కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం/మనసులోని తుఫాను
మనసులోని తుఫాను
ఈ రోజంతా పొగమంచు వదలకుండా వుండిపోయింది. సాయంత్రానికి కరిగి, మాయమయ్యేసరికి తూర్పునుంచీ గాలి వీచడం మొదలు పెట్టింది బొత్తిగా తేమ లేని ఆ గాలి తెరిపి లేకుండా వీస్తూ, రాలి పడిపోయిన ఆకుల్ని ఎగరగొట్టుతూ, నేలలో వున్న తడినంతా పీల్చేస్తున్నది. తీవ్రంగా వీస్తున్న తుఫాను గాలులతో భయంకరంగా వున్న రాత్రి అది. గాలి యింకా ఎక్కువైంది. ఇల్లు కిర్రు కిర్రుమని వూగుతున్నది. చెట్ల కొమ్మలు విరిగి కూలిపోతున్నాయి. ఆ మర్నాడు పొద్దున వాతావరణం ఎంత నిర్మలంగా వుందంటే, దూరాన వున్న పర్వతాలు చేత్తో తాకచ్చేమో అన్నంత స్పష్టంగా అనిపించాయి. గాలీ, దానితోపాటు వేడీ విజృంభించాయి. మధ్యాహ్నం దాటే వేళకు గాలి తగ్గిపోయింది. కాని సముద్రంమీది నుంచి పొగమంచు మళ్ళీ వచ్చి ఆవరించుకుంది.
ఈ భూమి మీద ఎంత అద్భుతమైన సౌందర్యం వుంది, ఎంత సంపన్నమైంది యీ భూమి! విసుగు అనేదే అనిపించదు. ఎండిపోయిన నదీ గర్భాలలో ఎన్నిరకాల ప్రాణులో జీవిస్తుంటాయి : ముళ్ళగడ్డి, రక్కిస మొక్కలు, ఎత్తుగా, పసుపురంగులో పూసే సూర్యకాంతులు. బండరాళ్ళమీద వూసరవెల్లులు, నలికెల పాములు వుంటాయి. తెలుపు, మట్టిరంగుల అడ్డచారలు వున్న పాము ఎండ పొడన పడుకున్నది. నల్లని నాలుకను బయటకు లోపలకు ఆడిస్తూ. డొంకకు అటువైపునుంచి కుక్క అరుపులు వినిపిస్తున్నాయి. ఉడతనో, కుందేలునో తరుముతూ వుండి వుంటుంది.
సంతుష్టి అంటే సఫలత పొందడంవల్లకానీ, ఒకదానిని సాధించడంవల్ల కానీ, వస్తు సంపద ఆర్జించడంవల్లకానీ కలిగేది కాదు. ఒక క్రియవల్లకానీ, నిష్క్రియవల్లకానీ అదీ కలగదు. 'ఉన్నది' తో మనం నిండిపోయినప్పుడు అది కలుగుతుంది తప్ప, 'వున్నది' ని సవరించడంవల్ల కాదు. నిండిపోయి వున్నప్పుడు సవరింపులు, మార్పులు అవసరం వుండవు, అసంపూర్ణమైనది సంపూర్ణంగా అవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అది అసంతుష్టి, మార్పు అనే కల్లోలంలో చిక్కుకుంటుంది. 'ఉన్నది' అనేది అసంపూర్ణంగా వుంటుంది; అది సంపూర్ణం కాదు. సంపూర్ణంగా వుండేది వాస్తవంలో వుండదు. ఆ అవాస్తవాన్ని అందుకోవాలనే ఆరాటంలో అసంతుష్టి అనే బాధ వుంటుంది. ఈ బాధకు చికిత్స లేదు. ఈ బాధని తగ్గించాలనే ప్రయత్నం కూడా వాస్తవం కానీ దానికోసం అన్వేషించడమే. అందులోనుంచే అసంతుష్టి జనిస్తుంది. అనంతుష్టినుంచి తప్పించుకోవడానికి మార్గం లేదు. అసంతుష్టి గురించి ఎరుకగా వుండటమే వున్నది గురించిన ఎరుక. దానితో మనం నిండిపోయి వుండటంలో సంతుష్టి అని పిలవదగిన ఒక స్థితి వుంటుంది. దానికి వ్యతిరేకంగా వుండే స్థితి వుండదు.
ఆ యింటిలోనుంచి చూస్తే లోయ అంతా కనబడుతుంది. దూరంగా వున్న పర్వతాల్లోని అతి ఎత్తయిన శిఖరం అస్తమిస్తున్న సూర్యుడి కిరణాలు తాకి ఎర్రగా వెలుగుతున్నది. రాళ్ళమయంగా వున్న ఆ శిఖరం ఆకాశంలో నుంచి వేలాడుతున్నట్లు, దానీ గర్భంలో నుంచి వెలుగు వస్తున్నట్లు అనిపిస్తున్నది. చీకట్లు ముసురుకుంటున్న యీ గదిలోనుండి చూస్తుంటే ఆ సౌందర్యపు వెలుగు ఆన్నింటికీ అతీతంగా కనబడింది. అతను చాలా చిన్నవాడు. ఎంతో వుత్సాహాం, అన్వేషణాసక్తీ వున్నాయి అతనిలో. “మతం గురించి, మతాచారాల గురించి, ధ్యానం గురించి, పరమోత్కృష్టమైన దానిని అందుకోవడానికి అవలంబించవలసిన రకరకాల పద్ధతులను గురించి చాలా గ్రంధాలు చదివాను. ఒకప్పుడు నేను కమ్యునిజం ఆకర్షణలో పడ్డాను. అయితే, ఎంతమంది మేధావులు దానికి కట్టుబడి వున్నప్పటికీ, అది అభివృద్ధి నిరోధకమైనదని నాకయితే చాలా త్వరగానే తెలిసివచ్చింది. కేథలిక్ మతం కూడా సన్ను ఆకర్షించింది. దానిలోని కొన్ని వుపదేశ సూత్రాలు నాకు బాగా నచ్చాయి. కేథలిక్ గా మారాలని కొంతకాలం అనుకున్నాను కూడా. అయితే ఒకరోజు గొప్ప పండితుడైన ఒక కేథలిక్ మతాచార్యుడితో మాట్లాడుతున్నప్పుడు, యీ మతమూ కమ్యునిజం అనే జైలు రెండూ ఒకేలాగే వున్నాయని నాకు హఠాత్తుగా స్పష్టపడింది. ఒక ఓడలో నావికునిగా చేరి తిరుగుతున్న రోజుల్లో నేను భారతదేశానికి వెళ్ళాను. సుమారు ఒక సంవత్సరం అక్కడ గడిపాను. సన్యాసం పుచ్చుకుందామని అనుకున్నాను. కాని అసలు జీవితాన్నుంచి అది మనల్ని దూరం చేస్తుంది. కల్పితమైన ఆదర్శాలే తప్ప అందులో యదార్థం వుండదు. ఒంటరిగా జీవిస్తూ ధ్యానాన్ని సాధన చేయాలనుకున్నాను. అదీ అయిపోయింది. ఇన్ని సంవత్సరాలు యిట్లో గడిపాక కూడా ఆలోచనలను అదుపు చేయడం నాకు బొత్తిగా చేతకావడంలేదనే అనిపిస్తున్నది. దీన్ని గురించే మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఇంకా చాలా సమస్యలున్నాయనుకోండి, సెక్స్ మొదలైనవి. ఆలోచనలను కనుక పూర్తిగా నా స్వాధీనంలో వుంచుకుంటే, అప్పుడు నాలో వున్న కోరికలను, నిగూఢమైన వాంఛలను నేను అదుపు చేసుకోగలుగుతాను.”
ఆలోచనలను అదుపు ఆజ్ఞల్లో పెట్టడంవల్ల కోరికలు నిమ్మలిస్తాయా, లేదూ వాటిని అణచివేయడం జరుగుతుందా? అణచివేయడం మళ్ళీ యితరమైన, యింకా లోతైన సమస్యలను తెచ్చిపెడుతుందా?
‘కోరికలకు లోబడి పొమ్మని మీరు సలహా యివ్వడంలేదనే అనుకుంటున్నాను. కోరిక ఆలోచనయొక్క స్వభావపు తీరు. ఆలోచనలను అదుపుచేసే ప్రయత్నాల ద్వారా కోరికలను జయించాలని ఆశించాను, కోరికలను జయించనన్నా జయించాలి, లేదా నిగ్రహించాలి. అయితే నిగ్రహించాలంటే ముందు వాటిని అదుపులో వుంచాల్సిందే. సాధారణంగా గురువులందరూ కోరికలను అధిగమించాలని నొక్కి చెప్తుంటారు. ఇది సాధించడానికి రకరకాల పద్ధతులను వాళ్ళు సూచించారు.'
తక్కినవారు చెప్పినది సరే, అసలు మీరు ఏమనుకుంటున్నారు? కోరికలను అదుపు చేసినంత మాత్రాన కోరికలవలన కలిగే సమస్యలన్నింటినీ పరిష్కరించు కోగలమా? కోరికలను అణచివేయడంకాని, నిగ్రహించడంగానీ వాటి అవగాహనకి తోడ్పతాయా? వాటి నుంచి మిమ్మల్ని విముక్తి చేస్తాయా? ఏదో ఒక వ్యాపకం మతపరమైనది కాని, మరొకరం కాని పెట్టుకోవడం ద్వారా రోజులో ప్రతి నిముషమూ మనసుని క్రమశిక్షణలో వుంచవచ్చు. వ్యాపకంతో వున్న మనసు స్వేచ్చగా వున్న మనసు కాదు. స్వేచ్ఛగా వున్న మనసుకే కాలరహితమైన సృజనాత్మకతను గురించిన ఎరుక వుంటుంది.
"కోరికలను అధిగమించడం ద్వారా స్వేచ్చ కలగదా?”
అదిగమించడం అంటే మీ అర్థం ఏమిటి?
"సంతోషాన్ని పొందడంకోసమే కాకుండా, ఆ పరమ ఔన్నత్యాన్నీ అందుకోవాలంటే కూడా కోరిక మనమీద స్వారీ చేయకుండా చూసుకోవడం అవసరం. కల్లోలంలో, ఆ గందరగోళంలో మనం చిక్కుకొనిపోకుండా వుండటం ముఖ్యం. కోరికలను అదుపు చేయాలంటే ఏదో రకంగా పోటీని లొంగతీసుకోవడం చాలా అవసరం. అల్పమైన విషయాల వెంటబడకుండా ఆ మహనీయమైన దానిని యీ కోరికే అన్వేషించవచ్చుగదా!”
కోరుకుంటున్న అంశాన్ని మీరు మార్చేయవచ్చు. ఒక యింటిని కాకుండా, జ్ఞానాన్ని, నీచమైన వాటిని కాకుండా వున్నతమైన వాటిని మీరు కోరుకోవచ్చు. అయితే అప్పుడు కూడా యిదంతా కోరిక చేస్తున్న పనేకదా, కాదంటారా? యీ లౌకిక ప్రపంచంలో గుర్తింపు కోవాలని మీరు కోరుకోకపోవచ్చు కాని స్వర్గాన్ని అందుకోవాలనే కాంక్ష కూడా ఒక ఫలితం కోసం ప్రాకులాడటమే కాదా?కోరిక ఎప్పుడూ సఫలం అవాలని, ఏదో అంది పుచ్చుకోవాలని చూస్తూ వుంటుంది. ఈ కోరికల కదలికలను అవగాహన చేసుకోవాలే తప్ప, వాటిని దూరంగా నెట్టివేయడమో, అణగదొక్కడమే కూడదు. కోరిక తీరుతెన్నుల్ని అవగాహన చేసుకోకుండా కేవలం ఆలోచనలను అదుపు చేయడంవల్ల లాభం లేదు.
“అసలు నేను మొట్టమొదట మొదలు పెట్టిన విషయానికి తిరిగివస్తాను. కోరికను అవగాహన చేసుకోవాలన్నా ఏకాగ్రత అవసరం కదా? అదే నాకు వచ్చిన ఇబ్బంది. ఆలోచనలను అదుపులో పెట్టలేకపోతున్నాను. అవి వాటి యిష్టం వచ్చినట్లు షికార్లు చేస్తుంటాయి. దొర్లిపోతుంటాయి. రకరకాల అర్థంలేని ఆలోచనలు వస్తూ వుంటాయి తప్ప వాటిలో ఒక్కటైనా గంభీరంగా కొనసాగేది వుండదు.”
మనస్సు రాత్రింబగళ్ళు పనిచేసే యంత్రం వంటిది. వాగుతూ వుంటుంది. నిద్రలోనూ, మెలకువలోనూ ఆగకుండా పనిచేస్తూనే వుంటుంది. దానికి వేగం ఎక్కువ, సముద్రంలాగా మహా అశాంతంగా వుంటుంది. చాలా సంక్లిష్టమైన, అత్యంత జటిలమైన యీ యంత్రంలోని మొత్తం కదలికలన్నింటినీ ఒక భాగం అదుపు చేయాలని చూస్తుంది. దానితో పరస్పర వ్యతి రేకమైన కోరికల మధ్య, కాంక్షల మధ్య సంఘర్షణ బయలుదేరుతుంది. వాటికి వున్నతాత్మ, నీచాత్మ అని మీరు పేర్లు పెట్టవచ్చు. అయితే రెండూ మనసు ఆవరణలోనివే. మనసులో, ఆలోచనల్లో జరిగే చర్య, ప్రతిచర్యలు రెండూ దాదాపుగా ఒక్కసారే, చాలావరకు యాంత్రికంగా వాటంతట అవే జరిగిపోతుంటాయి. తెలిసి జరిగేవీ, అచేతనంగా జరిగేవీ అయిన బూ మొత్తం ప్రక్రియలు అంటే అంగీకరించడం, నిరాకరించడం, లొంగిపోవడం, స్వేచ్ఛకోసం ప్రయాసపడటం యివన్నీ అమిత వేగంతో జరిగిపోతుంటాయి. కాబట్టి అసలు ప్రశ్న యీ మహా సంక్లిష్టమైన యంత్రాన్ని ఎట్లా అదుపుచేయాలన్నది కాదు; ఎందుకంటే అదుపు చేయడం అనగానే ఘర్షణ వస్తుంది. దానివల్ల శక్తి వృధా అవుతుంది. అయితే అతి వేగంతో పరుగులు పెడుతున్న యీ మనసు తన వేగాన్ని తగ్గించుకోగలదా?
"కాని, ఎట్లా?"
సర్, దయచేసి ఏమీ అనుకోకండి, అసలు సమస్య 'ఎట్లా' అని కానేకాదు. 'ఏవిధంగా' అనేది కేవలం ఒక ఫలితాన్ని మనకి యిస్తుంది. ఆ చిట్ట చివరి ఫలితానికి ఏ ప్రాముఖ్యమూ లేదు. ఈ ఫలితాన్ని సాధించుకున్నా యింకొక కోరిక ఫలించడం కోసం మళ్ళీ ఒక అన్వేషణ మొదలవుతుంది. దానితోపాటుగా వుండే సంఘర్షణ, వ్యధ తప్పవు.
“అయితే యిప్పడు మనం చేయవలసింది ఏమిటి?”
మీరు సరియైన ప్రశ్న అడగడంలేదు, అవునా? మనసు తన వేగాన్ని తగ్గించుకోవడంలోని సత్యాసత్యాలు కని పెట్టడం పోయి, ఒక ఫలితం రాబట్టాలని మీరు ఆరాటపడుతున్నారు. ఫలితాన్ని సాధించడం కొంతవరకు సులువే, కాదూ? కట్టి పడవేసి ఆపడం ద్వారా కాకుండా మరో విధంగా తన వేగాన్ని తగ్గించుకోవడం మనసుకి సాధ్యపడుతుందా?
“వేగం తగ్గించుకోవడం అంటే అర్థం ఏమిటి?"
కారులో చాలా వేగంగా పోతున్నప్పుడు చుట్టూ వుండే దృశ్యాలు మసక మసగ్గా కనిపిస్తాయి. నడుస్తూ వెళ్తున్నప్పుడుండే వేగంలో మాత్రమే చెట్లనీ, పక్షులని, పూలని మీరు వివరంగా పరిశీలించగలుగుతారు. మనసు వేగం తగ్గించుకున్నపుడు స్వీయజ్ఞానం కలుగుతుంది. అంటే అర్ధం వేగం తగ్గించమని మనసుమీద వొత్తిడి ప్రయోగించడం కాదు. నిర్బంధంవల్ల ప్రతిరోధించడం బయలుదేరుతుంది. మనసు వేగాన్ని తగ్గించడానికీ యీ విదంగా శక్తిని వృధాచేయడం జరగకూడదు. అంతేనంటారా కాదా?
“ఆలోచనను అదుపుచేయడం అనే ప్రయత్నం అంతా వ్యర్ధ ప్రయాస అని యిప్పుడిప్పుడే నేను గ్రహిస్తున్నాను. అయితే అసలు చేయవలసిందేమిటో నాకు అర్థంకావడం లేదు.”
ఏం చర్య తీసుకోవాలనేదాకా మనం యింకా రాలేదు. అవునా? మనసు వేగం తగ్గించుకోవడం చాలా ముఖ్యం అనేది గ్రహించడానికి మనం ప్రయత్నిస్తున్నాం. వేగం ఎట్లా తగ్గించాలి అనే సంగతిని కాదు. మనసు వేగం తగ్గించుకోగలదా? అది ఎప్పుడు జరుగుతుంది?”
'నాకు తెలియదు. దీన్ని గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు.”
సర్, ఏదయినా ఒకదాన్ని మీరు అప్రమత్తంగా చూస్తున్నప్పుడు మనసు వేగం తగ్గిపోతుందని మీరు గమనించలేదా? ఆ దారిమీదుగా కారు పోతూండటం మీరు జాగ్రత్తగా గమనిస్తున్నప్పుడు, ఏదయినా ఒక వస్తువును బాగా పరిశీలనగా మీరు చూస్తున్నప్పుడు, మీ మనసు చాలా మెల్లిగా పనిచేయడంలేదూ? గమనించడం, పరిశీలించడం మనసు వేగాన్ని తగ్గిస్తాయి. ఒక చిత్రపటంవైపు కానీ, ఒక ప్రతిమవైపు కానీ, ఒక వస్తువువైపు కానీ చూస్తూ వుండటం మనసు నెమ్మదిగా అవడానికి తోడ్పడుతుంది. అట్లాగే కొన్ని పదాలను మళ్ళీ మళ్ళీ పునరుక్తి చేయడం కూడా. అయితే అప్పుడు ఆ వస్తువు, ఆ పదాలు చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటాయి. మనసు వేగం తగ్గించుకోవడం అన్నదానిని, తరువాత ఏం కనిపెడతాము అన్నదానిని మీరు వదిలేస్తారు.
'మీరు వివరిస్తున్న దానిని నేను గమనిస్తున్నాను. మనసు నిశ్చలంగా అయిన ఎరుక కలిగింది.'
ఏ విషయాన్నయినా మనం నిజంగా గమనిస్తామా? రకరకాల అపోహలతో, ప్రమాణాలతో, తప్పొప్పుల నిర్ణయాలతో, పోల్చిచూడటాలతో, నిరసించడాలతో నిర్మించిన ఒక తెరను పరిశీలకుడికి, పరిశీలిస్తున్న అంశానికీ మధ్యన దించి చూస్తామా.
'ఇటువంటి తెర లేకుండా చూడటం సాధ్యం కాదు. అటూ యిటూ ఏమాత్రం అతిక్రమించని తీరులో పరిశీలించగలగడం నాకు చేతనవుతుందనుకోను.' మాటలతో కొని, అనుకూలమైనవో, ప్రతీకూలమైనవో నిర్ణయాలు చేసుకొని కాని మీరే మీ చుట్టూరా ఒక అవరోధాన్ని పేర్చుకోకండి అని నేను సలహా యివ్వ వచ్చునా. ఇటువంటి ఒక తెర లేకుండా పరిశీలన చేయగలరా? మరొక విధంగా చెప్తాను. మనసు ఒక వ్యాపకంతో వున్నప్పుడు సావధానత్వం వుంటుందా? మనసులో ఏ వ్యాపకమూ లేకుండా వున్నప్పుడే అది శ్రద్ధగా వినగలుగుతుంది. జాగ్రత్తతో గమనించడం వున్నప్పుడు మనసు మెల్లగా నడుస్తూ, అప్రమత్తంగా వుంటుంది. అదే నిర్వ్యాపరంగా వున్న మనసు యొక్క సావధానశీలత.
“సర్, మీరు చెప్తున్నది నేను స్వయంగా అనుభవాత్మకంగా గ్రహిస్తూ వున్నాను.”
ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి దీనిని పరీక్షిద్దాం. పరిశీలకుడికి, పరిశీలిస్తున్న అంశానికీ మధ్యన విలువలు బేరీజు వేయడం కాని, ఒక తెర కాని లేనప్పుడు ఆ రెండింటి మధ్య అప్పుడు విభజన వుంటుందా, అవి అప్పుడు విడివిడిగా వుంటాయా? పరిశీలకుడే పరిశీలిస్తున్న అంశం కాదూ?
'నాకు బొత్తిగా తెలియడం లేదు.'
వజ్రాన్ని దాని స్వభావశీల గుణాలనుంచి విడదీయలేము, విడదీయ గలమా? అసూయాభావాన్ని ఆ అసూయని అనుభవిస్తున్నవాడి నుంచి విడిగా విడదీయలేము. అయితే విభజన చేయగలం అనే భ్రమ వుంటుంది, అది సంఘర్షణకు ఆస్కారమవు తుంది. ఈ సంఘర్షణలో మనసు చిక్కుకొని పోతుంది. అసత్యమైన మీ విభజన మాయమైపోయి నప్పుడు స్వేచ్ఛ పొందడానికి అవకాశం వుంటుంది. అప్పుడు మాత్రమే మనసు నిశ్చలంగా వుంటుంది. అనుభవించేవాడు వేరుగా లేనప్పుడే యదార్ధమైనది. సృజనాత్మకంగా కదులుతుంది.
(కమెంటరీస్ ఆన్ లివింగ్ : సెకండ్ సిరీస్)