కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం/భూమిమీద జీవిస్తున్న ప్రాణులంటే మనకి కనికరం వున్నదా?

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

భూమిమీద జీవిస్తున్న ప్రాణులంటే మనకి కనికరం వున్నదా?

నది పక్కనే ఒక చెట్టు వుంది. గత కొన్ని రోజులుగా ప్రతిరోజూ సరిగ్గా సూర్యుడు వుదయించబోయే సమయాన ఆ చెట్టువైపే చూస్తూ కూర్చుంటున్నాము. దిగంతంలో సూర్యబింబం వుదయించి చెట్లమీదుగా మెల్లగా పైకిలేస్తూ వుంటే, యి చెట్టు అకస్మాత్తుగా బంగారం రంగును పులుముకుంటుంది. ఆకులన్నీ ప్రాణం పోసుకున్నట్లు మెరిసి పోతుంటాయి. ఆ చెట్టు పేరు ఏదయితేనేం - మనం చూస్తున్నది ఆ చెట్టు సౌందర్యాన్ని - అటువంటి ఆ చెట్టువైపు గంటల తరబడి కూర్చుని చూస్తూ వుంటే, ఒక అనిర్వచనీయమైన గుణతత్వంతో ఆ ప్రదేశం, ఆ నది ఆవరించుకొనిపోయినట్లుగా అనిపిస్తుంది. సూర్యుడు యింకొంచెం పైకి ఎక్కి రాగానే, ఆకులన్నీ గలగలమంటూ కదిలి నృత్యం చేయడం ఆరంభిస్తాయి. గంట గంటకూ ఆ చెట్టు ఒక కొత్త శోభతో మెరిసి పోతున్నట్లుగా అనిపిస్తుంది. సూర్యోదయం అవక ముందు కనిపించీ కన్పించకుండా, ఎక్కడో మనకి చాలా దూరంలో, నిశ్చలంగా నిలబడినట్లుండే ఆ చెట్టులో ఒక గాంభీర్యం కనబడుతుంది. రోజు గడిచినకొద్దీ, కాంతిని పైన పులుముకున్న ఆకులు నృత్యం చేస్తూ, గొప్ప సౌందర్యం అంటే యిదే సుమా అని అనిపించే ఒక ప్రత్యేకతను ఆ చెట్టుకు ఆపాదిస్తాయి. మధ్యాహ్న సమయానికి దాని నీడ బాగా చిక్కనవుతుంది. ఎండ బారిన పడకుండా హాయిగా అక్కడ కూర్చోవచ్చు. ఆ చెట్టు ఒక స్నేహితుడిలా తోడుగా వుండి, ఒంటరిగా వున్నామన్న భావన రానీయదు. అక్కడ కూర్చున్నప్పుడు, చెట్లు మాత్రమే యివ్వగలిగిన ఒక గాఢమైన, స్థిరమైన భద్రతాభావంతో కూడుకున్న బాంధవ్యమూ, స్వేచ్ఛా మనకు దొరుకుతాయి.

సాయంత్రం అస్తమిస్తున్న సూర్యుడు పడమటి ఆకాశాన్ని ఎర్రగా వెలిగించి నప్పుడు, చెట్టు క్రమక్రమంగా కాంతిహీనంగాను, అస్పష్టంగాను అయి, తరువాత పూర్తిగా చీకట్లో మునిగిపోతుంది. ఆకాశం ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల్లోకి మారుతుంది. కాని చెట్టు మాత్రం చలనం లేకుండా వుండిపోయి అదృశ్యమవుతుంది. ఇక రాత్రి అంతా విశ్రాంతి తీసుకుంటూ వుండిపోతుంది.

ఆ చెట్టుతో కనుక ఒక బాంధవ్యం ఏర్పరచుకుంటే మొత్తం మానవాళితోనే బాంధవ్యం ఏర్పరచుకున్నట్లవుతుంది. అప్పుడు ఆ చెట్టు బాధ్యత, లోకంలో వున్న చెట్ల బాధ్యత మీదే అవుతుంది. భూమిమీద జీవిస్తున్న ప్రాణులతో మీకు ఏ బాంధవ్యమూ లేనప్పుడు, మనుష్యులతో, యీ మానవాళితో మీకు వుండే ఆ కాస్త బాంధవ్యమూ కూడా కోల్పోతారు. చెట్టు యొక్క గుణం ఏమిటి అని మనం ఎప్పుడూ లోతుగా పరికించి చూడం. చెట్టుని, దాని దృఢత్వాన్ని గరుకుగా వుండే దాని బెరడుని తాకి చూసి అనుభవపూర్వకంగా తెలుసుకోము. చెట్టు వినిపించే ధ్వనులని వినం. గాలి చెట్ల ఆకుల్లోంచి వీస్తూ చేసే ధ్వనులని కాదు; పిల్లగాలుల చప్పుళ్ళనీ కాదు. అచ్చంగా చెట్టులోనే వున్న ధ్వనులని. చెట్టు మొదలు వినిపించే ధ్వనులని, చెట్టు వేళ్ళు మౌనంగా వినిపించే ధ్వనులని. ఆ ధ్వనులు వినాలంటే మీలో అసాధారణమైన సున్నితత్వం వుండాలి. అది యీ ప్రపంచం చేస్తున్న గోల వంటిది కాదు. అదేపనిగా వాగుతూ వుండే మనసు చేసే గోల వంటిదీ కాదు, తమ కలహాలతోను, యుద్దాలతోను మనుష్యులు సృష్టిస్తున్న అసహ్యమైన గోలా కాదు. ఈ విశాల విశ్వంలోని ఒక భాగం అయిన ధ్వని యిది.

ప్రకృతితో, కీటకాలలో, ఎగిరి దుమికే ఆ కప్పతో, కొండల మధ్యన తన జత పిట్టను పిలుస్తూ, కూస్తున్న గుడ్లగూబలో మనకి యింత తక్కువ బాంధవ్యం వుండటం ఎంతో వింతగా అనిపిస్తున్నది. భూమిమీద అసంఖ్యాకంగా వున్న యీ ప్రాణులంటే మనకి ఏమాత్రం లక్ష్యం లేదు. ప్రకృతితో కనుక మనం ఒక గాఢమైన, స్థిరమైన బాంధవ్యం ఏర్పరచుకోగలిగినప్పుడు, మన ఆకలి తీర్చుకోవడం కోసం జంతువుల్ని చంపడానికి చేతులు రావు. స్వప్రయోజనాల కోసం కోతుల్ని, కుక్కల్నీ, గీనీపందుల్నీ కోసి, పరీక్షించి, వాటిని చిత్రవధ చేయలేము, మన గాయాలు మాన్చుకోడానికి, మన దేహాలకి చికిత్స చేసుకోవడానికి యింకో రకమైన మార్గాలని వెతుక్కుంటాము. అయితే మనసుకు చికిత్స చేసుకోవడం అనేది దీనికి పూర్తిగా భిన్నమైనది. ప్రకృతితో మీరు వుండిపోతే, ఆ చెట్టుమీద వున్న నారింజకాంతితోను, సిమెంటులో నుంచి పొడుచుకొని వచ్చిన ఆ గడ్డిపోచతోను, మబ్బులు కమ్మివేసి, అదృశ్యం చేసిన ఆ కొండలతోను మీరు వుండిపోతే, అప్పుడు క్రమక్రమంగా మనసుకు నయమవుతుంది.

ఇది భావుకత్వం కాదు, కాల్పనిక లోక విహారమూ కాదు. ఈ భూమిమీద జీవిస్తున్న, సంచరిస్తున్న ప్రతి ప్రాణితోను మనకు వుండవలసిన బాంధవ్యం అనే ఒక నిజం. లక్షలాది సొరచేపలను మనిషి చంపేశాడు. ఇంకా చంపుతూనే వున్నాడు. వాటిని వధించడం ద్వారా పొందే ప్రయోజనాలన్నీ యితర విధానాల ద్వారా కూడా పొందవచ్చు. కానీ మనిషికి చంపడంలో - పరుగెత్తిపోతూ క్షణంలో కనుమరుగయ్యే జింకను, వుత్సాహంగా వురకలు పెడుతున్న లేళ్ళను, గజరాజులు ఏనుగులను - చంపడంలో ఏదో సంతోషం వున్నట్లుగా కన్పిస్తున్నది. మనకి ఒకరి నొకరం చంపుకోవడం అంటే కూడా యిష్టమే. ఈ భూమిమీద మానవుడి చరిత్ర ఆరంభమైన నాటినుండీ యీ రోజువరకు తోటి మనుష్యులను చంపడం అనేది సాగుతూనే వున్నది. ప్రకృతితో, చెట్లతోనే నేరుగాను, పొదలతోను, పూలతో, గడ్డితో, బిరబిరమని కదిలిపోయే మబ్బులతో ఒక గాఢమైన, సుస్థిరమైన, దీర్ఘకాల బాంధవ్యాన్ని మనం నెలకొల్పుకో గలుగుతే - నెలకొల్పగలగటం కాదు, నెలకొల్పి తీరాలి - అప్పుడు ఎటువంటి కారణం కోసమైనా సరే, మరొక మనిషిని చంపలేము. యుద్ధం అంటే వ్యవస్థీకృతం చేసిన హత్యలు. ఏదో ఒక ప్రత్యేకమైన యుద్ధానికి - అణుయుద్ధానికో, మరొకరకమైన యుద్ధానికో వ్యతిరేకంగా మనం ప్రదర్శనలు జరుపుతాం తప్ప. అసలు మొత్తం యుద్ధాలనే నిరసిస్తూ ప్రదర్శనలు ఎన్నడూ జరపలేదు. తోటి మానవుడిని చంపడం అనేది యీ భూప్రపంచం మొత్తంలోకల్లా అత్యంత పాపకార్యం అని మనం ఏనాడూ ఘోషించలేదు.

('కృష్ణమూర్తి టు హిమ్ సెల్ఫ్')