కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం/భద్రత

వికీసోర్స్ నుండి

భద్రత

వరిమళ్ళని చుట్టుకుంటూ పోతున్న యీ త్రోవ పక్కనే ఒక చిన్న కాలువ మందంగా ప్రవహిస్తూ వుంది. దాని నిండా తామరపూలు విచ్చుకొని వున్నాయి. మధ్యలో బంగారపు రంగు బొడ్లతో వున్న ఆ ముదురు వూదా రంగు పూలు నీళ్ళమీద బాగా పైకి వచ్చి తేలుతున్నాయి. వాటి పరిమళం పూలని అంటిపెట్టుకొని అక్కడే వుండిపోయింది. చాలా అందంగా వున్నాయి ఆ పూలు. ఆకాశం మేఘావృతమై వుంది. సన్నగా జల్లు పడడం మొదలయింది. మబ్బులు వుండి వుండి వురుము తున్నాయి. ఎక్కడో చాలా దూరంలో మెరుపులు మెరుస్తున్నాయి. కాని త్వరలోనే మేము నిలబడిన చెట్టు వైపుగానే రాబోతున్నాయి. వర్షం బాగా ఎక్కువైంది. తామర ఆకులమీద నీటి బిందువులు నిలబడిపోతున్నాయి. నీటి బిందువులు కొన్ని పోగయ్యాక, అవి మరీ పెద్దవైనప్పుడు ఆకులమీద నుంచి జారి కిందపడిపోతున్నాయి. మళ్ళీ కొత్త బిందువులు పోగవుతున్నాయి. ఇప్పుడు మా చెట్టుమీదే మెరుపులు మెరవడం ఆరంభమైంది. పశువులు భయపడిపోయి 'కట్టుతాళ్ళని తెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. నల్లని దూడ ఒకటి బాగా తడిసి, వణికిపోతూ, ఆతిదీనంగా అరిచింది. తరువాత తాడు తెంపేసుకొని, దగ్గరలోనే వున్న గుడిసెలోకి పరుగెత్తింది. తామరపూలు గట్టిగా ముడుచుకొని పోతున్నాయి. చుట్టూ ముసురుకుంటున్న చీకట్లనుండి తమ హృదయాలను దాచుకుంటున్నాయి. ఇప్పుడు వాటి లోపల వున్న బంగారపురంగు బొడ్లను చూడాలంటే వూదారంగు పూరేకులను బలంగా పీకి తెరవాలిసిందే. మళ్ళీ సూర్యుడు కనబడేదాకా అవి గట్టిగా ముడుచుకొనిపోయి వుంటాయి. అట్లా నిద్ర పోతున్నప్పుడు కూడా అవి ఎంతో అందంగా వున్నాయి. విద్యుల్లతలు వూరివైపుగా కదులుతున్నాయి. ఇప్పుడిక బాగా చీకటి పడిపోయింది. కాలువ నీటి గలగలల చప్పుడు మాత్రం సన్నగా చెవులకు వినిపిస్తున్నది. ఈ త్రోవే గ్రామాన్ని దాటుకుంటూ రహదారి వద్దకు చేరుస్తుంది. ఆ రహదారిమీదే ప్రయాణించి, కోలాహలంగా వుండే పట్టణాన్ని, తిరిగి మేము చేరుకున్నాం.

అతను యువకుడు. వయసు యిరవైలలో వుంటుంది. మంచి పోషణలో పెరిగిన శరీరం. ప్రపంచం కొంత తిరిగి చూశాడు. కళాశాలలో చదువుకున్నవాడు. భయభయంగా కనబడుతున్నాడు. అతని కళ్ళల్లో ఆదుర్డా వుంది. అప్పటికే ఆలస్యమైంది. కాని అతను ఏదో మాట్లాడాలన్నాడు. తన మనసును ఎవరయినా శోధించి, అక్కడ ఏమున్నదో వెదికి కని పెట్టాలని కోరాడు. చాలా మామూలుగా తనని గురించి తాను చెప్పుకున్నాడు. కాస్తయినా సంకోచమూ, దాపరికమూ కనబరచలేదు. అతని సమస్య ఏమిటో స్పష్టంగానే తెలుస్తున్నది, కాని అతనికి అది కనబడటంలేదు. అందువల్ల తడుముకుంటున్నాడు.

'ఉన్నది' ఏమిటో దానిని మనం వినిపించుకోము, కనిపెట్టము. మన వూహలు, మన అభిప్రాయాలు యితరుల మీద రుద్దుతూ వుంటాం. ఇతరులని మన ఆలోచనల చట్రంలో యిరికించాలని ప్రయత్నిస్తుంటాం. 'ఉన్నది'ని కని పెట్టడంకంటే మన ఆలోచనలు, మనం చేసే న్యాయనిర్ణయాలు మనకీ చాలా ముఖ్యం. 'ఉన్నది' చాలా సరళంగా వుంటుంది. క్లిష్టంగా వుండేది మనం. సరళంగా వుండే 'వున్నది'ని సంక్లిష్టపరచి, అందులో పూర్తిగా మునిగిపోతాం. రోజు రోజుకీ మన లోపల ఎక్కువై పోతున్న యీ గందరగోళమూ, అది చేసే గోలా మాత్రమే మనకు వినబడుతూ వుంటాయి. 'ఉన్నది' ని వినాలంటే మనకి స్వేచ్చ వుండాలి. అంటే అర్థం ఏ వ్యాపకాలూ వుండకూడదని కాదు. ఆలోచన కూడా ఒక రకమైన వ్యాపకమే. నిశ్శబ్దంగా వుండటానికి యివేవీ మనకి అడ్డుతగల కూడదు. అట్లా నిశ్శబ్దంగా వున్నప్పుడే వినడం అనేది సాధ్యపడుతుంది. అతను యిట్లా చెప్పాడు. నిద్ర పట్టబోతూ వున్నప్పుడు హఠాత్తుగా ఏ అకారమూ లేని అచ్చమైన భయం అతన్ని లేపి కూర్చోబెడుతుందట. ఆ సమయంలో గది స్వరూపమే తల్లక్రిందులై పోతుంది. గోడలు నేలమట్టంగా వుంటాయట. పైన కప్పు వుండదు. కింద నేల మాయమవుతుంది. అతను భయంతో వణికి పోతుంటాట్ట. దిగచెమటలు పోస్తాయి. చాలా సంవత్సరాలుగా యిట్లా జరుగుతున్నదిట.

దేన్ని గురించి మీరు భయపడుతుంటారు?

'నాకు తెలియదు. కాని ఆ భయంతో నాకు మెలకువ వచ్చినప్పుడు మా అక్కయ్య వద్దకో, మా అమ్మానాన్నల వద్దకో వెళ్తుంటాను. కాసేపు వాళ్ళతో మాట్లాడాక నాలో అలజడి తగ్గిపోతుంది. ఆ తరువాత మళ్ళీ నిద్రపోతాను, వాళ్ళు అర్థంచేసు కుంటారు. అయితే నాకు యిరవై ఏళ్ళు దాటాయి. ఇదంతా చాలా వెర్రితనంగా అనిపిస్తున్నది.' మీరు భవిష్యత్తుని గురించి వ్యాకులపడుతున్నారా?

'ఆఁ, కొంత అదే. మేము బాగా వున్నవాళ్ళమే. అయినా నాకు యీ విషయంలో కొంత ఆందోళన వున్నది'.

ఎందువల్ల? 'నేను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను. నా కాబోయే భార్యకు అన్నీ సౌకర్యంగా ఏర్పాటు చేయాలి.'

భవిష్యత్తుని గురించి ఆందోళన పడటం ఎందుకు? మీరు యింకా చాలా చిన్న వయసులో వున్నారు. ఉద్యోగం చేసి, భార్యకి కావలసినవన్నీ సమకూర్చవచ్చు. ఎప్పుడూ అదే ధ్యాసలో పడిపోయివుండటం ఎందుకు? సమాజంలో మీకున్న హోదా పోతుందేమోననే భయం మీలో వున్నదా?

'కొంతవరకు అదీ వుంది. మాకు కారు వున్నది, కొంత ఆస్తి, పేరు ప్రఖ్యాతులు వున్నాయి. ఇదంతా పోగొట్టుకోవాలనీ లేకపోవడం సహజమే. బహుశ నా భయానికి అదే కారణమై వుండచ్చు. కానీ పూర్తిగా అదే కాదు. అసలు భయం నా అస్తిత్వం పోతుందేమోనన్నది. భయంతో నాకు మెలకువ వచ్చినప్పుడు, నాకు అంతా అయోమయంగా అనిపిస్తుంది. నేను ఎవరినీ కాను అని అనిపిస్తుంది, ముక్కలు ముక్కలై నేను విరిగిపడిపోతున్నట్లుగా అనిపిస్తుంది.'

ఒకవేళ ఏదయినా కొత్త ప్రభుత్వం వస్తే, మీ ఆస్తి, మీ సంపద అంతా మీరు కోల్పోవచ్చు. కానీ మీరు యింకా చిన్నవయస్సులోనే వున్నారు. ఉద్యోగం చేసి, సంపాదించుకోవచ్చు. లక్షలాదిమంది తమ యిళ్ళూ వాకిళ్లూ పోగొట్టుకుంటున్నారు. మీకూ అది జరుగుతే జరగచ్చు. అంతే కాకుండా, అసలు ప్రపంచంలో వున్న సంపద అందరూ పంచుకోవాలి తప్ప, కొద్దిమంది చేతుల్లో వుండటం సమంజసం కాదు. ఈ వయసులో యింత సనాతనమైన పాతధోరణి ఆలోచనలు ఎందుకున్నాయి మీలో, ఆస్తి పోతుందని అంత భయం ఎందుకు?

'చూడండి, ఒక అమ్మాయిని నేను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను. దీనికి ఏ అవరోధాలు వస్తాయోనని భయపడుతున్నాను. మమ్మల్ని ఏవీ ఆపలేవని నాకు తెలుసు; ఆమెని విడిచి నేను, నేను లేకుండా ఆమె వుండలేక పోతున్నాం. నా భయానికి గల కారణాలలో యిదీ ఒకటేమో.'

మీ భయానికి కారణం అదేనా? మీకు తెలిసినంతలో మీ వివాహానికి అడ్డుతగిలేది ఏదీ లేదని మీరు గట్టిగా చెప్తున్నారు. అట్లాంటప్పుడు యింకా యీ భయం దేనికి?

'నిజమే. మేము ఎప్పుడు కావాలని నిర్ణయించుకుంటే అప్పుడు వివాహం చేసుకోవచ్చు. కాబట్టి నా భయానికి అది కారణం కాకపోవచ్చు. కనీసం ప్రస్తుతానికి. బహుశ నేను భయపడుతున్నది నా అస్తిత్వం లేకుండా పోతుందని అనుకుంటా. నేను అనే వ్యక్తి ఒకరు, నా పేరు యివి లేకుండా పోతాయని', మీ పేరును గురించి మీరు లెక్కచేయకపోయినా, మీ ఆస్తిపాస్తులన్నీ భద్రంగా వున్నా ఇప్పుడు కూడా మీలో ఏదో భయం వుంటుంది కదూ? అసలు మీరు- అంటే అర్థం ఏమిటి? మీ పేరు, మీ ఆస్తిపాస్తులు, మీరు అనే వ్యక్తి, మీ ఆలోచనలు వీటితోనేగా మిమ్మల్ని గుర్తించేది; ఏదో ఒకదానికి సంబంధించినవారుగా, ఫలానా వారు, ఫలానా వీరు అనీ గుర్తించడం, ఒక ప్రత్యేకమైన సమూహానికో, దేశానికో చెందినవారుగా ముద్ర వేసుకోవడం మొదలైనవి. ఈ ముద్రను పోగొట్టుకుంటానేమోననీ మీ భయం. అంతేనా?

'అంతే. అది లేకపోతే నేను ఎవర్ని? అంతే, అదే అసలు సంగతి'.

కాబట్టి, మీరు అంటే మీ స్వాధీనంలో వున్న మీ సంపదలు, మీ పేరు ప్రఖ్యాతులు, మీ కారు మొదలైన మీ ఆస్తులు, మీరు పెళ్ళిచేసుకోబోయే ఆ అమ్మాయి, మీలో వున్న ఆకాంక్షలు. మీరు అంటే యీ విషయాలే. ఈ విషయాలతో పాటు కొన్ని లక్షణాలు, కొన్ని విలువలు కూడా చేరి, మీరు అంటున్న యీ 'నేను' ను తయారు చేస్తున్నాయి. ఈ మొత్తం అంతా కలిపితే అదీ మీరు. దీనిని పోగొట్టుకుంటానేమో అనే మీ భయం. పోగొట్టుకోవడం అనేది అందరికీ జరిగినట్టే మీకూ జరిగే అవకాశం వుంది. యుద్ధం రావచ్చు, విప్లవం రావచ్చు. వామపక్షపు ప్రభుత్వం ఏర్పడచ్చు. ఈ రోజు కాని, రేపు కొని ఏదైనా జరిగి, మీకున్నవన్నీ పోవడం జరగచ్చు. అయితే భద్రతాలేమి అంటే యింతభయం ఎందుకు? భద్రతా రాహిత్యం చాలా సర్వ సహజమైన లక్షణం కాదూ? ఈ భద్రతారాహిత్యం నుండి రక్షించుకోవడానికి మీరు గోడలు నిర్మించుకుంటున్నారు. కాని యీ గోడలు కూడా పడిపోవచ్చు, పడిపోతున్నాయి కూడా. కొంతకాలం పాటు దీనినుంచి మీరు దూరంగా పారిపోవచ్చు. కానీ భద్రతాలేమి అనే ప్రమాదం ఎప్పుడూ పొంచి వుంటూనే వుంటుంది. 'ఉన్నదాని' ని మీరు తప్పించు కోలేరు. మీకు యిష్టం వున్నా, లేకపోయినా భద్రతాలేమి అనేది వున్నది. అయితే దీని అర్థం మీరు యీ విషయంలో చేతులు ముడుచుకొని కూర్చోవాలని కాదు. అంగీకరించాలనీ కాదు, నిరాకరించాలనీ కాదు. మీరు యువకులు; మీరెందుకు భద్రతాలేమినీ గురించి భయపడాలి? 'మీరు యిట్లా వివరించి చెప్పారు కాబట్టి భద్రతలేమిని గురించి నేను భయపడటం లేదు. పనిచేయడానికి నాకు ఏ అభ్యంతరమూ లేదు. నేను చేస్తున్న వుద్యోగంలో రోజుకు ఎనిమిది గంటల 'పైగా పని వుంటుంది. నాకు పెద్దగా యిష్టంలేకపోయినా యిదే విధంగా కాలం గడిపివేయగలను. ఉహాఁ, ఆస్తి, కారు వగైరా పోతాయేమో అనే భయం లేదు నాకు. నేను ప్రేమిస్తున్న అమ్మాయిని నేను ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వివాహం చేసుకోగలను. వీటిలో ఏవీ నా భయానికి కారణాలు కావని నాకు స్పష్టంగా తెలుస్తున్నది. అసలు కారణం ఏది?'

మనిద్దరం కలిసి కనిపెడదాం. అది యిదీ అని నేను మీకు చెప్పచ్చు. కానీ అప్పుడది మీరు స్వయంగా కని పెట్టినట్లుగా వుండదు. మాటల స్థాయిలోనే వుంటుందీ. కాబట్టి దానివల్ల వుపయోగం ఏదీ వుండదు. అది తెలుసుకోవడం మీ స్వంత అనుభవంగా వుండాలి. అదే అన్నింటికంటే అసలు ముఖ్య విషయం. కనిపెట్టడం అంటే అనుభవం. మన యిద్దరం కలిసి అది కని పెడదాం. మీ భయం వీటిలో ఏవైనా పోగొట్టుకుంటానేమో అన్నదానిని గురించి కాకపోతే, బాహ్యమైన భద్రతాలేమిని గురించి కూడా మీ భయం కాకపోతే, యిక మీ ఆదుర్దా దేన్ని గురించి? వెంటనే సమాధానం చెప్పేయకండీ, వింటూ వుండండి, అంతే. అప్రమత్తంగా వుండి కనిపెట్టాలి మీరు. భౌతికమైన భద్రతారాహిత్యం కారణంగా మీరు భయపడటంలేదని బాగా గట్టిగా చెప్పగలరా? ఇటువంటి విషయాల్లో ఎంతవరకు నిశ్చయంగా చెప్పగలమో అంతమేరకు. మీ భయం యీ విషయంలో కాదు అని అంటున్నారు. ఇవి వట్టి మాటలు కావు అని కూడా మీరు గట్టిగా అంటున్నారు. ఇక అప్పుడు మీరు భయపడుతున్న అసలు విషయం ఏమిటి?

'భౌతికమైన భద్రతారాహిత్యం నా భయానికి కారణం కాదు. అందులో నాకు ఏ మాత్రం సందేహం లేదు. పెళ్ళి మేము ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు. మాకు కావలసినవన్నీ పున్నాయి. కేవలం వస్తుసంపద పోగొట్టుకుంటానేమో అన్నదాని కంటే భిన్నమైనదేదో నన్ను భయపెడుతున్నది. అయితే అది ఏమిటి?'

అదే కనిపెడదాం. అయితే ప్రశాంతంగా అన్నీ పరిశీలిద్దాం. నిజంగానే యిది కనిపెట్టాలని మీకు వున్నది, వున్నదా లేదా?

'తప్పకుండా వున్నది. ఇప్పుడు యింతదూరం యీ విషయంలో ప్రయాణించాక యింకా గట్టిగా అనిపిస్తున్నది. దీనిని గురించి నేను భయపడుతున్నాను?'

అది కనిపెట్టాలంటే మనం ప్రశాంతంగా, అప్రమత్తంగా వుండాలి. ఏ మాత్రం ఒత్తిడి ప్రయోగించకూడదు. భౌతికమైన భద్రతాలేమి గురించి మీరు భయపడటం లేదు. సరే, అప్పుడు అంతర్గతంగా భద్రత లేదని భయపడుతున్నారా? మీరే నిర్దేశించుకున్న ఒక గమ్యాన్ని అందుకోలేరేమోనని భయమా? సమాధానం చెప్పకండి. వినండి, అంతే, ఏ గొప్పతనమూ సాధించలేని అసమర్థుడిని అని మీరు భావిస్తున్నారా? బహుశ మీలో ఆధ్యాత్మిక సంబంధమైన ఒక ఆదర్శం ఏదయినా వున్నదేమో. ఆ విధంగా జీవించడానికి, దానిని అందుకోడానికి తగిన సామర్ధ్యం మీకు లేదని భావిస్తున్నారా? ఇది చాలా నిరాశాజనకమైన భావాన్ని కలిగిస్తున్నదా? అపరాధభావాన్ని నిస్పృహను కలిగిస్తున్నదా?

'మీరు చెప్తున్నది నూరుపాళ్ళు నిజం. చాలా సంవత్సరాల క్రితం, నా చిన్నతనంలో మీ ప్రసంగాలు విన్నప్పటినుండీ మీరే నా ఆదర్శం అయ్యారు. ఇట్లా నేను అనవచ్చునో లేదో కాని నాకు మీలాగా వుండాలని వుంది. ఆధ్యాత్మికత మా రక్తంలోనే వున్నది. అందుకని మీలాగా నేను వుండగలను అని గట్టిగా అనిపించింది. అయితే, లోలోపల ఆ దరిదాపులకీ కూడా చేరలేనేమో అనే భయం కూడా వుంటూనే వుంది.'

మనం మెల్లగా వెళదాం. బాహ్యంగా భద్రత లేకపోవడం గురించి మీరు భయపడకపోయినా, అంతర్గతమైన భద్రతా లేమీ గురించి మీరు భయపడుతున్నారు. ఒక్కొక్కరు బాహ్యమైన భద్రత కోసం పరువు ప్రతిష్టల పైనో, కీర్తి పైనా, డబ్బు పైనా యింకా అటువంటివాటి పైనా ఆధారపడతారు. మీరు ఒక ఆదర్శం ద్వారా అంతర్గతమైన భద్రత సాధించాలని కోరుకుంటున్నారు. కాని ఆ ఆదర్శాన్ని అందుకునే శక్తి సామర్థ్యాలు మీలో లేవేమో అని అనుకుంటున్నారు. ఒక ఆదర్శంగా అవాలని, ఒక ఆదర్శాన్ని అందుకోవాలని ఎందుకు కోరుకుంటున్నారు? అక్కడ భద్రతా, రక్షణా వుంటాయనీ కదూ? ఈ సురక్షిత స్థానానికి మీరు ఆదర్శం అనే ఒక పేరు పెట్టారు. వాస్తవంగా మీరు కోరుతున్నది క్షేమంగా వుండాలని, సురక్షితంగా వుండాలని. అంతేనా?

'ఇంత సూటిగా మీరు చెప్పాక నాకు తెలుస్తున్నది, ఖచ్చితంగా ఇదే.'

'ఇప్పుడే యీ సంగతి మీరు కని పెట్టారు, అవును కదూ? సరే, యింకా ముందుకు పోదాం. బాహ్యమైన భద్రత వట్టి డొల్ల అన్నది యిప్పుడు మీకు స్పష్టంగా తెలిసింది. అయితే, ఒక ఆదర్శాన్ని చేపట్టడం ద్వారా అంతర్గతమైన భద్రతను పొందాలనుకోవడంలోని మిధ్యను 'మీరు గ్రహిస్తున్నారా? ఇక్కడ డబ్బుకి బదులుగా ఆదర్శాన్ని రక్షణ కోసం మీరు ఆశ్రయిస్తున్నారు. నిజంగానే యిది మీరు చూడగలుగుతున్నారా?

“అవును, నిజంగానే గ్రహించాను.”

ఇక యిప్పుడు మీరు ఏమిటో అట్లాగే వుండండి. ఆదర్శం మిథ్య అని మీరు గ్రహించినప్పుడు, అది దానంతట అదే రాలిపడిపోతుంది. 'ఉన్నది' ఏదో అదే మీరు. ఇక అక్కడి నుండి 'వున్నది' నీ అవగాహన చేసుకోవడం ఆరంభించండి. అయితే చివరకీ ఒక గమ్యస్థానం చేరుకోవడం కోసం కాదు. గమ్యమూ, లక్ష్యమూ అనేవి 'వున్నది' కి ఎప్పుడూ చాలా దూరంలో వుంటాయి. 'ఉన్నది' అంటే మీరే. అంటే ఒక ప్రత్యేక సమయంలో కాదు, ఒక రకమైన స్థితిలో వున్నప్పుడూ కాదు; ఒక్కొక్క క్షణంలోను మీరు ఎట్లా వుంటారో ఆ మీరు. మిమ్మల్ని మీరే నిరసించుకోకండి, నిరాశగా చూస్తూ కూర్చోనవద్దు. ఏ తాత్పర్యాలూ చెప్పుకోకుండా ‘వున్నది' యొక్క కదలికను జాగరూకతతో చూస్తూ వుండండి. ఇది చాలా కఠినమైన పనే. కానీ అందులో ఎంతో ఆనందం వున్నది. స్వేచ్ఛగా వున్నవారికే ఆనందం లభిస్తుంది; 'ఉన్నది' అనే సత్యంతో పొటుగా మాత్రమే ఆ స్వేచ్ఛ లభిస్తుంది.

(కమెంటరీస్ ఆన్ లివింగ్)