Jump to content

కొప్పరపు సోదర కవుల కవిత్వము/పంగిడిగూడెము శతావధానము - I

వికీసోర్స్ నుండి

పంగిడిగూడెము శతావధానములు

అవతారిక

రసికమహాశయులారా!

ఈచిన్నిపుస్తకమునకుఁ గారణభూతులైనవారు, ఆంధ్రదేశంబునఁ బ్రసిద్ధి వహించిన, సంస్థానములలో నొకటియగు నుత్తర వల్లూరు సంస్థానాధీశ్వరులలో జ్యేష్ఠులును, సద్యశోగరిష్టులునునగు మహారాజ రాజశ్రీ శ్రీరాజా బొమ్మదేవర నాగన్న నాయఁడు బహద్దరు జమీందారువారు. వీరి పూర్వులు జగదాశ్చర్య కార్యకలాపము చేతను, ప్రభుజన ప్రీతికర వర్తనముచేతను జనోపద్రవకారి ఘోరమృగ నిర్మూలన కృత్యములచేతను, ప్రఖ్యాతివహించి దేశాధిపతులగు నాంధ్రాంగ్లమేచ్ఛ ప్రభువరేణ్యులచే వివిధవిధ స్వర్ణబిరుదాలంకార లాంఛన సత్కారములనేకముల గ్రహించి యుండిరి. పూర్వోదాహృతములగు విషయములచే వీరిదిశూర సంస్థానమని నిర్ధారితము కాఁబడినది. ప్రస్తుతప్రభువులకుఁ బితామహులును బితామహప్రజ్ఞా గణనీయులును స్థిరయశఃప్రియులును, విద్యానురక్తులును వితరణశీలురునునైన శ్రీ శ్రీ రాజా బొమ్మదేవర నాగన్న నాయఁడు బహద్దరు జమీందారువారు "యశ ఏవ జన్మఫలతాత్మవతామ్” అను నార్యోక్తిననుసరించి, శాశ్వత యశంబు సంగ్ర హింపనెంచి, యది సత్కవికృత గ్రంథ ప్రభూతంబుగానెంచి సుప్రసిద్ధులును, తెనాలి పురవాస్తవ్యులునునైన బ్రహ్మశ్రీ మతుకుమల్లి నరసింహ కవివరేణ్యుల నిజాస్థాన కవివరేణ్యులుగ నిల్పికొని శ్రీమచ్చెన్నపురీవిలాస ప్రముఖకృతి పరిగ్రహణం బాచరించి కీర్తి లక్ష్మీ పరిగ్రహణం బాచరించికొనిరి. నాఁటనుండి యీ సంస్థానము విద్వత్సంస్థానమనియుఁ బేర్కొనంబడుచుండెను. సర్వవిధములఁ బితామహ తుల్యులైన శ్రీవారు తమ రాజ్యస్థానభాగమగు తోట్లవల్లూరు పట్టణమునకు విచ్చేయుటకు, నంతకుఁ బూర్వమే శ్రీ శ్రీ వేణుగోపాలదేవ మహోత్సవ సందర్భమున శ్రీవారి పినతండ్రిగారి పుత్రులైన శ్రీరాజా బొమ్మదేవర సత్యనారాయణవరప్రసాదరావు బహద్దరు జమీందారు వారొసంగు వార్షికసత్కారమునకై మేమటకు వచ్చి యుండుటయుఁ దటస్థించినందున శ్రీ వారికిని మాకును సందర్శన సల్లాపములు సంభవించినపుడు శ్రీవారికి విద్య యందును మాయందును గల ప్రీతిగౌరవములు ప్రకటితములగునట్లు, అనువత్సరమును వారాచరించు శ్రీదేవీ నవరాత్రవ్రత మహోత్సవములకు మమ్మాహ్వానించిరి. తన్మూలమున మేమును శ్రీవారి విద్యాదరములకు సంతసించి వారి యుద్దేశానుసారముగాఁ బంగిడి గూడెమునకు శ్రీమద్రౌద్రి సంవత్సరాశ్వయుజ మాసారంభమున వచ్చి యట శ్రీవారి యభీష్ట ప్రకారము శతావధానముం గావింపఁగా శ్రీవారందుల కానందించి గజారోహణోత్సవంబుం గల్గింపఁజేసి అయిదునూటపదియాఱులు రూప్యము లొసంగి బిరుదస్వర్ణ మండనములతో రాంకవాదికసువస్త్ర గౌరవంబు లొనర్చి ప్రతి సంవత్సరము ఏతన్మహోత్సవ సమయమున కరుదెంచి వార్షిక సత్కారమందు నట్లుగా నియమపత్రం బొసంగి యానందింపఁజేసిరి. మఱియుఁ దామట్లు సత్కరించుటయే కాక తమ కాప్తులును రసికప్రభువర్యులునునగు మహారాజరాజశ్రీ శ్రీ రాజా కందిమళ్ళ వేంకటరామనరసింహారావు బహద్దరు జమీందారువారి అశ్వారావుపేటలో వారియాస్థానమున మాకవిత్వావధాన విశేషములను జూపం దగినయేర్పాటొనరించి శ్రీవారి సన్మానములచే మమ్మానందితులనుగా నాచరించిరి. మఱియు శ్రీ మద్దుర్మతి సంవత్సరమున శ్రీరాజావారి యొక్కయు బంధువుల యొక్కయు, అభిప్రాయానుసారముగా సంపూర్ణ శతావధానముం గావింపఁబడియె. శ్రీవారి ప్రథమ సందర్శనము మొదలు శ్రీవారికిని మాకును గలుగుచు వచ్చిన సమయానుగుణ ప్రసంగోచితములుగను, ఇతర విషయములుగను శ్రీవారికి సంబంధించినవఱకు మాచే రచింపఁబడిన పద్యములు రాజాలోకమనుపేరుగల వివిధప్రసంగపద్యావళియందుఁజేర్పఁబడినవి. ఈ రెండు సంవత్సరముల సభా సమయములకుం జనుదెంచి అవధానములఁ దిలకించి వ్రాసిన కవుల ప్రశంసాపద్యములలో మాకు లభించినవానిలోఁ గొన్నిటి నిందుఁ బ్రచురించినారము.

ప్రథమ సంవత్సరావధానములోని దేవీస్తవమగు "నీలాంబుజారామకేళీ మరాళమై” యను సీసము శ్రీమద్దుర్మతి సంవత్సరపు, ఉగాది సంచికలో “సంవత్సర ప్రశంస”లో మొదటఁ బ్రకటింపఁబడియున్నది. పద్యముల సందర్భము లందు వివరింపఁబడి యుండుటచేఁ బునరుక్తమగునని యెంచి ప్రత్యేకముగా విషయ సూచిక ముద్రింపలేదు. శ్రీవారికిఁగల ఆర్యమత సంప్రదాయసిద్ధమగు దేవ బ్రాహ్మణ భక్తియు విద్యాదరము నిందుఁ బ్రస్ఫుటముగాఁ గన్పించు చున్నది. ఇట్టి భగవచ్చేవాపరులగు దంపతులకు దైవ మాయురారోగ్యైశ్వర్యాభీష్టఫలసిద్దు లొసంగుఁ గాత!

ముద్రణ ప్రమాద దోషములను గుణజ్ఞులు పాటింపకుందురు గాక.

ఇట్లు,

కొప్పరపు సోదరకవులు

శతావధానులు

1922 సంవత్సరము

శ్రీ మత్కనకదుర్గాంబాయై నమః

పంగిడిగూడెము శతావధానము-1

(అక్టోబరు - 1920)

శ్రీమదిష్టదేవతా ప్రార్ధనము

ఏయంబ బిరుదంబునిప్పించెఁ దొలుదొల్త
          మణికొండభూపాల మౌళిచేత
నేదేవి జయ ఘంటికాదుల నిప్పించె
          మద్రాసు బుధ శిరోమణులచేత
నేతల్లి వేయినూఱిప్పించె ఘటికాద్వ
          యిని బీఠికాపురాధీశుచేత
నేమాత జయ కేతు వెత్తంగఁ బతకంబు
          లిప్పించెఁ బోలనరేశుచేత

నే ప్రసువు, భుజగేంద్రాది సుప్రసిద్ధ
నృపులచే జయ బిరుదాదు లీయఁజేసె
నట్టి మదుపాస్య శ్రీ శివాబ్జాస్య నేఁడు
కూర్మి దళుకొత్త జయ మొనగూర్చుఁగాత!

1. జగదీశ్వరీ స్తవము

నీలాంబుజారామ కేళీమరాళమై
         సామేన శంకర స్వామి వెలయఁ
బవలు రాతిరి సేయు భద్రతాటంకముల్
         దరహాస రుచి ధగ ధగ వెలుంగఁ
ద్రయ్యంతవేణి పద్మజురాణి, హరి రాణి
         చెలికారమునఁ గెలంకుల మెలంగఁ
గెంగేలి రాచిల్క క్రీడార్ధమెసరేఁగి
         ప్రణవాక్షరార్ధ ముపన్యసింపఁ

గమ్రముక్తాఫలామల గగనవాహి
నీ పయఃకణపంక్తి వందే యటంచు
విఘ్నపతి పూజన మొనర్ప విశ్వభరణ
దీక్ష నెలకొన్న దేవి కిదే నమస్సు

2. ప్రకృత ప్రభువును దేవి రక్షించునట్లు

నవరాత్రవ్రతదీక్ష దక్షతనయం ద్రైలోక్యరక్షాచణన్
రవి చంద్రాగ్నివిలోచనన్ శ్రుతిపథబ్రాజన్మహామంత్రరూ
ప, విరాజత్కరుణాంతరంగ నిను, సంభావించు నాగావనీ
ధవు నంచత్కరుణాదృగంచలములందన్పంగదే, శాంకరీ!

3. సమస్య : నవరాత్రవ్రతదీక్ష చెల్లె నిట నానందం బమందంబుగన్‌

కవిరాజుల్, బుధరాజు, లుత్తమధరా
          కాంతుల్, హితుల్ బాంధవుల్
సవనంబంచు గణింప, నిర్మల నయ
          స్వాంతంబునన్, దేవి, రా

ఘవమాంబామణితోడ నాగవసుధా
          కాంతుండు పూజింప శ్రీ
నవరాత్ర వ్రతదీక్ష చెల్లె నిట
          నానందంబమందంబుగన్

4. విష్ణ్వంశజులగు ప్రభువులు

శ్రితచక్రంబుధరింప, సర్వసుమన శ్శ్రేణ్యున్నతుల్ వెంప, సం
తతదీక్షన్ విబుధాపకారి మద విధ్వంసంబుఁ గావింప న
చ్యుతకీర్తిన్ విహరింప భూరమలకున్ శోభల్ గడున్నింప సం
చిత విష్ణ్వంశముగల్గు త్వత్సములకే చెల్లున్నృపాలోత్తమా!

5. దశావతారమూర్తి

వనచర వనచర యుగళము
లనఁగ, ద్విజ ద్విజ యమళము లన, బుద్ధుఁడనం
గను గల్కి యనఁగ విష్ణుఁడు
తనరెన్, దశరూప నామధారియయి నృపా!

6. శ్రీరామచరిత్ర

అనఘులు దేవమౌను లధికార్తిని వేడఁగ నాజిరాజ నం
దనుఁడనఁగన్ జనించి, వసుధాతనయన్ వరియించి పంక్తికం
ఠుని వధియించి, శిష్టుల కనూనశుభం బొదవించినట్టి రా
మునిఁ, గరుణాభిరాముని, నమోయనికొల్వ నభీష్టసిద్ధియౌ

7. కొండ, కుండ, మండ, దండ అను శబ్దములు పాదాంతములందు వచ్చునట్లు శ్రీరాజావారి కాశీర్వాదము

విజయదశమిని బూజల వెలయు కొండ
పట్టి యనురక్తిఁ జూడ నోప్రాశ్నికుండ

సుకృతమణి నాగభూజాని సుకవి మండ
లంబు గణియింపఁ గొనుత శ్రీ లక్ష్మి దండ

8. భారత, భాగవత, రామాయణ గ్రంథములు

విజయ విక్రాంతి విదితముల్, విశ్వరిపు వ
రోగ్ర సేనోద్భవస్మయ నిగ్రహములు
పుణ్యజనవర్ధన క్రియాస్ఫూర్జితములు
పాండు, వసుదేవ, దశరథ భవుల కృతులు

9. విష్ణువు క్షీరసముద్రమును మాని శ్రీ రాజావారి హృదయమున నివసించినట్లు

సారప్రాభవ! నాగభూప! సుగుణాంచ ద్రత్నరాశీ! నయ
శ్రీరమ్యామలభక్తి శాంతిరసవీచీ ప్రోల్లసత్త్వన్మనో
వారాశిన్ సిరితోవసించి హరి, తా వర్ణించునింకం బయో
వారాశిన్ బహుభంగసంగతముగా భావించియత్యంతమున్

10. రాజావారి వేఁట

బారుటీటెలఁబట్టి దూరఁగా రానట్టి
          పొదలెల్లఁదూఱి బెబ్బులులఁ బొడిచి
చిఱుతకత్తులఁ బట్టి చెదరనీయక చుట్టి
          చిఱుతల గుండియల్ చీల్చికూల్చి
కాండ్రంచుఁ బైకొని గోండ్రించు పెను వరా
          హమ్ముల నహమించి క్రమ్మిపట్టి
చెంగు చెంగునదూఁకు జంగుబిల్లుల లేళ్లఁ
          గుర్కురంబులఁబంచి కూలఁజేసి

అశ్వ మాతంగ సుభట మహాంగ వాద్య
చండ రవములు, వనిఁ గలగుండు వెట్ట

వాలు మగఁటిమి నాఖేట ఖేలనంబు
జరుపు నాగావనీశుండు జనకు భంగి

11. రాజసౌధములు - ప్రథమపాదాంత, ద్వితీయపాదాది వర్ణములు “రామా" అని యుండవలయును. - మత్తకోకిల

మోదముంగలిగించువస్తు లమోఘపుణ్యమునిచ్చు రా
మాది దైవతవిగ్రహంబులు నద్భుతావహముల్, సమ
స్తాదృతంబులు శిల్పముల్, ప్రమదాస్పదంబులు చిత్రశ
య్యాదికంబులు, వొల్చు, రాణ్మణి హర్మ్యపాళి సుధీనిధీ!

12. శ్రీ రాజావారి దేవీ పూజ

మన మంబాపదయుగళం
బున నేకాగ్రతను నిల్పి, పుష్పాక్షతలన్
గొని నామావళితోడన్
జనపతి వూజింప, దేవి సంతసమొందెన్

13. సమస్య : కాముఁడు వెన్నెలల్ గురిసెఁ గంతుఁడు బాణములేసెనెచ్చెలీ

నామదినాటుకొన్న యలనాఁడు మొదల్ ప్రిదులంగబోవఁదా
కోమలమూర్తి రూప, మొనగూడదు కార్యము, నిల్వదింకనా
నీమము, కోకిలంబదె ఖణిల్లని ఱంకెలువేసె, రోహిణీ
కాముఁడు వెన్నెలల్ గురిసెఁగంతుఁడు బాణములేసెనెచ్చెలీ

14. ధర్మరాజే, ప్రకృతప్రభువుగా జనించి బేతాళునిఁ బూజించుచున్నట్లు

శరసంఘాతమునున్, ధనుఃప్రకరమున్, సంప్రీతిరక్షించి, యా
దరువై యెప్పిన భూతనాయకుని బేతాళుం గడుంగొల్చి ద్వా
పరమందయ్యది చాల కిక్కలిని గొల్వంబూని యప్పాండు భూ
వర పుత్రాగ్రణి నీవుగా నిటు జనింపంబోలు నాగాధిపా!

15. పాండవులు, స్వస్వప్రభావములచేఁ బ్రసిద్ధిఁబడసి, ప్రస్తుత ప్రభువై యవతరించినట్లు

వరధర్మప్రతిపాదనవ్రతమునన్, వైరిచ్ఛటాగర్వ ని
ర్హరణాత్యుగ్రబలాఢ్యతన్ వివిధలక్ష్యజ్ఞాగ్రగణ్యప్రదం
దురగారోహణ నైపుణిన్ సురభిసంతోష క్రియంబాండుభూ
వరపుత్రుల్ యశమొంది నీవుగ జనింపంబోలు నేకాకృతిన్

16. దసరామహోత్సవములం జూడవచ్చిన జనులు

నాగవాసములసౌందర్యంబు సంగీత
          మాసక్తిఁగని విని యలరువారు
చర్మనాటకములుత్సాహంబుతోఁగాంచి
          పోలుగాడుండమిఁ బొక్కువారు
గజములఁబులుల నక్కజమారఁ జేరి త
          దారవంబులకుల్కి పాఱువారు
శతవధానముఁ జూడఁజాలితిమీనాఁటి
          కంచు భూపాలుఁ గీర్తించువారు

స్వకరపద్మంబులం బూజసల్పు రాజ
దంపతు లితోధికైశ్వర్యధాములగుచుఁ
దనర దీవించువారైరి జనులు నేఁటి
విజయదశమీమహమ్ముల వేంకనార్య!

17. సర్వసామర్ధ్యములు గల్గి సకల వ్యవహారములు స్వయముగా నిర్వహించు శ్రీ రాజావారికి దివాంజీయుండవలెనా?

అన్నిటఁదాసమర్ధుఁడయి యందఱనన్ని విధాలఁ జూచుసం
పన్నతగల్గి గర్వమణుమాత్రమునొందక రాజధర్మముల్
సన్నగిలంగనీయక ప్రజాహితమొప్ప ధరిత్రినేలు నా
గన్న నృపాలవర్యునకొకం డనభిజ్ఞుఁడమాత్యుఁడేటికిన్

18. మత్స్యావతారము

సోమకుఁడను పలలాశి మ
ణీమంజూషోపమాన నిగమచయము, దు
ష్కాముఁడయి వార్దింద్రోయ, మ
హామత్స్యంబగుచు విష్ణుఁ డాఖలుఁ ద్రుంచెన్

19. రాజ్ఞి గారిని గుఱించి'

ఉభయ వంశముల కీర్త్యున్నతుల్ వెలయింప
          జననంబుఁగాంచిన సర్వవంద్య
మేనితోడనుజాయ మెలఁగు చందంబునఁ
          బతి ననువర్తించి పరఁగుసాధ్వి
రేనికిమంత్రియట్లై, నాథునకు సర్వ
          విధుల నుత్సాహంబుఁ బెనుచు సుగుణ
గానంబునందు సుజ్ఞానంబునందు న
          త్యున్నతస్తుతులందు నున్నతాత్మ

పుణ్యముం గీర్తి వాంఛించు పూతహృదయ
నాగనృపవీర పత్నియౌ, నంద్యచరిత
విజయరాఘవమాంబ, దేవీకటాక్ష
సిద్ధి నభిమతశుభవృద్ధిఁ జెందుఁగాత!

20. సమస్య : ఫలముల గొమ్ము, పోవునిఁకఁ బైత్యము వైద్యములేల విప్రుఁడా

వెలఁగల లోఁదలంపక వివేక విహీనత దేవదేవు కో
వెలఁగల వస్తులమ్ముకొని వేలగు మందులు గొంటివన్నియున్
వెలఁగలఁ బోలఁజాలవరవీసము గావున మన్మథాగభూ
ఫలములఁగొమ్ము, పోవునిఁకఁ బైత్యము వైద్యము లేలవిప్రుఁడా!

21. శ్రీ రాజావారి తండ్రిగారిచరిత్రము శ్రీవారి 'శ్రీ మదఖండ' అను బిరుదవర్ణములు పాదాదులయందు వచ్చునట్లు

శ్రీమన్నృసింహధాత్రీనాథవర్యుండు
          భయదమృగాటవీవహ్నియంచు
మహితాత్మ! ఛాయాసమాఖ్యాఢ్య సతిగాఁగ
          నంది సూర్యౌజ్జ్వల్యమమరమీఱి
దయయు, సాహసము నుత్సాహపౌరుషములు
          జగదభి వినుతంబులుగఁ దనర్చి
ఖండపరశ్వధాఖండభక్తివిశేషు
          బేతాళనాథు సంప్రీతిఁ గొల్చి
డమరమునడంచి, నాగరాటముఖసుతులఁ
గాంచి, సుపదాద్యవర్ణవిఖ్యాతబిరుద
గౌరవముఁబొంది, యింద్రసఖ్యమువరించె
బులులరాజని ప్రజలెల్లఁబొగడుచుండ

22. సమస్య : స్థిరశుభంబులొసంగి రక్షింపుమంబ!

కుంకుమాంకితనిశాపంకిలాక్షతములఁ
         బూజ గావించిన పూతచిత్త
కరవీర, మందార, కల్హార కుసుమవా
         రముల నర్పించిన విమలహృదయ
కర్పూర, మృగమద, గంధసారసుగంధ
         బంధురఁ జేసిన పావనాత్మ
శతసహస్రాయుతా ప్రతిమాననామార్చి
         తాంఘ్రిగాసల్పిన యనఘబుద్ధి

శాస్త్రనిగదితసర్వోపచారవిధుల
నిన్ను సేవించినట్టినాగన్ననృపుని
పత్నిశ్రీరాఘవాంబ వినూత్నకరుణ
స్థిరశుభంబులొసంగిరక్షింపుమంబ!

23. ఉదయ ప్రార్ధనము

సరసీజాసనుఁడాయురున్నతి, సరోజాతాప్తుఁడారోగ్యమున్
సరసీజాలయ భాగ్యమున్ హరిసరోజాతాక్షుఁడమ్మోక్షమున్
సరసీజాతహితాహితాగ్ని నయనశ్లాఘ్యాత్మ శ్రీమన్మహే
శ్వరి, సర్వేప్సిత సిద్ధిఁగూర్పఁదలఁతుంబ్రత్యూష కాలంబునన్

24. తిక్కన మంత్రి

ఘనుఁడై పంచమవేదనామకమహా గ్రంథంబు నిర్మించి వి
శ్వనుతాత్యద్భుత ధీసమర్ధతఁ గవిబ్రహ్మాంకముంజెందె న
న్యనృపస్వీకృతరాజ్యమున్ మనుమసిద్ధ్యాయత్తముంజేసెఁ ది
క్కనమంత్రీశ్వరుఁడమ్మహాత్ము నెనయంగా లేరుమంత్రీశ్వరుల్

25. యుగంధర మంత్రి

పరసేనాబలదోర్బలోన్నతులచే బందీకృతుండైన య
న్నరనాథుండు, ప్రతాపరుద్రుఁడు నిజౌన్నత్యచ్యుతింజెంద క
య్యరిసమ్రాట్కృతసత్కృతింబొరయ లోకాశ్చర్య కార్యక్రమ
స్మరణీయుండెవఁడయ్యుగంధరమహామంత్రీంద్రుఁడెన్నందగున్

26. తిమ్మరుసు మంత్రి

పురుహూతప్రతిమాన శ్రీనరస భూపున్ మెచ్చఁగాఁజేసి త
ద్వరసౌజన్యము, తన్మహీశ్వరత, ఠేవం గృష్ణరాయావనీ

శ్వరుఁడొందం గవిరాజకీర్తి రమలన్ వర్దిల్లఁగాసల్పు తి
మ్మరుసున్, మంత్రికులావతంసు జగతీమాన్యున్ నుతింపందగున్

27. ఎట్టివారు మంత్రిపదవి కర్హులు

పతికిన్ భూప్రజకాప్తుఁడై, బహువిధోపాయంబులన్ శాత్రవ
ప్రతతిం గీడ్వడఁ జేసి రాణ్మణికి హర్షశ్రీలు సేకూర్చి ధీ
చతురుండై, పటుకార్యకౌశలుఁడునై సత్కీర్తులంబొల్చునే
మతిమంతుండతఁడే యమాత్యపదసంభావ్యుండగున్ భూవరా!

28. శ్రీ రాజావారి శమీ పూజా ప్రయాణము

హర్మ్యాగ్రతలములం దతిహర్షితాత్మలై
         శుద్ధాంతకాంతలు చూచుచుండ
నిసుమువైచిన రాలనెడములేకుండఁగా
         నర సమూహములు క్రిక్కిఱిసి నడువ
భూరికాహళశంఖభేరికాభాంకార
         రవము తత్రత్యులఁ జెవుడువఱుప
నాగఘీంకృతి, బృహన్నాళికాడాంకృతి
         చెలరేగి దిక్కుడ్యములఁ బగుల్పఁ

బాదఘట్టనముల రజఃపటలమెగసి
సురనదీస్వచ్ఛజలములబురదసేయ
లలితవనమున జమ్మిపూజలనొనర్ప
నాగవిభుఁడేగుదేఱఁ గానంగనయ్యె

29. కామినీకాముకుల చిత్రపటము

తరుణి! భవద్దృగంబకవితానము భ్రూలతికాశరాసనో
త్తరమున నెక్కు వెట్టి బెడిదంబుగ నేర్పఁదొడంగెఁద్వత్సుధా

ధరరుచిరామృతంబొసఁగి, దర్పకుదర్పమడంచియాశ్రితుం
గరుణనునన్నుఁ బ్రోవుమని కాముకుఁడొక్కఁడు వేడుఁగామినిన్

30. ఆంధ్రీకరణము

పగలే నాచెయిఁ బట్టవచ్చెదవు గోపాలా? యిదేవింత మా
మగవారుండిరివీథిలోన నడుగోమామామ చాల్ చాలు, నీ
తగులంబెంతయొ తెచ్చునాకనెడుకాంతన్ లేదులేయంచుఁజి
ర్నగవొప్పారఁగముద్దు పెట్టిచను కృష్ణస్వామి నిన్నేలుతన్

31. తాళ వృక్షము

వర్షాతపములఁ బాపఁగబీదవార లే
         యాకుల గేహంబులల్లుకొంద్రు
కొఱునెత్తురుధారఁగట్టించి గాయంబు
         మాన్పించునెద్దానిమంచుబూజు
ఇనుమద్దిచేవకంటెను ఘనంబగుచేవ
         దేనిమూలంబునఁగానిపించు
మందుమ్రాఁకులకుమార్మసలు నుష్ణవ్యాధు
         లెద్దానిముంజచే నెగిరిపోవు

పొడుగుమానిసిఁగని కడుఁబొట్టివారు
దేనిఁబోల్చెద రద్దానిఁదెల్పఁదగదె
కృష్ణదేవాగ్రజు నిరధ కేతనంబు
తాళభూజంబు శ్రీనాగధారుణీంద్ర!

32. సమస్య : జారకులావతంసమును సాఁకఁదగున్ నృపతుల్ నరేశ్వరా!

సారసుగంధపూరఘనసారమసారమటంచు మేటిప
న్నీరము, కమ్మకస్తురియు నింద్యములంచు సుగంధబంధురం

భై రమణీయమౌపునుఁగునద్భుతభంగిసృజించుగంధమా ర్జారకులావతంసమునుసాఁకఁదగున్నృపతుల్ నరేశ్వరా!

33. మేనకా విశ్వామిత్రులు

గరువంపు “గుఱువంపుటిఱుకు చన్నుందోయి”
          కుట్లూడ్చి రైక గగ్గోలుసేయ
శ్రవణ సరః ప్రాంత సంచరత్‌ఝషములై
          క్రాలుగన్నులు వింతకాంతులీన
రంగు కుందనపు టరఁటి యాకుపైఁ ద్రాఁచు
          సరణి వీఁపునను గీల్జడ నటింప
సర్వాంగ సౌందర్య సహజ లావణ్యముల్
         యోగీంద్రు మనము నుఱ్ఱూతలూఁప

చిఱునగవు వెన్నెలలు సాఁగి చెక్కుటద్ద
ములకుఁదళుకీయ, రాయంచకులుకు నడలఁ
గమ్మతేనియలూరు గీతమ్ముఁబాడి
గాధిభవునాత్మ మేనకాంగన కరంచె

34. కర్ణు దాతృత్వము

కవచముఁ గర్ణకుండలయుగంబుఁ గిరీటి జయస్పృహాప్తి వా సవుఁడరుదెంచికోరెడునొసంగకుమన్పితఁగాంచి యాత్మపె
ల్లవియఁగ నర్యమాహ్వయగతార్ధముఁదెల్పియభీష్టపూరణో
త్సవముననింద్రుఁదన్పెను బ్రదాతృ వరేణ్యుఁడుకర్ణుఁడోసృపా

35. భారత యుద్ధ స్థలమును బాసి స్వర్గస్థలమునకుం జనిన కౌరవ వీరులు అసమవిక్రమరాశి యాపగాత్మజుఁడేగెఁ

గుంభసంభవుఁ డస్తగురుఁడు సనియె

భార్గవుశిష్యుండు బహుళాస్త్రవేది క
          ర్ణుఁడుఁ జేరె వెడలె శల్యుఁడతిబలుఁడు
భ్రాతృవర్గపరుండు రారాజుపోయె వ
          రప్రభావుఁడు సింధురాజు తరలె
వైష్ణవాస్త్రోగ్రుండు భగదత్తుఁడు గతించె
          భూరిశ్రవసుఁ డురుభుజుఁడు గడచె

నరిగిరింక నసంఖ్యాకు లరిదిమగలు
ధర్మదేవత కినుకతోఁ దలఁచుటెఱిఁగి
ధర్మజూదులు పెల్లుబ్బితనరుటెఱిఁగి
భూమిభువనంబువీడి, స్వర్భువనమునకు

36. రాజావారి ధేనువు

అనిమిషనాథు గోవరమునందు, వసిష్ఠమహామునీంద్రు నం
దినియెడ, బాణవైరి వనధి ప్రభునొందఁగఁజేయుబాణధే
ను నివహమందుఁగల్గిన యనూనమహామహిమంబులెల్ల నా
గన వసుధేంద్రు గోగణమునం దనువొంది శుభంబులీవుతన్

37. శ్రీరాజావారి బావమఱదిగారిని శ్రీ రాజావారిని కృష్ణార్జునులతోఁబోల్చుట

ఒకరిసోదరిని వేఱొకరికి భార్యగాఁ
         గల్పించుకొని ప్రీతిఁ గాంచుకతన
సహచరవృత్తిమై సతతంబు నొకచోట
         నొకమాట పట్టునం దుండుకతన
మేనమామ సుతుండు మేనయత్త కుమారుఁ
         డనెడు బాంధవముండు నట్టికతన

నొకరి పురోవృద్ధి కొక్కరుత్సాహంబు
సానుకూల్యముఁ జూపునట్టికతన

ధర్మజాతాతిబలభరోత్సవుల మిమ్ము
నల్లకృష్ణార్జునులఁ బోల్పనయ్యెమాకు
రాఘవాంబిక ప్రబల హర్షమున వినఁగ
రామకృష్ణార్య, నాగభూరమణులార!

38. సత్యవ్రతము

చంద్రమతియు, హరిశ్చంద్ర జనవరుండు
సత్య సువ్రతకాములై, నిత్యకీర్తి
ధాములై రావ్రతంబు నుదగ్ర దీక్ష
సలుపఁజాలినవారు వంద్యులు నరేంద్ర

39. శ్రీ రాజాగారి మేనల్లుఁడు

నీలంపు నికరంపు నిగ్గుముంగురులపైఁ
         గ్రమ్ము నందపుమోముఁదమ్మివాఁడు
మురిపెంపుసొంపుమై ముద్దాడఁగాఁగందు
         పాలబుగ్గల జగ్గుపరఁగువాఁడు
రిక్కవైచినవారి దిక్కుపొర్లుచుఁ జేతఁ
         గ్రవ్వుచుఁ గిలికిల నవ్వువాఁడు
గజ్జలకడియముల్ గల్లు గల్లనిమ్రోయఁ
         జిన్నారితొట్టె రంజిల్లువాఁడు

కృష్ణలీలల కుబ్బి, ముగించి నిద్రఁ
గేకిసలు గొట్టుచును నాలకించువాఁడు
శ్లాఘ్య వేంకట రామ ప్రసాద బాలుఁ
డంబికానుగ్రహమునఁ బెంపందుఁగాత!

40. శ్రీ రాజావారి మేనగోడలు

క్రీడదయివాఱ గోపాలకృష్ణు తోడఁ
బుట్టువందు సుభద్రను బోలఁజాలు
పాపమారావునకు నిఁకఁ బార్థుఁబోలు
పతిని సమకూర్పుమో నాగపార్ధివేంద్ర!

41. ప్రకృత రాజదంపతులవలెఁబార్వతీ పరమేశ్వరులను సేవించినవారెవ్వరు?

సురనాథుండు శచీపురంద్రియు, మనశ్శుద్ధుల్ విడంబింప భా సురసౌధాంతరచంద్రకాంతశకలాస్తోకప్రదేశంబులం
బరమేశీపరమేశులంగొలిచి రాఫక్కిన్, భవానీమహే
శ్వరులంగొల్చినరాజదంపతు లభీష్టశ్రీలఁజెన్నొందరే?

42. శక కర్తయగు శాలివాహనుఁడు

పురుషరూపముఁగొన్న భుజగేంద్రుఁ గూడిన
          యవివాహితకు సముద్భవము జెందె
ఎముక, బొగ్గులు, మృత్తు, నుముక, మంచపుఁగోళ్ల
          క్రింద నుంచిన వైశ్యు కీలెఱింగె
పశు లోహ భూ ధాన్య భాగంబు లెఱింగించి
          విశ్వ వేదిత్వంబు విశదపఱచె
నాగేంద్రుకరుణ, మృణ్మయసేన వజ్ర మ
          యంబుగా నని విక్రమార్కు గెల్చె

వసుధఁ బాలించె నేకోష్ణవారణముగ
నేఁటికిన్ శకకర్తయై పాటికెక్కె
నతఁడు శేషాంశజుండు, పూరితయశుండు
శాలివాహననామ రాట్చంద్రుఁ డనఘ!

43. రాజావారి అశ్వములు

ప్రతిపక్షక్షితిభృద్భయావహగతిన్ వర్తింపనింద్రాశ్వముల్
వితతైశ్వర్యవిచిత్రచిహ్నములు భావింపన్ ధనేంద్రాశ్వముల్
సతతానంతపథప్రచారముల నెంచన్వాసరేంద్రాశ్వముల్
మతినూహింపభవన్మహాశ్వము లసామాన్యాత్మ! నాగాధిపా!

44. బుట్ట దీపములు

నాగనృప! యుష్మదద్భుతానంతకీర్తి
సుప్రతాపద్యుతులు, సోమసూర్యవిభల
విష్ణుపదమందఁబోవఁ దద్విధు లెఱుఁగమి
బుట్టదీపంబు లందురీ భూమిజనులు

45. కర్ణార్జునుల యుద్ధము

శల్యసారథ్య వైశారద్య మొక్కట
          శౌరిసారథ్య కౌశల్య మొకట
కాలపృష్టగుణటంకారంబు లొకట, గాం
         డీవ మౌర్వీ మహారావ మొకట
హస్తికక్ష్యాత్మకంబగు కేతు వొక్కట
         కేసరిసుతరూప కేతు వొకట
ధృతరాష్ట్రపుత్రక స్తుతివాక్కులొక్కట
         వాసవాజాశీస్సువాక్కు లొకట

వెలయ, శస్త్రాస్త్ర పాండిత్యములు, వియచ్చ
రులు ప్రశంసింపఁ గాలరుద్రులను బోలు
కర్ణ పార్థుల రణ మభివర్ణనీయ
మై ప్రవర్తిల్లె, నాఁడు నాగన నరేంద్ర!

46. స్రైర్యాదికములగు సుగుణములు కలవారు స్త్రీలా? పురుషులా?

తెలియం బూరుషకోటికంటె, సతులందే హెచ్చుగాంభీర్యని
శ్చలచిత్తంబులు, సువ్రతాత్మ! యతిహాస్యంపుం బ్రసంగంబువే
ళల నవ్వాపుట, లో రతిప్రియతయెల్లందాఁచుటత్యుత్తమో
జ్జ్వలకీర్త్యార్జన బుద్దిగొంట, యితరాశాత్యాగమున్‌సల్పుటన్

47. గడియారము

గడియారంబుపయుక్త వస్తువుల నగ్రస్థానముంజెందు, న
య్యుడు చంద్రార్కులఁగాననీక జలదం బుగ్రంబుగాఁగ్రమ్ము న
య్యెడఁ గాలంబెఱిఁగించు, సైంధవుని నాఁడియంత్రమే యున్నచో
గడుఁగష్టంబగుఁగాదె? గాండివి ప్రతిజ్ఞం దీర్పఁగాఁ జక్రికిన్

48. సమస్య : జలముజలమ్ములోఁగలిసి సంతమసంబనఁ గ్రమ్మెదిక్కులన్‌

కలకలలాడు పద్మిని వికాసము వీడఁగఁ గల్వచెల్వ మేల్
కొలకొలలాడ, రేచెలి చకోరముతోఁ గనులెత్త, జక్కవల్
వలవలలాడ, నయ్యినునిఁ బాయుట కేడ్చు దినాంబుజాక్షి క
జ్జలము, జలమ్ములోఁ గలిసి, సంతమసంబనఁ గ్రమ్మెదిక్కులన్

49. మణి, మంత్రౌషధ శక్తులు

గణనాతీతముగా శమంతకము బంగారంబుఁగల్గించుటన్
బ్రణుతప్రక్రియఁబాండురాట్సతులఁ బుత్రశ్రీకలంజేయుటన్ రణభూమింబడియున్నలక్ష్మణుఁగపివ్రాతంబుతోఁబ్రోచుటన్
మణిమంత్రౌషధశక్తులద్భుతమహామాహాత్మ్యవంతంబులౌ

50. ప్రభువులు భుజింపఁదగిన వస్తువులు

బలవద్వైరుల గెల్చిభూప్రజలంబ్రోవన్, వ్యాఘ్రసింహాదికా
ఖిల దుష్టోగ్ర మృగావళీవిశసన క్రీడాగతిన్ గోవృషా

దుల రక్షింప, బలంబవశ్యముగ నెందున్ రాజులౌవారికిన్
వలయున్‌గాన, బలడ్యుతిప్రదములౌవస్తుల్ భుజింపందగున్

51. లోకస్తుతికి, గుణము ప్రధానమా? రూపము ప్రధానమా?

కామినిగాని పూరుషుఁడుఁగానిమఱేమియుఁగానిరూపఫున్
గోమునఁబేరుఁగాంచుటొనగూడునె? కస్తురి, కోకిలంబు లెం
దేమిటఁగాంచెఁబేరు గుణమెంతయొ కల్గుటఁజేసిగాక యే
రేమదివాని నల్పుగణియింతురె? దింతురె? తద్గుణస్తుతుల్

52. విద్యాబలము జయప్రదమా? దేహబలము జయప్రదమా?

కేవలదేహశక్తియనఁ గేకలమాత్రమెకాని సజ్జయం
బేవిధిఁ గూర్పనేర దెపుడేని జయం బొనగూర్చు విద్యయే
భూవరునాజ్ఞ నియ్యెడలఁ బోరిన మల్లురఁ జూడమే జయం
బేవఱకేనిఁ గాంచఁదగెనే యల దేహబలాడ్యుఁ డింతయున్

53. పుష్పములలో శ్రేష్ఠమైన పుష్ప మేది?

సూనశ్రేణు లవెన్ని యేనిగల వీ క్షోణిన్ విలోకింప నే
త్రానందప్రదరూపవంతములు, ఘ్రాణామోదసంధానము
ల్గానీ! భూరిపరీమళంబున మహాహ్లాదంబు సేకూర్చు నై
ట్క్వీనుంబోలుప్రసూనరాజమునెటన్ వీక్షింప ముర్వీశ్వరా!

54. శాస్త్రములందు ముఖ్యములైన రెండు శాస్త్రము లేవి?

ప్రాణులకునెల్ల నవయవ ప్రకర మనఁగ
వ్యర్ధమొకటియుఁగాక ముఖ్యంబులైన
వఖిల శాస్త్రంబులందు ముఖ్యములు రెండు
శబ్దశాస్త్రము, వైద్యశాస్త్రము నృపాల!

55. భారతము

తెలుపును, రాజనీతులను దెల్పుమహోపనిషద్రహస్యముల్
తెలుపు సమస్తధర్మములు దేటగఁబంచమవేద సుప్రధన్
వెలసిన భారతంబు కురువీరచరిత్రమనంగఁ బాండు పు
త్రులహరి సర్వసత్వజయధూర్వహులై మనఁజేయలక్ష్యమై

56. సమస్య : మరుఁడుగ్రక్రుధఁదాఁకె శైవవర సామర్ద్యంబుచే శ్రీహరిన్‌

హరిపౌత్రుం డనిరుద్దుఁడం చెఱుఁగకాహా! బాణదైత్యాధముం
డురు దర్పోద్దతిఁబట్టెఁ బౌత్రకుఁదదీయోదగ్రదర్పాంధ్య మే
పఱ శిక్షింపక మాననంచు హరిరానవ్వేళనాబాధితా
మరుఁడుగ్ర క్రుథఁదాఁకె శైవవరసామర్ధ్యంబుచే శ్రీహరిన్

57. రుచిగల పదార్ధమేది?

రమణి సుధాధరంబని కరంబనురక్తిని గాముకుల్, రమా
రమణ కథానులాపమని రాగ విరక్తులు మోక్షకాములీ
క్రమమునఁ బల్కుచో నెదియుఁగాదు మహాకవి వర్యు భవ్య వా
గమృతమె రుచ్యమంచు రసికాగ్రసరుల్ వచియింత్రు భూవరా!

58. మనుజుని బాధించు నగ్నులెవ్వి? వానిని హరించుటెట్లు? - మహాస్రగ్ధర

హరియింపన్‌వచ్చు, నన్నాద్యలఘువిధుల న
          త్యంతమౌజారరాగ్నిన్
హరియింపన్‌వచ్చుఁ గామిన్యతితరరతిసౌ
          ఖ్యంబులన్ మన్మథాగ్నిన్
హరియింపన్‌రాక, దేహిన్ హరువుఁజెఱచుఁ
          గ్రోధాగ్ని యొక్కండె కానన్

వరశాంతిఖ్యాత వృష్టింబఱపి, యడఁచుఁ
         దత్త్వజ్ఞుఁ డద్దాని నార్యా!

59. కీర్తిలేని మానవుని జన్మము - తరలము

పరిమళం బదిలేనిసూనము పంకజేక్షణ లేని మం
దిరము, నీరము లేని కూపము, నీరజాప్తుఁడులేని యం
బరము, దేవుఁడు లేని కోవెల, పండువెన్నెల లేని రా
తిరి యనంజనుం గీర్తిగల్గని దేబెజన్మము ధీనిధీ!

60. మహారాజశ్రీ శ్రీ శ్రీ శ్రీ రాజా నరసింహనాయఁడు బహద్దరు జమీందారువారు - లయగ్రాహి

శూరగణమందుఁ దనపేరు గణనీయమగు
         తీరుల నెఱింగి మృగవారముల సింహ
స్ఫారబలమేర్పడ విదారణమొనర్చి, నిజ
         ధారణిసుఖోన్నతుల మీఱ విజయ శ్రీ
ధారియయి, భూరిబలసారుల నుదారులఁ గు
         మారులను గాంచి నృపవీరయశుఁడై ల
క్ష్మీరమణుసేవకయి చేరె నరసింహవిభుఁడా
         రహితవైరి కెనరారు. పెరవారల్

61. శ్రీ రాజావారి కాశీర్వాదము

శ్రీ వాగ్దేవతధీసమంచిత వచశ్శ్రీ సిద్ధి శ్రీ దేవి ధా
త్రీ విఖ్యాతసురాజ్యలాభశుభముల్, శ్రీ రాజరాజేశ్వరీ
దేవీదృష్టిద్విషత్పరాభవకరోద్దేశక్రియాసిద్ధులున్
భావప్రీతిగఁగూర్చి నిన్‌మనుతురోభవ్యాత్మ నాగాధిపా!


(సంపూర్ణము)

రౌద్రిసంవత్సర శతావధాన ప్రశంసా పద్యములు

శ్రీయుత కొప్పరంపుఁ గవిశేఖరులార! నియోగివంశ ర
త్నాయతనాబ్జులార! కవితా వనితావసతీకృతాత్మ జి
హ్వాయుతులార! ధీరవరులార! నమస్కృతులాచరించి మీ
కీయెడఁ బద్యపంచకమునిచ్చితిఁ గూరిమి స్వీకరింపరే

శారద మీస్వరూపము ప్రశస్తయశోధనులార! సాటి మీ
కేరునులేరు మీకయిత యెందసమాన, వలంతులీరు నా
కోరికదీరఁ బద్యములఁగూరిచి యర్పణం చేసికొంటి మీ
ధారకు ధారణాస్థితికిఁ దద్దయు విస్మయమంది ధీనిధుల్

అవధానంబులు పెక్కు సల్పితిరి రాజాస్థాన రంగంబులన్
బవమానత్వరమించునాశుకవితా ప్రావీణ్యముంజూపినా
రవనీనాథులు సత్కవుల్ బుధులు మిమ్మగ్గించుచున్నారలో
కవిసర్వజ్ఞవతంసులార! పొగడంగా శక్యమే నాకిఁకన్

కరమని రసజ్ఞులెంతొ యాదరముమీఱ
మీకు వేయాఱులొసఁగుచు వీఁకగూర్తు
రర్ధరహితుండనౌటఁ బద్యంబులేను
శక్తికొలఁదినర్పించితి సరగఁగొనుఁడు

తృణమో, కణమో, భక్తిని
ప్రణతుఁడనగు చేనొసఁగితిఁ బరఁగంగొనుండీ
యణువే మేరువటంచని
గణుతించుచుఁ బ్రేమమీఱఁగా మీరెడఁదన్

రౌద్రి సంవత్సరాశ్వయుజ బ౧౧ లు

ఇట్లు.

యామర్తి వేంకటసుబ్బారావు

అకలంకుండు, శతావధాని, కవిరాజాంకుండు శ్రీపాదకృ
ష్ణకవిగ్రామణి, గోపభూపతి సభన్ సంతుష్టుఁడై హృద్యప
ద్యకదంబంబులసంస్తుతించుటలుమున్‌దర్బారులోఁగంటి నే
టికిమిమ్ముంగని మీకవిత్వమునువింటింబుణ్య లేశంబునన్

పవమానత్వరనాశుకావ్యములొనర్పన్ దుష్కరప్రాసముల్
వివిధాలంకృతులందు గూర్చుచుసభన్‌విద్వన్నుతుల్‌గాంచు మీ
రవధానంబున నెట్టిక్లిష్టపు సమస్యల్ పూర్తిగావించినన్
భువినాశ్చర్యకరంబుఁగాదనుచు మద్బుద్ధిన్ వితర్కించెదన్ .

అతులితప్రజ్ఞశతావధానము మీరు
          సేయ సంతోషంబుఁ జెందినాఁడు
బంగారుపతకముల్ భక్తినర్పించియా
          స్థాన సత్కవులుగా సల్పినాఁడు
ఏనుఁగుమీఁద నూరేగించి సభలోన
          నే నూటపదియాఱు లిచ్చినాఁడు
వర్షాశన మొసంగు పత్రంబుగూడ మ
         క్కువ మిక్కుటముగాఁగఁ గూర్చినాఁడు

మును పితామహుఁడౌ నాగభూవరుండు
శ్రీ నృసింహకవీంద్రుఁ గోరినవిధాన
మిమ్ము మా నాగభూపుఁ డిమ్మెయిని గోరెఁ
బ్రేమ దయసేయుఁడో కవి స్వాములార!

పెమ్మరాజు సత్యనారాయణరావు

అనుపమకొప్రపున్‌సుకవిహంసములార! కొనుండుమన్నతుల్
కనుఁగొనినాఁడనేఁటిసభ ఖ్యాతిగఁజేయు శతావధానమున్
ఘనమతినాగభూవరశిఖామణి పండితులున్ గవీశ్వరుల్
కని వినుతించి మిమ్మధిక గౌరవతృప్తులఁజేయుటాదిగన్

అరయన్ గంటకునైదునూఱులగుపద్యంబుల్‌జగచ్చోద్యధీ
గరిమంజెప్పి యసామ్యులీకవివరుల్ కాళీకృపాసిద్ధు లీ
శ్వరలీలామహిమంబుఁజూపజగతిన్ జన్మించిరంచున్‌గవీ
శ్వరచూడామణులేనుతించిన మిమున్ శక్యంబె నాకెన్నఁగన్

ఓ నాగభూప! మాకీ
యానందముఁగల్గజేయు నాఢ్యునకును నీ
కానందనందనుఁడు లో
కానందదుఁడిచ్చునాత్మజానందంబున్

ఇట్లు,

పసుమర్తి కామన్నశాస్త్రి

రౌద్రి సంవత్సర పుష్య శుద్ధ౧ నాఁడు మఱికొన్ని గ్రామముల వారాహ్వానించినప్పుడు ప్రయాణ సందర్భములోఁజెప్పినవి

సర్వకుటుంబభారముఁ బ్రశస్తతరార్హతమ క్రియావళిన్ ధూర్వహుఁడైనవాఁడనుఁగుఁదోడుగృహంబుననుండితీర్పమే
మిర్వుర మీ ప్రయాణము నభీష్ట శుభప్రతిపాదకంబుగా
నిర్వహణంబొనర్చితిమి నేఁటికి నీకృపనో మహేశ్వరీ!

చలివ్రేఁగయ్యె ధనాదిగౌరవ విశేషప్రీతులంగూర్చునా
ప్తులవీడన్‌మనసొప్పదయ్యె జననీపుత్రాదులంజూచుచూ
పులు మెండయ్యెఁబితృప్రయోజనదినంబుంజేరరానయ్యె మే
లొలయన్నేఁటికనుజ్ఞయీయఁగదెమాకోరెడ్డిసీమేందిరా!

మీగురులెవ్వరను ప్రశ్నమునకుఁ బ్రత్యుత్తరము

అనఘజయంతి రామవిబుధాగ్రణి సర్వసుఖంబులొందఁజే
య, నమరభాషనేర్పినమహాత్ముని రామడుగన్వయాబ్ది చం
ద్రుని గురురామకృష్ణ బుధధూర్జటినెంచుచుఁదత్కటాక్షసి
ద్ధినిఁదగువిద్య పేర్మిజగతింజరియింతుము వీరయాహ్వయా!

మత్సహోదరుఁడగు బుచ్చిరామకవిని గుఱించిన ప్రసంగమునుబట్టి పంగిడిగూడెములోఁ జెప్పినవి

ప్రకటప్రజ్ఞశతావధానములొనర్పంగా, మహాశుప్రబం
ధకవిత్వంబునఁబండితస్తుతులనొందంగాఁ దగెన్‌బుచ్చిరా
మకవిఖ్యాతుఁడుమత్సహోదరుఁడు క్షేమస్పూర్తిమై గేహర
క్షకునేఁడుండెను ధామసీమ నయవాసా! బాలకృష్ణాహ్వయా!

శతావధాన సభాంతమునఁజెప్పినవి

అరుదౌ ఠీవి శతావధానమును జేయం జేసి, నాగావనీ
శ్వరునిన్, సభ్యుల మెచ్చఁజేసి, మము నుత్సాహాడ్యులంజేయు నీ
కరుణాపూర్ణత కే మొసంగుట నమస్కారంబులే, కాన, స
త్కరుణాదృష్టుల మన్నమస్కృతులివే గైకొమ్ము సర్వేశ్వరీ!

తమరిడ్డ ప్రశ్నముల్ తగఁబూర్తియగుట సం
         స్తవమాచరించు పృచ్ఛక గణంబుఁ
గోరిన కోర్కి సేకూరుట కతితర
         ప్రమదమందెడు రాజబంధు వితతిఁ
బద్య గద్య శ్రేణి భావముల్ దెలియఁ బ్ర
         శంసించినట్టి రసజ్ఞ వరులఁ
దనమహాస్థానమే తాదృశోన్నతి గాంచు
         టారసి ముదమందు నధిపవర్యు

స్త్రీ ప్రతానంబుతో శ్రద్ధఁజేరి, కాంచి
మోద మిగురొత్త నాత్మలో మురియు రాజ్ఞి
నిష్ట సిద్ధులు దయచేసి యేలుమెపుడు
ఘన దయాస్థాని! భర్మదుర్గా భవాని!