Jump to content

కొప్పరపు సోదర కవుల కవిత్వము/పంగిడిగూడెము శతావధానము - II

వికీసోర్స్ నుండి

శ్రీమత్కనకదుర్గాంబాయైనమః

అక్టోబరు 1921 దుర్మతి సంవత్సరాశ్వయుజ మాసమున

నవరాత్ర వ్రతమహోత్సవములలో జరిపిన

పంగిడిగూడెము సంపూర్ణ శతావధానము - II

శ్రీమద్దివ్యశతావధాన శుభగోష్ఠీ శ్రేష్ఠముల్ గాంచి ప్ర
జ్ఞామాన్యుల్ కవిపండితోత్తమ రసజ్జక్ష్మాపరుల్ హర్ష వా
గ్ఘైమాలంకరణద్విపోత్సవ ముఖాహ్లాదంబులీఁజేయు నీ
వోమన్ రమ్ము! శతావధానకృతి నేఁడో దేవి విశ్వేశ్వరీ!

పల్లీపట్టణరాష్ట్రసీమల, సభాభాగంబులందింతకున్
మల్లీసూనమరందసార కవితామాహాత్మ్యముంగూర్చి వి
ద్వల్లోకభ్రమర ప్రమోదరుతులొప్పందీర్చి తీవట్లె రం
జిల్లంజేయుము నేఁడు నాగనృపుగోష్ఠిన్ రాజరాజేశ్వరీ!

1. శ్రీ రాజావారి శమీపూజా ప్రయాణము

వృషభాశ్వరధహర్ష సుషమాతిశయులు రా
          జోత్తమబాంధవు లొక్కవంక
హర్షప్రదాయి గజారోహణోత్సవ
          యుత సత్కవిద్వయ మొక్కవంక
శంపాలతాశత సంస్ఫురత్ఖడ్గ స
         ముద్భటభటరాజి యొక్కవంక
లఘునాళికోద్దితాలఘునాదచకిత జం
         తూత్కర వీరౌఘ మొక్కవంక

హితబుధోద్యోగి పరిజనప్రతతులొక్క
వంక నుష్ట్రాశ్వతతులొక్క వంక రాఁగ,
సామజేంద్రంబుపై నెక్కి జమ్మిపూజ
కేగె నయ్యారె! నాగనరేంద్రమౌళి

2. సమస్య: వనమా సాహసమింత చెల్లదుసుమా బాగోగులూహింపుమా

ధనమానంబులఁగొల్ల వెట్టి కులగోత్రవ్యక్తిఁ బోఁదటి దు
ర్వనితా సంగమమెచ్చఁబెట్టి పగళుల్ రాత్రుల్ ననున్మోహ పా
శ నిబద్ధాత్మునొనర్చె దేమిటికి? నీ సౌభాగ్యమెన్నాళ్లు, యౌ
వనమా సాహసమింత చెల్లదుసుమా బాగోగులూహింపుమా!

3. బేతాళుఁడు

ప్రమథగణరుద్ర గణయుతుఁ
డమలుఁడు ప్రత్యంగిరా హయాకారుఁడు భ
క్తమనోభీష్ట ప్రదుఁడరి
దమనుఁడు బేతాళుఁ డోముతను నాగనృపున్

4. పంగిడిగూడెము, ధరాస్వర్గము

అభివర్ణనీయంబు లగు మహాశ్వంబు లు
          చ్చైశ్రవోముఖ్యాశ్వసమితిగాఁగ
నుత్తుంగమత్తేభయూధంబు లైరావ
          ణాది దివ్యేభచయంబుగాఁగ
విబుధహర్షక్రియావిలసత్సభాలలా
          మంబు సుధర్మాసమజ్జ్యగాఁగ
నున్నతప్రాసాద ముద్యాన మల వైజ
         యంత నందన వనాగ్ర్యములుగాఁగఁ

బరిజనము సర్వసుమనః ప్రకరముగాఁగ
రాఘవాంబామణియు నాగరాజవిభుఁడు
శ్రీ శచీంద్రులుగాఁగ భాసిలు జగత్ప్ర
శస్తిఁ బంగిడిగూడెంబు స్వర్గగరిమ

5. సమస్య: రారాతమ్ముఁడ, రారయన్న యనియెన్ రాజాస్య ప్రాణేశ్వరున్‌

సారాత్రావు టనర్ధ హేతువది లజ్జా జ్ఞానమర్యాదలన్
నీరుంజేయుట నిక్కమిద్ది వినుఁడా నీరుం గడుంద్రావి దు
ర్వారంబౌ కయి పెక్కమైమఱచి నిర్వస్త్రాంగయై నవ్వుచున్
రారాతమ్ముఁడ! రారయన్న యనియెన్ రాజాస్య ప్రాణేశ్వరున్
 

6. పాదచారిత్వమున శ్రీరాజావారు దేవీపూజానిర్మాల్య విసర్జనముం గావించుట

కరులన్‌వీడి, విచిత్రపుష్యరథసంఘాతంబులన్ వీడి, మో
టరులన్‌వీడి, హయంబులన్‌విడి, నిరూఢంబైన భక్తిన్ శివా చరణార్చావినియుక్తపూతతరపూజాద్రవ్యనిర్మోచనం
బు రహిం గాల్నడఁదీర్చు నాగవరదేవున్ దేవి రక్షింపదే.

7. రెండద్దముల నడుమనుండెడి మనుష్యుఁడై

మువురు మనుష్యులనొక రీ
తి విరించి సృజించె ననఁగ దీవ్యత్ప్రతిబిం
బవిధిన్ గననయ్యెడు భూ
ధవ! ముకురద్వయమునడుమఁ దానెవఁడున్నన్

8. వర్షము, దసరామహోత్సవము

వానపిశాచమట్లు గడుభంగమొనర్పఁదొడంగెఁ బోవఁగా
మానసమొప్పదెట్లయిన మానవనాయకుడుంగవీంద్రులు
న్బూనిక నేన్గునెక్కుటఁగనుంగొనిపోయెదమంచుఁ బ్రేక్షకుల్
మానక, యెంచుచోఁజనియె, మాయగవాన, ఘటిల్లెవేడుకల్

9. రాజావారి స్కూలు

బాలురపైఁ గలదయ భూ
పాలుండీ నాగవిభుఁడు భవనంబిడి జీ
తాలిచ్చుచుండెఁగావున
స్కూలువెలయఁ జేయవయ్య సుబ్బారాయా!

10. శ్రీ రాజావారి వేఁట ప్రయాణము

మాకున్ మాపరివారమర్త్యులకు క్షేమంబుంగటాక్షించి బా
హాకౌక్షేయకముగ్ర జంతుదళనోద్యత్సారముంజేసి మ
మ్మేకాలంబును బ్రోవుమంబ! యనిముందేకాగ్రతన్ గొల్చి తా
వీకన్ వేఁటకుఁబోవు, నాగవిభు దేవీసత్కృపల్ సెందవే!

11. శ్రీరాజావారు చిఱుతపులిని, బేతాళునకు బలియిచ్చుట

కఱకున్ దంష్ట్రలుఖడ్గశాతనఖముల్ క్రొర్యోగ్రరావంబులం
దఱకుం దందరనావహింపఁగ మదౌద్ధత్యాకృతిన్‌మీఱు న

చ్చిఱుతన్‌డగ్గఱి, లీల, ఖడ్గహతిచేఁ జెండాడి బేతాళుఁడె
త్తఱిహర్షింపబలిన్ ఘటించు నరనేతన్ శూరులెన్నందగున్

12. నీచానీచజనసాంగత్య భేదములు

కడులాభంబగుఁగాక, నీచజనసాంగత్యంబు గర్హ్యంబగుం
గడునష్టంబగుఁగాక శ్రేష్ఠజనసాంగత్యంబు గ్రాహ్యంబగున్
బెడఁగౌ, గాడిదనెక్కినిక్కిచనుకంటెన్, వాజిపై నేగుచుం
బడినన్, గౌరవమే ఘటిల్లు, నది సర్వశ్లాఘ్యమౌ ధీమణీ!

13. దేవునిపై నెంతభారముంచవలెను?'

తనకృత్యంబులలోని లోపశతముందర్కింపఁగాఁబోక, దే
వుని నిందించుట తప్పుకార్యముసెడన్ మూఢత్వమౌనద్ది గా
లిని దీపంబిడనిల్చుటెట్లు? మతికల్మిన్ సర్వముందీర్చి, దే
వునిపైఁగార్య ఫలంబులన్నిలుపుటొప్పుంగాక సర్వేశ్వరా!

14. ధనవంతుని కుచితకృత్యములు

ధనవంతుండగునాఁడు మైమఱవకౌదార్యంబు సైర్యంబునున్
వినయంబున్, క్షమయుంబొసంగ యశమన్వేషించిధర్మాత్ముఁడై
మనుటొప్పున్ ధనమస్థిరంబని నిజాత్మన్నమ్ముచున్ దీపముం
డినయప్డే! యిలుచక్కఁబెట్టుమనుటన్జింతించి శేషాహ్వయా

15. సమస్య : బంగ్లాలోనికిదారియెద్ది చెపుమా? బాలా! కురంగేక్షణా

ఆంగ్లంబందు మనోజ్ఞవైఖరి నుపన్యాసంబులన్ సల్పఁగా
నాంగ్లేయప్రభుఁడెంచిపిల్వఁగ సహాధ్యాయుండుముందేగె నెం
దుంగ్లాంతింగనకుండఁదోడ్పడఁగ నేనుంబోదు వారున్న యా
బంగ్లాలోనికి దారియెద్ది? చెపుమా! బాలా! కురంగేక్షణా!

16. ప్రస్తుతకవులకుఁగలిగిన గజోత్సవాది సత్కారములు

ప్రకటప్రాభవులై రసజ్ఞమయులై భాసిలుభూపాగ్రణుల్
సుకవిశ్రేష్ఠులఁదన్పియిప్పగిది సుశ్లోకాఢ్యులైరంచుఁ బ్రే
క్షకలోకంబుగణింప నాగనరరాట్చంద్రుండుమాకిందు వా
ర్షికసత్కారముతో గజోత్సవము దీర్పించెన్ బుధౌఘోత్తమా

17. శ్రీ రామచంద్రస్వామి

తావకనామసుధారసరుచియెల్ల
          వాణీశవంద్య శర్వాణి యెఱుఁగు
భవదీయపదరజోలవమహత్త్వంబెల్ల
          గౌతమమౌనీంద్రు కాంత యెఱుఁగు
త్వన్మహాబాహు దర్పప్రభావంబెల్ల
          జనకపూజిత శైవచాప మెఱుఁగు
యుష్మదమోఘబాణోగ్రప్రయోగవై
          భవలీలయెల్ల భార్గవుఁడెఱుంగు

శ్రితజనప్రీతియెల్ల సుగ్రీవుఁడెఱఁగు
నిరతశరణాగతత్రాణ బిరుదమెల్ల
నావిభీషణుఁడెరుఁగు నీయఖిలమహిమ
లేమెఱుంగుదు మేలు మో రామదేవ!

18. ఉత్తమాధముల వాక్యములు

దంతిదంతంబుబలె స్థిరత్వంబుఁ జెందు
నుత్తమముఖోద్గతంబయియొప్పుపల్కు
అధమువాక్యంబు తద్విధంబందఁబోక
చలనగతిఁ జెందుఁ గూర్మశీర్షంబుభంగి

19. గరుత్మంతుఁడు

వినతాసతీసుపవిత్ర గర్భారణి
          ననలాకృతిజనించి నట్టిమేటి
గజకచ్ఛపాశన గ్రహణావసరమున
          వాలఖిల్యాశీస్సుఁ బడసిన ఘనుఁ
డమరావతిని శతారాయుధునిర్జించి
          యమృతభాండముఁ గొన్నయట్టి దిట్ట
కద్రూతనూజుల కాంక్ష నిర్వర్తించి
          జనని దాస్యంబు మాన్పిన సమర్ధుఁ

డధికమహిమాసనాథు రమాధినాథు
వాహనాకారమునఁ గొల్చు భవ్యుండెవ్వఁ
డట్టి విహగేంద్రు నసమమహత్త్వసాంద్రుఁ
దలఁప విష బాధలడఁగుఁ గాంతయసమాఖ్య

20. భూమికి “మేదినీ” నామ మెట్లు వచ్చెను - సుగంధి

కైటభాఖ్యుఁడున్ మధుండుఁ గ్రవ్యభుగ్వరుల్ నిరా
ఘాట బాహుశక్తి బ్రహ్మఁ గంజజన్ముఁగెల్వ రాఁ
బాటనంబు సల్పి చక్రి వారి మేద మెల్లెడన్
మీటి చల్లె దాన ధాత్రి మేదినీప్రథంగొనెన్

21. శ్లోకమునకు భాషాంతరీకరణము

పలుకులఁదేనెలూరువహిఁబల్కి మనంబు శిలోపమంబుగా
ఖలుఁడిల రేఁగుపండు వలెఁగన్పడెడుం బయి కెట్టులున్న న
త్యలఘుదయారసం బొదవ హర్షముఁగూర్చునునారికేళపున్
ఫలమునుబోలిసజ్జనుఁడు భావవిదుల్ గణియింత్రు సర్వమున్

22. పార్వతీ పరమేశ్వరులు

వాక్కునర్థంబనఁగ నైక్యభావమొంది
యుపనిషత్తులు వినుతింప నొప్పుజగము
తల్లి దండ్రుల కెపుడు వందనశతంబు
లిత్తు మా పార్వతీ పరమేశ్వరులకు

23. బాలకృష్ణమూర్తి విగ్రహము - మత్తకోకిల

నేలఁబొర్లుచువచ్చియున్నవనీత పాత్రములోనికిం
గేలుసాఁపి గ్రహించి ప్రక్కలుగ్రిందుమీఁదునుజూచుచుం
జాలినంత భుజించుచుం దనజాడఁగాంచు యశోదకున్
బాలలీలలుసూపు కృష్ణుని బాలవిగ్రహమద్దిరా!

24. శ్రీరామ చరిత్రము

దశరథనామ భూధవునకు జనియించి
          గాధేయ యజ్ఞ రక్షకతమించి
గౌతమదార నిర్గత పాపఁగావించి
          జనకు మెప్పించి సీతనువరించి
భార్గవరాముగర్వము సర్వముహరించి
          పితృవాక్యపాలన స్థితిభరించి
ఆ వాలిఁద్రుంచి సుగ్రీవుమైత్రి గడించి
          వనధిబంధించి రావణువధించి

అధిపునిగ విభీషణులంక కాచరించి
క్ష్మాజతో నభిషేక సౌఖ్యములఁగాంచి
సానుజుండయి విశ్వజనీనమహిమ
మించురఘుపతి మిమ్ము రక్షించుఁగాత

25. గయుని నిమిత్తము కృష్ణార్జునులు కలహించుట సుభద్రాదుల తలంపు

ఇరువురు వినకుండి రెవ్వరీపోరాపఁ
          గలరొ? యంచు సుభద్ర కళవళింప
నొక్కటికన్ను వేఱొక్కటి చెవియయ్యె
          నెట్లంచు వసుదేవుఁడెదఁదపింప
నేటికివచ్చెనేఁ డీమాయ గయుఁడంచు
          దేవకీదేవి లోదిగులుఁ జెందఁ
గ్రీడిస్వభావంబు నేఁడైన హరిబుద్ది
          కెక్కదే యని హలి యెంచి తెలుపఁ

గార్యగతులెంచి, కౌరవ గణమునొంచి
గయుని మన్నించి, కవ్వడి గారవించి
స్ఫూర్జితాస్త్రోప సంహారములఘటించి
హర్షమొదవించెఁదనవారి కచ్యుతుండు

26. సమస్య : పాముపడగనీడ నెలుక బాగుగఁ బండెన్‌

భీమమగుజాతి వైరం
బేమాత్రము లేక మైత్రి యిమ్ముగ విఘ్న
స్వామి పదాభరణంబగు
పాముపడగ నీడ నెలుక బాగుగఁ బండెన్

27. కవీశ్వరుల నితరులకంటె హెచ్చుగా నేలగౌరవింతురు?

అనిలుఁడుదక్క దేహులకుఁ బ్రాణసుఖస్థితిఁగూర్పలేరొరుల్
కనుఁగొననట్లు, సత్కవి యొకండె వివేకులకీర్తి, ధాత్రియుం
డిన వఱకుంచుఁ గాకొరులు నేరరు తద్విధికంచు సత్కవీం
ద్రునొరులకంటె నెక్కుడగఁదోప బహూకృతుఁజేతురుత్తముల్

28. సమస్య : సరసునివైపు వీపు నలచాన మొగంబటు గోడవైపునన్‌

సరసుఁడొకర్తుఁ గూడెనని స్వాంతమునం గడునీర్ష్యంజెంది సుం
దరియటు గోడవైపునకుఁ దా మరలంగ నసత్యమంచు నా
సరసుఁడు వెన్నునానుకొని సాంత్వన వాక్యములాడఁదోఁచెడున్
సరసునివైపు వీఁపు నలచాన మొగంబటు గోడ వైపునన్

29. శ్రీరాజావారి గుఱ్ఱపు సవారి - తరలము

శతమఖుండలనిక్కు వీనుల జక్కినెక్కి విహార మి
ట్లతిచమత్కృతి తోఁపఁజేయునటంచు నెల్లరుమెచ్చ, ధౌ
రితక రేచితమఖ్యముల్ గతిరీతులొప్పెడు తేజిపైఁ
జతురతానిధి నాగభూపతి స్వారిసల్పఁ గనం దగున్

30. వాక్ళూరుఁడు - కార్యశూరుఁడు

అధముడు స్త్రీలచెంతఁదనయాప్తులచెంతఁబ్రగల్భవాక్యముల్
పృథులముగాఁగఁబల్కు నరవీసముఁగార్య మొనర్పలేఁడు కీ
ర్తిధనుఁడు తాశ్రమంబనక తీర్చుసమస్తము తద్విధంబులం
బ్రథితపుసాక్షులుత్తరుఁడుఁబార్ధుఁడు, నాగనృపాలశేఖరా!

31. లక్ష్మీదేవి రాణిగారిని రక్షించునట్లు - భుజంగప్రయాతము

నమత్సర్వగీర్వాణి నానార్దిలోక
ప్రమోదప్రదస్వాంత భర్మాంగి శ్రీమ
ద్రమాదేవి తానాగరాడ్దర్మపత్నిన్
క్షమన్ సర్వసౌభాగ్యగాఁ బ్రోచుఁగాతన్

32. చిత్రపటములు గల శ్రీరాజావారి సభాభవనము

ప్రాతర్వేళల రాత్రి వేళలఁ దలంపం జూడ నత్యర్ధమై
పాతివ్రత్యముచే సురూపములచే భాసిల్లు స్త్రీవిగ్రహ

వ్రాతం బుత్తమరాజరూపపటముల్ రాజిల్లుటం బ్రాజ్ఞ సం
జాతంబొప్పుట నాగభూవరసభాసౌధంబు వంద్యంబగున్

33. కవులు, పండితులు

కవులుంబండితులంబుదాంబుధులనంగా నిత్యమన్యోన్యవృ
ద్ధివిధుల్ సల్పుచునుందురా, సుకవులెంతేఁగావ్యముల్ గూర్పఁద
త్సువిశేషంబులు దెల్పి పండితవరుల్ శ్రాతృప్రతానంబు న
ర్హవిధానంబులుదీర్పఁజేయుదురు ధీరా! భానుమూర్త్యాహ్వయా!

34. భరతమాత

భాసురసుమపత్ర, ఫల, లతా, వృక్ష, సుం
          దరతరారామబృందములుగల్గి
ముక్కారుపంటలు, మిక్కిలిపండించు
          జీవ నదీనద శ్రేణిగల్గి
అమితభాగ్యోన్నతు లమరించుమణి, హేమ
          రజతాదిలోహకరములుగల్గి
నిఖిలమహాయంత్ర నిర్మాణ శాస్త్రాప
          దేశదివ్యగ్రంధ రాశిగల్గి

వీరజననీ, సతీ, పుత్త్రవితతిగల్గి
పొలుపుమీఱు భవత్పుణ్యభూమి, యీతి
బాధలొందకయుండఁ బ్రోవంగదమ్మ
భద్రకరుణాగుణోపేత! భరతమాత!

35. శ్రీరాజాగారి తండ్రిగారును, గీర్తిశేషులును, నైన శ్రీరాజా బొమ్మదేవర నరసింహనాయఁడు బహద్దరు జమీందారువారి ఛాయాపటము

పొదనుండి కవియుబెబ్బులి నెదుర్కొని భాహు
            విక్రమంబునఁగూల్చు వీరుఁడంచు

మదమెత్తి పరువెత్తు మత్తేభములవెఱ
          పందించు సింహసత్త్వాఢ్యుఁడంచు
భరతునిభంగిగా బహువిధక్రూర మృ
          గక్రీడవర్తించు ఘనుఁడటంచు
ఎట్టిదుర్ఘటకార్యమేనిఁ గన్గొనినంత
          నిరుపమంబుగఁదీర్చు నిపుణుఁడంచు

సారె కెవ్వానివిందుమా శూరసింహుఁ
డగునృసింహావనీశు ఛాయాపటంబుఁ
గన మహాద్భుత ముదయించె వినుటకంటె
నార్యసన్మాన! రామకృష్ణాభిధాన!

36. శివుఁడు తదేకదృష్టితో గంగను జూచుచున్నట్లుగానుండిన గంగావతరణము చిత్తరువు - పృచ్ఛకుని సంశయమునకు సమాధానము

అతివంగాంచిన నెంతవానికిని మోహావేశమౌనంచుఁ ద
ద్గతబుద్ధిన్ శివుఁడూర్ధ్వదృష్టి నలగంగన్గాంచు నట్లెంచరా
దతివేగార్భటితో భగీరథునికై యభ్రస్థలిన్బాసి యీ
క్షితివ్రయ్యన్బఱతెంచు గంగ నిలుపన్శీర్షంబుఁ బైకెత్తుటౌ

37. నూతనముగఁ జేయించిన పెద్ద పడకకురిచి - భుజంగ ప్రయాతము

నవీనాకృతిన్ శిల్పనైపుణ్యమొప్పం
గవీశాభిగణ్యంబుగా విష్ణు పర్యం
క వర్యంబుతోఁ బోల్పఁగా నాగభూపా!
భవద్భృత్యుఁ డీకుర్చి బాగొప్పఁ దీర్చెన్

38. సమస్య : పూవుంగుత్తులు సోకినంతఁ గమలెన్ బొందమ్మిక్రొంబూసరుల్‌

దేవేంద్రాత్మజుపై విరాళిఁగడు నుద్దీపించు కామాగ్ని నా
సా వజ్రంబు మహేంద్రనీలమగుటన్ శైత్యక్రియల్ సల్పుచో
గోవిందానుజమేనుఁదీవ సొబగుల్ గొల్పించు వక్షోజపుం
బూవుంగుత్తులుసోఁకినంతఁ గమలెన్ బొందమ్మిక్రొంబూసరుల్

39. సూర్యచంద్రగ్రహణసమయముల స్నానాదులొనర్చుటెందులకు?

దినకరుఁడున్ నిశాకరుఁడు దేవనియోగముఁజెంది సర్వలో
కనికరసౌఖ్యవృద్ధులనుగల్గఁగఁజేయు మహోపకారు లా
ఘనులకు రాహుకేతు లపకారులొనర్చెడు పీడమాన్స స
జ్జనతతిస్నాన, దాన, జప, సద్విధులన్ భజియింతురీశ్వరున్

40. శ్రీ రాజావారి హెడ్జవాబునీవీను కాదంబరి వేంకటరావుగారి పద్ధతి

మొగమాటమనుమాట మొదలెలేకెట్లు తా
            నెఱుఁగునో యటె వచియించువాఁడు
తనకార్యమునకంటెఁ దానాత్మనమ్మిన
            స్వామికార్యముశ్రద్ధ సల్పువాఁడు
ఆంధ్రాంగ్లభాషలయందన్ని వ్యవహార
            ములకనువగు ప్రజ్ఞగలుగువాఁడు
పల్కులందొకరీతి పనులయందొకరీతి
            గాని నిష్కాపట్య మూనువాఁడు

మాటయందొకయించుకమార్దవంబు
లేదనుటెకాని యాత్మలో లేశమైన
లేదు కాఠిన్యమతఁడనళీకమతి వి
భాసి వేంకటరావు సూ భానుమూర్తి!

41. దేవీపూజ స్వయముగ నొనరించిన ప్రభుదంపతులు

శ్రీయుతులై మహావిభవసింధువులై, యతిసౌకుమార్యసం
స్త్యాయులునై సతంబుఁగడుశ్రద్ధయు, భక్తియుఁదోపఁబూజలన్
స్వీయకరాంబుజంబులను జేయుటనీ ప్రభుదంపతుల్ జగ
ద్ద్యేయ యశశ్శుభోన్నతులు దేవికృపన్ గ్రహియింపకుందురే

42. శ్రీ రాజదంపతుల బంధుప్రీతి

ఏమఱుపాటుగా నయిన నింత యనాదృతిఁజూపబోవరీ
ప్రేమయు, నిట్టి గౌరవగరిష్ఠతయుం గనమెందు, జానకీ
రాములఁబోల్పవచ్చు మన రాఘవసాధ్విని నాగభూపునం
చీమెయి, బంధులెల్లరువచింపఁగ వింటిమి మిమ్ముభూవరా!

43. సమస్య : అందఱు నందఱే మఱియు నందఱు నందఱె యంద ఱందఱే

కొందఱు సంస్కృతాంధ్రములఁ గొందఱు ద్రావిడ కన్నడంబులం
గొందఱు యావనాంగ్లములఁ గోవిదులిట్టి ఘనుల్ భవత్సభా
మందిరమందు గౌరవ సమగ్రతనుండిన వారలెన్న నీ
యందఱు నందఱే మఱియు నందఱు నందఱె యందఱందఱే

44. అశ్వత్థ వృక్షము

ఎద్దానిచిగురుల ముద్దచేరక్తగ్ర
          హణ్యతిసారాదు లడఁగిపోవు
సిద్దానిఫలచూర్ణ మెల్ల స్త్రీపూరుషు
          లకును దేజోవృద్ధులను ఘటించు
సంతానకాము లేక్ష్మాజంబు నారాయ
         ణ స్వరూపమని ధ్యానంబొనర్త్రు

నోటిపూతల నెగమీఁటి రసపుఁబట్లుఁ
           దలఁగించు నెద్దాని త్వగ్రసంబు

వర్ణనప్రౌఢులెద్దాని పత్రమొక మ
నోహరాంగంబుఁ బోల్తు రనోకహముల
పంక్తియందగ్ర గణ్య మశ్వత్థమద్ది
పెమ్మరాడ్రామలింగాఖ్య విజ్ఞపుత్ర!

45. శరత్కాలము

కనుఁగొననొప్పుఁగాలువల కట్టలఁబూచినరెల్లు పెన్పొదల్
తనరు లసత్సరోవర వితానములన్ నవపుండరీకముల్
జనసుఖదంబులై యెసఁగుఁ జల్లని తెల్లని పండు వెన్నెలల్
జనవర! తావకామలయశచ్చవి శారదవేళ నెంతయున్

46.వేఁట

దుష్టమృగబాధలుడిపి విశిష్టసాధు
జంతువులఁబ్రోవ వివిధశాస్త్రప్రయోగ
లక్ష్యసిద్దులెఱింగి యుల్లాస మొంద
గౌతమాదులు వేఁట ముఖ్యమని రధిప!

47. ద్వారకా తిరుమల

స్థిరకృపవేంకటేశ్వరుఁడె క్షేత్ర విభుండయిప్రోవ ద్వారకా
తిరుపతి సేవ్యమయ్యెఁ బెదతిర్పతినా వడుగుల్ వివాహముల్
జరుగుసతంబుభక్తి మెయిసల్పుచునుందురు ధర్మకర్తలై
తఱి సకలోత్సవంబులనుదారులు మైలవరప్రభూత్తముల్

48. పెద్ద తిరుపతి

తిరుపతిక్షేత్రరాజమని దేవసముల్ స్తుతియింత్రు వేంక టే
శ్వరుఁడు తదీశ్వరుండచటసర్వమహోత్సవముల్ ఘటిల్లు న
వ్వరదుఁడుసంశ్రితప్రతతివాంఛితముల్ ఫలియింపఁబ్రోచుఁబెం
పిరవుగ నేడకొండల పయిన్వసియించిన దేవుఁడాతఁడే

49. సమస్య : పనులుగావు సొంతపనులుగాక సీసములో

బెడఁగైన దంతపు బీరువాలివ్వి మ
          ద్రాసు శిల్పులకుఁ జిత్రము ఘటించు
మర్దళవీణాది మహితవాద్యములివి
          సకలగాయకుల సంస్తవము నొందు
దృఢపరికరములౌనినుప పెట్టియలివి
          సీమదొరలమెప్పుఁ జెందఁజేయు
రమ్యంబులగు నీలిమ్రాను కుర్చీలివి
          బొంబయివారి కబ్బురముగూర్చు

పద్మభవునకేని బ్రతిసెప్పనొప్పుశ్రీ
నారసింహనృపుఁ డొనర్చెనవ్వి
యన్యదేశశిల్పు లరుదెంచిచేసిన
పనులుగావు, సొంతపనులుగాక

50. ప్రశ్నమునకుఁబ్రత్యుత్తరము

పోలేపెద్ది సువంశ భూషణుఁడు సద్బుద్ధి ప్రవృద్ధుండు ని
ష్కాలుష్యోక్తిమధుప్రసారుఁ డుచితజ్ఞత్వంబునన్ మేటిభూ
పాలా!మున్ గుడివాడఁబిల్చి మము సంభావించె సమ్యక్సభన్
ధీ లేఖర్షభ దేశికుల్ సుకవితాధీరుల్ నుతుల్ సల్పఁగన్

51. శైవ వైష్ణవాది, వివిధమతములవారు, వివిధ విధముల సేవించుట వలన దేవుఁడొక్కఁడే యనుటెట్లు?

అంబరిల్లయనన్, గొడుగనఁగ ఛత్ర
మనఁగ, నాంగ్లాంధ్ర, దైవభాషాంతరముల
నొక్కవస్తువయిన యట్లె, యొప్పుదేవుఁ
డొక్కఁడయి పెక్కునామంబు లొనర ననఘ!

52. అదృశ్యుఁడగు దేవుఁడుండెనని తెలియు టెట్లు?

చలితములౌమహీజములశాఖ లగోచరుఁడైన వాయువుం
దెలిపినయట్లు, జ్యోతిషముతీఱు పరాగవిధంబుఁ దెల్పున
ట్టుల, భగవంతుఁడుండుటకడున్ ధ్రువమంచును, దెల్పుసృష్టి వృ
ద్ధి, లయము, లన్న కార్యములె, తేటగ నింక వచింపనేటికిన్

53. లక్ష్మీనివాసస్థానములు

శూరులబాహులన్ సుకవిసూక్తుల సాధ్వులయాననంబులన్
వారణ, వాజివర్యముల, వారిరుహంబుల, గోవృషంబులన్
సారసుగంధపుష్ప, ఫల, చారువనంబుల, సస్యభూములన్
హారిహిరణ్యరౌప్యముల, నద్దములన్ సిరియుండు మాధవా!

54. శమీపూజా సమయ ప్రయాణక్రమము

మొదలుర్వీశ, కవీశ, దంతియుగ, మాముందప్సరస్సంశయా
స్పదలౌవేశ్యలనాట్య, మక్కెలనదైవ ప్రార్ధనార్యాళి, ప్ర
క్కదెసన్ బంధులుఁబ్రాడ్వివాకు, లితరగ్రామాగతుల్‌రాఁ గడు
న్మదిఁబొంగించెను జమ్మికేగెడు ప్రయాణంబెల్ల వాద్యంబులన్

55. మద్రాసులో శ్రీకానాటు ప్రభువును శ్రీరాజావారు సందర్శించి చనుదెంచుట

ఈనాఁటికొదవిన కానాటునృపు సభ
          నున్నతోచితపీఠ మొనరుటకును

ప్రసిడెన్సిఁబాలించు ప్రభులువిల్లింగ్డను
          ప్రభృతుల పరిచితి పరఁగుటకును
రాజులతో, మహారాజులతోడ స్నే
          హప్రసంగానంద మమరుటకును
వేమవరాన్వయ రామదాససుధీంద్రు
          గౌరవప్రేమముల్ గాంచుటకును

రాజ్ఞితోఁదత్సహోదరప్రముఖకార్య
సచివ పరిజనములతోడ శ్లాఘ్యనగర
చిత్రములఁగాంచి పురినెమ్మిఁ జేరుటకును
హేతువగుదేవి నృపు నిత్య మేలుఁగాత

56. సికిందరాబాదునగరవైశ్యవరేణ్యులు శ్రీరాజావారిని తగువిధముల గౌరవించుట

శ్రీ సికిందరబాదు సెంటరుస్టేషను
          నందు "ట్రయిన్ డిగ్గి” రన్నయంత
రత్నాకరుఁ గుబేరుఁ బ్రతిసేయవచ్చు నై
          శ్వర్యనిధుల్ పురీవైశ్యమణులు
మేలుమోటరుల, బగ్గేలనెదుర్కొని
          పుష్పదామముల నామోదమొసఁగి
మంగళతూర్యముల్ మహినిండమ్రోయ నూ
         రేగింపుటుత్సవ మెలమిఁదీర్చి

ఇద్దవిభవాఢ్యుఁడగు జగదీశుహర్మ్య
రాజమందుంచి యే నరరాజమౌళి
నర్హ గౌరవములఁ దన్పిరట్టినాగ
నృపవరు, నుతింపఁదగు, రామకృష్ణరాయ!

57. తొమ్మిది పదయేనుగా నయ్యెననుటకు

నవరాత్రవ్రతసూత్సవ
మవిరతదీక్షలనుబెంచి యనఘాత్ముఁడు నా
గవిభుండొనరించుట, రా
ఘవ! తొమ్మిదియే, పదేనుఁగా సాఁగెఁజుమీ

58. శిష్టులను పరాభవింపఁబూనినవాఁడేమగును?

పరులన్ శిష్టులనిర్నిమిత్తముగఁదాభంగింపఁగాఁబూను ము
ష్కరుఁడెందేనియు దైవవంచితుఁడునై కష్టంబులంజెందు ధ
ర్మరతస్వాంతులఁబాండుపుత్రుల నలంపంబోయికౌరవ్యుఁ డె
ల్లరునవ్వన్ మును జిత్రసేను వలనన్ లావేది కీడందఁడే?

59. వేఁడిపాలు త్రావిన పిల్లి

వేఁడిపాలు త్రావి పెదవి కాలిన పిల్లి
తక్రమిడిన నమ్మి త్రావఁబూన
దొకట భంగ మొదవ, నొగిని దద్రూపకా
ర్యములు సంశయాస్పదములుగావె?

60. దసరాలో మహోత్సవములఁదిలకింప నితర పట్టణములనుండి వచ్చిన రాజబంధువులు

చందు వేంకటకృష్ణ సత్సమాఖ్యా సము
          ద్భాసి సికిందరాబాదు నుండి
చంద్వన్వవాయభూషణమూర్తి యాంజనే
          యఘనుండు బందరునందునుండి
బూరుగడ్డన్వయోదార నారాయణ
          రావునాయుఁడు కంకటావనుండి

కోలపల్యాహ్వయగోత్ర సీతాపతి
          రావు తా సేనాపురంబునుండి

రాఘవఘనుండు ముక్కొల్లుగ్రామవరము
నుండి సర్వేశ్వరాదులత్యుత్తమ స్వ
నగరములనుండి వచ్చి శ్రీనాగనృప కృ
తోత్సవములకుఁగడు హర్ష మొందిరనఘ!

61. ప్రస్తుత కవుల నివాసస్థానమగు కొప్పరమునందలి విప్రులు

ధీలలితుల్, కవీంద్రులు, శ్రుతిస్మృతివేత్తలు తత్ప్రచారులా
ర్వేలనియోగివర్యులు, ప్రవీణులు జ్యోతిషమందు వేద వి
న్మౌళులు వైదికోత్తములు మత్పురియందు వసింత్రు నాగభూ
పాలవరేణ్య! కొప్పరపువారనఁ జింతలపాటివారనన్

62. గాజుచెట్టు

అనఘత్యాగ గుణంబులో వినిమయవ్యాపారుఁడౌనింద్రుఁగా
దని నిన్ దానకళాధురంధరుని నభ్యర్చింప నేతెంచి దే
వనగంబా దివినుండి నొల్లమి భువింబాదంబిడన్ రామి రా
డ్డనమౌళీ! తగె గాజుచెట్టన భవత్సౌధాంతరాళంబునన్

63. చీకటి

రాజు తమిఁజేరునని నిశాభ్రమరచికుర
యమున నీరాడి నీలచేలముఁ గురంగ
నాభితిలకం బసిత భూషణములుదాల్చి
కురులకిడు ధూపమన నిరుల్ వఱలుననఘ!

64. మూఁడు కలవాఁడు పుణ్యవిశేషము గలవాఁడు

ధనవిద్యా సౌజన్యము
లనుత్రితము గల్గుటరిది యవియన్నియు నె
వ్వనియెడఁ జూడంబడు నా
ఘనుపుణ్యవిశేష మఖిల గణ్యంబనఘా!!

65. శ్రీ మైసూరు రాజదంపతుల చిత్రపటము

శ్రీరమతోడవిష్ణుఁడు శచీసతితో నమరేశ్వరుండు భా
షారుచిరాంగితో నజుఁడు శైలజతో శశిమౌళి యా రతీ
సారసనేత్రతో స్మరుఁడెసంగిన భంగిని రాజ్ఞితో మహీ
శూరమహీశ్వరుండమరశోభిలుచిత్రపటంబుఁ గాంచితే!

66. సమస్య: కుట్టకయున్న వృశ్చికముఁ గుమ్మరపుర్వని యెంతురేకదా!

కట్టిఁడి సూర్యనందనుఁడు కార్యమెఱుంగక దుష్టబుద్దియై
చుట్టలు మిత్రులున్ సతులు సూరెలఁగొల్వ సుఖాననున్న వాఁ
డట్టె యిఁకేల తామసిల నాతని త్రుళ్ళడగింపు లక్ష్మణా!
కుట్టకయున్న వృశ్చికముఁ గుమ్మరి పుర్వని యెంతురేకదా!

67. పద్మవ్యూహ నాటక కర్తలగు కాళ్ళకూరి నారాయణరావుగారిని మీరెఱుఁగుదురా?

నీతినిధానమై నెగడంగఁజిత్రాభ్యు
           దయరూపకము సుధాధారఁజేసె
అలవిరూపాక్ష పీఠాధీశుఁడగు జగ
           ద్గురుచే మహాకవి బిరుదమందె

సుకవితావిదులు నాటకరాజ మిదియని
          పొగడఁ “పద్మవ్యూహమును” రచించె
స్వకృతికస్యలనిచ్చె సగుణల సాలంక
          రణల శ్రీ వీరభద్రగుణి మణికి

దుర్మతులవాదముల దుమ్ముధూళిసల్పె
శతవధానాది చిత్రముల్ జరిపె సభలఁ
గాళ్ళకూరి నారాయణ కవివరుండు
జగమెఱుఁగ మేమెఱుంగమే సరసవర్య!

68. నలచరిత్రములోని నీతి

క్షమనన్యుండెటువంటివాఁడయిన ధిక్కారంబుఁగావించి దే
హమనోవాక్కులభర్తఁగొల్చుటసతీన్యాయంబటంచున్ స్వకా
ర్యములెట్లేగిన శ్రేష్ఠుఁడర్హులనుమెప్పందించు టొప్పంచు నా
దమయంతీనలసచ్చరిత్ర తెలుపున్‌ధన్యాత్మ వీరాహ్వయా!

69. సమస్య : కొక్కొరో కోయనుచుఁగోడికూఁతగూసె

కినిసి నవదంపతులుఁ జోరులును శపింపఁ
బ్రభుభటులు నైష్ఠికులుఁ గార్యపరతనేగఁ
దమ్మి గుమ్మడులకు సోయగమ్ము హెచ్చఁ
కొక్కొరోకోయనుచుఁ గోడికూఁతఁగూసె

70. హరిశ్చంద్ర చరిత్రములోని నీతి

తన సర్వస్వము కొల్లవోయినను దాదాస్యంబుచే స్రుక్కినం
దన భార్యాసుతులన్యుపాలయి యవస్ధల్ పెక్కువాటిల్లినన్
మనమందింత యసత్యమొల్లని సుధీమాన్యుండు కీర్త్యున్నతుల్ గనునంచుందగఁజంద్రమత్యధిపుసద్దాథన్ గ్రహింపందగున్

71. సఖీజనోక్తులకుఁ బ్రత్యుత్తరంబులొసంగి పార్వతీదేవి పరమేశ్వరుని వరించుట

కనకాంబరంబునకంటెను రమ్యంబు
          పులికళాసము పువ్వుఁబోణులార
కమల కల్హారాదికముల కంటెనుమేలు
          మదనపుష్పవరంబు మగువలార
నవరత్నహార సంతతులకంటె బెడంగు
          ఫణిరాజహారముల్ పడఁతులార
కర్పూర రజములకంటెను గణ్యంబు
          లాలేపభసితంబు లతివలార

సౌధములకంటె సౌందర్య సంయుతములు
శైలములు సతులార! ప్రశస్త సర్వ
సురవరులకంటె నధికుఁడీశ్వరుఁడు కాంత
లార! యని తెల్పి వరియించె గౌరి శివుని

72. రామేశ్వరము - రామలింగేశ్వరస్వామి

శ్రీమద్బ్రహ్మకుల ప్రసూతుని దశగ్రీవున్ వధింపం దదు
ద్దామాఘంబటఁగ్రమ్మఁ దన్నికృతికిం దారామదేవుండు సీ
తామాహాత్మ్యవతీప్రణీత సికతాత్ర్యక్షుంబ్రతిష్ఠించె లో
కామోదాప్తిగ సేతుసన్నిధిఁ గనుండారామలింగేశ్వరున్

73. జీవాంతము వఱకితరునకు వశముగానివేవి?

పాతివ్రత్యముగల్లు కాంతకుచముల్ వ్యాఘ్రోగ్రదంష్ట్రావళుల్
నీతింబాసినలుబ్దమర్త్యుధనముల్ వీరాగ్రణీపాణి వి
ద్యోతాస్త్రంబులు, నన్యుచేఁబడవు ప్రాణోత్కాంతియౌదాఁక ప్ర
ఖ్యాతి ప్రాంచితదానవైభవ విహారా! నాగధాత్రీశ్వరా!

74. అతిబాల్య వివాహము

అతిబాల్య వివాహము వల
దతి వేలాంబోధి నడుమ నఱ్ఱాడెడు నో
డ తెఱంగుఁగాంచుఁద జీ
విత మనిశము దైవకృపకు వేగిరపడుచున్

75. అర్జునుని యెడల శివుఁడెట్టివాఁడు?

కౌరవగర్వభంజకముగా దయఁబాశుపతంబొసంగి పం
కేరుహబాంధవాత్మజుని గెల్పునకొండుదలంచి తద్విధిన్
వారిజ సంభవాద్యమరవర్యుల నెన్నఁగఁజేసి సాధుర
క్షారతుఁడీశ్వరుండునరుగాఢజయోజ్జ్వలుసల్పె భూవరా!

76. రాజుగారి వేఁట డేగలు

కూలుచు బలవత్ఖగముల
వ్రాలుచు శశకములఁ జిత్రపక్షంబులు నా
భీల ఖర నఖముఖంబు ల
వేలాద్భుతమొసఁగ నాగవిభుసాళువముల్

77. రాజాగారి వేఁట కుక్కలు

విదళించుఁ బులులనైనన్
బెదరించుంగరులనైన వివిధమృగములన్
సదమదము సేయు దిక్కులు
ప్రిదులన్ బొబ్బలిడి నాగవిభు జాగిలముల్

78. రాజాగారి తటాకములు - లయగ్రాహి

ఝమ్మను రవమ్ము శ్రవణమ్ముల కలంకృతి వి
ధమ్మయి ప్రమోద మధికమ్ముసలుపం గెం
దమ్ములను శ్వేతవనజమ్ములను, నీలజల
జమ్ములను మత్తమధుపమ్ములు, భ్రమింపం

గమ్మని సుగంధ పవనమ్ములు, తటమ్ములది
టమ్ములుగనుండిన ద్రుమమ్ముల జనింపన్
శమ్మిడు తటాకనికరమ్ములు, పయోధి సదృ
శమ్ములయి నాగనృపు సమ్మదముఁ బెంచున్

79. సీతను రాముఁడరణ్యమున కేలపంపెను?

అల లంకాపురి సీతసాధ్వియని వహ్న్యాదుల్ దిశాధీశ్వరుల్
తెలుపంజేర్చితి నీయయోధ్య జనసందేహంబుపోఁ దొంటిరీ
తుల దేవావళి తెల్పునంతవఱ కిందున్నిల్పఁగాదంచు శ్రీ
నళినాక్ష్యంశజ సీతఁ గానకనిచెన్ రాముండురాజాగ్రణీ!

80. శ్రీ రాజదంపతులు షడృతువులయందుఁ జేయుపుష్పపూజ

మాధవీమల్లికా కదంబములఁ బద్మ
ములను జేమంతులను గుందములను భక్తి
రాఘవాంబయు శ్రీనాగరాజవరుఁడు
నాచరింతురు, ఋతుషట్కమందుఁ బూజ

81. ధర్మములు - స్రగ్విణీవృత్తము

ప్రాణముల్ బుద్బుద వ్రాతముం జంచలా
శ్రేణులంబోలుటన్ జేతురెంతేని ని
ర్వాణసౌధాగ్ర సౌభాగ్యముంగాంచ ని
శ్రేణులౌధర్మముల్ శిష్టవర్యుల్ నృపా

82. పులిపాక భానుమూర్తి

అలఁతంజెందక పత్రికాపఠన మత్యాసక్తిమై సల్పుచుం
దెలుపున్ సంగతులెల్ల లౌక్యవిధులందెల్వింగడుంజూపు నీ పులిపాకాన్వయభానుమూర్తినయసంపూర్ణుండుయుష్మత్కృపా
కలనంబెంపు వహింప నర్హుఁడు సుధీగణ్యాత్మ! నాగాధిపా!

83. సమస్య: దృఢసత్వంబునఁజీమతుమ్మెఁగదరా! దిగ్దంతులల్లాడఁగన్‌

ద్రఢిమన్మీఱిన పాండుపుత్రుల మహాస్త్రప్రౌడులన్ రాట్పరీ
వృఢలోకాద్భుత విక్రమక్రములనాఁపె న్సైంధవ భ్రష్టుఁడా
దిఢులీంద్రోపములైన నీశ్వరవరాధిక్యంబునంజేసి హా!
దృఢసత్వంబునఁ జీమ తుమ్మెఁగదరా? దిగ్దంతులల్లాడఁగన్

84. ఆశీర్వాదము నభిలషించివచ్చిన పుత్రుఁడగు దుర్యోధనుఁడు - గాంధారి

ఎచట ధర్మంబు వర్తించు నచట జయము
గలుగు ధర్మోజయతియంచుఁ దలఁచి పుత్ర
కదన మొనరింపు మనెఁగాని జ్ఞానపూర్ణ
యగుట గాంధారి దీవింప దయ్యెసుతుని

85. గులాబి పువ్వు

కళుకెసఁగుబాలు పాలబుగ్గ కెనవచ్చు
బంతిపువ్వులకంటె నత్యంతకాంతి
మంతమైయొప్పుఁ బద్మసామ్యమగు రూప
సౌరభంబులఁ బుష్పరాజము గులాబి

86. ఎట్టివారు సభయందుఁ బ్రశంసాపాత్రులు? - మందాక్రాంతవృత్తము

సారాసారజ్ఞులమలయశస్సంగ్రహాత్యాతురాత్ముల్
ధీరుల్, సత్యోక్తులు, వితరణస్దేమ హస్తప్రశస్తుల్
శ్రీరమ్యుల్, త్వత్సదృశు లధికాస్తిక్యభావుల్, కవీంద్ర
స్మేరాలోకాంచితమగుసభం జెందయోగ్యుల్ నరేంద్రా!

87. సూర్యనారాయణమూర్తిగారిని గుఱించి

పాయక, కొప్రపున్ సుకవివర్యులకభ్యుచితోపచారము
ల్సేయుజనంబునేమరుట లేక పరామరిసించి తెల్పుమం

చాయతబుద్ధిమీరునిచినట్లుగ మెచ్చగఁజేసె సూర్యనా
రాయణమూర్తి గౌరవవిదగ్రణి వీవగుటన్నృపోత్తమా

88. సమస్య: పృథ్విన్ సాధ్విసదధ్వచారులను మెప్పించున్ యశంబుంగొనున్‌

ఆ ధ్వాంతాపహరుల్ దిశాపతులు భూ
           మ్యాకాశముల్ స్తోత్ర శ
బ్దధ్వానంబులతో సతీత్వమెఱిఁగింపం
           బంక్తికంఠాసురేం
ద్రధ్వంసిన్ముదితాత్ముఁజేసికొను సీ
           తాకాంత చందంబునం
బృధ్విన్ సాధ్విసదధ్వచారులను మె
           ప్పించున్, యశంబుంగొనున్

89. దుష్కరప్రాసములకును, ఇతర కఠినవిషయులుకును, బ్రత్యుత్తరములు వెంటనే యెట్లుతోఁచును?

భగవతీకృపా ప్రభావంబుచేత దు
ష్కరపుఁ బ్రాసములకుఁ గఠినవిషయ
ములకు నుత్తరములు స్ఫురియించుఁజుమ్మి స
ర్వేశనామధేయ! కృతివిధేయ!

90. సమస్య : సారమహనీయమహిమ కాధారమగుచు క్షీరసముద్రవిషయముగా సీసములో నుండవలయును.

విష్ణువక్షస్థ్సల విహరణ శ్రీధన్యఁ
           గమలాలయాదేవిఁ గన్నకతన
నాదితేయులను దివ్యామృతంబున జరా
          మరణ వర్జితులుగా మనుచు కతన

గల్పక ద్రుమపంచకంబుఁ జింతామణి
          స్వర్గ పాలకునకొసంగు కతన
వెలుఁగు ఱేనికిజోడు గలుగ వెన్నెలఱేని
          సృష్టిఁజల్లని మతిఁజేయుకతన

ధేనువుల నగ్రగణ్యమై తేజరిల్లఁ
గామధేనువు నొదవించుకతన క్షీర
జలధివర్యంబు సర్వ సంస్తవ్యమయ్యె
సారమహనీయ మహిమ కాధారమగుచు

91. ప్రైవేటు సెక్రటరీ శ్రీవెల్లటూరి వీరయ్యగారు

ఊరన్ రాజ్ఞియురాజులేరనుచులోటొందింతుమేయంచుఁబ్ర
జ్ఞారూఢింబ్రయివేటు సెక్రటరీ వీరార్యుండు భావత్క చే
తోరాజీవ వికాసముల్ పొసఁగ సంతోషంబిడెన్మాకు స
త్కారజ్ఞోత్తమనాగభూప! భవదాజ్ఞాయోగముల్ వంద్యముల్

92. సమస్య: పుష్పాస్త్రుండేవఁదేమి సేయుజననీ! పూజ్యుత్మవై యుండీమీ!

దుష్పాండిత్యపు వాదమేల? కృపఁబుత్రున్వీడుమా నన్ను వా
స్తోష్పత్యున్నతు లెన్నియున్నఁదుదకున్ బూదింబడున్ దేహమా
నిష్పాపోపమితంబుఁ దుష్టజగతిన్జిత్రాంగి సానోర్చెదే
పుష్పాస్త్రుండెవఁడేమిచేయు జననీ! పూజ్యాత్మవై యుండుమీ!

93. సమస్య : శుభ్రాదభ్రయశస్కు నభ్రపదువిష్ణుం జేకొనెన్ భర్తగా

ప్రభ్రాజన్మహిమన్ సుపర్వుల సుధంద్రావించెనంచుం బయో
జభ్రూణస్తుతులొందెనంచు నసదృక్సౌందర్యుఁడంచున్ రమా
సుభ్రూరత్నము, చంద్రసోదరి సురీస్తోమార్చితాంఘ్ర్యజ్జయై
శుభ్రాదభ్రయశస్కు నభ్రపదు విష్ణుం జేకొనెన్ భర్తగా

94. నగరు తగరు తొగరు వగరు అను పదములు పదాదులయందుండునట్లు చంపకమాల శివధనుర్భంగము

నగరున శ్రీవిదేహ నరనాథుఁడు సల్పుసమర్చనెన్న కెం
త గరువమూనిచే శివధర్మవిభంగమటంచు నేత్రముల్
తొగరుకొనంగ దాశరథితో భృగువర్యుఁడెదర్ప భీతిమై
వగరుచుతండ్రిఁగన్గొని యపారధృతిన్ రఘువీరుఁడిట్లనున్

95. సమస్య : నానాఁటికిఁ దీసికట్లు నాగంబొట్లూ

ఏనెట్లు సేతుఁగాఁపుర
మీ నాతుకతోడబుద్ధి యేర్పడదయ్యో!
పూనిక నేనెట్లోర్చిన
నానాఁటికిఁ దీసికట్లు నాగంబొట్లూ!

96. వీరభద్రస్వామి - స్రగ్ధర

త్ర్యక్షున్నిందించె, సంబందలఁక కతిమనస్తాపసందగ్ధఁజేసెన్
వీక్షింపన్బంధుఁడే యీవిమతుఁడని యసిన్వీత శీర్షుంబొనర్చెన్
దక్షున్‌భానున్‌శిఖిన్‌దంతములురసనలుందప్పదాటించెఁబ్రోచున్
రక్షాసక్తామరాళిన్, రహిఁదలఁపుసమిద్రౌద్రు నవ్వీరభద్రున్

97. కోటశక్తియగు రణాంకాదేవి - స్రగ్ధర

ప్రాకారస్థానశక్తి ప్రథవెలయువిపద్గ్రావటంకన్, రణాంక
 స్లోకాతీత ప్రభావ న్గొలిచివిజయ సంతోషముల్నాగ నాభ్యో
ర్వీకాంతుం డొందుఁగాతన్ శ్రితులు, హితులు, హర్షింప వర్ధిల్లి నిచ్చల్
రాకాచంద్రాభకీర్తి ప్రభల దశదిశల్ రాజిలం జేయుఁగాతన్

98. విఘ్నేశ్వర స్వామి

శ్రీవిజయప్రమోదములు, సింధుర సైంధవగోవృషాదీశో
భావిభవోన్నతుల్ పొసఁగఁబౌరసుహృత్పరివారవృద్ధులున్
భావుకభంగిఁజెందఁ గరివక్త్రుఁడు భక్తహితుండు రాఘవాం
బావిభునాగనప్రభు నపారకృపారసమొప్పఁ బ్రోవుతన్

99. వేణుగోపాలస్వామి - మాలినీవృత్తము

విపులవిజయలక్ష్ముల్ వృద్ధిగా నాగభూపు
న్నృపకుల మణిదీపున్బ్రీతి రక్షించుమెప్డున్
సుపథహృదయవర్తీ! సూరిసంస్తుత్యకీర్తీ!
విపదగ పవిభావా! వేణుగోపాలదేవా!

100. సూర్యనారాయణస్వామి

నీయంఘ్రుల్, వినతాపదుద్దృత తమోనిర్భేదమున్సల్పి ల
క్ష్మీయుక్తంబులుగా హృదబ్జముల రంజిం చున్సతంబౌట నా
మ్నాయాకారుని నిన్నుఁగొల్చెదము సంరక్షింపవే సత్కృపన్
ఛాయానాయక! భక్తబాంధవ! గ్రహేశా! సూర్యనారాయణా!

సంపూర్ణ శతావధానము సమాప్తము

శతావధాన ప్రశంసా పద్యములు

మునుసంపూర్ణశతావధానము మదాప్తుండైననాగయ్య సే
ట్తనియన్ మీరొనరింపఁగాంచితిని హైదర్బాదునన్నేఁడునా
గన ధాత్రీశ్వరుమ్రోలఁజేయుట వినంగాఁగల్గియేతెంచుటం
గనుభాగ్యంబులభించె వెండియును వేడ్కంగొంటినోసత్కవుల్

అనఁగావిందురసజ్ఞులెందఱొసమస్యాపూరణంబందునన్
ఘనులీకొప్పరపుంగవీంద్రులని, మున్‌గన్నారఁగాగంటి విం
టిని నేఁడీజననాయకేంద్రునిసభన్ నిక్కంబయౌనంటి నే
ననినన్ వ్యర్ధుఁడఁగాను సేతునవధానాదుల్‌విలోకింపుఁడీ

ఎదురంబల్కఁగఁజొచ్చినాఁడితఁడువీఁడేపాటివాఁడంచునన్
ముదురుంజూపులఁజూడఁబోకుఁడు మనంబున్నిల్పుకోలేక ప
ల్కెదమున్ మీకవితాలతాంగివగఁగుల్కెంగాని బాల్యస్థితుల్
వదలన్నేరదు నేఁడు ప్రోడయయిమత్స్వాంతంబుఁజూఱుంగొనెన్

ప్రతిభాసంపద, ధారణాబలము, ధారాశుద్ధియున్‌మీకుసు
స్థితిమైఁబుట్టువుతో లభించెనన సందేహంబులేశంబులే
దతిలోకస్తుతులైన మీకుమఱినేనా సర్టిఫైచేయుటల్?
మతిచాంచల్యముఁజేసి పల్కితిక్షమింపంజెల్లునోసత్కవుల్

అలభోజక్షితిపాలకృష్ణనృపులుద్యత్కీర్తిసాంద్రుల్ కవి
త్వలతాంగిం గడుశ్రద్ధఁబెంచుకతనన్ ధాత్రీధ్రముల్‌వోలెవా
రలనామంబులు సుస్థిరత్వముగొనెన్ రాజేంద్ర నీవవ్విధి
న్సలుపంబూనుటవింటిఁదత్సముఁడఁవైసత్కీర్తిరాణింపవే

పి.వేంకటకృష్ణ కవి

ఇచ్చితిఁగొన్నిపృచ్ఛకుల నీయఁగఁజేసితిఁగొన్ని ప్రశ్న లె
ట్లిచ్చినఁగానివానిద్యజియింప, కదల్పకపూర్తిచేసి నా
యిచ్చనుదీర్చియుంట క్షమియింపుడుచేసినతప్పుఁ జెప్పితిన్
బొచ్చెములేని ప్రేమననుబూర్ణమతింగనుఁడో మహాశయుల్

అభ్రగంగా వేగ మది యెట్టిదో యంచు
          నిసుక ముద్దల నడ్డ మిడిన యట్లు
ప్రళయాగ్ని హోత్రమేపాటిదియో యంచు
          దూది బోరెంబులు త్రోసినట్లు
కడునగాధంబైన కడలి లోతెఱుఁగంగ
          మూర పుల్లను గొల్వఁబూని నట్లు
వేఁడి వెల్గున కెంత వేఁడి గల్గునొ యంచు
          నవనీతపు పరీక్ష నడిపినట్లు

ఆంధ్ర జగమెల్ల శతవధానాది చిత్ర
కార్యముల మెచ్చఁజేసి యఖండ కీర్తి
బిరుదములఁగొన్న మిమ్ము నేఁడెఱుక మాని
చేసితిఁ బరీక్ష, సైచి నా చేసినట్టి
యపకృతిని మర్వుఁడయ్య మహాత్ములార!

ప్రథమమౌ బాలసరస్వతీ బిరుద వ
          ర్యము గోపభూపుచే నందినారు
ఆశుకవీంద్ర సింహాంకంబు విక్రమ
          సింహపురంబునఁ జెందినారు
అలచెన్నపురసభయం దాశుకవి చక్ర
          వర్త్యభిధానంబుఁ బడసినారు
అవధానిపంచాన నాహ్వయంబును భావ
          పరకవిబుధులచేఁ బొందినారు

ఇంక బిరుదంబు లెన్నొ గప్రించినారు
బిరుదభూషణహారముల్ వేసినారు
పూర్వకవిరాజ సమకీర్తిఁ బొందినారు
సూరినుతులార! కొప్పరసుకవులార!

విధిఁబోలు వేదము వేంకటరాయ పం
         డితసార్వభౌముఁ డద్భుతధిషణుఁడు
ఆంధ్రవాల్మికి బిరుదాంకుండు వావిలి
         కొల్ను సుబ్బారాయ కోవిదుండు
కవిమౌళి చెన్నాప్రగడ భానుమూర్తి శ్రీ
         పర్ణశాల నృసింహపండితుండు
కావ్యకంఠాంకుండు గణపతి సుకవి, వే
         టూరి ప్రభాకర సూరివరుఁడు

మఱియు వ్యాకరణాచార్య బిరుదకలితుఁ
డైన ముదిగొండ నాగలింగార్యముఖులు
మెచ్చిన కవీంద్రవరుల మిమ్మిచ్చదీరఁ
గొలిచి సేవింప న్యాయ్యమై వెలయునాకు

ద్రావిడదేశ భూధవుల సత్కృతులు స
         త్కవి గౌరవంబును గాంచినారు
ఆంధ్రమండలభూతలాధిప మర్యాద
         లుత్తమకవినుతు లొందినారు
మేచ్చరాజులచే నమేయసన్మానముల్
         పండితస్తోత్రముల్ పడసినారు
ఆంగ్లేయనృపులచే సర్హభూఖండ లా
         భములుఁ బ్రశంసలుఁ బడసినారు

మీ కవిత్వంబు వినుమాత్ర మెచ్చిగౌర
వంబొనర్పని వారి నీవఱకుఁ గాన
మహహ మీరుదయించిన యా ముహూర్త
మెన్నఁదగుఁజుండు సుకవి మహేంద్రులార!

పూర్ణ శతావధాన మిది పూర్ణ సమర్ధత మీరొనర్చుటం
బూర్ణముదంబు మా కొదవెఁ బూర్ణముదం బొనగూడె ఱేనికిం
బూర్ణ యశోబ్దులార! పరిపూర్ణ కళానిధి మూర్తులార! సం
పూర్ణ శుభోక్తు లింపెసఁగఁ బూర్ణకృపన్ నిరంతబుఁ జూడుఁడీ.

దుర్మతి వర్షమందు విబుధుల్ కవివర్యులు సన్నుతింపఁగా
శర్మము గల్గు నాగనృప సత్తమ గోష్ఠి శతావధానముం
బేర్మి నొనర్చి నట్టి కవివీరుల కేసు నమస్కరించెదన్
ధర్మనిదానుఁడౌ నృపవతంసుని కీర్తి ధరన్ వేలుంగుతన్.


(ఈ పద్యముల కర్త యెవ్వరో తెలియదు)