Jump to content

కోనంగి/చతుర్థ పథం

వికీసోర్స్ నుండి


చతుర్థ పథం

ఆరోగ్యం

కోనంగి, చిక్కిన మోముతోనూ, గడ్డం, మీసం పెరిగిన మోము తోనూ తదియనాటి వెన్నెలలా నవ్వుతూ “అదోరకం మలేరియా, పెద్దరకం మలేరియాయే వచ్చింది మన పెద్దరికం తీసేసింది” అని మళ్ళా అన్నాడు.

అనంతలక్ష్మి అతని సంతోషానికీ, అతడు సలిపే హాస్యానికీ, అతడు బ్రతికాడన్న దివ్యభావానికీ ఎండా వానలా పకపక నవ్వుతూ, కళ్ళనీరు జలజల కారుస్తూ మళ్ళీనవ్వుతూ నుంచుంది.

మన నాటుకోటి చెట్టిగారు, పాపం, ఈ పదిరోజులూ వచ్చి కోనంగికి ఎల్లా ఉందని కనుక్కుంటూనే వున్నారు.

“ఆ హెూటల్లో జబ్బుపడి ఉన్న మనిషిని, ఈ అనంతలక్ష్మి తీసుకు వచ్చింది. దీనికి బుద్ధిలేదు! బోగందానిగుణం పోగొట్టుకొందికాదు! ఈ దుర్మార్గుడు చావనన్నా చావక ఈలా బ్రతికి ఉన్నాడు. అయినా తొందరలేదు. జ్వరం తీవ్రంగా వస్తోంది. ఇంతవరకు తెలివిరాలేదు. వచ్చినా అది సంధి తెలివి. ఒకవేళ జ్వరం తగ్గిందా, తనకు తగిలిన దెబ్బలకు బుద్ధివచ్చి ఇకరాడు. వచ్చాడా, ఇంకో చక్కని మార్గం చూచుకోవచ్చును. అనంతలక్ష్మికి తానుతప్ప కన్యరికం చేయగల శక్తిగలవాళ్ళు ఎవరు” అని లోపల ఊహించుకొనేవాడు. కాని కథ అడ్డం తిరిగింది.

అనంతలక్ష్మి దేహంలో మనస్సులో నిర్మలత్వం ఉంది. రఘునాధరాయని హృదయ మహారాజ్యం ఆక్రమించి, చక్రవర్తియై రాజ్యమేలిన దివ్యసుందరి, భూమికి దిగివచ్చిన పరమాప్పరస సుందరి మధురవాణి అందమంతా ఈ బాలికలో ప్రత్యక్షమైంది. కొంచెం కోల, కొంచెం గుండ్రని మోము, అయిదడుగుల ఎత్తు, పొట్టి పొడుగుకాని ముక్కు సమమైన కోలతనంలో దవడలో, బుగ్గలు ఫాలము ఏకరేఖా ప్రవాహ సామ్యం కుదిరి వుంటాయి. అలాంటి మోము గుంటలుపడే బుగ్గలు, కొంచెం పైకి తిరిగిన పై పెదవి, కొంచెం అంటే కొంచమే ఎత్తయిన క్రింది పెదవీ, సుడులుపడే సమ చుబుకమూ ఉండి, ఆ మోము కాసు బంగారంరంగు కలిగి, ఆ రంగుకు తగినట్లు లేత గులాబి రాగం అప్పుడప్పుడా బుగ్గలకు ప్రసరిస్తూ ఉంటే, అలాంటి సౌందర్య నిధులన్నీ చేకూరినచోట, ఆ నిధులకు కిరీటంలాంటి కళ్ళ అందం వెలసిందనుకొంటే, ఆ దివ్య సౌందర్యవదనం అనంతలక్ష్మిది. కాంచనమాలను, సుబ్బలక్ష్మిని, నళినీజయవంతను ముగ్గురినీ కరిగించి పోతబోస్తే అనంతలక్ష్మి అవుతుంది.

అవును. అనేకమందికి చక్కని హృదయాలనన్నీ గబగబ పువ్వుపుణికినట్లు పుణికే శక్తిగల సౌందర్యపూర్ణమైన మోము ఉంటుంది. అంతే. ఆ మోముకు తగిన తలగానీ, తలకట్టుగానీ ఉండవు. అతి పెద్ద లంకగుమ్మడి లాంటి తలో, పొన్నకాయలా మెదడులేని తలో ఉంటాయి. అనంతలక్ష్మికి తలకట్టు, తోడిరాగాలాపన ఆమె కేశ సౌభాగ్యము. కేశరంజనివారి ప్రకటన చిత్రాల తలకట్టులకు పాఠాలు నేర్పుతుంది.

ఎవరైనా ఒకశిల్పి “నీకు ఆ తలమాత్రం చాలదా” అని తెలివిగా అంటే పెదవి విరిచి ఊరుకుంటాడు.

పూర్వకవి అందాల మెడను శంఖంతో పోల్చాడంటే ఊరికే పోల్చాడా? ఇంగ్లీషుకవి వర్ణించే హంసమేడ ఆంధ్రకవిని హడలు కొడ్తుంది.

శంఖంవంటి కంఠం అంటే పైన లావు క్రింద సన్నమనిగాని, క్రిందలావు పైన సన్నమనిగాని కాదని కోనంగి అనంతలక్ష్మి కంఠంవైపు చూపులు పరుస్తూ అనుకున్నాడు. మూడు రేకలతో కూడిన్నీ శంఖం కాబోయే రూపము కలిగిన్నీ, శంఖంలా స్వచ్చమైన రంగు కలిగిన కంఠం సౌందర్యాతి సౌందర్యవంతమైనదని కవుల భావం అనుకున్నాడు కోనంగి. అలాంటి భావానికి పరిమళం ఇస్తుందికదా అనంతలక్ష్మి కంఠం.

అనంతలక్ష్మి కోనంగికి దాది అయింది. జయలక్ష్మి అనంతలక్ష్మిని “కాలేజీకి వెళ్ళు తల్లీ. నేను యీయన్ను చూస్తూ ఉంటానని బ్రతిమాలినా వినందే! మొదట కోనంగిని జ్వరంతో తీసుకుని వచ్చినప్పుడు కాలేజీకి వెళ్ళింది. కాని అక్కడ ఆమెకు ఏమీ తోచలేదు. ఏడుపు వచ్చినంత పని అయింది. మొదటిగంట కొట్టగానే ఒక ఉత్తరం తనకు జ్వరంగా ఉన్నదని వ్రాసి అనంతలక్ష్మి ప్రిన్సిపాలుగారికి ఇచ్చి, ఈవలకు వచ్చి, ఒక రిక్షా చేసుకొని ఇంటికి వచ్చివేసింది. మళ్ళీ కోనంగికి జ్వరం తగ్గేవరకూ కాలేజీ గడప తొక్కలేదు.

“తల్లీ, నీకు కూడా జబ్బుచేస్తుందేమోనే!” అని తల్లి అంటే ఆమె వినలేదు. తిరుపతి వెంకటేశ్వరులకు మొక్కుకుంది. మన్నారుగుడి శ్రీకృష్ణునికి మొక్కుకుంది. శ్రీరంగం శ్రీరంగశాయికి మొక్కుకొంది అనంతలక్ష్మి.

అతనికి నార్మల్ వచ్చి మాట్లాడుతూ ఉంటే ఆమె ఆనందం వర్ణనాతీతము.

ఈ చరిత్ర అంతా జయలక్ష్మి కనిపెడుతూనే ఉంది. తానూ అలాగే ప్రేమించింది అయ్యంగారుని, తన్ను ప్రేమ సముద్రంలో పూవుల ఓడలలో తేల్చుకొని పోయినా డా ప్రియమూర్తీ.

ప్రేమ అనే మహోత్తమ స్థితి మనుష్యుని జీవితంలో ఊరికేరాదు. భర్తతో స్నేహమూ, స్త్రీ పురుష సంబంధ ప్రీతీ సమ్మిశ్రితమై ఒకరకమైన ప్రేమగా పరిణమిస్తాయి. ఒకనాడాస్థితి సంపూర్ణప్రేమ కావచ్చును.

కాని అసలు ప్రేమే స్త్రీకిగాని, పురుషునికిగాని సంభవిస్తే, అది అమృత మహానది. సరస్సు కట్టలు తెగినట్లవుతుంది అని జయలక్ష్మి అనుకుంది.

అనంతలక్ష్మి వరస చూస్తే కోనంగిరావుని పూర్తిగా ప్రేమిస్తున్నట్లే జయలక్ష్మికి నిర్ధారణ అయిపోయింది.

ఏమిటి ఇప్పుడు కర్తవ్యం? అని జయలక్ష్మి అనుకుంటున్న సమయంలోనే అనంతలక్ష్మి కోనంగిచేత బార్లీ జావ త్రాగిస్తున్నది.

“ఆకలి అవుతున్నది, కాని సయించడంలేదు లక్ష్మీ!”

“మీవంట్లో ఒక వీశెడు క్వినయిను ప్రవేశించింది. అందుకనేగాదండీ మిమ్మల్ని పళ్ళరసం తెగతాగమంటారు డాక్టరు!”

“సరేలే! రెండు మూడు రోజులలో పైత్యనాడి తిరగకపోతుందా ఏమిటి? తిరక్కపోతే పైత్తకారినే అయిపోతాను!”

“అయితే గురువుగారూ, మీరు ఎప్పుడూ అల్లా నవ్వువచ్చే మాటలు మాట్లాడుతూనే ఉంటారా?”

“నాకు ఏడుపు మాటలు చేతకావు. కృష్ణశాస్త్రిగారి శిష్యరికంచేసి ఇంత ఏడుపు కవిత్వం రచించడమన్నా నేర్చుకోవాలి!”

“నవ్వు కవిత్వం, ఏడుపు కవిత్వాలేగాని, ఇంకోరకం కవిత్వం తెలుగులో లేనేలేవా అండి?”

“లక్ష ఉన్నాయి. రాయప్రోలువారి ప్రియురాలే చెల్లెలు కవిత్వం, వేదులవారి పూవుల కవిత్వం, నండూరివారి పల్లెటూరి కవిత్వం, తుమ్మలవారి రైతు కవిత్వం, విశ్వనాథవారి ఎత్తుకొండల కవిత్వం, కాటూరి పింగళుల తేనే పెరడు కవిత్వం, కవికొండలవారి అటుకులు, జీడిపప్పు కవిత్వం, దీక్షితులవారి బువ్వాలాట కవిత్వం....”

“అదేమిటండీ! ఒకటడిగితే ఇరవై చెబుతారు ఇంత నీరసంగా ఉన్నారు కూడా?”

“ఈలా మాట్లాడుతూఉంటే, కాస్త జావకూడా సయిస్తుంది. ఇంకో వెండిగిన్నెడు జావా, దానితోపాటు సాతుకుడిరసం ఒక పెద్ద గ్లాసుడూ పట్టుకురా అనంతయ్యగారూ!"

“అలాగేనండి కోనంగమ్మగారో!” అంటూ పరుగెత్తింది అనంతలక్ష్మి నవ్వుకుంటూ.

ఆమె పరుగెత్తుతూ ఉంటే ఆమె దేహసౌష్టవచంద్రిక వెన్నెల కురుస్తుంది. అనుకొన్నాడు కోనంగి. ఎక్కడా అపశ్రుతిలేని శరీరాంగ నిర్మాణం ఈమెలో చేతులూ, వక్షనిధులు, నడుము, కటి, కాళ్ళు, పాదాలు బ్రహ్మదేవుడు దివ్యలలిత కళాపారవశ్యకతతో సృష్టించి ఉంటాడను కున్నాడు. అందమైన బాలికలు ఉండడమే లోకానికి ఆపత్తు. అందం సూదంటురాయి. మగవాళ్ళు అనే ఇనుప శకలాలను ఆకర్షిస్తే ఏలాగు తనబోటి దద్దమ్మల బ్రతుకు!

అందాని కందం, ధనానికి ధనం, సంస్కృతి, విద్య అన్నీ ఉన్న ఈ బాలిక ఏమిటి? ఎక్కడో ఒక్క కోనంగి, కొక్కిరాయి తానా?

ఇంతలో అనంతలక్ష్మి బార్లీజావా, పళ్ళరసం పట్టుకు వచ్చింది.

“నేను అమ్మాయినా?”

“నేను అబ్బాయినా?”

2

పది పద్యాలు వంటబట్టి, కోనంగికీ బలం వచ్చింది. మళ్ళీ కోలుకొన్నాడు. వెనుకటి తేజస్సు వచ్చింది.

ఇంక తన హెూటలు గుజరాతుకు వెడతానన్నాడు. ఈలోగా మన చెట్టిగారి పుణ్యమా అని కోనంగిని గూర్చిన దర్యాప్తు యావత్తూ జయలక్ష్మికీ, అనంతలక్ష్మికీ కూడా తెలిసింది. చెట్టిగారు బందరు ఉత్తరాలు వ్రాయించి, కోనంగి చరిత్ర అంతా తెలుస్తున్నాడు. అదంతా తారుమారు చేసి జయలక్ష్మికి తెలియజేశాడు.

“కోనంగి తండ్రి ఎవరో తెలియదు. చెడిపోయిన ఒక బ్రాహ్మణ దానికి వీడు పుట్టాడు. ముష్టి ఎత్తుకుని తల్లీ కొడుకూ బ్రతికారు. ముష్టివల్లనే చదువుకున్నాడు. తల్లి ఇంకా జారిణీవృత్తి చేస్తూంది. వీడు వట్టిరెడీ, ముండల ముఠాకోరు. కొంచెం దొంగతనం కూడా వుంది వీడి దగ్గిర” అని చెట్టియారుగారు జయలక్ష్మికి చెప్పాడు.

జయలక్ష్మి కూతురుతో “అమ్మిణీ, మనకెందుకే ఈ దౌర్భాగ్యుడు? తల్లికీ తండ్రికీ పుట్టని మురికికాల్వ మనిషి వాడికి చేసిన జబ్బు పాతరోగమట! ఆ రోగం కట్టుతప్పిన చండాలురకు మాత్రం వస్తుంది. ఈ సంగతి మన డాక్టరే చెప్పాడట” అని చెప్పింది.

అనంతలక్ష్మి తల్లి మాటలకు లోలోన మండిపోయింది. కాని పైకి ఏమీ అనలేదు. ఇదంతా ఆ చెట్టియారు మహానుభావుడు తల్లికి నూరి పోసిన భావాలు. తన తల్లి వట్టి తెలివితక్కువ తల్లి కాబట్టి అన్నీ నమ్మింది.

కాలేజీకి వెడుతూ తను డాక్టరును కలుసుకొని, అనంతలక్ష్మి కోనంగి జబ్బుసంగతి అంతా అడిగింది. అయన స్పష్టంగా “కోనంగిరావుగారిని ఎవరో దెబ్బలు కొట్టడంవల్ల ఆయనలో ఎక్కడో అణగిఉన్న మలేరియా బయట పడినది. తలపై యెక్కువ దెబ్బలు తగిలి అలా ఒళ్ళు తెలియక పడి ఉన్నాడు. మంచి ఆరోగ్యవంతుడవటంవల్ల తేరుకున్నాడు” అని చెప్పాడు.

“అయితే ఆయనకేమీ స్త్రీ సంబంధమైన రోగాలు లేవా?”

"ఛా! ఛా! ఆ బాలకుడు ఉత్తముడు. ఎందుకంటావా, సంధిలో అతడు మాటాడిన మాటలన్నీ ఉదాత్తమైనవీ, హాస్యరసపూరితమైనవీన్ని. ఒక్కపొల్లుమాటైనా రాలేదు.”

"సంధిలో మాటలనుబట్టి..."

“మంచి చెడ్డలు నిర్ణయించగలం. సంధిలోనూ, మత్తుమందు ఇచ్చినప్పుడూ పూర్తిగా మత్తురాని మునుపూ, హృదయంలో స్త్రీలలో అణచు కొన్న అసలు భావాలు బైటపడతాయి. అందుకని ఆ మాటలనుబట్టి మనుష్యుని నిజతత్వం బయటపడుతుంది.”

అనంతలక్ష్మి వెళ్ళిపోయింది. అనంతలక్ష్మి వెళ్ళిన గంటకు డాక్టరుగారి దగ్గరకు చెట్టియారు చక్కావచ్చారు.

డాక్టరు: ఏమండీ! ఇలా దయచేశారు?

చెట్టి: మీకోసం డాక్టర్!

డాక్టరు: ఎందుకూ?

చెట్టి: నా ఉద్దేశం చెప్తాను. కోనంగిరావు అనంతలక్ష్మిపై కన్నువేశాడు. వాడు వట్టి లోఫర్. బి.య్యే. అయితే సరేనా మరి, గుణాలు ఉండాలి. ఇంతకూ వాడు ముండల ముఠా కోరు. నేను అనంతలక్ష్మిని పెళ్ళి చేసుకోదలచుకున్నాను. కోనంగి విషయంలో ఆ అమ్మా యి...

డాక్టరు: కొంచెం సదభిప్రాయంతో ఉందని మీ ఉద్దేశం?

చెట్టి: అవునండి. మీరు కోనంగికి వైద్యం చేస్తున్నారు. అతనికి సుఖవ్యాధులు ఉండకూడదా?

డాక్టరు: అలాంటివి యేవీ లేవని నేను నిర్ధారణగా చెప్పగలను.

చెట్టి: ఆమ, ఆమ. మీరు చెప్పింది నిజమే! కాని అనంతలక్ష్మిలో అనురాగరోగం కుదర్చాలి మీరు. నేను పదివేలు ఫీజు ఇచ్చుకో గలను.

డాక్టరు: అంత పెద్దజబ్బా అనురాగరోగం! రోగం సంగతి అంతా ఆలోచించి తర్వాత చెప్తానులెండి.

చెట్టియారుగారు సంతోషిస్తూ వెళ్ళిపోయారు.

డాక్టరు రంగనాయకులు రష్యాప్రియుడు, కమ్యూనిస్టువాది. కాంగ్రెసులో పనిచేసి చేసి దేశంలో ఉన్న శక్తులను కాంగ్రెసు కట్టుకు రాలేకపోతున్నదని, అహింసా వాదమువల్ల ఎదుటివాడి హృదయం మార్చడం అనే ఆశయం ఉద్భవం అవుతుందనీ, ఈలోగా తిండిలేక మాడిపోతూ ఉంటారు ప్రజలు అనీ నిర్దారణచేసుకున్నాడు. ఆచార్య నరేంద్రదేవు, జోషీ, జయప్రకాష్ మొదలగువారి వాదనలు వచ్చాయి. ఆ రోజుల్లో కాంగ్రెసు ఎడమ చేతి వాదన వారుండేవారు. వారు కాంగ్రెసు సోషలిస్టులు, కమ్యూనిస్టులు, అనీ.

జోషి మీరట్ కేసులో ఉన్నాడు జైలుకు వెళ్ళాడు. ఆ సందర్భంలోనే ఆ తర్వాతనే జోషి, డాంగే మొదలగువారు కమ్యూనిస్టులుగా ఉండి రహస్యంగా సామ్యవాదాన్ని ప్రచారం చేస్తూ వచ్చారు. వారిలో చాలామంది కాంగ్రెసు సభ్యులే.

ప్రభుత్వం కమ్యూనిస్టు సంఘాలను నిషేధించింది. ఆ కారణంచేత కమ్యూనిస్టులు కాంగ్రెసులోనే ఉండి పనిచేస్తూ వుండిరి.

జయప్రకాష్ నారాయణ్, మెహరల్లీ, పుచ్చలపల్లి సుందరయ్య మొదలైనవారంతా కాంగ్రెస్లో సోషలిస్టులుగా (సాంఘికవాదులుగా) ఉండేవారు.

డాక్టరు వీరి వ్రాతలు చదివేవాడు. బోలివిజంను గురించి చదివేవాడు. 1928లోనే పరీక్ష పూర్తిచేసి, 1930లో మదరాసులో ప్రాక్టీసు ప్రారంభించాడు. డాక్టరుగారికి మొదటనుంచీ చక్కని కాతాలు ఏర్పడి మంచి హస్తవాసి అనిన్నీ, దిట్టమైన వైద్యుడు అనిన్నీ పేరుపొందాడు. 1930లో కాంగ్రెసు సత్యాగ్రహం ప్రారంభించింది. 1931 తిరిగి వచ్చింది. మళ్ళీ 1932 కాంగ్రెసువారి నందరినీ కారాగారాలలో బంధించారు. కాని చాలా మందిని ప్రభుత్వంవారు లాఠీ ప్రయోగంచేసి మాత్రం వదులుతూ ఉండేవారు.

అలాంటివారి కందరికీ ఆ రెండవ సత్యాగ్రహంలో డాక్టరుగారు వైద్యం చేసేవారు. కాంగ్రెసు శిబిరానికి వైద్యులయ్యారు. అందుచేత ప్రభుత్వంవారు డాక్టరుగారిని కూడా కారాగారవాసానికి పంపినారు. 1934లో అందరితోపాటు ఆయనా బయటికి వచ్చాడు. మరీ పెద్ద వైద్యుడై, నేలకు సునాయాసంగా పన్నెండు వందలవరకూ తెచ్చుకుంటున్నాడు.

కాంగ్రెసు ప్రభుత్వకాలంలో జనరల్ ఆస్పత్రికి గౌరవ వైద్యుడయ్యాడు.

డాక్టరు రెడ్డి వైద్యం ప్రారంభించినప్పటి నుంచీ శ్రీరంగయ్యంగారు రెడ్డిగారిని తమ కుటుంబ వైద్యునిగా చేసుకున్నారు. అలా చేసుకొనడానికి ఒక ముఖ్యకారణం వుంది. అయ్యంగారు కారులో ఓ సాయంకాలం బీచికి వెడుతూ ఉన్న సమయంలో లజ్ మూల కొంచెం పనివుండి ఆగి, మళ్ళీ కారెక్కి వెళ్ళబోయే సమయంలో, తలుపుమూస్తూ ఉంటే చేతివేలు నలిగింది.

ఎదురుగుండా రెడ్డిగారి వైద్యాలయం ఉంది. అందులోకి అయ్యంగారు పరుగెత్తి చేతికి కట్టుకట్టించుకున్నారు. అప్పుడు అయ్యంగారికి రెడ్డిగారంటే చాలా మంచి అభిప్రాయం కుదిరింది. అనాటి నుంచి రెడ్డిగారు అయ్యంగారి కుటుంబ వైద్యులయ్యారు.

3

డాక్టరు రంగనాయకులరెడ్డి ముఖ్యంగా మూలకారణవాది. కారణం లేకుండా కార్యం జరగదంటాడు. అందుకనే చెట్టియారుగారు తనకు పదివేలరూపాయల ఫీజు ఇవ్వడానికి సిద్దం అయ్యాడే, అందుకు మహత్తర కారణం వెంటనే అర్థం చేసుకున్నాడు. డాక్టరు రెడ్డికి ప్రేమ అంటే నమ్మకంలేదు. స్త్రీ పురుష సంబంధం ఒక ప్రకృతి న్యాయమని ఆయన వాదన. పురుషునికి స్త్రీ కావాలి, స్త్రీకి పురుషుడు కావాలి. స్త్రీపురుషులు జాతి వృద్ధికోసం కలుసుకుంటారు. ఆ తర్వాత ఒకరికొకరికి సంబంధంలేదు.

ఈ బిడ్డలను కనవలసింది, పెంచవలసింది తల్లి. బలంకలిగిన మనుష్యుడు ఆంబోతు వంటివాడు కాబట్టి ఇరవై ముప్పదిమంది స్త్రీలను తన జట్టులో ఉంచుకొనేవాడు. ఇప్పటి కోతుల కుటుంబాలలో, అడవి ఏనుగులు, లేళ్ళు అంతేగాదా? ఆడవాళ్ళకు పురుష సంపర్కానికి కాలం, స్థలం కావాలి. పురుషులకు అదీలేదు ఇదీలేదు.

ఇంకప్రేమ ఎక్కడ వుంది? అది మనుష్యునిలోని నీరసత్వము. చరిత్ర ప్రవాహంలో మానవసంఘం చక్కగా నడవడానికి వివాహం అనే సంస్థను ఉద్భవింప చేసుకొన్నారు మనుష్యులు. దానివల్లనే ప్రేమ అనే కొత్తభావం వచ్చింది. విషయాలు తెలిసి ఉన్న వైద్యులు ఈ ప్రేమభావం ఎల్లా ఒప్పుకుంటారు? స్త్రీ పురుషులు ఒకరి నొకరు వాంఛించడం ఒక విధమైన నరముల పొంగువలన కలుగుతుంది. ఆది ప్రేమ ఎలా అవుతుందని ఆయన వాదిస్తాడు.

కాస్త శాస్త్రజ్ఞానం అబ్బిన దేశాల్లో వ్యభిచారం ఎక్కువ అవడానికి కారణం ప్రపంచాన్ని సరియైన విధానంగా అర్థం చేసుకోవడమే. పెళ్ళి స్త్రీ పురుషుల సంబంధాన్ని, రైలుపట్టా ఎక్కించడం వంటిది అని ఆయనవాదం. అందుకనే రెడ్డిగారు వివాహం చేసుకోలేదు. అనేకమంది పెద్దలు, బాలికలు ఆయన మనస్సు తిప్పుదామని ప్రయత్నం చేశారు. కాని లాభం లేకపోయింది.

డాక్టరు రెడ్డిగారు కోనంగి అంటే ఎంతో ఆనందం పొందినాడు. చెట్టియారుగారు లక్ష రూపాయలిస్తే మాత్రం కోనంగి భయంకర రోగపీడితుడని తాను చెప్పగలడా! ఈలాంటి దొంగసొమ్ము మైలుదూరంలో ఏభైఅడుగుల లోతు కలిగిన నూతిలో పడవేయాలి అని అనుకున్నాడు.

డాక్టరు రెడ్డిగారు కోనంగిని చూడ్డానికి వెళ్ళాడు. కోనంగి కులాసాగా ఉన్నాడు. పధ్యం వంటపడుతూ ఉంది. డాక్టరు ధర్మం, అధర్మము అనేవి మత విషయికములంటే నమ్మడు. శాస్త్రరీత్యా ప్రపంచం ఒకదానితో ఒకటి శ్రుతిగా సంబంధం కలిగిన న్యాయాలతో ధర్మాలతో నిండి వుండాలి. అంతవరకూ తాను ధర్మవాదే అని అనుకుంటూ కోనంగిని “ఏమండీ ఎవ్వరనుకుంటారు మిమ్మల్ని ఎత్తుకు పోయింది?” అని ప్రశ్నవేశాడు.

“నాకు అనుమానం ఉందండి. కాని అనుమానాలు పడడం అందమైన పనికాదు.”

“అందమంటే?”

“ఆనందం ఇచ్చేది అందం.”

“ఆనందం అంటే?”

“ఆనందం అంటే ఏమిటో జవాబు చెప్పగలమా! మామిడిపండు రుచిని వర్ణించగలమా డాక్టరుగారూ!”

“శాస్త్రరీత్యా ఏ విషయమైనా మనం వర్ణించవచ్చు కాదా అండి?”

“శాస్త్రానికి భాష సరిపోదు. వర్ణించడానికి మామిడిపండు రుచీ, వాసనా ఏమని వర్ణిస్తారు?”

“బాగానే ఉంది. కాని అనేక ఉపమానాలు అవీ చెప్పి ఆనందం అంటే ఏమిటో చెప్పగలను కాదా?”

“ఓ, చెప్పవచ్చును. కాని ఎంత చెప్పినా భూమీ ఆకాశం కలిసే చోటు చూడ్డానికి బయలుదేరడంలాగే ఉంటుంది.”

“అమ్మో మీరు అసాధ్యులండోయి! అయితే ప్రేమ విషయంలో మీ అభిప్రాయం ఏమిటి?”

“ప్రేమ అండి? ఒక పురుషుడూ ఒక స్త్రీన్నీ రాసాయనికంగా కలిసి మిశ్రమైపోదామన్న కాంక్ష!

“వారెవా! మీ కెప్పుడైనా అలాంటి ప్రేమ కలిగిందా?”

“నాకా అండి? ఇంకా నన్ను నేను పరిశోధనాలయంలో పెట్టుకొని పరిశోధించుకోలేదండి?”

“ఇతరులు చెయ్యాలా? ఎవరికి వారు చేసుకుంటారా?”

“డాక్టరైన వారే ఒక మందును పరిశోధిస్తారు. ఇతరులు ఉపయోగిస్తారు. కాని తనకు తానే పరీక్షించుకోవలసి జబ్బుచేస్తే?”

“నేను ఎరిగున్నంతమట్టుకు ఏ మనిషి కా మనిషి పరీక్షంచుకొనే జబ్బు ఏమీ కనబడలేదే?”

“ఉంది డాక్టరుగారూ, ప్రేమ అనే జబ్బు!”

“ప్రేమ స్త్రీని పురుషుడు కోరడం, పురుషుడు స్త్రీని కోరడమేనా?”

“కాదండి, అంతమాత్రం అంటే సరిపోదు. అది ప్రేమలో ఉన్న ఇరవై గుణాలలో ఒకటి మాత్రం.”

“తక్కినవి?”

“ఆ స్త్రీ కనబడకపోతే పురుషుడు గోల పెట్టటం, పురుషుడు కనబడకపోతే స్త్రీ రహస్యంగా కళ్ళనీళ్ళు కుక్కుకోడం.”

"ఇంకోటి సెలవియ్యండి.”

“స్త్రీ కోరిన పురుషుడు దొరక్కపోతేగాని, పురుషుడు కోరిన స్త్రీ సన్నిహితం కాకపోతేగాని, లోకం అంతా శూన్యం అవడం.”

“లోకం అంతా అల్లాగే ఉంటుందా?”

“లోకం అల్లాగే ఉంటుంది. దానికి ఆలోచనా పాలోచనా ఉంటేనా అండి? కాని వీళ్ళిద్దరికీ లోకం ఉండదు. నిద్రపోయేవాడి మనస్సుకు లోకజ్ఞానం లేనట్లు!”

“ప్రేమ అంటే నిద్రవంటిదనా?”

“అయితే బాగానే ఉండును. లోకంలోని మనుష్యులందరూ బ్రతికి పోదురు. నిద్రపట్టనప్పుడల్లా, ఇంత ప్రేమ తెచ్చుకుంటే, నిద్రైనా పడుతూ ఉంటుంది.”

“ఇంకా ఏమిటి, ప్రేమకు ఉన్న గుణాలు?"

“దేహ కలయిక ఒకటేకాదు. మనసూ, ఆత్మాకూడా కలవాలి.”

“ఆత్మ అంటే?”

“మనస్సును మించిన ఒక శక్తి.”

“అది ఎలా ఉంటుంది?”

“అసలు మనస్సు ఎలా ఉంటుంది? అది తెలుస్తే!”

“అది తెలియదా మీకు?”

“అబ్బే! తెలిస్తే ఇకనేమండి?”

“తెలియని వస్తువులు గుణాలెట్లా అవుతాయండి?”

“ప్రాణం అంటే ఏమిటో తెలియని డాక్టర్లు ప్రాణం రక్షించడానికి పాటుపడటం లేదాండి?”

“ఎంత దెబ్బకొట్టావయ్యా కోనంగీ!”

“నేను ఇంకా బలహీనంగా ఉన్నాను. దెబ్బలు కొట్టడమే!"

“మీరు ఏం చేద్దామని మద్రాసు వచ్చారు?”

“ఉద్యోగంకోసం.”

“ఏం ఉద్యోగం?”

“అది ఇంకా నిర్ధారణ కాలేదు. అయితే బాగానే ఉండును.”

డాక్టరు రెడ్డి కోనంగిని తన యింటికి వచ్చి ఉండవలసిందని, బాగా ఆరోగ్యం కుదరగానే ఎప్పుడు రావచ్చునో తానే చెపుతాననీ" అన్నాడు. కోనంగి నవ్వుతూ “నేను బాగా వంట చేయగలనండి” అని అన్నాడు.

“మీవంట మాకేం రుచి?”

“చూస్తారుగా!”

4

కోనంగితో, “మళ్ళీ హెూటలు గుజరాత్ కు మిమ్ము వెళ్ళనివ్వను. మా ఇంట్లో ఉండండి” అని పట్టుపట్టింది అనంతలక్ష్మి.

“అది ఏం సబబండి, మీ ఇంట్లో ఉండడం? నా పనికి అడ్డం కాదుటండీ!”

“ఏమిటి మీ పని?”

“నేను పనీ పాటూ చేయని పనికిరాని వాణ్ణనేనా మీ అభిప్రాయం?”

“అయితే మా ఇంట్లో ఎందుకుండమంటాను. పనికిరాని వాళ్ళంటే నాకు ఇష్టమనా మీ ఉద్దేశం?”

“మంచి బాగా దెబ్బకొట్టావు అనంతలక్ష్మి!”

“మీ పని ఏమిటో నిజం చెప్పండి?”

“నేను ప్రయివేటు ఉపాధ్యాయుణ్ణి....”

“అయితే మీరు మా ఇంట్లో ఉండవచ్చుకదా అండి?”

“హెూటలులో వడ్డనవాణ్ణి.”

“ఆ మాట నిజమేనా?”

“అంటే?”

“చెట్టియారుగారు చెబితే నేనూ, మా అమ్మా నమ్మలేదులెండి.”

“అది నిజం శిష్యురాలా!”

“మీ కంత ఖర్మ మేమి కలిగింది?”

“కర్మబలం మానవబలంకన్న వేయిరెట్లెక్కువ. ఈ మహాయుద్దం వస్తుందను కున్నారూ ఎవరైనా? అయినా వచ్చిపడింది. జర్మనీ వాడీ విజృంభణ చూచావుకదూ?”

“ఆ జర్మనీవాడి విజృంభణ చూచాను. విజృంభించవలసిందే, పోలండు రష్యాతో సంధి చేసుకోమంటే చేసుకోందే. అందుకని సెప్టెంబరు 17-వ తారీఖునకే పోలండు పని క్షవరం.”

“ఇప్పుడీ రష్యా ఫిన్లండులకు యుద్ధమేమిటి?”

“బలవంతుడు బలహీనుల్ని తింటాడు. ఇంగ్లండు ఇండియాను వదలుతుందీ?”

“బాగా చెప్పావు అనంతలక్ష్మి! అయితే మీ బాలికలు యుద్ద విషయాలు చర్చించుకుంటూ ఉంటారా ఏమిటి?”

“ఓ యుద్ధంవల్ల మేం జాగ్రత్తపడ్డాం. ఆదో యుద్ద సమస్య. ముఖ్యంగా కావలసిన ఫేసు పవుడర్లు, పేదవి రంగులు, గోళ్ళరంగులు, మొత్తంగా కొనేసి దాచుకుంటున్నాము. ఇన్ని కత్తిబ్లేడులు కొనుక్కోరాదూ?”

“భాగ్యవంతులకు ఆ ఆ జాగ్రత్తలు. ఏ ఏ పవుడర్లు యెన్నెన్ని కొన్నావు?”

“నేనా-కూటికోరాలు రెండుడజన్లు కొన్నాను. మామూలు ఖరీదుకు పావలా ఎక్కువబెట్టి కొనేశాను! ఈవెనింగ్ యట్ పారీసు సెంట్లు, నూనెలు, పవుడర్లు వగైరాలు డజను డజను కొన్నాను. పాండ్సువారి క్రీమురకాలన్నీ డజను డజను కొన్నాను.”

“ఒకషాపు కొన్నావన్నమాట. రెండేండ్లకు సరిపోతాయి!”

రెండేళ్ళేమిటిలెండి. మూడేళ్ళవరకూ వస్తాయి. అనవసరంగా డబ్బు తగల వేయలేను.”

“ఎంత జాగ్రత్త!”

“చాలా బాగుంది లెండి. మీరు మా యింటిలో ఉండండి అన్న నా ప్రార్థనను మూలకు తోసి, ఏవేవో భావాలన్నీ తీసుకువస్తున్నారు.”

“అదికాదమ్మా, అనంతలక్ష్మి-”

అనంతలక్ష్మికి నిజంగా కోపం వచ్చింది. కోనంగిరావు మాటలను పూర్తిచేయకుండా “నన్ను అమ్మా గిమ్మా అనకండి. మీకు నామీద ఇష్టం లేకపోతే పోయింది. మీ ఇష్టం వచ్చిన చోటకు వెళ్ళండి” అని లోపలికి వెళ్ళిపోయింది.

కోనంగి ఆమెకు ఎందుకు కోపం వచ్చిందో అర్థంగాక హెూటలు గుజరాతుకు చేరాడు. హెూటలు యజమాని సంతోషంతో కోనంగిని జబ్బును గురించి అడిగి, అతడు కులాసాగా వున్నందుకు అనందం వెలి బుచ్చి, కోనంగికి తక్కిన వాళ్ళతోబాటు నెలకు ఇరవై రూపాయల జీతమూ చేసినాడు.

కోనంగి సంతోషంతో తన పనిలో ప్రవేశించాడు. ఆ దినం రాత్రి యథాప్రకారం కోనంగికోసం అనంతలక్ష్మి కారు వచ్చింది. కోనంగి.

కోనంగి అనంతలక్ష్మిగారి ఇంటికి వెళ్ళినాడు. ఉదయం అనంతలక్ష్మి ఇంటినుండి వచ్చినప్పటినుంచీ, ఎందుకో అనంతలక్ష్మికి అంత కోపంవచ్చిందని ఆలోచిస్తూనే వున్నాడు. చిన్నప్పటినుంచీ, ఆల్లారు ముద్దుగా పెరిగినపిల్ల! తల్లికి కూతురన్న ప్రాణం. బాలిక కూడా వుత్తమ గుణాలు కలిగినది. లేకపోతే చెట్టియారుగారు ఆ బాలికను కబళించకుండా వుంటాడా?

ఎందుకో అనంతలక్ష్మి తోటలో నివసించే ఆ ముగ్గురు వస్తాదులు కారును గూర్చి, ఆ మనుష్యులను గూర్చీ మరీ మరీ తన్నడిగినారు. అందులో ఒకరు “సరే తెలిసిందిరా! వాండ్లో, మేం వాండ్లకు బుద్ధి చెపుతాం అన్నాడు. ఎంత గుచ్చి గుచ్చి అడిగినా వాళ్ళు ముగ్గురూ మాట్లాడలేదు. కాని చెట్టియారుగారు అలా జయలక్ష్మిగారి ఇంటికి రావడం తమ ముగ్గురికీ ఇష్టం లేదనిన్నీ ఆ జయలక్ష్మిగారి కోరికపైనే ఆతడు రాగలుగుతున్నాడనీ చెప్పారు. “సామీ! మా అమ్మిణి అంటే మాకు ప్రాణం. రంగయ్యంగారు మాకు నిండా స్నేహితులు.. అలాగే జయలక్ష్మి. వాడికేం తెలుసు. ఆ చెట్టి పైత్తకారి అమ్మిణికేసి దురుద్దేశంతో కన్నెత్తిన మర్నాడు, వాడు ఆమెరికాదా పారిపోవాలిదా” అని అన్నారు వాళ్ళు.

అటువంటి బాలిక తనంటే ఏదో, ఎందుకో చక్కని అభిప్రాయానికి వచ్చింది. చక్కని అభిప్రాయం ఏమిటి? చప్పటిమాట! తనపై.... కొంచెం... ప్రేమ కలిగింది ఆమెకు. ఎందుకు ఈలాంటి అద్భుతమైన విషయం. తనకు తెలియకుండగా, తన మనస్సుకు తెలియకుండా మారుమూలలు దాచుకోడం? తనలో తాను తనకు బయట పెట్టుకోడం ఒంటికి మంచిది. ఆమె తన్ను ప్రేమిస్తోంది! తాను ఆ బాలికను ప్రేమిస్తున్నాడు. ఇదీ , అసలు విషయం.

ఇది నానాటికీ తమలో తామిద్దరికి స్పష్టమైపోతున్నది. యెంత చిత్రంగా ఉంది. కాని తాను ప్రేమిస్తున్నట్లు ఆ అమ్మాయికి తెలియకూడదు.

ప్రేమ అనే పదార్థం ప్రపంచంలో ఉంటుంది అని అనుకోలేదు. డాక్టరు రంగనాయకులు రెడ్డిగారు లేదు అని వాదిస్తారు. కాని అంతకన్న ప్రేమ ఏంకావాలి, మానవజీవితంలో యౌవనంలో ఉన్నటువంటీ బాలకుడు, కొంచం ఎఱ్ఱగ బుజ్జిగ ఉన్న ప్రతి బాలికలోనూ స్త్రీ పురుష సంబంధం కలగాలి అని ఆశిస్తాడు. ధైర్యంకల యువతులు, యువకులు అయితే ఆ వాంఛను తీర్చుకుంటారు. కాని తన కెందుకో మొదటి నుండి, ఈ విషయంలో వట్టిపిరికితనం, దమ్ములేదు జావకడి వ్యాపారం.

ఆంధ్రులలో, ఆంధ్రులలో ఏమిటి, సకల భారతదేశంలోను, యువతీ యువకులకు దమ్ములు తక్కువ. ఆలా ధైర్యం కలవారు, ధనవంతులలో, పెద్ద ఉద్యోగాలలోనూ ఉన్నారు. ఇంతకూ నీతి అనీ, పాపమనీ అనుకోవడం సరా, కాదా!

తాను ఉద్భవించింది అవినీతివల్లనే! అయినా వివాహం మంచిదో చెడ్డదో నిర్ణయించుకోలేకుండా ఉన్నాడు. తనలో ఏదో వివాహమే సరియైన సంస్థ అనిచెప్తుంది. తనలోని విచారణ శక్తి అది ఒప్పుకోవటంలేదు. ఈరెంటికి తనలో సమన్వయం కుదురలేదు.

కోనంగి కారులోంచి దిగి, ఆనంతలక్ష్మి గదిలోనికి వెళ్ళినాడు. ఆనంతలక్ష్మి ఏదో కోపంగానే ఉంది. కోనంగి ఆమె కోపంగా ఉందని గ్రహించాడు. మాట్లాడకుండా బల్లదగ్గర ఆమె ఎదురుగుండా ఉన్న కుర్చీమీద కూర్చున్నాడు.

ఆ కోపంలో ఆమె ఎంత అందంగా ఉంది. అందాలు ఎన్నిరకాలు. అందమైన స్త్రీ సృష్టికంతకూ కిరీటమే. ఒక్కొక్క దేశంలో అందమైన స్త్రీల అందం ఒక్కొక్కరకం అందంగా ఉంటుంది.

స్త్రీ సౌందర్యం మనుష్యుల పురోగమనానికి నిజమైన ఉత్తేజం కలుగజేస్తుంది. మనుష్యునిచేత స్త్రీ సౌందర్యము ఎంతటి ఉత్తమ కార్యమయినా చేయిస్తుంది. స్త్రీ సౌందర్యం మనుష్యుని హీనమైన పశువునిగా తయారుచేస్తుంది.

5

ఆ రాత్రి కోనంగి పాఠాలు చక్కగా చెప్పాడు. పాతపాఠాలు ప్రశ్నలువేసి పరీక్ష చేశాడు.

అనంతలక్ష్మి ముభావంగా అసలైన విద్యార్థినిలా పాఠాలు నేర్చుకుంది. కాని మామూలు హుషారు, ఆ కంఠంలో ఏది? కోనంగి పాఠాలు పదకొండు గంటలకు ముగించాడు. ఇక లేచి వెళ్ళబోతూ, “లక్ష్మీ! అంత కోపం వచ్చిందేమిటి నామీద! ఇంకా తగ్గలేదా?” అని అడిగాడు.

అనంతలక్ష్మి కంట నీరు తిరిగింది. తల వంచుకొని, కోనంగి చూడడం లేదనుకొని పైటకొంగుతో కళ్ళు తుడుచుకొంది. కాని కోనంగి చూచాడు. చూడనట్లు నటించాడు.

"లక్ష్మి....!"

"ఊఁ! ఊఁ!” అన్నట్లు తల తిప్పింది అనంతలక్ష్మి. కోనంగి “ఎందుకు నీకు కోపం రావాలో అర్థం కావటంలేదు”అన్నాడు. “శబ్దరత్నాకరం మొదలయిన నిఘంటువులలో 'కోపం' అనే మాటకు అర్థం రాస్తాడు గాని, అనంతలక్ష్మికి కోపం ఎందుకు వచ్చిందో రాయడుగా! అందుకు అర్థం ఏమిటని అడిగాను” అన్నాడు.

అవును ఎందుకు రావాలి కోపం తనకు? తనకూ అర్థం తెలవదు. ఎవరు చెప్పగలరు? అనుకుంది అనంతలక్ష్మి.

“అనంతలక్ష్మి! నేను మీ ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోయాను అని నీకు కోపం వచ్చిందా, లేకపోతే నిన్ను 'అమ్మా' అని పిలవడంవల్లనా?” అని ప్రశ్నించాడు కోనంగి.

అనంతలక్ష్మి దగ్గిరకుపోయి కోనంగి ఆమె భుజంమీద చేయివేసి “అనంతం! ఇల్లా తిరుగు” అని కోరాడు. అనంతలక్ష్మి చటుక్కున కోనంగివైపు తిరిగి, కరిగిపోయి, అతని పాదాలపై వాలి, “మీరు మా ఇంట్లో ఉండిపోండి” అని అన్నది.

కోనంగి గుండె గుబగుబలాడుతూ ఉండగా ఆమెను లేవనెత్తాడు. వెంటనే అనంతలక్ష్మి అతని చుట్టూ చేతులు పోనిచ్చి, గాఢంగా అతన్ని తన హృదయానికి అదుముకొని తన మోము అతని హృదయంలో దాచుకొన్నది. కోనంగి పులకరించాడు. ఉప్పొంగిపోయాడు. ఆమెను తనకు ఇంకను దగ్గరగా లాక్కొని, కుడిచేతితో ఆమె మోమునెత్తి ఆమె కళ్ళల్లోంచి చూస్తూ “లక్ష్మి! ఈ బిచ్చగా.....”

“అలా అనకండి. నాకు మీకంటే, ఇతరులు కోటీశ్వరులు అయినా అక్కరలేదు” అన్నది.

ఇంతట్లో జయలక్ష్మి “అమ్మిణీ! ఇంకా పాఠాలు కాలేదా” అంటూ వస్తున్న చప్పుడు అయింది. అనంతలక్ష్మి కోనంగి విడిపోయారు. కోనంగి ఆ పక్కనే ఉన్న కుర్చీపైన కూర్చున్నాడు. అనంతలక్ష్మి నిలుచుండి ఉన్నది. జయలక్ష్మి వారిద్దరి దగ్గరకు వచ్చేలోపున, కోనంగి అనంతలక్ష్మికి ఒక్కదానికే వినబడేటట్లుగా “లక్ష్మీ! ఈ విషయం మనిద్దరం మాట్లాడేవరకూ ఏమీ ఎవ్వరికి చెప్పకు...” అన్నాడు.

జయలక్ష్మి వచ్చింది. “కోనంగిరావుగారూ, ఇవాళ పాఠాలు ఇంత ఆలస్యమయ్యాయి ఏమిటి?” అని ఆమె కోనంగిని అడిగింది.

కోనంగి: పరీక్షకు పంపించే పరీక్ష వస్తోంది. పదిహేనురోజులన్నా లేదు. అందుచేత పాత పాఠాలన్నీ తిరగవేస్తున్నాము.

జయలక్ష్మి: ఏలా ఉన్నది అమ్మిణి?

కోనంగి: అమ్మిణికేమండి! తెలుగులో మొదటి మార్కులు కొట్తుంది

అనంత: అమ్మా! రావుగారు ఇంగ్లీషులోనూ దిట్టమైన చెయ్యి. అన్నీ బాగానే చెప్తారు. కాని ఇంకా కొంచెం ఆ పాఠాలు నాకు గట్టిపరచాలి. హెూటలులో మానేసి మనింటిలో ఎందుకుండకూడదు ఈ పదిహేను రోజులూ?

కోనంగి: నాకు ఏ మాత్రం వీలున్నా పది హేనురోజు లేమిటి, పది హేను సంవత్సరాలుండమంటే ఉంటాను. కాని, ఉద్యోగమో, మగవాడికి ఉద్యోగం పురుషలక్షణం.

జయ: ఆ ఉద్యోగం ఉంటే ఏమిటి, వుండకపోతే ఏమిటి?

కోనంగి: ఏ ఉద్యోగమయినా అది పురుష లక్షణమే కాదండీ?

అనంత: ఏం పురుష లక్షణమండీ! ఇంతకూ నాకు ఇంగ్లీషు చెప్పరన్నమాట. కోనంగి: అల్లా అన్నానా? అనంత: పైకి స్పష్టంగా చెప్పాలా?

కోనంగి: ధ్వనిగా సూచించానన్నమాట!

అనంత: మౌనంగా మాట్లాడారన్న మాట! జయ: ఇంతకూ కోనంగిరావుగా రేమంటారు?

కోనంగి: నేను ఆ హెూటలు ఉద్యోగం మానివెయ్యడమేనా? కాబట్టి సాయంకాలం కొంచెం పెందరాళే కారు పంపండి. మీ ఇంట్లోనే భోజనం. అయిదున్నరకు పంపండి. అక్కడ నుంచి ఇంగ్లీషు, తర్వాత భోజనం, తర్వాత తెలుగు. ఇది నచ్చుతుందా అనంతలక్ష్మి!

జయ: చాలా బాగుంది!

అనంత: సంపూర్ణంగా మా ఇంట్లో ఉంటే బాగుండును. అయినా మీ యిష్టం. మాకు డిశంబరు రెండోవారం అంతా శలవు. మూడోవారం అంతా పరీక్షలు. అక్కడ నుంచి రెండువారాలు క్రిష్టమస్ సెలవులు.

జయ: నేను కాదంటున్నానా!

అనంతలక్ష్మి విసవిస లోనికి వెళ్ళిపోయింది. జయలక్ష్మి తెల్లబోయింది. కోనంగి పక పక నవ్వాడు. “మా చదువుకున్న వాళ్ళకు అనుకున్న పని కాకపోతే కోపం వస్తూవుంటుంది” అన్నాడు.

జయలక్ష్మి అవునని తల ఊపింది. తీరా కోనంగిని పంపిద్దామని పోర్చికోలోకి వస్తే కారు లేదు. వినాయగంపిళ్ళ అక్కడకు వచ్చి, “అమ్మిణ్ణి, కారు డ్రైవరును వెళ్ళిపొమ్మని చెప్పింది. అందుచేత వెళ్ళిపోయాడు.” అని చెప్పాడు జయలక్ష్మితో. జయలక్ష్మి కోనంగి. ఇద్దరూ ఆశ్చర్యం పొందారు.

ఏం చేస్తుంది జయలక్ష్మి? కోనంగిరావుని తీసుకొని ఇంటిలోనికి పోయింది. పనిమనిషిని పిలిచి, కోనంగిరావుకి వారి వెనుక గది సిద్దం చేయమంది.

కోనంగి పందిరి మంచంమీద పడుకొని ఏమిటి అనంతలక్ష్మి ప్రేమ? ఈ బాలిక తన్ను గాఢంగా ప్రేమించిందా, లేక యౌవనపు ప్రథమ సంవత్సరాలలోని కాంక్షలను ఈ రీతిగా తీర్చుకొంటున్నదా? తనకూ స్త్రీ వాంఛ కలుగుతున్నమాట నిజమే! కాని ఫలానా స్త్రీ అన్నది లేదు. అసలు సౌందర్యం స్త్రీ సంపర్కభావం కలిగింది. ఈనాడు హృదయం మధ్య ఈ అందాలబాల చేరింది. ఇది పెద్ద గడ్డు సమస్య తనకు.

తానా బీదవాడు, రేపటి తిండి ఎట్లాగో తెలియక వీధుల గడిపే పాంథుడు. ఈ బాలిక ఐశ్వర్యవంతురాలు. తన కీ సమయంలో వివాహం ఏమిటి? వివాహం చేసుకుంటేగాని, తనకూ, స్త్రీకీ సంబంధం ఉండకూడదు. అది పెద్ద వేదాంతభావము కాదు. నైతికభావమూ కాదు. అది మానవ న్యాయం.

పెళ్ళిళ్ళు జాతికి ఒక చక్కని రహదారి మార్గం వంటివి. పురుషుడు వేడి ఎక్కి ఇష్టం వచ్చినట్లు సంచరించవలసిన అగత్యమేమి? అమెరికాలోవలె వివాహాలు చేసుకోవచ్చును. రద్దు చేసుకోవచ్చును. స్త్రీ పురుష సంబంధం కలుగజేసుకుందామను కున్నప్పుడు వివాహం చేసుకొని, ఇష్టంలేనప్పుడు విడిపోవచ్చును. ఇంత చక్కని రాజమార్గం ఉంటే, అమెరికాలో కూడా, వట్టి మూర్ఖదారుల తిరుగుతారెందుకో స్త్రీ పురుషులు.

అతడు నెమ్మదిగా నిద్రకూలాడు. తెల్లవారగట్ల కలలు వచ్చాయి. యేవేవో అస్పష్టమైన కలలు. ఇంతగా తాను ఎక్కడో పొలాలలో కూలి వానిగా ఉన్నాడు. అనంతలక్ష్మి కూలిపిల్లగా చక్కా వచ్చింది అక్కడకు. తాను ఆమెను తప్పించుకొనడానికి ముందుకు పరుగు, ఆమె తరుముకు వచ్చింది. తానేదో కాలికి తగిలి క్రిందపడినాడు. అనంతలక్ష్మి పకపక నవ్వుతూ, “దొంగ దొరికాడు” అంటూ తనమీదవాలి భుజాలు రెండూ గట్టిగా పట్టుకుంది.

అతనికి చటుక్కున మెలకువ వచ్చింది. అనంతలక్ష్మి దేవతా బాలికలా తనమీదకు వ్రాలి రెండు భుజాలు పట్టుకొని, “ఇంకా నిద్దురే. తెల్లవారింది, ఎండ వచ్చింది, లెండి!” అని కదుపుతోంది.

6

కోనంగి గబుక్కున లేచి కూర్చున్నాడు.

“మీమీద ప్రేమ నన్ను గాఢంగా పొదివికొంది. నన్ను అమ్మతో చెప్పనే చెప్పవద్దన్నారు ఈ విషయం. అమ్మ స్నానం చేస్తోంది. స్నానం అవగానే జపం చేస్తుంది. అంతవరకూ బయటకు రాదు. అప్పటివరకూ కాఫీ అయినా తాగదు కాబట్టి మనం మాట్లాడుకునేందుకు కావలసినంత వ్యవధి ఉంది” అని అనంతలక్ష్మి తలవాల్చి అన్నది.

కోనంగి: అనంతలక్ష్మి, మీ అమ్మగారు నన్ను నువ్వు ప్రేమించడానికి వప్పుకోరు.

అనంతలక్ష్మి: మీరు ప్రేమిస్తున్నారా లేదా?

కోనంగి: నేను నిన్ను ప్రేమించకుండా ఉండగలనా లక్ష్మీ! నువ్వు నా దేవతవు. నేను ప్రేమ అనేది ఎరుగను. అది ఉంటుందనే తెలియదు. స్త్రీని అప్పుడప్పుడు వాంఛించాను. కాని వివాహం కాకుండా స్త్రీ సంపర్కం అనుభవించడం నా మతం కాదు. నాకు అర్థం కాదాభావం. ప్రేమ అన్నా ఉండాలి, అనుకూలమైన దాంపత్యమన్నా కావాలి. నాకు స్త్రీవాంఛ కవిత్వవాంఛ, సంగీతవాంఛ వంటిది. స్త్రీలకు పురుషవాంఛ, పురుషులకు స్త్రీవాంఛ, ఏదో ఉత్తమ పథాలలో ఉండాలని అనుకుంటాను. అందుకని నాలో కలిగిన స్త్రీ వాంఛ, ఏ ఒక్కస్త్రీ అని కాక ఒక ఉత్తమ స్త్రీ అనే. నువ్వు కారు డ్రైవు చేస్తున్నప్పుడు మొదటిసారి నిన్ను చూచినప్పుడే, ఈమె నా బాలిక, నా ప్రియురాలు, నా బ్రతుకురాణి అనుకున్నాను.

అనంత: నాకు పెళ్ళి అయివుంటే ఏమిచేద్దురు?

కోనంగి: నేను ప్రేమించబోతూ ఉంటే నీకు పెళ్ళయి ఏలావుంటుంది?

అనంత: ఇంతకు మీరు ఆలోచించిన సంగతి ఏమిటి?

కోనంగి: నేను ఏమీ ఆలోచించలేదు. నువ్వు నా సర్వలోకేశ్వరివి. అదే భావం నాకు ప్రస్తుతము. కాని ఆలోచించినకొద్ది, నేను నీకు తగుదునా! నేను ఎవరిని అన్న

అనంత: అన్న! అన్నాలేదు, చెల్లెలూలేదు. ఒకటిమాత్రం ఆలోచించండి, మీరు నన్ను

కోనంగి: ఉండు ఉండు. నెమ్మదిగా ఆలోచించుకొందాము. మనం ఈ విషయాలలో తొందరపడకూడదు.

అనంత: నెమ్మదిగా సంవత్సరాలు ఆలోచించాలి కాబోలు!

కోనంగి: నెమ్మదిగా నిముషాలు ఆలోచిస్తేచాలు.

అనంత: అప్పుడే మీరు లేచి అరగంట కావచ్చింది. ఇంతవరకూ ఏమీ ఆలోచించరేమి?

కోనంగి: నువ్వు ఎదురుగుండా ఉంటే ఆలోచన ఏమి సాగుతుందీ?

అనంత: నేనంత అసహ్యంగా ఉన్నాను కాబోలు, పోనీలెండి. నేను వెళ్ళిపోతాను.

కోనంగి: వెళ్ళూ! నా ప్రాణాలు నీతోనే వస్తాయి. నేను వట్టికట్టెలా పడుకొని ఉంటానులే!

అనంత: మీ ప్రాణాలు నాతో కూడా ఎందుకు? ఒక్కదాన్ని నీళ్ళుపోసుకుంటోంటే ఎవరో చూస్తున్నారని భయపడడానికి!

కోనంగి: లక్ష్మీ! నువ్వు లక్ష్మీవి, నేను -

అనంత: ఆ మాటలన్నీ వద్దండి గురువుగారూ -

కోనంగి: చెట్టిగారు కోటీశ్వరులు -

అనంత: ఈలాంటి మాటలు ఇంకా రెండు మాట్లాడితే -

కోనంగి: ఈ ఆడవాళ్ళతో ఇదే గొడవ.

అనంత: మగవాళ్ళతో ఇలాంటి గొడవ లుండవు కాబోలు?

కోనంగి: పరీక్షయ్యేవరకూ ఈ గొడవలన్నీ కట్టిపెట్టడం మంచిది కాదా లక్ష్మీ.

అనంత: ఇదీ గొడవే?

కోనంగి: సరియైన సందర్భాలు కుదరకపోతే అన్నీ గొడవలుగానే ఉంటాయి.

అనంత: మీకిది అంతా గొడవగా ఉంటే నేను వెళ్ళిపోతాలెండి.

అనంతలక్ష్మి లేచి విసవిస వెళ్ళిపోయింది. ఉదయమేలేచి, స్నానం చేసి, చక్కనిచీర, రవికా ధరించి, అందంగా అలంకరించుకొని, సౌందర్యాలు మూటలు కట్టినట్లు వచ్చిన అనంతలక్ష్మిని చూస్తూ ఆనందిస్తూ సర్వమూ మైమరచి కూచోక, భార్యను భర్త చెప్పినట్లు పిచ్చి వేళాకోళాలు చేసి అలా తరిమివేస్తే ఏమి బాగుంటుంది. మంచి శిక్ష చేసింది. ఏదో రొట్టి నేతిలో వేసుకు పుట్టాడు గనక, ఆ బాలికను తాను ప్రేమించినట్లే తన్ను ఆమెకూడా మొదటినుంచీ ప్రేమించసాగింది.

ఆ అదృష్టానికి సంతోషించక, లేచి నాట్యమాడక, నూరు టీ పార్టీలు చేయక, తనకు తానైనా వేయి అభినందన తంతులు పంపుకోక, ఈలా కుశ్శంకలు పట్టుకుని కూర్చున్నవాడి గతి ఇంతే.

తనంత అసలైన తెలివితక్కువ ఆంధ్రుడు ప్రపంచంలో ఇంకోళ్ళు ఉండరు! తన కెందుకు అనంతలక్ష్మిని పెళ్ళిచేసుకోడానికి ఇంత భయం? తాను వట్టిబీదవాడు. ఉద్యోగం లేదు. ఉద్యోగం ఇచ్చేవారులేరు. ఇచ్చేవారు ఒకరిద్దరున్నా, వాళ్ళు ఏ వంటవాడి పనో, గుమాస్తా పనో ఇస్తారు. లేకపోతే ఇప్పిస్తారు. అంతకన్న తనకు ఇంక గతి ఏమిటి?

ఈలాంటి తాను, భాగ్యనిధి, సౌందర్య సముద్రమూ అయిన ఒక బాలికను పెళ్ళిచేసుకోవడమే! తనది దొంగ ఎత్తన్నమాటే కాదూ! తనలో కూడా బూర్జువాతనం సంపూర్ణంగా ప్రవేశించింది. గాంధీగారు అహింసా, సత్యాగ్రహ తత్వాలు వ్యతిరేకించాయి అన్నమాటేగా?

తాను నెమ్మదిగా ఈ బాలిక జీవితంలోంచి తప్పుకుందామనుకుంటే, తనలో వుద్భవించిన ఆ నీరసత్వం, తన్ను వట్టి పిరికివాణ్ణిగా చేసి పారవేస్తుంది. తనలో ఒక వీసమెత్తయినా గౌరవమూ గర్వమూ వుంటే, తాను అనంతలక్ష్మిని వీడి వెళ్ళిపోవాలి. చిన్నతనంలో, ఎన్ని బొప్పెలు కట్టినా, త్వరలో మరిచిపోతాం. ఎంతమంది యువకులు తాము గాఢంగా ప్రేమించాము అనుకున్న భార్యలు తమ్మువిడిచి, దేహంచాలిస్తే, వెంటనే నెలలన్నా కాకుండా, రెండవ భార్యలను చేసుకోలేదు?

ఎంతమంది యువతులు తమ దైవము అనుకున్న భర్తలు పోతే, నిముషంలో ఊరటపొంది, మామూలుగా తిరగటంలేదు. వారి విచారం అంతా వైధవ్య చిహ్నాలు ధరించి విధవా జీవితం భరించవలసినదనే.

అలాగే తాను అనంతలక్ష్మిని వదిలి వెళ్ళిపోతే ఆ బాలిక కావ్యంలోలా తన్ను ప్రేమించి వుండకపోతే ఒక నెలరోజులలో మరిచిపోతుంది. లేదా తన్ను తలంచుకొని దుఃఖించడం మానివేస్తుంది. తాను అనంతలక్ష్మిని కావ్యంలోలా ప్రేమిస్తుంటే, ఆమె తన హృదయంలో, ఆత్మ అనే పదార్థంలో వుంచి షోడషోపచారవిధిగా అర్చిస్తూ వుంటాడు. తాను బాధపడినా, ఆ బాధంతా మగవానిలా భరించాలి. అంతేకాని ప్రబంధ నాయకులులా ఏడుస్తూ కూర్చోకూడదు.

అతడు లేచాడు. మొగం కడుక్కొని, స్నానాదికాలు కావించి, కాఫీకని హాలులోనికి వచ్చి కూర్చున్నాడు. అనంతలక్ష్మికి కోపం రావడం చాలా మంచి దనుకున్నాడు. ఆ బాలికకు ఈ ఏడాది బాగా చదువుచెప్పి, ఆ తర్వాత ఆమె కంటికి కనబడకుండా వెళ్ళిపోవచ్చు. ముష్టి ఎత్తుకొని తిరిగేవాడికి లోకం అంతా వాడిదే!

కాఫీ వగైరాదులు పుచ్చుకొన్నాడు. లోపలికి వచ్చాడు. హెూటలు గుజరాతుకు బస్సు ఎక్కి చేరుకున్నాడు. ఆ రోజు జీతం నష్టం అని హెూటలు యజమానితో చెప్పితే, యజమాని మండిపోయి “నువ్వు నాకు వద్దయ్యా” అని చెప్పినాడు.

“అవునండీ, ఎవరిక్కావాలి ఈ దరిద్రఘటం. ఘటవాద్యానికి పనికిరాదు. నీళ్ళు పోసుకోడానికీ పనికిరాదు. అమ్మవారి ఘటపూజకూ పనికిరాదు”అని లోనికిపోయి కోనంగి బట్టల పెట్టి సర్దుకుంటూవుంటే, తోటి అరవబాలకుడు పరుగునవచ్చి “నిన్న రాత్రి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత, ఎవరో రెడ్డిగారుట. ఒక నాటుకోటిచెట్టి వచ్చి మన మేనేజరుతో చాలాసేపు గుసగుసలాడారు. మన నాయరు “శంకరన్' రెండు మూడు ముక్కలు విన్నాట్ట. నీ మాటే నూరుసార్లు వచ్చిందట. నిన్ను పంపించివేయమని పట్టు పట్టాడట” అని కోనంగికి చెప్పాడు. “అంతకన్న ఏం కావాలి మణీ! సరే: నేను వెళ్ళి కొన్నాళ్ళపాటు నల్లతంబి నెల్లూరు హూటలులో ఉంటాను. ఈ బూర్జువాల ప్రతాపం అంతా మనబోటి హెూటలు కుఱ్ఱవాళ్ళమీదే! ఈలాంటి బూర్జువాలను చేపల దండలులా గుచ్చే సామ్రాజ్యవాదులు వస్తే ఈదద్దమ్మలు తమ కాళ్ళకు ఎంత బలం ఉందో పరీక్ష చేసుకోవడం ప్రారంభిస్తారు. ఇక సెలవు, మనం కలుసుకుంటూ ఉందాం. గాంధీమహాత్మాకీ జై! బూర్జువాలు మురదాబాద్!” అంటూ ఒక రిక్షా చేసుకొని నల్లతంబి నెల్లూరు హెూటలు చేరుకున్నాడు.