కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం/కోపం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

కోపం

అంత ఎత్తుమీద వున్నా వేడి మహా తీవ్రంగా వుంది. గాజు కిటికీ తలుపులనీ చేత్తో తాకి చూస్తే కాలుతున్నాయి. విమానాన్ని నడిపిస్తున్న యంత్రాల చప్పుడు జోలపాటలాగా వున్నది. చాలా మంది ప్రయాణీకులు కునుకు తీస్తున్నారు. నేల మాకు కిందగా, చాలా దూరంలో వుంది; బాగా వేడెక్కి తళతళమని మెరుస్తున్నది. అంతా మట్టినేలే, అక్కడక్కడ మాత్రం కాస్త పచ్చపచ్చగా కనిపిస్తున్నది. ఇంకాసేపయాక విమానం ఆగింది. ఇప్పుడు వేడి మరీ భరించలేనంతగా ఎక్కువైంది. నిజంగానే చాలా బాధాకరంగా వుంది. నీడలోకి వెళ్ళాక కూడా తలకాయు బ్రద్దలవు తుందేమోననిపించేంత వేడి. నడి వేసంకాలం అవడంతో ఆ ప్రాంతం అంతా దాదాపు ఎడారిలాగా వుంది. మళ్ళీ అందరం విమానం ఎక్కాం. చల్లని గాలులు వెతుక్కుంటూ విమానం యింకా ఎత్తులకి ఎగరడం ఆరంభించింది. ఇప్పుడు యిద్దరు కొత్త ప్రయాణీకులు ఎదురుగుండా కూర్చున్నారు. బాగా గట్టిగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ మాటలు వినకుండా వుండటం శక్యంకాని పని. ముందు కొంచెం మెల్లగానే మొదలు పెట్టారు. ఆ పైన వాళ్ళ కంరాల్లో కోపం ప్రవేశించింది. ఎంతోకాలంగా పరిచయమూ, లోలోపల విరోధమూ వుండటంవల్ల వచ్చే కోపం అది. వాళ్ళ వుద్రేకంలో తక్కిన ప్రయాణీకుల సంగతే మరిచినట్లున్నారు. వాళ్ళిద్దరూ ఎంత ఆందోళనలో మునిగి వున్నారంటే తక్కిన ప్రపంచపు వునికినే పట్టించుకోవడం లేదు. అందరి నుంచి దూరంగా విడదీసే ఒక ప్రత్యేక గుణం కోపంలో వుంటుంది. దుఃఖం లాగే యితర్లనుంచి మనల్ని దూరం చేస్తుంది. కనీసం ఆ కొంత సేపు అన్ని బాంధవ్యాలు అదృశ్యమై పోతాయి. ఏకాంతంగా వున్నవారిలో కనబడే దారుఢ్యమూ, జీవశక్తి కోపంలో కూడా తాత్కాలికంగా వుంటాయి. కోపంలో ఒక వింతైన నిస్పృహా వుంటుంది. అసలు ఒంటరిపోటు అంటేనే నిస్పృహ. నిరాశలో, అసూయలో, గాయపరచాలనే వాంఛలో వుండే కోపం గొప్ప తీవ్రత్వంతో బయటపడుతుంది. అందులో తనని తాను సమర్ధించుకోవడమనే సుఖం వుంటుంది. ఇతర్లని మనం నిరసిస్తాం. ఆ నిరసించడంలోనే మనల్ని సమర్థించుకోవడం వుంటుంది. ఏదో ఒక రకమైన యిటువంటి వైఖరి- తామే నీతిమంతులమనే స్వాతిశయంకానీ, లేదా ఆత్మన్యూనతాభావం కానీలేనప్పుడు మనం ఏమిటి? ధైర్యం తెచ్చుకోని బలం పుంజుకోవడానికి మనంతట మనమే రకరకాలుగా ప్రయత్నిస్తూ వుంటాం. ఇటువంటి పద్ధతుల్లో చాలా సులువైనది ద్వేషం. అటువంటిదే కోపమూ. మామూలు కోపం, క్షణాల మీద మరుపులో పడిపోయేదీ, ఛప్పున ఎగసి ఆరిపోయే మంట వంటిది అయిన కోపం- ఒక రకం. కావాలని ప్రయత్నపూర్వకంగా పెంచుకొని, మరగబెట్టి, గాయపరచాలనీ, ధ్వంసం చేయాలనీ చూసే కోపం పూర్తిగా మరొక రకానికి చెందినది. సరళమైన సాధారణ కోపానికి వెనుక ఏదో ఒక శరీరసంబంధమైన కారణం వుండచ్చు. అది కని పెట్టి చికిత్స చేసి నయంచేసుకోవచ్చు. కాని మనోతత్వ సంబంధమైన కారణం వల్ల జనించే కోపం అంతకంటే క్లిష్టంగా వుంటుంది. దానితో వ్యవహరించడమూ కష్టమే. మనలో చాలామందికి కోపం తెచ్చుకోవడానికి ఏ అభ్యంతరమూ వుండదు. ఏదో ఒక సాకు కోసం చూస్తూ వుంటాం, మనల్ని కాని, మన తోటివారిని కానీ యితరులు కష్ట పెడుతున్నప్పుడు ఎందుకు కోపం తెచ్చుకో గూడదు? అప్పుడు న్యాయం కోసం ఆగ్రహం తెచ్చుకుంటాం. కోపం వచ్చింది అని ఆ తర్వాత మాట్లాడకుండా వూరుకోవచ్చు కదా. అట్లా వూరుకోము. ఆ కోపానికి గల కారణాలను గురించి చాలా వివరంగా వ్యాఖ్యానాలు యిస్తాం. ఆసూయ, పగో నాకు వున్నది అని అనేసి వూరుకోం, దాన్ని సమర్థించడమో, దానిని గురించి వివరించడమో చేయాల్సిందే. అసూయ లేకుండా ప్రేమ వుంటుందా అని ప్రశ్నిస్తాం. ఎవరో చేసిన పనుల ఫలితంగా నాలో యీ కసి ఏర్పడింది అనీ యింకా యిట్లాంటివే ఎన్నో అంటూ వుంటాం.

మౌనంగా కాని, సంభాషణల ద్వారా కాని వివరించడం, మాటల్లో వ్యక్తీకరించడం కోపానికి విషయమూ, లోతూ యిచ్చి కోపం చల్లారి పోకుండా చూస్తాయి. మౌనంగానో, మాటల్లోనో మనం యిచ్చే వివరణాత్మక సమాధానాలు మనం ఏమిటి అన్నదానిని వున్నది వున్నట్లుగా కని పెట్టకుండా అడ్డుతగిలే అవరోధంగా పనిచేస్తాయి. మనకి

146

కృష్ణమూర్తి తత్వం

మెప్పుదల, పొగడ్తలు కావాలి. ఎప్పుడూ ఆశగా ఎదురుచూస్తూ వుంటాం. అవి దొరకనప్పుడు నిరాశలో మునిగిపోతాం. మన లోపల కసి, యీర్ష్య పెంచుకుంటాం. ఇక అప్పుడు వుద్రేకంగానో, నెమ్మదిగానో ఎవరో ఒకరి మీద తప్పు తోసేస్తాం. మనలోని యీ కటుత్వానికి బాధ్యత అంతా యితరులదే అని అంటాం. నీకు అందరికంటే గొప్ప ప్రాధాన్యం యిస్తాను, ఎందుకంటే నా సంతోషానికి, నా హోదాకి, నా పరువు ప్రతిష్ఠలకి నీమీద ఆధారపడతాను కాబట్టి. నీ ద్వారానే నా సార్థకత. అందుకని నాకు నీవు చాలా ముఖ్యం. నిన్ను రక్షించుకోవాలి, నిన్ను నా స్వాధీనంలో వుంచుకోవాలి. నా నుంచి నేను నీ ద్వారా తప్పించుకొని పారిపోతాను. వెనక్కి మళ్ళించి నన్ను నాకే ఎదురుగా నిలబెడితే, నా స్థితిని చూసి కలిగిన భయంలో కోపం తెచ్చుకుంటాను. కోపం రకరకాల రూపాలని తెలుస్తుంది; నైరాశ్యం, కసి, యీర్ష్య మొదలైనవి.

కోపాన్ని కూడబెట్టుకున్నప్పుడు అది ద్వేషమవుతుంది; దీనికి విరుగుడుగా క్షమాగుణం అవసరమవుతుంది. అయితే క్షమాగుణాని కంటే యీ కోపాన్ని కూడబెట్టుకోవడం అన్నదానిదే అనలు ప్రధానపాత్ర, కోపాన్ని కూడబెట్టి దోచుకోవడమే లేకపోతే క్షమాగుణం ఆవశ్యకతే వుండదు. ద్వేషం వున్నప్పుడే క్షమించడమూ అవసరమవుతుంది. నిర్లక్ష్యభావం అనే కారిన్యాన్ని పెంచుకోకుండా పొగడ్తలనుంచి, గాయపడినట్లుగా భావించడం నుంచి విముక్తి చెందాలంటే కరుణ, దయాగుణమూ తప్పక కావాలి. ఒక సంకల్పం చేసుకోవడం ద్వారా కోపాన్ని పోగొట్టుకోవడం సాధ్యంకాదు. ఎందుకంటే సంకల్పం హింసలో ఒక భాగం. కోరికకు పర్యవసానంగా సంకల్పం కలుగుతుంది. మరొకటి అవాలనే వ్యామోహం అది. కోరిక అంటేనే దాని స్వభావంలో దూకుడూ, మనదే పైచేయిగా వుండాలనే తత్వమూ వుంటాయి. గట్టిగా సంకల్పించుకొని కోపాన్ని అణచివేయడం దాన్ని మరొక స్థాయిలోకి తీసుకొనిపోతుంది. అప్పుడు దానీ పేరు యింకొకటవుతుంది. అయితే, అప్పుడు కూడా అది హింసలో భాగమే. అహింసను అలవాటు చేసుకోవడం ద్వారా హింసను వదుల్చుకోలేము. కోరికను అవగాహన చేసుకుంటేనే అది జరుగుతుంది. కోరికకు బదులుగా ఆధ్యాత్మికమైన ప్రత్యామ్నాయం ఏదీ వుండదు. కోరికను అణచివేయలేము, నిగ్రహించనూ లేము. కోరిక ఎడల మౌనంగా, యిష్టాయిష్ట ప్రసక్తి లేని ఎరుకతో వుండాలి. ఈ నిరాసక్తమైన ఎరుక కలిగివుండటమే కోరికను ప్రత్యక్ష అనుభవంలోకి తెచ్చుకోవడం.ఇక్కడ అనుభవించేవాడు ఆ కోరికకి ఒక పేరు పెట్టడం వుండదు.

(కమెంటరీస్ ఆన్ లివింగ్)