Jump to content

కోనంగి/ద్వితీయ పథం

వికీసోర్స్ నుండి


ద్వితీయ పథం

అనంతలక్ష్మి

కారు నడుపుకుంటూ అనంతలక్ష్మి లోపలికి పోయింది. కాని ఆ అబ్బాయి విగ్రహం చూపులనుంచి పోదే? ఎవరా యువకుడు? అతని మోములో విచిత్రమయిన శక్తి ఏమిటి? అతని కళ్ళల్లో ముక్తాయించిన శబ్దాలేమిటి? ఎంత చక్కగా మాట్లాడాడు! పాలఘాట్ మణి మృదంగంకన్న తీయగా ఉందామాట. తనకు ఇంకా నవ్వాగలేదు. నాటుపురం కాదట, కన్నాటుపుర మట!

అసలు స్త్రీ పురుష జీవితాలలో ప్రేమ అనేది కుదరదు. ప్రేమ అనేది ఒక కావ్యరస స్వరూపం. కాని జీవితం కావ్యశ్రుతికి రెక్కలు చాపినప్పుడు ఆ దివ్యానుభవ ప్రేమ మనుష్యులకు కూడా ప్రత్యక్షమవుతుంది కాబోలు.

అనంతలక్ష్మి ఆ కావ్యస్థితిలో ఉండే బాలిక. ఆమె రక్తంలో తంజావూరి రఘునాథరాయల ప్రేమ విధానము, మధురవాణి రసికత ప్రవహిస్తున్నవి. ఆ వంశపు ఆమ్మాయే ఆమె. ఆమె ముత్తవ ముత్తవ ముత్తవ ముత్తవ ముత్తవ మధురవాణి కొమరిత అని అనంతలక్ష్మి తల్లి వంశ వృక్షము చూపిస్తుంది.

అనంతలక్ష్మి ఆడవాళ్ళ కళాశాల అయిన క్వీన్ మేరీ కాలేజీలో చదువుకుంటున్నది, ఈ ఏడే ఇంటరుకు వెళ్ళాలి. అనంతలక్ష్మి తల్లి జయలక్ష్మి కొమరితకు ముగ్గురు ఉపాధ్యాయులను పెట్టి చదివిస్తోంది. తానయితే సంస్కృత కావ్యాలు, తెలుగు కావ్యాలు, అరవ కావ్యాలు చదువుకుంది. సంగీతంలో నిధి. నాట్యంలో దాక్షిణాత్య వివాహ రంగస్థలాలు అలంకరించి పండిత పామరుల హృదయములు, ఆదరములు చూఱగొన్న తలమానికమైన నర్తకి.

పొగాకు తాంబూలం వేసినా, జయలక్ష్మి కంచిలో ఉన్న ఒక ధనికుడైన అయ్యంగారి కుద్భవించిన దిట్టమయిన పుట్టుక కలది కాబట్టి, ఎఱ్ఱగాబుఱగా రవ్వల నగలతో, రవ్వల వడ్డాణంతో పదివేల రూపాయల నగలు తల్లి దగ్గర నుండి సంక్రమించుకొన్న నవోడ అయి, ఒక పెద్ద జమీందారుని కన్యరికపు భర్తగా పొందగలిగింది.

అ జమీందారు జయలక్ష్మిని వదులుతేనా? ఆ యువతి నాటుకోటి చెట్టియారుల పెళ్ళిళ్ళిలో, లక్షాధికార మొదలియారుల శుభకార్యములలో, తెలుగు శ్రేష్ఠులు, రెడ్లు, నాయకులు, రాజులు, దాయంగులు, అయ్యరు అయ్యంగార్లు, పిళ్ళేల ఇళ్ళల్లో వివాహాది శుభకార్యాలలో జయలక్ష్మి పట్టులాగు ధరించి, పెద్ద జరీ పూవుల బనారసుచీర ధరించి కుచ్చెళ్ళు పెట్టి అయిదువేల ఖరీదు కలిగిన రవ్వల అడ్డబాస పెట్టి, పద్దెనిమిదివేల రవ్వల వడ్డాణము తన తేనెటీగ నడుంలాంటి నడుముకు బిగించి, విప్పిన అల్లిక విసనకర్రలా కుచ్చెళ్ళు జరీ అంచుతో ముందు జిలుగులాడ, గజ్జెలుకట్టి, గురునకు పాదాభివందనము, మృదంగమునకు వంగి నమస్కారముచేసి, పెద్దలకు దణాలుపెట్టి అలరింపుతో నాట్యం ప్రారంభం చేసిందా, ఆ జమీందారుడు హాజరు.

జయలక్ష్మికి జమీందారుడంటే ప్రేమలేదు. తన కులపు స్త్రీలకు ప్రేమలు పనికిరావని తల్లి బోధించిన నీతి ఆమెకు తెలిసితీరును. “నీవు శృంగార సాయికవు. అభినయ శిరోరత్నానివి. శృంగారం ఆభినయించు. అష్టవిధ నాయికల్ని నాట్యంచేయి” అని తల్లి చెప్పిన వాక్యాలు ఎప్పుడూ మరవలేదు జయలక్ష్మి.

కాబట్టి జమీందారుడు విచారిస్తూ విచారిస్తూ జయలక్ష్మిని వదలలేక దుఃఖిస్తూ బహుశః ఇంద్రలోకమే చేరిఉంటాడు.

జయలక్ష్మి గౌరవానికి మూడు నెలలు దుఃఖించింది. కచ్చేరీలు మారింది.

అలాంటి కచ్చేరీలలో ఒక అయ్యగారింట జరిగిన నాట్యసభలో వర్తకంచేసే ఒక లక్షాధికారి అయ్యంగారు ముప్పదిఏళ్ళ ఈడువాడు భార్యపోయి దుఃఖిస్తున్నవాడు ఆ జయలక్ష్మిని చూచాడు. ఆ శుభముహూర్తంలోనే ఆత్మదగ్గిరనుండి వేలిగోరువరకూ ఒక ప్రేమ ఝంఝామారుతంలో ఆవిడకు సర్వార్పణమైపోయాడు. కాని ఆ రోజుల్లో ఆవిడ చూపులుతప్ప ఈతనికి ఏమీ అర్పించుకోలేకపోయింది. హృదయంలో పడమటిభాగం ఆ చూపులో వంపించుకుంది.

కాని ఆ జమీందారుగారు ఏదో లోకం చేరారు అని తెలుసుకున్నాడు. రాకెట్ విమానాలు లేవు. కనక తిరిగి వస్తాడన్న ఆశకు తావులేదు. ఆ మరుసటి క్షణంలో తన మైలాపురం ఇంటినుండి గంటకు నలభైమైళ్ళ సగటువేగంతో శ్రీమాన్ శ్రీరంగత్తిరుమల రంగయ్యంగారు కారుకు కూడా ఒకేసారి పెద్ద భోజనం పెట్టి తంజావూరు ప్రాంతంలో ఉన్న మన్నారుగుడికి ఉల్కాపాతంలా వెళ్ళిపోయాడు. మన్నారుగుడిలో జయలక్ష్మి రంగులమేడ ఉంది.

శ్రీమాన్ శ్రీరంగత్తిరుమలరంగయ్యంగారు వెళ్ళి దుఃఖిస్తున్న సంతతకన్య అయిన జయలక్ష్మిని ఊరడించ ప్రారంభించారు. ఆమె దుఃఖిస్తున్న మూడు నెలలూ ఆమెను రహస్యంగా ఊరడిస్తూ ఉన్నాడు.

ఆమె ఊరడిల్లి ఇంతకాలంవరకూ తన ఇనపపెట్టెలో దాచుకున్న ఆత్మనుతీసి తన బ్రతుకులో ధరించి చూచుకుంది. ఆ ఆత్మ శ్రీమత్తిరుమలరంగయ్యం గారిని వదలనంటుంది.

ఆనాటినుంచి ఆయనకు ఆమె భార్య. రంగయ్యంగారు ఆమె ప్రేమలో సర్వశృంగార మాధుర్యాలు రుచి చూచారు. పుస్తకట్టి వివాహం చేసుకోలేదు కాని, ఈనాడు లా ప్రకారం భార్యాభర్తలయిన జంటలలో వారిరువురకు ఒకరిమీద ఒకరికున్న ప్రేమ ప్రణయము, కాంక్ష, ఆపేక్ష, గౌరవము, అభిమానము ఏ ఒక్క జంటకన్నా ఉంటుందా?

వారిరువురి దాంపత్యఫలమూ అనంతలక్ష్మి. అనంతలక్ష్మి రసావిర్భావ. అనంతలక్ష్మి ప్రేమపూజావరము. అనంతలక్ష్మి ఆనంద తప సంజనితసిద్ది! జపాన్ చక్రవర్తి కూతురు అలా పెరగలేదు. రాక్ ఫెల్లరు మనుమరాలు ఆ మురిపాలు పొందలేదు.

ఏడాదికోసారి నగలన్నీ మారేవి. నెలకోసారి దుస్తులు మారేవి. రోజుకోసారి ముద్దుల విధానం మారేది.

చిన్నతనంలో పూర్ణారుణం రంగరించి బంగారు, బాలికాతనంలో కొంచెం గులాబిరంగు కలిపివేసిన మేలిమి. యవ్వనప్రాదుర్భావంలో మేలిమీ గులాబీ సమపాళ్ళు. నవయవ్వనంలో వేయితులాల మేలిమిలో 200 గులాబీల రంగు 100 కమలాల వర్ణము కలబోసి, అయిదుశేర్ల ఆవువెన్న, రెండు రాకా పూర్ణిమల వెన్నెల కలిపి, సన్నెకల్లులో నూరి వడబోసి స్పటికశిల చెక్కిన బాలికారూపంగల సీసాలో పోసి ఉంచిన దివ్యవర్ణం.

ఆ బాలిక గొంతుకలో ఏ నాదం వేద్దామా అని సృష్టికర్త చాలా సేపు ఆలోచించాడు. తోచక సరస్వతిని సలహా అడిగాడు. “పోనీలెద్దురూ, కోటిగొంతులు సెకండుకు చేయగల మీరు ఈ గొంతుకకోసం ఎందుకంత తంటా అంట?” అని ఆమె చిరునవ్వుతో పెదవులు ముడుచు కుంటూ పొడిగిస్తూ అంది.

ఆ ఆదికాలపు ముసలాయనకు హృదయం జల్లుమంది కాబోలు! ఆమె పెదవులు రెండూ ముద్దెట్టుకోడం మొదలుపెట్టేసరికి ఆ ముద్దులలో నుంచి ఒక స్వనం. ఆమె కరిగి వివశయైంది కాబోలు. అప్పుడామె కంఠంలోనుంచి ఒక కూజీతం. ఆమె చేయి ఆ వివశత్వంలో తన వీణను మీటుతూ వుంటే ఒక కలరుతం ఉద్బవిల్లి, ఆ మూడూ కలిసిపోయి వారిద్దరికీ మరింత పరవశత్వం కలిగించి ప్రవహించివచ్చి అనంతలక్ష్మి కంఠంలో చేరాయి.

2

ఇదేమిటి? ఆ బాలకుడు తన హృదయంలోంచి పోడేమిటి? పోనీ పగలు చూచి ఉండలేదే అతని రూపం, తన హృదయంలో ఛాయా చిత్రమై అచ్చుపడిపోవడానికీ! తనకు ఏర్పాటయిన పాఠ్యగ్రంథ నవలలో, తాను ప్రీతితో చదువుకునే నవలలో, చిన్న కథలలో నాటకాలలో ఎంతగానో వర్ణింపబడిన ప్రేమ అనే జబ్బుతనకూ ప్రవేశించింది. ఎవరు తనకు వైద్యం చేసేవాళ్ళు?

ఎక్కడైనా ఉంటుందా ప్రేమ? ఎవరో? ఏమిటో? ఎందుకో? ఎలాగో? ఎక్కడనుంచి? ఎక్కడికి? అనే ప్రశ్నలకు సదుత్తరాలు లేకుండా 1939-వ సంవత్సరంలో చదువుకొనే అతినవీన బాలిక ప్రేమించడం సంభవమా? కాని సంభవమై ఊరుకుందే! దీనివల్ల వచ్చే సంఘటనలు ఆ మన్మధునికి తెలుసునా?

రాత్రల్లో అనంతలక్ష్మికి నిద్దర సరిగా పట్టలేదు. పైగా కలలు. ఆ యువకుడు మోటారులోకి తన్ను తోసేసి వచ్చి కూచున్నాడట. తానే నడపడం ప్రారంభించాడుట. తో నాతనిదగ్గిర కూర్చున్నదట. తాను అతన్ని ఆనుకుని. అతనిలోనుంచి తనలోనికి ప్రవహించే ఏదో విచిత్ర శక్తికి పరవశత్వం పొందుతూ అ కారువేగం అనుభవిస్తోంది. తల్లి తన్ను వెనక సీటులోనికి లాగేద్దామని ప్రయత్నమట. ఇంతట్లో తమ మోటారు విమానమై ఎగరడం ప్రారంభించిందట. తామిద్దరూ విమానంలో వెనకాల కూర్చుని ఒకరి కౌగిలిలో ఒకరు ఒరిగిపోయి, అర్థంలేని నవయవ్వనపు పిచ్చి మాటలు మాట్లాడు కుంటున్నారట. తనతల్లే వైమానికుడై విమానం నడుపుతున్నదట.

ఉదయం అనంతలక్ష్మి పరధ్యానంగా ఉంది. జయలక్ష్మీ వచ్చికూతుర్ని చూచి, “ఏమే అమ్మణ్ణి, పరధ్యానంగా ఉన్నావు?” అని ప్రశ్నించింది.

అనం: నేను పరధ్యానంగా ఉన్నానా?

జయ: అంత బడలికగా ఉన్నావేమిటే?

అనం: నేను బడలికగా ఉన్నట్టు కనబడుతున్నానా?

జయ: అవునే అమ్మట్లే! వంట్లో బాగుందా?

అనం: ఏమీ జబ్బులేదు అమ్మా! రాత్రి సరిగ్గా నిద్రలేక అల్లా ఉంది.

జయ: నిద్రలేకపోవడమేమిటి? అందుకనే నేను కంగారుపడుతున్నాను. డాక్టరుగారికి కబురుపంపనా?

అనం: నా కేమీ జబ్బులేదు. నిన్నరాత్రి గేటు దగ్గిర కనబడ్డ ఆ అబ్బాయి ఎవరై ఉంటాడు అమ్మా?

జయ: ఎవరైతే మనకెందుకే! ఎవడో ఒక రౌడీ! లేకపోతే అల్లామాట్లాడుతాడా! ఉద్యోగానికి దురఖాస్తు పట్టుకువచ్చాట్ట! ఆడవాళ్ళ ఇల్లు, మనకు ఏమీ సంరక్షణ లేదనుకున్నాడు. మన మన్నారుగుడి వస్తాదులు మన ఆవరణలో వాళ్ళ కుటుంబాలతో కాపురంవున్నారనీ, అ గేటుకాపలా మనిషి ఆందులో ఒకడని ఆ పై త్తకారికి తెలిస్తేనా?

అనం: అమ్మా! ఏమిటా మాటలు? ఆ అబ్బాయి రౌడీ ఆ! నువ్వు అతని మొహం అన్నా చూడలేదు. కాని ఆ అబ్బాయి మొహంలో నిర్వచింపలేని ఉత్తమలక్షణాలు ఎన్నో ఉన్నాయి.

జయ: చాలులే! మన కామధ్య నిన్ను గురించి వచ్చిన ఉత్తరాలు నాకు మధ్యవర్తుల ద్వారా వచ్చిన రాయబారాలు, బెదిరింపులు అన్నీ మరచి పోయావా?

అనం: వాటికీ, ఈ అబ్బాయికీ సంబంధం ఏమిటి అమ్మా? మన వినాయగం పిళ్ళే గేటుదగ్గిర ఉన్నాట్ట, ఆ అబ్బాయి బస్సు ఆగేచోట నిలుచుండి నిలుచుండి నిలువలేక బద్దకించి మన ఇంటి గేటు దగ్గరకు వచ్చి గేటు ఏనుగుతలమీద కూర్చున్నాట్ట. ఎవరో పెద్దమనిషిలా ఉన్నాడని వినాయగంచూచి ఊరుకున్నాట్ట. ఇంతట్లో మనం సినిమానుంచి వచ్చాము.

జయ: నీకెలా తెలిశాయి యివన్నీ?

అనం: పొద్దున్నే తోటలోకి పువ్వులకు వెళ్ళి, వినాయగాన్ని అడిగి తెలుసుకున్నా.

జయ: పెద్దమనిషి అయితే కావచ్చును మనకెందు కా గొడవ?

అనం: ఆ ఆబ్బాయి కలలోకి కూడా వచ్చాడు.

జయ: కలలోకీ వస్తాడు, తలలోకీ వస్తాడు బుద్ది లేకపోతే సరి. త్వరగా నీళ్ళు పోసుకొని, తలదువ్వుకో, భోజనం చెయ్యాలి.

అనంతలక్ష్మి “సరేలే అమ్మా!” అంటూ లోపలికి పరుగెత్తిపోయింది.

స్నానంచేస్తూ, తలదువ్వుకొంటూ, బట్టలు ధరిస్తూ, భోజనం చేస్తూ ఆ కన్నాటుపురం బాలునే తలుచుకొంటూ తనలో తానే చిరునవ్వు నవ్వుకుంటూ, కాలేజీకి కారుమీద బయలుదేరింది.

క్వీన్ మేరీ కళాశాల సముద్రతీరంలో ఉంది. బాలికలు తరగతిలో కూచోడం ఒక యజ్ఞం. ఆచార్యా తరగతిలోకి రావటంతోటే ఘుమఘుమలాడుతూ, జలజల లాడుతూ, కలకలలాడుతూ, బిలబిలమంటూ, పలపలమంటూ బాలికలంతా లేస్తారు.

ఒక బాలిక ఎందుకో “హిహి” అంటుంది. అక్కడినుంచి తక్కిన బాలికలంతా “హీహీ అనీ, హినీ! హినీ హినీ, హిహీహ్! హీహినీ” అని నవ్వుతారు. ఆచార్యాణి తలెత్తి తరగతిని పరికించి చూస్తుంది. అంతా నిశ్శబ్బం.

పురుషుల కళాశాలలో చదివే బాలికలు, వంచినతల ఎత్తకుండా వస్తారు. చూస్తూ ఉన్నా చూడరు. పలుకరించినా చెవిటివారు. నవ్వితే ఎవ్వ డీ ఇకిలింపుల పెగూపోనీ అని అనుకుంటారు.

మా అనంతలక్ష్మి ఆ దినాన నోట్సు తీసుకోదు. ఇరుప్రక్కలనే వసించిన స్నేహితురాండ్రిద్దరూ ఏమిచెప్తున్నా వినిపించుకోలేదు.

మొదటి స్నేహితురాలు: లక్ష్మి! ఎక్కడే ఉంటా నీ మనసూ?

రెండవ స్నేహితురాలు: దారిలో నాగయ్యను, అశోకకుమార్, పృథ్వీరాజుని....

మొదటి: సురేంద్రునీ, మోతీలాలుని....

రెండవ: నజ్మలని....

మొదటి: జాన్స్టూఆర్టుని....

రెండవ: ఫ్రెడ్ మాక్ ముర్రేని...

మూడవ: క్లార్క్ బిల్....

అనంత: (తల యిరువురివైపూ చెరి ఒకమాటు తిప్పుతూ) నీ తలకాయని, నీ బుజ్జికాయనీ, నీ కళ్ళనీ, నీ పళ్ళనీ, నీ చెవినీ, నీ ముక్కునీ, నీ మెడనూ, నీ నుదురినీ, నీ తెలివినీ, నీ తేటనీ చూచి...

మొదటి: మోహించావు....

రెండవ: మూర్చపోయావు....

ఆచార్యాణి: ...ష్! ష్! నిశ్శబ్దము! అనంతలక్ష్మిదేవి! ఏమిటా గుసగుసలు?

అనంత: మూ, మూ, మూర్చపోయింది..

ఆచార్యాణి: (గడబిడగా కుర్చీనుండి లేచి) ఎవరు? ఎవరు?

అనంత: ఎవరూ మూర్చపోలేదండి. ఎవరో మూర్చపోయారని మా స్నేహితురాలు అన్నది.

ఆచా: అసలా మాటలెందుకు రావాలి?

అనంత: దిగాలుగా ఉంటే ఏమిటని క్లాసులోకి వస్తూ అడిగాను. దానికి అప్పుడే జవాబు చెప్పింది. అంచేత ధైర్యంగా ఉండు అని చెప్పినోట్సు తీసుకొంటున్నాను.

ఆచా: సరే, కూర్చో.

3

అనంతలక్ష్మి ఆటలు ఆడుటకు వెళ్ళింది సాయంకాలం. బాట్లింటనూ, బంతిఆటా, టెన్నిస్తూ, వాలీబాల్, రింగుటెన్నిసూ అన్నీ ఆడుతుంది. కాలేజీ విద్యార్థినుల నాటకాలలో ముఖ్యపాత్ర వహిస్తుంది. అటు తమిళ సారస్వత సంఘంలో ముఖ్యురాలు. ఇటు ఆంధ్ర సారస్వతసంఘంలోనూ ముఖ్యపాత్ర. ఇంటరులో 'బి' గ్రూపులో తెలుగు పుచ్చుకుంది. 'సి' గ్రూపులో తమిళం పుచ్చుకుంది.

అనంతలక్ష్మిలో తమిళాంధ్ర సంస్కారాలు ప్రయోగమయ్యాయి. ఈ ప్రయాగ దేవీప్రయాగ.

అనంతలక్ష్మి తళుక్కుమంటూ తన కారుమీద ఇంటికి చక్కా వచ్చింది. ఆమె అలావస్తూ ఉంటే గేటుదగ్గిర నిన్నటి అబ్బాయే తన ద్వారరక్షకుడు వినాయగంపిళ్ళేతో మాట్లాడుతున్నాడు.

అనంతలక్ష్మి కారు ఆపుచేసింది. ఆమె హృదయం టెన్నిస్ బాటు అయి ఉన్నట్టయితే ఒక్కప్రాయంటు తీయలేకపోయి ఉండును.

కారే గనక ఆపు చేయకపోతే, అనంతలక్ష్మి వెళ్ళి కారు బోల్తా కొట్టించి ఉండును.

అనం: ఏమిటి పిళ్ళా?

పిళ్ళ: ఈ అయ్యరుకు మీకు పాఠాలు చెప్పేవారు కావాలని ఎవరో చెప్పారుట. అందుకని దరఖాస్తు పెట్టడానికి వచ్చారట.

అనంత: లోపలికి తీసుకురా, మా అమ్మగారితో మాట్లాడవచ్చును.

పిళ్ళ: మీ అమ్మగారితో మాట్లాడటమయిందండి.

అనంత: ఏమన్నారు?

పిళ్ళ: ఖాళీలేమీ లేవన్నారు. ఇంక ముందు కూడా ఖాళీలు రావన్నా రటండి.

అనంత: నీ కెల్లా తెలుసు?

పిళ్ళ: అయనే చెప్పాడమ్మా.

అనంత: అల్లాగా?

పిళ్ళ: నేనడిగితే చెప్పారు.

అనంత: నువ్వెందుకు అడిగావు?

పిళ్ళ: మళ్లీ వస్తే రానివ్వడమో, రానివ్వకపోవడమే తెలియవద్దా అమ్మా?

అనంత: అల్లాగా?

పిళ్ళ: నేను మిమ్ములను కూడా కనుక్కోడం మంచిదని చెప్పు తున్నానండి.

అనంత: వారి ఆడ్రసు తీసుకో. ఏఏ పరీక్షలు ప్యాసయినది వగైరా తబ్సీళ్ళు తీసుకో, కార్డు వ్రాస్తాను అవసరమైతే.

అనంతలక్షి బర్రున కారు నడిపించుకు వెళ్ళిపోయింది.

కోనంగి నిట్టూర్పు విడిచి తలవాల్చాడు.

ఇంతవరకూ అరవంలో సంభాషణ జరిగింది అనంతలక్ష్మికి వినాయగానికీ. ఇప్పుడు వినాయగం కోనంగిని చూచి, తెలుగులో మాట్లాడుతూ 'స్వామీ' మీ నివాసం అడ్రసు ఇవ్వండి. ఏమీ' అని అన్నాడు.

సరేనని ఒక చిన్న కాగితంమీద తన అడ్రసు కోనంగేశ్వరరావు నెల్లూరు ఆంధ్రాహెూటల్, నల్లతంబి, ట్రిప్లికేను అని వారికి వ్రాసియిచ్చి తాను చక్కాపోయినాడు.

తాను వచ్చిన పని విజయవంతంగానే జరిగినది. ఎందుకంటారా, తానా బాలికను పగలు చూడాలని బుద్ధిపుట్టికదా తానీ వంకను వచ్చింది. దిట్టమయిన రౌడీలా ఉన్న ఆ గేటుకీపరు తన్నెంతో మర్యాదచేసి అన్ని విషయాలు మాట్లాడాడు. తనంటే ఆ పిట్టపిడుక్కీ అంత మంచి భావం కలగడానికి కారణం ఏమిటి?

తన్ను లోపలికి తీసుకుపోయి వరండాలో కుర్చీలో కూర్చోబెట్టి లోపలికివెళ్ళి మాట్లాడి వచ్చాడు. తానా బాలికా, తల్లి ఏ సినిమాస్టారులో అని కదా ఈ రోజున తబ్సీళ్ళు కనుక్కుందామని వచ్చింది?

వాళ్ళకూ సినిమాకూ సంబంధమేమీలేదు. తన ఉద్దేశంలో ఏమీ చెడు భావాలులేవు. అందుకు ట్రిప్లికేను ప్రార్థసారథి సాక్షి. మైలాపూరు కపిలేశ్వరుడు సాక్షి, మింటువీధి కందస్వామి సాక్షి.

వాళ్ళు అయ్యంగారు లంటారు. అయ్యంగారులంత వాళ్ళంటాడు, వినాయగం పిళ్ళే! జమీందారులంతటివాళ్ళట! ఇక చాలు తన ఈ చిన్నసాహసకార్యం.

యుద్ధం ప్రారంభమైంది. ఇంగ్లీషువారూ ఫ్రెంచివారూ ఏదో వేళా కోళంగా యుద్ధం చేస్తున్నారు జర్మనీవారితో. కాని, పోలండూవారికీ ప్రాణంపోకడ అయిపోయింది. ఒకరోజు రెండు రోజులలో పోలండు నాలుగోవంతు అయింది. వేలటాంకులు జగన్నాథ రథాలకన్నా మహావేగంతో అడ్డంలేని బరువుతో భయంకర శబ్దాలతో పోలండు బాలబాలిక, స్త్రీపురుష వృద్ధులనూ ఎదిరించే మగటిమిగలవారినీ, నాశనంచేస్తూ వెళ్ళిపోయాయి. అకాశంలో రాబందులు గద్దలులా వేలకొలది విమానాలు గుండెలవియజేస్తూ, దేశం నేలమట్టంచేసే ప్రళయవర్షం కురిపిస్తూ ముందుకు సాగిపోయినాయి.

ఇంతట్లో అటునుంచి రష్యావాళ్ళు వచ్చి సగం పోలండు అక్రమించారు. పోలండు లేదు. పలకమీద చిన్న బాలుడు పటంవేసి చెరిపేసినట్టు మాయమైపోయింది.

అనంత ధ్వనిలో ఒకదేశ ప్రజల హాహాకారాలు, అనంత రక్తిమలో మనుష్యరక్తమూ కలిసిపోయింది.

అంతులేని కాంక్ష, రాక్షసత్వమూ, రక్తం చూచిన పెద్దపులుల రక్తభౌజన తృష్ణా, భుగభుగమండే విజయగర్వమూ హిట్లరును భయంకర మూర్తిత్వంలో కలిసి యూరపు ఆవరించుకోవడం సాగించింది.

కాని కోనంగికేమి ఉద్యోగం ఉంది. యుద్ధం ఏలాంటి పరిణామం పొందుతుందో తెలియని కోనంగి కెలా ఉద్యోగం ఇస్తారు.

అటు తెలుగుదేశమూ ఇటు తమిళదేశమూ ప్రవాహాలై వచ్చి ఫెళ్ళున చెన్న పట్టణములో తారసిల్లాయి. తెలుగు ప్రవాహం ఉత్తరం బరంపురం నుండి ప్రవహించాలి. అది వచ్చివచ్చి చెన్నపట్నంచేరే కాలానికి వంద ఏళ్ళకుముందే అరవయ్యర్లూ అయ్యంగార్లూ తండాలుగావచ్చి ఉద్యోగం కోటలు పట్టుకు కూర్చున్నారు.

వాళ్ళవి ఇంజనీరింగు, పోలీసు, హైకోర్టు, ఎం. ఎస్. ఎం. రైల్వే, వైద్య విద్యా వగైరా. తీరా 1939లో కోనంగి మదరాసువస్తే ఈయనకోసం ఉద్యోగాలు సిద్ధంగా ఉంటాయా!

కాంగ్రెసు ప్రభుత్వం వచ్చింది: బాగానే పనిచేస్తూ వుండెను. అయినా ప్రధానామాత్యుడు అయ్యంగారే ఆయెను. ఉన్న కొద్దిరోజుల్లో తమజాతిని బాగుచెయ్యడం తెలుగు మంత్రులకు చేత అయితేనా?

తీరా రాజీనామా ఇచ్చి వెళ్ళిపోయే రోజుల్లో కోనంగి మదరాసు వచ్చాడు.

కొంచెం కంటిరెప్పలు రెపరెపలాడించేవేళకు కాంగ్రెసు మంత్రి వర్గాలన్నీ రాజీనామాలు ఇచ్చి కూర్చున్నాయి.

4

కోనంగి తీరగ్గా తిరగ్గా వైట్ వే లెయిడ్లా కంపెనీ “అమ్మకం మనిషి” ఉద్యోగం ఇచ్చారు. ఆ కంపెనీకి ఆంగ్ల మేనేజరు. రోజుకు రెండు రూపాయల జీతం. జీతం వారం కాగానే ఇవ్వటం. సరుకు విడుదలచేయడం ప్రధానం.

వైట్ వే లెయిడ్లా మద్రాసు శాఖ మూసివేయడానికి నిశ్చయించింది కంపెనీ, అందుకని సరుకులకు ఖరీదులు తగ్గించారు.

మేనేజరు అమ్మే స్త్రీ పురుషులతో “ఒక వస్తువు కొనడానికి వచ్చినవానిచేత పదివస్తువులు కొనిపించాలి. ఊరికే చూడడానికి వస్తే ఏభై వస్తువులు కొనిపించాలి” అని బోధించాడు.

ఇంక మా కోనంగి తమాషా చూడండి! ఎవరో ఒక పెద్దమనిషి జేబులో పది రూపాయలున్నవాడు వచ్చాడు. టై ఒక్కటి మాత్రం కొనుక్కుందామని ఆయన ఉద్దేశం. అక్కడే ఉన్నాడు కోనంగి.

కోనంగి: దయచేయండి. తమకు...?

పెద్దమనిషి: టైలు కావాలండి.

కోనం: ఇవి పట్టువి: ఈ నారవి చూచారూ! నూలువి తమకు కావాలా? పట్టువి మడతన్నా పడనివి. ఏవీ రంగుపోవు కాని, ఆ రంగు అందంగా కనబడాలంటే సిల్కుమీదే వెయ్యాలండి.

పెద్దమనిషి: సరేలేవయ్యా, నా కామాత్రం తెలుసులే.

కోనం: చిత్తం! ఎరుపురంగు టై శ్యామలవర్ణానికి బాగుంటుంది. నల్లవానికి నారింజరంగు, మీబోటి పసిమిపచ్చని వారికి తెల్లరంగు, ఎత్తయినవానికి నీలంరంగు, మొదలైన ఏ రంగు అయినా అందంగా ఉంటాయి.

పెద్ద: నాకు ఏ రంగు బాగా ఉంటుందో అలాంటి టై ఒకటి ఇవ్వండి.

కోనం: చిత్తం పైగా కోటునుబట్టి కూడా రంగుతేడాలు, పూవుల తేడాలు ఉండాలండి. తమకు ఏఏ రంగుల కోటులున్నాయి?

పెద్ద: ఎనిమిది ఉన్నాయి. రెండు తెల్లవి. రెండు నల్లవి. తక్కిన వానిలో చాక్లెట్ ఒకటి, కాఫీరంగు ఒకటి, నీలం ఒకటి, ఎరుపు బూడిద రంగు..

కోనం: కోటుకొకరకం టై ఉండాలండి. ఆ రకంలోనే రెండు మూడు వివిధమైన పూవులు మొదలయినవానితో నిండివుండడం మరీ బాగా వుంటుంది. మీ యీ కోటుకు ఈ రెండు టైలూ చాలా అందంగా ఉంటాయి.

పెద్ద: టై ఖరీదు?

కోనం: మూడు రూపాయలకు మించవు, ముప్పావులాకు తక్కువ లేవు.

పెద్ద: నేను జెప్పిన కోట్లకీ, నాకూ సరిపోయే టైలు పదిరూపాయలవి ఏరి ఇవ్వండి.

ఆ పెద్దమనిషి పదిరూపాయలు బల్లమీద పెట్టాడు. కోనంగి ఎనిమిది టైలు పొట్లంకట్టి బిల్లుతో యిచ్చాడు.

నవ్వుకొనే హృదయం గలవారిని కోనంగి ఇంకా నవ్విస్తాడు. పొగడ్తల కుబ్బే మనిషిని, తియ్యగా పొగిడి కొనిపిస్తాడు.

“మీకు వానకోట్లు కావాలన్నారు. వానకోటు మనకు ఉపయోగంగానూ ఉండాలి, అందంగానూ ఉండాలి. ఏవంటారు? ఉపయోగంలో సౌందర్యం రంగరిస్తే, వచ్చే ఆనందం వర్ణనాతీతం.”

“అయ్యా! కాలిజోళ్ళా? చిత్తం. ఈలా దయచేయండి. ఆ కుర్చీపైన... నల్లరంగు బ్రౌన్ రంగులలో, మీకు ఈబ్రౌన్ అందం: మీ చక్కని పొడుక్కు ఈ కాలేజీ వైఖరి అందం ఇంతా అంతా కాదండి: ఎంతచక్కగా సరిపోయిందో! ఈ జోడుకు సరిపోయిన చక్కని మేజోళ్ళున్నాయి: ఇవి మళ్ళీ రావండి, యుద్ధం. ఈ అందం మనదేశంలో నేతకువస్తుందా? వచ్చినా ఉన్న మేజోళ్ళ పరిశ్రమగారాలన్నీ ప్రభుత్వం గుత్తకు తీసుకుంటుంది. రెండుజతలా? మీ తాహతకు నాలుగుజత లుండవద్దూ! చెప్పండి.”

మాయా మంత్రాలు చేశాడు. కమ్మని మాటలు చెప్పాడు. ఆ వారం అతని రోజూ అమ్మకం సగటున రెండువందలయాభై తేలింది.

మేనేజరు తన గదిలోకి కోనంగిని పిలిచి ఇంత విచిత్రంగా, మంచి అనుభవం కలిగిన పాతవారెవ్వరూ సరుకును విడుదల చేయలేదనీ అంత చక్కగా పని చేసినందుకు పదిరూపాయ లావారానికి బహుమతి ఇస్తున్నానని ఇరవై నాలుగురూపాయలూ అతనిచేతిలో పెట్టాడు.

కోనంగి నవ్వుకుంటూ వెళ్ళినాడు. నల్లతంబిలో గదిలో చక్కగా అలంకరించు కొన్నాడు. తన కంపెనీలో మూడు షర్టులు రెండు టైలు ఒక కోటు కొనుక్కున్నాడు.

రొండోవారం కోనంగి విజృంభించాడు. అతడు ముఖ్య అమ్మకందారు అయినాడు. ఆడవారూ అతని మాటలకు మురుస్తూ అతని మూలాన ఇంకో పదివస్తువులు కొనుక్కు పోసాగారు. టైలు నాలుగు వందల అయిదు అమ్మివేశాడు. జేబురుమాళ్లు పెట్టెలు పెట్టెలే!

“జేబురుమాలాలేని జేబు చిలుకలేని పంజరము వంటిది. ఇల్లాలులేని గృహం వంటిది. కిల్లీ దుకాణంలేని వీధివంటిది.”

“పాదాలు, ఎనిమిదిరకాలు. పెద్దమడమలు, వెడల్పు పంజాలు, పొడుగువేళ్ళు, ఎత్తుమడాలు, వంకరపాదాలు, లావువేళ్ళు, పెద్దపాదాలు, చిన్నపాదాలు. ఒక్కొక్క పాదానికి ఒక్కొక్కరకంజోడు అందం. ఈడూజోడూ అనే మాటకు అసలయిన అర్థం ఈడుకు తగిన కాలిజోడు ఉండాలని! ప్రేమని కాపాడగలవి, కాలిజోళ్ళండి. ప్రియురాలు పక్కను నడుస్తుంటే, సరియైన కాలిజోడు లేకపోతే, ప్రియునిజోళ్ళు ప్రియురాలి పాదాలను నలక్కొడతాయి.”

ఈలాంటి సంభాషణలు వేయిపేజీల గ్రంథం అవుతుంది.

మేనేజరు కోనంగిని వారాని కోకొత్తశాఖకు అమ్మే మనుష్యునిగా ఏర్పాటు చేసేవాడు. ఇదివరదాకా, మందకొడిగాసాగే అమ్మకం ఇప్పుడు తుపానులా సాగింది. మూడువారాలు కోనంగి విజృంభణముందు హిట్లరు విజృంభణ చీమగంగాయాత్ర అయింది. వారానికి ముఫ్పై అయిదు చేశాడు.

“వచ్చేది వర్షాకాలం, దాచుకోవయ్యా కాస్తధనం” అన్న మూలసూత్రం కోనంగి మరచిపోయాడు.

కొత్తతోలు పెట్టి కొనుక్కున్నాడు. నాలుగు తువాళ్ళు, అరడజను బనీనులు, అన్నీ తన కంపెనీలో కొనుక్కున్నాడు.

ఒక శనివారం ఏవేవో కొనుక్కుందామని అనంతలక్ష్మి కంపెనీ లోనికి వచ్చింది. ఎదురుగుండా కోనంగి అమ్ముతున్నాడు. అనంతలక్ష్మి ఒక్కనిమిషం నమ్మలేకపోయింది. కోనంగి అనంతలక్ష్మిని చూచాడు. అతని మోము జేవురించింది. గుండెకాయ మూడు “లబ్' లు నాలుగు ‘డబ్' లు కొట్టడం తప్పి చక్కాపోయింది.

ఇంత గాలిపీల్చీ, ఛాతీ కొంచెం ముందుకు పోనిచ్చి తీయగా మాట్లాడుతూ తన అమ్మకం సాగించాడు కోనంగి.

అనంతలక్ష్మికి గుండె ఒకసారి ఆగిపోయింది ఒకసారి విమానంలా అల్లరిచేసింది. ఎల్లాగో కోనంగి దగ్గరకు నడిచివెళ్ళి అనంతలక్ష్మి “ఏమండీ, కోనంగిరావుగారూ!” అంది.

“అనంతలక్ష్మిగారూ! ఏంకావాలి మీకు? మంచి స్నోలు, ముఖంపవుడర్లు, చక్కని జేబురుమాళ్ళు, పిన్నులు, కాలిమేజోళ్ళు, ఆడవారి కాలిజోళ్ళు అన్నీ వున్నాయి. రండి! అలా తెల్లబోతారేమి? నేనిక్కడ అమ్మకందార్లలో ఒకణ్ణి!”

“మీకు కార్డు ఒకటి రాశాను అందలేదా?”

“లేదే!”

“రేపు అందుతుందో, మీరు ఇంటికి వెళ్ళగానే అందుతుందో!”

“కృతజ్ఞుణ్ణి”

“ఈ ఉద్యోగం మీకు ఇష్టమేనా?”

“నాకా, ఈ ఉద్యోగమా? ఏ ఉద్యోగమైనా నాకు ఇష్టమే!”

“ప్రయివేటు చెప్పుతామన్నారు? నాకు తెలుగు చెప్పాలండి.”

“తెలుగా? ఓ! తెలుగులో నేను రాయప్రోలు సుబ్బారావుగారి అంతవాణ్ణి.”

“అందుకనే మిమ్ముల్ని కోరుతూ వుంటా! నెలకు ఏభై రూపాయలిస్తాము. ఆ సంగతే కార్డులో రాశాను.”

“సాయంకాలం రావచ్చునా?”

“సాయంకాలంకన్న రాత్రి మంచిది.”

“రాత్రిళ్ళు నాకు బస్సు అందదు. అదీ భయం.”

“నా కారు వుందిగా?”

“సరేలెండి.”

“కృతజ్ఞురాలిని.”

5

అనంతలక్ష్మి ఇంటికి ఆ మరునాడు ఉదయం తొమ్మిది గంటలకు ఒక పెద్దకారు వచ్చింది. ఆ కారు రూపంలోనూ పెద్ద, గుణంలోనూ పెద్ద! దాని పేరు “రోలురాయిస్” ఇంగ్లీషులో ఆ కారుమీద పచ్చయప్ప కళాశాల, ఆంధ్ర విద్యార్థి ఒకడు అందమైన పాట చేశాడు.

“విత్ దౌ నాయిస్

ఇట్ రోల్స్

ఎమాంగ్ హెూల్స్

అండ్ షోల్స్

ది రోల్స్ రాయిస్”

ఈ పాట ముఖ్యంగా ఉపయోగింపబడింది ఈ రోలురాయిస్ని గూర్చే. ఈ రోలురాయిస్ కారు శివసంబంధ సుబరీమన్న గణేశమీనాచ్చి చెట్టియారుగారిది. బాగా అర్థం చేసుకునేందుకు ఎస్. ఎస్. ఎస్.జి. మీనాచ్చి చెట్టియార్ అంటారు.

ఆ చెట్టియార్ కు సినిమా కంపెనీలంటే మహాఇష్టం: సినిమా చిత్రాలంటే అంత ఇష్టంలేదు. అసలు సినిమా చిత్రం చూచి ఆనంద కందళిత స్పందిత మందహాస, అరవింద, తుందిల, బృందారక సుందోపసుందుడవుదా మనికాదు.

అసలు సెట్టియారుగారు ఆశయవాది. స్వప్నానందవాది: ఎస్కేప్టిస్టుకాదు. అసలయిన సిసలయిన నిఖార్సయిన, ప్రత్యక్షవాది, వాస్తవికవాది. “చూచి తెలుసుకో రుచి చూచి తెలుసుకో” అంతేగాని, ఏదో మాయలు, మర్మాలు, ఛాయలు అతనికి పనికిరావు. అతడు సినిమాకు వెళ్ళితే ఏదో అర్థం మాత్రం లేకుండా వెళ్ళడు. వట్టి భావకవిత్వ హృదయం కాదాయనిది: అహంభావవాస్తవికతా హృదయం.

ఎవరినన్నా బాలికను తీసుకువెళ్ళడానికి ఎవరో అందాలు తమ వంటినిండా కుదించుకొన్న మనోహరాంగులు రావచ్చును గనుక వారిని చూడడానికి మాత్రమే అతడు వెడతాడు. దీపాలు ఆరిపోతే బొమ్మని చూడడు. ప్రక్కను కూర్చున్న తనతో వచ్చిన బాలిక మెత్తని చేతులు తన చేతులలోకి తీసుకొని చెక్కుతూ స్పర్శ అనుభవించడం భుజాన్ని భుజం రాయడం, కాలుని కాలుతో తొక్కడం మొదలయిన శృంగార నాయకుని హావ భావ విలాస కేసులన్నీ అక్కడ ప్రయోగించి, వానివల్ల వచ్చిన అనుభవం పరీక్షించి వాటిని హృదయంగమం చేసుకోవడం ఆయన పరమాదర్శము.

సముద్రపు ఒడ్డు సౌందర్యయువతీ విరాజిత శృంగారభూమి. సభలు వివిధ విలాసయుత సుందరీ సందోహిత మందారవనాలు, నాటకాలు విచిత్రమన్మథనర్తిత రంగస్థలాలు. కాబట్టి ఈ ధనపిపాసి వానికి హాజరు. హాజరంటే ఊరికే వట్టిహాజరా? మెళ్ళో సన్నని బంగారు పొడుగాటి గొలుసు. ఆ గొలుసు చివర ఒక పచ్చ ఇరవై వేలుంటుంది. చేతులకు వున్న ఎనిమిది వుంగరాల మదింపు ముప్పదివేల రూకలు. ఆయన బట్టలు పాముకుబుసాలు. ఆయన చేతికర్ర బంగారు తలకట్టు, జాగిలాయి తల. ఆ కుక్కకు కళ్ళు కెంపురాళ్ళు. మూతికడ నీలం, పళ్ళు వజ్రాలు. కర్ర ఆసలైన సిసలైన నిఖారసైన దంతం.

చెట్టియారుగారికి ముప్పది మూడుఏళ్ళ మూడు నెలలు. నిరుడూ అంతే. ముందటేడూ అంతే. అంతకుముందు ముప్పది ఏళ్ళు, వరుసగా అయిదేళ్ళపాటు. అసలైన సిసలైన నిఖారసైన ఆయన ఈడు ఆయన జ్యోతిషం వ్రాద్దామనుకున్న రామస్వామి దీక్షితారుకే తెలుసును.

ఆ చెట్టియారుగారి రోల్స్ రాయిస్ కారు వారి ఆవరణలో నిలిచింది. అందులోనుండి దిగకుండా “చిన అమ్మాయిగా రున్నారా?” అని గేటుకీపరును చెట్టియార్ గారి చ్యాపియర్ అడిగినాడు.

“ఉన్నారు” అని వినాయగంపిళ్ళ జవాబిచ్చాడు. వినాయగంవీళ్ళకు ఈ చెట్టియారును గురించి నిండా పూర్తిగా తెలియును. అసలు వినాయగం పిళ్ళ ఉన్నదే అందుకు వినాయగంపిళ్ళ, కందస్వామి, అరుణాచలం ఈ ముగ్గురూ ఆ ఆవరణలో భార్యలతో బిడ్డలతో కాపురమున్నారు గనుకనే, చెట్టియారుగారు నెమ్మదిగా కారు దిగుతూ నవ్వుతారు, లోపలికి అడుగు పెట్టుతూ నవ్వుతారు, లోని హాలులో సోఫా కుర్చీలో చతికిలబడుతూ నవ్వుతారు.

వినాయగంపిళ్ళ, కందస్వామి మొదలియారు, అరుణాచలం నాయకరు ఒకనాడు సకల దక్షిణాపథ భీములనూ రాజ్యం ఏలారు. ఒకడు కుస్తీలో ఒక్క గామాకుమాత్రం లొస్కు రెండవ పెద్దమనిషి ముష్టియుద్దంలో జోలూయికీ బొక్కు మూడవవీరుడు బలప్రదర్శనంలో కోడిరామమూర్తికి మాత్రం కాస్త తగ్గు.

వీరు ముగ్గురూ మన్నారుగుడిలో ఉండే సమయంలో ముగ్గురకూ నెలకు అరవై చొప్పున జీతం యిచ్చి జయలక్ష్మి తనకు రక్షక వీరులుగా కుదుర్చుకొంది. ముగ్గురూ మంచివారు. తమ మల్ల ముష్టి ప్రదర్శనాలు చూపడం పోటీలకు పోవడం బహుమతులు పొందడం. అంతే వారికి తమ యవ్వనపు రోజులలో పని. ఆ దినాల్లో జయలక్ష్మికి ప్రియుడు జమీందారుడు. ఈ ముగ్గురినీ చేరదీసి అనేక విధాల సహాయంచేస్తూ వారి అభివృద్ధికి కారకుడయ్యాడు. అప్పుడే జయలక్ష్మి అంటే వారి ముగ్గురికి ఎంతో గౌరవం కలిగింది. ఆ జమీందారుడు పోగానే జయలక్ష్మిని అయ్యంగారు పెళ్ళాడినంత పనిచేసి మన్నారుగుడి నుండి మదరాసు తీసుకొని వచ్చినప్పుడు ఆమె కోర్కెపైన ఈ ముగ్గురు వస్తాదులను నెలకు ఎనభై చొప్పున ఒక్కొక్కనికిస్తూ తనతో ఉండండని కోరినది. ఆమె ఆ మూడు కుటుంబాలకూ చేసిన సహాయం అంతా ఇంతా కాదు.

వారి పేరు చెపితే దక్షిణాదిన భయపడని గూండా ఒక్కరైనా లేడు. దొంగలు, రౌడీలు వారి మువ్వురి పేరులలో ఒక్కరి పేరు విన్నా 106 డిగ్రీల మలేరియా జ్వరం పట్టుకుంటుంది. ఇక మువ్వురిపేర్లూ కలిపివింటే టైఫాయడూ, న్యూమోనియా, మలేరియా, ప్లేగు, కలరా, డిసెంట్రీ, పారా ప్లేగెయా, మెనింజైటిస్, డిప్తీరియా, ఇంసోమ్నియా, గాభరేరియా అన్నీ ఒక్కసారిగా పట్టుకుంటాయి.

చెట్టిగారు వచ్చాడు అని అనంతలక్ష్మి పరిచారిక ఒకర్తె చెప్పింది. ఆ మాట వింది. ఆ బాలిక మండిపోయింది. ఆ కోపాన్న ఆ పరిచారికను అక్కడే ఆపింది. “ఒసే ఎవరు వీడు? ఈ పశువు, ఈ కుక్క ఈ నక్క ఈ పంది, ఈ పంది కొక్కు? ఎందుకు? ఎందుకు వస్తాడు మా ఇంటికి? వీడు ఈ గాడిద, ఈ కంచరగాడిద, ఈ కోతి, ఈ ఒరంగ్, ఈ ఒటాంగ్, ఈ ఎలక, ఈ చీమ, ఈ దోమ, ఈ నల్లి, ఈ పిల్లి. నాకు తీరుబడి లేదని చెప్పు పో! వెంటనే వెళ్ళి చెప్పు! వాడు నా ఇంటిలో అడుగుబెడితే నాకు జ్వరం వస్తుంది.”

“అప్పుడే అమ్మగారు మాట్లాడుతున్నారు.”

“మా అమ్మను మామియర్ (అత్తా) అంటాడు. మా అమ్మ వాణ్ణి మరుమగన్ (అల్లుడా) అంటూ పిలుస్తుంది.”

“ఏమి చేయమంటారమ్మా?”

“కారు సిద్ధంచేసి పోర్చి ఆవలగా ఉంచమను. ఈలోగా నువ్వుపోయి. ఆ ఎలుగు బంటితో నేను వస్తున్నానని చెప్పు.”

పదినిమిషాలలో అన్నీ సిద్ధం చేసుకుంది. గబగబ వెళ్ళి కారులో కూర్చుని కారును తిన్నగా ట్రిప్లికేను పోనియ్యమంది.

వీధి గేటు దగ్గరకు ఆ కారు వెళ్ళేసరికి మన చెట్టియారుగారికీ ఆ కారు కళ్ళబడింది. “అమ్మాయి ఎక్కడికో వెడుతోందే?” అని చెట్టియారుగారు జయలక్ష్మితో అన్నాడు.

“అయితే వస్తాను. ఏదో ఇవాళ అదివారంకదా, కాస్త అమ్మణితో మాట్లాడవచ్చునని వచ్చాను.” అని చెట్టియారు లేచి గబగబ వచ్చి తన “రోల్సు” కారు ఎక్కినాడు. కారుడ్రైవరుతో “ఆ కారు ఎక్కడికి వెడితే అక్కడికి పో” అని అన్నాడు.

రోల్సు ఉరికింది ముందుకు, గేటుదాటి కుడివైపుకు తిరిగింది. సిద్దహస్తుడైన డ్రైవరు చేతిలో ఆ కారు జర్రున వేగంగా సాగింది. లజ్ నుంచి రాయపేట హైరోడ్డు కలియికకడకు వచ్చేసరికి ముందు అనంతలక్ష్మి బెంట్లే కనబడింది. ముందు బెంట్లే వెనకరోలు. ఆ కారును చూచి, ఆ ముందు వెళ్ళేబెంట్లేలోని అమ్మాయిని చూచి, పడిందిరా ఆంబోతు పడ్డవెనకా లనుకున్నారు. డ్రైవరుకు వెనకాల రోలు తరుముకు వస్తున్న విషయం బీచిలో తెలిసింది. ఆ విషయం అనంతలక్ష్మికి చెప్పాడు. అలాగా! సరే ఈ పైత్యకారిని ఏడిపిద్దాము అని అనుకుని డ్రైవరుతో తిన్నగా ఎడ్వర్డు ఎలియట్సు రోడ్డుకు తిప్పి అక్కడ నుంచి తిన్నగా పోనిచ్చి గోపాలపురంలో ఉన్న తన స్నేహితురాలు ఆలమే అలుంబాన్ తండ్రి హైకోర్టు జడ్జి పార్ధసారధి మొదలియార్ గారి భవనంలోకి తిన్నగా పొమ్మంది.

ఆ డ్రైవరు వేగంగా బెంట్లేని పోనిచ్చి తిన్నగా హైకోర్టు జడ్జిగారి భవనంలోకి వెళ్ళినాడు.

మన చెట్టిగారు చూచారు, “వేసిందిరా దిట్టమైన ఎత్తు. అయినా మనంవట్టి వాజమ్మలమా, సూదుము!” అని తన కారు తిన్నగా లోనికి పోనిచ్చినాడు.

పోర్చిలో ముందు ఆపివున్న బెంట్లీ వెనకనే ఈ కారు అపి తను దిగి అక్కడేఉండే చౌకీదారుచే తన విలాసమున్న కార్డు పంపాడు.

6

జడ్జిగారు లోనికి రావలసిందని కబురు పంపారు చెట్టియారు గారికి.

చెట్టియారుగారు లోనికివెళ్ళి, తాను ఒక గొప్ప నాట్య ప్రదర్శనము ఏర్పాటు చేస్తున్నాననీ, అందువల్ల వచ్చేసొమ్ము యుద్ధనిధికి యివ్వదలచుకొన్నాననీ, ఆ ప్రదర్శనానికి గౌరవనీయులైన జడ్జిగారు అధ్యక్షత వహించాలని కోరాడు.

జడ్జిగారికి ఆనందము కలిగి చెట్టియారుగారి కృషికి మెచ్చుకున్నారు.

తాము తప్పక అధ్యక్షత వహిస్తామని ఒప్పుకున్నారు. ఆ సందర్భంలో అనంతలక్ష్మి సంగీతకచ్చేరి కూడా ఉంటుందన్నారు, చెట్టిగారు. అందుకు తాను ప్రయత్నం చేస్తున్నాడట.

జడ్జిగారు: అనంతలక్ష్మి నా మాటంటే ఏదీ తీసివేయదండీ, నేను చెప్పి చూస్తాను.

చెట్టి: చిత్తం, ఆ అమ్మాయి సంగీత కచ్చేరి, భోజనంలో మిఠాయి వంటిదండి.

జడ్జి: అవునవును. నేను విన్నాను. నాకు చాలా యిష్టం ఆమె పాటంటే.

చెట్టి: ఆ అమ్మాయి కష్టపడి, భరతనాట్య గురువులలో నాయకమణి అయిన గోవిందకృష్ణపిళ్ళ దగ్గిర నాట్యం నేర్చుకుందండి. ఆమె నాట్యం ముందు మన దక్షిణాదిన ఎవరు. నిలవగలరండి?

జడ్జి: అలాగా, ఆమె నాట్యం చూడనేలేదు. నాట్యం చేస్తుందనే నాకు తెలియదు!

చెట్టి: అయ్యయో! అద్భుతంగా చేస్తుందండి. నేను ఎన్నిసారులో చూచాను. ఎందుకంటే నేను ఆ అమ్మాయిని వివాహం చేసుకోదలచుకున్నానండి. ఆ అమ్మాయి అమ్మగారు అంగీకరించారు.

జడ్జి: అద్భుతం! అనందం! మీ చేయి (కరస్పర్శచేయును) ఈలాంటి వివాహాలు జరిగితేగాని - దేశం బాగుపడదండి. ఇక సెలవు.

చెట్టిగారు తన హృదయంమీద అనంతలక్ష్మి వాలినంత అనందంచెంది, నమస్కరించి సెలవుపొంది కారు ఎక్కి కదలి, వీధిలోకి వెళ్ళి ఆ వీధిచివర ఎవరికోసమో చూస్తున్నట్టు ఆపినాడు. అతనికారు ఉన్న స్థలానికి జడ్జిగారి వీధిగేటు కనబడుతుంది.

అంతలో అనంతలక్ష్మి బెంట్లీకారు అతివేగంగా గేటుదాటి అవలివైపుకు పోసాగింది. వెంటనే చెట్టియారుగారి కారు తరిమింది. ముందు బెంట్లీ , వెనుక రోలురాయిస్.

ముందు పావురం వెనుక డేగ, ముందు జింక వెనుక పెద్దపులి, ముందు చిన్నచేప వెనుక సముద్రపు మొసలి.

బెంట్లీ డ్రైవరు ఎన్ని సందులు గొందులు తిప్పాడో ఎన్ని చుట్టుమార్గాలను తీసుకు వెళ్ళాడో చివరకు పన్నెండు గంటలకు బెంట్లీ అనంతలక్ష్మి ఇల్లు చేరింది. అమ్మయ్యా! ఓపికగలవారికే విజయం, పట్టుదల అంటే తనదే పట్టుదల. ఎంత ఎగిరినా పిట్టగూడు చేరకుండా ఏవాడ పడుతుంది అని అనుకుంటూ చెట్టియార్ గారు తన కారులో అంత మొగం చేసుకొని, రెండు చెవులవరకు నోరు సాగనవ్వుతూ కారు ఆపి, లోనికివచ్చి “మామియర్! (అత్తా) మామియర్!” అని పిలిచాడు.

జయలక్ష్మి పరుగెత్తుకొని వచ్చింది. “ఓ మరుమగనువా!” (అల్లుడవా) అని అంటూ “మళ్ళీ వచ్చారేమి?” అని ప్రశ్నించింది.

చెట్టి: మామియర్, నాకు చాలా పెద్దపని! ఆ పని మనకు, మీకూ నిండా మంచిది. అదిదా నెగ్గుతానో, నెగ్గనో అని భయందా పడితిని మామియర్! మీ అదురుట్టం నా అదురుట్టం పండిందిదా! అది అయింది. ఆ విషయం మీతోదా సెప్పాలి అని వచ్చాను.

జయ: సంతోషం! చెప్పు.

చెట్టి: ఇప్పుడు ఇంటికిపోను: మీ దగ్గిరదా భోజనం.

జయ: అంతకన్న సంతోషం ఎన్న?

జయలక్ష్మి త్వరత్వరగా లోనికిపోయి భోజనం ఏర్పాటులన్నీ చేస్తూంది. చెట్టియారు పిల్లిఅడుగులువేస్తూ అనంతలక్ష్మి గదులలోనికిపోయి చూచాడు. ఆమె అక్కడలేదు. సరే! తల్లిగదులలో ఉండవచ్చును అనుకున్నాడు.

జయలక్ష్మి వంటవారిచేత అన్ని ఏర్పాట్లు చేసి వచ్చి చెట్టియారుగారి దగ్గర కూచుంది.

చెట్టి: మామియర్, యుద్ధంసాగుతోంది. ప్రభుత్వానికి మనం సహాయము చేయాలి.

జయ: ప్రభుత్వానికి మనం ఎందుకు? ప్రభుత్వంకన్న భాగ్యవంతులయినవారు ఎవరు?

చెట్టి: ప్రభుత్వం అంటే మనమేగా?

జయ: ఏమి మరుమగన్?, అట్లదా మాట్లాడుదువు? మనం ప్రభుత్వం ఎట్లు అవుదుము?

చెట్టి: మన మంత్రులుకదా రాజ్యం చేస్తున్నది?

జయ: అయితే రాజ్యం చేయించేది తెల్లవాండ్లు కాదా?

చెట్టి: అబ్బేబ్బె! ఏమిమాటదా సెపుతావు? అది ఇరవైఏండ్లమాట. మన జస్టిసుపార్టీవారు వచ్చిందే, అప్పుడుదా పెజలే రాజ్యం.

జయ: మరుమగన్! మీరు అన్నీ గమ్మత్తుగా అందురు. ఎందరు మంత్రులు వచ్చినా రాజ్యం తెల్లవాండ్లదిదా! జస్టిస్ పార్టీవారు, ఉద్యోగాల పార్టీవారు. బ్రాహ్మణ ద్వేషం మీదదా బతికారు. ఇంతలో కాంగ్రెసు వచ్చింది. ఏమయిపోయినారు జస్టిస్! వీరేం హైకోర్టు జస్టిసా!

చెట్టి: కాదు మామియర్! బామ్మలు తమ రాజ్యందా స్థాపించిరి. మనందరం వాండ్లకు బుద్ది చెప్పినాము.

జయ: నేను బ్రాహ్మణ స్త్రీని, అయ్యంగారి అమ్మాయిని, అయ్యంగారి భార్యను.

చెట్టి: ఆమ! ఆమ! ఆయినా లా ప్రకారం మీరుదా నాన్ బామ్మలు!

జయ: లావో, గీవో? అయితే కాంగ్రెసువాండ్లు ఎవరు?

చెట్టి: వాండ్లు బామ్మలు!

జయ: పటేల్, రాజేంద్రబాబు, సుభాష్, ఆజాద్, గపూర్ ఖాన్, అసలు కాంగ్రెసుకు మహా నాయకుడు గాంధీజీ బ్రాహ్మణులుకాదే?

చెట్టి: వాండ్లంతా బామ్మల బానిసలు.

జయ: అయితే కాంగ్రెసు ఎందుకు నెగ్గింది? జస్టిస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయిందిదా? యింతలో వడ్డనవాడు వచ్చి భోజనానికి రావచ్చునని చెప్పాడు.

జయలక్ష్మి చిన్ననాటినుంచీ మాంసాహారం ఎరగదు. అన్నం ప్రారంభించినప్పటి నుంచీ తండ్రి అయిన అయ్యంగారు శాకాహారమే అలవాటు చేశాడు. తర్వాత జమీందారుని చెట్టబట్టి నప్పుడూ జయలక్ష్మి మాంసాహారం ఎరగదు. ఇంక రంగయ్యంగారికి భార్య అయిన వెనక అచ్చంగా అయ్యంగారి స్త్రీలా తయారయి ఊరుకుంది. అనంతలక్ష్మి తల్లివలెనే శుద్ద అయ్యంగారి బాలిక, కాని ఎవరి ఇంట్లోనన్నా భోజనం చేస్తుంది.

చెట్టియారుగారు స్నానాల గదిలోనికి పోయి చేయి కడుక్కొని, సబ్బుతో మొగం కడుక్కొని తువాలుపెట్టి తుడుచుకొని, భోజనాల హాలులోనికి పోయాడు.

అక్కడ పీటా, దానిముందు వెండికంచమూ పెట్టివున్నది.

ఒక్కకంచమూ దాని చుట్టూ నాలుగు వెండి ఆకులూ మూడు వెండిగిన్నెలూ ఉన్నాయి. అన్నింటిలోనూ కూరగాయలు, గిన్నెలలో సాంబారు, మోరుకుళంబు, రసం వున్నాయి.

“ఒక్కకంచమే ఉన్నదే రెండవ కంచమేది?” అని చెట్టియారుగారడిగారు.

“ఎవరికి రెండవ కంచం?”

“మీ అమ్మాయి, అనంతలక్ష్మికి?”

“అనంతలక్ష్మి భోజనం ఇక్కడకాదు.”

“ఎక్కడ?”

“జడ్జిగారింట్లో”

“కారుమీద తిరిగి ఇంటికి వచ్చిందే!”

“అబ్బే, తానక్కడ భోజనం చేస్తున్నాననీ, కారు తిరిగి పంప నక్కరలేదనీ, వాళ్ళ కారుమీదనే వస్తాననీ కబురు పంపుతూ వట్టికారు తిరిగి పంపేసింది.”

“ఏమిటీ!” తల తిరిగినంతపని అయింది చెట్టియారుగారికి.