కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం/మానవాళి భవిష్యత్తులో ఏమున్నది?

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

మానవాళి భవిష్యత్తులో ఏమున్నది?

పక్షులకోసం వుంచిన ఆహారపు తొట్టెమీద ఒక పది, పన్నెండు పిట్టలు వాలి కిచకిచలాడుతూ, ఒకటి నొకటి నెట్టుకుంటూ గింజలు ఏరుకోవడానికి అవస్థ పడుతున్నాయి. మరో పెద్ద పక్షి వచ్చి వాలేసరికి, రెక్కలు టప టప కొట్టుకుంటూ యివన్నీ ఎగిరిపోయాయి. ఆ పెద్ద పక్షి ఎగిరిపోగానే మళ్ళీ ఆన్నీ వచ్చి చేరాయి. మళ్ళీ కలకలా రావాలు చేస్తూ, కొట్లాడుకుంటూ, కిచకిచమంటూ మొత్తంమీద విపరీతంగా గోలచేస్తున్నాయి. అంతలోనే ఒక పిల్లి అటుగా వచ్చింది. పిట్టలన్నీ కలవరపడిపోయి, కీచు కీచుమంటూ అరచి నానా హంగామా చేశాయి. ఎట్లాగయితేనేం ఆ పిల్లిని తరిమేశాయి. అది పెంపుడు పిల్లే కాదు, అడవి జాతికి చెందినది. రకరకాల రంగుల్లో, ఆకారాల్లో, చిన్నా, పెద్దా అడవిపిల్లులు యీ చుట్టుప్రక్కల చాలానే వున్నాయి. ఆహారపు తొట్టె చుట్టూ రోజు పొడుగూతా పిట్టలు వాలుతూనే వున్నాయి, చిన్న చిన్నవీ పెద్దవీ కూడా. మధ్యలో ఒక నీలిరంగులో వున్న పాలపిట్ట వచ్చింది. అందరిమీదో, మొత్తం ప్రపంచం మీదే అరుస్తూ కేకలు పెట్టింది. తన అరుపుల్లో తక్కిన పిట్ట లన్నింటినీ తరిమి పారేసింది. నిజం చెప్పాలంటే అది రావడం చూసి అవే పారిపోయాయి. ఈ పిట్టలన్నీ పిల్లులొస్తాయేమోనని జాగ్రత్తగా కని పెట్టి వుంటాయి. సాయంత్రం అవుతున్నకొద్దీ ఒక్కటొక్కటిగా అన్నీ ఎగిరిపోయాయి. అంతటా నిశ్శబ్దం, నెమ్మది, ప్రశాంతత అలముకుంది. పిల్లులు వచ్చాయి, వెళ్ళాయి. కానీ పిట్టలు అక్కడ లేవు.

ఆ వుదయం మబ్బుల్లో మెరుపులు తెగ మెరుస్తున్నాయి. వర్షం బాగా పడే సూచనలున్నాయి. గత కొద్ది వారాలుగా వర్షం కురుస్తూనే వుంది. ఇక్కడ ఒక చెరువులాంటిది తయారుచేశారు. అందులో నీళ్ళు నిండిపోయి అంచులదాకా వచ్చాయి. ఆకుపచ్చని ఆకులు, పొదలు, ఎత్తయిన చెట్లు అన్నీ ఎండకోసం ఎదురుచూస్తున్నాయి. కేలిఫోర్నియాలో సాధారణంగా కాసే తీవ్రమైన ఎండ వంటి ఎండ రానేలేదు. సూర్యుడు తన ముఖం చూపించి చాలారోజులైంది.

మానవాళికి భవిష్యత్తులో ఏమున్నదో అని అనిపిస్తూ వుంది. అక్కడ కనబడుతున్న ఆ పిల్లల భవిష్యత్తులో - అరుస్తూ, ఆడుకుంటూ, ఎంతో సంతోషంగా, ఎంతో సౌమ్యం, ముద్దుగా వున్న ఆ పిల్లల భవిష్యత్తులో ఏముందో? ఇప్పుడు మనం ఏమిటో అదే మన భవిష్యత్తు. చారిత్రకంగా చూస్తే అనేక వేల సంవత్సరాలుగా జరుగుతున్నదీ యిదే. బ్రతకడం, చనిపోవడం, జీవించడానికి మనం పడే ప్రయాసా - అంతే. భవిష్యత్తు గురించి మనం అంతగా పట్టించుకున్నట్లు కన్పించదు. పొద్దున లేచిందగ్గర్నుంచీ రాత్రి పడుకునేవరకు అంతులేని వినోదకార్యక్రమాలు మీరు టెలివిషన్లో చూస్తూ వుంటారు. ఒకటి రెండు ప్రసారకేంద్రాల్లో మినహాయించి; అవైనా చాలా కొద్దిసేపే వుంటాయి; పైగా అంతగా లోతయిన విషయాల గురించీ వుండవు. పిల్లలకు కాలక్షేపం అయిపోతూ వుంటుంది. మీకు చాలా వినోదం కలుగుతున్నదనే విషయాన్ని వ్యాపారప్రకటనలు- మరీ మరీ జ్ఞాపకం చేస్తుంటాయి. దాదాపుగా ప్రపంచం అంతటో యిదే జరుగుతున్నది. ఈ పిల్లలందరూ భవిష్యత్తులో ఏమైపోతారు? క్రీడారంగానికి సంబంధించిన కార్యక్రమాలుంటాయి . కొద్దిమంది ఆడుతుంటే ముప్పయి, నలభై వేలమంది ప్రేక్షకులు చూస్తుంటారు. గొంతులు చించుకొని అరుస్తుంటారు. ఒక గొప్ప చర్చీలో జరుగుతున్న పూజా కాండనీ కూడా మీరు చూస్తుంటారు. అది ఒక రకమైన వినోద కాలక్షేపమే. కాకపోతే అదంతా చాలా పవిత్రమైనది, మతానికి సంబంధించినది అంటారు - వుద్విగ్నపూరితమైన, భావగర్భితమైన అనుభూతి, మత ధర్మపరమైన అనుభూతి ఇట్లా ఎన్ని పేర్లు పెట్టినా అదంతా వినోదకాలక్షేపమే. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లోనూ జరుగుతూ వున్న యిదంతా గమనిస్తున్నప్పుడు, వుల్లాసం కలిగించే వేడుకలతోను, వినోదాలతోను, క్రీడలతోను రకరకాలైన యీ వ్యాపకాలతోను మనసును నింపుకోవడం గమనిస్తున్నప్పుడు ఏమాత్రం అక్కర వున్న వారయినా తప్పకుండా అడగవలసిన ప్రశ్న ఏమిటంటే - భవిష్యత్తులో ఏముంది? ఇప్పుడున్నదే కొత్త కొత్త రూపాలు ధరించి యింకా ఎక్కువవుతుందా? రకరకాలైన వినోద కాలక్షేపాలా?

మీకు ఏం జరుగుతున్నది అన్న స్పృహ మీకేమాత్రమైనా కలిగితే, వినోద కాలక్షేపాల ప్రపంచం, క్రీడా ప్రపంచం మీ మనసుని ఎట్లా పట్టివుంచుతున్నాయి, మీ జీవితాన్ని ఏవిధంగా మలుస్తున్నాయి అన్న సంగతి మీరు ఆలోచించాలి. ఇదంతా దేనికి దారితీస్తున్నది? బహుశ యిదంతా మీకు అసలు అక్కర్లేదేమో? బహుశ మీకు రేపటి గురించి లెక్ఖ లేనేలేదేమో. బహుశ దాన్ని గురించి మీరిప్పుడు ఆలోచించలేదేమో. ఒకవేళ ఆలోచించినా - అది మహా సంక్లిష్టమైనదీ, తలుచుకుంటేనే భయం వేస్తుందీ, రాబోయే కాలాన్ని గురించి ఆలోచించడం చాలా ప్రమాదకరం - అనీ అంటారేమో. ఇది ప్రత్యేకంగా మీ ఒక్కరి వృద్ధాప్యం గురించి కాదు. విధిబలీయతను గురించి - ఆ పదం వుపయోగించవచ్చు, ఫరవాలేదు అంటే, ఇప్పుడు మనం గడుపుతున్న జీవిత విధానానికి - అంటే రకరకాల కాల్పనిక భావాలతో, వుద్రేకాలతో, వుద్విగ్నాను భూతులతో, వ్యాపకాలతో కూడుకున్న మొత్తం వినోదప్రపంచం అంతా కలసి మనసు మీద దండెత్తుతున్న - యీ జీవిత విధానానికి పర్యవసానం చివరకు ఏమిటి? దీనంతటినీ గురించిన స్పృహ మీకు వుందో లేదో! మానవాళికి భవిష్యత్తులో ఏముంది?

ఇంతకు ముందే మేము చెప్పినట్లుగా, ప్రస్తుతం మీరు ఏమిటో అదే మీ భవిష్యత్తు. ఏ మార్పూ కనుక జరగకపోతే రకరకాల రాజకీయ, మత, సామాజిక విధానాలకి అనుగుణంగా పైపైన చేసుకునే సద్దుబాట్లు కాదు, పై పైన జరుపుకునే దిద్దుబాట్లు కాదు బాగ గాఢమైన లోతుల్లో వచ్చే మార్పు. ఇటువంటి మార్పు జరగాలంటే మీ పూర్తి ధ్యాస, మీ శ్రద్ద, మీ వాత్సల్యం దానిమీద తప్పక వుండితీరాలి. ఇటువంటి మౌలికమైన మార్పు వస్తే తప్ప ప్రస్తుతం ప్రతిరోజూ మన జీవితాల్లో మనం ఏంచేస్తున్నామో అదే మన భవిష్యత్తు కూడా అవుతుంది. మార్పు అనే మాటలోనే కొంత క్లిష్టత వుంది. మార్పు చెంది ఏమవాలి? మరొక కొత్త నమూనాకి మారడమా? ఇంకొక ప్రతిపాదనకో మరో రాజకీయ విధానానికో మత విధానానికో మారడమా? దీన్నుంచి దానికి మారడమా? అది కూడా యీ పరిధిలోనిదే; 'ఉన్నది' అనే రంగంలో వుంటుంది. ఇటువంటి మార్పును చిత్రించేది ఆలోచనే. దానిని సూత్రీకరించేదీ, వస్తుప్రపంచానికి సంబంధించినదిగా స్థిరపరచేదీ ఆలోచనే.

కాబట్టి, మార్పు అనే యీ మాటను గురించి జాగ్రత్తగా పరిశోధించాలి. ఒక ప్రయోజనాన్ని ఆశించినప్పుడు అది మార్పు అవుతుందా? ఒక ప్రత్యేకమైన మార్గంలో, ఒక ప్రత్యేకమైన ఫలితం కోసమూ, తెలివిగా, హేతుబద్ధంగా అనిపించే ముగింపు కోసమూ జరిగినప్పుడు అది మార్పు అవుతుందా? బహుశ దీనీకంటే సరియైన పదప్రయోగం ఏమిటంటే, 'ఉన్నది ని సమాప్తం చేయడం' అంటే 'వున్నది' నుంచి “వుండవలసినది' కి పోవడం కాదు. మార్పు అంటే అది కాదు. మార్పు అంటే సమాప్తం అవడం, పూర్తిగా అయిపోవడం ---- అంతకంటే సరియైన మాట వుందా ----? 'సమాప్తం అవడం’ సరిగ్గా వుంది అనుకుంటాను. అదే మనం తీసుకుందాం. సమాప్తం ఆవడం. అయితే సమాప్తం కావడానికి వెనకాల ఏదయినా ప్రయోజనమూ, వుద్దేశ్యము వున్నట్లవుతే, అది ఒక నిర్ణయం తీసుకోవడం వంటిది గనుక అవుతే, అప్పుడు అది కూడా కేవలం ఒకదానినుంచి మరొకదానికి మార్పు మాత్రమే అవుతుంది. ఇక్కడ నిర్ణయం అనే మాటలో సంకల్పించే చర్య అనే అర్థం కూడా వస్తుంది. 'నేను యిది. చేస్తాను', 'నేను యిదీ చేయను'. సమాప్తం అవడం అనే క్రియలో కోరిక ప్రవేశిస్తే సమాప్తం అవడానికి కోరిక కారణం అవుతుంది. కారణం వున్నప్పుడు లోపల ఒక వుద్దేశ్యమూ వుంటుంది. కాబట్టి అప్పుడది నిజంగా సమాప్తం చెందడం కాదు.

ఇరవయ్యో శతాబ్దంలో చాలా బ్రహ్మాండమైన మార్పులు వచ్చాయి. విధ్వంసపూరితమైన రెండు యుద్ధాలే కాకుండా గతి తార్కిక భౌతికవాదం వచ్చింది. మతవిశ్వాసాలను, మతాచారాలను కర్మకాండలను విమర్శించే ధోరణి కూడా మొదలయింది. వీటితోపాటు సాంకేతిక విజ్ఞానరంగం కూడా ఎన్నో లెక్కలేనన్ని మార్పులు తీసుకొని వచ్చింది. కంప్యూటర్లు అభివృద్ధి చెందినకొద్దీ యింకా ఎన్నో మార్పులు జరగనున్నాయి. ఇంకా మీరు ఆరంభదశలోనే వున్నారు. అంతా పూర్తిగా కంప్యూటర్ల అజమాయిషీలోకి వచ్చినప్పుడు మన మానవ మస్తిష్కాలు ఏమయిపోతాయి? అది మళ్ళీ యింకో సమస్య. ఇంకెప్పుడయినా దానిని గురించి పరిశీలిద్దాం.

వినోదకార్యక్రమాలను వుత్పత్తి చేసే పరిశ్రమ ప్రాబల్యం ఎక్కువయినప్పుడు - ప్రస్తుతం మెల్లిమెల్లిగా అదే జరుగుతున్నది . అప్పుడు నిరంతరంగా సుఖం కోసం, సరదాల కోసం, పూహాలోకాల్లో చిత్రించుకున్న యింద్రియాకరణల కోసం యువతీ యువకులు, విద్యార్థులు, చిన్నపిల్లలు ప్రేరేపించబడుతూ వుంటారు. నిగ్రహము, నిరాడంబరత వంటి మాటలను సయితం దూరంగా తీసిపారేస్తారు. ఆ మాటల ముఖం కూడా చూడరు. సన్యాసులు, మునులు అవలంబించే కఠోర నియమనిష్టలు, వారి వైరాగ్యం, కాషాయ వస్త్రాలో, ఏదో ఒక చిన్న అంగవస్త్రమో ధరించడం, యీ విధంగా లౌకిక సుఖాల్ని పరిత్యాగం చేశామనుకోవడం నిరాడంబరత్వం కాదని చెప్పడంలో ఏమాత్రం సందేహం అక్కర్లేదు. అసలు యిటువంటి విషయాలను గురించీ, నిరాడంబరత అంటే ఏమిటి అనేదాన్ని గురించి వినడానికైనా మీరు యిష్టపడరు. చిన్నతనంనుంచీ వినోదాలతో ప్రొద్దుపుచ్చుతూ, మీనుంచి మీరు పారిపోవడానికి మతసంబంధమైనవో, యితరమైనవో కాలక్షేపాలను వెతుక్కుంటూ గడుపుతున్నప్పుడు, మనోతత్వ వైజ్ఞానిక నిపుణులందరూ మీరు లోపల ఏమేమి భావిస్తుంటే అవన్నీ పైకి వ్యక్తం చేసి తీరాలనీ, అట్లా కాకుండా లోపల దాచుకోవడం వల్ల నిగ్రహించుకోవడంవల్ల చాలా దుష్పలితాలు కలిగి రకరకాల మానసిక రుగ్మతలకు దారితీస్తాయనీ చేస్తున్నప్పుడు - సహజంగానే మీరు యింకా ఎక్కువెక్కువగా క్రీడారంగం లోను, వినోదాలతోను, కాలక్షేపాలలోను మునిగి తేలుతూ వుంటారు. ఇవన్నీ మీనుంచి, అసలు మీరు ఏమిటో దానినుంచి మీరు పారిపోవడానికి సహాయం చేస్తుంటాయి.

మీరు ఏమిటి అన్నదాని స్వభావాన్ని ఏ విపరీతార్థాలూ కల్పించకుండా, ఏ పక్షపాతాలకూ తావులేకుండా, మీరంటే యిదీ అని కనిపెట్టాక, దానిని చూసి ఎటూ చలించకుండా, దానిని అవగాహన చేసుకోవడమే నిరాడంబరతకు ఆరంభం. ప్రతి ఆలోచననూ, ప్రతీ మనోభావాన్నీ కనిపెట్టే వుండటం, ఆ ఎరుక కలిగి వుండటం, వాటిని అదుపు చేయకుండా, నిరోధించకుండా, మీ స్వంత అర్థాలను, ఆపోహాలను జోడించకుండా ఎగురుతున్న పక్షిని గమనిస్తున్నట్లుగా గమనించాలి. ఈ విధంగా గమనించడం వలన ఒక అసాధారణమైన నిరాడంబరతత్వం కలుగుతుంది. మనకి మనం విధించుకునే నిబంధనలకంటే, మనమీద మనం చేసుకునే రకరకాల మూర్ఖపు ప్రయోగాల కంటే, స్వీయ వున్నతి అనీ, స్వీయ సాఫల్యం అనీ మనం అనుకునే వాటన్నింటికంటే మించిపోయి వుంటుంది యిదీ. అసలు అవన్నీ పరిణతిలేనివారు చేసే చేష్టలు. ఈ విధమైన గమనించడంలో గొప్ప స్వేచ్ఛ వుంటుంది. ఆ స్వేచ్ఛలో నిరాడంబరతత్వం అనే వుదాత్త భావం వుంటుంది. ఈనవనాగరిక ప్రపంచానికి చెందిన విద్యార్థులతో, చిన్నపిల్లలతో యిదంతా మాట్లాడితే వాళ్ళకు బహుశ విసుగొచ్చి తలకాయలు యింకోవైపుకి తిప్పేసుకుంటారు. ఎందుకంటే ప్రస్తుత ప్రపంచం తనకి కావలసిన సుఖసంతోషాలని వెతుక్కోవడంలో పూర్తిగా మునిగిపోయి వుంది.

గోధుమరంగులో వున్న పెద్ద వుడుత ఒకటి చెట్టు పైనుంచి దిగి వచ్చి, ఆహారపు తొట్టెవద్దకు వచ్చింది. నాలుగు గింజలు నోట కరచుకొని తొట్టె అంచుమీద కూర్చుంది. తోక నిటారుగా నిలబెట్టి, చివర మాత్రం మెలి త్రిప్పి, పెద్ద పెద్ద గాజు పూసల్లాంటి కళ్ళతో నాలుగువైపులా చూస్తూ ఎంతో ముచ్చటగా వుంది అది. ఒక నిముషం సేపు అట్లా కూర్చుందో లేదో మళ్ళీ తొట్టె కిందికి దిగి వచ్చింది. చెదరు మదరుగా వున్న రాళ్ళమీద గెంతుకుంటూ పోయి, చటుక్కున చెట్టుమీదకెక్కి, అదృశ్యమైపోయింది.

మానవుడు తననుంచి, తను ఏమిటో దానినుంచి, తను ఎక్కడికి పోతున్నాడో దానినుంచి, అసలు యిదంతా దేనిగురించో దానినుంచి అంటే - యీ విశాల విశ్వం, మన దైనందిన జీవనం, చనిపోవడం, ఆరంభం అనే వాటినుంచి ఎప్పుడూ పారిపోతున్నట్లుగా కనబడుతున్నది. మననుంచి మనం ఎంతగా పారిపోయినా సరే, తెలిసి బుద్ధి పూర్వకంగా గాని, మనకు తెలియకుండానే గాని, యింకా పైకి కనబడని సూక్ష్మ పద్ధతిలో గాని, మనం ఎంత దూరంగా తప్పించుకొని వెళ్ళిపోయినా సంఘర్షణ, సుఖము, బాధ, భయం మొదలైనవి ఎప్పుడూ మనల్ని అంటిపెట్టుకొనే వుంటాయని మనం ఏమాత్రం గ్రహించం, ఇది నాకు చాలా వింతగా అనిపిస్తుంది. చివరకు అవే మనమీద స్వారి చేస్తాయి. వాటిని అణగదొక్కాలని మీరు ప్రయత్నించవచ్చు. ఒక గట్టి నిశ్చయం వంటిది చేసుకొని, వాటిని లోపలకు నెట్టి పారేయాలని మీరు ప్రయత్నించవచ్చు; కాని అవి మళ్ళీ బయటపడుతూనే వుంటాయి. మనమీద చాలా ఎక్కువ ప్రభావం చూపే అంశాల్లో సుఖం ఒకటి. అందులోనూ మళ్ళీ సంఘర్షణలు, బాధ, విసుగు అన్నీ వుంటాయి. సుఖం కూడా బడలిక కలిగించడం, చిరాకు అనిపించడం మన జీవన మహాకల్లోలంలోని భాగమే. దానినుంచి తప్పించుకోలేవు మిత్రమా! ఈ లోతయిన అగాధమైన కల్లోలం నుంచి మీరు తప్పించుకోలేరు. నిజంగా మీరు దానిని గురించి గాఢంగా ఆలోచిస్తే తప్ప; ఒక్క ఆలోచించడమే కాదు, శ్రద్దతో కూడిన సావధానత్వంతో, శ్రమతో కూడిన అప్రమత్తతతో ఆలోచనలు, 'నేను' అనే మొత్తం కదలికను పరికిస్తే తప్ప. ఇదంతా చాలా అలసటైన పని అనీ, అనవసరం అనీ మీరనవచ్చు. కాని యీ విషయాల మీదకు మీరు ధ్యాస మళ్ళించకపోతే, పట్టించుకోకపోతే భవిష్యత్తు మర్తి విధ్వంసపూరితంగా, మరింత దుర్బలంగా వుండటమే కాకుండా పరమ అర్థవిహీనంగా కూడా తయారవుతుంది.. ఇదంతా ఒక నిరాశా జనకమైన, నిస్పృహ కలిగించేటటువంటి దృక్పధం కాదు. ఇది నిజంగానే యిల్లా వున్నది. ఇప్పుడు ప్రస్తుతంలో మీరు ఏమిటో రాబోయే కాలంలో కూడా అట్లాగే వుంటారు. దీనిని తప్పించుకోలేరు. సూర్యుడు వుదయించడమూ, అస్తమించడమూ ఎంత రూఢి అయినవో యిదీ అంతే. ఇది మనిషికి, మానవాళి అంతటికీ వచ్చిన వాటా. మన అందరం, మనలో ప్రతి వొక్కరమూ మారితే తప్ప. అంటే ఆలోచన చిత్రించినది కాని ఒకదానిగా మార్పు చెందితే తప్ప.

(కృష్ణమూర్తి టు హిమ్ సెల్ఫ్)