Jump to content

కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం/మరణం అనే యీ దుఃఖం ఎందుకు వున్నది?

వికీసోర్స్ నుండి

మరణం అనే యీ దుఃఖం ఎందుకు వున్నది?

ధ్యానం అంటే కొత్తది విచ్చుకొని వికసించడం. పునరావృత్తి వంటి గతానికి ఆవలగా, ఎత్తుగా కొత్తది వుంటుంది. ధ్యానం అంటే యీ పునరావృత్తిని సమాప్తం చేయడం. ధ్యానంవల్ల కలిగే మరణమే కొత్త యొక్క అమరత్వం, కొత్తది ఆలోచనల పరిధిలో వుండదు. ఆలోచనలు మౌనంగా వుండటమే ధ్యానం.

ధ్యానం ఒక సాధన కాదు, ఒక దివ్యస్వప్నాన్నీ అందుకోవడమూ కాదు, వుద్వేగ పూరితమైన యింద్రియానుభూతీ కాదు. అది నది వంటిది. దానిని లొంగదీసుకోలేము; అది వడివడిగా ప్రవహిస్తూ తీరాలను ముంచివేస్తూ వుంటుంది. ధ్వని లేని సంగీతం వంటిది అది. దానిని మచ్చిక చేసుకొని వుపయోగించుకోలేము. ఆరంభంలోనే పరిశీలకుడు లేకుండా పోయిన నిశ్శబ్దం అది.

ఇంకా సూర్యుడు పైకి రాలేదు. చెట్ల మధ్య నుండి వేగుచుక్క కనబడుతునే వున్నది. ఒకే అపూర్వమైన నిశ్శబ్దం అంతటా అలముకొని వున్నది. రెండు ధ్వనుల మధ్యనో, రెండు సంగీత స్వరాల మధ్యనో వుండే మౌనం కాదు. బొత్తిగా ఏ కారణమూ లేకుండానే వుండే నిశ్శబ్దం- యీ లోకం ఆరంభమైనప్పుడు యిటువంటి నిశ్శబ్దమే వుండివుంటుంది. లోయ, కొండలూ అన్నీ దానితో నిండిపోయాయి. రెండు పెద్ద పెద్ద గుడ్లగూబలు ఒకరినొకరు పిల్చుకుంటున్నాయి. అయితే ఆ నిశ్శబ్దాన్ని అవి భంగపరచలేదు. చాలా దూరంలో ఒక కుక్క ఆలస్యంగా వుదయించిన చంద్రుడిని చూసి మొరుగుతున్నది. అది కూడా యీ అపారనిశ్శబ్దంలో భాగంగానే అనిపిస్తున్నది. పొగమంచు బాగా దట్టంగా ముసురుకున్నది. కొండ చోటునుంచీ సూర్యుడు మెల్లిమెల్లిగా పైకి లేస్తుంటే చిత్రమైన వర్ణాలతోను, సూర్యుడి ప్రథమకిరణాల్లో వుండే ప్రకాశంతోను కొండ తళ తళ లాడటం మొదలు పెట్టింది.

జకరంద వృక్షాల సుకుమారమైన ఆకులు మంచుతో తడిసి బరువెక్కి పోయాయి. పక్షులు పుదయస్నానాలకై వచ్చి వాలాయి. అవి రెక్కలు అల్లల్లాడిస్తుంటే ఆ సుకుమారమైన ఆకుల్లోని మంచునీరు వాటి యీకలను తడుపుతున్నది. కాకులు అదేపనిగా కావు కావుమంటున్నాయి. ఒక కొమ్మ నుంచి మరో కొమ్మమీదికి ఎగురుతూ, ఆకుల మధ్య నుంచి తలలు పైకెత్తి చూస్తూ, రెక్కలు టపటప లాడిస్తూ, మధ్య మధ్య ముక్కులతో పొడుచుకొని రెక్కలను శుభ్రంచేసుకుంటున్నాయి. ధృఢంగా వున్న ఆ కొమ్మమీద సుమారు అరడజను కాకులు కూర్చున్నాయి. ఇంకా ఎన్నోరకాల పక్షులు ఆ చెట్టునిండా చెదరుమదరుగా వాలి, ప్రాతఃకాల స్నానాలు చేస్తున్నాయి.

ఈ నిశ్శబ్దం వ్యాపిస్తున్నది. ఆ కొండలను కూడా దాటి ఆవలగా పోతున్నది. రోజూలాగే పిల్లల అరుపులూ, నవ్వులూ మొదలయినాయి. తోట మెలమెల్లగా నిద్ర నుంచి మేలుకుంటున్నది.

ఈ రోజు చల్లగా వుండేటట్లుగా వుంది. ఇక యిప్పుడు కొండలు సూర్యుడి కాంతిని చేదుకుంటున్నాయి. అవి చాలా పురాతనమైన కొండలు- బహుశ ప్రపంచంలోకల్లా అతిప్రాచీనమైనవేమో- చాలా శ్రద్ధతో చెక్కినట్లు అనిపిస్తున్న వింత వింత ఆకారాల రాళ్ళు ఒకదానిమీద ఒకటి పేర్చి పెట్టినట్లుగా సుతారంగా నిలబడి వున్నాయి. అయితే గాలి వీచినా, చేతులతో కదిలించినా ఆ రాళ్ళు వాటిస్థానాలనుంచి పడిపోవు.

ఇది పట్నవాసాలకి చాలా దూరంగా వున్నలోయ. దీని మధ్య నుంచి మరో గ్రామానికి పోయే దారి వుంది. దారి ఎగుడుదిగుడుగా వుంటుంది. ఈ లోయలో ఏళ్ళ తరబడిగా నిలబడిపోయిన ప్రశాంతతను భగ్నంచేయడానికి కార్లు, బస్సులు ఏవీ యిటు రావు. ఎడ్లబళ్ళు పోతుంటాయి. అయితే వాటి కదలిక ఆ కొండల్లో ఒక భాగంగా కలిసి పోతుంది. ఈ ఎండిపోయిన నదీగర్భంలో కుండపోతగా వర్షాలు కురిస్తే తప్ప నీళ్ళు నిండవు. అక్కడి యిసుక ఎరుపు, పసుపు, మట్టిరంగుల మిశ్రమ వర్ణంలోగా వుంది. అది కూడా ఆ కొండలతో పాటు కదిలి పోతున్నట్లుగా వుంది. నిశ్శబ్దంగా నడిచిపోతున్న ఆ గ్రామీణులు కొండ రాళ్ళలాగా కనబడుతున్నారు.

రోజు గడిచిపోతున్నది. సాయంత్రమయ్యేసరికి, పడమటి కొండల్లో సూర్యుడు అస్తమిస్తుంటే, దూరంగా వున్న కొండలమీద నుంచి, చెట్లలో నుంచి నిశ్శబ్దం వ్యాపిస్తూ వచ్చి, చిన్న చిన్న పొదలనూ, పురాతనమైన మర్రిచెట్టునూ కప్పివేసింది. నక్షత్రాల ప్రకాశం ఎక్కువైన కొద్దీ, నిశ్శబ్దం అత్యంతమైన చిక్కదనాన్ని సంతరించుకున్నది. మనం భరించలేనంతగా.

గ్రామంలోని చిట్టిదీపాలు ఆరిపోయాయి. నిద్రతో పాటుగా యీ నిశ్శబ్దపు తీవ్రత్వం యింకా గాఢంగా, యింకా విశాలంగా, అన్నింటినీ తనలో యిముడ్చుకుంటూ పెరిగిపోయింది. కొండలు కూడా బాగా నెమ్మది వహించినట్లు అనిపించింది. వాటి గుసగుసలు, వాటి కదలికలు ఆగిపోయాయి. బ్రహ్మాండమైన తమ బరువుని అవి కోల్పోయినట్లు కూడా అన్పించాయి.

ఆమె తనకు నలభై అయిదు ఏళ్ళు అని చెప్పారు. చాలా పొందికగా చీరకట్టుకొని వున్నారు, చేతులకు కాసిని గాజులున్నాయి. ఆమెతోపాటు వున్న పెద్దమనిషి ఆమె మేనమామట. అందరం నేలమీదే కూర్చున్నాం. అక్కడనుండి తోటంతా కనిపిస్తున్నది. ఒక మర్రిచెట్టు, కొన్ని మామిడిచెట్లు, పూలతో మెరిసిపోతున్న బోగన్ విల్లా, ఎదుగుతున్న కొబ్బరిచెట్లు కనబడుతున్నాయి. ఆమె విచారంగా వున్నారు. చేతులు అశాంతిగా కదులుతున్నాయి. తన లోపలినుంచి పొర్లుకొని వస్తున్న మాటలనీ, బహుశ కన్నీటిని కూడా బయటికి రాకుండా అణచివేసుకుంటున్నారు.

'మా మేనకోడలి గురించి మాట్లాడటానికి మీ వద్దకు వచ్చాం. కొద్ది సంవత్సరాల క్రితం యీమె భర్త పోయాడు. ఆ తరువాత కొడుకు పోయాడు. ఈమె దుఃఖాన్నుంచి తేరుకోలేక పోతున్నది. ఒక్కసారిగా వృద్ధాప్యం మీదపడ్డట్లుగా వున్నది. మాకు ఏం చేయాలో పాలు పోవడంలేదు. మామూలుగా వైద్యులు చెప్పే సలహాలేవీ పనిచేయడం లేదు. తన తక్కిన పిల్లల సంగతే పట్టించుకోవడం మానేసింది. రోజు రోజుకీ చిక్కి పోతున్నది. ఇదంతా చివరకు ఏవిధంగా పరిణమిస్తుందో తెలియడంలేదు. మిమ్మల్ని చూడాలనీ యీమె పట్టుబట్టడం వల్లనే యిక్కడికి వచ్చాము' అని ఆ మేనమామ చెప్పారు.

'నాలుగు సంవత్సరాల క్రితం నా భర్తను పోగొట్టుకున్నాను. ఆయన డాక్టరు; కేన్సరుతో పోయారు. చాలాకాలం తనకు కేన్సరున్న సంగతి నాకు చెప్పకుండా దాచి వుంచారు. ఇక చివరికి, అంటే ఆఖరి సంవత్సరంలో మాత్రమే నాకు ఆ సంగతి తెలిసింది. డాక్టర్లు మార్పిన్ మొదలైన మత్తుమందు లిచ్చేవారు. అయినా ఆయన విపరీతమైన బాధ అనుభవించారు. నా కళ్ళముందే కృశించి, కృశించి, చివరకు లేకుండా పోయారు'.

అక్కడ ఆపేశారు ఆవిడ, కళ్ళనీళ్ళు వుక్కిరిబిక్కిరి చేసేశాయి. కొమ్మమీద ఒక పావురం కూర్చొని చిన్నగా కువకువలాడుతున్నది. దీని రంగు కొంచెం మట్టిరంగు, కొంచెం బూడిదరంగు కలిసిన మిశ్రమంలాగా వుంది. చిన్న తల, పెద్ద శరీరం- మరీ అంత పెద్దది కాదు, పావురాయి కదా! అంతలోనే అది ఎగిరిపోయింది. పావురం ఎగిరిన వూపుకి కొమ్మ పైకీ కిందకూ వుయ్యాలలూగడం మొదలు పెట్టింది. 'ఈ ఒంటరితనాన్ని ఎందుకో నేను భరించలేక పోతున్నాను. ఆయన లేని జీవితం అర్థవిహీనంగా వుంది. నా పిల్లలంటే నాకు ప్రేమే. ముగ్గురు పిల్లలుండేవారు. ఒక అబ్బాయి, యిద్దరమ్మాయిలు. క్రిందటి సంవత్సరం ఒకరోజు మా అబ్బాయి స్కూలునుంచీ ఒక వుత్తరం రాశాడు, తనకు ఒంట్లో బాగుండటం లేదని, ఆ తరువాత కొద్దిరోజులకే హెడ్ మాస్టరు ఫోనుచేసి, మా అబ్బాయి చనిపోయాడని చెప్పారు.'

ఇక ఆమె ఆపుకోలేక వెక్కివెక్కి ఏడవడం మొదలు పెట్టారు. కొద్ది సేపటికి, ఒక వుత్తరం తీసి చూపించారు. అందులో ఆ అబ్బాయి తనకు ఒంట్లో బాగుండటంలేదనీ, యింటికి రావాలనుందనీ, అమ్మా నీవు కులాసాగా వున్నావని తలుస్తున్నాననీ రాశాడు తనగురించి పిల్లవాడికి ఎంత శ్రద్ధ వుండేదో ఆమె వివరించి చెప్పారు. అసలు అతనికి స్కూలుకి వెళ్ళడం యిష్టంలేదనీ, తల్లిని కనిపెట్టుకొని వుండాలనుకున్నాడనీ ఆమె చెప్పారు. దాదాపుగా అతన్ని బలవంతంచేసి స్కూలుకి పంపారట. ఎందుకంటే తనతో వుంటే తన దుఃఖం అతన్నీ బాధిస్తుందేమోనని. ఇప్పుడింక అంతా అయిపోయింది. ఆడపిల్లలిద్దరూ చాలా చిన్నవాళ్ళు. జరిగినదంతా పూర్తిగా గ్రహించే వయసు కాదు. ఆమెకి మళ్ళీ ఆవేశంలాగా వచ్చింది. “ఏం చేయాలో నాకు తోచడంలేదు. మృత్యువు నా జీవితపు పునాదులను మొదలంటా కుదిపివేసింది. ఒక యిల్లు కట్టుకున్నట్లుగా మా వివాహజీవితాన్ని గట్టి పునాదులు వేసి నిర్మించామని మేము అనుకున్నాం. ఈ విపరీత సంఘటనలవల్ల అంతా సర్వనాశనమై పోయింది.'

ఆ మేనమామకి దేవుడిలో విశ్వాసం వున్నట్లుంది. సంప్రదాయ వాదిలాగా వున్నాడు. అందుకని, “ఇదంతా ఆ పరమాత్ముడి లీల. ఈమె చేత అన్ని కర్మకాండలూ చేయించాను. కాని ఆమెకు నెమ్మది చేకూరలేదు. పునర్జన్మలో నాకు నమ్మకం వుంది. అయితే యీమెకు అదీ ఓదార్పునివ్వడం లేదు. అసలు ఆ మాట మాట్లాడటానికే యీమె యిష్టపడటంలేదు. అదంతా అర్థంలేనిదీగా ఆమెకు కనబడుతున్నది. మేమెవ్వరం ఆమెని ఓదార్చలేక పోతున్నాం' అని అందించారు.

కొంత సేపు అందరం మౌనంగా కూర్చుండిపోయాం. ఆమె జేబురుమాలు అప్పటికి పూర్తిగా తడిసిపోయింది. సొరుగులో నుంచి తీసి యిచ్చిన కొత్త జేబురుమాలు ఆమె బుగ్గల మీద కన్నీటిని శుభ్రంగా తుడిచివేసింది. కిటికీలోంచి ఎర్రని బోగన్ విల్లా తొంగిచూస్తున్నది. ప్రకాశవంతమైన దక్షిణపు కాంతి పడి ప్రతి ఆకూ వెలిగిపోతున్నది. | దీన్ని గురించి మీరు నిజంగానే లోతుగా మాట్లాడాలను కుంటున్నారా- లోపలగా వున్న మూలందాకా పోయి? లేదూ కొన్ని వివరణలతో, కొంత హేతు పూర్వకమైన చర్చతో వోదార్పు చెందాలనుకుంటున్నారా? మీకు తృప్తి కలిగించే కొన్ని మాటల ఆసరాతో దుఃఖాన్ని మరిచిపోవాలనుకుంటున్నారా?

'దీన్ని గురించి లోతుగా వెళ్ళి చూడాలనుకుంటున్నాను. అయితే మీరు చెప్పబోయేదానిని విని తట్టుకునే సామర్థ్యం కాని, బలంకాని నాకు వున్నాయా అని సందేహిస్తున్నాను. మావారు బతికున్న రోజుల్లో మీ ప్రసంగాలు వినడానికి అప్పు డప్పుడు వస్తుండేవాళ్ళం. కానీ యిప్పుడు మీరు చెప్పేది అర్థంచేసుకోవడం నాకు చేతనవుతుందో లేదో' అని ఆమె జవాబిచ్చారు.

మీలో దుఃఖం ఎందుకు వుంది? దానిని సమర్థిస్తూ కారణాలు వివరించకండి. ఎందుకంటే అదంతా మీ మనోభావాలను మాటల్లో పేర్చి చెప్పడం అవుతుందే తప్ప అసలు వాస్తవం కాదు. అందుకని మేము ప్రశ్న అడిగినప్పుడు దయచేసి సమాధానం చెప్పకండి. ఊరికే వినండి. వీని మీ అంతట మీరే తెలుసుకోండి, ఈ మరణం అనే దుఃఖం ఎందుకు వున్నది- పేద వారికి, గొప్ప వారికి; బాగా అధికారబలం వున్నవాళ్ళకు, బిచ్చగాళ్ళకూ, ప్రతి యింట్లోనూ? మీరెందుకు దుఃఖిస్తున్నారు? మీ భర్త కోసమా లేక మీ కోసమేనా? అతని కోసమే గనుక దుఃఖిస్తుంటే, మీ కన్నీళ్ళు అతనికేమైనా సహాయం చేయగలవా? ఆయన పోయారు, యింక తిరిగిరారు. మీరు ఏంచేసినా సరే, అతను మళ్ళీ మీవద్దకు ఎన్నడూ తిరిగి రాలేదు. కన్నీళ్ళు కాని, నమ్మకాలు కాని, కర్మకాండలు కాని, దేవుడు కాని అతన్ని తిరిగి తీసుకొని రాలేవు. మీరు ఒప్పుకొని తీరవలసిన వాస్తవం అది. ఈ విషయంలో మీరు యింకేమీ చేయలేరు. కాని, ఒకవేళ మీరు ఏడుస్తున్నది మీ కోసమే అయితే, మీ ఒంటరితనం, మీ శూన్యజీవితం, మీరు పొందిన యింద్రియ సుఖాలు, మీ సన్నిహిత స్నేహం తలుచుకొని మీరు ఏడుస్తుంటే, అప్పుడు మీరు ఏడుస్తున్నది నిజంగా మీ లోపలి శూన్యత్వం వల్ల, మీపై మీకే జాలివేయడం వల్ల. మీలో వున్న అంతర్గతమైన పేదరికం గురించిన స్పృహ కలగడం బహుశ యిదే మొట్టమొదటిసారి అనుకుంటా. మీ పెట్టుబడి అంతా మీ భర్తమీద పెట్టారు. అవునా కాదా? మృదువుగా చెప్పాలంటే యీ పెట్టుబడి మీద సౌఖ్యం, తృప్తి, సంతోషం మీకు లభించాయి. మీరు యిప్పుడు పడుతున్న బాధ అంతా ఆ వెలితి; ఒంటరితనం వల్ల, ఆందోళనల వల్ల కలిగిన మనోవ్యధ- యిదంతో ఒకరకంగా మీ మీద మీరు జాలిపడటమే; ఆవును కదూ? దానివైపు పరికించి చూడండి; అది చూసి హృదయాన్ని కరినం చేసుకోకండి. చేసుకొని, 'నేను నా భర్తని ప్రేమిస్తున్నాను, ఒక్క రవ్వంత కూడా నా గురించి ఆలోచించడం లేదు. అతన్ని కాపాడుకోవాలనుకున్నాను, తరచు అతని మీద అధికారం చేసింది కూడా యీ కారణంగానే. అయితే అదంతా అతని కోసమే. నా కోసం నేను ఎప్పుడూ ఆలోచించుకోలేదు.' అని అనకండి, అతను యిప్పుడు వెళ్ళిపోయారు కాబట్టి మీ అసలు పరిస్థితి ఏమిటి అన్నది యిప్పుడే గ్రహిస్తున్నారు, కాదూ? అతని మరణం మిమ్మల్ని కుదిపివేసిందీ, యదార్థమైన మీ మానసిక పరిస్థితినీ, హృదయస్థితినీ మీకు చూపించింది. అటువైపు చూడటం మీకు యిష్టంలేక పోవచ్చు; భయంవల్ల అదంతా నిరాకరించవచ్చు; కాని మీరు మరీ కాస్త పరిశీలనగా చూస్తే, మీ లోపలే వున్న ఒంటరి తనం కారణంగా, మీ లోపల వున్న అంతర్గత పేదరికం కారణంగా మీరు దుఃఖిస్తున్నా రని గ్రహిస్తారు. ఇదంతా మీ మీద మీరే జాలిపడుతూవుండటం వల్ల జరుగుతున్నది.

'మీరు చాలా నిర్దాక్షిణ్యంగా మాట్లాడుతున్నారు, కాదా చెప్పండి' అన్నారు ఆమె. 'మీరు ఎంతో వూరట కలిగిస్తారని వచ్చాను. కాని మీరు నాకిస్తున్నది ఏమిటి?'

చాలామందికి వుండే భ్రాతుల్లో యిదీ ఒకటి- అంతర్గతమైన వూరట అనేది ఒకటి వుంటుందనీ, ఎవరో ఒకరు అది మీకు యివ్వగలుగుతారని మీరనుకుంటారు. లేదా మీ అంతట మీరే అది సంపాదించాలనుకుంటారు. అటువంటిది అసలు లేనే లేదని చెప్తున్నాను. ఊరట కోసం మీరు వెతుకుతుంటే భ్రాంతిలోనే జీవించక తప్పదు. ఆ భ్రాంతి బ్రద్దలైనప్పుడు బాధపడక తప్పదు. ఎందుకంటే దానితోపాటు ఆ వూరట కూడా మాయమవుతుంది. అందువల్ల దుఃఖాన్ని అవగాహన చేసుకోవడానికి లేదా దుఃఖాన్నీ మించి ఆవలగా పోవడానికి, అంతర్గతంగా అసలు ఏం జరుగుతున్నదో చూడాలి తప్ప, దానికి ముసుగు వేసి దాచకూడదు. ఇదంతా స్పష్టంగా చూపించడం నిర్దాక్షిణ్యత కాదు కదా, ఏమంటారు? ఇందులో చునం సిగ్గుపడవలసినంత అసహ్యకరమైనదేమీ లేదు. ఇదంతా చాలా స్పష్టంగా మీరు గ్రహించినప్పుడు, ఆ క్షణమే అందులో నుండి బయట పడిపోతారు. జీవితంలోని సంఘటనలు మిమ్మల్ని ఏ మాత్రం తాకకుండా, ఒక్క గాటుకాని, ఒక్క మచ్చగాని-మీమీద వదలకుండా, ఎప్పటికీ నవ్యనూతనంగా మీరు వుండిపోతారు. మరణం అన్నది మన అందరికీ అనివార్యమే. దానినుంచి ఎవ్వరమూ తప్పించుకోలేము. దీనిని మించిపోయి తప్పించుకోవాలనే ఆశతో రకరకాల నమ్మకాలని పట్టుకొని వేలాడతాం, రకరకాల తాత్పర్యాలు కనిపెట్టాలని ప్రయత్నిస్తుంటాం, మీరు ఏమయినా చేయండి, అది లేకుండా పోదు. రేపో, త్వరలోనేనో, ఎన్నో ఏళ్ళ తర్వాతో- అది రాక మానదు. జీవితంలోని యీ అతి పెద్ద వాస్తవం మనల్ని తాకకుండా వదలదు.

‘కాని...' అంటూ మొదలు పెట్టారు ఆ మేనమామ. ఆత్మ అనేది ఒకటి వున్నదనీ, అది కలకాలం కొనసాగే శాశ్వత సత్వమనీ నమ్మే సాంప్రదాయికమైన విశ్వాసాలన్నీ బయటకు వచ్చాయి. ఆయన తనకి బాగా పరిచయం వున్న రంగంలోకి ప్రవేశించారు. యుక్తి యుక్తమైన వాదాలతోను, వుదాహరణల వ్యాఖ్యలతోను బాగా నలిగిన రంగం అది. హఠాత్తుగా ఆయన లేచి నిటారుగా కూర్చోవడం అందరూ గమనించారు. ఆయన కళ్ళల్లోకి యుద్ధపు మెరుపులు, మాటలతో చేసే యుద్ధపు మెరుపులు వచ్చాయి. సానుభూతి, ప్రేమ, అవగాహన అన్నీ పోయాయి. ఆయన యిప్పుడు నమ్మకమూ, సంప్రదాయమూ అనే పవిత్ర రంగం మీదకు, నిబద్ధీకరణం అనే అతిభారమైన బరువుతో బలంగా ముద్రలు పడిపోయిన రంగం మీదకు ప్రవేశించారు. 'కాని ఆత్మ అనే ఒకటి మనందరిలోనూ పున్నది! ఆది పునర్జన్మల ద్వారా కొనసాగుతూవుంటుంది, చివరకు తానే బ్రహ్మ అనే పరమార్థాన్ని చేరుకునేదాకా జన్మిస్తూనే వుంటుంది. ఆ పరమసత్యాన్ని అందుకోవాలంటే యీ దుఃఖాన్ని మనం అనుభవించి తీరాలి. మనం మాయలో జీవిస్తుంటాం. ఈ లోకమంతా మాయ. పరమసత్యం మాత్రం ఒకే ఒక్కటి.'

అట్లా సాగిపోతున్నారు ఆయన, ఆమె నావైపే చూస్తున్నారు, ఆయన చెప్తున్నది వినిపించుకోవడం లేదు. ఆమె ముఖం సన్నని చిరునవ్వుతో విచ్చుకోవడం మొదలు పెట్టింది. మేమిద్దరం తిరిగివచ్చిన పావురంవైపు, ఎర్రగా మెరిసిపోతున్న బోగనవిల్లా పూలవైపు చూస్తూ వుండిపోయాం. ఈ భూమిమీద కానీ, మనలో కాని శాశ్వతమైనవి ఏవీ లేవు. ఒకదానిని, గురించి తాము ఆలోచన చేసి, దానికి శాశ్వతంగా వుండే గుణాన్ని ఆపాదించగలవు ఆలోచనలు. ఒక మాటకు, ఒక భావానికి, ఒక సంప్రదాయానికి ఆలోచనలే శాశ్వతత్వాన్ని యిస్తాయి. ఆలోచన తాను శాశ్వతం అని అనుకుంటుంది. కాని, అది శాశ్వతమా? ఆలోచన అంటే స్మృతి స్పందించడం, ఆ స్మృతి శాశ్వతమా? ఆలోచన ఒక కాల్పనిక బింబాన్ని నిర్మించి, ఆ కల్పిత చిత్రానికి కొనసాగే గుణమూ, శాశ్వతత్వమూ యిచ్చి, దానికి ఆత్మ అనో, లేదూ యింకొక పేరే పెట్టగలదు. భర్తదో, భార్యదో ఒక ముఖాన్ని జ్ఞాపకం పెట్టుకొని, దాన్ని పట్టుకొని వేలాడనూగలదు. ఇదంతా ఆలోచనలు చేసే కార్యకలాపాలు. ఇవి భయాన్ని సృష్టిస్తాయి, ఆ భయంలోనుండి శాశ్వతత్వం కోసం తపన బయలుదేరుతుంది- రేపు భోజనం దొరకదేమో, ఆశ్రయం దొరకదేమో అనే భయాలు, మరణం అంటే భయం మొదలైనవి. ఆలోచనలకు ఫలితమే యీ భయం. బ్రహ్మం కూడా ఆలోచనలు తయారు చేసిన వుత్పత్తే. 'స్మృతి, ఆలోచన కొవ్వొత్తి వంటివి. వాటిని ఆర్పేయవచ్చు, మళ్ళీ వెలిగించ వచ్చు. మర్చిపోతారు, మళ్ళీ కొంతకాలానికి జ్ఞాపకం తెచ్చుకుంటారు. చనిపోతారు, మళ్ళీ యింకో జన్మలో పునర్జన్మ ఎత్తుతారు, కొవ్వొత్తిలో వెలిగే జ్వూల ఒకటే- ఒకటి కానూ కాదు. కాబట్టి యీ జ్వాలలో కొనసాగడం అనే ప్రత్యేక గుణం వున్నది' అని మేనమామ అన్నారు. కానీ ఆర్పివేసిన జ్వాల, క్రొత్త జ్వాల ఒక్కటి కావు. పాతదానిని అంతంచేశాకే కొత్తది వస్తుంది. ఒక్కటే రూపాంతరం చెందుతూ ఎప్పటికీ కొనసాగుతుంటే కొత్తది అప్పుడు వుండనే వుండదు. వేయి నిన్నలను కొత్తవాటిగా మార్చలేము. కొవ్వొత్తి కూడా పూర్తిగా కాలాక అయిపోతుంది. ప్రతిదీ, కొత్తది రావడం కోసం సమాప్తమై తీరాలి.

ఇప్పుడు ఆ మేనమామకు వుదాహరణాల వ్యాఖ్యలు, నమ్మకాలు, యితరుల సూక్తులు ఏవీ సహాయపడటం లేదు. అందుకని తనలోకి తను ముడుచుకొనిపోయి, మెదలకుండా కూర్చున్నారు. అయితే ఆయనలో అయోమయం, ఆగ్రహం కూడా కలిగాయి. ఎందుకంటే తాను ఏమిటో ఆయనకే చాలా బాహటంగా కనిపించింది. తన మేనకోడలిలాగే ఆయనా ఆ వాస్తవాన్ని సూటిగా చూడటానికీ యిష్టపడటంలేదు, ఇదంతా నాకు అక్కర్లేదు' అన్నారు ఆమె. నేను దారుణమైన వేదనలో వున్నాను. భర్తనీ, కొడుకునీ పోగొట్టుకున్నాను. ఇద్దరు పిల్లలూ, నేనూ మిగిలి వున్నాం. నేను యిప్పుడు ఏం చేయాలి?'

ఆ యిద్దరు పిల్లల మీద కనుక మీకు శ్రద్ధవుంటే, మీ గురించి, మీ వేదన గురించి విచారించరు. వాళ్ళ ఆలన, పాలన చూస్తారు; సవ్యంగా చదివిస్తారు, సగటురకంగా తయారవకుండా వాళ్ళని పెంచుతారు. మీమీదే జాలిలోపడి మీరు మునిగిపోరు. దానినే 'నా భర్తమీద ప్రేమ' అని అంటూవుంటే, మీ ఒంటరితనంలోకి మీరు ముడుచుకొని పోతూవుంటే, యీ యిద్దరు పిల్లల జీవితాలనీ కూడా మీరు ధ్వంసం చేసేస్తారు. మనకి తెలిసో, మనకీ తెలియకుండానే విపరీతమైన స్వార్థపరత్వం మనందరిలోనూ వున్నది. మనకి కావలసినవి మనకు దొరుకుతున్నంతవరకు అంతా సవ్యంగా వున్నట్లు పరిగణిస్తాం. దీన్నంతటినీ భగ్నం చేసే సంఘటన ఏదయినే జరిగిన మరుక్షణమే నిస్పృహతో ఏడ్చేస్తాం. ఇంకోరకమైన సౌఖ్యాలకోసం చూస్తాం. అవీ యీ విధంగానే భగ్నమవడం ఖాయమనుకోండి. ఈ ప్రక్రియ అంతా యిట్లాగే సాగిపోతూ వుంటుంది. ఇందులో వున్న సాధక బాధకాలన్నీ పూర్తిగా తెలుసుకొని కూడా, దానిలో చిక్కుకొని పోవాలని మీరు కోరుకుంటే, నిక్షేపంగా కానివ్వండి. అయితే అందులోని అసంబద్దతనంతా గ్రహించినప్పుడు దానంతట అదే మీ ఏడుపూ ఆగిపోతుంది, మీరు ఒంటరితనంలో మునిగిపోవడమూ మానేస్తారు. ఒక కొత్త కాంతితో, ఒక చక్కని చిరునవ్వుతో మీ పిల్లలతో జీవితం గడపడం ఆరంభిస్తారు.

(ది వోన్లీ రివల్యూషన్)

భద్రత

వరిమళ్ళని చుట్టుకుంటూ పోతున్న యీ త్రోవ పక్కనే ఒక చిన్న కాలువ మందంగా ప్రవహిస్తూ వుంది. దాని నిండా తామరపూలు విచ్చుకొని వున్నాయి. మధ్యలో బంగారపు రంగు బొడ్లతో వున్న ఆ ముదురు వూదా రంగు పూలు నీళ్ళమీద బాగా పైకి వచ్చి తేలుతున్నాయి. వాటి పరిమళం పూలని అంటిపెట్టుకొని అక్కడే వుండిపోయింది. చాలా అందంగా వున్నాయి ఆ పూలు. ఆకాశం మేఘావృతమై వుంది. సన్నగా జల్లు పడడం మొదలయింది. మబ్బులు వుండి వుండి వురుము తున్నాయి. ఎక్కడో చాలా దూరంలో మెరుపులు మెరుస్తున్నాయి. కాని త్వరలోనే మేము నిలబడిన చెట్టు వైపుగానే రాబోతున్నాయి. వర్షం బాగా ఎక్కువైంది. తామర ఆకులమీద నీటి బిందువులు నిలబడిపోతున్నాయి. నీటి బిందువులు కొన్ని పోగయ్యాక, అవి మరీ పెద్దవైనప్పుడు ఆకులమీద నుంచి జారి కిందపడిపోతున్నాయి. మళ్ళీ కొత్త బిందువులు పోగవుతున్నాయి. ఇప్పుడు మా చెట్టుమీదే మెరుపులు మెరవడం ఆరంభమైంది. పశువులు భయపడిపోయి 'కట్టుతాళ్ళని తెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. నల్లని దూడ ఒకటి బాగా తడిసి, వణికిపోతూ, ఆతిదీనంగా అరిచింది. తరువాత తాడు తెంపేసుకొని, దగ్గరలోనే వున్న గుడిసెలోకి పరుగెత్తింది. తామరపూలు గట్టిగా ముడుచుకొని పోతున్నాయి. చుట్టూ ముసురుకుంటున్న చీకట్లనుండి తమ హృదయాలను దాచుకుంటున్నాయి. ఇప్పుడు వాటి లోపల వున్న బంగారపురంగు బొడ్లను చూడాలంటే వూదారంగు పూరేకులను బలంగా పీకి తెరవాలిసిందే. మళ్ళీ సూర్యుడు కనబడేదాకా అవి గట్టిగా ముడుచుకొనిపోయి వుంటాయి. అట్లా నిద్ర పోతున్నప్పుడు కూడా అవి ఎంతో అందంగా వున్నాయి. విద్యుల్లతలు వూరివైపుగా కదులుతున్నాయి. ఇప్పుడిక బాగా చీకటి పడిపోయింది. కాలువ నీటి గలగలల చప్పుడు మాత్రం సన్నగా చెవులకు వినిపిస్తున్నది. ఈ త్రోవే గ్రామాన్ని దాటుకుంటూ రహదారి వద్దకు చేరుస్తుంది. ఆ రహదారిమీదే ప్రయాణించి, కోలాహలంగా వుండే పట్టణాన్ని, తిరిగి మేము చేరుకున్నాం.

అతను యువకుడు. వయసు యిరవైలలో వుంటుంది. మంచి పోషణలో పెరిగిన శరీరం. ప్రపంచం కొంత తిరిగి చూశాడు. కళాశాలలో చదువుకున్నవాడు. భయభయంగా కనబడుతున్నాడు. అతని కళ్ళల్లో ఆదుర్డా వుంది. అప్పటికే ఆలస్యమైంది. కాని అతను ఏదో మాట్లాడాలన్నాడు. తన మనసును ఎవరయినా శోధించి, అక్కడ ఏమున్నదో వెదికి కని పెట్టాలని కోరాడు. చాలా మామూలుగా తనని