కోనంగి/ప్రథమ పథం

వికీసోర్స్ నుండి


కోనంగి

• సాంఘిక నవల •

ప్రథమ పథం

ఉద్యోగ ప్రయత్నం

సర్రున కారువచ్చి ఆగింది. కారులోంచి కోనంగి దిగాడు. దిగీదిగడంతోటే కారు డైవరుకు కుడివైపున ఉన్న అద్దంలో ఎందుకైనా మంచిదని తన్నుచూచుకొంటూ కోటుమడతలు సరిచేసుకొన్నాడు. టై సర్దుకున్నాడు. చేతికర్ర వయ్యారంగా పట్టుకొని ఒకమాటు తల ఇటూ, ఓమాటు తల అటూ తిప్పుకొని, 'దిగ్విజయీభవ!' అని మనస్సులో అనుకొని ఈ విజయదశమికి తనకు విజయం తప్పదనుకొంటూ, జాగ్రత్తగా కుడికాలు జాపి దూరముగా ఉన్న మొదటిమెట్టుపై వేలువైచి పడబోయినంతపని అయి కర్రతో ఆపుకొని, పదిసెకండులు మెట్టుమీదే ఆగి, రెండవదిమెట్టు, మూడవ మెట్టు, నాల్గవ అయిదవ మెట్టులు కుడిపాదం వేస్తూనే ఎక్కి ఆ భవనం ముందర వరండాలో ఆగాడు. ఆగినాడంటే మామూలుగా ఆగినాడా?

ఒక మహారాజు కొమరుడు వేరొక మహారాజు ఇంటికి వచ్చినట్లే! ఆ వచ్చినకారు తనదే అయినట్లు! ఏమో, ఈ సంబంధమే కుదిరితే ఈ కారు తనది ఎందుకు కాకూడదూ?

అదృష్టం పెళ్ళివల్ల పట్టాలి! బంగారపు పాదాలతో పెళ్ళికూతురు పెళ్ళి కొమరుని దగ్గరకు నడచివచ్చిందనుకోండి; అప్పుడు లక్ష్మి నీ దగ్గరకు వచ్చినట్లే కాదటయ్యా! నీ మామగారు వట్టి పాలసముద్రుడా? ఇంగ్లీషు ఆయిషైరు ఆవుపాల సముద్రుడుగాని!

కుదిరితే ధనంవున్న పెళ్ళికూతురే కుదరాలి; అయితే ఐ. సి. ఎస్. ఉద్యోగమే ఆవ్వాలి, అని కోనంగి దృఢనమ్మకం.

ఇంతలో కోనంగిరావుగారి దగ్గరకు ఒక చప్రాసీ పరుగెత్తుకొనివచ్చి, వంగి నమస్కారాలు చేసి లోనికి దయచేయండని అక్కడవున్న ఒక సోఫాపై అధివసింప సంస్కృత భాషలో కోరినంతపని చేశాడు. 'ఆ సోఫాత్తిల్లె అదిగసిప్పుడు సామీ' అని.

ఆ చప్రాసీ ఉత్తర మలబారుజిల్లా మనిషి, యజమాని హెబ్బారు అయ్యంగారు, వచ్చిన కోనంగి తెలుగువాడు. కారుడైవరు తిరునల్వేలి జిల్లా పోడు.

“ఇదర్ వా అప్పా. ఈ సామానుదా తీయ్, క్విక్?” అని డైవరు చప్రాసిని కేక వేసినాడు.

యజమానిగాని, కాబోయే పెళ్ళికూతురుగాని, ఆమె చెలికత్తెలుగాని, ఆయన ప్రాణ స్నేహితులుగాని, మరి ఏ యితర పెద్దమనుష్యులుగాని, కోనంగికి ఆ హాలులో, ఆ గుమ్మాలలో, ఆ గోడలమీద, ఆ మేడ పై కప్పుపై దృశ్యం కాలేదు. ఆఖరికి ప్రత్యక్షమన్నా కాలేదు. కోనంగి భాషలో ఈ రెంటికి తేడా ఉండదని కాలేజీలోనే వాదించేవారు. వెళ్ళగానే కనబడడం దృశ్యం. వెళ్ళి కనిపెట్టుకొని ఉండగా, ఉండగా కనబడడం ప్రత్యక్షం. 'త్యక్షం' అంటే వెళ్ళిన అయిదు నిముషాలకే కనబడడం. 'క్షం' అంటే చూడడానికి వెడదామని అనుకొంటేనే తన ఇంటికి ఆ పెద్దమనిషి రావడం.

'దరిసెనం' అనే మాటకు చూడటానికి వెళ్ళిన పెద్దమనిషి వీపు మాత్రం కనబడటం!

కోనంగి తాను సలుపవలసిన మర్యాదలు నిర్వర్తిస్తున్నాడు. ఒకటి, హాలు డాబా సరంబీవంక చూచాడు. రెండు, హాలంతా కలియచూచాడు. మూడు, గుమ్మాలవంక చూచాడు. నాలుగు, ఒకసారిలేచి హాలు యావత్తూ కలియతిరిగాడు.

ఇంతట్లో లోననుండి ఒక లావుపాటి సూటు వేసుకొని తలపాగాచుట్టుకొన్న మనిషీ, సన్నగా పొడుగ్గా పోకచెట్టులా ఉండి పంచె, కోటు, తలపాగా, మడతల జరీ సేలంకండువా వేసుకొన్న మనిషి లోనకు వచ్చారు.

ఇద్దరు పెద్దలు రాగానే కోనంగిరావు నిలుచున్నాడు. వారికి నమస్కారం చేశాడు. తానే వారిద్దరినీ అయా పీఠాలపై కూర్చోండని మర్యాదగా రెండు చేతులూ జోడించి చూపినాడు.

కోనంగి చూపులో, వారిద్దరూ కోనంగి ఇంటికి దయచేసిన ఎవరో ఇద్దరు పెద్దల్ని చూచిన చూపులు.

లావుపాటి ఆయన: ఓహెూ మీరు దయచేసినారా! (ఇంగ్లీషులోనే ప్రశ్న తరువాత ఇంగ్లీషే!) ఇవాళ మెయిలు ఆలస్యము కాబోలు! కనిపెట్టుకొని ఉండి భోజనం చేశాను. క్షమించండి. ఆఫీసు టైము.

సన్నపాటి ఆయన: వీరేనా భవిష్యత్తు వరుడు? (ఈయనా ఇంగ్లీషు భాషలోనే!) అయితే తమ పేరు?

కోనంగి: (ఇంగ్లీషులోనే) నా పేరు కోనంగేశ్వరరావు. స్నేహితులు కోనంగి అని పిలుస్తారు. కొందరు కోనంగిరావు అంటారు.

లావు: వీరు బి.ఏ. మొదటి తరగతిలో ప్యాస్ అయినారు. మంచి ఆస్థిపరులు.

కోనంగి: అబ్బెబ్బే, ఆస్థి ఏమీలేదండి.

సన్న: మీ మర్యాదమాటల కేమిలెండి! మీ గ్రామం?

కోనంగి: మాది బందరు.

లావు: ఆమ్మాయి కాలేజీకి వెళ్ళబోతూ ఉన్నది. ఇప్పుడే వస్తుంది. (ఈయన మాట్లాడినప్పుడల్లా స్నేహితునివైపు, నేను చెప్పేది నిజమేకదూ అన్నట్లుగా చూస్తూ ఉంటాడు. అలా చూసినప్పుడల్లా ఆయన అవునుకదా మరి! అన్నట్టుగా తల ఊపుతాడు.)

ఇంతట్లో ఆ ఇంట్లోనుంచి, నూటయాభై రూపాయల ఖరీదుగల బెనారసు జరీపూవుల నూరోనెంబరు ఆరుగజాల నూలు చీర ధరించి, చిన్నఐరావతం వంటిదిన్నీ, తెల్లని పళ్ళెత్తుగలిగినదిన్నీ బాలిక ఒకతె రెండు జడలతో, ఎత్తుమడమల జోళ్ళతో చక్కా వచ్చింది. ఆమె ఇంగ్లీషు భాషలోనే, “డ్యాడీ, వరుడు వచ్చాడనుకొంటా, ఈయనేనా?” అని ప్రశ్నించింది. ఆ అమ్మాయి పై పళ్ళు నాలుగు బాగా ఎత్తుగా ముప్పదిడిగ్రీలు ముందుకువచ్చి క్రింది పెదవిని కప్పుతూ పై పెదవిని ముక్కుకంటిస్తూ ఉన్నాయి.

లావు: అవును సీతా! అవును. ఆయనే భవిష్యత్తు వరుడు. ఈయన ఇక్కడే ఉంటాడు. నువ్వు త్వరగా కాలేజీ నుంచి వచ్చి ఈయనతో మాట్లాడుతూ ఉండు. నేనూ మీ మామా ఇద్దరం కలిసివస్తాము. అమ్మాయి: చాలా బాగుంది, డ్యాడీ! నేను కాలేజీకి వెడుతున్నాను. అసలు వెళ్ళకపోదును కాని, క్లాసుకు మొదటిదాన్ని అవడంచేతా, అందరికీ తల్లో నాలికవంటిదాన్ని అవడంచేతా, నేను లేకపోతే తరగతి అంతా చిన్నబోతుంది. డ్యాడీ! ఈ భవిష్యత్తువరుడు బాగానే ఉన్నాడు. నాకు నచ్చితే ఇంగ్లండు తీసుకుపోతానుకూడా! హల్లో! అందరికి వందనాలు. వెడుతున్నా. ఓ నూత్నవరుడుగారూ! మీరు మాఇల్లే మీఇల్లనుకోండి. అన్ని సౌకర్యాలు పనికత్తె రామ్ చూస్తుంది. సెలవు.

ఆ అమ్మాయి గబగబా కారుదగ్గరకు వెళ్ళిపోయింది. లావుపాటి భవిష్యత్తు వధువు తండ్రీ, సన్నపాటి పెద్దమనిషీ ఇద్దరూ లేచి వంటవాడు, పనిమనిషి, బోయీ మీకు సమస్త సదుపాయాలూ చేస్తారు. త్వరలోనే వస్తాము” అని చెప్పి పోర్చిలో సిద్దంగావున్న వేరొక కారెక్కి చక్కా పోయారు.

కోనంగి అలా దిగ్భ్రమపడి ఆ చక్కని ఒకటన్ను గులాబిపూవుల ప్రోవులాంటి పెళ్ళికూతురును తలచుకొంటూ, “ఓహెూ! ఏమి అందం!” అని అనుకొన్నాడు. తాను 'హిందూ'లో చూచిన ఎడ్వర్టయిజిమెంటు ప్రకారం “ఈ బాలిక బంగారపు పిచ్చిక! విధవ అయితేనేమి? ధనం మూలుగుతూంది. ఆ అమ్మాయి నడిచిన భూమే బంగారపుముద్ద అవుతుంది.ఆ అమ్మాయి పాదాల్లో, చేతులో, చూపుల్లో పరసువేది ఉంది తప్పకుండా! కాని అందం మాటా? అది దృక్పథాన్నిబట్టి ఉంటుంది” అనుకున్నాడు.

ఆ విషయంలో తన దృక్పథం కొంచెం వ్యతిరేకంగా ఉంటున్న దేమిటో మరి. మనస్సు కొంచెం ముడుచుకుపోయింది. తన ధైర్యం వేసం కాలంలో నీళ్ళులేక ఎండిన వాగులా అయిపోయింది.ఎండగట్టిన కృష్ణ కాలవలా తయారై ఊరుకుంది.

గిరీశం లాభనష్టాలు బేరీజు వేసుకొన్నాడు. అలాటి తెలివితక్కువ పని తాను చేయదలచుకోలేదు. చలంలా ఇన్ని మ్యూజింగులు చేయదలచు కోలేదు. తాను ఒక కానో ఓ రూపాయో ఎగరవేసి చూడ్డం మంచిది. లేదా చీటీలు ఏలాగా ఎగురవేయవచ్చును. లేకపోతే పెళ్ళికూతుర్నే "అవునూ, కాదూ” వేళ్ళు పట్టుకోమంటే?

ఈ ఆలోచనకు నైజాంబోయీ అడ్డంవచ్చి “దొరా! లే స్నానానికి రండ్రీ” అన్నాడు. ఆ బోయే కోనంగిని ఒక గదిలోకి తీసుకువెళ్ళాడు.

2

ఆ ఆమ్మాయి సీతాదేవి సాయంకాలం వచ్చింది. రాగానే “హల్లో! మీ పేరు కోనంగిరావు కాదూ! అయితే కోనంగిరావుజీ, ఇదిగో దుస్తులు మార్చుకొని వస్తున్నాను. మనం ఇద్దరం టీ పుచ్చుకుందాము. నీకు కాఫీ యిష్టమా, టీ ఆ? కొంపదీసి కోకో కాదు గదా? టీ అవగానే న్యూగ్లోబు సినిమా చూడ్డం మన కార్యక్రమం ఆ తర్వాత బీచీ, పది గంటలకు ఇంటికి, పదిన్నరకు భోజనం” అని గబగబ కోకిలలా, చిలకలా, గ్రామఫోనులా, రేడియోలా, సినీమాస్టారులా పలికి, లోనికి పరుగెత్తింది. ఆ వరాలమూట, ఆ వజ్రాలపోగు, ఆ రసగుల్లాల పళ్ళెం "నువ్వూ దుస్తులు మార్చుకో" అంటూ పరుగున పెద్ద మలయమైన గాలివానలా తేలిపోయింది.

అయిదు గంటలకే వచ్చింది. అరగంట సేపు అలంకరించుకొంది. అలంకారం అంతా అయి టీ గదిలో కూర్చుని కోనంగికి కబురు పంపింది.

కోనంగి తాను దుస్తులు మార్చుకుందామనుకున్నాడు. అతనికి ఉన్నదే ఒక కోటు. అదయినా అతని స్నేహితుడు ఎరువు ఇచ్చిన కోటు. షర్టు రెడీమేడ్ షాపులో కొన్నది. లాగు అతనికున్న రెండులాగులలో ఒకటి. ఇంకా ఎల్లా మారుస్తాడు? బ్రిటిషు గవర్నమెంటు ఉద్దేశంఅన్నా మార వచ్చును కాని అతడు దుస్తులు ఎలా మార్చుకోగలడు? చర్చిల్ భారతీయులకు చెప్పినట్లు కోనంగి, కోనంగికి “ఓయి శ్రీయుత కోనంగిరావుగారూ! మిమ్ము అయితే కాబోయే పెళ్ళికూతురుగారు దుస్తులు మార్చుకోవయ్యా అంది. మీరు దుస్తులు మారుస్తారు. మార్చే ప్రయత్నంలోనే ఉన్నారు. మీ దారిద్య్రానికీ, మీ ఆశయాలకూ, మీ మైనారిటీ అయిన ధనానికి సామరస్యం కుదిరిన మర్నాడు మీకు దుస్తుల బిల్లు మా పార్లమెంటులో తీర్మానించడానికి ఏమీ అభ్యంతరంలేదు” అని సమాధానము చెప్పేసి ఊరుకున్నాడు. ఈ ఉత్తర ప్రత్యుత్తరాలు ఏమీ ప్రచురించడానికి వీల్లేదనిన్నీ నిర్ధారణ చేశాడు.

మొగం కడుక్కుని, తువాలాతో తుడుచుకొని, కోనంగిరావు కోటు తొడుక్కొని ముస్తాబై, గదిలోకి వెళ్ళాడు. అక్కడ సీతాదేవి అందాలన్నీ బస్తాలతో ఏరి కుర్చీమీద పెట్టినట్లు కూచుని ఉంది.

తన పెద్ద కళ్ళెత్తి “నే నందంగా లేనా?” అని ప్రశ్న వేసింది.

“నువ్వు అందానికే అచ్చుతప్పులు దిద్దేటంత అందంగా ఉన్నావు.”

“నువ్వు కోటు మార్చుకోలేదేమి?”

“మార్చుకొన్నా! అంటే తిరిగి మార్చాను. అంటే మార్చినంతపని చేశాను. ఉన్నది ఒక్కకోటే అవడంచేత, ఒకమాటు విప్పి తొడగడం చేతనే, మార్చినట్లు! సబ్ కలెక్టరును మార్చమని ప్రజలు ప్రభుతానికి అర్జీ పెట్టితే, అతన్ని ఆ జిల్లాకే కలెక్టరుగావేస్తే ఎంతో బాగా మార్చినట్లే గదా!”

“నువ్వు చెప్పింది నిజమే కోనంగిరావ్!”

ఇద్దరూ టీ తాగారు. బయలుదేరి వెళ్ళి కారెక్కి సినిమాకు వెళ్ళారు.

అంతకుముందే సీతాదేవి మూడు రూపాయల టిక్కెట్లు రెండు తెప్పించి ఉంచింది. “నువ్వు నా అతిథివి కోనంగిరావూ!” అని ఆమె అంది.

“కాకపోయినా మనపర్సు కాళీగా, సీతాదేవీ!”

“అన్నీ గమ్మత్తుమాటలే నీవి!

“నిజం చెబుతున్నాను.”

“నేను నమ్మను.”

“నువ్వు దగ్గిరుంటే నాకూ నమ్మకంలేదు.”

“నువ్వు చాలా ధనవంతుడవని మా డ్యాడీ చెప్పాడు”

“మీ తండ్రిగారు నన్ను చూచి అనుకున్నారు. అయితే ఒక విధంగా నేను లక్షాధికారినే. నా అందం ఖరీదు ఒక లక్షాయిరువది అయిదువేల మూడువందల రెండు రూపాయిలుంటుంది. నా చదువు డెబ్బది ఎనిమిదివేల తొమ్మిది వందల పది రూపాయలు ఖరీదు ఉంటుంది. నా తెలివితేటల ఖరీదు రెండు లక్షలకు తక్కువకాదు. అయితే నా ఆదృష్టం తీసివేతే కాబట్టి ప్రస్తుతం నిల్వ ఏమీలేని బీదవాళ్ళమే!"

“ధనం కలవాళ్ళు మాత్రం కానీ, పెద్ద ఉద్యోగులు మాత్రం కానీ మాకు దరఖాస్తులు పెట్టవలసిందని మా తండ్రిగారు హిందూలో ప్రచురించారుగా?”

“సీతాదేవీ! ఈ సినిమా చూచి మనం సముద్రం ఒడ్డుకు వెడతామే, అక్కడ మాట్లాడుకుందాం. నా కథ ఈ సినిమాకథతో కలిస్తే, మీకు సినిమా నాయకుడు కోనంగిగానూ, కోనంగి సినీమా నాయకుడుగానూ కనబడవచ్చును. ఏవంటావు?”

“అద్భుతం అంటాను! దీపాలు ఆరగానే నిన్ను ముద్దుపెట్టుకుంటాను. వెంటనే నువ్వు నన్ను ముద్దు పెట్టుకో! ఈ ముద్దులు పెట్టుకోవడం ప్రేమచేతకాదు, లేదూ, ఇంకో దురుద్దేశం చేతనూ కాదు. నువ్వు ఏ రకం రుచిగా ఉంటావో చూడడం, నా పరీక్షలలో ఒకటి!”

“ఆ పరీక్ష లేన్ని ఏమిటి?”

“మనుష్యుని రూపురేఖా విలాసము ఒకటి. దానిని పరీక్ష చేసేవారు మా మామయ్య. రెండవ వరీక్ష: ధనమూ, ఉద్యోగమూ: అది మాతండ్రి గారు. మూడవ పరీక్ష తెలివితేటలు: ఆ పరీక్షచేసేది మా గుమాస్తా.”

“మీ గుమాస్తే! ఎప్పుడా పరీక్ష? పరీక్షకు అచ్చుపత్రం యిస్తారా? లేక పలకా బలపమా?”

“మా గుమాస్తా ఎప్పుడు పరీక్ష చేస్తాడో నేను చెప్పకూడదు. ఎల్లా చేస్తాడో ఏమో నాకే తెలియదు?”

సీతాదేవి ధరించిన చీరా, జంపరూ, అయిదారువందల రూపాయల ఖరీదు ఉండి ఉండవచ్చును. ఆమె సువాసన ద్రవ్యాలతో ఘుమఘుమలాడి పోతోంది. ఆమె ముందర నేను వట్టి బంట్రోతులా కనబడి ఊరు కొన్నాను” అని కోనంగి తలపోశాడు.

సినిమా ప్రారంభమయి దీపాలన్నీ ఆరిపోయి చీకటి కమ్మింది. ఆ ఘూర్ఘాకుక్రీల లాంటి పళ్ళ సీతాదేవి ముద్దు పెట్టుకుంటుంది కాబోలు భగవంతుడా! ఇక తన పెదవులు ఏ జనరలు ఆస్పత్రిలోనో చేరి బాగు చేయించుకోవాలి కాబోలు అని అనుకుంటూ, గుండె దడదడమంటూ గుప్పిళ్ళు బిగ పెట్టి కూర్చున్న కోనంగిని మెడ ఒకచేత్తో కౌగలించుకొని, రెండువ చేతితో అతని తల వంచి ఘట్టిగా సినిమా షాట్లా ముద్దు పెట్టుకుంది సీతాదేవి.

ఆమె కోర్కె ప్రకారం కోనంగి ఆమె పెదవులు రెండూ విడివిడిగా వెతుక్కుని కష్టపడి ముద్దు పెట్టుకున్నాడు. వెంటనే ఆ బాలిక నూరురూపాయలు ఖరీదుచేసే చేతిసంచి తెరచి అందులోంచి చేతిరుమాలు తీసి, తన పెదవులద్దుకొంది.

పెదవులు తడుముకొని గాయాలు లేకపోవడం గ్రహించి తిరుపతి వెంకటేశ్వరునికి మొక్కుకున్నాడు కోనంగి.

ఇద్దరూ సినిమా అవగానే బీచికి వెళ్ళినారు. కోనంగి ఏవో మాట్లాడాడు. పాటలు పాడినాడు.

రేపటి పరీక్ష ఏ విధంగా ఉంటుందో అని ఆలోచిస్తూ ఆమెతోపాటు వారింటికి చేరినాడు కోనంగిరావు.

3

వారి గుమాస్తా పగలు మూడు గంటలకు వచ్చాడు.

“మీరుదానే కోనంగిరావా?”

"ఆమ!”

“మీరుదా ఏ మాత్రం తెలివైనవారు దా?”

“మీరు దా గుమాస్తాలుదానే?”

“ఆమ!”

“మీకుదా ఎన్ని సేర్లు మెదడుదా ఉందిదా?”

“సామీ! వేళాకోళంకాదు, మీరు మీ దేశం తెలుగులోనే మాట్లాడ వచ్చుదా.”

“మరిగంటే ఏయండి, ఏటి తెగుళ్ళు నీకు వచ్చిపోతాది బాబు?”

“సామీ! అదేమి తెలుగుదేశం?”

“గట్లో సెప్పు! శమా? ఆండ్ల మతలబు ఏంది!”

“సామీ! మీకు పట్టిన తెలుగులోనే మాట్లాడుండా!”

“ఇదేమయ్యా, తెలుగుదేశం తెలుగులు రెండు మాట్లాడుతేనే అర్థం కాక తన్నుకున్నావే?”

“నాను ఇక్కడివాణ్ణిదా, ఆ తెలుగులు ఎట్లు తెలుస్తవి సామీ?”

“మీరు బ్రాహ్మణవాండ్లుదానే?”

“అవును దా!”

“నేనుదా, అడిగేదిదా, మీరుదా, నన్నుదా, ఎట్లాదా. పరీక్షదా చేస్తురుదా? అదిదా!”

“అన్నిటికీ దా ఉండదు సామీ?”

“మా దేశంలో చూస్తివా? పిల్లకాయలు, దా బాష మాట్లాడుదురు. నీదా కూదా, ఎదాన్నిదా, ఏందాడ్లుదా? అంటే నీకు ఎన్ని ఏండ్లు? అన్న మాట. తెలుసునా?”

గుమాస్తా వెళ్ళిపోయాడు హడలి బేజారై.

ఇదివరకే బీచిదగ్గర కోనంగి తన చరిత్ర అంతా సీతాదేవికి చెప్పాడు. తాను ఒక బ్రాహ్మణ వితంతువు కొమరుడు. లా ప్రకారం తనకు తండ్రి లేడు. తన తల్లి దిక్కులేనిదయినది, ఆమె భర్తపోగానే.

“అవిడ తిండికోసం, దిక్కుకోసం ఒక బ్రాహ్మణ ఉద్యోగి దగ్గిర వంటలక్కగా చేరింది. సీతాదేవీ! ఆ ఉద్యోగి కొంచెం అందంగా యవ్వనంలోవున్న మా తల్లి పైన కన్ను వేశాడు.”

“రామా రామా! అలాంటి జంతువులు వుంటారు?”

“ఆయన్ని ఏమీ అనకు సీతాదేవీ, ఆయన లా ప్రకారం భార్య అందంలో కొంచెం శూర్పణఖకు దగ్గిర చుట్టం అనుకుంటాను. కాని వట్టి తెలివి తక్కువ సన్యాసి! లేకపోతే పరమాద్భుతమైన అందం భర్తను నాగస్వరం పాముని ఆపినట్టూ, మీఠాయిపొట్లం కుఱ్ఱ ఆపినట్టూ ఆపుతుందనే అవిడ ఉద్దేశం!”

“అయితే ఆ ఉద్యోగి పామువంటి రాస్కెల్ అన్నమాటేగా?”

“ఎంతైనా వాస్తవికతా దృష్టిప్రకారం మాత్రం మా తండ్రేగా? అతి వాస్తవికతా దృష్టిప్రకారం, మా అమ్మగారి యవ్వనమే కారణం.”

అతి వాస్తవికత అంటే సర్ రియలిజం, అనేనా?”

“సర్ రియలిజమో, దివాన్ బహదూర్ రియలిజమో, నా బ్రతుకుకు విభావాను భావాలు అయ్యారు. వారిద్దరూ.”

“విభావానుభావాలా?”

“అదంతా కావ్యవిమర్శ.”

“ఏ కావ్యం?"

“నా బతుకు కావ్యం! సరే, మా తల్లి నిజముగా వితంతువుకాదు. విధవ మాత్రమే! అందుచేత మా రియలిస్టికు తండ్రి, మాసర్ రియలిస్టిక్ తల్లిని మంచి చీరలూ, రెండు. మూడు నగలూ అవీ ఇచ్చి కరిగించి వేశాడు”

“కరిగించటం ఏమిటి?”

“అది భావ కవిత్వంలే! హృదయం కరిగించాడనుకో. ఇంతకూ మన జన్మ ప్రారంభం అయింది. మా అమ్మ భయపడి అప్పుడు సిగ్గుచేత చచ్చిపోయిందట. మా తండ్రి ఆమెను మద్రాసు చేర్పించాడు. ఈ మదరాసులో నేను ఉద్భవించాను సీతాదేవీ!”

“అట్లాగా! ఈ మద్రాసేనా నీ జన్మస్థలం!”

“మా అమ్మ మాస్వగ్రామమైన కాకినాడ వదలి నన్ను పెంచుతూ బందరులో మకాం పెట్టింది. మా తండ్రి బ్రతికి ఉన్నన్నాళ్ళూ మాజీవితం ధనవంతుల జీవితం. నేను అల్లారుముద్దుగా పెరిగాను. మాతండ్రి నేలకు నూరు రూపాయలు పంపేవాడు. మా అమ్మ అందులో ఇరవై రూపాయలు దాచేది.”

“అదీ మంచిదే!”

“మా తండ్రి బందరులో మాకో చిన్నయిల్లు కొని ఇచ్చాడు. నా విషయంలోనే మాఅమ్మకు జరిగిన అనుభవంవల్ల నేను పుట్టిన కొన్నాళ్ళకు జుట్టు తీయించుకుంది. మా అమ్మ అసలు కొంచెం ధర్మపరాయణురాలు. కర్మ చాలా చెడ్డదనుకుంటాను. కర్మ ఎవరినన్నా ఆవహించిందా డొక్క చీలుస్తుంది. అందులో పూర్వకర్మ అయితే, అది 124 ఎ. నిబంధనే!”

“మీ అమ్మ జుట్టు తీయించకుండా వుండవలసింది.”

“జుట్టు తీయించుకోక?”

“మీ తండ్రినే పెళ్ళిచేసుకోవలసింది.”

“అక్కడే ఆ కర్మ అనే పదార్థం దెయ్యమై మా అమ్మను పట్టుకుంది. దెయ్యమేమిటి, లంచగొండి పోలీసు ఇనస్పెక్టరులా పట్టుకుంది. తన కర్మవల్ల తాను నరకకూపంలో పడిపోయిందట. ఆ తప్పు, వెధవ పెళ్ళి అనే మహా భయంకరమైన తప్పుచేసి దిద్దదలుచు కోలేదట. అంచేత మా తండ్రి తన్ను రహస్యంగాగాని, బహిరంగంగాగాని పెళ్ళి చేసుకుంటానని ఎన్ని కోరినా, తన అస్థికి కాబోయే బిడ్డ అధికారి అవుతాడని చెప్పినా మా అమ్మ ససేమిరా అంది. మరి నన్ను పెంచడమే తనకు శిక్షట.”

“ఎంత తెలివితక్కువ పని?”

“మా తండ్రి వీలయినప్పుడల్లా బందరువచ్చి నన్ను చూచి వెళ్ళేవాడు. ఎవరో చుట్టం అనుకునేవాణ్ణి. ఓ రోజున మాకిద్దరకూ ఏమీ చెప్పకుండా మా తండ్రి గుండె జబ్బువల్ల స్వర్గం వెళ్ళి ఊరుకున్నాడు. ప్రవరాఖ్యుడికి కాలి పసరు దొరికినట్లు మా తండ్రి కేమన్నా దొరికిందేమో? స్వర్గం వెళ్ళాడు. అక్కడ అతనికి ఏ అగ్నిదేవుడూ సహాయం చేయలేదు. ఇక్కడ మాత్రం అతని దేహానికి అగ్ని సహాయం చేశాడు.”

“ప్రవరాఖ్యు డెవరు?”

“అసలుయిన ఆంధ్రుడు! కోటి రూపాయల మూట ఎదురుగండా వస్తే తన్నేసిన మూర్ఖుడు.”

“ఆంధ్రులను అట్టే అనకు. నా కోసం పెళ్ళి దరఖాస్తులు పెట్టిన వారిలో నూటికి ఎనభైపాళ్ళు వాళ్ళే!”

“అయితే వాళ్ళు ప్రవరాఖ్యులు కారు. వట్టి చలం లు అయి ఉండాలి.”

“ఎవడా చలం?”

“జాగ్రత్త. అతనికి దూరంగా ఉండు. నీమీద ఇన్ని మ్యూజింగులు రాసి పారేస్తాడు. ఇంతకూ నా తండ్రి పోగానే నా చదువు తక్షణం ఆగలేదు. మా అమ్మ దాచుకొన్న డబ్బూ, అవిడకు మా తండ్రి ఇచ్చిన నగలూ చాలా కాలం వచ్చాయి. ఇంటరువరకూ నాకు ఇబ్బందిలేకపోయింది, బి.ఏ. చదువు యమయాతనే అయింది.”

“పాపం!”

“ఏం లాభం? కులంలేక, దిక్కులేక, చుట్టాలులేక, చందాలు, విద్యార్థి వేతనాలతో ఎలా ఆ రెండేళ్ళు పూర్తి చేశానో సీతాదేవీ! ఆ తర్వాత ఇప్పటికీ,బి.ఏ. పట్టా పొందిన ఏడాది నుంచి ఉద్యోగానికి తిరుగుతున్నా! అంతలో మీ తండ్రిగారు 'కావాలి వరుడు, బ్రాహ్మణుడు చాలు. ఎవరైనా బి.ఏ. పై చదువువాడు, పెద్ద ఉద్యోగి, ఇరవై అయిదేళ్ళు మించనివాడు. ధనం కలవాడు చాలు. వధువు పంతొమ్మిదేళ్ళ అందమయిన బాలిక. బి.ఏ. ఆనర్సు మొదటి తరగతి. ఏభైవేల రూపాయల ఆస్తికలది” అన్నది చూచి, వెంటనే ఫొటోతో దరఖాస్తు పెట్టాను. ఇది నా చరిత్ర. నాకో చిన్నయిల్లు తప్ప ఏమీ ఆస్తిలేదు, సీతాదేవీ.”

“లాభంలేదు కోనంగిరావూ! ఎంచేతనంటే నన్ను ఎవరైనా ప్రేమించి నే నాతన్ని ప్రేమించి ఉంటే, నా తలిదండ్రుల ఇష్టంతో నాకు అవసరంలేదు. నేను నన్ను, నేను నిన్నూ పరీక్షగా ఇందాకటి ముద్దులలో ప్రేమిస్తున్నానా లేదా అని చూచాను. నాకు ఎక్కడా మన్మథ బాణాలు తగల లేదు. నిన్ను చూస్తే జాలిపుట్తోంది. అయినా లాభంలేదు.”

అతని హృదయం తేలికైపోయింది. ఆమె చేసుకుంటానంటే, తాను మర్యాదకు, ధర్మానికి, గౌరవానికి, ధనానికి ఒప్పుకు తీరవలసి రావచ్చును! అమ్మయ్య! ఆమెతో ఇల్లు చేరాడు. ఇప్పుడే గుమాస్తా పరీక్ష ఎందుకు? సీతాదేవి తన నిశ్చయం ఇంకా ప్రెస్ కాన్ఫరెన్సులో ప్రచురించలేదు కాబోలు.

4

సీతాదేవి స్వయంగా కారు నడుపుకుంటూ తన్ను రైలుదగ్గిర దిగబెట్టింది. రెండవ తరగతి టిక్కెట్టు కొని ఇచ్చి రైలులో కూర్చోబెట్టి సెలవు పుచ్చుకొని మైలాపురంలో ఉన్న తనింటికి నడిచింది నడిచిందంటే నడిచివెళ్ళిందనికాదు, కారు నడుపుకుంటూ వెళ్ళిందని.

ఆమె వెళ్ళింది. వెంటనే కోనంగి బండిలోంచి దిగాడు. సామాను పట్టుకున్నాడు - సామానంటే తోలుపెట్టె, హెల్టాలున్ను. చరచరా టిక్కట్లమ్మే స్థలందగ్గరకు వచ్చి తనకు రైల్లో ఉండగా అర్జెంటుపని ఒకటి జ్ఞాపకం వచ్చిందని చెప్పుతూ అణాడబ్బులు చెల్లించి, తక్కిన టిక్కెట్టు డబ్బు తీసుకున్నాడు.

ఇక్కడ నుంచి, హస్తసాముద్రికం చూచి ఒక స్నేహితుడు చెప్పిన తన భవిష్యత్తు, నిజం అవడం ప్రారంభించింది. “ఒరే కోనంగీ, నీ శనిరేఖ శుక్ర స్థానంలోంచి బయలు చేరడంచేతనూ, నీ బుధస్థానంలో స్త్రీ రేఖపొడుగ్గా ప్రవహించి శనిస్థానంవరకూ వెళ్ళడముచేతనూ నీహృదయరేఖలో ధనతారలు మూడు ఉండడముచేతనూ, నీకు స్త్రీ ధనలాభం ఎక్కువ. ఉద్యోగం స్త్రీ వల్లనే కలుగుతుంది. స్త్రీయే నీకు ఉద్యోగం” అని చెప్పడంవల్లనే కదా తాను వరుడు కావాలి, అన్న ప్రచురణలు చూస్తో ఉండేవాడు.

ఇంతకూ, కోనంగి మొదటి సంపాదన స్త్రీవల్లనే వచ్చింది. నువ్వు పెళ్ళికొడుకుగా, నాకు పనికిరావు అని నిర్మొహమాటంగా తియ్యగా చెప్పి సీతాదేవి, కాస్త కోనంగి అంటే కరుణ జనించి తనే అతనికి బందరుకు ఇరవైరెండు రూపాయల పై చిల్లరపెట్టి రెండవ తరగతి టిక్కెట్టుకొని ఇచ్చింది.

తోలుపెట్టి ఒక స్నేహితునిది, హోల్డాలు ఇంకో స్నేహితునిది, దుప్పటి ఇంకోరిది. కోటు ఒక ప్రాణస్నేహితునిది. మదరాసు ప్రయాణానికి మరో ముఖ్య ప్రాణస్నేహితుని దగ్గర పదంటే పదిరూపాయలే బదులు పుచ్చుకు బయలుదేరాడు. బందరుబండిలో టిక్కట్టుకొనే వ్యవధి చాలాలేదు. రైలు కదులుతూ ఉండగా ఎదురుగుండా ఉన్న రెండవతరగతిలో ఎక్కి బెజవాడ చేరుకున్నాడు.

బెడవాడలో మెయిలుకు పద్దెనిమిది రూకలు పెట్టి రెండవ తరగతి కొనాలి. యుద్ధంరోజులు: రెండవతరగతి టిక్కెట్టు కొనేందుకు తన దగ్గర డబ్బులేదు.

అసలు రెండవ తరగతి విషయం ఏలా వచ్చిందీ అంటే “కావాలి వరుడు” అని 'హిందూ' లో ప్రచురించిన వధువు తండ్రి బాక్సు నెంబరు 134 'హిందూ' గారికీ తనకూ జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలలో వధువు తండ్రి “మీరు రెండవతరగతిలో వస్తున్నారు కనుక అక్కడకు మాడ్రైవరు వచ్చి మిమ్మును గూర్చి వాకబు చేస్తాడు. మా కారు నెంబరు ఎం. సి. ఏ. 3004, కారు చెవ్రలెట్, డైవరు పేరు మురుగేశం” అని వ్రాశాడు.

టిక్కెట్టు లేకుండా సెకండుక్లాసులో ప్రయాణం చేయడం వట్టి దురన్యాయం తాను అబద్దం ఆడదలచుకోలేదు, అయితే “ఆశ్వద్దామా హతఃకుంజరః” అని ధర్మరాజుగారన్న చిన్న తెల్ల అబద్దం "వారిజాక్షులందు, వైవాహికములందు” ఆడవచ్చునని శుక్రుడు అన్నాడు.

థర్టుక్లాసు కొన్నాడు. మెయిలు వచ్చింది. గబగబ సామాను సెకండు క్లాసులో ఎక్కించాడు. తాను మాత్రం మూడవ తరగతిలోనే, యమయాతనపడి ప్రయాణం సాగించాడు. బేసిస్బ్రిడ్జి దగ్గిర టిక్కెట్లు వసూలు చేశారు. బయలుదేరబోయే ముందు మాత్రం సెకండుక్లాసులో ఎక్కికూర్చున్నాడు. మదరాసులో సెకండు క్లాసులోనే ఉన్నాడు. మురుగేశం వచ్చి కోణంగిరావుగారూ అని పిలిచే సరికి ఎవరన్నా అడిగితే సెకండు క్లాసులోనే వచ్చాను అని పైకి అని బేసిన్ బ్రిడ్జినుంచి మదరాసుకు అని లోపల అనవచ్చును.

ఇక ఇప్పుడు అతని దగ్గర ఉన్న ఆస్తి ధనం ఇరవై ఆయిదు రూపాయల పై చిల్లర.

తానే సామాను పట్టుకు ఈవలికి వచ్చాడు. ట్రిప్లికేన్ బస్సు ఎక్కాడు. బస్సు పైక్రాఫ్ట్స్ లో దిగినాడు. ఒక రిక్షాకు అణాడబ్బులిచ్చి నల్లతంబిలో ఉన్న నెల్లూరు ఆంధ్రలాడ్జికి చేరినాడు. అక్కడ గదులు కాళీలు లేవు. ఉన్న గదులే మూడు. కోనంగి దిగాలు పడిన మోము చూచి హెూటలు యజమాని కేశవప్ప మెత్తపడి “మా సామాను గదిలో మీ సామాను పెట్టించండి. మీరు వరండాలో పండుకొనండి. ఎల్లుండి ఒకగది కాళీ అవుతుంది, స్వామీ!” అన్నాడు.

“ఓ అంతకన్నానా!” అన్నాడు ఉప్పొంగిపోతూ కోనంగి. ఆ రాత్రి అతను సీతాదేవి ఇంటిలో భోజనంచేసే, రైలుకు బయలుదేరాడు.

గూడపంచెకట్టి, బనీనుతో కోనంగి వరండాలో పడుకుని చంటిపిల్లవాడిలా నిద్రపోయాడు. మరునాడు స్నానాదికాలు కానిచ్చి, భోజనంచేసి ముస్తాబై రౌండుతానా దగ్గిర దిగాడు. (అది ఇప్పుడు లేదు. పేరు మాత్రం మిగిలింది.)

అక్కడ నుంచి ఉద్యోగానికి ప్రయత్నం ప్రారంభించాడు కోనంగి. స్త్రీవల్ల ధనలాభం ఏమిటి? తనకు ఉద్యోగం ఎలా వస్తుంది? అని అనుకున్నాడు. ఏదో వెట్టివాడు తన స్నేహితుడు 'చెయిరో' 'బెర్గసన్' వగైరా పుస్తకాలు చదివి, చేతికి ఇంత తారుపూసి, ఓ కాయితం పాడుచేసి, మూడు గంటలు తబ్బిబ్బై నాలుగుముక్కలు చెప్తాడు. అయినా ఎన్ని సరి అవుతున్నాయి? ఏ శాస్త్రంలో ఏముందో! దేవతలు నడవడానికి భయపడే ప్రదేశాలలో తానా నాట్యం ఆడడం!

“ఏం ఉద్యోగం?... యుద్ధంలో చేరరాదూ?” అని ప్రతి కంపెనీ మేనేజరూ అనడమే. చీకటి బజారులలో లక్షలు లాభాలుకొట్తు తనొక్కడికి ఉద్యోగం ఇవ్వలేరు కాబోలు?

ఒకచోట మాత్రం అతనితో ఒకాయన కొంచెం శాంతంగా మాట్లాడాడు.

“మీ దేవూరండి?”

“బందరండి!”

“ఎంతవరకు చదివారు.”

“బి.ఏ. మొదటి తరగతిలో నెగ్గాను”

“సంగీతం పాడగలరా?”

“సై గలంత బాగా పాడలేనండి. మాష్టర్ క్రిష్టకు ఒక్కశ్రుతి తక్కువగా ఉంటాను. పంకజమల్లికూ నేనూ బావమరదులులా ఉంటాం సంగీతములో!”

“కాస్త పాడండి?”

“ఎందుకండి??

“మాకో సినిమా కంపెనీ ఉంది. హరిశ్చంద్ర తీయదలచుకున్నాం. అందులో లోహితాస్యుడు కావాలి.”

“నేనా లోహితాస్యుణ్ణి!”

“ఎందుకు కాకూడదు? నాగయ్యగారు ఇరవైఏళ్ళ బాలా కుమారుడు కావటంలేదా? ఆయనకు ముప్పదిఅయిదు పైన వుంటాయి. పదిహేను ఏళ్ళ తేడాఉన్నా భయం లేదన్నమాటేగా?”

“అవునండి. దేవికారాణికి ముప్పదిఏళ్ళు. పన్నెండేళ్ళ బిడ్డగా దుర్గలో వేషం వేసింది. పద్దెనిమిదేళ్ళ తేడా ఉంది. నేను అయిదేళ్ళ బిడ్డగాకాని రెండేళ్ళ శిశువుగా గాని వేషం వెయ్యవచ్చును!”

“అయితే పాడండి.”

“ఏం పాట?”

“పియా మిలనకో జానా."

“మీ బొమ్మ ఎందులో తీస్తారు?”

“అరవంలో.”

“నేను తెలుగువాణ్ణే ?”

“కన్నాంబ, నాగయ్య తెలుగువాళ్ళు కారూ? జయమ్మ కన్నడిగమ్మ కాదూ?”

“హిందీపాట ఎందుకు?”

“అన్ని భాషలూ కలిసిపోతున్నాయి కాదటయ్యా!”

పాడాను, పియా మిలనకోజానా. సంగీతంలో నేనేమి త్యాగరాజ భాగవతారుకు తీసిపోతానా? ఆయన “అద్బుతం” అన్నాడు.

తక్షణమే తాను నాకు ఇంత కాఫీ వగైరాదులు ఇప్పించి, వెంటబెట్టుకొని త్యాగరాజనగరు తీసుకుపోయాడు.

అక్కడ నన్ను కొలిచారు. కోటు, చొక్కా విప్పించి చూచారు. పొటోతీశారు. పాడించారు. అడించారు.

చివరకు రోజుకు రూపాయి చొప్పున ‘ఎక్ష్ట్రా' ఉద్యోగం ఇస్తామన్నారు.

5

సినిమా కంపెనీ నుంచి నడిచి నడిచి, అళ్వారుపేట టర్నింగ్ దగ్గరకు వచ్చేసరికి కోనంగికి కొంచెం మానసికమైన అలసట పట్టుకుంది. తనకేమిటి మానసికమైన అలసటేమిటి? అక్కడ పదినిముషాలు నిలుచుండి, ఎందుకు తనకు కొంచెం ఏదోగా అయినట్లు కనబడాలి? అని విచారణ ప్రారంభించాడు.

సీతాదేవికి ఎలాంటి భర్త వస్తాడో! వట్టి వెట్టిబాగులపిల్ల. ఆబాలికను ఏ అసాధ్యుడో టోపీవేసి, ఆమె ఆస్తికాస్తా తన పేర రాయించుకొని, ఆమెకు ఉద్వాసన చెప్పిగాని: ఆమెను మాయచేసి కళ్ళకు గంతలుకట్లో లేక బ్లాకు అవుటు చేసో ఇంకో వన్నెల విసనకర్రనో, తళుకులతారనో, కులుకు మిఠారినో, హృదయంలో రహస్యంగా దాచుకునిగాని, అన్యాయం చేస్తే పాపం!

ఇంతకూ ఆమెగొడవ తన కెందుకు? తాను ఆమెను అన్యాయం చేయదలచు కోలేదు. లేకపోతే, భగవంతుడు మగపురుగులకందరికీ ప్రసాదించిన శృంగార సంబంధపు విప్రవినోది సంచిలోనుంచి తాను రెండు మాయ మంత్రాలు ప్రయోగిస్తే? ఏభైవేల ఆస్తీ, రివెన్యూబోర్డు మెంబరు మామా, తెల్ల బెజవాడ జామపండులాంటి పెళ్ళికూతురూ దక్కిపోవునే! పళ్ళెత్తయితే కొంపలు మునగవుకదా! నవీనమైన ఎత్తుమేడలు నాలుగు ఎకాఎకిని వచ్చివుండును.

ఇలా నిర్ధారణ చేసికొని, కోనంగి ఆళ్వారుపేట మలుపు ముందునుంచి ఆగే స్థలాలనుంచే

“ఒక కాలు ఎత్తీ

ఒక కాలు మోసీ

ఎత్తుతు దింపుతు

సత్తువ తెలుపుతు

నడుస్తు నడుస్తు

అడుగులు వేస్తూ

ఉద్యోగానికి వెదకేనోయ్

గద్యం కాదిది పాటేనోయ్!”

అని పాడుకుంటూ నడిచాడు, నడిచాడు. రెండు బస్సుస్టాండు లయ్యాయి: ఎక్కడా బస్సు దొరకలేదు. ప్రతిబస్సు ఆగేస్థలం దగ్గిరా పదిహేను నిముషాలకు తక్కువ కాకుండా నిలిచాడు, కోనంగి. బస్సు రాకపోవడం, అతడు నడుద్దాము, రెండు అణాల డబ్బులు మిగుల్తాయి అని బయలుదేరడం, దారిలో ఈతన్ని ఓ బస్సు దాటిపోవడం జరుగుతూ వచ్చింది. చివరకు ఈ మూడవస్థలం దగ్గిర, అంటే లజ్లో, మొదటిదాని దగ్గర ఆగిపోయినాడు.

ఇక్కడైనా తాను బస్సుతో దెబ్బలాడి విజయం పొందాలి. ఈలా ఈ యుద్ధం రోజుల్లో ఈ 1939 సంవత్సరంలో ఒక నవయువకుణ్ణి - బస్సులు అన్యాయం చేయడం తగనిపని అనుకుంటూ అక్కడ ఉన్న ఒక పెద్ద బంగాళా ముందు ఉన్న గేటుకుముందు అలంకారానికి కట్టిన ఏనుగుపైన అధివసించి, నేను ఇంద్రుణ్ణి కావచ్చు, పట్టపుటేనుగ ఎక్కి ఊరేగే మహారాజును కావచ్చు, టార్జాన్ ను కావచ్చు, లేదా వట్టి మావటివాణ్ణి కావచ్చును, అనుకుంటూ ఉండగా కారులైట్లు తనమీద పడ్డాయి.

బస్సు కాదని నిర్ధారణ చేసుకొని కాస్త వయ్యారంగా ఆవరణగోడకు అనుకొని, కాలు ఒకటి వేసివున్న గేటు తలుపునకు, ఒకటి ఏనుగు తొండానికి ఆనించి ఏవరిదో ఈ అందాలమేడ అని ప్రశ్నించుకొన్నాడు. ఇది ఒక హైకోర్టు జడ్జిది కావచ్చు. మదరాసు జిల్లా కలెక్టరుగారిది కావచ్చు. ఆడ్వొకేటుది కావచ్చు. ఒక వర్తకునిది కావచ్చు. ఒక సినిమాస్టారుది కావచ్చు. గేటుదగ్గిర చప్రాసీలేడు, జడ్జిదికాదు, కలెక్టరుది కాదు. పార్టీలు నడయాడుటలేదు, అడ్వొకేటుది కాదు. మూర్కావాడు కాపలాలేడు, సినీమాతారదికాదు. అయితే వర్తకునిదో లేక ఖాళీగా ఉందో, ఖాళీగా వుంటే లోపల జనం అలికిడి ఉంది, అన్న ఆలోచనలలో కళ్ళుమూసుకొని కలలు కంటున్న అతని కంటి మీద నుంచి కాంతి గలిగిన వెలుగు పడడం, బుర్రుమని గుండెలదిరేటంత చప్పుడవ్వడం ఒక్కమాటుగా జరిగింది.

ఉలిక్కిపడి, అదిరిపడి ఒక్కగంతున ఉరికి లేచాడు కోనంగేశ్వరరావు.

“ఎవరయ్యా! దారికడ్డంలే, నాటుపురం మనిషిలా ఉంటివే!” అన్న కిన్నెరస్వనము.

“నేను నాటుపురంవాళ్లే! నాటుపురమేకాదు కన్నాటుపురం కూడా నాది!”

“కన్నాటు అంటే!"

“కళ్ళుమూసుకు కలలు కంటున్న నాటుపురంవాణ్ణి. అందుకని కన్నాటు పురంవాణ్ణి.”

కిలకిల, వీణపంచమతీగెను పంచమం మీటితే వచ్చిన కాకలీనిస్వనపు నవ్వు కారులోంచి వినపడింది.

ఈ మాటలకు ముందే గేటు తెరవడం, బస్సురావడం బర్రుమని వెళ్ళిపోవడమూ జరిగినవి.

"అయ్యో! మీ కారువల్ల నా బస్సు తప్పిందండీ!” అంటూ కారు ముందు నుంచి కోనంగిరావు కారు డ్రైవరు వైపుకు వచ్చాడు. కారుడ్రైవరు ఒక బాలిక. వీధి దీపాల వెలుతురు మాత్రం ఆధారం. అందులో వెలుగు లోంచి వచ్చాడు. డ్రైవరు ఘుమఘుమ మంటే, కళ్ళు చిట్లించుకొంటూ కోనంగి డ్రైవరువైపు పారకించి చూస్తే, ఆ డ్రైవరుగారు అస్పష్టంగా కనబడే ఒక చక్కని బాలికలా కనబడింది!

“మీరు మాతో ఏమన్నా పనిఉండి వచ్చినారా ఏం?”

“ఏమన్నా కాదండి, ఉన్నపనే మీతో!”

“ఏమిటా పని?”

"ఉద్యోగంకోసం దరఖాస్తు పట్టుకువచ్చా.”

“మా దగ్గిర ఉద్యోగాలు ఏమీలేవే?”

“మీరు కూడా యుద్ధ ఉద్యోగంలో చేరమని చెప్పలేదే?”

ఒక బాలిక డ్రైవరు పక్క సీటులోంచి కిటికీలో తలఉంచి తనతోమాట్లాడుతున్నది. ఆమె మాటలు ఎంతో లోతుగా ఉన్నాయి. ఎంతో నీలంగా ఉన్నాయి. ఎంత మధురంగా ఉన్నాయి! మాట్లాడుతోంటే పున్నాగవరాళిరాగం వస్తోంది అని కోనంగి. అనుకున్నాడు.

ఆ ఆ బాలిక ముక్కున వజ్రాల బేసరీ, చెవుల వజ్రాలదుద్దులు, అందుండి వేళ్ళాడే వజ్రాలజూకీలు తళుక్కుమన్నాయి. ఆమె కళ్ళు వజ్రాలకన్న, ఆకాశంలో తారలకన్న తళుక్కుమన్నాయి.

కోనంగి చూపులూ ఆమె చూపులూ ఎదురుబొదురై తారసిల్లి వైఖరీ ధ్వనిలో ఫెళ్ళుమని, కలిసి పై కెగసి, తుంపర్లతో లోకం నింపి క్రిందికి దిగి సుళ్ళుపడి, కలసి కరిగిపోయి ఏకప్రవాహం అయ్యాయి.

వీధిగేటు, కారు, మదరాసు, భరతదేశం రెండవ ప్రపంచయుద్ద ప్రారంభం, సర్వప్రపంచము, అఖిలవిశ్వమూ మాయమైపోయాయి.

ఆ శూన్యంలో కోనంగి, ఆ యువతి.

పక్కనున్న ఆమె “అమ్మిణీ! కారు పోనియ్యవే” అంది. ఇంతవరకూ కారు గురుగురు లాడుతూనే ఉంది. ఆ అమ్మిణీ న్యూట్రల్లోంచి మొదటిగేరులో కారు ముందుకు ఉరికించింది. రెండవ గేరులో కారు లోపలికి వెళ్ళిపోయింది.

కోనంగి ఎవరీ బాలిక? కొంచెం పచ్చగా. కొంచెం శలాకలా, కొంచెం బొద్దుగా, కొంచెం పొట్టిగా, కొంచెం పొడుగ్గా ఉన్నట్టుగా కనబడి అతి మనోహరంగా వెలిగిపోయే మొహంతో ఎవరు ఈ ముద్దులగుమ్మ అనుకున్నాడు.

తన బ్రతుకు సినిమాకాదుగాని, లేకపోతే మూడుపాటలు పాడును. అప్పుడు ఎవరైనా బాక్ గ్రౌండ్ మ్యూజిక్ వాయిద్దురు. భారతీయ సినీచిత్రాలలో అడివిలో వెళ్ళేవాడికి, నదిలో కొట్టుకుపోయేవాడికి పాటలు పాడబుద్ధి కలిగినప్పుడు వాడికి బాక్ గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది - తాను ఈలాంటి బాలిక కనబడినప్పుడు రెండు పాటలు విసరకూడదా? నాటకాలలో ఏ సి. ఎస్. ఆరో. అయితే యాభై అయిదు పద్యాలుపాడి ఉండును.

అలాగే అతడు నిలుచుండిపోయినాడు. అతని హృదయం ఉందోలేదో ఎడంవైపున తడుముకొని, అద్దుకొని చూచుకొన్నాడు. కొందరు కుడిచేతితో కుడివైపున చూచుకోవడం చూచి ఉన్నాడు కాబట్టి, డాక్టరు కానట్టి తనకు ఎందుకైనా మంచిదని కుడివైపునకూడా తడిమి చూచుకొన్నాడు.

హృదయంలేదు వట్టి గుండె కొట్టుకొంటోంది. ఓయి కోనంగీ! ఇది నా వాటర్లూ యుద్దమో, లేక నీ ఆర్కాటుముట్టడో అనుకున్నాడు.

లోపలినుంచి ఒక సేవకుడెవరో తనవైపు పరకాయించ చూస్తూనెమ్మదిగా గేటు మూసివేసినాడు.