కైవల్య పాదము

వికీసోర్స్ నుండి
పతంజలి యోగ సూత్రములు - తెలుగు అనువాదము (కైవల్య పాదము)
కైవల్యము :



1. జన్మౌషధిమంత్రతపఃసమాధిజాః సిద్ధయః[మార్చు]

(జన్మ ఔషధి మంత్ర తపః సమాదిజాః సిద్ధయః) - (విభూతి పాదంలో ప్రస్తావించిన) సిద్ధశక్తులు జన్మతః వస్తాయి. లేదా ఓషధులతో గానీ, మననం, సాధన, ధ్యానంతో గానీ సాధించవచ్చు.


2. జాత్యంతరపరిణామః ప్రకృత్యాపూరాత్.[మార్చు]

(జాతి అంతర పరిణామః ప్రకృతి అపూరాత్) - ఒక జీవి మరొక జీవిగా పరిణామం పొందడానికి కారణం సహజసిద్ధమైన ప్రకృతి.


3. నిమిత్తమప్రయోజకం ప్రకృతీనామ్ వరణభేదస్తు తతః క్షేత్రికవత్.[మార్చు]

(నిమిత్తమ్ అప్రయోజకమ్ ప్రకృతీనామ్ వరణ భేదః తు తతః క్షేత్రికవత్) - పునర్జన్మకి పాపపుణ్యాలు స్వయంగా కారణాలు కావు.అవి కేవలం సహజ పరిమాణంలో అవాంతరాలను దాటడానికి ఉపయోగపడతాయి. రైతు ఏటినీరు పారుదలకి అడ్డమైన వాటిని తొలగించి పారుదల సుఖకరం చేసినట్టే.


4. నిర్మాణచిత్తాన్యస్మితామాత్రాత్.[మార్చు]

(నిర్మాణ చిత్తాని అస్మితా మాత్రాత్) - చిత్తమును అస్మిత మాత్రమే సృష్టించగలదు.


5. ప్రవృత్తిభేదే ప్రయోజకమ్ చిత్తమేకమనేకేషామ్.[మార్చు]

(ప్రవృత్తి భేదే ప్రయోజకమ్ చిత్తమ్ ఏకమ్ అనేకేషామ్) - వేరు వేరు జీవుల చిత్తముల ప్రవర్తన భిన్నంగా ఉన్నా, వీటి అన్నిటిమీద ఆధిపత్యం వహించే చిత్తము వేరొకటి ఉన్నది.

6. తత్ర ధ్యానజమనాశయమ్.[మార్చు]

(తత్ర ధ్యానజమ్ అనాశయమ్) - చిత్తములు వేరు వేరు రూపాలలో ఉన్నా, స్వచ్ఛమైన చిత్తము మాత్రమే సమాధిద్వారా అంతరాంతరాల అణగి ఉన్న కర్మఫలాలనుండీ కోరికలనుండీ విముక్తి పొందగలదు.


7. కర్మాశుక్లాకృష్ణమ్ యోగినస్త్రివిధమితరేషామ్[మార్చు]

(కర్మ అశుక్ల అకృష్ణమ్ యోగినః త్రివిధమ్ ఇతరేషామ్) - యోగికి మంచి కర్మా చెడు కర్మా అంటూ లేవు. ఇతరులకు కర్మ మూడు విధములు, మంచిఫలితాలనిచ్చేది, చెడుఫలితాలనిచ్చేది లేదా మిశ్రమ ఫలితాలనిచ్చేది.


8. తతస్తద్విపాకానుగుణానామేవాఽభివ్యక్తర్వాసనానామ్[మార్చు]

(తతః తత్ విపాక అనుగుణానామ్ ఏవ అభివ్యక్తిః వాసనానామ్) - ఒక జన్మలో చేసిన కర్మయొక్క ఫలితాలు వాసనలుగా మరుజన్మలో వ్యక్తమవుతాయి.


9. జాతిదేశకాలవ్యవహితానామప్యానంతర్య్యమ్ స్మృతి సంస్కారయోరేకరూపత్వాత్[మార్చు]

(జాతి దేశ కాల వ్యవహితానామ్ అపి ఆనంతర్య్యమ్ స్మృతి సంస్కారయోః ఏకరూపత్వాత్) - దేశము, కాలము, స్థూలరూపము(జన్మ) వేరు అయినా స్మృతి, సంస్కారములలో వ్యత్యాసము ఉండదు. అంచేత వాసనలు వ్యక్తమవడానికి తగిన సమయంలో అనుగుణమైన జన్మ కలిగినప్పుడు మళ్ళీ వ్యక్తమవుతాయి.


10. తాసామనాదిత్వమ్ చాశిషో నిత్యత్వాత్.[మార్చు]

(తాసామ్ అనాదిత్వమ్ చ ఆశిషః నిత్యత్వాత్) - ఈ వాసనలకి మొదలు లేదు కనక జీవితాశ కూడా అనంతంగా సాగుతూనే ఉంటుంది.


11. హేతుఫలాశ్రయాలంబనైః సంగృహీతత్వాదేషామభావే తదభావః[మార్చు]

(హేతు ఫల ఆశ్రయ ఆలంబనైః సంగృహీతత్వాత్ ఏషాం అభావే తత్ అభావః) - హేతువు, ఫలము, సాధకుడు ఆచరించే క్రియలు ఆధారంగా వాసనలు ప్రోది అవుతాయి కనక వాటిని తొలగిస్తే, వాటికి ఆధారమయిన అవిద్య నశిస్తుంది.


12. అతీతానాగతమ్ స్వరూపతోఽస్త్యధ్వభేదాద్ధర్మాణామ్[మార్చు]

(అతీత అనాగతమ్ స్వరూపతః అస్తి అధ్వభేదాత్ ధర్మాణామ్) - గతమూ, భవిష్యత్తూ స్వరూపాలలో తేడా ఉంది. వాటి మార్గాలను అనుసరించి వాటి తత్త్వాలు ఉంటాయి.


13. తే వ్యక్తసూక్ష్మా గుణాత్మానః[మార్చు]

(తే వ్యక్త సూక్ష్మాః గుణ ఆత్మానః) - అవి స్థూలంగానో సూక్ష్మంగానో వాటి సహజప్రకృతులని అనుసరించి వ్యక్తమవుతాయి.


14.పరిణామేకత్వాద్వస్తుతత్త్వమ్[మార్చు]

(పరిణామ ఏకత్వాత్ వస్తు తత్త్వమ్) -వస్తువు యొక్క తత్త్వం ఆ వస్తువు మార్పు చెందే ఉంటుంది.


15. వస్తుసామ్యే చిత్తభేదాత్తయోర్విభక్త పంథాః[మార్చు]

(వస్తు సామ్యే చిత్తభేదాత్ తయోః విభక్తః పంథాః) - వేరు వేరు సాధకుల చిత్తములలో వ్యత్యాసాలమూలంగా ఒకే వస్తువుగురించిన అభిప్రాయాలు వేరు వేరుగా ఉంటాయి.


16. న చైకచిత్తతంత్రమ్ వస్తు తదప్రమాణకమ్ తదా కిం స్యాత్?[మార్చు]

(న చ ఏకచిత్త తంత్రమ్ వస్తు తత్ అప్రమాణకమ్ తదా కిమ్ స్యాత్?) - ఒక వస్తువుయొక్క అస్తిత్వం ఒక వ్యక్తి చిత్తముమీద మాత్రమే ఆధారపడి ఉండదు. మరి ఆ వ్యక్తి ఆ వస్తువును గమనించనప్పుడు ఏమవుతుంది?


17. తదుపరాగాపేక్షిత్వాచ్చిత్తస్య వస్తు జ్ఞాతాజ్ఞాతమ్.[మార్చు]

(తత్ ఉపరాగ అపేక్షిత్వాత్ చిత్తస్య వస్తు జ్ఞాత అజ్ఞాతమ్) - ఒక వస్తువును గురించి తెలియడం కానీ తెలియకపోవడం కానీ ఆ వస్తువుకి సంబంధించినంతవరకూ దాన్ని చూచే వ్యక్తి ఆలోచనలను బట్టి ఉంటుంది.


18. సదా జ్ఞాతాశ్చిత్తవృత్తయస్తత్ ప్రభోః పురుషస్యాపరిణామిత్వాత్.[మార్చు]

(సదా జ్ఞాతాః చిత్తవృత్తయః తత్ ప్రభోః పురుషస్య అపరిణామిత్వాత్) - పరమపురుషుడికి మార్పు లేదు. అతడు సమస్త చిత్తవృత్తులలో మార్పులను గ్రహించగలవాడు.


19. నతత్స్వాభాసమ్ దృశ్యత్వాత్.[మార్చు]

(న తత్ స్వాభాసమ్ దృశ్యత్వాత్) - చిత్తము స్వయంప్రకాశము కాదు. ఇతరులకు మాత్రమే చిత్తమును పరిశీలించడం సాధ్యము.


20. ఏకసమయే చోభయఽనవధారణమ్[మార్చు]

(ఏక సమయే చ ఉభయ అనవధారణమ్) - చిత్తమునకు ఒకే సమయంలో రెంటిమీదా – ఆత్మ, ద్రష్టలమీద- ధ్యానము నిలడం సాధ్యము కాదు.


21. చిత్తాంతరదృశ్యే బుద్ధిబుధ్ధేరతిప్రసంగః స్మృతిసంకరశ్చ.[మార్చు]

(చిత్త అంతర దృశ్యే బుద్ధి బుద్ధేః అతి ప్రసంగః స్మృతి సంకరః చ) - ఒక చిత్తము మరొక చిత్తమును అర్థం చేసుకోడానికి ఆ రెంటికంటే వేరు అయిన మరొక బుద్ధి కావాలి వాటిని పరిశీలించడానికి. అది అసాధ్యం. అది ఆ కారణంగా స్మృతిలో అయోమయం కలిగించడానికి కారణమవుతుంది.


22. చిత్తేరప్రతిసంక్రమాయాస్తదాకారాపత్తౌ స్వబుద్ధిసంవేదనమ్.[మార్చు]

(చిత్తేః అప్రతిసంక్రమాయాః తత్ ఆకార ఆపత్తౌ స్వ బుద్ధి సంవేదనమ్) - ఒక ప్రవృత్తినుండి మరొక ప్రవృత్తికి మారని స్థితి చిత్తమునకు కలిగినతరవాత స్వబుద్ధిని తెలుసుకోగలదు.


23. ద్రష్టృద్దృశ్యోపరక్తం చిత్తం సర్వార్ధమ్.[మార్చు]

(ద్రష్టృ దృశ్య ఉపరక్తమ్ చిత్తమ్ సర్వ అర్థమ్) - ద్రష్ట, దృశ్యముల ప్రవృత్తులను గ్రహించిన చిత్తమునకు తానే ద్రష్ట అయి ఆ చిత్తమును పరిశీలించగల శక్తిని పొందగలదు.


24. తదసంఖ్యేయవాసనాభిశ్చిత్రమపి పరార్థమ్ సంహత్యకారిత్వాత్.[మార్చు]

(తత్ అసంఖ్యేయ వాసనాభిః చిత్రమ్ అపి పరార్థమ్ సంహత్య కారిత్వాత్) - చిత్తము అనేక వాసనలతో నిండి ఉన్నప్పటికీ పరమపురుషునికి చేరువ కావడంచేత, తదనుగుణంగా ప్రవర్తిస్తుంది.


25. విశేషదర్శిన ఆత్మభావభావనావినివృత్తిః[మార్చు]

(విశేష దర్శిన ఆత్మ భావ భావనా వినివృత్తిః) - అనుభూతి ఆత్మలమధ్య విభేదము గమనించిన సాధకుడు చిత్తమును సంపూర్ణంగా నిరోధించగలడు.


26. తదా వివేకనిమ్నమ్ కైవల్యప్రాగ్భారమ్ చిత్తమ్[మార్చు]

(తదా వివేక నిమ్నమ్ కైవల్య ప్రాగ్ భారమ్ చిత్తమ్) - అప్పుడే చిత్తము వివేకముతో ప్రాపంచికపరమైన ఆత్మనుండి సంపూర్ణంగా విడివడి పరమపురుషునికి చేరువ అవుతుంది.


27. తచ్ఛిద్రేషు ప్రత్యయాంతరాణి సంస్కారేభ్యః[మార్చు]

(తత్ ఛిద్రేషు ప్రత్యయః అంతరాణి సంస్కారేభ్యః) - ఆవిధంగా ప్రశాంతత పొందిన చిత్తములో సూక్ష్మవిషయాలు లేదా స్మృతులు అంతరాంతరాలనుండి తిరిగి వెలువడి గోచరము అవుతాయి.


28. హానమేషాం క్లేశవదుక్తమ్.[మార్చు]

(హానమ్ ఏషామ్ క్లేశవత్ ఉక్తమ్) - వీటిని కూడా తొలగించడం (ముందు చెప్పుకున్న) చిత్తవృత్తులకి సంబంధించిన క్లేశములను తొలగించడం వంటిదే అని యోగులు చెప్తారు.


29. ప్రసంఖ్యానేఽప్యకుసీదస్య సర్వథా వివేకఖ్యాతేర్ధర్మమేఘస్సమాధిః[మార్చు]

(ప్రసంఖ్యాన అపి అకుసీదస్య సర్వథా వివేక ఖ్యాతేః ధర్మ మేఘః సమాధిః) - ఎవరు ఆ సమాధిలో లౌకికలాభమును గమనించరో వారికి ఇతోధికంగా సద్వివేచన లభిస్తుంది, మేఘములు స్వతస్సిద్ధంగా వర్షించినట్టు.


30. తతః క్లేశకర్మనివృత్తిః[మార్చు]

(తతః క్లేశ కర్మ నివృత్తిః) - అప్పుడు అనేక జన్మలతాలూకు క్లేశములు మళ్ళీ మళ్ళీ బయట పడడం ఆగిపోతుంది.


31. తదా సర్వావరణమలాపేతస్య జ్ఞానస్యానంత్యాజ్ఞేయమల్పమ్.[మార్చు]

(తదా సర్వ ఆవరణ మల ఆపేతస్య జ్ఞానస్య ఆనంత్యాత్ జ్ఞేయమ్ అల్పమ్) - ఆ తరవాత, ఈ ఉత్కృష్ట వివేచనతో పోలిస్తే చిత్తములో వసిస్తున్న మానసికమైన, బౌద్ధికమైన వికారాలు చాలా అల్పమయినవిగానూ అర్థరహితంగానూ కనిపిస్తాయి.


32. తతః కృతార్థానాం పరిణామక్రమసమాప్తిగుణానామ్.[మార్చు]

(తతః కృతార్థానాం పరిణామ క్రమ సమాప్తి గుణానామ్) - ఆ పరిణామ క్రమం పని పూర్తయిన తరవాత పరిణామదశ అంతమవుతుంది.


33. క్షణప్రతియోగీ పరిణామాపరాంతనిర్గ్రాహ్యః క్రమః[మార్చు]

(క్షణ ప్రతియోగీ పరిణామ అపరాంత నిర్గ్రాహ్యః క్రమః) - ఆ పరిణామానికి కారణమైన సమయం అంతమైన తరవాత ఆ క్రమం కూడా అంతమవుతుంది. పరిణామక్రమం పూర్తి అయిందన్న విషయం సాధకునికి స్పష్టమవుతుంది.


34. పురుషార్థశూన్యానామ్ గుణానామ్ ప్రతిప్రసవః కైవల్యమ్ స్వరూపప్రతిష్ఠా వా చిత్తశక్తిరితి.[మార్చు]

(పురుషార్థ శూన్యానామ్ గుణానామ్ ప్రతిప్రసవః కైవల్యమ్ స్వరూప ప్రతిష్ఠా వా చిత్తశక్తిః ఇతి) - సాధారణ మానవులకి ధ్యేయం అయిన విషయాలలో ఆత్మ (లౌకికమైన) చిత్తమునుండి, ప్రాపంచిక విషయప్రభావాలనుండి విడివడి, యోగియొక్క భగవత్పరమైన ఆత్మలో లయమవుతుంది. అదే సమాధి. ---


కైవల్యపాదము సమాప్తము.



పతంజలి యోగ సూత్రములు - తెలుగు అనువాదము (కైవల్య పాదము)
కైవల్యము. :


మూస:పతంజలి యోగ సూత్రములు - తెలుగు అనువాదము