Jump to content

కొప్పరపు సోదర కవుల కవిత్వము/బాపట్ల శతావధానము

వికీసోర్స్ నుండి

బాపట్ల శతావధానము

పీఠిక

ఆర్యులారా!

శ్రీమదాశుకవిసింహేత్యాది బిరుదాంచితులైన బ్రహ్మశ్రీ కొప్పరపు వేంకట సుబ్బరాయ వేంకట రమణాభిఖ్యాతి విఖ్యాతకవిపుంగవు లీనెల 14వ తారీఖున మా బాపట్ల పురవాసులును విద్యాభిమానులును నగు బ్రహ్మశ్రీ చోరగుడి వేంకటాద్రిగారును, బ్రహ్మశ్రీ రాచపూడి జగన్నాథరావుగారును, బ్రహ్మశ్రీ పాతూరి శివరామయ్యగారును, బ్రహ్మశ్రీ కోన వెంకట్రావుగారును, బ్రహ్మశ్రీ ఆలూరి గోపాలరావు గారును, బ్రహ్మశ్రీ వల్లూరి వేంకటరామయ్యగారును, బ్రహ్మశ్రీ కొమరవోలు హనుమంతరావు గారును, బ్రహ్మశ్రీ చెంచురామయ్యగారును, బ్రహ్మశ్రీ కోటేశ్వరరావుగారును, బ్రహ్మశ్రీ బ్రహ్మాండం బాపయ్య గారి గుమస్తాగారగు బ్రహ్మశ్రీ గోపాలరావుగారును, బ్రహ్మశ్రీ కర్లపాలెపు సూర్యనారాయణగారును, బ్రహ్మశ్రీ పెళ్లూరి శ్రీనివాస కవిగారును మఱియు ననేకులగు మహామహులును సముచితంబుగ నాహ్వాన మొనర్ప నంగీకరించి వచ్చి, మా బాపట్ల రైలు స్టేషను లోనికిఁ బ్రవేశించు వఱకుఁ దద్దర్శనోత్సాహ వర్ధిష్ణులైన జనులనేకులు కరతాళ ధ్వనులొనర్చుచు జయజయేతి శబ్దంబులచే నుతియించుచు స్వాగత పద్యంబు లొసంగి యశ్వ శకటాధిరోహులఁ గావించి యూరేగించి సభా భవనమునఁ బ్రవేశపెట్టిరి. సభ యందు నిండియుండిన పండిత పామరులందఱొక్కసారిగాఁ గరతాళ స్వనంబులచేఁ దమ సంతోషంబును దెలిపిరి. ఆనాఁటి సభయందగ్రాసనాధిపతులుగా కోర్టు మునసబు గారైన బ్రహ్మశ్రీ టి. భుజంగరావు పంతులుగారుండిరి. ఈ కవి ద్వయము సభ్యులచే నెఱిఁగింపఁ బడిన కథా విషయంబుల నగ్రాసనాధిపతి గారు కోరఁగాఁ దమ నిరుపమానమగు నాశు కవితా ప్రభావంబుచే నక్కథలను బూర్తియొనరించి యెల్లర హృదయంబు లమందానంద కందళితంబులుగా సల్పిరి. ఇతఃపూర్వ మెన్నఁడును నెచ్చటను గని విని యుండని వారి యత్యద్భుత కవితాధారచేఁ దనిసి మెచ్చి తలయూపనివారు కానరారైరి. మఱునాఁడు 15వ తేదీన (15-9-1911) మధ్యాహ్నము సుమారు గం. 2-20 నిమిషములకు శతావధానముఁ బ్రారంభించి (తెల్లవారు జాము) గం. 2-10 ని.లకు ముగించిరి. ఆ సభకు బ్రహ్మశ్రీ దేశిరాజు కృష్ణయ్య పంతులుగా రగ్రాసనాధిపత్యము వహించిరి. పృచ్ఛకులకు ననులోమ విలోమ సంఖ్యాకముగాఁ గోరిన విషయములం గూర్చి కోరిన వృత్తములం జెప్పిరి, ధారణా శక్తి తప్పిపోవుట గాని, సమస్యాపూరణ మందు సారస్యము లేకపోవుట గాని, అవధానాంతమునఁ బద్యములు చదువకుండుట గాని, కోరిన సమస్యలు మార్చి పూర్తి సేయుట గాని, పద్యములు మఱునాడు చదివెదమనుట గాని సంభవింపక, యసూయాగ్రస్తులకు సైతము వేఱైన యూహలు దోఁపఁదగిన వ్యవధి లేకుండుటచే నిదియేమి యాశ్చర్యమను నట్లు సభ్యులగు వారికందఱ కత్యధికమగు సంతసమును గలిగించిరి. మూఁడవనాఁడు (16-9-1911) సభ్యుల కోరికచే వారి యత్యద్భుత కవితా ధారఁజూపి గంటకు 480 పద్యములు చెప్పి మెప్పు గాంచిరి. పులినిఁ జూచి నక్క వాఁతఁ బెట్టుకొన్న సామ్యమున నీ సోదర కవులవలె నాశు కవిత్వమును జెప్పుటకు సాహసించి మృదు మధురశైలి లేకపోగా నడుగు సాఁగక, విషయము తోఁచక, యతులు గతులు చెడుట వలన మతియును, స్మృతియునుఁ గూడఁ దప్పి, కథను గోదావరిలోనో, గంగలోనో కలిపినవారై తమ శక్తి లేమి నెఱింగియు నితరుల శక్తినిఁజూచి యోర్వలేక యందని మ్రాని కఱ్ఱులు సాఁపుచు సత్కీర్తినిఁ గోరుచుఁ బిదప దానికి వ్యతిరేకమగు దానినే వడయచున్నవారిని గొందఱినిఁ జూచిన యెల్లరకు నీ బాలసరస్వతుల యసమాన సామర్ధ్యమత్యాశ్చర్యముఁ గలిగించెను, ఆ నాఁడే యీ సోదర కవి సింహులకు రు. 116-0-0 పారితోషిక మొసంగఁబడి బంగరు పతకంబులుఁగూడ వాగ్దానము సేయఁబడెను. బహుమానమునొసంగి నప్పుడది గ్రహించి బెల్లముఁ గొట్టిన రాళ్ల వలె నూరకుండెడి కొందఱవలెఁ గాక తమ సంతోషము నంగీకారమును వెల్లడించుచుఁ బ్రతిపద రసభావ గుంభితంబులుగా నొక యేఁబది పద్యములఁ జెప్పి సభాస్తారుల రంజింపఁ జేసిరి. ఇట్టి సోదర కవియుగ్మమున కత్యంతాయురారోగ్య భాగ్యంబుల నింకను వెలయించి సర్వకామిత ప్రదుండగు భగవంతుండు నిరంతరంబును రక్షించుఁగాత.

బాపట్ల,

20-9-1911

ఇట్లు,

చంద్రమౌళి చిదంబరరావు

బాపట్ల రైల్వేస్టేషనులో దిగినపుడు చదివిన స్వాగతపద్యములు

శ్రీకొప్పరపువంశ సింధుసంజనిత ము
       క్తామయులార! స్వాగతము మీకు
ఘనసుబ్బరాయ వేంకటరమణాఖ్య స
       త్కవివరులార! స్వాగతము మీకు
ఆశుకవీంద్ర మృగాధీశ్వరప్రధాం
       చితమూర్తులార! స్వాగతము మీకు
కుండినకవికుల మండలహంసాఖ్య
       గణనీయులార! స్వాగతము మీకు

రాజధానియందురహిమించు నాంధ్ర దే
శంబునందు యశముఁజల్లి మిగుల
బిరుదులంది పెంపుఁ బేర్కొన్న నగ సమ
థైర్యులార! స్వాగతంబు మీకు

కొప్పరపు కవులటంచును
గొప్పగు కీర్తిని వహించి కొమరొప్పెడు నీ
యొప్పులకుప్పల కిప్పుడు
మెప్పుగ స్వాగత మొసంగ మేలగుఁగాదే

చిత్రమే శారదా నవరాత్రులందు
పాత్రులై శారదా నవగాత్రులైన
మిత్రు లీకవివర్యుల మేలిరాక
శిష్ట శతపత్రములు వికసించు ఢాక

కర్లపాలెం సూర్యనారాయణ

బాపట్ల శతావధానము

(15-09-1911)

1. శ్రీమత్కనకదుర్గాంబాయై నమః

ప్రాపై పల్లెలఁ బట్టణంబుల ధరాపాలుల్ కవుల్ మెచ్చఁగా
నైపుణ్యంబును జూపఁజేసి జయమున్ ద్రవ్యంబుఁ జేకూర్చుచున్
మాపట్లన్ దయనించు దేవివని నిన్ భావంబునన్ నిల్పి యీ
బాపట్లన్ జరుపంగఁబూనితి సభన్ బాలింపు కాత్యాయనీ

2. వర్షాకాలప్రవాహము - గర్భిణీసతి

నీరుచే నద్దియిద్దియు నెగడుచుండు
తృప్తిఁగనకద్దియిద్దియు నెసఁగుచుండు
నదియు నిదియును దరులదృశ్యములుగఁ దగు
గర్భిణీకాంత నది యభంగప్రచార

3. గోపికావస్త్రాపహరణము - మందాక్రాంతవృత్తము

కాంతల్ భక్తిన్ గిరిజఁగొలువంగా నదిన్ దానమాడన్
వింతల్‌దోపన్ వసనములఁ బృధ్వీజమందుంచఁగా నా
దంతీడ్యానల్ వెదకి హరికృత్యంబటంచున్ భజింపన్
జింతల్ పాయన్ గరుణనొసఁగెన్ జేలముల్ కృష్ణుఁడంతన్

4. వసంతర్తువునందు వనములు

నానాసూనవితాన సంపదల నానందంబు సంధింపుచున్
సూనాస్త్రాయుధరాజికిన్ శరథులై సొంపొందుచున్ గామ కే
ళ్యానందంబునఁ దేలుయౌవతము నుత్యర్థోక్తులన్ గాంచి సా
రానన్ మించె వసంత వేళను వనుల్ రమ్యస్థితిన్ జెందుచున్

5. సమస్య : పున్నమ యమవస యనంగఁ బొల్పందె భువిన్‌

అన్నా పున్నమ లెన్నియొ
కన్నుల పండువును జేయఁగా ఘన తిమిర
చ్ఛన్నమయి వ్యాసు పేరిటి
పున్నమ యమవస యనంగఁ బొల్పందె భువిన్

6. రెండవ పూర్తి -

వెన్నెల వెదఁజల్లుచు దివి
వెన్న వలెన్ దోఁచు చంద్రబింబము నెల్లన్
గ్రన్నన రాహువుమ్రింగఁగఁ
బున్నమ యమవస యనంగఁ బొల్పందె భువిన్

7. దేహము - గడియారము

ఊహింపందగు యంత్రసంపదలచే నొప్పొంది యెల్లప్పు డు
త్సాహంబిచ్చెడు నందొకండు చెడినన్ సౌకర్యముంబాసి వే
వే హానిన్‌గను వేయిఁజెప్పవలెనే విశ్వంబు నందన్నిటన్
దేహంబున్ గడియారమున్ సమము సందేహింపకో మిత్రుఁడా!

8. సమస్య : క్రమమనియెంచిపంచెఁ గవిరాయఁడు భారతియిస్తువంతయున్

ప్రమదముదోప గాయకులుఁ బాండితిగల్గినవార లొక్కెడన్
సమరముసేయుచుండఁగని శారద యందఱి మాత “యిందు న్యా
యము కవిరాజ తెల్పు"మనె నయ్యెడ రాజు నిజంబుఁ దెల్పు టే
క్రమమనియెంచి పంచెఁ గవిరాయఁడు భారతి యిస్తువంతయున్

9. నల్లి - లయగ్రాహి

మల్లెలును మొల్లలును జల్లినను శయ్యపయి
నల్లియొకఁడుండ సుఖమెల్లయును బాడం

చెల్లరు వచింతు రటు లెల్లిదము సేయఁదగ
         దల్ల కుసుమాంబకుని భల్ల మదియందున్
వల్లభుఁడు కాంత ముదమల్లుకొన సెజ్జఁగనఁ
         బెల్లెగసి నిద్ర తనువెల్ల మఱపింపన్
ఝల్లుమనఁగుట్టి రతి నుల్లములు దన్పి భళి
         వల్లెయని వారి నుతులల్లపుడే గంటన్

10. బ్రహ్మశ్రీ నందిరాజు లక్ష్మీనారాయణదీక్షితులవారు

వేదంబనంగ నేవీథిలోవస్తువో
        యనువారి సందియం బడలఁద్రోచె
శాస్త్రంబనంగ బాజాఱులో నెంతటి
        క్రయమను వారల కలతఁబాపె
బ్రమసి సంధ్యావందనమను పల్కునకెట్టి
        యర్థమో యనువారి కదియుఁదెలిపెఁ
దమ రెట్టిజాతిజన్మములనుండిరొ యది
        యెఱుఁగనివారల కెఱుఁగఁజేసె

నెట్టివారల నేవిధి నెప్పుడెపుడు
గాంచఁగావలె నవ్వారిఁ గరుణ నట్టి
విధు లెసఁగఁ గాంచె విజ్ఞాన విహృతిఁబెంచె
దీక్షితుండనఁ దామరసాక్షుఁ డవని

11. ఆశుకవిత్వ మీజన్మమున నెట్లుసంభవించెననుటకు

తనకన్నఁ బెద్దలౌ ఘనమతులను గాంచి
         గౌరవించిన పుణ్యకర్మ మొకటి
విద్యార్థులకు నర్హవిద్యల నెఱిఁగించి
         కైకొన్నదౌ పుణ్యకర్మ మొకటి

తల్లిదండ్రులకన్న దైవముల్ లేరంచు
          గణుతిఁజేసిన పుణ్యకర్మ మొకటి
అలశారదా దేవి నతిభక్తిఁ గొల్చుచుఁ
          గైజోతలిడు పుణ్యకర్మ మొకటి

కలసి మెలసిన నీభువిఁ గలుగువేళ
నాశు కవనము లభియించు నందు రట్టి
కవితయన మాటమాత్రంబె చవులఁగురిసి
సరసులకు వశ్యమంత్రమై సౌరునించు

12. సమస్య : తొలిఁజేసెస్ భయమింతయున్ గనక విద్యుద్వల్లికబ్రంబహా

తళుకుంజూపులు సోగకన్నులును మందంబైన యానంబునున్
గులుకుంగుబ్బలు బారలౌ కురులు బెళ్కుంజూపు మధ్యంబునున్
వెలయన్ నల్వస్మరాస్త్రమే మెయియనన్ బింబోష్ఠినిర్మించితాఁ
దొలిఁజేసెస్ భయమింతయున్ గనక విద్యుద్వల్లికబ్రంబహా.

13. అంధుండాలయముఁ గాంచి యానందించెన్‌

బంధురశక్తిని రేఁచి సు
ధాంధుల నడలింపఁ జంద్రధరుఁగన భక్తిన్
సంధించి బాణుఁడను గ
ర్వాంధుం డాలయముఁగాంచి యానందించెన్

14. సీత, దమయంతి, చంద్రమతి యను స్త్రీలలో శ్రేష్ఠురాలెవరనుటకు

పాతివ్రత్యమునందు మువ్వురును మున్‌బ్రావీణ్యమున్ గాంచిరా
సీతాదేవియు, భీమరాజసుతయున్ సీమంతినీరత్నమన్
ఖ్యాతిన్‌గన్న త్రిశంకుపట్టిసతియున్ గానీ విభున్ బ్రోవఁగా
నీతిన్‌నిల్పెనుగానఁ జంద్రమతియే నేటంచు నేనెంచెదన్

15. సమస్య : పద్మంబునకోడి చేరెఁ బద్మారి దివిన్‌

పద్మవ్యూహము విప్ర క
కుద్మంతుఁడు గూర్పనడఁపఁ గోరెద రంచున్
బద్మారియైన వ్యూహపుఁ
బద్మంబున కోడి చేరెఁ బద్మారి దివిన్

16. రెండవ పూర్తి -

పద్మములు విలోచనములు
పద్మపుముకుళములు చనులు పద్మాక్షికి నా
పద్మాక్షి సుందరానన
పద్మంబునకోడి చేరెఁ బద్మారి దివిన్

17. గ్రీష్మకాలము - కవిరాజవిరాజితము

సుమశరుఁడేపునుజూపఁదొడంగిన సుందరులన్ విడఁజేయుటలౌ
శ్రమమును గొల్పుచు నెండలు వెల్గుటఁ జల్లనిగాలియుఁ గల్గమిచేఁ
జెమటలు గ్రమ్ముట దేహము తాపముఁజెందుట నీరము ద్రావఁగఁగో
ర్కె మహితమౌటఁ గడుంగడుఁగల్గును గ్రీష్మమునందున ధీరనుతా

18. నాగలింగ సోమయాజిగారనువారు^

నేను నాగలింగసోమయాజిని, బ్రాహ్మణుఁడను, కౌండిన్యగోత్రుఁడను, నీభక్తుఁడను, నాకుఁ జిన్నతనమునఁ జెవిలోఁ బోటుపుట్టఁగా నోమోపిదేవి సుబ్రహ్మణ్య స్వామీ నీ పుట్టకు నమస్కారముఁ జేసితినీ, చెవిలోని పోటు పోయినది యను సర్ధమువచ్చునట్లు శార్దూలమును చెప్పుమనగా -

భావింతున్ నిను మోపిదేవిఁగల సుబ్రహ్మణ్య! నీ భక్తుఁడన్
నేవిప్రుండను నాగలింగయను గౌండిన్యాఖ్యగోత్రుండ నా
కావిర్భావముఁ జెందెఁబోటు చెవిలో నాబాల్యమందప్పుడో
దేవా! నీదగుపుట్టకు న్నతుల నెంతేఁజేయఁ బోయెంగదే

19. త్రిమూర్తులను స్తుతించుట

శ్రీనారీప్రియవల్లభుండయిన యాశ్రీవిష్ణుసేవించెదన్
ధీనంద్యుండగు కాళికాధవుభవున్ వేడ్కన్ బ్రశంసించెదన్
సూనాస్త్రాగ్రజు శారదాపతి విధిన్ శోభాగతుల్ గూర్పఁగా
నానందంబునఁ గొల్తుఁ బండితులు మేలౌరా యనన్ మాటికిన్

20. ప్రస్తుత సభ

అందఱు సద్గుణౌఘయుతు లందఱు భూరికళావిశేషు లీ
యందఱుఁ బాండితీప్రథితు లందఱు సత్కవితాభిమానులీ
యందఱు దానధర్మరతు లందఱుఁ గీర్తి రమావిలాసులీ
యందఱు నందఱౌట సభయందలి వీరలనెన్న శక్యమే

21. సుదర్శన చక్రము

ఆ కరినాథుఁ గాచుటకునై చని నక్రముఁజంపె నుధ్ధతిన్
బ్రాకటశక్తిఁ బళ్ళెరమునాఁదగి వైద్యుని రూపుమాపె సు
శ్లోకులు సన్నుతింప నెటులోపము గల్గకయుండ భక్తులన్
శ్రీకరమౌచుఁ గాచెనది శ్రీశు సుదర్శన చక్రమో సఖా

22. రాజునకుఁ గవికి మైత్రి

సారసరాజికిన్ భసల సంతతి కెంతటిమైత్రి యుండెనో
వారిదపంక్తికిన్ మఱియు బర్హి చయంబున కెట్టిమైత్రియో
కీర పికాళికిన్ మధువు గీల్కొను మావుల కొట్టిమైత్రియో
ధారుణి భర్తకున్ గవికిఁ దద్దతి మైత్రి నితాంతమైతగున్

23. సోదరకవులమైత్రి - లయగ్రాహి

ఒక్క యెడకే చనుచు నొక్క నరునే గనుచు
         నొక్క పనిఁజేయుచు మఱొక్క మతి లేకే

యొక్క పదవిం గనుచు నొక్కటనె సాపడుచు
         నొక్కటనె పండుచు మఱొక్కటియుఁగాకే
యొక్కటను గాని క్రుధనొక్కరును బూనకయె
         యొక్క కృతిఁజేయుచును మిక్కుటపుఁ జెల్మిన్
నెక్కొనిన సోదరులు పెక్కగు వధానములఁ
         జక్కని కవిత్వమున నుక్కుఁ గనిరిందున్

24. బ్రహ్మశ్రీ బెల్లముకొండ రామరాయకవీంద్రులు

అలనాగేంద్రుఁడె శబ్దసంతతికినై యాశించు నానొప్పుచున్
బలుకుల్ కప్రపుఁబల్కులై దొరలఁగాఁ బద్యంబుఁదోడ్తోడరాఁ
బలుకుందన్వియె యిట్లుపుట్టెననఁ గబ్బంబుల్‌దగన్ వ్రాయుచున్
మెలఁగెన్ బెల్లముకొండ రామకవిసుమ్మీ సత్కవీశానుఁడై

25. సాయంకాలమునందు తూర్పున నొకకాంత సూర్యునిఁ జూచుట

సారసనేత్రయొక్కరిత సారసమిత్రుఁడు పశ్చిమాంబుధిన్
జేరఁగబోయి నట్టియెడఁ జెల్వుగఁ దూర్పునఁగల్గుచెర్వులో
నీరముపాత్రఁ గైకొనఁగ నెమ్మది నెంచి జలంబుఁజూడ నా
నీరమునందుఁ జాయయయి నీరజ మిత్రుఁడు దోఁచెనొయ్యనన్

26. కృతఘ్నునకు దైవ శిక్ష

అరసి యుపకారి కపకార మాచరింపఁ
దలంచిన కృతఘ్నునకు సేయు దైవమెదుట
నన్నమున్ బెట్టి తిననెంచు నట్టివేళఁ
దొలఁగఁజేసెడి పాపినిఁ గొలుచునట్లు

27. అవధానమునఁ గవికినిఁ బృచ్ఛకులకుఁ గలుగు కష్టసుఖములు

కదల కొక్కెడ నుండుటే కష్ట మొకటి
కాని, సరస పదంబులు కవితఁబడిన

సంతసముగల్గు నామీఁద సౌఖ్యమబ్బుఁ
దలఁపఁ గవి పృచ్ఛకుల కవధానమందు

28. పండితుఁడు, కవి

కవివరుం డల్లినట్టి శ్లోకంబునందు
గల్గు నర్దంబుఁ బాండితీగరిమఁ గన్న
ఘనుఁడు, తెల్పును గవి యట్టు లొనరఁ దెల్పి
మీఁదఁ గవనంబుఁ జెప్ఫియు మేప్పుగాంచు

29. మల్లె - లయవిభాతి

వెలయును సుగంధమున వెలయును సురూపమున
          వెలయును మదాళికినిఁ జెలువము ఘటింపన్
వెలయును దుషారదర మలయజ శతారశర
          ములను నగఁజాలెడి ధవళరుచులతోడన్
వెలయు మరుబాణమయి వెలఁదులకుఁ బూరుషుల
          కలుకలను బాపి మదిఁ గలయికలు గూర్పన్
బొలుపెసఁగ మల్లెయది తులయగు సుమంబు ధరఁ
          గలయఁగను జూచినను గలుగదనఁ జెల్లున్

30. ఖండిత నాయిక

నీరేజాక్షినొకర్తుఁగూడి పిదపన్ నెయ్యంబు దోపంగఁదన్
జేరన్ వచ్చిననాథుఁ గన్గొని భళీ, చెంగల్వలై నేత్రముల్
మీఱెన్ దేహము వాడువాఱె ముఖమెమ్మెన్ బాసి మేల్‌వీడె నీ
తీ రేమంచెదిరించి ఖండిత యనున్ దీవ్రోక్తి పుంజంబులన్

31. సమస్య : కాంతుఁడు లేనివేళఁ గలకంరి కిలక్కున నవ్వెఁ గిన్క తోన్‌

కంతుని వాడితూపులను గాసిలు నన్ దయఁగావ వత్తునం
చింతకురాకఁ దక్కెఁబ్రియుఁడేమిటికోయని బిట్టు దూఱుచున్

జింతయుఁగోపమూను సరసీరుహలోచనఁ జేరె నాతఁడున్
గాంతుఁడు లేని వేళఁ గలకంఠి కిలక్కున నవ్వెఁ గిన్కతోన్

32. శ్వేతాభిసారిక

అనువుగఁ బ్రాసవిశ్రమము లర్థము భావము చూచుకొంచు నం
తనగను నాశుధారఁ గవనంబు చెలంగు విధంబుఁదోపఁగా
వనిత విటున్ గనుంగొనెడు వాంఛను దేల్లనిచీరఁగట్టి తె
ల్లని నును వెన్నెలన్ జను భళా యభిసారిక మానసత్వరన్

33. బాలాసుందరీ నాటకశాలను భావనారాయణస్వామిని రక్షింపుమనుట

మీలంబోలి తెరల్ తళుక్కుమని యెమ్మెన్ జూపుచుండంగ భం
గాళిన్ బోలుచుఁ గట్టడంబులవి నేత్రానందమున్ జేయఁగా
బాలాసుందరి కంపెనిన్ వనధిగా భావించినారార్యు లిం
దోలిన్ నీవువసించి ప్రోవఁగదవే యో భావనారాయణా

34. అభిమన్యుని పద్మవ్యూహనిర్భేదనము - పంచచామరము

ధరామరుండు ద్రోణుఁడల్ల ధర్మరాజుఁబట్టఁగాఁ
గరంబుఁ బన్నిదంబు వైవఁగా నరాత్మజుండు తా
దరంబులేక మొగ్గరం బుదగ్రుఁడౌచుఁ జించుచో
గురుప్రకాండ మెల్ల గోడుగోడుమంచు నేడిచెన్

35. సమస్య : శనికిన్ భయమందనట్టి చతురుండితఁదే

వనజాక్షు బహిఃప్రాణం
బనఁదగు విజయుండితండె యమరేంద్ర వనం
బును వహ్నికిచ్చి యుగ్రా
శనికిన్ భయమందనట్టి చతురుం డితఁడే

36. సమస్య : దుర్మతి రాజుగాఁగఁ బరితోషము గైకొని రెల్లవారలున్‌

దుర్ముఖియందె పుట్టియును దుర్ముఖిగాక ప్రజానురాగుఁడై
కర్మఠుఁడైనయట్టి నరకాంతుని పుత్రుఁడు రౌద్రివత్సరం
బర్మిలి నిండినంతఁ దగునంతటి ప్రాయముగల్గి మేటియై
దుర్మతి రాజుగాఁగఁ బరితోషము గైకొని రెల్లవారలున్.

37. సమస్య : కుక్క చేతనుబడెఁగదా కుంజరంబు

దుర్బలుం డకృతాస్త్రుఁడౌ ద్రుపద పుత్రు
చేత ద్రోణుండు చాపదేశికుఁడు పడియె
నన్నమాత్రన యచ్చెరువయ్యె మదికిఁ
గుక్క చేతను పడెఁగదా కుంజరంబు.

38. సమస్య : కోడెలతోడ ఢీకొనియుఁగూలెఁగదా ముసలెద్దులొక్కటన్.

వాఁడితొలంగి దేహబల వైభవమున్ మఱిబుద్ధి శక్తియున్
గూడఁదొఱంగి దుష్కవులు కొందఱు సత్కవి సింహపోతముల్
పోఁడిమిఁజూపఁగా నెదిరిపోరి యడంగెడునట్లుగాఁగ నా
కోడెలతోడ ఢీకొనియుఁ గూలెఁగదా ముసలెద్దు లొక్కటన్

39. సమస్య : తల్లి తల్లిమగఁడు తల్లియయ్యె

మోహినీస్వరూపమున నొప్పు హరితోడ
భవుఁడు కలయఁ బుట్టె భైరవుండు
దాన భైరవునకుఁ దండ్రియయ్యె శివుండు
తల్లితల్లి మగఁడు తల్లియయ్యె

40. సమస్య : తలలోపలనున్న కల్లుఁద్రావిరనేకుల్‌

బలువేసవి దినములలోఁ
గలిగిన తాపంబు దీఱఁగా నుత్సాహం

బొలయఁగఁ గడుఁజల్లని ముం
తల లోపలనున్న కల్లుఁ ద్రావి రనేకుల్

41. సమస్య : ఫలముఁదినందగునె చూతఫలముంబోలెన్ - దమయంతీ కథ

నలనామ మొనర నుగ్రా
నలుని వరింపంగ నెట్లు నాకొనఁగూడున్
ఫలమనినమాత్ర ముక్తా
ఫలముఁ దినందగునె చూతఫలముంబోలెన్

(సంపూర్ణము)

అవధానాంతమున

పండితకవుల యభిప్రాయములు

బ్రహ్మశ్రీ పెళ్ళూరి శ్రీనివాసశాస్త్రిగారు

శ్రీమత్కొప్పర వంశేజాతౌ సుబ్బార్యోరమణశ్చేత్యుక్తౌ
ఏతౌభూమిమలంకుర్వాణౌ ధీరౌసద్గుణసంపద్యుక్తౌ

ఏతౌహిసోదరావస్మిన్ నగరే సత్కృతౌజనై
స్తయోర్దర్శనమాత్రేణ పరిపూర్ణ మనోరధైః

సూరివరేణ్యులాశుకవిశూరులు గంటకునాల్గు నూఱ్లసా
ధారణశక్తి యుక్తి బుధతండము వల్లెయనంగఁ బద్యముల్
ధీరతఁ జెప్పినారుగద ధీవరులార! యుదారులార! యా
శారద యీ సురూపముల సభ్యులు మెచ్చఁగఁ దాల్చియున్నదౌ

విద్యామహిమఁ జూచి వినుతింపుమందురా
         కవిచక్రవర్తులే ఘనులుగారె
ఆశుకవిత్వంబు నల్లుటయందును
         బాలసరస్వతుల్ ప్రథితులిలను
శతఘంటకవనంబు సమధిక స్థితిసల్ప
         సుబ్బార్యరమణులే శూరులెన్న
అష్టావధానంబు నతిదక్షత నొనర్పఁ
         గవికులసింహముల్ గణుతికెక్కి

రరయ నేత్రావధానంబు సరణిఁదెల్పి
కొప్పరపు వంశశుక్తిలోఁ గొమరుమిగులఁ

బరఁగు ముక్తాఫలంబులై వాసికెక్కి
రట్టివారలు విబుధు లత్యధిక మతులు

శతావధానాశుకవిత్వధీరౌ అష్టావధానేప్యసహాయశూరౌ
తథాబుధౌనేత్రవధానశక్తౌ నారాయణో రక్షతుపండితౌ తౌ

పెళ్ళూరుశ్రీనివాసేన కృతాన్యేతాని పండితాదృష్ట్వా
అత్ర స్థితాన్ హి దోషాన్ క్షంతుంయుష్మాన్ భజామ్యహంవై

బాపట్ల కోర్టు ప్లీడరు

బ్రహ్మశ్రీ చంద్రమౌళి చిదంబరరావు పంతులుగారు

శ్రీలసమానకొప్పరపురీమణిదీప కవీంద్రులార! నీ
లా లలనామనోహర విలాసపదాబ్జమరందపాన కే
ళీలలితాత్ములార! సఫలీకృత కారణజన్ములార! నే
కేలు మొగిడ్చి మ్రొక్కెదనొగిన్ గవిసోదరులార! మీకిటన్

కవులంజూచితిఁబండితాగ్రణులఁ బెక్కండ్రం గనుంగొంటి భా
రవిముఖ్యాదిమహత్కవీశ రచితోద్గ్రంథంబులన్ వింటి పె
క్కవధానంబులఁగాంచితిన్ వివిధ విద్యానాధులన్ జూచితిన్
భవదీయోరుకవిత్వధారగల యీ ప్రాగల్భ్యముల్ గంటినే?

కవితాధారయొ లేక ధూమశకటోగ్రవ్యగ్రవేగంబొ కా
క వియత్తుంగతరంగసంగతమహాగంగాప్రవాహంబొ యం
చు వివేకుల్ కవివర్యు లెంతయును నౌత్సుక్యంబు దీపింపఁగా
సువినీతిన్ విరచింప నేరికగు నేచ్చో మీకె గాకీధరన్

సరసకళాస్వరూపయగు శారద మీముఖరంగమందు సుం
దరతరలీల నృత్యము ముదంబునఁ జేయునటంచుఁ బండితో

త్తరులనఁ గాదు వాణియవతారము నిక్కము కొప్పరంపు సో
దర కవియుగ్మమియ్యది యధార్దమటం చెద నాకుఁ దోఁచెడిన్

రసవదలంకార రమణీయవృత్తముల్
         కోరిన సంఖ్యకుఁ గొదువలేదు
ధారాప్రమాణంబుఁ గోరిన నైగరా
         జలపాతమునుగొని కొలువవచ్చు
దీర్ఘసమాసంపు తెరువుగావలెనన్నఁ
         గాదంబరీకావ్య కలనఁజూపు
భావగాంభీర్యాది పరిణతిఁగాంచిన
         భవభూతి గౌరవ ప్రభ వహించు

సుబ్బరాయకవీశ్వర సూరివినుత
వేంకటరమణకవిమణి వేడ్కమీఱ
మీ కవిత్వంబు వర్ణింప నాకెగాదు
తలలు వెయిగల్గు చిలువకుఁ దరముగాదు.

రంగదుత్తుంగ తరంగసంగతగాంగ
         భంగవేగము సరివచ్చు నేమొ
ధావదుగ్రవ్యగ్ర ధారణాధికధూమ
         శకట వేగముకొంత చాలునేమొ
ప్రావృట్సమయభూరి పర్జన్యుఁ డంపెడు
         జడివాన రయమైనఁ జాలునేమొ
రాము నమోఘ శస్త్రవితాన గమన వే
         గముకొంత వెంటరాఁగలుగునేమొ

కాని యితరంబు ధారుణిఁగానరాదు
నిరుపమాఖిల కవి వర్ణనీయ విమల

చాతురీడ్య భవత్కవిత్వాతిధార
కెన యనంగను దలపంగ ననువుగలదె

కవితామాధురియొప్పుధారయు నలంకారప్రభారీతి శ
బ్దవితానంబున సౌష్ఠవంబు రసవంతంబై మనోరంజక
త్వవిధిన్ గూరుచుశయ్యచొప్పు వహవా పాండిత్యసంపత్తి యె
య్యవి లేవే కవితస్? రసజ్ఞులకు మోదాంకూరముల్ పుట్టఁగన్

వర జయంత్యస్వయాభరణంబు రామధీ
         రాగ్రణి యొక్కరుఁ డమలయశుఁడు
వావిలికొల్ను సుబ్బారాయకవిచంద్రుఁ
         డాంధ్రవాల్మికి బిరుదాంకితుండు
సకలభాషావేది శాంతుండు చెన్నాప్ర
         గడ భానుమూర్తి సత్కవివరుండు
చతురవచోవిలాసయుతుండు శతఘంట
         వేంకటరంగ కవిప్రవరుఁడు

సంస్కృతాంధ్ర కవిత్వ విశారదులు ర
సజ్జు లనుపమ ధిషణా నిశాంతులెల్ల
సాక్షులుగనుండు మీకవీశ్వరతనెట్లు
కాదనుచు నెంచి వచియింపఁగల్గువాఁడ

పండితులౌదురో యలఁతిబాలకులో సురభాషలోసు ధీ
మండలి శాస్త్రవాదములు మాన్యతఁ గాంతురొ యవ్వియేల యు
ద్దండసరిత్తరంగ సమధాటిమహత్త్వ కవిత్వవైదుషీ
మండనులార! మీకవిత మాకు మనోహరమయ్యె నియ్యెడన్.

మును మనసార వల్లెయిడి పోఁడిమితోఁ బఠియించినట్టివా
నినె పఠియించురీతిఁగడు నేర్పునఁజెప్పు కవిత్వశక్తి మీ

యనుపమధారణామహిమ యన్నిట సన్నుతిపాత్రమయ్యెనో
ఘనకవులార! మీకవితకన్నను బూజ్యతయొండుపొందునే?

బ్రహ్మశ్రీ పంగులూరి వీరరాఘవయ్యగారు

శ్రీరమణీమనోహరుఁ డశేషజనోద్ధరుఁ డిద్ధకీర్తివి
స్తారుఁడు సత్యరూపకుఁడు దైవశిఖామణి భక్తలోకమం
దారుఁ డుదీర్ణమానసుఁడు ధర్మవిచారుఁడు రామమూర్తి మి
మ్మారయుఁగావుతన్ గడుఁ జిరాయువొసంగి నిరంతరంబిగిన్

మీకవితావిలాసములు మీపదగుంభనముల్ సదాగతిన్
వీక హసించు సత్వరకవిత్వములున్ గడునొప్పుశ్లేష ల
స్తోకపుభావగర్భముల సొంపులు మేలుపమానపంక్తులున్
మీకె తగున్ మహాసభ లమేయతరంబుగఁజేసి పండితా
నేక బహూకృతుల్ వడసి నిర్మలకీర్తివహించినట్టియో
శ్రీకరకొప్పరంపుకుల సింధుసుధాకరులార! నానుడుల్
చేకొనరయ్య మీరిపుడుచేసిన యీయవధానమెంతొ స
వ్యాకృతినొప్పఁ గాంచితిని భావపురంబున నీసభాజనుల్
ప్రాకటమోదమొందిరను పల్కునుబల్కఁగ నేల నాదు మో
దాకలనంబు మీకుసుమదామము లర్పణఁజేతునన్నచో
వాకెసఁగంగ నీపురనివాసు లధీశులు సన్మహోత్సవా
నేకములాచరించిరట నేర్పరులై తగు పెక్కుమంది ద్ర
వ్యాకృతిచేత నూటపదియాఱులొసంగిరి వేఱెయియ్యఁగా
నాకిటశక్తిచాలమి ఘనంబుగ నుత్పలమాలికావళుల్
తేకువఁగూర్చియిచ్చితి నతిప్రమదంబున నూఱువేలుగాఁ
గైకొని సంతసింపుఁ డల కల్వలఱేఁడొక జీర్ణతంతువున్
జేకొని సంతసింపఁడె యశేషజనైక సుఖప్రదాతయై

ఆశుగ జవంబుఁబోలు మీయాశుధార
అమృతధారకుఁబురుడు మీయాశుధార
ఆర్యహృదయంగమంబు మీయాశుధార
శుభగమతులార! సోదర సుకవులార!

బ్రహ్మశ్రీ కర్లపాలెపు సూర్యనారాయణరావుగారు

శ్రీకొప్పరపు కవిశ్రేష్ఠులు మనపురం
       బందున నిన్న నేఁడందముగను
నాశుకవిత్వంబు నవధానమహిమంబు
       సలిపినవార లత్యలఘుమహిమ
వారివాగ్దోరణి వర్ణింపవేయినో
       ళ్ళభుజంగ రాయండు లఘువుననియెఁ
గీర్తివర్ధనుఁడైన కృష్ణాభిధానుండు
       సంతోషవారిధి నెంతొమునిఁగెఁ

గానవీరిని వర్ణింపఁగాఁదరంబె
నాదుబోంట్లకునైనను నామనంబు
నందుఁగల సంతసంబున నిందునిలిచి
నాను వేఱేమిచెప్పఁగా లేను నిజము.

గ్రుక్కవిడువక నొక్కటనుక్కు మిగిలి
గ్రక్కు గ్రక్కునఁబల్కెడు పెక్కులైన
యక్కరపుముక్కలప్పక్కి జిక్కి నెక్కు
చక్కనయ్యకుఁజెప్పఁగ మిక్కుటంబె

తురంగగతివృత్తము

అనయము మనమున ముదమున నగజాత్మజన్ నెలకొల్పుచున్
వినయమునను దమవినుతులను నవీనము నొనర్చుచున్

ఘనమగు మదినిలకడయును ననఘంబునౌ కవితారుచుల్
గను కవివరులకుఁ దురగయుగము గానుకంచు నొసంగెదన్

తురంగగతివృత్తము

వినుతి గలకవనమున మనుజుల వేడ్కలన్ దగఁ దేల్చుచున్
వనజములఁ దినకరుఁడు ననయము వాసిగా దయఁజూచున
ట్లనయము సుజనుల హృదయములు మహాముదంబును జెందఁగాఁ
గను కవివరులకుఁ దురగయుగము గానుకంచు నొసంగెదన్.

శ్రీ గంగరాజు పున్నయ్యగారు

బిరుదుల నెన్నియో పడసి పెక్కు సభల్ ఘటియించి పండితుల్
నిరుపమ సత్కవిత్వ రమణీయులు వాజ్నిధులంచు మెచ్చఁగా
నఱమరలేక యాశు కవితార్భటిఁ జారుతరావధానముల్
గఱపెడి మిమ్ముఁ బావనులఁ గాంచిన యిప్పురి పున్నెమెట్టిదో!

మీ కావ్యామృత మాధురీ మహిమయున్ మీధారణా శక్తియున్
మీకున్నట్టి సుయోజనాతిశయమున్ మీవాక్య సందోహమున్
వీఁకన్ గన్గొని భారతీ ప్రియుఁడు నువ్విళ్లూరు “నా సృష్టికిన్
జేకూరెన్ గద సార్థకత్వ” మనుచున్ నిక్కంబుగా సత్కవుల్

అడిగినఁ బ్రశ్న నల్కఁగొని యట్టిటు పల్కుచుఁ ద్రోసివేయ కే
నుడివితి రయ్య లెస్సయగు నూత్నవచో రచనా చమత్కృతిన్
వడి వడిఁ గావ్య సంతతుల వైఖరిఁ దెల్పెడి యాశుధార మీ
యడుగుల మ్రోలనే నిలిచె నద్దిర! మీదగు భాగ్య మెట్టిదో!

నిష్కళంకులు మీకైత నిక్కువముగ
మెచ్చుచుండ నీర్ష్యాళువుల్ మెచ్చకున్న

లోటు మీకేమి గలదొ యాలోకమాత
భారతీదేవి మీ జిహ్వఁ బాదు కొనఁగ.

శతలేఖినీపద్య వితతిని వర్షించు
         కవిసార్వభౌమాంక ఘనులుమీరె
గంటకాలంబులోఁ గావ్యముల్ రచియించు
         కవిసార్వభౌమాంక ఘనులుమీరె
గాఢసమస్య లెక్కనుజేయకే చెప్పు
         కవిసార్వభౌమాంక ఘనులుమీరె
ప్రౌఢపదార్ధాది భావంబులొడఁగూర్చు
         కవిసార్వభౌమాంక ఘనులుమీరె

బాపురే భాను చంద్రుల పగిది మీర
లాంధ్ర లోకంబు వెలయింప నవతరించి
యశము గాంచుచు నున్నార లతులితముగ
ననుజ సత్కవులార! గుణాఢ్యులార!

శ్రీపూసపాటి రంగనాయకులుగారు

సజ్జనోత్తములార! యో సభ్యులార!
యిక్కవీంద్రులఁగూర్చి నే నెలమితోడఁ
జిన్ని పద్యంబులనుగూర్చి చెప్పువాఁడ
వినఁగ వేడెద మిమ్ముల ననఘమతులు

పరగ శతావధానములఁ బట్టణసీమల సల్పినట్టి కొ
ప్పరపుఁగవీంద్రులార! బహుభంగుల మిమ్ములసన్నుతింప నా
తరమగునే వినుండిఁకను దప్పుల నెంచకుఁడయ్య ప్రీతిఁ జం
దురునకు నూలుపోగిడిన దోసమటంచుఁ దలంపన్యాయమే

ధారణఁజూచి యల్ల కవితాసతి వీరిని వీడియుండినన్
గౌరవ మెట్టు లబ్బునిఁక నాకని యిక్కవిరాజరాజులన్
జేరెనటంచు నెంచెదను జెప్పఁగ నేటికి వేయిమాటలా
తీరునఁగాకయుండిన సుధీరులు వహ్వరె యంచు మెత్తురే

ఎవ్వ రెట్టి సమస్యల నియ్య నపుడె
వలదటంచును బలుకక నలఘుమతులఁ
బూర్తిఁజేసినయట్టి మీ పూర్వపుణ్య
ఫలమదేమొకొ కొప్రంపు వాసులార!

భారతవర్షంబు పావనంబుగఁ జేయఁ
         బరమేశ్వరుఁడు మిమ్ము పంచెనొక్కొ
పూరుషాకృతినిచ్చి భారతీ దేవి న
         ప్పరమేష్ఠి జగతిపైఁ బంపెనొక్కొ
మీతల్లిదండ్రులు ప్రీతి నోచిననోము
         ఫలము లీరీతిగాఁ బరఁగెనొక్కొ
కలరిప్పటికి మహాకవులను వారి వా
         క్యములు రూపంబులు గాంచెనొక్కొ

యనుచు మిమ్మెల్లవార లత్యంతగరిమ
సంస్తుతించుచునున్నారు సకలదిశల
మీయదృష్టంబునకు నింతమేరకలదె
యనుజ సత్కవులార! గుణాడ్యులార!

మిమ్ముఁబోలిన కవులను నమ్ముఁడయ్య
యెచటఁగానము మీతోడ నిచ్చకంబు
లాడుటయెగాదు మేమట్టు లాడనేమీ
వచ్చునది కొప్రపుం గవివర్యులార!

జగతిలో మిమ్ముఁ బోలిన సత్కవులను
కొందఱినినైనఁ బుట్టించి కోర్కెమీఱ
భరతవర్షంబునకు మేలు నెఱపుకొఱకు
వినుతిజేయుచునున్నాఁడ విశ్వనాథు.

దేశరాజాన్వయాగార దీపమైన
కృష్ణయ బుధుండు సమధిక కీర్తిశాలి
సభకు నధిపతియై చాల సంతసింపఁ
జేసితిరి మిమ్ము దేవి రక్షించు గాక.

బాపట్ల నుండి ప్రయాణమై వెడలునపుడు చెప్పిన పద్యములు

బ్రహ్మశ్రీ వేంకట సుబ్బరాయ కవిగారు

వైరులు దుర్విచారులయి వాగి కడుంగడు నింద సేయ భా
షా రుచిరత్వ మేర్పడఁగ సత్యమసత్యమెఱుంగఁ గోరి మే
లారసి యస్మదీయ విజయధ్వజ సంస్థితి నొప్పి సద్యశో
భారముఁ గొన్న భావపుర వాసులఁ గాంచన వాసుఁడేలుతన్.

బ్రహ్మశ్రీ వేంకట రమణ కవిగారు

అజరాధీశ దిశా సరిద్విటతటోద్యద్దేవ భూజంబవై
భజమానార్య కదంబవై తనరు నో బాపట్ల పూరిందిరా
రజనీశాస్య! సతంబు సోదర కవీంద్ర స్థాపితంబైనదౌ
విజయస్తంభముఁ బ్రోవుమీ త్రిజగతీ విఖ్యాతి దీపింపఁగన్.