కొప్పరపు సోదర కవుల కవిత్వము/విశదల శతావధానము

వికీసోర్స్ నుండి

శ్రీ కనకదుర్గాంబాయై నమః

విశదల శతావధాన పీఠిక

బాలసరస్వత్యాశుకవిచక్రవర్త్యాది బిరుదాంచితులగు శ్రీ కొప్పరపు సోదర కవులను గూర్చి పండిత ప్రకాండులు వ్రాసి పంపిన పద్యములు మొదలయినవి కొన్నియు, వారిచేఁ జేయఁబడిన సమస్యా పూర్తులు కొన్నియు నొక చిన్న పుస్తకముగా సంగ్రహింపఁబడియెను. వారి కవితాశక్తి యసమానమైనదని యందువలననే కొంత తేటపడకమానదు. అందలి యంశములన్నియు నప్పటప్పటి వార్తాపత్రిక లలోఁ బ్రచురింపఁబడినవేయైనను నాత్మదోషంబు కతనఁ గొందఱు విశ్వసింపఁజాల కుండిరి. తన కన్నులతోఁ జూచుచుండిన భర్చువను తన మంత్రి బ్రతికి యున్నట్లు విశ్వసింప లేకపోయిన రాజుకథవినమె? ఇట్లు వీరి రసనాగ్రసీమల యందు సహజ సముత్పన్నయైన కవితాలతికకు దృష్టి దోషంబుదగిలి యందుద్భవించిన యశః పుష్పంబులు వాడునో యను శంక దూరదృష్టిలేని కొందఱు జనంబుల మనంబులఁ బొడమఁ దొడంగెను. ఇట్టి సమయంబున నీ గుంటూరు పట్టణంబునకు సమీపంబుననున్న విశదలగ్రామ నివాసియును గమ్మవంశజుండును నిరుపమాన మల్లీశ్వర దేవతాయతన నిర్మాణ జనిత నిర్మల కీర్తియునగు శ్రీ చెరుకూరి తిరుపతిరాయ మహాశయుండు పై యంశములను దెలిసినవాఁడై యీ సోదరకవుల సామర్ధ్యము స్వయముగా వీక్షింపనెంచి మిత్రజనంబుల ప్రోత్సాహంబున స్వగ్రామంబున నొక సభ సమకూర్చె. ఈనెల 17వ తేది ఆదివారమునాఁడు విశదలలో శ్రీమల్లీశ్వర స్వామివారి దేవళముముంగిట సభ జరిగెను. గుంటూరు నుండి యనేకులు న్యాయవాదులును, నుద్యోగీయులును నచ్చటినుండియుఁ జుట్టు పట్ల నుండియుఁ బెక్కురు పండితులును, గవులును విచ్చేసియుండిరి. బ్రహ్మశ్రీ కొండా వేంకటప్పయ్యపంతులు, బి.ఏ., బి.ఎల్., గారగ్రాసనాధిపతిగా సభ్యులచే నెన్నుకొనఁబడిరి. సోదర కవులలో జ్యేష్ఠులగు బ్రహ్మశ్రీ సుబ్బరాయ కవిగారు పగలు షుమారు 1 1/2 గంటలకు శతావధానముఁ ప్రారంభించి రాత్రి 12 గంటలగు వఱకు ముగించిరి. కూరుచున్న వారిలోఁ బలుగురు రాజకార్యముల నిమిత్తము మఱునాఁడు గుంటూరికిఁ దిరిగి వెళ్ళవలసిన వారగుటచేఁ బృచ్ఛకుల సంఖ్య నలువది యొకటికి మించనీయఁబడలేదు. అవధానము జరుగునంత కాలము కవిగారు పృచ్ఛకుల మధ్యము నుండి కదలనే లేదు. నడుమ నడుమ సభ్యులడుగు ప్రశ్నలకు సమాధానములుగా ననేక పద్యములఁ జదువుచు ననేకముల నాశువుగాఁ జెప్పుచుఁగూడ వచ్చిరి. పృచ్ఛకులలోఁ గొందఱు తమకుబదులొరుల నియమించియుఁ గొందఱు తమకాగితముల నెవరిమీఁదనో పడవైచియు నడుమ నడుమనే సగముకంటె నెక్కుడుగా జారి పోయిరి. అయినను సగముమేని వానికరుణఁ గవిగారి ధారణ చెడక యవధానము నిరాఘాటముగా నెఱవేఱినది. సమస్యలును బ్రశ్నలలో గొన్నియును విషమములుగా నున్నను బద్యములలోఁ కొన్ని మహాకావ్యములలో నుండి వానికి వన్నెతేఁదగినవిగా నున్నవని గుణగ్రహణ పారీణులగు వారికిఁదోఁపక మానదు. లోపము లెంచఁజూచినచో మహాకవులు సావకాశముగా రచించిన ప్రబంధములలోనే కన్పట్టుచుండ నాశువుగాఁ బృచ్ఛకులయు సభ్యులయుఁ దొందరలతోఁ జెప్పఁబడిన కవిత్వములోనా దొరకకుండుట? ప్రకృతావధానము జ్యేష్ఠ సోదరుల సామర్ధ్యము మాత్రమే చాటు చున్నను గనిష్ఠులును దక్కువ వారుకారని నే నెఱిఁగినదానినిబట్టి చెప్పఁగలను. వారి సమస్యాపూర్తి యొక్కటి యిందుఁబొందుపరుపఁబడియునున్నది. భగవంతుఁడు వీరికి దీర్ఘాయురారోగ్యైశ్వర్యము లొసంగి వీరనేకములగు సుద్గ్రంథముల నొనర్చి దేశీయుల మనంబుల రంజిల్లఁజేసి శాశ్వతకీర్తి గడించునట్లు వీరికిఁ దోడ్పడుఁగాత.

ఈ చిన్నపుస్తకములో నవధానము మఱునాఁడు కొందఱు వీరిని గుఱించి వ్రాసియిచ్చిన పద్యములుఁ గొన్ని గలవు.

ఇట్లు,

పాటిబండ సూర్యనారాయణరావు

22-9-1911

విశదల శతావధానము

(17-09-1911)

శ్రీరంజిల్ల శతావధానమిచటన్ జేయంగ నూహించితిన్
బ్రారూఢిన్ నినునమ్మి యిమ్మహిత సభ్యశ్రేణి మెచ్చంగ నీ
కారుణ్యామృతబిందువుల్ చిలికి విఖ్యాతిన్ విడంబింపవే
ధారాశుద్ధియు ధారణాధికతయున్ దార్కాణగా శాంభవీ

కుశలుఁడు సత్యవాది చెరుకూరి కులుండు మదారివారణం
కుశము కవిప్రియుం డఖిలకోవిదవంద్యచరిత్రుఁ డుల్లస
ద్విశద యశోభిరాముఁడగు తిర్పతినాముఁడు పిల్వనేఁడు నీ
విశదలఁజేయు సత్సభను వేడుకఁజూడుము మల్లికేశ్వరా

1. ఆంజనేయ స్తవము

ఎవ్వనినమ్మి దేశములకెంతయుఁబోయి జయంబు గంటిమో
యెవ్వనినమ్మి యీ సభ నహీనధృతిన్ జరగించుచుంటిమో
యెవ్వనినమ్మి యేమిటనొకింతయు సందియమందకుంటిమో
యవ్వరకీర్తిశాలి పవనాత్మజుఁ డేలుత మిమ్ముమమ్మునున్

2. మల్లీశ్వరస్వామి ధ్వజముఁగూర్చి యుత్ప్రేక్ష

ఈమల్లీశ్వర దేవు కోవెలధ్వజంబింపొందు నత్యున్నతిన్
ధీమంతుల్ వినుతింప ఘంటలధ్వనుల్ నిత్యంబు మాస్వామిఁదా
నేమాన్యాత్ముఁడు గొల్చునాతనికి లే దేలాటి పాపంబటం
చామోదంబునఁదెల్పు శూలిభటులోయంచున్ వితర్కింపఁగన్

3. సమస్య : తల్లిమగండు తండ్రియని తల్పక కూడియు సాధ్వీ యయ్యెఁగా

తల్లిధరిత్రి సీతకు యథార్ధము శ్రీహరి యా ధరిత్రికిన్
వల్లభుఁడయ్యె నాహరియు వర్ణితలీలను రాముఁడయ్యెనా
హల్లకపాణి సీత విభుఁడై తగురాముని యోగ్య వేళలన్
తల్లిమగండు తండ్రియని తల్పక కూడియు సాధ్వియయ్యెఁగా.

4. సమస్య : మార్తాండుం డపరాద్రిఁగ్రుంకె నిదిగో మధ్యాహ్న కాలంబునన్‌

ఆర్తిన్ వేల్పులు కావుకావుమని హాహా కారముల్ సల్పఁగా
ధూర్తుల్ ధారుణి నిల్వఁగూడదని రుద్రుండాజ్ఞనీఁ గాళి దు
ర్వర్తుల్ గావున దైత్యులం దునిమి యాపైఁజంప శుంభాసు రే
ణ్మార్తాండుం డపరాద్రిఁగ్రుంకె నిదిగో మధ్యాహ్న కాలంబునన్

5. చంద్రోదయము - లయగ్రాహి

కమ్మవిలుకాని పువుటమ్ములను బోలి వెల
        కొమ్మలు విటాళికిలుగుమ్మములఁ జేరన్
దుమ్మెదలగుంపు కమలమ్ములను బాసి కుతు
        కమ్మునఁ దొవల్గల సరమ్ములనుదూరన్
నెమ్మిని జకోరతతు లిమ్ముఁగన జక్కవ కొ
       లమ్ములు వియోగమున నుమ్మలికఁ జెందన్
భమ్ముల విభుండు సిరితమ్ముఁడు శశాంకుఁడు న
       భమ్మునను దోఁచెఁ గళ లెమ్మెలు పొసంగన్

6. కాశీపట్టణము

సంజవేళల మౌనిసప్తకంబు నుతింపఁ
         బంచాస్త్రవైరి నర్తించుచోటు
మధ్యాహ్నముల ధరామరరాజి కన్నంబుఁ
         బంచాస్యు రాణి వడ్డించుచోటు

మాధవప్రభృతు లాత్మాభిధానంబులు
         మించ లింగముల స్థాపించుచోటు
కలుషకర్ముల సుకర్ములఁజేయు సురగంగ
         యంచితస్థితిఁ బ్రవహించుచోటు

అరయఁ బంచత్వమొందినయట్టి జంతు
వెట్టిదైనను లింగమై పుట్టుచోటు
కాశి యది పుణ్యరాశి దుష్కలుషవల్లి
కా శితాసి భజింతు నిక్కముగ నెంతు.

7. ఇద్దఱు భార్యలుకలవాఁడు

ఒకతఱినొక్కదానిఁబ్రియ మొప్పఁగఁజూచినఁగోపమందు వే
రొకతె, సుబుద్ధిదానిపయినుంచిన నద్ది కుబుద్ధివంచనున్
గకవికదోఁప నిద్దఱగుకాంతలు కల్గినవానికష్ట మే
రికి వివరింపనౌ నది భరించిన శూలికిఁగాక యెయ్యెడన్

8. సమస్య : జయజయయంచుఁ గౌరవులు చాలవిషాదముఁజెంద నాత్మలోన్‌

భయదపరాక్రమంబునను బార్థులఁగూల్చునుభీష్ముఁడంచు దు
ర్నయమునఁబల్కు కౌరవుల నాకువశంబొకొనిల్పనంచు మే
ల్జయమగు మీకటంచనియెసంజయుడద్ది గ్రహించియౌర సం
జయజయయంచుఁ గౌరవులు చాలవిషాదముఁజెంద నాత్మలోన్

భయదపుసింహనాదము ప్రభంజనసంభవుఁ డాచరించి టె
క్కియముపయిన్నటింప హరి కేల్గవ దట్టినుతింపఁ బార్ధుఁడ
క్షయధృతినారిమీటఁగనె, ఘల్ఘలమ్రోఁగెను వింటిగంటమేల్
జయజయయంచుఁ గౌరవులు చాలవిషాదముఁజెంద నాత్మలోన్

శ్రీవేంకటరమణకవిగారాశువుగాఁబూర్తి

భయదపరాక్రమంబునను బార్థులగెల్చునుభీష్ముఁడంచు దు
ర్నయుఁడు సుయోధనుండు వదరన్ విని దానికినోర్వలేక వే
జయమునుగాంచఁబార్థుఁడట శాతశిలీముఖమూనిదూఁకెఁదా
జయజయయంచుఁ గౌరవులు చాలవిషాదముఁజెంద నాత్మలోన్

9. సమస్య : దారములేని హారము నితంబిని నీ కెవఁడిచ్చెఁ జెప్పుమా

చారుపటీర చర్చకలశద్వితయోపమమౌ కుచద్వయిన్
మీఱఁగనొక్కపూరుషుని మెచ్చి కవుంగిటఁజేర్చితౌటనా
పూరుషుపేరుముత్తెములఁబొల్పగుగుర్తులునిల్చెఁగానిచో
దారములేని హారము నితంబిని నీ కెవఁడిచ్చెఁ జెప్పుమా

10. అచ్చ తెనుఁగు; కొండవీడు

కైతలుగూర్చువారి బలఁగంబదిసంబరమీనుచుండఁగాఁ
జేతులబల్మిగల్గి పసఁజెందిన ఱేఁడుల గుంపుమీఱఁగా
నేతఱి నీరొకించుకయు నెండని వాఁగులు జాలువాఱఁగా
జోతలుకొండవీడుగనెఁ జొప్పడుమాదగు కొప్పరంబటన్

11. సుశక్తుఁడు, అశక్తుఁడు - పంచచామరము

సుశక్తుఁడైన శూరుఁడొక్క శూరుతోడఁబోరుఁదా
నశక్తులైనవారు పల్వురైనఁగాక పోర ర
ప్రశస్తమం చధర్మమంచుఁ బల్కనొక్క డేగతో
భృశంబుపోరునొక్కడేగ పిట్టలెన్నొపోరెడున్

12. సరసులైన కవులను గౌరవించు రాజులిప్పటికి నుండిరా?

అభినవభోజుఁడో యనఁదగు మంత్రి ప్రె
           గడ భుజంగక్షమాకాంతుఁడుండెఁ

గవితాభిమాని పోలవర వేంకటకృష్ణ
         రాయాఖ్యుఁడొఁక ధరారమణుఁడుండె
విద్యావినోది శ్రీవేంకటగిరి మాన
         వేంద్రుండు కృష్ణయాచేంద్రుఁడుండె
శ్రితలోకములకెల్లఁ జింతామణి పిఠాపు
         రాధీశ్వరుఁడు సూర్య రాయఁడుండె

విజయనగర ప్రభుండు బొబ్బిలివిభుండు
విరవజటప్రోల్ నృపులు నూజవీటి దొరలు
నరసరాట్పురి మణికొండ ధరణిపతులు
గలరు మఱికొందఱున్నారు కఱవుగలదె?

13. జొన్నన్నములో గోఁగుకూర గలుపుకొని పచ్చిమిరపకాయఁ గొఱకుట

అనువుగ జొన్నయన్నమున యందునుఁగల్పిన గోఁగుకూరతోఁ
దనకనుకూలమైనరుచి దార్కొనఁగానొక పచ్చిమిర్పకా
యను గొఱుకంగఁ బూనుటలహా! తనుమించిన దానిఁగూడుచున్
దనయుని ముద్దుఁబెట్టుకొని తాపము వాసినవాని చందమౌ

14. తమలపాకు, స్త్రీతోఁ బోల్చుట

అందిందున్ గలుగున్ నఖక్షతము లాయా వేళలందొప్పుగా
నందిందున్ గలుగున్ మృదుత్వము మనోహ్లాదంబు సంధిల్లఁగా
నందిందున్ గలుగున్ సుఖానుభవ మత్యంతంబు వర్ణింపఁగా
నందిందేమన వీడియంపుదళమం దాకాంతయందెన్నఁగాన్

15. సజ్జ - మంగళమహశ్రీవృత్తము

 
గజ్జెలును మువ్వలును ఘల్లనఁగ మోదమున గండుగలయెద్దు లిలదున్నన్
సజ్జఫలియించునది సస్యములలోనఁగడు శ్లాఘ్యమని కర్షకులుపల్కన్

వెజ్జులు భుజింపనిది వీలనుచుఁదెల్పుదురు వేసటయడంగు నదిమెక్కన్
మజ్జిగకుదానికిని మైత్రియనుచుం దదభిమానులు వచింత్రు మెసవంగన్

16. అవధాన సమయమునందుఁ గవిగారువేసికొనిన సాలువ

అంతయు నెఱ్ఱ రంగుగలదై తనరన్ జలతారుపోఁగుల
త్యంతముగాఁ గనంబడెడు నయ్యవి బంగరు కాంతులీనఁగా
నెంతొక్రయంబుసేయు, నిదియిచ్చిరి చెన్నపురిన్ సుధీమణుల్
వింత యిదేమి సాలువను పేరువహించెనుసుమ్మి మిత్రుఁడా

17. సమస్య : బుధ్ధమతావలంబనులు పూజలుసల్పిరి విష్ణుమూర్తికిన్‌

బుద్ధుఁడనంగవిష్ణుఁ డొకపూజ్యతరంబగు పేరుగాంచెమున్
సిద్ధమువానిదౌమతముఁ జెందుటఁ జేసి యభీష్టసిద్ధిగా
బుద్ధిఁదలంచి మేలనుచుఁ బొల్పగు నొక్క దినమ్మునందునా
బుధ్ధమతావలంబనులు పూజలుసల్పిరి విష్ణుమూర్తికిన్

18. తెల్లునూఁగు - మహాస్రగ్ధర

కనమే యాఱెల్లునూఁగున్ గఱకుఁదనముచేఁ గ్రాలిబాధించుచుంటన్
దనువంటన్ మంటతోఁచున్ దగిలినయెడ వస్త్రంబులెంతేనిపాడౌ
వినలేదద్దాన నీమేల్వెలయుననుచునే విజ్ఞుఁడుందెల్ప నెందున్
దనరుం దుర్మార్గుతో నెంతయునదిసరిగాఁదమ్ముడా పోల్కి సేయన్

19. చీఁపురుఁగట్ట

మలినంబుఁబాపి నిర్మలతఁ జూపుటఁ జేసి
          యల్ల గంగాదేవి యనఁగవచ్చు
నఖిలప్రదేశంబు లందుఁ దోఁచుటఁ జేసి
          యల పరమాత్మయే యనఁగవచ్చు

నిత్యాభిషేకమ్ము నెమ్మిఁగాంచుటఁ జేసి
         యల జలస్థిత లింగమనఁగవచ్చు
స్త్రీకరగ్రహణంబుఁ జెలిమినందుటఁ జేసి
         యల పురుషోత్తముఁడనఁగ వచ్చు

ననుచునెట్లెట్లో పొగడఁగా నయ్యెఁగాదె
యదియు సింగారపుంగట్ట యనుటఁ జేసి
కాక నద్దాని జీఁపురుఁగట్ట యనిన
నింతగా వర్ణనముసేయ నెవఁడుదలఁచు?

20. సమస్య: మాయాతి, నాయాతి, నయాతి, యాతి, అనుపదములు వరుసగా నాల్గు చరణములలో నొక్కొక్కటిగా నిమిడ్చి కృష్ణపరముగా

మాయాతిస్థిరవృత్తిఁ గృష్ణుఁడన దుర్మానారి మీనవ్రజా
నాయాతి స్ఫుటశక్తిఁజూపి తనరెన్ నారాయణుండాతఁడో
యాయుష్మంతుఁడ! తానయాతిమతినయ్యాద్యుం బరుంగొల్చినన్
శ్రేయంబబ్బు జయాతికీర్తి గరిమం జెందు న్నరుండెయ్యెడన్.

21. మత్తేభము

ఇలనెతై తగు కొండచందమున నెంతేరూపమింపందెడిన్
బలువౌ తుండము వాసుకిం దెగడి సౌభాగ్యంబు వాటించెడిన్
జెలఁగుం జేటలరీతి శ్రోత్రము లెదం జింతించియద్దానినే
పలుకంగాఁదగు మత్తకుంజరమునా వాక్యంబు లింకేటికిన్

22. విద్యయే భూషణము

విద్య నరేంద్రపూజితము విద్య సుధీంద్రహితప్రచారమా
విద్య యశఃప్రదంబు మఱివిద్య ధనప్రద మల్ల విద్యయే

హృద్యము ధాత్రినద్ది యొకయించుకగల్గినఁజాలుఁగాక యే
చోద్యము వెండిబంగరపు సొమ్ములుదాల్చివిలాసమందుటల్

23. సమస్య : తద్భవమన నిట్టిదనుచుఁ దగుఁ దెలియంగన్‌

సద్భజనీయం బియ్యది
యద్భుతమే శాణమునకు నగు సాన యనన్
సద్భవనంబులఁ గావునఁ
దద్భవమన నిట్టిదనుచుఁదగుఁ దెలియంగన్

24. అతనుసంగరకళా భ్యాసదేశికకళాఘాతమోయన జడకటినటింప అను సీసపాదార్దము కందపద్యములోఁ జెప్పుఁడు

కందర్పాహవ కళనౌ
సందేహముఁబాపు గురు కశాఘాతమనన్
మందేభగమన కటి మీఁ
దం దగు జడయనఁగ మొదటిదానికి సమమౌ

25. కందపద్య లక్షణము

అందముగా భజసనలము
లంది త్రిశరగణములొంది యటవడిమూఁటన్
జెంది నలజ లవి యాఱిట
నొందఁగఁ గందంబు మఱియు నొకకొన్నిటనౌ

26. తోఁకచుక్క

ఆకాశంబునఁదోకచుక్క తగుభీమాకారముందాల్చి య
స్తోకుల్ సత్కవిరాజు రాజులిది యీక్షోణీస్థలిన్‌గల్గు సు
శ్రీకళ్యాణములెల్ల నూడ్చుటకునై చింతించి కాలేశ్వరుం
డే కేలందగఁబట్టుజీఁపురనుచున్ హేయంబుగాఁబల్కఁగాన్

27. భీష్మ కర్ణాభిమన్యు శబ్దార్థములువచ్చునట్లు రామాయణకథ

<poem>
భీష్ముఁడై కుంభకర్ణుండు విక్రమింపఁ
గాంచివిజయప్రభూత దోర్గర్వమడర
రామదేవుండు తీవ్రనారాచములను
బఱపి దునుమాడె వానరప్రవరులలర.

28. ఇంద్రచాపము

తెలు పెఱుపుఁ బసువుఁబచ్చన
నలుపొదిగఁ జిత్రవర్ణ నవరుచులెసఁగన్
జలధర పథమున నత్యు
జ్జ్వలమైతగు నింద్రధనువు సత్కవి నుతమై

29. రామాయణముయొక్క ఆత్మార్ధము

ప్రకృతియె సీతయై తనర రాముఁడె యీశ్వరుఁడై రహింపఁగా
వికృతి యొకింతలేక సుకవిప్రవరుల్ తమకావ్యరాశిలో
సుకృతి పొసంగ వ్రాయుదురు సుస్థిరమై తగు జ్ఞానలబ్ధికై
ప్రకృత మెఱుంగువారికది పథ్యముగాఁ దనరార కుండునే?

30. (ఇంతలుకన్నులుండఁ దెరువెవ్వరి) యను మనుచరిత్ర పద్యమునకుఁ బ్రతి కందపద్యము

ఇంతలు కనులుండఁగఁ బ్ర
శ్నింతువు వచ్చినపథంబుఁ జెప్పుమనుచు శు
దాంతసతుల నిటుపల్కుట
యెంతకొ యిదివ్యాజమనుచు నేఁదలఁతుసుమీ

31. అవధాని చిత్తవృత్తి - పృచ్ఛకుని నెంబరు

ముప్పది యొక్కఁడు నెంబరు

తప్పదు నీపద్యమిది వధానం బిందున్
దప్పునొ ధారణ? యుమ కృప
చొప్పడినం దప్పదనుచు సూచింతుఁజుమీ

32. ప్రస్తుత సభావర్ణన

రెండైనపంక్తులుగఁ గూ
ర్చుండిరి పృచ్ఛకులు సరసు లుండిరి కవులో
మెండుగ నవధానపు సభ
నుండిరి మల్లీశు కరుణ నొనరు విశదలన్

33. సంధ్యారాగ వర్ణన

చేరన్ వచ్చెను రాజు సత్ప్రియతచేఁ జెల్వోందునాఱేఁడు శృం
గారం బొప్పఁగఁజేసి యాతని మదిన్ గల్పింతునాహ్లాదమున్
వేఱేలాయని పాశి దిక్తరుణిలోఁ బ్రేమించి శోణాంబరం
బారూఢిన్ ధరియించె నాఁగఁ దగె సంధ్యారాగ మభ్రంబునన్.

34. షట్చక్రవర్తులపేరులు వచ్చునట్లు కందము - క్రమమక్కఱలేదు

ధరనలుఁడు హరిశ్చంద్రుఁడుఁ
బురుకుత్సుండును బురూరవుఁడు సగరుఁడు దు
ర్భరుఁడైన కార్తవీర్యుఁడు
వఱలుటఁదగె మున్ను చక్రవర్తి ప్రథచేన్

35. నియోగులకు వైదికులకు భేదము వలదనుట

బెరయన్ రాదునియోగి వైదికులకున్ భేదంబు రవ్వంతయున్
ధరపై వారలు చాలమైత్రిఁగొని మిథ్యావాదముల్ మాని యొం
డొరులాహ్లాదముఁబొందుటల్ తగును వేఱొక్కండుగానున్నచో
సిరులెల్లం జెడిపోవుఁ గీర్తులడఁగున్ జింతల్ గడున్ వర్దిలున్

36. పురాతన నూతనాంధ్ర ప్రబంధకవులు

పూర్వమునందుఁతెల్గునఁబ్రపూర్ణ రసోన్నతిఁ గావ్యరాజి ధీ
ధూర్వహులౌచు వ్రాసి పరితోషము నించిరి గాని యింతయే
గర్వముఁ బూనలేదటులఁగా కిపుడున్న కవుల్ కృతిక్రియా
నిర్వహణప్రవీణతకు నిగ్గక గర్వము గాంతు రక్కటా.

37. నన్నయ తిక్కనల కవిత్వము

ఇరువురి సత్కవిత్వమున నింతయులే దపశబ్దదోషమా
యిరువురి ప్రజ్ఞలున్ సమములేయగు నించుకభేద మెంచనా
తరమగునె కవీంద్రులు ప్రధానులు నన్నయతిక్కయజ్వలా
వరమతులన్ నుతించుటకు వాణియొ శేషుఁడొ రావలెన్ జుమీ

38. కృష్ణరాయల యాంధ్ర కవిత్వాభిమానము - కవిరాజ విరాజితము

తెనుఁగు కవిత్వమునందునఁ బ్రేమ యతి స్థిరమై విలసిల్లుటచే
నెనిమిదిమంది కవీంద్రుల గౌరవమిచ్చుచుఁ బ్రోచెను గృష్ణుఁడటుల్
ఘనులొకకొందఱు గల్గిరినేఁడు సుఖంబిడివారల మన్నననే
యు నరవరేణ్యులొకానొకచోఁదగియుండకపోరదియారయనౌ‌

39. నిశ్చయబుద్ధి లేనివాఁడు

అంతకుమున్ను దియ్యనిదన్న శర్కరఁ
          బాడు చేఁదనిపల్కుఁ బైత్యరోగి
అంతకుమునుబిడ్డయని యెంచిలాలించు
          దూడ యాఁబోతుగాఁగూడుఁ బశువు
అంతకుమున్న యుప్పనునుప్పుఁ బిదపఁగా
          దని చెప్పు సర్పవిషాకులుండు
అంతకుమున్నక్క యనుదాని నాలుగాఁ
          దాఱుమాఱుగఁజూచుఁ ద్రాగుఁబోతు

కాన నిశ్చయమగు బుద్ధి కాసువీస
మైన లేకున్న వారల కగు నవస్ధఁ
జెప్పఁదరమౌనె వేయేండ్లు చిక్కువడిన
నెవరి కర్మం బదెట్టులో యెసఁగునట్లె.

40. వసంతఋతువు చివర వృద్ధత్వ యౌవనమధ్యావస్ధ - మాలిని

చివురులును గరంబుల్ చెల్వమంతంతఁ బాయున్
సవసవగొని కాయల్ చాచులున్ జేవ దప్పున్
భువిని మధువు పెంపున్ బోవుచోఁగొమ్మలందున్
బొవరు వయసుపెంపున్ బోవుచోఁగొమ్మలందున్

41. వర్షాకాలమును 'భారతయుద్ధముతోఁ బోల్చుట - పంచచామరము

మురారియట్లు వానకాలమున్నతిన్ ఘటింపఁగాఁ
గరంబుశక్రచాప మల్ల గాండివంబునాఁదగన్
నరుండెదిర్చినట్లుగాఁగ నారదం బుదగ్రతన్
గురుప్రతాపవహ్నినార్చె ఘోరకాండవృష్టిచేన్

42. కవుల గౌరవమొనరించు మఱికొందఱు రాజులు

ఉరలాంభూపతులాత్మకూరు నృపవర్యుల్ శ్రీమహాశూరభూ
వరచంద్రుల్ వనపర్తి భూపతులు గద్వాలక్షమావల్లభుల్
కిరలంపూడి నరేంద్రులింక మఱియున్ గీర్తింపఁగానెందఱెం
దఱొదాతల్ నరనేతలుండి రిఁక విద్యాగౌరవంబల్పమే?

(సంపూర్ణము)

అవధానాంతమున

పండితకవుల యభిప్రాయములు

శ్రీ జూపూడి హనుమచ్ఛాస్త్రి, శతావధాని

శ్రీకరుఁడార్తరక్షకుఁడుఁ జిన్మయరూపుఁడు ముక్తిదాయకుం
డా కమలామనోహరుఁ డహంకృతిదూరుఁడు నిర్వికారుఁడ
స్తోకములైన భోగములతోఁ దులఁదూఁగఁగఁ జేయుఁగాత మి
మ్మో కవివర్యులార బుధులుత్తమ భావులు సంస్తుతింపఁగన్

పత్రమో పుష్పమో లేక ఫలమొ యేమొ
పెద్దలను జూచుచో సమర్పింపవలయు
ననెడి యార్యోక్తినమ్మి పద్యప్రసూన
ముల నొసంగితిఁ గైకొనుం డలఘుమతులు

ధారణతప్పకుండ, బుధతండము హాయనిచొక్కు చుండ వా
గ్దార తలంగకుండ, బెడిదంబుల నోట నెసంగ కుండ, వి
స్ఫార కవిత్వతత్త్వమున సభ్యులఁదన్పితి రేమి చెప్ప నే
నారయలేదు మున్ను జనులా శతఘంట కవిత్వరాజ్య ధూ
ర్దారణమేడ బాలక విధానమదేడ ననంగ, మీ కవి
త్వారభటిన్ వధానగతి నారయకుండనివారు, వారలి
ప్డోరిచి చూచి మెచ్చుకొని రూరక మున్ననినారమంచు, నా
నేరుపదేమి మెచ్చితినె, నిక్కముగా మిముఁజూడకుండి, యే
తీరున మెచ్చవచ్చు, గడిదేఱిసభన్ జరగించుమిమ్ము, ని
చ్చోరమణీయవృత్తిఁగవిశూరులఁగంటిని మెచ్చుకొంటి మీ
ధోరణిజూడఁ బార్వణ విధూదయలాభ సముల్లసత్తరం
గోరు ఘుమంఘుమారవ సముత్కట పార్ధులమించె సద్యశో
భారముఁబూనినట్టి మిము బాలురటంచు వచింప నిప్డు నా

నోరెటులాడు, రూపముననో పలుకం దలకొందుఁగాని, బల్
నేరుపుచేతఁ బూర్వకవినేతలనుం దలఁపించుచుంటి రో
భారవులార! మీసుగుణ పద్ధతిమేలు, శతావధాన సం
ధారమణీయులార! బహుధా నుతియింపఁగఁజెల్లు మిమ్ములన్

శతలేఖిన్యవధానులఁ
జతురుల నత్యంతకీర్తి సంపద్యుతులన్
మతిమద్వర్ణిత మూర్తుల
ధృతియుతులన్ మిమ్ము దేవ దేవుఁడు ప్రోచున్

బ్రహ్మశ్రీ బెల్లముకొండ రామారాయ కవీంద్రుల శిష్యుడఁగు శ్రీ ములుకుట్ల లక్ష్మీనారాయణ శాస్త్రిగారు

రామరాయనివర్ణింప రాదునాకు
భక్తిమైఁదెల్పనది స్వభావో క్తియగుట
నమ్మహాత్ముని శిష్యుండ నంతొయింతొ
శాంకరీయంబుఁ జదివితి జంకులేదు

కంటిని మీకవిత్వమును గంటిని మీదు శతావధానమున్
గంటిని మీమహత్త్వమును గన్నులపండువుగాఁగ నేఁడహో
జంట కవీంద్రులార! మదిసంతసమయ్యె మఱేమియీయలే
కుంటను వేయినూఱులని యొంచుఁడి యిచ్చితినొక్కపద్యమున్

బ్రహ్మశ్రీ చివుకుల రాధాకృష్ణశాస్త్రిగారు

కప్రముఁబలుకులఁ గుఱిసెడి
కొప్రపు కవివరుల కవితకున్ జయమగుతన్
సుప్రధిత ధారణాస్థితి
కప్రతిమాత్యంతకీర్తి యబ్బెడుఁగాతన్

ధరనవధానముల్ జరుప దక్షతగల్గినవారి సత్కవీ
శ్వరుల యశోధురంధురులఁ జాలఁగఁగాంచితి నంతేగాక నే

జరుపఁగ నేర్చినానయిన సత్యముగా భవదీయ ధారణా
గరిమను జూచి సిగ్గుపడఁగావలసెన్ మొలచెన్ భయంబెదన్

అవధానంబునఁ బూర్తిచేయఁగ నసాధ్యంబై గభీరార్ధశ
బ్దవితానంబయి యన్యదుర్లభమునై భాసిల్లు నీదుస్సమ
స్య విలాసంబుగఁ బూర్తిచేసితివి నీసామర్ధ్యమెన్నంగ నా
కవునే వేంకటసుబ్బరాయ కవివర్యా! యార్యలోకస్తుతా!

శ్రీమాన్ తిరుపతి రంగాచార్యులవారు

శ్రీమత్కొప్పరపు బుధ
స్వాములకున్ సోదరులకు సరసులకు యశో
ధాముల కవధాన కవి
గ్రామణులకు రాముఁడిచ్చుఁగాత శుభంబుల్

గంగాభంగతరంగ ఘుంఘుమరవోద్గాఢ ప్రసంగంబులన్
గాంగేయోగ్రరణధ్వనత్కర ధనుర్ఘంటా విలాసంబులన్
రంగత్పద్మభవాంగనాంఘ్రి కటకారావప్రభావంబులన్
మ్రింగున్ మీ కవితా మహామహిమ నెమ్మి న్నమ్మివర్ణింపఁగన్

పాయసంబున నుప్పు లోపంబటంచుఁ
గోడి నడినెత్తి పైమూఁడు కొమ్ములనుచుఁ
బలుకువా రీర్ష్య నెట్టులోఁ బలుక నేమి
మిమ్ము నిష్పక్ష పాతులు మెచ్చినారు

ధారణకు మెచ్చితిని మీ
ధోరణికిన్ మెచ్చితిని బుధుల్ కవులు నృపుల్
మీరాక కెదురుచూచుచు
గౌరవ మిచ్చెదరుసుండి కవిమణులారా!

బ్రహ్మశ్రీ రామేశ్వర కవులు శతావధానులు

శతఘంట కవనమ్ముసల్పు వారెవరన్న
          మున్నుగా మిమ్మునే యేన్నవలయు
అష్టావధానమ్ము నాచరింత్రెవరన్న
          మున్నుగా మిమ్మునే యెన్నవలయు
ఆశుకవిత్వమ్ము నల్లువారెవరన్న
          మున్నుగా మిమ్మునే యెన్నవలయు
నేత్రావధానమ్ము నెగడింతు రెవరన్న
          మున్నుగా మిమ్మునే యెన్నవలయు

నెన్నియో దేశములనుండి యెందఱేని
పండితులు సత్కవీంద్రులు వచ్చినారు
గాని మిమ్మునుబోలఁ డొక్కండుగూడ
రమణ సుబ్బాఖ్య కవులార! రసికులార!

సరసులు నాఱువేలకుల సాగరచంద్రులు వాసభూమి కొ
ప్పరము, శతావధానము లపారముగా నొనరించినారు సో
దర కవులంచుఁ బేర్వడసి దక్షుల మెచ్చగఁ జేసియెన్నియో
బిరుదములందినారు ఫృథివీశుల మన్నన లొందినారు భా
సురముగ నాంధ్రమండలి యశోవిభవంబును బాదుకొల్పి నా
రురుతరశక్తియుక్తుల మహోన్నతులై తనరారినారు బం
ధుర జయయాత్రలన్ జనని నోముఫలింపఁగఁ జేసినారు సు
స్థిరసుకలాభిరాములన ధీరతఁ బెంపువహించినారు మా
తరమె నుతింప వీరిని బుధస్తవనీయుల సద్విధేయులన్
కవనముండినఁ బాండిత్య గరిమసున్న
పాండితియెయున్నఁ గవనలాభము హుళక్కి

తనర నవిరెండు శుద్ధవర్తనము గలుగ
దుర్వినటుగాక మీకన్ని యుండె భళిరె

రంగత్కావ్య పరంపరాభిరచనా ప్రారంభశుంభద్వచో
త్తుంగా! చారు శతావధానఘటనా దుర్వార! స్వర్వాహినీ
భంగానంగఘుమంఘుమారవసదృక్పద్యార్బటీ తృప్తస
భ్యాంగీకార! బుధాంబురుట్తరణి! సుబ్బారాయవిద్వన్మణీ!

బ్రహ్మశ్రీ తురగా వేంకట కవీంద్రుల శిష్యుఁడు భీమిరెడ్డి వెంకటప్పారెడ్డి

శ్రీరామారమణీమనోహరుని హృత్సమన్‌దగన్నిల్పిత
త్కారుణ్యంబున సత్కవిత్వ రచనాదార్డ్యంబుచే మించి దు
ర్వారుల్కొప్రపుసత్కవీశ్వరులు వహ్వాయంచు విద్యానిధుల్
పేరొప్పన్నుతియింపమీమహిమముల్ వింటిన్‌బ్రమోదించితిన్

ఈయనుజన్ముల కిట్టియాశుకవిత్వ
         పటుశక్తి యెవ్విధిఁ బట్టువడెనొ
ఈసోదరులయందె తాసోయగముఁజూపె
         ధారణాతరుణి యే కారణంబొ
ఈసరసుల జత నీక్షింప సభ్యుల
         మనము లానందంబుఁ గొనుటయెట్లొ
ఈ పూజ్యమూర్తుల నేపుణ్యమునుజేసి
         కాంచీరో తలిదండ్రు లెంచి చూడ

ననుచు జనములు గొనియాడ నలరిశతవ
ధాన ధౌరేయులై బిరుదములు గాంచి

రాశుకవిచక్రవర్తులయారె యనఁగ
నఖిలదిక్తటి మీకీర్తి యతీశయించే

పొంకముగాఁగ మీమహిమ పోఁడిమిఁజెప్ప నశక్యమైన ని
శ్శంక రచించినాఁడ మదిఁజాల్కొనిపొంగిన మోదశక్తి నా
వంక దయారసేక్షణము పర్వగఁజూడుఁడి వేంకటప్పఁడన్
వేంకట సుబ్బరాయ ఘన వేంకట శ్రీరమణాఖ్య సత్కవుల్

సభల వేయాఱు లందెడు సత్కవులకు
నే నొసంగితి పద్యముల్ పూని మీకృ
పా విశేషమ్ము మదిలోనఁ బడయఁగోరి
చంద్రునకు నూలుపోగను సామెతఁగొని

బ్రహ్మశ్రీ పాటిబండ సూర్యనారాయణరావుగారు

చేసిరి పూర్వమిప్పుడును జేయుటగద్దు శతావధానముల్
భాసురరీతి నందఱు సెబాసన మీవలె నెవ్వరేని మున్
జేసిరె, యిప్పుడుంగలఁడె, చేయఁగలాఁడొకఁడేని మీకు నా
హా, సముఁడున్నె కొప్పరకులానుజసత్కవులార ధాత్రిలోన్

ఒజ్జలకడ నేన్నియో మొట్టికాయలు
         తినినేర్చినట్టి విద్దెయునుగాదు
గ్రహణశక్తియొకింత గల్గిన లేకున్న
         శాస్త్రముల్ పిడివేయు సరణిగాదు
పేరవధానులై విఱ్ఱవీఁగుటకునై
         పరుని సాయముగోరు పటిమ గాదు
అబ్బబ్బ? డొడుగీడ్చినట్లు జెప్పఁగఁదోఁచు
        నాశుకవిత్వ మియ్యదియుఁగాదు

భళిభళీ! యౌర! దైవాంశ వలనవీరు
పుట్టినప్పుడె కవులౌచు బుధులునగుచు
వఱలినా రన్యమెంచుట వట్టివెఱ్ఱి
ధర ననన్యధీజవులు కొప్పరపుఁ గవులు.

శ్రీమత్కొప్పర వంశపావనయశశ్స్రీభ్రాతృయుగ్మంబ!యా
సోమార్కంబు భవద్యశంబధికమై శోభిల్లుతన్ ధాత్రిమీ
నామంబుల్ వినినంత మాత్రమున నున్మత్తస్థితింజెందిపో
రే మీశత్రులు మత్సరత్వమునకున్ హృత్సీమఁజోటిచ్చినన్

బ్రహ్మశ్రీ పుట్రేపు శేషయ్యగారు

గంగాప్రవాహ భంగప్రచారంబు మీ
         యాశుధారా కవిత్వాతిశయము
పూషాంశుకాండ విస్ఫురణాసమంబు మీ
         యాశుధారా కవిత్వాతిశయము
జంఝానిలాటోప సంరంభయుతము మీ
         యాశుధారా కవిత్వాతిశయము
గాండీవిహస్తనిర్గళితాస్త్రధార మీ
         యాశుధారా కవిత్వాతిశయము

నిర్మలము నిష్కళంకము నిరుపమాన
మై యొసంగెను మీ కవిత్వాతిశయము
గాన మిమ్మెన్న నేరుపు గలదె నాకు
సూరిహితులార! సోదర సుకవులార!!

ఆశుకవిత్వసంపద కహాయని మెచ్చనియట్టివారు మీ
పేశల వాక్సుధామహిమపెంపు నుతింపనియట్టివార లీ
చేసిన మేల్ వధానము ప్రసిద్ధమటంచు గణింపనట్టి వా
రీ సభఁగాన రారు సుకవీశ్వరులార! రసజ్ఞులౌటచే.

సుగుణమయమైన మీయెదఁ జోటెఱింగి
ప్రౌఢి స్మృతి మతి బుద్ధియుఁ బ్రజ్ఞయనెడు
గంబములఁబాతి ధారణా గరిమయనఁగఁ
దగినదూలంబుపైఁ గవిత్వచ్ఛదంబు
నిలిపి వాణికి గేహంబు నలువ గూర్చె

శ్రీయుతుఁడంబుజాప్తకుల శీతకరుండు దయాకరుండు స
త్యాయతకీర్తిశోభితుఁ డనంతుఁడు దుష్టజనాంతకుండు ప్ర
జ్ఞాయుతుఁడార్త రక్షకుఁడు కర్మఫలప్రదుఁడంతరాత్ముఁడే
యేయెడనైన సజ్జయమునిచ్చి సుఖంబిడుఁగాత మీకొగిన్

బ్రహ్మశ్రీ వేంకట సుబ్బరాయ కవి గౌరవానంతరమున ఆశువుగాఁ జెప్పిన పద్యములు

అలగర్తపురిని రామాభిఖ్యు నింటి కే
         తెంచి మత్కవిత నాలించినాఁడు
చేయింతు సభను మీచేత మాయూరిలో
         పల నంచు వినయోక్తిఁ బలికినాఁడు
ఉద్యోగి జనుల గుంటూరున నుండి రా
         వించి బల్ విందు గావించినాఁడు
శతఘంట కవనంబు సల్పించి నూర్పదా
         ర్లంచిత స్థితి సమర్పించినాఁడు

రీవి మల్లీశు గృహము కట్టించినాఁడు
రేవ నర్దులలేమి నెట్టించినాఁడు
పూజ్య చెరుకూరి వంశ సంభూతుఁడైన
తిరుపతి సమాహ్వయుండు సుధీహితుండు.

అగ్రాసనాథిపతిగారిని గుఱించి

అవధానంబొనరించు నీసభకుఁ దానగ్రాసనాధీశ్వర
త్వ విలాసంబు భరించినాఁడు కవితా తత్త్వంబు వీక్షించినాఁ
డవురా తిర్పతియున్ సభాసదులుఁ దన్నౌనంచు మన్నింప వే
డ్కవరంబై తగ న్యాయవాదియగు కొండా వెంకటప్పార్యుఁడే.

మరియు సభచేయించినవారిని గుటించి

వేంకట రాయనాముఁడు ప్రవీణుఁడు సోదరుఁడై రహింప ని
శ్శంక గుణాభిరాములగు సౌమ్యులు పేరయ వీరయాహ్వయుల్
కొంకు గలంకు లేక తనకున్ బరిచర్యలు సేయుచుండ నే
వంక గొఱంత లేని సిరి వర్ధిలఁ దిర్పతి యొప్పుఁగావుతన్.

శ్రీ చెరుకూరు తిరుపతిరాయఁడుగారి వృత్తాంతము

మానితంబైన గుంటూరు మండలమునఁ
దనరె సిరి కాఁపురంబు విస్తలపురంబు
పుణ్యపురుషులకది జన్మభూమి యందుఁ
గలరు చెరుకూరివారన కమ్మవారు

చెరుకూరు వంశాబ్ది శీతాంశుఁ డురుకీర్తి
         భరుఁడు పేరయ్య యెవ్వానితండ్రి
భాగ్యదేవతకుఁదాఁ బ్రతివచ్చు భాగమాం
         బా శిరోరత్న మెవ్వానితల్లి
శంకాపహారి శ్రీ వేంకటరాయాభి
         ధానుండు సుగుణి యెవ్వాని తమ్ముఁ
డతిసుందరాకారుఁడైన వీరయ్య యె
         వ్వని సోదరుని ప్రియతనయుఁడయ్యె

నట్టి విద్యాభిమాని పేరయ్య తండ్రి
ప్రబల ధీస్ఫూర్తి తిరుపతిరాయమూర్తి
విశదల పురాధికారి సేవితపురారి
నెమ్మి గుంటూరి కేతెంచి మమ్ముఁగాంచి

పాలడుగు వేంకటప్పయ
తో లలిత యశోవిలాసుతో సచివునితో
నాలోచించి మిముం దగు
వీలున సభఁగూర్చి గౌరవించెద ననుచున్

ఏకా రామాదుల నా
లోకించి సభన్‌ఘటింప లోపింపక య
స్తోక వినయోక్తిఁ బిలిచి గు
ణాకరులగువారి యిష్టమంది చని పయిన్

తన గుమాస్తాను గుంటూరి కనిపి కవులఁ
బండితుల నధికారుల భారతీ ప్రి
యత వలయు నెల్లజనుల నాహ్వాన మాచ
రింపుమన నాఘనుండట్టిరీతి జరుప

స్థిరవారమున మేము చేరితి మంతలో
         నూరూరి చుట్టముల్ చేరినారు
రెండుమూఁడామడలుండు విద్యా ప్రియుల్
         నూఱులకొలఁదిగాఁ జేరినారు
కవితా చమత్క్రియా గౌరవుల్ పాండితీ
         ధౌరేయులెందఱో చేరినారు
గుంటూరుపురినుండి గొప్పయుద్యోగులు
         శిష్ఠు లనేకులు చేరినారు

జరుగు శతఘంట కవనంపు సభయటంచుఁ
బిలిచి నంతటనే విశదలకు వారి
నర్హ వాక్యంబులను మధురాన్నములను
హాయిగొనఁజేసి తిరుపతిరాయఁ డలరె

విశదల శ్రీ మల్లీశ్వరస్వామి

ఒయ్యనఁ బుట్ట కోటపయి నుండిన శ్రీ రమణీశుబొల్లి మో
రయ్యనుగాంచి, యా హరిదయామతి నాత్మకుఁదోఁచిశూలినా
నెయ్యుఁడు నాకు నాతనికి నిక్కము భేదములేదు కాన నీ
వెయ్యెడనైన దేవళము నీశునకుం దగఁ గట్టి యాతనిన్
జయ్యనఁగొల్వు మిష్టములు సాగును దిర్పతి! యంచుఁబల్కనా
యయ్యకు మ్రొక్కి విస్తలపురావనిఁ జిత్ర విచిత్ర వైఖరిన్
డయ్యన నొక్కకోవెల దృఢంబుగఁ గట్టి కుమారదేవుఁ గ
న్నయ్యను మల్లికేశు నిను నాభ్రమరాంబను విశ్వమాతఁదా
నియ్యెడనిల్పి కొల్చె నతఁ డితఁడె తిరృతి ప్రోవు మీశ్వరా

శరడిండీరపటీరశుభ్ర సరసీజాతాచ్ఛపత్రాదితే
యరసారుట్ శరదబ్దహీరదర పంచాస్యారవాణీపయ
శ్శరధీరాభ్ర తరంగిణీలహరికాసంక్రందనాశ్వక్షపా
కరనీకాశకనత్స్వరూప! త్రిజగత్కళ్యాణ! మల్లీశ్వరా!

సరసీజాసన శక్రముఖ్యదివిషత్సంఘో త్తమాంగస్థభా
స్వరరత్నస్థగితోరు భూరిమకుటీ శస్తద్యుతిచ్ఛన్న సుం
దరవాతాశన రాజ మండన లసత్పాదారవిందా! బుధా
దర చారిత్ర! దినేశసోమశుచినేత్రా! భర్గ! మల్లీశ్వరా!

మంచుంగొండకుఁగల్గు భాగ్యమయినన్ మాబోండ్లకున్ రాదుగా
కొంచెంబెట్లగు వెండికొండయశ ముక్కుంబూనెఁగాశీపురం
బెంచన్ రాని మహత్త్వ మీవొసఁగుటన్ హీనుండఁగాకుండ భ
ద్రాంచత్సత్కృపతోడఁజూడవె యుమాప్రాణేశ! మల్లీశ్వరా!

సర్వజ్ఞుండవు నీవెఱుంగనిది యేజాడన్‌గనన్ రాదుగా
నిర్వాణోజ్జ్వలహర్మ్య దేశమునకున్ నిశ్రేణి నీభక్తినిన్
గీర్వాణుల్ వరభక్తిమైఁ గొలుతురే క్రేవన్ విచారింప భ
ద్రార్వా! భక్తజనావనవ్రత! ఫణీడ్రైవేయ! మల్లీశ్వరా!

రంభాభోగము నవ్వునిన్గొలుచు ధీరస్వాంతుఁడశ్రాంతమా
జంభారాతిపదంబు హేయమను నీసద్భక్తుఁడాత్మార్థమున్
శుంభద్రీతి నెఱుంగవచ్చునినుసంశుద్ధాత్ముఁడై కొల్చువాఁ
డంభోజాసనపూజితైకపదయుగ్మా! శర్వ! మల్లీశ్వరా!

పౌలస్త్యున్వరియించుటిల్ల హరికిన్ బ్రాపౌటయేకల్ల యా
వ్యాళంబున్ గృపఁజూచుటేయనృత మార్యా దేవికిన్ మైసగం
బాలోచింపక యిచ్చితీవనుటసత్యం బిందునన్ బ్రోవకే
యాలస్యంబొనరించెదేని, శ్రితలోకాధార! మల్లీశ్వరా!

కందర్పుండు భవద్విరోధియయి యాకారచ్యుతింజెందె నా
యిందుండొప్పె వరాంగసంగతిని నీయిష్టంబునార్జించి నీ
యందే భావమునిల్పు భక్తునకు లో టావంతయుం గల్గారా
దందున్ విందును నీవెదేవుఁడవు దాసానంద!' మల్లీశ్వరా!

ఉక్షేంద్రధ్వజ! నీ కటాక్షమునకై యూహింత్రు మౌనీశ్వరుల్
పక్షీంద్రధ్వజబాణ! నిన్గొలుచుసద్భక్తుల్ మహేంద్రాదులో
దక్షద్వేషి! భవత్పదాశ్రితులకున్ దాపౌను మోక్షంబు గో
ధ్యక్షానన్ గృపరక్ష సేయఁగదె లోకాధ్యక్ష! మల్లీశ్వరా!

కీర్తింపందగు సచ్చరిత్రముల మేఖేల్కొల్పువారల్ ధరా
భర్తల్ పల్వురుగల్గియుండినను నిర్వాణోన్నతిన్ గూర్పఁగా
ధూర్తుల్ నవ్వకయుండఁబ్రోవఁగనునీతో సాటివాఁడెవ్వఁడో
యార్తత్రాణపరాయణా! వరద! సత్యాకార! మల్లీశ్వరా!

వింటిన్ భక్తజనావన వ్రతమునన్ వెల్గొందు నీవైఖరిన్
గంటిన్ నీదగు దివ్యవిగ్రహము దృక్పర్వంబు సంధింపఁగాఁ
గొంటిన్ నీదుపదాంబుజద్వయముహృత్కోశంబునన్ బ్రోవవే
యంటిన్ నీకిదితప్పదంటి భ్రమరాంబాధీశ! మల్లీశ్వరా!

సిరియొకకొంతయుంట నతిచిత్రముగాఁబొరుగూళ్ళనుండియిం
దఱ బిలిపించి విందిడి వధాన మొనర్పఁగఁజేసి మాకు సో
దరులకు వస్త్రభూషల ముదంబిడి నూటపదాఱులిచ్చె నీ
తిరుపతిరాయఁడాధనపతింబలెఁ బ్రోవవే మల్లికేశ్వరా!