Jump to content

కోనంగి/తృతీయ పథం

వికీసోర్స్ నుండి


తృతీయ పథం


సందుగొందులు

'

చెన్నపట్నం సందులు వేనకువేలు. పాత చెన్నపట్నమైన జార్జిటౌనుకు పూర్వం పేరు బ్లాక్ టౌను. ఈ జార్జిటౌనులో ఒక వీధి పొరపాటు నన్నా వెడల్పు ఉండదలచుకోలేదు.

ఆ వీధులలోకల్లా మహా వెడల్పయిన వీధీ 'బ్రాడ్వే' బ్రాడ్ వే అంటే వెడల్పుదారి అని అర్థం. ఇక దాని వెడల్పంటారా పదిగజాలు. అలాంటి వీధిలో మేడమీద మేడ, ఇంటిమీద ఇల్లు, బజారుమీద బజారు, షాపుమీద షాపు, హెూటలుమీద హెూటలు, వెత్తలపాకు కొట్టుమీద కొట్టు, ఎప్పుడూ ఒక కుంభమేళాలా ఉంటుంది.

వీధుల పేర్లన్నీ లక్ష్మీదేవి నాట్యంచేసే పేర్లు. ఒకటి టంకశాలవీధి, ఒకటి ముత్యాలవర్తక వీధి, ఒకటి పగడాల బేరగానివీధి, లింగసెట్టి, తంబు సెట్టి, ఎఱ్ఱు బాలసెట్టి వగైరా సెట్టుల వీధులు. గిడ్డంగివీధి, చీనాబజారు, ఆవల ఒకటే ధనపూర్ణాలైనవి.

కాని ఇంతవరకు మదరాసు వర్తకాన్ని రాజ్యంచేసిన ఆంధ్ర శ్రేష్ఠులు నానాటికి తీసికట్టు నాగంభొ ట్టు అయిపోయారు. మారువాడీలు, గుజరాతీ శ్రేష్టులు, బొంబాయి భోజాలు మదరాసు వర్తకం అంతా గుంజు కొన్నారు. ఆంధ్ర చెట్టియార్లు, బంగారు గొలుసు, వజ్రాల తమ్మంట్లు వేసికొని చిన్నచిన్న కాగితాలకోట్లు, గుడ్డలకోట్లు పెట్టుకుంటున్నారు.

కాఫీ హెూటళ్ళలో కూడా అరవయ్యర్ల ప్రభావం తగ్గిపోయింది. ఉడిపివారి సామ్రాజ్యాలు స్థాపితమైపోయాయి. తమలపాకుల దుకాణాలలోంచి పిళ్ళలు, మొదలియార్లు మాయమై, మలబారు నాయర్లు నిండిపోయారు. పండులా ఉంటారు, మెండుగా స్నానం చేస్తారు, దండిగా విభూతిపెట్టారు, నిండా అందంగా ఉంటారు వారూ వారి ఆడవారూ.

ఇవన్నీ మా కోనంగి చూస్తూ మదరాసు ఎన్ప్లనేడు తిరుగుతున్నాడు. అతని అనందం పోదు, ఆశ వదలదు, హాసం మాయమవదు. ఇన్ని చదరపు మైళ్ళ మదరాసులో తనకు ఉద్యోగమే దొరకదా? పోతే వైటువే కంపెనీ ఉద్యోగం పోయిందిగాక. ఆ పోవడమూ ఊరికేపోయిందా? కోనంగిగారి అతి ఉత్సాహమే అతని ఉద్యోగానికి షష్టాష్టకమైంది. తీన్తేరా అయింది, ఆర్ అఠారా అయింది.

వైట్ వే కంపెనీలో ఉద్యోగంచేసే అందరితోనూ కోనంగిరావు అయిదు రోజులలో స్నేహంచేశాడు. కొందర్ని "హల్లో జార్జి” అంటాడు; “ఏమిటి బ్రదర్' అంటాడు. కొందర్ని “ఎన్నా సమచారం స్నేహిదన్" అని అంటాడు: మరికొందర్ని "వెల్ మైడియర్! ఎలా వుంది వ్యాపారము?” అని ఇంగ్లీషులో పలుకరిస్తాడు ఆంగ్లో ఇండియన్ బాలికల్ని అందులో సారా' అనే ద్రాక్షసారాయవంటి అందమయిన బాలిక ఉంది.

కోనంగిరావు ఆ బాలికతో మంచి సహవాసం చేశాడు. ఈ జాతి ఆశయం ఏమిటి? ఈ బాలికల ఆలోచన లేమిటి? వీరికి స్త్రీ పురుష పరమ ధర్మమైన ఆలోచనలుతప్ప ఇంక ఏమీ ఉండవంటారు. నిజమా? అని తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది. స్నేహం విషయంలో కోనంగికి అందరూ ఒకటే. అందరూ ప్రాణ స్నేహితులే. మనస్సులో ఏమన్నా దురుద్దేశాలుంటేనా?

సారా చాలా అందంగా ఉంటుంది. కొంచెం పొడుగరే! ఎత్తుమడమల జోడుతో ఒక అంగుళం తగ్గుగా కోనంగితో సమానంగా ఉంటుంది. కోనంగే సమోన్నతం కలవాడు. అంటే అయిదడుగుల ఏడంగుళాలవాడు. పెద్ద బలమైనవాడు కాదు. కండపుష్టి సామాన్యం. కనుముక్కుతీరు సామాన్యం. కాని అతని ఆనందం అతనికి ఏదో అందం నమకూరుస్తుంది.

ఒక పుట్టెడు వ్యక్తిత్వంకల మనిషి. కొత్తలేదు, నదురు బెదురు లేదు, తొణుకు బెణుకు లేదు.

సారాకు మొదటనుంచి కోనంగి అంటే ఎంతో గౌరవం కలిగింది. అపేక్ష పుట్టింది, గాఢస్నేహం చెయ్యాలనీ వాంఛ ఉద్భవించింది. రోజూ ఇద్దరూ మాట్లాడుకుంటూ పోయేవారు. రెండు మూడుసార్లు సారా కోనంగిని తనింటికి పిలిచింది. కోనంగి మాటలకు పకపక నవ్వేది. కోనంగిని భుజాలు పట్టి కదిపివేస్తూ నవ్వేది.

ఎవ్వరితోనూ ఎప్పుడూ మాట్లాడదు. తనమీద తనకు గౌరవమూ, ఒక విధమైన బిడియమూ సారాను ప్రత్యేక భౌతికను ఒనరించాయి. అలాంటి ఆ బాలిక కోనంగి. అంటే ఒక్కసారిగా పుష్పంలా విరిసిపోయింది, అతనితో కంపెనీ పరిసరాలలో ముభావంగా ఉన్నా, అది దాటిన వెంటనే, చెల్లెలుకన్న ఎక్కువగా చనువు చూపించసాగింది. కోనంగి ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలమీద ఉపన్యాసాలు, అంగన్యాస, కరన్యాస, నాశికన్యాస, లోచనన్యాస పూర్వకంగా కుంభవృష్టి కురిపించేవాడు. వారి సంభాషణాలు ఎక్కువగా సినీమాలమీద విరుచుకుపడేవి. విరుచుకుపడడం అంటే పెళ్ళున విరుచు పడడమే.

కోనంగి: అబ్బ! ఏమిటమ్మా ఆ పిగ్మీలియాను, ఏమిచిత్రమండి!

సారా: ఏమిటయ్యా అందులో ఉండే అందం!

కోనంగి: ఓ వెట్టి అమ్మాయి! ఏమి నంగనాచిలా మాట్లాడుతున్నావే!

సారా: ఏమిటి నా నంగనాచితనం? ఆ అమ్మాయి వేషం వేసినతార, ఇదివరకే అతి తెలివిగల తార! అందుకని ఆ బొమ్మలో నిజమైన భావంలేదు.

కోనంగి: లేకపోతే నిజమైన చేపలబజారు మనిషిని తీసుకవచ్చి, మహారాణిలా తయారు చేయమన్నావా సినీమా కంపెనీవాణ్ణి? దివాలాతీసి ఊరుకుంటాడు.

సారా: ఆ అమ్మాయిని, ఆ ప్రసిద్ద విద్యావేత్త ఆరునెలలలో నాగరిక బాలిక క్రింద తయారుచేస్తానన్నాడా లేదా?

కోనంగి: అవును. నేనయితే ఆరురోజులలో తయారుచేస్తానందును!

సారా: తయారు చేయగలిగి ఉందువా?

కోనంగి: ఓ! నిన్ను మాంచి తెలుగు అమ్మాయిగా తయారుచేసి ఉందును.

సారా: ఎన్నేళ్ళకు?

కోనంగి: పదిహేనేళ్ళకు.

సారా: ఆరురోజు లన్నావే!

కోనంగి: పదిహేనేళ్ళ బంగారు బొమ్మని అని నా ఉద్దేశం.

సారా: పది హేనేళ్ళ బంగారు బొమ్మని, వెండిబొమ్మగానా, వజ్రపు బొమ్మగానా?

కోనంగి: ప్లాటినంబొమ్మగా!

సారా: ఆ పిల్ల నిన్ను మోహించి ఊరుకుంటుంది.

కోనంగి: నేను ఒప్పుకొని ఊరుకుంటాను.

సారా: అయితే నన్ను తయారుచేయి!

కోనంగి: మా భాషలో సారా అంటే మత్తురసం. నిన్ను సారా నల్లా ద్రాక్షసారాగా చేయగలను.

సారా: ఏదీ, చేయి పందెం వేద్దాము!

కోనంగి: ఆమ్మో! సారా తాగేవాళ్ళకి మత్తువచ్చినట్టు, నిన్ను తయారుచేస్తుంటే నేను మత్తువచ్చి పడిపోతే!

సారా: బెర్నార్డుషా ఓడినట్లే!

కోనంగి సారా ఇంట్లో టీ త్రాగి తన నెల్లూరి హెూటలుకు చేరాడు.

ఓ లక్ష్మివారం కాసినోలో మంచి ఆంగ్ల నాట్యచిత్రం వచ్చింది. డాన్ ఆమెచీ, కార్మెన్ మిరాండాలు నటిస్తున్నారు. బుధవారంరోజు సాయంకాలం కోనంగిని తనతో ఆ చిత్రం చూడడనికి రమ్మని సారాకన్య కోరింది. రాత్రి 9-30 గంటల ప్రదర్శనానికి వెడదామంది. జార్జిటౌనులో ఉన్న తనింటికి తొమ్మిదింటికి వస్తే ఇద్దరూ కలిసి కాసినోకు రావడం అని నిర్ణయించు కున్నారు.

2

కాసినోకు అయిదురూపాయలు ఖర్చుపెట్టి టాక్సీమీద తీసుకు వచ్చాడు సారాను కోనంగేశ్వరరావు. సారా ఘుమఘుమలాడుతూ వచ్చికూచుంది కారు వెనక సీటులో. తాను సారాకై తలుపు తెరచి ఉంచి నందున తానున్నూ లోపలికి పోయి తలుపు వేసుకొని కారు పొమ్మన్నాడు.

ఈ పాశ్చాత్య ఆచారాలన్నీ కోనంగి సినీమాలు చూచి నేర్చుకున్నాడు. ఆ రోజున తెల్లకోటు వేసికొని సాయంకాలపు టోపీ పెట్టుకొని కోనంగి కొంచెం పెద్దరికపు యూరోపియను యువకునిలా తయారై ఉన్నాడు. తాను సాయంకాలమే అయిదురూపాయల టిక్కట్లు రెండు కొని ఉంచాడు. అందుచేత ఒక ఇంగ్లీషు లార్లు ఒక ఇంగ్లీషు డచ్చెసును తీసుకువెళ్ళినట్లు సారా తనచేతిపై చేయివేసి యుండగా నెమ్మదిగా తమ నియమిత స్థలానికి తీసుకువెళ్ళినాడు. అక్కడ దారి చూపించేవాడు వినయముతో దారి చూపించాడు.

బాక్సు, డ్రెస్ సర్కిలు మొదటి తరగతి మేడమీద ఉంటాయి. అక్కడ ఆ సమయంలో ఇంగ్లీషు వర్తకులు, ఇద్దరు ముగ్గురు ప్రభుత్వ కార్యదర్శులు, సేనానాయకవర్గంవారు, ఇంగ్లీషు వర్తకుల భార్యలు, బిడ్డలు ప్రభుత్వకార్యదర్శుల భార్యలు, బిడ్డలు తళతళలాడుతూ నిండి ఉన్నారు. అందులోకల్లా కోనంగీ, సారా ఇద్దరూ రాజకుమారుడు రాజకుమారికలా ఉన్నారు. సారా ఉప్పొంగిపోయింది.

ఎవరో ఒక ఇంగ్లీషు పెద్దమనిషి కోనంగిని చూచి ఇతడొక జమీందారుని కొమరుడు అని ప్రక్కన ఇంగ్లీషు మనిషితో అన్నాడు.

“ఏవూరు జమీందారుని రాజకుమారుడు?”

“ఏదో జ్ఞాపకంలేదు.”

“ఓహెూ అలాగా?”

“అవును.”

“అతని పక్క బాలిక ఎవరు?”

“ఆవిడ ఆతని భార్య. ఒక ఫ్రెంచిబాలిక. నేను మన మెయిల్ పత్రికలో వెనక చూచినట్లు జ్ఞాపకం.”

ఈ ముక్కలు కోనంగి విన్నాడు. తాను రాకుమారుడే. బందరు గొడుగు పేటకు తాను రాజకుమార్ కాడా! అవును. ఇంతట్లో చాకలేట్టూ ఆవి పట్టుకొని ఒక “బోయి” వచ్చివంగి వినయంతో చాకలేట్లు, సిగరెట్లు వగైరా పళ్ళెం వీరిరువురూ కూర్చున్న ఆ చక్కని సోఫాముందు పట్టుకొన్నాడు.

కోనంగి చిరునవ్వుతో సారావైపు చూచి "ప్రియతమా! నువ్వు అంబరెల్లాపేట్ రాజకుమారివయ్యు నాలుగు మంచి చాకలేట్లు పుచ్చుకోవే?” అని ప్రశ్నించాడు.

సారా నవ్వుతూ మంచి చాకలేట్లు రెండు పుచ్చుకొంది. ఆందుకు ఆయన అయిదురూపాయలు ఇస్తూ ఒక పావలా వాడికి బహుమానం ఇచ్చాడు. వాడు పదిసలాములు పెట్టి వెళ్ళిపోయినాడు.

వాడు “అంబరెల్లా పేట రాజకుమారికవు కావా?” అని కోనంగి. సారాతో అన్నముక్కలు విన్నాడు. కనక నెమ్మదిగా అక్కడ ఉన్న పరిచారకులతో చెప్పాడు. అది వెన్నెల పాకినట్లు అక్కడ వున్న జనం అందరిలో పాకింది. ఈ వార్త రెండురూపాయలన్నర మొదటి తరగతిలో కూర్చున్న వైట్వే కంపెనీ మేనేజరుగారికి తెలిసింది.

ఆ మేనేజరు స్టూఆర్టు గారు తన దగ్గిర తాబేదారుడైన కోనంగిని సారాను అప్పుడే ఆనవాలుపట్టి పళ్ళు బిగించి ఉన్నాడు. కోనంగి అంబరెల్లా పేట రాజకుమార్ అని తనకు తెలిసిందికాదే! అని అనుకున్నాడు ఆశ్చర్యపడుతూ. దీపాలు ఆరిపోయి చిత్రదర్శనం అయినప్పుడల్లా సారా కోనంగి దగ్గిరగా ఒదిగిపోయేది. అతని చెంప ఒత్తుకునేది. అతని చేయి తన నడుము చుట్టూ తిప్పుకునేది. అతనిచేయి తనగుండెలకు అదుముకునేది.

కోనంగి రక్తం పరవళ్ళెత్తింది. అతనిగుండె పంజాబ్ మెయిల్ వేగం తొల్చింది. నెమ్మదిగా సారాను దగ్గరకు తీసుకొని కోనంగి ఆమె పెదవులను అస్పష్టంగా స్పృశించాడు. బొమ్మలో ప్రేమదృశ్యమూ, కౌగిలింతలూ చుంబనాలూ వచ్చినప్పుడు వీరిద్దరూ జల్ జల్ మనేవారు.

చిత్రం ఎలా పూర్తిఅయిందో అయింది. సారాయున్నూ కోనంగిన్నీ టాక్సీ ఒకటి పిలిచి అందులో ఎక్కబోయే సమయంలో స్టూఆర్టు గారు వీరికి కనిపించాడు. సారా అస్పష్ట వాక్యాలతో “కొంపలు మునిగినాయి కోన్!” అని అన్నది

ఇద్దరూ కారులోకి దూకారు. కారు సాగింది. కొంతదూరం పోగానే సారా కోనంగిని గట్టిగా కౌగలించుకొని అతని మోమంతా ముద్దులు కురిపించింది.

కోనంగి అతిపురుషుడై సారాను నలిపివేశాడు. అతడు ఇంతవరకు యాదాలాపంగా స్త్రీలను స్పృశించడమే కాని, ఈ రీతిగా కాంక్షతో, గాఢతమితో తన కౌగిలిలో అదిమివేయడం ఎరగడు.

మాంచి ఘాటుఎక్కిన చాంపేను ద్రాక్షసారాయి త్రాగినపోరులా వారిద్దరూ సారా ఇల్లు చేరారు, సారా తనలో ఉప్పెనలా విరుచుకు పడుతూ ఉన్న కామకాంక్షతో కోనంగిని తీగలా అల్లుకుపోయి, “ఈ రాత్రి ఇక్కడ ఉండిపో కోనంగీ.!” అంది.

కోనంగి ఘట్టిగా సారాను తన హృదయానికి అదుముకొని ముద్దులు కురిపించి ఆమెను వదిలి, అక్కడ వున్న కుర్చీపై కూర్చుండబెట్టి డగ్గుత్తికలు మింగి, తలవూపి ఇటూ అటూ తిరిగి అక్కడ వున్న గ్లాసుతో కూజాలోని మంచినీళ్ళు త్రాగి, సారా ఎదుటకు వచ్చి నిలుచుండినాడు.

“సారా! నాకు ఒళ్ళు వేడెక్కి ఉన్నమాట నిశ్చయం! కాని, నేను... పెళ్ళి... లేకుండా... స్త్రీలతో... స్త్రీపురుష సంబంధం... పెట్టుకోలేను.”

“అలాగా, కోన్!”

కోనంగి సారా తలపట్టి నుదురు చుంబించి, ఆమె మేడమెట్లు దిగి జర జర నడుచుకుంటూ వెళ్ళిపోయినాడు. అతని వెనక నెమ్మదిగా ఒక కారు కొంతదూరం సాగి వెనక్కు తిరిగి సారా యింటికడకు పోయి అగింది.

కోనంగి నడిచి, నడిచి, అనంతమైన ఆలోచనలు మెదడులో సుడిగుండాలు, సుడిగాలులు తిరిగిపోతూ ఉండగా నడిచిపోయాడు.

తానూ అచ్చంగా ఆంధ్రుడే. ఒక వరూధిని వచ్చి “ఓ సుందరకోనంగీ కుమారా! నాతో మన్మథసామ్రాజ్యవు చక్రవర్తివై ఏలుదువు రమ్ము. నా హృదయమున వ్రాలుము! ఈ అతనుడు కోయని ఆర్చి పుంఖాను పుంఖములుగ తన నిశిత కుసుమసాయకముల పరచి నా హృదయమును తూటుపడ వేయుచున్నాడు. హా రక్షింపుము!” అని విరహతాపాన కుంగుతూ ప్రార్థిస్తే, “నా ఇంటికి దారిచూపో!” అని ఏడుస్తూ కూర్చున్నాడు ఆంధ్రప్రవరాఖ్యుడు.

అలాగే తానూ! సారా అందాల వయ్యారాల కులుకుమిటారి. అలాంటి బాలిక “రారా నా సామీ!” అని కోరింది. తాను వట్టి వాజమ్మ కాబట్టి చేతులు రెండూ అడ్డంబెట్టి పారిపోయి వచ్చేశాడు.

స్త్రీ సంపర్కం ఏదో ఆనందంగా ఉంటుందని ఊహ. ఆ ఊహమాత్రాన దేహం అంతా వేడెక్కి ఝల్లుమనిపోవడం కళ్ళు మత్తు లెక్కడం!

ఏమిటి యీ పశుత్వం. స్త్రీపురుష సంబంధంతప్ప ప్రపంచంలో ఇతర సమస్యలు లేవా? తిండి సమస్యా, స్త్రీ సమస్యా?

కుటుంబప్రేమ, జాతిప్రేమ, మానవప్రేమ ఒహెూ ఎంత మధురంగా ఉంటాయి! బీదవాళ్ళే లోకం అంతా! బీదవాళ్ళు ఎక్కడ చూచినా!

జీర్ణమై కుళ్ళిపోయిన గుడ్డలు, చివికిన హృదయాలూ, ఆశలూ, ఆశయాలూ.

కుష్ఠురోగంతో సింహమొగమై, పెదవులు వాచి, కళ్ళు మోరడించి, ఒళ్ళు నూనెక్కి పళ్ళు ఊడి, పుళ్ళ దుర్గంధంతో, వీధిలో పారవేసిన ఆకులో మిగిలినదే అమృతమని తింటూ బస్సుల దగ్గర, బజార్లలో, రైళ్ళలో, తిరునాళ్ళలో ఉత్సవాలలో కాకులలా, ఈగలలా ముసిరే తిండిలేని, ఎండి పోయిన మండిపోయిన జీవితాలుగల, బీద దరిద్ర శుష్కజీవిత జనం ఎన్ని లక్షలూ, కోట్లు!

తానా కోట్లూ, సూట్లూ, అయిదు రూపాయల టిక్కట్లు, టాక్సీలు, ఇంక తనకోసం కొన్న బట్టలూ వగైరాలు, జేబులో ఉన్న అయిదు రూపాయలు చిల్లర ఇవీ.

తనదేశం కుళ్ళుదేశం. తనతోటి మనుష్యులు దుర్వాసన బ్రతుకుల వాళ్ళు. లోకంలో ఇతరులపై జాలి పొందేవాళ్ళు దేవతలు. ఆ సీతాదేవి జాలి చూపించింది. హెూటలు యజమాని సుబ్బరామయ్య, తమలపాకుకిళ్ళీ దుకాణదారు రామన్ నాయరు, సారా, అనంతలక్ష్మి అందరూ దేవతలు.

ఇంతలో ఆ పన్నెండున్నర గంటల వేళలో మౌంట్ రోడ్డు ప్రవేశించిన తన్నుద్దేశించి కూయం వంతెనమీద నడిచి వెళ్లే ఒక కుంటి ముసలిది “అయ్యా! సామీ! ఒక పైస!” అని అడిగింది. కోనంగి తన జేబులో ఉన్న అయిదు రూపాయల చిల్లర ఆమె చేతిలో పోశాడు. వెనక్కు చూడకుండా హెూటలు గదికి ఒంటిగంటన్నరకు చేరి పండుకొన్నాడు. చిరునవ్వుతో నిదురపోయాడు.

తెల్లవారి లేచి స్నాన భోజనాదికాలు ముగించి, హెూటలు యజమాని దగ్గర నాల్గణాలు బదులు పుచ్చుకొని, వేటువే కంపెనీకి పోయాడు.

వెళ్ళగానే మేనేజరు తన ఆఫీసు గదిలోనికి పిలిచి “కోనంగిరావుగారూ, మీరు మా కంపెనీకి చేసిన సేవ ఎప్పుడూ మరచిపోము. కాని ఇవాళ నుంచి మీ ఉద్యోగం మాకు అక్కరలేదని కంపెనీవారు నిర్ణయించారు. ఈవారం ఆఖరువరకూ మీకు ముప్పైరూపాయలూ మా కృతజ్ఞతకు ఈఇరవైయిన్నీ మంజూరుచేశారు. మీకు కంపెనీవారిచ్చిన ఉత్తమ చరితాపత్రం ఇదిగో” అని చెప్పినాడు. కోనంగిరావు అన్నీ పుచ్చుకొని అమ్మయ్యా అని బయటపడినాడు.

3

చిరునవ్వుతో కోనంగి అందరి స్నేహితుల దగ్గిరా సెలవు పుచ్చుకొంటూ సారా దగ్గరకు వచ్చి “నిన్న రాత్రి నేను నీ హృదయానికి కలుగజేసిన బాధకు క్షమించు సారా! నేను వట్టి పిరికివాణ్ణి! చెప్పానుగా అదృష్టాన్ని కూడా కాలదన్ను కొనే కళ్ళు మూతగాణ్ణి. నీ ఉత్తమ హృదయం.... అని చెప్పబోతుంటే సారా అడ్డంవచ్చి “కోనంగీ, నువ్వు రేపు శనివారం సాయంకాలం నాలుగు గంటలకు మా యింటికి రా. నీతో మాట్లాడవలసిన విషయాలు చాలా ఉన్నాయి ఇక వెళ్ళు...” అని సెలవు తీసుకొని తన పనిలో తాను మునిగింది.

కోనంగి నవ్వుతో వెళ్ళిపోయాడు. గదికి వెళ్ళడమెందుకని ఆ మిట్టమధ్యాహ్నం ఏమి బుద్ధి పుట్టిందో తిన్నగా గుజరాత్ హెూటలుకుపోయి, దానికి మేనేజరయిన కిషన్ చంద్ బాలక్రాంగారిని కలుసుకొన్నాడు. హెూటల్ గుజరాత్ బ్రాడ్వేలో ఉంది. అతిథులకు సమస్త సదుపాయాలూ చేయడంలో ఆ హెూటలు మదరాసులోకెల్లా మంచిదని పేరు పొందింది.

హెూటల్ గుజరాత్ మేనేజరు కొంచెం గాంధీతత్వవాది. కాంగ్రెసు అంటే విపరీతమైన మంచి అభిప్రాయం. మహాత్ముడు శ్రీకృష్ణావతారమని అతని నమ్మకం.

కోనంగి ఆయన్ను కలుసుకొని “అయ్యా నేను బి.ఏ. మొదటి తరగతిలో నెగ్గాను. ఇప్పుడే యుద్ద సంబంధమైన పరిశ్రమలెన్నో ప్రారంభమయ్యాయి. కాని ఎందుచేతనో నా మనస్సు ఉద్యోగాలమీదకు పోవటం లేదు. అవి తప్పనీ, ఒప్పనీ వాదించేటంత సాహసమూలేదు. నాకు ఇష్టమూ లేదు. నాకు మాత్రం ఆ ఉద్యోగాలమీదకు ససేమిరా బుద్దిపోవటంలేదు. ప్రస్తుతం జర్మనీవాడు వస్తేమాత్రం వాణ్ణి ఆ ముందు క్రాఫింగు పిలకపట్టి జాడించి వదులుతాను. అవన్నీ అల్లా ఉంచి నాకు మాత్రం మీహెూటల్లో ఏదైనా ఒక ఉద్యోగం ఇప్పించాలి” అని మనవి చేశాడు.

“నా దగ్గర బి.ఏ. లకు ఏమీ ఉద్యోగాలు లేవయ్యా!”

“నన్ను బి.ఏ.గా గణించకుండా ఉద్యోగం ఇప్పించండి. బి.ఏ. డిగ్రీ నాకు ఏదైనా ఉద్యోగం ఇప్పించేందుకే!”

“నాకు దక్షిణాది బాలకులు బల్లల దగ్గిర తినుబండారాలు అందించేందుకు ఉన్నారు. ఉడిపివారు ఆర్గురూ, ముగ్గురు గుజరాతీ బ్రాహ్మణులూ ఉన్నారు. లెక్కలకు మా సేట్ బాలకులు ఇద్దరున్నారు.”

“నేను బల్ల దగ్గిర అందించకూడదా?”

“సరే ఉండు. మొదట ఆరు రూపాయలకన్నా ఎక్కువ జీతం ఇవ్వలేను. తిండి రెండుపూటలా, ఉదయం ఒక కారమూ, కాఫీ. సాయం కాలం ఒక తీపీ, ఒక కారమూ, కాఫీయున్నూ ఇస్తాము.”

“అంతకన్న భాగ్యం ఏముంది?”

“తక్కిన బాలకులకు ఇరవై, ఇరవై అయిదూ, ముఫ్పైరూపాయలు ఇస్తున్నాను.”

“కావచ్చు. మీ సంస్థలో వాళ్ళు ఉపయోగించినట్లు నేను ఉపయోగించలేను అయినా నాకు అయిదారు రకాల తెలుగుకూరలు, ఎనిమిదిరకాల తెలుగు పచ్చళ్ళు, మూడురకాల తెలుగు పులుసులు చేతనవును. ఎప్పుడైనా చాలా ఆవసరమయితే నన్ను మీరు ఉపయోగించ వచ్చును. ఆ మర్నాడునుంచి కోనంగి వచ్చి పనిలో చేరడం నిశ్చయమైంది. వెంటనే తన నెల్లూరు హెూటలు యజమాని దగ్గరకుపోయి, తనకు పది పదిహేను రోజులు ఇంటి దగ్గర అర్జెంటుపని ఉంది వెళ్ళివస్తానని చెప్పి, ఒక తోలు పెట్టె, రెండుకోట్లు, నాలుగు షర్టులు, రెండు లాగులు, రెండు పంచెలు, రెండు తువ్వాళ్ళు వగైరాలూ, పరుపూ పక్కసర్దుకొని, రాత్రి సామాను పుచ్చుకొని హెూటల్ గుజరాత్ కు చేరుకున్నాడు.

ఆ మర్నాడు ఆ హెూటలు వడ్డనవారల దుస్తులు ధరించి, పెద్ద వడ్డనదారు తనకు బోధించిన విధానాలు మనస్సుకు హత్తించుకొని తన పనిలో చేరాడు.

మొదటే హెూటలు మేనేజరుతో తన కా శనివారం మూడు గంటల నుండి సెలవు కావాలనీ, తన స్వంతపని ఉందనీ చెప్పినాడు. మేనేజరు సరే అని ఒప్పుకున్నాడు.

మూడు గంటలన్నరకు సారా ఇంటికి కోనంగి వెళ్ళినాడు. సారా అతన్ని సగౌరవంగా తీసుకువెళ్ళి తన స్వంత గదిలో కూర్చోబెట్టింది. వాళ్ళ అమ్మా, నాన్నా, చెల్లెళ్ళు, తమ్ముళ్ళూ అందరూ సినీమాకు పోయారు.

అతనికి మంచి కాఫీ తయారుచేసి కేక్, కాఫీలు ఇచ్చింది. కోనంగీ సారా ఇద్దరూ ఉపహారం అయిన తర్వాత సిగరెట్లు తాగుతూ ఇద్దరూ కబుర్లు చెప్పుకోటం ప్రారంభించారు.

సారా: కోన్, నిన్ను చూస్తే ఎందుకో నాకు అపరిమితమైన ప్రేమ కలిగింది. ప్రేమ అంటే, కవులు వర్ణించిన ప్రేమో కాదో నాకు తెలియదు.

కోనంగి: (గుండెల్లో బేజారయ్యాడు.) తప్పకుండా ఏ కవినైనా అడిగి తీరవలసిందే ఆ విషయం. లేకపోతే అయిదారు రకాల కవులను అడగాలి. ఒకరు శ్రీపాద కృష్ణమూర్తిగారు, పూర్వకవుల ఆఖరుకాపు. తర్వాత రాయప్రోలు సుబ్బారావుగారు. నవ్య కవుల ప్రథమ సంతానం. ఆ తర్వాత శ్రీశ్రీ నవ్యకవిత్వంలో వంకరకొమ్మ. ఆ తర్వాత గోపీ చందు, ఎక్కడా విత్తుకు పుట్టని ఆర్చిడ్ కవిత్వం. ఆ తర్వాత విద్వాన్ విశ్వం, అభ్యుదయ పరంపరాభివృద్ధిరస్తే కవి. ఇంకా అదోరకం వాళ్ళలో చిన్ని చిన్ని చిన్నారి వాళ్ళందరినీ జమకడదాం!

సారా: ఏమిటి పిచ్చి సంభాషణ? ఇది విను. నాకూ మన కంపెనీ మేనేజరుకూ అసలైన స్త్రీ పురుష సంబంధం ఉన్నది.

కోనంగి: (తెల్లబోతూ) అదా రహస్యం? మొన్న రాత్రి సినిమా దగ్గర మనిద్దర్నీ చూచాడు.

సారా: అందుకనే మీ ఉద్యోగం పోయింది. కోన్, నువ్వు కంపెనీలో చేరినప్పటినుంచే నువ్వంటే ఏదో ఆపేక్ష కలిగింది. నీ స్నేహం తప్ప వేరే దురుద్దేశం నాకు అప్పటికీ ఇప్పటికీ లేదు.

కోనంగి: ఆంగ్లో ఇండియన్లు భారతీయులంటే ఎక్కువ చనువు తీసుకోరు. అందుకని నువ్వు నాతో స్నేహంగా ఉండడం నాకూ ఆశ్చర్యము కలుగజేసింది, ఎంతో అనందమూ అయింది.

సారా: ఔను కోన్. మా ఆంగ్లో ఇండియన్లు రెంటికీ చెడిన రేవడివంటివారు. భారతీయులమై భారతీయులం కాము అనుకుంటాము. ఇంగ్లీషు వాళ్ళము అవుతామని ఆశించి ఏనాటికీ వాళ్ళం కాలేము.

కోనంగి: మరి నీకు నేనంటే స్నేహం చెయ్యాలని బుద్ధిఎలా కలిగింది? మొదటి నుంచీ మీవాళ్ళు మన జాతీయోద్యమాల్లో ఏమీ పాలు పుచ్చుకోవడంలేదే?

సారా: మొదటి నుంచీ ఏమీ పాలుపోక పాలు పుచ్చుకోలేదు.

కోనంగి: మీకు వివాహం చేసుకోవాలని బుద్ధి పుట్టలేదా? మీకు మన మేనేజరంటే గాఢమైన ప్రేమా?

సారా: ప్రేమా గీమో నాకు ఏమీ తెలియదని చెప్పానుగా? మావర్గంలో స్త్రీ పురుష సంబంధాలలో కొంచెం కట్టుబాట్ల మరలు వొదులుగానే ఉంటాయి.

కోనంగి: ఒక్కొక్కప్పుడు ఊడిపోతూనే ఉంటాయి ఆ మరలు.

సారా: మా జాతికి వెనకటి చరిత్ర అంత గర్వించతగిందికాదు. ముందు చరిత్రనన్నా బాగుచేసుకుందామన్న వేడీ కలగడంలేదు.

కోనంగి: జాతికి వేడి మాటేమోగాని మీ జాతి ఆడవాళ్ళు దగ్గర కొచ్చిన మొగవానికి మాత్రం నూట ముప్పై మూడు డిగ్రీల వేడి పుట్టిస్తారు.

సారా: నీ మాటకేంగాని మొన్నరాత్రి నువ్వు వెళ్ళీ వెళ్ళడంతోనే మేనేజరు స్టూవర్టు తుపానులా వచ్చిపడ్డాడు. నేను మండిపోయాను. ఇద్దరం అతి ఘోరమైన మాటలనుకున్నాం.

కోనంగి: ఆ ఖారం ఇంతపారేస్తే మా ఆవకాయన్నా పెట్టుకుందును.

సారా: మీ తెలుగువాళ్ళ ఆవకాయను గురించి వినడమేకాని ఎప్పుడూ రుచి చూడలేదు.

కోనంగి: ఇంతకీ నీకూ మీ మేనేజరుగారికీ విడాకులై నట్లా కానట్లా?

సారా: నేనే విడాకులిచ్చాను. చెప్పాను అతనితో జరిగినదంతానూ.

కోనంగి: నేను మేనేజరుగారికి ప్రతినాయకుణ్ణి అయ్యానన్న మాట!

సారా: నా మాటలన్నీ విని మాటాడకుండా వెళ్ళిపోయాడు. నిన్న కోనంగిరావుని మళ్ళీ కంపెనీలోకి తీసికోకపోతే నేనున్నూ మానివేస్తాననీ, నాకూ అతనికీ అంతటితో చెల్లనీ, అనుమానరహితమైన మాటలతో చెప్పేశాను. స్టూవర్టు చాలా కించపడి నన్ను అతిదీనంగా క్షమాపణ వేడుకున్నాడు. రేపు నిన్ను అతడు క్షమార్పణడిగి తన కంపెనీలో ఉండమని కోరుతానని చెప్పాడు.

4

అనంతలక్ష్మి ఉత్తరం రాసింది కోనంగికి. ఆ ఉత్తరం కోనంగికి 'హెూటల్ గుజరాత్'కి పూర్తిగా బయలుదేరి వెళ్ళేముందు సాయంకాలం టపాలో అందింది.

'గాంధర్వ కూటం',

235 లజ్ చర్చి రోడ్డు, మైలాపురం,

25, నవంబరు 1939

.

“కోనంగిరావుగారూ,

మళ్ళీ మీరు కనబడలేదు. మా ఇంటికి ఒక్కసారి వచ్చారుకారు. మీరు నాకు తెలుగు చెప్పండని కోరి ఉంటిని. మీరు తప్పక వస్తారనీ, నాకు తెలుగు పాఠాలు బోధిస్తారనీ ఉప్పొంగిపోతూ, నా తెలుగుపాఠం పుస్తకాలు ముట్టుకోనన్నాలేదు. నాకు అర్ధ సంవత్సరపు పరీక్షలు వస్తున్నాయి. తెలుగులో మా కాలేజీలోకెల్లా మొదటగా కృతార్థురాల నవ్వాలని ఆశ. మా అమ్మగారు మీకు నెలకు యాభై రూపాయలు ఇస్తామన్నారు.

ఆదీ కాకుండా, మీరు నా పాట ఎప్పుడూ వినలేదు. నేనూ రెండు మూడు పెద్ద కచ్చేరీలు చేశాను. కచ్చేరీకి అయిదువందల చొప్పున పుచ్చుకొని, ఆ డబ్బు బాలికల కళాశాలలకు ఇచ్చాను.

ఎప్పుడు వస్తారు మీరు? నాకు తెలుగు రావాలంటే వెంటనే నాకు చదువు ప్రారంభించండి.

సెలవు,

ఇట్లు,

కాబోయే మీ శిష్యురాలు,

అనంతలక్ష్మి, మన్నారుగుడి.”

ఈ ఉత్తరం చదువుకున్నాడు. ఎవరీ అనంతలక్ష్మీ? ఎందుకీ తెలుగు పాఠం? అయినా తాను ఒకసారి ఆ అమ్మాయిని వెళ్ళి చూడ్డం మంచిది అని ఆమెకు తిరిగి జవాబు వ్రాశాడు.

హెూటలు గుజరాత్

ఉయ్యేటి కోనంగేశ్వరావు, బి.ఏ.

బ్రాడ్వే, మదరాసు,

26, నవంబరు 1939

“శ్రీమతి అనంతలక్ష్మిగారూ,

దయార్ధమైన మీ ఉత్తరం అందింది. నేను తప్పక మీ ఇంటికి పై ఆదివారం 4, డిశంబరున వస్తాను. పగలు పన్నెండు గంటలకు వస్తాను. ఒంటిగంట వరకూ ఉంటాను. ఆ తర్వాత వేరే అర్జంటు పనిమీద వెళ్ళాలి. నేను వచ్చినప్పుడే మీకు తెలుగు చెప్పడం విషయం ఆలోచిద్దాము. అప్పుడే నాకు ఒకటి రెండు పాటలు వినిపించెదరుగాక!

ఇట్లు,

కోనంగిరావు.”

కోనంగిరావు మరు ఆదివారంనాడు వైటువే కంపెనీ మేనేజరును సారా ఇంటిదగ్గర పదకొండు గంటలకు కలుసుకొన్నాడు. ఆయన కోనంగిని గూర్చి తప్పు అభిప్రాయం పడినందుకు క్షమాపణ అడిగి మళ్ళీ పనిలో ప్రవేశింప వలసిందని కోరినాడు.

కోనంగీ: మీ దయకు ఎంతో కృతజ్ఞుణ్ణి. కాని, నేను ప్రవేశీంప లేను.

మేనే: కారణం?

కోనంగి: మొదట ప్రవేశించడమే ఎంతో తెలివితక్కువ పని. నాకు మా దేశం అంటే నానాటికి భక్తి ఎక్కువౌతూ ఉంది. మీ రమ్మేవన్నీ ఇంగ్లీషు వస్తువులు. అవన్నీ నేను అమ్మిపెట్టడం దేశద్రోహం వంటిది. అలాంటిది తిండికోసం మీ పంచకు చేరి....

సారా: ఒకసారి చేరితే ఒకటి, రెండోసారి చేరితే వేరునా?

కోనంగి: ఆదికాదు సారా! మొదట ఆలోచన చేయకుండా చేరాను. మేనేజరుగారు నన్ను పంపివేయడం ఎంతో మంచిదయింది.

సారా: పంపించకపోతే?

కోనంగి: ఇప్పటి ఆలోచన పుట్టునో పుట్టకపోవునో! మొన్న కాంగ్రెసువారు మంత్రిత్వాలు వదులు కోవడంతోటే, నాకు కళ్ళు విడివడ్డాయి, ఎంతో జాగ్రత్తగా ఆలోచించుకొన్నాను.

మేనే: కోనంగిరావుగారూ! నేను కన్నుగానని పశువునై మీ వంటి ఉత్తముణ్ణి పంపించి వేశాను. మీరు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? ఏమి చేస్తున్నారు?

కోనంగి: హెూటల్ గుజరాత్లో వడ్డనకుఱ్ఱవాణ్ణిగా ఉన్నాను. ఆరు రూపాయలు జీతం....

మేనే: ఏమిటీ! వడ్డన కుర్రవాడుగానా! ఆరు రూపాయలు

సారా: జీతమా!

కోనంగి: ఆవును. ఏపని అయినా ఆత్మని చంపని ఉద్యోగం మూత్తమం కాదా?

మేనే: మా కంపెనీలో తిరిగి చేరడం ఆత్మను చంపడం అవుతుందా కోనంగిరావు గారూ!

కోనంగి: అందులో నా భావం పూర్తిగా అర్థంచేసుకోండని ప్రార్థిస్తున్నాను. భారతీయులు, సంపూర్ణ స్వరాజ్యం కోరుతున్నారు. సంపూర్ణ స్వరాజ్యం రావడానికి మహాత్మా గాంధీగారి మార్గం ఉత్తమం.

మేనే: అందుకని ఆంగ్లేయుల వస్తువులు కొనగూడదా?

కోనంగి: ఆంగ్లేయులవే కాదు, సర్వవిదేశీవస్తువులు కొనగూడదు. ఆర్థిక స్వాతంత్య్రమూ, రాజకీయ స్వాతంత్య్రమూ రెండూ చేయిచేయి పట్టుకొని నడవాలి.

మేనే: ఇక సెలవు. మీరు ఎప్పుడు వచ్చినా మా కంపెనీలోకి తీసుకుంటాను. మా కంపెనీ మదరాసు శాఖను కొద్ది రోజులలో మూసివేస్తాము. ఈలోగా మీకు మా ఆహ్వానం ఎదురు చూస్తూ ఉంటుంది.

కోనంగి అక్కడ నుంచి మైలాపురం బస్సు ఎక్కి అనంతలక్ష్మి ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఎస్. ఎస్. వగైరా చెట్టియారుగారి 'రోల్పు' కారు సిద్ధంగా ఉంది.

కోనంగి రాగానే గేటు కాపలాదారు మర్యాదగా కోనంగిని వేరు మార్గాన అనంతలక్ష్మి చదువులగదికి తీసుకుపోయాడు.

అతడు రాగానే అనంతలక్ష్మి సోఫామీద నుంచి గంతువేసి లేచింది. ఆమె మోము వేయి పద్మాల దీప్తితో వికసించింది. పదినిమిషాలు మాటలాడలేక సిగ్గుపడింది. ఆయిదు నిమిషాలు పుస్తకాలు సర్దింది.

కోనంగి అనంతలక్ష్మిని రేడియం చూపులలో చూశాడు. ఏమిటి ఈ బాలిక అందం? అసలయిన అలమండ మామిడితాండ్ర! వేయి సిసలైన పచ్చకర్పూరపు డబ్బాలు గుమ్మరించిన ప్రోగు! అయిదువందల ఎకరాలలో పండిన కాశ్మీరపు కుంకుమపూవుల రాశి! వికసించిన పూవులతో నిండి ఉన్న కోటి గులాబిపూవుల చెట్టున్న దివ్యక్షేత్రం! క్షేత్రయ్య పాటలన్నీ వీణమీద వాయిస్తూ పాడిన తీయని కంఠంలోంచి వచ్చిన నూరురాగాల మాలిక! మదరాసు మాలికాకారులు కట్టిన జరీ దారాలతో తళతళలాడే పెద్ద చామంతుల దండలు వరసగా వేసిన కంఠంగల ప్రపంచ సుందరుల ఎన్నికలో మొదటగా నెగ్గిన విశ్వసుందరి!

ఇంకేముంది! తన హృదయం ఆగిపోయింది. ఆగిపోయింది. ఆగిపోవడమేమిటి? ఉండవలసిన స్థలంలో లేదు. అదుగో ఆమె పాదాల క్రింద కోటికోటికోటి పరమాణువులై పోయినది.

ఇదే కాబోలు పూర్వం నుంచి ఈనాటివరకూ సమస్త దేశాల కవులూ పాడిన ప్రేమ అనే దివ్యస్థితి. ఈ దివ్యస్థితివల్ల తనకు, 'కళ్ళు మూతలుపడని అనిమిషత్వం సర్వకాలాలా ముప్పదిఏళ్ళడు. అమృతం త్రాగుడూ అన్నీ వస్తాయి కాబోలు!

అనంతలక్ష్మి అయిదడుగుల రెండంగుళాల అమ్మాయి. కోనంగి ఆమె మోము పరిశీలించి చూశాడు. శ్రీమతి సుబ్బలక్ష్మి మోములోని పరమ పరిపూర్ణ రేఖలూ, కాంతియున్నూ, శ్రీనళిని జయవంత్ ముఖంలోని అంగాంగ శ్రుతియున్నూ, వీనికి విభిన్నమైన ఒక పరమాద్భుత సౌందర్య విలాసమూ ఉందని తీర్మానించుకొన్నాడు.

ఆ మోముకు తగిన శరీరపు బంగారుకాంతీ, స్పుటమధురాంగ సమ్యక్ స్థితి ఈ బాలికను, బాలికలందరిలోనూ “ఫస్టుమానిటరెస్”ను చేశాయని అతడనుకున్నాడు.

తన్ను ఎక్స్‌రే కళ్ళలో కోనంగిరావు చూస్తున్నాడని అనంతలక్ష్మి అర్థం చేసుకుంది. అది తెలిసే ఏమీ ఎరగని అమ్మాయిలా ఏమిటో సర్దుతోంది.

ఆ అమ్మాయి తన్ను “ఇన్ఫ్రా రెడ్, అల్ట్రావయిలెట్” కాంతుల చూపులలో చూస్తున్నదని కోనంగికి తెలుసు. అది తెలిసే అతడు మూడేళ్ళ ముద్దుల బాలునిలా ఆ అమ్మాయిని చూడనట్లు నటిస్తున్నాడు.

రెండుసార్లే వీరిద్దరూ ఒకరి నొకరు చూచుకొన్నారు. ఆ రెండుసార్లలో చీకటిలాంటి వెలుగులో ఒక పర్యాయం. అయినా ఈసారి ఏ విధమైనటువంటి అనుమానం లేకుండా ఇద్దరూ శకుంతలా దుష్యంతుల అవస్థ అనే పూవుల, కుసుమాల, సుమాల, ప్రోవుమీద మైళ్ళు ఎత్తుననుండి పడ్డారు.

అరగంటసేపు వారికి ఆ పడడం “షాక్” వల్ల మాటా మంతీ లేదు.

అప్పటికి కోనంగి “బావ” గుక్క తిప్పుకున్నాడు. “అనంతలక్ష్మిగారూ! వచ్చాను” అన్నాడు.

“ఊఁ! ఊఁ!” అన్నది అనంతలక్ష్మి

“నేను వచ్చాను!”

“ఊఁ!”

“మీరు తెలుగు నేర్చుకుంటారా?”

అవున్నట్లు గుక్కమింగుతూ అనంతలక్ష్మి,

“తె-తెలు-తెలుగు నేను చెప్పగలనా?”

అది మీకే తెలియాలన్నట్లు తలవంచి చిరునవ్వుతో, ఏదో భయంతో అనంతలక్ష్మి కళ్ళు మూడుసారులెత్తి అతన్ని నిమేషంలో రెండువంతులలో వంతుకాలం మాత్రం చూచి ఆ నిడుపాటి నల్ల కనురెప్ప వెంట్రుకలు గల రెప్పలను నిమీలితం చేసింది.

5

ఇంత లోకం మార్పు అనంతలక్ష్మి చదువుల గదిలో సంభవించిందని చెట్టియారు గారికి తెలియనే తెలియదు. ఎవరో ప్రయివేటు మాష్టరు వచ్చి అమ్మణికి పాఠం చెపుతాడని అతనితో చెప్పింది జయలక్ష్మి.

చెట్టిగారికి అనంతలక్ష్మి ప్రయివేటు మాష్టర్ల దగ్గర పాఠాలు నేర్చుకోడం బొత్తిగా ఇష్టంలేదు. ఎదిగివున్న పిల్లలు పోతరించి ఉన్న మగవాళ్ళ దగ్గిర వేరే ఎవ్వరూ లేకుండా కూర్చుండి పాఠాలేమిటి?

అప్పటికీ ఒక ప్రయివేటు మాష్టరు స్త్రీ ఎం.ఏ. గారు రెండవ ప్రయివేటు మాష్టరు ఒక ముసలాయన, తమిళం పండితుడు. ఆయనే సంస్కృతమూ చెప్తాడు. ఇంక తెలుగు చెప్పేవారు లేకపోయారు. ఇంగ్లీషు చెప్పే ఆయన అనంతలక్ష్మి పెత్తండ్రి కొడుకయిన అయ్యంగారు యువకుడు. అతడు లయోలాలో ఇంగ్లీషు ఆచార్యులుగా ఉన్నాడు. ఇంక నాలుగో ఆచార్యు లెవరో చూద్దామని చెట్టియారుగారికి బుద్ధి పుట్టింది.

అందుచేత చెట్టియారుగారు చటుక్కున ఒకమాటు వచ్చి చూచేసరికి, అనంతలక్ష్మికి ఆ లాజిక్కు చెప్పే స్త్రీ ఎం.ఏ. గారు పాఠం చెప్పడం చూచి జర్రున వెనక్కు చక్కాపోయాడు.

చెట్టియారుగారికి తెలుసును, అట్టే వత్తిడి చేస్తే అనంతలక్ష్మికి తనంటే భయంకరమైన ద్వేషం ఉద్భవించి కథ అడ్డంగా తిరుగుతుందని. చెట్టిగారు సినిమా కంపెనీ పెట్టారు. ఇతర సినిమా కంపెనీలలో వాటాదారుడుగా ఉన్నాడు. “మదరాసు అఖిల కళామండలి” అనే సభ ఒకటి ఏర్పాటుచేసి, దానికి చక్కని భవనం ఒకటి మౌంటురోడ్డులో అద్దెకు పుచ్చుకున్నాడు. అక్కడే ఒక చిన్న రంగస్థలం అమరించాడు. ఒక చిన్న సినిమా ప్రదర్శక యంత్రంపెట్టి, ఆ ప్రదర్శనాలు ఏర్పాట్లు చేశాడు.

సినిమా కంపెనీలో తారల మధ్య తాను చంద్రుడు, కళామండలిలో కళాపూర్ణుడు.

అనేక రకాల స్త్రీలు అనేక రకాల పిండి వంటలు. ఒకరి పెదవి మాధుర్యం మామిడిపండులా ఉంటే, ఇంకో అప్సరస పెదవి ద్రాక్ష. మరో మధురాధరి అధరం రసగుల్లా, ఒక కలువకంటి వాతెర చాంపేను సారా అయితే ఇంకో విలాసిని వదనము బాదామికీర్.

అందుకని మన చెట్టి వ్యాపారంలో ఎంత ఘట్టిగా ధనం సంపాదిస్తాడో అంత వదులుగా మదగజయానలకై వెచ్చంచేసి, పద్దులో ప్రయివేటు ఖర్చు అని రాసుకుంటాడు.

అలాంటి చంచల విటకావతంసునికి అతని 'వాటర్లూ యుద్ధం అనంతలక్ష్మి ఆవరణలోనూ ఇంటిలోనూ రోజూ జరుగుతోంది.

అనంతలక్ష్మి ఒకనాడు కాలేజీకి వెడుతోంటే, బర్మా మలయాది దేశ విజ్ఞానరహిత వివిధ మానవుల కష్టార్జితమైన విత్తం గుంజుకొనే ఈ చెట్టియారుగారు అవర్గళ్ చూచాడు. హంసతూలికాతల్ప సహస్రాలకన్న మెత్తగా ఉన్న తన రోలురాయిస్ కారు వెనకసీటులో ఒక వెయ్యోవంతు సెకండు నిశ్చేష్టుడై పడిపోయాడు. ఆ కోడెకాడయిన అనంగుడు అలరుటంబులు వేసి చెట్టిగారి హృదయాన్ని ఛిన్నాభిన్నంచేసి వదిలాడు.

అప్పుడు చెట్టిగారికి తెలియకుండానే, ఆయన మనస్సు “ఓ కుందరదనా! ముమ్మొన వాలుచూపులదానా! నా చెట్టియారు హతాశుడు.” అని వాపోయింది.

ఆ బాలిక కారు వెనకే తన కారు పోనిచ్చి, ఆమె క్వీన్ మేరీ కళాశాలకు వెళ్ళడం చూచి, సాయంకాలం మాటేసి, ఆమె ఇల్లు కనిపెట్టి, సమాచారం సమస్తమూ తెలిసికొని జయలక్ష్మి హృదయదుర్గం ఓడిస్తేనే కాని, ఆమె కొమరిత తనకు వశ్యంకాదని ప్రయత్న పరంపర ప్రారంభించాడు.

కాని జయలక్ష్మి హృదయ దుర్గంలోకి ఇతరులు రావడానికి వీలు లేదు. తర్వాత ఏమయినా, ముందర వారి ఇంటిలో అడుగుపెడితే అంతే చాలునని తాను అనంతలక్ష్మి స్వయంవరానికి ఒక దరఖాస్తుదారునిగా మనవి చేసుకున్నాడు.

కోటీశ్వరుడు, ముప్పదిఏళ్ళ బాలాకుమారుడు. ఇంతకన్న పద్దెనిమిదేళ్ళ తన బాలికకు మంచి సంబంధం వేరొకటి ఉండదనుకొని, తన కొమరిత హృదయం కైవసం చేసుకోవడానికి జయలక్ష్మి ఆజ్ఞ జారీచేసింది. ఆ పూట చెట్టియారుగారు వెంటనే ఇంటికిపోయి శైవుడవడంచేత కపాలేశ్వరస్వామికి నారికేళజలాభిషేకం, కందస్వామికి అన్నాభిషేకం, పిళ్ళయారుకి కుడుముల అభిషేకమూ చేయించాడు.

భగవంతుడు తనకు అనుకూలించి, విజయం చేకూర్చితీరుతాడనీ, తక్కిన పని తన అంతులేని ఐశ్వర్యమే సమకూరుస్తుందని చెట్టియారుగారు దృఢనమ్మకంతో అనంతలక్ష్మి హృదయ దుర్గానికి ముట్టడి ప్రారంభించాడు. తన విలాస పురుషత్వశక్తి అంటే చెట్టియారుగారికి నిరవధికమైన గౌరవం తన ధనానికి ఆశించి తన కౌగిలింతలలో కరిగినారు. వివిధ విలాసవతులు, అన్న భావము అతడు దూరంగా నెట్టివేస్తాడు. అలాంటి పిచ్చి నమ్మకాలు అంటే అతని కేమాత్రం నమ్మకంలేదు. ధనానికి ఆశపడితే తనలా ధనవంతులైనవారి కందరికి ఈ సుందర నారీబృందము వశులవుతూ ఉంటారని ఆయన ఏలా అనుకోగలడు! ఒక్కొక్క ప్రసిద్ధ భూలోకాప్సరస మనోహరాంగనను గద్దలా ఎగతన్నుకు పోవడానికి లక్షరూపాయలనే గోళ్లు ఉద్భవింప చేసుకోవలసి వచ్చింది చెట్టియారు జీవిత విటవిహంగానికి.

అలా తాను చేస్తున్నా, తన ధనమనే అయస్కాంతం విలాసవతుల ఇనుప హృదయాల ఠంగున లాగుతున్న విషయం అతనికి తెలిసి ఉన్నా, చెట్టియారుగారు తన్ను తానే నమ్మదలచుకోలేదు.

ఈలాంటి ఆద్భుతమైన కారణాలవల్ల చెట్టియారుగారికి తన విజయం అనే ఓడ గిరగిర సుడిగాలిలో తిరుగుతోందని తోచింది. కాని, ముందుకు ఒక అడుగు నడవటంలేదు. అయినా నాటుకోటు చెట్టియారులకు నూటికి వేయి రూపాయలు వడ్డీకట్టి, ధనం కుప్పతిప్పలు ఇంట్లో పోసుకొనే నేర్పుకు శిఖరశిల ఆయినట్టి, తనశక్తి అనంతలక్ష్మిని మూడురోజులు తప్పితే, మూడు నెలలలో, తప్పితే మూడు ఏళ్ళలోనన్నా తనకు తానే చెట్టిగారి పురుషత్వానికి సిద్దిఅయి తీరుతుంది అని దృఢంగా నమ్మినాడు.

"ఇంతట్లో మళ్ళీ ఒక్కసారి చూద్దామని, చెట్టియారుగారు అనంతలక్ష్మి చదువుల గదిలోనికి వచ్చేసరికి, ఒక చక్కని యువకుడు తెలుగుపాఠం చెబుతున్నాడు.

“రసములు తొమ్మిది, కాని అన్నింటిలో రాణి శృంగారం. శృంగారానికి స్థాయీభావము రతిగాని విప్రలంబముగాని కావచ్చును. ఇప్పటి నవలలలో కథలలో పాటలలో కూడా శృంగారమునకే ప్రాధాన్యం ఈయబడుతున్నది.”

“శృంగారము అంటే అలంకరించుకొనుట అనే అర్థం ఉందిగదా అండి.”

“అవును. దానినిబట్టి మీరు ఊహించుకొనవచ్చునుగదా! రసము అనేది సాహిత్యపరమైనది మాత్రము అని.”

“చాలా గొడవగా ఉంది. గ్రంథంలో 'ఇది శృంగార రసభరితమగు కావ్యము' అని ఆ గ్రంథకర్త రాసినారు. నాకు రసమంటే ఏమిటో మాతెలుగు ఆచార్యాణిగారు తరగతిలో చెప్పారుగాని నా మనస్సుకు ఎక్కలేదు.”

“మనుష్యుడు ఎలాంటివాడో అలాంటిది కావ్యం అనుకుందాం.”

“మంచిదండి.”

“ఆ మనుష్యునకు ఆత్మ ఎలాంటిదో, కావ్యానికి రసం అటువంటిది అనుకుందాం.”

“సరేనండి.”

"శృంగారాది రసాలు, పురుషుని వ్యక్తిత్వమువంటివి.”

ఈలా పాఠం సాగుతోంది. వారిద్దరు కూచోడంలో, వారిద్దరిమధ్యనా బల్లమీద నృత్యంచేసే పాత్రత్వంలో, చిరునవ్వులలో, ఆ చూపులలో ఏడో తనంలో, చెట్టియారుగారికి కాళ్ళలో ఎముకలు మాయమయ్యేటంత భయంకర స్థితి సంభవింపచేసే ఏదో విపరీత సంఘటన అస్పష్టంగా తోచింది.

“యార్ ఇవన్! (ఎవరు వీడు) యార్ ఇంద సైతాను!” (ఎవడీ సైతాన్) అని అనుకున్నాడు. అతని గుండెలో నల్లబండరాయి గుబేలుమని పడింది. మోమున చెమటలు గుమ్మాయి.

చెట్టి “తెలుగుదానే నేరుస్తుండవు లక్ష్మీ!” అని లోపలికి వచ్చి, ఆ పక్క కుర్చీపై చతికిలపడ్డాడు. ప్రపంచంలో ఎన్నిచోట్లయినా జయించుకు రాగలిగిన కోనంగి, ఆనంతలక్ష్మి ఎదుట గజగజలాడుతున్నాడు. అతనికి తెలుసును. తెలిసిపోయింది, కావ్యాల్లో నాయకులకు తప్ప ఇతరులకు పట్టని మహత్తరావస్థ ఒకటి తనకు పట్టిందనీ, అనంతలక్ష్మి అనే ఒక అద్బుత దివ్యసుందరాంగి తన ప్రేమ నిధానము అయి చక్కాబోయిందనీ.

ఆమెను చూచిన క్షణాతిక్షణంలో ఆ నిజం ఒక్కసారి వెలిగిన వేయి విద్యుద్దీపాలులా అతనికి తెలిసిపోయింది.

అలాంటి ఒక పరమ మధుర “మత్తు” లోపడి పాఠం చెబుతున్నాడు. మూడుసారులు నత్తి కూడా వచ్చింది. అట్టి సందర్భంలో దేవుడులా వచ్చాడీ మహానుభావుడు. ఎవరీ పెద్దమనిషి, వాడి పుణ్యమా అని.

6

“ఈవాళ కింతే చాలు. నాకు చాలా పని ఉంది వెళ్ళాలి” అని కోనంగి అన్నాడు.

“కొంచెం కాఫీ తీసుకుని వెళ్ళండి గురువుగారూ!” అని అనంతలక్ష్మి కోనంగిని ప్రార్థించింది.

“నాకు వ్యవధిలేదు. క్షమించండి” అని కోనంగి మనవిచేసి తలతిప్పి అనంతలక్ష్మికి, చెట్టియారుగారికి నమస్కారంచేసి లేచినాడు.

“మా కారు మిమ్ముదిగబెడుతుం”దని అనంతలక్ష్మి పరిచారికను పిలవడానికి లోనికి పరుగిడింది.

చెట్టియారు: ఎంగళది ఎందూరు?

కోనంగి: అరవపేశం నాకు రాదు స్వామీ!

చెట్టియారు: మీరుదా ఎందా ఊరా?

కోనంగి: బందరు..

చెట్టి: ఇక్కడదా, ఏమి చేస్తురు?

కోనంగి: ఉద్యోగం చేస్తునుదా!

చెట్టి: ఎక్కడదా ఉద్యోగం?

కోనంగి: ఒక మరాట్ట సంస్థలోదా!

చెట్టి: సమస్తా? అది ఎన్న?

కోనంగి: అది పొన్ను!

చెట్టి: బంగారం బేపారందానే?

కోనంగి: బంగారంవంటి అశన బేపారందా!

చెట్టి: అశన అంటే ఏమిటిద?

కోనంగి: కుక్షింబరత్వందా!

చెట్టి: అది ఎన్న?

కోనంగి: అది వెన్న....

ఇంతలో అనంతలక్ష్మి వచ్చి “గురువుగారూ! రండి” అని పిలుచుకు చక్కాపోయింది చెట్టియారుగారు మండిపోయారు. ఈ చదువు చెప్పడం వ్యాపారం త్వరలో ముగింపించాలి అని అయిన పళ్ళు బిగించాడు. కోనంగిని అనంతలక్ష్మి తన వేరే గదిలోనికి కొనిపోయి, అక్కడ సిద్దపరచివున్న కాఫీ బల్లఎదుట కూర్చుండబెట్టి తాను కోనంగికి ఎదురుగుండా కూర్చుండి, అతనితో ఉపాహార మారగించసాగింది.

“గురువుగారూ, ఆయన ఒక నాటుకోటి సెట్టిగారు.”

“ఏయన?”

“మీరు పాఠం చెపుతోంటే వచ్చినాయన. వట్టి రౌడీ! లక్షాధికారి! పరమ దుర్మార్గుడు. వాణ్ణి చూస్తేనే నా ఒళ్ళు మండిపోతుంది.”

“అయితే చూడకండి!”

“వాడు మా అమ్మగారిని బాగా ఎరుగును. మా కుటుంబ క్షేమంకోరే మనిషి. అందుకని తప్పనిసరిగా వాణ్ణి భరించవలసివస్తోన్నది.”

“అయితే వచ్చిన నష్టం ఏముంది? మామూలుగా వెళ్ళేటట్లుగానే వెళ్ళనియ్యండి!”

“నన్ను అండి అని మర్యాదచేయవద్దని ప్రార్థన.”

“కొన్నాళ్ళు సాగనివ్వండి.”

“మీకు మా ఇంట్లో భోజనంచేయడానికి అభ్యంతరం ఉందా? వంటమనిషి ఒక అయ్యరు. మేము మాంసాదులు తినం.”

“అయితే నా కేమీ మీ ఇంట్లో తినడం అభ్యంతరంలేదు.”

వారు కాఫీ త్రాగుతున్నారు. చెట్టియారుగారు అనంతలక్ష్మి చదువులగదిలో కూర్చుండి ఎంతకూ రాలేదేమని అనుకుంటూ ఉండగా కారు బర్రుమన్న చప్పుడు విన్నాడు.

అమ్మయ్యా! ఆ శనిగాడు వదిలాడు. వీడెక్కడ నుంచి దాపురించాడు? వీణ్ణి వదలించాలి. తాను ఎంతమంది పడుచుఉపాధ్యాయుల్ని అనంతలక్ష్మి ఇంటికి రాకుండా చేయలేదు! ఎలాచేయగలిగాడో ఎవ్వరికీ తెలియదు. వాళ్ళేందుకు రావడం మానినారో అనంతలక్ష్మికీ తెలియదు, జయలక్ష్మికి అంతకన్నా తెలియదు.

ఇంకా రాదే అనంతలక్ష్మి! అని చెట్టియారుగారు గబగబ లేచారు. ముందు వరండాలోకి వచ్చారు. అక్కడ వున్న ఒక వస్తాదును "అనంతలక్ష్మి ఎక్కడ?” అని ప్రశ్నించాడు.

“అనంతలక్ష్మా?”

“ఆమ!”

“నా కేమి తెలుసు?”

“కారుమీద ఆ అయ్యవారు వెళ్ళినారా?”

“ఆ అయ్యవారా? ఇందాక వచ్చిన అయ్యవారా?”

“ఆమ!”

“నా కేమి తెలియును?”

కోపంతో చెట్టియారుగారు లోపలికి వెళ్ళి పరిచారిక నడిగారు. ఆమె “చిన్నమ్మగారు కారుమీద వెళ్ళారు” అని అన్నది.

“ఎప్పుడు?”

“ఇప్పుడే.”

“ఇప్పుడే.”

“ఇప్పుడే.”

“ఏ కారుమీద?”

“తన కారుమీదే.?”

“అది కొత్త అయ్యవారిని పంపించడానికి వెళ్ళిందికాదా?”

“అవును.

“అందుమీద ఎల్లా వెళ్ళింది?”

“అందుమీదే వెళ్ళింది.”

7

చెట్టియారుగారు ఏడ్చినంత పని చేశారు. అనంతలక్ష్మి తన్ను తప్పించుకోనేందుకు వేసిన ఎత్తు ఇది అని ఆయనకు తెలుసు. అతనికి మరి కొంచెం పట్టుదల ఎక్కువ అయింది. కళ్ళు తుడుచుకొని పళ్ళు బిగించాడు. వెంటనే జయలక్ష్మితోనన్నా మాట్లాడకుండా కారెక్కి వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు పనిమనిషి చూచింది. వెళ్ళనిచ్చి జయలక్ష్మితో చెప్పింది. అయ్యో! కాబోయే ఆల్లుడికి కోపం వచ్చింది కాబోలు ననుకొని, జయలక్ష్మి పరిచారికను అన్ని విషయాలూ అడిగింది.

ఆ రోజున గేటు దగ్గర నిలుచున్నవాడే, తన్ను “ప్రయివేటు ఉపాధ్యాయకత్వం ఏమన్నా ఉందా” అని అడిగి లేదనిపించుకున్నవాడేనా ఈరోజున వచ్చాడు? వాడికీ అమ్మణ్ణికీ స్నేహం ఎక్కడ కుదిరింది చెప్మా? సాధారణంగా ఎవ్వరితోనూ సహవాసం చేయదు. తన తోటి విద్యార్థినులతో కూడా ఏ పదిమందితోనో మాత్రం చనువుగా స్నేహంగా ఉంటుంది తన అమ్మణ్ణి. అలాంటిది ఈ కొత్త అబ్బాయి ఎక్కడ దాపురించాడు.?

ఒంటిగా అనంతలక్ష్మి ఏ మగవాళ్ళతోనూ వెళ్ళదే! ఆందులో ఒక కొత్తవానితో ఎలా వెళ్ళగలిగింది చెప్మా! అని జయలక్ష్మి ఆశ్చర్యం పొందింది.

జయలక్ష్మి తబ్బిబ్బయింది. ఆవేదన పడింది. కుర్చీమీద చతికిలపడింది. తిన్నగా తనభర్త అయ్యంగారి తైలవర్ణచిత్రమున్న గదికిపోయింది. అది పూజాగృహంలా ఉంటుంది. అక్కడ సాష్టాంగపడి లేచి, చెంపలు వాయించుకొని... “అనంతలక్ష్మిని గూర్చి ఏమాలోచించారు స్వామీ” అని దీనంగా ప్రార్థించింది.

ఎంత సేపూ అయ్యంగారి బొమ్మ నవ్వినట్లే కనబడుతుంది. ఏదో ఊరట చెంది జయలక్ష్మి తాను రంగుదారాలతో కుట్టే కుట్టు పనికి పోయింది.

అనంతలక్ష్మి కోనంగిని కారులో ఎక్కమని తాను కూడ, చటుక్కున అతని పక్కకూర్చుండి కారును పొమ్మంది. మొదట ధైర్యంచేసి ఎక్కిందన్న మాటేగాని, తర్వాత సిగ్గుతో, భయంతో ముడుచుకుపోయింది. ఎవరేమను కుంటారో? తల్లి ఏమనుకుంటుంది? తానెప్పుడూ ఒంటరిగా మగవానితో ప్రయాణంచేసి ఎరుగదు. కారు డ్రైవరు తన పెద అమ్మమ్మ మనుమడు. తనకు అన్నగారి వరస. అంచేత కొంత నయం. అయినా ఈలా సరిసమానంగా ఒంటిగా ఒక పురుష పుంగవునితో ప్రయాణం చేయలేదే తాను!.

అనంతలక్ష్మికి చెమటలు పట్టాయి. కోనంగి అనంతలక్ష్మి అవస్థ చూడకుండానే గ్రహించాడు. అనంతలక్ష్మి చటుక్కున తనతోపాటు కారు ఎక్కడం, అందులో తనపక్కనే కూర్చోడం, అతనికి శృంగారావస్థలో మూర్చ వచ్చినంతపని అయింది. గుండెలు మహావేగంతో కొట్టుకొంటున్నాయి. ఏదో మత్తు అలుముకుపోయింది. నుదురు, చెంపలు, భుజాలు, వీపు వేడెక్కాయి. ఇదే మన్మథావస్థ! అమ్మయ్యో! ప్రేమ మహారోగం వచ్చి తన్ను పట్టుకుంది. ఈ రోగం రానేరాదు; వచ్చిందా వదలనే వదలదు. ఇంక తనకు స్వాతంత్ర్యంలేదు. ఇంక మనస్సు ఫ్రీలాన్స్ జర్నలిస్టు (పత్రికా స్వేచ్చా విలేఖరి) లా తిరగడానికి వీలులేదే! అలా అని ఇదివరకు తాను మహా ఆడపిల్లలకోసం దేవుళ్ళాడినట్టు? ప్చు, ప్చు. ఆడపిల్లలంటే హడలి బేజారయ్యే తాను దివాస్వప్నాలలో అందమయిన బాలికను ప్రేమిస్తున్నట్లు ఊహించుకునేవాడు.

తన్ను రాయిస్టులు, “ఎస్కేపిస్టు వయ్యావు నువ్వు! ఎందుకంటే నువ్వు కలలు కనకూడ”దని వాళ్ళ ‘విహారి' పత్రికలో రాయవచ్చుగాక! తనకు పగటికలలు రాకపోతే ఏలా బ్రతుకగలడు తాను?

ఇప్పుడిక ఆ పగటికలలు కనడానికి వీలులేదు. ఎందుకంటే ఈ ప్రేమ నిధానమయిన ఈ ఆందాల మనోహరాల బాలిక- అనంతలక్ష్మి - తన జీవితంలోనికి ఒక పెద్ద గాలివానలా వచ్చి ప్రవేశించింది.

అతడు ముడుచుకొని కూర్చున్నాడు, అనంతలక్ష్మి ముడుచుకు కూర్చున్నది.

కారు మహావేగంతో ముందుకు సాగిపోతోంది. ఆ కారు డ్రైవరుకు ఎక్కడకు వెళ్ళాలో తెలియక, బీచి వెంటా బజారుల వెంట తిరుగుతున్నాడు.

కొంతసేపటికి అనంతలక్ష్మి, కోనంగీ కూడా మోటారుకారు మనిషి తన ఇష్టం వచ్చినట్లు కారు పోనిస్తున్నాడని గ్రహించారు.

ఆ కారుడ్రైవరు మొదట బీచిరోడ్డు వెంట వెళ్ళాడు. అక్కడ నుండి ఎస్ప్లనేడు, అక్కడ నుంచి సెంట్రల్, తర్వాత పూనమల్లి హైరోడ్డు, తర్వాత చెటపట్, త్యాగరాజనగరు, అళ్వారుపేట, అటునుంచి మౌబ్రేస్, తర్వాత రాయపేట అక్కడ నుంచి తిన్నగా మైలాపూర్, ఆ వెనక అడయారు వెళ్ళాడు.

అడయారులో ఎక్కడా ఆగకుండా తిన్నగాపోయి, బీచి దగ్గర ఆగినాడు.

కారుడ్రైవరు అనందంనాయుడికి తన చెల్లెలయిన అనంతలక్ష్మి అంటే కన్నకూతురుకన్న ఎక్కువ ఆపేక్ష. ఆమెమీద ఈగను వాలనీయడు. ఆనందంనాయుడికి కోనంగి అంటే ఎందుకో మంచి అభిప్రాయం కుదిరింది.

ఆ మూడుగంటలవేళ వాళ్ళిద్దరూ కారులోంచి దిగారు. దిగడానికి కారణం ఆనందంనాయుడు కారుదిగడానికని తలుపు తీయడమే!

ఇద్దరూ దిగారు. సముద్రం ఒడ్డున చిన్నతోట, తోట అవతల చిన్న ఇసుకబయలు ఉన్నది. ఆ తర్వాత ఒడ్డు, ఆ తర్వాత సముద్రము ఉన్నాయి.

ఇద్దరూ కలిసే నడిచారు. ఇద్దరూ ఒక చక్కని ఇసుక ప్రదేశంలో తోటలో మామిడిచెట్టు నీడను చతికిలపడ్డారు. ఆలోచించుకొన్నట్లు కారు ఎక్కినది మొదలు ఇంతవరకు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు.

“నేను పురుషుణ్ణి. ఈలా మాట్లాడకుండా ఉండడము వట్టి పిరికితనము, చిన్న మనిషితనము, దద్దమ్మతనము? వెర్రితనము” అని అనుకున్నాడు కోనంగి.

“ఇదేమిటి? నేను చదువుకునే విద్వార్థినిని. నేటికాలపుదాన్ని, ఈలా మాటాడకుండా ఉండడము వట్టి పిరికితనము, దద్దమ్మతనము, అవమానకరము” అని అనంతలక్ష్మి అనుకొన్నది.

కోనంగి గొంతుక సవరించుకొని “పాఠం అంతా మనస్సునకు హత్తింది కాదా అండి?” అని అన్నాడు కొంచెం బొంగురుపోయిన గొంతుకతో.

“అర్థమయింది. చాలా బాగా ఉంది. అయినా పరీక్షకోసం కాకపోయినా నాకు వేసవికాలంలో కావ్యవిమర్శ అంతా మీరు చెప్పాలి”

“నేనే కావ్యవిమర్శ చెప్పడం! నాకేం తెలుసునండీ?”

“నన్ను అండీ అనకండి.”

“క్షమించండి....కాదు క్షమించు అనంతలక్ష్మి!”

“మా గురువుగారిని మేము క్షమించడమే! అమ్మో!”

అనంతలక్ష్మి తలవంచే మాట్లాడుతూంది. ఆ మాటలలో కొంచెం సిగ్గు కొంచెం విచారమూ కూడా మిళితమై ఉన్నాయి.

“అనంతలక్ష్మిదేవి!”

“ఎందుకండి?”

“నన్ను అండి అనవచ్చునా? నేను అండిగినా!”

“గురువులను అండి అనడం మన పూర్వాచారం.”

“గురువులు చదువులకు అండగలంటివారన్నమాట!”

అనంతలక్ష్మి నవ్వుకుంది.

“అనంతలక్ష్మీదేవి! నేను నా ఉద్యోగానికి ఇవాళ నీళ్ళు వదలుకున్నట్లే”

“మీరు ఉద్యోగం మానివేసినట్లయితే తక్షణం మా ఇంటికి వచ్చేయండి.”

8

అనంతలక్ష్మి ఆశతో ఆ మాట అంది. ఆమెను చూచి కోనంగి విచార వదనంతో “అనంతలక్ష్మిదేవి, నేను కటికదరిద్రుణ్ణి. నాకు మా అమ్మ తప్ప ఇంకెవ్వరూ లేరు. బి.ఏ. పరీక్షలో మాత్రం మొదటి తరగతిలో నేగ్గాను. ఉద్యోగాలకు ప్రయత్నం చేస్తున్నాను. అందుకని మదరాసు వచ్చాను.వైటువే కంపెనీలో చేరాను. ఆ ఉద్యోగం అయిపోయింది” అని అన్నాడు.

“ఏ ఉద్యోగం చేయాలని మీ ఆశయం?”

“ఏ ఉద్యోగంలోనూ చేరలేను, చేరకుండా వుండలేను.”

“ఇదేమి చిత్రం!”

“అదే నా జీవిత రహస్యం. ఏదో అసంతృప్తి. ఒక్కచోటా ఉండ లేను. ఏ పనీ చేయలేను. చేయబూనుకుంటే మాత్రం ఆద్భుతంగా చేయగలను.”

“మీరు పాఠం చెబుతోంటేనే నాకర్థమయింది.”

“ఏమని?”

“మీరేదో మహత్తరకార్యంకోసం ఉద్భవించారని.”

“ఆ మహత్తరకార్యం ఏమిటో తెలిస్తే బాగుండిపోను. దాన్నిబట్టి నా జీవితవిధానం ఏర్పాటు చేసుకొందును. నా ప్రయత్నాలన్నీ ఆ ఆశయం కోసం చేసి ఉందును.”

“ఏ విధమైన ఉద్యోగం చేద్దామని మీ ఉద్దేశమో తెలియడం మంచిది కాదా అండి?”

“నిజమేనమ్మా. రెవెన్యూ వగైరాది ప్రభుత్వోదోగాలు చేయాలని సరదా పుట్టదు. పోనీ ప్లీడరీ చేద్దామంటేనే అసహ్యం. బుడబుడక్క జోస్యమూ, గాంధోళిగాని హాస్యమూ జ్ఞాపకం వస్తాయి. వర్తకంగాని, వర్తక కంపెనీలో ఉద్యోగంగాని ఆలోచిస్తే ఎలాంటి వస్తువుల వర్తకమైనా చివరకి అత్తరువులు కంపెనీ అయినా కుళ్ళిపోయిన ఉల్లిపాయల వాసన జ్ఞాపకం వస్తుంది.” “అయితే ఏంచేద్దామని?”

“రిక్షా లాగుదామని.”

“అదేమి మాటండీ!”

“రిక్షావాడిబండిలో కూర్చుని వెడుతోంటేనూ, పది ఎద్దులుకూడా లాగలేని సామానులు లాగుడు బండిలోవేసి కాడికఱ్ఱలు పొత్తికడుపునకు తగిలించుకొని, పశవులకున్న బలం లేకపోవడంచేత, ఆయాసపడుతూ హృదయం ఏడుస్తూ, రక్తాశ్రుబిందువులు కారుస్తూ లాగుతూ ఉండే కూలివాళ్ళను చూస్తూ వుంటేనూ, వారి ఆడవాళ్ళు వెనకనుంచి తోస్తూ ఉంటేనూ ఆదృశ్యాలు రెండూ ఏలా చూడగలం అనంతలక్ష్మీదేవి!”

“అవి భరింపరాని దృశ్యాలే. అందుకని సరదాకుకూడ రిక్షాలో కూర్చోలేను.”

“అవునమ్మా అవును! అందుకని ఆ రిక్షాలాగాలని బుద్ధిపుట్టుంది నాకు. దానివల్లనే జీవించాలని అనుకుంటాను. కాని ఒక రిక్షావాడి తిండి నేను కొట్టివేశానన్నమాటే కాదా?”

“నిజంగా రిక్షాలాగకండి, చాలా జబ్బు!”

“అవును లక్ష్మీ! లక్ష్మీదేవి! కాని ఎంతమందో రిక్షాలు లాగుతూ ఉంటే, మనం రిక్షా లాగవలసిన దుర్భరస్థితులు మనదేశంలో, ఆఫ్రికాలో, జపానులో, చీనాలో, ఇంకా అనేకచోట్ల ఉన్నా మనం చూస్తూ ఊరుకుంటున్నాము. ఏమీచెయ్యలేము. ఇదొకటి నా ఆవేదన”

“గురువుగారూ, నన్ను లక్ష్మి అనే పిలవండి. అదే నాకు చాలా బాగుంటుంది.”

“నువ్వు లక్ష్మివే నిజంగా! అందుకనే నీకు పాఠాలు చెప్పడానికి తగుదునా అని నా ఆలోచన!”

“అదేమిటండి, అలాంటి మాటలు?”

“ఏమి మాటలాడమంటావు లక్ష్మీ! నీకు చదువు చెప్పడం చాలా ఆనందము, లాభదాయకమునూ, అయినా ఇంటి దగ్గర పిల్లలకు చదువు చెప్పుకునే ఉపాధ్యాయునిగా మాత్రం తయారవుతానేమోనని భయం!”

“ఉపాధ్యాయవృత్తి చాలా మంచిదంటారుకాదా?”

“మంచిదే! గోవు మాలచ్చిమి వంటిది ఆవృత్తి. ఆందులో దిగితే గోవునో, గొర్రెనో లేకపోతే గాడిదనో అవడానికి సావకాశం ఉంది.”

అనంతలక్ష్మి పకపక నవ్వింది.

“కాని, మీరు మా ఇంటికి రావడంమాత్రం మానకండి. నేను ఒక విషయం చెపుతాను. సాధారణంగా ఏలాంటివారి స్నేహాలకూ నేను వెళ్ళను. అందులో నాకు పురుషస్నేహితులసలే లేరు. వాళ్ళతో స్నేహంచేయకుండా నేను వ్రతంపట్టడానికి ఒక ముఖ్యకారణం వుంది. ఇవాళ మీరు చూచిన పెద్ద మనిషి ఒక నాటుకోటి చెట్టియారుగారు. ఆయన్ను చూస్తే మీ రిందాకా అనుకున్నట్లే అనుకుంటాను. ఆయన్ను చూచిన పాపం నాకు పోవాలంటే మీరు నాకు తెలుగుపాఠాలు చెప్పాలి. మీరు తెలుగు చెబితే నేను నెగ్గి తీరుతాను. లేకపోతే తెలుగు సున్న అవుతుంది నాకు.”

“నేను తెలుగు చెప్పడానికీ, నాటుకోటి పాపానికి సంబంధం ఏమిటి?”

“కావలసినంత!”

“నాకు పగలు తీరిక ఏమీ వుండదు.”

“నాకూ తీరిక వుండదు.”

“అయితే ఎల్లాగ?”

“రాత్రి రండి, వెనుకనే ఆ సంగతి మనవిచేశానుకదా?”

“మీ కారుమీద నేనున్న మకామునకు పంవుతానన్నావు రోజూ. ఈ యుద్ధం రోజుల్లో ఈలా ఎన్నాళ్ళవరకూ సాగుతుందని నీ వుద్దేశం?”

“నా పరీక్షలవరకూ సాగితే చాలండి.”

“నేను హెూటలు గుజరాత్లో వున్నాను మరి.”

“అక్కడికే పంపుతాను.”

“నువ్వు నాకు ఏమీ జీతం క్రింద ఇవ్వకపోతే నేను నీకు పాఠాలు చెప్పడానికి అభ్యంతరంలేదు.”

“అలాగే లెండి.”

అనంతలక్ష్మికి కలిగిన ఆనందానికి పరిమితిలేదు. కాని కోనంగికి ఏదో భయం కలిగింది. ఆ భయం యొక్క రూపు రేఖా విలాసాలు మాత్రం అతనికి స్పుటం కాలేదు.

“వెడదామా అనంత....?”

“ఎంత చక్కగా వుంది మీరు అనంతా అని పిలిస్తే!”

“ఇదేనా నువ్వు గురువులను మెచ్చుకునే విధానం?”

“ఇతర గురువులు పేర్లతో పిలవరు, ఏమీ పిలవరు. మా అన్నగారు మాత్రం అమ్మిణీ అని పిలుస్తారు.”

“యెవరా అన్నయ్య?”

“మా పెదతండ్రి కొడుకు.”

“ఆయన....?”

“ఆయన లయోలాలో ఇంగ్లీషు ఆచార్యులలో ఒకరు”

ఇంతట్లో ఇద్దరూ మౌనం వహించారు. కోనంగి పక్క చూపులతో అనంతలక్ష్మిని చూచాడు. అనంతలక్ష్మి తలవంచి ఆలోచిస్తూ పక్కచూపులతో కోనంగిని చూచింది.

చివరకు ఇద్దరి చూపులూ కలిశాయి. ఇద్దరూ పకపక నవ్వుకున్నారు. ఇద్దరి హృదయాలూ ఎందుకో ఉప్పొంగిపోయాయి.

కోనంగికి ఇంతలో ఏదో ఆవేదన కలిగింది. కాని చిరునవ్వుతో అనంతలక్ష్మిని చూచి “శిష్యురాలుగారు, మనం వెళ్ళాలి. మా మకాముకు నేను చేరాలి. మా యజమాని ఉద్వాసన చెప్పితే మాత్రం నీ పని పడతాలే!”

“నన్ను పట్టుకోండి చూదాం, గురువుగారూ!” అంటూ లేచి అనంతలక్ష్మి పరుగెత్తి కారులో కూర్చుంది. కోనంగి లేచి పరుగున నడిచి, “ఓడిపోయాను” అంటూ ముందు సీటులో డ్రైవరు పక్క కూర్చున్నాడు.

9

యజమానితో తనకు అర్జంటు పని ఉండి ఆగిపోయినానని కోనంగి చెప్పగానే అతడు ఊరుకున్నాడు.

కోనంగి కోసం రాత్రిళ్ళు ఎనిమిదిన్నర గంటలకు అనంతలక్ష్మి కారు వచ్చేది. కోనంగి ఆ కారుమీద వెళ్ళి పదిన్నరవరకూ పాఠం చెప్పి తిరిగివచ్చేవాడు. తెలుగుభాష సంస్కృత భాషకు బిడ్డ అనిన్నీ, ఆర్యులయిన ఆంధ్రులు దక్షిణాదికి రాగానే ఇక్కడ ఉన్న "అనాదిజాతుల భాషలో నుంచి కూడా కొన్ని పదాలు తెలుగు భాషలోనికి వచ్చాయనీ అతడు చెప్పాడు

తెలుగుభాషలో పద్యాలు ఎప్పటి నుంచి ప్రారంభమో, తెలుగు భాష్యమైన ఆంధ్రభారతం ముందు కవిత్వంఎల్లా ఉండేదో తెలిపినాడు. భారతకాలంనాటి కవిత్వము, శ్రీనాధ పోతరాజుల యుగము, కాకతీయుల కాలం నాటి ద్విపదయుగము, రాయల ప్రబంధయుగము, సంగీతయుగము, శృంగార పదయుగము, హీనప్రబంధయుగము, నూత్నయుగారంభము, నవ్యకవిత్వ యుగము, అతినవీనయుగము మొదలయిన ఆంధ్ర కావ్యచరిత్ర అంతా చెప్పినాడు.

ఆంధ్రభాష అందము తెలిపినాడు. ఆ తర్వాత సంస్కృతభాషా చరిత్ర తెలిపినాడు. సంస్కృతానికీ ఆంధ్రానికీ ఉన్న మహత్తర సంబంధాన్ని గూర్చి బోధించాడు.

ఈ చరిత్ర తెలుసుకోవడం ప్రతి ఆంధ్రభాషా విద్యార్థికి ముఖ్యమన్నాడు

అక్కడ నుండి అతడు పరీక్షకు ఏర్పాటయిన గ్రంథాల పాఠాలు చెప్పడం సాగించాడు. తిక్కన భారతంలోని ఉపాఖ్యానం ఒకటి ఉన్నది. తిక్కన కవిత్వము, భారత కవిత్వం తిక్కన్నకాలం నాటి చరిత్ర, చరిత్రకు కవిత్వానికీగల సంబంధమూ అన్నీ బోధించాడు.

అతని గంభీరమైన బోధనాశక్తి సౌందర్యవంత మయినది. అతని కంఠము మధురమైనది. అతని గుణగణాలు. ఆతని మూర్తి మనోహరమైనవి. ఒకదాన్ని గమనిస్తూ, ఇంకోటి మరిచిపోతుంది, అన్నీ ఒకసారి గమనిస్తుంది. ఇంకా చెప్పమంటుంది. తొమ్మిదిగంటలకు ప్రారంభించిన పాఠం పదింటికి పూర్తిచేస్తే అతనిపాఠము తనకు చాలటంలేదంటుంది అనంతలక్ష్మి.

జయలక్ష్మి కోనంగి పాఠం చెప్పే విధానం చూస్తోంటే ఆమెకూ ఆనందం కలిగింది. ఎంత బాగా చెపుతారు ఈ ఆబ్బాయి అనుకుంది. కొంచెం ఆడతనం వుంది అతనికి మోములో, శిశుతనం అతని గుణాలలో, కొంచెం చిలిపితనం ఉంది అతని మాటలలో.

పాఠం పూర్తిఅయిందాకా జయలక్ష్మి వారిరువురి దగ్గరే కూర్చుని ఉండేది. కోనంగిని కారు ఎక్కించి, తర్వాత ఇతర పనులు చేసుకునేది.

అలా నెలా పదిహేనురోజులున్నరకాలం గడిచింది. ఆ తర్వాత ఒకనాడు కోనంగి కారుదిగి హెూటలు గుజరాత్ భవనంలో వెనకప్రక్క పని చేయువారున్న గదులలోనికి వెళ్ళబోతూ ఉన్న సమయంలో అక్కడే నిలిచి ఉన్న ఒక పెద్దకారులోంచి, ఒక గూడకట్టు మనిషి వచ్చి, కోనంగిని పిలిచి, “సార్ మీరుదానే కోనంగిరావూ?” అని ప్రశ్నించాడు.

“అవును.”

“మిమ్మల్ని అర్జెంటుగా మా జమీందారుగారు తమకారుమీద తీసుకు రమ్మన్నారు.”

“ఎవరు మీ జమీందారుగారు? ఎందుకు తీసుకురమ్మన్నారు నన్ను?”

“తిరువేనుంగుడి జమీందారుగారు. ఎందుకు తీసుకురమ్మన్నారో మాకు తెలియదు సామీ! తాము స్వయంగా ఎక్కే డెయిమ్లరు కారే పంపించారు. అర్జెంటుదా సొళ్రారు (చెప్పారు).

“ఇప్పుడే వచ్చాను. అక్కడ ఎంత ఆలస్యం అవుతుంది?"

“యారుసెఫ్తారు సామీ!?”

“సరే, పదండి.”

కోనంగి కారు ఎక్కాడు. కారు ముందుకు సాగింది. అతివేగంగా మౌంటురోడ్డు వెంటనే చెంగల్పట్టు వెళ్ళేదారిని పరుగులెత్తింది. అరగంట అయినది. ఎంతకూ ఆగదు.

కోనంగి పక్కన కోనంగిని ఆహ్వానించిన ఆయన కూర్చున్నారు.

కోనంగి ఆయన్ని చూచి “ఎక్కడ ఉన్నాము? ఎంత సేపటికి వెళ్ళగలము అక్కడికి?” అని ప్రశ్నించాడు.

“ఇక్కడ ఉన్నామురా పైత్తకారీ” అంటూ ఆ పెద్దమనిషి కోనంగిని పళ్ళూడేంత బలంగా చెళ్ళున లెంపకాయ కొట్టాడు. కోనంగి తెల్లబోయి లేవబోయేసరికి ఇంకో చెంపకాయవేశాడు. కళ్ళు పచ్చబడిపోయాయి కోనంగికి ఆ మనిషి చేయి యినుపచేయి.

“ఒరే గాడిద కొడకా, ఆడపిల్లలకు పాఠాలు చెబుతావా? రాత్రిళ్ళప్పుడా! నీ పీకనులిమి ఇప్పుడే ఏ కొండలోనో పారేయాలిరా!” అంటూ అయిదారు చెంపకాయలు కొట్టినాడు కోనంగిని. బాధచేతా, పౌరుషంచేతా, ఏమీ చేయలేనితనంచేతా కళ్ళనీళ్ళు తిరిగాయి. చెంపలు వాచిపోయాయి, క్రింద పెదవి తెగి రక్తం కారిపోతోంది.

మరునిమిషంలో కోనంగి దూలంలాంటి ఆ పెద్దమనుష్యుని గొంతు పట్టినాడు. కోనంగి ఈతలో అఖండుడు ఎప్పుడూ హాకీ ఆడేవాడు. భయపడ్డాడు. వెర్రకోపం వచ్చింది. ఒళ్ళు తెలియని రుద్రరూపుడై ఆ పెద్దమనుష్యుని పీక పట్టుకొని తన సర్వశక్తులు వినియోగిస్తూ అతని కంఠము ముడిబొటనవేళ్ళతో నొక్కినాడు.

ఇద్దరూ కలసి కిందపడ్డారు. అవతలివాడు గుప్పిళ్ళు ముడిచి, కోనంగి తలమీద పిడుగులాంటిగుద్దులు గుద్దుతున్నాడు. కోనంగి, అతనిపీక బ్రహ్మరాక్షసునిలా నొక్కుతూ అతని మోము మీదకు వంగి, తన పళ్ళతో అతని ముక్కును పళ్ళులోనికి దిగేటట్టు కొరికాడు. వాడు గుద్దడం మాని కోనంగి. తల వెనక్కు నెట్టడానికి కోనంగిజుట్టు పట్టుకున్నాడు. డైయివరు ఒక పక్కరోడ్డు దొరికేవరకూ కారుపోనిచ్చి, ఆ పక్కరోడ్డులోనికి పోనిచ్చి ఆ కారు ఆపి, తానూ కోనంగిమీదకు ఉరికాడు.

కోనంగి ఆ పెద్ద మనిషిముక్కును కండ ఊడేటంత కొరగ్గానే 'ఓ' అని ఆరచి, అతడు కేక వేయడంవల్ల, అంత గొప్ప వస్తాదును మించిన మహావీరుడు కోనంగి కాబోలు ననుకొనే కారు అపుచేశాడు. డ్రైవరు కోనంగి మీదకు ఉరికాడు. కోనంగి ఈతని పీకనొక్కడం మరింత గట్టిచేశాడు. డ్రైవరు అది చూచి తన మొలలో ఎప్పుడూ వుండే అరువల్ (కత్తి) తీశాడు పొడవడానికి. అది ఎలా గ్రహించాడో కోనంగి, మొదటివాని పీకవదలి రెండవవాడు కత్తిఎత్తేలోపుగా వాడి మొగంమీద తన జోడు కాలితో తన్నాడు. ఆ తన్ను కోనంగి అదృష్టం కొద్ది వాడి యెడమ కంటికి తగిలి ప్రాణం జిల్లార్చుకుపోయే బాధపెట్టి “ఓ” అని అరచి కత్తి వదిలాడు.

ఆ కత్తి సీటుమీద పడింది. కోనంగి ఆ కత్తి అందుకుని రివ్వున లేచాడు. డ్రైవరు కారు తలుపు తెరచి పైకి ఉరికాడు. మొదటివాడు కోనంగి పట్టిన గట్టి పట్టువల్ల పది నిమిషాలు ఒళ్ళు తెలియక పడివున్నాడు.

ఇప్పుడు మెలకువ వచ్చి, మొదటివాడు “సామీ, మీరు పొండి, మాకు బుద్ది వచ్చింది” అన్నాడు.

కోనంగి కాలభైరవునిలా లేచి “ఓరి వెధవల్లారా! మిమ్మల్నిద్దర్నీ చంపి మరీ వెడతానురా” అని ఆరచాడు.

కింద పడినవాడు తన అరువుల్ మొల నుండి తీద్దామని ప్రయత్నం చేశాడు. కాని కోనంగి ఆ చేతిని తన జోడుకాలితో నొక్కాడు. చేతివేలు ఒకటి ఫెళ్ళున విరిగింది.

త్రాగుడువల్ల నీరసించిన దుండగీళ్ళు త్రాగుడుబలంతో ప్రాణాలు తీయడానికి వెరవరు. స్వచ్ఛమైన బ్రతుకు బ్రతికిన కోనంగిలో వున్న బలం వారు ఊహించుకోలేక పోయారు.

కారు డ్రైవరు రోడ్డు ప్రక్కపడివున్న పెద్దరాయి తీసికొని వెనక తలుపు తెరచి కోనంగిమీదకు వేసేసరికి, కోనంగి డ్రైవరు సీటు లోనికి ఉరికాడు. ఆ రాయి వచ్చి క్రిందపడి లేవబోయేవాడి గుండెకు తగిలి “నీకోండ్రు పోటాయిడా!” అని ఆరచి వెనక్కు పడ్డాడు. కోనంగి కారులోంచి బయటపడి తనచేతిలో వున్నకత్తితో కారు చక్రం టైర్లు పరపర కోసిపారేశాడు.

డ్రైవరు తనమీదకు వచ్చేసరికి కత్తి పుచ్చుకొని వాడిమీద కురికాడు. వాడు “ఓ” అని కేకలువేస్తూ పొలాలలోనికి ఉరికాడు.

కోనంగి వెంటనే కారుకడకు వచ్చి, కత్తి క్రిందపడవేసి లోనవున్న మనిషిపై రాయితీసి, వాడు మూలగడం చూచి, భయము లేదనుకొని, పక్కపొలంలోని నీళ్ళు తీసుకొని వచ్చి మొగంమీద జల్లి, వాణ్ణి ఎత్తి సీటుమీద పడుకోబెట్టినాడు.

10

కారు సైదాపేటకు ఎనిమిది మైళ్ళలో ఆగింది. ఆ విషయం కోనంగి ముఖ్య రాజపథంమీద మైలురాయిని చూచి తెలుసుకొన్నాడు. హెూటలు గుజరాతుకు పదిహేనుమైళ్ళు నడవాలిరా భగవంతుడా అనుకుంటూ సైదాపేట వైపు దారిపట్టాడు.

వాళ్ళిద్దరూ కలసి కారుచక్రపు టైరు వేరొకటి తగిలించి వెళతారు కాబోలు అనుకున్నాడు. తన మొగం అంతా వాచింది. ఒళ్ళంతా భరింపలేని బాధ. తనతో రాక్షసి యుద్ధంచేశారు ఇద్దరూ.

ఏమిటి వీళ్ళ ఉద్దేశ్యం? ఆడపిల్లలకు చదువు అంటే అనంతలక్ష్మికి చదువు కదా? ఆ చదువు చెప్పడం ఆ జమీందారు కెవ్వరికో ఇష్టంలేదు.

జమీందారూ లేడు గిమీందారూ లేడు. తప్పకుండా ఈ పని ఆ నాటుకోటి చెట్టిగారిది కావచ్చు. చెట్టిగారికి తాను అనంతలక్ష్మికి పాఠాలు చెప్పడం యిష్టంలేదు. ఆ మనిషిని చూస్తేనే వట్టి నూనె మనిషిలా వున్నాడు.

అతనికి అనంతలక్ష్మిని కబళిద్దామనివుంది. ఎవరీ అనంతలక్ష్మి? చెట్టియారుగారికి ఈ కుటుంబానికి ఏమిటి సంబంధం? డెయిమ్లరుకారు చెట్టియారుగారికే ఉండాలి. లేదా వేరే యింకా జమీందారు ఉన్నాడేమో, అతడలా కన్నువేసి వుంచాడేమో! ఈ విషయం చెట్టియారుగారికి ఏమీ తెలియదేమో? తాను ఊరికే భ్రమపడ్డాడేమో?

ఎవర్నీ యిలా ఈ రోజులలో చేయరు. అంత దౌర్జన్యం ఇంకోటిలేదు. ఒక్కబాలికా జీవితంలో అనేక కారణాలవల్ల అనేకులకు వ్యవహార సంబంధాలు వుంటే ఓర్వలేనితనం, చేతకానితనాలవల్ల ఒక దుర్మార్గుడు అలా సంబంధము కలిగివున్న ప్రతివాణ్ణి చంపించి వేయడమేనా? లేకపోతే చావగొట్టడమా?

కాని మా బాగా బుద్ధిచెప్పాడు తాను గుండాలిద్దరికీ. కొంచమయితే తానే వాళ్ళిద్దరనీ చంపేవాడేమో! తన దగ్గిర ఆ కారుడ్రైవరు కత్తి ఆదొంగ పెద్ద గుండా కత్తీ రెండూ వున్నాయి. ఆ కత్తులమీద పేర్లుంటే, ఆ ఇద్దరు రౌడీల పేర్లు తెలుస్తాయి. వాళ్ళని తానూ బాగా ఆనవాలు పట్టగలుగుతాడు.

వాడు కొట్టిన లెంపకాయలకు తన పెదవి చితికిపోయింది. ఎంత వాచిందో ఈ పెదవి!

ఇంక తన కర్తవ్యం ఏమిటి? తాను భయపడి అనంతలక్ష్మికి పాఠం మాని వెయ్యడమా, చెప్పడమా? ఈ చచ్చుగుండాలకు భయపడి తాను తన గౌరవాన్ని వదలుకోవడమేనా?

“ఓయి కోనంగి! నీ కెందుకు భయమూ?

చాలుచాలు నయమూ

ఏమంటిని రయమూ

త్వరగా నడు టయిమూ”

అని పాడుకుంటూ నడకవేగం ఎక్కువ చేశాడు. తల, మొగమూ యెంతో బాధ పెడుతున్నాయి. నవ్వబోతే పెదవులు మరీ నొప్పి పెట్టాయి.

ఈ చెట్టి ఎంతపనిచేశాడు! “ఓయీ నాటుకోటీ, నీ కోట్లతో కోనంగేశ్వరరావు బ్రతుకు సందులలో ప్రయాణానికి అడ్డం పెడదాము అనుకున్నావు కాబోలు?”

“రాబోకు రాబోకు చెట్టియారూ

నీ బోంట్లు మాబోంట్ల కడ్డురారూ”

అనుకుంటూ వేగం ఎక్కువ చేశాడు. ఇంతట్లో వెనకనించి కారులైట్లు కనబడ్డాయి. ఎందుకైనా మంచిదని ఒక మళుపు తిరిగి పొలంలోనికి దిగి చేతులలో రెండుకత్తులూ ధరించి చెట్టుచాటున నిలుచున్నాడు కోనంగి. కారు నెమ్మదిగా వచ్చి అక్కడే ఆగింది.

అందులోంచి డ్రైవరు ధిగాడు. “కోనంగిరావుగారూ, మీరుదా ఇక్కడ ఉండే రండి! తీసుకువెళ్ళి మీ హెూటలులోదా దింపుతాము!” అని ఓ మోస్తరుగా కేకవేశాడు.

“అక్కరలేదయ్యా, నీ కారూ నువ్వూనూ! నడు. నీకారును విమానం చేయగలిగితే ఎగిరి చక్కాబో, స్వర్గలోకానికో, యమలోకానికో” అన్నాడు కోనంగి.

కారుడ్రైవరు “మీ చిత్తందా!” అనినాడు కారులో ఎక్కి కారు సాగింది. అయిదు నిమిషాలలో మాయమైపోయింది. అక్కడ నుంచి కోనంగి కాళ్ళీడ్చుకుంటూ నడిచి మూడుగంటలకు సైదాపేట చేరాడు. సైదాపేటలో బస్సులు అయిదుగంటలకు బయలుదేరతాయి. ఆ బస్సుస్టాండు దగ్గర ఉన్న కాఫీ హెూటలుకు ముందున్న బల్లమీద వాలిపోయి కొంచెం చలివేయడంవల్ల ముడుచుకొని పడుకున్నాడు.

చలి ఎక్కువగా వేసింది. తలనొప్పి చంపుతోంది కోనంగిని. ఒళ్ళు వేడెక్కింది. ఒళ్ళునొప్పులు ఎక్కువైనాయి. అలాగే ముడుచుకొని పరుండి అయిదుగంటలకు మొదటి బస్సుమీద హెూటలు గుజరాతు దగ్గిరదిగి. అప్పుడే సేవకుల దొడ్డిద్వారం తెరచివుంటే అందులోంచి లోనికిపోయి, తన గదిలో తనతోబాటు వుండే ఇద్దరు వడ్డనదార్లు లేకపోవడం కూడ గమనించలేని దశలో తన పక్కమీద పడుకొని, దుప్పటి కప్పుకొని నిదురపోయాడు.

పాడు కలలు. కలలు లేకుండా ఏదో మత్తూ. మైళ్ళకొద్దీ దూరాన ఉన్నట్లు ఎవరో ఎక్కడో మాటాడుతున్నట్లయింది. కోనంగి అలా పడివుండి ఎన్ని యుగాలకో కళ్ళు తెరిచాడు. ఎదురుగుండా మంచంమీద అనంతలక్ష్మి కూచుని ఉంది. ఆమె వెనుక జయలక్ష్మి కుర్చీలో అధివసించి వుంది.

“గురువుగారూ, ఏలా వుంది?”

“ఎలా ఉండడమేమిటి?” (మాట నీరసంగా వుంది.)

“మీకు పదిహేనురోజుల నుండి ఒళ్ళు తెలియని జ్వరం. మీ ఒళ్ళంతా హెూనమై ఉంది. ఏమిటిదంతా?”

నర్సు “నెమ్మదిగా చెప్పండి కబుర్లు. రోగి ఆవేదన వృద్ధి చేయకండి. ఆయన ఒంటికి మంచిదికాదు” అని అన్నది.

అనంతలక్ష్మి: అలాగేనమ్మా!”

జయలక్ష్మి: మీ కోసం రెండురోజులు చూచింది మా అమ్మాయి. దాని బాధ ఎక్కువ అయింది. చివరకు పదిరోజుల క్రిందట నేనూ, అమ్మాయి మీకోసం హెూటలు గుజరాత్ వెళ్ళాం. వచ్చిందాకా ఊరుకొంటేనా? అక్కడ ఒళ్ళుతెలియని జ్వరంలో ఉన్నారు. హెూటలువారు మీకేదో మందిప్పిస్తున్నారు. జ్వరంతో అనేరకాల మాటలు. మా కారుమీద ఎక్కించుకొని మా ఇంటికి తీసుకువచ్చాం: మా కుటుంబం డాక్టరు రెడ్డిగారు శాయశక్తులా పనిచేశారు. ఒళ్ళుగాయాలకు కట్టుకట్టించారు. ఇంజక్షనులు ఇచ్చారు. రక్తం పరీక్షచేశారు. నిన్నరాత్రి చటుక్కున జ్వరం తగ్గింది. మీకు వచ్చిన జ్వరం పెద్దరకం మలేరియాటండి. అందులో తలమీద ఏవో దెబ్బలు తగిలి ఆ మలేరియావల్ల మీరు మమ్ము గుర్తు పట్టలేకపోయారు అని తెలిసింది.

“అబ్బా! ఇంత పెద్దగాధ జరిగిందటండి?” అని నీరసంగా నవ్వాడు కోనంగి.