కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం/ఆరాటం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఆరాటం

అర్థంపర్థంలేని చిన్న చిన్న విషయాలు తనని తెగ ఆరాటంలో ముంచెత్తుతుంటాయని చెప్తున్నారు ఆయన. పైగా యీ విషయాలు ఎప్పటికప్పుడు మారిపోతూ కొత్త కొత్త ఆరాటాల్లో పడిపోతుంటారుట. ఏదో ఒక శరీర సంబంధమైన దోషాన్ని వూహించుకొని, దాన్ని గురించి విచారిస్తూ కూర్చుంటారుట. మళ్ళీ కొద్ది గంటల్లోనే ఆయన చింత ఆంతా యింకో సంఘటన మీదో, యింకో ఆలోచన మీదో లగ్నం అవుతుందిట. ఒకదాని తర్వాత ఒకటిగా కలిగే ఆందోళనా భరితమైన ఈ యావలతోనే ఆయన బ్రతుకంతా గడిచిపోతున్నది. ఆయన యింకా యిట్లా చెప్తున్నారు. ఈ ఆరాటాలనుంచి బయటపడే మార్గం కోసం ఎన్నో పుస్తకాలు వెతికారు, స్నేహితులతో తన సమస్యగురించి చర్చిస్తుంటారు, ఒక మనోవైజ్ఞానిక నిపుణుడిని సలహా కూడా అడిగారు. ఎందువల్లనో ఏవీ ఆయనకు వుపశాంతిని యివ్వలేదు. చాలా గంభీరమైన, ఆసక్తికరమైన సమావేశాల్లో పాల్గొన్నా, అవి ముగిసిన వెంటనే మళ్ళీ ఏదో ఒక యావ, ఆ పైన యింకో రంధి బయల్దేరుతాయట. వీటి వెనకాల వున్న కారణం కనిబెడితే అవి ఆగిపోతాయా అని ఆయన ప్రశ్న.

కారణాన్ని కనిపెట్టడం ద్వారా దాని ప్రభావాన్నుంచి విముక్తి లభిస్తుందా? కారణం గురించి తెలుసుకోవడం ఫలితాన్ని నిర్మూలిస్తుందా? యుద్ధాలకు గల కారణాలు, ఆర్థిక సంబంధమైనవీ, మనోతత్వసంబంధమైనవీ రెండూ మనకి తెలుసు. అయినే పైశాచికత్వాన్ని, మన వినాశనాన్ని మనమే స్వయంగా ప్రోత్సహిస్తున్నాం. అసలు యీ కారణంకోసం అన్వేషించడానికి వెనకాల వున్న మన వుద్దేశ్యంలో అది కలిగించే ప్రభావాన్ని వదుల్చుకోవాలనే కోరిక వున్నది. ఈ కోరిక మారురూపంలో వున్న ప్రతిరోధభావం లేదా నిరసన భావం. నిరసన వున్నప్పుడు అవగాహన వుండదు. 'అయితే యిప్పుడు నేను ఏం చేయాలి?' అని అతను అడిగారు.

ఇటువంటి అలా అల్పమైన మూర్ఖమైన ఆరాటాలు మనసును ఎందుకు పట్టిపీడిస్తాయి? 'ఎందుకు' అని అడగడం అంటే, మీ లోపల కాకుండా ఎక్కడో వేరేగా వున్న ఒక కారణాన్ని మీరు అన్వేషించి పట్టుకోవడం అని కాదు అర్థం; మీ ఆలోచనా రీతులు ఎట్లా వున్నాయి అనేది మీరే తెరిచి తీసి చూసుకోవడం. కాబట్టి, ఎందుకు మనసు యీ విధమైన వ్యాపకాలతో నిండిపోతూవుంటుంది? మనసు కృత్రిమంగాను, డొల్లగాను, తుచ్ఛంగాను వుండటం వల్ల, తనకి ఆకర్షణీయంగా వుండే వాటిలోనే మునిగిపోయి వుండాలనుకుంటుంది; కాదూ?

“అవును” అని అతను సమాధానమిచ్చారు. 'అదే నిజమనిపిస్తున్నది. కానీ పూర్తిగా కాదు. ఎందుకంటే నేను బాగా లోతుగా ఆలోచించే రకం మనిషిని'.

ఈ ఆరాటాలు కాకుండా మీ ఆలోచనలు యింకా ఏఏ విషయాల గురించి వుంటూ వుంటాయి?

'నా వృత్తిని గురించి' అన్నారాయన. నేనొక బాధ్యతాయుతమైన పదవిలో వున్నాను. రోజంతా, ఒక్కొక్కసారి రాత్రివేళల్లో కూడా, నా వృత్తికి సంబంధించిన విషయాలని గురించిన ఆలోచనలతోనే మునిగిపోయివుంటాను. అప్పుడప్పుడు ఏవో చదువుతుంటాను, కానీ సమయమంతా దాదాపుగా నా వృత్తి ధర్మంలోనే ఎక్కువగా గడిచిపోతుంది'.

మీరు చేస్తున్న పని మీకు బాగా యిష్టంగా వుందా?

“ఇష్టమే. కాని పూర్తిగా తృప్తికరంగా లేదు. నా జీవితమంతో నేను చేస్తున్న పనిలో కొంత అసంతృప్తితోనే గడిచిపోయింది. అయినా కూడా నేను యిప్పుడున్న పదవిని వదులుకోలేను. నామీద కొన్ని బాధ్యతలున్నాయి. పైగా వయసు కూడా ఫైబడుతున్నది. నన్ను విసిగించేదల్లా యీ ఆరాటాలూ, నా పనిమీదా, మనుష్యుల మీదా రోజు రోజుకీ నాలో పెరిగిపోతున్న ఆగ్రహమూ. నేను ఎవ్వరిమీదా పెద్దగా దయ చూపించలేదు. భవిష్యత్తు అంటే తగని ఆందోళనగా వుంది. శాంతి అనేది ఎరగనే ఎరగను అని అనిపిస్తున్నది. నా పని నేను బాగానే చేస్తాను, కాని....' ‘ఉన్నది' కి వ్యతిరేకంగా ఎందుకు పోరాడుతున్నారు మీరు? నేను నివసిస్తున్న యిల్లు రణగొణధ్వనులతో నిండివుండచ్చు, మురికిగా వుండచ్చు, అక్కడ వున్న సామాన్లన్నీ పరమవికారంగా వుండచ్చు; మొత్తంమీద సౌందర్యం అనేది ఏమాత్రం అక్కడ లేకపోవచ్చు. కాని, అనేక కారణాలవల్ల నేను అక్కడే నివసించాలి. మరో యింటికి మారలేను. అటువంటప్పుడు సమస్య ఆమోదించడమా కాదా అన్నది కాదు; కళ్ళకి కనబడుతున్న వాస్తవాన్ని చూడటం గురించి. 'ఉన్నది' ని నేను చూడకపోతే, పూలనీ వుంచే ఆ కూజాను గురించో, ఆ కుర్చీ గురించో, ఆ చిత్రపటం గురించే విచారించి సుడిపడిపోతాను. అవే నా ఆరాటాలుగా మారతాయి. అప్పుడు మనుష్యులన్నా, నా పని అన్నా నాలో ఆగ్రహం పుట్టుకొస్తుంది. ఇదంతా పూర్తిగా వదిలేసి మళ్ళీ కొత్తగా నేను మొదలుపెట్టగలిగితే, అది వేరు. కానీ, నేను అట్లా చేయలేను. 'ఉన్నది' కి, అసలు వాస్తవానికి వ్యతిరేకంగా నేను తిరగబడటంవల్ల లాభం లేదు. ‘ఉన్నది' ని గుర్తించేక నా పాటికి నేను హాయిగా, తృప్తిగా వుండిపోవడం జరుగుతుందని అనుకోకండి. 'ఉన్నది' ని వప్పేసుకోవడం వల్ల, అది నాకు అవగాహన అవడమే కాకుండా, మనసు వుపరితలం పైన ఒక విధమైన నెమ్మది కూడా ఏర్పడుతుంది. ఉపరితల మానసం ప్రశాంతంగా లేనప్పుడే అది ఆరాటాల్లో- అవి నిజమైనవి కావచ్చు, కల్పితమైనవి కావచ్చు. వాటిల్లో పడి మునిగిపోతుంది. రకరకాలైన సంఘ సంస్కరణ ల్లోనో, మతానికి సంబంధించిన సూక్తులలోనో, పరమగురువులు, లోకరక్షకుడు, పూజాపునస్కారాలు మొదలైనవాటిల్లో చిక్కుకొని పోతుంది. ఉపరితల మానసం నెమ్మదిగా వున్నప్పుడే, అజ్ఞాతంగా లోపల వున్నది బయటపడటానికి అవకాశం వున్నది. అజ్ఞాతంగా లోపల వున్నది బయటపడి తీరాలి. అయితే వుపరితల మానసం ఆరాటాల బరువును, చింతల భారాన్ని మోస్తున్నప్పుడు దీనికి అవకాశం లేదు. ఉపరితల మానసం నిరంతరం ఏదో ఒక ఆందోళనలో వుంటూవుండటం వల్ల మనసు యొక్క పై పై పొరలకు లోలోపలి పొరలకు మధ్యన సంఘర్షణ అనివార్యం. ఈ సంఘర్షణను పరిష్కరించుకోనంత వరకు ఆరాటాలు ఎక్కువవుతూనే వుంటాయి. నిజంగా చూస్తే, మన సంఘర్షణల నుండి తప్పించుకొని పారిపోవడానికి మార్గాలే యీ ఆరాటాలు, పలాయనాలు అన్నీ ఒకటే రకం. అయితే వాటిలో కొన్ని మాత్రం సమాజానికి చాలా హానికరమైనవి అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

ఈ ఆరాటాలు, లేదా మరో సమస్యలు ఏవైనా సరే, పోటి మొత్తం ప్రక్రియను గురించి మనం ఎరుకగా వున్నప్పుడే ఆ సమస్య నుంచి విముక్తి కలుగుతుంది. బాగా విస్తృతమైన ఎరుక కలిగివుండాలంటే ఆ సమస్యను ఖండించడం గానీ, సమర్థించడం కానీ వుండకూడదు. ఆ ఎరుకలో ఎంపిక చేసుకోవడం వుండకూడదు. ఆ విధమైన ఎరుక కలిగివుండటానికి చాలా వోరిమి, సున్నితత్వమూ అత్యావశ్యకం. ఉత్సాహం, ఆగిపోకుండా కొనసాగే సావధానత కూడా అవసరం. అప్పుడే ఆలోచనా ప్రక్రియ నంతటినీ పరిశీలించవచ్చును, అవగాహన చేసుకోవచ్చును.

(కమెంటరీస్ ఆన్ లివింగ్)