Jump to content

కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం/స్వాభిమానం

వికీసోర్స్ నుండి

స్వాభిమానం

ఆమె తన ముగ్గురు స్నేహితులని వెంటబెట్టుకొని వచ్చింది. వాళ్ళందరిలోనూ మంచి ఆసక్తి, తెలివితేటలవల్ల నొనగూడే హుందాతనమూ వున్నాయి. వారిలో ఒకరికి చాలా త్వరగా గ్రహించగలిగే శక్తి వున్నది; మరొకరిలో చురుకుదనంతోపాటు అసహనం కూడా వుంది; మూడో వారిలో వుత్సాహం వుంది కానీ అది ఎక్కువ సేపు కొనసాగే వుత్సాహం కాదు. మంచి మిత్రబృందం అది. తమ స్నేహితురాలి సమస్య గురించి వారందరిలోనూ విచారం వుంది. అయితే ఎవ్వరూ సలహాలు కాని, బరువైన అభి ప్రాయాలు కాని వెలిబుచ్చడంలేదు. సంప్రదాయానికో, పదిమంది అభిప్రాయానికో, వ్యక్తిగతమైన అభిలాషకో అనుగుణంగా కాకుండా ఏది చేస్తే మంచిది అని ఆమె అనుకుంటే అది చేయడానికి ఆమెకు తోడ్పడాలనుకుంటున్నారు. ఇబ్బంది ఎక్కడంటే అసలు ఏది మంచిది అనేది కనుక్కోవడం ఎట్లా? అమెకే అంత నిర్ధారణగా తెలియడంలేదు. ఆమెకి అంతా అలజడిగాను, తారుమారుగాను అనిపిస్తున్నది. కాని తక్షణమే చర్య తీసుకోవలసిన వొత్తిడి కూడా ఎక్కువగా వుంది. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇక ఎక్కువ కాలం యిట్లాగే పొడిగించడానికి వీల్లేదు. ఒకానొక బాంధవ్యాన్నుంచి విడుదల చెందాలన్నదే ప్రస్తుత సమస్య. ఆమెకి స్వేచ్ఛ కావాలి, ఈ మాట అనేకసార్లు ఆమె మళ్ళీ మళ్ళీ అంటూ వచ్చారు.

గదిలో అంతా ప్రశాంతంగా వుంది. అందరిలోనూ అసహనం, ఆందోళన నెమ్మదించాయి. సమస్యను గురించి చర్చించాలని వాళ్ళంతా చాలా ఆత్రంగా వున్నారు. అయితే దానివల్ల ఫలితం వుంటుందని కాని, ఏది సరియైన కర్తవ్యం అన్నదానికి ఒక నిర్వచనం లభిస్తుందని కాని వాళ్ళు ఆశించడంలేదు. సమస్య పూర్తిగా బయటకు వ్యక్త మయాక కర్తవ్యం ఏమిటో దానంతట అదే సహజంగా, సంపూర్ణంగా వెల్లడవుతుంది. సమస్య లోపల వున్న విషయాన్ని కనిపెట్టడం ప్రధానం కాని, చివరకు కలిగే ఫలితం ముఖ్యం కాదు. ఎందుకంటే చివరికి ఏ సమాధానం వచ్చినా సరే అది కూడా ఒక తీరో, ఒక అభిప్రాయమో, యింకొక సలహానో అవుతుందే తప్ప అసలు సమస్యని ఏవిధంగానూ ఆది పరిష్కరించలేదు. సమస్యని సమస్యగా అవగాహన చేసుకోవాలి తప్ప, ఆ సమస్యకు ఎట్లా ప్రతిస్పందించాలి, ఆ విషయంలో ఏం చేయాలి అన్నవి ముఖ్యం కాదు. సమస్యను సవ్యమైన దృష్టితో దరిచేరడం ముఖ్యం. ఎందుకంటే సమస్యలోనే చేయదగిన కర్తవ్యం నిబిడీకృతమై వుంటుంది.

సూర్యుడు నదిలోని నీళ్ళ పై వెలిగించిన కాంతిరేఖలు నీళ్ళను పులకింపజేసి నాట్యం చేయిస్తున్నాయి. తెల్లని తెరచాపతో ఒక పడవ ఆ దారినే వెళ్ళింది. కాని నాట్యం మాత్రం ఆగిపోలేదు. స్వచ్ఛమైన ఆనందపారవశ్యంతో చేస్తున్న నృత్యం అది. చెట్లనిండా పక్షులు వాలి వున్నాయి. గట్టిగా అరుస్తూ, ముక్కులతో పొడిచి యీకలు సవరించుకుంటూ, కాసేపు అటూ యిటూ ఎగిరి, మళ్ళీ వచ్చి వాలుతూ సందడి చేస్తున్నాయి. ఎక్కడ చూసినా కోతులు - లేత ఆకులు తెంపి నోళ్ళల్లో కుక్కుకుంటూ అల్లరి చేస్తున్నాయి. ఆ కోతుల బరువువల్ల సన్నగా లేతగా వున్న కొమ్మలు ఆర్థచంద్రాకారాల్లో వంగిపోయాయి. అయినా కోతులు ఏమాత్రం భయపడ కుండా కొమ్మల్ని పట్టుకొని తేలిగ్గా వేలాడుతున్నాయి. ఎంతో సునాయాసంగా ఒక కొమ్మమీద నుంచి యింకో కొమ్మమీదికి మారుతున్నాయి. అవి ఎగరడమూ, మరో కొమ్మ మీదికి దూకడమూ రెండూ కలిసిపోయి ఒకే ఒక కదలికలాగా అనిపిస్తున్నది. తోకలు కిందకు వేళ్ళాడేసుకొని కూర్చుని, ఆకులు అందుకుంటున్నాయి. బాగా పై కొమ్మలమీద కూర్చొని వుండటంవలన కింద నడిచిపోతున్న మనుష్యులు వాటి దృష్టిలోకి రావడంలేదు. చీకటి పడుతుండగా వందలకొద్ది రామచిలకలు వచ్చి, గుబురుగా వున్న ఆకుల మధ్యన ఆ రాత్రికి మకాం వేస్తున్నాయి. అవి రావడం కనిపిస్తున్నది. కానీ వచ్చేక ఆ చిక్కని గుబురాకుల్లో అదృశ్యమైపోతున్నాయి. అమావాస్య దాటిన పాడ్యమినాటి చంద్రుడు సన్నగా బయటపడుతున్నాడు. దూరంగా నదివొంపు తిరిగిన చోట వున్న పొడుగాటి వంతెన దాటుతూ రైలు కూత వేస్తున్నది. ఈ నది చాలా పవిత్రమైనది. దూరదూరాలనుంచి ప్రజలు వచ్చి, తమ పాపాలు కడిగేసుకోవడానికి యీ నీళ్ళలో స్నానం చేస్తుంటారు. అసలు ప్రతి నదీ పవిత్రమైనదే, అందమైనదే. ఈ నదిలోని సౌందర్యం ఏమిటంటే విశాలంగా విస్తరించుకొని వున్న దోని వంపు, లోతయిన నీటి మడుగుల మధ్య ద్వీపాలవంటి యిసుక తిన్నెలు. ప్రతిరోజూ ఆ నది పైన నిశ్శబ్దంగా కదులుతూ, వచ్చీ పోయే తెల్లని తెరచాపలు.

'చాలా ప్రత్యేకమైన ఒక బాంధ్యవ్యం నుంచి స్వేచ్ఛ పొందాలని నేను కోరుకుంటున్నాను' అన్నది ఆమె.

స్వేచ్ఛ కావాలి అని అంటే మీ అర్థం ఏమిటి? నాకు స్వేచ్ఛ కావాలి' అని మీరు అంటున్నారంటే, దాని అర్ధం మీరు స్వేచ్ఛగా లేరు అన్నమాట. మీకు స్వేచ్ఛ లేనిది ఏ విషయంలో?

'భౌతికంగా నేను స్వేచ్చగానే వున్నాను. ఎక్కడికంటే అక్కడికి వెళతాను, వస్తాను. ఎందుకంటే యిప్పుడు నేను ఒకరి భార్యను కాను. అయితే ఇంకా సంపూర్ణమైన స్వేచ్ఛ నాకు కావాలి. ఆ మనిషితో ఇంక నాకు ఏ సంబంధమూ వుండకూడదు.'

భౌతికంగా మీకు స్వేచ్ఛ వచ్చేసినప్పుడు, ఆ వ్యక్తితో మీకొక ఏవిధమైన బాంధవ్యం వుంది? ఇంకేరకంగా నైనా అతనితో మీకు సంబంధం వుందా?

'నాకు తెలియదు కాని అతనంటే నాకు విపరీతమైన ఆగ్రహం వుంది. అతనికీ, నాకూ మధ్యన యిక ఏమీ వుండకూడదు.'

మీకు స్వేచ్ఛ కావాలని కోరుకుంటున్నారు. అయినా అతనంటే మీకు ఆగ్రహం వుందా? అంటే అర్థం మీరు అతని నుంచి విముక్తి పొంద లేదు అతనంటే ఎందుకు మీకీ ఆగ్రహం?

'ఈ మధ్యనే అతని అసలు స్వరూపం ఏమిటో తెలుసుకున్నాను. ఆ నీచత్వం, అంతటి ప్రేమరాహిత్యం, అంతటి విపరీతమైన స్వార్థపరత్వం. అతనిలో నేను కని పెట్టిన ఆ భయంకరత్వాన్ని గురించి నేను చెప్పలేను. ఒకప్పుడు అతని మీద యీర్ష్య పడ్డానని, అతన్ని ఆరాధించానని, అతనికి పూర్తిగా నన్ను నేను సమర్పించుకున్నానని తలచుకుంటేనే ఎంతో ప్రేమ, గొప్ప దయ వున్న ఆదర్శమూర్తి నా భర్త అని అనుకున్నాను. వట్టి మూర్ఖుడూ, వంచకుడూ అని నేను కని పెట్టినప్పుడు అతనంటే అసహ్యం వేసింది. ఒకప్పుడు అతనితో జీవించానన్న తలంపే నేను కలుషితమై పోయాననే భావం కలిగిస్తున్నది. అతని నుంచి నాకు పూర్తిగా స్వేచ్ఛ కావాలి.'

భౌతికంగా మీరు అతని నుంచి విముక్తి పొందవచ్చు. కానీ మీలో అతనంటే ఆగ్రహం వున్నంతవరకు, మీకు స్వేచ్ఛ దొరకదు. అతన్ని మీరు ద్వేషిస్తుంటే, అతనితో మీకు బంధం వున్నట్లే. అతన్ని తలచుకొని మీరు సిగ్గుపడుతుంటే అతనికీ మీరు యింకా దాసులుగా వున్నట్లే, మీ కోపం అతని మీదనా, మీ మీదేనా? అతను ఏమిటో అట్లా అతను వున్నాడు. మీకెందుకు కోపం? అసలు మీ ఆగ్రహం నిజంగా అతనిమీదేనా? 'ఉన్నది'ని చూశాక, దానితో కొంతకాలం సహవాసం చేశానే అని మీరు సిగ్గుపడుతున్నారా? మీలో వున్న ఆగ్రహం నిస్సందేహంగా అతనీమీద కాదు. ఒకప్పుడు మీరు ఏర్పరచుకున్న అభిప్రాయాలమీద, నిర్ణయాలమీద, మీచర్యలమీద. మిమ్మల్ని చూసుకొని మీరే సిగ్గుపడుతున్నారు. ఇది ఒప్పుకోవడం ఇష్టంలేక అతను అట్లా వున్నాడని అతనిమీద దోషం ఆరోపిస్తున్నారు. మీలో వున్న కాల్పనిక ప్రణయ ఆరాధన నుంచి పొరిపోవడానికి అతని మీద ద్వేషం ఒక మార్గం అని మీకు తెలిసివచ్చినప్పుడు, అప్పుడు అతను అనే వ్యక్తి మీ దృష్టిపధం నుంచి అదృశ్యమౌతాడు. మీరు సిగ్గుపడుతున్నదీ అతన్నీ గురించి కాదు, అతనితో సహవాసం చేసిన కారణంగా మీ గురించే. మీ కోపం అంతా మీ మీదే, అతని మీద కాదు.

'అవును, అది నిజమే.'

ఇది మీరు నిజంగా గ్రహిస్తే, దాన్ని ఒక వాస్తవంగా అనుభూతిలోకి తెచ్చుకుంటే, అప్పుడు మీకు అతని నుంచి స్వేచ్ఛ లభిస్తుంది. ఇక ఆ తరువాత మీ శత్రుత్వానికి అతను కారణభూతుడు అవడు. ప్రేమలాగే శత్రుత్వం కూడా ఒక బంధం అవుతుంది.

'కానీ నా అవమానాన్నుంచి, నా అవివేకాన్నుంచి నేను ఎట్లా విముక్తి పొందుతాను? నాకు యిప్పడు అంతా స్పష్టంగా అర్థమవుతున్నది. అతనున్నట్లుగా అతనున్నాడు. అతని దోషం ఏమీ లేదు. కానీ, యీ అవమానాన్నుంచీ, నా లోపల మెల్లమెల్లగా పెరుగుతూ, యీ విషమస్థితిలోకి, పూర్తిగా పరిపక్వదశ చేరుకున్న యీ ద్వేషభావాన్నుంచి, నాకు ఎట్లా విముక్తి కలుగుతుంది జరిగిపోయిన గతాన్ని ఎట్లా చెరిపివేయగలను?? గతించినదాన్ని ఎట్లా చెరిపివేయాలో తెలుసుకోవడంకంటే, ఆ గతాన్ని చెరిపివేయాలని - మీరు ఎందుకు కోరుకుంటున్నారన్నది ముఖ్యం. ఒక సమస్యని గురించి ఏంచేయాలి అన్నదానికంటే, మీరు వెనకాల ఏ వుద్దేశ్యం పెట్టుకొని ఆ సమస్యను చూస్తున్నారన్నది చాలా ముఖ్యం. ఆ సహవాసం యొక్క జ్ఞాపకాన్ని తుడిచిపారేయాలని మీరు ఎందుకు కోరుకుంటున్నారు?

'అప్పటి ఆ రోజులకు చెందిన స్మృతులంటే నాకు బొత్తిగా యిష్టంలేదు. అవి తలచుకుంటేనే నా మనసు చేదెక్కుతున్నది. ఈ కారణం సరిపోదా?'

అంతగా సరిపోదు. సరిపోతుందా? ఆ పాత స్మృతులను చెరిపివేయాలని మీరు ఎందుకు కోరుకుంటున్నారు? అవి మీ మనసును చేదెక్కిస్తున్నాయనే కారణంగా కానే కాదు. ఒకవేళ మీ పాత జ్ఞాపకాలను ఏదో ఒక విధంగా మీరు చెరిపివేయగలిగినా, మళ్ళీ మీకు అవమానంగా అనిపించే చర్యల్లో మీరు చిక్కుకోవచ్చు. మీకు అసహ్యంగా అనిపించే జ్ఞాపకాలను తుడిచిపారేసినంత మాత్రాన మీ సమస్యకు పరిష్కారం దొరకదు. దొరుకుతుందా?

'దొరుకుతుందని అనుకున్నాను. అయితే యిప్పుడు అసలు సమస్య ఏమిటి? మీరు అనవసరంగా సమస్యను మరీ సంకీర్ణంగా తయారుచేయడంలేదూ? ఆసలే జటిలమైన సమస్య. పోనీ నా జీవితమే జటిలమైనది. దాని మీద యింకా భారాలన్నీ మోపడం ఎందుకు?'

భారం ఎక్కువ చేస్తున్నామా, 'వున్నది' నీ అవగాహన చేసుకొని దానినుంచీ విముక్తి పొందడానికి ప్రయత్నిస్తున్నామా? దయచేసి కొంచెం ఓర్పుతో వినండి. గతాన్ని చేరిపివేయమని మిమ్మల్ని ప్రేరణ చేస్తున్నది ఏమిటి? గతం అసహ్యకరంగా అనిపించవచ్చు. కాని చెరిపివేయాలనీ మీరు ఎందుకు కోరుకుంటున్నారు? మీ గురించి మీకు ఒక ప్రత్యేకమైన భావన, ఒక కాల్పనిక చిత్రం వున్నది. దానికి యీ స్మృతులు విరుద్ధంగా వున్నాయి. అందుకని ఆ స్మృతులను వద్దు పొమ్మంటున్నారు. మీకు మీరే ఒక ప్రత్యేకమైన విలువను యిచ్చుకున్నారు కదూ?

'అవును మరి, లేకపోతే --------'

రకరకాలైన అంతస్తుల్లో మనల్ని నిలబెట్టుకోవడం మనం అందరమూ చేసే పనే. ఈ ఎత్తు మీదనుంచి మనం కిందపడిపోవడం కూడా జరుగుతూనే వుంటుంది. మనం సిగ్గుపడేది ఈ పడిపోవడం గురించి, ఈ సిగ్గుపడటానికి, యీ పడిపోవడానికి మనకి మనం ఆపాదించుకునే ఘనతే కారణం. అవగాహన చేసుకోవలసింది మనకి మనమే స్వయంగా యిచ్చుకున్న యీ ఘనతని తప్ప పడిపోవడాన్ని కాదు. ఒక వున్నత సింహాసనంమీద మిమ్మల్ని మీరే నిలబెట్టుకోకపోతే పడిపోవడం అనేది ఎందుకుంటుంది? స్వీయఘనత, వ్యక్తిగౌరవం, ఏదో ఒక ఆదర్శం అనే వున్నతపీరం మీద మిమ్మల్ని మీరే ఎందుకు నిలబెట్టుకున్నారు? ఇది కనుక మీరు అర్ధం చేసుకుంటే అప్పుడు గతాన్ని గురించి సిగ్గుపడటం వుండదు. అదంతా పూర్తిగా అదృశ్యమై పోతుంది. ఆ వున్నతపీరం లేకపోతే మీరు ఏమిటో అట్లాగే మీరు వుంటారు. ఉన్నతపీరం లేనప్పుడు, ఒకర్ని ఎక్కువగాను, ఒకర్ని తక్కువగాను చూపించిన ఆ ఎత్తుమీద మీరు నిలబడనప్పుడు, మీరు యిన్నాళ్ళూ చూడకుండా తప్పించుకొని తిరిగిన ఆ అసలు మీరు అక్కడ వుంటారు. 'వున్నది' ని, మీరు ఏమిటో దానిని, చూడకుండా తప్పించుకోవడంవల్లనే గందరగోళం, విరోధం, అవమానం, ద్వేషం కలుగుతాయి. మీరు ఏమిటో అది నాకు గాని, మరొకరికి గాని మీరు చెప్పవలసిన పనిలేదు. కానీ, మీరు ఏమిటి అనేది, అది ఏదయినా సరే, దాని ఎరుక మీకు వుండాలి. సమర్థించడం కాని, నిరోధించడం కానీ చేయకుండా దానితో జీవించండి. దానికొక పేరు పెట్టకుండా దానితో జీవించండి. ఎందుకంటే ఆ పేరే ఒక దూషణగానో, ఒక గుర్తింపుగానో పనిచేస్తుంది. ఏ భయమూ లేకుండా దానితో జీవించండి. భయం వుంటే దానితో సాన్నిహిత్యానికి అడ్డు వస్తుంది. సాన్నిహిత్యం లేనప్పుడు దానితో జీవించలేరు. సాన్నిహిత్యం వుండటమే ప్రేమించడం. ప్రేమ లేకుండా గతాన్ని మీరు తుడిచి వేయలేరు. ప్రేమ వున్నప్పుడు గతం వుండదు. ప్రేమించండి, అప్పుడు కాలం వుండదు.

(కమెంటరీస్ ఆన్ లివింగ్)