలాపంగా చూస్తే, అది అష్టమ ఎడ్వర్లు ఎందుకు రాజ్యం త్యాగం చేశాడు అనే పుస్తకము అవడమూ, ఆ పుస్తకం తీసి చూస్తూ ఆ పుటలలో ఎడ్వర్డూ, అతని ప్రియురాలు డచ్చెస్ బొమ్మ చూచి, ఆ బొమ్మ తన యొక్క తన ప్రియురాలి బొమ్మగా చూడడం, అంతటితో నాయకుడు ఒక నిర్ధారణకు వచ్చి, ఇల్లు విడిచిపెట్టి కట్టుగుడ్డలతో వెళ్ళిపోవడానికి నిశ్చయించి, తండ్రికీ, తల్లికీ ఉత్తరాలు రాసిపెట్టి వెళ్ళిపోవడమూ రంగాలు తీస్తున్నారు.

అవన్నీ అనంతలక్ష్మి చూచింది. ఆమె తన మనోనాయకుని అభినయ సామర్థ్యము చూచి ఆశ్చర్యం పొందింది. ఆ రోజు ఈమె రావడంవల్ల కాబోలు కోనంగి చార్లెస్ బోయరు, చార్లెస్ లాటన్ మొదలయిన ఉత్తమ నటకులకన్న ఎక్కువ అందంగా నటించాడు.

ఆ రాత్రి నాయకుడు ఒక్కడే తన గదిలో ఆలోచించుకొంటూ, తన హృదయంలో నుంచి వెల్లువలై పారిన ఆవేదనను పాటగా పాడినట్లు కోనంగి అభినయిస్తూ

“ఏది దారని ఎవరినడిగెద

ఏది నిజమని ఏల వెదికెదవో?

ఆలసించిన అమృతమేనా

కాలకూటముగాక, మారుని

వేళదాటిన వేడుకేలా

వెక్కిరింతేగా?

బ్రతుకు యాత్రలో విధము తెలియక

బాటకాదిది బాట అది అని

మనసు తెలియని మనుజు డెవడో

వాడు నాశనమే!”

అని పాడుకొంటూ కుర్చీలో కూలబడినాడు. ఆ పాటా, ఆ పాట పాడిన గంభీర మధుర కంఠమూ ఆ సెట్టులో ఉన్నవారందరి గుండెలూ నలిపివేశాయి,

నాయకుని పాట వింటూ, అతని తల్లి గదిలోనికి వచ్చి “నాన్నా! ఏమి చేయదలచుకొన్నావు?” అని అడిగినట్లు ఒక రంగంలో అభినయం ప్రారంభం.

నాయకుడు: ఏం చేయమంటావు? నువ్వు అంతా చూస్తున్నావు. నీ సలహా ఏమిటి?

తల్లి: ఒరే నాన్నా! ఒక్క కొడుకువు! ముగ్గురు ఆడపిల్లల తర్వాత పుట్టావు నీ మీద మీ. నాన్నగారికి ప్రేమలేదంటావా?

నాయ: ఇక్కడ నాన్నకు ప్రేమలేదన్నమాట ఏమి వచ్చిందమ్మా? ప్రేమ వేరు. ఒక పురుషుని జీవితమార్గం ఏర్పరచుకోవడం వేరు.

తల్లి: ఏమి టా జీవితమార్గం?

నాయ: రాక్షసులుచేసే ఉద్యోగాలు చేయడమా అది? బానిస అవడమా దారి? ఎందుకమ్మా నాకా డిప్యూటీ కలెక్టరు పదవి. నాన్న స్నేహాలవల్లా, నేరుపువల్లా ఆ ఉద్యోగం ఎం.ఏ. ప్యాసయిన రెండో సంవత్సరమైన ఈ ఏడే నాకు తెప్పించిపెట్టారు.

తల్లి: నాన్న తెప్పించడమేమిటి? నువ్వే ఆ పదవికి పెట్టిన పరీక్షలో మొదటగా వచ్చావుటగా?

నాయ: నిజం విను, అమ్మా! నేను ఆ పరీక్షలో బాగా కృతార్థుడనయ్యే ఉంటాను. కాని మొదటివాడుగా రావడానికి కారణం నాన్నగారే! ఆయనకూ ఆ పరీక్షకు ఒక ముఖ్యమైన జవాబు పత్రం దిద్దిన ఒక పెద్ద కలెక్టరుగారికి యెంతో స్నేహం. ఒకరివల్ల ఒక రెంతకాలం నుంచో ఉపకారాలు పొందారు. ఆయన నాకు ప్రథమ స్థానం యిప్పించారు.

తల్లి: మీ తండ్రి ఇంత ఆస్థి సంపాదించారురా? రెండు మూడు జమీగ్రామాలు కొని జమీందారనిపించుకున్నారు. ఈ ధనానికి తగిన తాహతు, ఉద్యోగము నీకు ఉండాలనీ, నువ్వు డిప్యూటీ కలెక్టరు, కలెక్టరు పనీ చేస్తూ ఉంటే చూచి ఆనందించాలనీ వారి కోరికరా నాన్నా.

నాయ: అవునమ్మా అవును. నా సోదరులను ఖైదుకు పంపే కలెక్టరు, మాట్లాడడానికి వీలులేదని 144 అస్త్రం ప్రయోగించే యోధుడు, నా దేశాన్ని సర్వకాలం శృంఖలాలలో ఉంచే ప్రభుత్వానికి ఉత్తమాయుధములా అయిన ఆ ఉద్యోగం చేయమంటావు. అంతేనేకాని, నాకు వ్యవసాయం అంటే ఇష్టం. అందులో అనేకరీతులు ప్రవేశింపచేసి నా కృషిఫలితం నే ననుభవిస్తానంటే నాన్నకూ నీకూ గిట్టదు.

తల్లి: ఎంత లెక్చరిస్తావురా! నువ్వు ఆ గాంధీ జట్టులోనో, ఆ కాట్రేడ్స్ చేతులలోనో చేరి వడవడ వాగి కైదుకు పోవడమో, ప్రాణాలు పోగొట్టు కొనడమో చేసి నా కడుపు చిచ్చు - పెడతానంటావు?

నాయ: నేను రాజకీయాలలో చేరనని మాటిస్తాను.

తల్లి: అంతేనేగానీ ఇంత కష్టపడి తాము పెద్ద గౌరవం సంపాదించి నందుకు, వారికి తగిన కొడుకువై వారు సంపాదించిన ఉద్యోగంచేస్తూ మన కుటుంబగౌరవం నిలబెట్టదలచుకోలేదు.

నాయ: నువ్వూ నాన్నా ఒక్కటే!

తల్లి: మా జీవితాలు భగ్నంచేయడానికి పుట్టావు తండ్రీ!

ఈ రకంగా రంగం అనేక రకాలయిన కోణాలలో ఛాయాగ్రహణలలో పూర్తి అయింది.

10

కోనంగి ఎంత నవ్వుతాడో, అంత ఆవేదన పడుతూ ఉంటాడు. అతని నవ్వూ, అతని చిన్నబిడ్డచేష్టలు, హాస్యకృత్యాలు, అందరినీ అతడు సదా సంతోషజీవి అని అనుకునేటట్లు చేస్తాయి.

కాని అతని హృదయంలో భూగోళం మధ్య ఉన్న భయంకరాగ్ని శిఖలు ఫెళ ఫెళ మండుతూనే ఉన్నాయి. తల్లి పాపంలో పుట్టిన తన బాలకుణ్ణి తిన్నగా చూడలేదు. చెన్నపట్నంలో ట్రిప్లికేను గోషా ఆస్పత్రిలో అతను జన్మించాడు. అక్కడి దాదులే అతన్ని పెంచారు. తల్లి సరిగా చూచేది కాదు. అయినా పది పన్నెండు రోజులయిన తర్వాత దాదులంతా బలవంతం చేస్తే పిల్లవాడికి పాలిచ్చేది. ఆమెలోని మాతృత్వం హాయి పొందేది. తాను పిల్లవాణ్ణి చూచి ఆనందిస్తున్నందుకు విచారించేది.

ఇటు పిల్లవాడి పైన అనురాగం తన్ను ముంచెత్తి పరువులెత్తుతున్నది. అటు అనేక యుగాలనుంచి వస్తూన్న ఆచార సంప్రదాయ ఛాందసమూ, యమలోక భయమూ కలిసి లోననుండి చండాగ్నులతో దహిస్తున్నాయి. ఒకసారి చూచీ, ఒకసారి చూడకుండా తల్లి కుమారుడ్ని పెంచింది. కొమరుడు తన పాపచిహ్నము, ఆ పాపాన్ని పెంచడమే తన కర్మవిపాకము అని ఆమె ఆలోచించుకొనేది. తాను పాపంచేసి బ్రాహ్మణత్వం పోగొట్టుకొంది. కాని తాను పాపంచేసిన పురుషుడు బ్రాహ్మణుడవడంవల్ల కొంత నివృత్తి. పాపంలో జన్మించిన శిశువు సంపూర్ణ పాపి అనీ ఆమె అభిప్రాయం. ఆమె దినదినమూ భగవంతుణ్ణి తన పాప నివృత్తి చేసుకో సహాయం చేయమని ప్రార్థించేది. తిరుగు ప్రయాణంలో కృష్ణ ఒడ్డుకు పోయి తలకట్టు గంగ కర్పించింది.

కొంచెమయినా జ్ఞాపకంలేని చిన్ననాటి భర్తను తలుచుకొని దుఃఖించి అంతవరకూ ఉన్న గాజుల్ని చితుకకొట్టుకుంది.

సంపూర్ణ సన్యాసివేషం ధరించింది. సన్యాసివేషంతో బిడ్డకు పాలివ్వడం ఆమెకు ఎంతో కష్టంగా వుండేది.

కొన్నాళ్ళవరకూ ఆమె ఎవ్వరిమొగం చూచేది కాదు. కోనంగి తండ్రే అమెకు అన్నీ పంపించేవాడు. కోనంగి తండ్రి మొగాన్ని చూచేది కాదు.

“నన్నంత ప్రేమించినదానవు, ప్రేమ అంటే ఏమిటో ఎరగని ఒక నికృష్టజీవికి ప్రేమదానమిచ్చిన దివ్యదేవివి! ఇప్పుడు నీకంత కష్టమేమిటి?” ఆమె మాట్లాడలేదు.

“నువ్వు చేసినపని ఏనాటికీ తప్పుకాదు. ముసల్మానులకు భయపడి పుట్టిన నియమాలన్నీ పూర్వకాలంనాటి వనుకుంటున్నావు. భర్తపోయిన అంబికా అంబాలికా వేదవ్యాసునితో సంగమించి కొడుకులను కన్నారు. వారికిలేని తప్పు నీకు వచ్చిందా?”

ఆమె మరీ మౌనం వహించింది. కోనంగి అసలు తండ్రి లోనికి చొచ్చుకొనిపోయి, ఆమెను బిగియార కౌగలించుకొన్నాడు. అతనికి ఆమె విగతకేశినిలా కనబడనేలేదు. అతని ముద్దులు కల్లబొమ్మ పెదవులపై పడ్డాయి కాని, ఆమెకు కొంచేమన్నా స్పందనం కలిగించలేకపోయాయి. ఆడవాళ్ళ హృదయం పరమాత్మునికి కూడా తెలియదనుకుంటూ అతడామేను మళ్ళీ తనకు ని చేసుకొనే ప్రయత్నం తగ్గించాడు. ఆ మానడం ఒక్కసారిగా తగ్గించలేదు. నెమ్మది నెమ్మదిగా తగ్గిపోయింది.

ఎప్పుడైనా వచ్చి అతడు ఆమె పక్కలో పండుకొని, వేయివిధాల బ్రతిమాలినా ఆమె రాతిబొమ్మ అయిపోయి లోకం కరిగిపోయినట్లు కళ్ళ నీళ్ళుకార దుఃఖించేది. మహాత్ముని శిష్యురాలిలా ఆమె ఇతర అల్లరి ఏమీ చేయకుండా సత్యాగ్రహం చేసేది.

కోనంగి తల్లిపైన ఆ తండ్రికున్న ప్రేమ అంతా కొమరుని పైన మహాప్రేమతో కలిపి కోనంగిపై నే అఖండవర్షం కురిపించేది!

తన్ను కౌగలించుకున్నప్పుడు తనదేహం అతడు ముద్దెట్టుకున్నప్పుడు ఆమె వెంటనే ఆవుపేడ నీళ్ళలోకలిపి స్నానంచేసేది. ఇన్ని ఆ నీళ్ళే త్రాగేది. భగవంతుని ప్రార్థించేది, రోదించేది.

కోనంగి తండ్రి కూడా కొంచెం పాపభీతి కలవాడు కాబట్టి, కొంతమేరకు సాగి ఆమెను రెండవసారి కామవాంఛాతృప్తికి దింపలేకపోయేవాడు.

అతడు ఒకసారి తన్ను పెంచడంవల్ల అతడు తన కొక విధంగా భర్త అని ఆమె అనుకోక పోలేదు అతడు తనలోని గాఢవాంఛతో ఆమెను నలిపివేస్తున్నప్పుడు ఆమెకు తెలియకే ఆమెలోని స్త్రీత్వ నరపుముడులు సడలుకొని కొంచెం కరిగేది గాని, ఆమెలోని పాపభీతి ఆ కరగుటను గమనింపజేయక ఆమెను వట్టి చైతన్యరహితురాలినిగా మాత్రం చేసేది. అంతటితో కోనంగి తండ్రి ఆగిపోయేవాడు.

తన గతి ఇంతేనని, భగవంతుడు ఉత్త కామపురుషుడయిన తనకు ఈలాంటి శిక్ష నిచ్చాడనీ అతడు రోదించేవాడు. ఇవన్నీ కొమారునికి ఒక ఉత్తరం వ్రాసి అతడు పరలోకగతుడయ్యాడు. కోనంగి తండ్రి పోవడం తన అదృష్టమనీ, తన ప్రార్థన భగవంతుడు వినడంవల్లననీ ఆమె అనుకునేది. ఒక ప్రక్క స్త్రీత్వ మేమీలేని రాక్షసి తన భార్యయట. తాను ప్రేమించిన స్త్రీకి విపరీత పాపభీతియట. ఇవన్నీ తన ప్రియపుత్రునికి రాయడానికి కారణం ముందు ముందీ విషయాలనుగూర్చి విచారించి పరిశోధించి ఆ బాలకుని జీవితము ఉత్తమపథంలో నడిపించుకొనడానికేనట!

“బాబూ! మనుష్యుడు కర్మజంతువు. అతడుగాని ఆమెగాని (ముఖ్యంగా పురుషుడు) సర్వకాలమూ పనిలో నిమగ్నుడై ఉండాలి. ఈ కర్మకు పునాది స్త్రీకి పురుషుడు, పురుషునకు స్త్రీ. స్త్రీవాంఛలో పురుషు డే కార్యమూ సాధించలేడు. అలాగే స్త్రీయున్నూ. ఎంత ఉత్తమ కార్యం తలపెట్టినా అంతే. మనం మహాత్మాగాంధీలము కాము కాబట్టి, నాయనా! ప్రేమ అనే వస్తువు వుంది. దాన్ని ఏడిపించక వీధులూడ్చే దానిమీద ప్రేమ కలిగితే, (వట్టి పశు కోనంగి వాంఛకాదు బాబూ) దాన్ని నీ భార్యగా చేసుకో. ఆ తర్వాతే నీవు లోకంలో ఏ పనికోసం పుట్టావో ఆ పనిచేయి.”

ఈ విషయమున్నూ ఇంకా అనేక విషయాలు ఇంగ్లీషులో రాసి ఉంచి, ఒక పెట్టెలో పెట్టి ఆ పెట్టెతాళం బంగారం రింగులో పెట్టి కోనంగి మెళ్ళో కట్టాడు. ఆ ఉత్తరం పెద్దవాడయిన తర్వాత చదువుకున్నాడు కోనంగి.

తల్లి మాత్రం ఎవరికో వంటచేసి బ్రతుకుతోంది. తాను బందరులో వున్నప్పుడే తన్నెప్పుడూ వంట ఇంటిలోకి రానిచ్చేది కాదు. ఎప్పుడూ ఆపేక్షగా పిలిచేదికాదు. “కోనంగి” అని మాత్రం పిలిచేది. కోనంగి “అమ్మా” అని పిలిస్తే మొహం ముడుచుకునేది. నాలుగురోజులు “అమ్మా” అని పిలవకుండా వుంటే యాధాలాపంగా అన్నట్లు “నాన్నా” అని పలుకరించేది. అప్పు"డమ్మా” అని కోనంగి పిలిచేవాడు.

కోనంగి పంపించిన డబ్బు ఆమె కోనంగి కోసమే దాస్తున్నానని రాసింది. ఆమెను ఆమె కులంవారే వంటలకుగా పెట్టుకున్నారు. అగ్ని హెూత్రంలాంటి మనిషని వారు నమ్మినారు. ఆమె కొడుకు ఆమెను చిన్నతనంలో పెళ్ళిచేసుకున్న భర్తకు పుట్టలేదని వారికేం తెలుసు?

తాను అలాంటి చరిత్ర కలవాడు. తనకు కావలసిన వారింకెవరు? తల్లి బంధువులు ఎవ్వరూ ఎప్పుడూ రాలేదు. ఈవిడ విధవయై బిడ్డను కన్నది. అందుకని వారెవ్వరూ ఈమెతో సంబంధము పెట్టుకోలేదు. భర్త వంక వారితో ఆవి డే సంబంధము పెట్టుకోలేదు. తన్ను కన్నతండ్రి వంక వారికి తాను బంధువన్న సంగతే తెలియదు.

ఈలా ఒంటివాడై లోకంలో నిలబడ్డ తాను సర్వసంఘ స్వతంత్రుడు. తన జీవితానికి తానే కర్త. ఇంక తనతో సంబంధం కలవాళ్ళు తన స్నేహితులు. ఇంతకన్న అనువైన జీవితంగల పురుషుడు లోకంలో ఎవరు? తనకున్న పని తాను చేయడానికి ఇంకెవరున్నారు?