కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం/నిబద్ధీకరణం

వికీసోర్స్ నుండి

నిబద్ధీకరణం

అతని ఆసక్తి అంతా మానవాళికి సేవలు చేయడంలో, మంచి పనులు చేయడంలో లగ్నమై వుంది. రకరకాల సమాజ సంక్షేమ సంస్థలతో, వాటి కార్యకలాపాలతో అతను తీరిక లేకుండా వుంటాడు. రోజులకొద్దీ సెలవు పెట్టి సరదాగా గడపడం అనేది ఎరగనే ఎరగనని అతడు అన్నాడు. కళాశాలలో చదువు ముగించగానే సమాజాభ్యుదయ కార్యక్రమాలను చేపట్టాడు. అప్పట్నుంచీ వదలకుండా అందులోనే నిమగ్నమై వున్నాడు. తను చేసే పనికి డబ్బు తీసుకోవడం అనే మాటే లేదుట. అన్నింటికంటే అతనికి తను చేస్తున్న పనే అతి ముఖ్యమైపోయింది. ఆ పనితో వీడదీయలేని బంధాన్ని పెంచుకున్నాడు. ఒక వుత్తమమైన సమాజ సేవకునిగా అతను స్థిరపడ్డాడు అది అతనికి నచ్చింది. అయితే ప్రసంగాలలో ఒకసారి. మనసుని నిబద్ధం చేసే రకరకాల పలాయన మార్గాలను గురించి చెప్తుంటే విన్నాడు. ఆ విషయమే యింకా వివరంగా మాట్లాడాలనుకుంటున్నాడు.

'సమాజ సేవకునిగా పనిచేయడం కూడా నిబద్దీకరణమే నంటారా? దీనివల్ల కూడా సంఘర్షణ పెరగడమే జరుగుతుందా?' నిబద్దీకరణం చెందడం అంటే ఏమిటో తెలుసుకుందాం. నిబద్ధీకృతమై వున్నా మనే ఎరుక మనకెప్పుడు కలుగుతుంది? అసలు ఆ ఎరుక మనకి వుంటుందా? మీరు నిబద్దీకృతులై వున్నారన్న సంగతి మీకు అసలు తెలుసా? మీ అస్తిత్వంలోని కొన్ని కొన్ని పొరల్లో మాత్రమే సంఘర్షణ, పోరాటం వున్నాయని అనుకుంటున్నారా? మనకి మన నిబద్దీకరణం గురించి తెలియకపోచ్చు కానీ మన సంఘర్షణలు, మన బాధలు, మన సుఖాల గురించి మాత్రం బాగా తెలుసు.

‘సంఘర్షణ అంటే మీ అర్థం ఏమిటీ?'

అన్ని రకాల సంఘర్షణలూ : దేశాల మధ్య, వివిధ సమాజాల మధ్య, వ్యక్తుల మధ్య వుండే సంఘర్షణలూ, మనిషి లోలోపల వుండే సంఘర్షణలూ కూడా, కర్తకి అంటే చర్య చేస్తున్న వాడికీ చర్యకీ మధ్య, ప్రేరణకి ప్రతిస్పందనకీ మధ్య సమైక్యత లేనంతవరకు సంఘర్షణ అనివార్యమే కాదా? సంఘర్షణే మన సమస్య, అవునా కాదా? ఏదో ఒక్క సంఘర్షణ కాదు. అన్ని రకాల సంఘర్షణలూ : భావాలకు, నమ్మకాలకు, సిద్ధాంతాలకు మధ్య గల పోరాటం, రెండు పరస్పర వ్యతిరేక విషయాల మధ్య పోరాటం; సంఘర్షణలు కనుక లేకపోతే సమస్యలే వుండవు. 'అందరూ ఏకాంత జీవితాన్నీ, ధ్యానమూ, గాఢ అంతర్విచారణలతో కూడిన జీవితాన్నే గడపాలని మీ సలహానా?'

గాఢమైన ఆలోచనా నిమగ్నత చాలా శ్రమతో కూడుకున్న విషయం. దానిని అవగాహన చేసుకోవడం చాలా కష్టం. తెలిసో, తెలియకుండానేనో ప్రతి ఒక్కరూ తమ తమ పద్దతులకు చెందిన ఒక ఏకాంత జీవితాన్నే కోరుకుంటూ వుంటారు. అయితే ఆ ఏకాంత వాసం మన సమస్యలను పరిష్కరించలేదు. పైగా సమస్యలు యింకా పెరిగిపోతాయి. ఈ నిబద్దీకరణంలోని ఏయే అంశాలు సంఘర్షణలను యింకా ఎక్కువ చేస్తాయి అన్నది అవగాహన చేసుకోవాలని మనం ప్రయత్నిస్తున్నాం. మన సంఘర్షణలని గురించి, బాధలు, సుఖాల గురించి మనకు తెలుసు. అయితే మన నిబద్ధీకరణాన్ని గురించి మనకే తెలియదు. అసలు యీ నిబద్ధీకరణం ఎట్లా జరుగుతుంది?

'సామాజిక ప్రభావాల వల్ల, పరిసరాల ప్రభావాల వల్ల. మనం జన్మించిన సమాజం, మనం పెరిగిన సంస్కృతి, ఆర్థికపరమైన, రాజకీయమైన ఒత్తిడులు మొదలైన వాటివల్ల.'

అది సరే, కానీ మొత్తం అంతా అదేనా? ఇవన్నీ మనం స్వయంగా తయారు చేసుకున్న ప్రభావాలు. అవునా కాదా? మనిషికి తన తోటి మనుష్యులతో వుండే సంబంధ బాంధవ్యాల ఫలితంగా సమాజం ఏర్పడింది. దీనిలో సందేహం లేదు. ఉపయుక్తత, అవసరాలు, సౌకర్యం, సంతృప్తి అనే వాటి మీద యీ బాంధవ్యాలు ఆధారపడి వున్నాయి. ఈ బాంధవ్యాలే మనల్ని కట్టి పడ వేసే ప్రభావాలను, విలువలను తయారుచేస్తున్నాయి. ఈ కట్టిపడేయడమే మన నిబద్దీకరణం. మన ఆలోచనలు, మన చర్యలే మనల్ని బంధిస్తాయి. అయితే మనం యీ విధంగా బంధించబడి వున్నామని మనకే తెలియదు. మనకు తెలసిందల్లా మన బాధలు, సుఖాలు, వాటికి సంబంధించిన సంఘర్షణ, దీనిని మించి పోవడం మన వల్ల కాదు. మనకు చేతనైనది ఏమిటంటే మన సంఘర్షణను యింకాస్త ఎక్కువ చేసుకోవడం. మన నిబద్ధీకరణాన్ని గురించి మనకు తెలియనే తెలియదు. అది తెలుసుకోనంతవరకు సంఘర్షణను, గందరగోళాన్ని యింకా పెంచుకుంటూనే వుంటాం.

'నిబద్దీకరణాన్ని గురించిన ఎరుక మనలో ఎట్లా కలుగుతుంది?'

అది కలగాలంటే మరొక ప్రక్రియని మమకారబంధం అనే ప్రక్రియని అర్థం చేసుకోవాలి. మమకారాన్ని ఎందుకు పెంచుకుంటామో అర్థం చేసుకుంటే, అప్పుడు బహుశ మన నిబద్ధీకరణాన్ని గురించిన ఎరుక మనలో కలుగుతుంది. ‘సూటిగా అడిగిన ప్రశ్నకు డొంక తిరుగుడుగా వున్న సమాధానం కాదా యిది?'

అట్లాగా? మీరు నిబద్దులై వున్నారనే ఎరుక పొందడానికి ప్రయత్నించి చూడండి. వరోక్షంగా, మరొక దానితో సంబంధించిన అంశంగా మాత్రమే దానిని తెలుసుకోగలుగుతారు. దేనిమీదా ఆధారపడని, కేవలం ఒక సిద్ధాంతంలాగా మీ నిబద్ధీకరణాన్ని గురించి తెలుసుకోలేరు. అప్పుడది ఒక మాట, ఒక శబ్దం అవుతుందే తప్ప అంతకంటే గొప్ప అర్ధం అందులో కనిపించదు. మనకు ఒక్క సంఘర్షణను గురించే తెలుసు. సమస్యకూ ప్రతిస్పందనకూ మధ్యన సమైక్యత లేనప్పుడు సంఘర్షణ కలుగుతుంది. ఈ సంఘర్షణ మన నిబద్ధీకరణానికి పర్యవసానం. నిబద్దీకరణం అంటే మమకార బంధం. మన పనితో, సంప్రదాయంతో, ఆసక్తితో, మనుష్యులతో, సిద్ధాంతాలతో యింకా ఎన్నో యిటువంటి వాటితో మనకు వుండే మమకార బంధం. ఈ మమకారమే కనుక లేకపోతే నిబద్దీకరణం వుంటుందా? ఉండనే వుండదు. మరి అప్పుడు మనం ఎందుకీ మమకారం పెంచుకుంటాం? నా దేశం మీద నాకు మమకారం; ఎందుకంటే దేశం పేరు చెప్పుకుంటే గాని నాకో గుర్తింపు వుండదు. నేను చేస్తున్న పనివల్ల నాకు ఒక గుర్తింపు వస్తుంది కాబట్టి ఆ పని నాకు చాలా ప్రధానమైపోతుంది. నేను అంటే నా కుటుంబం, నా ఆస్తిపాస్తులు. వాటిమీద నాకు మమకారం. నా లోని ఖాళీతనాన్నుంచి నేను దూరంగా పారిపోవడానికి, నేను మమకారం పెంచుకున్న విషయం నాకొక దారిని చూపిస్తుంది. మమకారం అంటేనే పలాయనం, ఈ పారిపోవడమే నిబద్ధీకరణాన్ని యింకా పటిష్టంగా తయారుచేస్తున్నది. నీమీద నేను మమకారం పెంచుకున్నానంటే దానికి కారణం నేను పారిపోవడానికి నీవు ఒక సాధనంగా పనికొస్తున్నావు కాబట్టి. అందువల్ల నీవు నాకు చాలా ముఖ్యమైన వ్యక్తివి, నీవు నాకు స్వంతం అవాలి, నిన్ను గట్టిగా పట్టుకొని వుంటాను. నిబద్ధీకరణంలో నీవూ ఒక అంశం; పారిపోవడమే ఆ నిబద్దీకరణం. మన యీ పారిపోవడాలనీ గురించిన ఎరుక మనకు కలిగితే అప్పుడు యీ నిబద్ధీకరణాన్ని తయారుచేస్తున్న కారణాలను, ప్రభావాలను చక్కగా పరిశీలించవచ్చు.

'సమాజ సేవ ద్వారా నానుంచి నేను పారిపోతున్నానా?'

దాని మీద మీకు మమకారం వుందా? అది మిమ్మల్ని బంధిస్తున్నదా? సమాజ సేవ చేయకపోతే మీరు అయోమయంలో పడిపోతారా; అంతా ఖాళీగానూ, విసుగ్గానూ అనిపిస్తుందో మీకు?

'తప్పకుండా అనిపిస్తుంది.' పనిమీద మీరు పెంచుకున్న మమకార బంధమే మీ పలాయనం. మన అస్తిత్వంలోని అన్నీ స్థాయిల్లోనూ యిది జరుగుతుంటుంది. మీరు పనిలో పడటం ద్వారా పారిపోతారు. మరొకరు త్రాగుడులో; మతపరమైన కర్మకాండల్లో యింకొకరు; జ్ఞానం ఆర్జించడంలో కొందరూ, దేవుడి పేరు చెప్పుకొని కొందరూ పారిపోతుంటారు. ఒక్కొక్కళ్ళు వినోదకాలక్షేపాలకు బానిసలవుతారు. అన్ని పలాయనాలు ఒకటే, అందులో గొప్పవీ, అల్పమైనవీ అనే తేడాలు లేవు. మనం ఏమిటో ఆ దానినుంచి పారిపోవడానికి వుపయోగించుకుంటున్నంత కాలం దేవుడూ, త్రాగుడు రెండింటి స్థాయీ ఒకటే. ఈ పలాయనాల గురించిన 'ఎరుక కలిగినప్పుడే, మన నిబద్ధీకరణాన్ని గురించి తెలుసుకోగలుగుతాం.

'సమాజ సేవ ద్వారా పారిపోవడం అనేది నేను ఆపివేశాననుకోండి. ఆ తరువాత నేను ఏంచేయాలి? పలాయనం అన్నది లేకుండా ఏ పనైనా నేను చేయగలనా? నేను చేసే అన్ని పనులూ ఏదో ఒక రూపంలో నానుంచి నేను పారిపోవడమే కాదా?'

ఈ ప్రశ్న కేవలం మాటలతో పేర్చినదో, లేక మీరు నిజంగా అనుభూతి చెందుతున్న ఒక వాస్తవాన్ని వ్యక్తం చేస్తున్నదా? మీరు పారిపోకుండా వుంటే అప్పుడు ఏమవుతుంది? అదెప్పుడయినా ప్రయత్నించారా?

`ఇట్లా నేను అనవచ్చో కూడదో కాని మీరు చెప్పేదంతో వట్టి వ్యతిరేక వాదంగా వుంది. పనికి ప్రత్యామ్నాయంగా యింకొకదానిని మీరు చూపడం లేదు.'

ఈ ప్రత్యామ్నాయాలు వెతుక్కోవడం అంతా యింకో రకం పలాయనం కాదూ? ఒక రకం కార్యకలాపాలు సంతృప్తికరంగా లేకపోతేనో, సంఘర్షణను పెంచుతుంటేనో మరోకదానివైపు మళ్ళుతాం. అసలు పలాయనం అనే దానినీ అర్ధం చేసుకోకుండా ఒక పని ఆ పేసి, ఆ స్థానంలో మరో కార్యకలాపాన్ని పెట్టుకోవడం వల్ల ఏమీ లాభం లేదు. అవునా కాదా? ఈ పలాయనాలు, వాటి మీద మనం పెంచుకున్న మమకార బంధాలే నిబద్ధీకరణాన్ని తయారు చేస్తున్నాయి. నిబద్దీకరణం వల్లనే సమస్యలు, సంఘర్షణ వుత్పన్నమవుతున్నాయి. ఈ నిబద్ధీకరణమే సమస్యలనీ అవగాహన చేసుకోకుండా మనకి అడ్డు తగులుతున్నది. నిబద్ధులమై వుండటంవల్ల మన ప్రతిస్పందనలన్నీ తప్పకుండా సంఘర్షణకు దారితీస్తాయి.

'నిబద్ధీకరణం నుంచి విముక్తి ఎట్లా దొరుకుతుంది?'

అవగాహన చేసుకోవడం వలన; మన పలాయనాల గురించి ఎరుక పొందడం వలన. ఒక మనిషిపైన, ఒక సిద్ధాంతం పైన మమకారం పెంచుకోవడమే నిబద్ధీకరణం పొందడానికి గల కారణం. మనం అర్థం చేసుకోవలసింది అదీ. అంతే తప్ప, యింతకంటే మంచి పలాయనాన్నో, యింతకంటే తెలివిగల పలాయనాన్నో వెతుక్కో వడం కాదు. పలాయనాలన్నీ తెలివి తక్కువ వల్ల జరిగేవే. ఎందుకంటే వాటి వలన సంఘర్షణతప్పకుండా పుడుతుంది. నిర్మమకారంగా వుండటం అలవాటు చేసుకోవడం యింకొక రకమైన పలాయనమూ, ఏకాంతవాసమూ అవుతుంది. అది మళ్ళీ ఆకారం లేనీ ఒక భావన మీద, ఒక ఆదర్శం మీద మమకారం పెంచుకోవడం అవుతుంది. ఆదర్శం కాల్పనికమైనది. అహం తయారుచేసినది. ఆదర్శాన్ని అందుకోవడం అంటే 'వున్నది' నుంచి పారిపోవడమే. మనసు ఏరకమైన పలాయనాన్నీ కోరుకోకుండా వున్నప్పుడు మాత్రమే 'వున్నది' ని అవగాహన చేసుకోవడం, 'వున్నది' కి సంబంధించి సముచితమైన చర్య చేయడం జరుగుతాయి. 'ఉన్నది' గురించి ఆలోచించడం కూడా 'వున్నది' నుంచి పారిపోవడమే. సమస్య గురించి ఆలోచించడం అంటే సమస్య నుంచి పారిపోవడం. ఎందుకంటే ఆలోచించడమే సమస్య. అసలు సమస్య అదే. మనసు తను ఏమిటో అట్లా వుండటం యిష్టపడదు కాబట్టి, తను ఏమిటో అది అంటే భయపడుతుంది కాబట్టి, యీ రకరకాల పలాయనాలు వెతుక్కుంటుంది. పలాయనానికి దారితీసేది ఆలోచన. ఆలోచన వున్నంతవరకు పలాయనాలు, మమకార బంధాలు వుండి తీరుతాయి. వాటివల్ల నిబద్ధీకరణం యింకా గట్టిపడుతుంది.

ఆలోచించడం నుంచి విముక్తి పొందడం ద్వారా నిబద్ధీకరణం నుంచి స్వేచ్ఛ లభిస్తుంది. మనసు సంపూర్ణమైన నిశ్చలతతో వున్నప్పుడు మాత్రమే యదార్ధమైనది వుండటానికి కావలసిన స్వేచ్ఛ లభిస్తుంది.

(కమెంటరీస్ ఆన్ లివింగ్ ; సెకండ్ సిరీస్)