కోనంగి/పంచమ పథం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


పంచమ పథం

రాజకీయాలు

కోనంగి వెళ్ళిపోయిన తర్వాత కాలేజీకీ వెళ్ళడానికి అనంతలక్ష్మి బయటకు వచ్చింది. కోనంగి లేడు. అతడు బస్సు ఎక్కి వెళ్ళిపోయాడు. ఆ బాలిక గుండె గుభిల్లుమంది. పదిహేడేండ్లు నిండి, పద్దెనిమిది సంవత్సరాలు జరుగుతూ అప్పుడే విప్పారే కమలపుష్పమా బాలిక. ఆమె అలాగే తెల్లబోయి నిలుచుంది. కళ్ళనీళ్ళు తిరిగినవి. తాను సరదాకు కోపగించి వేడితే, నిజమనుకుని వెళ్ళిపోయినాడు.

కాలేజీ మాని, హెూటలు గుజరాతుకు వెళ్ళి పట్టుకుందామని. తిన్నగా కారు వేసుకొని, హెూటలు గుజరాతు పక్కనుండే ఒక బట్టలషాపులోకి పోయిడైవరును కోనంగి కోసం పంపింది. అతడు తిరిగివచ్చి కోనంగిని యజమాని పంపివేశాడనీ, అతడు ఎక్కడికో వెళ్ళిపోయాడని తెలిపినాడు.

అంతటితో అనంతలక్ష్మికి కాళ్ళు చేతులు చల్లబడ్డాయి. కాలేజీకి వెళ్ళడానికి ఇష్టం లేకపోయింది. ఆమెకు కోనంగిపైనా, సర్వప్రపంచం పైనా కోపం వచ్చింది. కారు తిన్నగా క్వీన్ మేరీస్ కాలేజీ హాస్టలుకు పోనిమ్మని అక్కడకు పోయింది. హాస్టలు పరిచారికను పంపి తనకు భరించలేని తలనొప్పి వచ్చిందని చెప్పి ఒక స్నేహితురాలి గదితాళం తెప్పించుకొని, ఆ గది తలుపుతీసి, అనంతలక్ష్మి ఆ అమ్మాయి మంచంమీద పడుకొంది.

చిన్నతనాన్నుంచీ కోరిన వస్తువు తెప్పించి ఇచ్చాడు తండ్రి. ఆ బిడ్డకోసమే తల్లిదండ్రులు బ్రతికినారు పండితులచే సంగీతం చెప్పించారు. ఆ వస్తువు బాగుందంటే తండ్రి కొన్నాడు. ఆ బొమ్మ కావాలంటే తల్లి కొంది. ఆ బాలికకోసం సాలుకు మూడు నాలుగు వేల రూపాయలు బట్టలకూ, రెండు మూడు వేల రూపాయలు బొమ్మల సామానులు మొదలయిన వాటికి ఖర్చయ్యేది.

అలాంటి తనకు, ప్రేమించిన ఒక బాలకుడు ఇంత దూరం అవడం ఏమిటి? అతడు దూరమయ్యాడన్న భావం ఆమెకు మరింత ఆవేదన తెచ్చి పెట్టింది. చెట్టియారు అల్లుడు కావాలని తల్లి కోరిక. ఎంత అసహ్యకరమైన కోరిక. తనకు ఇష్టంలేక తల్లి ఏ పనీ చేయదని అనంతలక్ష్మికి తెలుసును. ఎందుకు తనకీ అవేదన? ప్రతిబాలికా ఎవరినో ఒకరిని ప్రేమించి అతని కోసం ఈలా బాధలు పడుతుందా? జీవితాన్ని తలక్రిందులుచేసే సంఘటన వస్తే మనుష్యులు బాధ పడతారు. రానంత సేపూ ఆనందంగానే ఉంటారు జనులు.

మేనేజరు అతన్ని పొమ్మన్నాడనీ, అందుచేత వెళ్ళిపోయాడనీ తనకు తెలిసింది. హెూటల్సులో ఎప్పుడూ అలాగే చేస్తారు. హెూటలు వాళ్ళకు నీతి నియమాలు ఏలా ఉంటాయి? అంతచదువుకొని ఆయన హెూటలులో చేరడం ఏమిటి?

ఆయన బ్రాహ్మణుడు. తాను వేశ్యకులంలో ఉద్భవించింది. తండ్రి అయ్యంగారయితే ఏమి? తన కులంలో ఉద్భవించినా ఒక సుబ్బలక్ష్మిని సుబ్రహ్మణ్యయ్యరు, ఇంకో సుబ్బలక్ష్మిని సదాశివన్ వివాహం చేసుకోలేదా? వరలక్ష్మి చెల్లెలు భానుమతిని, ఇంకో అయ్యరు వివాహం చేసుకున్నాడు.

వాళ్ళంతా సినిమా తారలు. సినిమా తారలను పొదివికొని ఏదో ఒక వర్ణించలేని వెలుగూ, ఆకర్షణ ఉంటాయి. తాను వట్టి బాలిక. ఎంతమందో తన్ను సినీమా రంగానికి లాగాలని ప్రయత్నించారు. కాని, ఆడసింహంలా తల్లి గర్జించింది.

సినీమారంగంలో స్త్రీలు పశువులై పోతున్నారు. పురుషు లిదివరకే పశువులు. “ఏ బ్రతుకు మానివేసి ఉత్తమ మార్గం పట్టాలని ప్రయత్నిస్తున్నామో ఆ బ్రతుకే ఇంకా అధికమైన అసహ్యతతో సినీమారంగంలో ప్రత్యక్షమవుతంది” అనికదా తన తల్లి జయలక్ష్మి తన్ను సినీమాకు పంపించనని భల్లూకపు పట్టు పట్టింది.

చెట్టియారుగారు పెళ్ళంటారు. ఆయన్ను చేసుకొంటే బాగుంటుందని అందరి వాదనా! కాని, ఆయన్ను చేసుకోవాలని తనకు బుద్ధి పుట్టడంలేదు సరికదా, ఆయన్ను చూస్తే భరించలేని అసహ్యత ఉద్భవిస్తుంది.

ఇంక కోనంగిరావుగారు కనబడకుండా వెళ్ళిపోయినారు. ఆయన ఇంతటితో తన జీవితంలోంచి వెళ్ళిపోతారా? ఆయన్ను హెూటలులోంచి వెళ్ళిపొమ్మంటే వెళ్ళిపోయారు. ఎక్కడకు వెళ్ళి ఉంటారు?

ఇంతట్లో అంబుజమ్మ పరుగున తన గదిలోకివచ్చి, “ఏమే అనంత, తలనొప్పి ఏమిటే! ఎందుకు వచ్చిందీ? ఎప్పుడు వచ్చింది?” అని ప్రశ్నించి నుదుటిపై చేయివైచి చూచింది.

అనంత: వట్టి తలనొప్పికి నుదుటిమీద ఏముంటుందే?

అంబుజం: ఏమో! ఒక్కొక్కప్పుడు వట్టి తలనొప్పికి కూడా నుదురు వేడెక్కుతుంది!

అనంత: అవును, నువ్వు డాక్టరు కూతురువు. డాక్టరువు కాబోతున్నావు. అందుకని నీ మాటా కొట్టివేయకూడదు.

అంబుజం: నీకు ప్రేమ తలనొప్పి వచ్చిందేమో?

అనంత: ప్రేమ తలనొప్పి, ప్రేమజ్వరం, ప్రేమ కడుపునొప్పులు ఉంటాయా ఏమిటే?

అంబుజం: ఓసి ఇడియట్టా! అలాంటివి ఉండేవని మన పూర్వ గ్రంథాలు చెప్తున్నాయిగా. అలాగే క్రొత్త గ్రంథాలు చెప్పవచ్చునుగదా!

ఇంతలో మెహరున్నిసా పరుగెత్తుకొని వచ్చింది.

మెహర్: ఏమిటే అనంతం! నీకు తలనొప్పి వచ్చిందని అంబుజం చెప్పి ఇక్కడకు వచ్చింది. వచ్చేటప్పుడు నన్ను కూడా పిలవకూడదూ?

అంబుజం: క్లాసందరికీ తెలిస్తే, అందరూ ఇక్కడికే వస్తారని నీ ఒక్కదానితో మాత్రం చెప్పాను. మన పార్వతితో చెప్పానా మరి?

మెహర్: పార్వతితోను, ఫిలోమెలాతోనూ చెప్పలేకపోయావు. వాళ్ళకు తర్వాత తెలిస్తే ఏమనుకుంటారు?

అనంత: నేను అంబుజాన్ని మాత్రం రమ్మన్నానా? ఏదో కాస్తతల నొప్పివస్తే ఈ గడబిడ అంతా ఎందుకే?

అంబుజం: ప్రేమ తలనొప్పా అంటే, ప్రేమ కడుపునొప్పి అంటుంది.

మెహర్: అనంతానికి తప్పక ప్రేమజబ్బే పట్టుకుంది.

అనంత: బాలికలలో చంద్రునివంటిదానవు. నీకు తెలియదటే మెహర్?

మెహర్: నాకేమి చెప్తావు నువ్వు? నీకు కొత్తగా అందాలరాయుడు ప్రయివేటుగా తెలుగు చెప్తున్నాడుగా?

అనంత: ఎవరు చెప్పినారే నీకు? మెహర్: పార్వతే!

అంబుజం: పార్వతా! అది హైకోర్టు జడ్జిగారి కూతురు. దానికి తెలియకపోతే ఇంకెవ్వరికి తెలుస్తుందే. అదిగో పార్వతిగారు వయ్యారంగా నడిచి వస్తోంది.

పార్వతి నిజంగా వయ్యారంగానే నడచి వచ్చింది. లోనకు రాగానే అనంతాన్ని కౌగలించుకొని, “ఆ చెట్టి నిన్ను బాధపెడుతున్నాడేమిటే?” అని ప్రశ్నించింది.

అంబుజం: ఆ మొద్దురాయడేనా? వాడు అనంతాన్ని బాధపెడ్తాడా పార్వతీ? వాడి పళ్ళు రాలగొట్టదూ అనంతం!

మెహర్: ఏమే పార్వతీ, ఎవరా కొత్తమాష్టరు? అనంతానికి తెలుగు పాఠాలు చెప్పేది?

పార్వతి: ఒక్క తెలుగేమిటి! ఇంగ్లీషు కూడా చెపుతున్నాడు.

అంబుజం: అతనికీ, అనంతం తలనొప్పికి సంబంధం ఏమిటి?

మెహర్: వచ్చింది, ప్రేమ తలనొప్పి కదా, పాఠాలు చెప్పే పెద్ద మనిషి ఇంట్లో ఉంటే తలనొప్పి తగ్గించలేడూ?

అనంత: ఈలాంటి మాటలంటే, కాలేజీకికూడా వినబడేటట్టుగా కేక వేస్తాను.

2

కోనంగిరావుకు ఏమిచేయాలో తోచదు. అతనికి ఏ ప్రభుత్వ ఉద్యోగమో చేయడానికి ఇష్టంలేదు. అతనిలో రాజకీయాలు వట్టి మబ్బులులా ఉన్నాయి.

కాంగ్రెసు మహాసంస్థ అనీ, కాంగ్రెసు నాయకులైన మహాత్మాగాంధీ లోకనాయకుడని అతని నమ్మకము. కాని అతనికి అహింస ధర్మాశయంఎల్లా అవుతుందో అర్థంకాలేదు. కాంగ్రెసు రాజకీయాలుగాని, సాంఘిక వాదాలుగాని, సామ్యవాదాలుగాని పూర్తిగాతెలియని విద్యార్థిగా ఉన్నప్పుడు, విద్యార్థి రాజకీయ సభలలో అతడు చేరలేదు.

కోనంగి మతవిషయికాలు అంత ఎక్కువ చదువలేదు. హిందూమతమంటే, బౌద్దమతమంటే, క్రైస్తవమతమంటే ఏమీ తెలియదనే చెప్పాలి. వేదాంతం అంటే ఏమిటో ఎరగడు. ఉపనిషత్తుల పేరులే తెలియవు ఏ మతపుస్తకాలూ ఎప్పుడూ చదవలేదు.

కోనంగి పాఠ్యపుస్తకాలు బాగా చదివేవాడు. ఆ పాఠ్యపుస్తకాలకు సంబంధమైన పుస్తకాలూ బాగా చదివేవాడు.

పాశ్చాత్యుల మనస్తత్వశాస్త్రం అతడెరగడు. జ్ఞానపిపాస ఒకమోస్తరుగా ఉండేది.

తెలుగు కోసం తన పాఠానికి పుస్తకాలు బాగా చదివాడు. ఈలా చదివిన పుస్తకాలు మాత్రం బాగా అర్థం అయ్యేవరకూ వదిలేవాడు కాడు. అలా అర్థం చేసుకొని పరీక్షలలో ప్రశ్నలకు ఎంతో బాగా ప్రత్యుత్తరాలు రాసేవాడు. అందుచేత అతనికి మొదటి మార్కులు వచ్చేవి.

అతడు కళలను గురించి అంతబాగా తెలుసుకోలేదు. అతని గొంతుక బాగానే ఉంటుంది. విన్న పాటగానీ, పాటపాడే విధానంగాని మరచి పోకుండా చక్కగా పాడతాడు. సంగీత శాస్త్రాన్ని గురించి ఏమీ తెలియదు.

బొమ్మలు చూస్తాడు భారతిలో, మోడరన్ రివ్యూలో, ఇంకా ఇతర చోట్లా ప్రచురణమయ్యే బొమ్మల్ని పరిశీలించి చూస్తాడు. అవి అజంతావైనా ఒకటే. అమరావతి వైనా ఒకటే, చటర్జీవైనా ఒకటే.

తనకు ఏ విషయం గురించి తెలియక పోయినా తెలియదని చెప్పేస్తాడు. మాట్లాడే వాడి ఉద్దేశం గ్రహించి, ఏ విషయాన్ని గురించి వాదన వచ్చినా బాగా చదువుకున్నవాడిలా కోనంగి వాదిస్తాడు.

కోనంగి. ఆటలో ఆందెవేసిన చెయ్యే. కాని తాను చదివే విద్యాశాలలో పిల్ల వాళ్ళు మెచ్చుకుంటూ, తమ వీరుణ్ణి చేసుకునేటంతవాడు మాత్రం కాదు.

పరీక్షలలో మొదటివాడుగా నెగ్గేవాడు. పరీక్ష విషయాలను గూర్చి ఎవరు ప్రశ్నవేసినా చక్కగా ప్రత్యుత్తరం చెప్పేవాడు.

చదువు లయ్యాయి. జీవితంలో ప్రవేశించాడు. ఇంటిలోనుంచి బయటకు వచ్చి ప్రపంచాన్ని చూచిన బాలకునిలా అతడు గుమ్మందగ్గిర నిలుచుండి తన్ను తాను ప్రశ్నించుకున్నాడు.

చదువుకున్నన్నాళ్ళు అల్లరిపిల్లవాడే. ఎవరికీ కష్టం కలిగించని అల్లరి, అనేకరకాల వేషాలు వేసేవాడు. స్నేహితులు కూడా గుర్తుపట్టని వేషం వేసివాళ్ళ గదులలోనికి పోయి అల్లరిచేసేవాడు.

ఒకనాడు చాకలివాని వేషం వేసికొని, ఒక స్నేహితుని ఇంటికి వెళ్ళాడు. (అతని చాకలివాని సంగతులన్నీ ఇదివరకే తెలిసికొని ఉన్నాడు) “మరిడయ్య మా చుట్టమేనండి, ఆడే పంపాడండి” అని తన స్నేహితుని తల్లితండ్రులనూ, తక్కినచుట్టాలనూ నమ్మించి బట్టలన్నీ వేయించుకుని తన ఇంటికి తీసుకుపోయాడు.

అక్కడ అవన్నీ మడతలు పెట్టి పెద్ద పార్శిలుకట్టి “దీపావళి బహుమతి” అని పేరుబెట్టి తన స్నేహితునకు తన పేరుతో బహుమతి పంపాడు. కొన్నాళ్ళవరకూ బందరంతా నవ్వింది.

కోనంగికీ ఆ రోజుల్లో చాకలి కోనంగి అని పేరువచ్చింది.

ఒకనాడతడు బి.య్యే అయిన రోజులలో, పదిమంది స్నేహితులను వెంటబెట్టుకుని, తాను సర్వేయరులా, కావలసిన సామాను పట్టుకొని బచ్చుపేట - రామానాయుడుపేట కలిసేచోటికిపోయి, ఆ వీధి కొలుస్తూ ఆ దారినివేళ్ళే ఒక పెద్దమనుష్యుని పిలిచి "ఈ చివర పట్టుకోండి సార్' అని కోరినాడు. ఆ వీధి మలుపుతిరిగి, ఇవతలి వీధిలోవెళ్ళే ఇంకో పెద్దమనిషితో “ఈ చివర కొంచెం పట్టుకోండి సార్" అని అందిచ్చి. స్నేహితులతో వెళ్ళిపోయినాడు.

ఆ పెద్దమనుష్యులిద్దరూ, ఒకరికి తెలియకుండా ఒకరు ఆ తాడు చివరలు ఒకరోవీధిలో ఇంకోరోవీధిలో పట్టుకుని ప్రభుత్వాని కెంతో సహాయం చేస్తున్నా మనుకొని ఒక గంటన్నరసేపు అలా ఉన్నారట. చివరకు ఒకాయన చాలా ముఖ్యమైన పని ఉండి ఏమవుతోందో చూదామని వీధిమలుపు తిరిగి చూస్తే తాడును ఒకచివర తాను, ఇంకో చివర ఇంకో పెద్దమనుష్యుడు పట్టుకుని ఉండడం చూచి, ఇంకెవ్వరూ అక్కడ లేకపోవడం చూచి, “ఏమిటండీ ఈ కొలత?” అని అడిగాడు.

“నాకేం తెలుసు, మీకు తెలియాలి!”

“అదేమిటి అల్లా అంటారు? మీకు తెలియదూ?”

“సోకేం తెలుసును. మీకే తెలియాలి?”

“ఎవరు ఇదంతా కొలుస్తున్నది?”

“ఏమో ఏ సర్వేయరో?

“ఈ ప్రభుత్వం సేవకులకు బుద్ధిలేదు. లేకపోతే ఇదేమిటండీ మనలనిద్దరినీ ఇక్కడ విడిచిపోయాడూ?”

“ఇంజనీరుకు వ్రాసి డొక్క చీలుస్తాను.”

“నేనూ దస్కత్తు చేస్తాను రాయండి.”

ఇంజనీరుకు రాశాడు. ఆయన ఈ గొడవ మాకేమీ తెలియదని జవాబిచ్చాడు. ఈ విషయం అంతా కృష్ణాపత్రికలో వేశారు. ఊరంతా నవ్వు కున్నారు.

ఆ ఇంటాయన ఎంతకాలంవరకో తనిల్లు యుద్దంకోసం ప్రభుత్వం తీసుకుంటుందేమోనని భయపడినాడు.

కోనంగి ఒకసారి పెద్దటైపు కొట్టి బందరు కలెక్టరుకు ఒక పెద్దపీటీషను రాశాడు. అందులో “మీరు రాత్రి 10 గంటలకు... పేటకు...నంబరు ఇంటికి వచ్చి చూస్తే ఇరవై ముప్పైమంది కూడా ఏదో కుట్రచేస్తున్న విషయం తెలుసుకోగలరు. మన ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలంటే, అలాంటివి జరగకూడదు. ఇవి యుద్ధంరోజులు” అని రాశాడు.

అప్పటికి కోనంగి చదువు పూర్తిఅయింది. జర్మనీ పోలండుమీదకు చొచ్చుకుపోయే రోజులు.

కలెక్టరుగారు నిజంగా పోలీసుదళంతోవచ్చి చూస్తే. అక్కడ హరనాధబాబా భజన జరుగుతోంది. అయినా కలెక్టరుగారికి అనుమానం. అక్కడికి వెళ్ళిగడబిడచేసి యుద్దానికీ, కుట్రకూ, భజనకూ ఏమీ సంబంధం లేదని తెలుసుకొని, కాస్సేపు పళ్ళుకొరికి, కాసేపు పకపక నవ్వి వెళ్ళిపోయాడట.

3

కోనంగిలో ఉన్న అసంతృప్తికి కారణం లేకపోలేదు. ప్రపంచంలో నిద్రాణమై ఉన్న శక్తులన్నీ మేల్కొన్నాయి. కోనంగి రాజకీయపు బిడ్డగా ఉద్భవించాడు. కానీ రాజకీయాలనుంచి పారిపోయాడు. అందుకు కారణం అతనిలోని రహస్యమే.

పుట్టిన బ్రతుకు అర్థము లేనిదవడంవల్లనూ, అతనిలో అనంతమైన ఆనందమైన శక్తి ఉండడంవల్లనూ, అతనికి హాస్యరసం శరణాగతమైంది. మానవజీవితంలో సంభవించే ఒడుదుడుకులకూ, కష్టనిష్టూరాలకూ బండిని కాపాడే స్ర్పింగువంటిది హాస్యరసం. దుఃఖం అనే చెరువుగట్టు తెగిపోతే, ఆ నీరు వెళ్ళిపోయే తూము హాస్యభావం. హాస్యం అనే కాపుదల లేకపోతే మానవుని హృదయం దుఃఖఘాతం ఒక్కటి తగిలినా ముక్కలై వుండును.

మానవ జీవితం 'అద్దపుసామాను జాగ్రత్త' వంటిది. ఆ సామాను విచ్ఛిన్నం కాకుండా రక్షించే ఉక్కుపెట్టే హాస్యరసం.

సంపూర్ణజీవిగా పుట్టేవారున్నారు. వారికి ఏనాడో లోకసంపూర్ణ జీవితం కైవసం చేసికొనే ఆవేదన వస్తుంది. ఆ ఆవేదన ఉద్భవించడానికి ఒక మహత్తర కారణం కూడా ఉండాలి. కోనంగి అనంతలక్ష్మిని ఎదుర్కొనడమే అతని జీవితభావం అంతా తారుమారు అవడానికి కారణమైంది.

బి. య్యే. పరీక్షలో మొదటి తరగతిలో నెగ్గిన బాలకునకు ఉద్యోగం సంపాదించడం అంత బ్రహ్మవిద్య కాదు. కాని అతనిలో అవ్యక్తంగా ఏదో లోకాన్ని అతివేగంగా అధిగమించే వేదనాభరిత కాంక్ష బయలుదేరింది.

అతని చేతిలో తన మనస్సు తాను చూచుకునే దుర్బిణియంత్రమే ఉంటే, తన్నీ రోజులలో పొదివికొన్న ఆవేదన అర్థమయ్యే ఉండును.

ప్రపంచం అంతా అతనికి లోపభూయిష్టంగా కనబడేది. అతని చూపు వెనక్కులేదు. “ఇప్పటి' పైనే ఎక్కువగా ఉంది. ఆ 'ఇప్పటి’ లో ఉన్న అపశ్రుతులన్నీ అతని మనోనేత్రాలకు వికారాలుగా తోస్తూ ఉన్నవి. అతనికి నవ్వూ, కోపమూ రెండూ ఒక్కసారిగా వచ్చేవి. అతని కోపం నవ్వుతో మిశ్రమై, నిశితమైన అపహాసంగా ఉద్భవించింది.

ఇప్పటిలోని సంఘపథకం అతనికి ముందుగా కనబడుతూ ఉంటుంది. మిస్ మేయో రాసిందంటే రాయదూ! ఆవిడ ఇంకా గౌరవంగా “మదర్ ఇండియా” అని రాసి ఊరుకుంది. “ఏ పూర్ ఇండియా' అనో రాయలేదు. “ఏ డర్టీ ఇండియా" అనో వ్రాయలేదు. అది నయంకాదుటండీ అనుకున్నాడు. వైటువే కంపెనీ మేనేజరుగారి దగ్గర ఆ “మదర్ ఇండియా” పుస్తకం చూచి చదువుకునేందుకు తీసికొని, చదివి ఇచ్చేశాడు. పరీక్షలలో మొదటి తరగతులలో నెగ్గే ఘటమాయను. ఆ ఒక్కసారి చదువులో ఆ గ్రంథం యావత్తూ పూర్తిగా కంఠతః వచ్చింది.

పుస్తకం చదవగానే మొదట అతనికి కోపం వచ్చింది. తర్వాత దుఃఖం వచ్చింది. వెంటనే నవ్వు వచ్చింది. అవును ఆ ముసలావిడకు భరతదేశం కోడలై కనిపించింది. అమెరికావారు భారతదేశీయపు మురుగు కాల్వలన్నీ టెలిస్కోపులో చూడాలని ఇంగ్లీషువారు ఆమెచేత ఈపుస్తకం రాయించారని ఆనాడు గగ్గోలు పుట్టిన మాట నిజం.

మొత్తంమీద మేయో భారతజాతిలో ఉన్న కోటికళంకాలన్నీ వెదికి ఏరి మాలిక అల్లి ఆనందించండర్రా అని తన దేశస్తుల మేళ్ళలో వేసిందా దేయ్యపుదండను.

ఆ పుస్తకం ఎప్పుడు చదివాడో, ఆ వెంటనే దానికి జవాబుగా వచ్చిన నాలుగు పుస్తకాలూ చదివాడు. రంగయ్యంగారి “పాదర్ ఇండియా” లాలాలజపతిరాయిగారి “అన్ హాపీ ఇండియా”, ఎర్నెష్ణువుడ్ గారి “యాన్ ఇంగ్లీష్ మాన్సు రిప్లయ్ టు మదర్ ఇండియా”, గాబాగారి “అంకుల్ షామ్” అనే పుస్తకాలు చదివాడు.

ఇన్ని పుస్తకాలు చదవడానికి అనంతలక్ష్మి దర్శనమే కారణం కోనంగిరావుకి. ఇంకా ఆఖరు పుస్తకం రెండోసారి చదువుతున్నాడు. ఈ పుస్తకాలన్నీ అనంతలక్ష్మి తండ్రిగారి పుస్తకాగారంలోనివి.

ఈ అయిదు పుస్తకాలూ చదివేటప్పటికి ఆ కాలంలోని అన్ని విషయాలు విచారణకు వచ్చాయి కోనంగి మనస్సులో.

హెూటలు గుజరాత్ నుండి తిన్నగా నెల్లూరు హెూటలుకుపోయి చేరిన రెండు రోజులవరకూ ఎక్కడికీ కదలలేదు కోనంగి. మూడవ రోజున సాయంకాలం అనంతలక్ష్మి ఇంటికి పాఠానికి వెళ్ళాడు.

కోనంగిని చూడగానే అనంతలక్ష్మికి కలిగిన ఆనందం ఏ రాయప్రోలో, దేవులపల్లో, వేదులో, నండూరో, విశ్వనాధ్, శివశంకరులో, కాటూరో, పింగళులో వర్ణించవలసిందే.

“నిన్నా మొన్నా రాలేదేమండీ గురువుగారూ?”

“కొంచెం ఒంట్లో బాగుండక రాలేదు.”

“మా ఇంటికి రాకూడదు కాబోలు.”

“వచ్చే ఉందును అనంతం. కాని నేను మీ ఇంట్లో ఉండడం అనేక కారణాలవల్ల మంచిదికాదు. నీకు గురువు నవడంవల్ల నా జీవితమే మారి పోయేటట్టు ఉంది.

“అలాంటా రేమిటి, ఏమి మారుతుందంటారు?”

“మారడం అంటే, నేను ఏ ఆవునో, మేకనో, గుట్టాన్నో, కుక్కనో అవుతానని కాదుసుమా!”

“ఏమో బాబూ! మీరల్లా అయిపోతే!”

“వహ్వా! వేశావు బాణం! అది నిజమే, మీ ఇంట్లో కాపురానికివస్తే కుక్కా గుట్టాన్నీ కాదుగాని గాడిదను అవుతానని భయం.”

“మేమంతా గాడిదలమనా?”

“మంచిదానవే నువ్వు! మీది మంచి తోటన్నమాట. ఆ తోటంతా మేసే గాడిదలా వస్తానన్నమాట!”

“నాకు మీ మాటలు ఏమీ బాగాలేవు గురువుగారూ!”

“మీ ఇంట్లో చేరితే నువ్వు సర్వకాలమూ నా ఎదుటే ఉంటే, నా హృదయమూ, ఆత్మా నీకు సర్వార్పణమైతే ఇంక నా పని ఏమిటి? నేనని ప్రత్యేకత ఏమవుతుంది?”

“ఏమి కవిత్వమండీ!”

“నిన్ను చూస్తే ఎవరికి కవిత్వం రాదూ?”

“చెట్టియారుకు వచ్చిందా?”

“ఏమో, అరవంలో ఎంత కవిత్వం రాస్తున్నాడో?”

“కవిత్వం రాదుగాని కపిత్వం వస్తుంది.”

“వట్టి కోతయిపోతాడన్నమాట. నేను గాడిదనయినట్లు.”

“మిమ్మల్ని మీరలా తిట్టుకోకండి.”

అనంతలక్ష్మి ఆ మాట మహామధురంగా అన్నది. ఆ మాటలు కోనంగి గుండె చెదరగొట్టాయి. అనంతలక్ష్మిని కోనంగి తన దగ్గిరగా తీసుకొని గట్టిగా కౌగలించుకొని, “నేను దొంగతనం చేస్తున్నాను అనంతం! వట్టి నిరుపేదను. అయినా నీ జీవితాలయంలోకి, ఈలా నిర్భయంగా వస్తున్నాను” అంటూ ఆమె పెదవులను తనివార చుంబించినాడు.

అనంతలక్ష్మి కరిగిపోయింది. ఆమె కన్నుల నీరు తిరిగింది. అనంద పరవశయైన ఆమె పెదవుల మధురహాసము నృత్యము చేసింది. ఆమె ధైర్యముతో కోనంగిని తనంతట తానే కౌగలించుకొని, అతని మోము వంచి, అతని పెదవుల ముద్దు పెట్టుకుంది.

ఇద్దరికీ సర్వప్రపంచమూ మాయమైంది. ఇద్దరే విశ్వంలో. వారు జంట సెలయేళ్ళు, మహానదులు, వారు అగ్నివాయువులు, వారు రెండుపూవులు, వారు మేఘము మెరుములు, వారు కేరటము సుడిగుండమూ, వారు కొమ్మలో కోకిలజంట!

ఆ మధుర మత్తతలో ముందర మేల్కొన్నది కోనంగే. “అనంతలక్ష్మీ! నేను మీ ఇంటిలో ఉండడము మంచిదికాదు. మీ తల్లికి మన వివాహం సంగతి మనము ఇద్దరమూ చెప్పాలి. అందుకు కొంచెం ఓపికపట్టు. ప్రస్తుతము నీ పరీక్ష అయినవరకూ మన ప్రేమ సంగతి మరిచిపో. చదువు పూర్తి కాగానే, మన విషయం తేల్చుకుందాము” అని అంటూ కోనంగి అనంతలక్ష్మిని తన హృదయానికి మరొకసారి అదుముకొని ఆమె పెదవులు, కన్నులు, తల, మెడ, బుగ్గలు తనివార ముద్దులవర్షంతో నింపినాడు.

4

కోనంగికి రాజకీయాలేమీ లేవు కాబట్టే, వ్యవసాయానికి సిద్దంగావున్న శాలి భూమిలా ఉన్నాడు.

“మదర్ ఇండియా” అతనిని రాజకీయపు నిద్రమత్తు నుండి లేపింది. “ఏమిటీ కాంగ్రెసు? ఎవరీ మహాత్ముడు? ఎందుకీ అహింస? ఏలాంటిదీ సత్యాగ్రహం?” అని ప్రశ్నలు వేసుకున్నాడు. కాంగ్రెసును వ్యతిరేకించే జస్టిస్ పార్టీ అంటే ఏమిటి?

అతడు ఈ పేర్లు వినలేదనిగాని, వీటి అన్నిటి" విషయమూ చూచాయగా తెలియదనికాని కాదు. ఈలాంటి వివిధ భావాలు, సకల ప్రపంచ పథకంలో పెట్టుకొని ఇంతవర కాతడు పరీక్షకు చదివినట్లు చదవలేదు.

అనంతలక్ష్మి ఇంట్లో వేలకొలది పుస్తకాలున్నాయి. పట్టాభిగారి “కాంగ్రెసు చరిత్ర” ఉంది. మహాత్ముని “యంగ్ ఇండియా” పత్రికా సంపుటాలూ, “హరిజన” సంపుటాలూ ఉన్నాయి. అహింస, సత్యాగ్రహం వీనిమీద వ్రాసిన గ్రంథాలున్నాయి. రొమైన్ రోలా మొదలగువారు గాంధీ మీద వ్రాసిన గ్రంథాలున్నాయి. ఈ సంవత్సరమే గాంధీగారిమీద డెబ్బదవ సంవత్సరోత్సవ సంచిక రాధాకృష్ణునుగారు ప్రచురించిన గ్రంథమున్నది. గాంధీగారు వ్రాసిన “హింద్ స్వరాజ్”, “సత్యం విషయమై నా పరిశోధన” అనే గ్రంథా లున్నాయి. వారు భగవద్గీతకు వ్రాసిన భాష్యమున్నది.

తిలక్ గారి భగవద్గీతా భాష్యమున్నది. నటేశన్ కంపెనీవారు ప్రచురించిన ఇతర గ్రంథాలెన్నో ఉన్నాయి. లాలా లజపతిరాయిగారు వ్రాసిన గ్రంథ మున్నది. జవహర్ లాల్ గారి “ప్రపంచ చరిత్ర”, “జీవిత చరిత్ర” అనే గ్రంథాలున్నాయి.

ముస్లింలీగువారి వ్రాతలు, జస్టిస్ పార్టీ వారి వ్రాతలు, గోఖలేగారి ఉపన్యాసాలు మొదలయినవి చదవడం ప్రారంభించాడు. నౌరోజి, పాల్, రెనడీ, మెహతా, బెనర్జీ, బాసు మొదలైనవారి జీవిత చరిత్రలు, ఉపన్యాసాలు చదవడం సాగించాడు.

అనంతలక్ష్మి పరీక్షలకు వెళ్ళేరోజులు వచ్చేసరికి 1940 మార్చి నెలకు ఈ గ్రంథాలన్నీ పూర్తి చేశాడు.

ఇవి చదువుతూ 1939 డిశంబరు నుండీ ఉద్యోగంకోసం వెదుకుతూ, 1940 జనవరిలో ఒక తెలుగు సినిమా కంపెనీలో కథానాయకుడుగా చేరాడు.

నెలకు రెండు వందల జీతము. భోజనము కంపెనీవారి భోజనసత్రంలోనే!

బొమ్మ తీయడం ప్రారంభించడం మార్చి నెలనుంచి అనీ, కోనంగి ఆ కంపెనీవారి భవనంలో ఉంటూ తన కిచ్చిన నాయకుని భాగం యావత్తూ కంఠత చదివేయాలనీ, అతని వంతుకు వచ్చిన అయిదు పాటలూ రోజూ రిహార్సల్సులో క్షుణ్ణంగా వచ్చేయాలనీ మేనేజింగు డైరెక్టరు విష్ణుమోహన లక్ష్మీనారాయణగారు చెప్పినారు.

పోరనూ, పాటలూ మూడు రోజులలో కంఠతః పట్టినాడు. రోజూ రిహార్సల్సు ఉదయం పదకొండు గంటలు మొదలు, సాయంకాలం ఆరుగంటల వరకూ.

కోనంగి సినీమాలకు ఒక మోస్తరుగా వెళ్ళేవాడు. ఇప్పుడు దాని సంగతి బాగా తెలుసుకోవాలని "సినీమా టెక్నిక్”, “మంచి నటన”, “ధ్వని” “కెమెరా” “ దర్శకత్వం” అను గ్రంధాలు, ఇంకా ఎన్నో గ్రంథాలూ అన్నీ క్షుణ్ణంగా చదివేవాడు.

సినీమాలో అతనికి ప్రవేశం దొరకడానికి కారకుడు డాక్టరు రెడ్డిగారే!

కోనంగి నెల్లూరు హెూటలులో ఉంటూ అనంతలక్ష్మికి పాఠాలు చెబుతూ, డాక్టరు రెడ్డిగారింటికి వెళుతూ ఉండేవాడు.

డాక్టరు రెడ్డిగారూ, వారి స్నేహితులు కొందరు, చుట్టాలు కొందరూ కలిసి, ఒక సినీమా కంపెనీ “ది వండరీపుల్ పిక్చర్ టోన్” అని పేరు పెట్టి స్థాపించారు. డాక్టరుగారు ఆ చిత్రానికి కోనంగినీ నాయకునిగా ఎన్నుకొన్నారు.

ఈలోగా డాక్టరుగారితో రాజకీయాలను గూర్చి కోనంగి వాదించడం అలవాటు పడ్డాడు. రాజకీయాలకూ, మతానికీ సంఘ వ్యవస్థకూ, ఆర్థిక పరిస్థితులకూ అవినాభావ సంబంధం ఉంది కాబట్టి అవన్నీ వాదించాలని డాక్టరుగారు.

1938లో డాక్టరుగారు విదేశాలన్నీ తిరిగివచ్చారు. ఆ తిరగడంలో రష్యాలో ఎక్కువ కాలం ఉన్నారు. ఆయనకు రష్యా విధానం బాగా నచ్చింది. సామ్యవాదాన్ని గూర్చి బాగా చదువుకున్నాడు. ఆర్యసమాజంవారు ఎవరినన్నా సరే వాదంలో ఓడించడానికి క్షుణ్ణంగా తయారై ఉంటారు. అల్లాగే ఎవరివాదం వారు బలపరచడానికి గ్రంథాలు పూర్తిగా చదవాలి. ఎదుట ఏ ప్రశ్నలు వేస్తారో అని ప్రతిభతో ఊహించుకొని, వానిని నీ వాదనకు సరిపోయే దిట్టమైన ప్రత్యుత్తరాలు సిద్ధం చేసుకుని ఉండాలి అని డాక్టరు. వాదన.

మనుష్యుడు బ్రతకడం కోరతాడు. ప్రతిజంతువూ అంతే! తర్వాత తన జాతివృద్ధి కోరతాడు. ప్రతిజంతువు అంతే! ఈ రెంటిలో నుంచి, తన దేహరక్షణ, జాతిరక్షణ అనేవి వస్తాయి. తన దేహరక్షణ విశ్రాంతి బలము, ఆయుధం, తప్పించుకోడం, చుట్టూ రక్షణ నిర్మాణం, రోగనివారణ, ఆకలి బాధ నివారణ, దాహ నివారణ, శీతోష్ణస్థితిగతుల బాధా నివారణ, పరిస్థితి సంజనిత బాధానివారణ అనేవి కోరుతాడు.

జాతిరక్షణ, జాతి, జాతివిద్య, జాతిదక్షత, కోట, యుద్దము, పోలీసు, సమిష్టి వ్యవసాయం, వివాహం, యువతీయువక సంప్రీతి, శిశుపోషణ, శిశువైద్యము, శిశు విద్య సంఘరోగ్యము, సంఘవైద్యము మొదలైనవి కోరుతుంది.

“ఇవి కాకుండా మనుష్యుడు ఆనందం కోరడా అండీ? ఆటలనీ, పాటలనీ, నాటకాలనీ, సంగీతమనీ, కవిత్వము చిత్రశిల్పాలనీ, నాట్యమనీ?”

“అవన్నీ జంతులక్షణాలే!

“అయితే శాస్త్రజ్ఞానము, కవిత్వాధికళలూ వివాహమూ, బంతి ఆట మొదలైనవి ఇవన్నీనండీ?”

“కోనంగిరావు. ఇవన్నీ కూడా పశువులలోనూ గర్భితమై ఉన్నాయి. కుక్కపిల్ల గుడ్డముక్కతో ఆడుతుంది. సింహంపిల్ల ఎముకముక్కతో ఆడుతుంది. లేడిపిల్ల ఆకులతో ఆడుకుంటుంది. గంతులు వేస్తుంది. వేస్తూ అరుస్తుంది.”

“అవే కవిత్వాలు, నాట్యాలు, సంగీతాలూ, ఆటలూ అంటారా ఏమిటి?”

“ఎందుకంటానయ్యా? జంతువులో గర్భితమైన శక్తులు, చిహ్నమాత్రంగా ఉండే శక్తులు, మానవునిలో వ్యక్తమయ్యాయి, అంతే."

“అదే నేనూ అనేది. అలా వ్యక్తం కావడానికి కారణం అతని మనస్సు కాదా అండీ?”

“అదే నేనూ అనేది. అలాంటి మనస్సు కలవాడు కాబట్టి మనుష్యుడు?”

“మీరూ నేనూ ఒకటే అంటున్నాము. ఇంక తేడా ఎందులో ఉంది?”

“మీరు నాతో వాదన ఎందుకు పెట్టుకొన్నట్టు?”

“వాదనను నేను ఓ హారంలా ధరించలేదు!”

“ధరించి ఉన్నారేమో?"

“మట్టి తలకాయను భరించినట్లు”

“ధరించడం మట్టుకు ధరించకండి ఏ మాత్రము!”

5

కోనంగి: అయితే కాంగ్రెసు రాజకీయాలమాట ఏమిటి?

డాక్టరు: కాంగ్రెసు మంచిదే. మహాత్మాగాంధీ ఉత్తమాశయాలు కలవాడు. కాని కాంగ్రెసు ఆశయాల ప్రకారం కాంగ్రెసులో కోటీశ్వరుడు చేరినా ఏమీ ఇబ్బందిలేదు.

కోనంగి: సాంఘికవాదులతో మాత్రం కోటీశ్వరులు చేరడానికి అభ్యంతరం వుందా?

డాక్టరు: ఇప్పుడు మేము పెట్టుకున్న పద్ధతి ప్రకారం కోటీశ్వరులు చేరవచ్చును. కాని ముందు ముందు తనకున్న ఆస్తి యావత్తు సాంఘిక వాదానికి అర్పించవలసి వస్తుంది.

కోనంగి: సాంఘికవాదులు, సామ్యవాదులు మహాత్మాగాంధీగారి బోధనలు ఒప్పుకోరా?

డా: ఒప్పుకోరు.

కోనంగి: కారణం?

డా: ఆ బోధనల నష్టం ఏమిటో, నష్టలాభాలు బేరీజు చేసుకోకుండా సాంఘిక సామ్యవాదులు, ఆయన బోధన ఎలా ఒప్పుకుంటారు?

డాక్టరుగారితో గాంధీగారి బోధ తమకు బాగా అర్థమైంది అని తెలియజేశాడు. మహాత్మాగాంధీగారు నిజమైన సామ్యవాది అని అన్నాడు. “డాక్టరుగారూ, ప్రపంచం ప్రపంచంలో ఉన్న ప్రజలందరిదీ అనీ, ఆ ప్రజలందరూ సమంగా పైకిరావాలనీ ఆ ఉత్తమపథం అందటానికి మనుష్యుని ధర్మశక్తినే ఆధారం చేయాలనే వాదనకన్న గొప్పవాదం ఏమి ఉండగలదు?”

“సామ్యవాదం చెప్పేది అదే. కాని అలాంటిస్థితి ప్రపంచానికి రావాలంటే, మనుష్యుని ధర్మశక్తి పైన ఆధారపడి ఊరుకుంటే, ఆ ఉత్తమస్థితి రావడానికి భూగోళం అంతమయ్యేవరకూ ఎదురుచూస్తూ వుండవలసిందే!”

“దేనిమీద అధారపడితే త్వరగా వస్తుంది?”

“హింసమీదే! తప్పుచేసిన వారిని దండించడం మానవజాతిలో వుండే ఒక పెద్ద శక్తి! ఆ శక్తిని ఉపయోగించడం మానివేసి, ఎక్కడో మూలదాగి వున్న ఒక చిన్న ముసలమ్మ శక్తిని సహాయం తెచ్చుకుంటే ఏం పని జరుగుతుంది? ఆకాశంలో ఎగరాలంటే, విమానాలకు పెట్రోలియమే ఆధారం కావాలి. ముసలమ్మ ఓడలకు మోటారునూనె కావాలి. ఇంకా పాత ఓడలకు బొగ్గు, నీరే ఆధారం! ఇంకా ముసలమ్మ తాతమ్మ ఓడలకు గాలీతెడూ ఆధారం”

“హింసమీద ఆధారపడితే ప్రతిహింస కోరదా హింస?”

"కోరినా భయమేమిటి?”

“హింస ప్రతిహింసలలో ఏది ఎక్కువ బలంకలదైతే అదే నెగ్గుతుంది.”

“కాక”

“అయితే సామ్యవాదులకన్న బలవంతులైన సామ్రాజ్యవాదులు వస్తే?”

“అలా రావడానికి వీలులేదు.”

“జర్మనీ వస్తుంది. కాని రష్యాకు ఇతర సామ్రాజ్యవాదులు సహాయం చేయకపోతే రష్యా నాశనం అవుతుంది.

“జర్మనీకి రష్యాకు ఇప్పుడు స్నేహంకాదా? రష్యాలోని ప్రజాశక్తి ఎవరు తనపై పడినా కాచుకో కలదయ్యా?”

కోనంగి: ఏమిచేస్తాడు భారతీయు డీ ప్రపంచంలో! భారతదేశానికి స్వరాజ్యం కావాలా అక్కరలేదా? స్వరాజ్యం కావలసివస్తే గాంధీజీ చూపించిన దారి ఉత్తమముకాదా? తాము స్వరాజ్యం సంపాదించుకొన్న తర్వాత ఇతర సమస్యలు చూచుకోడం మంచిదికాదా?

డా: అవునయ్యా. నువ్వు చెప్పినదాంట్లో అర్థం లేకపోలేదు. మన స్వంత భూమి సంపాదించుకొనేటప్పుడు, ఏలాంటి వ్యవసాయం చేయదలచుకొన్నామో నిశ్చయించుకోవద్దా?

కోనంగీ: అదేమింటండీ అలా అంటారు? మనం ఇంటిస్థలంకోసం వ్యాజ్యం వేశాము. ఆ స్థలం మనదైన తర్వాతగదా ఏలాంటి ఇల్లు కావాలో నిశ్చయించుకొనేది. పొలం మన స్వాధీనమైనతర్వాత ఎలాంటి వ్యవసాయం చేయాలో నిశ్చయిస్తాము. మొదట స్వరాజ్యం రానీయండి చూద్దాం.

డాక్టర్: గాంధీగారి పద్దతివల్ల స్వరాజ్యం రాదనే నా ఉద్దేశం.

ఎందుకంటే గాంధీగారిని మాయచేసి భారతీయ పూంజీదారులు కాంగ్రెసుకు మద్దతు చేస్తున్నారు. వారి స్వలాభంకోసం భారతదేశాన్ని ఇంగ్లండు నుంచి పూర్తిగా విడిపోనియ్యరు.

కోనంగి డాక్టరుగారితో వాదించడం కష్టమనుకొన్నాడు. కాంగ్రెసులో బిర్లాలున్నారు. అంబాలాలు, సరాభాయిలున్నారు. వారు కోటీశ్వరులే! కాని వారి ధనాశతనం మానుకొన్నారా?

కాంగ్రెసు నాయకుడైన జవహర్ లాలు నెహ్రూకూడా సాంఘికవాది అయ్యాడు. అయినా ముందర కాంగ్రెసులో నాల్గణాల సభ్యుడవడం తన కర్తవ్యం అనుకున్నాడు. తాను హెూటలు గుజరాతులో సంపాదించుకొన్న ఆ కొద్ది రూపాయలు పెట్టి ఖద్దరు కొనుక్కున్నాడు.

అనంతలక్ష్మి ఇంటిమూల పడివున్న వార్ధాచరఖా వడకడం ప్రారంభించాడు. ఇంతలో తాను సినిమాలో చేరడం వచ్చింది.

డాక్టరు రెడ్డిగారు రష్యాను గురించి గ్రంథాలన్నీ తన్ను చదవమన్నారు. అవి కూడా చదవడం ప్రారంభించాడు. మార్కుృగారి 'పెట్టుబడి మూలధనం' చదవడం సాగించాడు. అనుమానాలు డాక్టరుగారి నడగడం! ఈలా మార్చి నెలాఖరుకు ఆ పుస్తకం పూర్తిచేశాడు. లెనిన్గారి గ్రంథాలలో “సామ్రాజ్యతత్వ విమర్శనము” అనే గ్రంథం చదివాడు. “మార్క్సిజం” అనే గ్రంథం మొదలు ఇరవైనాలుగు సంపుటాల గ్రంథాలున్నాయి. కోనంగి అవన్నీ కూడా చదవడానికి నిశ్చయం చేసుకున్నాడు.

ఒకవేళ తాను ఒక పెద్ద రాజకీయనాయకుడైపోతే! ఇంకేముంది? ఎవరు భరిస్తారు? ఊరేగింపులూ, పూలమాలలూ, జయధ్వానాలున్నూ! ఇంక వూరికే ఉపన్యాసాలిస్తూ వుండాలి కాబోలు, జైలుకు వెళ్ళడం ప్రారంభించాలి కాబోలు. ఇదో ఇబ్బందే. తన తల్లి దుఃఖిస్తుంది. అదో రకం జీవితం క్రింద మారుతుంది. అదృష్టంకొద్దీ తల్లి ఒక విగతభర్తక అయిన ధనవంతురాలింట వంటలకుగా చేరింది. తానేమో పెద్ద ఉద్యోగంచేసి తన్ను మోటారు ఎక్కిస్తాడు కొడుకు అని ఆశిస్తోందో, లేక ఈ పాపం వల్ల పుట్టిన శనిగాడు వదిలాడు అని అనుకొంటోందో?

హెూటలులో వడ్డనదారీ ఉద్యోగం చేసిన పట్టభద్రుడైన కొడుకును కన్నాను అని ఆమెకు తెలియదింకాసు పాపం!

అన్నిరకాల ధనసంపాదనా మానవకృషి అనీ, అవి చవిచూడాలన్న అల్లరిభావం ఒక ప్రక్కా ఇంత చదువూ చదివి ఇల్లు అలుకుతున్నాడన్న బాధ ఒకవైపునా అతన్ని ఊపుతూనే ఉండేవి.

అసలే కొడుకు నెందుకు కన్నానా అని విచారించే అమ్మ! కానీ కన్నకొడుకుపై ప్రేమ తప్పుతుందా? ప్రేమ, అసహ్యమూ, ద్వేషమూ రంగరించిన ఆపేక్ష తన పైన తల్లికి.

ఆ తల్లికి ఎప్పుడు పంపినా యాభైరూపాయలవరకూ పంపాడు తాను. ఇక సినీమా ఉద్యోగం వచ్చిందికదా బాగా ధనం పంపవచ్చు.